కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/నిజమైన పరిత్యాగం అంటే ---

వికీసోర్స్ నుండి

నిజమైన పరిత్యాగం అంటే ---

అధ్యాపకుడు : విద్యార్థులతో ప్రసంగిస్తూ ఒకసారి మీరు, సమస్య ఏదయినా తలెత్తినప్పుడు వెంటనే దానిని పరిష్కరించుకోవాలని అన్నారు. ఇది ఎట్లా చేయగలుగుతాం అంటారు.

కృష్ణమూర్తి : ఒక సమస్యని వెంటనే పరిష్కరించాలంటే, ఆ సమస్యని అవగాహన చేసుకోవాలి. ఒక సమస్యని అవగాహన చేసుకోవడానికి కొంత సమయం అవసరమా, లేదూ అది గ్రహింపులోని తీక్షణతకూ, చూడటంలోని గాఢత్వానికి సంబంధించినదా? నాకో సమస్య వున్నదీ అనుకుందాం : నాకు గర్వం, అదీ సమస్య ఎందుకయింది అంటే దానివల్ల నాలో నాకే సంఘర్షణ, పరస్పర వైరుధ్యమూ కలుగుతున్నాయి కాబట్టి. నాకు గర్వం అన్న సంగతీ వాస్తవమే, గర్వపడటం నాకు యిష్టం లేదు అన్న సంగతి మరొక వాస్తవమే. మొట్టమొదట, నాకు గర్వం అన్న వాస్తవాన్ని నేను అవగాహన చేసుకోవాలి. ఆ వాస్తవంతో నేను కలిసి నివసించాలి. ఆ వాస్తవం విషయంలో నాకు చాలా గాఢమైన ఎరుక వుండటమే కాకుండా, దానిని సమగ్రంగా ఆకళింపు చేసుకోవాలి. సరే, ఆకళింపు చేసుకోవడం అన్నది సమయానికి సంబంధించినదా? వాస్తవాన్ని నేను వెంటనే చూడగలను. చూడలేనా? తక్షణమే జరిగే ఆ గ్రహింపే, ఆ చూడటమే సమస్యను కరిగించివేస్తుంది. నేను ఒక పాముని చూసినప్పుడు తక్షణమే చర్య తీసుకుంటాను. అయితే గర్వాన్ని మాత్రం నేను ఈ రకంగా చూడటం లేదు. గర్వాన్ని నాలో చూస్తున్నప్పుడు, నాకు ఆది యిష్టం కాబట్టి ఆ విధంగానే కొనసాగుతోను; లేదూ దానివలన సంఘర్షణ పుడుతున్నది కాబట్టి అది నాకు అక్ఖర్లేదు, అంటాను. ఆది కనుక సంఘర్షణను కలిగించకపోతే అప్పుడు ఏ సమస్యా వుండదు.

గ్రహింపు, అవగాహన కాలానికి సంబంధించినవి కావు. గ్రహింపు చూడటంలోని తీక్షణతకు సంబంధించినది. అంటే సమగ్రంగా చూడటం. ఏదయినా ఒక విషయాన్ని సమగ్రంగా చూడటం అంటే ఎట్లా వుంటుంది? ఒక సమస్యతో మనకున్న మొత్తం శక్తి అంతటితోను, తక్షణమే తలపడేటట్లుగా చేసే సామర్థ్యం, సత్తువ, సజీవశక్తి, పట్టుదల మనకు ఎట్లా వస్తున్నాయి? మనలోని శక్తిని విభజించడం జరిగిన మరుక్షణమే సంఘర్షణ పుట్టుకొస్తుంది. అందువల్ల ఒక విషయాన్ని సమగ్రంగా చూడటం జరుగదు, గ్రహించడం జరగదు. సరే, ఒక నాగుపాముని చూసినప్పుడు వులిక్కిపడి ఎగురుతారు, యీ శక్తి మీకు ఎక్కడినుంచి వస్తున్నదీ? ఈ విధంగా మీరు అనే ఆ మొత్తం జీవి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, తక్షణమే ప్రతిస్పందన జరిపి, వులిక్కిపడి ఎగరడానికి వెనకాల వున్న ప్రక్రియలు - శరీర సంబంధమైనవీ, మనోతత్వ సంబంధమైనవీ కూడా అవి ఏమిటీ? ఆ తక్షణత వెనకాల వున్నవి ఏమేమిటి? తక్షణమే జరిగే ఆ చర్యలో చాలా సంగతులు నిబిడీకృతమై వున్నాయి: భయమూ, ప్రాణరక్షణ చేసుకొనే స్వభావం - యిది తప్పకుండా వుండవలసిన గుణం - నాగుపాము ప్రాణాపాయం కలిగిస్తుందనే సమాచారం - యివన్నీ వున్నాయి.

అటువంటప్పుడు, గర్వాన్ని కరిగించివేసుకొనే విషయంలో కూడా యిదే విధమైన, సశక్తిమంతమైన చర్య ఎందుకు జరుగదు? గర్వాన్ని ఒక వుదాహరణగా మాత్రమే యిక్కడ తీసుకుంటున్నాం. ఈ విషయంలో ఆ శక్తి మనకు లేకపోవడానికి వెనకాల అనేక కారణాలు వున్నాయి. గర్వంగా వుండటం నాకు యిష్టం. ప్రపంచం దానిమీదే నడుస్తున్నది. సమాజపు పద్ధతులన్నీ దీనిమీదే ఆధారపడి వున్నాయి. ఈ గర్వం వల్ల నాలో ఒక బలోత్సాహం, ఒక రకమైన హుందాతనం, ఎవ్వరితోనూ సన్నిహితంగా వుండకపోవడం, యితరుల కంటే గొప్ప అనే ఒక భావమూ కలుగుతున్నాయి. ఇవన్నీ కలిసి గర్వాన్ని కరిగించి వేసెయ్యడానికి అవసరమైన శక్తికి అడ్డుగా నిలుస్తాయి. చూడండి, నేను చేయవలసిన చర్యకు అడ్డు తగులుతున్న కారణాలను, గర్వంతో తలపడటానికి కావలసిన శక్తినీ నిరోధిస్తున్న కారణాలను నేను విశ్లేషిస్తూనైనా కూర్చుంటాను. లేదూ తక్షణమే ఆ సంగతి గ్రహిస్తాను. విశ్లేషణ అంటే కాలంతో ముడిపడిన ప్రక్రియ. వాయిదా వేయడానికి ఒక పద్ధతి. నేను విశ్లేషణ జరుపుతూ వున్నప్పుడు గర్వం కొనసాగుతూనే వుంటుంది. కాలం దాన్ని అంతం చేయబోవడం లేదు. కాబట్టి గర్వాన్ని సంపూర్ణంగా నేను చూడాలి. కానీ అట్లా చూసే శక్తి నాకు లేదు. ఈ విధంగా చెదిరిపోయి వృధా అవుతున్న శక్తిని పోగుచేసుకోవాలంటే, గర్వం వంటి సమస్యలను ఎదుర్కొనప్పుడు కాకుండా, నిరంతరమూ, ఏ సమస్యా లేనప్పుడు కూడా శక్తిని కూడగట్టుకోవడం అన్నది జరుగుతూనే వుండాలి. ఎప్పుడూ సమస్యల్లోనే మునిగి తేలుతూ వుండం, సమస్యలు లేని క్షణాలు కూడా వుంటాయి. అటువంటి సమయాల్లో శక్తిని కనుక మనం సేకరించుకుంటూ వుంటుంటే, యిక్కడ సేకరణ ఆంటే ఎరుకలో వుండటం అనమాట - అప్పుడు సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కోగలుగుతాం. అప్పుడు విశ్లేషణ అనే ప్రక్రియలో పడి మునిగి పోనక్కరలేదు.

అధ్యాపకుడు : మరో యిబ్బంది కూడా వుంది : సమస్య ఏదీ లేనప్పుడు, శక్తిని కూడగట్టుకోవడం కూడా లేనప్పుడు, ఏదో ఒక రూపంలో ధ్యానం చేస్తూ వుంటాం.

కృష్ణమూర్తి : వల్లించినదే మళ్ళీ మళ్ళీ కేవలం వల్లిస్తూ వుండటం వల్ల, స్మృతులకు ప్రతిస్పందిస్తూ వుండటం వల్ల, అనుభవాలకు ప్రతిస్పందిస్తూండటం వల్ల శక్తి వృధా అవుతుంది. మీ మనసుని కనుక మీరు పరిశీలిస్తూ వుంటే, సుఖాస్పదమైన ఒక జరిగిపోయిన సంఘటన మనసులోకి మళ్ళీ పునరావృతం అవుతూంటుందని గమనిస్తారు. ఆ సంఘటనలోకి మీరు తిరిగి వెళ్ళాలనుకుంటారు. దాన్ని గురించే ఆలోచించాలనుకుంటారు. ఆ విధంగా అది మళ్ళీ ప్రాణం పోసుకొని వేగం పుంజుకుంటుంది. మనసు ఎరుకగా వున్నప్పుడు, ఆలోచనని పూర్తిగా వికసించ నివ్వడం సాధ్యమా? అంటే అర్థం ఏమిటంటే, 'ఇది తప్పు, యిది ఒప్పు' ఆని అనకుండా, ఆ ఆలోచనని పూర్తిగా జీవించ నివ్వడం; ఆ ఆలోచన చక్కగా ఎదిగి తనంతట తానే సమసిపోయే మనోస్థితిని కలిగి వుండటం.

ఒక కొత్తదైన తీరులో సమస్యలతో మనం తలపడదామా? ఒక నవ్యనూతనమైన మానసిక గుణం గల యువతరాన్ని తయారుచేయాలనే విషయం మనం చర్చించుకుంటున్నాం. అది ఎట్లా సాధించగలం? నేనే కనుక యిక్కడి అధ్యాపకుల్లో ఒకరినవుతే యీ విషయంలో నాకు చాలా అక్కర వుంటుంది. ఒక మంచి అధ్యాపకుడి హృదయంలో నిస్సందేహంగా యీ అక్కర వుంటుంది : ఒక కొత్త మనసుని, ఒక కొత్త సున్నితత్వాన్ని తీసుకొని రావడం, చెట్ల ఎడల, మబ్బులు, ఆకాశం, సెలయేళ్ళ ఎడల ఒక కొత్త మనోభావాన్ని కలగజేయడం; పాతచేతననే సరిదిద్ది కొత్త రూపంలోకి తేవడం కాకుండా, ఒక నవ్యనూతనమైన చేతనను తీసుకొని రావడం. నేను చెప్తున్నది గతంచేత ఏమాత్రం కలుషితం అవని, పూర్తిగా నవ్యనూతనమైన ఒక కొత్త మనసు గురించి. నేను అపేక్షించేది కనుక అదే అవుతే యీ విషయంలో నేను చేయవలసినది ఏమిటి? అసలు అటువంటి మనసును తయారుచేయడం సాధ్యమా? గతాన్నే కొనసాగించుకుంటున్న మనసును ఒక కొత్తరూపంలోకి మలచుకోవడం కాదు. గతం స్పర్శతో ఏమాత్రం కలుషితం కాని మనసును తయారుచేయడం. అది నెరవేరే పనేనా? లేక వర్తమానంలోకి చొచ్చుకొని వచ్చే కొనసాగుతూ వుండే యీ గతానికే కాస్త మార్పు చేర్పులు చేసి కొత్త ఆకారం యివ్వడం తప్పు గత్యంతరం లేదా? ఆటు వంటప్పుడు కొత్త తరం అనేది వుండనే వుండదు. పాత తరమే యింకో కొత్త రూపంలో పునరావృతం అవుతుంది.

ఒక నవ్యనూతనమైన తరాన్ని తయారుచేయడం సాధ్యమేనని నాకనిస్తున్నది. ఇది నాలో నేనే అనుభూతి చెందడంతో పాటుగా, విద్యార్థికి కూడా దీనిని అందించడం ఎట్లా అని నేను ప్రశ్నించుకుంటున్నాను.

నాలోపల ఏదయినా ప్రయోగత్మకంగా దర్శిస్తున్నప్పుడు విద్యార్టికి ఆ విషయం వ్యక్తీకరించకుండా వుండలేను. ఎందుకంటే యిందులో నేను వేరు అతను వేరు అన్న ప్రశ్నే లేదు. ఇది యిద్దరికీ సంబంధించిన విషయం. అవునా కాదా?

సరే, కలుషితం అవని, నిర్మలమైన మనస్సును తీసుకొని రావడం ఎట్లా? మీరూ, నేనూ యిప్పుడే కొత్తగా పుట్టిన శిశువులం కాదు. సమాజమూ, హిందూమతమూ, మన చదువు, కుటుంబమూ, వార్తా పత్రికలూ అన్నీ మనల్ని కలుషిత పరిచాయి. ఈ కాలుష్యాన్నుంచి బయట పడటం ఎట్లా? ఇదంతా మన అస్తిత్వంలోని భాగమే అని అనుకుంటూ స్వీకరించాలా? సర్, చెప్పండి, ఏం చేయాలి మనం? మన మనస్సులు కలుషితమైపోయాయి అనే సమస్య ఎదురుగా వున్నది. కొంత వయసు పైబడిన వారికి యిందులో నుండి బయట పడటం మరీ కష్టం. మీరు కొంత నయమే, యింకా చిన్న వయసులోనే వున్నారు. సమస్య ఏమిటంటే మనస్సును కాలుష్య రహితంగా చేయడం. ఇది ఎట్లా జరుగుతుంది?

ఇది సాధ్యమైనా అవచ్చు, లేదూ అసాధ్యమూ కావచ్చు. అయితే సాధ్యమా కాదా అనేది కనుక్కోవడం ఎట్లా? తక్షణమే దీనినీ మీరు తేల్చుకోవాలని కోరుతున్నాను.

'పరిత్యాగం' అనే మాటకు అర్ధం ఏమిటో మీకు తెలుసా? గతాన్ని, హిందూత్వాన్ని త్యజించడం అంటే దాని అర్థం ఏమై వుంటుంది? పరిత్యజించడం అనే మాటకు అర్థం ఏమిటసలు? ఎప్పుడయినా, ఏదయినా పరిత్యజించారా మీరు? నిజమైన పరిత్యాగం వుంటుంది, బూటకపు పరిత్యాగం కూడా వుంటుంది. వెనకాల ఒక వుద్దేశ్యం పెట్టుకొని చేసేది బూటకపు పరిత్యాగం. ఒక ఆశయాన్ని సాధించడానికి గాని, ఒక లక్ష్యం మీద దృష్టి పెట్టుకొని గాని, భవిష్యత్తులో ఏదో ఆశించి గాని చేసేది పరిత్యాగం కాదు. ఒకదాన్ని త్యజించడం ద్వారా దాన్ని మించిన దాన్ని లాభంగా పొందాలని చేసేది పరిత్యజించడం కాదు. అయితే ఏ వుద్దేశ్యమూ పెట్టుకోకుండా చేసే పరిత్యాగమూ వుంది. పరిత్యజించాక, యిక ఆ పైన నా భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియనప్పుడు, అది నిజమైన పరిత్యాగం అవుతుంది. నేను హిందువును కాను అనీ, ఏ సంస్థకూ చెందననీ, ఏ ఒక్క ప్రత్యేకమైన మతశాఖకూ చెందనని అన్నింటినీ వదిలేస్తాను. ఈ విధంగా అన్నింటినీ త్యజించడంలో నేను పూర్తిగా భద్రత పోగొట్టుకుంటాను. అటువంటి పరిత్యాగం మీకు తెలుసా? మీరు ఎప్పుడయినా ఏదయినా పరిత్యజించారా? ఆ రకంగా మీరు గతాన్ని త్యజించగలరా? భవిష్యత్తులో ఏముందో అన్న సంగతి తెలియకపోయినా త్యజించగలరా? మీకు తెలిసినదంతా పరిత్యజించగలరా?

అధ్యాపకుడు : నేను ఏదయినా పరిత్యజించినప్పుడు, వుదాహరణకి హిందూ మతాన్ని త్యజిస్తే, అప్పుడే అదే సమయంలో హిందూత్వం అంటే ఏమిటి అన్న అవగాహన కలుగుతుంది.

కృష్ణమూర్తి : మనం చర్చిస్తున్న అంశం ఏమిటంటే, ఒక నవ్యనూతనమైన మనస్సును తయారుచేయడం గురించీ, అది అసలు సాధ్యమేనా అనీ. కాలుష్యం వున్న మనసు కొత్తది అవలేదు. అందుకని మనసుని కాలుష్య రహితంగా చేయడమూ, అది సాధ్యమా కాదా అన్న విషయమూ మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భంగా పరిత్యజించడం అంటే ఏమిటి అని మిమ్మల్ని అడగడం ఆరంభించాను. ఎందుకంటే పరిత్యాగానికీ దానికీ చాలా దగ్గర సంబంధం వుంది. పరిత్యాగానికి నవ్యనూతనమైన మనసుతో చాలా సన్నిహిత సంబంధం వుంది. వెనకాల కారణాలు మిగల్చకుండా, ఏ ప్రయోజనాలూ ఆశించకుండా నేను శుభ్రంగా పరిత్యజించివేస్తే అది నిజమైన పరిత్యాగం అవుతుంది. అయితే, అది సాధ్యమేనా? చూడండి, యీ సమాజాన్ని - అంటే రాజకీయ, ఆర్థిక సూత్రాలతోను, సామాజికమైన సంబంధ బాంధవ్యాలతోను, ఆకాంక్షాపరత్వం, అత్యాశలతోను నిండిపోయి వున్న - యీ సమాజాన్ని కనుక నేను పూర్తిగా త్యజించకపోతే, నవ్యనూతనమైన మనసు వుండటం అంటే ఏమిటో కని పెట్టడం నాకు సాధ్యం కాదు. కాబట్టి పునాదులను పగలగొట్టడంలో మొదటిది ఏమిటంటే నాకు తెలిసిన విషయాలన్నింటినీ పరిత్యజించడం, అది సాధ్యమేనా?

మాదక ద్రవ్యాల వలన నవ్యనూతనమైన మనసు కలగదని నిస్సందేహంగా చెప్పచ్చు. గతం అంతటినీ మొత్తంగా పరిత్యజించడం అన్న ఒక్కటి తప్ప మరేది దానిని కలిగించలేదు. అది చేయగలమా? ఏమంటారు? అటువంటి పరిత్యాగంలోని పరిమళాన్ని, ఆ దృష్టిని, ఆ రుచిని నేను చవిచూశాక, విద్యార్థికి అది చెప్పకుండా వుండగలనా? అది విద్యార్థికి ఎట్లా అందజేయాలి? అతను గణితమూ, భూగోళశాస్త్రం, చరిత్ర - యివన్నీ బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అయితే, అంత క్షుణ్ణంగానూ తెలిసిన వాటిని వదిలివేయాలి. ఏమాత్రం పరితాప పడకుండా వదిలివేయాలి.

అధ్యాపకుడు : సర్! గ్రహణేంద్రియాల ద్వారా కలిగే అనుభూతులన్నీ కొంత అవశేషాన్ని, కొంత అలజడిని మిగులుస్తాయి. ఇది రకరకాల సంఘర్షణలకు, అనేక రకాల మానసిక కార్యకలాపాలకు దారితీస్తుంది. అన్ని మతాలలోను సంప్రదాయంగా వస్తున్న పద్ధతి ఏమిటంటే క్రమశిక్షణ ద్వారా, నిరోధించడం ద్వారా యీ యింద్రియాను భూతులను తిరస్కరించడం. కాని మీరు, యీ అనుభూతులను చాలా పదునైన స్పందనశీలత్వంతో గ్రహించాలనీ, అప్పుడే యీ యింద్రియానుభూతులను వక్రీకరించడం గానీ, అవశేషాన్ని మిగుల్చుకోవడం గాని లేకుండా చూస్తామనీ అంటున్నారు.

కృ : అదీ అసలు విషయం. సున్నితత్వమూ, యింద్రియానుభూతులూ ఒకటి కావు. అవి వేరు, యివి వేరు. ఆలోచనలకు, యింద్రియాను భూతులకు, మనోభావాలకు దాస్యం చేసే మనసు అవశేషాలను మిగుల్చుకొనే మనసు. మిగుల్చుకున్న దానిని పట్టుకొని అదీ సంతోషిస్తూ వుంటుంది. ప్రాపంచిక సుఖాలను తలచుకొని తలచుకొని సంతోషిస్తుంది. ప్రతి ఆలోచనా ఒక ముద్రను వదలివెళ్తుంది. అదే మిగిలిపోయిన అవశేషం. మీరు పొందిన ఒక్కొక్క సుఖాన్ని గురించిన ఆలోచన ఒక్కొక్క ముద్రను వదిలి వెళ్తుంది. అవే మన సున్నితత్వాన్ని పోగొడతాయి. ఇవి తప్పకుండా మనసును మొద్దుబారేటట్లు చేస్తాయి. క్రమశిక్షణ, ఆదుపులో పెట్టడం, అణచివేయడం మనసుని యింకా కాస్త మందకొడిగా తయారుచేస్తాయి. నేను చెప్తున్నది ఏమిటంటే సున్నితత్వం అంటే యింద్రియానుభూతి కాదూ అని. సున్నితత్వం అంటే ఏ ముద్రలూ వుండవు, అవశేషం మిగలదు. ఇక ఇప్పుడు సమస్య ఏముంది?

ఆధ్యా : అయితే మీరు చెప్తున్న పరిత్యజించడం వేరూ, యింద్రియాను భూతులను నిరోధించడం అనే పరిత్యాగం వేరూ అనా?

కృ : అదుగో ఆ పూవుల సౌందర్యాన్ని చూసి, వాటి ఎడల సంపూర్ణమైన సున్నితాత్మకతతో వుండి, యిక ఆపైన పోటీని గురించిన ఏ అవశేషమూ, జ్ఞాపకమూ మిగుల్చుకోకుండా వుండాలంటే వాటివైపు ఎట్లా చూడాలి? అంటే ఒక గంట పోయాక వాటివైపు చూసినప్పుడు మళ్ళీ కొత్త పూవులను చూసినట్లుగా వుండాలంటే ఎట్లా చూడాలి! ఒక యింద్రియానుభూతి లాగా, పూవులకు, సుఖానికి సంబంధించిన ఒక యింద్రియానుభూతి లాగా చూస్తే మాత్రం అది సాధ్యపడదు. సాంప్రదాయికమైన పద్దతి ఏమిటంటే సుఖాన్నిచ్చే వాటన్నింటికీ దూరంగా వుండటం. ఎందుకంటే వాటితో సాంగత్యం వల్ల మనలో యింకా యితర రకాలైన సుఖాలు మేలుకుంటాయి. అందుకని అసలు అటు దృష్టి పోకుండా మిమ్మల్ని ఒక క్రమశిక్షణలో వుంచుకుంటారు. ఇటువంటి సాంగత్యాలను శస్త్ర చికిత్స చేసినట్లుగా కోసి పారేస్తే అది పరిణతి అనిపించుకోదు. కాబట్టి అద్భుతమైన యీ రంగులను మనసు, కళ్ళు చూశాక కూడా అవి ఏ ముద్రలను వదలకుండా వుండటం ఎట్లా జరుగుతుంది?

దీనికి ఒక పద్ధతి వుండాలని నేను అనడం లేదు. అటువంటి స్థితి ఎట్లా కలుగుతుంది? లేకపోతే మనలో సున్నితత్వం వుండదు. అంటే ఒక ఫోటోగ్రాఫిక్ కాగితంలాగా చిత్రాల ముద్రలను స్వీకరించడమూ, తనంతట తానే చెరిపేసుకొని తిరిగి శుభ్రంగా అవడమూ. ఫిల్ములాగే వెలుతురు మీద పడగానే ముద్రించుకోవడం, మళ్ళీ వెలుతురు తగిలితే నెగెటివ్గా అయిపోయి కొత్త ముద్రను స్వీకరించడం. కాబట్టి స్వీకరించిన సుఖాలన్నింటినీ తనకు తానే చేరిపేసుకొని నిరంతరంగా శుభ్రం చేసుకుంటూ వుండాలి మనసు. అది సాధ్యమయేదేనా? వాస్తవాలతో కాకుండా కేవలం వట్టి మాటలతో మనం ఆటలాడుకుంటున్నామా?

నాకు స్పష్టంగా కనబడుతున్న సంగతి ఏమిటంటే యింద్రియానుభూతుల, అనుస్పందనల అవశేషాలను మిగుల్చుకుంటే మనసు మందకొడిగా తయారవుతుందీ అని. ఈ యదార్థాన్ని మనం వొప్పుకోము. అనుభవపు మరకలను మిగుల్చుకోకుండా, అత్యంత తీవ్రమైన గాఢత్వంతో ఒక పూవును సంపూర్ణంగా చూడటం అనే అద్భుతమైన సున్నితశీలత్వం అంటే ఏమిటో మనకు తెలియదు. ప్రతి యింద్రియానుభూతీ, ప్రతి మనోభావమూ, ప్రతి ఆలోచనా ఒక మరకను ముద్రిస్తాయనీ, యిటువంటి మరకల మనసు ఒక నవ్యనూతనమైన మనసును మనకు యివ్వలేదనీ, యిది ఒక తిరుగులేని నిజమనీ నేను చూడగలుగుతున్నాను. ఇటువంటి మరకలతో వున్న మనసు వుండటమే మరణం అనీ గ్రహించాను. కాబట్టి నేను మరణాన్ని తిరస్కరిస్తున్నాను. అయితే మరొకటి ఏమున్నదో నాకు తెలియదు. మంచి మనసు అంటే అనుభవాల అవశేషం మిగుల్చుకోకుండా సున్నితంగా వుంటుందని కూడా నేను గ్రహించాను. ఆ మనసు అనుభవాలను పొందుతుంది. అయితే ఆ అనుభవాలు మరకలను ముద్రించడం వుండదు. ఆ మరకల్లో నుంచి మరికొన్ని అనుభవాలను పొందడమూ, కొన్ని అభిప్రాయాలను తయారు చేసుకోవడమూ, ఆ విధంగా యింకా మరణించడమూ వుండదు.

ఒకదానిని నేను త్యజిస్తున్నాను. ఇంకొకటి ఏమున్నదో నాకు తెలియదు. తెలిసినది త్యజించడంలో నుండి తెలియని దానిలోకి అవస్థాంతరం చెందడం ఎట్లా జరగాలి?

ఈ త్యజించడం అనేది ఎట్లా చేస్తాను? తెలిసిన దానిని ఎట్లా త్యజిస్తాను? బ్రహ్మాండమైన నాటకీయ సంఘటనల్లోనా, చిన్న చిన్న సంఘటనల్లోనా? గడ్డం క్షవరం చేసుకుంటున్నప్పుడు అది వదిలేసి, స్విట్జర్లాండులో గడిపిన మధుర క్షణాలు గుర్తుకి తెచ్చుకుంటూ వుంటామా? చాలా సంతోషకరంగా గడిపిన రోజు స్మృతులను ఎవరయినా త్యజిస్తారా? ఈ విషయం గురించి ఎరుక కలిగాక అప్పుడు వాటిని త్యజిస్తారా? ఇందులో నాటకీయత ఏమీ వుండదు. పరమ విచిత్రాలూ వుండవు. దీనిని గురించి యితరులకి ఏమీ తెలియనూ తెలియదు. అయినా సరే, ఒకే ఒక్క పెద్ద, బ్రహ్మాండమైన తుడిచిపెట్టేయడమే కాకుండా, చిన్న చిన్న విషయాలను సదా త్యజిస్తూ వుండటం, చిన్న చిన్న తుడిపివేతలూ, చిన్న చిన్నవి తొలగించుకోవడాలూ చాలా అవసరం. సంతోషకరమైనవి కానివ్వండి, అసహ్యకరమైనవి కానివ్వండి, జ్ఞాపకాలు అనే ఆలోచనలను, ప్రతి రోజూ ప్రతి క్షణమూ అవి లేవగానే వాటిని త్యజించివేయడం చాలా అవసరం. దీనివల్ల ఏదో ప్రయోజనం సిద్ధిస్తుందనీ కాదు, అజేయమైన ఒక పరమాద్భుత స్థితిలోకి ప్రవేశించడం కోసమూ కాదు. రిషీవేలీలో నివసిస్తుంటారు, ఏ బొంబాయి గురించో, రోము గురించే ఆలోచిస్తుంటారు. దీనివల్ల సంఘర్షణ పుడుతుందీ, మనసు మందకొడిగా తయారవుతుంది, విభజన జరిగి ముక్కలై పోతుంది. ఇదంతా గ్రహించాక దీన్నీ తుడిచి వేయగలరా? మనకు తెలియని ఒక అజేయమైన స్థితిలోకి ప్రవేశించడం కోసం కాకుండా వూరికేనే అన్నింటినీ తుడిచివేస్తూ వుండగలరా? అజ్ఞేయమైనది ఏమిటో మీరు ఎన్నటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే యిది అజ్ఞేయమైనది అని మీరు గుర్తించిన మరుక్షణమే తిరిగి తెలిసిన దానిలోకే మీరు వచ్చేస్తారు.

గుర్తించడం అనే ప్రక్రియ అంటే తెలిసినదే కొనసాగే ప్రక్రియ. అజ్ఞేయమైనది ఏమిటో నాకు తెలియదు. కాబట్టి నేను చేయగలిగింది ఒక్కటే. ఆలోచన పుట్టగానే దానిని తుడిపివేస్తూ వుండటం.

ఆ పూవును చూస్తారు, దాన్ని తాకి చూస్తారు, ఆ సౌందర్యాన్ని, ఆ తీక్షణతను, వుజ్వలంగా మెరిసిపోతున్న దాని రంగునీ చూస్తారు. ఆ తరువాత మీరు నివసిస్తున్న మీ గది లోపలకు వెళతారు. హెచ్చుతగ్గులుగా వున్న కొలతలతో, వికారంగా వున్న మీ గదిలోకి వెళ్లారు. ఆ గదిలోనే నివసిస్తుంటారు. కానీ సౌందర్యం గురించిన ఒక అనుభూతి మిమ్మల్ని వదలదు. అందుకని ఆ పూవును తలచుకుంటారు. ఆ తలపు మీలో కలగగానే దాన్ని పట్టుకొని శుభ్రంగా తుడిచివేసేయాలి. అయితే ఎంత లోతులదాకా వెళ్ళి దానిని వెకలించి వేయగలుగుతారు; ఆ పూవుని, మీ భార్యని, మీ దేవుళ్ళని, మీ ఆర్ధిక జీవనాన్ని ఎంత లోతులనుండి వాటిని త్యజించి వేస్తున్నారు? మీ భార్యతో, మీ పిల్లలతో, యీ వికారమైన, భయంకరమైన సమాజంలో మీరు నివసించక తప్పదు. ఈ జీవితాన్ని వదిలేసి దూరంగా ఎక్కడికీ పారిపోలేరు. అయితే మీరు కనుక ఆలోచనలను, దుఃఖాన్నీ, సుఖాన్ని సంపూర్ణంగా త్యజించివేస్తే, అప్పుడు మీ బాంధవ్యం అంతా వేరుగా వుంటుంది. అందువల్ల సంపూర్ణంగా త్యజించడం జరగాలి. పాక్షికంగా త్యజించడం కాదు. ఇష్టమైనవి వుంచుకోవడమూ, యిష్టంకానివి త్యజించడమూ కాదు.

సరే, యిప్పుడు మీరు అవగాహన చేసుకున్న దానిని విద్యార్థికి ఎట్లా విడమరచి చెప్తారు?

అధ్యా : బోధించడంలో, నేర్చుకోవడంలో వుండవలసినది ఒక ప్రగాఢమైన స్థితి అనీ, అక్కడ 'నేను యీ విషయం నీకు నేర్పిస్తున్నాను' అన్న దృష్టి వుండదనీ మీరు చెప్పారు. ఇప్పుడు, ఆలోచన వదిలే మరకలను నిరంతరం తుడిచివేస్తూ వుండటానికి, 'బోధించడం నేర్చుకోవడం' స్థితిలోని ప్రగాఢత్వానికీ సంబంధం వున్నదంటారా?

కృ: నిస్సందేహంగా. చూడండి, బోధించడమూ నేర్చుకోవడమూ రెండూ ఒకటే అని నేననుకుంటున్నాను. ఇక్కడ జరుగుతున్నది ఏమిటీ; నేను మీకు బోధించడం లేదు. నేను మీకు ఆధ్యాపకుడినీ కాదు, అధికారినీ కాదు. నేను అన్వేషణ సాగిస్తూ వున్నాను. నా అన్వేషణలను మీకూ తెలియ పరుస్తున్నాను. అవి అందుకుంటారా, వదిలేస్తారా - అది మీ యిష్టం. విద్యార్థుల విషయంలో కూడా యిట్లాంటి వైఖరే వుండాలి.

అధ్యా : అప్పుడు అధ్యాపకుడు చేయవలసినది ఏమిటి?

కృ : నిరంతరమూ త్యజించివేస్తూ వున్నప్పుడే మీరది కనిపెట్టగలుగుతారు. ఎప్పుడయినా ప్రయత్నించి చూశారా? అది పగటివేళలో ఒక్క నిముషం కూడా నిద్రపోకుండా వుండటం లాంటిది.

ఆధ్యా : సర్! దీనికీ ఎంతో శక్తి అవసరం. అయితే దీనివలన ఎంతో శక్తి లభిస్తుంది కూడా.

కృ : కానీ, ముందుగా త్యజించడానికి మీకు శక్తి కావాలి.

(కృష్ణమూర్తి ఆన్ ఎడ్యుకేషన్)