కుటుంబ నియంత్రణ పద్ధతులు/నిరోద్

వికీసోర్స్ నుండి

2. నిరోద్

నిరోద్ అంటే ఏమిటి?

క్రొత్తగా పెళ్ళి అయిన కుశల్రావుకి కొంతకాలం పాటు కుటుంబ నియంత్రణ పాటించాలని కోరిక కలిగింది. రోజూ రేడియోలో ప్రచారం చేస్తున్న "నిరోద్" అతన్ని కూడా ఆకట్టుకుంది. అనుకున్న ప్రకారంగా అతని భార్య అనిత అంగీకారంతో నూతన దాంపత్య జీవితాన్ని ప్రారంభించాడు. పాపం నిరోద్ గురించి విన్నాడుకాని, నిరోద్‌ని ఎలా వాడాలో తెలియక చివరికి తికమక పడ్డాడు. ఆ తికమక పర్యవసానంగా అతనికి అనుకోని విచిత్ర సమస్య తయారయింది. మరుసటి ఉదయమే డాక్టరు దగ్గరకు పురుగెత్తి "డాక్టర్ ! మీకు ఎలా చెప్పాలో తెలియకుండా ఉంది. కాని చాలా ప్రమాదం జరిగిపోయింది. కుటుంబ నియంత్రణ కోసం నిరోద్ వాడబోతే అది సంయోగ సమయంలో నా భార్య యోని మార్గంలో జారిపోయింది. ఏమి చేయాలి డాక్టర్? దీనివల్ల నాభార్యకి ఏమైనా ప్రమాదం అవుతుందా?" అని భయపడిపోతూ అడిగాడు.

కుశల్రావుకి నిరోద్ సరిగ్గా యెలా వాడాలో తెలియకపోతే, ఇంకొంత మందికి అసలు నిరోద్ అంటే ఏమిటో తెలియదు. ఈ నిరోద్‌నే రబ్బర్ అనీ, సేఫ్ అనీ, ఫ్రెంచి లెదర్ (యఫ్ యల్) అనీ. గర్భనిరోధక సాధనమనీ అంటారు. ఈ రోజుల్లో తయారయ్యే నిరోద్ లన్నీ పల్చగా మెత్తగా ఉండే రబ్బరుతో తయారుచేస్తున్నారు. జంతువుల చర్మంతో తయారయే నిరోధ్‌లు కూడా కొన్ని వున్నాయి. నిరొద్ ఒక అంగుళం వెడల్పు, ఏడు అంగుళాల పొడవు వుంటుంది. నిరోధ్ కూడా రబ్బరు బూర లాగానే గాలి వూదితే ఉబ్బుతుంది. నిరోద్ క్రింది భాగంలో చిన్న బుడగ లాగా ప్రత్యేకంగా వుంటుంది. సంయోగం సమయంలో విడుదలయిన వీర్యం ఇందులో వుండిపోతుంది. నిరోద్ పురుషాంగానికి తొడిగినప్పుడు జారిపోకుండా వుండటానికి దీని ముందు భాగములో దళసరిగా వుండే రబ్బర్ ఇలాస్టిక్ రింగ్ వుంటుంది. నిరోధ్‌ల్లో సైజులు వేరువేరుగా వుండవు. దీనికి సాగే గుణం వుంది. కనుక పురుషాంగంము ఏ పరిమాణము కలిగి వున్నా సరిపోతుంది. నిరోధ్‌లు ఒక్కొక్కటి వేరువేరుగా తగరపు కాగితముతో గాని, దళసరిఅట్టతోగాని చుట్టబడి వుంటాయి.

ఈనాడు నిరోధ్‌లు కుటుంబనియంత్రణకి వుపయోగిస్తున్నా మొట్టమొదట్లో ఎక్కువగా అక్రమ కామసంబంధాలకి, వేశ్యాసంపర్కమువల్ల వచ్చేసుఖవ్యాధులు రాకుండా వుండటానికి మాత్రమే వుపయోగించేవారు. కుటుంబనియంత్రణ సాధనాలలో ఒకటిగా ఇది ప్రచారము కలగడానికి కొన్ని ఆపోహలుకూడా అడ్దము వచ్చాయి. నిరోధ్ చాలా సందర్భాలలో ఫేల్ అయిపోతుందనే దురభిప్రాయం వుంది. దీనికి కారణము సరిగ్గా దానిని వుపయోగించ లేకపోవడము లేదా పురుషుని నిర్లక్ష్యం. స్త్రీ గర్భవతి కాకుండా వుండాలంటే పురుషుడు జాగ్రత్తగా నిరోధ్‌వాడాలి. భర్త నిరోధ్ వాడతాడుకదా అని భార్య నమ్మి వూరుకున్నా, పురుషుడు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహిరించినా భార్యకి గర్భము రావడానికి ఆస్కారం వుంది. పైగా కొందరు పురుషులకు సహజరతికీ, నిరోధ్ వాడుతూ పాల్గొనే రతికీ చాలా తేడా కనబడుతుంది. నిరోధ్ వాడుతున్నప్పుడు కొందరికి రతిలో కలగలవసినంత తృప్తి కలగకుండా వుంటుంది. రతిలో తృప్తి కలగడం లేదని భావించి సరిగ్గా వీర్యస్థలనానికి ముందు నిరోధ్ వాడవచ్చని ఊరుకుంటారు. అటువంటప్పుడు ఒక్కొక్కసారి సంయోగంలో శీఘ్రస్థలనం అయి గర్భం రావచ్చు.

నిరోధ్‌ని వాడటం ఎలా ?

సంయోగంలో పాల్గొనబోయే ముందే నిరోధ్‌ని స్థంభించిన పురుషాంగానికి తొడగాలి. పురుషాంగం చివరి భాగాన్న నిరోధ్ ఒక అర అంగుళం పొడవు వదులుగా ఉంచాలి. అలా ఉంచటంవల్ల స్థలనమైన వీర్యం అక్కడే వుండిపోవటానికి వీలు కుదురుతుంది. నిరోధ్ స్తంభించిన పురుషాంగానికి తొడగబోయే ముందు శిశ్నంపైన ఆచ్చాదనగా వుండే చర్మాన్ని వెనకకులాగి తొడగాలి. సున్తీ చేయించుకున్న వాళ్ళల్లో ఆ సమస్యే ఉండదు. నిరోధ్ తొడుగుతున్నప్పుడు చేతి గోళ్ళుకాని, వేళ్ళకు ఉండే ఉంగరాలుకాని గీసుకుపోకుండా జాగ్రత్త వహించాలి. లేకపోతే ఆ తెగిన స్థలంనుంచి వీర్యం లీక్ అవడానికి ఆస్కారం వుంటుంది. నిరోధ్‌ని పురుషాంగానికి చివరికల్లా తొడిగి ఇలా స్టిక్ రింగ్ గట్టిగా పట్టుకొనేటట్లు చూడాలి. నిరోధ్ వాడుతున్నప్పుడు పురుషాంగంనుంచి వెలువడే ద్రవాలు బయటకురావు కనుక అంతా పొడిగా వుంటుంది. అటువంటప్పుడు స్త్రీ యోనిమార్గం కూడా సరిగ్గా ద్రవాలు వూరక పొడిగ ఉంటే అటువంటి దంపతులలో సంయోగం సరిగ్గా కుదరదు. పైగా బాధాకరంగా వుంటుంది. ఇటువంటప్పుడు కుటుంబ నియంత్రణ కుపయోగించే పేస్టులు, జెల్లీలు నొరోధ్ పైన రాయాలి. అప్పుడు తేలికగా సంయోగం కుదురుతుంది. జారుడు పదార్ధంగా వేజలైను వ్రాయకూడదు, వేజలైను లాంటివి నిరోధ్ రబ్బరుని పాడుచేస్తాయి.

పురుషాంగం బాగా స్తంభించి ఉన్నప్పుడు నిరోధ్ బాగానే పట్టుకుని ఉండి జారిఫోకుండా ఉంటుంది. అలా కాక వీర్యం స్థలనం అయిన తరువాతగాని, సంయోగం సమయంలో ఇతర కారణాలవల్లకాని పురుషాంగం పరిమాణం తగ్గిపోతే, నిరోధ్ జారిపోయి యోనిమార్గంలో ఉండిపోవడానికి ఆస్కారం ఉంది. అందుకని నిరోధ్ వాడేటప్పుడు పురుషాంగ పరిమాణం తగ్గకముందే రతినుండి ఉపసంహరించాలి. లేకపోతే స్థలనమైన వీర్యం వదులుగా ఉన్న నిరోధ్‌నుంచి బయటకు జారుకుంటూ వచ్చి యోని మార్గంలో ప్రవేశించ వచ్చు. అందుకని అంగ పరిమాణం తగ్గిపోగానే నిరోధ్‌ని చేతితో అదిమిపట్టుకొని పురుషాంగాన్ని యోనిమార్గంనుండి ఉపసంహరించాలి. ఒకవేళ నిరోధ్ యోనిమార్గంలోకి జారిపోతే వెంటనే చేతివేళ్ళు యోని మార్గంలోకి పోనిచ్చి తీసివేయాలి. ప్రతీసారి సంయోగం అవగానే నిరోధ్‌ని జాగ్రత్తగా పరిశీలించాలి. నిరోధ్ ఎక్కడయినా చిరుగుపడినట్టు కనబడితే వెంటనే యోని మార్గాన్ని డూష్ చేసుకోవాలి. లేదా కుటుంబనియంత్రణ కోసం ఉపయోగించే పేష్టుని యోని మార్గంలో ప్రవేశపెట్టాలి. అసలు నిరోధ్ ఉపయోగించేటప్పుడల్లా దానితో పాటు ఫోమ్ బిళ్ళలుగాని, కుటుంబనియంత్రణ జెల్లీలుగాని వాడినట్లయితే నిరోధ్ ఎట్టి పరిస్థితుల్లో చిరిగినా, జారినా గర్భం వచ్చే ప్రమాదం ఉండదు. నిరోధ్ వాడబోయేముందు బెలూన్‌లాగ గాలి వూది చూచి బాగా ఉన్నట్లయితేనే వాడుట మంచిది. కానీ మంచి కంపెనీవి, నమ్మకమైన షాపులో కొత్తస్టాకు తీసుకుంటే అంతగా యిబ్బంది ఉండదు. రబ్బరు నిరోధ్‌లు ఒక్కసారికే పనికివస్తే చర్మం నిరోధ్‌లు ఎక్కువసార్లు ఉపయోగించవచ్చు. ఈ రెండు రకాలుకాక "టిప్" నిరోధ్‌లు కేవలం పురుషాంగం చివరఉండే శిశ్నాన్ని మాత్రమే కప్పి ఉంచుతాయి. ఇవి గర్భనిరోధానికి వాడకుండా ఉండడం మంచిది. ఇవి తేలికగా సంయోగ సమయం లో జారిపోవచ్చు. 1981-82 సంవత్సరాల్లో భారతదేశంలో 44 లక్షల మంది దంపతులు నిరోధ్ ద్వారా కుటుంబ నియంత్రణని పాటిస్తే, 1984 సంవత్సరం వచ్చేసరికి దానికి రెట్టింపు దంపతులు నిరోధ్ వాడటం చేస్తున్నారు. ఈ నాడు ప్రపంచంలో 40 మిలియన్లుకి మించి దంపతులు కుటుంబ నియంత్రణని పాటించడానికి నొరోధ్ వంటి సంతాన నిరోధక సాధనాన్ని వాడుతున్నారు. జపానువంటి దేశాల్లో దంపతులు ఆకర్షణీయంగా ఉండే రంగురంగుల నిరోధ్‌లు వాడుతున్నారు. ఈ రకంగా నిరోధ్‌వంటి ప్రాచుర్యం బాగా పెరిగింది.

నిరోధ్ వాడటం అతి తేలిక. చాలా క్షేమకరమైనది. ఏ విధంగానూ దంపతుల్లో ఏ ఒక్కరికీ అనారోగ్యాన్ని కలిగించదు. పైగా నిరోధ్ వాడకంవల్ల స్రీలకి గర్భాశయ కంఠానికి కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే భర్త పురుషాంగానికి ఉండే పాచి పదార్ధం స్త్రీ యోనిలోకి ప్రవేశించదు. (పాచికి కేన్సర్‌ని కలిగించే గుణం ఉందనే సిద్ధాంతం ఉంది కదా).

అరుదుగా కొందరు దంపతులకి నిరోధ్ రబ్బర్ ఎలర్జీ కలిగించవచ్చు. అలాగే నిరోధ్‌ని ఎంత జాగ్రత్తగా వాడుతున్నా వందమందిలో 6-10 మంది దంపతులకి గర్భంవచ్చే అవకాశం ఉంది. దానికి కారణం అది జారిపోవడమో, చిల్లు ఉండడమో, అయితే ఫోమ్ బిళ్ళలతో పాటు ఇది వాడితే ఆ అవకాశం కూడా లేదు.