కుటుంబ నియంత్రణ పద్ధతులు/గర్భస్రావ చట్టము
25.గర్భస్రావ చట్టము
భారత ప్రభుత్వము గర్భస్రావ చట్టాన్ని 1-4-1972 నుంచి అమలులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ చట్టంలోని విషయాలు తెలియక యెందరో గర్భస్రావము చేయించుకోవడము చట్టప్రకారం నేరం కాదని భావిస్తారు. కాని వాస్తవానికి పూర్వం చట్టంలో కంటే ఇప్పటి కొత్త చట్టంలో అబార్షన్ చేయించుకోవడానికి కొన్ని అవకాశాలే విస్తృత పరచటము జరిగింది. పూర్వపు చట్టములో ఒకే ఒక ప్రాతిపదికమీద అబార్షన్ చేయడానికి అవకాశముంటే ఇప్పటి క్రొత్త చట్టం (M.T.P.Act.) ప్రకారం మూడు ప్రాతిపదికలలో ఏదో ఒక దానిమీద అబార్షన్ చేయడానికి అవకాశాన్ని విస్తృతపరచటం జరిగింది. ఎవరైనాసరే కడుపు వద్దనుకుని అబార్షన్ చేయించుకోవాలంటే చట్ట ప్రకారం ఎట్టి అభ్యంతరము లేని విధంగా చట్టము రూపొందించడం జరగలేదు. ఎందుకంటే పుట్టిన ప్రతివ్యక్తికీ జీవించటానికి చట్టప్రకారము ఎలా అర్హత, రక్షణఉందో, అలాగే ఒకసారి గర్భంలో పిండము జీవిగా మారున్నప్పుడు దానికీ చట్టప్రకారము పెరగడానికి, పుట్టడానికి అధికారం వుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో తల్లి శారీరక, మానసిక ఆరోగ్యరక్షణ నిమిత్తమై గర్భస్రావానికి చట్టప్రకారము అనుమతి ఇవ్వడము జరిగింది.
చట్టం ఆమోదించిన కారణాలు
మన దేశములో చట్టప్రకారముగా ప్రత్యేకమైన మూడు పరిస్థితుల్లోనే గర్భస్రావము చేయించుకోవచ్చు. అందులో మొదటిది తల్లి ఆరోగ్యం రక్షణ దృష్ట్యా గర్భస్రావం చేయడము. గుండెజబ్బు వుండటమువల్లగానీ, గుర్రపువాతం రావడంవల్లగానీ, ఇతరత్రా ఏ వ్యాధివల్లగానీ తల్లికి ఆ గర్భము వుండటమువల్ల ప్రాణహాని జరిగేటట్లయితే ఆమెకు తప్పక గర్భస్రావము చేయవచ్చు. పూర్వం చట్టంలోకూడా ఈ సదుపాయం కలిగించడం జరిగింది.
పిండ నిర్మాణంలో లోపం:- కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పుట్టబోయే బిడ్డ శారీరకంగా అవిటివాడుగానూ, మానసికంగా సక్రమంగా లేకుండా ఉండేటట్లయితే, అటువంటిబిడ్డ బాధపడటంకన్నా పుట్టకుండా ఉండటము మంచిది. గర్భస్రావము చేయడం ద్వారా అటువంటి బిడ్డ కలగకుండా చేయడానికి చట్టం అంగీకస్తున్నది. ఉదాహరణకి ఒక స్త్రీ గర్భవతిగా వున్నప్పుడు డీప్ ఎక్స్‌రే ట్రీట్ మెంట్ పొందినట్లయితే గర్భంలో వున్న బిడ్డ అవిటితనముతోనూ, వికృతంగా జన్మించడానికి ఆస్కారం వుంది. అదే విధంగా ఒక స్త్రీ L.S.D. ఎక్కువగా ఉపయోగిస్తూ వుంటే సక్రమమైన బిడ్డ పుట్టకపోవచ్చు. అందుకని యిటువంటిదానికి ఆస్కారం లేకుండా వుండడానికి చట్టములో గర్భస్రావానికి అంగీకరించడం జరిగింది. అయితే గర్భస్రావం చేయబోయే ముందు డాక్టర్ ఇందుకు తగిన ఆధారాల్ని చూపించాలి.
మానసిక ఆందోళన:_ ఒకవేళ ప్రస్తుతం వున్న కడుపు ఆస్త్రీకి అమితమైన మానసిక ఆందోళనని కలిగించినా, దానివల్ల మానసికంగా, శారీరకంగాకృంగికృశించిపోయేందుకు కారణభూతమయ్యేటట్లయితే డాక్టరు తగిన నిర్ణయం తీసుకొని గర్భస్రావము చేయవచ్చు. ఈ మానసిక ఆందోళన ఒకసారి వుండవచ్చు_ మరొకసారి లేకపోవచ్చు. కడుపు వున్నప్పుడు వుండవచ్చు, కడుపు తీసేసిన తరువాత లేక పోవచ్చు. కావాలనుకున్నప్పుడు వెంటనే నిర్దారణ చేసుకోవడానికి వీలులేనిది. అందుకని పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కానివాళ్ళు కానీ గట్టిగా గర్భం వద్దనుకున్నప్పుడు డాక్టరు ఈ మానసిక ఆందోళన అనే కారణము మీద గర్భస్రావము చేయడానికి అవకాశము లభించింది. అంతే గాని గర్భం వద్దనుకున్న ప్రతీ స్త్రీ అబార్షను చేయించుకోవడానికి అవకాశము కల్పించలేదు. అయితే ఈ మధ్య ఈ చట్టంలో చేసిన కొన్ని సవరణలలో కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో గర్భస్రావాన్ని కూడా ఒక పద్ధతిగా ఆమోదించడము జరిగింది. ఇక అవివాహిత స్త్రీలు, వితంతువులు గర్భం దాల్చడము జరిగితే వారు గర్భము మద్దనుకుంటే "మానసిక ఆందోళన“ అనే క్లాజు ప్రకారముగానే గర్బస్రావము చేయించుకోవాలి.
గర్భస్రావం - గర్భనిరోధక మాత్ర!
ఎవరైనా వివాహిత స్త్రీ తాను గర్భనిరోధకమాత్ర వేసుకుంటున్నా గర్భము వచ్చిందని, ప్రభుత్వంవారు కుటుంబ నియంత్రణ కావాలంటున్నారు. కనుక తనకి గర్భస్రావము చేయమని అడిగితే చట్టప్రకారముగా ఆస్త్రీకి గర్భస్రావము చేయడానికి అవకాశములేదు. ఎందుకంటే చట్టములో కుటుంబ నియంత్రణ పద్దతుల్లో ఒక్కటిగా గర్భస్రావాన్ని పొందుపరచలేదు. కాని ఆస్త్రీ గర్భ నిరోధక మాత్రలు వాడినా గర్భము వచ్చింది ఎలాగ అని మానసికంగా కృశించిపోయేటట్లయితే ఆమానసిక కారణము మీద ఆమెకు గర్భస్రావము చేయవచ్చు. అలాగే ఒక అవివాహిత స్త్రీ తాను గర్భనిరోధక మాత్రలు వాడుతున్నా గర్భమువచ్చిందని వాపోతే మాత్రము డాక్టరు గర్భస్రావం చేయవచ్చు. ఇక్కడ గర్భ నిరోదక మాత్రల గురించికంటే ఆమె మానసిక వేదన ముఖ్యం గనుక, ఆమె అసలు కారణం చెప్పినా, ఆమె వేదనని తీసివేయడానికి, గర్భస్రావం చేయడానికి చట్టం అంగీకరించింది.
కొన్ని ఇతర దేశాల్లో కుటుంబ గౌరవము నిలబెట్టడానికి, పిల్లలు ముగ్గురు - నలుగురికంటే ఎక్కువ వున్నారంటేనూ, వారికి వయస్సు 18 సంవత్సారాలకంటే తక్కువ వుంటేనూ, ఒక స్త్రీకి 45 ఏళ్ళు దాటి ఇక పిల్లలు అనవసరమను కుంటేనూ గర్భస్రావము చేయడానికి చట్టంలో అనుమతి పొందుపరచి వున్నది. కాని ఇలాంటి కారణాలు మనదేశంలో ఒప్పుకొనక “మానసిక వేదన“ అన్న దాంట్లో డాక్టరు నిర్ణయానికి వదలడమైనది.
గర్భస్రావం ఎన్ని నెలల వరకు చేయవచ్చు!
చట్టం ప్రకారము గర్భస్రావము చేయడానికి ఇంగ్లీషు వైద్యం చేసే డాక్టర్లు మాత్రమే అర్హులు. హోమియోపతి, ఆయుర్వేద, యునాని మొదలైన వైద్యులు అర్హులు కారు. అదేవిధంగా ఆర్.యం.పి. పి.యం.పి లకి గర్బస్రావం చేయడానికి అర్హతలేదు. అల్లోపతి డాక్టర్లు గర్భస్రావం చేయడానికి రాష్ట్ర వైద్యమండలి నుండి ప్రత్యేకంగా అనుమతిపొంది తమ పేరు రిజిష్టరు చేయించుకోవాలి.
మూడు నెలలలోపు కడుపు వున్న వాళ్ళకి గర్భస్రావము చేయడానికి డాక్టరు తనంతట తాను నిర్ణయం తీసికొని గర్భస్రావం చేయవచ్చు. కాని మూడు నెలలకి పైబడి అయుదునెలలలోపు కడుపువున్నప్పుడు గర్భస్రావము చేయడానికి చట్టము ప్రకారము ఇద్దరు డాక్టర్లు కలిసి నిర్ణయము తీసుకోవాలి. అయిదు నెలలుదాటిన గర్భిణీ స్త్రీకి గర్భస్రావం చేయబడదు. కాని కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అయిదు నెలలు తరువాత కూడా గర్భస్రావము చేయడానికి చట్టము అంగీకరించింది.
గర్భస్రావము చేయడానికి ముందు డాక్టరు ఆ స్త్రీ అంగీకారము తీసుకోవాలి. ఆమెకు గర్భస్రావము చేయడానికి భర్త అంగీకారము అవసరంలేదు. స్త్రీ ఒప్పుకుని, ఆమె భర్త ఒప్పుకొనకపోయినా గర్భస్రావము చేయవచ్చు. ఒక వేళ ఆ స్త్రీ మైనరు అయినా, పిచ్చిది అయినా భర్త గార్డియన్ అనుమతి కావాలి.
అనుమతి పొందిన ఏ ప్రైవేట్ నర్సింగు హోమ్‌లో అయినా, గవర్నమెంటు హాస్పిటల్‌లో అయినా గర్భస్రావాన్ని చేయించుకోవచ్చు. గర్భస్రావము చేయడానికి కావలసిన శిక్షణ ఇవ్వడానికి చట్టంలోఅవకాశం నిర్దేశింపబడి ఉంది. అందుకని శిక్షణ నిపుణత వున్న డాక్టర్ల ద్వారానే గర్భస్రావము చేయబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోను గర్భస్రావము చేయించుకున్న స్త్రీ పేరు బయట పెట్టబడదు. హాస్పిటల్‌లో ఒకే ఒక రిజిష్టరులో వారి పేరు వ్రాయబడి వుంటుంది. ఇక తక్కిన వాటన్నింటి మీద కోడ్ నంబరు మాత్రమే వాడబడుతుంచి. చివరికి కేస్ షీట్ మీద కూడా పేరు వ్రాయబడదు. గర్భస్రావం - మరికొన్ని వివరణలు
ఒక స్త్రీకి చట్టము ప్రకారము ఎన్నిసార్లు గర్భస్రావము చేయడానికి అవకాశము వుందని సందేహము కలగవచ్చు. చట్టంలో ఇన్నిసార్లు మాత్రమే గర్భస్తావం చేయాలని హద్దు పెట్టలేదు. ఆమెకు వచ్చిన మానసిక, శారీరక పరిస్థితినిబట్టి ఎన్ని సార్లు అయినా గర్భస్రావం చేయవచ్చు.
గర్భస్రావం చేసిన తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయించుకోమని స్త్రీని ఒత్తిడి చేయటానికి చట్టం ప్రకారం అవకాశం లేదు.
కొన్ని సందర్భాలలో చట్టం ప్రకారం స్త్రీకి గర్భస్రావము చేయించుకోవడానికి అర్హత ఉన్నా గర్భస్రావం చేయడానికి తగిన ఆరోగ్య పరిస్థితి లేకపోతే డాక్టరు గర్భస్రావం చేయడానికి నిరాకరించవచ్చు. కాని దానికి తగిన కారణాలు డాక్టరు చూపించాలి. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ మత సంబంధంగా ఏ డాక్టరు గర్భస్రావం చేయడానికి నిరాకరించరాదు. అలా చేసిన పక్షంలో స్టేట్ మెడికల్ రిజిష్టరు నుంచి ఆ డాక్టరు పేరు తీసివేయడం, గుర్తింపు రద్దు చేయడము జరుగుతుంది.
చట్టం ప్రకారముగా ఒక నిర్దిష్టమైన గర్భస్రావ పద్దతిని చేయాలని అనలేదు. డాక్టరు ఏది సక్రమమైన గర్భస్రావ పద్దతి అని భావిస్తాడో ఆ పద్దతి ప్రకారము గర్భస్రావము చేయవచ్చు. పెళ్ళి కాకుండా, కడుపు వచ్చిన వాళ్ళు, వితంతువులు కూడా గర్భస్రావము చేయించుకోవడానికి చట్టప్రకారం అర్హులు. అలాగే విదేశ స్త్రీలు తాత్కాలికముగా మనదేశం వచ్చి ఇక్కడ గర్బస్రావము చేయించుకోవడానికి అభ్యంతరం అడ్డంకు లేదు.
చట్టంలోని భావాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని డాక్టరు గర్భస్రావాన్ని చేయాలి. అలా కాకుండా చట్టంలోని విషయాలకి వ్యతిరేకంగా గర్భస్రావం చేసేటట్లయితే ఆ డాక్టరుకి జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించబడుతుందని చట్టంలో రాయబడింది.
* * *