Jump to content

కుంభరాణా (మీరాబాయి)/స్థలము 1

వికీసోర్స్ నుండి

స్థలము 1 : ఉదయపురము.

[శ్రీ కృష్ణాలయాంతర్భాగము. అంతయు కొంచెము చీఁకటిగనుండును. ద్వారముచుట్టును వెలుఁగుచుండిన చిన్నప్రమిదలు కొలఁదిపాటి వెలుతురి నొసఁగుచుండును. తెఱ యెత్తఁబడఁగనే అలంకృతమైన కృష్ణవిగ్రహము, తీర్థాపాత్రాది సన్నిధి సామగ్రి, పూజించుచున్న అర్చకుఁడు, దర్శనార్థము వచ్చిన యిద్దరు యాత్రికులు అగపడుదురు. అర్చకుఁడు అర్చనానంతరము కర్పూరహారతి యెత్తును. యాత్రికు లిద్దఱుకూడ పాడుదురు]

ముదటి యాత్రికుఁడు : ఆహా! ఏమి యీదేవాలయ ప్రభావము! లోన అడుగు పెట్టినంతనే యేదో అనిర్వాచ్యమగు ఆనందము, శాంతి నా చిత్తము నావరించుచున్నవి.

రెండవ యాత్రికుఁడు : వేసవి యెండలఁ దిరిగి తిరిగి సొమ్మసిల్లు బాటసారికి శీతల తరుచ్ఛాయ సుఖమొసఁగునట్లు, సంసారపీడా జర్జరిత చిత్తుఁడైన మానవునకు ఈ కృష్ణమందిరము శాంతదాయకమగుచున్నది.

మొ. యాత్రి : అవునవును. ఒక్క క్షణములో నెంత మార్పు గలిగినది!

రెం. యాత్రి : ఇచ్చట పవిత్ర వాతావరణము నిగూఢమైయున్న మానవుని దివ్యప్రకృతిని పై కుబికించుచున్నది. [విగ్రహము తట్టుతిరిగి] నందనందనా, మరల నీదర్శనభాగ్యము లభింపఁజేయుము.

[ఇరువుఱు యాత్రికులు నిష్క్రమింతురు.]

అర్చకుఁడు : పూజల పనేగాని ఒక్కరూక కూడ పడడములేదు తీర్థపాత్రలో.

[వెంకయ్య సుబ్బయ్య అను ఇద్దఱు యాత్రికులు ప్రవేశింతురు.]

సుబ్బయ్య : [దేవాలయ స్తంభములు తక్కిన విశేషములు చూచుచుండును.]

వెంకయ్య : ఓయ్, శనిపిశాశమా, యిట్టసూడు దేవుణ్ణి. బుద్ది, బుద్ది. [చెంపలు వేసికొని] మనకా యింటికాడి కూఁతలే వస్తాయి దేవళాల్లో కూడాను. దేవుణ్ణి శేవించు.

సుబ్బ : ఆ - శేవించాంగా మఱి. దూరాపుకొండలు నునుపన్నారు పెద్దోళ్ళు. ఈసంబరానికా మఱి నన్ను గోదారినుండి ఏంటేంటో శెప్పి యింతదూరం లాక్కొనొచ్చావు ? ఇంతదూరం వచ్చాంగా యెంత పెద్ద గాలిగోప్పరం వుంటుందో అని ఆశపడ్డాను. శ్రీరంగ దేవళంలో నూరోవంతుకూడాలేదు. దాని తస్సాదీయ ఆస్తంబాలకేశి చూస్తే తలగుడ్డ కింద పడ్డాది. యెంకయ్యా, యీశిత్తరం చూశావా ? ఇంత జగప్పెళయంగా తిరునాళ్ళ జరుగుతుంటె ఒక్క జంతరిజంతరిపెట్టె కూడాలేదు. ఒక్క రంకలరాటమైనాలేదు. అదేంసూశావు, ఒక్క సుట్టపొవ్వాకు అంగడికూడా లేదు.

వెంక : ఆ, బేష్, మాబాగాశెప్పావురా సుబ్బన్నా ! ఎంత పెద్దగాలిగోపురం వుంటే అంత పెద్ద మహత్తెం గల్ల దేవుడుంటాడాయేం? ఇక్కడ మహత్తెమంతా ఆమీరాబాయమ్మగారిదే. అందుకోసమే దేశ దేశాలనుంచి జనం తేరుమోకు తీశినమల్లె వస్తుంటారు. ఒక్కసారి ఆతల్లి పాటవింటే మనజన్మం తరిస్తుందంట. ఆమె యీ పట్న మేలే రాణాగారి పట్టపుదేవంటారు. సుబ్బ : ఆలాగా ? పట్టపుదేవిని మనము సూస్తే యింకా బతకడం గూడానా ?

వెంక : ఆ బక్తురాలికి రాణి వాసంలేదు.

సుబ్బ : అందరూ సూశేటట్లు పెళ్ళాన్ని యీదులు తిప్పేరాజు యేంరాజోసి తోసిరాజు !

అర్చకుఁడు : [చేతులుతట్టి] ఓయ్, పండ్లూ ఫలాలు బేడా పాతిక యేదైనా తెస్తే సన్నిధిలో సమర్పించండి. తీర్థం శటకోపం తీసుకోండి.

సుబ్బ : ఒకమూల కడుపు కాలు తుంటే శిత్తం శివుడిమీద నిలుస్తుందా యేవిటి ?

వెంక : మీరాబాయమ్మ యెప్పుడు ఇక్కడికి వస్తాదండి ?

అర్చ : ఆమె యిప్పుడు రాదు. మీరు తెచ్చిన నైవేద్యం తృణం ఫణం యీతట్టలో పడవేయండి.

[హారతిపళ్ళెము చూపించును.]

సుబ్బ : [వెంకయ్యతో రహస్యముగ] ఇక్కడిది ఇక్కణ్ణే రంగరిస్తాం. [ప్రకాశముగ] అంతా దేవుడి సొత్తేగదండి. పళ్ళు ఫలాలు ఇక్కడివే పెట్టండి.

వెంక : ఒక అణారూక పెట్టు.

సుబ్బయ్య : కాటికాపైనా తప్పినా తప్పుతుందిగాని, అర్చకుడి కట్నంమాత్రం తప్పేది కనాకష్టం. [కుచ్చె కొంగుముడివిప్పుచు] ఇంట్లో డబ్బు స్మరణా, ఈదులో డబ్బుస్మరణా, దేవళంలోకూడా డబ్బు స్మరణేనా సోమీ ?

అర్చ : [కర్పూరము వెలిగించి హారతి త్రిప్పుచు] ఏడ్చినట్లే వుంది మీ స్మరణా, మీభక్తి ! యాత్రవచ్చినప్పుడైనా పదిపాతికలు ఖర్చు చేయరాదూ ? [ఈలాటి మంత్రములతో హారతియిచ్చి, ఒక తులసిదళం ప్రసాదముగా యిచ్చును.] సుబ్బ : కాశంత ఆ పళ్ళుఫలాలు పెసాదం పెట్టండి సోమీ.

అర్చ : కొనుక్కోని తినండి వెళ్ళండి. వచ్చేవాళ్ళకుకూడ అడ్డము. [అని అదిలించును.]

సుబ్బ : అణారూక శేతులోపడేదాక కాస్త అట్టా యిట్టావుండి అది శేతులో పడ్డపాట తన్నబోతాడ ! ఈడి తస్సాదియ మావూళ్ళోకాక పోయెనే.

వెంక : నోరుమూసుకో. అపచారం. [సుబ్బయ్యను లాగుకొని పోవును.]

[పూర్వసువాసినియగు వైష్ణవియు నొకబాలుఁడును పూజాద్రవ్యములతోఁ బ్రవేశింతురు]

వైష్ణవి : [అర్చకుని చేతి తబుకులో పూజాద్రవ్యములు పెట్టును.]

అర్చ : అష్టోత్తరమా, సహస్రనామమా ?

వైష్ణ : సహస్రనామమె చెయ్యండి.

అర్చ : అష్టోత్తరానికి అర్ధరూపాయి, సహస్రనామానికి ఒక రూపాయి.

వైష్ణ : అట్లయితే అష్టోత్తరమే జరిపించండి.

అర్చ : అర్ధరూపాయ యిట్లా పడవేయండి.

వైష్ణ : [గుడ్డకొంగు విప్పుచు] జపించండి. ఇస్తున్నాను.

అర్చ : మీయజమానుడి పేరేమి?

వైష్ణ : ఒరే, బాబు.

బాలు : ఏమవ్వా ?

వైష్ణ : మీతాత పేరటచెప్పరా.

బాలు : వరదాచార్లు.

వైష్ణ : కాదురా. బాలు : రంగాచార్లు.

వైష్ణ : కాదురా, నీకు తెలియదూ ?

బాలు : [కోపముతో] కుంకాచార్లు, వెంకాచార్లు.

వైష్ణ : ఛీ! వెధివి. [అర్చకుడితట్టు తిరిగి] అది గాదండీ. సీతా అమ్మవారి మరిదిపేరు ఏమిటండి ?

అర్చ : భరతుఁడు.

వైష్ణ : ఇంకొకాయనండి.

అర్చ : శత్రుఘ్నుఁడు, లక్ష్మణుఁడు.

వైష్ణ : ఆ, నిలపండి ఆరెండో ఆయనండి.

అర్చ : లక్ష్మణాచార్యులా ! అబ్బా ? చంపినావుగదమ్మా [అర్చన మొదలు పెట్టి పదినామములు చదివి అర్ధరూపాయ కొఱకు చూచుచు] ఈ యుగములో విచ్చేటట్టుగా వుండలేదే ఆకొంగుమూట !

వైష్ణ : ఇదుగోనండి [బేడరూక తబుకులో వేయును. బేడను చూచి అసంతృపుఁడయి అర్చనచేయుట ముగించి కర్పూర హారతి యిచ్చి, తీర్థమిచ్చును.]

బిచ్చగాడు : అయ్యా రెండుకళ్ళూ లేనివాణ్ణి, ఒక్కకాణీ దై చెయ్యండి తండ్రులారా.

బాలు : [రహస్యముగ] అవ్వా, నీదగ్గరవుండిన చెల్లని బేడబిళ్ళ ఏమిచేశావు ?

వైష్ణ : ఎందుకురా ?

బాలు : అదుగో ! ఆ గుడ్డివాడికి వేశి చిల్లరతీసుకొంటాము.

వైష్ణ : అయ్యో, నేను అర్చకుడి తబుకులో వేసి తీర్థం తీసుకొన్నా గదరా.

బాలు : అయితే పోనీలే అవ్వా, మంచిపనే చేశావు.

[ఇద్దఱు నిష్క్రమింతురు.]

[హిందూ యాత్రికుల వేషముధరించిన తాన్‌సేను ఇస్మాయిల్ ప్రవేశితురు.]

తాన్‌సేన్ : ఆహా, యేమి యీచిత్రము ! గర్భగుడి చీఁకటిలో మినుకుమినుకు మని నక్షత్రములవలె వెలుఁగుచున్న ఈ దీపములు మూల ప్రకృతిలో మెఱయుచున్న జీవాత్మలో యనునట్లున్నవి ! ఈ యగరు దూపము, ఈ కర్పూర సౌరభ్యము, ఇవి యన్నియుంజూడ మన మెదో యొక దివ్యప్రపంచమున సంచరించుచున్న ట్లున్నది. మన శ్రమకు మించిన ప్రతిఫల మబ్బినది.

ఇస్మాయిల్ : తాన్ సేన్ జీ -

తాన్ : జాగ్రత -

యిస్మా : మఱచితిని. గురూజీ, ఇచ్చట ప్రాణరహితములగు శిలలు కూడ పవిత్రము లైనవో యనునట్లు భయ భక్తులను పురి కొల్పు చున్నవి. మీరాబాయి గాన మాధుర్యముచే మెత్తవడి, భక్తుల యడుగు రాపిళ్ళకు అఱుగు వాఱిన ఈ శిలా ఫలకములు గూడ మానవ కారుణ్యమునకు పాత్రములగు చున్నవి.

తాన్ : నేను హిందూ దేవాలయము లోనికి ప్రవేశించుట కిదియే మొదటితూరి. ఇట్టి యానందము నే నెప్పుడును అనుభవించియుండలేదు. మనము పునీతులమైతిమి. మనజన్మము సార్థకమైనది.

అర్చ : [తీర్థపు గిన్నెలోని రూకలను ఎంచుకొనుచు] దమ్మిడి యాగాణి, అణా, ...ఒక వెండిరూకైన వేసిన పాపాత్ముడులేడు. లేకలేక ఒక బేడరూక పడితే అదికూడా చెల్లనిదే ! వీళ్ళభక్తి యిట్లా బద్దలవుతుంది.

[డబ్బులు తీసి రొండిన దోఁపుకొనును.]

[కొందఱు యాత్రికులు ప్రవేశింతురు. దూరమున మీరాబాయి గానము వినఁబడును. కలకలముమాని యాత్రికు లందఱు వినుచుందురు.]

తాన్ : ఆ యవ్యక్త మధురగాన ప్రవాహమెక్కడనుండి?

యాత్రికులు : అదిగో ! మీరాబాయి, మీరాబాయి.

[యాత్రికులలో కలకలము]

[మీరాబాయి పాడుచు ప్రవేశించును. సుశీల, వాసంతికి ఇంకకొందఱు స్త్రీపురుషులు పూజాద్రవ్యములతో ప్రవేశింతురు. దేవాలయములోనుండిన యాత్రికులు మీరాబాయికి సాష్టాంగ నమస్కారములొనరింతురు.]

అర్చ : [స్వగతము] ఈయమ్మవల్ల మాబ్రతుకుఁదెరువు పాడయిపోతున్నది.

మీరా : అన్న లారా, లెండు, లెండు. నాకు మీరేల మ్రొక్కెదరు ? ఈతుచ్ఛురాలి నేల ప్రశంశించెదరు ? నేనుదాసురాలను, ఈకృష్ణ మందిరమున నూడీగము చేయుదానను. బిచ్చకత్తెను. యాచించు బిచ్చగాండ్రకు ఏమిప్రయోజనముకలదు ? మనల నందఱను రక్షించుటకు కంకణము గట్టుకొన్న ఈ శ్రీకృష్ణపరమాత్మను - ఈరాధావల్లభుని - ఈభక్తవత్సలుని _ ఈయనంత కళ్యాణగుణ పరిపూర్ణుని _ ఈసౌందర్యరాశిని మనమందఱమును చేరి ప్రార్థించెదము.

[కొందఱు యాత్రికులు అర్చకుని చేతికి పూజాద్రవ్యముల నియ్యఁబోవుదురు.]

మీరా : వలదు, వలదు. మీరుతెచ్చిన పూజాద్రవ్యములను ఈలీలావిగ్రహుని పాదముల కడనుంచుఁడు. జన్మమెత్తిన ప్రతిమానవుఁడును దేవుని పూజించుట కర్హుఁడు. అందఱము సృష్టికర్తయెదుట సమానులము మధ్యవర్తితో నవసరములేదు.

[అందఱును అట్లేచేయుదురు.]

అర్చ : [కోపము దిగమ్రింగుచు] మీరు సొంతగా పూజించుకొంటే పూజించుకొన్నారుగాని, మాభాగం కొబ్బరిచిప్పలు పండ్లు ఫలాలు తృణం ఫణం ఈబుట్టలో పడవేయండి. [బుట్టచూపును.]

[కొందఱు అట్లుచేయుదురు.]

మీరా : [భక్తిపారవశ్యమున పాడును.]

[అందఱును ఆనందపరవశు లగుదురు. అర్చకునకుగూడ భక్తి గలిగి మీరాబాయికి నమస్కరించును.]

మీరా : హే కృష్ణా, భక్తజనహృత్పద్మాసనాసీనా.

[ధ్యాన నిర్మగ్నయగును; సుశీల ఆమెను పడనీయక పట్టుకొనియుండును.]

తాన్ : మిత్రమా, నేనిఁక గాయక సార్వభౌముఁడనుగాను. నాగర్వము నేలగఱచినది. నాగాన నైపుణ్యము తృణప్రాయమైనది. మీరాబాయి బ్రతికియున్నంతవఱకు లోకమున మఱియెవ్వరును గాయకసార్వభౌములు లేరు. ఆహా ! అగ్బరు చక్రవర్తియే ఈభక్తురాలి గానము విన్న -

ఇస్మా : చక్రవర్తి బిచ్చగాఁడగును. కృష్ణమందిరమె వాసగృహమగును.

[మీరాబాయి మెల్లగా కన్ను లెత్తిపాడుచు కదలును; అర్చకుఁడు తప్ప అందఱును ఆమెననుసరింతురు.]

[తెఱజాఱును.]

_______