కుటుంబ నియంత్రణ పద్ధతులు/శరీర ఉష్ణోగ్రతలో మార్పు- కుటుంబ నియంత్రణ

వికీసోర్స్ నుండి

13. శరీర ఉష్ణోగ్రతలో మార్పు- కుటుంబ నియంత్రణ

అండం విడుదల సమయంలో శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా ఒక డిగ్రీ ఫారన్ హీట్ పెరుగుతుంది. దీనినే ‘బేసల్ బాడీ టెంపరేచర్ ‘ పెరగటం అంటారు.

నెల నెలా సక్రమంగా బహిష్టు అయ్యే స్త్రీలోగాని, కాని స్త్రీలో గాని అండం విడుదల సమయంలో ఇలా ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకని అండం ధర్మామీటరు సహాయంతో చక్కగా గుర్తించవచ్చు. సక్రమంగా బహిష్టులు అయ్యే స్త్రీలో కొన్ని నెలలపాటు వరసగా ‘బేనల్ బాడీ టెంపరేచరు ‘ ని కొలచి నెలలో ఏరోజున ప్రతీసారి ఉష్ణోగ్రత పెరుగుతున్నదో గమనించినట్లయితే కుటుంబనియంత్రణ్ని పాటించే దంపతులు ఆరోజుకి కాస్తముందు, కాస్త తరువాత రతిలో పాల్గొనకుండానో, పాల్గొన్నా ఇతరసాధనాలనీ ఉపయోగించి గర్భం రాకుండా జాగ్రత్త పడవచ్చు.

అండం విడుదల తెలుసుకోవడం కోసం స్త్రీ తాను బహిష్టు అయిన మొదటిరోజునొంచి, తిరిగి బహిష్టు అయ్యే వరకు రోజూ ఉదయంపూట నిద్రనుంచి లేవగానే ధర్మామీటరుని నోటిలో పెట్టుకుని రెండు నిమిషాలు ఉంచుకోవాలి. తరువాత నోట్లోనుంచి ధర్మామీటరుని నోట్లోనుంచి తీసి టెంపరేచరు ఎంత ఉందో ఒక కాగితం మీద నోట్ చేయాలి. టెంపరేచరు చూసుకునే వరకు బెడ్ దిగకూడదు. ఏ పనీ చేయకూడదు. నోట్లో వేడినీళ్ళుగాని, చన్నీళ్ళు గాని పోసుకోవడం చేయకూడదు. అలా నోట్ చేసిన టెంపరేచర్‌ని కాగితం మీద ఆ రోజు తారీఖు వేసి దానికి ఎదురుగా వేయాలి. టెంపరేచర్‌ని నోట్ చేసిన తరువాత ధర్మామీటరుని విదిలించి, పాదరసం నార్మల్ కంటే ఇంకాతక్కువ లెవెల్ ఉండేటట్లుచూసి చన్నీళ్ళతో దానిని కడగి భద్రంగా దాచి పెట్టాలి. ఇలా రోజూ ఉదయం టెంపరేచర్ చూస్తూ తిరిగి బహిస్టు కనబడే వరకు ఆ నెలది నోట్ చేయాలి.

సాధారణంగా మొదట కొద్దిరోజులు శరీర ఉష్ణోగ్రత 97.6 లేక 98 డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది. ఇలా ఉన్న ఉష్ణోగ్రత అకస్మాత్తుగా 98.6 లేక 99 డిగ్రీల ఫారన్ హీట్ కి పెరుగుతుంది. ఈ పెరిగిన ఉష్ణోగ్రత 10 - 12 రోజులు అలాగే కొనసాగుతుంది. తరువాత తగ్గిపోయి రెండు మూడు రోజుల్లో బహిస్టు స్రావం కనబడుతుంది.

అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరిగిన రోజు అండం విడుదలైనదానికి గుర్తు అండం విడుదలైన దగ్గర నుంచి శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణం ఆ రోజునుంచి ప్రొజిస్టిరోన్ హార్మోను మరింత ఎక్కువ ఉత్పత్తి అవడమే.

ధర్మామీటరు సహాయంతో శరీర ఉష్ణోగ్రతని గమనిస్తున్న కొందరిలో ఉష్ణోగ్రత పెరగడానికి ఒక పూట గాని, ఒక రోజు ముందుగాని అంతకు ముందు ఉన్న శరీర ఉష్ణోగ్రత ఒక అరడిగ్రీ పడిపోవడం కనబడుతుంది. సరిగ్గా అండం విడుదలయ్యే ముందు కొందరిలో శరీర ఉష్ణోగ్రత పడిపోయి మళ్ళీ వెంటనే పెరుగుతుంచి. కొందరిలో ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పు కనబడిన రోజున పొత్తికడుపులో నొప్పి అనిపించడం, కొద్ది చుక్కలు రక్తస్రావం అవడం ఉంటాయి. ఇవన్నీ ఆండం విడుదలకి చిహ్నాలే.

ఈ ఉష్ణపట్టికలు (టెంపరేచర్ చార్టులు) వలన ఆ స్ర్రీలలో అండం విడుదల ఎప్పుడు అవుతున్నదీ స్పష్ణంగా తెలుస్తుంది. దానిబట్టి కుటుంబనియంత్రణని పాటించే స్త్రీలు జాగ్రత్త పడవచ్చు అయితే లూప్ వేయించుకున్నవారు, నోటి మాత్రలు వాడేవరు, టుడే వంటి వెజైనల్ టాబ్లెట్టు వాడేవారు, భర్తలు నిరోధ్ వాడేవారు అయినప్పుడు ఉష్ణోగ్రత పట్టిక అవసరం లేదు. సేఫ్ పెరియడ్, క్వాయిటస్ రిజర్వేటస్ పాటించేవారు శరీర ఉష్ణోగ్రతని గమనించి దాని ప్రకారం జాగ్రత్త పడటం మంచిది.

* * *