కుటుంబ నియంత్రణ పద్ధతులు/సక్రమ గర్భస్రావ పద్ధతులు

వికీసోర్స్ నుండి

23. సక్రమ గర్భస్రావ పద్ధతులు

అబార్షను గ్రర్భస్రావం చేయించుకోవటం చట్ట ప్రకారము అనుమతించబడింది. కనుక ప్రభుత్వ ఆసుపత్రిల్లోను, ప్రైవేటు ఆసుపత్రులలోనూ విరివిగా అబర్షన్మూస:ZWJలు చేస్తున్నారు.

కుటుంబ నియంత్రణకొరకు చేస్తున్న గర్భస్రావాన్ని "యం.టి.పి." అంటున్నారు. యం.టి.పి. అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రగ్‌నన్సీ.

యం.టి.పి. ల్లో సాధారణముగా చేసేది క్యూరటాజ్ పద్ధతి. గర్భము వచ్చిన మూడు నెలలలోగా క్యూరటాజ్ పద్ధతి ద్వారా గర్భస్రావాన్ని తేలికగా చేయవచ్చు. ఈ పద్దతి ప్రకారం గర్భస్రావము చేసే స్త్రీకి నొప్పి తెలియకుండా తగిన మత్తు ఇంజక్షను ఇవ్వడము జరుగుతుంది. ఈ ఆపరేషను చాలా సులువైనది. గర్భస్రావము చేయడానికి గర్భాశయ కంఠాన్ని (సెర్విక్స్) సన్నపాటి కడ్డీలతో (డైలాటర్స్) వెడల్పు చేసి, తరువాత క్యూరెట్ అనే పనిముట్టుద్వారా గర్భాశయము లోపల పిండాన్ని గీకి వేయడము జరుగుతుంది. ఈ రకంగా గర్భాశయాన్ని పూర్తిగా క్లీన్ చేసి గర్భాన్ని తొలగించడము జరుగుతుంది. ఈ మొత్తం కొద్ది నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఈ పద్దతి అతి తేలిక, క్షేమకరం అయితే ఇది ఎంత తేలికో, శిక్షణ లేనివాళ్ళు చేస్తే అంత ప్రమాదము జరిగే అవకాశం కూడా ఉంది.

రెండవ పద్ధతి - సక్షను పద్ధతి

ఇందులో గర్భాశయములోనే సన్నటి గొట్టమువంటిది దూర్చి, దానికి ఒక ట్యూబు తగిలించి సక్షనుద్వారా గర్భాశయములో ఉన్న పిండము తాలూకు భాగాలను పీల్చివేసి గర్భాశయాన్ని క్లీన్ చేయడము జరుగుతుంది. ఇది క్యూర్ టాజ్ కంటే తేలికైనది త్వరగా అయిపోతుంది. అయితే కొందరిలో సక్షను చేసినా పూర్తిగా క్లీన్ కాక, క్యూరట్ చేయవలసి వస్తుంది.

మూడవ పద్ధతి- ఇంట్రా ఆమ్ని యాటిక్ ఇంజక్షను పద్ధతి:-

కొందరికి నాలుగు అయిదు నెలలు నిండిన తరువాత అబార్షను చేయించుకోవలసి వస్తుంది. నెలలు ఎక్కువైన అటువంటి స్త్రీలలో పొత్తికడుపు పైనుంచి పొడుగాటి సూది గర్భాశయములోని ఉమ్మనీరు సంచిలోకి పోనిచ్చి అందులోని ఉమ్మనీరుని సిరంజి ద్వారా బయటికి లాగివేయడము జరుగుతుంది. ఉమ్మనీరు (అమ్ని యాటిక్ ఫ్లూయిడ్) వచ్చినంత తీసివేసి అందులోకి సలైనుగాని, 50 శాతం గ్లూకోజ్ కాని 50 సి.సి. నుండి 100 సి.సి. వరకు ఎక్కించడం జరుగుతుంది. ఇలా ఎక్కించిన కొద్ది పూటల్లో కాన్పు నొప్పులు వచ్చి పిండము బయట పడిపోతుంది. ఈపద్ధతిని చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదము కలుగుతుంది.

మూడు నెలలకంటే ఎక్కువ గర్భము ఉన్నప్పుడు కొందరికి కడుపుకోసి సిజేరియన్ లాగా పిండాన్ని తీసివేయడము జరుగుతింది. దీనిని హిస్ట్రాటమీ అంటారు.

యం, టి.పి. ఎక్కువసార్లు చేయించుకోవడము మంచిది కాదు. మాటి మాటికీ చేయించుకుంటే దుష్పలితాలు కలిగే అవకాశము ఉంది.

* * *