కృషీవలుడు/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము

ఆంధ్రవాఙ్మయమున ప్రకృతము ప్రసిద్ధికి వచ్చుచుండెడు గణ్యములగు నూతనసృష్టులలో నీకావ్య మొకటి. విషయమందును భావములందును ఇయ్యది మనదేశముయొక్క నవజీవితమునకుం జేరినది. అచ్చటచ్చట శైలియందును దూరోపమలు మొదలగు నలంకారముల యందును ప్రాచీనవాసన యింకను కొంత వదల వలసియున్నటుల తోచెడిని.

కవి కాపుయువకుడు; విషయము కాపులజీవితము; దృష్టి యభిమాన ప్రేరితము. కృషీవలుల జీవితమును ప్రథానాంశముగ గ్రహించిన తెలుగు గ్రంథములలో నిదియె మొదటిది. ఈవిషయ నవ్యతను దలంచియ కాబోలు రామిరెడ్డిగారు ఈక్రింది విధముగ వితర్కించి యుండుట :

అన్నాహాలిక, నీదు జీవితము నెయ్యంబార వర్ణింప మే
కొన్నన్ నిర్ఝరసారవేగమున వాక్పూరంబు మాధుర్యసం
పన్నంబై ప్రవహించుఁగాని, యితరుల్‌ భగ్నాశులై యీర్ష్యతో
నన్నుం గర్షకపక్షపాతియని నిందావాక్యముల్ వల్కరే?

తాను పూర్వలాక్షణికుల కరిగాపుగాడనియు స్వచ్ఛంద విహర శీలుడనియు నీక్రింది పద్యములలో బాహాటముగ చాటించి యున్నాడు.

వనలతయైన నాకవిత పత్రపుటంబుల బూవురెమ్మలన్‌
దినదిన జృంభమాణయయి తేజరిలెన్‌ సహజప్రరోహ వ
ర్ధన నియమానుసారముగ, దల్లత యెన్నడు దోటమాలిపా
ణిని గనుగోని వన్యరమణీయత జిల్కు నపూర్వపద్ధతిన్‌.

పంజరనిబద్ధకీరంబు బయలుగాంచి
యడ్డుకమ్ములదాటంగ నాసచేయు
నటు బహిర్ణియమంబుల నతకరించి
మన్మనంబు స్వాతంత్ర్యసీమకు జరించు.

కాన, యెవరేమియనుకొన్న దాన నేమి
గలుగు; గాలమనంతము; ఇలవిశాల;
భావలోకము క్రమముగా బడయుమార్పు
ఏల హృదయంబు వెలిపుచ్చ నింతయళుకు?

తన కవిత వనలత, స్వచ్ఛందవ్యాపనముగలది. చెన్నపురిలోని మాలీలదోహదములు కత్తిరింపులు మొదలగు చికిత్సలచే కృత్రిమసౌభాగ్యమువహించిన పూలచెట్లవంటిదిగాదు, "సహజ ప్రరోహవర్ధన నియమానుసారముగ" నల్లునట్టితీగె. "అపూర్వపద్ధతి" నవలంబించినది. శాస్త్రకారుల యాదేశములను, పారంపర్యప్రాప్త బహిర్ణియమంబుల పాటింపదు. ఆగమ పుంజములకుచేరిన గతానుగతికముగాదు. స్వాతంత్ర్యసీమను జరించు నది. ఏమీ! పూర్వికుల విధులను అతిక్రమింపవచ్చునా? వా రేర్పఱచిన కృతివిధానములుగాక అన్యము లెక్కడనైన నున్నవా? అని మూఢభక్తు లెవరైన ఆక్షేపించినయెడల "కాలమనంతము, ఇలవిశాల; భావలోకము క్రమముగా బడయు మార్పు" అని కవి వారిని తిరస్కరించి తనదారిని తా నేగెడిని. వీరు చేసియుండెడు కవితావిషయమైన చర్చను కొన్నియేడులక్రిందట సందర్భానుసారముగ నేనును "కవిత్వ తత్త్వవిచారము" లో చేసినాడను.

"ఐరోపాలోని కవీశ్వరులు కొందఱు కాపువారు, సైనికులు, మొదలైన తక్కువ వృత్తులవారి బ్రదుకులను వర్ణనార్హములని భావించి యెంతో సుందరముగ గావ్యములలో వ్రాసియున్నారు. మన గ్రంథముల మాత్రము చదివి యీ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రముయొక్క స్థితిగతుల నరయ జూచువారికి ఈ దేశమున బీదసాదలపై నాదరముగల కవి యెవడైన నున్నాడా? తుదకు బీదసాదలైన నున్నారా? యను సంశయము పట్టినను తప్పు వారిదికాదు! శోకరసము వర్ణింపవలయునన్న ననుకూలమగు సందర్భమెయ్యది? క్రొవ్వుకాఱెడి నాయికా నాయకుల యూహామాత్రములైన కష్టములా? ప్రజలు దినదినము కన్నీరుగార్చుటకైన నవకాశములేక కుడుచుచుండు పరిపరివిధములైన గోడులా? శాంత రసమునకు బోషకమెయ్యది? తమకు గష్టముదేనట్టివైన రాజులయొక్క యుదారచర్యలా? ఆకటమాడి మలమలమాడుచు నింటికి వచ్చి వంట సిద్ధముకాకుండినను భార్యపై గోపింపక, కన్నులు మూతపడుచుండ విధిని ధ్యానించుచు నొకమూల గూర్చుండు పొలముకాపులయొక్క నడవడియా? ఆహా! జన సామాన్యము యొక్క ప్రతిదిన వృత్తములలో నెంతభావము, రసము, గుణము, నుపగతములై యున్నవో మనకవులకుం దెలియవుగదా, రాజపుత్రులను, రాజకన్యలను, చాలనందుకు బ్రాహ్మణులను వేశ్యలనుబట్టి ఝంఝాటమాడుటదప్ప కవితకు మేలైన యన్యకర్మములు లేవా?"

ఉన్నవియనుటకు ఈ "కృషీవలుడు"ను, అబ్బూరి రామకృష్ణారావు, రాయప్రోలు సుబ్బారావు మొదలైన యువకులు విరచించియుండెడు నవ్యకావ్యములును ప్రమాణములు.

ఈ గ్రంథమునందు పొలముకాపులయు కాపుటిల్లాండ్రయు దైనందిన చర్యలతోడ ఋతువర్ణనములను కవి బహుచమత్కారముగ సమన్వయించి యున్నాడు. ఇది భావగంభీరులకేగాని శుష్కపండితులకు సాధ్యమగు క్రియగాదు. ప్రాతఃకాలమునుండి రాత్రి నిద్రపోవువఱకు కృషీవలులు చేయు కార్యములొకకూర్పు; వీనితో సమ్మేళించిన విధమున చేయబడి యుండెడి ఋత్వాది ప్రకృతివర్ణన మింకొకకూర్పు. రెండును భావకళా నిర్మితములును శోభితములును అయిన ప్రకృతి ప్రతిబింబములట్లు సత్యమును రామణీయకమును దాల్చియున్నవి. కృతిపరిమాణమున చిన్నదైయును గుణమున నానాసౌభాగ్య శోభితముగనున్నది. వీని నన్నింటిని విడదీసి ప్రదర్శింపవలయునన్న సూత్రమునకన్నను వ్యాఖ్యానము విపులమగును. అట్లు చూపుటచే చదువరుల భావపరిశ్రమ విక్షేపములకు నిరోధముగల్గును. కాన, కొన్ని యంశములను పేర్కొని విరమించెదను.

ఇందు గ్రామాంతర నివాసము వ్యవసాయవృత్తి ఇత్యాది ప్రకృతి సామీప్యజీవితమునకును మనుష్య స్వభావ ప్రవృత్తికిని ఉండు సంబంధము చూపబడియున్నది. మొత్తముమీద పట్నవాసు లంత మంచివారుగారనియు, గ్రామవాసులు నడవడియందు మేలుతరమైన వారనియు కవి యొక్క అభిప్రాయము. ఇది నిర్వివాదము కాదని నామనవి. పట్టణస్థులకు గ్రామస్థులకు చర్యాబేధములు, స్వభావభేదములు లేవనలేముగాని, పోలికలనుపెంచి యెక్కువతక్కువలను రూపించుట సాహసకార్యము. దేశాభ్యుదయమునకు పల్లెలెటులనో పురములును నట్లే యావశ్యకములు. మఱియు ఆర్థిక ప్రపంచమునకు ఆధారము వ్యవసాయమని కవిగారు చూపియున్నారు. ఇదినిజమేగాని తక్కినవాణిజ్యాది యభ్యుదయములు లేనిచో దేశము సమగ్రత తాల్వనేరదు.

నవ్యపాశ్చాత్య సభ్యత నాగరకత
పల్లెలందు నస్పష్టరూపముల దాల్చి
కాలసమ్మానితములైన గ్రామపద్ధ
తులను విముఖత్వముం గొంత గలుగజేసె.

నేటి నాగరకత నీమేలుగోరక
యప్పుచేసి బ్రతుకుమని విధించు
నాయవృద్ధికన్న నావశ్యకపదార్థ
సంఖ్య హెచ్చ జిత్తశాంతి యున్నె?

కవికి పరిణామములు వలయునో వలదో తెలియకున్నది. కవితా భావములను శాస్త్ర తత్త్వములం బలె తార్కిక దృష్టితో విమర్శింపదగదు. వానియందు రసికులు గమనింపవలసిన విషయము సౌందర్యము. ఆ గుణ మీకావ్యమందు అఖండముగ నున్నది.

అసంబంధములగు వర్ణనలు సంగతు లీ గ్రంథమున లేవు. ప్రతియంశమును చిత్తరువున కనుకూలించినదియు అగత్యమైనదియుగానున్నది. సంయోగతాలక్షణ మిందు ఏమాత్రము భంగము చెందకుండుట కవియొక్క భావనాగాంభీర్యమునకు అమోఘమైన సాక్ష్యము. తా వర్ణించు జీవితమును విషయములును తనకు అనుభవ వేద్యములు కాబట్టియు, వానియందు తనకు మనసు హృదయసంపూర్ణముగ లీనమై యుండుటచేతను వర్ణనలన్నియు హృద్యతాగుణపరిశోభితములు. వానియందు సత్యస్ఫురణ, మనోహరత, హృదయాకర్షణాది శక్తులున్నవి. ఇదియ శిల్పముయొక్క పరమార్థము.

పాశ్చాత్యభాషలలో "పా'స్టొరల్సు" నాఁబడు పాశుపాల్యాది గ్రామాంతర వృత్తులవారి అకృత్రిమ జీవిత స్వభావాదుల వర్ణించు కావ్యము లనేకములున్నవి. అయ్యవి గ్రీకు లా'టిన్‌, భాషలలో పుట్టి ఆధునిక ఐరోపా వాఙ్మయముల యందును వ్యాపకమునకు వచ్చియున్నవి. హైందవ భాషలలో ఈతరగతికింజేరిన కావ్యములలో శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, బృందావన జీవితము, గోపగోపికాసంచారములు ఎంతయు హృదయ రంజకములు. భాగవతమునందలి దశమస్కంధమును, విశేషించి యెఱ్ఱాప్రగ్గడయొక్క హరివంశ పూర్వభాగమును దేశీయ వాక్ప్రపంచమున తమస్సునడంచి చల్లని వెన్నెలను కురిపించి చిత్తానందముచేయు చంద్రబింబములవలె నున్నవి. జయదేవకృతమైన గీతగోవిందమును నిట్టిదయ. గోపికలను వదలిన గ్రామాంతర జీవిత మలభ్యమనియో, కృష్ణకాంతలకు తదనంతరము గోపికాసంతతులు నశించిరను భ్రమగొనియో మనకవులు అట్టివర్ణనలను, ఇతర సందర్భముల, ముఖ్యాంశములుగ గైకొని వర్ణించుట మానివేసిరి. ఈనాటికి ఆవృత్తములు మరల కవితాదృష్టికి నర్హములని భావింపబడుట తటస్థమైనది. ఇట్టెప్పుడో నశియించిన మహోత్తరమైన వృత్తమును పునర్జీవితముంజేసి దివ్యాకృతిగ మనముందర రామిరెడ్డిగారు నిలిపియుండుట వారి యసాధారణప్రజ్ఞను సూచించుచున్నది.

కృషీవలుని జీవితమంతయు పువ్వులపాన్పు గాదని కవిగా రెఱుంగక పోలేదు. పట్నవాసులకు వారికినుండు ఆర్థికస్పర్థ, సర్కారువారు వారియెడల చేయు అనాదరణము, ముఖ్యముగా వారి నావరించియుండెడు అజ్ఞానాంధకారమును, దానిచే వారినిపట్టి బాధించెడు దురాచార పిశాచముల విషయమును రాజకీయ సాంఘికాదినీతులును, సంస్కారముల యావశ్యకతను సూక్ష్మముగ దడవియున్నారు. మింటికెగయు పక్షియైనను భూమిమీద పెట్టియుండెడి గూటిపై చూపువేయక యుండునా? కాపువారియొక్క దుఃస్థితి యెప్పుడు తొలగును? వా రికముందైన పూర్వపు రెడ్డిరాజుల కాల మందువలె ఉన్నతపదవికిరారా? అను విచారములు అసలు సహజములేగద. "కాలగర్భంబు నందెట్టి ఘటనగలదొ; భావిపరిణామ మెవ్వరు పలుకగలరు" ఎవ్వరు పలుకగలరో గాని నావలన మాత్రముగాదు. రైతు లెట్టి దారిద్ర్యముపాలైయున్నారు! "కార్యారంభంబును ధైర్యమున్‌ విడకుమయ్యా" అని కవిగారు సంబోధించుచున్నారు. వీరి మాటల నాలకించి యాదరింతురు గాక. ముఖ్యముగ మా కులమువారికి అతిథి సత్కారము ఒకరు చెప్పక చూపక వచ్చిన సదాచారము. అన్నదానము మా వారివలె చేయువా రితరులున్నారో లేదో. ఎట్లును మించినవారు లేరనుట అతిశయోక్తిగాదు. ఈవిషయమున రామిరెడ్డిగారు ఈ క్రింది విధమున రమ్యముగ నుడివి యున్నారు.

ఉండి తిన్నను లేక పస్తున్నగాని
యాసచేయవు పరుల కష్టార్జితంబు;
నాకలెత్తగ నీపంచ కరుగు నతిథి
తినక త్రావక పోయిన దినములేదు.

కాపుటిల్లాండ్రను గూర్చి కవి చేసిన స్తుతులన్నియు సత్యమునకు మీఱినవి కావు; తక్కువ. వారియొక్క "శాంతి నీతియు నురుకష్టసహనశక్తి, నెవరెఱుంగుదురు?" స్త్రీలంగూర్చి వీరొనరించిన ప్రశంస యెంతయు సత్యము; గంభీరమును.

అతుల సంసారసాగర మందు గాల
జలము సుకృత దుష్కృతవాత చలితమగుచు
సుఖవిషాదపు దరగలై సుడియుచుండ
పడవవై గట్టుజేర్తువు పతిని, గృహిణి!

సంగ్రహించి వ్రాయుశక్తియందు ఈ కవిని మించినవారుండరు కాబోలు, ఈ గ్రంథమును జదువ జదువ ఏరీతిని నిన్నియంశములను నిన్నికొద్దిపుటలలో నిక్షేపించినాడు అను ఆశ్చర్యము దాల్పని వారుండరు. పునరుక్తి, నిరర్థకవృత్తి, యిత్యాది కాలవ్యయమును స్థలవ్యయమును చేకూర్చు పద్ధతులు లేవు. తన కుల స్థులయట్లె యీకవియు మితభాషి. అర్థము ఎక్కువ పదములు తక్కువ అను శ్లాఘనకు పాత్రుడు.

మనుచరిత్ర, కళాపూర్ణోదయాదులలోని పద్యముల ననుకరించిన తలపోతలు వ్రాతలు ఒకటిరెండు చోటుల నున్నట్లు తోచెడిని. ఇది దోషముగాదు. ప్రమాదము కావచ్చును. వీరి యాథార్థ్యవర్ణనాశక్తిని చూపించుటకై కొన్ని పద్యముల నుదహరించు చున్నాను.

చలువగల కప్పురము చిలికినటు చల్లనయి
     లలిత కలధౌత మృదువిలసనము పోలెన్‌
మొలక లిడు వెన్నెలల చెలువము దిగంతముల
     కలముకొని తారకల తళుకులను గప్పన్
గలువపొడి గందవొడి దొలక సుడిరేగుచును
     మెలగు నెల పయ్యరలు నలసత జరింపం,
దలపున రసార్ద్రమగు వలపు లిగిరింప దిన
     కలకల మడంచి నిశ గొలిపె ప్రమదంబున్‌.
 
స్నానమొనరించి, వెన్నెల చలువ బయల
బిడ్డలున్నీవు నిల్లాలు ప్రీతి గుడిచి,
పొడుపు కతలు, సమస్యలు, బూర్వచరిత
లంత వచియింపు వారలు సంతసింప.

శ్రమ, విషాదమ్ము, లాసలు, సర్వకాల
హృదయ భేదక చింతలు, నిదుర యనెడు

శాంతవారిధి లీనమై సమసిపోవ
విశ్రమింపుము సైరికా వేగువఱుకు.

నేనును విశ్రమించెదను. వేగువఱకు గాదు. మఱి రామిరెడ్డిగారు ఇంకొక గ్రంథము వ్రాయువఱకు. వ్రాసినతోడనే పఠనమునకుం దొడంగెద.


ఇట్లు