కాశీయాత్ర చరిత్ర/ఇరువది నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

యీనెట్టున బహుప్రసిత్థి కెక్కివున్నవి. వొక దేవాలయముకూడా వున్నది. యీవూళ్ళో యీరాత్రి వసించినాను.

ఇరువది నాలుగవ ప్రకరణము

31 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి రెండామడ దూరములోనుండే శింగవృక్ష మనే వూరు వొక గంటకు చేరినాను. దారి వరిపొలాల గనిమొల మీద నడిచి రావలసినది. రేగడ భూమి అయినందుననున్ను, వర్షాలు కురిశి వున్నందునన్ను చాలా అడుసునీళ్ళు గలిగి బహుప్రయాసగా వుండినది. గోదావరి వుదకము లడ్డకట్టి తెచ్చిన నాలుగు మడుగులు, రొమ్ముల లోతునీళ్ళలో దాటినాము. శింగవృక్ష మనే వూరు గొప్పబస్తీ. 100 బ్రాహ్మణ యిండ్లు కలవు. అనేకముగా అంగళ్ళు కలవు. ఈవూళ్ళో భోజనానకు నిలిచి మూడు గంటలకు మళ్ళీ బయిలువెళ్ళీ 6 గంటలకు బోండాడ ప్రవేశించినాను. దారిలో తెల్లవారివలెనే రెండు మడు;గులు దాటడమయినది.

బోండాడ అనేవూరున్ను బస్తీగ్రామమేను. యీ వూరికున్న ఘట్టిపర అయినందున ధాన్యము పాతరలువేశి వుంచుతారు. రాజమహేంద్రవరము మొదలుగా తాటిచెట్లు అమితముగా కలిగివున్నవి. ప్రతివూరనున్ను తాటిపండ్లరసము తీసి చాపలుగా చేసి వుంచుతారు. యీరాత్రి యిక్కడ వసించినాను.

ఆగష్టునెల 1 తేది వుదయమయిన 4 గంతలకు బయిలువెళ్ళీ యిక్కడికి 4 కోసులదూరములో నుండే యేలూరిపాడు అనేవూరు 10 గంటలకు చేరినాను. యీవూరు పేటస్థలము. నేడు నడిచిన దారి యిసకపర. శింగవృక్ష మనేవూరు మొదలు యిదే రీతిని దారి అనుకూలముగా వున్నది. బండ్లు సమేతముగా రావచ్చును. యీవూరు నియోగుల అగ్రహారము. రాజమహేంద్రవరము జిల్లాకున్ను బందరు జిల్లాకున్ను యీవూరివద్ద వుండే వుప్పుకాలువ సరిహద్దు అని తెలియవలసినది. యీ మధ్యాహ్నము 12 గంతలకు యిక్కడినుంచి భోజనము చేసుకొని బయిలి వెళ్ళి వుప్పకాలవ సంగళ్ళకుండా దాటి రాత్రి 7 గంతలకు యిక్కడికి 6 కోసులదూరములో వుండే తుమ్మడి యనే వూరు చేరినాను. యీ మధ్యాహ్నము మీద నడిచిన దారి యిసకపర, శుద్ధబయిలు. యేలూరిపాడు మొదలుగా వర్షాలు లేనందున యిక్కడ దారిలో మడువులు బొత్తిగా యెండివున్నవి. దారిలో కలిదండియనే ప్రసిద్ధి గ్రామము దాటి వచ్చినాను. తుమ్మడి అనే గ్రామములో బ్రాహ్మణయిండ్లలో స్థలము దొరకనందున కలకత్తాలో విశ్రయించడానకు యిచ్చివచ్చిన రెండు డేరాలు, వెంకటరాయనింగారికి యిచ్చివచ్చిన వొక డేరాగాక మిగిలిన రెండు డేరాలు యిక ఫరవాలేదు ప్రతివూళ్ళో బ్రాహ్మణ యిండ్లలో స్థలము దొరకునని అందరు బోధించినా చెయికావలికి యెనిమిదిమంది బోయీలచేత తెచ్చినందున ఆ రెండు డేరాలు వొక బావివద్ద వేయించి యీరాత్రి గడపడమయినది. యీవూళ్ళో మంచినీళ్ళు బహుప్రయాస. నేను డేరాలు వేయించిన స్థలమున వుండే బావి యీ వూరికి మంచినీళ్ళు, ఆ నీళ్ళు మాకు తాగకూడనిదిగా వున్నది. అభ్యాసము అన్నిటినిన్ని అనుకూలపపరుస్తున్నదనే యింగిలీషుమాట యీ దినము సత్యముగా తొచినది.

3 తేది వుదాత్పూర్వము 2 గంటలకు మబ్బుచినుకులుగా వున్నా లేచి యిక్కడికి రెండామడదూరములో వుండే మచిలీబందరు అనే షహరు యీ దేశస్థులు పేటా అని చెప్పే బస్తీని 6 గంటలకు ప్రవేశించినాను.*[1] దారి నిన్నటివలెనే యిసుకపర. బండ్లు సాధారణముగా


(వ్రాత ప్రతిపుట 488 లోని అదనపుసంగతి) నడవవచ్చును. రామన్నపేటలో వొక గొప్పతోట యింట్లో దిగినాను. యీ మచిలీబందరు బస్తీలో 22 పేటలు కలిగివున్నది. వొక్కొక్క పేటను పూర్వమందు లక్ష్మెకటాక్షము కలిగిన పురుషులు తామై కలగచేసినారు గనుక ఆపేటలలో వచ్చుబడిబాడిగెలను పేటలు కలగచేసిన వారి వంశస్థులు నూరారు రూపాయలవంతున సుఖోపాయముగా యిప్పట్లో ప్రతిమాసమున్ను అనుభవింపుచున్నారు. ఈ బస్తీ లోగడ తురకలది. హయిదరాబాదు కింద వున్న అధికారస్థుడు యిక్కడికి తాను నవాబు అనిపించుకొని యీ రాజ్యాన్ని ఆక్రమించినాడు. ఆ స్వామి ద్రోహము వారి వంశస్థులను కుంఫిణీవారికింద పించను తీసుకొని యిప్పట్లో వుండేటట్టు చేసినది.

పూర్వకాలము మొదలుగా యీ బస్తీ సర్వాధికారుల నివాసముగా వుంటూ రావడముచేతనున్ను, యిప్పట్లోనున్ను వుత్తరఖండం ప్రొవింషియల్ కోరటులో జిల్లాకోరటు కలకటరు కచ్చేరి మమ్మిస్సెర్యాటు ఆఫీసు సహితముగా కొంత దండు వసించివుంటూ రావడంచేతనున్ను, కాండ్రేగులవారు మొదలయిన కొందరు జమీందారులు సాహుకారులు వర్తకులున్ను వుండుటచేతనున్ను బస్తీ చాలాగా శోభించివున్నది. రాజవీధులు బాగా విశాలముగా వున్నవి. యిండ్లు బయిట చూచేటందుకు చిన్నవిగా అగుపడ్డా లోపలి ఆవరణాలు విశాలముగా కట్టివున్నారు. లోముంగిళ్ళుమాత్రము కొంచపరచి కట్టివున్నారు. సమస్ పదార్ధాలున్ను సమస్తపనులు చేయగల మనుష్యులున్ను దొరుకుదురు. శ్రీకాకొళము వదిలిన వెనక బాడిగెకు బండ్లు యీ బస్తీలొ దొరకడము కష్టము. భూమి వుప్పుకలిసిన రేగడి. నీళ్ళవసతి లేదు. దూరమునుంచి యీ బస్తీకి మంచినీళ్ళు తెచ్చుకోవలసినది.


వీరాస్వామయ్యగారు బందరులో జిల్లాజడ్జిగా నుండిన ఆంధ్రభాషోదారకులగు చార్లెస్ ఫిలిప్ బ్రౌను గారిని దర్శించారు గాని యీ పుస్తకములొ ఆ సంగతి వ్రాయలేదని బ్రౌనుగారు స్వదస్తూరితొ వ్రాత ప్రతి 423 పుటలో రిమార్కువ్రాసినారు. వీరాస్వామయ్యగారు చెన్నపట్టణము చేరిన తరువాత బ్రౌనుగారికి వ్రాసిన యింగ్లీషు వుత్తరము వ్రాతప్రతి చివర అంటించబడియున్నది. వీరాస్వామయ్యగారిని బందరుపుర వాసులు 14 రోజులు అక్కడ వుంచారు. మనుష్యులు నిండా ఆరోగదృఢగాత్రులుగా వుండలేదు. స్త్రీలు లలంకారపురస్సారముగా శోభాయమాన లయి వున్నారు. స్వరూపలావణ్యము గలవారు కారు. చెవులకు నిడుపుగొలుసులు వేశి కొన్ని పాపటకు చేర్చి చెక్కుతారు. స్త్రీ పుర్లుషులు చాయ వేసిన వస్త్రప్రియులై యున్నారు. రాజమహేంద్రవరానికి యీవల కృష్ణవరకు బ్రాహ్మణ్యమునకు భూజీవనాలు విస్తారములేక సంతుమాత్రము అతిశయిస్తూ రావడముచేత బందరుబస్తీ యాచక బ్రాహ్మణపూరితమై వున్నది. గంజాం, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, మచిలీబందరు, గుంటూరు జుములా యీఅల్యిదు జిల్లాలలోను భూమి విస్తారము జమీందారుల అధీనముగా పూర్వము నుంచి చేయబడివున్నందున జమీందారుల ప్రాబల్యద్వారా హిందువులవల్ల అద్యాపి కొన్ని విశేషధర్మాలు 20-30 వేల బ్రాహ్మణులకు సంతర్పణములున్ను చేయబడుచున్నవి. అన్నిటిలోను బందరు కాకినాడ జిల్లాల జమీందారులు చాలా ధర్మబుద్ధిగలవారు. రాజా కొచ్చర్లకోట వెంకటరాయనింగారు రెండావృత్తులు కుటుంబసహితముగా తులాభారము తూగి రెండావృత్తులు లక్ష బ్రాహ్మణభోజనము చేయించి అనేకయాగాలు చేయించినారు. వాశిరెడ్డి వెంకటాద్రినాయుడు అప్పారావు మొదలైన మరికొందరు అంతకు యెక్కువగా హిందుధర్మములను జరిగించినారు. యీ దేశస్థులు కచ్చేరి సహితముగా విందుచేస్తే ఆ వుత్సవాన్ని మేజువానీ లంటారు. కాకినాడజిల్లా సాలుకు 2 లక్షల వరహాలు యెత్తుచున్నది. మచిలీబందరు ఆరు లక్షల వరహా లెత్తుచున్నది. యీ మచిలీబందరులో ఆగస్ఠు నెల 15 తేదివరకు వసించినాను.

16 తేది వుదయాత్పూర్వము నాలుగుగంటలకు బైలువెళ్ళి యిక్కడికి 2 ఆమడ దూరములో నుండే కొత్తపాళె మనే కృష్ణాతీరపు వూరు 10 గంటలకు చేరినాను. దారిలో యీదేశస్థులు పర్రలు అని చెప్పే పల్లెలు కొన్ని వున్నవి. రేగడభూమి. కొత్తపాళెమునకు రెండు కోసుల దూరములో చల్లపల్లియనే యేర్లగడ్డ జమీందారుని నివాసగ్రామము వొకటి వున్నది. అందులో సుందరతరముగా వొక మిద్దెను ఆ జమీందారుడు కట్టియున్నాడు. యీ కొత్తపాళెము చిన్నవూరు అయినప్పటికిన్ని వెచ్చా గోపాలకృష్ణమ్మయనే కోమటి యిప్పట్లో బందరు ప్రొవింషియల్ కోర్టులో ప్లీడరుగావుండి అతడు వొక సత్రము కట్టించినందున మార్గస్థులకు బహువుపకృతిగా వున్నది.

గంజాంలో బందం చలమయ్య అనే అతను, విశాఖ పట్టణములో చిన్నం చలమయ్య అనేఅతను, యానాంలో మన్నెం కనకయ్య, రాజమహేంద్రవరములో గుండు శోభనాద్రి వగైరాలు జమీందారులయి లక్షాంతరములు వ్యాపారముచేసి దొరతనపు డౌలు పాయాపరువున్ను కలిగివున్నా వీరిని దక్షిణ దేశములాగున శెట్టి అనడములేదు గాని గారు అనే ప్రతిష్టావాచక ప్రయోగమున్ను తాజీం అనే ప్రత్యుద్ధానమున్ను వీరికి చేయకూడ దని వొక నిష్కర్ష యితర జాతులందరు తాగాల్యతునుంచి చేసుకొని అటు యీ దేశములో జరిగింపుచున్నారు. కోమటి జాతిలో వెచ్చా వారి కుటుంబము లాగున గవర్నమెంటు వుద్యోగాలు చేసిన కుటుంబాన్ని ఎక్కడా చూడలేదు/ శూద్రజాతిలోనున్ను యెంతగొప్పవాడైనా నాయిడనే ప్రతిష్టా వాచకాన్ని ఆ పురుషుని పేరుతోకూడా సాధారణముగా వాడరు. గంజాం మొదలుగా భోగస్త్రీలు సభాస్థలములకు వస్తే తంబుర వీణల వుంచుకొని పాడేకాలము తప్ప తక్కిన వేళలలో కూర్చుండకూడరు. పశ్చాత్తాపములేక రెండు మూడు ఝాములు వారిని నిలల్వపెట్టుతారు.

బందరుజిల్లా ప్రవేశించినవెనక బందిపోట్లు, పితూరీలు అనే మాటలు వినడములేదు. ఆ విషయమై యీ దేశము సుభిక్షముగా వున్నది. యిటీవల గుంటూరుజిల్లాలో భేది, వాంతి వుపద్రవాలు చాలా కలిగియున్నట్టు తెలియడమయినది. ఆ వుపద్రవము తగిలినయింట్లో మళ్ళీమళ్ళీ తగులుతూవున్నట్టు తెలిసినది. గనుక అందుకు హేతువు నాకు తొచడము యేమంటే అవశాత్తుగా వొక పురుషునికి ఆ వుపద్రవము తగిలి విపత్తుకు హేతువు కాగానే సన్నిహితులు భీతినిచెంది భీతిద్వారా యీ వుపద్రవము పరంపరగా వారు తెచ్చుకొనేటట్టు తోచుచున్నది. భీతి మరణాన్ని యివ్వగల వుపద్రవమని అనుభవసిద్ధముగదా! "తేన వినా తృణాగ్రమపిన చలతి" అనే వాక్యము సత్యమయినా దేహదృష్టిచేత నున్ను ప్రపంచ దృష్టిచేతనున్ను యిటువంటి వూహలు దేహదృష్టి విలయము పొందే కొరము చేయవలసి యున్నది.

కృష్ణాతీరమునందు 19 తేది మధ్యాహ్నమువరకు నిలిచి నాను. కృష్ణానదీ మహాత్మ్యము విచారించగా లోకులనుతరింపచేసే కొరకున్ను యీ కలిలో లోకుల పాపాలు యెంతబళువో అంత పాటి పుణ్యము వొక స్నానముచేతనే కలిగేకొరకున్ను శ్రీమహావిష్ణువు యీ నదీస్వరూపముగా అవతార మెత్తినట్టు తెలియవచ్చినరి. యీ కృష్ణామాహత్మ్యము స్కాందపురాణాంతర్భూతముగా వున్నది. యిక్కడికి 2 కోసుల దూరములో కళ్ళేపల్లి అనే మహాస్థలము వొకటి వున్నది. యీ నది సహ్యపర్వతములో వుత్పత్తి అయినది. ఆవుత్పత్తి స్థలసాగరసంగమాలకు 70 ఆమడ అని విన్నాను. యిక్కడ కృష్ణానది కోశెడు వడల్పు, అనేక గొప్పలంకలు కలవు. అందులో అనేక అడివి యావులు స్వేచ్చగా విహరింపుచున్నవి. యీ లంకలలో కాయకూరలు చాలాగా పైరై బందరు బస్తీలో వ్రయ మవుచున్నవి.

19 తేది మధ్యాహ్నము మీదట 1 గంటకు బయిలువెళ్ళి కృష్ణానది పడవలకుండా దాటి 5 కోసుల దూరములోవుండే కనగాల యనే వూరు సాయంకాలము 9 గంటలకు చెరినాను. యీ తీరమందు గ్రామస్థులు తమ ఖర్చుకింద పడవలు చేయించుకుని బీదలవద్ద డబ్బులు తరాతర ప్రకారము పుచ్చుకుని దాటిస్తారు. బలిష్ఠులకు అధికారస్థులకు అమిజీ (వెట్టి)కి దాటిస్తూ వుంటారు. యీతీరమందు నా స్నానకాల మందు చుట్టుపక్కల గ్రామాలలో వుండేవారుగా భూరి దక్షిణ నిమిత్తము 200 బ్రాహ్మణులు చేరినారు.

యిక్కడి బ్రాహ్మలలొ కొందరు దేశాంతరాలు వెళ్ళి ద్రవ్యము సంపాదించి స్వదేశము కుదురుగా చేరినందువల్ల నున్ను యీ తీరపు బ్రాహ్మలు పుత్రదారాదులయిన బాంధవులను వదిలి దక్షిణము కన్యాకుమారివరకున్ను, వుత్తరము కాశ్మీర పత్యంతమున్ను సంచారము చెసి లోకులు చేయతగిన బ్రాహ్మణపూజలు నిర్బంధపెట్టి చేయించుకుంటూ వుంటారు. యీరీతిని కొండవేడు మొదలయిన యీ స్థలజ్ఞులు విచ్చలవిడిగా వొకరినిచూచి వొకరు సంచరించ ప్రయత్నపడ్డవా ఆవరించేపాటి ముక్కరలు చాలా లావుగా చేసి ధరించుతారు. యీ లోపల భూమికొలతను కత్తెలు (కత్తులు) అంటారు. గంజాం మొదలుగా కృష్ణాతీరమువరకు పెద్దమనుష్యులు సమానుల సమాగమము అయినప్పుడు అత్తరుతాను వుంచి తాంబూలముతోకూడా అత్తరునున్ను అవశ్యము యిస్తూ వస్తారు. యీ కళింగదేశము మొదలుగా కోసులు సుళువుగా అగుపడుచున్నవి. యిక్కడి వొక కోసు దక్షిణదేశపు రెండుగడియల దూరానకు కాలు గడియ తక్కువ అని చెప్పవచ్చును. గ్రామలెక్కలు మొదలయిన వ్రాతలు రాజమహేంద్రవరానకు దక్షిణము తాటాకులలో వ్రాస్తారు.

గంజాం మొదలు విజయనగరము వరకు తామర సమస్త గుంటలలో, చెరువులలో వేశివున్నారు. వాటి తూంట్లను కూర మొదఒలయిన పక్వాన్నాలుగా చేసి భక్షిస్తూ వస్తారు. నీళ్ళు తూకడానకు బావుల వద్ద తాటాకులు దొన్నెలుగా కట్టివుంచుతారు. వాటికి తాడుకట్టి నీళ్ళు చేదినంతల్లో రెండుపళ్ళ నీళ్ళు వచ్చుచున్నవి. యీ కనగాల అనే వూరు గొప్పది. విశాలమయిన బ్రాహ్మణ యిండ్లున్ను వొక గొప్ప చావడిన్ని కలవు. సమస్త పదార్ధాలు దొరుకును. యిక్కడ సమీపముగా కాటికెవా రని పౌరుష నామధెయముగల వొక నేత్రచికిత్సకుల కుటుంబము వున్నది. వారు యధాశాస్త్రముగా నేత్రచికిత్సకుల కుటుంబము వున్నది. వారు యధాశాస్త్రముగా నేత్రచికిత్స చేయుచూ వుంటారు. యీ వూళ్ళో యీ రాత్రి నిలిచినాను. దారి నల్లచౌటిరేగడ. తుమ్మచెట్లు యిరుపక్కలా వుంటూ వచ్చినవి. దారిలొ భట్టుప్రోలు అనే వూరివద్ద లంజదిబ్బ అని వొక మిట్టవున్నది. అదిమొదలు చెట్లశాలను దారిలో వేసివున్నారు.

20 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో వుండే చందవోలు అనే గ్రామము 7 గంటలకు చేరినాను. దారి యిసకపర. యిరుపక్కలా చెట్లు పెట్టివున్నారుగాని నిండా లేతలు గనుక నీడ యివ్వనేరవు. యీ చందవోలు అనే వూళ్ళో వెచ్చా గొపాలకృష్ణమ్మ తమ్ముడు ధర్మపురి అనే అతను వొక సత్రము కట్టితివున్నాడు. యీవూరినుంచి కొండవీడుశీమకు దారి చీలిపొతూ వున్నది. యీవూరు తురక భూయిష్టమయినది. లోగడ అనేక శివా 3 కోసులదూరములోవుండే చినగంజాం అనేవూరు 6 గంటలకు చేరినాము. దారి యిసకపొర అయినా కాలు దిగబడేపాటి బొల్లియిసక కాదు. చినగంజాంవూరిచుట్టూ వుప్పుపంట విస్తారము చేస్తారు. వూరు నిండా చిన్నది కాదు. యిక్కడ కొళంద వీరాపెరుమాపిళ్ళ సత్రము వొకటి వూరికి బయిలున వున్నది గనుక అక్కడదిగినాను. ముసాఫరులకు కావలశిన సామాను దొరికినది.

22 తేది వుదయాత్పూర్వము 3 గంతలకు బయిలుదేరి యిక్కడికి 4 కోసుల దూరములోవుండే అమ్మనబోలు అనేవూరు6 గంటలకు చేరినాను. దారి నిన్నటిదినము మేమునడిచినట్టె ఉపాయమయిన యిసకగా వున్నది. చనగంజాం అనే వూరితో గుంటూరు జిల్లా సరిహద్ధుసరి. యివతల నెల్లూరిజిల్లా అమ్మనబోలు అనేవూరు గొప్పదేను. సమస్త పదార్థాలు దొరుకును. కృష్ణకు యీవలవుండే యిండ్లు అన్ని పూరివేసికట్టివున్నవి. పెంకుటిండ్లు సకృత్తైనందున యీ దేశస్థులకు అగ్నిభయము చాలా కలిగివున్నది. బాపట్ల వద్దినుంచి నాతోకూడా వచ్చిన పరిచారకపు బ్రాహ్మణులు కొందరు వారి స్వగ్రామమయిన లంజచెరుకూరికి రెండుకొసులదూరములో వుండగా వెళ్ళి అమ్మనబోలులో మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఈ వూరి గ్రామ కరణము యింట్లో వంట భోజనాలు కాచేసుకున్నాము. బాపట్ల వలెనే యీ వూళ్ళోనున్ను తొపులు చెరువులు వసతిగా వున్నవి. మధ్యాహ్నము మీదట రెండు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే ఆకులల్లూరు అనేవూరు 6 గంటలకు చేరినాను. దారి వుప్పుకలిశిన రేగడ. వర్షాకాలములో నడవడము ప్రయాసగా వుందును.'

ఆకులల్లూరు అనే వూరు యధోసితము పెద్దదిగా వున్నది. 80 బ్రాహ్మణ యిండ్లు వున్నా స్థలము యిచ్చేవారు కారని ప్రసిద్దికెక్కివున్నారు. అయినప్పటికి యీ శీమగ్రామ అధికారులయిన రెడ్డి కరణాలను పిలిపించి మాట్లాడి వొక బ్రాహ్మడి యిల్లు కురుర్చుకుని అందులో బసచేసినాను. అన్నిపదార్ధాలు దొరికినవి.

రాజమహేంద్రవరము మొదలు గుంటూరుజిల్లా సరిహద్దువరకు సరఫరాయి బంట్రౌతులను నాయక వాడీ లంటారు. వారు ముసాఫరులకు గొప్పవారయిన పక్షమందు సమస్త సరఫరాయి చేస్తూరావలసినది. నెల్లూరిజిల్లా మొదలుగా ఆదేతరహా నౌకరులను మహాతాదులంటారు. నెల్లూరిజిల్లాలో భూమికొలతను కుచ్చళ్ళు అంటారు. కుచ్చల 1 కి 2 గొర్రుల సంజ్ఞ యారాత్రి యిక్కడ వసించడమైనది.

26 తేదీ వుదయాత్పూర్వము నాలుగుగంటలకు లేచి యిక్కడికి 4 కోసులదూరములోనుండే వలగపూడిసత్రము 2 గంటలకు చేరినాను. దారి యిసకరేగడ కలిసియున్నది. యీసత్రము రాజాముద్ధుకృష్ణమనాయుడు వెలగపూడియనే గ్రామముందుగా యిక్కడి జమీందారులవద్ద యినాముగా సంపాదించి కట్టినాడు. గ్రామపు వసూలులో సదావృత్తి యిస్తూ వునారు. సత్రములక్షణముగా కట్టి యిప్పటికి బాగావున్నా కళాహీనమై వున్నది. నా అనుభవముచేత విచారించగా కళకలలాడుతూ వుండే భవంతుల కళావిలాసాలు వొకటే తీరున వున్నావాటి వ్యత్యాసకాలాలలొ కళాహీనమై పాడుకోరుతూ వుంటున్నది. గనుక యిటువంటి మానుష నిర్మాణములయందుకూడా పరమాత్ముని చైతన్యము యథోచితముగా ప్రతిఫలించెటట్టు తోచుచున్నది. యిక్కడ వంటభోజనాలు కాచేసుకుని 5 గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసులదూరములోవుండే కరేడు అనేవూరు 2 గంటలకు చేరినాను.

దారిలో రెండు వుప్పుటేరులు దాటినాము. యిప్పుఛు కాలినడకగానే వున్నది. యీ రెండుయేరులలో సర్పాకారమయిన విషజంతువుల భయము కదాచిత్తుగా కలిగి వుంచున్నది. దారి యిసకకలిసిన రేగడ. అమ్మనబోలుకు ఆకులల్లూరి మధ్యే నాగర్తను కొత్తపట్టణము యీతముక్కల వగయిరా బస్తీలువున్నట్టు యీమధ్యే గొప్పవూళ్ళులేవు. కరేడు గొప్పవూరు. యాభై బ్రాంహ్మయిండ్లు, వొక సత్రము, రెండుగుళ్ళున్ను, కలిగిన పేటస్థలము. సమస్తపదార్ధాలు దొరుకును. యీ రాత్రి యీ వూరి కరణము కట్టించిన సత్రములో వసించినాను.

24 తేది వుదయాత్పూర్వము 2 గంటలకు లేచి యిక్కదికి 2 ఆమడ దూరములోవున్న కొత్తసత్రమనే పేరుతో రామానుజ రాయడుకట్టిన సత్రము 2 గంటలకు ప్రవేశించినాను. దారి బహుయిసక. రామయపట్నము వరకు కాలు పూడిబోతూ వచ్చినది. యివతల సత్రమునకు రెండు కోసుల అంత యిసకలేదు. సత్రము బహు వసతిగా వున్నది. వద్దవుండే అంగళ్ళల్లో భాటసారులకు కావలశిన పదార్ధాలు దొరుకును. యిక్కడ వంటభోజనము కాచేసుకుని యిక్కడికి 5 కోసుల దూరములోవుండే జువ్వులదిన్నె అనేవూరు 6 గంటలకు చేరినాను. దారి కొంతమేర యిసక, కొంత యిసక కలిసిన రేగడ. దారిలో మామిళ్ళదొరువు అనే మజిలీవూర ముసాఫరుఖానా దొరలు దిగే లాయఖుగా వొకటి వున్నది.

జువ్వలదిన్నె అనేవూరు గొప్పదయినా నీళ్ళు ఆసరా విస్తారములేదు గనుక పంటలుజబ్బు. పేటస్తలముగా శానాకోమటి యిండ్లువున్నందున సమస్తపదార్ధాలు దొరుకును. దేవాలయాల సహితముగా కొన్ని బ్రాహ్మణయిండ్లు వున్నవి. అందులో వొక యింట్లో రాత్రివశించినాను. కృష్ణకు యివతల పశువులు గొప్ప దేహాలు కలవిగా వుంటూ వచ్చినవి. అమ్మనబోలు మొదలుగా అటువంటి పశువులు పుష్టికలవిగా గాలిమందలుగా అనేకములు చూస్తూ వచ్చినాను.

నేను యీవరకు కన్యాకుమారిమొదలుగా సంచరించిన భూములలో యీపాటి వైలక్షిణ్యము, స్థూలము, వున్నతము కల పశువులను చూడలేదు. యీ పశువుల పోషణముందర వ్యవసాయము నున్ను యీ దేశపు కాపులు లక్ష్యపెట్టేవారు కారు. పొలము బీడువేసి వాటికి పుల్లరి అనే తీరువ యిచ్చి పశువులను మేపించి కాపాడుతారు. యీ నెట్టు వారికి పశుధనమే ప్రబలముగా కలిగి వున్నది.

25 తేది వుదయాత్పూర్వము 2 గంటలకు లేచి యిక్కదికి రెండామడ దూరములో వుండే కొడవలూరి సత్రము 8 గంటలకు చేరినాను. దారి పంటల్లూరివరకు యిసక కలిసిన రేగడ. పంటల్లూరు మొదలుగా సత్రమువరకు సడక్కువేశి శాలవేశి వున్నది. పంటల్లూరు భారీదస్తు అయ్యే గ్రామము. తహశీలుదారుడు వుండే కసుబా. నేను దిగిన సత్రము వసతిగా వున్నా జలసౌఖ్యము మట్టు. యిక్కడ గొప్పది. 1000 యిండ్లు వుండును. రధములుపొయ్యే వీధులు మాత్రము నిండా విశాలముగా వున్నవి. స్వతంత్రుడుగా శీమనుంచి వచ్చివుండే పేయిర్ అనే దొరను యాత్రవారి మహసూలు వసూలు చేసే పనులలో కలకటరు హస్తాంతరముగా మామూలు ప్రకారము అటారానాళాఃఘాటువద్ద వుంచి వున్నారు. యాత్ర వారి సమేతముగా పండాల విచారణ ఆ దొరల పరమై వుంచున్నది. బియ్యము మొదలయిన సమస్త పదార్ధములు అంగళ్ళలో వుండేవి. స్వామికి నైవేదనార్హములు గనుక వాటిని వాసన చూచి మళ్ళీ ఆ రాసులలో నెయ్యనివ్వరు. యీ నియమము వింతగా యీవూళ్ళో జరుగుచున్నది. మహాజనులనె సాహుకారులు యీ వూళ్ళో లేదు. సమస్త పదార్తములు దొరుకుచున్నవి. యూవూరు సముద్రతీర మందున్నది. యిక్కడ సముద్రస్నానము బహుముఖ్యము. జాతుల వాండ్లు సముద్రతీరమందు యిసక దిబ్బలలో వుపాయమైన యిండ్లు కట్తుకుని కాపురమున్నారు.

కొత్త మూర్తులను ప్రతిష్టచేసిన వెనక గుళ్ళోవుండే పాత మూర్తులను మూటినిన్ని రెండో ప్రాకారములొ వుండే మోక్షద్వారమనే కూపములో ప్రవేశింప పెట్టుతారు. ఆ కూపము అగాధమైన లోతని తెలియవచ్చినది. ఆకూపము వుండే ప్రదేశానకు యిక్కడివారు పొను భయపడుతూ వుంటారు. పాత మూర్తులలో నుండిన చైతన్యకళలను కొత్తమూర్తుల వక్షస్థలాలలో ప్రవేశింప పెట్టినవనక రెండుమూడు నెలలలో ప్రవేశింపపెట్టిన వృద్ధ కొరాతకులు దేహాలు వదులుతారని నిశ్చయముగా తెలిసినది. దాని కారణము యీశ్వరునికే తెలుసును. అయినా నాకు భయమే కారణముగా తోచుచున్నది. యిక్కడ నాలుగు కూరలు పప్పుపులుసు పరమాన్నము రెండు పిండివంటలతో సాధారణముగా వెయింటికి భోజనము చేయించ వలిస్తేయిన్నూటయాభై రూపాయలు సరాసరిపట్టుచున్నది. యిక్కడ అనేక మఠాలున్ను రోగిష్ఠులకు ప్రసాదవినియోగమయ్యేకొరకు కుంఫ్హిణీ ధర్మశాల వొకటిన్ని వుండేటందున బ్రాహ్మణ భోజన నిమిత్తము వొకదినముముందు పిలిస్తేపండితులు పామరులు సహా భోజనము కాఛెసుకుని రెండు గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి అమడదూరములో వుండే నెల్లూరు షహరు 6 గంటలకు చేరినాను.

పయి సత్రమువద్ద కొమటియిండ్లులు కొన్ని చేరినవి గనుక కావలసిన సామానులు దొరికినవి. ఆ సత్రానికి ముందు అల్లూరు మొదలుగా నేమి, యివతల నెల్లూరువరకు న్నేమి నాలుగైదు సత్రాలున్నవి. దారి సడక్కు వేశి గులకరాళ్ళు పరచి ఘట్టించి శాల చెట్లు వుంచివున్నారు. అవి పెద్ద చెట్లు అయినవి గనుక నీడ బాగా యిస్తూవున్నవి. నెల్లూరిలో జిల్లాజడ్జి కలకటర్లు వున్నారు.

పినాకినీనది దాటి నెల్లూరు ప్రవేశించినాము. నది అరకోసెడు వెడల్పు కద్దు. వొడ్దున రంగనాయకులపేట యనే గొప్ప విష్ణుస్థలమున్నది. వుత్తరము మూడుకోసుల దూరములో జొన్నవాడ యనే వూరు కామాక్షమ్మదేవీ సహితముగావున్నది. అక్కడ లక్ష్మీసరస్వతులు వింజామరలు వేశే అవసరముగా దేవివద్ద బింబాలను చేసి వున్నారు. బహుమంది సేవించి వరప్రసాదసిద్ధు లవుతారు. ఆ వూరు భోగస్త్రీలకు మిరాశి గనుక వారి సంఘప్రాబల్యముగలది. ఆవూరికి మిక్కిలి సమీపముగానే వొక చిన్న కొండమీద నరసింహస్వామి దేవాలయ మున్నది. యీజిల్లాలోనే వంగోలుకు రెండామడదూరములో శింగరాయకొండ యనే జాగ్రతస్థలము వొకటి వున్నది. నెల్లూరు సౌఖ్య మయిన వూరు. ఆరోగ్యకరమయిన భూమి. సుమారు వెయ్యిండ్లుకలవు. వుద్యోగస్థులచేత నిబిడీకృతముగావున్నది. గాని వర్తకులు లేరు. సమస్త కూరకాయలు పదార్ధాలు మంచి పాలుపెరుగు కావలశినప్పుడు దొరుకును.

చినగంజాం మొదలుగా సముద్రతీరమందు యీ జిల్లాలో వుప్పు పయిరుచేయడము విస్తారము గనుక వుప్పరజాతి స్త్రీలు దోటిముక్కరలు ధరించి పురుషులు సహాగా భూమి తొవ్విపొలాలుయేర్పరచే పనులలో జాగ్రత్తగా వుంటారు. యిప్పట్లో దక్షిణదేశము పడమటిదేశము పొడుగునా భూమి తొవ్వడానకు నెగడివుండేవారు యీ దేశపు వుప్పరవాండ్లున్ను, వోఢ్రదేశపు వొడ్డేవాండ్లుగా తోచినది. నెల్లూరిలో సమస్త విధములయిన పనివాండ్లు వున్నారు. మరునాడు యావత్తు యిక్కడ వసించినాను.

27 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమణ్నరదూరములో వుండే మనుబోలువద్ద కృష్ణమాచార్యుల సత్రము 7 గంటలకు చేరినాను. యీ సత్రము బహువసతిగా వున్నది. సమస్తపదార్ధాలు దొరికినవి. యిక్కడ వంట, భజనములు కాచేసుకుని యిక్కడికి ఆమడ దూరములో వుండే గూడూరు జాములో చేరినాము. గూడూరు పెద్దదైనా అనావృష్టి కాలములయందు నీళ్ళకు బహు ప్రయాస. బావులు లేవు. ప్రయాసమీద బ్రాహ్మణయిండ్లలో స్థలము దొరికినది.

రాజమహేంద్రవరము వదిలినది మొదలు నియోగుల కర్ణీకపు వుద్యోగము కలవారై పూర్వోత్త్రరమునుంచి ప్రబలులుగా వుండడము వల్ల గొప్ప యింఛ్లు కట్టుకొని వున్నారు. వీరి ప్రారబ్ధవశమువల్లల్ భాటసారులకు స్థలము యిస్తేతమకు పరువుతక్కువాని వొక బుద్ధి జనియించి యిల్లు గొప్పగదా అని అవరైనా వెళ్ళి స్థలము అడగపోతే బ్రాహ్మణ యిండ్లకు పొమ్మంటారు. మీరు బ్రాహ్మణులుకారా అని ప్రశ్నచేస్తే కాదు మేము కరణాలము, స్థలములేదు పొమ్మంటారు. యీ వూళ్ళో రెడ్లు ప్రబలముగా వున్నారు. వొక దేవాలయ మున్నది. యిక్కడ యీ రాత్రి వొక బ్రాహ్మణయింట్లో వసించినాను. దారి సడక్కువేశి శాలపెట్టి వంటల్లూరు మొదలుగా వొక్కతీరుగా గులకపరచి వారధులు కట్తివున్నవి.

28 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 24ఆమడ దూరములొవుండే నాయడిపేట అనే వూరు 9 గంటలకు చేరినాను. యిది పేటస్థలము. సమస్త పదార్ధాలు దొరుకును. మనుబోలు మొదలుగా వెంకటగిరిరాజు వారి భూమి. యె పేటలోను, వారి సదవృత్తి అన్నసత్రము, నగెరున్ను వున్నది. యిక్కడ బోజనము చేసుకుని 6 గంతలకు బయిలువెళ్ళి యిక్కదికి కోసెడు దూరములో వుండే బ్రాహ్మణ పుదూరు చేరినాను. యీవూరు దారి కాక పొయినా 50 యిండ్లు విద్యన్మడలి వుండే గ్రామము గనుకనున్ను నాపరివారల స్వకీయులు కొందరు అక్కడ వున్నారు. గనుకనున్ను యీ వూరికి రావడమయినది. యిక్కడ అనాది దేవాలయాలు 2 ఆబ్రాహ్మణుల పేదరికమునకు తగినట్టి కాపాడబడుచున్నవి. యీ బ్ర్రాహ్మలకు ఈ గ్రామము శ్రోత్రియము. ఈ వూళ్ళో 29 తేది మధ్యాహ్న పర్యంతము నిలవడమయినది.

కృష్ణ మొదలుగా గూడూరివరకు తాగ నీళ్ళులేవని జనులు హాహాకారపడుతూ వుండినారు. ఇవతల నాయడిపేట మొదలుగా యెక్కువ వర్షాలు ప్రతిదినము కురుస్తూ వున్నవి. జగదీశ్వదుడు యీ చొప్పున పాత్రాపత్రములు యెరిగి జీవనాదానము చేయుచూ వున్నాడు. కాల నష్టములకు కారణము అనేకవిధాలా విచారించగా రాజధర్మము ప్రజల నడవడికె యీ రెండుకారణాలున్ను ముఖ్యములని తొచబడుచున్నది. గూడూరు మొదలుగా దారి సడక్కుకాదు. యిసక కలిసిన రేగడ. నాయుడిపేటవద్ద సువర్ణముఖరీనది దాటవలసినది. యేరు అరగడియ దూరము వెడల్పుకద్దు.

నెల్లూరు మొదలుగా అరవమాటలు వింటూ వస్తారు. యీ వూరికి ఆ వూరు యిన్ని గడియల దూరమని చెప్పుతారు. కోసులమాట నిలిచిపోయినది. వుత్తరపినాకిని మొదలు దక్షిణపినాకిని వరకు మధ్య దేశముగా తోచుచున్నది. యీ దేశాములో పడమటి నుంచి కన్నడము వచ్చి కలిసినది. దక్షిణము నుంచి అరవము వచ్చి కలిశినది. వుత్తరము నుంచి తెనుగు అదే రీతుగా వచ్చి కలిసినది గనుక యీధ్యదేశపు భాష యీ మూడు భాషల మిశ్రమయి యీ మూడు భాషలు యీ దేశస్థులు వచ్చి రాక ఆ యా దేశములోకి వెళ్ళి మాట్లాడపోతే ఆ యా దేశస్థులు హాస్యము చేయసాగుతారు.

29 తేది మధ్యాహ్నముమీద 3 గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే దొరవారి కోనేరు అస్తమానానకు చేరినాను. యిక్కడ వెంకటగిరి రాజు వొక గుంట తొవ్వించినాడు. అందులో యెన్నడికి అరోగ్యముగానున్ను, రుచికరముగానున్ను ఆరోగ్యకరముగానున్ను వుండే వుదకము కలిగివున్నది. యిక్కడ వారు కట్టివుండే సత్రము చావిళ్ళు యధోచితముగా విశాలములై వున్నా నిత్యము వేలమోడిగా ప్రజలు దిగుతారు గనుక స్థలము సమ్మర్ధముగా వున్నది. సమీపమందు వుండే అంగళ్లలోను, భాటసారులకు కావలశిన పదార్ధాలు అన్ని దొరుకును. యిక్కడ యీరాత్రి వచించినాను. దారియెర్రయిసక. యిరుపక్కలా అడివి. చోర భయము కద్దు.

30 చేది వుదయాన 4 గంతలకు బయిలువెళ్ళి యిక్కదికి ఆమడదూరములో వుండే మన్నారు పోలూరు 2 గంటలకు చేరినాను. దారి నిన్న మధ్యాహ్నము నడిచినటువంటిదేను. యిక్కడ ప్రసిద్ధమయిన కృష్ణ దేవాలయము వున్నది. వూరికి వుభయపార్శ్వాలా కాళించి యమునలు అనే నదులు రెండు చిన్నివిగా ప్రవహిస్తూవున్నవి. యీ గుళ్ళో జాంబవతుని గుహ యనే బావి వొకటి వున్నది. యిక్కడ జాంబవతునితో పోరి శమంతకమణిన్ని, జాంబవవతిన్ని ప్రతిగ్రహించి శ్రీకృష్ణులు విరాజమానుడయినట్టు స్థలపురాణము తెలియపరుస్తున్నది. భక్తాభీష్టములిచ్చే కోదండరామస్వామి ఆలయమున్ను, జాంబవతుని ఆలయమున్ను లోఆవరణములో వున్నది. కృష్ణమూర్తిని వ్యత్యస్తపాదమనే ధ్యాన శ్లోక ప్రకారము నిర్మించి వున్నారు. యిరువైయిండ్ల బ్ర్రాహ్మణులు వున్నారు. అగ్రహారము ముందర తిరుక్కొళము గమణీయముగా వొకటి యున్నది. వెంకటగిరిరాజాగారి నగరు వొకటి కట్టి వున్నారు. అతిరుక్కొళము నీళ్ళు నిండా పాచి అయినప్పటికిన్ని ప్రతియింటా బావులున్నవి గనుక జలవసతి కలదిగానే వున్నది. కాళిందీ నదికి ఆపక్క, కోటపోలూరని వొకటి వున్నది. గడియ దూరములో సూళూరుపేట అనేపేటా వొకటి వున్నది. యిక్కడి నూరిండ్ల నియోగులు చుట్టుపక్కలా వున్నారు. పోలూరిలో ప్రయత్నము మీద కావలశిన పదార్ధాలు దొరుకును. నెల్లూరు మొదలుగా భూమి తొవ్వితే అక్కడక్కడ కావలసి నన్ని గులకరాళ్ళు తియ్యవచ్చును. నిన్నానేడు నదిచిన భాట కొంత మేర రాతిగొట్టుగా వచ్చినది. యిక్కడ యీరాత్రి నిలిచినాను.

31 తేది వుదయమయిన 4 గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే చిలకలపూడి రామస్వామి సత్రము 7 గంటలకు చేరినాను. దారి సన్నయిసక పొర. నిండా అడివి లేదు. యీ సత్రము పూర్వము వున్న వొక గుంతను ఆసగాచేసి కట్టినాడు. మంచి మజిలీ స్థలము. సత్రము విశాలముగా వున్నది. సత్రములో తొవ్విన బావినీళ్ళు తేలికగానున్ను, రుచిగానున్ను వుంచున్నవి. భాటసారులకు కావలసిన సామానులు అన్ని దొరుకును. యిక్కడ భోజనము కాచేసు కోవడానకు మధ్యాహ్నము నిలిచినారు.

నెల్లూరిసీమ పుల్రుషులు, స్త్రీలు దేహపటుత్వము కలవారుగా నున్ను, యధోచితమయిన శుకచరూపము కలిగి సౌందర్య వతులుగా తోచు చున్నదిగాని దేహవర్ణము నలుపుకలసిన చామనగా తోచుచున్నది. గుణము నిష్కాపట్య ప్రధాన మని చెప్పవచ్చును. యీ మధ్యాహ్నము మీదట రెండు గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి ఆమడ దూరములో నుండే కోళూరురాజు సత్రము ఆరుగంటలకు చేరినాము. దారిలో పెరియవేడు అనే వూరువున్నది. అక్కడినుంచి బండి భాట గుమ్మడిపూడిమీద చీలిపోవుచున్నది. నేను వచ్చిన భాటలో పయిసత్రము సమీపముగా పడవలగుండా వొక వుప్పుటేరు దాటవలెను. చెన్నపట్టణమునకు సమీపగా వుండే కాకిరేనుకాలువకు నీళ్ళువచ్చే ప్రళయకావేరి అనే యేరు పోలూరుదాకా ప్రవాహకొలమునందు వచ్చుచున్నది. ఆయేరు యీ దినము దారి నడవడములో చూస్తూ రావచ్చును. నేడు మధ్యాహ్నము నడిచినదారి యిసకపర. పెరియవేడు మొదలుగా వుప్పుపయిరు చేసే అళాలు శానా వున్నవి. పయినవ్రాసిన సత్ర్ము నుంచి సుందరమయినతోట మధ్యే రెండుకట్లుగా కట్టి వున్నది. జలవసతి కద్దు. సత్రమువద్ద వొక అంగడి అయినా అన్నిపదార్ధాలు దొరికినవి. యీ రాత్రి యిక్కడ వసించినాను.

  1. * మచిలీబందరు 2 వ తేది మగళ్వారం ఉదయాన దారి యిసకపొర "నాతమ్ముడయిన సీతాపతికి బారుజల్లి అనే తాలూకాకు పని అయింన్నీ నాకోసరం బందరులో శలవుమీద కాచివున్నాడు. మణపాక సాల్వపతినాయిడుగారు నాకు విహితుడు గనుకనున్ను వారు వుభయులూ కలుసుకొని" వీరాస్వామయ్యగారిని వాద్యములతో వూరిలోకి తీసుకొని వెళ్ళి రామన్నపేటలో వక గొప్పతోటయింట్లో బస యేర్పరిచినారు.