కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/'నేను' ఎట్లా పనిచేస్తుంటుంది - ఒక అంతర్వీక్షణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

'నేను' ఎట్లా పనిచేస్తుంటుంది - ఒక అంతర్వీక్షణ

మానవుల్లో చాలామంది స్వార్ధపరులు. తమలో యింత స్వార్ధం వుందని వారికే తెలియదు. వారి జీవన విధానంలోనే ఆది వుంది. తను స్వార్థపరుడిననే సంగతి ఎవరైనా ఎరిగివున్నా ఆ సంగతిని వారు చాలా జాగ్రత్తగా దాచి పెడతారు. సమాజపు తీరు అంతా స్వార్థం మీద ఆధారపడే నడుస్తున్నది. కాబట్టి, ఆ సమాజపు పద్ధతులకి లోబడి వారు నడుస్తూ వుంటారు. స్వార్థపరమైన మనసు చాలా జిత్తులమారిది. అది చాలా మొరటుగా, బాహాటంగా తన స్వార్ధపరత్వాన్ని వెల్లడించుకోనూవచ్చు; లేదా రకరకాల మారువేషాలనూ వేసుకోవచ్చు. మీరు ఒక రాజకీయవేత్త కనుక అయితే, మీ స్వార్థం అధికారాన్నీ, హోదానీ, ప్రజాభిమానాన్నీ కోరుకుంటుంది. ఒక సిద్ధాంతానికో, సేవాసంస్థకో తనని అంకితం చేసుకుంటుంది. ఇవన్నీ ప్రజలకు మేలు చేయడం కోసమే అనీ అంటుంది. మీరు కనుక ఒక నియంత అయితే, యితరుల మీద అతి కర్కశత్వంతో పెత్తనం చెలాయించడంలో అది వ్యక్తమవుతుంది. మీకు మతపరమైన విషయాలమీద అభిరుచి వుంటే, అప్పుడది ఆరాధనగానో, భక్తిగానో, ఒక నమ్మకాన్ని గాని, ఒక అంధవిశ్వాసాన్ని గాని గట్టిగా పట్టుకొని కూర్చోవడంలోనో తనని బయటకు వ్యక్తపరచుకుంటుంది, కుటుంబాల్లో కూడా స్వార్థం పనిచేస్తూ వుండటం చూడవచ్చు. తండ్రి జీవితం గడిపే పద్దతిలో అతని స్వార్థమే కనబడుతుంది. తల్లి అయినా అంతే. లోలోపల ఆజ్ఞాతంగా దాగి, విస్తరించుకుంటూ పోయే యీ స్వార్థానికి కీర్తి, ఐశ్వర్యం, అందచందాలు అనేవి ఆధారం. మతాచార్యుల చుట్టు ఉండే అధిష్టానశ్రేణీ స్వరూపంలో కూడా యిది వుంటుంది. వారే సృష్టించుకున్న ఒక ప్రత్యేకమైన దేవుడి బొమ్మ మీద తమకు గల భక్తిని, ప్రేమను వారు ఎంత గొప్పగా ప్రకటించుకున్నా సరే, అక్కడా యీ స్వార్థం వుంటుంది. గొప్ప గొప్ప పారిశ్రామిక అధినేతలలోనూ, ఒక పేద గుమాస్తాలోనూ కూడా క్షణ క్షణం విస్తరించిపోతూ, మనిషిని మొద్దుబారేటట్లు చేసే యీ స్వార్థం అనే యింద్రియలోలత్వం వుంటుంది. ఈ లౌకిక జీవనాన్ని పరిత్యజించిన సన్యాసి అయినా సరే, అతను ప్రపంచమంతా బైరాగిలా పర్యటిస్తుండవచ్చు గాక, లేదూ ఆశ్రమంలో ముక్కు మూసుకొని కూర్చుండవచ్చు గాక, అతనయినా తన లోపల అంతూ పొంతూ లేకుండా జరిగే యీ స్వార్ధపు కదలికలను మాత్రం వదుల్చుకోలేడు. వాళ్ళు తమ పేర్లు మార్చుకోవచ్చు, కాషాయ వస్త్రాలు ధరించవచ్చు, బ్రహ్మచర్య వ్రతమో, మౌనవ్రతమో పాటించవచ్చు. అయినాసరే, ఒక ఆదర్శమో, ఒక వూహా ప్రతీమో, ఒక చిహ్నమో వారిని లోలోపల దగ్ధం చేస్తూ వుంటుంది.

విజ్ఞానశాస్త్రవేత్తల్లో, తాత్వికుల్లో, విశ్వవిద్యాలయాల్లోని ఆచార్యుల్లో కూడా యిది లేకుండా వుండదు. మంచి పనులు చేసే పరోపకారశీలురు, మహాత్ములు, గురూజీలు, పేదలకోసం అహర్నిశలు శ్రమిస్తున్న స్త్రీ, పురుషులు - వీళ్ళందరూ కూడా పనిలో మునిగిపోయి తమని తాము మరిచిపోవాలని కోరుకుంటారు. అయితే ఆ పని కూడా వారి స్వార్ధంలోని భాగమే. తమ అహంకారాన్ని వాళ్ళు తమ కృషిలోకి మళ్ళించారు. ఇది చిన్నతనంలోనే ఆరంభమవుతుంది. వృద్ధాప్యంలో కూడా కొనసాగుతూనే వుంటుంది. తన జ్ఞానం చూసుకొని గర్వించేవాడు, దొంగ వినయాన్ని అభ్యాసం చేసి అలవరచుకున్న నాయకుడు, విధేయురాలైన భార్య, పెత్తనం చెలాయించే మగవాడు వీరందరిలోనూ యీ రుగ్మత వున్నది. దేశంలో, రకరకాల సంఘాలతో, గొప్ప గొప్ప లక్ష్యాలతో, సిద్ధాంతాలతో స్వార్ధం తనని తాను పూర్తిగా ఐక్యం చేసుకోవచ్చు. అయినా అది ఆరంభంలో ఎట్లా వుంటుందో, ఎప్పటికీ అట్లాగే వుండిపోతుంది.

విపరీతమైన క్షోభకూ, గందరగోళానికీ కారణమైన యీ కేంద్రాన్ని వదిలించు కోవడం కోసం మానవుడు రకరకాలైన అలవాట్లు, పద్ధతులు, ధ్యాన విధానాలు ప్రయత్నించి చూశాడు. అయితే అది ఒక నీడలాగా చేతికి చిక్కకుండా తప్పించుకుంటూనే వున్నది. అది ఎప్పుడూ అక్కడే వుంటుంది. కానీ, చేతుల్లో నుంచి, మనసులో నుంచి తప్పించుకొనిపోతూ వుంటుంది. పరిస్థితులను బట్టి అది బాగా బలం పుంజుకోవటమో, కొంచెం దుర్బలంగా అవడమో జరుగుతూ వుంటుంది. ఇక్కడ దాన్ని పట్టుకున్నామంటే, అది మరెక్కడో పైకి తేలుతుంది.

ఒక కొత్త తరాన్ని తయారుచేసే బాధ్యత తన మీద వున్న అధ్యాపకుడు యీ స్వార్థం అన్నది మన జీవితాలకు ఎంతగా హాని చేస్తున్నదో, ఎంత కలుషితపరుస్తున్నదో, ఎంత వికృతపరుస్తున్నదో, విపరీతాలను సృష్టించగలదో మాటల్లో కాకుండా, నిజంగా అవగాహన చేసుకున్నాడా అని సందేహం కలుగుతున్నది. దానినుండి ఎట్లా విముక్తి చెందగలమన్నది అతనికి తెలియకపోవచ్చు, కాని అసలు అది వున్నదన్న ఎరుక కూడా అతనికి లేకపోవచ్చు. అయితే, ఒకసారి యీ స్వార్ధం యొక్క కదలికల తీరుతెన్నుల్ని అతడు గ్రహించాక, దానిలోని సూక్ష్మాసూక్ష్మతలను అతడు (లేక ఆమె) విద్యార్థులకు అందించగలరా? ఇది చేయడం అతని బాధ్యత గాదా? స్వార్ధం పనిచేసే తీరు గురించిన ఆంతర్దృష్టి యీ పార్యపుస్తకాల పనంకంటే, పరీక్షలకంటే ముఖ్యమైనది. స్వార్ధం తాను యింకా విస్తరించడానికి, తనలోని దౌర్జన్యానికి, తన లోపల వుండే క్రూరత్వానికి తను సంపాదించిన జ్ఞానాన్ని వుపయోగించుకోగలదు కూడా.

మన జీవితాల్లోని అతి ప్రధానమైన సమస్య యీ స్వార్ధపరత్వం, లొంగిపోయి వుండటం, అనుకరణ అన్నవి స్వార్థం యొక్క లక్షణాలే. అట్లాగే, పోటీ తత్వం, ప్రతిభలో వుండే నిర్దాక్షిణ్యతా కూడా. మన పారశాలల్లోని అధ్యాపకులు యీ సమస్యని గట్టిగా పట్టించుకొని ఆలోచిస్తే కనుక - వాళ్ళు అట్లా చేస్తారనే నేను ఆశిస్తున్నాను అప్పుడు వాళ్ళు విద్యార్ధి స్వార్ధరహితంగా ఉండటానికి ఏవిధంగా అతనికి తోడ్పడాలి? అబ్బో, అది ఏదో దైవప్రసాదంగా రావలిసిందే అనో, అది అసాధ్యమనో మీరు దీన్ని త్రోసిపారేయవచ్చు. అట్లా కాకుండా నిజంగానే మీరు దీన్ని కనుక గాఢంగా పట్టించుకుంటే - మనం పట్టించుకొని తీరాలీ - విద్యార్ధి మొత్తం బాధ్యత అంతా మీదే అనుకుంటే అప్పుడు అనాదిగా వస్తున్నటువంటి, కట్టి బంధించివేసేదైనట్టి యీ శక్తి బారినుంచి మనసును విముక్తం చేయడం ఎట్లా మొదలు పెడతారు? ఎంతో దుఃఖానికి కారణభూతమైన యీ స్వార్ధం బారినుంచి? విద్యార్థి కోపంగా మాట్లాడినప్పుడు గాని, మరొకరిని కొట్టినప్పుడు గానీ, తను చాలా గొప్పవాడిని అని తెలుస్తున్నప్పుడు గాని, వీటి పర్యవసానం ఎట్లా పరిణమిస్తుంది అన్న సంగతిని చాలా శ్రద్ధగా అంటే అందులో ఎంతో ఆత్మీయత పొదిగి చిన్న చిన్న మాటల్లో, సరళమైన భాషలో మీరు వివరించి చెప్పవద్దూ? విద్యార్థి 'యిది నాది' అని మొండికేస్తు న్నప్పుడు, 'నేను చేశాను' అని ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు, భయంవల్ల ఒక పని చేయకుండా తప్పించుకుంటున్నప్పుడు, యిటుక మీద యిటుక పేరుస్తున్నట్లుగా తన చుట్టూ తాను ఒక గోడను నిర్మించుకుంటున్నాడని వివరించి చెప్పడం సాధ్యం కాదా? అతని కోర్కెలు, అతని యింద్రియానుభూతులు, అతనిలోని హేతుబద్ధమైన ఆలోచనాశక్తిని అణచివేసి తామే ప్రాబల్యం వహిస్తే, అప్పుడు స్వార్థపు నీడ విస్తరిస్తున్నదని అతనికి సూచించడం సాధ్యం కాదా? స్వార్థం, అది ఏ వేషం వేసుకున్నా సరే, అది పున్నప్పుడు ప్రేమ వుండదని విద్యార్థికి చెప్పడం సాధ్యం కాదంటారా?

అయితే విద్యార్థి, 'నిజంగా మీరు యిదంతా గ్రహించారా లేక వూరికే కబుర్లు చెప్తున్నారా?' అని అధ్యాపకుడిని అడగవచ్చు. ఆ ప్రశ్న మీలోని వివేకాన్ని మేల్కొల్పేది అవచ్చు. అప్పుడు మీలో మేలుకొన్న ఆ వివేకమే మీలో సముచితమైన భావాలను కలిగించి, సవ్యమైన సమాధానాన్ని మాటల రూపంలో మీకు అందివ్వవచ్చు.

ఆధ్యాపకుడు అనే పెద్ద హోదా ఏదీ మీకు వుండదు. విద్యార్ధి లాగానే మీరు కూడా అనేక సమస్యలున్న ఒక మనిషి. ఒక హోదాతో మీరు మాట్లాడిన మరుక్షణమే మనుష్యుల మధ్య వుండవలసినే నిజమైన బాంధవ్యాన్ని మీరు హతమార్చేస్తారు. హోదా అనగానే అందులో అధికారం వుంటుంది. అధికారం కోసం ఆరాటపడుతున్నప్పుడు, దానిని గురించిన స్పృహ మీలో వున్నా లేకపోయినా, ఒక నిర్దాక్షిణ్యమైన వైఖరి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. మిత్రమా, మీ మీద మహత్తరమైన బాధ్యత వుంది. ప్రేమ అనే యీ సంపూర్ణమైన బాధ్యతను కనుక మీరు తీసుకుంటే, అప్పుడు స్వార్థపు పునాదులనే పెకలించివేసినట్లవుతుంది. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలనో, మీచేత యీ పనులు చేయించాలనే వుద్దేశ్యంతోనో యిది చెప్పడం లేదు. అయితే, మనమందరమూ యీ సమస్త మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తున్న మనుష్యులమే కాబట్టి, కావాలనుకున్నా వద్దనుకున్నా మన మీద యీ సమస్తమైన, సంపూర్ణ బాధ్యత వున్నది. దీనినుంచి తప్పించుకోవాలని మీరు ప్రయత్నించవచ్చు. అయితే ఆ కదలిక కూడా స్వార్థం చేస్తున్న చర్యే. నిర్దుష్టమైన గ్రహణశీలత వుండటమే స్వార్ధం నుంచి విముక్తి చెందడం.

('లెటర్స్ టు ది స్కూల్')