కుంభరాణా (మీరాబాయి)/స్థలము 2
స్థలము 2 : ఢిల్లీ
_________
[అగ్బరుపాదుషా విశ్రాంతి మందిరము; చిన్న మేజాపై హుక్కా పెట్టబడియుండును. తెఱయెత్తు నప్పటికి అగ్బరు తాన్‌సేనులు సంభాషించు వైఖరిలో నుందురు.]
తాన్ : ప్రభూ, మీకోరిక అపాయకరము. మఱలనాలోచింపుడు.
అగ్బరు : అపాయము మొగలాయిచక్రవర్తులకు క్రొత్తది కాదు; అనుక్షణ పరిచితము.
తాన్ : అయినను ఇది సాహసకార్యముగాదా ?
అగ్బ : నే నెఱుంగుదును. కుంభరాణా మనకు ప్రబల విరోధి. రహస్యముగ ఆతని రాజ్యమున ప్రవేశించుట సాహసకార్యమె. అయినను, ఆభక్తురాలి దర్శనము అవశ్య కర్తవ్యము. తాన్‌సేన్, ఆమెపాట నిన్ను కూడ ఆనంద పులకితుని గావించినదా?
తాన్ : నన్నేకాదు. ఆ దావీదు నేఁడు జీవించియుండి ఆభక్తురాలి గానమువిన్న ఆనంద పరవశుఁడై యొడలు మఱచును. స్వర్గములోని కౌసరు నిర్ఝరము ఆమె కంఠమునుండి ప్రవహించును. ఆదివ్యగాన ప్రవాహమున నేనును నాచిన్న పానపాత్రిక నింపుకొంటిని.
అగ్బ : ఏమి ?
తాన్ : నేను ఆమెపాటలు కొన్ని నేర్చుకొంటిని.
అగ్బ : [సంతోషముతో] అటులనా, ఏదీ ఒక్కపాట పాడుము. నాహృదయమును ఆనంద వీచికల నుయ్యాల లూఁపుము.
తాన్ : ఆ సుధా ప్రవాహమెక్కడ ? ఈ యుప్పునీటి కాలువ యెక్కడ ? అగ్బ : ఆ పాటలు విన కుతూహలము వొడముచున్నది.
తాన్ : [పాడును]
అగ్బ : ఆహా, ఏమి యీ పాటసొంపు ! ఈగీతము ఆమె సౌందర్యముకడ మాధుర్యము నెరవు తీసికొనెనా యేమి ?
తాన్ : ప్రభూ, వ్రతోపవాస కృశాంగి యగుటచే ఆమె సౌందర్యము పూజ్యము; దివ్యము. శ్రీకృష్ణ ధ్యానపరాయణయై తన్మయత్వమున ఒడలు మఱచి వ్రాలినది. మజ్నూనుకూడ లైలా కొఱకు అంతటి వేదన అనుభవించియుండఁడు. షీరీనుకొఱకు భృగుపాతమొనరించిన ఫర్హాదు సైత మట్టి నిర్మల ప్రేమ నెఱిఁగియుండఁడు 'అనల్‌హక్' అని చాటించిన మాన్సూరుకూడ అంతటి ఆత్మ పరమాత్మల యైక్యము రుచుచూచి యుండఁడు. ఆ సతీతిలకము హిందూసూఫీ-
హర్షపులకిత దేహయై హా! ముకుంద,
కృష్ణ, కృష్ణా యటంచు సంకీర్తనంబు
సలుపుచునె ధ్యానమగ్నయై సన్నుతాంగి
దివ్య శోభా పరిధియందుఁ దేజరిల్లె !
అగ్బ : తాన్‌సేన్, నా వాంఛా ప్రదీపమును వెలిగించితివి; ఉత్కంఠ ప్రేరించితివి. నిర్దయుఁడవై మఱల నార్పఁబోకుము. నాజీవిత మంతయు రాజ్యసంపాదనమునందె వ్యయమగుచున్నది. ఒక్కనిమిషమైన శాంతిలేదు. ఈ తృష్ణకు దరిదాపుగలదా ?
ఒకరాష్ట్రము గైకొన వే
ఱొక రాజ్యము నాచి కొనఁగ నుల్లముగోరున్;
సకలైశ్వర్యము లొనరియు
నిఁకఁ జాలునటన్న తృప్తి యిల లేదుగదా !
అగ్బ : తాన్‌సేన్, చక్రవర్తులు గూడ మర్త్యులే సుమా.
ఏరీ యా బహరాముగోరి, ఖుసురూ ? లెందేఁగె సౌషీరవాన్ ?
ఏరీ రుస్తుముజాలు, తాయి ? యెపుడో యెచ్చోటనో ధూళియై
పోరే, వారి సమాధులైనఁ గలవే ? భోగాను భోగత్వమే
సారంబో, పరతత్త్వమొండు గలదో సత్యంబుగా సృష్టిలోన్?
మే నెవ్వఁడను ? ఏలజన్మించితిని ? ఏల మరణించుచున్నాను ? ఈ జనన మరణముల రహస్యమేమి ? ఈ ప్రశ్నలు చిరంతనములయ్యును నిరంతరములుగ నగపడుచున్నవి. దైవదృష్టియందు అందఱుము సమానులమేకదా ? అట్లయిన లోకములోని ఈ విపర్యాసమునకు కారణమేమి? కొందఱు రాజులు, కొందఱు రైతులు, కొందఱు సంపన్నులు, కొందఱు దరిద్రులు. కొందఱు సుఖితులు, కొందఱు దు:ఖితులు ! ఈరహస్యమును ఆ భక్తురాలు భేదింపఁగలదు. ఆమె ఐంద్రజాలిక స్పర్శచే ఈ రహస్యము దాఁచిన మం జూషపు మూఁత విడిపోవును. మనము రేపే తరలవలయును.
తాన్ : నావలనఁ గదా మీ కీ తలంపు గలిగినది ! ఇప్పటికే మౌలానాలు, షేకులు మిమ్ము ద్వేషించుచున్నారు. మీ హైందవ పక్షపాతమును నిందించుచున్నారు. ఇంతకును నేను కారకుఁడనని నామరణమున కెదురుచూచు చున్నారు.
అగ్బ : తాన్‌సేన్, వారు జగదేకసత్యము నెఱుంగరు. జ్ఞానమున కన్న వారికి స్వపక్షాభిమానము మిక్కుటము. జ్ఞానమునకు జాతిమతభేదములులేవు. గులాబిపూవు ఎవరిచేతనుండినను అదేవాసన గొట్టుచుండును.
తాన్ : నిజము చెప్పితిరి. హైందవ తురుష్క పారసీ హౌణులకును
వీరువారననేల ?. యీ విశ్వమునకు
దేవుఁ డొకఁడను సత్యంబుఁ దెలియలేక
మతము పేరటఁ బోరాట మ్రందు జనము.
అగ్బ : మీరాబాయి జ్ఞానప్రదీప మీ మాయాంథకారమును దొలఁగింపఁగలదు.
తాన్ : మహమ్మదీయుల కంటఁ బడిన కులకాంతలు రాణివాసమునకు తగరని రాజపుత్రుల మతము. అందులో కుంభరాణా మిక్కిలి యభిమానవంతుఁడు.
అగ్బ : మనయుద్దేశము దుష్టముగాదు. ఆమె హృదయ హోమకుండమునుండి జ్ఞానవిస్ఫులింగ మొక్కటియైన వెలికుఱికి మన మన:పథముల జ్యోతిర్మయము చేయవచ్చును.
తాన్ : మీచిత్తము. వజీరు లీయుద్యమమున కియ్యకొందురా ?
అగ్బ : ఇది మన యిరువురిని దాఁటి పోని రహస్యము.
తాన్ : మీ ప్రయాణమునకు కారణము ?
అగ్బ : ఆ సంగతి నాకు వదలుము. మనము హిందూ యాత్రికులమయ్యెదము. వలసిన యేర్పాటులు గూఢముగ కావింపుము.
తాన్ : మాఱాడఁ జాలను.
అగ్బ : సంశయింపకుము. దైవము మనకు తోడ్పడును.
తాన్ : అట్లె యగుఁగాక ! సెలవు. [నిష్క్రమించును.]
అగ్బ : నా జీవిత కావ్యమునందు క్రొత్త అధ్యాయము ప్రారంభమైనది. [హుక్కాత్రాగుచు ఆలోచించుచుండును.]
[తెఱజాఱును]
__________