కుటుంబ నియంత్రణ పద్ధతులు/డీప్ ఎక్స్ రే పద్ధతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

14. డీప్ ఎక్స్ రే పద్ధతి

అందానికి మారుపేరు ఛాయాదేవి అని చెప్పుకోవచ్చు నేమో! అంత చార్మింగ్‌గా ఉండే ఛాయాదేవికి నిండా యిరవై సంవత్సరాలైనా నిండకుండానే పెళ్ళి అయిపోవడము, ఇద్దరు పిల్లలు పుట్టేయడము కూడా అయిపోయింది. ఇంతటితో పిల్లలు పుట్టకుండా పుల్‌స్టాప్ పెట్టేయాలని నిశ్చయించుకున్నది. ఇంజక్షన్ సూది అంటేనే అదిరిపడే ఛాయాదేవి మనసులో ఆపరేషన్ అనే భావం రాగానే బెదిరిపోయింది. ఆపరేషనుకి బదులుగా మరో మార్గం లేదా అని ఆలోచిస్తూ వుండగా ఎవరో చెప్పినమాట ఒకమాట ఎంతో ఊరట కలిగించింది. వారు చెప్పిన ప్రకారము పిల్లలు వద్దనుకుంటే ఆపరేషను లేకుండా ఆపుచేయవచ్చు. అంతేకాదు, పిల్లలు పుట్టడము ఆగిపోవడముతోపాటు నెల నెలా వచ్చే బహిస్టులు కూడా లేకుండా అయిపోతాయి. పిల్లలతో, నెల నెలా బహిస్టులతో సతమతమయ్యే స్త్రీలకు ఇంతకంటే మంచిమాట మరొకటి ఏమి ఉంటుంది? ఇలా ముచ్చటపడిపోయిన ఛాయాదేవికీ ముడుపు చెల్లించుకుని ఇక ముందు ముట్లు లేకుండానూ, మూడవసంతానంమాట లేకుండానూ కరెంటు పెట్టించుకుని వచ్చింది. ఇంతముచ్చటపడిన ఛాయాదేవికి మూడుపదుల వయస్సు నిండకముందే ముసలితనం వఛ్ఛేసింది. ఇరవైఅయుదు సంత్సరాల ఛాయాదేవిలో అరవై అయిదు సంవత్సరాల వయస్సులో ఉండే అనారోగ్యం వచ్చేసింది. ముఖంలో మొన్నీమధ్య వరకు ఉన్న బ్యూటీ లేదు. రక్తహీనతతోపాటు మొఖం పాలిపోయి కళావిహీనంగా వుంది. వంకీలు తిరిగేజుట్టు ఊడిపోయి ఉత్త బోడిగుండుగా కాబోతుంది. నడుములో ఓపికలేదు. నడకలో ఊపులేదు. చార్మింగ్ లేడీ అయిన ఛాయాదేవి చేవలేకుండా అయిపోయింది.

ఛాయాదేవి అలా అయిపోవడానికి కారణం ఆమె కరెంటు అంటూ చేయించుకున్న చికిత్సే కారణం దీనిని డీప్ ఎక్సరే ట్రీట్ మెంటు అని, రేడియేషన్ చికిత్స అనీ అంటారు.

ముప్పు తెచ్చే డీప్ ఎక్స్ రే

డీప్ ఎక్స్ రే చికిత్స కేవలం కేన్సర్ వచ్చినప్పుడు కేన్సర్ కి సంబంధించిన పుండుని మాడ్చివేయడానికి ఉపయోగిస్తారు. ఈ డీప్ ఎక్స్ రే కిరణాలు కేన్సర్ కణితిని కాకుండా మామూలుగా ఆరోగ్యకరంగా ఉండేకణాలని కూడా మాడ్చివేస్తాయి. ఇలాంటి గుణం ఉండబట్టే అరుదుగా కొందరు డీప్ ఎక్స్ రేని ఉపయోగించి గర్భకోశాన్ని, అండా శయాల్ని ఎప్పటికీ పని చేయకుండా అణచివేస్తున్నారు. దీనివల్ల ఇక గర్బం రావడం కాని, బహిస్టులు కలగడంగాని ఉండవు.

ట్యూబెక్టమీ ఆపరేషను బదులుగా డీప్ ఎక్స్‌రే పెట్టించుకోవచ్చా?

ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్స్ రే ట్రీట్ మెంటు పూర్తిగా తప్పుపద్దతి, డీప్ ఎక్స్‌రేగాని, రేడియం సూదులు గాని, కోబాల్టు ట్రీట్ మెంటుగాని ఏవి అయినప్పటికీ అవన్నీ కేవలం కేన్సర్ వచ్చినప్పుడు చికిత్సగా ఉపయోగించవలసిందే తప్ప, ఆరోగ్యకరంగా ఉండే టిస్యూలోని శరీరభాగాలని మాడ్చివేయడానికి ఏ మాత్రం ఉపయోగించరాదు. ఒక సీనియర్ రేడియాలజీ ప్రొపెసరు ఈ విషయంపై స్పష్టంగా వివరించి చెబుతూ డీప్ ఎక్సరే చికిత్సని కుటుంబనియంత్రణ ఆపరేషన్లకి బదులుగానూ, అబార్షనులు అయ్యేటట్టు, బహిస్టులు పూర్తిగా లేకుండా చేసేటట్లుగానూ ఉపయోగించడం చాలా ప్రమాదకరం. వీటికొరకు డీప్ ఎక్సరే ఉపయోగించడంవల్ల వచ్చే మామూలుగా కలిగే బాధలు అటుంచి, కేన్సర్ లేనివారికి కేన్సర్ కలిగేటట్లు చేయడమవుతుందని వివరించారు.

డీప్ ఎక్సరేవల్ల కేన్సర్ ఎందుకు వస్తుంది?

డీప్ ఎక్సరేని కేన్సర్ వచ్చినప్పుడు అది నివారింప బడడానికి చికిత్సగా ఉపయోగిస్తారుకదా, మరి దానివల్లనే ట్యూబెక్టమీ ఆపరేషనుకి బదులుగా ఉపయోగించినపుడు కేన్సర్ ఎందుకు రావాలని కొందరు అడుగుతూ వుంటారు. కాని ఏ ఎక్సరే కిరణాలకి కేన్సర్ కణుతులను మాడ్చివేసే శక్తి వుందో, వాటికే కేన్సర్‌ని కలిగించే గుణం కూడా ఉందని తెలుసుకోవాలి. అందుకనే మామూలు పరిశ్రమలలో రేడియంతో కాని, ఎక్సరేలతోకాని పనిచేసే వాళ్ళలో వాటి ప్రభావంవల్ల కేన్సర్ ఎక్కువగా వస్తూ వుంటుంది. న్యూయార్క్‌లోనూ, న్యూ జెర్సీలోనూ చేతి గడియారాల పరిశ్రమలలో గడియారాల ముల్లులకు, అంకెలకు రేడియం పెయింట్ చేసే పనివాళ్ళలో ఎముకలకి సంబంధించిన కెన్సర్ జబ్బు ఎక్కువగా కనబడుతుంది. కారణం రేడియం కిరణాలు శరీరంలోకి ప్రవేశించి హాని కలిగించడమే. అదే విధంగా హీరోషిమా, నాగసాకిల మీద ఆటంబాంబు పడినప్పుడు ఆ ఎక్స రే కిరణాలు తగిలిన ఎందరో ప్రజలు రక్తంలోని కేన్సర్ జబ్బులకి గురికావడం జరిగింది. అడే విధంగా ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్సరే ట్రీట్ మెంటు చేయించుకుంటే ఆరోగ్యకరమైన గర్భాశయ కణాలలో కేన్సర్‌కి సంబంధించిన లక్షణాలు నిదానంగా కొంతకాలానికి ప్రారంభమవడానికి అవకాశం ఉంది.

డీప్ ఎక్సరే చికిత్స చేయించుకున్న వాళ్ళలో గర్భాశయానికి కేన్సర్‌వచ్చినవాళ్ళు ఉన్నారా?

ఒక సీనియర్ రేడియాలజీ ఫ్రొఫెసర్ పరిశీలన ప్రకారం ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్సరే పెట్టించుకున్న అధిక శాతం స్త్రీలల్లో గర్భాశయ కంఠానికి గాని, గర్భాశయానికిగాని కేన్సర్ రావడం గమనించడం జరిగింది.

ట్యూబెక్టమీ ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్సరే చికిత్సని గైనకాలజిస్టులుగాని, రేడియోలజిస్టులు గాని ఆమోదించడం జరిగిందా?

ఈ పద్ధతిని వీరు ఆమోదించకపోవడం అటుంచి అసలు చేయడం చాలా అనర్ధదాయకం అని నిర్ధారించారు. దానికి కారణం ఇటువంటి చికిత్స వల్ల కేన్సర్, కలిగే అవకాశాలు యెక్కువగా ఉండటమే. అందుకనే అన్ని హంగులు ఉండి రేడియం చికిత్స చేసే కేన్సర్ హాస్పటళ్ళలో, అంతమంది పెద్దపెద్ద రేడియాలజిస్టులు ఉండి కూడా ఈ పద్ధతి అవలంబించదం లేదు.

ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్సరే పెట్టించు

కున్న ప్రతీ వాళ్ళకీ కేన్సర్ వస్తుందా ?

అలా ప్రతి వాళ్ళకి కేన్సర్ వస్తుందని చెప్పడం కాదు కానీ, అధిక శాతం స్త్రీలల్లో కొన్ని సంవత్సరాల తరువాత కేన్సర్ బయలుదేరడానికి అవకాశంవుందని చాలా మంది రేడియోలజిస్టుల అభిప్రాయం. కేన్సర్ రావడం అటుంచి , నిదానంగా వాళ్ళల్లో శారీరిక బలహీనత యెక్కువగా కనబడుతుంది. ఆకలి మందగించడం, అలసట అనిపించడం, ఏదో ఒక బాధ తరచు అనిపిస్తూ ఉండటం ఉంటాయి. ముఖ్యంగా డీప్ ఎక్సరేవల్ల యెముకలు దెబ్బ తినడం, రక్త కణాల తయారీ తగ్గిపోవడం దానివల్ల రక్తహీనత వుంటాయి. ఈ లక్షణాలు కొందరిలో త్వరగా కనబడితే మరికొందరిలో మరికాస్త ఆలస్యంగా కనబడతాయి. కొందరిలో దీనివల్ల నష్టాలు విపరీతంగా కనబడితే, మరికొందరిలో చాలా తక్కువ కనపడతాయి. మరీ చిన్న వయసులో, అంటే 20, 25 సంవత్సరాల వయస్సులో ఈ కరెంటు పెట్టించుకొన్న స్త్రీలలో మరింత స్పష్టంగా బాధలు కనబడతాయి. ఇలాంటి చిన్న భాధలు, పెద్ధ బాధలు ఉండబట్టే అనుభవించవలసిన వయస్సుని అనవసరంగా రేడియేషన్ విషమ పరిణామాలతో పాడుచేసుకోకండి అని రేడియాలజిస్టులు వివరించి చెబుతున్నారు.

* * *