Jump to content

కృషీవలుడు/పద్యాలు 31-40

వికీసోర్స్ నుండి

     స్వాంతమున నీకు రామణీయక పిపాస
     యంతరించె నటంచు నే ననను గాంత,
     కాని, యెడలేని సంసార కష్టములకు
     స్త్రీప్రకృతి బలివెట్టుట చెల్లదమ్మ. 31

     త్యాగమునకైన నొకహద్దు దగును గాని
     శలభ మట్టుల నాత్మనాశనము మేలె?
     పొలఁతికి సతీత్వ సౌందర్యములును రెండు
     బ్రార్థనీయ వరంబులై పరఁగుఁగాదె! 32

     అతివ, నాయూరడింపుల యందె దవిలి
     చిన్నకూఁతురి నంపవు జొన్నమడికి
     బావురంబులు జిల్కలు పాలకంకి
     విఱచుకొని యాకసంబున వెడలెఁ జూడు. 33

పడెనట జిల్క లన్నమిష బైట దొలంగిన జూచిచూడకే
యొడిసెల ఱాయిఁబెట్టి పొలమోరలఁ బోయెడి బాటసారిపై

బడ దెగ రువ్వెదేల మగువా, యిటులం బడుచుందనాల తుం
దుడుకుదనంబు నీయెడద తొందరవెట్టెనె? నైజమేగదా! 34

ఐన నయ్యెగాని, యాఁకలి బలుదొడ్డ,
రెండు కంకు లిమ్ము రెడ్డిపడుచ,
ప్రొద్దువోవు మాదు పొలిమేర జేరను,
బాట నడచి నడచి బడలె మేను. 35

అని కడువేడు పాంథులకు నచ్చట చేతికినందు కంకులం
దినుఁడని చెప్పి మంచెపయి తియ్యనిరాగము దీయు ప్రాయపుం
గొనబుమిటారి, నీ మనసుకుందు నెఱుంగదుగాని, యింటిలో
ననయము లేమిడిన్‌ సయిచు నమ్మవెతల్‌ దలపోయ వేలొకో? 36

చిన్నప్రాయమందె చీడపుర్వును దెచ్చి
నీదుహృదయకళిక నిలుపఁదగదు,
పచ్చపైరుచేల బాంధవ్యమునఁ జేసి
పెరిగినావు ప్రకృతిబిడ్డ వోలె. 37

పూలకారుగాలి పొలముపై వీతెంచె
వలపు మొలచి యొడలు పులకరింప,
మనసుకోఁతలెల్ల మానిపోఁ గోయిలఁ
గూడి పాడు మొక్క క్రొత్తపాట. 38

పైరుంబచ్చలులేని లోపమును పాపంబోలె గ్రొంబూలసిం
గారంబుం గయిసేసి లేఁజివురులం గాంతిల్లె వల్లీతతుల్‌,
దారింబోయెడు బిచ్చకత్తెయయినం దావుల్‌ గుబాళింపగం
బూరేకుల్‌ చికురంబులం దుఱిమి సొంపుంబెంపు బాటించెడిన్‌. 39

కనుమ, యాబిచ్చకత్తెకు గలసుఖంబు
నందు సగపాలు లేదు నీయాలి కకట!
పవలు నిద్రించెదే కాఁపుపడుచువాఁడ,
పొలతి నిట్టూర్పు నీయెద పొగిలిపోదొ? 40