Jump to content

కులశేఖర మహీపాల చరిత్రము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

చెన్నపురి ప్రభుత్వ ప్రాచ్యలిఖతపుస్తకభాండారములో ఈ కులశేఖరమహీపాలచరిత్రమునకుఁ దాళపత్రప్రతి యొక్కటియే కలదు. (డి. నం. 2077) ఇటీవలనే దానికి దుహితృక కల్పింపఁబడినది. (ఆర్. నం. 1071)

మాతృక అశిథిలమును దోషరహితము నగుటచే ముద్రణ ప్రతిసంపాదనము సుకర మైనది. చివరియాశ్వాసమున తుదిపద్యము లొండురెండును కావ్యమధ్యమున రెండు మూడు తావులలో నొకటి, అఱ, పద్యచరణములు మాత్రము త్రుటితములును లేఖక ప్రమాదవిసృష్టములు నని తెలుపవలసియున్నది.

అపరిహరణీయములగు నీనీహారలేశములను విడిచినచో నితరపూర్వకావ్యములవలె సందేహస్థలములలో బరిష్కర్తల వికల్పముల కెడమీయక యథోచ్చారితముగఁ బ్రకాశము నందగలుగుట యీ కావ్యవిషయమున నెన్నదగిన విశేషము. ఇందలి కావ్యగుణముల మేలిమి కీ మేలు కలిసివచ్చినది. ఇట్టిది యరుదు. శ్రీవైష్ణవమతప్రవర్తకులగు నాళ్వారులలో నన్యతముఁడును, సుప్రసిద్ధమగు ముకుందమాలకును ద్రవిడాగమైకదేశమగు పెరియతిరుమొ௶కినిఁ గర్తయగు కులశేఖరమహీపాలుని చరిత్ర మిందలి వస్తువు. ఆపస్తంబసూత్రుఁడును కౌండిన్యగోత్రుఁడునగు శేషము రఘునాథాచార్యుఁడు దీనికిఁ గర్త. ఇతఁడు ప్రస్తావనలో నిరూపించిన తనవంశక్రమ మిది:—

పినతమ్ముఁడు చెన్నభట్టరు, తన యభిమన్యుకల్యాణములో రఘునాథాచార్యుని నిట్లు స్తుతించెను.

"అందగ్రజుఁడు సద్గుణాభిరాముండు
నందనందనకథానందచిత్తుండు
శమదమవాత్సల్య సౌశీల్యముఖ్య
కమనీయగుణరత్న కలశవారాశి
యమలవైష్ణవరహస్యార్థసంవేది
రమణీయశుభకీర్తి రఘునాథగురుఁడు.”

ఈ అభిమన్యుకల్యాణము రసోత్తరమయిన ద్విపదకావ్యము. ఇది యీగ్రంథాలయమున డి. నం. 1022-1027 రులలో వర్ణితము. ఇది యముద్రితము. ఈచెన్నభట్టరుకుమారుఁడు రంగాచార్యుఁడును సరసకవి. భావనారాయణవిలాసమను ప్రశస్తయక్షగానమును రచించెను.

"ఇది శ్రీమన్నందనందనచరణారవిందద్వంద్వనిష్యందిమరందబిందుమదవదిందిరాయమాణ మానసశేషవంశాబ్ధిసుధాకర చెన్నభట్టారకకుమార రంగాచార్యప్రణీతంబైన భావనారాయణవిలాసంబు" అని దానిగద్య.

ఇది యీ గ్రంథాలయమున డి. నం. 1981 రున వర్ణితము. వీరివంశము పరిపాటి యిట్టిది. అందఱును విద్వత్కవులే. భావనారాయణవిలాసమునందలి యితివృత్తము ముచ్చటయైనది. గుంటూరిమండలము పొన్నూరు గ్రామమునకు గూనిగోవిందుఁడను భక్తునిచేఁ దనవైవాహికవిషయమున మేనమామకడకు సాక్షిగఁ గొనితేఁబడి సాక్షి భావనారాయణుఁ డనపేర నచట నిలిచిన స్వామి మాహాత్మ్య మిందు వర్ణితమైనది.

చెన్నభట్టరు రచించిన యభిమన్యుకల్యాణమునందలి వస్తువుకూడ దాదాపుగ నిట్టిదియే. కన్యాప్రదానవిషయమున నాడినమాట తప్పఁ జూచిన మేనమాను, సాక్షియైన నారాయణుని యనుగ్రహమునఁ దుదకు గృతార్థుఁడైన మేనల్లుఁడును, ఈ తండ్రికొడుకుల కృతులలో సమానముగ గోచరింతురు. రంగాచార్యుఁడు గ్రహించిన యితివృత్తము పొన్నూరునకు సంబంధించినదగుట నీశేషమువారు గుంటూరుమండలవాస్తువ్యులై యుందురనునూహ కెడమిచ్చుచున్నది. రఘునాథాచార్యుల కాలనిర్ణయమునకుఁ బ్రకృతకావ్యమునందుఁ

గాని తమ్ముఁడు చెన్నభట్టరు కృతిలోఁ గాని, తత్పుత్రుని కృతిలోఁ గాని యాధారములు గనవచ్చుట లేదు.[1]

ఎట్లును బదునేడవ శతాబ్ది కీవలిదియే యనకతీఱని యీకావ్యము కవితాపరిణతినిబట్టి మాత్రము పదునాఱవశతాబ్దిలోఁ బుట్టఁదగినదిగఁ దోఁచును. ప్రతిభావ్యుత్పత్తులలో నాయకరాజులనాటి తెనుఁగుకవులెవ్వరును రఘునాథాచార్యునితో సరిరారు. ఇట్టి విశిష్టమైనవాఙ్ముద్రయే వారికి లేదు. ఈయుజ్జ్వలతయు పరిణతియు క్షయోన్ముఖమైన నాఁటి సారస్వతములో పుట్టకపుట్టిన వనవలెను. ఆ యుగలక్షణముల కపవాదభూత మై కంకంటి పాపరాజు కావ్య మొకటి యున్నదన్నచో నీ కులశేఖరచరిత్రమును దాని సరసను జేర్పవలెను. గతానుగతికమును మందప్రతిభము నగు పదునేడు పదునెనిమిదవ శతాబ్దుల తెనుఁగువాఙ్మయములో నరుదుగ నుదయించిన రెండుమూఁడు ప్రశస్తకృతులలో నిది యొకటి. అస లిది యిన్నా ళ్ళప్రకటితమై మఱుగుపడి యుండుటయే యాశ్చర్యము. ప్రభుత్వమువారిచే నేఁటివఱకుఁ బ్రచురితములగుచున్న పూర్వాంధ్రకావ్యములలో నింతకవితాగుణసమృద్ధమైన కావ్యము రాలే దనుట యతిశయోక్తి కాదు. ఇందలి ప్రతిపద్యమును శాణోత్తేజిత మైనరత్నము. ప్రబంధవాఙ్మయమహాసౌధమునకు మూలస్తంభములగు ఆముక్తమాల్యద, వసుచరిత్రము, పాండురంగమాహాత్మ్యము, ప్రభావతీప్రద్యుమ్నములలోని యాయా విశిష్టకవితాలక్షణములు రఘునాథాచార్యుని కృతిలో హత్తికొనినవి. భావగతముగనో రచనాగతముగనో, పలుకుబడినో, ప్రతిపద్యమునను నొకవిశేషము భాసించుచునేయుండును. కవియొక్క కృతహస్తతకు నిందలి ప్రతిపద్యము నుదాహరణమే.

ఇదియు నాళ్వారుకథ యగుట, కావ్యముఖమునందలి పంచాయుధవిష్వక్సేనగరుత్మదాదులస్తుతులును, కావ్యమున నాపాదచూడముగ గుబాళించుచున్న విశిష్టాద్వైతసంప్రదాయముద్రయును ఆముక్తమాల్యదను దలపించుచున్నవి. శ్లేషవర్ణనాసందర్భములలో నీకావ్యము వసుచరిత్రధోరణులను పుణికి పుచ్చికొన్నట్లు కననగును. ఒక్కొకయెడ తెనాలికని కూర్పుబిగువులహరువు మెఱయును. ఇఁక సంవాదములలో, శృంగారదౌత్యములలో, ప్రణయలేఖలో సూరన దైశికముద్ర యుట్టిపడును. కవియుపజ్ఞకుఁ దొలియాశ్వాసమున హరిణీవృత్తాంతములోని కోడండ్రికముయొక్క చిత్రణమే గొప్పయుదాహరణము. నాల్గవయాశ్వాసముతుద నీళాపరిగ్రహానంతరము శ్రీరంగనాథుఁడు దాక్షిణ్యభంగభీరువై శ్రీదేవిని జూడనేగిన సన్నివేశము తన్నిర్వహణము కావ్యమునకు మకుటాయ మానముగనున్నవి. కులశేఖరులు నీళను శ్రీదేవికి నప్పగించు సందర్భములో దుహితృ స్నేహావిక్లబమగు పితృహృదయమునుఁడి వెలువడినమాటలు, వానికి శ్రీదేవి యొసఁగినయుత్తరమును ఔచిత్యమునకు మేఱుగ నున్నవి.

కౌస్తుభాంశజనితుఁడగు కులశేఖరుని భక్తివాసనాక్రమసమున్మేషము, రామాయణశ్రవణసమయములయందలి యతనితన్మయత, భాగవతులయం దతని పక్షము పుణ్యవాసనాప్రబోధదక్షములుగ నున్నది. మంత్రులదుర్మంత్రమును వ్యవహారకౌటిల్యమునుఁ జిత్రించిన నేర్పు కవికిఁ గల లోకస్వభావపరిజ్ఞానమునకు నిదర్శకముగ నున్నది. రసానుకూలముగ నాయఘట్టములలో స్వీకృతము లైనఛందోభేదములు శిల్పజ్ఞతను జాటుచున్నవి.

కావ్యము సర్వాంగీణముగ గుణసంపన్నమైనపుడు కతిపయోదాహరణములతో దాని సమగ్రసౌందర్యనిరూపణము సాధ్యపడునది కాదు. సమగ్రపరిశీలనమున కెడమును లేదు. ప్రచురితములై వెలువడుచున్న గ్రంథమాత్రములనెల్ల "వ్రతానా ముత్తమం వ్రతం" అను న్యాయమును పాలించి యతివిస్తరముగఁ బీఠికలయందుఁ బ్రశంసించుట యొకయాచార మైపోయినది కానఁ బ్రకృతకావ్యమును గూర్చి సంక్షేపముగ నైన నీమాత్రము చెప్పవలసి వచ్చినది. కాని నిజమన కిట్టికావ్యములు పీఠిగోపజీవ్యములు కావు. స్వయంప్రకాశములు.

నికషాయమాణులై యభిజ్ఞు లీకృతిరత్నము నొరయుదురు గాక.

తి. చంద్రశేఖరన్.


  1. శ్రీ నిడదవోలు వేంకటరావు గారు Journal of University of Madras Sections A. Humanities Vol. XXIII Nos. 1-2. (July-December) Pages (57-61) లో Kulasekhara in Telugu Literature అనువ్యాసములో నీరఘునాథాచార్యుల కాలమును నిర్ణయించిరి. అందు వారుచూపిన యాధారములలో మొదటిది. రామదాసకృతమగు దాశరథిశతకము 9వ పద్యములో "రఘునాథభట్టరాచార్యుల కంజలెత్తి" అనునది. కాని గోత్రగృహనామములు తెలుపఁబడని ఈ రఘునాథభట్టరు, ప్రకృత రఘునాథాచార్యులు కాకపోవుటకుగల సంభవమును, రఘునాధసంజ్ఞికులు పలువు రుండకుండుటకుఁగల యసంభవమును దీనికి బాధకములుగ నున్నవి. రెండవది. కులశేఖరచరిత్ర అభిమన్యుకల్యాణములలోని ప్రస్తావనలకు అంబరీషోపాఖ్యానప్రస్తావనోదాహృతపద్యను జోడించి వా రొసగిన శేషమువారివంశవృక్షము. అంబరీషోపాఖ్యానకృతికర్త తిరుమలాచార్యుఁడుకూడ శేషమువంశజుఁడును కౌండిన్యగోత్రుఁడును. అందు తిరుమాలాచార్యుఁడు తాను నారాయణార్యసంభవుఁడనని చెప్పికొనెను. శ్రీ వేంకటరావుగారు తా మొసగిన వంశవృక్షములో 'నారాయణాచార్యుని' అహోబలదేశికుని పుత్రపంచకములో నన్యతమునిగా జేర్చిరి. అభిమన్యుకల్యాణ, కులశేఖరచరిత్రములలోనహోబలదేశికుని యగ్రనందనుఁడని రామానుజాచార్యుఁ డొక్కఁడే పేర్కొనఁబడెను. కడను నలువురినామములు పేర్కొనఁబడలేదు. తిరుమాలాచార్యుఁడు తనకృతిలో దండ్రినిమాత్రమే పేర్కొనెను గాని, తాతపేరు తడవినవాఁడు కాఁడు. ఇట్టిస్థితిలో నహోబలదేశికునకు నారాయణచార్యుఁడు కుమారుఁ డనుట, యూహైకసాధ్యము కాని ప్రమాణసిద్ధము కా దనవలసివచ్చుచున్నది. ఆది పొసఁగిననే కాని తిరుమలాచార్యుని యంబరీషోపాఖ్యానమును బట్టి వారు చేసిన రఘునాథాచార్యుని కాలనిర్ణయము పొందుపడదు. ప్రతివాదమునకులోఁ గని ప్రమాణాంతరములు లభించునంతవఱకు రఘునాథాచార్యుని కాలనిర్ణయవిషయము పరిశీలనార్హమైయున్నది.