కృషీవలుడు/పద్యాలు 21-30

వికీసోర్స్ నుండి

పొలముల కేగు పల్లెతలు పుత్తడిగాజులు ఘల్లుమంచు రా
పిలి యులివెత్తగం జిటికెవేయుచు నిన్గని యేలపాటలం
జెలువుగ బాడ నుప్పతిలు సిగ్గున నూరకపోక మాఱుపా
టల నెలుగెత్తి పాడుమ, మిటారుల నవ్వుల కాస్పదంబుగన్‌. 21

     గ్రామవాసుల కిట్టి నిష్కైతవంపు
     ముగ్ధపరితోషములు సుఖభోగ్యములగు;
     బట్టణ నివాసకుల శుష్కభావములను
     నిట్టి సామాజికానంద మెసఁగఁగలదె? 22

     ఓయి రెడ్డియువక, యూరక యిందందుఁ
     దిరుగ నేమి ఫలము? తిండిచేటు!
     తండ్రి కోఁతమడుల దగ్గఱ బనిసేయు,
     నన్నమునకు నింటి కనుపుమయ్య. 23

వ్రాలిన కొప్పులోపలి పూలరేకులు
     సడలి యొక్కొక్కటి జాఱుచుండ,
బరువంపు రొమ్ముపై బయ్యెద చినుగుళ్లు
     గాలికి నట్టిట్టు గదలియాడ,
నెలుగెత్తి పాడెడి యేలలు విని బాట
     సారు లెక్కసకెము సలుపుచుండ,
దమ్ములపుంబూఁత దవిలిన వాతెఱ
     పై పలుచాలు నవ్వకయె నవ్వ,
 
     జేతికొడవలి ఝళుపుచు చిన్నెలాడి
     కన్నెమాలెత పిడిచుట్టి మున్నమున్న
     మునువు తఱిగెడి; నింటికి బోవువేళ
     సందెడోదె యీలేవె కర్షకకుమార! 24

ఆఁకటి చిచ్చుబాధ సగమైన యొడళ్ళును నంటు డొక్కలుం
జీఁకటిచూపులున్‌ మొలకు జేనెడుపీలిక గల్గి జీవితం

బే కడగండ్లుగా, బరిగయేరెడి బీదల వెళ్లగొట్టి చీ
కాకొనరింపఁబోకు; వెలిగాదల యాఁకటిమంట నీకునున్‌. 25

     పసిఁడిపూసల పేరుల పగిది దోర
     పక్కముగ బండి నేలకు వ్రాలు కంకి
     గుత్తుల బిచుకతిండికిఁ దెత్తుననుచు
     నింతికిం జెప్పి మఱచితే యింతలోన? 26

     పడఁతి యొంటికత్తె; పనిపాటు సేయను
     నిడుగు దొడుగులకును నెవరు లేరు;
     చంటిబిడ్డ యొకఁడు, సంసారభారంబు
     పీల్చి పిప్పిసేయు బీదరాలి. 27

చెలియా, యిత్తఱి నిన్నుఁ గన్గొనిన నాచిత్తంబు తాపార్తమై
కలఁగుం, కష్టకుటుంబకార్యముల నెక్కాలంబు నిర్మగ్నవై
మెలఁగంజూతువు మంచిచీర రవికెల్‌ మేలౌనలంకారముల్‌
దలఁపంబోవు, తలైన దువ్వ; విఁకలేదా మేర నీపాటుకున్‌? 28

     మున్నూటరువది దినముల
     నెన్నండును గన నశక్య మేపనియును లే
     కున్న నిమేషము; కాఁపుం
     గన్నియ, నీ కాటవిడుపుకాలము లేదే? 29

     నిత్యకృత్యములం దొక్క నిమిషమైన
     దొంగిలింపుము కైసేయ దోయజాక్షి!
     యఖిలకామినీ సామాన్యమౌ బ్రసాద
     న ప్రియత్వము నీ యందు ననలుకొనదొ? 30