కుంభరాణా (మీరాబాయి)/స్థలము 10
[నేపథ్యమున మీరాబాయి గీతము పాడుచు పోవుచుండును. ఆగీతము క్రమక్రమముగ సన్న గిల్లును.]
తాన్ : మనహృదయము లింకను పరిశుద్ధము కావలయును?
అగ్బ : ఇదియె కడసారి పాట!
తాన్ : అశరీర గానము ఆకసమునఁ దేలిపోవు చున్నట్లున్నది.
అగ్బ : ఆ గాన మస్ఫుటమై లయించినది. అకటా ! మీరాబాయి నిఁక మర్త్యలోకమునఁ జూడలేము.
చిర విరహతాప సంశీర్ణ చిత్త, మీర
యభిసరించుచు నున్నది యాత్మనాథు -
తాన్ : నెన్నడో దివ్యపాదోధి నెడసినట్టు
జలకణంబు సంగమ తృష్ణఁ జనెడురీతి.
[తెరజాఱును.]
_______
స్థలము 10 : రాజమందిరము.
_______
[రాణా చెదరినవెంట్రుకలతో ఉద్రిక్తచిత్తుఁడై అటునిటు తిరుగుచుండును]
రాణా : మీరా యింతలోన విషముత్రావి యైనను ఉరివేసుకొని యైనను లేక యమునలో దూకియైనను ప్రాణపరిత్యాగము గావించుకొని యుండును. ఓసీ, కాంతాపాత్రనిర్వహణముతో నన్ను మోసగించిన పిశాచీ! నీవు యమునలోనే దూకి చావుము. నీ యపయశో మాలిన్యము గుర్తింపరాక ఆ యమునా జలనీలిమములో మిళితమై పోఁగలదు. నీ చిఱునవ్వు మఱుగున విషదిగ్ధమగు కోఱల నెట్లు దాఁచుకొని యుంటివి? - నే నెంతబుద్ధిహీనుఁడను! ఇంకను ఆ కులభ్రష్టవిషయమై చింతించు చున్నాను; దాని మనోహర ప్రతిమను నాహృదయమునుండి బలాత్కారముగఁ బెఱికివైచితిని. కాని, మచ్చ మాత్రము మాసిపోదు.
ఒక్క దినములో వార్థక్యము వచ్చినట్లు తోఁచుచున్నది! నా జీవితపు పునాదియే సడలినట్లు కదలుచున్నది. నేను కుంభరాణాకన్న నన్యుఁడను భ్రమపుట్టుచున్నది - నాస్మృతి పథమున జీవించియున్న కుంభరాణా, ఇప్పటి నన్ను నీ వెక్కిరింపకుము! - ఆ! గతస్మృతి! ఇది మరణదండనమున కన్న హింసాకరము! ఘోరము!
[కుమారసింహుఁడు ఎగుఊపిరితో పరుగెత్తుకొనివచ్చును]
కుమారసింహుఁడు : అగ్బ రిచ్చటనే యున్నాడు.
రాణా : ఎక్కడ? అంత:పురములోనా?
కుమా : కాదు. యమునామార్గమున రాణిగారిని నే ననుసరించు చుంటిని.
రాణా : కానిమ్ము, ఒక్కమాటలో చెప్పుము! ఎక్కడ?
కుమా : అచ్చట నొకచోట నిద్దఱు మనుష్యులు ఆమెతో మాటలాడుచుండిరి. వారిలో నొకడు "మీమరణ దండనమునకు కారణమైన రాక్షసులమని చెప్పుచుండెను. నేను పరుగెత్తుకొని వచ్చితిని. అతడే అగ్బరు కావలయు.
రాణా : [కోపముతో] ఆ దుశ్చరితుఁడే అగ్బరు కుమారసింహా, నీ వేల యింత మందబుద్ధివైతివి? ఆ యంత:పుర ద్రోహి ప్రక్కలో నొక్క కత్తిపోటు పొడిచి యా సంతోషవార్తను దెచ్చుటకుమాఱు ఊరకయేల బేలవై పరుగెత్తుకొని వచ్చితివి?
కుమా : [చేతులు పిసుగుకొనుచు] ఆజ్ఞకొఱకు. రాణా : ఓరి, దుర్బలహృదయుఁడా. కాలు దవిలిన విష సర్పమును చావమొత్తుట కెవరియాజ్ఞ కావలయును? పొమ్ము! ఱెప్పపాటులో ఆస్థలము చేరుము. నీ పిడిబాకుతో వాని హృదయమును జీలిచి ఆరక్తపూరములో నీ రుమాలు గుడ్డను తడిపి కొనిరమ్ము. [చేతిగుడ్డను విసరి కుమారసింహునితట్టు పాఱవేయును; కుమారసింహుఁడు వంగి అందుకొనును]
ఆ దురాత్ముఁడు మీరాను ఢిల్లీకిఁ దీసికొనిపోవుటకు వేచియున్నాఁడు. అదియె వారు నిర్ణయించుకొన్న సంకేతస్థలము. - ఇంకను నీ విచ్చటనే యున్నావా? పరుగెత్తుము. ఎగిరిపొమ్ము. [కుమ్మరసింహుఁడు నిష్క్రమించును] వంటయిలుసొచ్చిన కుందేటిని వదలివచ్చితివి.
ఓరీ! పాదుషా, నీకు దగిన శిక్షను నీవు పొందనున్నావు. ప్రాణములతోడ నీవు మరల ఢిల్లీకిఁబోవు. ఓ మృత్యుదేవతా, ఈనాఁటిరాత్రి నీకుఁ జేతినిండ పనిదొరికినది. ప్రళయంక రోన్మత్త నృత్యము గావింపుము.
ఆఁ! యిసీ! నేనెంత మందమతిని? ఎంతపొరపడితిని? నాయంత:పురము నారడి వుచ్చి, నా యానంద భాండమును బగులఁ దన్ని, మా పవిత్ర వంశ యశమును అపవాద దూషితము గావించి, నన్నిట్లు పిచ్చిబికారిని జేసిన యా నరాధముని ఈ కరవాలమునఁ గ్రుమ్మి యాతని మరణవేదన నా కను లారఁ జూడకున్న నా హృదయ సంతాప మెట్లు తీఱును? అగ్బర్, నీకు మృత్యు వాసన్నము. [ఖడ్గహస్తుఁడై వేగముగ నిష్క్రమించును.]
[యవనిక జాఱును.]
స్థలము 11 : యమునానదీ మార్గము.
________
[గాఢాంధకారము. రాణా ఖడ్గ హస్తుఁడై ప్రవేశించును.]
రాణా : ఇదియేనా యమునకుఁ బోవుమార్గము ? [నలుప్రక్కలఁ