కాశీయాత్ర చరిత్ర/ఇరువది మూడవ ప్రకరణము
దాయము యీరాజ్య్హములో 2 లక్షల దాకా వుండేటట్టు విన్నాను. యిక్కడానున్ను బందిపోటు వుపద్రవము చెన్నపట్టాణములో వారంటు తియ్యడాలు జడిజీకోటుకు యీడ్చడాలవలెనే వొకరి మీద వొకరికి కోపమువస్తే నిమిషములో జరిగింపుచున్నారు. ఆదివారము రాత్రి నేను దిగిన వూళ్ళో వొక బిందువు పడకపోయినా విజయనగరములో అమితమయిన వర్షము కురిసినది.
ఇరువది మూడవ ప్రకరణము
12 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో వుండే ఆలమంద యనే వూరు 2 గంటలకు చేరినాము. యీ విజయనగరము దేశపు బోయీలు బాగా నడుస్తారు. చెన్నపట్టణములో పల్లకీసవారీలయొక్క షోకు బహుశా అందరికి కలిగి వున్నందున గంజాము మొదలుగా వుండే బోయీలందరు చెన్నపట్టణము వచ్చుచున్నారు. చెన్నపట్టణములోనుంచి నాతోకూడా యాత్రవచ్చిన యాత్రబోయీలలో కొందరు యిండ్లు బురంపురము వద్ద వున్నందున వారు శలవుతీసుకొని వెళ్ళినారు.
నేను కన్యాకుమారి మొదలుగా కాశ్మీరమువరకు సంచరించిన ప్రదేశములలో వుప్పాడ బోయీలకు సమానమైన మోతగాండ్లు, చూపరులు, బలాఢ్యులు, అలంకారప్రియులు, ప్రయాసకు వోర్చగల వారు, బంట్రౌతుమానాగా ఆయుధధారణప్రియులు యెక్కడా వున్నట్టు తోచలేదు. అయితే దేశముకాని కొన్నిదేశాలకు వస్తే యీ వుప్పాడ బోయీలకు దేహదార్ఢ్యము తప్పి రోగిష్టులొవుతారు. వారిని జాగ్రత్తగా కాపాడుచూ వారి దేహములు వొచ్చిన కాలమందు ఆయా దేశస్థులయిన బోయీలతో పనిగడిపి వీరిని తీసుకొనివస్తే యీ వుప్పాడ బోయీలతో భూగోళ సంచారము యావత్తూ చేయవచ్చునని తోచుచుచున్నది. పాలకీలు మోశే వృత్తికి యీ వుప్పాడదేశస్థులనే ఈశ్వరుడు తగినవారినిగానే నియమించినట్టు తోచబడుచున్నది. అయితే వీరు మాంస, మద్య, మత్స్యప్రియులు మిక్కిలి అయినంచున వీరు తాగి నప్పుడు తమలో రాము పోట్లాడితే పోట్లాటలు ఖామందుల మనసున నిండా నొప్పిచేస్తున్నది.
నేడు వుదయాన నడిచినదోవ కుంఫిణీలయను దారి కిరుపక్కలా చెట్లుమాత్రము పెట్టి యండాకాలములో వాటికి నీళ్ళు పోయడానకు మనుష్యులను వుంచుతారు. వర్షాకాలము రాగానే ఆ మనుష్యులను తీసివేయడమువల్ల పెట్టినచెట్లు అదృశ్యమయి మళ్ళీయివతలి సంవత్సరానకు కొత్తచెట్టు పేట్టవలసి వున్నవి.
యీ రాజ్యములో వీరభద్రరాజు యనేవాడు తనకు కావలశినంతా నారాయణ బాబుగారి కార్యస్థులు యివ్వలేదని కొళ్ళగాండ్లను కొలువు పెట్టించి మనుష్యులను హింస చేయుచున్నాడు గనుక నేను బురంపురములో కొలువు పెట్టిన ఆరుగురు బంట్రౌతులు శ్రీకాకొళమునుంచి కోటునజీరు తయినాతి పంపించిన ముగ్గురు జవాన్లు గాక నారాయణబాబుగారి ఫౌజు సంబంధ మయిన పదిమంది శిఫాయిలను కూడా తెచ్చినాను. ఆలమందలో విజయనగరమురాజు నారాయణబాబుగారి షడ్డకుడు వాసము చేస్తాడు. 10 బ్ర్రాహ్మణయిండ్లున్నవి. సమస్తమైన పదార్థాలు అంగళ్ళు కలవు గనుక దొరుకుచున్నవి. యిక్కడ వర్ష ప్రతిబంధముఛేత యీ వూళ్ళో యీరాత్రి వసించినాను.
13 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో వుండే సబ్బవర మనే వూరు 2 గంటలకు చేరినాను. దారి బహు దొంగల భయము. కొండలు, అడివి దారి కిరుపక్కలా వున్నవి. కొంతదూరము రాతిగొట్టు తతిమ్మాదారి కొంతదూరము యిసకపొర, కొంతదూరము రేగడాభూమిగా నున్నది. ఆలమంద అనే వూరికి సమీపమందు అరణ్యము మధ్యే కొండమీద పర్మనాభమనే స్థలము వున్నది. పురాతన ప్రతిష్టగాని అనాదిపురాణ సిద్ధముకాదు. అక్కడ మానుషసంచారము విస్తారములేదు. సబ్బవరమనే వూళ్ళో వెన్నకోటివారు వొక గ్రామము విజయరామరాజువద్ద సంపాదించి వొకపాలు అగ్రహారానకు వృత్తులు చేసి మరివొక పాలు అన్నసత్రానకు వొదిగేటట్టు నిశ్చయము చెసి వొక అన్న సత్రము కట్టి మరివొకపాలు తమ వంశస్థుల అనుభవానకు వుంచి నాడు గనుక అతని వంశస్థుడైన రవణప్ప ఆ సత్రము లోకోపకారముగా బహుచక్కగా నడిపింపుచున్నాడు. యీ దినము మేము కొంచము తడిశినందున యీ రాత్రికూడా నిలిచినాను. యీవూళ్ళో వచ్చిన సమస్తజాతిపాంధులకు కావలసిన భోజనసామానులు యీ సత్రములో బలవంతముచేసి కావలిస్తే పక్వాన్నముగాకూడా పెట్టుతారు. అంగళ్ళు విచారించనక్కరలేదు. 40 బ్రాహ్మణయిండ్లున్నవి. మంచి వసతైన గ్రామము.
యీవూరికి రెండుకోసులదూరములొ సింహ్వాచల మనే మహా స్థల మున్నది. ఆ గుడిఖర్చుకు సాలుకు 10 వేల రూపాయిలు తగులు చున్నవి. యీ ధర్మము విజయనగరపురాజు పరిపాలనఛేయుచున్నాడు. యీస్థల మహాత్మ్యము ప్రహ్లాదుణ్ని తండ్రిదండనవల్ల నివర్తింప చేసి కాపాడిన అవసరము. యీ మూర్తి పేరు వరాహ నరసింహమూర్తి. అనేక జలధారలు స్రవింఛే పర్వతము మీద వరాహాకృతిగా ఆ మూర్తి వొకమందిరములో వసించివున్నాడు. 200 వైష్ణవుల యిండ్లు యీ స్థలమందున్నవి. రాజోపచారములతో యీ మూర్తిని ఆరాధింపుచున్నారు. అక్షతదియతప్ప మరియేదినము ఆ మూర్తి దర్శనములేదు. తతిమ్మా దినాలు చందనముచేత ఆ మూర్తిని కప్పివుంటారు. యీ మూర్తియొక్క ధాన్యశ్లోకము యీ అడుగున వ్రాయుచున్నాను. శ్లోక: త్రాహీతి వ్యాహరంతం త్రిదశా రిపుసుతం పాతుకామ స్స్వభక్తం ı విస్రస్తం పీతవస్త్రం జిజకటియుగళే నవ్యహస్తే గృహ్ణన్ ı వేగశ్రాంతం నితాంతం ఖగపతి మమృతం పాయయ న్యస్స్వపాణౌ ı సింహాద్రౌ శీఃఘ్రపాతక్షితినిహితపద: సాతుమాం నారసింహ: యీ శ్లోకమే యీస్థల మాహాత్మ్యానకు సంగ్రహమని తెలియవలసినది.
14 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కదికి 7 కోసులదూరములో నుండే కసంకోట అనేవూరు 9 గంతలకు చేరినాను. దారిలో అనకాపల్లి హనే మజిలీవూరు వున్నది. పోలీసు అమీనున్ను40 యిండ్ల బ్రాహ్మణాగ్రహారమున్ను కలది. దారి నిన్నటివలెనే భయోత్పదములయిన మన్యాలు యిరుపక్కలా కలిగివున్నవి. కనంకోట యనే వూరు గొప్పదేను. అన్నిపదార్ధాలు దొరికేపాటి అంగళ్ళు కలవు. బ్రాహ్మణ యిండ్లలో వంట, భోజనము కాచేసుకుని వొక గంటకు బయిలుదేరి యిక్కడికి యేడుకోసులదూరములో నుండే యలమంచిలి యనే వూరు ౭ గంటలకు చేరినాను.
నేటి మధ్యాహ్నము దారిలో వ్యాఘ్రభయాలుకూడా కద్దు. యిది మజిలీవూరు అయినప్పటికిన్ని దారి వొత్తి వొకకోసుదూరములో వుండే దివ్యల అనే గ్రామ నివాసి యయిన భాగవతుల కిత్తన్న యెదురుగా వచ్చి తన వూరికి రమ్మని ప్రార్థించినందున ఆ వూరు ౭ గంటలకు ప్రవేశించి ఆరాత్రి ఆ మరునాడు శుక్రవారము వర్ష ప్రతిబంధముచెత నిలిచినాను. యీ వూరు ౧౦౦ యిండ్ల అగ్రహారము. అందరు ఉపపన్నులు అయినప్పటికిన్ని వొక యతిశాపముచేత పెంకుటిండ్లు కట్టక పూరియిండ్లల్లో కాపురము చేయుచున్నారు. యీ వూళ్లో వుండే బ్రాహ్మణులందరు వేదపారంగతులు. కిత్తయ్య యనే వారు జమీౝదారుడున్ను, మంచి సాంప్రదాయికుడున్ను. యీ వూళ్ళో అంగళ్లు కలవు. అన్ని పదార్ధాలు దొరుకును.
౧౬ తేది వుదయాత్పూర్వము ౪ గంటలకు లేచి యిక్కడికి ౫ కోసుల దూరములో నుండే నక్కపల్లి వుపమాకా యనే వూళ్లు ౯ గంతలకు చేరినాను. దారి కొంత వెల్లడిగా వున్నది. కొంతదూరము యిసకపరగానున్ను, కొంతదూరము రేగడగానున్ను వున్నది. వుపమాకా యనే వూళ్ళో వొక చిన్నకొండమీద వెంకటాచలపతి గుడి వున్నది. ౫౦ యిండ్ల వైష్ణవాగ్రహారము ఆ గుడిని నమ్ముకుని వున్నది.వెంకటాచలపతిపేరు ప్రసిద్ధి.యీవూరు మొదలుగా దక్షిణదేశములో కలిగివున్న దని తెలియవలసినది. ఆకు తినే మేకల మందలు పొలాలలో విశాఖపట్టణముతోచేరిన విజయనగరపు రాజ్యము సరిహద్దు మొదలుగా చూస్తూవస్తాను. జగన్నాధము మొదలుగా యేదలనే యెనుములు పోతులు విస్తారము కలవు.
విశాఖపట్టణము జిల్లా సాలుకు ౧౪ లక్షల రూపాయిలు యెత్తుచున్నది. భూమి యావత్తు జమీౝదారుల అధీనముగాని కలకటరు అమానీ విచారణలో యేమాత్రమున్ను లేదు. జమీౝదారులకు యీ జిల్లాలో 100 కి 24 వంతున లాభమువచ్చును. అయినా బందిపోట్లవల్ల నిండా నొచ్చిపోవుచున్నారు. నక్కపల్లి, వుపమాకా యనే వూళ్ళున్ను చేరినట్టుగానే యున్నవి. మధ్యే వొక చెరువుకట్టకద్దు. వుపమాకాలొ వొక శివమందిరమున్ను, దానిలో చేరినట్టు వొక సత్రమున్ను వుండగా అందులో దిగినాను. నక్కపల్లెలో అన్ని పదార్ధములు దొరుకును.
యీ దేశపు స్త్రీలు మంచి సౌందర్యము కలవారుగానున్ను, ముఖలక్షణము కలవారుగానున్ను అగుపడుతారు. జాఫరావిత్తుల వర్ణముచేసిన బట్టలు వుపపన్నులు కట్టుతారు. కాళ్ళకు పాడగాలు వెయ్యడము కలిగివున్నది.
సర్వసాధారణముగా యీ దేశమందు తెనుగుభాష ప్రచురముగా వున్నది. మాటలు దీర్ఘముగానున్ను దేశియ్యమయిన శబ్దహ్రస్వముగానున్ను పలుకుతారు. తెనుగు అక్షరములు గొలుసుమోడిగా వ్రాస్తారు. మనుష్యులు స్వభావమూఅ దౌష్ట్యములు చేయతలచినా మంచితియ్యని మాటలుమాత్రము వదలరు. యేపనిన్ని వూహించి చేస్తారు. యీ వూళ్ళో రాయవరపు మునిషీ కోటూరు వీరరాఘవమొదిలిని కలుసుకొనే నిమిత్తము యీ రాత్రికూడా నిలిచినాను.
17 తేది వ్దయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 4 కోసులదూరములో వుండే తుని యనే వూరు 7 గంటలకు చేరినాను. యీవూరివద్ద తాండవ మనే నది వొకటి, కసంకోటవద్ద శారదా అనే వది వున్నట్టె వొకవాగున్నది. యీ తాండవనదికి అవతలిపక్క రావుపేటాయనే వూరు వొకటి వున్నది. అక్కడ తపాలాఆఫీసు రయిటరు వొకడు ఆఫీసును వుంచుకుని వున్నాడు. ఈ రెండువూళ్ళుగొప్పబస్తీలు. యిక్కడ హేడ్డాపోలియను వసముచేయుచున్నాడు. సమస్త పదార్ధములు దొరుకును. యీవూరినుంచి రాజమహేంద్రవరానము కుంఫిణీవారు వేసిన లయను దారి మన్యాలమీద వేరేచీలి పెద్దాపురము, పిఠాపురముల నిమిత్తము లేకపోవుచున్నది. ఆ దారి వొక ఆమడ సమీపమయినప్పటికిన్ని, బండ్లదారి అయివున్నా నాతొకూడా చెన్నపట్టణమునుంచి వచ్చిన బోయీలయిండ్లు పిఠాపురపుదారిలో వున్నందున వారి సంతో తనిమిత్తము ఆ దారివళ్ళ నిశ్చయించినాను. యీ మధ్యాహ్నము నడిచినదారి బహుదూరము రేగడ, అడివి నిండాలేదు. దారి కిరుపక్కలా కొంతదూరములో చిన్నకొందలు వుండివున్నవి.
గంజము మొదలుగా అన్ని యిండ్లలో యర్రమన్ను గోడలకు పూశి సున్నపుచుక్కలు నాలుగైదు అంతస్తులుగా బారుతీర్చి వుంచుతారు. కడపలకు పసుపు కుంకుమ వుంచుతూవస్తారు. విజయనగరము మొదలుగా రనచెక్కలని కాచు కలిపి నిండు, చిన్నపోకలను వుడకపెట్టి వక్కలుగా అమ్ముచున్నారుగాని యీవరకు కనుపడుతూవచ్చిన పోకలు విశేషము లేవు. చుట్టలు తాగడము విశేషము.
యీవూరునుంచి బండ్లను రాజానగరములో నున్ను కలుసుకునే టట్టు పంపించి యిక్కడ బ్రాహ్మలయిండ్లలో వంట, భోజనము కాచేసుకుని రెండు గంటలకు బయిలుదేరి యిక్కడికి 4 కోసుల దూరములో వుండే వంటిమామిడి యనే వూరు 6 గంటలకు చేరినాను. యీ వూరు చిన్నది. అయినప్పటికిన్ని యిప్పుఛు కోటీత్రియంబకరాయని వారు నడిపించే సదావృత్తి అన్నసత్రము వొకటి విశాలముగా కట్టివున్నది. అంగళ్ళు కలవు. సమస్తమయిన పదార్ధములు దొరికినవి. యీ వూళ్ళో యీ రాత్రి వసించినాను.
12 తేది వుదయాత్పూర్వము 4 గంతలకు బయిలువెళ్ళి యిక్కడికి 9 కోసుల దూరములో నుండే నగలాపల్లె అనే వూరు 10 గంటలకు చేరినాను. తుని మొదలుగా దారి దక్షిణాభిముఖముగా వచ్చినందున కొండలు దూరమై సముద్రము దగ్గిర అవుతూవచ్చినది. కన్యాకుమారి మొదలుగా కలకత్తావరకు యీభూమిగడ్డను సోగతమలపాకు అందమయ్యేటట్టు సముద్రము ఆవరించి వున్నందున మనము దక్షిణాభిముఖముగా వఛ్ఛే కొద్ది సముద్రతీరానకు సమీపముగా రావడమైనది. గంజాం మొదలు సముద్రతీరమందే వచ్చేటట్టు చెన్నపట్టణమునకు వొక బాట వున్నది. ఆభాట సమీపమయినా వుప్పుకాలువలు అనేకముగా దారిలో దాటవలసి వున్నది గనుక ఆమార్గము నుంచి కుంఫిణీవారు పడమరవొత్తి శాలవేసినారు. సముద్రతీరువు భలేను వుప్పుకటారులు త్రిరోదయం యెటున్నదో అటువంటి దారిని అడివి, కొండలు, పులులు, రాళ్ళు, దొంగలు వీండ్ల భయము చాలా కలిగివున్నది. యీ దినము నడిచినదారి యెడారి. కొంతమేర అడుసు నీళ్ళుగా వున్నది. నాగలాపల్లెవూరి ముందర వొక వుప్పు కాలువ వున్నది. దానికి పాటు పోటు కద్దు. పోటువేళ దానికి సంగడి అని రెండు తాటిచెట్లును దోనువలెనే తొలిచి చేర్చి కట్టివుంటారు. అందులో ఆరుగురు యెక్కవచ్చును.
నాగలాపల్లె అనేవూరు పెద్దది కాక పోయినా అన్ని పదార్ధములు దొరుకును. యిక్కడి వుప్పుకాలువ వద్ద చెన్నపట్టణములో వుండే వొక పెద్దమనిషే యీ దేశస్థుడి బోధన మీద్ పదివేల రూపాయలు ఖర్చుపెట్టి రెండుతాటాకు గుడిశలు వేసి రెండునీలిమందుచేసే తొట్లుకట్టి వొకబావి తొవ్వించినాడు. నీలిమందు లాభముయొక్క భ్రాంతి చెన్నపట్టణపు వారిని బహుశా యీరీతుగా ముంచినది. యీ వూరికి యానాం నీలపల్లి అనే గొప్ప బస్తీలు మూడు ఆమడలోవున్నవి. యింజరమనే గ్రామము నీలపల్లికి సమీపముగా వున్నది. మాదయాపాళెము యానానికి ఆమడదూరములో నున్నది. యీవూరికి కాకినా డనే కలకటరు నివాసస్థలము 7 కోసుల దూరములో వున్నది.
వుప్పాడా అనేవూరు యిక్కడికి కోసేడుదూరములో నున్నది. వుప్పాడాకు చుట్టూ ఆమడదూరములో సముద్రతీరమందు సుమారు యేనూరు యిండ్ల బోయిజాతివారు గుడిసెలు వేసుకొని కాపురమున్నారు. వీరికి పయిరు భూమి యిలాకా యెంతమాత్రములేదు. సముద్రములో మత్స్యములి పట్టి యెండవేశి మణుగు 1 కి కొంగము తీరువ యిచ్చి అమ్ముకోవడమున్ను చెన్నపట్టణములో కొలువుకొలిచి బ్రతకడమున్ను. వీరియిండ్లలో మొగవాడు పుట్టితే చచ్చేవరకు తల 1 కి ర్పూ 14 సరకారువారికి తీరువ యివ్వవలసినది. వీరి గుడిశలు నాలుగు రూపాయలకు యెక్కువచేయవు. యీబోయస్త్రీలు కట్టెలుకొట్టి అమ్మడమువల్లనున్ను, పైరుపెట్టే సంసారులకింద పనిపాటులు చేయడామువల్లనున్ను, వన్యములైన కూరకాయలు తెచ్చి అమ్మడమువల్లనున్ను కాలక్షేపముచెయుచు మొగవాండ్ల నిమిత్తము సరకారుకు యివ్వవలసిన పన్నుసహా యిచ్చుకుంటారు. మొగవాండ్లు రూపాయి 1 కి నెలంతా ఆరు యింటికి పావులావంతున వడ్డీకి అప్పుతీశి సారాయి మొదలయిన మత్తద్రవ్యములు తాగి ఆ అప్పులు మిక్కటమయితే తీర్చడానకు దేశాంతరములకు జతలుగా కలిసివచ్చి బోయీకొలువుచేసి మళ్ళీ దేశమునకు వచ్చి చేసియున్న అప్పులు తీర్చుకుంటూవుంచున్నారు. కొందరు బైటిసంపాదనకూడా తాగడానకు చాలక స్వదేశగమనమే పదిపదిహేనుయేండ్లు తలుచుకోకుండా వుంటారు. నాతోకూడావచ్చిన బోయీలలో యిద్దరు యీ దేశము వదిలి బహుకాలమౌటచేత వారి భార్యలు వారిని గుర్తుపట్టలేకపోయినారు. ఆ యిద్దరిని వారి యిండ్లస్త్రీలు మాకు తాగడానకు మేము కావలసినది యిస్తాము, యికమీరు దేశమువదలి పోవద్దని బతిమాలుకొనుచున్నారు.
యీ మత్తద్రవ్య పానమువల్ల లోకులకు యింత ఆసక్తియేల కలిగినదో అది యీశ్వరునికే తెలుసును. అయినా నాకు తోచడము యేమంటే యేలే బుద్ధి యనే రాజుయొక్క అధికారమునకు లోబడని దేహములోని మనసు మృతముయొక్క చేష్టలతో తిరుగులాడుచూ వుంచున్నది. గనుక ఆ మనసు యీషణత్రయబద్ధ మయి స్వప్నావస్థలోకూడా యీషణాదులను గురించి కలిగే విరోధములు అబద్ధములని జాగ్రదవస్థలో తెలిశిన్ని జాగ్రదవస్థ పొందిన వెనకకూడా స్వప్న సంభావితాలను జ్ఞాపకమునకు తెచ్చుకొని అవి సత్యములని కొంతసేపు భ్రమసి కొంచము దు:ఖించడము స్వానుభవముచేత నాకు తెలిశి వున్నది గనుక బుద్ధిచేత యేలబడని మనసుకు దు:ఖనివృత్యర్ధమున్ను యధోచితము బ్రహ్మానందవతుగా తాగడానకు మొదలు పెట్టినారనిన్ని అది పరంపరగా యెక్కువ అయి అనేకులు యీశ్వరుడు తమకు యిచ్చిన యథోచితమైన ప్రజ్ఞనుకూడా తాము పొగొట్టుకునేటట్టు పానాపేక్ష కలగడమయినది.
ఇంతదేశము తిరగడమువల్ల స్త్రీ పురుషులకు పరస్పర స్నేహమున్ను కలియకయున్ను మోహమున్ను ఆసక్తులున్ను పుట్టను కారణమేమని విచారించగా యిదిన్ని ఆహారములు, ఆచారములు, అలంకారములు వీటియెడల రుచిపుట్టేలగే గాని, యుక్కువలేదని తోచబడు చున్నది. అది యెందువల్లనంటే వొకదేశపు పురుషుణ్ని మరివొక దేశపు స్త్రీ చూస్తే ఆ పురుషుడి రూపాలుకారములు బాగా వున్నా హేయముగా చూచి అపహాస్యము కిందికి తెచ్చి అసహ్యబడుచున్నది. స్వదేశస్థుణ్ని చూచినంతలో వొక విధమైన యిష్టము హృదయములో అకస్మాత్తుగా జనించి కలియక ఆపేక్ష కలిగిన వెర్రి వాలుచూపులు కులుకులు అనే దేహకంపము - యిది మొదలయిన చేష్టలు స్త్రీలకు పుట్టి మర్మమైన అవయవములు దాచి మూసే లాంచనలతో తమ అవయవములకు ఆ స్వ దేశపురుషులకు నిరూపిస్తూ వుంటారు. తత్రాసి స్వదేశస్థులలోను స్వకీయులనున్ను, అత్యాసన్నులనున్ను స్త్రీలు చూచిన పక్షమందు పైన వ్రాశిన చేష్టలు దశగుణముగా అధికమవుచున్నది. యీ హేతువులవల్లనే పూర్వీకులు వివాహవిషయమై స్వకియ్యులలో సమీప రక్తస్పర్శ కలస్థలములలోకన్యాదానాలు కన్యాప్రతిగ్రహము నిషేధించి నిర్ణయించినట్టు తోచుచున్నది. ఆ నిశ్చయానుసారముగానే పరస్పరవాంచలున్ను వుదయింపుచున్నవి. గాని యీ వాంఛలున్ను వుదయింపుచున్నవి. గాని యీవాంఛలకు ఆచారాలకారాలవలెనే వాడికె మీద పుట్టే మనసు కారణమేగాని మరివొకకారణము వేరే వున్నట్టు తోచలేదు. యిందుకు శిష్టవాక్యము యింగిలీషువారిలో "యూజ్ రిక్రిసయిల్స్ వుయిత్ ఎవ్వది ధింజ్" అని వున్నది. దీనికి తాత్పర్యము యేమంటే పరిచయము అన్నిటితోనున్ను అనుకూలింపచేయుచున్నది అని అర్ధము. 19 తేది అంతా యీవూళ్ళో నిలిచినాను.
20 తేదివుదయాన నాలుగున్నరగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే పిఠాపురమనే పుణ్యస్థలము యేడు గంటలకు చేరినాను. యీవూరు పూర్వము గయాసుర రాజధానిగా వుండినది. యీ స్థలమును పాదగయ యని అనుచున్నారు. యిక్కడ వొక తటాక మున్నది. దాన్ని పాదగయతీర్ధ మనుచున్నారు. యీ తటాకములో గయాసురుని పాదములు వున్నవని ప్రసీద్ధిగనుక యిక్కడ శ్రాద్ధముచేశి పిండప్రదానము చేయవలసినది. తీర్ధ్యమువొడ్డున వొక చిన్న శివాలయమున్నది. అందులోని లింగముపేరు కుక్కుటేశ్వరుడని అనుచున్నారు. యీవూళ్ళో వొకపాడుకూపములో అష్ఠాదశపీఠము లతో చేరిన పురుహూత యనే శక్తి అదృశ్యముగా వసింపుచున్నదట. ఆపెకు ఉత్సవాలు యేమిన్ని నడవడము లేదు.
యీ వూళ్ళో యిన్నూరు బ్రాహ్మణయిండ్లు కలవు. వారందరు తీర్ధవాసులుగా యాచకవృత్తిని వహించియున్నారు. యీదేశములో గంజాము మొదలుగా భూరూపకమయిన జీవనము లేని బ్రాహ్మణుడు లేడు. యీ దినము తొలిఏకాదశి. దీన్ని సమస్తమయిన వారు యీ ప్రాంతములో గొప్ప పండగగా జరిగింపుచున్నారు. గయాపాద తీర్ధమువొడ్దున నేను డేరాలువేశి దిగి యిక్కడికి గుడిలోపల వంట, భోజనములు కాచేసుకున్నందున గయాతీర్ధములో స్నాననిమిత్తమై వచ్చిన వూరి స్త్రీలను బాలుల సమేతముగా అందరినిన్ని దర్శనము చేయడమయినది.
యీ వూళ్ళో పోలీసుదారోగా సహితముగా జమెందారులు నీలాద్రిరాయనింగారి కుటుంబస్థులు వొక మట్టికోటకట్టుకొని అందులో వసింపుచున్నారు. యీవూరు గొప్పబస్తీ. సమస్తపదార్ధాలు దొరుకును. సురాకార మనే పెట్లప్పు యిక్కడ పైరౌచున్నది. వూరుతోపులతోను తటాకాలతోను నిండి విశాలమైన వీధులు కలిగివున్నది. నేడు తెల్లవారి నదిచిన దారి కొంతమేర అడుసు నీళ్ళుగాని మిగిలిన భాట యిసకపరగానున్నది. జగన్నాధము మొదలుగా యిసకపరభూమి గనుక తాటిచెట్లు, మొగిలిచెట్లు, జెముడు, యివి మొదలయినవి విస్తరించిల్వున్నవి. యిండ్లకు తాటాకులు కప్పి పయిన కసువు పరుస్తారు. యీవూరి బ్రాహ్మణులు విచ్చలవిడిగా తారతమ్యాలు తెలియక నటింఛేవారు. పదిరూపాయలు భూరి పంచిపెట్టినంతలో యధోచితముగా సంతోషించిరి.
యిక్కడనుంచి రెండుగంటలకు బయిలువెళ్ళి నాలుగు కోసులదూరములొనుండే పెద్దాపురము 6 గంటలకు చేరినాను. యీ మధ్యాహ్నము నడిచిన దోవ పల్లపు పారు గనుకనున్ను భూమి రేగడ గనుకనున్ను యీదినము వర్షము కురిశినందుననున్ను అడుసునీళ్ళుగా వుండినందున చాలా జారుచూ వచ్చినది. యీ నడమ యేలా అనే వొక చిన్ననది కాలినడకగా దాటినాము. ఈ నది చిన్నదయినా మిక్కిలి తీక్ష్ణమయిన వేసంగికాలములయందున్ను, అనావృష్టి దోషాలు కలిగినప్పుడున్ను వొక్కరీతిని మిట్టను ప్రవహింపుచున్నది. పిఠాపురము పెద్దాపురము జమానుదారులు తాలుకాలవారు వంతుల ప్రకారము యేటి నీళ్ళు అడ్డకట్టి తమ గ్రామాదులకు తెచ్చుకోవడము చేత వీరి తాలూకాలలో యెల్లప్పుడు పంటలు సమృద్ధిగా గలిగియున్నవి.
పెద్దపురమనే వూరు పిఠాపురముకన్నా గొప్పది. యీ వూరి యిండ్లున్ను గొప్పలుగానే కట్టియున్నారు. 100 బ్రాహ్మణుల యిండ్లు కలవు. యిక్కడ పోలీసుదారోగా సహితముగా యిక్కడి జమీందారుడు వసింపుచు నుంటాడు. యితని తాలూకా 3 లక్షలది. అంగళ్ళు కలవు. సమస్తపదార్ధాలు దొరుకు చున్నవి. యీ వూళ్ళో 3 సంవత్సరములుగా యీ జమీందారుని భార్య అమ్మన్న అనే పురుషుని గొప్పయిల్లు స్వాధీనము చేసుకుని వొక అన్నసత్రము వేసియున్నది. ఆ స్థలము విశాలముగా వున్నందున అందులోనే యీ రాత్రి వసించినాను.
21 తేదీ వుదయాత్పూర్వము 2.4 గంతలకు లేచి యిక్కదికి 2 ఆమడ దూరములోనుండే రాజానగర మనే వూరు 10 గంటలకు ప్రవెశించినాను. దారి ఇసక కలిసిన రేగడ. కొంచపాటి యడివిన్ని, వొక కొండ తిరుగుడున్ను బహు చోరభయమున్ను కలిగి నడవ సమకూలమై వున్నది. యిక్కడ గోపాలరాజుల పితూరి అనే పేరుగల బందిపోట్లు ప్రతివూర కలిగివున్నది. నేను తుని యనే వూరివద్ద వదిలిన అయళ దారి రాజానగరము ముందు వచ్చి కలిసింది. రాజానగరము జలవసతి కల వూరు. అంగళ్ళు కలవు. పోలీసు అమీనా వసిస్తూ వుంటాడు. అన్ని పదార్ధములు దొరుకును. యీ వూరు కొచ్చలకాకోట వెంకటరాయుడి జమీను. యిక్కడ లోగడ రాజాబహదరు వారి అన్నసత్రము వుండి నిలిచిపోయినంతలో యీ జమీందారుడు. ఆ సత్రాన్ని వుద్ధరించి మళ్ళీ జరిగింపుచున్నాడు. యీ సత్రములో వంటబోజనముల నిమిత్తముదిగినాను. సత్రము బహువిశాలముగా కట్టివున్నది. యీవూరికి సమీపమందే 40 యిండ్ల బ్రాహ్మణాగ్రహారము వొకటి వున్నది.
పాదగయలో నేను తీర్ధము వొడ్డున డేరాలలో దిగివుండగా గొప్పవర్షము కురిశినది. అప్పట్లో స్నాననిమిత్తమున్ను శివాలయదర్శననిమిత్తమున్ను వచ్చిన స్త్రీలు వర్షమును లక్ష్యపెట్టక స్నానపానములు స్వామిదర్శనాలు తడుస్తూచేసిన వేడుక చూడముచ్చటనున్ను విజయనగరములోను పట్నాఅనే షహరులోను గొప్పవారి యిండ్ల స్త్రీలకు అత్యంత దేహోపద్రవాలు కలిగి నేను ఔధముయిచ్చి పధ్యము తీసుకొమ్మన్నంతలో చచ్చినా మంచిదిగాని స్నానము లేక మేము వంటచేసుఖోక అన్నము పుచ్చుకొనమని వొకపట్టుగా మూర్ఖముచేసిన నిశ్చయముచూడగానున్ను 'కలిసాధుస్త్రీయస్సధు ' యనే సామాన్యవచనము బాగానేవున్నట్టు తోచుచున్నది.
యిక్కడనుంచి రెండుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి 4 కోసుల దూరములోనుండే రాజమహేంద్రవరము 3 గంటలకు చేరినాము. దారి కిరుపక్కలా అడివికలిగి యిసుకపరగావున్నది. రాజానగర రాజమహేంద్రవరాలకు చేరిసగాన పోలీసుఠాణాను పాంధుల క్షేమముకై కలకటరు వుంచివున్నాడు. యీ రాజమహేంద్రవరము పూర్వము రాజరాజనరేంద్రుని రాజధాని. అతని కొడుకు సారంగధరునితో చంద్రవంశము అంత్యమయిన దని లోకప్రసిద్ధి.
యీ రాజమహేంద్రవరము గౌతమమహాముని ఆశ్రమము పూర్వకాలమందు ద్వాదశర్షక్షామము సంభవించి సమస్త బ్ర్రాహ్మణ్యము అన్నములేక మనుష్యకోటికి గురువులయిన గౌతమలవద్దికి వచ్చి మొరపెట్టుకుంటే వారు తన తపోబలముచేత బ్రత్యహము కొద్దిగా వరిబీజాలు చల్లి అవి సద్య:ఫలమునకు వచ్చేటట్టుచేసి ఆధాన్యము అక్షయ మౌటచేత అనేకకోటి బ్రాహ్మణ్యమునకు ప్రత్యహము అన్నము యిచ్చి వారల ప్రాణరక్షణ చేసినారు. పిమ్మట క్షామము వదలగానే సమస్త ద్విజులు గౌతముల ఆశ్రమము వదిలి పొయ్యేటప్పుడు యంత యశస్సు గౌతములకు రావచ్చునా అని అసూయచేత, పాంఛంభౌతిక దేహములన్ని యీశ్వరుని మాయా సంబంధమయిన అరిషడ్వర్గముతో బద్ధము లయివున్నవి గనుకనున్ను ఉయిక్కడి జిల్లాజడ్జియయిన వైబరుటుదొర, చెక్కుముక్కి రాయిపై యినుము వేగముగాకొట్టి అగ్ని పడకపోతే తుపాకీలోని మందుగుండు బయిలుపడదు అన్న వతుగా యీ ప్రపంచము కృతజ్ఞత సాత్వికత్వౌలతో నిండితే అన్ని ప్రకృతులు చప్పుడు లేక స్థావరములుగా నిద్రపోతూ వుండవలశినవి గనుకనున్ను దురత్యయమయిన మాయ 'కష్నతి కష్నతి కష్న త్యేన ' అనే వచనప్రకారము పండితులను కూడా మోసపరచి చీకటిలో కండ్లు కలవాడు కండ్లు లేనివాడున్ను సమ మయినట్టు మనుష్యులను కృతఘ్నులను చేయుచున్నది గనుక అదేప్ర్కారము అప్పట్లో గౌతముల ఆశ్రమములో నున్న బ్రాహ్మణులు కుతంత్రమువల్ల ల్వొక గోవును కల్పించి గౌరములు ఆ దినము చల్లిన పయిరు మే శేటట్టు చేసినారు. ఆ గోవు ఆ ప్రకారము తాను చల్లిన పయిరు మేశేకృత్యము చూచి గౌతములు బ్రాహ్మలమీది భక్తిచేత గరికపోచను గొవుమీద వేశి అదలించినాడు. అంతమాత్రానికే ఆ గోవు చచ్చినట్టు అభినయించినది. వెంబడిగానే అక్కడవున్న బ్రాహ్మలు గౌరములను హత్యదోషము కలవాణ్నిగా నిందించినారు. గౌతములు పశ్చాత్తప్తలయి నాకు యేమి గతి యని బ్రాహ్మణమందలిని అడగగా శివుని జటాజూటములో వుండే విష్ణుపాదప్రసూతయయిన గంగను బయిటికి తెచ్చి అందులో అవగాహనము చేస్తేనేగాని నీవు పుణ్యాత్ముడవు గావని చెప్పినారు. పిమ్మట గౌతములు తపస్సువల్ల సాంబమూర్తిని సంతోష పెట్టి వొక ధారను భూమిమీదికి తెచ్చి తన ఆశ్రమముదాకాతెచ్చి స్నానముచేసి యెప్పుడున్ను లోకాపకారముగా భూమిమీద ప్రవహింపుచు వుండేటట్టు చేసినాడు. ఆ ధారకు, గొదావరి అని నామకరణము చేయడమయినది. పిమ్మట సప్తఋషులు గౌతములను ప్రార్ధించి సెలవు పుచ్చుకుని యేడుధారలుగా గోదావరిని చీలదీసి తమ తమ ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళీనారు గనుక యీ రాజమహేంద్రవరమునకు గోదావరి అఖండముగా వచ్చిధవళేశ్వరము మొదలుగా చీలి సప్తగోదావరులుగా అయినది. ఆ సప్తగోదావరీ తీరమందు వుండే భూములు గోదావరీ వుదకబలముచేత సమసస్యా ధులను అమోఘముగా ఫలింపచేయుచున్నవి. ఆ సప్తగోదావరీ తీరమును కోనశీమ అనుచున్నారు. అక్కడ బ్రాహ్మలకు భూవసతులు చాలా వున్నవి.
యిది కాకినాడుజిల్లా యెనిమిదిలక్షల వరహాలు సాలుకు యెత్తు తన జమీన్ గ్రామాలమీదుగా తానుకూడా వచ్చి యెనిమిదామడపత్యంతము నన్ను సాగనంపించవలె నని తలచి ప్రార్ధించినాను గనుక దండుల్దారిని యేలూరిమీదుగా నా రెండుబండ్లను రవానాచేసి నేను అడ్డదారినివుండే వాడపల్లి రాత్రి 7 గంటలకు ప్రవేశించినాను. దారి గోదావరి వొడ్డుననే వొక మనిషి నడిచేపాటి కాలిదారిగా వున్నది. రాజమహేంద్రవరమునకు వాడపల్లె అనేవూరు 6 కోసుల దూరము. గోదావరి మధ్యే కొన్ని లంకలు ప్రవాహపు వేగాన పెట్టబడుచువచ్చుచున్నవి. వాడపల్లి యనే వూరు విష్ణుస్థలము గనుక వెంకటేశ్వరుల గుడి చిన్నదిగా వొకటి వున్నది. యిరువై యిండ్ల వైష్ణవాగ్రహారముకూడా కలదు. రాజా కొచ్చర్లకోట వెంకటరాయనింగారి తమ్ముడు యీ వాడపల్లెలో విశాలమయిన నగరు కట్టివున్నాడు. యీ రాత్రిన్ని మరునాడున్ను యిక్కడ వుండినాను. యీవూరు గోదావరి వొడ్డు గనుక యీవూళ్ళో బావులులేవు.
30 తేది వుదయమయిన ఆరుగంటలకు లేచి యిక్కదికి 7 కోసుల దూరములో వుండే ఆచంటయనే వూరు 11 గంటలకు చేరినాను. దారిలో సప్తగోదావరి యనే వొక పాయ పడవలకుండా దాటడమయినది. యిది కాలి భాట. తొపులు, వూళ్ళమధ్యే నడుస్తూ వచ్చినాము. అందులో రాల (ర్యాలి) యనే వొక గ్రామములో శుభ్రమయిన నల్లశిలతో ప్రభసమేతముగా వొక గోపాలమూర్తిని చేసివున్నది. ఆ ప్రభలోనున్న మూర్తి పీఠము మీదనున్ను రాసక్రీడలు మొదలయిన అవసరాలు మూర్తీభవించి నట్లుచెక్కి ప్రధానమూర్తిని గోళ్ళు, వెండ్రుకలుకూడా విరళపరచి అతిసుందరముగా చేసివున్నది. యీ మూర్తి సముద్రములో కొట్టుకొని వచ్చినట్టు యిక్కడ చెప్పుకొంటారు. ఆచంట అనే వూళ్ళో వెంకటరాయనింగారు తన నివాసముకొరకు వొక గొప్ప నగరుకట్టి దానికి చుట్టూ సుందరమయిన వనము నిర్మించిల్ వున్నాడు. యీ వూళ్ళోనున్ను, వాడపల్లెలోపల వున్నట్టే వొక పోలైసు అమీను వున్నాడు. ముప్పై బ్రాహ్మణ యిండ్లు వున్నవి. యిక్కడ పెండలపు గడ్డలు బహు బాగా అయి యీనెట్టున బహుప్రసిత్థి కెక్కివున్నవి. వొక దేవాలయముకూడా వున్నది. యీవూళ్ళో యీరాత్రి వసించినాను.
ఇరువది నాలుగవ ప్రకరణము
31 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి రెండామడ దూరములోనుండే శింగవృక్ష మనే వూరు వొక గంటకు చేరినాను. దారి వరిపొలాల గనిమొల మీద నడిచి రావలసినది. రేగడ భూమి అయినందుననున్ను, వర్షాలు కురిశి వున్నందునన్ను చాలా అడుసునీళ్ళు గలిగి బహుప్రయాసగా వుండినది. గోదావరి వుదకము లడ్డకట్టి తెచ్చిన నాలుగు మడుగులు, రొమ్ముల లోతునీళ్ళలో దాటినాము. శింగవృక్ష మనే వూరు గొప్పబస్తీ. 100 బ్రాహ్మణ యిండ్లు కలవు. అనేకముగా అంగళ్ళు కలవు. ఈవూళ్ళో భోజనానకు నిలిచి మూడు గంటలకు మళ్ళీ బయిలువెళ్ళీ 6 గంటలకు బోండాడ ప్రవేశించినాను. దారిలో తెల్లవారివలెనే రెండు మడు;గులు దాటడమయినది.
బోండాడ అనేవూరున్ను బస్తీగ్రామమేను. యీ వూరికున్న ఘట్టిపర అయినందున ధాన్యము పాతరలువేశి వుంచుతారు. రాజమహేంద్రవరము మొదలుగా తాటిచెట్లు అమితముగా కలిగివున్నవి. ప్రతివూరనున్ను తాటిపండ్లరసము తీసి చాపలుగా చేసి వుంచుతారు. యీరాత్రి యిక్కడ వసించినాను.
ఆగష్టునెల 1 తేది వుదయమయిన 4 గంతలకు బయిలువెళ్ళీ యిక్కడికి 4 కోసులదూరములో నుండే యేలూరిపాడు అనేవూరు 10 గంటలకు చేరినాను. యీవూరు పేటస్థలము. నేడు నడిచిన దారి యిసకపర. శింగవృక్ష మనేవూరు మొదలు యిదే రీతిని దారి అనుకూలముగా వున్నది. బండ్లు సమేతముగా రావచ్చును. యీవూరు నియోగుల అగ్రహారము. రాజమహేంద్రవరము జిల్లాకున్ను బందరు జిల్లాకున్ను యీవూరివద్ద వుండే వుప్పుకాలువ సరిహద్దు అని తెలియవలసినది.