కుటుంబ నియంత్రణ పద్ధతులు/లూప్

వికీసోర్స్ నుండి

5. లూప్

గర్భాశయంలోకి సంతాననిరోధక సాధనాన్ని ప్రవేశాపెట్టి గర్భం రాకుండా చేసే పద్దతి దాదాపు 2000 సంవత్సరాల నుంచి అమలులో ఉంది. ప్రాచీన గ్రీకు వైద్య పితామహుడు హిప్పోక్రాట్ తన వైద్య పద్ధతిలో లూప్ వంటి సాధనం గురించి వివరించారు కూడా. శతాబ్ధాల పాటు అరబిక్, తుర్కిష్ వ్యాపారులు తమ ఒంటెల విషయంలో లూప్ వంటి గర్భనిరోధక పద్ధతి అవలంభించారు. ఒంటెల మీద సామాను వేసుకొని నలల తరబడి ఎడారుల గుండా పోయేటప్పుడు ఒంటెలు గర్భం ధరించకుండా గర్భాశయం లోకి గులకరాళ్ళు ప్రఫేశపెట్టేవాళ్ళు. ఈ విధంగా లూప్ వంటి ఉద్దేశ్యం మానవునికి ఏనాటినుంచో ఉంది.

ఈ శతాబ్దం ప్రారంభంలో 1929 లో జర్మన్ దేశంలో గ్రీఫెన్ బెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు సంతాన నిరోధక సాధనంగా లూప్ వంటి సాధనాన్నిరూపొందించాడు దానినే గ్రీఫెన్ బెర్గ్ సిల్వర్ రింగ్ అనేవారు. 1959 సంవత్సరం వరకు గ్రీఫెన్ బెర్గ్ రూపొందించిన లూప్ వంటి ఈ సాధనం అనేక రూపాంతరాలు చెందుతూ ప్రచారంలో ఉంది. 1962 నుంచి లూప్ మరింత క్రొత్తగా రూపం దిద్దుకొని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. లూప్ నే "ఇంట్రాయుటెరైన్ కాంట్రాసెప్టెల్ డివైస్" అని అంటారు. ఐ. యు. సి. డి. అన్నా, ఐ. యు. డి. అన్నా లూప్ వంటి గర్భనిరోధక సాధనాన్నే

లూప్‌లో రకాలు

ఈనాడు బారతదేశంలో రెండు రకాల లూప్‌లు "ఐ.యు.సి.డి" వాడకంలో ఉన్నాయి.

1.ఔషధ రహిత (అన్ మెడికేటెడ్) లూప్

2.ఔషధ పూరిత (మెడికేటెడ్) లూప్

మళ్ళీ ఔషధ రహిత లూప్‌లో రెండు రకాలు వాడుకలో ఉన్నాయి. అందులో ఒకటి లిప్సీస్ లూప్,రెండవది - సూన్ వాలా లూప్.

ఇక ఔషధపూరితె లూప్‌ల్లో "కాపర్-టి","మల్టి లోడ్ కాపర్ 250" లూప్‌లు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి.

భారతదేశంలో లిప్సీస్ లూప్‌లు తయారు చేయబడుతున్నాయి. "కాపర్ - టి 209" లూప్ లు విదేశాలనుంచి దిగుమతి చేయబడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడబడుతున్నాయి. "మల్టీలోడ్ సి.య 250" లూప్‌లు మార్కెట్టులో కొనడానికి లభ్యమవుతాయి. "మల్టీలోడ్ సి.యు. 250" లూప్ ఖరీదు వందరూపాయలకు పైగా ఉంటుంది. కాపర్ టి లూప్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వేస్తారు.

లిప్పీస్ లూప్

లిప్పీస్ లూప్‌ని న్యూయార్క్‌లో డాక్టర్ జాక్ లిప్పీస్ రూపొందించారు. ఇది ఇప్పుడు మన దేశంలోనే ఉత్పత్తి చేయబడుతోంది.

లిప్పీస్ లూప్‌లో నాలుగు సైజులు ఉన్నాయి. 25 మిల్లీ మీటర్ల పరిమాణం కలిగి నీలం రంగు దారాలు ఉన్నది.

2] 2.75 మిల్లీ మీటర్ల పరిమాణం కలిగి నల్లదారాలు ఉన్నది. 3" 30 మిల్లీమీటర్ల పరిమాణం కలిగి పసుపు దారాలు ఉన్నది. 4" 30 మిల్లీమీటర్ల పరిమాణం కలిగి తెల్లదారాలు ఉన్నది.

25 మిల్లీ మీటర్ల పరిమాణం కలిగి నీలం రంగు దారాలు ఉన్న లూప్‌ని సంతానం కలగని స్త్రీలకి వేస్తారు. మిగిలిన మూడు సైజులు కల లూప్‌లని సంతానం కలిగిన స్త్రీలకి వేస్తారు.

లిప్పీస్ లూప్‌ని బేరియం సల్ఫేట్ కల ప్లాస్టిక్ (పాలీ ఎధలిన్)తో తయారు చేస్తారు. దీని చివరన నైలాన్ దారాలు రెండు ఉంటాయి. లూప్‌ని గర్భాశయం నుంచి తీసి వేయాలనుకున్నప్పుడు ఈ దారాలను పట్టుకుని లాగి వేస్తే బయటకు వచ్చివేస్తుంది. లూప్ గర్భాశయం లోపల ఉన్నప్పటికి నైలాన్ కోసలు యోనిలో ఉంటాయి. దారాలు అలా ఉన్నా అవి సంయోగానికి ఎటువంటి ఇబ్బందికరంగా అనిపించవు.

ఔషధరహిత లూప్‌ల్లో సాఫ్-టి" కూడా ప్రపంచవ్యాప్తంగా వాడబడుతోంది. చైనాలో స్టీల్ రింగ్ వాడబడుతోంది.

ఔషధపూరిత లూప్

ఔషద రహిత లూప్‌లు గర్భాశయంలో వాటి కదలికలవల్ల పిండం నిలబడకుండా చేస్తే ఔషధ పూరిత లూప్‌లు వాటిలో ఉన్న ఔషధాల వల్ల మరింత ఎక్కువ ప్రయోజకరంగా పని చేస్తాయి.

ఔషధపూరిత లూప్‌లకి ప్రధానంగా రాగి (కాపర్) వాడబడుతుంది. కాపర్-టి లూప్ అంటే ఇంగ్లీషు అక్షరం "టి" రూపంలో ఉన్న ప్లాస్టిక్ సాధనానికి రాగి తీగ చుట్టబడి ఉండటం

కాపర్-టి లూప్‌ల్లో కొన్నింటికి 200 లేదా 220 లేదా 250 స్క్వేర్ మిల్లీ మీటర్ల రాగి తీగ చుట్టబడి ఉంటుంది. లూప్ తోక భాగాన్న, అనగా దిగువ భాగాన్ని రెండు కొసలుగా నైలాన్ దారం ముడి వేసె ఉంటుంది.

లూప్‌లని భద్రపరచడం ఎలా ?

లూప్‌లని రోగక్రిముల నుంచి రక్షణ కలిగించి, పరిశుభ్రమైన రీతిలో గర్భాశయంలో ప్రవేశ పెట్టవలసి ఉంది.

లిప్పీస్ లూప్‌నిగాని, దానిని గర్భాశయంలోకి ప్రవేశపెట్టే సాధనాన్ని గాని క్రిముల నిర్మూలనకొరకు వేడినీళ్ళల్లో మరిగించడం, వేడిగా ఉండే ఆటోక్లేవ్‌లోగాని ఉంచడం చేయకూడదు. అలా చేయడం వల్ల అవి పాడైపోతాయి.

గర్భాశయంలోకి లూప్‌ని ప్రవేశపెట్టు సాధనము

లూప్‌ని వేయడానికి ముందు లిప్పీస్ లూప్‌ని, దాన్ని లొపలకు ప్రవేశపెట్టే సాధనాన్ని 'అప్లికేటర్ ' యాక్వసస్ ఐడిన్ 12:500 ద్రావకంలోగాని, 75 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాలులొగాని, శావలాన్ సల్యూషన్‌లోగాని ఉంచాలి అలా ఉంచడంతో లూప్‌కి, అప్లికేటర్‌కి అంటుకుని ఉన్న వ్యాధిక్రిములు పూర్తిగా నిర్మూలింపబడతాయి.

కాపర్-టి లూప్‌గాని, మల్టీలోడ్ సి యు 250 లూప్‌గాని క్రిముల నుంచి పూర్తి రక్షణ ఉన్న ప్యాక్‌లో భద్రపరచి ఉండటం జరుగుతుంది కనుక వాటిని వేయడానికి ముందు వేరే శుభ్రపరచవలసిన అవసరం లేదు.

గర్భాశయంలోకి లిప్పీస్‌లూప్‌ని వేయడంఎలా?

లూప్‌ని వేయించుకునే ముందు ఆ స్త్రీ పూర్తిగా మూత్రవిసర్జన చేసి ఉండాలి లూప్ వేయడానికి వీలుగా బల్లమీద వెల్లకిలా పడుకుని కాళ్ళు రెండూ మోకాళ్ళ దగ్గర ముడుచుకుని ఎత్తిపెట్టి ఉంచాలి. లూప్ వేసే ముందు హెల్త్ వర్కరుగాని, వైద్యుడుగాని శుభ్రమైన గ్లవ్స్‌తో మర్మావయాల లోపల క్షుణ్ణంగా పరీక్ష చేయాలి. గర్భిణీ లేదని, గర్భాశయానికి గడ్దలుగాని, పుళ్ళుగాని లేవని నిర్ధారణ చేసుకోవాలి.

అటు పిమ్మట లూప్ వేయడానికి వలసెల్లంతో గర్భాశయకంఠాన్ని 'సెర్విక్స్ ' పట్టుకొని కాస్త ముందుకు లాగాలి. ఆ తర్వాత యుటిరైన్ సౌండుతో గర్భాశయం ఎంత పరిమాణంలో ఉందో కొలత చూడాలి.

తరువాత అప్లి కేటర్ లొకి లూప్‌ని దూర్చి ఆ అప్లికేటర్‌ని గర్భాశయ కంఠం ద్వారా గర్భాశయంలోకి ప్రవేశపెట్టాలి. తరువాత అప్లికేటర్‌లో ఉన్న లూప్‌ని గర్భాశయంలోకి నెట్టాలి. ఆ తరువాత అప్లి కేటర్ లో ఉన్న లూప్ ని గర్బాశయం లోకి నెట్టాలి. ఆ తరువాత అప్లికేటర్ ని తీసివేయాలి. అప్లి కేటర్‌ని తీసివేసిన తరువాత లూప్‌కి కట్టబడిన నైలాన్ దారాలు యోని లోపల వ్రేలాడుతూ కనబడతాయి. ఈ దారాలు మరీ పొడవు ఉంటే రెండు-మూడు సెంటీమీటర్ల పొడవు ఉంచి తక్కిన పొడవుని కత్తిరించి వేయాలి.

లూప్ వేసిన తరువాత 15-20 నిముషాలు విశ్రాంతి తీసుకొవాలి. లూప్ వేయడానికి ఎటువంటి మత్తు ఇవ్వనవసరంలేదు. అతిగా భయపడి ఎంతో నెర్వస్‌గా ఉండే వాళ్ళకి కొందరికి పూర్తి మత్తు ఇచ్చి లూప్ వేయవలసి వస్తుంది.

లూప్ వేయడానికి అప్లి కేటరు గర్భాశాయ కంఠం

ద్వారా లోపలికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే సెర్వయికల్ డైలేటార్స్ ద్వారా కొద్దిగా వెడల్పు చేయవలసి ఉంటుంది.

కాపర్ -టి లూప్ వేయడం ఎలా?

1969 లో జప్సర్ అనే శాస్త్ర్రవేత్త చిలీలో కాపర్-టీ లూప్‌ని రూపొందించి విస్తృత ప్రచారంలోకి తీసుకుని వచ్చాడు. "కాపర్ -టి 200" లూప్‌లు పరిశుభ్రమైన ప్యాకెట్టుల్లో లభ్యమవుతాయి. ప్రతి ఒక్క కాపర్-టి లూప్‌కి 120 మిల్లీ గ్రాముల రాగి తీగ చుట్టబడి ఉంటుంది. ఈ రాగి తీగ లూప్‌కి పొడుగుగా ఉండే భాగానికి చుట్టబడి ఉంటుంది.

రాగి వైరు మొత్తం 208 స్క్వేర్ మిల్లీమీటర్లు విస్తరించి ఉంటుంది. కాపర్ -టి (Copper-T) లూప్ గర్భకోశంలో ప్రవేశపెట్టేటప్పుడు 'T ' తలభాగం గర్భకోశం పై వైపుకి, T క్రిందిభాగం గర్భకోశం క్రింది వైపుకి ఉండేటట్లు చూడడం జరుగుతుంది. అప్లికేటరు ద్వారా కాపర్-టి లూప్‌ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది.

మల్టీలోడ్ సి యు 250 లూప్

a) తేలికగా వంగే లూప్ భుజములు (Flexible plastic arms)

b) లూప్‌కి నిలువుగా ఉన్న ప్లాస్టిక్ భాగము దీనికి కాపర్ తీగ చుట్టబడి ఉంటుంది

c) లూప్ చివర ముడివేయబడిన నైలాన్ దారాలు

మల్టీలోడ్ సి యు 250 లూప్‌ని ఆర్గనాన్ ఫార్మాస్యూటికల్ కంపనీ మార్కెట్‌లో ప్రవేశ పెట్టింది. ఇది 3, 6 సెంటీ మీటర్లు పొడవు ఉండే ప్లాస్టిక్ సాధణం. దీనికి అగ్రభాగాన వంకర తిరిగి ఉండే రెండు ప్లాస్టిక్ కొమ్ములు ఉంటాయి.

ఈ లూప్‌కి క్రిందిభాగంలో రెండు నైలాన్ దారాలు ముడివేయబడి ఉంటాయి. మల్టీలోడ్ సి యు 250 లూప్‌కి సంబంధించి ప్లాస్టిక్ రాడ్ కి 27 సెంటీమీటర్ల రాగి వైరు చుట్టబడి ఉంటుంది. ఈ రాగి వైరు మొత్తం 250 స్క్వేర్ మిల్లీ మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమించి ఉంటుంది. కాపర్ (రాగి) 250 స్క్వేర్ మిల్లీ మీటర్లు వైశాల్యం ఆక్రమించి ఉంటుంది కనుక ఈ లూప్‌ని 'మల్టీలోడ్ సి యు 250 ' అంటారు. 'సి యు ' అంటే కాపర్ (రాగి).

'మల్టీలోడ్ సి.యు 250 'లూప్ స్టెరలైజ్డ్ ప్యాక్‌లో లభ్యమవుతుంది. అందుకని దీనిని గర్భకోశంలో ప్రవేశపెట్టే ముందు ప్రత్యేకంగా శుభ్రపరచవలసిన అవసరం లేదు. ఈ లూప్‌తోనె అప్లి కేటర్ కూడా ఇవ్వబడుతుంది. అది కూడా శుబ్రప్రరిచే ఉంటుంది. తక్కిన లూప్‌ల్లాగానే ఈ లూప్ కూడా గర్భకోశంలోకి ప్రవేశ పెట్టడం జరుగుతుంది.

లూప్‌ని తీసివేయడం ఎలా ?

కాపర్ -టి లూప్‌నిగాని, మల్టీలోడ్ సి.యు 250 లూప్‌ని గాని తీసివేయాలనుకున్నప్పుడు గర్భాశయ కంఠం నుండి యోనిలోకి వ్రేలాడుతూ కనపడే నైలాన్ దారాలని రెండింటిని పట్టుకుని నిదానంగా లాగితే లూప్ గర్భాశయంలోనుంచి బయటకు వచ్చి వేస్తుంది. లూప్‌ని లాగివేయడం చాలా సుళువు. అరుదుగా కొందరికి దారాలు వచ్చేసి లూప్ అసలు బాగం గర్భాశయం లోపలే ఉండిపోతుంది. అటువంటప్పుడు మత్తు ఇచ్చి గర్భాశయ కంఠాన్ని కాస్త వెడల్పు చేసి దానిని తీసివేయవలసి వస్తుంది.

లూప్‌ని ఎవరిమట్టుకు వారు వేసుకొవచ్చా ? తీసేసుకోవచ్చా ?

లూప్‌ని ఎవరి మట్టుకు వారు వేసుకోవడం, తీసేసుకోవడం కుదరదు. డాక్టరు అందుబాటులో ఉంటే డాక్టరే లూప్ వేస్తారు. అవసరం లేదనుకున్నప్పుడు డాక్టరే తీసేస్తారు. డాక్టరు అందుబాటులో లేకపోయినా కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చిన మిడ్‌వైవ్స్, నర్సులు, శిక్షణ పొందిన కుటుంబనియంత్రణ కార్యకర్తలు లూప్ వేయడం తీయడం చేస్తారు.

లూప్ ఎప్పుడు వేయాలి ?

స్త్రీ బహిష్టు అయిన తరువాత వారం రోజుల లోపు లూప్ వేయాలి. లూప్ వేయించేలోగా దంపతులు దాంపత్య సంబంధాలలో పాల్గొనకుండా ఉండటం మంచిది. లూప్ ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు. నేల మధ్యలో వేసినట్లయితే గర్భం ఉండవచ్చు. అటువంటప్పుడు లూప్ వేయడంవల్ల ఫలితం ఉండదు. లేదా లూప్ వేయడం వల్ల గర్భస్రావం జరగవచ్చు. దాంపత్య సంబందాలలో అసలు పాల్గొనకుండా ఉంటే బహిష్టుకీ మధ్య కాలంలో ఎప్పుడైనా లూప్ వేయవచ్చు.

కొందరికి మామూలు దినాల్లో గర్భాశయ కంఠద్వారం (సెర్వయికల్ కెనాల్) బిగుతుగా ఉండి లూప్ వేయడానికి అప్లి కేటర్ దూరదు. అదే స్త్రీ బహిష్టు ఉన్న సమయంలో అయితే సెర్వయికల్ కెనాల్ వదులుగా ఉంటుంది. దానితో అప్లికేటరు తేలికగా గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. అందువలన సుళువుగా లూప్ వేయడానికి, లూప్ వేయించుకునే స్త్రీకి బాధ లేకుండా ఉండటానికి లూప్‌ని బహిష్టు ఉన్న సమయంలో వేయడం మంచిది. బహిష్టు సమయంలో లూప్ వేయడం వల్ల అది జారిపోవడం జరగదు.

కాన్పు అయిన తరువాత లూప్

కాన్పు అయిన తరువాత ఆరు వారాలకి లూప్ వేయవచ్చు. మరీ అవసరం అనుకుంటే కాన్పు అవగానే ఆ స్త్రీ డెలివరీ టేబుల్ నుంచి దిగకుండానే లూప్ వేయవచ్చు లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నప్పుడు వేసి పంపవచ్చు. గర్భస్రావం జరిగిన తరువాత లూప్ వెంటనే వేయవచ్చు. అంతేగాని కాన్పు లాగా ఆరువారాలు ఆగనవసరం లేదు.

ఏ సమయంలో లూప్ వేసినా ఆ స్త్రీని కొంతసేపు పడుకుని ఉండమని చెప్పడం మంచిది.

లూప్ వేయించుకున్న తరువాత మళ్ళీ డాక్టరుకి కనబడాలా ?

లూప్ వేయించుకున్న తరువాత ఏమైనా తేడా ఉంటే వెంటనే డాక్టరుకి చూపించుకోవాలి. ఎటువంటి బాధ లేని పక్షంలో మూడు నెలలు గడచిన తరువాత డాక్టరుచేత సాధారణపరీక్ష చేయించుకుని లూప్ ఏ పరిస్థితుల్లో ఉన్నదో తెలుసుకోవడం అవసరం. అటు తరువాత సంవత్సరానికి ఒకసారి చూపించుకోవడం అవసరం.

లూప్ ఎంత కాలం ఉంచుకోవచ్చు  ?

లిప్పీస్ లూప్‌ని ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు. కాని ప్రతి రెండు మూడు సంవత్సరాలకొకసారి అయినా పాత దానిని తీసివేసి క్రొత్తది వేయించుకోవడం మంచిచి. ఎందుకంటే లూప్ కొంతకాలంపాటు గర్భాశయంలో ఉన్న తరువాత అది గర్భాశయం లోపలి పొరల్లో పాతుకునిపోయే ప్రమాదం ఉంది దానివల్ల లూప్ వేయించుకున్నా ప్రయోజనం ఉండదు. వీరిలో లూప్ ఉన్నా గర్భం వచ్చే అవకాశం వుంది. కాపర్ -టి లూప్‌నిగాని, మల్టీలోడ్ సి యు 250 లూప్‌ని గాని రెండు-మూడు సంవత్సరాలకి ఒకసారి పాతది తీసివేసి క్రొత్తది వేయడం అవసరం. ఎందుకంటే ఈ లూప్‌లు ఔషధ పూరితమైనవి. 3 సంవత్సరాలు గడిచే సరికి ఈ ఔషధం తన ప్రభావాన్ని కోల్పోతుంది. కాపర్ టి లూప్‌లోగాని, మల్టీ లోడ్ సి. యు 250 లూప్‌లోగాని ఉండే ఔషధం కాపర్ 'రాగి '. ఈ కాపర్ రోజుకి 52 నుంచి 64 మైక్రోగ్రాములు తరిగిపోతూ ఉంటుంది. వీటికి సంబంధించిన కాపర్ తరిగిపోయిన తరువాత గర్భనిరోధం జరగదు.

కాపర్-టి లూప్‌ని ప్రత్రీ మూడు సంవత్సరాలకీ ఒకసారి తీసివేయాలి. మల్టీ లోడ్ సి యు 250 లూప్‌ని ప్రతీ రెండు సంవత్సరాలకి ఒకసారి తీసి వేయాలి. పాత లూప్ తీసి వెంటనే క్రొత్త లూప్ వేయవచ్చు.

లూప్ ఎవరు వేయించుకోకూడదు ?

గర్భిణీ లూప్ వేయించుకోకూడదు. అలాగే గర్భాశయంగాని, అండ వాహికలుగాని వాచి ఉన్నప్పుడు లూప్ వేయించుకోకూడదు. యోనిలో వ్యాధి వున్నా, గర్భాశయ కంఠానికి పుండు ఉన్నా, గర్భాశయంలో ఫైబ్ర్రాయిడ్స్ (గడ్డలు) ఉన్నా, అత్యధికంగా బహిష్టు స్రావం అవుతున్నా లూప్ వేయించుకోకూడదు. అలాగే ఆపరే షను చేయించుకున్న స్త్రీకి ఆపరేషను చేయించుకున్న భాగం చాలా బలహీనంగా ఉన్నా లూప్ మంచిది కాదు.

పెళ్లి కాగానే లూప్ వేయించుకోవచ్చా ?

పెళ్లి కాగానే కొందరు దాంపత్య సంబందాలలో పాల్గొనక ముందే లూప్ వేయించుకోవాలనుకుంటారు. అలా వేయడం మంచిది కాదు. ఒకవేళ లూప్ వేయడం తప్పని సరి అయితే పూర్తి మత్తు ఇచ్చి వేయవలసి ఉంటుంది.

క్రొత్తగా పెళ్లి అయినవాళ్ళు వెంటనే గర్భం వద్దనుకున్నపుడు కొంతకాలంపాటు తక్కిన కుటుంబ నియంత్రణ పద్దతులు అవలంబించిన తరువత లూప్ వేయించుకోవడం మంచిది.

ఒక్క బిడ్డ కూడా కలుగకుండా లూప్ వేయించుకోవడానికి కొందరు డాక్టర్లు అంతగా ప్రోత్సహించరు. ఎందుకంటే అరుదుగానైనా ఎవరికో ఒకరికి గర్భకోశం, అందవాహికలు లూప్ వల్ల వాచే అవకాశం ఉంది. దానివల్ల వారిలో సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఆ ఉద్దేశ్యంతోనే అంతగా అవసరం అనుకుంటే తప్ప సంతానం లేకుండా లూప్ వేయించుకోవద్దని అంటారు.

లూప్ గర్భం రాకుండా ఎలా నిరోధిస్తుంది ?

లూప్ ఏ విధంగా గర్భం రావడాన్ని నిరోధిస్తుందనే విషయమై ఇంకా స్పష్టమైన శాస్త్రీయ వివరణ లేదు. ఇంతవరకు అవగాహన చేసుకున్న దాని బట్టి లూప్ గర్భాశయ కండరాలని, అండవాహికలని ఎక్కువగా ఉత్తేజపరచి కండర సంకోచం ఎక్కువ జరిగేటట్లు చేస్తుంది. అండవాహికలలో వీర్యకణాలు అండంతో కలయిక పొంది తరువాత అక్కడనుంచి గర్భాశయంలోకి చేరడం జరుగుతుంది. అయితే లూప్ వేయించుకున్న వారిలో వీర్యకణాలు కలయిక పొందిన అండం గర్బాశయానికి చేరలేకపోతుంది. ఒక వేళ చేరినా లూప్‌వల్ల గర్భాశయం లొపల కదలికలు ఎక్కువ ఉండి కలయికచెందిన అండం అక్కడ నిలద్రొక్కు కోలేకపోతుంది. ఇది ఇలా ఉండగా లూప్‌వల్ల గర్భాశయం లోపలి పొరలు నీరుచేరి కాస్త ఉబ్బడం జరుగుతుంది. దీనినే ఇన్ ఫ్లమేటరీ ప్రోసెస్ అంటారు. ఈ రకంగా గర్భాశయం లోపలి పొరలు అనుకూలంగా లేకపొవడంతో వీర్యకణంతో కలయిక పొందిన అండం నిలద్రొక్కుకోలేక నిర్వీర్యం అయిపోతుంది. అంతేకాకుండా లూప్ వల్ల గర్భాశయం లోపలి పొరల్లో ప్రోస్టాగ్లాండిన్స్ అత్యధికంగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల గర్భాశయ కండరాలు మరింత ముడుచుకోవడం, సాగడం జరుగుతుంది. దానివల్ల సంయుక్త బీజకణం వీర్యకణంతో కలయిక పొందిన అండం నిలద్రొక్కుకోవాలనుకున్నా కుదరకుండా అవుతుంది. ఆ రకంగా సంయుక్త బీజకణం పిండంగా మారకుండా ఆగిపోతుంది. సంయుక్త బీజకణం పిండంగా రూపొందనప్పుడు నెలనెలా బహిష్టులు మామూలుగా వచ్చేస్తూ ఉంటాయి. కాపర్ -టి, మల్టీలొడ్ సి యు 250 లూప్‌ని బయో యాక్టివ్ కాపర్ డివైసిస్ అంటారు. ఈ రకమైన లూప్‌లు గర్భాశయంలో కాపర్ 'రాగి ' అణువులని విడుదల చేసి అక్కడి కణాలలో మార్పు తీసుకుని వస్తాయి. గర్భాశయంలో లూప్‌వల్ల కాపర్ అణువులు విడుదలైనా ఇవి రక్తం ద్వారా శరీరమంతా ప్రసరించడం జరగదు. గర్భాశయంలో విదుదలైన కాపర్ అణువులు అక్కడి కణాల్లో మార్పు కలిగించి సంయుక్త బీజకణం పిండంగా ఎదగకుండా క్షీణించి పోయేటట్లు చేస్తాయి.

ఔషధ పూరిత లూప్‌వల్ల గర్భనిరోధాన్ని మాత్రమే కలిగిస్తాయిగాని, స్త్రీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించవు.

లూప్ వల్ల వచ్చే బాధలు

లూప్ వల్ల ఆరోగ్యానికి హాని లేకపోయినా కొందరిలో కొన్ని రకాల బాధలు కలుగుతాయి. కొందరు స్త్రీలకి లూప్ వేయగానే పొత్తి కడుపులో మెలిపెట్టుతున్నట్లు నొప్పి వస్తుంది. కొందరు అటువంటి నొప్పి రాఫడంతో భరించలేక క్షణకాలంపాటు కళ్ళు తిరిగి పడిపోతారు. కాని కొద్ది నిముషాల్లోనే తేరుకుంటారు. అందుకనే లూప్ వేయగానే వెంటనే టేబుల్ మీదనుంచి దిగకుండా కొద్ది సేపు పడుకుని ఉండడం మంచిది. దానివల్ల ఇటువంటి బాధ చాలా వరకు కనబడరదు. కొందరు స్తీలకి లూప్ వేయించుకున్న తరువాత కిద్ది నెలలపాటు అప్పుడప్పుడు కాస్త మైల అవుతున్నట్లు కనబడుతుంది. కాని దీని గురించి భయపడనవసరం లేదు. స్టెప్టోవిట్ వంటి బిళ్ళలు తడవకి ఒకటి చొప్పున రోజుకి 4 సార్లు వేసుకుంటే మైలకనబడడం ఆగిపోతుంది. చాలామందికి ఇటువంటి మందు బిళ్ళల అవసరమే ఉండదు. కేవలంకొద్ది చుక్కలు రక్తం కనబడుతుంది. అంతే తప్ప మరేమీ ఉండదు.

కొద్దిమంది స్త్రీలలో లూప్ వేయించుకున్న తరువాత బహిష్టు కాలంలో బ్లీడింగు ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో స్టెప్టోవిట్ టాబ్లెట్ గాని, గైనో సి.వి.వి క్యాప్సుల్స్ వంటివి తడవకి ఒకటి చొప్పున రోజుకి 4 సార్లు 4-5 రోజులు వేసుకుంటే అతిగా బ్లీడింగ్ అవడం ఉండదు. లూప్ వల్ల అతిగా బ్లీడింగు అవడం మూడు-నాలుగు ఋతుస్రావాల్లో జరిగినా తరువాత లేకుండా అయిపోతుంది. ఈ రకంగా అధిక రక్తస్రావం అవడానికి కారణం లూప్ ప్లాస్మినోజిన్ యాక్టి వేటర్ ని ఎక్కువ అయ్యేటట్లు చేస్తుంది. ఇద్ ప్లాస్మినోజిన్‌ని ప్లాస్మిన్ గా మారుస్తుంది. రక్తం ఎక్కువ కారకుండా గడ్డకట్టి ఆపే ఫైబ్రిన్‌ని ప్లాస్మిన్ నష్టపరుస్తుంది. దానితొ బహిష్టు సమయంలో చిట్లిన రక్తనాళాలు, త్వరగా మూసుకుని పోకుండా రక్తస్రావం జరుగుతుంది. అయితే లూప్ వేయించుకున్న ప్రతి స్త్రీలో ఇలా జరగదు. ఒకరిద్దరు పిల్లలు పుట్టిన స్త్రీలు లూప్ వేయించుకున్నప్పుడు వచ్చే బాధలు కంటేఅసలు పిల్లలు కలగగుండా లూప్ వేయించుకున్న వారిలో వచ్చే బాధలు కాస్త ఎక్కువ.

లూప్ వల్ల ధుష్పరిణామాలు

లూప్ వల్ల వచ్చే దుష్పరిణామాలు చాలాకొద్ది మందిలో కలుగుతాయి. లూప్ వేయించుకున్నప్పుడు మామూలుగా వచ్చే కడుపులో నొప్పి, కాస్త ఎక్కువ బ్లీడింగు అవడం, లూప్ వేయించుకున్న మొదట్లో అప్పుడప్పుడు కాస్త కాస్త బ్లీడింగు కనబడడం కాంప్లి కేషన్లు క్రింద పరిగణించడం జరగదు. ఎక్కడో ఎవరికో మరీ ఎక్కువ బ్లీడింగు అవడం, మందులు వాడినా ఫలితం కనపడకపోవడం అవుతుంది. అటువంటి సందర్బాలలో లూప్ తీసివేస్తే ఆ బాధ తొలగిపోతుంది. అయితే చాలామందిలో మందు బిళ్లలు వాడటంతో కొద్ది రోజుల్లోనే బాధలు సర్దుకుపోతాయి.

లూప్ వేయించుకున్న 100 మంది స్త్ర్రీలలో 2.2 నుంచి 7.7 స్త్రీలల్లో లూప్ వల్ల గర్భాశయం, అండవాహికలు వాచడమో, గర్బాశయాన్ని చీల్చుకుని లూప్ కడుపులోపలికి ప్రవేశించడమో, గర్బాశయం చుట్టు ప్రక్కల వాపు వచ్చి కడుపునొప్పి విపరీతం అవడమో జరుగుతుంది. ఈ రకంగా గర్బాశయం, దాని చుట్టు ప్రక్కల వాపు రావడానికి వ్యాధి క్రిములు ప్రవేశించడమే. వ్యాధి క్రిములు గర్బాశయంలోకి, అండవాహికల్లోకి ప్రవేశించడానికి కారణం లూప్ పరిశుబ్రమైన స్థితిలో ఉండకపొవడమో, లూప్‌ని అప్లి కేటర్ ద్వారా లోపలికి ప్రవేశపెట్టేటప్పుడు యోనిలో ఉండే క్రిములు దానిద్వారా లోపలికి ప్రవేశించడమో, లేదా తరువాత యోనిలోపల ఉండే లూప్ దారాల ద్వారా క్రిములు లోపలికి ప్రవేశించడమో జరుగుతుంది.

కొన్ని సందర్భాలలో అంతకు ముందే గర్భకోశం లోపలగాని, దాని చుట్టుప్రక్క్జలగాని చైతన్య రహితంగా ఉన్న క్రిములు లూప్ వేయడం ద్వారా వాటిల్లో కదలికలు వచ్చి బాగా వృద్ధి చెంది వ్యాధి లక్షణాలని కలుగజేయవచ్చు.

లూప్ వేయడంవల్ల ఇన్ ఫెక్షను వచ్చి గర్బాశయం, దాని చుట్టు ప్రక్కల వాపు, నొప్పి కలుగుతున్నదని అనుమానం కలిగినపుడు లూప్‌ని తీసివేసి పెన్సిలిన్, టెర్రామైసిన్, జెంటామైసిన్ వంటి యాంటిబయాటిక్స్ ఏదో ఒకటి వాడాలి. దానితొ ఇన్ ఫెక్షను తగ్గిపోతుంది.

అరుదుగా కొందరికి లూప్ వేస్తున్న సమయంలోగాని, తరువాతగాని లూప్ గర్భాశయం పొరలను చేదించుకుని కడుపు లోపలికి వెళ్ళి పోతుంది. దీనినే 'పెర్‌ఫోరేషన్ ' అంటారు. ఇలా పెర్‌ఫోరేషన్ జరగడం లూప్ వేయించు కున్న రెండు వేల మందిలో ఒకరికి జరుగుతుంది. కాన్పు అవగానేగాని, లేదా 4-6 వారాలలోగ గాని లూప్ వేసిన వారిలో ఈ విధంగా 'పెర్ ఫోరేషన్ ' జరగడం సహజం.

పెర్‌ఫొరేషన్ జరిగిందని కొందరిలో తెలియనే తెలియదు. చాలామందిలో గర్భాశయం పొరలని చేదించుకుని లూప్ కడుపులోపలికి పోయినా ఎటువంటి బాధగాని, ప్రమాదంగాని ఉండవు. మామూలుగా గైనిక్ చెకప్ చేసినప్పుడు యోనిలో వ్రేలాడుతూ కనబడే లూప్ దారాలు కనబడకుండా అవుతాయి. దానిబట్టి లూప్ గర్బసంచిలో లేదని తెలుసుకోవచ్చు. అదే కాకుండా కడుపుని ఎక్స్‌రే తీస్తే లూప్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కూడా లూప్ గర్భాశయంలో ఉందా, చేదించుకుని బయటికి పోయిందా అనేది తెలుసుకో వచ్చు. లాప్రోస్కోపు పరీక్ష ద్వారా కూడా పెర్‌ఫొరేషన్ ద్వారా బయటికి వచ్చిన లూప్‌ని గుర్తించవచ్చు. అంతేకాదు లాప్రొస్కోప్ ద్వారా దానిని బయటికి తీసివేయవచ్చు. కొన్ని కేసుల్లో పెర్‌ఫొరేట్ చేసి బయటికి వచ్చిన లూప్ బయట ఇరుక్కుని పోయి ఉంటుంది. అటువంటప్పుడు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న లూప్‌ని తీయవలసి వస్తుంది.

లూప్ వేయించుకున్నా గర్భం రావచ్చా ?

లూప్ వేయించుకున్న వాళ్ళల్లో నూటికి ఇద్దరు నుంచి నలుగురి దాకా గర్భం రావచ్చు. ముఖ్యంగా ఈ ఫెయి ల్యూర్ లూప్ వేయించుకున్న మొదటి సంవత్సరంలో ఎక్కువ, లూప్ వేయించుకున్న సంవత్సరం తరువాత లూప్ పిఫలమై గర్భం రావడం తక్కువ. లూప్ వుండగా గర్భం వచ్చిన వారిలో గర్భం నిలవడం తక్కువ. అందుకనే లూప్ వుండగా గర్భం వచ్చిన వారికి మూడు నుంచి ఆరు నెలల్లో గర్బస్రావం జరిగిపోతూ వుంటుంది.

లూప్ వుండగా గర్భం వచ్చినవాళ్ళు ఆ గర్బాన్ని వుంచుకోవాలని ఆశించినప్పుడు మొదటి 3-4 నెలల్లోనే లూప్‌కి ముడివేయబడి వున్న నైలాన్ దారాలని పట్టుకుని నిదానంగా బయటికి లాగివేయాలి ఇలా లూప్‌ని గర్భకోశం నుంచి లాగివేయడం వల్ల గర్భం నిలిచే అవకాశం ఎక్కువ.

గర్భం వచ్చినప్పుడు నిదానంగా లూప్‌ని బయటకు లాగివేయడం కుదరనపుడు దానిని అలాగే వుంచివేసి గర్భాన్ని కొనసాగనివ్వవచ్చు. లూప్ గర్భాశయంలో వుండగా గర్భాన్ని కొనసాగించడం వల్ల పిండంలో ఎటువంటి అంగవైకల్యం కలగడం గాని, జన్యుదోషం ఏర్పడటం గాని జరగదు. లూప్‌ని అలాగే వుంచేసి గర్బాన్ని కొనసాగించడం వల్ల గర్బస్రావం ఏ సమయంలోనైనా జరిగి పోవచ్చు. అయితే అందరిలో గర్భస్రావం జరిగి తీరాలని లేదు. ఒకవేళ వచ్చి, లూప్‌ని తొలగించడం కుదరనప్పుడు ఆ స్త్రీ గర్భం కొనసాగించడానికి ఇష్టపడకపోతే అబార్షను చేసి గర్భంలో ఎదుగుతున్న పిండాన్ని, దానితో పాటు లోపల వుండిపోయిన లూప్‌ని తీసివేయవచ్చు. అంతేగాని ఆ స్త్రీకి గర్బాన్ని కొనసాగించి మానసిక వేదనని కలిగించ నవసరం లేదు.

అరుదుగా కొందరికి గర్బం గర్భాశయంలో కాకుండా అండం ప్రయాణించే ఫెల్లోఫియన్ ట్యూబులలో అండ వాహికలలో ఏర్పడుతుంది. అలా ఏర్పడిన పిండం అండవాహికల్లోనే ఎదుగుతుంది. పిండం ఎదుగుతున్నపుడు ఫెల్లోఫియన్ ట్యూబు పగిలిపోయి ప్రాణాపాయం కలగవచ్చు. గర్భాశయంలో కాకుండా ఫెల్లోఫియన్ ట్యూబులలో (అండవాహికల్లో) గర్భం వచ్చే సంఘటనలు లూప్ వేయించుకున్న వాళ్లల్లో మామూలుగా కంటే ఆరు రెట్లు ఎక్కువ. దీనికి ముఖ్య కారణం లూప్ వల్ల గర్భాశయంలో పిండం నిలవడానికి అనుకూల పరిస్థితులు లేకపోవడమే. అందువల్ల అండంతో కలయిక పొందిన వీర్యకణం అండంగా తయారై ఫెల్లోఫియన్ ట్యూబులో పెరగా లనుకుంటుంది.

లూప్ దానంతటకదే జారిపోతుందా ?

లూప్ వేయించుకున్న వారిలో నూటికి 2 నుండి 10 మందిలో లూప్ వేయించుకున్న మొదటి సంవత్సరంలోనే దానంతట కదే జారిపోతుంది. అయితే ఒక సంవత్సరంపాటు జారిపోకుండా నిలిచిన లూప్ రెండవ్, మూడవ సంవత్సరంలో జారిపోవడం అరుదు.

లూప్ జారిపోయింది కదా అని మళ్ళీ లూప్ వేస్తే వారిలో అధిక సంఖ్యాకుల్లో తిరిగి లూప్ జారిపోవడానికి అవకాశం వుంది. లూప్ జారిపోవడం అనేది ముఖ్యంగా పిల్లలు పుట్టిన తల్లుల్లో కంటే అసలు పిల్లలు పుట్టని వారిలో ఎక్కువ.

లూప్ ముఖ్యంగా బహిష్టు సమయంలో బహిష్టు స్రావంతో జారిపోతుంది. కాన్పు అవగానే లూప్ వేయించుకున్న వారిలో మూడవవంతు మందిలో లూప్ జారిపోవడం ఎక్కువ. లూప్ దానంతట కదే జారిపోవడం నూటికి ఇరవై మంది స్త్రీలు గుర్తించగలుగుతారు. అయితే నూటికి 80 మంది లూప్ పడిపోయిందనే గమనించరు. అందుకని లూప్ వేయించుకున్న వారు ప్రతీసారి బహిష్టుస్తావం అయిపోయిన తరువాత యోని మార్గంలో వ్రేలు పోనిచ్చి గర్బాశయకంఠం (సెర్విక్స్ దగ్గర లూప్ దారాలు తగుతున్నదీ లేనిదీ గమనించడం మంచిది. అలా చూసుకోవడం వల్ల లూప్ వున్నదీ పడిపోయినదీ తెలుసుకుని గర్భం రాకుండా జాగ్రత్త పడవచ్చు.

వేసిన లూప్‌ని ముందుగా ఎందుకు తీసివేయవలసి వస్తుంది ?

లూప్ వేయించుకున్న వారిలో నూటికి 5-20 మందికి అధిక రక్తస్రావం అవడం, పొత్తికడుపులో నొప్పి రావడం వుంటాయి. రక్తస్రావం ఆగకపోయినా, పొత్తికడుపులో నొప్పి తగ్గకపోయినా లూప్ తీసివేయవలసి వస్తుంది. సాధారణంగా ఇటువంటి బాధలు లూప్ వేసిన మొదటి సంవత్సరంలోనే ఎక్కువ కనబడతాయి. అందుకని లూప్ తీసివేయవలసి రాఫడం ఎక్కువగా మొదటి సంవత్సరంలోనే ఎక్కువ. తరువాత సంవత్సరాలలో బాధలూ తక్కువే. లూప్ తీసివేయవల్సిన అవసరం రావడం కూడా తక్కువే.

లిప్పీస్ లూప్ కంటే కాపర్ లూప్ ఎందుకని మంచిది ?

లిప్పీస్ లూప్ వేయించుకున్న 4 శాతం మందికి గర్భం రావడం వుంటుంది. అదే కాపర్ -టి 200 లూప్ వేయించుకున్న 2.5 శాతం మందిలో, కాపర్ -టి 220 వేయించుకున్న వారిలో 1.5 శాతం మందిలో, మల్టీ లోడ్ సి.యు 250 లూప్ వేయించుకున్న 0.8 శాతం మందిలోనే గర్భం రావడం జరుగుతుంది. లిప్పీస్ లూప్ వేయించుకున్న స్త్రీలలో బహిష్టు సమయంలో రక్తస్రావం అధికంగా వుంటుంది. అదే కాపర్ -టి లూప్ గాని, మల్టీలోడ్ సి.యు. 250 లూప్ గాని అయితే బహిష్టు సమయంలో రక్తస్రావం తక్కువ అవుతుంది.

బహిష్టు సమయంలో లూప్ జారిపోవడమనెది లిప్పీస్ లూప్ వేయించుకున్న 11 శాతం మందిలో జరుగుతుంది. కాపర్ -టి 200 లూప్ 6.3 శాతం మందిలోనూ, కాపర్ -టి 220 లూప్ 6.3 శాతం మందిలోనూ, మల్టీలోడ్ సి.యు 250 లూప్ 2.2 శాతం మందిలోనూ జారిపోవడం జరుగుతుంది.

అధిక రక్తస్రావం అవడం వల్లనో, పొత్తికడుపులో నొప్పి అనిపించడం వల్లనో లూప్ తీసివేయవలసి రావడం లిప్పీస్ లూప్ విషయంలో 8-4 శాతం మందిలో జరుగగా, కాపర్-టి 200 లూప్ 6.4 శాతం మందిలోనూ, కాపర్ -టి 220 లూప్ 5.3 శాతం మందిలోనూ, మల్టీలోడ్ సి.యు 250 లూప్ 2.4 శాతం మందిలోనూ తీసివేయవలసి వస్తుంది.

లిప్పీస్ లూప్ వెయించుకున్న స్త్రీలలో 69 శాతంమంది సంవత్సరాల తరబడి హాయిగా ఉంచుకుంటారు. కాపర్-టి 200 లూప్ వేయించుకున్న 77 శాతం మంది, కాపర్ -టి 220 లూప్ వేయించుకున్న 82 శాతం మంది మల్టీలోడ్ సి.యు. 250 లూప్ వేయించుకున్న 90 శాతం మంది నియమిత కాలం పూర్తిగా ఉంచుకోగలుగుతారు. వారికి ఎటువంటి బాధగాని, దుష్పలితాలుగాని కనబడవు.

ఈ రకంగా చూసినట్లయితే లిప్పీస్ లూప్ కంటే కాపర్ లూప్ చాలా క్షేమకరం. కాని లిప్పీస్ లూప్ కంటే కాపర్ లూప్ ఖరీదు ఎక్కువ. అంతే కాకుండా ప్రతీ రెండు మూడు సంవత్సరాలకి ఒక పాత లూప్ ని తీసివేసి క్రొత్త లూప్ ని వేయవలసి వస్తుంది ఏమైనా లిప్పీస్ లూప్ కంటే కాపర్ లూప్ ఎక్కువ ప్రయోజనకారి.

* * *