కాశీయాత్ర చరిత్ర/ఇరువది ఒకటవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యుముగా మీవారు ఆక్రమించిన కటకపుజిల్లా మీకు యివ్వవలసినది లేదని యింగిలీషువారు నిలుపుకొని యేలుతూ వున్నారు. 24 సంవత్సరములుగా వీరి అధీనములో వుండివున్నది.

Kasiyatracharitr020670mbp.pdf

ఇరువది ఒకటవ ప్రకరణము

కన్యాకుమారి మొదలు కాశ్మీరమునకు సమీపమయిన దేశము వరకు ఉత్తర దక్షిణములున్ను సింధునది మొదలు బ్రహ్మపుత్రినది వరకు తూర్పు పడమర లున్ను యింత అనాయాసముగా యెంతో దూరవాసులయిన క్రీస్తు మతాంతరులకు యీశ్వరుడు స్వాధీనము చేయవలనదేమని మరిమరి యోచించగా నాబుద్ధికి విశేషముగాతొచినది యేమంటే మన పూర్వీకులు చెప్పియుండే "అహింసా పరమోధర్మం, స్వర్ణస్తేయం సురాపానం, ఆత్మవత్సర్వ భూరాని" యివి మొదలయిన వచనములయొక్క ధర్మములను జగత్తులో అందరున్ను పరిపాలన చేయసాగితే ప్రపంచధర్మము జరగక లోకము కృత్యరహితమై శాంతినిపొందును గనుకనున్ను అటువంటి శాంతి యీశ్వరుని చిద్విలాసానకు వ్యతిరిక్తము గనుకనున్ను అటువంటి ధర్మాలు అందరున్ను జరిపించ నేరరు గనుకనున్ను ప్రపంచముయొక్క మర్యాదప్రకారము కామక్రొధములతో చిద్విలసము నడుస్తూ వుండేటట్టుగానున్ను అటువంటి ముఖ్యధర్మాలు వదలకుండా కొందరు అవస్యముగా లోకములో జరిగించి యీశ్వరుణ్ని తృప్రిపరచి ఈశ్వరకటాక్షము సంపాదించి అటువంటి జగదీశ్వరును యొక్క దుర్లభమయిన కటాక్షము తాము సంపాదించుకునేటట్టుగా తమకు ఆయాచిత జీవనము కలుగచేసి కాపాడుచువచ్చిన ఇతరులక్షేమమును "స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం" అనే వచన ప్రకారము ప్రార్ధింపుచూ వుండేకొరకు బ్రాఃహ్మణ క్షత్రియులు మొదలయిన వర్ణములు నిర్ణయించపడ్డవిగదా? అందులో క్షత్రియులు చేయుచూవచ్చిన క్షాత్రధర్మపురస్సరమయిన రాజ్యపరిపాలన పూజ్యులుగా వున్న బ్రాహ్మణులకు దురభిమాన పురస్సరముగా పూర్వకాలములో సరిపడక ఆగ్రహోదగ్రులై క్షత్రియులను నిర్వంశము చేసినందున రాజ్య పరిపాలనచేయ నేర్చిన సంప్రదాయకులు యీ కర్మభూమిని లేకపోయిరి. కడమ మూడువర్ణములవారు యెంతవారివారి ధర్మములు జరిపింపుచున్నా శిక్షకులు రక్షకులున్ను అయిన క్షత్రియులు లేకపోయి నందున వీరి స్వధర్మములు ధీర్ఘముగా జరిపించు కోలేక వర్ణాశ్రమ సంకరులైనారు.

శాంతిరహితులయిన బ్రాహ్మణులద్వారా యింత సంకరము అయిన వేడుక యీశ్వరుడు చూచి వీరి శిక్షనిమిత్తము బలాత్కారము చేత కర్మశూన్యులని చేయ నేర్పరచిన తామసగుణ ప్రధానులయిన మహమ్మదంత ప్రవిష్ణులను యీ భూమిలో ప్రవేశింపబెట్టి కావలసి నంతమట్టుకు పూర్వపు వాసనప్రకారము కర్మద్వారా జ్ఞానము సంపాదించనలె నని పొరాడుతూ వుండే బ్రాహ్మలను శిక్షించినాడు. పూర్వీకులు చేసిన పాపానికి వారివంశస్థులు యెట్లా శిక్షకు అర్హులయినారని విచారిస్తే "మాతాశేశద్ మక్కళ్ క్కొ" అనే అన్యయారువచనమే ఆకరము. పిమ్మట యెశ్వరుడు కృపాసముద్రుడు గనుక అనుపూర్వికమైన కర్మభూమి శుద్దముగా కర్మశూన్యమైపోవుననే భయముచేత సత్వగుణప్రధానులై బుద్ధికుశలతచేత యీశ్వర సృష్టి అయిన అనేక బ్రహ్మాండముల గతులను ఉత్తర దక్షిణ ధృవనక్షత్రాల స్థితులనున్ను తెలిపి సాహస ధైర్యములతొ నక్షత్రరూపముగా నుండే బ్రహ్మాండాల వుచ్చములను పట్టి సముద్రము మధ్యేవాడలను నడిపించి యిన్ని బ్రహ్మాండములకు సృష్టికర్తగా వొకడేవున్నాడని నమ్మి యీశ్వరుణ్ని ఆరాధనచేయుచూ వుండే యింగిలీషువారికి తగుపాటి బహుమతిగా ఈ కర్మభూమిని అవలీలగా యిచ్చినాడని తోచినది.

యీశ్వరుడు చిద్విలసార్ధమై ప్రతి చైతన్యానికి భిన్నరూపము భిన్నధ్వని భిన్నతత్పర్యము కలుగచేసి వున్నాడు గనుకనున్ను ప్రకృతి దేహములకు సద్గురుకటాక్షము కలిగేవరమున్ను ఆత్మస్తుతి పరనింద చేసేటంతగా మిక్కిలి ఆనందము వేరే లేదు గనుకనున్ను సాత్విక బుద్ధిగా విచారించితే హిందువులను తమ క్రీస్తుమతానకు యెక్కువ అని వారు అనుకోక పొయినా సరిపోలిన దనియైన అనుకో వచ్చును. దురత్యయమయిన యీశ్వరమాయ అటు సాత్వీకముతో వొకమాత్రముగా యెవరినిన్ని అనుకోనివ్వరు గనుకనున్ను మీది మిక్కిలి హిందువులు పై సంకరద్వారా మత విషయమై బహిరంగకృత్యములలో గర్హితముగా కొన్నికొన్ని ప్రమేయాలయందు నడుచుచున్నారు. గనుక పయిన నార, లోపల చెక్క, అందులోపల మధురమయిన విత్తు, కలిగిన బాదమపండు వతుగా వుండే హిందూమత సారమును తెలుసుకోలేక హిందువులు తెలియక మణిగిపోతారే; మనమతము పట్టితే కడతేరుదురే; అనే పశ్చాత్తాపముతో స్వమత ప్రకటన చేయను యిగిలీషువారు వుద్యోగిస్తూవున్నారు గాని మరి యెటువంటి విషయములోనున్ను హిందువులకు యే విరోధముచేతనైనా తమచేతనయిన మట్టుకు తొందరలేకుండా రాజ్యపరిపాలన చేయుచు ఈశ్వర కటాక్షమునకు దినదినానికి పాత్రులుగా ప్రవర్తింపుచువున్నారు.

యీ కటకపు షహరులో 2000 యిండ్లు కద్దు. పదివేలమంది ప్రజలు వుండవచ్చును. సమస్తమయిన పదార్ధములు దొరుకుచున్నవి. తురకలు ఈ రాజ్యము చేసేటప్పుడు యిక్కడ తురకలు నిండా ప్రవేశించినారు. ఇప్పట్లో మొహరంపండుగ అయినందున యీవూళ్ళో తత్ప్రయుక్తమయిన వుత్సవము జరుగుచున్నది. గాని దక్షిణదేశమువలెనే వుత్సవము జరిగింఛేవారు నామము బొగ్గు మొదలయినది పూసుకొని వెఱ్ఱిచెష్టలు విస్తారము చెయ్యడములేదు.

మహమ్మదు మతస్థులు కాబూలుదేశ ద్వారా హిందుస్తానులో ప్రవేశించిన వెంబడిగానే సింధునదీ తీరమందు వున్న సోమనాధస్వామి గుడి నవరత్నఖచితమైనది వుండగా కొట్టి పాడుచేసి కోట్యంతరాల రత్నాలు స్వాధీన్ముచేసుకొని అక్కడి నివాసులనున్ను పంజాజ అనే అయిదు దారలు కల సింధు నదీ తీరమందు వుండే హిందువులనున్ను సుమారు లక్షమందిదాకా మహమ్మదుమతములో మేము ప్రవేశించమని చెప్పినందుకు వారిని శిరచ్చేదము చేయించినారు. అటుతర్వార ప్రయాగలోవున్న అక్షయవటం యంత్రము మొదలయిన స్థలములను నిర్మూలముచేశినారు. కాశిలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణ వగైరా దెవతలను వారి మందిరాలను బ్రహ్మాలయాలను పగలగొట్టినారు. యింత నిర్బంధము మహమ్మదు మతస్థులు జరిగించినప్పడికీన్ని యిప్పువు వుపాయముచేత క్రీస్తుమతస్థులు తమ మతములో చేర్చిన హిందువులలో సహస్రములో వొకపాలైనా ఆ కాలమందు మహమ్మదుమతములో హిందువులు ప్రవేశించక మహమ్మదు మతస్థులను క్రమక్రమశ: తమ మతముజోలికి రాకుండావుండేటట్టు చేసుకొని యిడిసిన దేవాలయాలను బ్రహ్మాలయాలను మళ్ళీ వుద్ధరించుకుంటూ వచ్చినారు. క్రీస్థుమతస్థులు 'ఉపాయేవతు యచ్చక్యం సతచ్చక్యం పరాక్రమై:' అనే వచనప్రకారము క్రమక్రమముగా యీ దేశములో గౌరవము సుతరాంలేకుండా వుండే జాతిని విస్తారముగా తమమతములో చేర్చుకొని కర్మఫలము యొక్క రహస్యము తెలియని వారిని క్రీస్తు మతమే వుత్తమమని చెప్పుకుంటూ వుండేటట్టు యెప్పటికిన్ని చేసి వున్నారు.

మహమ్మదు మతానకు క్రీస్తుమతానకున్ను (హిందూమతానకున్ను) వుండే తారతమ్యములను గురించి నేను ఒకకధ వినడమయినది. అది యేలాగంటే వొక ప్రభువు ఈ మూడుమతస్థులను వద్దవుంచు కొని వొక ప్రశ్నచేసినాడట. ఆ ప్రశ్న (ఏది) అనగా వొక దారిమధ్యే వొకడు భాటసారిని కొట్టి నిర్భంధపెట్టి తన యింటికి పిలుచుకొని వచ్చి ఆతిధ్యము యిచ్చేటట్టు సంకల్పముచేసుకొని యిల్లు కట్టుకొని కాపురము చేయుచూ వచ్చినాడు. మరినొకడు తన యింటియొక్క సౌఖ్యమును తన ఆతిధ్యముయొక్క రుచినిన్నిభోధచేసి దారిన నడిచేవారిని యింటికి పిలుచుకొని వచ్చి ఆతిధ్యము యిస్తూ వచ్చేటట్టు సంకల్పముచేసి వొక యిల్లు కట్టుకుని కాపురము చేయుచువున్నాడు. మరివొకడు తనయింటికి వొకరిని పిలువవలసినది లేదు, నేను వొకరింటికి వొకరివద్దికి పోను, నా అంతట నేనువుండ వలసినదని నిశ్చయము చేసి యిల్లు కట్తుకుని కాపురము చేయుచు వచ్చినాడు. యీముగ్గురిలో యెవడు వుత్తముడని పై ముగ్గురి మతస్థులను ప్రశ్నచేసినంతలో మహమ్మదు మతస్థుడు బోధించి పిలుచుకుని వచ్చేవాణ్నిన్ని తావులో పడివుండే వాణ్నిన్ని నపుంసకులుగా నిందించి ఆతిధ్యము యివ్వవలెనని తోచినప్పుడు వెర్రితనముచేత దారిపొయ్యేవారు రాకపోతే తన్ని ఆదిధ్యము యిచ్చేదే పురుషవాహిని యని ప్రత్యుత్తరము యిచ్చినాడట. క్రీస్తుమతస్థుడు నిర్భంధము చేసేవాణ్ని కౄరుణ్నిగానున్ను వుండేతావులోనుంచి కదలని వాణ్నిస్థావరిరూపుణ్నిగా నిందించి మనసును రంజితపరచి ఆతిధ్యం యిచ్చేవాడు శ్రేష్టుడని ప్రత్యుత్తరవు యిచ్చినాడట. హిందుమతస్థుడు మంచిపదార్ధములున్ను మంచిస్థలమున్ను దొరికినవాడు తనకు అబ్బెగదా అనిన్ని కొత్తవాణ్నిపిలుచుకొని వస్తే తనకు దొరికిన మంచి పదార్ధము భక్షణచేసెవాడికె కొత్తవానికి లేక పదార్ధాన్ని చెరిచి తాను భుజించక ఆ మంచి పదార్ధాన్ని నిందించి పదార్ధము కలవానికి పనికి రాకుండా కొత్తవాడు యెక్కడ చేసిపోనో అనే భయముచేత మంచిపదార్ధము కలవాడు వొకణ్ని చేర్చక వొకని తొను చేరక తనంతట వుండును. వాడు పూర్ణుడున్ను బలవంతముచేసి తన పదార్ధము పెట్టేవాడున్ను బోధించి తన పదార్ధమును పెట్టేవాడున్ను సకాములు వుత్తమ పదార్ధమును కన్నవారు కారు అని పరస్పరమున్ను నిందించివారట.

యిదిన్నిగాక మరివొక ఇతిహాసము విన్నాను. అది యేమంటే వొక యింగిలీషుదొర వొక బ్రాహణ్ని నాదేహమువలెనే నీదేహము రక్తమాంసాది యుక్తములయిన అవయవాదులతో చేసివున్నదే? బ్రాహ్మలు మేము యెక్కువ అని అనుకోవడానకు కారణ మేమని అడిగినంతలో బ్రాహ్మణుడు పుల్లమామిడిపండు తియ్యమామిడి పండున్ను వొక్కదినుసు ఆకులు కొమ్మలుగల చెట్టున వొక ఋతువులో వొకటే విధమయిన తోలు కండముట్టేతో జనించి సమస్త విధాలా వొక్కటేరీతిగా వున్నా రుచిభేదము కావడానకు యేమికారణమో అదేకారణము బ్రాహ్మణుల యెక్కువతనాన కని చెప్పి మరిన్ని బ్రాహ్మలు శ్రేష్టులని యీశ్వరుడు చెప్పినాడంటాము గాని మేమే చెప్పలేదు. యెట్లా అన్ని మామిడిపండ్ల వుత్పత్తి స్థితిలయాలు వొక్కటే క్రమమయినా వాటి భోక్తకు వాటి రుచిభేదము తెలిశి యిది మంచి యిదిచెడు అని వాట్లను వాడినట్లు మీదేహసారానిన్ని బ్రాహ్మణదేహాల సారానిన్ని యెరిగి యీశ్వరుడు తియ్యమామిడిపండు శ్రేష్టమని రుచిచూడగలవాడు చెప్పినట్లు బ్రాహ్మలను శ్రేష్టులని నిరూపించినాడని చెప్పినాడట. 19 తేదీ మధ్యాహ్నమువరకు కటకములో నిలిచి 4 గంటకు బయలుదేరి యిక్కడికి 5 కోసుల దూరములో నుండే గోపాలపూరు అనేవూరు 8 గంటలకు చేరినాను. కటకముముందర చుట్టుకొనివుండే మహానదిని పడవలకుండా నొకసారి దాటినాను. లోగడ మామిడిచెట్లు శాలవుండగా వాటిమధ్యే యిప్పుడు సడక్కు వేసి వున్నది. గనుక బహు రమణియ్యముగా వున్నది. గోపాలపూరు గొప్పవూరు. బాజారు వీథి కద్దు. వూరుమధ్యె వొక సరసింహస్వామి గుడి కట్టి లోపలి ఆవరణలో బ్రాహ్మలు దిగడానకు తాళువారము వేశి వెలిపక్క శూద్రులకు తాళువారమువేశి మిద్దెవేశి కట్టివున్నది. గనుక ఆగుళ్ళోనే దిగడమయినది. నరసింహమూర్తిని సుందరముగా చేసి వుంచినారు. యీమత్స్యదేశపు బ్రాహ్మణుడు రెండుకాలాలున్ను పూజచేస్తాడు. దక్షిణదేశపు చట్టముగా గుడి కొంచములో ముఖమంటపము వుంచి కట్టివున్నది. యీవూళ్ళో అన్నిపదార్ధములు దొరికినవి. గోపాలపూరు ముందర రెండు నదులు కాలినడకగా దాటినాను. వాటిపేళ్ళు భార్గవనది వొకటి, కుశనది వొకటి.

20 తేది వుదయాత్పూర్వము 4 1/2 గంటలకు లేచి యిక్కడికి 10 కోసుల దూరములో నుండే సత్యవాది యనే వూరు 2 గంటలకు చేరినాను. దారిలో పిప్పిలి అనే మజిలీ వూరివద్ద మనుష్యులు తడిశేపాటి వర్షము కురిశినది. రేపటిదినము ద్వాదశి గనుకనున్నుజగన్నాధమహాక్షేత్రములో కొంచము బ్రాహ్మణ భోజనము చేయింతామని యత్నముతో యీదినము యింతదూరపు మజిలీ చేయడమయినది. యీవూరున్ను గొప్పది. మహాస్థలము. వొకమఠములో విశాలముగా స్థలమువుండగా దిగినాను. యిక్కడ గోపాల మూర్తి గుడి వున్నది. వజ్రరెఖయనే నది వొకటి చిన్నదిగా గుడికి సమీపముగా ప్రవహిస్తూవున్నది.

ఈ స్థలమాహాత్మ్యము పూర్వకాలములో గోకుల బృందావన నివాసిగావున్న కులీనుడయిన బ్రాహ్మణుడు, ఆసన్న కాలమందు వుపచరిస్తూ వున్నవాడికి తనకన్యకను యిస్తానని వాగ్దత్తము చేసినట్టున్ను, ఆ వృత్తాంతము కన్యాబంధుజనము అబద్ధమని వాదించినంతలో గోకుల బృందావననివాసి యయిన గోపాలమూర్తి పురుషాకృతి ధరించి యిక్కడి రాజుముందర సాక్షి చెప్పి ఆ కులీనుడుకి కులీనుడికన్యను తీసి యిచ్చి వివాహము చేసినట్టున్ను అదునిదలుగా యిక్కడ గోపాలమూర్తి విలశిల్లి అంగుళియ్యముతో గీచి, నదిని కలగచేశి భక్తవత్సలుడుగా వుండేటట్టు వాడుకుంటారు. మత్స్యదేశపు బ్రాహ్మల యిండ్లు యీవూళ్ళో 100 కడపదాకా వున్నవి. యీ మూర్తికి పిష్టపక్వాన్నము నైవేద్యముగాని ప్రత్యక్ష అన్నము నైవేద్యము చేసే వాడికెలేదు.

21 తేది వుదయాత్పూర్వము 4 గంతలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములోనుండే జగన్నాధ మహాక్షేత్రము వుదమయిన రెండు గడియలకు చేరినాను. దారి సడక్కు వేసియున్నది. క్షేత్రానకు కోశెడు దూరములో తులసీదాసు అనే మహాపురుషుడి సమాధి వున్నది. అక్కడ జగన్నాధస్వామి స్థూపీమీదనుండే చక్రదర్శనము అవుతున్నది. అక్కడి స్థలవాసులకు యధోచితము దక్షిణయిచ్చి చక్రదర్శనము చేయవలశినది. అటారానాళాఘాటు కుండా క్షేత్రము ప్రవేశించినాను. ఆఘాటులో యాత్ర్ర వచ్చినవారివద్ద హశ్శీలు పుచ్చుకొనే కచ్చేరి వున్నది. అక్కడ మనుష్యులు గణన చేయించుకొని హాశ్శీలు యిచ్చి చీటీచేయించుకుని స్థలము ప్రవేశించవలసినది.

యీ జదన్నాధ మహాక్షేత్రమాహాత్మ్యము పురాణ సిద్ధముగా యిప్పుడు తెలియడము యేమంటే పూర్వకాలమందు యీ భూమి అతిఘోరమయిన దండకారణ్యముగా వుండినది. అందులో నీలాద్రి అనే పేరుగల పర్వతము వొకటి వున్నది. అందులో నీలమాధవస్వామి అనే మూర్తి నివాసము చేయుచు కిరాతకులవల్ల ఆరాధన చేయబడుతూ వుండినట్తున్ను యిట్లా వుండాగా యిక్కడికి బహు దూరప్రాంతమందున్న యింద్రధ్యుమ్న మహారాజుకు యీమూర్తి ప్రభావము ఈస్థల ప్రభావమున్ను తెలిశి నిశ్చయముగా చూచి విచారించి వచ్చేకొరకు వొక బ్రాహ్మణ్ని పంపించినాడు. పూజ చేయుచున్న కిరాతకులకు నీలమాధవస్వామి తత్పూర్వము నన్ను యెప్పుడు బ్రాహ్మడు వచ్చి దర్శనము చేయుచున్నాడో అప్పుడు మీ అధీనము వదిలిపోతానని చెప్పివుండినాడు. గనుక యింద్రద్ద్యుమ్న మహారాజువల్ల పంపించబడ్డ బ్రాహ్మడు తన్ను బ్రాహ్మణుడని తెలిస్తే కిరాతకులు హింసింతురనే భయముచేత ప్రచ్చన్న వేషుడై యీ దండకారణ్యము ప్రవేశించి స్త్రీలు మాయాశక్తి చైతన్య పరిపూర్ణులై సమస్త కామక్రోధ కలహాలు పురుషులకు కలగచేశేవారు గనుక వచ్చిన బ్రాహ్మణుడు కిరాతక రాజుకొమార్తెను స్వాధీనపరచుకుని కిరాతకులవల్ల అర్చింపబడే నీల మాధవస్వామిని దర్శనముచేసి తన రాజుకు సమాచారము చెప్పను వెళ్ళినాడు. ఇంతలో నీలాద్రిపర్వతమున్ను నీలమాధవస్వామి మూర్తిన్ని సముద్రసైకతమువల్ల అంతర్ధానమైపోయి సముద్రతీరమందుండే చక్రతీర్థమువద్ద బలభద్ర కృష్ణసుభద్రల మూడు కళీబరాలున్ను కొంతమట్టుకు దహనమై కొంతకాలకనిలిచి అవి దారుమొద్దువలెనే ఆకారములు కలిగినవిగా కొట్తుకునివచ్చి పడివుండగా అందులో నీలమాధవస్వామి చైతన్యాంశలు ప్రవేశించివుండింవి. ఆవయినము ముఖ్యకిరాతకులకు తెలిసి ఆ దారుమొద్దులను తెచ్చి మృదంగవతుగా వక్షస్థలములయందు ధరించి వాటిని వాయిస్తూ ఈశ్వరభజన చేయుచూ వచ్చినారు. ఇట్టి సమయమందు యింద్రద్యుమ్నరాజు యీ స్థలము ప్రవేశించి నీలమాధవస్వామి అంతర్ధానమయిన వర్తమానము తెలిసి ఖిన్నుడై బహు తపస్సుచేసి మళ్ళీ నీలమాధవస్వామి ఇక్కడ విలసిల్లుతావని వాకు ఇచ్చినందు మీదట యిప్పుడుదృశ్యముగా వుండే మందిరములు కట్టి మళ్ళీ బహుకాలము తపస్సుచేయుచూ నుండగా యీ మందిరాలు పర రాజు స్వాధీనమై పోయినవి. మళ్ళీయీమందిరలనున్ను కిరాతకుల స్వాధీనముగా వున్న దారువులనున్ను యింద్రద్యుమ్నరాజు సంపాదించిన వెనుక విశ్వకర్మ వృద్ధ స్వరూపముగావచ్చి ఆ దారుమొద్దులను బింబాలు చేస్తూవుండగా విశ్వకర్మ నియమించిన కాలము వరకు మనసు తాళక అతను పనిచేసే ఆలయము తెరిచి చూచినందున సగము మట్టుకైన పనితో ఆ మొద్దులను యథోచితముగా బింబాకృతి చేసి విడిసిపెట్టి విశ్వకర్మ పోయినాడు. తర్వాత ఆరీతిగావుండే బింబాలలోనే మూర్తీభవిస్తానని అశరీరవాక్కుగా యీశ్వరాజ్ఞ అయినందున బ్రహ్మపురస్సరముగా ఆ మూర్తులను యింద్రద్యుమ్న రాజు ఇక్కడ ప్రతిష్ట చేసినాడు. అది మొదలుగా యిక్కడ యీశ్వర చైతన్యము ప్రతిఫలించివున్నది---యిక్కడ ప్రసాదమహిమ యెక్కువ కావడానకు కారణము యేమంటే వైకుంఠములో నుండే శ్రీమహావిష్ణుదర్శనానకు సాంబమూర్తిన్ని బ్రహ్మౌయున్ను వెళ్ళినట్లున్ను అప్పుడు లక్ష్మి బ్రహ్మకు శివునికిన్ని యిచ్చినట్టున్ను వీరుభయులు వుచ్చిష్టమని యెంచక మహాప్రసాదమని భుజించి వీరి స్వస్థలాలకు వచ్చినంతలో వీరుభయుల భార్యలుకున్ను వీరుభయులు కళాహీనులై యున్నట్టు తోచి అందుకు కారణమేమని అడిగినంతలో వీ రుభయులు తాము మహాప్రసాదభక్షణ చేసిన వర్తమానము చెప్పగా ఆ యిద్దరుస్త్రీలు ఆ మహాప్రసాదభక్షణ కళావృద్ధి చేయతగ్గదికాని కళాహీనము చేయనేరదే, మరి యేమి పనిచేసినారో అని చెప్పి ఆ ప్రసారము మాకు యేల తెచ్చి యియ్యక పోతిరి అని అడిగినట్తున్ను వీరుభయులు మీరు స్త్రీలు మాయాస్వరూపులు గనుక మహాప్రసాదానకు అర్హులు కారని మీకు తెచ్ఫి యియ్యలేదని చెప్పి మనము కళాహీనులు కావడానకు కారణ మేమో అడిగి తెలుసుకుందా మని మళ్ళీ విష్ణువద్దికి వచ్చినట్టున్ను విష్ణువు వారికి చెప్పడములో మా ప్రసాదభక్షణవల్ల మీరు కళాపరిపూర్ణులు కావలసినవారైనా ఆ మహాప్రసాదము స్వీకరించడములో ఆ ప్రసాదము మీచేతులకు తగిలి పరంపరగా తక్కువయిన అవయవములలో తాకి ప్రసాదాన కగౌరవము మీవల్ల నడిచినది గనుక తన్నిమిత్తమయిన అపరాధముచేత మీరు కళాహీనులైనారని తెలియచెప్పినట్టున్ను అందుకు ప్రాయశ్చిత్తమేమని అడగగా జగన్నధ మహాక్షేత్రములో వొక పుణ్యతీర్ధము వున్నది, ఆ పుణ్యతీర్ధమందు మీరు స్నానము, పానము మొదలయినవి చేసితి రేని తత్పాపపరిహారమగునని చెప్పినట్తున్ను బ్రహ్మరుద్రులు అట్లా చేసినట్లున్ను తదారభ్య యీ స్థలము వదిలిపొయ్యేటప్పుడు యాత్రకు వచ్చినవారు అందరు ఆ తీర్ధములో ప్రసాదవిషయమయిన అపరాధపరిహారార్ధము స్నానపానములు చేస్తారు. ఆ చొప్పున విష్ణుమహాప్రసాదానకు స్త్రీలు అర్హులుకారని తెలిసిన వెనక పార్వతి సరస్వతులు యిద్దరు ఈ స్థలములో తపస్సుచేసి సర్వసాధారణముగా స్త్రీలకు శూద్రులకు కూడా విష్ణుహాప్రసాదము కలిగేటట్టుగా వరము తీసుమున్నారుగనుక అద్యాపి యిక్కడ ప్రసాదము సర్వసాధానణమై తారతమ్యము లేకుండా పరిగ్రహింపబడుతూ వున్నది.

ఆ చొప్పున తపస్సుచేసి అవసరముగా పార్వతి విమలా అనే పేరు ధరించి యీ గుళ్ళో విలసిల్లి ఆమె సంవత్సరోత్సవములో అద్యాపి తామసపూరాంగ మయిన జీవహింసలు అంగీకరింపుచున్నది. విష్ణుగుళ్ళో ఆవరణము లోపల యీ బలులు జరగడము యుక్తముకాదని కొందరు సాత్వికులు యిటీవల విరోధిస్తే వారిని ఉపద్రవపెట్టి యధాప్రకారము ఆశక్తి బలిపూజలు జరిగించుకుంటూ వున్నది. సరస్వతి రజోగుణ ప్రధానురాలు గనుక యధోచితమైన పూజను అంగీకరిస్తూ యీ గుళ్ళో పార్వతివలెనే విశేషనామధేయములేక విలసిల్లివున్నది. యీగుళ్ళో స్నానము చేసినమాత్రాన విష్ణుసారూప్యము కలగచేయ తగ్గపాటి వొక మహాతీర్ధము వుండినదట. తద్ధ్వారా కాకులు మొదలయిన పక్షులకు విష్ణుసారూప్యము కలుగుతూ వచ్చెనట. ఆతీర్ధము యిప్పుఛు కలిసామ్రాజ్యద్వారా అంతర్ధానమై ఆ ప్రదేశాముయొక్క నిశానిమాత్రము చూపింపుచున్నారు. రజస్యమయిన తాపిని మొదలయిన గ్రంధాలలో పరమాత్మ చతుర్ధాకృతిగా ఇక్కడ దర్శనము యిస్తున్నాడని చెప్పేటట్టు తెలిసినది.

ఇక్కడి గుడి నన్నూరు అడుగుల చచ్చవుకములో సుమారు తిరువట్టూరి గుడిపాటి విశాలముగా రెండు ప్రాకారాలు కలిగివున్నది. గర్భగృహము మీద చక్రము వుంచివున్నది. ముఖమంటపము విశాలముగా పయిన పయిన గుంమటము అందము గల స్థూపీ అరటి పువ్వందముగా రెండుతాటిచెట్లపొడుగున కట్టి మీద చక్రము వుంచివున్నది. ముఖమంటపము విశాలముగా పయిన గుంమటము అందముగల కట్టి వున్నది. ముఖమంటపముయొక్క బయిటి ప్రాకారము గోడలో తురకరాయి మీద చిత్తుళిపని బహుసుందరముగా చేసివున్నారు. గర్భగృహము చుట్టూ చిల్లర గుళ్ళ శానా కట్టివున్నవి. గుడిలోపల వొక అక్షయ వటము వొక ముక్తి మంటపము వున్నది. వాటికింద జపము చేస్తే ముక్తిప్రదమని నియమించివున్నారు. వెలిప్రాకారములో నన్నూరు పొయిలుగల వంటశాల విశాలముగా వొకటి కట్టివున్నది. వొక్కొక్కపొయిమీద 12 పిడతలు వుంచి అన్నము పచనమయ్యేటట్టు వయిపు (వీలు) చేసివున్నారు. వొక్కొక్కపొయి 5 వేల రూపాయలకు కదా చిత్తుగా అమ్మకానికి దొరుకుతున్నది. పచనమయ్యే ప్రసాదములో పొయి గలవానికి వరుమానము విస్తారము. నిత్యము రమారమిని అయిదు గరిశల బియ్యము అన్నము భోగ్యముగా నివేదనము అవుతున్నది. పిడతలు చేసే కుమ్మరవాండ్లు 400 యిండ్ల వారున్నారు. ప్రసాదస్వీకారము చేయడములో ఉచ్చిష్టదోషము యెంతమాత్రము పాటించక స్వీకారము చేయుచున్నారు. గుడి లోగడ నీలాద్రిపర్వమున్న తావులో కట్టివున్నది గనుక వూరువుండే భూమి కన్నా గర్భగృహము సుమారు నూరడుగుల పొడుగులో కట్టి వున్నట్టు తోచబడుచున్నది.

గుడికి నాలుగు పక్కలా నాలుగు ద్వారాలువున్నవి. అందులో తూర్పుపక్క ద్వారములో ఒక సింహాన్ని చేసివున్నారు. గనుక దాన్ని సింహద్వారమంటారు. అక్కడ సర్కారు మనుష్యులుంటారు. చీటీ చూచుకొని స్వామిదర్శనానికి గుడిలోపల మనుష్యులను యెంచి విడిచి పెట్టుతారు. జేలేశ్వరమువద్దవుండే సువర్ణ రేఖనది మొదలు గంజాం వద్దవుండే ఋషికుల్యానదివరకు వోఢ్ర దేశముగనుక యీ మధ్యేవుండే కాపురస్తులు జగన్నాధానకు వస్తే యెంతమాత్రము హాశ్శీలు యివ్వనక్కరలేకుండా పూర్వమునించి యేర్పాటు అయివున్నది. యితరదేశస్థులు యెవరువచ్చినా నాలుగుదినములు స్వామి దర్శనము చేసి అయిదోదినము భోజనముచేసి పోవడానకు జమను 1 కి ర్పు 2 రు(2-6-0) యివ్వవలసినది. యెక్కువ దినాలు స్వామిదర్శనము ఆమేక్షిస్తే ఆలెక్కకు త్రైరాశికము మీద రెట్టించి మహసూలు యిచ్చి చీటి పుచ్చుకోవలేను. మహసూలు తీరువచీట్లు యిచ్చేటప్పుఛు పురోహితము వహించిన పండా మారీఫత్తున వాడి పేరుకూడా దాఖలా వ్రాసుకుని యిస్తారు. క్లుప్తమయిన దినాలకు యెక్కువగా యాత్రవారు వుండి పండా తెలియచేయకపోతే 12 రూపా యలు జులుమానా పుచ్చుకుంటారు. గనుక పండావాండ్లు క్లుప్త దినాలకు యెక్కువ వొక గడియ అయినా యాత్రవాండ్లను వుండనీయకుండాకూడా ఘాటీవరకువచ్చి సాగనంపించి లోగడ యిచ్చిన చీటీని మళ్ళీ వెళ్ళీపోయిన ఘాటులో దాఖలుచేసి యాత్రావాండ్లు సాగిపోయిన వయినము లెక్కపెట్టించి రెపోర్టు వ్రాయించివేస్తాడు.

యీ పండాలనే స్థలవాసులని 700 యిండ్లదాకా వున్నవి. వీరు ముప్పదియారు తెగలవారై పూజ వంట మొదలైన పరిచారకము గుళ్ళో చెస్తూవుంటారు. ఈగుడి దేవదాశీలు వింజామరలు మొదలైనవి వేశి వుపచారపు వస్తువులు చేతవుంచుకొని సన్నిధానములో సేవ చేయడముగాని నాట్యమాడడము లేదు. మేళగాండ్లు కొలువులేదు. హాశ్శీలు మూలకముగా లక్షాయిరువైవేల రూపాయిలు సాలుకు వసూలు అవుచున్నవి. అందులో సగముమట్టుకు గుడిసెలవుల నిమిత్తము కుంఫిణీవారు నెలకు సుమారు నాలుగువేల రూపాయిలవంతున యిస్తూవస్తారు. *[1] అన్నిదూపాయిలు ప్రసాదముగా నివేదనచేసి ప్రతి దినపు ప్రసాదాన్ని వారివారి క్లుప్తప్రకారము పంచుకోవలసినదిగాని వొక గవ్వ అయినా రొక్కముగా గుడి యిలాకాదార్లకు దొరకదు

ప్రసాదాలు సింహద్వారము మొదలు ముఖమండపము వరకు గంపలలో పెట్టి అనేక అంగళ్ళుగా అమ్ముతూ వుంటారు. వుచ్చిష్ట వ్యవస్థను విచారించక సమస్త జనులున్ను రుచిచూచి కొనుక్కొనుచున్నారు. కుంఫిణీవరు మహసూలు వసూలుద్వారా పైన వ్రాసిన ప్రకారము యివ్వడము కాకుండా గుడికి కొంత,లాకు జారి భూమిన్ని వుండివున్నది. స్వామిముందర భేటి యనే కానుకలు యేవివుంచినా సరకారు చేరుతున్నవి. యీ మహసూలు ద్వారా సరకారువారికి సమస్త శలవులుపోగా సాలుకు సుమారు పదివేల రూపాయిలు మిగిలేటట్టు తెలిసినది. ♦[2] పండాలకు యాత్ర వారిని యాచించి జీవనము చేయ డమేకాని వేరే యెటువంటి భూరూపకమయిన ఆకరములేక వున్నా లక్షాధిరారులుగా కొందరు పండాలు వున్నారు.

మూడుమూర్తులున్ను దేవదారు దారువులతో నడుముట్టుకు తీరితీరని అంగములతో చేసివున్నవి. బలభద్రుడు జగన్నాధస్వామియనే మూర్తులకు రెంటికిన్ని మణికట్టులేని హస్తాలు ఆలింగనము చేసుకోను జూచిన వతుగా యేర్పరచి యున్నది. మధ్యేవుండే సుభద్రా బింబము చిరతవాలుగా చేతులు లేకనే యేర్పరచబడి యున్నది. జగన్నాధస్వామికి కుడి పక్క సుదర్శనమనే పేరుపెట్టి వొక ముసలాకారముగా ఆదారువుతోనే వొక రూపము యేర్పరచి వుంచినారు. 12 సంవత్సరములకు వొకసారి వచ్చే అధిక ఆషాఢమాసములో కొత్తదారువులను తెచ్చి మూర్తులు యిక్కడ పరంపర్యముగా చేసే శిల్పులచేత చేయించి పూర్వికపు కిరాతకుల వంశస్థులలో ముక్తిని ఆపేక్షించి ఏకవారాశము చేసి బ్రహ్మచర్యము చెయుచునుండే వృద్ధులచేత పాతమూర్తుల వక్షస్థలములో వుండే చైతన్యాన్ని కొత్తమూర్తులలో వుంపించి ఆవక్షస్థలానకు బీగము ముద్రలు వెయిస్తారు. సుభద్ర మూర్తిలోని చైతన్యము పరరాష్ట్రస్థులకు చిక్కి వోఢ్రదేశమందే వేరేచోట పూజింప బడుచున్నది. నాకు తెలియడములో బలభద్ర మూర్తిలోను జగన్నాధస్వామి మూర్తిలోను అద్భుతమయిన వొక లోహమిశ్ర మయిన హస్తప్రమాణము గల వొక స్థూలాకృతి పరమాత్మకున్ను వొకవిగ్ర(హ)ము జీవాత్మకున్ను ప్రత్యామ్నాయముగా వుండేటట్టు విన్నాను. సుభద్రా దేవిబింబములో వొకలక్ష్మీనారాయణ మూర్తి సాలగ్రామము మాత్రము వుండేటట్టు పీఠము మీద మెత్తతలగడలు వేశి వుంచి వస్త్రాలంకారము చేసివుంచుతారు. గనుక కాళ్ళుకలిగినట్తుగానే దర్శనమూవుతూవుంచున్నది. జగన్నాధ బింబమునకు నీలవర్ణము పూశి యున్నారు. బలభద్రబింబమునకు శ్వేతవర్ణముమున్ను సుభద్రకు పసుపువర్ణమున్ను పూసి వర్ణముతో కండ్లుముక్కు యేర్పరచి యున్నారు. రత్నమయముగా మూడుశిరోభూషణములు మూడు బింబములకు ధరించివున్నవి.

నిత్యము యేడు భోగ్యపదార్ధములు నివేదన మవుచున్నవి. వాటిలో ప్రధమద్వితీయాలు యేమంటే బాలభోగ్య మొకటిన్ని కిచ్చిడి భోగ్యమొకటిన్ని యీ రెంటిలోనే విశేషపదార్ధాలు చెరడముగాని తతిమ్మా భోగ్యమునంతా అన్నము పప్పుకూరలు చారు పులుసు పరమాన్నము వడలు అతిరసాలు మొదలయిన పిండివంటలున్ను చేరి నివేదమవుచున్నది. బాల భోగ్యానకు దూదుపూరీ అని పాలమీగడతో వొక దినము పూరీచేస్తారు. అది అపూర్వముగా తోచినది. మిరపకాయలకు బదులు మిరియాలు వాడతారు. హారతికి పచ్చకర్పూరము వాడుతున్నారు. ఉదయకాలమందు దంతధావనసేవయున్ను అర్ధరాత్రిలో బడాశృంగారపు సేవయున్నుముఖ్యములు. నైవేద్యమయ్యేవరకు ప్రసాదాలు నియమము కల పండాల అధీనముగా వుంచున్నవి. నైవేధ్యానంతరము జాతిహీనుల అధీనమయి అందరికి వారు తెచ్చి యిస్తూ వుంటారు. వంటశాలలో పాచకులు తప్ప యితరులు పోకూడదు.

జ్యేష్ఠశుద్ధ పున్నమనాడు గర్భగృహములోనించి మూర్తులను వెలిప్రాకారములో వుండే అభిషేక మంటపానకు నడిపించి తీసుకుని వచ్చి జ్యేష్ఠాభిషేక మంటపములో సాయంకాలము దాకా వుంచి రాత్రి మళ్ళీ నడిపించి గర్భగృహము వద్దికి తీసుకొనిపోయి మరుసటి అమాస్య వరకు తెరకు లోపల యెవరికిన్ని దర్శనము లేకుండా శయనావసరముగా మూర్తులను వుంచి పెట్టుతారు. యీపక్షము యావత్తు కిరాతక వంశస్థుల ఆరాధనతో మూర్తులుంటున్నవి. పండాలుకూడ చూడడము లేదు. జ్యేష్ఠాభిషేక మంటపము బహువున్నతముగనుక ఆ అభిషేక దినము సాయంకాలము వరకు వూళ్ళో యెదటి వీధులలో వుండే వారికంతా స్వామిదర్శనము అవుతూవుంచున్నది. యీదినపు యాత్రనున్ను రధయాత్రనున్ను పతితపావనయాత్ర అని యిక్కడివారు చెప్పుచున్నారు. జ్యేష్ఠాభిషేకానంతరమువచ్చే అమావాశ్యమీది పాడ్యమినాడు ప్రతిసంవత్సరమున్ను చేసే క్రొత్తరధాలు మూటినిన్ని సింహ గొప్పది. 1000 యిండ్లు వుండును. రధములుపొయ్యే వీధులు మాత్రము నిండా విశాలముగా వున్నవి. స్వతంత్రుఘుగా శీమనుంచి వచ్చివుండే పేయిర్ అనే దొరను యాత్రవారి మహసూలు వసూలు చేసే పనులలో కలకటరు హస్తాంతరముగా మామూలు ప్రకారము అటారానాళాఘాటువద్ద వుంచి వున్నారు. యాత్రవారి సమేతముగా పండాల విచారణ ఆ దొర పరమై వుంచున్నది. బియ్యము మొదలయిన సమస్త పదార్ధములు అంగళ్ళలో వుండేవి. స్వామికి నివేదనాహ్రములు గనుక వాటిని వాసన చూచి మళ్ళీ ఆ రాసులలో వెయ్యనియ్యరు. యీ నియమము వింతగా యీవూళ్ళో జరుగుచున్నది. మహాజనులనే సాహుకారులు యీ వూళ్ళో లేరు. సమస్త పదార్ధములు దొరుకువున్నవి. యీవూరు సముద్ర తీరమందున్నవి. యిక్కడ సముద్రస్నానము బహుముఖ్యము. జాతులవాండ్లు సముద్రతీరమందు యిసుక దిబ్బలలో వుపాయమైన యిండ్లు కట్తుకుని కాపురమున్నారు.

కొత్త మూర్తులను ప్రతిష్ణచేసిన వెనక గుళ్ళోవుండే పాత మూర్తులను మూటినిన్ని రెండో ప్రాకారములో వుండే మోక్షద్వారమనే కూపములో ప్రవేశింప పెట్టుతారు. ఆ కూపము అగాధమైన లోతని తెలియవచ్దినది. ఆ కూపము వుండే ప్రదేశానకు యిక్కడివారు పోను భయపడుతూ వుంటారు. పాతమూర్తులలో నుండిన చైతన్యకళలను కొత్తమూర్తుల వక్షస్థలములలో ప్రవేశింప పెట్టినవెనక రెండుమూడు నెలలలో ప్రవేశపెట్టిన వృద్ధ కిరాతకులు దేహాలు వదులుతారని నిశ్చయముగా తెలిసినది. దానికారణము యీశ్వరునికే తెలుసును. అయినా నాకు భయమే కారణముగా తొచుచున్నది. యిక్కడ నాలుగు కూరలు పప్పుపులుసు పరమాన్నము రెండు పిండివంటలతో సాధారణముగా వెయింటికి భోజనము చేయించ వలిస్తేయిన్నూటయాభై రూపాయలు సరాసరిపట్టుచున్నవి. యిక్కడ అనేక మకాలున్ను రోగిష్టులకు ప్రసారవినియోగమయ్యే కొరకు కుంఫిణీ ధర్మశాల వొకటిన్ని వుండేటందున బ్రాహ్మణ భోజన నిమిత్తము వొకదినము ముందు పిలిస్తే పండితులు పామరులుసహా వెయ్యింటికి చేరుతారు. గుడి పండాలలో 1400 కి దాకా చేరుదురు. గోసాయిలు బయిరాగులు యేనూటికి చేరుతారు. వొక్క అణాపామరునికిన్ని నాలుగూణాలు పండితుడికిన్ని దక్షీణ యిస్తే ఆనందింపుచున్నారు. గొప్పవాడు యీ స్థలము విడిచిపెట్టి వచ్చేటప్పుడు గుడియిలాకాపండాలకు నూరు రూపాయలు బహుమతి రూపముగా మొత్తముగా యిస్తే వారివారి తారతమ్య ప్రకారము కలియపంచుకొని తృప్తిని పొందడము లేదు. నాపరువుకు మొన్నూరు రూపాయలు ముట్టచెప్పితే యెంత మాత్రము నా పురోహితునికి కనికరము తోచ లేదు.

వింధ్యకు ఉత్తర దేశస్థులు యెందరు ధనికులు యెందరు ప్రభువులు యే యాత్రవచ్చినా యే సత్కర్మలు చేయతలచినా తోచిన కాలమందు యీశ్వరుడు యిచ్చిన సంపత్తుకొద్ది దానాలు చేసి యత్నసిద్ధి గలవారవుతారు గాని దాక్షిణాత్యుల స్వభావము వలె నేటికి బోరిగెల కోనుకోగానే సరేనా, యెల్లప్పటికి వొక్కటేరీతిగా నడవను యోచనచేసి ఒక్కటే నిదానముగా ధర్మము చేయుచూ వుండవద్దా? అని వెర్రితనముగా యీశ్వరవేద్యము లయిన భవిష్యత్కార్యములను తమకు తెలిసినట్టు తమ అధిక జాగ్రత్తవల్ల కొన్నిపనులు నడవతగ్గట్టుగా యీశ్వరుడు కటాక్షించిన కాలమందు కూడా శక్తికొద్ది ధర్మము చేసుకోకుండా విత్తము త్యాగభోగరహిత మయ్యేటట్టు దాచి వ్యర్ధోపయోగ మయ్యేటట్టు చేయడములేదు. గనుక హిందుస్తానులోని గొప్పవారు యీ పండ్యాలవంటి యాచకులకు యిచ్చే ప్రకరణములో అతిశయమైన యీవిని యిస్తారు గనుకనున్ను దక్షిణ దేశస్థులు కొంచముయిచ్చి తియ్యనిమాటలు శానా చెప్పుతారు గనుక దక్షిణ దేశస్థులకు యేర్పడివుండే పండ్యా దాక్షిణాత్యులకు రాక్షసులని నామకరణము చేసినాడు.

ఈ స్థలముయొక్క రీతి యేమంటే గుళ్ళోవుండే బింబాలు నిరూపించకూడని స్వరూపాలతో వుండడమున్ను రెండుబింబాలు యిరు పక్కల వుండేవి యధోచితముగా సమయమయిన గాత్రముతో వుండడమున్ను మధ్యే సూక్ష్మరూపముతో ఒక బింబము స్త్రీ అని పురుషుడ నిన్ని సందేహవిషయముగా వుండడమున్ను వుచ్చిష్టనిషేధములు లేక ప్రసాదస్వీకారము చేయడమున్ను ప్రసాదముమీద అత్యంతగౌరవమున్ను జాతినియమ వర్జితమున్ను యివిమొదలయినవి కలిగియున్నవి. వీటిని యావత్తున్ను వొక సమూహముచేసి వాటివాటి కారణాలున్ను ఆ కారణాలలో పరంపరగా జన్యమయ్యె కారణాలున్ను యివంతవిచారించగా నా బుద్ధికి తొచడము యేమంటే సమస్తమయిన కర్మభూమియందున్ను సగుణోపాసనకు అనుకూలముగా అనేక దేవతల ఆరాధనలు నియమించి వారివారి భార్యలతోకూడా బింబాలను చేసి వాటికి మందిరములు కట్టి ఆరాధింపుచూ వుండగా నిష్కాముడయి మహాత్ముడయి నామరూప రహితుడయి జ్ఞాన స్వరూపుడయిన దేవునియొక్క రీతిని లోకులకు కృష్ణలీలలను భాగవతసేవ అనే ఆటమూలకముగా ప్రసిద్ధపరచినట్లు యీ జగన్నాధమందిరాన్ని కట్టి యిందులోని మూర్తులను యీరీతిగా రూప నిర్ణయములేక కల్పించి స్థాపించి వొక తత్వ సంగ్రహ పురాణద్వారా ఉచ్చిష్టదోషరహితముగా ప్రసాదగ్రహణము జాతిభేద నివృత్తి యీ స్థలములో కలుగజేసి ప్రకాశింపచేసినట్టు తోచుచున్నది. దని క్రమ మేమంటే శుద్ధతత్వము సమస్తశౄతి చోదితముగా నాదము బిందువు కళ అతీతము అని చెప్పబడుచున్న నాలుగు వస్తువులు ఒకటిగా అయితే అవాజ్మానసగొచర వస్తువు ప్రకాశిస్తున్నది. నాదస్వరూపమయిన జీవాత్మ, బిందు స్వరూపమయిన ఆత్మ కళా స్వరూపమయిన అంతరత్మ, అతీత స్వరూపమయిన పరమాత్మ వీటియొక్క రూపములు యిట్టివని నిర్ణయించ కూడనిది సత్యము గనుక నిర్ణయించకూడని రీతిగానే జీవాత్మ అని చూపించేకొరకు యిప్పట్లో బలభద్రుడనే బింబాన్ని చేసి ఆత్మ నిరూపణ కొరకు సుభద్ర బింబాన్ని చేసి అంతరాత్మయొక్క నిరూపణకొరకు జగన్నాధస్వామిబింబాన్ని చేసి పరమాత్మ నిరూపణకొరకు శుద్ధస్తంభాకారముగా వుండే సుదర్శన బింబాన్ని కల్పించి యీ నాలుగింటిని బోధితము లయ్యేటట్టు చేయడము అవాజ్మానన గోచరవస్తువుయెక్క అన్నమయినందున ఆ అన్నాన్ని ప్రసాదముగా యిక్కడ పేరుపెట్టి సమస్తానకు ఆధారభూతము అన్నము గనుక దాన్ని సమస్తవిధాలా యిక్కడ పూజితపరచి అన్నము యెట్టిగతిని పొందినా నిషిద్ధముకారని యేర్పరచి ప్రపంచము యావత్తు పైన వ్రాసిన అయిదు పదార్ధాలకు అంతర్భూతము అయినది గనుక నేను యెక్కువ, నీవు తక్కువ అనే బుద్ధి లేకుండా జాతి నియమాదులు కూడా మరిచిపోయి ప్రవర్తించేటట్టు ప్రసాదస్వీకార విషయములో వొకనిర్ణయము గలగచేసి అందుకు కొన్ని పురాణాలున్ను ప్రసిత్థ పరచినట్టు తోచుచున్నది. అటువంటి సారవత్తైన పురాణాలున్ను ప్రసిద్ధ పరచినట్టు తోచుచున్నది. అటువంటి సారవత్తైన పురాణములు ఇక్కడ దొరకకపొయినా వాటి కధాక్రమము యెవరికైనా యిక్కడ జ్ఞాపకము వుండునా అని విచారిస్తే యెటువంటి పండితునికిన్ని నాకు తోచినకధ వినికిడి అయివుండేటట్టు తోచలేదు. అయితే పరబ్రహ్మ నాలుగాకృతులతో యీ స్థలమందు ప్రకాశింపు చున్నా డని వొక మాట స్థూలముగా పండితుల వాక్కున ప్రచురముగా వినపడుచున్నది. వాటి క్రమ మేమని అడిగితే ధోరణిగా చెప్పను వారికి వినికిడి లేకుండావున్నది. యిటువంటి మహాస్థలములో జూన్ నెల 26 తేది వరకు వసించినాను.

Kasiyatracharitr020670mbp.pdf

ఇరువది రెండవ ప్రకరణము

27 తేది భోజనోత్తరము 11 ఘంటలకు బైలుదేరి యిక్కడికి 4 కొసుల దూరములో వుండే సరసింగఘాటు అనే వూరు 3 గంటలకు ప్రవేశించినాను. యీ వూరు చిన్నదైనా ముసాఫరులకు కావలసిన సామానులు అన్ని యిచ్చేపాటి కోమట్లున్నారు. యిక్కడ కోమట్లు రెండుతెగలు. కళింగ కోమట్లని వొకతెగ, గౌరకోమట్లని వొక తెగ. దక్షిణదేశములో వుండే తెగ గౌరకోమట్లు. యిక్కడగౌరకోమట్లు నిండాలేదు. యీవూళ్ళోదక్షిణదేశస్థుడు ముద్ధుకృష్ణ పిళ్ళ అనేవాడు గంజంలో వుద్యోగముచేసి వొక డాబా అనే సత్రము చుట్టు మిద్దెవేశి కట్టి మధ్యేజగనాధస్వామికి వొక మందిరముకట్టి వొక తటాకము వొక వనప్రతిష్ట చేసి భూస్థిరులు సంపాదించి అతిని ఆచార్యపుషుడు జగన్నధ నివాసియై వుండగా అతనికి దానము యిచ్చినాడు.

  1. * చూడు. యీపుటలోని వ్యాఖ్యానము.
  2. ♦ 1843 సంవత్సరము వరకు దేవాదాయములను కుంఫిణీవారు స్వయముగా పరిపాలించుచుండిరి. కలెక్టరులు రెవెన్యూబోర్డు తనిఖీక్రింద అజమాయిషీ చేయచుండిరి. మిగిలిన సొమ్ము తీసికొనుచుండిరి.