Jump to content

కుంభరాణా (మీరాబాయి)/స్థలము 11

వికీసోర్స్ నుండి

రాణా : ఓరి, దుర్బలహృదయుఁడా. కాలు దవిలిన విష సర్పమును చావమొత్తుట కెవరియాజ్ఞ కావలయును? పొమ్ము! ఱెప్పపాటులో ఆస్థలము చేరుము. నీ పిడిబాకుతో వాని హృదయమును జీలిచి ఆరక్తపూరములో నీ రుమాలు గుడ్డను తడిపి కొనిరమ్ము. [చేతిగుడ్డను విసరి కుమారసింహునితట్టు పాఱవేయును; కుమారసింహుఁడు వంగి అందుకొనును]

ఆ దురాత్ముఁడు మీరాను ఢిల్లీకిఁ దీసికొనిపోవుటకు వేచియున్నాఁడు. అదియె వారు నిర్ణయించుకొన్న సంకేతస్థలము. - ఇంకను నీ విచ్చటనే యున్నావా? పరుగెత్తుము. ఎగిరిపొమ్ము. [కుమ్మరసింహుఁడు నిష్క్రమించును] వంటయిలుసొచ్చిన కుందేటిని వదలివచ్చితివి.

ఓరీ! పాదుషా, నీకు దగిన శిక్షను నీవు పొందనున్నావు. ప్రాణములతోడ నీవు మరల ఢిల్లీకిఁబోవు. ఓ మృత్యుదేవతా, ఈనాఁటిరాత్రి నీకుఁ జేతినిండ పనిదొరికినది. ప్రళయంక రోన్మత్త నృత్యము గావింపుము.

ఆఁ! యిసీ! నేనెంత మందమతిని? ఎంతపొరపడితిని? నాయంత:పురము నారడి వుచ్చి, నా యానంద భాండమును బగులఁ దన్ని, మా పవిత్ర వంశ యశమును అపవాద దూషితము గావించి, నన్నిట్లు పిచ్చిబికారిని జేసిన యా నరాధముని ఈ కరవాలమునఁ గ్రుమ్మి యాతని మరణవేదన నా కను లారఁ జూడకున్న నా హృదయ సంతాప మెట్లు తీఱును? అగ్బర్, నీకు మృత్యు వాసన్నము. [ఖడ్గహస్తుఁడై వేగముగ నిష్క్రమించును.]

[యవనిక జాఱును.]

స్థలము 11 : యమునానదీ మార్గము.

________

[గాఢాంధకారము. రాణా ఖడ్గ హస్తుఁడై ప్రవేశించును.]

రాణా : ఇదియేనా యమునకుఁ బోవుమార్గము ? [నలుప్రక్కలఁ గలయంజూచి] అమావాస్యరాత్రి, కాఱుమబ్బులు నలుదెసలు నావరించి యున్నవి. ఈ వృక్షశ్రేణులక్రింద నాకు నేనే యగపడుటలేదు! చినుకులు గూడ పుటపుట రాలుచున్నవి. అంతయు నాహృదయమువలె గాఢాంధకార మలీమసమైనిశ్శబ్ద సమాధిగ నగపడుచున్నది. [ఆలకించి] ఎవరిదా కాలిచప్పుడు? [మరల నాలకించి] కాదు, కాదు. చెట్లయాకులు కదలుచున్నవి. [పరికించి] ఇచ్చట ఎవ్వరును లేరు. వా రింతవఱకే వెడలిపోయి యుందురా? [కొంత పరిక్రమించి] అచ్చట నేదియో యొక యాకృతి కనఁబడుచున్నది. [కాలిచప్పుడు కాకుండ దగ్గఱకుపోయి కత్తితో పొడుచుట నభినయించి] ఓ! తరుకాండము! అగ్బ రని భ్రమించితిని!

[వెదకుచుండును.]

[కుమారసింహుఁడు ఖడ్గహస్తుఁడై ప్రవేశించును.]

కుమారసింహుఁడు : [స్వగతము] నే నెచ్చట వెదకినను వారిరువురు నగపడలేదు. ఈ చెట్ల నీడలో దాగుకొని యుందురు. [అటునిటు పరికించి] అదిగో! చీకటిలో నస్పష్టముగ నటునిటు తిరుగుచున్న వ్యక్తియె అగ్బరు పాదుషా. ఆతని యీకత్తిచే నొక్క పోటు పొడిచి నా స్వామి ఋణమును దీర్చుకొందును. [మెల్లగాపోయి పొడిచి] అగ్బర్ పాదుషా, యిది యుదయపూర్ రాజ్యాధిపతి యాజ్ఞ. నీ దుండగమునకు దగిన మరణదండనము - నా స్వామి ఋణము దీర్చుకొంటిని.

రాణా : [తరుకాండమున కానుకొని బాధ నభినయించుచు] అయ్యో! ప్రమాదము! కుమారా, చచ్చితిని, చచ్చితిని.

కుమా : [దు:ఖోద్వేగముతో] హా! స్వామి ఘాతుకుడను. అయ్యో, తండ్రీ, నీవేల యింతలో నిచ్చటకు వచ్చితివి? హతవిధీ, తలపట్టి యీడ్చుకొని వచ్చితివా? ఈదు:ఖము దుర్భరము. మీ సేవకుడు మిమ్ము ననుసరించుచున్నాడు. [నడుము కట్టులోనున్న ఖడ్గముదూసి పొడుచుకొని] తండ్రీ, మన్నింపుము. మన్నింపుము. - విధి - చేష్ట - వి - ధి - చే - ష్ట - [మరణించును.]

రాణా : [తరుకాండము క్రిందికిజాఱి] కుమారా, స్వామిభక్తున కనురూపమె నీప్రాణ పరిత్యాగము, ప్రయోజనమేమి? నావైన ఏల బ్రతుకవు? తలంపని చోటనుండి కులిశాఘాతము! ఎంత ఘటనా వైపరీత్యము.

ఓరీ, అగ్బర్, నీకింకను మంచి దినములుగలవు; నీవు బ్రతికితివి. నే నిప్పు డశక్తిమంతుఁడను. ఒక్క నిమిషములో మరణింపనున్నాను. కాని, నీకుమాత్రము దండనము తప్పదు. నా యవమానమును కులావమానముగఁ దలంచిన యే రసపుత్ర వీరుఁడైనను నా మనో నిశ్చయమును నెరవేర్పఁగలఁడు. రక్తజ్వాలా భయంకరమైన నా యభిశాపము పిడుగువలె నీ తలపై ప్రేలఁ గలదు.

[అగ్బరు తాన్ సేనులు ప్రవేశింతురు.]

అగ్బరు : ఎవఁడో వేదనా భరితుఁడు నన్ను నిందించుచున్నాఁడు. [దగ్గఱి] అయ్యా. మీ రెవ్వరు? అగ్బరు నేల శపించుచున్నారు?

రాణా : [వేదనా గద్గదస్వరముతో] ఆ పరమపాతకుని నామమును మీ రేల యుచ్చరించెదరు? ఆమొగలాయి కులకలంకుఁడు నన్నారడిపుచ్చి నా యిల్లాలిని దొంగిలించుకొని ఢిల్లీకి పాఱిపోవుచున్నాఁడు.

తాన్‌సేన్ : ఇదియేమి భ్రాంతి ?

అగ్బ : మీకేల యింత దురవస్థ కలిగినది?

రాణా : విపరీత సంఘటనము.

అగ్బ : అగ్బరును చంపింప నెంచి మీరే చంపఁబడితిరా?

తాన్ : పాదుషాకు ప్రాణాంతకమైన గండము తప్పినది.

అగ్బ : కుంభరాణా.

రాణా : నారాజ్యమున నన్ను బేరుపెట్టిపిలచు మానవుఁ డెవ్వడు? అగ్బ : అగ్బరు మీ యంత:పురముఁ జొచ్చినది నిజము. తన జీవితమును పునీతముచేసి కొనుటకై పరమ భక్తురాలైన మీరాబాయిని సందర్శించెను. ఆమె పాదరజ: ప్రసాదము యాచించుట కొఱకు సాధారణ ధర్మములు లెక్క సేయక పాదుషా సాహసించెను.

రాణా : [భూమిపైనుండి సగము నిక్కి] ఏమీ? అగ్బరు మీరాను మోహింపలేదా?

అగ్బ : తల్లి స్తన్యపానము చేయుచున్న పసిబిడ్డకు మోహ మంట గట్టు నీచు డెవ్వఁడుండును?

రాణా : నీవెవ్వడఁవు? అగ్బరు సహాయులలో నొక్కఁడవా?

అగ్బ : నేనే అగ్బరును.

రాణా : [క్రోధముతో] అగ్బర్! [దూరముగ పడియుండిన కత్తి కయి చేయి తడవును]

అగ్బ : [కత్తితీసికొనివచ్చి కుంభరాణా కందించుచు] నా మరణమువలన నీ హృదయము నీ మరణకాలమున క్రోధరహితమయి, సుఖవంతమగు నేని నన్ను వధింపుము. ఇదిగో! అనాచ్ఛాదితమైన నా వక్షస్థలము. [మోకాలుపైన వంగును]

తాన్ : ఏమి యీ సాహసము? [చేయిపట్టుకొని పైకి లాగును]

రాణా : [ఇతి కర్తవ్యతా మూఢుఁడయి, ఆశ్చర్య స్తంభితుఁడయి] పాదుషా, నీవు సత్యము పలుకుచున్నావా? ఇంతదనుక నన్ను బాథించుచున్న సంశయము కేవలము స్వప్నమా? మీ రిరువురును నిరపరాథులా?

అగ్బ : రాణా, నీ యెడల నాకు జాలి కలుగుచున్నది. మీరాబాయి మాతల్లి. నే నామె పుత్రుఁడను. ఇంతకన్న నెక్కుడుగ నేనేమి చెప్పఁగలను? నీకేల యింత భ్రాంతి కల్గెను?

రాణా : పాదుషా, నా హృదయమున మెరముచుండిన శల్యమును పెరికి వైచితివి. నాకు నీవు ప్రబలద్వేషి వయ్యును ఇప్పుడు పరమాప్తుఁడ వైతివి. సంశయ గ్రస్త చిత్తుఁడనై బ్రతికియుండుటకన్న సత్యమెఱుంగుట కాస్పదమైన యీ మరణమె సుఖవంతము. అగ్బర్, నా మీరా యేమైనది?

అగ్బ : ఆ పతివ్రతా శిరోమణి యమునాగర్భము నాశ్రయించినది.

రాణా : [గద్గదస్వరముతో] హా! పరమ పాతకుఁడను. ఆ అమాయికను నిష్కారణముగ హింసించినందులకు దు:ఖించెదను. మందమతినై తప్పుజాడపట్టితిని. స్వయంకృతాపరాధమునకు తగిన చరమశిక్ష ననుభవించు చున్నాను. - అబ్బా, భ్రమ కప్పుచున్నది. - మీరా - మీరా - క్షమాపణము వేడికొనుటకై నీయొద్దకే వచ్చుచున్నాను. - పాపాత్ముఁడనని పెడ మోము పెట్టకుము. నీ యెదుట నంజలి బద్ధుఁడనై నా యపరాధము నొప్పుకొందును. మీరా - మీరా - మన్నింపుము - కనికరింపుము - మీ - రా - మీ - రా - రా - రా - [మరణించును.]

అగ్బ : రాణా మరణమునకన్న నా బ్రతుకే శోచనీయము. ఆతఁడొక్కసారియే మరణించెను. నేను ప్రతిక్షణము మరణవేదన ననుభవించు చున్నాను.

తాన్ : మృత్యువు దైవముయొక్క అమోఘాస్త్రము.

అగ్బ : అజ్ఞాతముగ మన మీ ఘటనావర్తములోని కీడ్వఁబడితిమి.

                      పరమభక్తురాలి పదములు సేవింప
                      భక్తితోడ నిటకు వచ్చినాఁడ,
                      దైవఘటన మెట్లు తలపోతు? మరలెద
                      రక్తసిక్తమౌ కరంబుతోడ.

                                                                             [తెరజాఱును.]

సంపూర్ణము.

29-10-1924

______:(0):_______