Jump to content

కులశేఖర మహీపాల చరిత్రము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

కులశేఖర మహీపాల చరిత్ర

ప్రథమాశ్వాసము

శా.

శ్రీ గోత్రాతనయాస్తనస్థగితకాశ్మీరద్యుతుల్ స్వీయ వ
క్షో[గంధార్ద్ర] లలంతికారుచితతుల్ చూపట్టి యన్యోస్యహృ
ద్రాగంబుల్ బయలెక్కిన ట్లెసఁగ నుద్యత్సంతానందసం
భోగౌత్సుక్యమునందు రాఘవుఁడు మమ్ముం బ్రోచు నెల్లప్పుడున్.

1


ఉ.

ధౌతయశఃప్రభూత విబుధవ్రజసేవిత దివ్యరూప వి
ఖ్యాత సమస్తలోకశుభ కారణదృష్టిసమేత జాంబవ
ద్వాతసుతాంగదాది, కపివందిత పూతపదాంబుజాత, సం
ప్రీత, పతివ్రతాశ్రవణపీతగుణామ్మత సీతఁ గొల్చెదన్.

2


మ.

జలజాక్షుం డెట సంభవించె నచటన్ సాహాయ్యధౌరేయుఁడై
బలశౌర్యమ్ములఁ బెంపు గాంచి విలసత్పర్యంకసౌధాంబరా
దులు దానై హరికిన్ సఖత్వభటవృత్తుల్ పూను ధన్యాత్ము ని
స్తులభోగోన్నతు నిత్యశాంతుని ననంతున్ గొల్తుఁ జిత్తమ్మునన్.

3


చ.

తనభుజపీఠి నచ్యుతుఁడు తర్కరపద్మమునందు మందరా
వనిధరమున్ దదగ్రమున వారణ ఖడ్గ లులాయ సింహ భృ
ద్వనములు దద్ద్రుమస్థ కపివర్గము, పైపయి నిట్లు దొంతిఁ బూ
నిన క్రియఁ దాల్చి లీలఁ జననేర్చిన పత్రిపతిన్ భజించెదన్.

4


మ.

వివిధ ప్రాణి సమాకులాఖిల జగద్విశ్రాంతి కృత్కాండ సం
భవ రక్షా లయహేతు సంచలనశుంభద్వేత్రబాహుండు, మా
ధవ భావాభిమతప్రవర్తకుఁడు దైత్యధ్వాంతభానుండు, దా
సవనవ్రాత వసంతుఁడై వెలయు విష్వక్సేనుఁ గీర్తించెదన్.

5

మ.

రవి మున్నొక్కరుఁ డేగుదెంచు నిదె ఘోరప్రక్రియన్ గోటిసూ
ర్యవిలాసోగ్రత దోఁచె నంచు ఖచరవ్రాతమ్ము భీతిల్ల దా
నవసేనావనముం దహించి సురసన్మానంబులం జెందు మా
ధవు చక్రాయుధమున్ భజించెద సముద్యద్భక్తియోగమ్మునన్.

6


ఉ.

యూధములై నిశాచరసముత్కటచక్రము లోలిఁ బర్వ ని
ష్క్రోధమహామునివ్రజచకోరము లింపు వహింప నిర్జరాం
భోధి సమృద్ధి జెంద భవపుంజతమంబెడలన్ దనర్చు న
మ్మాధవు శంఖచంద్రికలు మాకు శుభమ్ము లొసంగు గావుతన్.

7


మ.

ప్రకటారాతి కరోటపాటనవినిర్యద్రక్తసిక్తాత్మమూ
ర్తికి సొంపై పయిఁ జెందు దివ్యకుసుమశ్రేణిరుచిన్ జిత్రకం
చుకమున్ దాల్చినలీల దోఁప సుమనస్స్తుత్యక్రియాప్తిన్ సమ
గ్రకళావైఖరి శౌరిచేఁ దనరు నక్కౌమోదకిన్ గొల్చెదన్.

8


మ.

రవికోటిన్ దెగడు న్నతాంతరతమోరాశివ్యయాపాదియై
పవికోటిన్ బ్రహసించు దైత్యకుధర ప్రధ్వంసనోద్వృత్తి కే
శవ హస్తాంబుజభూషణమ్మగుచు శశ్వద్విశ్వవిఖ్యాత వై
భవమై యొప్పెడు నందకమ్ము గలుషప్రచ్ఛేదమున్ జేయుతన్.

9


ఉ.

పాటవ మొప్ప నాత్మముఖబంధవిముక్తశరమ్ములన్ ద్విషత్
కోటులు గ్రుంగె నంచుఁ దన కోటి జనార్దను కర్ణసీమకున్
మాటికిఁ దెల్పఁబంచిన క్రమంబున మండలితాకృతిన్ సమి
న్నాటకలీలఁ దాల్చు యదునాయకు శార్ఙ్గము నాశ్రయించెదన్.

10


సీ.

తనుకాంతు లఖిలదిక్తటనటత్కరటి వి
        స్ఫుటకటమ్ముల జాఁజుపూఁతఁ బెనుప
ఛదజనుః పవనముల్ సప్తాబ్ధివీచీప
        రస్పరాహతికి సారథ్య మునుప
తుండాగ్ర మత్యుగ్ర దుర్గ్రహారిగ్రావ
        పాళిపై దంభోళికేళి సలుప
నఖరముల్ నతజనోన్ముఖ మహాఘధ్వాంత
        పేటికిఁ దపనాంశుధాటి గాఁగ

తే.

ముఖరుచులు శంభుజంభారి ముఖ్యదేవ
దృక్చకోరావళులకుఁ జంద్రికల నినుప
విలసితోదగ్రమూర్తియై వెలయు బుధవి
ధేయు మునిగేయు నవ్వైనతేయుఁ గొలుతు.

11


గీ.

సత్యానందగుణాభినంద్యుఁడు జగజన్మాదికృత్యైకసం
గత్యాపాదకవేత్రపాణి, నిజహుంకారాంకురోగ్రోత్క్రమ
ప్రత్యాఖ్యాతవిరోధిమండలుఁడు విష్వక్సేనదేవుండు ని
ష్ప్రత్యూహమ్ముగ మత్కృతిం గరుణనిర్వాహస్థితిం బ్రోవుతన్.

12


చ.

అనయము సత్కవుల్ భగవదర్పిత కావ్యరసమ్ము మెత్తు, రొ
య్యనఁ గుకవుల్ వెసన్ నెరసు లారయుచుండుదు రేమిచిత్రమో!
ఘన సరసీ లసత్కమలకైరవ సౌరభ మేవగింపుచున్
మునుకొని నత్తగుల్లలకు ముక్కులు సాచు బకంబులున్ బలెన్.

13


వ.

ఇత్తెఱంగున నిష్టదేవతాప్రార్ధనంబును సుకవికవితాభివందనంబునుం
గుకవినిందనంబునుం గావించి యెద్దియేనియు నొక్క చిరంతన ప్రపన్నచరితంబును
మిశ్రకవితావిశేషానుబంధంబు గావించి భగవత్సమర్పితంబు సేయు భాగ్యంబు దొర
కొనునొకోయని నిదురించు నంత క్షపావసానయామంబునందు.

14


చ.

నగుమొగమున్ విశాలనయనమ్ములు చక్కని చెక్కుదోయి, చె
న్నగు సరులున్న పెన్నుర, ముదంచితబాహుయుగంబు, ముత్తెఁపుం
జిగిఁ దళుకొత్తు పల్వరుస, చిన్నియొయారఁపుచెయ్వు లొప్ప సొం
పగు పురుషుఁడు నాదుకల నాదర మేర్పడ గోచరించినన్.

15


వ.

ఏనును బులకాంకురంబు లవయంబుల నవలంబింప నప్పురుషుని తెఱఁ
గెఱుఁగక వెరఁగుపడి చూచుచున్నంత-

16


తే.

“ఏను రఘువల్లభుఁడ నీదుహృదయ మెఱిఁగి
వచ్చితిని గులశేఖరాళ్వార్లచరిత
మాంధ్రగీర్వాణ మిశ్రపద్యాంతరములఁ
గృతి వినిర్మింపు మాకు నంకితముగాఁగ.”

17

వ.

పరమపురుషార్థవేత్తలగు భాగవతోత్తములం గీర్తించుట కీర్తికరంబును
మదీయ కైంకర్యవిశేషంబు నగుంగావున నిత్తెఱంగునం గావించి కృతార్ధుండవు
గమ్మని యానతిచ్చిచనియె నంత మేలుకాంచి నామనంబున నిట్లని యూహించితి.

18


ఉ.

ఎక్కడిచోద్య మజ్జగదధీశ్వరుఁగూర్చి మహాతపమ్ము ము
న్నైక్కడినుండి చేసితి నహేతుక మాతని సత్కటాక్ష మొ
క్కొక్కనిపైఁ బొసంగు ననుచుండెద రార్యులు తథ్యమయ్యె లోఁ
జిక్కినభక్తి నర్పణముఁ జేసెద మత్కృతి రామమూర్తికిన్.

19


సీ.

శుభకరాపస్తంబసూత్రుండు కౌండిన్య
        గోత్రపవిత్రుండు గుణవిశిష్టుఁ
డనుపమశేషాన్వయాంభోధిచంద్రుం డ
        హోబలదేశికుం డొనరఁ దనదు
సతియందుఁ బుత్రపంచకము నాపాదించె
        నందగ్రజుండు రామానుజార్యుఁ
డమ్మహాత్ముండు సీతమయను నిజదేవి
        వలన శ్రీభట్టరాహ్వయకుమారుఁ


తే.

గనియె నా శాంతినిధికి రాగమయు సత్య
భామ యను భార్యలిరువురు భవ్యమతులు
సరవి రాగమదేవికి సంభవించె
సరసగుణశాలి వేంకటాచార్యమౌళి.

20


తే.

అమ్మహాత్ముఁడు లక్ష్మమ యనెడి పత్ని
వలన మువ్వురిఁ దనయుల నెలమి గాంచెఁ
జెలిమి రామానుజుండును జెన్నభట్ట
రను సహోదరు లిరువు, రే నగ్రజుండ.

21


క.

ఇల రఘునాథార్యుండన
వెలసితి లక్ష్మణమునీంద్ర విమలపదాబ్జం
బులు శరణంబని నమ్మితి
లలి భాగవతార్చనాభిలాషంబెసఁగన్.

22

వ.

ఇట్టి యేను గృతిపతియగు జానకీపతిం గుఱించి షష్ఠ్యంతమ్ములు రచించెద

23


క.

పురహరగిరి సురవరకరి
దరశరహరినిభయశస్సుధాలహరి కి దు
ష్కర పరసైన్యోద్దురసం
గరరంగ విశృంఖల ప్రకటశౌర్యునకున్.

24


క.

అకుటిల సంవిన్నిజసే
వకజన భయదోగ్రదైత్యవపురేథః పా
వక కీలాయితశరునకు
ప్రకటయశః పిహితభూనభః కుహరునకున్.

25


క.

ఉద్యత్ప్రద్యోతద్యో
తద్యోతిత నిజభుజప్రతాపద్యుతికిన్
హృద్యానవద్య పద్య
స్వాద్యరసోద్యత్ప్రబంధ సమ్యక్ఛృతికిన్.

26


క.

దుర్గమనిలయనిశాచర
వర్గాధిప భయదశస్త్ర వరధోరణికిన్
దోర్గర్వనృపతిదుస్సహ
భర్గధనుర్భంగలబ్ధ భామామణికిన్.

27


క.

శోభితకల్యాణగుణ
శ్రీభరితాత్మునకు రత్నచిత్రవిభూషా
భాభూషితాంగునకు రవి
భూభూపాలునకు రామభూపాలునకున్.

28


వ.

అంకితంబుగా నాయొనర్పంబూనిన కులశేఖరచరిత్రంబునకుఁ గథాక్రమం
ఔట్టిదనిన—

29


చ.

శమదమ సత్యశీల గుణసంపద సొంపువహింప వైష్ణవో
త్తములు ప్రభాతవేళ నుచితజ్ఞత మేల్కని తామ్రపర్ణికా
విమలజలావగాహనము వేడ్క నొనర్చి సితోర్ధ్వపుండ్రదీ
ప్తముఖసరోజులై జపతపఃక్రియలన్ నివసించి యున్నెడన్.

30

క.

అందొక దేశికమణి ని
ష్పందముకుందాంఘ్రిభక్తి భజనాసక్తిం
జెంది సికతాతలమ్మున
సుందరపద్మాసనైకశోభితుఁ డగుచున్.

31


వ.

విచ్చేసియున్నయెడ శిష్యప్రవరు లయ్యాచార్యపురుషునకుఁ బ్రదక్షిణ
ప్రణామమ్ములాచరించి యంజలిపుటంబులు నిటలతటంబులం గదియించి యిట్లని
విన్నవించిరి—

32


ఉ.

దేవరవారు మున్ను వసుదేవకుమారక భక్తవృత్తముల్
పావనసూక్తులం దెలియఁబల్కితి రక్కులశేఖరాభిధా
నావనిభర్త సచ్చరిత మద్భుతరూప మనంగ నాత్మలన్
దావలమయ్యెఁ గౌతుకము దాసులకున్ గృప నానతీదగున్.

33


క.

అనుచుం బ్రార్థించిన శి
ష్యనికాయము జూచి పలికె నాచార్యుఁడు మీ
రనుపమభక్తిన్ వేడిన
ఘనుచరితంబిపుడు దెలియఁగా వివరింతున్.

34


క.

శ్రీదమ్ములు దళితాశ్రిత
ఖేదమ్ములు దుష్టహ్వద్విగీతాచారో
చ్ఛేదమ్ములు శోషితభవ
శాదమ్ములు విష్ణుభక్తజనపాదమ్ముల్.

35


క.

పావనములు వినమితసుజ
నావనములు విబుధకోకిలాశ్రయణమధు
శ్రీ వనములు కృతముని సం
భావనములు విష్ణుదాస పదసేవనముల్.

36


వ.

అదిగావునఁ బ్రపన్నపురుషశ్రేష్ఠుండగు కులశేఖరమహీపాలునిచరి
త్రంబు పురాతనభాగవతపరంపరాముఖోదీరితం బై వచ్చుచున్న యది. పరమపవిత్రం
బగు తచ్చరిత్రంబు మీకు దెలియునట్లు వివరించెద సావధానులరై వినుండని పల్కి
ప్రసాదసుముఖుండగుచు వారలంజూచి యిట్లని యానతిచ్చె—

37

ఉ.

శ్రీకరమై సుధీజనవశీకరమై బహుదివ్యరత్నర
త్నాకరమై విదేహమగధాంధ్రకళింగశకాంగముఖ్య
శాకృతులన్ దదీయవిభవాతిశయమ్ముల మించి సంతత
ప్రాకటభాగ్యసౌఖ్యములఁ బ్రస్తుతి కెక్కిన కేరళమ్మునన్.

38

పురవర్ణనము

తే.

సంపదలకెల్లఁ దామరతంపమగుచు
ధారుణీదేవి యాననదర్పణమ్ము
మాడ్కి సురనరనగరోత్తమంబులందు
మేటియన నొప్పు కుక్కుటకూటపురము.

39


సీ.

ఉగ్రసేనారూఢి నుల్లసిల్లెడిగాని
               మధురసంతతసౌఖ్యమహిత గాదు
గురుకృపాధిగమభాసురము గాని గజాఖ్య
               నగరమ్ము దుశ్శాసనమ్ము గాదు
హంససంతతి విలాసాస్పదంబగు గాని
               సాకేత మసగరాస్పదముగాదు
బాణప్రతాపసంభాసమానము గాని
               శోణం బదోషాటసులభి గాదు


తే.

ధరణి నటువంటి పురము లీకరణి నొకటఁ
గొఱఁతవడుగాని కుక్కుటకూటనగర
మలరు నారోగ్యధర్మశిక్షానుపేత
కపటచరణసుధీపుణ్యకలన వలన.

40


ఉ.

మేటి కవాటపాళికల మీఁద నమర్చిన నూత్నరత్నపుం
దేఁటమెఱుంగు లంగముల నివ్వటిలంగఁ బురప్రఘాణపా
ర్శ్వాటనవేళలందు శబలాంబరధారణ లీల లేర్పడన్
నీటు దలిర్ప నొప్పుదురు నిర్ధనులున్ ధను లొక్క కైవడిన్.

41

ఉ.

మేడలమీఁదీనెత్తముల మేలగుచంద్రిక సాంద్రపింఛముల్
జోడుగ విప్పువార గొని సొంపుగ నాడెడి నెమ్మిపిండువున్
జూడగ వచ్చియందు పురసుందరులన్ వెసఁ జూచి యచ్చరల్
వ్రీడ ఘటింప మోము లరవెట్టుదు రీశులకున్ మఱుంగుగన్.

42


శా.

సౌధద్వారహయమ్ములం గని సమంచద్భాస్కరాశ్వంబు లు
త్ప్రోథోదీరితహేషితార్భటుల నాక్రోశింప భీతిల్లి త
త్పాథోజానన లాననమ్ములు సెమర్పన్ గృత్రిమాశ్వాంగముల్
బాధా హేతువులంచుఁ గప్పుదురు కూర్పాసమ్ములన్ మేనులన్.

43


ఉ.

అంబరవాహినీజలరుహాకరకోకగణమ్ము వీఁటి సౌ
ధంబుల పైఁ జరించెడుసుదంతుల కన్నుల మీనులంచు ని
చ్చం బఱతెంచి తద్వదనచంద్రు పై కెదురెక్కలేక వే
గంబ పిఱందికిం దిరిగి గాసిలుఁ గామితవిఘ్నసిద్ధికిన్.

44


సీ.

చందనసహకారచాంపేయపాటలీ
               వకుళపున్నాగద్రువర్ణితములు
బహుపతత్ఫలరసస్పృహణీయవేణికా
               ఫ్లావితసుమరజఃపంకిలములు
ప్రత్యగ్రకిసలచర్వణజాతకాకలీ
               కోకిలకులవిహారాకరములు
మంజులమకరందమాధురీసౌహిత్య
               మదవ దిందిరమందిరములు


తే.

అంతరాంతరసరసీలతాంతవిసర
సురభితానిలబాలసంచరణశామ్య
దంతికాయాతపథికఘర్మాంకురములు
వెలయు నుద్యానవనము లవ్వీఁటికడల.

45


సీ.

శుచియు నాఁదగియు నాశుగసఖుం డాత్మలో
               నరసి చూడఁగ నాశ్రయాశుఁ డనుచు
బుధుఁడయ్యు నమృతాంశుపుత్రుండు సతతోగ్ర
               కరసన్నిధానానుకారి యనుచు

గురుభావ మందియు సుకరాజమిత్రుండు
               రాజప్రియాంగనారక్తుఁ డనుచు
కవి యయ్యు భార్గవుX డవిరళకలుషదో
               షాచరసముదయాచార్యుఁ డనుచుఁ


తే.

దారు శుచితా, శుభావాసతా, జితాక్ష
తా, ఘనాశ్రయతా, ది సద్ధర్మయుక్తి
నతిశయిల్లుచు సత్యవ్రతాఢ్యు లగుచు
వేడ్క నొప్పుదు రవ్వీఁటి విప్రవరులు.

46


సీ.

భుజమూలములఁ జతుర్భుజసాధనము లైన
               ఘనశంఖచక్రలాంఛనము లమర
రసనాంచలముల నారాయణద్వయమంత్ర
               లలితాక్షరమ్ములు చెలిమిఁ దెలుప
మనముల నుపనిషద్వనధిప్రమథనని
               ష్కృష్టతత్త్వామృతసేవ దనర
సల్లాపముల విష్ణుచర్యాతదీయపూ
               జావిశేషప్రపంచన మెసంగ


తే.

మహితసౌరభనళినాక్షమాలికాస్ఫు
రద్గళమ్ముల నూర్ధ్వపుండ్రప్రదీప్త
ఫాలముల సొంపుదాల్తు రప్పట్టనమునఁ
బరమవైదికులగు మహాభాగవతులు.

47


చ.

దళమగు వాసుదేవపరతత్త్వనిబంధనవాదఘోషణం
బుల హరిపూజనక్రమనిబోధనమంత్రరవంబులన్ నవో
త్పలరుచు లుల్లసిల్ల నునుపాఱెడు తిన్నియలన్ దనర్చి ని
ర్మలగతి నయ్యగార్ల తిరుమాళిగ లప్పురి నొప్పు నెంతయున్.

48


ఉ.

కంతులు రూపసంపదల గాఢపరాక్రమలీలలన్ శచీ
కాంతు లఖండకీర్తికళికాపరిపూర్ణత, పూర్ణిమానిశా
కాంతులు సాంద్రసద్గుణనికాయనిశాంతులు సాధురక్షణ
క్షాంతులు క్షత్రియోత్తములు కాపురముండుదు రప్పురమ్మునన్.

49

మ.

పటుగోరక్షణమున్ గృషిక్రియ యనల్పంబైన వాణిజ్యమున్
దిట మొప్పన్ దమవృత్తులై వడుప నర్థిన్నిత్యసంపాదితో
త్కటనానాధనధాన్యలాభముల యక్షస్వామి నోడించుఁ గో
మటు లవ్వీఁట వసించియుండుదురు సమ్యగ్దానపారీణులై.

50


క.

భీరు లసత్క్రియల, మహో
దారులు సత్పాత్రముల, బుధద్విజసేవా
ధీరులు సంగ్రామకళా
శూరులు తత్పురి వసించు శూద్రప్రవరుల్.

51


ఉ.

కొండలపెంపు గెల్చు రథకోటులు కాఱుమొగిళ్లభంగి నొం
డొండచెలంగు మత్తకరు లుజ్జ్వలఘోటకముల్ ప్రచండకో
దండకళోద్భటుల్ భటు లుదగ్రతఁ బెంపువహింప వైరి దో
శ్చండిమ గండడంచు బలసంపద నప్పుర మొప్పు నెంతయున్.

52


చ.

సరసిజపత్రలోచనలు చంద్రనిభాస్యలు తప్తహేమసుం
దరతనువల్లు లుల్లసితధర్మపరిశ్రమనైపుణీమనో
హరచరితల్ పతిప్రియగుణాన్విత లవ్యయపుణ్యగణ్య ల
ప్పురిని పురంధ్రికామణులు పొల్పు వహింతురు శీలసంపదన్.

53


సీ.

తనుకాంతులకు నోడి తపియించి కరఁగు హే
               మార్తికి హేమ తా నార్తిఁ గాంచె
విపులోరుదీప్తికి వెఱ యూఁది రంభ కం
               పింపంగ రంభ కంపింపఁదొడఁగె
కమనీయనిటలరేఖకు నోడి శశిరేఖ
               కృశియింప శశిరేఖ కృశత గాంచె
విమలలోచనసౌష్ఠవమునకు హరిణి భీ
               తిలఁ జూచి హరిణి భీతిల్లఁదొడఁగె


తే.

నప్పురమ్మున నుండు వారాంగనాంగ
కోపమానపుంజం బిట్టు లోటుపడుట
గాంచి తన్నామగంధయోగమునఁ జేసి
తలఁకి రచ్చర లెద నపత్రప జనింప.

54

చ.

కులుకుమిటారిచన్గవలు కోమలబాహులతాయుగంబు లం
చలగతులన్ గలంచు నడ, సన్నఁపుగౌనులు విద్రుమంపుసొం
పలవడుకెంపువాతెఱ, లొయారఁపుఁజైవులు వింత గూర్చు చెం
తల వెలయాండ్రఁ గన్గొనినఁ దాపసులైనఁ జలింతు రప్పురిన్.

55


సీ.

శుభనాస! చాంపేయసూన మంటెద మన్న
               నందునే చంద్రమధ్యస్థ మండ్రు
ఏణాక్షి! కలువ లాఘ్రాణింతు మన దుర్గ
               భము జోడువిండ్లు కాపాడు నండ్రు
సుకుచ! తామరమొగ్గలకు జయంబన ననం
               భస్స్థానజములు చేపడునె యండ్రు
సుదతి! కందమ్ములసొం [పెద్ది యన సుధా]
               స్వాదమ్ము లవి యగోచరము లండ్రు


తే.

చారుగతి నొప్ప విపణిదేశములయందు
వరసుమస్తోమవిక్రయవ్యాజగతుల
కాముకులతోడ సరసవాగ్రచన లెసఁగ
వీఁటఁ జరియించు కుసుమలావీజనమ్ము.

56


సీ.

చెలి సదోచితముఖోజ్జ్వలమైనమావికెం
               జిగు రొకించుక నొక్కుఁ జెందరాదె!
శుకవాణి! యళి లసల్లికుచగుచ్ఛమ్ములు
               డాసి గోరంత ముట్టంగరాదె!
రుచిరాంగి! విరళాప్తరోచనాబ్జంబులు
               కోరి యొక్కంత మూర్కొనఁగరాదె!
సకియ! వికారమై చను వికచోత్పల
               శ్రేణి మెల్లన సవరింపరాదె!


తే.

యనుచుఁ బల్లవు లధరస్తనాక్షికేశ
కలన భాషింపఁ దేనెలు గాఱిపోవు,
నొక్కులగు, కౌరెసఁగు దేంట్లు గ్రక్కసించు
వలదువలదండ్రు సుమలావికలు పురమున.

57

ఉ.

ఆ పుర మేలుచుండు సముదంచితబాహుబలప్రతాపసం
దీపితకీర్తిమూర్తి పరిధిస్ఫుటదిగ్వలయాంతరక్షమా
ద్వీపసమార్జితద్రవిణవిశ్రుతవైభవశాలి, దానవి
ద్యాపరతన్ దృఢవ్రతశుభాఖ్య వహించి నృపాగ్రగణ్యుఁడై.

58


శా.

పాలించెన్ వివిధాశ్రమానుగుణసంభావ్యప్రజారక్తుఁడై
యాలించెన్ గృపమీఱ దుర్విధజనోక్తాలాపముల్ బాహులన్
గీలించెన్ జతురంబురాశిరశనాక్షీణక్షమాచక్రమున్
దూలించెన్ బటుమండలాగ్రమున నస్తోకద్విషత్సైన్యమున్.

59


సీ.

చెట్టున బొక్కెడు చెలమ గ్రుక్కెడు గాని
               నన్నంబునీళులు నంట రింట
నొగి నారచీరలు తొగలపేరులు గాని
               నవ్యాంబరవిభూషణమ్ము లిడరు
పులిలేటిగంతులు పులుగురంతులు గాని
               నటయూధనాట్యగానములు వినరు
కొండలచెంతలు గుళ్లపొంతలు గాని
               సౌధపర్యంతదేశములు గనరు


తే.

రణమహీస్థలి నమ్మహారాజు నెదిరి
యోటువడి వ్రీడఁ జెంది పానాట హూణ
మద్ర మాళవ సౌవీర మగధ పాండ్య
కురు కరూశాంగ నేపాళధరణిపతులు.

60


సీ.

తనభృత్యునిగఁ జేసె దాశార్ణభూపతి
               ననుచరత్వం బిచ్చె నంధ్రపతికి
వంగభూపాలుని వశునిగా నొనరించెఁ
               జెలికాని గావించె సింధువిభుని
సేనానియంతగాఁ జేసె మత్స్యాధీశు
               నయ మొప్పఁ బ్రోచె గాంధారరాజు
నశ్వవరేణ్యుగా నరసె లాటవరేణ్యు
               సఖుని గావించెఁ బాంచాలపతిని

తే.

నవ్విధంబున నిఖిలదేశాధినాథు
లనవరత మాత్మహితకారులై చరింప
నల దృఢవ్రతభూపాలుఁ డతులకీర్తి
భూషితదిగంతరాళుఁడై పొలుపు గాంచె.

61


సీ.

బ్రాహ్మణుల్ క్రతుకర్మ పరిణతుల్ గాంచిరి
               తగువేళ వర్షముల్ దనియఁ గుఱిసె
ధనధాన్యరాసులఁ బెనుపొందిరి జనంబు
               లవిరళగతుల ధేనువులు పితికె
బహుసస్యసంతతుల్ ఫలభొజనము లయ్యె
               కలకాల మొగిఁ బచ్చికసవు గలిగె
వనములు సుమవైభవంబులఁ దనరారె
               చోరప్రసంగముల్ దూరమయ్యె


తే.

సకలవంశప్రసూతప్రజాసమృద్ధిఁ
బిల్ల చెఱ కీనినటుల శోభిల్లె ధరణి
యమ్మహీభర్త యయ్యైవిధమ్ము లెఱిఁగి
మనుజకోటుల శాసించి మనుచు కతన.

62


వ.

ఇవ్విధమ్మున నవ్వసుంధరావల్లభుండు కనకకలధౌత కరితురగమణిగణ
ప్రముఖవస్తుప్రదానసమయసముద్ధతసలిలధారాపరిగ్రహసమర్దార్ధిజనానందప్రవర్ధ
మానకీర్తిచంద్రకాధవళీకృతదశదిశాంతరాళుండును, నిరంతరంస్వవినయభక్తి
పూర్వకవందనానందితమహాభాగవతకటాక్షవీక్షణాసాదితభాగధేయవైభవోజ్జ్వ
లుండును, ప్రచండదోర్దండమండితకోదండపాండిత్యవశంగతరాజన్యపర్జన్యప్రవర్షి
తావిరళద్రవిణధారాసంపాతసంపూరితభాండాగారుండునునై నిఖిలప్రజాభ్యర్హితదై
నందినమహాసామ్రాజ్యవైభవసమృద్ధిన్ బ్రసిద్ధి వహించి పెద్దకాలమ్ము రాజ్యమ్ము
చేసి యొక్కనాడు—

63


సీ.

విమలధర్మాధర్మవిదులైన విద్వాంసు
               లొకవంక సద్దోష్ఠి నోలలార్ప
మహనీయశౌర్యసామంతభూకాంతులు
               కోర్కెచే నొకచాయఁ గొలువుసేయ

నరిభయంకరమూర్తులై యొప్పురాహుత్తు
               లొకచక్కి మాఱుగే లూఁది నిలువ
గాయకవందిమాగధబృంద మొకవంక
               నమరి యాత్మీయగీతములు వాడ


తే.

నాదిగర్భేశ్వరా! పరాకా! యటంచు
సౌవిదల్లులు దన్ను హెచ్చరిక సేయ
రమణు లిరుగడ వింజామరములు వీవ
నరవరేణ్యుండు సింహాసనమున నుండి.

64


క.

ఆటలఁ బాటల బహువా
చాటోక్తులఁ గొంతప్రొద్దు చనునంత నిరా
ఘాటముగ వేఁటతమి మదిఁ
బాటింపుచు విభుఁడు సైన్యపతితో ననియెన్.

65

రాజు వేఁట కేగుట

మ.

సదసత్కార్యవిధిజ్ఞులార! మృగయాసంచార మొక్కింత స
ల్పుదమే! యంచు వచింప నియ్యకొని యో భూనాథ! యివ్వేళ మం
చిద మాకున్ బ్రియమయ్యె దేవర బలశ్రీ మీఱ, నానామృగా
స్పదకాంతారవిహారలీలలఁ జరింపన్ జెంత వీక్షింపఁగన్.

66


క.

అని పల్క, నాటవికులన్
గొనిరండని భటులఁ బనుప గొబ్బున వారల్
చని పిలుచునంతఁ బ్రజ తమ
వనచరభావంబుఁ జూడ వచ్చిరి సభకున్.

67


క.

వల లురిద్రాళ్లును దగు బో
నులు గాలమ్ములు గదాధనుశ్శరకుంతం
బులు మొదలగు సాధనములు
నలవడ ధరియించి భీషణాకృతు లొప్పన్.

68

సీ.

కరిగండు పులిగొంగ కఱకుమీసలబంటు
               సయ్యాటములమారి చట్టుగుండె
కొఱవిచూపులబూచి కుప్పిగంతులదిట్ట
               యడవులరాకాశి పిడుగుతునుక
జల్లితోకబెడంగు పిల్లులబూతంబు
               గనగచ్చికపిసాళి గబ్బిమెకము
ఉరుకులగండుకక్కెర పొంచులాడు గుం
               పులమారి జముకోఱ పులుఁగుచూడు


తే.

ఱక్కెస గుబాటుకాఁడు పేరుక్కుతునియ
యనుచు నామమ్ము లిడి పెంచినట్టి జాగి
లముల గొలుసుల నిడికొని తమక మడర
నరుగుదెంచిరి యెఱుకు లయ్యధిపుకడకు.

69


ఉ.

భూతలనాథుఁ జేరి జయపూర్వకశబ్దము లుచ్చరించుచున్
జేతులు సాచి మ్రొక్కి పెడసె య్యిడి ముందట నిల్చి సామి మీ
తాతలు తండ్రులున్ గరుణ దప్పక సాకిరి మామసళ్ల, మే
మీతరువాత దేవరయె యేలికగా సుకముంటి మెంతయున్.

70


క.

ఓడక మీపాదమ్ముల
నీడలఁ జరియించు మమ్ము నీసొ మ్మనుచున్
జూడుము మాకొలఁదుల కిక
నీడగు పని యాజ్ఞ సేయు మెంతయుఁ గరుణన్.

71


చ.

అనవుడు నా నృపాలుఁడు దయామతి వారల నాదరించి గ్ర
క్కున విడియం బొసంగి పటుఘోటకరాజము లీల నెక్కి త
క్కినబహువీరమంత్రిహితకింకరవర్గము సుట్టిరా, వెసన్
జనియె తరక్షభల్లకిటిసైరిభఘోరవనాంతభూమికిన్.

72


సీ.

వడిఁబన్నిదముఁ జేసి పొడవైన పొదరిండ్లఁ
               దొడరి యావలఁ బడ దుముకువారు
రంపటిల్లెడు మల్లరంపుగిత్తలవోలె
               నెడనెడ వడిబొబ్బ లిడెడివారు

వడఁద్రోళ్లు వెట్టిన వెడఁద పెందొడలపై
               సారెసారెకు మల్ల సఱుచువారు
పటుతరాయుధము లిట్టటు ద్రిప్పికొనుచు బే
               ర్వాడి లక్ష్యమ్ముల వైచువారు


తే.

నగుచు వనచరభటులు సాహసికవృత్తి
గ్రామ్యబలముల నృపవరుఁ గడచి కలిసి
శరభశార్దూలసింహకాసరము లాది
యగు మృగమ్ములఁ బడవైచి రలవు మెఱసి.

73


క.

అత్తఱి నాగరవీరుల
మొత్తము లారణ్యకులు నమోఘ[సిత]శరా
యత్తములఁ జేసి వివిధమృ
గోత్తమములు నవనిఁ గూల్చి రుగ్రార్భటులన్.

74


తే.

జీవురులనంటి వలలకుఁ జేర్చి బోను
లందుఁ జొఱఁద్రోలి యురులచే డిందుపఱచి
పొసఁగఁబట్టిరి, కొన్నింటిఁ బొడవడంచి
రెలమి ఖగముల మృగముల నలవు మెఱసి.

75


భుజంగప్రయాతం.

జగద్భీకరాత్మీయసైన్యంబు లిట్లా
మృగస్తోమముం ద్రుంచి మెప్పించువేళన్
మొగమ్మందు నుత్సాహమున్ సొంపు దోడై
తగన్ ఘాటమున్ గాలఁ దాఁటించె లీలన్.

76


క.

ఘోటకము దుముకఁజేయుచుఁ
బాటవమున విల్లు బూని పటుమేఘనిరా
ఘాటధ్వని పురణింపఁగ
జ్యాటంకృతు లెసఁగఁజేసె జనవరుఁ డెలమిన్.

77


క.

ఈరీతి నిజగుణధ్వని
క్రూరత నందంద వెడలి రోదసి నిండన్
జేరువ నొకయీరమ్మున
గూరికియున్నట్టి లేడి గుండియ లవియన్.

78

ఉ.

లేచి తటాలునం దుమికి లీలమెయిన్ బరువెత్తిపోవగాఁ
జూచి నృపాలుఁ డామెకము జొప్పడ బిట్టడలించి తన్ను ప్రే
రేచెడు దైవసంగతి హరిన్ హరిణీపథయుక్తిఁ జొన్పె మా
రీచునిత్రోవ ము న్ననుసరించిన రామమహీశు చాడ్పునన్.

79


వ.

ఇవ్విధంబున నమ్మహీకాంతుండు దురంతకాంతారసీమాభ్యంతర
మార్గంబున ననర్గళసంచారసముదంచితసముత్తుంగతురంగమంబు నాహరిణీలలా
మంబు వెంటనంటం బరపి గెంటని తమకంబునం బ్రచండభుజాదండమండితకోదండ
నిర్ముక్తకాండపరంపరన్ జంపనొల్లక దిట్టతనంబునం బట్టందలంచి తరుషండంబు
నకుం గేడించియు నికుంజపుంజంబులపయి జవుకళింపం జేయుచు నేఱులపయిం బఱ
పియు నతివిభ్రమకరాదభ్రచక్రభ్రమణంబుల నిట్టట్టు ద్రిప్పియుం బుడమిఱేఁడు పిఱింది
దెసం దఱిమికొని రా నిరీక్షించి చెదరిన హృదయమ్ము కుదురుపఱుపనేరక యంత
కంతకుం బెరుగు తత్తరమ్మున—

80


సీ.

తురగరింఖోద్దూత ధరణీపరాగమ్ము
               కనుదోయిఁ గ్రమ్మినఁ గలఁగి కలఁగి
పటుహయాంఘ్రిన్యాసభయదార్భటుల పేర్మి
               సుడియు విభ్రాంతిచే సొరిగిపొరిగి
సంక్షుబ్ధవక్రసంచారశ్రమంబున
               నొడలు కంపింపంగ నొదిగియొదిగి
యెడనెడ నృపుఁ డొనర్చెడు సింహరవముల
               వెడవెడ నరచుచు నడలియడలి


ఆ.

కొంతదూర మరిగి యంతటఁ జిడిముడి
నడలు గడలుకొనఁగ నడువలేక
యొక్కసరిసిచెంత నుర్వీశు డీక్షింప
హరిణి తల్లడిలుచు నవని వ్రాలె.

81


వ.

అంత నమ్మహీకాంతుండు డాయంజని.

82

సీ.

కడువడిఁ జలియించు కన్నులకొలఁకుల
               నుడుకుజలమ్ముల విడుచుదాని
వెఱయూఁది యంగముల్ విరవిరవోవంగ
               నగ్గలమ్ముగ వడకాడుదాని
ప్రాణముల్ చంచలభావ మందఁగ నోఁట
               గళగళ నురువులు గట్టుదాని
మార్మెడ యిడుచు నుమ్మలికంబు దోపంగ
               నొయ్యనఁ గుట్టూర్పు లూర్చుదాని


ఆ.

హరిణయువతిఁ జూచి యందంద తనలోనఁ
బాపభీతియును గృపారసమ్ము
గీలుకొనఁగ నపుడు కృష్ణ కృష్ణా! యంచు
నగ్గలించి హయము డిగ్గనుఱికి.

83


క.

ఈ తెఱఁగున హరిణిం గని
శీతలసికతాతలంబు జేర్చి కడానీ
పూఁతదువ్వలువ ముసుగిడి
చేతుల నుదకంబు పట్టి చిలుకుచు మఱియున్.

84


ఉ.

హా! యిది యేటి వేఁట యను, నబ్బురపాటున దీనిఁ జూడ నే
లా! యను, నాగ్రహింపదగునా యను, నెంతచలమ్ము గొంటి నౌ
రా! యను, లేటి ని ట్లలతురా యను, నింత దలంతె శ్రీనివా
సా! యను, నమ్మహీశుఁడు తదార్తి పరిక్షుభితాంతరాత్ముఁడై.

85


వ.

ఉన్నయవసరంబునం గొంతవడికి సేదదేఱి తదీయకరకమలసంస్పర్శ
విముక్తసకలకలుషబంధయగు నాహరిణాంగన పూర్వజన్మసుకర్మవాసనావిశేషం
బునం జనితవిజ్ఞాననైపుణ్యంబునం గృపాళుండగు నృపాలుం జూచి మనుష్యభాష
ణంబుల నిట్లనియె—

86

హరిణి పూర్వకథ

శా.

క్షోణీవల్లభ! మానసంబునఁ బరిక్షోభించెదే లయ్య! మున్
బాణవ్రాతముచే నరాతిభటశుంభత్కుంభిఘోటీరథ

శ్రేణిం గూల్చెడిచోఁ జలింపవు కడుం జిత్రం బయో! నేఁడు సం
క్షీణం బౌనొకొ! లోకమంతయు మృగస్త్రీ నొక్కతెం జంపినన్.

87


చ.

సమరమునందు శత్రుబలసంఘము ముందట వేఁటలాడుచో
సమదకురంగశల్యకశశవజ్రమున్ వధియించుటల్, క్రతు
ప్రముఖసుకర్మవేళల నపారధనవ్యయబుద్ధి సల్పు, టు
త్తములగు ధారుణీశులకు ధార్మికవర్య! నిసర్గవృత్తముల్.

88


తే.

కాన మిముబోటి యుత్తమక్షత్రియులకు
మృగనిబర్హణకృత్యంబు తగవు గాఁగ
నెఱిఁగెఱింగియు ననుఁ బ్రోచి తిద్ధచరిత!
క్షితి నితోధికసౌభాగ్యసిద్ధిఁ గనుము.

89


క.

ఈ కరణి హరిణి పల్కిన
యాకస్మికమనుజభాష లాలించి ధరి
త్రీకాంతుఁ డిట్టులను న
స్తోకతరాద్భుతరసాభిజుషాత్మకుఁడై.

90


చ.

హరిణకులమ్మునం బొడమి యద్భుతమానుషభాషణమ్ము లే
వెరవున నేర్చి, తందు నృపవీరకులోచితధర్మమార్గవి
స్తరము లెఱుంగు టెట్లు, మృగజన్మ కుతూహలతం జరించు ఖే
చరసతివౌదొ! యక్కట నిజమ్ముగ నేణివొ! చెప్పు మేర్పడన్.

91


క.

అనవుడు నిట్లను నది యో
జనవర! మత్పూర్వకర్మసంగతిని బొసం
గిన లేటితనం బిది చ
క్కన విను మెఱిఁగింతు నాదుకత దెలియంగన్.

92


సీ.

కుకురదేశమున లాంగూలపురమ్మునాఁ
               గల దొక్కనగర మత్యలఘులీల
నందుండు ధర్మజ్ఞుఁడనెడి విప్రునకు నే
               నర్మిలి కూఁతర నవనినాథ!

మా తల్లిదండ్రులు మన్నన దళుకొత్త
               నేఁ గోరినవియెల్ల నిడుచుఁ బెంప
నొకనాఁడు నాయీడు నువిదలతో గూడి
               యాడుచు నుండ మాయయ్య చూచి


తే.

నాదు గుణరూపములకు నానంద మంది
యత్తమామలు మఱఁదులు నాడుబిడ్డ
లుండ సిరులందియున్న చోటోకటి గాంచి
చిత్తమున నన్ బరాధీనఁ జేయఁ దలఁచి.

93


క.

ఆ విప్రున కగ్రసుతుం
డై వెలసిన చంద్రకునిఁ బ్రియం బెసలారన్
రావించి పరిణయం బొగి
గావించిరి యగ్నిసాక్షికముగ నృపాలా!

94


క.

తగు మొదవులేను దాసీ
యుగళము వస్త్రాభరణసమున్నతి యరణం
బుగ నిచ్చి యంత నను జ
క్కగ మావా రనిచి రత్తగారింటి కొగిన్.

95


తే.

ఏను నుబ్బుచు నత్తవారిల్లు సొచ్చి
పొలుపు దీపింప నాసాటి పువ్వుబోండ్లు
మెచ్చఁ బనులందు నేరుపు లచ్చుపడగ
నిపుణమతి నొప్పుచుందును నృపవరేణ్య!

96


సీ.

సుకుమారనయ్యు నే నొకవేళయందైన
               నలసితి నని యుస్సురస్సు రనను
ఈవలి దావల నిడకున్నదాన న
               య్యును నోర్చి చెప్పినపనులు మఱువ
నఖిలపదార్ధమ్ము లనుభవించినదాన
               నయ్యు పెట్టరు పొయ్యరని తలంప
గారవమ్మునఁ బెంపు గనుదాన నయ్యును
               గసరులఁబడి మదిఁ గ్రక్కసింప

తే.

మామ కోపించునో! యంచు మగనిమనసు
కందునో! యంచు మఱఁదులు కాఱు లఱతు
రనుచు భయమగ్గలింప నే ననుసరింతు
మండలేశ్వర! యత్తింట నుండునపుడు.

97


సీ.

పని సాల గలిగియున్నను బొరుగిండ్లకు
               నడువ నెన్నండును నరవరేణ్య!
పలుకరించిననైనఁ బరపూరుషుల వంక
               తేఱిచూడను ధరిత్రీలలామ!
తిట్టిననైన నర్ధి గురువ్రజంబుల
               నట్టిట్టు వలుక మహానుభావ!
నడురేయినైన మానక యత్త చెప్పిన
               కృత్యముల్ మఱువ నక్షీణవిభవ!


తే.

యిట్లు నిరతంబు భయభక్తు లెసఁగ నేఁ జ
రింపుచుండంగ మత్పూర్వకృతము దక్క
కారణము లేకయును జండిక యనఁ బరగు
నత్త చిత్తమ్మునకుఁ గసరెత్తె నయ్య!

98


వ.

ఇట్లు దినదినప్రవర్ధమానరోషాయతచిత్తయగు నత్త నాయెడం బెరిగిన
చలమ్ముడింపక -

99


సీ.

ప్రాణపదమ్ముగాఁ బాకమ్ముసేయ ము
               ప్పోకలకూడంచు ముట్టియాడు
గృహకృత్యముల నెచరింప డగ్గఱి యింత
               వడకంచు నడునెత్తి యడచిపోవు
పని చెప్పిపనిచి చయ్యన మగవారితో
               నింట నిల్వదటంచు వెచ్చరించు
ముందటఁ జనఁగఁ బిఱుందఁ దా వచ్చుచు
               మోము నిట్టటుద్రిప్పి మూతి విఱుచు

తే.

మెకమువలె నిట్లు రేగి నామీఁద మగని
మదిని మఱఁదులయాత్మల మామగారి
యుల్లమున సివమెత్తిన ట్లుగ్రకోప
బుద్ధి పుట్టించె నేమి సెప్పుదు నరేంద్ర!

100


క.

మును గయ్యాళితనమ్మున
నొనరిన మా యాడుబిడ్డ లుగ్రతఁ దమ్ముం
జనని కనుగిలుప నా మా
టనినం బైవత్తురొంటియడుగున నధిపా!

101


చ.

తెలతెల వేఁగునంతనె యతిత్వరగైకొని మేలు కాంచి ని
ర్మలముఖమార్జనాదుల సమంజసనై గృహశుద్ధి మున్నుగా
నల నొనరించి శాకములు నన్నము డింపగ నిద్రదేఱి యొ
త్తిలి గళమెత్తి యత్త నను దిట్టును గూఁతులు తోడుపల్కఁగన్.

102


సీ.

మా తండ్రి యొసఁగిన మాణిక్యకటకముల్
               తెమ్మంచుఁ దనదు సందిట ఘటించె
నమ్మ పెట్టిన పటుటంచుచీరలు నాల్గు
               డక్కరి తోడికోడండ్ర కొసఁగె
ముత్తవ దయసేయు ముత్యాలపట్టెడ
               పడిఁ బుచ్చుకొని కూఁతుమెడఁ దవిల్చె
యన్న యిచ్చిన పదార్వన్నెయొడ్డాణమ్ము
               వదలించి చెల్లెలివైపు జేర్చె


తే.

నన్నియును గల్గి యరణంపుటాల నమ్మి
కొనియెఁ బరిచారికల నీళ్లు గూడు నిడక
నెడలఁ గొట్టించె మా పుట్టినింటిసొమ్ము
వీసమైనను లేకుండఁజేసె నయ్య!

103


ఆ.

మూఁడుజాము లరుగ ముంగేల నన్నమ్ము
వెట్టి సనుచు నాల్గు దిట్టి దీని
తిండివలన సమసెఁ గుండకుడంతయు
ననుచు వీథిజనులు వినఁగ నాడు.

104

క.

ఈ రీతి నింటఁ గల్గిన
వారందఱు నటుల సేయ వసుధేశ! వగం
గూరి తలమునుక లై సం
సారము దెస రోసి మది విచారము దోచన్.

105


చ.

కటకట! పూర్వజన్మకృతకర్మ మదెట్టిదొ! తప్పొకింత లే
దిటుల దురాగ్రహమ్ము దలకెత్తుక యూరక రంపటిల్లుచుం
దిటమఱి యున్న నన్ను నొగిఁ దిట్టియు గొట్టియు నత్త చిత్త మి
ప్పటికిని శాంతినొందద యుపాయము నామది దోఁచదేమియున్.

106


చ.

తొడిబడి కన్నవారొసఁగు తొఱ్ఱుల నమ్మి రొకించుకైన న
న్నడుగక సొమ్ముఁ బుచ్చుకొని, రన్నము నీళులు వేళపట్టు నం
దిడక యదల్చి యూడిగఁపుటింతుల నిల్వెడలంగఁ ద్రోచి, రీ
నడవడి వీరికిందగియె నాయముగాదని చూడరక్కటా!

107


ఆ.

కన్నవార లిచటికత లెఱుంగరు వార
లెఱిఁగి యేమి యొరుల కిచ్చినపుడె
పట్టుచెడు స్వతంత్రపద్ధతు లయ్యాస
విడిచి పడినచోట వెదుకవలయు.

108


క.

అని తలఁచి మఱియు నీయడ
లున కత్తయె మూల మాత్మలో నయ్యమకున్
గనికరము వుట్టఁజేసిన '
వెనుకన్ భయ మెడలుగాక వెంటంబడునే!

109


వ.

ఇట్లు విచారించి సవినయసల్లాపమ్ముల నత్తచిత్తమ్ము గఱగింపందలంచిన
దాననై యొక్కసమయంబు నెడగని డాయంజేరి సముల్లాసహాసభాసురముఖి యగు
నయ్యమ పరుండిసాచిన యడుగులు తొడలపయింబెట్టుకొని మెత్తమెత్తనఁ గర
తలంబుల నొత్తుచు నల్లన నిట్లంటి.

110


క.

పొలఁతులకు నత్తమామలు
దలపోయఁగఁ దల్లి తండ్రి దైవము గురుఁడున్

గలనైన వారికెగ్గులు
పలుకంగారాదు నీతిపథ మూహింపన్.

111


ఉ.

పెంచిన తల్లిదండ్రు లరసేయక మీ పదసేవకై సమ
ర్పించిరి నన్ను మీకు బెదరింపదలంచిన నాదరించినన్
మంచిదకాక యన్యులిక మాకెవరమ్మ! మదిందలంపు మీ
పంచఁ జరించుదాన దయపాయఁగ నేమిటికమ్మ! నాయెడన్.

112


క.

తిట్టియు దీవించియుఁ జే
పట్టి కరుణఁ బ్రోచునట్టి భారంబొగి నీ
పట్టున నుండఁగ మాకి
ట్టట్టని పలుకంగ నేలనమ్మ! తలంపన్.

113


తే.

అనుచు నే వేడుటయును మాయత్త కనలి
ముసముసమటంచుఁ దప్పక మోము చూచి
చేరి నాచెంతఁ జక్కటుల్ సెప్ప నెంత
దానవని రోషమునఁ బడఁదన్నె నయ్య!

114


క.

అంతటఁ దనివోవక ని
న్నింతింతలు సేతుననుచు నెగచుచు రాఁ ద
త్ప్రాంతకవాటము నిటలా
భ్యంతరమున దవిలి రక్త మరియురిఁ దొరఁగెన్.

115


తే.

అవ్విధంబున నొచ్చి యాయమ కడంక
నదియు నాయపరాధం బటంచుఁ దలచి
కూడు నుదకంబు గొననీక మూడుదినము
లుపవసింపగఁ జేసె నన్ గృపదొలంగి.

116


ఉ.

మూఁడవనాఁడు దప్పిగొని మూర్ఛమునింగెడి నన్ను జూచి క్రొ
వ్వాడిమసమ్మునన్ గపటవైఖరి గైకొని మేలిమీగడల్
గూడగఁ బాలు పాత్రనిడి గొబ్బునఁగ్రోలెడిగాని బింకఁపుం
జేడియ! దీని నీమగనిచేతికి నిమ్మని రే యొసంగుచున్.

117

క.

ఇచ్చిన వెంబడిఁ గూఁతురి
నచ్చువడం గాపుపెట్టె నది యెఱుఁగక పెం
జిచ్చుగతి డప్పి జఠరము
ద్రచ్చఁగ నొకగ్రుక్కెడన్నిఁ ద్రావితి నడుమన్.

118


చ.

అదిగని యావెలంది తమయన్నకు నంతయుఁ జెప్ప నుగ్రుఁడై
యిది కుటిలాత్మురా లకట! యెంగిలిపాలిడెనంచు నెమ్మదిన్
బొదలిన రోషవేగమున బోరునఁదిట్టుచు నన్నుడాసి యీ
యదనున వెళ్లఁద్రోతునని యద్దమరేయి నతిప్రచండతన్.

119


క.

చేతులు మాటిడికొనుచు భ
యాతురత వడఁకు నన్ను నడిచి గృహబహి
ర్భూతంగాఁ జేసిన మతి
కాతరనై తల్లడిల్లగా నవ్వేళన్.

120


క.

వెడలినయుడిగఁపుబోటులు
వడిఁజని చెప్పంగఁ గన్నవారెఱిఁగి భయం
పడి పనుప నగ్రజుఁడు నా
కడకుం జనుదెంచె దైవగతి నారాత్రిన్.

121


తే.

ఎలుగు విని వచ్చి యంతయు నెఱుకవఱుప
నిచ్చ వగచుచు నేను దమయిల్లు సేర్చె
తల్లిదండ్రులు మదిలోన దయఘటిల్లి
చీరగూడు నొసంగి పోషించిరయ్య!

122


వ.

అంతం గొంతకాలంబు సనునంతం గృతాంతభటు లరుగుదెంచి నన్నుం
గొనిచని ధర్మరాజు ముందటం బెట్టినం జూచి.

123


ఉ.

అక్కట భర్త త్రావఁగఁ బయఃపరిపూరితపాత్ర గొంచుఁ దాఁ
దెక్కలికత్తెవోలె నతిదీనగతిం జనుచుండి త్రోవలో
గ్రుక్కెడు ద్రావి యెంగిలిడు గుత్సితయౌటఁ దృణాశనంబు చే
నొక్కట ధాత్రిపై హరిణయోని జనించి చరించు గావుతన్.

124

క.

అని యాదేశించి మనం
బున నావెతఁ జూచి కరుణపొడమి పలికె పా
వనమూర్తియగు దృఢవ్రతు
ననుగ్రహమువలన సుగతి నందెద వనుచున్.

125


క.

అక్కారణమునఁ బుట్టితి
నిక్కానన్ హరిణి నగుచు నిన్నాళ్ళకు
యక్కజఁపుగరుణ నందుట
క్రిక్కిరిసిన దుష్కృతములు గ్రేళ్లుఱికె నృపా!

126


తే.

పాటులన్ని పడియుఁ బతికి నెంగిలి వెట్ట
హరిణజన్మ మిట్టు లగ్గమయ్యె
ధరణి నెవ్వఁడోపు ధర్మసూక్ష్మక్రియ
లెఱిఁగి యాచరింప నిద్ధచరిత!

127


సీ.

పోషించితివిగదా! పుణ్యతత్త్వజ్ఞాన
               పరిణామయుతమహాభాగవతుల
భాషించితివిగదా! బహుధర్మసంహితా
               నిర్ణీతనిరుపమనీతికథల
భూషించితివిగదా! భూరికీర్తి మనోజ్ఞ
               చంద్రికాస్ఫురణదిక్సామజముల
తోషించితివిగదా! దుష్టరాజకఠోర
               కంఠీరవోద్రేకలుంఠనముల


తే.

సకలసంపద లందితి జగమునెల్లఁ
గలయ నేలితి వన్నిఁట ఘనుఁడ వగుచు
వితతగుణజాల! యోదృఢవ్రతనృపాల!
పుడమి ననపత్యత గొఱంతవడియె గాక.

128


వ.

అని పలికి యప్పుడ హరిణీరూపమ్ము విడిచి దివ్యగంధమాల్యాంబరాభరణం
బులం బొలుపు దీపించి యమ్మహారాజుచేత ననుజ్ఞాతయై దివంబునకుం జనియె నంత
నమ్మహీకాంతుండు హరిణీవృత్తాంతంబునకు విస్మితుండగుచు నుండునంత.

129

పరిజనము రాజు నరయుట

ఉ.

అంత నమాత్యు లయ్యధిపు నయ్యెడఁ గానక దంతిదంతకుం
తాంతనికృత్తతాళనిచయక్షతివాంతమధుస్పృహామిథో
త్యంతకభల్లమల్లకహహారవభీతశకుంతసంవృతా
శాంతవిచిత్రవర్ణసుమహాగహనాంతగవేషమాణులై.

130


సీ.

ముదమారఁ గదలు తుమ్మెదల బల్ రొదల సం
               పదలచేఁ బొదలు పూఁబొదలు జూచి
దివులు వెందవులించు నవులపై సింగంపు
               రవళిఁ జూపు వెడందగవులు సూచి
నెరయుఁ బెల్లిరుల పెల్లొరలెడి తరులు పెం
               దరుల పందిళుల వందురులు సూచి
తముల నున్మత్తచిత్తములైన కరుల మొ
               త్తములు క్రీడించు నెత్తములు సూచి


తే.

కొలఁకుకెలఁకుల లేమావి గుముల గముల
మరువుటిరు...............................
మొగలి తెగలఁ గడిందిగొజ్జగుల జగల
నరసి భూవిభుఁ గానలేరైరి భటులు.

131


తే.

అంత మహనీయసైన్య మత్యంతవిపిన
పాళి నరపాలమౌళి శుంభత్తరంగ
ఖురపుటన్యాసనిర్భిన్నసరణిఁ దెలియ
నరసి యుబ్బున నొకట గో యని చెలంగె.

132


శా.

ఆ బాబారతనంబు జాడఁ జని యుద్యన్మాధవీవేష్టన
ప్రాబల్యోపహతోష్ణరశ్మికరసంబంధాపగాతీరభూ
జాబద్ధస్ఫటికాయమానతలశైత్యచ్ఛాయఁ గూర్చుండి చిం
తాబాహుళ్యము నొందు భూవిభుని నింతంతన్ విలోకింపుచున్.

133


క.

జనితోత్సుకులై సచివులు
జననాథుని జాడ నరిగి సంభృతచింతా

వనతాననాబ్జుఁడగు నా
తని తెఱఁగ్రహించి మిగులఁ దలఁకొదవంగన్.

134


చ.

తెలియుదమంచు నిట్లనిరి దేవగ సేవలడించి యొంటిమై
బలవదతిప్రచండమృగబంధురకాననసీమలందుఁ బే
రలుకమెయిన్ జరింపఁ బ్రియమంచు దలంచియొ మేల్దలంచు మా
వలన ననాదరం బెసఁగ వంచన సేయుటొ ధారుణీశ్వరా!

135


సీ.

రింఖాఝళఝళత్పృధులార్భటుల ఘోట
               కము దుమికింపంగఁ గాంతుమనియు
బహువిచిత్రపతత్రిపటలిపై పెనుడేగ
               పోతుల నాడింపఁ జూతుమనియు
నదె పదుం డిదెమెకం బని మీర లుత్సవా
               వేశోక్తు లెసఁగింప విందుమనియు
నిశితాసి తళతళ విసరుచుఁ బటుమృగ
               శ్రేణి భంజింప వీక్షింతుమనియు


తే.

గాదె యివ్వేళ మృగయావినోద మొదవె
నంచు దేవరయానతి ననుగమింప
భీకరాటోపవేళఁ బరాకు దగునె
దివ్యచిldతమ్మునకు ధరిత్రీలలామ.

136


క.

అనవుడు వైక్లబ్యము నె
క్కొను మన మొకభంగిఁ జేసికొని యల్లన వాం
చినమొగ మెగయింపుచు ని
ట్లను సచివాగ్రణులఁ జూచి యవనీశుఁ డొగిన్.

137


చ.

వినుఁ డెఱిఁగింతు మీ కిచటివృత్తము వంచనమైఁ దొలంగి వ
త్తునె! నయకోవిదుల్ హితతతుల్ మిముఁ బాయఁదలంతునయ్య! దై
వనియతి నయ్యె నింతయు నవారణ నొక్కకురంగి పాఱుదెం
చిన నలయించి దాని వడిఁ జేకొను వేడ్క జనింప నొయ్యనన్.

138

సీ.

కేడించి హయము క్రొవ్వాడిమై నడరింప
               మదమరి కికురించు మంత్రులార!
ఇది యసాధ్యంబంచు నేఁదలంపఁగ నది
               దాపై మెలంగు ప్రధానులార!
ఒగి గుబాలునఁ దురంగోత్తమం బెగువంగ
               జౌకళింపుచుఁ బాఱు సచివులార!
మది నేమరించి పట్టెదనంచుఁ జూచిన
               మది బెగ్గడిల్లు నమాత్యులార!


ఆ.

పొదువ నలవిగాదు పొలియింపఁ దమి లేదు
మగిడి విడిచిపోవ మనసురాదు
అకట యేమి చెప్ప నాలేటిఁ గైకొను
నాసఁ జేసి వెంట నరుగునపుడు.

139


క.

అంత నది యలసి యేత
త్ప్రాంతంబునఁ బడిన దానిబడలిక గని మ
త్స్వాంతమునఁ గృపజనింపఁగ
నెంతయు శైత్యోపచార మేఁ జేయంగన్.

140


క.

అది యంత మనుజభాషల
ముదవొదవఁగ నన్ను జూచి భూనాయక! నీ
మది నేల వగవఁజూచెద
విది రాజోచితవిహార మీ వెఱుఁగవొకో.

141


వ.

అని రాజధర్మానుగుణసంభాషణమ్ముల నాకుం బ్రియమ్ము నెరపి
వెండియు.

142


సీ.

తన పూర్వభవమున ధర్మజ్ఞుఁడన నొప్పు
               భూసురోత్తమునకుఁ బుత్రి ననియె
తననాథుఁడగు చంద్రకుని తల్లి చండిక
               శ్రమ నొంచెఁ గోటరికమున ననియె
దనమృదూక్తుల నాయమను మంచిసేయంగఁ
               దలఁచిన పగ సాల బలసె ననియె

దను కృశింపించి వంచన నత్త మద్భర్త
               కెంగిలిపాలు పోయించె ననియె


తే.

నింతయును దండధరుఁ డాత్మ నెఱిఁగె ననియె
నవని హరిణీత్వమునఁ బుట్టుమనియె ననియె
నీవు దయఁజూడఁ గలుషమ్ము లెడలె ననియె
నిటుల నాలేఁడి తనచందమెల్లఁ దెలిపె.

143


తే.

అంతయును జెప్పి క్రమ్మఱ నమ్మృగమ్ము
మున్నుగ ఘనుండ వీ వంచు నన్ను నతులొ
నర్చి యనపత్యదోష మెన్నఁగఁ గొఱంత
యయ్యె నీకంచుఁ గాంతయై యరిగె దివికి.

144

అనపత్యతకు రాజు విచారించుట

ఉ.

అట్టిద కాదె! నాబ్రతుకు హారపటీరనికాశకీర్తిసం
ఘట్టితదిక్తటీకరటికౌంభమణివ్రజకంఠపాళికా
పట్టికి రాజ్యపుంగడలిపట్టికిఁ బట్టగునట్టి పట్టికిన్
పట్టనరాజపీఠమునఁ బట్టముగట్టఁగ లేమి నక్కటా!

145


మ.

సచివాగ్రేసరులార వింటిరె! సమస్తక్ష్మాతలాధీశ్వరుల్
ప్రచురస్యందనబృందతుంగహయశుంభత్కుంభిపట్టాంబర
ప్రచయస్వర్ణమణిప్రతానముల సంభావింప నట్లొప్పు మ
త్సుచిరప్రాభవరేఖకుం గొఱఁతవచ్చుంబో సుతాభావతన్.

146


సీ.

అన్నదానాదిపుణ్యఫలంబులకు నెల్ల
               సుతుగాంచు ఫలము మెచ్చులు ఘటించు
తరుతటాకాదిసంతతిఫలంబులకంటె
               సుతుగాంచు ఫలము మెచ్చులు ఘటించు
రాజసూయాదిసత్క్రతుఫలంబుల కెల్ల
               సుతుగాంచు ఫలము మెచ్చులు ఘటించు
ఘనతీర్థయాత్రాధిగతఫలంబుల కెల్ల
               సుతుగాంచు ఫలము మెచ్చులు ఘటించు

తే.

పైతృకంబైన ఋణ మెడఁబాయు దలఁపు
లాత్మజులు లేమి గొనసాగవండ్రు బుధులు
గాన హరిణీలలామంబు గడఁక బలుకు
పలుకులన్నియు మృషలంచుఁ బలుకరాదు.

147


ఉ.

అప్పటినుండి నాహృదయ మట్లు విషాదరసం బెసంగినన్
జొప్పడు రాజ్యసంపదకు సూనుఁడులేని కొఱంత దోఁచె నీ
యెప్పమి మానునట్టి తెఱఁ గొయ్యన నా కెఱిఁగింపరయ్య! మా
కెప్పుడు ప్రాణతుల్యహితు లెన్నఁగ మీరకదా! తలంపఁగన్.

148


చ.

వనులఁ జరించి పూరిఁ దిని వాఁగులవంతల నీరు ద్రావి నె
క్కొనెడు పశుత్వధర్మమునఁ గ్రుమ్మఱునట్టి మృగంబె యేవగిం
చెను మది నోటులేక నిఁకఁ జెప్పెడి దేమి! సమగ్రధర్మవ
ర్తను లనపత్యదూష్యుల కొఱంత గణింపక యుండనేర్తురే!

149


తే.

అనుచు సందేహడోలాయితాంతరంగుఁ
డగు నృపాలునిఁ జూచి నెయ్యమున మంత్రి
జనము లౌదలలూచి యంజలిపుటములు
ఫాలతలములఁ గదియించి పలికి రెలమి

150


ఉ.

వింతలుగొన్ని మీవలన వింటిమి నేఁ డిచటన్ జతుస్సము
ద్రాంతధరాధురంధరుఁడవై జగతిం గలరాజులెల్ల నీ
చెంతలఁ జేరి సన్నుతులు సేయఁగ నొక్కతృణాశి యార్జవం
బింతయు లేక దూఱుటిది యెంతకొఱంత నృపాలశేఖరా!

151

మంత్రులు రాజు నోదార్చుట

చ.

జగతి ననంతపుణ్యగుణసౌష్ఠవయుక్తులు సాధుసమ్మతా
నుగతసమగ్రవై భవమనోజ్ఞచరిత్రులు ధర్మసంగ్రహా
ద్యగణితకీర్తియుక్తులు మహాత్ములు నిన్ను గొఱంతలెన్న ర
మ్మృగమన నోపు కానఁజెడమేసిన చెంగలికాయ క్రొవ్వునన్.

152

సీ.

బ్రహ్మోపనయనాదిబహుకృతుల్ గావించి
               తది నీకు సంతతి యగునొ కాదొ
వాపీతటాకనిర్వాహమ్ము ఘటియించి
               తది నీకు సంతాన మగునొ కాదొ
దేవతాయనప్రదేశముల్ నిర్మించి
               తది నీకు సంతాన మగునొ కాదొ
హయమేధముఖ్యభవ్యాధ్వరమ్ము లొనర్చి
               తది నీకు సంతతి యగునొ కాదొ


తే.

కాదొ సంతాన మా రమాకాంతపదని
బద్ధసాంతఃకరణకృతభాగవతస
భాసపర్యాదిసోపానపంక్తి నీకు
సంతతి కొఱంత యెట్లయ్యె జనవరేణ్య!

153


చ.

అన నొడబాటు లేమి దరహాసము చారుకషాయితేక్షణో
జ్జనితలనద్రుచిప్రతతిసాహ్యమునన్ నరపాలశేఖరా
నన మొగిఁ జూడనొప్పెసఁగె నవ్యసముజ్జ్వలసాంధ్యరాగమే
ళనశబలీకృతైందవకళాకళికాకళికాపరాగమై.

154


ఉ.

మీరలు నీతివర్తను లమేయగుణాకరులంచు ధర్మవి
స్తారత నిందునందు సుఖసంగతి యే గణియించుపద్ధతిన్
జేరరు పూర్వపక్షములు జేసెద రిట్టిది రాజకార్యని
స్తారకులౌ నమాత్యుల విధంబె వృథా విపరీతవాదముల్.

155


సీ.

తనయులకై ఘోరతప మాచరింపఁడే
               యడవులయందు స్వాయంభువుండు
సుతులకై నిష్ఠురవ్రతనిష్ఠ పూనఁడే
               బుధులెన్న యువనాశ్వభూమిభర్త
సంతతికై యుగ్రశపథముల్ పలుకఁడే
               జలధీంద్రుతో హరిశ్చంద్రనృపుఁడు
ఘనపుత్రకాముఁడై క్రతు వాచరింపఁడే
               బహుదక్షిణలు మీఱఁ బంక్తిరథుఁడు

తే.

నందనావాప్తికై కాదె నాభి కశ్య
పాత్రిదక్షాదిపుణ్యు లాయాసపడుట
తలఁచిచూడుడు వారికిఁ గలవొ లేవొ
వనతటాకాది సంతానవైభవములు.

156


క.

చనియెదరు నీతిపద్ధతి
ననియెద రుచితోక్తిసరణి నత్యాప్తులరై
మనియెద రనియుండితి మి
ట్లనయుల రగుటెన్నఁడెఱుఁగ మంచుం బెలుచన్.

157


చ.

సమధికసూక్ష్మపక్ష్మనికషానుకషాయితవీక్షణద్యుతుల్
దము నునుగెంపు దువ్వలువ దట్టఁపురంగు పొసంగఁజేయ భూ
రమణునికిన్కఁ గన్గొని ధరాధరధైర్యధురంధరుండు చి
త్తమునఁ గలంగెనంచును బ్రధానవరుల్ సభయాంతరంగులై.

158


క.

భూనాయక! నీదగు సం
తానేచ్ఛాదృఢత దెలియఁదలఁచి యనుటయే
కాని యొండొకటి సేయం
బూనుదుమే! యిట్టులనుట పోలునె మమ్మున్.

159


శా.

సమ్యక్సౌమ్యపురూరవశ్ఛదకనచ్చాఖాంచితంబున్ మరు
ద్గమ్యంబై విలసిల్లు శీతరుచిసత్సంతానసంతాన మౌ
పమ్యశ్రీ నిరసించి యుష్మదురుపుష్పప్రాప్తిఁ జెన్నొంది సం
భ్రామ్యత్సూర్యళియై భవత్సుతఫలప్రారంభముం గోరదే!

160


తే.

మంచి దింతట నేమయ్యె మనుజనాథ!
మన పురంబున కేఁగి సమ్మదము మిగుల
బ్రహ్మవిదులైన శ్రీమహాభాగవతుల
నడిగి వారల యానతి నడువ వలయు.

161


అని సచివు లిట్లు పలికెడు
సునయోక్తుల కియ్యకొని యశోధనుఁడగు న

మ్మనుజేంద్రుండు చతుర్విధ
ఘనసేనాకలితుఁ డగుచుఁ గదలెం బురికిన్.

162


ఉ.

ఆనృపుఁ డాదరించెఁ బునరాగమనావసరాగతాంబుఖే
లానిరతామరీకుచమిళద్ఘనసారపటీరపాళికా
ఫేనిలసహ్యజాసలిలపేశలబిందుపయోజగంధస
న్మానితశైత్యమాంద్యలసమానవిహారసమీరడింభమున్.

163


వ.

ఇవ్విధంబున నమ్మహీకాంతుండు పథశ్రమం బపనయించి పురంబు
ప్రవేశించి యాస్థానమండపంబున సముచితపరివారంబు కొలువం గొలువుండి సమీప
జనులం జూచి బ్రహ్మవేత్తలగు భాగవతోత్తములం దోడి తెండని పంచినం జనిరని
చెప్పిన విని శిష్యుప్రవరు లయ్యాచార్యునిం జూచి యవ్వలివృత్తాంతం బెట్టిదని
యడిగిన-

164


శా.

సారాచారవిహారహారమణిరాజత్కంఠ! కంఠీరవో
దారస్ఫారపరాక్రమాక్రమితదైత్యవ్రాత! సీతావథూ
స్మేరాస్యేక్షణలోలలోచన! యశశ్శ్రీనిర్జితాంచత్పయః
పారావారసితప్రభావిభవ! శుంభద్భాహుదర్పోజ్జ్వలా!

165


శంకరపత్నీహృదయవ
శంకరనిజనామమంత్రసౌరభ! మౌర్వీ
టంకారశ్రవణదళ
ల్లంకాపురవాసహృదయ! లలితాభ్యుదయా!

166


మాలిని.

సకలమునిశరణ్యా! సత్యధర్మాభిగణ్యా!
వికటవిమతభేదీ! వీరలక్ష్మీవినోదీ!
సుకవిగణితకీర్తీ! సుస్ధిరానందమూర్తీ!
ముకురనిభకపోలా! ముఖ్యసౌజన్య హేలా!

167


గద్య.

ఇది శ్రీరామచంద్రకరుణానిరీక్షణ సమాసాదితకవితావిశేష
శేషాన్వయప్రదీపక వేంకటాచార్యప్రణీతంబైన కులశేఖరమ
హీపాలచరిత్రంబను మహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము

168

————