కుటుంబ నియంత్రణ పద్ధతులు/గర్భస్రావానికి నాటు పద్ధతులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

24. గర్భస్రావానికి నాటు పద్ధతులు

ఎండాకాలము మిట్టమధ్యాహ్నము ఆసుపత్రి నుంచి పిలుపు వస్తే డాక్టర్ ఆనంద్ తన నర్సింగ్ హోమ్‌కి కేసు చూడడానికి వెళ్ళాడు. డాక్టర్ ఆనంద్ యింకా ఆసుపత్రి లోపలికి వెళ్ళకుండానే ఒక యువతి పెట్టే పెద్ద అరుపులు, బాధకి ఓర్వలేక ఏడిచే ఏడుపు వినబడుతోంది. లోపలికి వెళ్ళి చూస్తే 16 సంవత్సరాలయినా నిండని ఒక అమ్మాయి భాధతో మెలికలు తిరిగిపోతూ, చేతితో పొట్ట నొక్కిపట్టుకుని అరుస్తూ కనబడింది. ఆ అమ్మాయిని పరీక్ష చేసిచూస్తే నాలుగు నెలల కడుపు జ్వరం 106 డిగ్రీలు దాకా వుంది. జ్వరంతొ ఒళ్ళు మాడిపోతోంది. కడుపు ముటుకుంటేనే నొప్పి. ఇక ఆమె జననేంద్రియాల విషయం చెప్పనే అవసరంలేదు. ఆమె జననేంద్రియాలు ఎర్రగా వాచిపోయి ముట్టుకుంటేనే ప్రాణం పోయేటంత బాధాకరంగావున్నాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషమ పరిస్థితికి సెక్సు గురించి ఆమెలో వున్న ఆరాటము, అజ్ఞానము కారణము. పదవ తరగతి చదువుతున్న ఈ అరుణకుమారికి ఇప్పుడిప్పుడే సెక్సు గురించి ఆలోచనలు, ఉత్సుకత మొదలెట్టాయి. లేత వయస్సులో వున్న తనకు యీ యవ్వన తొలిదినాల్లో ఒక యువకునితో పరిచయమై అతని మాటలు, చేష్టలు ముగ్దురాల్ని గావించాయి. యవ్వనపు తొలి దినాల వేడిలో సెక్సు గురించి ఆరాటం ఎక్కువగా వుండటం సత్యమే కదా. అటువంటి మానసికోద్రేక స్థితిలో అరుణకుమారి సంయోగము అంటే ఏమిటో, ఆ మధురానుభూతి ఎలా వుంటుందో చవిచూసింది.

దాని ఫలితంగా ఆమె గర్భవతి కావడము జరిగింది. ఆమె గర్భవతి అయిందని తెలుసుకోగానే ఆ యువకుడు పలాయనం చిత్తగించాడు. చేసేదిలేక వివశురాలయిపోయి సరైన డాక్టరు దగ్గరికి వెళ్ళడానికి ముఖం చెల్లక అక్రమ పద్ధతుల్లో గర్భస్రావం కొరకు ప్రయత్నిం చేసింది. దానితో పరిస్థితి విషమించి ప్రాణంమీదికి వచ్చి చివరకు డాక్టరు దగ్గరికి రావలసి వచ్చింది.

అక్రమ పద్ధతుల్లో గర్భవిచ్చేదనము జరిగే వాటిని క్రిమినల్ అబార్షన్లు అంటారు. ఈ విధంగా గర్భ విచ్చేదనానికి ప్రయత్నము చేయటం చట్ట విరుద్ధము, నేరమూను. ఇటువంటి గర్భ విచ్చేదనాలన్నీ చాలా మోటు పద్దతిలోను అశాస్త్రీయంగా చేయడం జరుగుతుంది. ఇందువల్ల చాలా సందర్భాలలో ప్రాణం పోవడము జరుగుతుంది కూడాను. మన దేశంలో ముఖ్యంగా అక్రమ పద్దతుల్లో గర్భస్రావాలు వితంతువులు, పెళ్ళికాని స్త్రీలు, అప్పుడప్పుడు పెళ్ళిఅయిన పిల్లలున్న కొందరు స్త్రీలు చేయించుకోవడం చూస్తూ వుంటాము. కడుపు పోగొట్టుకోవడానికి ఎవ్వరంతటికి వాళ్ళు మందుబిళ్ళ వేసుకోవడమో, ఫలితము కనబడకపోతే నాటు మంత్రసానులు, దాయాలు దగ్గర్కి వెళ్ళటమో ఛేస్తూ వుటారు. వీళ్ళు కూడా కడుపు పోగొట్టడానికి ఇచ్చే మందులు ఆరోగ్యానికి యెంతో హానికరముగా వుంటాయి. కడుపు పోగొట్టడానికి ఇతరత్రా వీళ్ళు చేసే పనులు యెంతో మోటుగాను, ప్రాణహాని కలిగించేవిగాను వుంటాయి. వితంతువులు, పెళ్ళికాని స్త్రీలు గర్భము వచ్చినప్పుడు వివశులై దిక్కు తోచక యిటువంటి వాళ్ళ చేతులలో పడి ప్రాణము మీదికి తెచ్చుకుంటారు.

కొంతమంది స్త్రీలు గర్భం వచ్చినప్పుడు ఏమయినా బిళ్ళలు వేసుకుంటే గర్భస్రావము జరిగిపోతుందని భావిస్తారు. కాని అది తప్పు అభిప్రాయము. తల్లి ఆరోగ్యానికి ఎట్టి హానీ కలిగించకుండా గర్భము పోయే మందులు లేవు. పెన్నీ రాయిల్, జూనిఫర్, టార్సన్ టాయిన్, ఎస్పియాల్, శానిన్ ఆయిల్ మొదలయిన మందులు గర్భస్రావము జరగడానికి వాడుతూ వుంటారు. సీసముని గర్బస్రావము అవడానికి ఎక్కువగా వాడుతూ వుంటారు. ఈ మందులవల్ల ముందు తల్లి ఆరోగ్యము దెబ్బతింటుంది. చాలా విషమ పరిణామాలు కూడా సంభవిస్తాయి. గర్భము పోవడానికి విపరీత ముగా విరోచనాలు అయ్యె మందు వేసుకుంటారు. దీనివల్ల గర్బము పోవడము ఎలవున్నా ముందు తల్లి పరిస్థితి గల్లంతు అవుతుంది. ఎర్గాట్, క్వినైన్, ప్రత్తిచెట్టు వేరు రసం, పిట్యూటరీ ఇంజక్షన్ కూడా గర్భస్రావము జరగడానికి ఉపయోగిస్తారు. ఇవేవి కూడా పని చేయవు. ఎర్గట్ గాని, పిట్యూటరీగాని కాన్పునొప్పులు వస్తున్నప్పుడు యింకా ఆ నొప్పులను యెక్కువ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాయి. కాని ఆరోగ్యకరముగా వున్న స్త్రీ గర్భముపైన యెట్టి ప్రభావాన్ని కలిగించలెవు. ఇలా కొంతమంది గర్భస్రావము జరగడానికి పచ్చి బొప్పాయి విత్తనాలు, పచ్చి ఆనపకాయ, జిల్లేడుపాలు, కాకర రసము, ఇంగువ రసము, లవంగ రసము మొదలైనవి ఉపయోగిస్తారు.

పెన్సిళ్ళు, జడపిన్నులు !

కడుపు పోగొట్టుకోవడానికి నాటు మంత్రసానులు, ఆయాలులాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయిదారు అంగుళాల పొడవుగల కర్రపుల్లని గర్భకంఠము ద్వారా గర్భకోశములోకి దూరపడము సాధారణముగా చేసేపని. ఈ పుల్లకి ఒక చివర దూదిచుట్టి ఆ దూదిని నల్లజీడిలోగాని, జిల్లేడు పాలలోగాని ముంచి గర్భకోశములోకి నెట్టుతారు. మర్రిపాలు, గన్నేరుపాలు కూడా ఇందుకు ఉపయోగిస్తారు. కొన్ని సంధర్భాలలో ఆర్సనియన్ ఆక్సయిడ్, ఆర్సనిక్ సల్పయిడ్, రేడ్ లెడ్ ఈ దూదికి అంటించి గర్భకోశంలోకి పంపిస్తారు. ఇలా చేస్తే గర్భకోశములో మంట పుట్టి దానివల్ల గర్భస్రావము జరుగుతుంది. అయితే ఈ పద్దతులు చాలా ప్రమాదకరమైనవి. గర్భస్రావము అవడము ఎలా వున్నా ప్రాణము పోయేటంత పని అవుతుంది. కొంతమంది గర్భాశయంలో వున్న పిండాన్ని పాడుచేయడానికని గర్భాశయము లోపలికి తమకి అందుబాటులో వుండే పెన్సిళ్ళు, బ్నలపాలు, కుట్టుకునే సూదులు, దబ్బలాలు, జడపిన్నులు మొదలైనవి దూరుపుతారు. ఒక్కొక్కసారి ఇవి బయటకు రాకుండా లోపలే యిరుక్కుపోయి వుండిపోతాయి. కొందరు జిల్లెడు పుల్లలు, మర్రిచెట్టు పుల్లలు గర్భాశయ కంఠములో దూర్చి వుంచేస్తారు. మరికొందరు గర్భాశయ కంఠము దగ్గర జీడిసొన, జిల్లేడుపాలు, మర్రిపాలు బాగా రుద్ది వదిలిపెడ్తారు. ఇలా చేయడంవల్ల యోని మార్గము, గర్భాశయ కంఠము, గర్భాశయము మండిపోయి వాచిపోతాయి. పుల్లలు, సువ్వలు లోపలికల్ల దూరపబట్టి గర్భాశయకంఠము చీరుకుపోవడము, గర్భాశయానికి కన్నము పడటము అందులో నుంచి జీర్ణకోశం పేగులు యోని ద్వారమునుండి యబటకు రావడము కూడా జరుగుతుంది.

కొంతమంది నాటు మంత్రసానులు రబ్బరు ట్యూబు ఒకటి తీసుకొని, సిరంజిద్వారా గర్భాశయంలోకి సబ్బునీళ్ళు, పొటాషియం పెర్మాంగనేటు నీళ్ళు, లైసాల్ లాంటివి ఎక్కీస్తారు. ఇలా చేయడంవల్ల చాలా విపరీత పరిణామాలు కలుగుతాయి. నాలుగు-ఐదు నెలలు వచ్చిన స్త్రీలల్లో అయితే గర్భస్రావము జరగడానికి ఒక ఇనుపకడ్డీ సన్నటిది తీసుకుని గర్భాశయంలో వుండే ఉమ్మనీరు సంచికి కన్నంపడేటట్లు పొడుస్తారు. ఇంకా కొంతమంది స్త్రీల విషయంలో గర్భస్రావము జరగడానికి ఒక గుండ్రని డబ్బా మూతని ఎర్రగా కాల్చి పొత్తికడుపుమీద వాత గుండ్రముగా తేలే టట్లు పెడతారు. వీటన్నింటివల్ల యెన్నో నష్టాలు, బాధలు వున్నాయి. కాని కడుపువచ్చి వివశురాళ్ళయిన స్త్రీలు ఇవన్నీ గమనించక, వివేకాన్ని కోల్పోయి ఈ అక్రమ పద్దతులు అవలంబించి ప్రాణం మీదికి తెచ్చుకుంటారు.

గర్భవిచ్చేదనము కావలసి వచ్చినప్పుడు సరైన పద్దతిలో చేయించుకోకుండా, అక్రమ పద్దతులు అవలంబించినట్లయితే చాలా నష్టాలు సంభవిస్తాయి. ఇష్టము వచ్చినట్లు మంటపుట్టే పదార్దాలు గర్భకోశములోకి నెట్టినట్లయితే ఆ నొప్పికి, మంటకి తట్టుకోలేక షాక్ వచ్చి ప్రాణాపాయం కలుగుతుంది. పుల్లలు కడ్డీలు దూరిపితే గర్భాశయానికి కన్నం పడటము పెరిడోనైటిస్‌లాంటి ప్రమాదకర పరిణామాలు సంభవిస్తాయి. ఇటువంటి గర్భస్రావాలు చేసినప్పుడు బాక్టీరియా క్రిములు తేలికగా గర్భాశయములోకి చేరడం, త్వరితగతిని వ్యాధిక్రిములు వ్యాపించి ఆస్త్రీ జబ్బుపడటము జరుగుతుంది. దీనివల్ల అమితమైన జ్వరము, షాక్ కలుగుతాయి. అక్రమ పద్దతుల్లో గర్భస్రావము చేయించుకున్న వాళ్ళకి ధనుర్వాతం రావడము పరిపాటి. గర్భచిచ్ఛేదానానికి అవలంబించిన పద్దతులవల్ల గర్భస్రావము జరిగినా, పూర్తిగా పిండము బయటపడకుండా వుండి, రక్తస్రావము అధికంగా అవుతుంది. అధిక రక్తస్రావంవల్ల షాక్ వచ్చి ప్రాణాపాయము కలుగుతుంది.

గర్భస్రావము అవడానికి వాడిన మందులవల్ల వెంటనే ప్రమాదకర లక్షణాలు కనబడకపోయినా నెమ్మది నెమ్మదిగా ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీనికి గుర్తుగా ఆకలి, అరుగుదల సరిగ్గా వుండకపోవడము, నరాల బలహీనత, గుండె బలహీనత మొదలైనవి కలుగుతాయి. దీనివల్ల అనారోగ్యంగా వుండి, చివరికి ఆరోగ్యము క్షీణించి పోతుంది. మందులేకాదు, అక్రమ పద్దతులద్వారా గర్భస్రావము ప్రయత్నించినప్పుడు కూడా తత్కాలికముగా ఒక్కొక్కసారి ఏమీ నష్టం కనపడకపోయినా తరువాత నిదానముగా దానికి సంబందించిన చెడు ఫలితాలు కనపడతాయి.

గర్భవిచ్చిత్తి - ఇంగువ

పచ్చిబొప్పాయిగాని, ఇంగువగాని ప్రతి కేసులో గర్భస్రావముకలిగించవు. అయితే అరుదుగా కొందరిలో వీటివల్ల గర్భము పోవడము జరుగుతుంది. చాలాకేసుల్లో గర్భము పోవడానికి ఇంగువ లాంటివి వేసుకోవడము వల్ల గర్భము పోకపోవడము అటుంచి కడుపులో మంట, నొప్పి వాంతులతో బాధపడిపోవడము జరుగుతుంది. అందుకని బాధాకరమైన ఇటువంటి పద్దతులను అవలంబించడము ప్రమాదకరము. అంతకంటే తేలికగా డి అండ్ సి వంటి చిన్నఆపరేషను ద్వారా అబార్షను చేయించుకోవచ్చు. ఇంతవరకు మనకు అందుబాటులో గర్భము పోవడానికి సరైన మందులులేవు. ప్రోస్టాగ్లాన్డిన్స్ అనే మందు వైద్య పరిశోధనల్లో వుంది. ఇది సరియైన ఫలితాలు ఇస్తుందని వైద్యప్రయోగాల్లో నిర్ధారణ అయిన తరువాత అందరికీ అందుబాటులోకి రాగలదు. ఈనాడు చాలామంది ఏవో బిళ్ళలు వేసుకుంటే గర్భము పోతుందని భావించే కేసుల్లో పరిశీలించి చూస్తే వారికి అసలు గర్భము రావడము అనేది జరిగి వుండదు. చాలామందికి గర్భము రావడము జరగకుండానే బహిస్టులు రాకుండా ఆగిపోతాయి. బహిస్టు రానంత మాత్రాన గర్భము వచ్చినట్లు కాదు. ఇట్లాంటి కేసుల్లో డూయోగైనాన్ వంటి బిళ్ళలు రోజుకి ఒకటి చొప్పున రెండు రోజులు వేసుకుంటే వారం పదిరోజుల్లో మామూలు బహిస్టు స్రావము కనబడుతుంది. నిజంగా గర్భమువస్తే ఈబిళ్ళవల్క గర్భము పోవడము జరగనే జరగదు. కాని ఈ విషయము తెలియక ఏ ఇతర కారణాలవల్ల బహిస్టు ఆగిపోయినా ఈ బిళ్ళలు వేసుకోవడముతో గర్భము పోయిందని భావిస్తూ వుంటారు.

* * *