కుంభరాణా (మీరాబాయి)/స్థలము 3
స్థలము 3 ఉదయపురము.
_________
[ఉద్యానవనము. ఒక సరోవరము, అందు చేపలుతినుచున్న కొంగయు అగపడును. కుంభరాణా పరాయత్తచిత్తుఁడై ఒకపూవును వాసన చూచుచు చలువఱాతిబండపయి కూర్చుండియుండును.]
రాణా : నానాఁటికి మాయంత:పురము నే నడుగిడుటకు యోగ్యముగాని సన్న్యాసిని మఠమగుచున్నది. అచ్చట పూర్వమునవలె హృదయరంజన మొనరించుట కొక్క చిఱునవ్వుగాని, ఒక్క ప్రేమావలోకనముగాని, తుదకొక్క తియ్యని మాటగాని కఱవయ్యెను. నా ప్రాణేశ్వరి క్రమక్రమముగ నాచేతినుండి జాఱిపోవుచున్నది. ఆపాడు మత మేనాఁడు మా యింట నడుగు వెట్టినదో ఆనాఁటినుండియు మా యిరువురి యనురాగ బంధములు సడలి పోయినవి. ఆ విరాగిణి హృదయమున నాకిప్పు డించుకయైన చోటులేదు. [నిట్టూర్చి] నేఁడు నేను కేవలము భర్తను, ప్రాణవల్లభుఁడను. పుప్పొడి రస్తావలె కనుపడుచుండిన మా జీవిత మార్గము నేఁడు కంటకశిలా భూయిష్టమయి అసహ్యమయి ఘోరమయి పొడకట్టుచున్నది - నాసంసార మసారమయి నరకప్రాయమైనది.
[మీరాబాయి, సుశీల పువ్వుల బుట్టతో ప్రవేశింతురు.]
మీరా : నాథుఁడిచ్చటనే యున్నాఁడు. సుశీలా, మనమా వంకకు పోయి పూవులు కోసికొందము. పూజా సమయము కావచ్చినది.
[ఇరువుఱును రాణాకు కొంచెము దూరమునఁ బోవుచుందురు.]
మీరా : అయ్యో! నాయపరాధమును మన్నింపుఁడు. మీరేదో యాలోచనలో మునిఁగియున్నటుల తోఁచినది. మాసందడి మీ యవధానమునకు అంతరాయము కావచ్చునను తలంపుతో తొలఁగిపోయితిమి.
రాణా : [విషపు చిఱునవ్వుతో] అనుకూలవతివి !
మీరా : నా సదుద్దేశము నేల యనుమానించుచున్నారు ? ఎపుడైన మీకనిష్ట మాచరించితినా ? నాసతీత్వమున కేమైన లోపమువాటిల్లెనా?
రాణా : మీరా, ఆయుపచారవాక్యముల నటుండనిమ్ము. సతులు నిరంతర వ్రతోపవాస కృశాంగులేకారు, కేవలము విధినియమబద్ధ సంబంధ లేకారు; పతుల హృదయము లాకర్షించు సమ్మోహన మంత్రాధి దేవతలు గను. మృదుమధుర స్వభావలుగ నుండవలయును. పరస్పర హృదయైక్యములేని వైవాహిక బంధము నీరసము - సంతాపకరము - హత్యాకరము. కృశాంగీ, కడచిన యేడెనిమిది సంవత్సరములు వేఱు. మున్నటి లావణ్యవతి వేనా నీవు ?
కాటుక జిగి పూఁత కాఱుచీఁకటి గ్రమ్ము
నీ కన్నుఁదమ్ముల నీటుదొలఁగె;
హృదయభేదక చింత లేనియు నడఁగించు
చిఱునవ్వు విడిమోము చిన్నవోయె;
కనుల కానందంబు గలిగించు నీరూప
సౌందర్య మేడకో జాఱిపోయె;
ఎపుడైన విశ్లేష మెఱుఁగని చిత్తంబు
ప్రణయ శ్మశానమై రాజఁదొడఁగె;
నవ్వులాటలు సరసాలు నాఁడె ముగిసె;
నీ సమేలమేనియు స్మరయణీమయ్యె;
అనుదినంబును నెడఁబాటె యధికమయ్యె,
నిఁక సతీపతి సంబంధమేమి యౌనొ!
మీరా : సుశీలా, చూచితివా నాధుఁడెంత తప్పదలఁచుచున్నాఁడొ? వేషముపైని యభిమానమును నాపైని ప్రేమయని పొరపడినాఁడు.
సుశీల : [మీరాతట్టు తిరిగి] అంతేగదమ్మా మఱి. [రాజుతట్టుతిరిగి] అట్లుగాదు లేవమ్మా [స్వగతము] ఎటుచెప్పినా చావె.
రాణా : మీరా, నీకిపు డటులనే తోఁచును లెమ్ము. హృదయముతోడ నంతయు మాఱును. - చేటికా, నీవిఁక వెడలిపొమ్ము.
సుశీల : [వారికి కనఁబడకుండ మూతి త్రిప్పుకొనుచు నిష్క్రమించును.]
రాణా : [మీరాబాయి భుజముపట్టుకొని] నీవేల యీ పిచ్చి వేషము వేసికొని నా కన్నులను దూషించుచున్నావు ? నా సంతోషము భగ్నము చేయుటకు నీవు కంకణము కట్టుకొంటివా ?
మీరా : నాథా, యెవరెవరి వేషములు వారివారి చిత్తసంస్కార స్వభావాదుల కనురూపముగ నుండును. నాకీ వేసముపై ప్రీతిగలదు.
రాణా : నాప్రీతియు తలఁపవలదా ?
మీరా : నాస్వభావమునకు విరుద్ధముగ నేనెట్లు నడచుకొనఁ గలను ? ఆ కపటనాటకుమువలన మీకెట్టి ప్రీతిగలుగును ?
రాణా : అన్యోన్య భావానుసరణము కపటనాటకముగాదు. అదియె గార్హస్థ్య జీవితమునకు పునాది.
మీరా : నేను ధర్మబాహ్యనని మీ యుద్దేశమా ?
రాణా : నీమతావేశము, అలౌకిక విషయచింతనము, నిరభిమానము, శుష్క వైరాగ్యము సామాన్య గృహస్థ ధర్మములకు భంగము గలిగించుచున్నది.
మీరా : [దీనముగ] అయ్యో! అందుకు నేనేమిసేయుదును ? నా మనస్సు నాస్వాధీనము కాకయున్నది. కన్నులు మూసినను దెఱచినను శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహము నాయెదుట నిలిచినట్లు పొడకట్టును. ఒక్కనిమిషమా రాధావల్లభుఁడు నాకన్నులకుఁ గట్టకున్న లోకమే మునిఁగిపోయినట్లు అంతయు శూన్యముగ నగపట్టును. నిమిషమొక్క యుగముగ విశ్లేషదు:ఖ మనుభవింతును. ఇట్టి జీవితము నాకు స్వభావికమైనది. ఇందు మీకేమి విపరీతము తోఁచుచున్నది ?
రాణా : అందు విపరీతము కానిదేమున్నది ? [స్వగతము] ఇంతదనుక యీ కాంతను తనదారిని తన్నేఁగనిచ్చినందులకు నేనే నింద్యుఁడను. అయినను పూర్వస్మృతిని కొంత కలిగించి చాచెదను. [ప్రకాశము] ప్రేయసీ, యటుచూడుము. ఆసుందర సరోవర ప్రాంతమును మఱచితివా ?
మీరా : లేదు.
రాణా : తామరపాకువెంబడి నిలుచుండి యాకొంగ చేయుచుండిన యుదర పూరణ తపస్సును చూడుము:
ధ్యాన నిర్మగ్నమైనిల్చి యా బకంబు
కాలు దవిలిన చేపలఁ గఱచితినును,
కపట వైరాగ్యనటనల ఘనతచూపి
గ్రుడ్డిలోకుల వంచించు గురుని పగిది.
కాయ మనపాయ మని యెంచి కాలమెల్ల
మిట్టిపాటులఁ బుచ్చెదు మీనరాజ,
విధి యదృశ్యహస్తము వెనువెంట నంటి
కడకు నిను మృత్యుపదముల కడకు గెంటు.
రాణా : [స్వగతము] ఇంతవఱకు నాయుద్దేశము తనయుద్దేశముగ నుండినది. ఇప్పుడు భిన్నము. ఇదియంతయు దుర్మతముయొక్క వైపరీత్యము [ప్రకాశముగ] అవునుగాని, మీరా, యీపాలఱాతిబండ జ్ఞప్తియున్నదా ?
మీరా : పూర్వము మనకు విశ్రాంతిపీఠము.
రాణా : పూర్వము ! - అవునవును పూర్వము ! మఱియొకమాఱిచ్చట కూర్చుండి మున్నటి వినోదములను ఆప్రణయ సఖ్యమును కొంచెము సేపు కల గనియెదము వచ్చెదవా ? ఆస్మృతి మందపవనుని సుఖోచ్ఛ్వాసమువలె, నాయొడలు పులకరింపఁజేయుచున్నది.
మీరా : కలయని తెలిసియు దానిపై నింతమక్కువ యేల ?
రాణా : [విసుగుతో] నీయీపిచ్చి ప్రశ్నలే నన్ను మాటిమాటికి హతాశుని చేయుచున్నవి. నీకేదో చిత్తచాంచల్యము కలిగియుండవలయు. రమణీయస్వప్నము ఆనందదాయకము కాదా ?
మీరా : ఆ యానంద మెంతకాలము ? కలగనినంతకాలమె. మనమేల నిరంతర దివ్యానంద మనుభవించుటకు యత్నింపఁగూడదు ?
రాణా : [ఆసతో] ఆ యానంద మెట్టిది ?
మీరా : అమృతానందము; శ్రీకృష్ణలీలాధ్యాన పారవశ్యము.
రాణా : [లాఘవముగ నవ్వి] ఓసీ పిచ్చిదాన, నీమాటలు నాదు:ఖమునందు కూడ నవ్వుపుట్టించుచున్నవి. నామనస్సు తేలికయైన యగరు ధూపమనుకొంటివా గాలిలో నెగిరిపోవుటకు ? ఊహమాత్రమైన పాల సము ద్రమును నమ్మి చేతిలోని పాయసపు పాత్రను జాఱవిడుచు మూఢుడుండునా ? దారిద్ర్యచింతా పీడితుల నూరడించుటకొఱకు, పరలోకముమీఁది యాసతో నిహలోక దు:ఖము సహించుటకొఱకు, అవివేకులను భయపెట్టి ధర్మబద్ధులను జేయుటకొఱకు పౌరాణికులు స్వర్గనరకములను కల్పించిరి. పరలోకమునకు ద్వారపాలకులు గురువులఁట! వారికి లంచమిచ్చినవారికి పరమపదము ! నిరసించినవారికి నరకము కాఁబోలు ! ఎంత యవివేకము ?
మీరా : [దీనముగ] అయ్యో! యేల యీ పరలోకదూషణము, గురునిరసనము ? అహంకారచిత్తు లెఱుఁగఁజాలని తత్త్వరహస్యము లెన్ని లేవు ?
కండ నెత్తురు ప్రాయంపుఁ గారవంబు
కనుల కెగఁదట్టఁ దత్త్వంబు గానఁబడదు;
పాలనా దండశక్తి నశ్వరమటన్న
పిడుగువంటి సత్యంబును వినెద వెపుడొ.
రాణా : మీరా, నీ నిరసన స్వభావము నాకు కోపము గొల్పినను నీయజ్ఞానమునకు మాత్రము నాకు జాలికలుగుచున్నది. ఆఁడువా రబలలు దుర్బలచిత్తలు. వివేకమునకన్న భావోద్రేకము మిక్కుటము. కావుననే మత విక్రేతలగు కపటగురువులు మిమ్ములను దేలికగ లోపఱచుకొని వంచింతురు. పాక్షికమతావలంబకులే లోకమునకు ఉపద్రవకారులు, స్వయమారోపితమైనవారి పవిత్రత ఏవము పుట్టించును; వారి దుర్ణయములు దురాచారములు మతాచ్ఛాదసముతో లోకుల మోసగించు చున్నవి. మీరా, నీమతోన్మాదము నీకు పరలోకము నిచ్చునో లేదో తెలియదు గాని, సంతోషముగను నిశ్చింతముగను గడచిపోవుచుండిన మన గార్హస్థ్య జీవితమును మాత్రము భగ్నముచేసినది.
తెమ్మెర వీవఁ గఁపిలెడి దీపము మానవ జీవితంబు; సౌ
ఖ్యమ్ములు భోగముల్ గుడువనౌను దదంతరమందుఁ; జావు స
త్య; మ్మని రూప్యసంశయపదంబు పరంబును నమ్మియేల భో
గ్యమ్మగు యౌవనాసవము నానక చిందెదవో విరక్తవై.
మీరా : [స్వగతము] ఓవిశ్వనాటక ప్రణేతా, నీవురచించిన యీ సంసార విషాదాంత నాటకమును అభినయింపించుటకు మమ్మునిరువుర నొక్కమాత్రమున బంధించితివా ? ఏమి నీమాయావిలాసము !
రాణా : [స్వగతము] సుందరుఁడయి సర్వభోగ సమో పేతుఁడయి తన్ను ప్రాణప్రదముగ కామించుప్రియుని అలక్ష్యముచేసి అప్రత్యక్షమైన యూహవిగ్రహమును మనోవైకల్యములేని యేయువతియైన ప్రేమించునా ? - ఇది యసహజము. - ఇదియొక మానసిక వ్యాధి. ఔషధసేవనము మేలుచేయవచ్చును.
[నేపథ్యమున శంఖధ్వని]
మీరా : నాథా, నేనిఁక పోవచ్చునా ? శ్రీ కృష్ణ మందిరమున శంఖమును పూరించుచున్నారు. ఇది పూజాసమయము.
రాణా : నాయొద్దిక నీకంత వెగటు పుట్టించుచున్నది కాఁబోలు. మీరా, మనజీవితమునందెంత మార్పుకలిగినదో నీవే యూహింపుమా. ఈ పరిసరములే అప్పటి మనవినోదమునకు సాక్షులు.
ఇచటి సంధ్యావిహారంబు, లిచటి చేఁత,
లిచటి యాటలుపాటలు హేళనములు,
నిచటి విడరాని కౌఁగిళ్ళు, నిచటి సుఖము
కనుల కాలేఖ్యమట్టులఁ గానవచ్చు.
మీరా : సకల వస్తువులకును మార్పు అనివార్యము. భోగములు శాశ్వతములని తలంచితిరి కాఁబోలు ! మీరు నారూపసౌందర్యమునే వలచియుందురేని నేనెప్పటికైన పరిత్యజింపఁబడవలసిన దాననే. నాసౌందర్యము నిరంతము కాదు. రోగపీడితను జరాభారకృశాంగిని కావచ్చును.
రాణా : నీవు నిజముగ లోకజ్ఞాన శూన్యవు. యౌవన సౌందర్యములెట్లు కాలబద్ధములో మానవును భోగాభిలాషకూడ అట్లె. ఆకామ్యానురాగమె అనుభుక్తమయి వార్థక్యమునందు తప్తకాంచనమువలె నిష్కల్మష మయి బహుకాల సహవాసజనిత బాంధవ్యముగ మాఱును. వసంతమున పూచిన పువ్వు శరత్తున ఫలవంతమగును. సామాన్యమైన యీ ప్రకృతి ధర్మమును గుర్తెఱుఁగని నీమనస్తత్త్వము నాకు దురూహ్యముగనున్నది.
మీరా : అసామాన్య ధర్మములుకూడ. కొన్నికలవని మీరును గుర్తింపవలయును.
రాణా : [విసుగు కోపములతో] అవి కుక్కమూతి పిందియలు. చెడుకాలమునకు పుట్టు విపరీతములు.
మీరా : మీకట్లు తోఁపవచ్చును.
రాణా : [స్వగతము] మతితప్పినవారింత యుక్తియుక్తముగ మాటలాడుదురా ? నాబుద్ధిసంశయగ్రస్త మగుచున్నది. [ప్రకాశముగ] విరాగవతీ, రసహీనమైన తర్కము నేనెఱుంగను. హృదయముల భాష వేఱు. ఆ భాషయె నాకు తెలియును. నీవనావశ్యకముగ భావిచింతనము సేయు చున్నావు. కడచినది కడచిపోయె దు:ఖమ్మొ సుఖమొ,
కడచు చున్నదె పెదవుల నిడినపాత్ర;
దానికన్న ననిశ్చితార్థంబు మేలె?
రేపు రేపను మాటకు రూపులేదు
[బ్రతిమాలుకొనునట్లు] నీవీ సన్న్యాసిని వేషమును తగులవెట్టి మున్నటి మీరావు కమ్ము.
మీరా : ఆమీరా నిఁక చూడలేరు; పునర్జన్మము వచ్చినది. నాథా, వేషములో నేమున్నది ?
రాణా : [కోపముతో] నీహృదయములో నేమున్నదో ఆవల్లకాడే వేసమునందు ప్రతిఫలించుచున్నది. ఎంతయోర్చుకొనఁ బోయినను నీయీతత్త్వోన్మాదము నాకు విసుఁగుపుట్టించి కోపము రేఁపుచున్నది. నీవు నీమతమునైనను లేదా నేను నిన్నైనను వదలుకొనవలయును. అందు నీ కేది సమ్మతము ?
మీరా : నాకు రెండును సమ్మతములుకావు. నేను మిమ్ములను ద్వేషించుట లేదు.
రాణా : ప్రేమించుటయునులేదు. అటులైన భావసామరస్యము లేని మనకు సంసారమెట్లు నిరంతరాయముగ కొనసాగును ?
మీరా : ఆసామరస్యము, ఆసంధిస్థానము మీయందును నాయందును అందఱియందును కలదు. మనమందఱము నొక్క మాత్రమున గ్రుచ్చఁబడిన ముత్యములము; ఒక్క భిత్తిపై చిత్రింపఁబడిన బొమ్మలము; ఒక్క సముద్రమున రేఁగు తరంగములము. ఈబాహ్యవివిధత్వమునందు అంతర్భూతమైన ఏకత్వము కలదు.
రాణా : ఓసి వెఱ్ఱిదానా, నీరోగమునకు మందులేదా ? మీరా : ఆమందుకొఱకె నిరంతర మన్వేషించుచున్నాను. చేతికి చిక్కీ చిక్కక మాయగారడివలె మఱిఁగిపోవుచున్నది. ఆమందు దొఱకిన నా పిచ్చియే కాదు, లోకము పిచ్చిగూడ కుదురును.
రాణా : [కోపముతో] మీరా, నీవిఁక పిచ్చిదానివికమ్ము, బిచ్చకత్తెవు కమ్ము, ఇంక నేదియైన కమ్ము, నీవుమాత్ర మిఁక నంత:పుర మర్యాదను దాఁటవలదు. సామాన్యస్త్రీలవలె అందఱికంటపడుచు నీవు కృష్ణమందిరమునకు పోవలదు. నీప్రవర్తనము నీయొక్కతెకే సంబంధించినదికాదు; మాపైకూడ ప్రతిఫలించును. ఉదయపూరు రాజ్యాధీశ్వరుని పట్టమహిషి పిచ్చిపట్టి వీథులవెంబడి తిరుగుచున్నదను అపవాదమునుండి కాచికొనుము.
మీరా : నాపై ఆస వదలితి నంటిరి. బిచ్చకత్తె నగుటకు సమ్మతించితిరి. దారిప్రక్కల దుమ్ముతోకూడ సరిపోలని నాకు అభిమానమేల ? ఆదురభిమానము పూర్వజన్మముతోడ నశించినది. దిక్కులేనివారికి దేవుఁడే తోడునీడ. బిచ్చమెత్తుటకు నాకు అనుజ్ఞయిండు; ఆలోకేశ్వరుని ముంగిట భిక్షాందేహియని నిలచెదను.
రాణా : నీపిచ్చికి నిన్ను వదలినను త్రాడుతెగినగాలిపటమువలె నిన్ను తిరుగనిచ్చుట నాకిష్టములేదు. ఇంకను నేను నీకు పతిని.
మీరా : అ కృష్ణుఁడొక్కఁడే ప్రాణేశ్వరుఁడు. లోకములోని జీవిలందఱును విరహిణులు.
రాణా : [కోపముతో] ఈపిచ్చి మఱింత ముదురుచున్నది. మీరా, నీవన్నమాట నీకుతెలిసివచ్చినదా ? - వినుము, ఇంకను నేనునీకు ప-తి-ని.
మీరా : నన్ను సేవకురాలిగ పనిగొండు. నామతమునకు నన్ను వదలుఁడు. అన్యమతస్థులే పూజ్యమైన హిందూమతమును స్వీకరించి సంసారమును తరించుచుండ మీరేల నాస్తికులగుట ?
రాణా : అన్యమతస్థులెవరు ? మీరా : అగ్బరు పాదుషావంటివాఁడే గోపిచందనము ధరించి భక్తిమార్గము నవలంబించి హిందూ మతమును ఆదరించుచున్నాఁడని వినికిడి.
రాణా : [కోపముతో] అగ్బర్ ? మరల ఆతని ప్రశంస. ఇదివఱకే పలుమాఱులు హెచ్చరించితిని. ఆతని ప్రశంస నారాజ్యమునందు అపరాధము. ఆతఁడు మేకవన్నెపులి. తేనేపూసిన కత్తి. చిరకాలమునాఁటి రసపుత్రరాజ్యములను మెలమెల్లగ కబళించుచున్నాఁడు. ఆతని రాజకీయ నీతి అతలస్పర్శి. - ఆ! - సరి, సరి. నీయభిమానమునకు కారణముకలదు. అగ్బరు నిన్ను వివాహమాడ తలఁచి యుండెనుగదా. మీతండ్రికి మానము ఆభిజాత్యము లేకుండిన నీవు సార్వభౌముని శుద్ధాంత కాంతవై యుందువు. పాపము, నీదురదృష్టవశమున నాబోఁటి యల్పమండలేశ్వరునకు భార్యవైతివి.
మీరా : కడచిన గాధలేల త్రవ్వెదరు ? మీమనస్సులోని వేరు పుర్వు ఇంకను నశింపలేదు. మీయనుమానమె మీకు తెవులులేని వేదనయగుచున్నది. అగ్బరు పాదుషా మనకు విరోధియైనంత మాత్రమున ఆయన పేరుకూడ ఉచ్చరింపకూడదా ? విరోధి లొనున్నంతమాత్రమున సద్గుణములు గౌరవింపఁబడకూడదా ? పాదుషాహి జనకునివంటి కర్మయోగియని వింటిని.
రాణా : [పిడుగడచినట్లు నిర్విణ్ణుఁడయి, కోపఘూర్ణిత నేత్రుడయి] ఏమీ ? - నాసతి - నాయెదుట - ఆరసపుత్రకుల మానాపహారిని ఆమ్లేచ్ఛుని ప్రశంసించుట ? వాని దుర్ణయములను సమర్థించుట ! - సహింపరాని పతితిరస్కృతి. ఓసి మాన రహితా, నీవెంత సాహసమున కొడిగట్టితివి ? ఆ మాయవేషగాఁడా నీకు పూజ్యుఁడు ? ఆ కపటనాటకము హిందువుల నాకర్షించి మోసగించుటకై పన్నిన పన్నాగమని నీవెఱుఁగవా ? గౌరవమైన రసపుత్రకులము చెడపుట్టిన బీహారిమల్లునివంటి వంశపాంససులు వానిపాదములు నాశ్రయించి తమకూఁతుండ్లను వాని యంత:పురకాంతలు గావించి వాని గులాములకు గులాములై తిరుగుచుండ నేనొక్కఁడనే వానిని ధిక్కరించి స్వతంత్రుఁడనై యుండుట నీవెఱుంగవా ? ఆదురా త్మునిపై ఏల నీకు గౌరవము ? నా నెత్తురు తుకతుక యుడికిపోవుచున్నది.
మీరా : [దీనముగ] అయ్యో! నేనేమిసేయుదును ? నాదురదృష్టమువలన నామాటలలో మీకు విపరీతార్థములు తోఁచుచుండును. నేను విన్నసంగతి యంటిని ? రాణా : అవునవును! విన్నసంగతి యంటివి. అంత:పురమున నీకు వాని ప్రసంగములతో ప్రొద్దుపోవుచుండెనా ? వెడలిపొమ్ము, నామనము సంక్షుబ్ధమైనది.
మీరా : [కన్నీరు నించుచు] మీకింత మనోవేదన కలిగించు నేనుండియేమి ఉండకయేమి ? శ్రీకృష్ణా, ఆపద్బాంధవా, నన్ను నీకడకు చేర్చికొమ్ము.
[నిష్క్రమించును.]
రాణా : ఎంతకాల మీయింటిలోనిపోరు ? - హృదయములోని కొలిమి ? - నాసతి నావిరోధికి వత్తాసివచ్చుట ? - రవంతయైన యళుకు లేక ఆతుచ్ఛుని జనక మహర్షితో సరిపోల్చుట, ఆ కాంత ధిక్కారము హృదయ శల్యమువలె పీడించుచున్నది. మన కింక శాంతిలేదు. మీరా, మన యిద్దరిలో నెవ్వరైన నొకరు చావవలయును.
[నేపథ్యమున] చేటిక : ఇద్దరున్నూ.
రాణా : ఏమి యీయుపశ్రుత ? ఎవరక్కడ ?
చేటిక : [ప్రవేశించి] దాసురాలిని వాసంతికను. రాణిగారూ సుశీలా యెక్కడికి పోయారని గోస్వాములవారడిగారు. ఇద్దరున్నా యిప్పుడే దేవాలయం తట్టుకు పోయారని చెప్పేసరికి దేవరవారు హెచ్చరించుకొన్నారు.
రాణా : మరల ఆయున్మాదిని దేవాలయమునకు పోయెనా ? ఈ గోస్వాములు మహిషస్వాములు మాసంసారమిట్లు వల్లకాడుచేసిరి. ఏడి యాసన్యాసి ?
[తొందరగ నిష్క్రమించును.]
[తెఱజాఱును.]
________
స్థలము 4 : ఉదయపురము.
________
[పాంథశాల. కొందఱు యాత్రికులు కునికిపాట్లు పడుచుందురు, కొందఱు నిద్రించుచుందురు. ఒక ముసలియవ్వ కాళ్ళుచాపుకొని కూర్చుండి మేలుకొలుపులు పాడుచుండును. ఈసందడికి వెంకటదాసు ముందుగాలేచును.]
వెంకటదాసు : ఏమండోయ్, గోకులదాసూ, లెగండి, లెగండి, ఎంత మొద్దునిద్రయ్యా మీకు ! పొద్దున్నే ప్రయాణమంటే నాకు రాత్రంతా నిద్రపట్టదు. ఏమండోయ్, బృందావనానికి పొయ్యేబండ్లు కదిలిపోతున్నాయి; ఈసమయం తప్పితే మనకింక మంచి దారితోడుదొరకదు. లెగండయ్యా లెగండి.