కృషీవలుడు/పద్యాలు 41-50

వికీసోర్స్ నుండి

కాఁపులెల్లరు నాగళ్ళు గట్టి కోడ
యడుగు దున్నెద రిపుడు; నీ వదనెఱుఁగవొ?
యాలసింపక యెడ్ల కయ్యలను దోలు
మోయి, యెండలు ముదిరి పెల్లుక్కవెట్టె. 41

శ్రమలు లేకయె ఫలములు దుముకఁబోవు,
పిండికొలఁదియె రొట్టె; యోపిన విధాన
కష్టపడుము కృషీవలా, గలుగు సుఖము
ఉత్తయాసల కన్న మే లుద్యమంబు. 42

అర్కబింబము మధ్యందినాతపంబు
గాయుచున్నది మేనెల్ల కమలిపోవ;

నురుగు గ్రక్కుచు నూర్చుచు నోరుదెఱచి
యొక్కయడుగైన బెట్టవు దుక్కిటెడ్లు. 43

ఖరకరతాపతప్తమయి కాయము ఘర్మకణాళి నీనుచున్‌
సొరిగెడి సత్వహీనముగ, చూపులు దీనములయ్యు ప్రొద్దునం
బొరసినమోము తేట లెటువోయెనొ! దప్పియు హెచ్చెనోయి, యి
త్తఱి తరుమూలశాయివయి తాపమువాయుమ చల్లనీడలన్‌. 44

కరము గష్టించు నిను గాంచి కనికరమున
నెండవేడిమి తొలగించు నిచ్చతోడ
వారిదం బాతపత్రమై వచ్చెగాని,
మారుతాహతి శిథిలమై మరలె నదియు. 45

తరువుల గోటరంబులకు దారెను బక్షికులంబు, బఱ్ఱెలున్‌
సరసుల జొచ్చెరోజుచు, గనంబడ రెవ్వరు దారులందు, నీ
సరణి నచేతనప్రకృతి చల్లదనంబున కాసచేయ మే
నెరియగ నీవుమాత్ర మిటులేల శ్రమించెద వెఱ్ఱటెండలన్‌? 46

బాటల వేడిదుమ్ములకు బాదములం జిఱుబొబ్బలెత్త గ్రీ
యూటగ జెమ్మటల్‌ మొగమునుండిదొరంగగ గూటిదుత్తతో
బాటలగంధి వచ్చెడిని, బాపము! వేగమ నీట మున్గి య
చ్చోటనె మజ్జిగన్నము రుచుల్వచియింపుచు నారగింపుమీ. 47

తరుణీ, ధూళుల కాళ్లుగాలెనని సంతాపంబునం గాంతునిం
జిఱుముఱ్ఱాడక, గేహనిర్వహణమున్‌ సేద్యంబు సాగంగ ని
ద్దఱు కష్టింప కుటుంబరక్షణము సాధ్యంబౌను; భిన్నాధ్వసం
చరణాసక్త హయద్వయంబు రథమున్‌ సాంతంబుగా లాగునే? 48

శ్రమ కుచితంబుగా ఫలము సంధిలదోయని చింతవొందకో
రమణీ, నిదాఘతాపము దొఱంగెడు నంతకు మఱ్ఱియూడజొం
పముల యుయాలలూఁగి పదమాత్రన యింటికిఁ బొమ్ము, పాలకై
కుములుచు నేడ్చునేమొ యనుంగు బసిపాపడు నిద్రలేచుచున్‌. 49

దారి జరించుచున్నప్పుడు దగ్గఱనున్న తటాకమందు నిం
పారు సరోజముల్‌ గొని గృహంబునకుం జనుదెమ్మ, బాలకుం
డారమణీయ పుష్పముల నచ్చెరువొందుచు గాంచి యాడుకో
దీఱిక వంటయింటి పని దీర్పుము కాంతుడు వచ్చునంతకున్‌. 50