కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/కాంతి దర్శనం
కాంతి దర్శనం
ఒకరి ప్రశ్న ? పారమార్థికులము అని చెప్పుకునే వాళ్ళందరిలోనూ ఒక సామాన్య లక్షణం వుంటుంది. మీ ప్రసంగాలు వినడానికి వస్తున్న వారిలో కూడా నాకు యీ లక్షణం కనబడుతున్నది. నిర్వాణమనీ, విమోచనమనీ, జ్ఞానోదయం అనీ, ఆత్మ సాక్షాత్కారమనీ, ఆద్యంతరహితమైనదనీ, దేవుడనీ రకరకాల పేర్లు పెట్టి, దానికోసం వాళ్ళు వెతుకుతూ వుంటారు. వాళ్ళకు వాళ్ళ లక్ష్యం స్పష్టంగా కనబడుతూ వుంటుంది, రకరకాలైన వుపదేశ మార్గాలన్నీ యీ లక్ష్యాన్నే మన కళ్ళ ముందు ఆడిస్తూ వుంటాయి. ఈ పుపదేశాలకు, వర్గాలకు అన్నింటికీ ప్రత్యేకమైన గ్రంధాలు, ప్రత్యేకమైన బోధనా రీతులు, గురువులు, నీతి నియమావళి, తాత్విక ధోరణి వుంటాయి. ఆశలు రేకెత్తించడం, బెదిరింపులు కూడా వుంటాయి. ఇవన్నీ కలిసి తక్కిన ప్రపంచానికి దూరంగా వుండే ఒక తిన్నని, యిరుకైన మార్గంగా ఏర్పడతాయి. ఈ మార్గానికి చివరి కొసన స్వర్గమో, మరొకటో వున్నట్లు వూరిస్తాయి. అన్వేషకుల్లో చాలామంది ఒక మార్గం వదిలేసి మరొక పద్ధతికి మారుతూ వుంటారు. పాతదానిని వదిలేసి, ఆ స్థానంలో తాజాగా వినబడుతున్న యింకొక కొత్త బోధనా మార్గాన్ని స్వీకరిస్తూ వుంటారు. అన్నింటిలో వున్నదీ ఒకటే సూత్రమని గ్రహించుకోలేక, వుద్రేకాలను రెచ్చగొట్టే యీ కార్యక్రమాలలో, ఒకదాని తర్వాత యింకోదానిలో పడిపోతూ దేనికోసమో వెతుక్కుంటూ వుంటారు. కొంతమంది ఏదో ఒక పద్ధతి, ఒక కూటమిలోనే వుండిపోయి, అక్కడ నుండి కదలడానికి యిష్టపడరు. కొంతమంది చివరకు తాము కోరుకున్న సత్యదర్శనాన్ని సాధించామని నమ్మి, అందరికీ దూరంగా ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో రోజులు గడుపుతుంటారు. వీళ్ళచుట్టూ శిష్యబృందం మూగి, మళ్ళీ అదే కార్యక్రమ చక్రం తిరగడం ఆరంభమవుతుంది. వీరందరిలోనూ ఏదో విధంగా సత్యదర్శనం పొంది తీరాలనే ఒత్తిడీ, విపరీతమైన ఆశా వుంటాయి. వాటితోపాటే దుర్భరమైన నిస్పృహ, ఆశలు విఫలమవడంవల్ల కలిగిన బాధ కూడా వుంటాయి. ఇదంతా నాకు చాలా అనారోగ్యకరంగా అనిపిస్తున్నది. వీళ్ళందరూ ఏదో ఒక కాల్పనికమైన లక్ష్యం అందుకోవడం కోసం తమ సాధారణ జీవితాన్ని త్యాగం చేసివేస్తారు. ఈ రకమైన వాతావరణంలో నుండి అతి తీవ్ర మతమౌఢ్యం, వెర్రి వుత్సాహం, హింసాతత్వం, మూర్ఖత్వం వంటి జుగుప్సాకరమైన ధోరణులు పుట్టుకు రావడంలో సందేహం లేదు. ఇటువంటి వారిలో కొందరు మంచి మంచి రచయితలు కూడా వుండటం చాలా ఆశ్చర్యం గొల్పుతుంది. ఇదొక్కటి తప్ప యితరత్రా వాళ్ళు మానసికంగా ధృఢంగానే వుంటారు. దీనంతటికీ మతం అని పేరు పెడతారు. మహా కంపు కొట్టే వ్యవహారం యిది. ఇదీ భక్తి పంచుతున్న పరిమళం. అన్ని చోట్లా నాకు యిదే కనబడుతున్నది. జ్ఞానోదయం లేదా సత్య సాక్షాత్కారం కోసం పడే యీ ఆరాటం విపరీతమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నది. ఎంతోమంది బలైపోతున్నారు దీని కారణంగా. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏమిటంటే, నిజంగానే సత్య సాక్షాత్కారం అనేది ఒకటి వున్నదా? వుంటే కనుక అది ఏమిటి?
కృష్ణమూర్తి : మీ నిత్యజీవితం నుంచి అది ఒక పలాయనం కనుక అవుతే - నిత్యజీవితం అంటే అసంఖ్యాకమైన కదలికలతో కూడుకొని వున్న సంబంధ బాంధవ్యాలు - అటువంటి నిత్యజీవితం నుంచి యిది పలాయనం కనుక అవుతే, అప్పుడు ఆత్మజ్ఞానం అనీ, యింకా ఏవేవో పేర్లతో మీరు పిలుస్తున్నదీ అయిన యీ సత్య సాక్షాత్కారం వట్టి మిధ్య; బూటకం. జీవితం ఎడల ప్రేమనీ, అవగాహనని, క్రియాచరణని తిరస్కరించేది ఏదయినా సరే చాలా విపరీతమైన అనర్ధాలని సృష్టిస్తుంది. మనసుని వక్రీకరిస్తుంది. ఇక అప్పుడు జీవితం చాలా ఘోరంగా తయారవుతుంది. పోనీ, లోకమంతా ఆమోదించిన ఒక పరమ సూత్రంగా దీనిని తీసుకుంటే - అప్పుడు యీ సత్య సాక్షాత్కారాన్ని - దాని అర్థం ఏదయినా సరే, దానిని జీవించడం అనే చర్యలోనే పొందగలమా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. నిజానికి, ఒక సిద్ధాంతం కంటె, ఒక ఆదర్శం కంటె, ఒక లక్ష్యం కంటె, సూత్రం కంటె కూడా జీవించడం అన్నదే చాలా ప్రధానమైనది. జీవించడం అంటే ఏమిటో మనకి తెలియదు గాబట్టి పలాయనవాదాన్ని వుపదేశించే యిటువంటి మిధ్యాపూర్వకమైన, అవాస్తవమైన సూత్రాలను మనం తయారు చేసుకుంటాం. అసలు ప్రశ్న ఏమిటంటే, మనిషి జీవించడంలోనే, జీవితానికి సంబంధించిన రోజువారీ కార్యకలాపాలలోనే యీ సత్య సాక్షాత్కారాన్ని పొందగలడా లేక చాలా అసాధారణమైన శక్తులు సంపాదించిన కొద్దిమందికి మాత్రమే యీ కటాక్షం సిద్ధిస్తుందా? సత్య సాక్షాత్కారం అంటే తనే ఒక దీపంగా వెలిగి, తనకు కాంతినిచ్చుకోవడం. కాని, యీ దీపం తను స్వయంగా చిత్రించుకున్నదీ, తనే కల్పన చేసుకున్నదీ కాకూడదు; తన వ్యక్తిగతమైన ఒక తిక్క చేష్టా కాకూడదు. మొదటి నుంచీ నిజమైన మతం, అంటే వ్యవస్థగా ఏర్పడిపోయిన విశ్వాసాలు, భయాలు కావు - ఆ నిజమైన మతం చెప్తున్నది యిదే.
ప్ర: నిజమైన మతం చెప్పేది యిదీ అని మీరు అంటున్నారా? మరి అప్పుడు, యిందులో నిష్ణాతులైన వారూ, యిదే వృత్తిగా అవలంబించినవారూ కలిసి ఒక పక్షమూ, తక్కిన ప్రపంచమంతా ఎదుటి పక్షమూ అయిపోతారే. అంటే మీ అర్ధం మతం వేరూ, సాధారణ జీవనం వేరు అనా?
కృష్ణమూర్తి : మతమూ, జీవితమూ విడివిడిగా వుండవు. అసలు మతమంటే జీవితమే. మీరు చెప్తున్న దురవస్థలన్నింటికీ మూలం మతాన్నీ, జీవితాన్నీ వేరుచేస్తున్న విభజనే. మళ్ళీ మన మొదటి ప్రశ్నకు తిరిగి వస్తున్నాం. నిత్య జీవితంలో వుంటూనే సత్యదర్శనం ప్రస్తుతానికి ఆ మాటనే వాడుకుందాం- కలిగిన ఆ స్థితిలో వుండటం సాధ్యమేనా?
ప్రశ : సత్య దర్శనం అంటే అర్ధమేమిటో నాకింతవరకూ తెలియలేదు.
కృష్ణమూర్తి : అన్నింటినీ కాదంటున్న స్థితి. కాదు కాదు అనడమే అన్నింటికంటే నిర్ద్వంద్వమైన చర్య. నిర్ద్వంద్వంగా నొక్కి చెప్పడం కాదు. ఇది మీరు అవగాహన చేసుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం. నిర్ద్వంద్వంగా వుండే మూఢ విశ్వాసాలను, నిర్ద్వంద్వంగా వుండే మతాచారాలను మనలో చాలామంది ఏ అభ్యంతరమూ లేకుండా ఆమోదిస్తుంటారు. ఎందుకంటే మనకి అందులో భద్రత దొరుకుతుంది, మేము దానికి చెందిన వాళ్ళం అని చెప్పుకోవచ్చు; దీనితో అనుబంధమూ, దానిమీద ఆధార పడటమూ మనకు కావాలి. నిర్ద్వంద్వంగా వుండే వైఖరే విభజిస్తుంది. ద్వైదీభవాన్ని కలిగిస్తుంది. అప్పుడు యీ వైఖరికీ, తక్కిన వాటికీ మధ్యన సంఘర్షణ ఆరంభ మవుతుంది. అయితే సమస్తమైన విలువలను, సమస్త నీతి సూత్రాలను అన్ని నమ్మకాలనూ కాదనడం, చుట్టూ ఏ సరిహద్దులూ గీసుకోకుండా వుండటం అనేదీ, ఏ ఒక్కదానికో వ్యతిరేకతను చూపడమూ ఒకటి కావు. వుద్ఘాటన అన్నదాని నిర్వచనంలోనే విభజన వున్నది. విభజించడం అంటే ప్రతిఘటన చూపడం. ఇదంతా మనకు అలవాటై పోయింది. ఇదంతా మన నిబద్ధీకరణం, ఇదంతా విసర్జించడం నీతిబాహ్యం కాదు. అంతే కాదు, యీ విభజనలను, యీ ప్రతిఘటించడాలను విసర్జించడమే అసలైన గొప్ప నీతి. మనిషి కల్పన చేసుకున్న అన్నింటినీ కాదనడం - అతని విలువలను, నీతిశాస్త్రాలను, దేవుళ్ళను - అన్నింటినీ కాదనడం అంటే ఏ ద్వైదీభావమూ లేని ఒక మానసిక స్థితిలో వుండటం. అటువంటి స్థితిలో అనుకూల, ప్రతికూలతల మధ్య విభజన, ప్రతిఘటించడమూ వుండవు. ఈ స్థితిలో పరస్పర వ్యతిరేకమైనవి వుండనే వుండవు. ఈ స్థితి మరొక దానికి వ్యతిరేకమైన స్థితి కానే కాదు.
ప్రశ్న : అప్పుడు ఏది మంచి, ఏది చెడు అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? అసలు మంచి, చెడూ అనేవి లేనే లేవా? నేరాలూ, హత్యలు చేయకుండా నన్ను ఏది నిరోధిస్తుంది? ఏ ప్రమాణాలూ, విలువలూ లేకపోతే రకరకాలైన వెధవ పనులు చేయకుండా నన్ను ఏ దేవుడు రక్షిస్తాడు?
కృష్ణమూర్తి : వీటన్నింటినీ వర్ణించడం అంటే తన్ను తాను వర్ణించుకోవడమే. తాను అంటే అలవాటుగా మంచి అని నమ్ముతున్న దానినే అనుసరిస్తూపోతూ వుండే నిబద్ధుడైన ఒక జీవి అనమాట. అన్నింటినీ కాదనడం వల్ల మిగిలేది శూన్యం అని మనలో చాలామంది భావిస్తుంటారు. ఇది ఎందువల్ల అంటే, మన నిబద్ధీకరణం, మన భయాలు, మన బాధలు అనే జైలు లోపల జరిగే కార్యకలాపాలు మాత్రమే మనకు తెలుసు. ఈ దృష్టితో చూసినప్పుడు అన్నింటినీ కాదనడం అంటే అదేదో భయంకరమైనదనీ, అంధకారమయమూ, శూన్యమూ అనీ వూహిస్తుంటాం. సమాజమూ, మతమూ, సంస్కృతీ, నీతి సూత్రాలూ వుద్ఘాటించి చెప్పినవన్నీ కాదన్న మనిషి, సామాజిక కట్టుబాట్లు అనే జైలులోనే యింకా మగ్గిపోతున్న వాళ్ళంతా దుఃఖంలో మునిగి వున్నట్లుగా గ్రహిస్తాడు. గతాన్నుంచి విముక్తి చెందిన మనిషి యొక్క కార్యకలాపాలన్నింటిలోనూ పనిచేస్తూ వుండే యీ కాదనడమే సత్య సాక్షాత్కార స్థితి. కాదు అని మనం విసర్జించవలసినది సంప్రదాయంతోను, ఆధిపత్యంతోను ముడిపడివున్న గతాన్ని. కాదనడమే విముక్తి. విముక్తి చెందిన స్వేచ్ఛా మానవుడే జీవించగలడు, ప్రేమించగలడు. చనిపోవడమంటే ఏమిటో తెలిసేది అతనికే.
ప్రశ్న : అంతవరకు స్పష్టంగా వుంది. కానీ, అతీంద్రియమైనది, అలౌకికమైనది, లేదూ మీరు దానికి యింకో పేరు పెట్టినా సరే, దానినుండి వినవచ్చే ఆజ్ఞాత సందేశాలను గురించి మీరు ఏమీ మాట్లాడటం లేదు.
కృష్ణమూర్తి : స్వేచ్ఛలో మాత్రమే దానినుండి వచ్చే సందేశాలను కనిపెట్టగలుగుతాము. దానిని గురించి ఏ వ్యాఖ్యానం చేసినా అది మళ్ళీ స్వేచ్ఛకు అడ్డు వస్తుంది. దానిని గురించి మాట్లాడటం అంటే అర్థం లేని శబ్దాలు వుచ్ఛరించడమే. అది వుంటుంది, అంతే. దానిని మనం కనిపెట్టలేము; రమ్మని పిలిచి ఆహ్వానించలేము. ఒక ప్రత్యేకమైన మార్గంలో దానిని అసలే బంధించలేము. మనసు తన చాతుర్యంతో గారడీలు చేసి దానిని చేజిక్కించుకోలేదు. చర్చీలలో గానీ, మసీదుల్లో గానీ, ఆలయాల్లో గాని అది లేదు. దానిని చేరడానికి ఏ మార్గమూ లేదు. ఏ గురువులూ, ఏ విధానాలూ ఆ సౌందర్యాన్ని ఆవిష్కరించి చూపలేరు. ప్రేమ వున్నప్పుడే ఆ తన్మయానుభూతి కలుగుతుంది. సత్య సాక్షాత్కారం అంటే అదీ.
ప్రశ్న : దాని ద్వారా యీ మహా విశ్వపు స్వభావరీతిని గురించి కాని, చేతనని గురించి కొని, అస్తిత్వాన్ని గురించి కాని ఒక నవ్యమైన అవగాహన కలుగుతుందంటారా? అటువంటిదేదో జరుగుతుందని మతగ్రంధాలన్నీ ఎంతగానో వర్ణించాయి.
కృష్ణమూర్తి : ఈ తీరం మీద నివసిస్తూ, అవస్థలు పడుతూ అవతలి తీరం గురించి ప్రశ్నలు వేయడంలా వుంది మీరు అడుగుతున్నది. ఆ అవతలి తీరం మీద మీరు వున్నప్పుడు సమస్తం మీరే, ఏమీ లేకపోవడమూ మీరే, ఇటువంటి ప్రశ్నలు మీరు అడగనే అడగరు. ప్రశ్నలన్నీ యీ తీరం మీద వున్నప్పుడే, నిజానికి యీ ప్రశ్నలకు అర్థం లేదు. జీవించడం అరంభించండి. అప్పుడు మీరు కోరుకోకుండానే, ప్రయత్నించకుండానే, నిర్భయంతో అక్కడికి చేరుకుంటారు.
(కన్వర్జేషన్స్)
--- ---