కాశీయాత్ర చరిత్ర/ఇరువదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

క్రీస్తుమతానికి అంతర్భూతమయిన అరమనజాతి మొదలయిన వారిగుళ్ళు బహుశ: యీ బస్తీలో కట్టివున్నవి. క్రీస్తుమత ప్రకటన నిమిత్తము యిక్కడ అనేక ప్రయత్నములు గ్రంధప్రచురత్వద్వారా జరుగుచున్నవి.

ముచ్చిగోలా మొదలు బ్రారకుపూరుదాకా వొక సడక్కువేసి యిరుపక్కలా చెట్లువేసి బహుసుందరముగా యేర్పరచి వున్నది. సహరు బస్తీ నిడువున వుత్తర దక్షిణములు మూడామడవుండవచ్చును. వెడల్పులో రెండామడ వుండవచ్చునని తోచుచున్నది. జనబాహుళ్ళము చూస్తే సుమారు 15000 వేలు వుండవచ్చునని తోచినది.

మవాసైనీలయిన స్త్రీలు శంఖపుగాజులు ధరించవలసినది అగత్యము గనుక దక్షిణదేశపు శంఖాలంతా ఈ దేశములోనే వ్రయమయ్యేటట్టు తోచబడుచున్నది. స్త్రీలు విస్తారము ఆభరణాదులు ధరించడము లేదు. పురుషులలో గొప్పగా వుండేవారు యింగిలీషు జాడగా వస్త్ర వాహనాదులు వాడుకుంటున్నారు. వాద్యవిశేషములలో ఫిడీలు అనే యింగిలీషు వీణలు యీప్రాంతముల బహు ప్రచురముగా వున్నవి. యిక్కడల స్తర్లు గ్లాసులు కరిగిపోశి చేయుచున్నారు. కంట్లాలు మోశే గుర్రాలు వొంటెలు దొరకవు గనుక నా డేరాలను బోయీల చేత మోయించేటట్టు నిశ్చయము చేసినాను.

దేశ దేశపు వాడలు యిక్కడ వరకు తెచ్చి యిక్కడి సరకులు దేశ దేశాలకు తీసుకొనిపోవుటచేత యీ షహరులో దొరకని ద్వీపాంతర పదార్ధములుగాని స్వదేశ పదార్ధములు గాని లేకవున్నవి. వర్తకులు సుఖించివున్నారు. యిటువంటి కలకత్తాషహరులో జూన్ నెల 2 తేది వరకు వసించినాను.

ఇరువదియవ ప్రకరణము

3 తేది వుదయాన 5 గంటలకు ప్రయాణమై పడవలమీద వుడుబడియా యనే వూరికి 12 గంటలకు చేరినాము. ఈ దేశములో ఆయుధపాణులుగా యెవరున్ను వుండకూడకపోయినా బనారసుల్లో వర్షారంభము గనుక యీ రాత్రి నిండా వర్షముకురిసినది. యీ రాత్రి యిక్కడ వసించినాను.

4 తేది వుదయాన 6 గంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసుల దూరములోవుండే బాగునా అనే వూరు 9 గంటలకు ప్రవేశించినాను. దారి సడక్కువేశియున్నది. నామోదరు అనేనది పడవలతో దాటినాను. కాశినుంచి పది బాడిగె గుఱ్ఱాల మీద 40 బిందెల గంగ చెన్నపట్టణమునకు పంపించినది గాక కూడా వున్న గంగాజలము యెనిమిది బిందెలున్ను నిత్యము జరూరులేని డేరాలు రెండున్ను మందుల పెట్టెలు వగైరా సామానున్ను రెండుబండ్లమీద తెచ్చినందున యీనదులు పడవలకుండా దాటేటప్పుడు, బహుప్రయాస యిచ్చినవి. యీవూరుగొప్పదేను. బాజారుకద్దు. సకల పదార్ధాలున్ను దొరుకును. భాటసారులు దిగడానకు గొప్ప యిండ్లు, అంగడివాండ్లు కట్టివుంచి వుండేటందున డేరాలు నిమిత్తము లేకుండా విశాలమైన అంగడి యింట్లో దిగినాను.

5 తేది వుదయాత్పూర్వము మూడుగంటలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములో వుండే సీదహాటు అనేవూరు పదిగంటలకు చేరినాము. దారి నిన్నటివలెనే సడక్కు వేశి వారధులు కట్టి వున్నది. రుక్మినారాయణ న్ అనే నది వొకటి యీదినము పడవకుండా దాటినాము. యీవూరు గొప్పది. బాజారున్నది. దిగడానకు యిండ్లు సహా కట్టివున్నారు గనుక డేరాలు వెయ్యలేదు. దిగినయింటికి నాలుగణాలు యిస్తే అంగటివాడు సామాను తీయవలసినది గనుక అదే ప్రకారము చేసినాను. సమస్తమైన పదార్ధాలు ఈ వూళ్ళో సహజముగా దొరికినవి. యీవూళ్ళో ఈ రాత్రి వసించినాను.

6 తేది వుదయాత్పూర్యము మూడుగంటలకు లేచి యిక్కడికి యేడు కోసుల దూరములో నుండే డబరా వూరు 10 గంటలకు చేరినాను. దారి సడక్కువేసి ముందుదినముల దారివలెనే యిరుపక్కలా పైరుపొలాలుకలిగి సుందరముగా వున్నది. దోవలోవుండే క్రసా అనేనది కాలునడకగా దాటినాను. యీవూరుగొప్పదేను. అంగటివాండ్లు గొప్ప యిండ్లుకట్టిపెట్టివున్నారు. సమస్తమయిన పదార్ధాములు దొరికినవి. పోలీసు జమీందారుడువుండే కసుబావూరు నాపరవానా వొక మజిలి ముందు పంపిస్తూ రావడమువల్ల నేను దిగే ప్రతివూరున్ను అన్ని విధాలా సొంతమువలే కావడముమత్రమే కాకుండా దింగిన వూరిమష్యులు దిగిపొయ్యే వూరిదాకా కూడావచ్చిసాగనంపించి పోవుచున్నారు. యిటు నాకు జరగడమే కాకుండా యిక్కడ పోలియను ఖాయిదా ముసాఫరులువచ్చి దిగితే చౌకీపారా రాత్రిళ్ళు యిచ్చి వారిని వారి సామానునున్ను కాపాడి పంపించేటట్టుగా వుత్తర్వు అయివున్నది. అంగటివాండ్లు వచ్చిన మొసాఫరులను ప్రార్ధించి దిగేలాగుచేసి కావలసిన పదార్ధాలు యిచ్చి ఆదరింపుచున్నారు.

యీ దేశపువాడికె వొకసారి వండుకున్నకుండ రెఒడోసారికి పనికిరాదు గనుకనున్ను కుండలు నయముగకనున్ను ముసాఫరులు అందరు కుండలుకొని వండుకొని దిగిన తావులలో ఆకుండలు పగల కొట్టిపోతారు.దిగుడు మజిలోలో కుండ పెంకుల వల్ల అసహ్యము మాత్రము ఒకటి కలిగియున్నది. యిల్లుకట్టి అంగటివాండ్లు జలవసతికి కూడా పూరాగాచేసి యుంచుతారు. యీవూళ్ళోనుంచి రాణీ సరాయిదాకా సడక్కు లేనందుననున్ను సడక్కు తిన్నగా యీవూరి నుంచి మేదినిపూరునకు వేశియుండుటందుననున్ను నా రెండుబండ్లను మేదినివూరుకుండా రాణీసరాయికి రమ్మని సాగనంపించి యీవూళ్ళో యీరాత్రి వసించినాను.

7 తేదీ ఉదయాత్పూర్వము 3 1/2 గంటలకు లేచి యిక్కడికి యేడు కొసుల దూరములో వుండే భద్రకాళి అనే వూరు 12 గంటలకు ప్రవేశించినాను. దారి సడక్కులేదు. పొలములమీద నడిచి రావలసినది. ప్రతిదినమున్ను నేను బయలుదేరిన దినము మొదలుగా కలకత్తాలో కలిగియున్న గ్రీష్మము లేకుండా తెల్లవారి మబ్బువేసి మజిలీ దిగినవెనక వర్షము కురియుచూ వచ్చినది. గనుక దారి బహు అడుసుగావుండినది. యీవూరున్ను గొప్పదేను. భద్రకాళి అనే దేవి గుడివున్నది. దిగడమునకు విశాలమయిన యిండ్లుకట్టి వసతికి గుంటలు తొవ్వించి యున్నారు. మొసాఫరులు దిగడానకు ఈ అంగడివాండ్లు, అంగడికి చేరినట్టు ప్రత్యేకముగా కట్టివుంచే యిండ్లు విడవలిపూరికలవి అయినా బహు రమణీయముగా ప్రతిదినమున్ను శుద్ధిచేసి వుంచుతారు. యిక్కడ సమస్తమైన పదార్ధములు దొరికినవి.

2 వ తేది వుదయాత్పూర్వము 4 గంటలకు లేచి యిక్కడికి యెనిమిదికోసుల దూరములోనుండే రాణీసరాయి ప్రవేశించినాను. ఈజాగాలో వూరులేదు. 30 అంగళ్ళు సడక్కుకు యిరుపక్కలా కట్టివున్నవి. దిగడానకు విశాలమయిన యిండ్లుకట్తి వాటికి చేరినట్టుగానే రమణీయమైన గుంటతొవ్వించినారు. చౌకీదారులు మాత్రము వున్నారు గాని పోలీసు బంట్రౌతులు యిచ్చట వుండడములేదు. దారిలో నారాయణగడయని వొకవూరు వున్నది. అక్కడ పూర్వరాజులు నియమముచేసిన సదావృత్తి సత్రాన్ని అద్యాపి కుంఫిణీవారు నడిపిస్తూవున్నారు. యిక్కడ సకల పదార్ధములు కూరగాయల సమేతముగా దొరికినవి. ఈదేశములో పాలు పెరుగు సహజముగా దొరుకుచున్నవి. దిగిన మజిలీలలోవుండే చౌకీదార్లను నలుగురేశిమందిని రాత్రిళ్ళు నాబంట్రౌతులతో కూడా పారాయిచ్చేటట్టు చేసి వుదయాన సాగివచ్చేటప్పుడు నాలుగేశిఅణాలు యిస్తూ వచ్చుచున్నాను. యీ దినము దారి కొంతమేర సడక్కువేశి యున్నది.

6 తేది ఉదయాత్పూర్వము 2 1/2 గంటలకు లేచి యిక్కడికి 9 కోసుల దూరములో నుండే జేలేశ్వరం పట్టణం అనే వూరు 1.3 గంటలకు ప్రవేశించినాను. దారిసడక్కువేసి వారధులు కట్టివున్నవి. యిరుపక్కలావుండే భూమికన్నా మనిషి పొడుగుమిట్టతో సడక్కువేసియున్నారు. సడక్కునిమిత్తమై కాలువగా మట్టి యెత్తినారు గనుక ఆ కాలువలో నీళ్ళు నిచిచినప్పుడు వొంటికొయ్య దోనెలమీద కావలసిన సామానులు వుంచి యీడ్చుకొని వస్తూవుంటారు. ఈ వూరు సువర్ణ అనే నదీతీరము. గొప్పవూరు. బాజారువీధి వున్నది. ముసాఫరులు దిగడానకు యిండ్లు సమేతముగా యేర్పడివున్నవి. సమస్తమయిన పదార్ధాలు దొరికినవి.

10 తేది వుదయాత్పూర్వము 3 1/2 గంటలకు లేచి యిక్కడికి అయిదుకోసుల దూరములో నుండే బస్తా అనే వూరు 10 గంటలకు చేరినాను. యీవూరు చిన్నదైనా అన్ని పదార్ధాములు అప్రయత్నముగా దొరికినవి. కుంఫిణీవారు విశాలమైన ధర్మశాలలు రెండుమిద్దెలు కట్తించివున్నారు. నేటిదారిన్ని సడక్కువేసియున్నది. సువర్ణనది కాలువ నడకగా దాటినాము. నదికి యీ పక్క మంకపుచౌకీ వొకటి యున్నది. వొకమాత్రపు వారిని సోదాచూడడమనే సాకుపెట్టి కొంత గుంజుకోకనే ఆ చౌకీదారులు వదలరు. నేటిదారిలో భాటకు కుడిపక్క కొంతదూరములో వొక పర్వతము తెలుస్తూ వచ్చుచున్నది.

కలకత్తాలో నేను వుండగా వొకదినము గాలితోకూడా రాళ్ళ వాన కురిశి గచ్చకాయలంతేశిరాళ్ళు పడ్డవి. ఆరాళ్ళు పది అయిదు యెత్తి వొకపాత్రలోవేశి కుదిలించితే రాళ్ళు రాళ్ళు కుదిలించినట్టు చప్పుడౌతున్నది. కిందపెట్టి బళువైన పదార్థముతో కొట్టితేనీళ్ళయిపోతున్నవి గాని దెబ్బకు తాళనెరవు. చేత పట్టుకుంతే తూటుపొయ్యేపాటి శీతళముగా శుద్దస్ఫటిక నంకాశముగా వున్నది. గడియవుంచితే క్రమక్రమముగా కరిగిపోతున్నవి. మళ్ళీ అటువంటి నాన ప్రసక్తించలేదు. కలకత్తాలో కలిగివున్న పిశాచగాలిన్ని యిక్కడలేదు.

కలకత్తాలో నేను వుండగా మలడీ అనే జ్వరము కలకత్తాలో నంతా ప్రవేశించి నా పరివారములో యివవైమందిని బాధపెట్టినది. గయలో వొక నల్ల డాక్టరు నాకు చెప్పిన ప్రకారము హిందూస్థాని భాషలో చిరటా అనిన్ని యింగిలీషులో బిట్టరు అనిన్ని చెప్పేమూలిక వేశి కషాయముపెట్టి యిలిక్కిసియా విత్రిల్ అనే ద్రావకము వొక క్వార్టర్ బాటిల్ కషాయానకు రెండు తేగరిటెలు పోశి సాయంప్రాత: రెండేసి తులాలు యిస్తూ వచ్చినంతలో ఈశ్వర కటాక్షముచేత అందరికిన్ని అనాయాసముగా వాశి అయినది. వొక బోయివాడికి నీరుకు బదులు నెత్తురు దిగుతూ వచ్చినంతలో బొందెగడ్డ రసము తీసి తవ్వెడు రసములో మూడు బొట్లు గంధకద్రావకము పోశి యిచ్చినాను. త్వరలో వాశి అయినది.

11 తేది వుదయాత్పూర్వము 2 1/2 గంటలకు లేచి యిక్కడికి 7 కోసుల దూరములో వుండే బాలేశ్వరమనే కసుబాబస్తీ 9 గంటలకు చేరినాను. దారి యీవరకు వున్నట్టు సడక్కు యేర్పడి వుండడములో భూమి యిసుక కలిసిన రేగడ గనుక బహు గట్టిపడి వర్షము కురిశివున్నా కాలికి అంటుకోకుండా వున్నది.

కలకత్తా మొదలుగా సువర్ణనది వరకు భూమి జిగట రేగడి, అందువల్ల కలకత్తాలో కోశే యిటికెరాళ్ళు బహుగట్టిగా రెందుమూళ్ళ చచ్చౌకముగా కొయ్యగల పాటివైపు కలిగివున్నవి. కలకత్తా యిటికె రాళ్ళు యినుప చిట్టముతో సమమైన బలము కలవని చెప్పవచ్చును. కలకత్తా సున్నము మాత్రము ధావశ్యము చాలదు గనుక యింటి గోడలు చెన్నపట్టణము వలె నీడలు తేరడము లేదు.

దేశాస్థులందురున్ను గుల్లసున్నము వేసుకొంటారు. యీ విషయాన్ని గురించి ఒక దినము బంగాళీవారు మీ దేశములో బ్రాహ్మణులు మత్స్యభక్షణ చేయడములేదంటిరే, గుల్లసున్నము తాంబూలచర్వణముతో తినడములేదా అని అడిగెను. నా అనుభవద్వారా కావేరి మొదలు కన్యాకుమారి వరకు సమస్త బ్రాహ్మణులున్ను దేశాచారప్రకారము గుల్లసున్నము వేసుకుంటారని తెలిసి నేను ఆ దేశ సంచారము చేసినప్పుడు వారితోటిపాటుగా అదే సున్నము వేసుకొనివున్నా బంగాళీవాడుచేసిన ప్రశ్నమహిమను యోచించి మా చెన్నపట్టణములో గుల్లసున్నము వేసుకోవడము లేదని వుపాయముగా వుత్తర్వు చెప్పినాను గాని నా మనస్సుమాత్రము కలతబడి వున్నది. గుల్ల లున్నూ జలజంతువుల కళేబరాలతో చేరినది నిజమేకదా! యీ దేశస్థులు మత్స్యకళేబరాలను పచనముచేసి తింటే దక్షిణదెశస్థులు వాటి దేహాలమీది చిప్పలను కాల్చి తింటారు. ఈ రీతిగా పరోక్ష ప్రత్యక్షాలుగా జలజంతువుల కళేబరాలను వొక పక్కది వొక దేశస్థులు వొకవిధమయిన పచన ద్వారా భక్షణ చేస్తే మరివక దేశస్థులు మొరివొకపక్క కళేబరాన్ని మరివొక విధమయిన పచనముతొ భక్షణ చేయుచూ సమమైన పాపులయివున్నా వొకరిని వొకరు నిమిత్తము మాలి నిందింపుచూ వుంటారు. యీసరికి నావద్ద ప్రయాగనుంచి తెచ్చిన రాతిసున్నము వున్నది. యిది ఖర్చు అయిన వనక బంగాళి వాడివల్ల ధర్మసూక్ష్మము యెచ్చరించబడ్డా యుక రాతిసున్నము దొరకక పోతే దేశాచారాన్ని లోగడివలెనే అనుసరించవలసి వస్తున్నది. మూటశోధన నిర్బంధము లోకులకు కలిగి యున్నది.

1 వ తేది వుదయాత్పూర్వము 1 1/2 గంటలకు లేచి యిక్కడికి 9 కోసుల దూరములో వుండే సూరంగు అనే వూరు 7 గంటలకు చేరినాను. నామూడు సవారీలలో రెండు సవారీలకు యిరువై యింటికి వోఢ్రబోయీలను పెట్టవలసి వచ్చినందునన్ను వారు యిరువురి మోతతో వారి వారి అడుగులను యివతలవారి అడుగులతో కలుపుకోకుండా మెల్లిగా నడిచేవారు గనుకనున్ను యెండగొట్టుకు యెంతమాత్రము సహించలేదు గనుకనున్ను రాత్రిళ్ళు యింతప్రొద్ధువుండగా లేచి నడవ వలసివున్నది. దారి నిన్నటివలెనే సడక్కుచేసి యున్నది. యిసక కలిసిన రేగడ. బాలేశ్వరము మొదలుగా కుడిపక్క రెండు గడియల దూరములో సముద్రములో కలియవచ్చిన వింధ్యపర్వత సంబంధమైన పర్వతములు వుండి వున్నవి. నేటిదారిలో బాలేశ్వరానకు కొశెడు దూరములో వక సుంకపు పెరిమెట్టు చౌకీ వున్నది. యిక్కడి కలకటరు మేజెస్ట్రేటు అయిన రికెట్టుదొర వొక చప్పరాశి బంట్రౌతును తయినాతిగా యిచ్చినందున తలషీ అనే శోధన చిక్కులేకుండా సాగి వచ్చినాను. అయినప్పటికి నా గొప్ప కాపాడుకునే నిమిత్తము చౌకీ 1 కి ర్పు 2 వంతున యినాము యిస్తూవచ్చినాను. ఠాణా సరిహద్ధు ప్రకారము వొక బరక్రదాసు అనే పోలీసు బంట్రౌతు వస్తూ వచ్చినాడు గనుక యివతలి సరిహద్ధు పోచాయించి (చేర్చి) బంట్రౌతు సాగి పొయ్యేటప్పుడు అరదూపాయిలు యినాము యిస్తూవచ్చినాను.

యీ భూమిని వరిపయిరు యెక్కువ. యీ వుత్కలదేశములో వసించే వొఢ్రబ్రాంహ్మణ పండితులు గౌడదేశస్థులకన్నా సంస్కృత భాషను బాగా వుచ్చరించుతారు యీ దేశస్థులకు తెనుగుమాట వొకటి అర వచ్చును. చెన్నపట్టణమంటే తెలియదు. మదిరాసు అనవలసినది.

కలకత్తావద్ద భాగీరధీంది వదిలిన వెనక గంగలో కొట్టుకునివచ్చే కళేబరాలను తినే నిమిత్తము యీశ్వరుడు గంగకు యిరుపక్కలా సృజన చేసిన వింత ఆకృతిగల బోరుగద్ధలను చూడలేదు. ఆగద్దలు రెండు పూర్వ మహంపూర్వ మని యెదురుగా వచ్చినారు. వారు వోఢ్రబ్రాహ్మలు, వుత్కలు లనిన్ని చెప్పుతారు. యిక్కడ శేరు 1 కి 20 రూపాయల యెత్తు, కలకత్తా శికారూపాయలకు చెన్నపట్టణపు రూపాయలకు నూటికి పది వ్యత్యాసము వున్నది. చెన్నపట్టణములో తగ్గిన దినుసని తెలియవలసినది. బంగాళా సీమలోనుండే బోయీలు యీరీతిన బళువు యెత్తలేని జన్ను మోతగాండ్లుగా వున్నారే, మన దేశానకువచ్చే బంగళా పల్లకీలు బహు బళువుగా వుంటున్నవే, వీటి నిమిత్తమే మని విచారించగా బంగాళాలొవుండే యింగిలీషుదొరల కేమి? హిందువులకేమి పాలకీలుయెక్కే షోకేలేదు. పని గడవడానకు కూలిపల్లకీలు అప్పటప్పటికి వుంచుకుంటారు. ఆకూలివల్ల కీలు తేలికగానె వుంచున్నవి. అక్కడ నెల పొడుగు పల్లకీలు మాత్రము చేసి వుంచివున్నవి. వాట్లను హిందూస్తాన్ చెన్నపట్టణము మొదలయిన దేశాంతరాలకు పంపించడానకు తయారయినట్టుగా తోచబడుచున్నది.

14 తేది వుదయాత్పూర్వము 4 గంటలకు లేచి యిక్కడికి 2 కోసుల దూరములో నుండే వైతరణీనదీతీరపు వూళ్ళయిన ఆకులాపదా, మూడియాపాడు అనే వూళ్ళు 11 గంటలకు చేరినాను. యీనది వర్షాలు కురిశినందున వడవలకుండా దాటడమయినది. యీ దినము నడిచినభూమి శుద్ధరేగడ, మన్ను వర్షము కురిశినందున అమితముగా కాళ్ళకు అంటుకుంచూ వచ్చినది.

యిక్కడికి జాజీపురమని పేరుకలిగిన నాభిగయ మూడుకోసుల దూరములోవున్నది. అక్కడ యీ వైతరణీ నదీతీరమందు దేహానంతరము జీవుడు వైతరణీనది దాటే కష్ణము పొందకుండా వుండేకొరకు వైతరణీ ప్రయుక్తముగా వొక గొదానముచేసి నాభి ఆకారముగా వుండే వొక కూపములో పిండప్రదానము చేయవలసినది. వుత్కల బ్ర్రాహ్మలు 140 యిండ్లవారు నాభి గయావళీలని పేరు వుంచుకొని యాచించి జీవనముచేస్తారు. వీరు మత్స్యభుక్కులు కామనిచెప్పినా గయామహాక్షేత్రములో గయావళీలకు బ్రాహ్మణార్ధము చెప్పినట్తు దక్షినదేశస్థులు వీరిని చెప్పడములేదు. ప్రత్యక్షముగా అన్నశ్రాద్ధము చేస్తే స్వదేశాస్థులు దొరికితే బ్రాహ్మణార్ధము చెప్పుతారు. లేని వుగా యెక్కి పడవలమీద వుందవచ్చును. ఈ రెండునదుల పేర్లు కరుసా అనిన్ని బ్రాహ్మణి అనిన్ని చెప్పుతారు. బ్రాహ్మణినది గోపాలపూరుకు వోరగా వున్నది. యీవూళ్ళోను ధర్మశాలలు 200 అడుగుల నిడువు 15 అడుగుల వెడల్పుతో నొక కూటమున్ను ఆరడుగుల వెడల్పుతో నొక తాళువారమున్నూ వేశి రెండుకొనలలో రెండు కొట్టిడీలు కట్టివున్నవి. ఇటువంటి ధర్మశాలలు రెండేశి వొక్కోక్క వూళ్ళో యెదురెదురుగా మధ్యే 400 అడుగుల బయలు విడిచి రమణీయముగా కట్టివున్నవి. మధ్యేవుండే బయిలులో వొక బావి తొవ్వించివున్నారు. యీధర్మశాలలు కుంఫిణీవారు కట్టించి మూడుసంవత్సరములు అయినవి. ప్రతి ధర్మశాలలోను వొక పోలీసు బంట్రౌతును యిద్దరేశి ఝూడుమాలీలను వుంచినారు. యీదినము దిగిన ధర్మశాలకు చేరినట్టుగా సమీపములో వున్నవి. యీవూళ్ళో సమస్తమైన పదార్ధాలు దొరికినవి.

17 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కడికి 7 కోసుల దూరములో నుండే చత్తియా అనే వూరు 10 గంటలకు చేరినాను. దారి సడక్కువేసివున్నా వర్షము కురిసి యెండివున్నందున మనుష్యులను నడవనియ్యకుండా మట్టిగడ్డలు కాళ్ళకు నిండాగా గుచ్చుకుంటూ వచ్చినవి. యిక్కడి బోయీలను బేరాలని చెప్పవలెను. వారందరు గోపాలకజాతి అని తెలియవచ్చినది. మనదేశపు వుప్పాడ బోయీలు వారు మోశే దండే మీద చెయివేస్తే మాజాతి మణిగిపోయనని బహు రచ్చచెస్తారు, వీరు స్నానము మొదలయిన ఆచారముకలిగి బ్రాహ్మణులకు యిక్కడి దేవతలకున్ను వుదకము పాకానికి తెచ్చి యిచ్చి నిండా వుపచారము చేయును అర్హులుగా తుళసీమణి ధారణ చేసి మాంసభక్షణ వదిలి నియమముగా వుంటారు. యీవుత్కలదేశములో అమితమైన పొగచుట్టలు తాగుతారు గాని హుక్కాల ప్రసక్తిలేదు. నేడిదారి కుడిపక్క కనుపడుతూ వచ్చే కొందలకు అడివికిన్ని సమీపము గనుక పులుల భయముకద్దు. మేముదారివడుస్తూ వుం డగా దారిలో వొక అంగడివద్దవుండే కుక్కను పులివచ్చి పట్టుకొనిపోయెనదని గాబరాగా వుండినది. యీ వూరిలో బజారు వీధి వొకటే కలిగివున్నది. దిగడానకు ఇండ్లు నిండా చిన్నవిగా కట్టివున్నవి. నపల్లకీలు నవుకర్లు వుండడానకు నడివీధిలో వొక గుడారము వేసి యిముడ్చుకొని దిగినాను. ధర్మశాలలు యిక ముందర లేవని విన్నాము. యీ వూళ్ళోను కావలసిన పదార్ధాలన్ని దొరికినవి. యీ వూళ్ళో యిద్దరు పోలీసుఠాణా బంట్రౌతులు ఠాణా వుంటారు. ఠాణా యిక్కడికి మూడుకోసుల దూరములో వున్నది.

నాతోకూడావచ్చిన మనుష్యులలో కొందరికి అకస్మాత్తుగా తాళకూడని కడుపునొప్పి తగిలి నూరుబొట్లు స్పిరిటులవండర్ ద్రావకము పోసియిస్తే కుదిరినది. కొంతమందికి నెత్తురుబంకపడుతూ వచ్చినంతలో లాడును ద్రావకము పదిబొట్లు చక్కెరలో పోసియిస్తే కుదిరినది. భేదులు అమితముగా అవుతూ వచ్చివారికి శుద్ధిచేసిన అభిని మందు పూటకు చిన్నదూకయెత్తు యిస్తూ వస్తే కుదిరినది. స్త్రీసంబంధమయిన మేహరోగముమాత్రము వొకమాత్రానికి సాధ్యమయ్యేదిలేదు. వొక కావిటివానికి అతి బలిష్టుడైనా సకృదావృత్తి ఒక స్త్రీ సంభోగము అయినంతలో మేహము మేహవ్రణముకూడా పుట్టి క్రమముగా పాదాలలో నొప్పిపుట్టి నడవ కూడకుండా కలిగి నా చేతనయినంత చికిత్స కలకత్తలో చేయించిన్ని కుదరక నా స్నేహితులవశముగా ఆ మనిషిని కలకత్తలో విడిచిపెట్టి వచ్చినాను.

ఈశ్వరుడు యింతరోగముము సకృదావృత్తిలో పురుషులకుయిచ్చే పాడి దేహధర్మముతొ స్త్రీలను పురుషాకర్షణ చేయుచు వచ్చే టట్టుగా వేడుకతో తిరుగుతూ వుండేటట్టు యెందుకు నియమించినాడో ఆకారణము అతనికే తెలియ వలసినది. అయితే నాకు తోచేది యేమంటే ఆరీతిగా స్త్రీలను వుంచడము వల్ల తన కటాక్షానకు పాత్రులు కాతగ్గ పురుషులకు అడివిలో చరింపుచు నుండే వ్యాఘ్రము మొదలయిన మృగాలను చూచితే యెట్లా భయపడి దూరస్థు లౌదురో తద్వత్తుగా అయ్యే నిమిత్తమని తోచినది. అయితే అతని మాయ దురత్యయము గనుక మోహాన్ని జయించలేకుండా వున్నాము. యీగౌడ దేశములోనున్ను వుత్కల దేశములోనున్ను చింతపండు మిరపకాయలు విస్తారముగా మన దేశమువలె తినక పోయినా మనదేశస్థుల నిమిత్తము కావలసినవి అంగళ్ళలోపెట్టి వుంచుతారు. యెండు మామిడి వరుగు చింతపండుకు బదులుగా వాడుతారు. మామిడిచెట్లు అమితముగా కలవు. శాలలోకూడా అవేపెట్టి పయిరు చెస్తూవున్నారు. యీ దేశపు బోయీలు మిట్టలు యక్కవలసినప్పుడు హరిబోలో అనే మాటతో కంఠధ్వని వుగ్గళించి చేయుచూ వచ్చుచున్నారు.

12 తేది ఉదయాత్పూర్వము 4 గంటలకులేచి యిక్కడికి 7 కోసుల దూరములో నుండే కటమమనే షహరు 11 గంటలకు చేరినాను. దారి సడక్కువేశి గట్టిపడి వున్నా నిన్నటి దినము అమితమయిన వర్షము కురిశినందున దారినిండా అడుసుగా వుండినది. ఆ కటకముముందు రెండుకోసులు కద్దనంగా సడక్కులోనుంచి నొక కాలువ చీలి మహానదిలో కలిసినది. ఆదారి గులకయిసుక పరగా వుండినది. ఆ మహానది కటకము చుట్టుకొని ప్రవహింపుచున్నది. ఆ నది రెండుకోసుల వెడల్పు కద్దు. యీ నది వింధ్యపరతములో వుత్పత్తి అయి కటకానికి సమీపముగానే సముద్రగామి యయినది. వైతరణినది మొదలుగా కటకము వరకున్ను అతి ఘోరమయిన అడవిగా లోగడ వుండినది. యిప్పుడు కుంఫిణీవారు కలకత్తాలో వుండే బంగాళీధనికులు కూడా ఆ అడివి కొట్టించి సడక్కు వేయించినారు.

కటకముపూర్వమందు ఢిల్లీ కింద వుండినది. అక్కడిపాధుషా కుటుంబస్థులకు అంత:కలహము కలిగి అరాజక మయిన మీదట నాగపూరు యేలుతూ వున్న షాహురాజు వంశస్థులు యీ నెట్టునవున్న అధికారస్థులను కొట్టి తీసుకున్నారు. పిమ్మట యింగిలీషువారు పునాషహరు స్వాధీనము చేసుకొని క్రమక్రమముగా హిందూస్తాన్ సమగ్రముగా స్వాధీనము చేసూంటూ వచ్చేసమయములో నాగపూరున్నాసాహేబుతో కలహప్రసక్తి అయినది గనుక ఆకలహము ఆకరము చేసుకొని కటకపుజిల్లా స్వాధీన పరుచుకొన్నవారై పిమ్మట నాగపూరు రాజ్యము ఆరాజు సంబధికుని అధీనము చేసినప్పుడు యీ కటకపుజిల్లా ఢిల్లీ పాధుషాది గనుకనున్ను ఆ ఢిలీతక్తుయిప్పట్లో తమచేతికింద వున్నది గనుక అన్యా యుముగా మీవారు ఆక్రమించిన కటకపుజిల్లా మీకు యివ్వవలసినది లేదని యింగిలీషువారు నిలుపుకొని యేలుతూ వున్నారు. 24 సంవత్సరములుగా వీరి అధీనములో వుండివున్నది.

ఇరువది ఒకటవ ప్రకరణము

కన్యాకుమారి మొదలు కాశ్మీరమునకు సమీపమయిన దేశము వరకు ఉత్తర దక్షిణములున్ను సింధునది మొదలు బ్రహ్మపుత్రినది వరకు తూర్పు పడమర లున్ను యింత అనాయాసముగా యెంతో దూరవాసులయిన క్రీస్తు మతాంతరులకు యీశ్వరుడు స్వాధీనము చేయవలనదేమని మరిమరి యోచించగా నాబుద్ధికి విశేషముగాతొచినది యేమంటే మన పూర్వీకులు చెప్పియుండే "అహింసా పరమోధర్మం, స్వర్ణస్తేయం సురాపానం, ఆత్మవత్సర్వ భూరాని" యివి మొదలయిన వచనములయొక్క ధర్మములను జగత్తులో అందరున్ను పరిపాలన చేయసాగితే ప్రపంచధర్మము జరగక లోకము కృత్యరహితమై శాంతినిపొందును గనుకనున్ను అటువంటి శాంతి యీశ్వరుని చిద్విలాసానకు వ్యతిరిక్తము గనుకనున్ను అటువంటి ధర్మాలు అందరున్ను జరిపించ నేరరు గనుకనున్ను ప్రపంచముయొక్క మర్యాదప్రకారము కామక్రొధములతో చిద్విలసము నడుస్తూ వుండేటట్టుగానున్ను అటువంటి ముఖ్యధర్మాలు వదలకుండా కొందరు అవస్యముగా లోకములో జరిగించి యీశ్వరుణ్ని తృప్రిపరచి ఈశ్వరకటాక్షము సంపాదించి అటువంటి జగదీశ్వరును యొక్క దుర్లభమయిన కటాక్షము తాము సంపాదించుకునేటట్టుగా తమకు ఆయాచిత జీవనము కలుగచేసి కాపాడుచువచ్చిన ఇతరులక్షేమమును "స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం" అనే వచన ప్రకారము ప్రార్ధింపుచూ వుండేకొరకు బ్రాఃహ్మణ క్షత్రియులు మొదలయిన వర్ణములు నిర్ణయించపడ్డవిగదా? అందులో క్షత్రియులు చేయుచూవచ్చిన క్షాత్రధర్మపురస్సరమయిన రాజ్యపరిపాలన పూజ్యులుగా వున్న బ్రాహ్మణులకు దురభిమాన పురస్సరముగా పూర్వకాలములో సరిపడక ఆగ్రహోదగ్రులై క్షత్రియులను నిర్వంశము చేసినందున