Jump to content

కుటుంబ నియంత్రణ పద్ధతులు/గర్భం వచ్చినట్లు తెలుసుకోవడం

వికీసోర్స్ నుండి

19. గర్భం వచ్చినట్లు తెలుసుకోవడం

కొందరికి అప్పుడే పిల్లలు వద్దనిపిస్తుంది. కాని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోరు. దానితో నెల తప్పడమవుతుంది. ఇక అప్పటినుంచి కంగారు మొదలవుతుంది. ముందు అసలు అది గర్భం రావడమా, బహిస్టులు రావడం ఆలశ్యం అవడమా అనే అనుమానం కూడా కలుగుతుంది. ముఖ్యంగా లూప్ వేయించుకున్న వారిలోనూ, 'టుడే ' వెజైనల్ టాబ్లెట్లు వాడేవారిలోనూ, ఫోమ్, జెల్లీలు వాడే వారిలోనూ నెలసరి రాకపొయేసరికి ఇటువంటి అనుమానం కలగడం మరింత ఎక్కువ.

పూర్వకాలమైతే గర్భిణీ అవునా కాదా అని తెలుసుకోవడానికి డ్యూయోగైనాన్, సైక్లోనార్మ్ వంటి బిళ్ళలు, ఇంజక్షన్లు వాడేవారు. ఆ బిళ్ళలు రెండు వేసుకున్నా, రెండు ఇంజక్షన్ లు చేయించుకున్నా గర్భం అయినదీ లేనిదీ తేలిపోయేది. ఎలాగంటే ఈ మందులు వాడిన వారంరోజుల్లో బహిస్టు స్తావం కనబడితే గర్భం కానట్టు తేలిపోయేది. కేవలం ఏదో కారణాలవల్ల బహిష్టు రాలేదు కాని గర్భం రావడం వల్ల కాదని నిర్ధారణ అయ్యేది. అదే మందులు వాడిన వారం పది రోజుల్లో బహిష్టు స్తావం కన బడకపోతే గర్భం అని నిర్ధారణ అయిపోయేది. గర్భం ఉంటే ఒకటికి పది బిళ్ళలు వేసుకున్నా గర్భం పోవడంగాని, బహిష్టు స్రావం కనబడటం జరగదు. ఇది ఒక రకంగా చాలా తేలికైన పద్ధతే అయినా గర్భం అవునా, కదా తెలుసుకోవడానికి వాడే ఈ మందు బిళ్ళలవల్ల ఇంజక్షన్‌ల వల్ల నిజంగానే గర్భం వచ్చి ఉన్నట్లయితే గర్బస్థ శిశువు మీద దుష్పలితాలు కనబడే అవకాశం ఉంది. అందరు శిశువులమీద వీటిదుష్పలితాలు కనబడకపోయినా, నూటికో - కోటికో ఒకరి మీద కనపడినా కూడా తప్పే కదా. అందుకని డ్యుయోగైనాన్ వంటి బిళ్ళ్లని, ఇంజక్షన్లని గర్భం అవునా, కాదాఅని తెలుసుకోవటానికి ఉపయోగించడాన్ని వైద్యశాస్త్రజ్ఞులు ఒప్పుకోలేదు. ఒకవేళ గర్భం అవునా, కాదా అని తెలుసుకోవడానికి వాడితే, దానివల్ల గర్భం ఉందని తేలితే, ఆ గర్భాన్ని ఉంచుకోకుండా అబార్షను చేయించుకోవాలని వైద్యశాస్త్రజ్ఞులు సలహా ఇచ్చారు. ఎందుకంటే ఈ మందులు వాడడంవల్ల పుట్టబోయే బిడ్డ అంగవైకల్యంతో పుట్టుతాడో, పుట్టడో చెప్పడం కుదరదు కనుక, కీడు ఎంచి మేలుకోసం అబార్షను చేసివేయడం అవసరం అని అభీప్రాయం వ్యక్తపరిచారు. అందుకని గర్భం అయితే అబార్షను చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటేనే ఈ గర్భధారణ మందులు వాడాలని సలహా ఇచ్చారు.

వైద్యశాస్త్రం బాగా అభివృద్ది సాధించడంతో ఇప్పుడు ఇటువంటి బిళ్ళలు ఇంజక్షన్లతో పని లేకుండా క్షేమకర పద్దతుల వల్లనే గర్భం వచ్చినదీ లేనిదీ తెలుసు కోవడానికి అవకాశం కలుగుతుంది.

నెల తప్పిన స్త్రీ మూత్రం పరీక్ష

గర్భం అయినదీ కానిదీ తెలుసుకోవడానికి ఈనాడు బిళ్ళలు మ్రింగనవసరం లేదు, ఇంజక్షన్ లు చేయించుకోనవసరం లేదు. అంతే కాదు వారం - పది రోజులపాటు వేచిచూడనవసరం లేదు. నెల తప్పిన రోజు నుంచే ఆ స్త్రీ మూత్రం కొద్ది చుక్కలు పరీక్ష చేస్తే చాలు, రెండు నిముషాల్లోనే ఆమెకు గర్భం వచ్చినదీ లేనిదీ నిర్ధారణ అయి పోతుంది. ఇది ఎలా సంభవమని ఆశ్చర్యం కలగవచ్చు. కాని ఇది సైన్సు సాధించిన విజయం.

అండంతో వీర్యకణం కలయిక పొందిన 24 గంటల్లో హ్యూమన్ కోరియానికి గోనాడో ట్రాసిన్ హార్మోను ఉత్పత్తి మొదలవుతుంది. అలా తయారైన హార్మోను మూత్రంద్వారా విడుదల అవుతుంది. ఈ హార్మోను గర్భం దాల్చని స్త్రీలలో తయారవడం, మూత్రం ద్వారా విడుదల అవడం ఉండదు అందుకని అతి సున్నితమైన పరీక్షావిధానం ద్వారా కొద్దిచుక్కలు మాత్రమే మూత్రం తీసుకుని పరీక్ష చేసి ఆ హార్మోను తయారు అవుతున్నదీ లేనిదీ తెలుకుకోవడం జరుగుతుంది.

గ్రావిండెక్స్ టెస్టు

మూత్రం పరీక్ష ద్వారా గర్భం వచ్చిందీ లేనిదీ తెలుసుకునే పరీక్షా పద్దతుల్లో గ్రావిండెక్స్ టెస్టు ఒకటి. ఈ టెస్టు ద్వారా నెల తప్పిన తరువాత 2 నుంచి 5 రోజులలోగా గర్భం వచ్చినదీ లేనిదీ నిర్ధారణ చేయవచ్చు.

గ్రావిండెక్సు టెస్టు చేయు విధానం

ఈ టెస్టు చేయడానికి మార్కెట్టులో రెండు రసాయనిక పదార్ధాలు ఒక కిట్‌గా దొరుకుతాయి. ఈ కిట్‌లో ఉండే రెండు సంయోగ పదార్ధాలు 1) యాంటీబాడి 2)యాంటీజిన్.

పరీక్ష చేయవలసిన స్త్రీ మూత్రాన్ని ఒక చిన్న సీసాలో కొద్ది చుక్కలు పట్టితే చాలు. అలా కలెక్టుచేసిన మూత్రాన్ని తీసికొని లేబరటరీలో ఒక గాజు ప్లేటు (గ్లాసు స్లైడ్) మీద ఒక చుక్క వేస్తారు. దానికి ఒక చుక్క యాంటీబాడీ సంయోగ పదార్ధాన్ని కలుపుతారు. కిట్‌లో ఇవ్వబడిన పుల్లతో గాజుప్లేటు మీద వేసిన రెండు చుక్కలని చక్కగా కలుపుతారు. తరువాత 30 సెకండ్లు పాటు గాజుప్లేటుని (గ్లాస్ స్లైడుని) ఇటు అటు కుదుపుతారు. ఆ తరువాత కిట్‌లో ఉన్న మరో సంయోగ పదార్ధం యాంటీ జన్‌ని బాగా కుదిపిన ఒక చుక్కని కూడా దానితో కలుపు తారు. తరువాత మళ్ళీ మూత్రాన్నీ, యాంటీబాడి, యాంటీజన్ మిశ్రమాన్నీ పుల్లతో బాగా కలుపుతారు. అటుపిమ్మట గ్లాస్ స్లైడుమి రెండు నిమిషాలు నెమ్మదిగా ఇటు అటు త్రిపుతారు.

గావిండెక్స్ టెస్థులో ఎలా తెలుసుకోవచ్చు ?

మూత్రంలో కనుక హ్యూమన్ కోరియానిక్ గొనాడో ట్రాపిక్ హార్మోను లేకపోతే (గర్భం దాల్చటం జరగక పోవడంవలన) యాంటీబాడీ, యాంటీజన్ లు రెండూ రెండునిమిషాల్లో కలిసిపోతాయి. ఇలా కలిసిపోవడాన్ని 'ఎగ్లుటినేషన్' అంటారు. ఎగ్లుటినేషన్ ఏర్పడితే గర్భిణి కాదని అర్ధం. దీనినే గ్రావిండెక్స్ టెస్టు నెగటివ్ అంటారు. ఇక్కడ టెస్టు నెగటివ్ అంటే గర్భం లేదని అర్ధం.

మూత్రంలో కనుక హ్యూమన్ కోరియానిక్ గొనాడో ట్రాపిక్ హార్మోను ఉంటే అది యాంటీ బాడీస్ తో సంయోగం చెందుతుంది. అప్పుడు యాంటీబాడీస్ న్యూట్రలైజ్ అవడం వలన యాంటిజన్ తో ఎగ్లుటెనేషన్ ఏర్పడదు. ఈవిధంగా ఎగ్లుటెనేషన్ రెండు నిమిషాల్లో ఏర్పడకపోతే గర్భిణీ అని అర్ధం. దీనినే గ్రావిండెక్స్ టెస్టు పాజిటివ్ అంటారు. ఇక్కడ పాజిటివ్ అంటే గర్బిణీ అయినట్లే అర్ధం. ఈ విధంగా నెల తప్పిన స్త్రీ మూత్రాన్ని ఒక చుక్క మాత్రమే తీసుకొని రెండు నిముషాల్లోనే గర్భిణీ అయినదీ కానిదీ నిర్ధారణ చేసి చప్పవచ్చు.

'గ్రావిండేక్స్ ' బదులు 'ప్రెగ్ కలర్ '

'ప్రెగ్ కలర్ ' అనేది మరొక రకమైన పరీక్షా విధానము. దీనిలో గ్ర్రావిండెక్స్ టెస్టులో లాగా కాకుండా "రంగు మార్పు"కలుగుతుంది. అదీగాక పరీక్ష గ్లాసు స్లైడ్ మీద కాకుండా చిన్న ట్యూబులో చేస్తారు.

ఒక ట్యూబులో యాపిల్‌పండు రంగులో చిన్న గోళీ ఉంటుంది. దానిలో కిట్ లో ఇచ్చిన భపర్ సల్యూషన్ మొత్తం వేసేసి గోళి కలిసిపోయేవరకు బాగా కుదపడం చేస్తారు. తరువాత భఫర్ సల్యూషన్ ఖాళీ చేసిన ప్లాస్టిక్ బాటిల్ తోనే మూత్రాన్ని తీసుకుని 3 చుక్కలు రంగు గోళీ కరిగిన ట్యూబులో వేస్తారు. తరువాత ఆ ట్యూబు మూతిని రబ్బర్ కార్కుతో మూసివేసి బాగా కుదుపుతారు.. తరువాత 30 నిమిషాలు అలాగే ఉంచివేస్తారు. అలా ఉంచిన ట్యూబులో ద్రవం ఏ రంగులో ఉందనే దానినిబట్టి గర్భం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడంజరుగుతుంది.

గర్భం రాకపోయినట్లయితే ట్యూబులోని ద్రవం డార్క్ పింక్ కలర్ లోఉంటుంది. గర్భం వచ్చినట్లయితే ట్యూబులోని ద్రవం రంగు మారిపోయి లైట్ పింక్ లేదా అసలు కలర్ పూర్తిగా లేకుండానో ఉంటుంది. ఇలా కలర్ మారితే ప్రెగ్నెన్సీ టెస్ఠు పాజిటివ్ వచ్చిందని అంటారు. పాజిటివ్ అంటే గర్భం ఉన్నట్లు అర్ధం.

ప్రెగ్ కలర్ టెస్టు గ్రావిండేక్సు టెస్టుకంటె సున్నితమైనది. గర్భం వచ్చిందీ లేనిదీ గ్రావిండెక్సు టెస్టుకంటే ఇంకా ముందుగా ప్రెగ్ కలర్ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు. హ్యూమన్ కొరియానికు గొనాడోట్రాపికు హార్మోన్ ఒక లీటర్ మూత్రంలో 800 I U ఉంటే తప్ప గ్రావిండెక్సు టెస్ఠులో పాజిటివ్ రావడం జరగదు. ప్రెగ్ కలర్ టెస్టుకి మూత్రంలో హ్యూమన్ కొరియానికు గొనాడో ట్రాపికు హార్మోను 200 I.U. ఉన్నా చాలు. మామూలుగా గ్రావిండెక్సు టెస్టు ద్వారా గర్భం అయినదీ కానిదీ తెలుసుకోడానికి నెల తప్పిన తరువాత 2 నుంచి 5 రోజులు ఆగవలసి ఉంటే ప్రెగ్ కలర్ టెస్టు ద్వారా నెల తప్పిన రెండవ రోజునే గర్భం అయినదీ కానిదీ నిర్ధారణ చేసుకోవచ్చు.

గర్భం అయినదీ కానిదీ తెలుసుకోవడానికి స్త్రీ మూత్రాన్ని పరీక్ష చేయడానికి రోజులో మొట్టమొదటి సారి పాస్ చేసే మూత్రమే అవసరం లెదు. మూత్రాన్ని ఎప్పుడు పట్టినా పనికి వస్తుంది. అయితే మూత్రాన్ని కలెక్టు చేసిన తరువాత సాధ్యమైనంత త్వరగా పరీక్ష చేయడం అవసరం. కనీసం 12 గంటల లోపు పరీక్ష చేయవలసి ఉంటుంది. 12 గంటలుకంటే ఎక్కువ కాలం పట్టేటట్లయితే మూత్రానికి ధమెరొనాల్ లేదా సోడియం ఎజైడ్ గానికొంత కలిపి రిఫ్రిజిరేటర్‌లో ఒకవారం రోజులు ఉంచవచ్చు. అలా ఉంచిన మూత్రాన్ని వారంరోజుల తరువాత పరీక్ష చేసినా గర్భం వచ్చిందీ లేనిదీ తెలుస్తుంది.

కుటుంబ నియంత్రణ పాటించాలనుకున్న దంపతులకి ఇటువంటి టెస్టులు ఉన్నాయనే విషయం తెలిసి ఉండాలి. ఎందుకంటే ఏ కారణం వలన ఋతుస్రావం రావడం ఆలశ్యమైనా గర్భంవచ్చిందేమోనని భయంకలుగుతూ ఉంటుంది. అటువంటి భయం లేకుండా ఉండటానికి బహిష్టు రావలసిన సమయానికి రాకపోతే మరుసటి రోజునే ప్రెగ్ కలర్ వంటి టెస్టు చేయించుకుని గర్భం అయినదీ కానిదీ నిర్ధారణ చేసుకోవచ్చు. అప్పుడు కావాలంటే గర్భం ఉంచుకునేది, వద్దనుకుంటే గర్భస్రావం చేయించుకునేది. అంతేగాని అనవసరంగా మానసిక ఆందోళన చెందనవసరం లేదు.

* * *