Jump to content

కూసుమంచి గణపేశ్వరాలయం/ఉనికి

వికీసోర్స్ నుండి

ఉనికి

తెలంగాణా రాష్ట్రంలోనే అతిపెద్ద శివలింగం కూసుమంచి గణపేశ్వరాలయంలోని బృహత్ శివలింగం. దేశంలోనే చెప్పుకోదగిన స్థాయిలో దీని పరిమాణం వుంది. అత్యంత చాతుర్యాన్ని కనబరిచిన ఆలయ నిర్మాణం, విశేషమైన వాస్తుపద్ధతిలో వున్న ఉప ఆలయాలు, సుమారు వెయ్యేళ్ళ చారిత్రక ఉనికి, చరిత్రకు ఆనవాళ్ళుగా నిలిచిన వీరగల్లులు, ఊరికి అనుబంధంగా నిర్మించిన గంగాదేవి చెరువు ఇక్కడి గణపేశ్వరాలయ ప్రత్యేకతను చాటుతున్నాయి.

ఖమ్మం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఖమ్మం నగరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూసుమంచి గ్రామంలో ఈ గణపేశ్వరాలయం వుంది. సూర్యాపేటనుంచి ఖమ్మంరోడ్ లో 40 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. హైదరాబాదునుంచి 170 కిలోమీటర్లు, వరంగల్ నుంచి ఖమ్మంమీదుగా 130 కిలోమీటర్ల దూరం వుంటుంది. విజయవాడ నుంచి 126 కిలోమీటర్లు వుంటుంది. ఖమ్మం చరిత్రను గమనిస్తే అప్పట్లో రాజధానులుగా వెలుగొందిన నేలకొండపల్లి, ముదిగొండకూడా చాలా దగ్గరగా వున్నాయి. విష్ణుకుండినుల పాలన, అప్పట్లో పారిశ్రామికంగా చాలా అభివృద్ది చెందిన ప్రాంతం అతి పెద్ద బౌద్దారామం వున్న ప్రదేశం, భక్తరామదాసుకు పుట్టినిల్లు అయిన నేలకొండపల్లికి 20 కిలోమీటర్ల లోపు దూరంలోనే కూసుమంచి వుంటుంది. అదేవిధంగా చాళుక్యవంశం ముదిగొండ ప్రాంతంనుంచి పరిపాలన చేయడం వల్లనే ముదిగొండ చాళుక్యులుగా పేరుపొందారు. ఆ ముదిగొండ కూడా పాతిక కిలోమీటర్ల ప్రస్తుతం రోడ్డుమార్గం పద్దతిలో వుంటుంది. ఏరియల్ డిస్టెన్స్ పద్దతిలో మరేదైనా దారి వుండివుంటే ఈ దూరం మరింత తగ్గుతుంది. కూసుమంచి ఊరినుంచి సుమారు 2 కిలోమీటర్లు లోపటికి ప్రస్తుతం ఈ దేవాలయం వుంది. పర్యాటక ప్రాంతంగానూ, చారిత్రక

అధ్యయనానికి ఊతాన్నిచ్చే ప్రాంతంగానూ దీనికి ప్రాముఖ్యత ఉంది. కూసుమంచి గ్రామానికి ఈశాన్యదిశగా ఈ గణపేశ్వరాలయమూ దీని ఉపాలయాలూ నెలకొనివున్నాయి. భౌగోళికంగా అక్షాంశము: 17°23'0.85" రేఖాంశము: 79°95'1.09" లపై వుంది.