కూసుమంచి గణపేశ్వరాలయం/కూసుమంచి ఊరిపేరు వెనక

వికీసోర్స్ నుండి

కూసుమంచి ఊరిపేరు వెనక

కాకతీయుల కాలంలో దేవాలయాలను కేవలం రాజధాని ప్రాంతంలోనో పెద్దపెద్ద జనావాసాలున్న చోట మాత్రమే కాకుండా వారి రాజ్యం నలుమూలలా విస్తరించేలా కట్టారు. ఆలయం, నగరం, నీటివసతిని ఒక క్రమబద్దమైన పద్దతిలో అమరిక కలిగివుండేలా జాగ్రత్త పడ్డారు. కాకతీయ నిర్మాణశైలికి పరాకాష్టగా భావించే రామప్ప దేవాలయం కూడా పాలంపేట అనబడే చిన్న ప్రాంతంలో నిర్మించారు. అది రాజధానిగానో, వర్తక వ్యాపారాలూ నిర్వహించిన అతిపెద్ద పట్టణ ప్రాంతంగానో ఎక్కడా ఆధారాలు దొరకలేదు. పైగా మొన్నమొన్నటి వరకూ కూడా తుప్పలూ, చెట్లతో నిండిన మారుమూల అరణ్య ప్రాంతంగా వుంది. ఖమ్మంజిల్లాలోని గణపేశ్వరాలయం నిర్మాణం కోసం ఎంచుకున్న కూసుమంచి ఊరు పేరును గమనిస్తే ఇది మొదటినుంచి స్వల్ప జనావాస ప్రాంతమేనేమో అనిపిస్తుంది.

పేరునుబట్టి చూస్తే ‘కూసు’ అంటే చిన్న, సులభసాధ్యమైన అని అర్ధం. కూసుమంచి అంటే చిన్నఊరు అనే అర్ధంలో తీసుకోవచ్చు. అభ్యాసం కూసు విద్య అనే సామెతలో ఈ పదం ఇప్పటికీ వాడుకలోనే వుంది. వైష్ణవ సంప్రదాయాలలో ఒకటైన సాతాని మతం(చాత్తాద వైష్ణవం)లో కూడా కూసుమతం, కూచిమతం అనే ఒక శాఖ వుంది.

కొంచెము అనేందుకు కూసింత, కూసంత అనే పదాలను కాస్తంత అనే రూపంలోనూ వాడుతున్నాం. కూచి అంటే కూడా చిన్న అనే అర్ధం వుంది. కూచికుండ అనేది ఇలా వాడుకలోకి వచ్చిందే. 18వ శతాబ్దంలో కూచిమంచి జగ్గకవి ( చంద్రరేఖా విలాపం అనే శృంగార ప్రబంధము కాకతీయుల చారిత్రక వివరాలను కూడా తెలిపే ‘సోమదేవ రాజీయము’ వంటి గ్రంధాల రచయిత) , కూచిమంచి తిమ్మకవి (పుదుచ్చేరి లోని కామ గ్రంథమాల సంపాదకులు)ఈ విధమైన ఇంటిపేరుతో ప్రసిద్ధులు.