కుటుంబ నియంత్రణ పద్ధతులు/గర్భనిరోధక మాత్రలు

వికీసోర్స్ నుండి

3. గర్భనిరోధక మాత్రలు

శ్రీమతి ఉషారాణి ఒక కాలేజీలో లెక్చరర్. ఆమెను చూచి తక్కిన లెక్చరర్స్‌కి అసూయగానూ ఉంటుంది. ఆశ్చర్యంగానూ ఉంటుంది. కారణం ఆమె తన దాంపత్య జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడమే. వివాహమయిన నాలుగు సంవత్సరాలకు దాంపత్య జీవితపు తొలి దినాల్లోని ఆనందానుభూతిని ఎటువంటి బాదరబందీ లేకుండా అనుభవించింది. తరువాత పుట్టిన యిద్దరు పిల్లల్నీ ఎంతో ప్లానుగా పెంచింది. ఆ పిల్లల ఆరోగ్య విషయంలోను, ఆహార విషయంలోను యెంతో శ్రద్ధ వహించింది. ఇలా కాకుండా వివాహమనగానే పిల్లలుపుట్టి, వాళ్ళని సరిగ్గా పెంచలేక, పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరూలేక దాంపత్య జీవితపు ఆనందాన్ని అనుభవించలేని వాళ్ళు ఈ లోకంలో యెంతోమంది వున్నారు. ఇటువంటి స్త్రీలందరికీ సరయిన మార్గం గర్భనిరోధక మాత్ర.

సామాజిక అవసరాలకోసం చేసిన కృషిలో గర్భనిరోధక మాత్ర వైద్యశాస్త్రజ్ఞుల విజయం. 20 వ శతాబ్దపు ప్ర్రారంభంలో స్త్రీ సంక్షేమము కొరకు స్త్రీ స్వేచ్ఛకొరకు గట్టిగా పోరాడిన వాళ్ళలో మార్గరేట్ శానజర్ ఒకరు. ఏ స్త్రీకి అయినా పిల్లలు కలిగే విషయంలో అదుపు చేసుకోగల శక్తీ, స్వేచ్ఛ లేనంతకాలము స్వతంత్రముగల స్త్రీగా మనజాలదు. ఈ అభిప్రాయముతోనే 1930 లో మార్గరేట్ శానజర్ "ప్లాన్డ్ పేరెంటు హుడ్ ఫెడరేషన్" నుండి 2,100 డాలర్లు విరాళంగా సేకరించి డాక్టర్ పింకన్ అతని సహచరుడు జాన్ రాక్‌కి గర్భనిరోధక ప్రక్రియలు కనిపెట్టడానికి సహాయము చేసింది. తరువాత వీరిద్దరి రీసెర్చికి అనేక సంస్థల నుంచి కూడా కొన్ని మిలియన్ల డాలర్లు రాసాగాయి. 1956 లో రాక్ పింకన్ - వీరితో కలసిన మరొక డాక్టర్ సెల్సొగార్సియా మురికి పేటల్లో నివసించే 265 మంది స్త్రీల మీద ఈ గర్భనిరోధక మాత్రలు వాడి సంతృప్తికరమైన ఫలితాలను గమనించాడు. దీనితో "ఉమన్ లిబరేషన్" ఉద్యమములో విప్ల వాత్మకమైన మలుపు వచ్చింది. గర్భనిరోధక మాత్ర కనిపెట్టిన దశాబ్దంలోనే అనేక కంపెనీలు యీ మాత్రలను కొన్ని మిలియన్ల సంఖ్యలో తయారు చేశాయి.

గర్భనిరోధకమాత్ర ఎలాగర్భాన్ని నిరోధిస్తుంది?

మామూలుగా మెదడులో ఉండే పిట్యూటరీ గ్రంధినుండి అండాశయాలని ఉత్తేజపరిచే హార్మోన్లుతయారవుతూ వుంటాయి. ఆ పిట్యూటరీ హార్మోన్ల ఫలితంగా అండాశయాలనుండి గ్రుడ్డు తయారయి విడుదలవడం జరుగుతూ వుంటుంది. అంతెకాకుండా ఈ హర్మోన్లు ఫలితంగా అండాశయాలనుంచి ఈస్ట్రోజన్, ప్రొజస్టిరోన్ హార్మోన్లు త్రయారవుతూ వుంటాయి. ఒకవేళ స్త్రీ గర్భవతి అయినట్లయితే అండాశయంనుంచి విడుదలవుతున్న ప్రొజస్టిరోన్ హార్మోను యెక్కువ మోతాదులో తయారవడము ప్రారంభం అవుతుంది. ఈ ఎక్కువగా తయారయ్యే ప్రొజస్టిరోన్, అక్కడనుంచి తయారయ్యే ఈస్ట్రోజన్ కలిసి పిట్యూటరీ గ్రంధి నుండి అండాశయాలను ఉత్తేజపరిచే హార్మోన్లను తయారవకుండా చేస్తాయి. దాని ఫలితంగా అండాశయాల నుంచి గర్బీణీస్త్రీలో మరొక గ్రుడ్డు విదుదలయ్యే అవకాశం వుండదు. ఈ విషయాన్నే శాస్త్రజ్ఞులు గుర్తించి స్త్రీ బహిష్టు అయిన అయిదవ రోజునుంచే ఎక్కువ మోతాదులో ఈష్ట్రొజన్, ప్రొజస్టిరోన్ మాత్రల రూపములో యివ్వడము జరిగింది. ఈ విధముగా ఈ రెండు హార్మోన్లు గ్రుడ్డుని తయారుచేసే హార్మోన్లను పిట్యూటరీ గ్రంధినుంచి వెలువడకుండా నిరోధించివేస్తాయి. అంతే కాకుండా గర్భనిరోధక మాత్రల ద్వారా యిచ్చే ప్రొజిస్టిరోన్ వల్ల గర్భాశయము కంఠం దగ్గర వుండే పచ్చని పొరదళసరిగా మారి గర్భాశయములోనికి వీర్యకణం ప్రవేశానికి అవరోధము కలిగిస్తుంది. అంతే కాకుండా గర్భాశయము లోపలిపొరను అండము పొదగబడటానికి అనుకూలంగా లేని స్తితిలో ఉంచుతుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో అయినా అండము తయారయి విడుదలయినా ఆండాశయములో అది పిండంగా ఎదగడానికి వీలులేకుండా అయిపోతుంది.

స్త్రీ బహిష్టు అయిన 5 వ రోజునుంచి రోజూ ఒక మాత్ర చొప్పున 21 రోజులు తీసుకోవాలి. 5వ రోజునుంచి అంటే ఎప్పుడు అని అనుమానము కలుగవచ్చు. స్త్రీబహిష్టు స్రావము కనబడినరోజు మొదటి రోజు క్రింద లెక్క కట్టాలి. అక్కడినుంచి లెక్కకట్టి అయిదవ రోజునుంచి గర్భనిరోధక మాత్ర ప్రారంభించాలి. గర్భనిరోధక మాత్ర ఒక నిర్ణీత సమయంలో రోజూ తీసుకోవాలి రాత్రిపూట మొదలెట్టినట్లయితే రాత్రిపూటే తీసుకోవాలి. ఒకరోజు రాత్రిపూట, మరొకరోజు మధ్యాహ్నము యిలా తీసుకోవడం సరయిన విధానము కాదు. రోజూ రాత్రిపూట భోజన్మము చేయగానే గర్భనిరోధక మాత్ర తీసుకోవడము మంచిది. ఆహారము తీసుకున్న తరువాత మాత్ర వేసుకుంటే కడుపులో వికారము కలగడము, తల తిరగడము లాటివి అనిపించవు. ఇలా 21 మాత్రలు వేసుకుని ఆపివేసిన 3 రోజుల్లో బహిష్టు స్తావము కనబడుతుంది. తిరిగి బహిష్టు స్తావము కనబడిన 5 వ రొజు నుంచీ గర్భనిరోధక మాత్ర తీసుకోవటము ప్ర్రారంభించాలి.

కొందరు స్త్రీలు తిరిగి అయిదవరోజునించి గర్భనిరోధక మాత్ర వేసుకోవడము మరిచిపోతూ వుంటారు. అటువంటి అవకాశము లేకుండా 28 మాత్రలు ఉండే ప్యాకెట్లు తయారుచేయబడివున్నాయి. ఈ 28 మాత్రలు ఉండే ప్యాకెట్లు వాడే స్త్రీలు యిక బహిష్టు సమయంలో కూడా బిళ్ళ ఆపే పనిలేదు.

కుటుంబ నియంత్రణ మాత్రలు

కుటుంబనియంత్రణ కొరకు స్త్రీలు రోజు వాడే బిళ్ళలు బహిష్టు స్రావం కనబడిన అయిదవ రోజునుండి వేసుకోవాలి కదా! మరికొందరు బహిష్టు సమయంలోకూడా సంయోగం జరుపుతారు. ఇటువంటి స్త్రీలు బహిష్టు సమయంలో మాత్రలు వాడకపోవడంవల్ల గర్భం రావడానికీ అవకాశం ఉండదా అనే అనుమానం కొందరు వ్యక్తపరుస్తారు.

నెల నెలా ప్రతి బహిష్టుకి అయిదవ రోజునుంచి కుటుంబ నియంత్రణ మాత్రలు వాడే స్త్రీలు బహిష్టు సమయంలో సంయోగం జరపడంవల్ల గర్భం రావడం జరగదు. అందుకని బహిష్టు సమయంలో జరిపినా ప్రత్యేకంగా మాత్రలు వాడనవసరం లేదు. మామూలుగానే ఐదవ రోజునుంచి వాడితే చాలు.

గర్భనిరోధక మాత్ర - కొన్ని అనుమానాలు

గర్భనిరోధక మాత్రలు కొన్ని నెలలపాటు వాడుతున్నా ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటే అప్పుడు మాని వేయవచ్చు. ఈ మాత్రలు కొంతకాలముపాటు వాడుతూ ఉండినట్లయితే, తరువాత పిల్లలు కలగరేమోననే భయము అనవసరము. 75 శాతము స్త్రీలలో ఈ మాత్రలు వాడటము మానివేసిన 2 నెలల్లో గర్భిణీ రావడానికి ఆస్కారము వుంది 90 శాతం స్త్రీలు ఒక సంవత్సర కాలము లోగా గర్భవత్రులవుతారు. స్త్రీలు గర్భనిరోధక మాత్రలు వాడినా, అవి మానివేసిన తరువాత అందరి స్త్రీలలాగానే మామూలుగా గర్భవతులవుతారు. అలాగే గర్భనిరోధక మాత్రలు వాడి ఆపిన తరువాత ఆ స్త్రీలకు పుట్టిన పిల్లలు మామూలు ఆరొగ్యవంతులుగానే వుంటారు. వారిమీద ఆ మాత్రల ప్రభావము ఏమీ వుండదు.

గర్భనిరొధక మాత్రలు - దుష్పలితాలు

మామూలు ఆరోగ్యవంతమైన స్త్రీకి ఈ మాత్రలవల్ల పెద్ద దుష్ఫలితాలు ఏమీ కలగవు. కాని మాత్రలు వాడడము మొదలు పెట్టిన మొదటి రెండు మూడునలల్లో కొన్ని ఒడిదుడుకులు కనపడతాయి. దీనికి కారణము ఆ మాత్రలో వుండే ఈస్ట్రోజన్ హార్మోను. నాలుగు నెలల్లోగా మాత్రల రూపములో యిచ్చే ఈ హార్మోనుల ప్రభావానికి శరీరము సరిపెట్టు కోగలుగుతుంది. 3 నెలల తరువాత కూడా యీ మాత్రలవల్ల చెడు ఫలితాలు కనబడుతూ వుంటే డాక్టరు సలహా పొందడము మంచిది. ఎక్కువమంది స్త్రీలల్లో వీటివల్ల ఎటువంటి చెడు ఫలితాలు కనబడవు మామూలుగా ఇబ్బంది కలిగించే లక్షనాలల్లో కడుపులో వికారము ఒకటి మామూలుగా ఒకటి రెండు రోజులలో యీ ఇబ్బంది తగ్గిపోతుంది. అసలు రాత్రిపూట భోజనము చేయగానే యీ మాత్ర వేసుకుంటే చాలావరకూ ఏ వికారము అనిపించదు లేదా ఒక గ్లాసు పాలలో తీసుకున్నా ఏమీ అనిపించదు.

ఈ మాత్రలు తీసుకొంటున్న కొందరు స్త్రీలల్లో కాళ్ళకి నీరు రావడం, కాళ్ళల్లో కండలు బిగదీసుకున్నట్లు, వక్షోజాలు బరువెక్కినట్లు, ఒళ్ళు బరువెక్కినట్లు అవడము ఉంటాయి. కొందరికి ఒంటికి దురదలు వస్తాయి. ఇలాకాక కొందరు స్త్రీలకు బాగా తలనొప్పి రావడము, ఒళ్ళు తూలినట్లు అవడము, చూపు కనబడటమ లో మార్పు రావడము కలుగవచ్చు. ఇటువంటప్పుడు ఆ మాత్రలు ఆపివేయడము మంచిది. కొందరు స్త్రీలకు తెల్లబట్ట అవడము అనేది ఈస్ట్రోజన్ వల్ల నే కాని ఇతరత్రా వ్యాధి కలిగిగాదు. కొందరు స్త్రీలల్లో ఆకలిపెరగడము, బరువు పెరగడముకూడా వుంటాయి. మరికొందరు స్త్రీలల్లో యీ మాత్రలు వాడుతున్నా బహిష్టుకీ బహిష్టుకీ మధ్య కొద్దిగా రక్తస్రావం కనబడవచ్చు. అది కేవలము ఆ మాత్రలలో ప్రొజష్టిరోన్ హార్మోనుకి సంబంధించిన మోతారు తక్కువలో ఉండుటయే కారణము. ఇటువంటి స్త్రీలు ప్రొజిస్ఠిరోన్ ఎక్కువ ఉండే గర్భనిరోధక మాత్రలు వాడడము మంచిది. అరుదుగా కొందరికి యోనిలో బాగా దురద, మంట కలగడము సంయోగానికి ఇబ్బందికరంగా వుండటము ఉండవచ్చు. అది కేవలం యీ మాత్రల వల్లనే

గర్బనిరోధక మాత్రలవల్ల కేన్సర్ వస్తుందా ?

30 సంవత్సరాల పైగా స్త్రీల వ్యాధులలో చాలా ఎక్కువ మోతాదులో ఈష్ట్రొజన్ హార్మోనును ఉపయోగించడము జరుగుతోంది. యీ రకంగా మందు రూపములో యీ హార్మోన్లు ఇవ్వగా కేన్సర్ వచ్చినట్లు ఎక్కడా రూఢి అవలేదు. కొందరు యీమాత్రలు వాడితే కేన్సర్ వస్తుందేమోనని ఆపోహ పడటానికి ఒక కారణం ఉంది. యీ మాత్రలు వాడుతున్నప్పుడు గర్భాశయ కంఠము దగ్గరవున్న టిస్యూలలో కేన్సర్ వచ్చినపుడు కనబడే మార్పులు కనబడటము జరుగుతుంది. స్త్రీ గర్బవతిగా వున్నప్పుడు కూడా అక్కడి టిస్యూలలో ఇటువంటి కేన్సర్ లక్షణాలే కనబడి, కాన్పు అయిపోయిన తరువాత ఆ లక్షణాలన్నీ పోయి మామూలుగానే మారిపొతాయి. అదే విధంగా మాత్రలు వాడుతున్నంతకాలము కనబడి, ఆ మాత్రలు మానివేయగానే ఆ లక్షణాలు లేకుండా పోతాయి. ఇంకో రకంగా చూస్తే అసలు ఈ మాత్రలు గర్భాశయానికి, వక్షోజాలకు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.

కొందరికి నిషేధింపబడిన మాత్ర

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్నప్పడు ఊప్రితిత్తుల్లో రక్తం గడ్డకట్టి అడ్దు పడినప్పుడు, పక్షవాతం వచ్చినప్పుడు, కళ్ళనరాల్లో రక్తప్రసారం ఆగిపొయినపుడు గుండె జబ్బు ఉన్నప్పుడు, శరీరంలొ కేన్సర్ ఉన్నప్పుడు గర్భనిరొధక మాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఎందుకంటే ఆ మాత్రలలో ఉండే ఈస్ట్రొజను హర్మోను ఆ వ్యాధి ముదరడానికి లేదా తిరగబెట్టడానికి దోహదం చేస్తొంది. పై పరిస్థితుల్లోనే కాకుండా మధుమేహం ఉన్న వాళ్ళు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నవారు, గర్భాశయంలో ఫైబ్ర్రాయిడ్స్ ఉన్నవారు నోటి మాత్రలు వాడకూడదు.

గర్భనిరోధక మాత్రలు పాలు ఇస్తున్న తల్లులు వాడవచ్చా?

గర్భనిరోధక మాత్రల వల్ల తల్లి దగ్గర పాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అందుకని బిడ్ద ఆహారం తీసుకోవడం మొదలుపెట్టే వరకు తల్లి సంతాన నిరోధక మాత్రలు వేసుకోవడం మంచిదికాదు. బిడ్డకు పాలు ఇస్తున్న తల్లులు కనీసం ఆరవ నెలవరకు ఈ మాత్రలు వాడకుండా ఉండటం మంచిది. అయితే కుటుంబ నియంత్రణకి ఇతర పద్ధతులు అవలంబించవచ్చు.

కొన్ని సంతాన నిరోధక నోటి మాత్రలు

'ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ' నే నోటి మాత్రలు అని అంటారు. మర్కెట్టులో ప్రతీ మందుల షాపులోనూ, ప్రభుత్ఫంవారి కుటుంబనియంత్రణ విభాగంలోనూ ఈ క్రింది విధమైన నోటి మాత్రల ప్యాకెట్టులు దొరుకుతాయి. వీటిల్లో వేటినైనా దంపతులు కుటుంబ నియంత్రణని పాటించడానికి వాడవచ్చు.

1.కంబైన్డ్ పిక్ (గవర్న మెంట్ ఆఫ్ ఇండియా) కుటుంబనియంత్రణ నోటి మాత్రలు.

21 బిళ్ళల ప్యాకెట్టులు

28 బిళ్ళల ప్యాకెట్టులు

ఇలా ఈ నోటి మాత్రలు రెండు రకాలు ఉన్నాయి. 28 బిళ్ళల ప్యాకెట్టు ఎలా ఉపయోగించవలసిందీ తరువాత వివరించబడుతుంది.

2. ఓవ్రాల్ (31 బిళ్ళల ప్యాకెట్టు)

3. ఓవ్రాల్ యల్ (21 బిళ్ళల ప్యాకెట్టు)

4. ఓర్ లెస్ట్ 21 బిళ్ళల ప్యాకెట్టు మరియు 28 భిళ్ళల ప్యాకెట్టు

5. ప్రైమోవలార్ - 50 - 21 బిళ్ళల ప్యాకెట్టు

6. ప్రైమోవలార్ ఇ.డి. - 28 బిళ్ళల ప్యాకెట్టు

7. ప్రైమోవలార్ - 30 - 21 బిళ్ళల ప్యాకెట్టు

8. మోనోవలార్
        21 బిళ్ళల ప్యాకెట్టు, 28 బిళ్ళల ప్యకెట్టు

9. ఓప్యులిన్ - 30
      21 బిళ్ళల ప్యాకెట్టు

10. ఆర్ధోనోవిన్ 21 బిళ్ళల ప్యాకెట్టు

11. నారాసైక్లిన్ 22 బిళ్ళల ప్యాకెట్టు

12. లిండియాల్ 22 బిళ్ళల ప్యాకెట్టు

13. ట్రైక్విలర్ 21 బిళ్ళల ప్యాకెట్టు

పైన ఇచ్చిన నోటిమాత్రల లిస్టు మార్కెట్టులొ లభించే అనేకంలో కొన్ని మాత్రమే వీటి 21 బిళ్ళల పాకెట్టుగాని, 22 బిళ్ళల ప్యాకెట్టుగాని బహిష్టు స్రావం కనబడిన 5 వ రోజునుంచి ప్రతి రోజూ రాత్రిపూట ఒకటి చొపున వాడాలి.

8 బిళ్ళల ప్యాకెట్టులు తయారు చేయడంలో ఒక కారణం ఉంది. కొందరికి రోజూ వేసుకుంటే తప్ప మానివేసిన తరువాత తిరిగి 5వ రోజున వేసుకోవాలని గుర్తు రాదు. అందుకని అటువంటి స్త్రీలకి ఇక ఎప్పటికీ మానకుండా సంవత్సరాల తరబడి రోజూ వేసుకునేందుకు 28 బిళ్ళల ప్యాకెట్తులు తయారుచేయబడ్డాయి. ఈ 28 బిళ్ళల ప్యకెట్టులో మొదట 21 బిళ్ళలే ఈస్ట్రోజన్, ప్రొజస్టరన్ హార్మోన్లకి సంబంధించినవి. మిగతా 7 బిళ్ళలు కేవలం ఐరన్ లెదా లాక్టొజ్ బిళ్ళలు. సాధారణంగా 21 ప్యాకెట్టు బిళ్ళలు వాడే స్త్రీలు ఆ ప్యాకెట్టు పూర్తి అవగానె ఆపివేస్తారు. అవి ఆపివేసిన్ 3-4 రొజుల్లో బహిష్టు వస్తుంది. తిరిగి బహిష్టు వచ్చిన తరువాత 5 వ రోజునుంచి క్రొత్త ప్యాకెట్టు ప్ర్రారంభిస్తారు. కాని 28 బిళ్ళల ప్యాకెట్టులే కావాలనుకునే స్త్రీలు మొట్టమొదటివారి 5వ రోజునుంచి తెల్ల బిళ్ళల దగ్గరనుంచి మొత్తం 21 బిళ్ళలు పూర్తి చేసి తరువాత చాక్లెటు రంగులో ఉండే మిగతా 7 బిళ్ళలు వేసుకుంటారు. ఈ బిళ్ళలు కూడా రోజుకి ఒకటి చొప్పునే వాడాఅలి. ఈ 7 బిళ్ళ్లు పూర్తి అయిపోయేలోగా బహిష్టు రావడం, పూర్తి అవడం జరిగిపోతుంది. ప్యాకెట్టు అయిపొగానే తిరిగి 28 బిళ్ళల ప్యాకెట్టు తీసుకుని అందులో మళ్ళీ తెల్లబిళ్ళల దగ్గర నుంచి వేసుకోవడం మొదలుపెట్టాలి.

నోటిమాత్రలు ఎంత కాలం వాడవచ్చు ?

నోటి మాత్రలు వరసగా 3 నుంచి 5 సంవత్సరాలు వాడవచ్చు. ఇంతకంటే ఎక్కువకాలం కూడా వాడవచ్చు. అయితే కొన్ని చెడు ఫలితాలు కనబడే అవకాశం ఉంది. అందుకని డాక్టరు సలహా లేనిదే మూడు సంవత్సరాలకి మించి వాడటం మంచిది కాదు.

నోటి మాత్రలు వాడే స్త్రీలు ప్రతి 6 నెలలకి ఒకసారి వైధ్యునిచేత రక్తపొటు చూపించుకోవడం, రక్తంలో సుగర్ శాతం ఎంత ఉన్నదీ పరీక్ష చేయించుకోవడం మంచిది. అంతేకాకుండా డాక్టరుచేత పి. వి (గర్భకోశం, ఇతర జన నేంద్రియాల పరీక్ష) చేయించుకోవడం మంచిది.

నెలకి ఒకటిరెండుసార్లే కలసినా నోటిమాత్రలు నెలంతా వాడాలా?

కొందరు దంపతులు ఉద్యోగరీత్యా దూరంగా ఉండి నెలలో రెండు మూడు రోజులే దాంపత్య సంబంధాలలొ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అటువంటివాళ్ళు అయినా నోటి మాత్రలు రోజూ వాడి తీరవలసిందే. అంతేకాని దాంపత్య సంబంధాలలో పాల్గొన్నప్పుడే నోటి మాత్రలు వాడితే సరిపొతుందని అనుకుంటే పొరబాటే అవుతుంది. రోజూ వాడకుండా కేవలం దాంపత్య సంబంధాలలో పాల్గొన్న రోజునే నోటిమాత్రలు వాడడంవల్ల గర్బం రాకుండా ఆగడం జరగదు.

నోటిమాత్ర మిస్‌కొట్టితే....

నోటి మాత్ర రోజూ రాత్రి భోజనం అవగానే వేసుకోవడం మంచిది. అంతేగాని బెడ్ రూం లోకి వెళ్ళిన తరువాత వేసుకుందామంటే ఆ రోజుకే మిస్ కొట్టే ప్రమాదం ఉంది. ఒకవేల ఒకరోజు మరచిపోతే ఉదయం లేవగానే ఆ విషయం గుర్తు తెచ్చుకుని టిఫెన్‌తో రాత్రి మాత్రని వేసుకోవాలి. తిరిగి ఆ రోజు రాత్రి మామూలుగానే వేసుకో వాలి. అంతేగాని ఉదయం వేసుకున్నాం కదా అని రాత్రి మానకూడదు. అలాగే ఈరాత్రికి మా శ్రీవారు లేరుకదా అని బద్దకం వేసి మాత్ర మింగడం మానకూడదు.

ఒకవేళ మాత్ర వేసుకోవడం వరసగా రెండురోజులు మరచిపోతే మూడవరొజు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వాడటమే కాకుండ, ఇక ఆ రోజునుంచి మాత్రం కోర్సు పూర్తి అయ్యేవరకు ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతులు అంటే యోనిలో పెట్టుకునే ఫోమ్స్, బిళ్ళలు, పురుషుడు నిరోధ్ వాడటం వంటివి, వరుసగా రెండురోజులు మాత్రలు వాడుతున్న మధ్యకాలంలో మాత్రలు వేసుకోవడం మరిచిపోతే గర్భం రాకుండా ఇక ఆ నెలకి ఆ మాత్రలు శక్తివంతంగా తోడ్పడలేకపోతాయి. అందుకనే వాటికి తోడు ఇతర కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని సూచించేది.

గర్భనిరోధక మాత్రలు - అంగవైకలం

గర్భనిరోధక మాత్రలు వాడిన స్త్రీలకి తరువాత సంతానంకలిగితే ఆ సంతానానికి అంగవైకల్యం వస్తుందేమో ననే భయం కొందరిలో ఉంది. నోటిమాత్రలు వాడడంవల్ల తరువాత పుట్టే బిడ్డకి అంగవైకల్యంరాదు. అలాగే నోటి మాత్రలు వాడడంవల్ల సంతాన సాపల్యత తగ్గిపోవడం జర గదు. ఈ బిల్లలు వాడటం మానివేసిన 3 నెలల్లోనె నూటికి 98 మంది స్త్రీలలో అండం విడుదల మామూలుగానే జరుగుతుంది. గర్భం మామూలుగానే వస్తుంది. ఒకవేళ ఇది వరకు సరిగ్గా బహిష్టులు రాని స్త్రీలుగాని, అండం విడుదల నెలనెల రాని స్త్రీలుగాని ఉన్నట్లయితే నోటిమాత్రలు కొన్ని నెలలు వాడినపుడు బహిష్టులు అయి పిమ్మట రెగ్యులర్‌గా నెలనెలా రావడం, అండం విడుదల సక్రమంగా అవడం కూడా జరుగుతుంది.

ఎక్కడో కొందరిలో ఈ బిల్లలు వాడడంవల్ల కొద్ది పాటి చెడు ఫలితాలు కనబడతాయి. కొద్దిగానో, కొంత ఎక్కువగానో బాధలు కనబరిచేవాళ్ళు 5-25 మంది ఊంటారు. వీళ్ళు కూడా మాత్రలు మ్రింగడం మానివేసిన తరువాత మామూలు అయిపోతారు.

ప్రపంచం మొత్తం మీద 50 మిలియన్లకి పైగా స్త్రీలు గర్భనిరోధక నోటిమాత్రలు రెగ్యులర్‌గా వాడుతున్నారు. మన దేశంలో స్త్రీలు నోటిమాత్రల వాడకం విషయంలో అంత ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా గ్రామిణ స్త్రీలు ఇందుకు ముందుకు రావడంలేదు. దానికి కారణం సరైన విద్య, విజ్ఞానం లేకపోవడమే.

నోటిమాత్రలు వాడే స్త్రీలకి గర్భం రావడం అరుదు. ఈ బిళ్ళలు వాడే స్త్రీలలో 1-2 శాతం మందిలో గర్భం రావడం జరుగుతూ ఉంటుంది. * * *