కూసుమంచి గణపేశ్వరాలయం/ఇలా వెలుగులోకి వచ్చింది

వికీసోర్స్ నుండి

ఇలా వెలుగులోకి వచ్చింది ...

కూసుమంచి గ్రామానికి సుమారు 2 కిలోమీటర్లు ఎడంగా ఊరిబయట పొలాల్లో సర్వేనంబరు 636లో కేవలం పాడుబడిన శిధిలాల్లాగా మాత్రమే ఈ దేవాలయం వుండేది. నిండా పెరిగిన పిచ్చిమొక్కలు, పురుగూ పుట్రాతో లోపటికి కాలుపెట్టాలంటేనే బయపడేలా వుండేది. పశువుల కాపర్లకో, లేదా ఊసుపోక ఆటలాడుకుందామని వచ్చేవాళ్ళకో ఆవాసంగావుండేది. 2001లో కూసుమంచి పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్‌స్పెక్టరు పనిచేస్తున్న సాధు వీరప్రతాప్ రెడ్డి గారి చొరవతో దేవాలయంలో మళ్ళీ దీపం వెలిగించటం ప్రారంభం అయ్యింది. ఆయనను ఆకర్షించింది కూడా ప్రధానంగా ఈ అతిపెద్ద శివలింగమేనని చెప్తున్నారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు తమ సిబ్బందితోపాటు గ్రామస్తుల సహాయ సహకారాలను ఆయన తీసుకున్నారు. అప్పటినుంచి నిత్య పూజలే కాకుండా కళ్యాణ మహోత్సవాలు, ఉత్సవాలూ జరుగుతున్నాయి. శివునికి ప్రీతి పాత్రమైన సోమవారం రోజున భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ప్రత్యేకంగా శివరాత్రి పర్వదినం రోజునైతే లక్షలాదిమంది భక్తులు గణపేశ్వరాలయాన్ని సందర్శించుకుంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారేకాక రాష్ట్రం నలుమూలలనుండికూడా ఆలయసందర్శన చేసుకుంటారు. సిఐ ప్రతాప రెడ్డిగారి తర్వాత కూసుమంచి సర్కిల్ కు వచ్చిన మరికొందరు పోలీసు అధికారులు శ్రీ బాలకిషన్, శ్రీ సాయిబాబా, శ్రీ వెంకట్రావు, శ్రీ సునితారెడ్డి, శ్రీ నరేష్ రెడ్డి మొదలైన వారుకూడా అదే ఆనవాయితీని కొనసాగించి ఆలయం అభివృద్ధికి తమ సహాయ సహకారాలనందించారని గ్రామప్రజలు చెపుతారు. ప్రస్తుతం దేవులపల్లి శేషగిరి శర్మగారు పూజారిగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత 2002 నుంచి దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి ఈ దేవాలయాన్ని తీసుకుని కొంతమేరకు అభివృద్ధికార్యక్రమాలను చేపట్టడంతో పర్యాటక ప్రాంతంగా కొంత అభివృద్ధి చెందింది.