కాశీమజిలీకథలు/రెండవ భాగము/18వ మజిలీ

వికీసోర్స్ నుండి

కాశీమజిలీ కథలు

18వ మజిలీ

భువనేశ్వరిదేవి కథ

పదినెనిమిదవ మజిలీ మొదలు శౌనకుడు మణిసిద్ధుని దరువాయికథ జెప్పుడని వేపుచుండ నయ్యోగీంద్రుండు నద్దివసంబున దనయనుష్టానమంతయు సంక్షేపముగా గావించి వంటజేసి భుజించిన వెనుక నొకమనోహరతరుశీతలచ్చాయం గూర్చుండి తరువాయికథ నిట్లని చెప్పదొడంగెను. వత్సా! వినుము. అదృష్టదీపుండా పుష్పగిరిలోనుండి నిత్యము రాజపుత్రిక చేయుచున్న కృత్యముల పరీక్షించుచు దూతికల నరయుచు దాదుల వెదకుచు నంతఃపురచారిణులతో మైత్రిచేయుచు నీరీతి గొన్నిదినములు గడపినంత నొకనాడు కలహంసికయను దానికి రాజపుత్రికతో మిక్కిలి మైత్రిగలదని విని దాని యింటి యొద్దకుంబోయి యల్లన నిట్లనియె.

కలహంసికా! నీవు మిగల బుద్ధిశాలివని నీయొద్ద గొన్నివిశేషములు దెలిసికొను తాత్పర్యముతో వచ్చితిని. మాది కాశీదేశము. అదృష్టదీపుడను రాజునకు మిత్రుడను. నా పేరు మిత్రగుప్తుడందురు. అతడు తీర్థయాత్రకు బోయిన నతనిజూచు తలంపునబోవుచున్నవాడ. ఈ యూరువచ్చి పదిదినములైనది. ఈ పట్టణంబున బుద్ధిమంతులలో నగ్రగణ్యు లెవ్వరని విమర్శింప నిన్ను మున్నుగా వక్కాణించిరి. దానం జేసి నీ యొద్దకు వచ్చితిని. బుద్ధికిసాధ్యముకాని పని లేదుకదా. నేనును నా మిత్రుడు నొకనాడు విహారార్థమై చతురంగబలములతో నొకయరణ్యమునకు బోయితిమి. అచ్చట గొంతసేపు విహరించినంత మిట్టమధ్యాహ్నమగుటయు నది గ్రీష్మకాలమగుటచే నెండకునోడి నేనును నా మిత్రుడును ఆ ప్రాంతమందున్న యొక త్రాటిమాను నీడను నిలిచితిమి. మా సేనలన్నియు నచ్చటి కనతిదూరములో నున్న యొక మర్రిచెట్టుక్రింద నిలిచినవి. అట్టి సమయములో నా మిత్రుడు పక్కున నవ్వెను. అకారణముగా నట్లు నవ్వితివేమని నేనెంత ప్రీతితో నడిగినను చెప్పడు. యీ కారణము నీ వూహించి చెప్పితివేని నీకు నూరువేల దీనారము లిత్తునని ప్రతిజ్ఞచేసెను. నేను నట్టి ప్రశ్నమున కుత్తరముచెప్పుటకు నారుమాసములు మితికోరితిని. అతండిచ్చెను. నేనది మొదలు చేశాటనము చేయుచు బ్రతిపట్టణమునకు బోవుచు నందు బుద్ధిమంతులని పేరు పొందినవారినెల్ల నడుగుచు దిరుగుచుంటిని. ఇప్పటికి మూడుమాసములైనది ఎవ్వరును చెప్పలేకపోయిరి. ఇచ్చట నీవార్త విని నీ యొద్దకు వచ్చితిని. నీ బుద్ధియంతయు విని యోగముచేసి దీనిని జెప్పితివేని నాకుదొరకు లాభములో నీకు సగము పంచియిచ్చెద నని చెప్పగా విని యా కలహంసిక చిరునగవు నవ్వుచు నిట్లనియె

ఆర్యా! మీరు నన్నింత బెద్దజేసి గౌరవింపుచుండ నేనేమని యందును. జగద్విదితకీర్తియగు నదృష్టదీప మహారాజు మిత్రులైన మీకంటె నేను బుద్ధిశాలి నగుదునా? మీరు నన్నుజేసిన గౌరవమునకు మిక్కిలి సిగ్గుగానున్నది. నన్నిచ్చటివారు పొగడుటకు నాయందే విశేషమును లేదు. నాకేవిద్య యందును బాండిత్యములేదు. మీవంటివారు మన్నించుచుండుటయే నా గౌరవమునకు గారణమైనది. నేనంతదానను కాకపోయినను నా యాశ్రమస్థాపన మట్టిదని చెప్పవచ్చును. మా ప్రియంవద రూపమునను విద్యాబుద్ధులచేత ననన్యసామాన్యమైయున్నది. మీరడిగిన ప్రశ్నమునకు నా కేమియు నుత్తరము దోచలేదు. రెండుమూడు దినములు గడచిన తరువాత మీరు మరల నొకసారి దయసేయుదురేని యావిశేషములు భర్తృదారిక వలన దెలిసికొని మీతో జెప్పెద. అప్పడతి యీ ప్రశ్నములకు సులభముగా నుత్తరము జెప్పునని పలుకగా సంతసించును నదృష్టదీపు డప్పుడు దాని యనుమతి వడసి యింటికిబోయెను.

అదృష్టదీపుడు మఱి రెండుదినములు గడచిన తరువాత తిరుగా నాకలహంసిక యింటికి బోయెను. అదియు నాతని నుచితమర్యాదల నర్చించినంత గూర్చుండి దానితో యువతీ! నీ వయస్య నా ప్రశ్నమునకు కత్తరము జెప్పినదా యని యడుగు గుటయు నయ్యతివ యతనితో నిట్లనియె.

ఆర్యా! నేను మఱచిపోయి మిమ్ముల నీదినమ్మున రమ్మంటిని ఆ ప్రియంవదతో నిన్నను మాట్లాడుటకు నవసరము దొరికినదికాదు. ఆ చిన్నది ప్రతి శుక్రవారమును భువనేశ్వరీదేవి నర్చించుచు సాయంకాలమున గేళీశైలమునకు బోవుచుండును. ఆ దివసమున నామెతో నితరగోష్ఠి జేయరాదు. నిన్న నట్టివారమగుటచే మీ మాటనడుగుట తటస్థించినది కాదు. మిమ్ము వృథా శ్రమపెట్టినందులకు లజ్జించుచున్నదాన నని పలుకగా నతడు నవ్వుచు మరల నిట్లనియె. ఇంతీ! యింతమాత్రమునకే నాకుశ్రమ గలుగునా? దీని దెలిసికొనుటకై కాదా దేశమంతయు దిరుగుచుంటిని. రేపు మరల వత్తునులే యని పలుకుచు వెండియు నిట్లనియె.

మచ్చెకంటీ! నీ నెచ్చెలికి వివాహమైనదా1 పిల్లలెందరు? వాల్లభ్యము మంచిదగునా?ప్రతిశుక్రవారమును భువనేశ్వరీదేవి పూజ యెచ్చటజేయును! కేళీశైలమనునది యెచ్చటనున్నది? నిన్నుబట్టి యారాచపట్టియు మాకు బంధువురాలే యైనది. ఆ పూవుబోడి వృత్తాంతము కొంత వినవలయునని యుత్సాహముగా నున్నది. గోప్యముగాకున్న నుడివెదవే యనుటయు నదియు బ్రసంగవశంబున నడుగుచున్నాడని యూహించి యా రహస్య మితరుల కెవ్వరికిని దెలియనిదైనను వానికి మెల్లన నిట్లనియె. ఆర్యా! మా భర్తృదారికకు వివాహ మింతవరకును గాలేదు. ఆ లేమ యేమికారణముననో తానిచ్చిన ప్రశ్నముల కుత్తరము చెప్పువానిం కాని బెండ్లియాడనని పట్టుపట్టుకొని యున్నది. పాపము కొన్నిదినముల క్రిందట నొక బ్రాహ్మణకుమారుడా ప్రశ్నముల కుత్తరము నేను జెప్పెదనని వ్రాసి లోనికిబోయి చివరకు జెప్పలేక పోయెను.

వాని నురిదీయుటకు రాజు సెలవియ్యగా వాని బంధువుఁడెవ్వడో మరల నారుమాసములు మితికోరినాడట. అందుమూలమున వానినింకను నురిదీయలేదు. వాని కుత్తరము జెప్పుట బ్రహ్మతరముగాదు. తండ్రి యెన్నియో విధముల బోధించెను. కాని వినినదికాదు. ఆ చిన్నది ప్రతిశుక్రవారము మధ్యాహ్నము యింటియొద్ద భువనేశ్వరీదేవి నర్చించి సాయంకాలమున దప్పక కేళీశైలమునకు బోవును. ఆ శైలము మీ పట్టణమున కుత్తరదిక్కున గ్రోశదూరములో నున్నది. అంతవరకు మేమందరము కూడా పోవుదము కాని యగిరిశిఖర మెక్కునప్పుడు మాత్రము మమ్మెవ్వరిని రానీయక తానొక్కరితయే పోయి కొంతసే పందుండి మరల వచ్చును. ఆ శిఖరముమీద నేమియును లేదు. అచ్చట నేమిచేయునో మా కెవ్వరికిని దెలియదు.

ఒకనాడు సాహసించి యా యించుబోడి యందేమి చేయుచున్నదో చూతమని ద్వారరక్షకుల గన్మొరగి యా శిఖరము మీదికి బోయితిని కాని నాకెక్కడను నక్కలికి గనంబడినది కాదు. ఏ శిలచాటుననో దాగియుండునని యూహించి చూచిన శిక్షించు నను వెరపుతో సత్వరము మరలి గిరిదిగితిని. అమ్ముదితచేయు కృత్య మిదియే యని చెప్పిన ముదితహృదయుండై యత డొక్కంతసే పూహించి మరల నత్తరుణితో నాతీ! ఆ తెరవ శుక్రవారమునాడు గాక మరి యెప్పుడని యక్కొండదండకు బోవునా? యని యడుగుటయు నమ్మదవతి యతనితో నాడుగాక మరి యెప్పుడు నగ్గిరిదరి కఱుగదని చెప్పినది అతం డయ్యితివ నుడివిన మాటలన్నియును విని సంతసించుచు బొలతీ నేనీనాటికి బోయివచ్చెద. ఱేపైనను శ్రద్ద జేసి యడుగుమీ? యని పలుకుచు నక్కలికిజేత ననిపించుకొని మరల నింటికి వచ్చి నాటి సాయంకాలమున గలహంసిక చెప్పిన గురుతులు చూచుకొనుచు నా విహారశైలముకడకు బోయెను.

ఆ శైలము చుట్టుకొలత రెండు క్రోశములుండును. ఎత్తు పాదక్రోశముగలదిగా నున్నది. అదియు గమోన్నత మగుటచే నెక్కుటకు గష్టములేదు. మార్గములు పెక్కు గలవు. దానియందు చిన్నతుప్పలే కాని పెద్దవృక్షము లేమియును లేవు. పర్వతమును జూచి సంతోషించుచు నా యదృష్టదీపుడు రెండు మూడుసారులు అక్కొండ చుట్టును తిరిగివచ్చి యొక దెసనుండి యమ్మెట్టపై కెక్కెను. ఆ శిఖరము విశాలముగాను సమచతురస్రముగా నున్నది. అచ్చటనైనను చిన్నదుప్పలే కాని మరి యేమియును లేవు. అట్టిచోట నతండు మిగుల శ్రద్దాపూర్వకముగా నలుమూలలు దిరుగుచుండెను. కాని యెంతసేపు తిరిగినను యేమియు గనంబడినది కాదు.

అంతలో సాయంకాలమగుటయు నగ్గిరిదిగి మరల నింటికివచ్చి యచ్చట బలభద్రునితో ముచ్చటించుకొనుచు నారాత్రి సుఖముగా వెళ్ళించెను. మరునాడరుణో దయమున లేచి మరల నద్ధరణీధరము కడకు బోయి మధ్యాహ్నమువరకు నచ్చటి విశేషములు చూచుచు నింటికి వచ్చి భుజించిన తరువాత వెండియు నక్కొండదండకు బోయి యచ్చటనే క్రుమ్మరుచుండెను. కాని యే విశేషము కనంబడినది కాదు. అప్పు డతండు కలహంసిక చెప్పిన పర్వతమిది కాదేమోయని యనుమానింపుచు నచ్చటి గురుతులన్నియుం జూచుకొని రాత్రికింటికి వచ్చి భుజించిన వెనుక కలహంసిక యింటికిబోయెను.

అదియు నతనింజూచి సంతసించుచు సత్కరించి ఆర్యా! మీ రాకకు నేను వేచియున్న దానను. మీరడిగిన ప్రశ్నము మా రాజపుత్రికతో జెప్పితిని. అదియు నవ్వుచు నీపాటిమాట కింతదూరము రావలయునా? యని పరిహాసము చేసినది. నేనును సంతసించుచు నించుబోణి! వడిగా జెప్పుము. నేను బోయి యాతని కెఱింగింతునని తొందరపెట్టగా నక్కలికి అట్లయిన నతండీ ప్రశ్నల కుత్తరము జెప్పినందులకు నీ కేమిచ్చునో తెలిసికొని రమ్ము. తరువాత జెప్పెదనని పలికినది. నేనును సమ్మతించితిని. మరియు నత్తరుణి మీరు అదృష్టదీపునకు మిత్రులని చెప్పినంత నెద్దియో ధ్యానించి తలపంకించుచు నాతో మరేమియు జెప్పినది కాదు. తరువాత నేను వచ్చితిని దీనికి మీరేమిచ్చెదరో చెప్పుడని పలుకుటయు. నతడు సుందరీ! నీకు సందేహమేల నాకు దొరకిన దానిలో సగమిత్తునని మొదటనే చెప్పితిని గాదా? నా కతండా సొమ్మిచ్చిన వెంటనే నీకు దెచ్చి యిచ్బెదను. వడిగాబోయి తెలిసికొని రమ్మని పలుకుచు మరియు నిట్లనియె. తరుణీ! నిన్నను నేను విహారార్ధమై యీ పట్టణమున కుత్తరము దెసకు బోయితిని అచ్చట రెండు మర్రి వృక్షములు పొడవుగా నెదిగి యున్నవి. వానికవతలగా నొకచిన్న మెట్టయున్నది. అదియే యగునా నీవు చెప్పిన ప్రియంవద యొక్క కేళీశైలమని పలికిన నక్కలికియు నౌ నదియే మీరచ్చటికేటికి బోయితిరి? నేనట్టు జెప్పిన సంగతి యెవ్వరితోనైనను జెప్పెదరుసుడీ! అన అయ్యో! అట్లు చెప్పుటకు నేనంత మూర్ఖుడ ననుకొంటివా యేమి. ప్రసంగవశమున నడిగితిని గాని నాకు మాత్ర మీ గొడవ కావలయునా? యని నుడువుచు మరల రేపు వచ్చెదనని జెప్పి యింటికి బోయెను. మరునా డుదయమున లేచి మరల నగ్గిరిదరికరిగి యందు నానావిధములగు రుప్పలు సందులు గొందులు మొదలగునవి మిక్కిలి శ్రద్ధతో చూచెను. కాని యెచ్చటను నేజాడయు గనబడినది కాదు. మరల మధ్యాహ్నమింటికి వచ్చి భోజనము జేసి వెండియు నా కొండదాపునకు బోయి రాత్రివరకు వెదకెను.

అప్పుడతండు మిక్కిలి పరితపించుచు అయ్యయ్యో! నేను రాజవాహనునితో బలికిన మితి సమీపించుచున్నది. ఇప్పటికేమియుం దెలియలేదు. వృధగా బ్రాహ్మణ కుమారుని నురిదీయుదురు. నా చావునకింతయేని విచారము లేదు. వాని రక్షించెదనని వచ్చి చివరకు నాకు శక్యమైనది కాదని చెప్పుటకంటె హైన్యమున్నదా? నేనెప్పుడో వారివలన జంపబడనేల! అంతకు పూర్వమే మృతినొందిన యుక్తముగా నుండును. ఇది మొదలింక నేను భుజింపను. ఈ రాత్రిగూడ యిచ్చటనే యుండెదను. ఇక నాకు బట్టణములోనికి బోవలసిన యగత్యమేమున్నది? రాత్రివేళ నిందేమైనవిశేషములు కనంబడునేమో చూచెదగాక యని యనేక ప్రకారముల దలపోయుచు నారాత్రి యింటికిబోక యచ్చటనే యుండి యప్పర్వతశిఖరమంతయు మరల బరికించెను. కాని క్రొత్త విశేషము లేమియు గనంబడలేదు.

తరువాత విరక్తి బూని యుదయంబున లేచి మరియొక దేశము పోవలయునని నిశ్చయించుకొని యొక సమభూమిం బరుండి దానిం గురించియే ధ్యానించుచు గాంతిమతిం దలంచుకొనుచు దన పూర్వప్రఖ్యాతి యంతయు స్మరించుకొనుచు దన యప్పటిస్థితిగురించి చింతించుచు ముందు కర్తవ్య మెద్దియని తర్కించుచు నా హృదయంబునం బెక్కుకల్పనలు జనియింప నతం డాలోచింపుచుండ నంతలో నిద్ర పట్టినది. ఆ నిద్రలో నెద్దియో యద్భుతమైన స్వప్నము వచ్చినందున దటాలున మేల్కొని వెల్లకితల బండుకొని కన్నులు దెరచి చూడగా నెదుర దివ్యభవనమొకటి కనబడినది. అదియు నవరత్నదీపములచేత వెలుంగుచు గన్నులకు మిరుమిట్లు గొల్పుటయు నతండు కన్నులు మూసికొని యొక్కింతసేపుండి మరల విప్పి చూచెను. మరల నారీతినే కనంబడినది. దానికి వెఱగందుచు నోహో నాకు స్వప్నములో స్వప్నము వచ్చుచున్నదే! నే నింకను నిద్రబోవుచున్నానా యేమి యెదుటి గనంబడుచున్న సౌధమెవ్వరిది? నే నిప్పు డెచ్చట నున్నాడను. పట్టణములో నుంటినా? కాదు కేళీశైలమున రాత్రి బరుండితిని. అట్లయిన నీమేడ యెక్కడిది? నిజముగా నేను గేళీశైలమున బరుండలేదు. ఆలాగున స్వప్నము వచ్చినది కాబోలు అయ్యో! భ్రమజెందుచున్నానేమి? నేను రాత్రి యింటికిబోక పర్వతశిఖరమున బరుండినమాట నిక్కువమే? నాకాకలి యగుచున్నది. ఇప్పుడు కనంబడు మేడ కలలోనిదే. అన్నా! దీనిమాత్రము కలయని యెట్లు నమ్ముదును. నాకు మెలకువయున్నట్లు నా కన్నులే చెప్పుచున్నవే! ఈ కన్నులు దెరచితి ననుకొనుటయు స్వప్నభ్రాంతియే కాదు గదా! ఇదిగో! యిప్పుడు లేచుచున్నానని పెక్కుతెఱంగుల నంతరంగమున దలపోయుచు దటాలున లేచి కూర్చుండెను. అప్పుడంతకుమున్ను గనంబడుచున్న మేడ గనఁబడక యధాప్రకారము శిఖరి దారుణియే కనబడినది. తరువాత నతం డది కలయని నిశ్చయించి యాసౌధశోభావిశేషమున కచ్చెరువందుచు నయ్యోరే! నాకెంత స్వప్నము వచ్చినది. నిజముగా నట్టి మేడ లుండునేమో, యింక కొంచము సేపు లేవక యట్లేయుండిన నిద్రమెలకువ రాక పోవునుగదా యెంత తొందరపడితిని అని పెక్కుతెరగుల దలంచుచు కొంత సేపచ్చటనే కూర్చుండి ధ్యానించుచు మరల శయనించెను. అట్లు పండుకొన మరల జూచువరకు మొదట గనంబడిన సౌధము వెండియు బొడగట్టినది. అత డప్పుడు మరియు నాశ్చర్యమందుచు నౌరా! ఇది మిగుల వింతగా నున్నది. నిద్రలో స్వప్నము వచ్చుట సహజము. జాగ్రదవస్థలో స్వప్నము వచ్చుట యెచ్చటను వినియుండలేదు. ఇది చిత్ర విభ్రమమేమో తెలియదు. కానిమ్ము యెద్దియైన నీవింత జూచెదంగాక యని మరల లేచినంత నది కనంబడినదికాదు.

అత్తరి నతం డది మరల స్వప్నమని భ్రమపడి విరక్తితో తిరుగాబరుండెను. పరుండి కన్నులు తెరచిచూడ మునుపటి మేడ గనంబడినది దానంజేసి యతనిహృదయమున సంతోష సాధ్వససంభ్రమములు జనించినవి. ఒక్కింత నిదానించి చూచుచు నతండిచ్చట నెద్దియో గారడియున్నది. ఈచిత్రము పరుండి చూచిన గనంబడుచున్నది. లేచిచూడ గన్పట్టదు. మొదట స్వప్నమని భ్రమపడితిని. కాని యిప్పుడది కానట్లు స్పష్టమైనది. ఇది యెద్దిఏని పిశాచమహాత్మ్యమా? యని యూహింతమన్నను నిట్టి చిత్రములు కలుగునని యెప్పుడును వినియుండలేదు. దీనికెద్దియేని కారణ ముండవచ్చును. పరుండియే యూహించెదనని నిశ్చయించి యట్టె చూచుచుండెను.

అతం డట్లెంతసేపు పరుండిచూచినను ఆ చిత్రసౌధము దృష్టి గోచరమగుచునేయున్నది. ఇక యది యంతర్ధానముకాదు. స్థిరపడినది ! దీనిలోనికిబోయి చూచి వచ్చెదనని తలంచుచు లేచినంత నన్నిశాంత మంతర్థానమైనది అతడు మిక్కిలి వెఱగందుచు నోహో! ఇప్పుడు నాకు దెలిసినది. ఇది నిజముగా స్వప్నమే పరుండిన తోడనే కొంచెము నిద్రపట్టును. దానిలో నిట్టి కలవచ్చుచున్నది. కానిచో బరుండినప్పుడు గనబడుచున్నవింత లేచినప్పుడేల కాన్పించదు. ఇదియే నిక్కువమని తలంచి తిరుగ బరుండెను. అత్తరి గ్రమ్మరనమ్మందిరముముందు సుందరముగా బొడచూపిన నతడు మెండుగా వితర్కించుచు మేనెల్ల గిల్లుకొని యదికలగాని యట్లు నిశ్చయించుకొని దాని గురించి పలుదెరంగుల నాలోచించుచు నేకారణమును నిశ్చయింపలేక చివరకు దనకు బిచ్చియెత్తినట్లు నిర్ధారణ చేసికొనియెను.

అంతలో మరల నాలోచించుకొని అయ్యో! నాచిత్తము స్వస్థతగానే యున్నదే నా చర్యలన్నియు దలంచుకొనియున్న నిదానముగా స్ఫురించుచున్నవి. నామనస్పూర్తి పూర్వమువలెనే యున్నది. ఇది యెద్దియునుగాదు. దైవకల్పితము. భువనేశ్వరీదేవియాలయమునకై నేను శ్రమపడుచుండ భక్తవత్సలుడగు పరమేశ్వరు డాయాలయమునుదెచ్చి యిచ్చట బెట్టెను. ఇది నిక్కు.వము కావచ్చును. అట్లయినను స్థిరముగా నుండవలయునుకాని దృశ్యాదృశ్యముగా గనంబడుచుండనేల? మేలుమేలు. ఇట్టియద్భుతము గనంబడునని యెన్నడును దలంచ నైతిని. ఈ చిత్ర మెవ్వరికేని నేను జెప్పిన నమ్ముదురా? భళీ! భళీ! అయ్యారే! యని యాశ్చర్యపారావారనిమగ్నచిత్తుండై విస్తృతనిమేషములగు చక్షస్సులచే నాప్రాసాదమును జూడదొడంగెను.

అతండు విరక్తిచే వట్టినేలనే పరుండి యున్నవాడు కావున నట్టిసమయములో నతనితలలో జీమ కుట్టుటయు నదరిపడి యించుక లేచి తలద్రిప్పి చూచినంత నచ్చట నేమియుం గనంబడినదికాదు. తరువాత ననుమానముదీరక తలనానినచోటు చేతితో దడుమగా నచ్చటొక పచ్చనిచెట్టు కనంబడినది దానిపూవులు రత్నములవలె మెరయుచున్నవి. ఆకులును మరకత మాణిక్యముల పోలికరంగు లీనుచున్నవి. అదియు జిన్నమొక్క గనుక యతని క్రిందబడి నలిగిపోయినది. అది మొదట జూచినప్పుడు గనంబడక తడవినతోడనే చేతికి దగిలి కన్పట్టుట కతండు వితర్కించుచు నదితన తలక్రిందబడి నలుగుట సైతము పరిశీలింపుచు రేయి విడిచినంత నదిమరల నదృశ్యమైనది. అతండచ్చట తిరుగ జేయిపెట్టి తడుముటయు క్రమ్మొక్క గ్రక్కున గరమునకు దగిలి గోచరమైనది. అప్పుడతండది యొకయోషధివిశేషమని నిశ్చయించి యిందాకటి చర్యలన్నియు దీనివేమోయని యాలోచింపుచు నియ్యోషది నంటుచుం గూర్చుండి చూచునంత నన్ని శాంత మంతర్ధానముగాక యట్లేయున్నది. అత్తరి నతని చిత్తమున బొడమిన సంతోషమేమని చెప్పుదును. అపరిమితానందము జెందుచు నోహో! తెలిసినది. ఇదియొక యోషధి. దీనినంటినప్పుడు తత్ప్రాసాదము గనంబడును. లేనిచో నదృశ్యమగుచున్నది. నేను బరుండినప్పు డీలత నా తలకు దగులుచున్నది. కావున నామేడ గనంబడునది. లేచినప్పు డదృశ్యమైనది. ఈ సంగతి దెలిసికొనలేక పెక్కుపోకలం బోయితిని. నేనుకాదు. మరియెట్టి బుద్ధిమంతుడైనను నిటు జరిగినప్పుడు విభ్రాంతి నొందకమానడు. చీమకుట్టుటచేత నీ సంగతి తెలిసినది. కాని లేనిచో బెద్దతడ విట్లే భ్రమించు చుండును. అదియుంగాక తల క్రింద నోషధీలతయున్నదని యెట్లూహింతును. నాకీభ్రాంతి బోగొట్టినది పిపీలికము. దానిరుణము నేను దీర్చుకొనజాలనని యూహించుచు నాలతావిశేషమును విడువక తన మొలలోనున్న కత్తిందీసి దాని మొద లంటంగోసి చేతితోఁ బట్టుకొని మెల్లఁగా లేచెను.

అప్పుడతని కుడికన్నును భుజమును తొడయు నదరఁ దొడఁగినవి. ఆ శుభశూచకములఁ గనిపెట్టి యతండు సంతసించుచుఁ దనకుఁ గనంబడుచున్న మేడయొద్దకుఁ బోయెను. రత్నకాంతులచేఁ జీఁకటి యించుకయు లేనందున నందలివిశేషము లన్నియుఁ దేటయగుచున్నవి. దానితలుపులు దెరచియే యున్నవి. ఆ ద్వారమున కిరు ప్రక్కలను రత్నముతోఁ జెక్కిన ద్వారపాలకావిగ్రహములున్నవి. ఆ ప్రతిమలం జూచిన నెట్టివానికి మోహము జనింపకమానదు. మొదట నతఁడా విగ్రహములను జూచి నిజముగా స్త్రీలనుకొని యెద్దియో యడుగఁ బోయెను. నిదానించి చూడంజూడ బొమ్మలని తెలిసినది. తరువాత నతండా గుమ్మమున లోనికిఁబోయెను. మణిస్తంభములచే ప్రకాశించుచున్న యమ్మందిరాభ్యంతరమునఁ బ్రవేశించినంత నతనికి దిగ్బ్రమయైనది. అందుఁ బెక్కు గదులు రత్నకవాటములచే మూయఁబడి యున్నవి. వానివింతలన్నియుం జూచుచు సాహసముతో నొక గది తలుపు తెరచి చూచెను.

విశాలమగు నాగదిలో నుసిరికాయలుకన్న పెద్దవగు వజ్రముల రాసులు వేనవేలు గన్నులకు మిరుమిట్లు కొలుపు కాంతులతో నొప్పుచున్నవి. ఆ వజ్రనికరముల నిగనిగలకు వెరచుచుఁ గన్నులు మూసికొనుచు నాతలుపులు తటాలునమూసెను. మరియు రెండవగదితలుపు తెరచినంత నందు వైడూర్యరత్నములరాసు లసంఖ్యాకములుగా నున్నవి. అతడు దోసెడు రత్నములు దీసి కొంగున మూటఁగట్టెను. ఈరీతి నందున్న గదులన్నియుం బరీక్షింపఁ బ్రతియరయందును వేరువేర నవరత్నముల జాతులు బంగారునాణెములు నవనిధులు బంచలోహములు గలిగియున్నవి. వానిం జూచినంత నతఁడు స్వాంతమున నింతింతనరాని సంతోషము జెందుచు నోహో! ఈ సొమ్మంతయు నాయధీనమైనచో లోకంబున యాచకులను పేరులేకుండగఁ జేయకపోదునా? యని తలంచుచు మఱియుం గొంతసేపందున్న విశేషము లన్నియుం జూచుచుండెను.

ఆ లోపలఁ దిరుగుచుండ నొకమూల సోపానములు గనంబడినవి. వాని ననుసరించి పైకినడువనడువ మరియొకయంతస్థు కనంబడినది. అందు మొదట నద్భుతమయిన తేజఃపుంజముగాక మరి యేమియుం గనఁబడలేదు. దానికి వెరిచి యతండు కొంతసేపు కన్నులు మూసికొని నిదానించి చూడంజూడ నాకాంతి యంతయు సూర్యకిరణములచే మంచు విరియునట్లు క్రమంబున నణగిపోయినది. పిమ్మట నలుమూలలు దృష్టిప్రచారము బరగించినంత నాగోడలన్నియు రత్నమయములైయున్నవి. మరియు నచ్చట రత్నకంబళి యాస్తరణగాఁ బరువఁబడియున్నది. ఆ యంతరములోనున్న విశేషములన్నియుం జూచుచుఁ బోవఁబోవ దూరపుముఖముగా నొప్పుచున్న యొకబంగారు విగ్రహము బొడఁగట్టినది. పరిశీలించి చూడఁగ నదియొకశక్తివలెఁ దోచినది. ఆ విగ్రహమునకు రెండుచేతులు, మూడుతలలు గలిగియున్నవి. దానిం జూచువారికి వెఱపుగలుగక మానదు.

అతండు మనంబునంబుట్టిన సాధ్వపము నడంచుకొనుచు నా విగ్రహమును తర్కించి చూడఁగా వెనుకను మరల మెట్లుకనంబడినవి ఆ సోపానమార్గమున మరలఁ బైకెక్కఁగా వేరొకయంతరమున దర్శనీయమయిన యలంకారముతోఁ జూడనయ్యె. అందొక మహాశక్తి యైదుముఖములును, పదిచేతులునుఁ గలిగి జగములన్నియుఁ బాలించు సామర్థ్యమును సూచించు తేజంబున నొప్పుచు దయాదృష్టి ప్రసాదములు వెదజల్లుచున్నట్లు గనఁబడినది మరియు నమ్మహాదేవి ముఖముల యందును పంచవర్ణములు గలిగియున్నవి ఆమె పీఠమున భువనేశ్వరీదేవియని వ్రాయఁబడి యున్నది. అమ్మహాదేవి భువనేశ్వరీదేవియని తెలిసినప్పు డతని మనంబునం బొడమిన యానంద మేమని యందును. అప్పుడతని మనంబునం బెక్కు తలంపులు పుట్టినవి. మరియు విమర్శింప నద్దేవి వెనుకటి గోడయందిట్లు వ్రాయబడియున్నది.

గీ. ఇలనదృశౌషధీలత యెవనిచేత
    జిక్కు వాడె యిందు రక్షింపబడుచు

    తనరునిధులకు నధికారి తత్ప్రియంవ
    దా ప్రియుండు నతండెవో తథ్యముగను.

అనియున్న పద్యమును ముమ్మారు చదువుకొని ముఖంబున నించుక విన్నదనంబు దోప అయ్యో! ఈ లిపియందు నాకప్రియం బొకటియున్నదే. నేనిప్పుడు పడుచున్న యిడుములన్నియు హరిదత్తుని కొరకేకాని నానిమిత్తముకాదు. ఇందులో ప్రియంవదాప్రియుండు లతదొరకినవాడేయని యున్నది పాప మాహరిదత్తు డాసబడిన పడతిని నేనెట్లు స్వీకరింతును! అయినం గానిమ్ము. అంతవరకు వచ్చినప్పు డాలోచించుకొనవచ్చును ముందుగా నిమ్మహాదేవికి నమస్కరించి తరువాత కృత్యముల నాలోచించుకొనియెదంగాక యని నిశ్చయించుకొని కన్నులమూయుచు బరాకున తన చేతిలో నున్న యోషధిలతను క్రిందనుంచి సాష్టాంగముగా నమస్కరింపుచు మనంబున నిట్లు ధ్యానించెను.

శ్లో. మదాపదపహారిణీం మణిఘృణీలసన్నేఖలాం
    మనోజ్ఞముఖపంచక ప్రకటితాధిక ప్రాభవాం
    కృపాకలితవీక్షణా ముఖిలలోక సంరక్షణీం
    త్రిలోచనకుటుంబినీం భువననాయకింభావయె

అని కొంతసేపు భక్తిపూర్వకముగా ధ్యానించిలేచి కనులు దెరచి చూచువరకు నక్కొండ శిఖరముగాక మఱేమియుం గనంబడలేదు. అప్పు డతం డదరిపడుచు నాకసమువంకజూచి నక్షత్రములు గనంబడినవి. భూమివంకజూడ బచ్చికయు రుప్పలు శిలలు గనంబడినవి. అట్టి సమయంబున నతనిచిత్తమున నెట్లుండునో తలంపుము ముహూర్తకాలమతం డున్మత్తునిక్రియ నేమియుం దోపక విభ్రాంతచిత్తుండై ఆహా! యేమి యీ మాయ యిప్పుడు నాకు గనంబడినదంతయు గల యగునా! మాయ యగునా! నా చేతిలో నున్న యోషధీలత యేమైనది? క్రింద బెట్టితినే? అట్లు పెట్టినట్లు కలలోనే వచ్చెనేమో? నా కేమియుం దెలియకున్నది. అయ్యో! కలకాదు, నిక్కువమే నేనా యోషధిని పరాకున నేలబెట్టి అమ్మవారికి మ్రొక్కితిని కాదా; దానంజేసి యామేడ యదృశ్యమైనది. కానిమ్ము అదియు నిచ్చటనే యుండునని నిశ్చయించి యా ప్రాంతభాగమంతయు వెదకెను గాని యెచ్చటను నతనిచేతి కా యోషధి తగిలినది కాదు.

అప్పుడది యతండు కలగా నెంచి తాను సంతతము భువనేశ్వరీ దేవాలయమును గురించి ధ్యానించుచుండ నదియట్లు కలలో గనబడినది ఆ సంగతులే ప్రియంవద కుత్తరము చెప్పెదను. సమ్మతించిన సమ్మతించుగాక లేకపోయిన మడియించు నింతకన్న నేమి చేయును. కానున్నది కాకమానదుకదాయని నిశ్చయించి యా రాత్రి తాను జూచిన సంగతులన్నియు స్మరించుకొని వెఱగందుచు నెద్దియో తలంచు కొని యొడిజూచుకొనునంతలో నందుబూర్వము తాను సంగ్రహించి మూటగట్టిన దోసెడు రత్నములమూట గనంబడినది ఉత్కృష్టకాంతులచే నొప్పుచున్న యా దివ్య మణులంగాంచి తల పంకించుచు నోహో ! ఇది దేవమాయకాని మఱేమియుంగాదు. వీనిఁబట్టి కలగానియట్టు స్పష్టపడుచున్నది.

కలలోగన్న వస్తువు లెప్పుడేని మేల్కొనిన గాన్పించునా! యోషధీమహిమ యొండె దేవతా మాయ యొండె గావలయును ఎట్లయినను మేలే యగుంగాక యని యాలోచింపుచు నెట్టకే నా రాత్రి గడపెను. ఉదయంబున మదంబుబౌదల లేచి యా గిరి దిగి మణిఘృణులచే దనమేనంతయు వింతకాంతిచే మెరయుచుండ నా రత్నము లన్నియుం బదిలముగా మూటగట్టికొని పట్టణములోనికివచ్చి ముందుగా గలహంసిక యింటికరిగెను. అమ్మచ్చకంటియు నా చిన్నవానింజూచి సంతసించుచు నభ్యర్చించి, యార్యా! నేను మీరాక వేచియున్నదాన. మీరిచ్చిన ప్రశ్నమునకు మా రాజపుత్రిక యుత్తరము చెప్పినది తాటిచెట్టునీడంగూర్చుండి మీరాజుగారు నవ్విన కారణము వినుడు. మర్రిచెట్టు విత్తనము మిక్కిలి చిన్నది తాళవృక్షము విత్తనము మిక్కిలి పెద్దది. బీజ మల్పమైనను నీవటవృక్షము మిగులవ్యాపించి నా సేననంతయు నెండదగులకుండ నీడ యిచ్చి కాచుచున్నది. ఈ తాళవృక్షము బీజాధిక్యముకలదియై నను నిరువురు నిల్చుటకు దగిన నీడ నియ్యలేకపోయెనే! సృష్టివైచిత్ర్యమెంత వింతగా నున్నదని మీ రాజుగారు నవ్విరి ఇదియే కారణము అని ప్రియంవద జెప్పినది. ఈ సంగతి వారికిజెప్పి మీ కిచ్చిన కానుకలో నాకుగూడ బంచియిండు. వేగము పొండని పలుకగా సంతసించుచు నతండా రాజపుత్రిక బుద్ధికౌశల్యమునకు మెచ్చుకొనుచు నొక్కింతసేపు ధ్యానించి మరల దాని కిట్లనియె.

కలహంసికా! నా మిత్రు డిప్పు డెచ్చటనో యున్నవాడు. అతని యొద్దకు బోయి వచ్చుసరికి మిగుల నాలస్యమగును. ఈ ప్రశ్నలవిషయమై నీవు మిగుల శ్రమ పడితివి. మీ ప్రియంవదసైతము నీ నిమిత్తమేకదా యుత్తరమిచ్చినది. ఇప్పుడు నిన్ను రిత్త పొమ్మనుట ధర్మముకాదు. నా యొద్ద బ్రస్తుత మీ రత్నములు మాత్రమున్నవి. వీని నీకు బారితోషికముగా నిచ్చుచున్నవాడ. గైకొనుమని పలుకుచు దనయొడిలోనున్న రత్నములుదీసి యక్కలహంసిక దోసిటిలో బోసెను. కన్నులకు మిరుమిట్లు గొలుపు కాంతులతో నొప్పుచున్న యా రత్నములంజూచి యా చిగురుబోడి వెఱగందుచు నతడు మహాప్రభావసంపన్నుడుకాని సామాన్యుడు కాదని నిశ్చయించి యతనికి నమస్కరింపుచు యనుమతి వడసి యప్పుడే యా మణులం దీసికొని ప్రియంవద కడకు బోయినది.

తరువాత నదృష్టదీపుడు తాను రాత్రిజూచిన విశేషములు బరిభద్రునితో జెప్పుటకు మిక్కిలి తొందరపడుచు వడిగా నింటికి బోవుచుండెను. ఇంతలో రాజు కింకరులు కొంద ఱెదురుపడి యాతని విమర్శించిచూచి దొరికితివి. హరిదత్తా! ఎచ్చ టికి బోయెదవని నిర్బంధింపుచు, గారాగారప్రాయమైన యొక సౌధమునకు దీసికొనిపోయిరి. అదృష్టదీపుడు వాండ్రతో నేనేమి యపరాధము జేసితిని. నేనుబెట్టిన మితియు మీరలేదే. అప్పటికి నేను రాకపోయినచో నన్ను నిర్బంధింపవలయునుగాని యప్పుడే యిట్లు ఆటంకబెట్టితిరేల? ఇదియునుంగాక నేను మిత్రగుప్తుడను. హరిదత్తాయని పిలుచుచున్నా రేమి! హరిదత్తుడెచ్చటికేని బారిపోయెనా! యని యడుగగా నాతనికి నాకింకరు లిట్లనిరి.

నీ మాయమాటలను మేము నమ్మము. నీవు తప్పక హరిదత్తుడవే ఇదిగో నీ యాకృతిగల చిత్రఫలకమును జూచికొనుము. నీకును దీనికిని యించుకయు భేదము లేదు. నీవు మమ్ముల మాయజేసి పారిపోయితివి. నీకతంబున మాకు మాటవచ్చినది. ఈసారి నీకు మరణము తప్పదు. నీ విషయమయి రాజుగారికి మిక్కిలి కోపముగా నున్నది. నిన్ను మున్నుజెప్పిన మితివరకు నిలుపునని తోచదు. పారిపోయిననేరము బెద్దదిగదా? ఇక నీయిష్టదైవములను ధ్యానించుకొనుమని పలుకగా విని యతండు వెఱగందుచు నోహో! ఇది మిగుల చిత్రముగానున్నది. నన్ను హరిదత్తుడని వీరు భ్రమ జెందుచున్నా రేమి? అతండు నా పోలికనున్నవాడు కాబోలు. ఔను మొదట బలభద్రుడుగూడ నట్లే చెప్పెను. పోనీ వానికొరకు నేను మునుపే ప్రాణములు విడువదలంచుకొని యున్నానుగదా ఇప్పుడతండు తప్పించుకొని పారిపోయెను కాబోలు. మంచినేర్పరియే? ఎట్లయినను బ్రాహ్మణకుమారుడు బ్రతికినం జాలుగదా యని యూహించుచు గాలమహిమ కచ్చెరు వందుచుండెను.

అచ్చట గలహంసిక యదృష్టదీపుడిచ్చిన రత్నములను దీసికొని ప్రియంవదయొద్దకుబోయి యమ్మణులం జూపుచు నతని చరిత్రయంతయు జెప్పినది. అప్పు డప్పడతి యమానుషంబులగు రత్నంబులంజూచి యాశ్చర్యమందుచు దానితో నిట్లనియె. కలహంసికా! నీవు చెప్పినప్పుడు మొదట నేను నమ్మ లేదు. ఈ మాత్రపు దానికే యింత ధనమిచ్చునా? యని నిరవించితిని. నీవు మిక్కిలి నిర్బంధముజేయగా చెప్పితిగాని యంత శ్రద్ధజేయలేదు. అదృష్టదీపుని ప్రసిద్ధి మనము వినుచున్నారము కదా. అతని మిత్రుని దాతృత్వము సైతము కొనియాడదగియే యున్నది ఈ రత్నములు వెలగట్టించిన గోటికి దక్కువ యుండవు. మాతండ్రి రాజ్యమంతయు నింత లేదని తోచుచున్నది. నాకీవ్రతమున్నదిగాని యట్టివాని గైకొనిన జక్కగా నుండును. అతండు మిక్కిలి చక్కనివాడనియుం చెప్పుచుంటివికదా! నా ప్రశ్నముల కుత్తరము జెప్పువాడీలోకములో లేడు. నా యౌవనమంతయు వృధగా బోవుచన్నదని వేడి నిట్టూర్పులు నిగుడ బల్కుచున్న యాచిలుకల కొలికింజూచి కలహంసిక యిట్లనియె.

అక్కా! పెక్కు దినములనుండి నిన్నీవిశేష మడుగవలయునని తలంపు గలిగియున్నది కాని నీకేమి కోపము వచ్చునో యని సందేహించుచు నూరకొంటిని. ఇప్పుడు నీవే యీ ప్రసంగము దెచ్చితివి కావున దెగువబూని యడుగుచున్నదాన దప్పైన సైరింపుమీ? నీవిట్టి వ్రతమేటికి బూనితివి? ఇది స్వకల్పితమా? పితృనిర్దిష్టమా? ప్రాణతుల్యనగు నాకు జెప్పినం దప్పులేదుగదా? యని గ్రుచ్చి గ్రుచ్చి యడిగిన నమ్మించుబోడి యించుక ధ్యానించి యల్లన నిట్లనియె ప్రియసఖీ! స్త్రీలయొద్ద రహస్యము నిలువదని యూహించి నీతో నింతకుముందు జెప్పలేదుకాని లేకున్న నీయెడ రహస్యము లున్నవియా? మా కులదేవత భువనేశ్వరీదేవియట. నేను భువనేశ్వరీదేవి వరంబున బుట్టితిని. బాల్యము నుండియు మాతండ్రి నన్ను గారాబముగాజూచి పెంచు చుండెను. అతనికి నేనొక్కతెనే పుత్రికనగుట సంతతము సన్నే జూచుకొని యానందించుచుండెను.

ఇట్లుండ నొకనాడు త్రికాలవేదియగు నొక యోగి మాయింటి కతిధిగా వచ్చెను. మా తండ్రి యయ్యోగీంద్రుని నుచితసత్కారములచే నర్చించి యతని స్యాంతమునకు మెప్పువచ్చునట్లు పచారములు బెక్కుగావించెను అమ్మహానుభావుడు మజ్జనకుని భయభక్తి వినయ విశ్వాసములకు సంతసించుచు గొన్నిదినము లందుండెను. అప్పుడు మా తండ్రి యాయనకు శుశ్రూషకుగాను నన్ను నియోగించెను. నేనును నతని చిత్తానువృత్తి మెలంగుటంజేసి యయ్యతికి నాయందు మిక్కిలి వాత్సల్మము గలిగినది. మరియు నతండు వెళ్ళబోవు సమయమున మా తండ్రి నన్నుజూపుచు, మహాత్మా! మీ శిష్యురాలికి దగిన వరుండు లభించునా? యని యడిగెను.

అతండు నవ్వుచు నన్ను జూచి బాలా! నీకు బెండ్లి యాడవలయునని యభిలాషయున్నదా? యని యడుగగా నేను నెఱిగియు నెరుగని ప్రాయంబున నుండుట బట్టి యించుకి సిగ్గుతొ దలవంచుకొనుచు మీయనుగ్రహంబుండిన బెండ్లి యాడెదనని చెప్పితిని. నా ముద్దుపలుకుల కతం డలరుచు నెద్దియో ధ్యానించి మన మిచ్చుచున్న ప్రశ్నము వ్రాసియిచ్చి పట్టీ! వీనికి సదుత్తరములిచ్చు వానింగాని బెండ్లి యాడకుము. ప్రతీశుక్రవారము భువనేశ్వరీదేవి నర్చించుచు సాయంకాలమున నీ యూరి కుత్తరము దెసనున్న శైలశిఖరమున కరుగుచు నచ్చట కొంతసేపు క్రీడించి వచ్చుచుండుము. సార్వభౌముడుగాని యీప్రశ్నముల కుత్తరము జెప్పలేడు దానంజేసి నీ కనుకూలుడగు వరుండు లభించునని పలుకగా విని మాతండ్రి అయ్యా! ఎప్పటికేని నట్టివాడు దొరకునా యని యడుగగా నతడు నవ్వుచు వానికేమి యుత్తరము జెప్పక నా చెవిలో నెద్దియో చెప్పి నన్ను దీవించుచు నెక్కడికేని బోయెను అప్పుడు మాతండ్రి నన్ను నీ చెవిలో జెప్పిన సంగతులేమియని యడుగగా వాటిని జెప్పుటకు గురువు నాజ్ఞ లేదని చెప్పితిని. దానిఁబట్టి యతడూహించుకొని సంతసించుచు నట్టి ప్రకటన దేశమంతయు వ్యాపింప జేసెను. ఇదియే దీని వృత్తాంతము. అమ్మహానుభావుని వచనం బమోఘంబని యాశతో నుంటిని. నేటివరకు నెవ్వడును చెప్పినవాడు లేడు.

కొందరు వంచకులు నన్ను జూడవలయునను తాత్పర్యముతో మేము చెప్పెదమని వచ్చి యెద్దియో ప్రేలిన సరిపడునా? వానికి దగిన ప్రాయశ్చిత్తము సేయం బుచ్చితిని. అదృష్టదీపుని మిత్రుడును మహోన్నతుడువలె దోచుచున్నవాడు. కావున నట్లంటినికాని యతి వచనము తలంచుకొనిన భయమగుచున్నది. ఈ రత్నములం జూడ మనుష్యలోకసంబంధములుగా దోచదు. వీని మా తండ్రికి జూపిన నతని కేమి తోచునోయని అనేకప్రకారముల నా రత్న ప్రభావమగ్గింపుచు దానితో ముచ్చటింపు చుండెను. ఇట్లిరువురు మాట్లాడుకొనుచున్న సమయంబున నొక దాది యుత్తరమొకటి దెచ్చి, భర్తృదారికా! దీని నయ్యగారు మీ కిమ్మనిరని పలుకుచు నొక యుత్తరము ప్రియంవదకిచ్చినది. ఆమె దానిని బుచ్చుకొని విప్పి చదివిన నిట్లున్నది.

పట్టీ! హరిదత్తుడను బ్రాహ్మణకుమారుని నీ విదివరకు వినియున్నదానవు కదా. అతని నొకకారణముచేత నురిదీయక నారుమాసములు గడువిచ్చితిని ఆ చిన్నవాడును మ్రుచ్చువలె మొన్నను రక్షకపురుషులకు దేలియకుండ బందీగృహమునుండి పారిపోయెను. కాని దైవవశము చేత మరల వారికే చిక్కెను. వాని నాయొద్దకు దీసికొని వచ్చి యతడు చేసిన అపరాధాంతరమును దెలియపరుచుచు వెంటనే యురిదీయుట కుత్తరము దయచేయవలయునని వాండ్రు ప్రార్థించిరి. నేనును వెంటనే అట్టియాజ్ఞ యియ్యదలచుకొనుచు దీనికి నీవేమి చెప్పెదవని అతని నడిగితిని. అతండు కొంతసేపు ధ్యానించుచు నెద్దియో గొడవ చెప్పబోయను. కాని మరల నడంచుకొనుచు జివరకు నాతో నిట్లనియె. దేవా! మీ యధికారములో మీరేమి చేసినను సాగునుగదా మితియిచ్చి మరల నింతలో నురిదీయుట కేమి కారణమున్నది. నేను బారిపోయితినని గదా వీరు జెప్పుచున్నారు. ఆ మాటలెంత నిక్కువములో యాలోచింపక యాజ్ఞ యిచ్చెదనని నేనేమి చెప్పుదును. కానిమ్ము. నీ కూతురిచ్చిన ప్రశ్నలకిప్పుడు ప్రత్యుత్తర మిచ్చుటకు సిద్ధముగా నుంటిని నన్నొకసారి యామె యొద్దకు దీసికొని పొండని యడిగెను. దానికేమియు జెప్పక నీ యభిప్రాయము దెలిసికొనుటకయి యుంటిని. దీనికి నీవేమి చెప్పెదవో వ్రాయుము. అని యున్న యుత్తరము చదువుకొని యమ్ముదిత పెదవి విరుచుచు గలహంసిక కిట్లనియె.

కలికీ! అతని తెలివి మొదటనే తెలిసినది. ఇంతలో నతనికి సూక్ష్మబుద్ధి యెచ్చటనుండి వచ్చినది. ఊరక చావలేక కాలక్షేపము చేయుటకై యట్లనుచున్న వాడని యూహించెదను. మరల రప్పింపనేల? దీనికి నీవేమనియెదవని యడుగగా నక్కలహంసిక యిట్లనియె. అక్కా! నీవాలాగున చెప్పరాదు. ఎప్పటికేబుద్ధి తోచునో? అతండు చెప్పిన సంగతులు వినియే పైకార్యము జరిగించుకొనవచ్చును. బ్రహ్మహత్యాదోషమున కింతయేని వెరువక మీ తండ్రియంత సాహసము చేయు చున్నవాడేమి. అయ్యయ్యో! వినినంత నా మేనగంపము జనింపుచున్న దేయని పలుకగా బ్రియంవద దానితో బోటీ! రాజధర్మము మిగుల సూక్ష్మమైనది. అతండట్టి ప్రతిజ్ఞబట్టి యున్నవాడు. పతిజ్ఞాభంగము సైతము పాపహేతువని పెద్దలు చెప్పుదురు.

ఆ మాటల సంగతి మనకేటికి. ఇప్పుడు నాకొకటి తోచుచున్నది. వాని నిచ్చటికి రప్పించుటకంటె నాతడిచ్చు నుత్తరములు వ్రాయించి తెప్పించుకొనిన యుక్తముగా నుండునని తోచుచున్నది. అవి యుచితముగా నుండిన మనము ధన్యులమే కదా? లేనిచో వాని నేమి చేయవలయునో అట్లు చేయింతునని పలికి అక్కలికి కోపించి యా మాటలే మరల జీటిలో వ్రాసి తండ్రికంపినది. ఆ రాజవాహనుండా చీటిం జదువుకొనుచు దనయెదుట నున్న యా రాజకుమారుని కా సంగతి జెప్పెను. అప్పుడతండు వారి నడిగి చిత్తరువు వ్రాయు సామాగ్రిం దెప్పించుకొని తాను జూచిన విషయము లన్నియు దేటయగునట్లు వ్రాసెను. ముందుగా బుష్పపురి నొకచోట వ్రాసి దాని కుత్తరముగా గేళీశైలము దాని శిఖరము మీద మూడంతరములు గల భువనేశ్వరీ దేవాగారము లిఖించెను.

మఱియు నాయాయీయంతరంబులం గల విశేషములన్నియు దేటతెల్లముగా వ్రాయుచు పైభాగమున భువనేశ్వరీదేవి విగ్రహమును దాను చూచిన ప్రకార మైదుముఖములు బదిచేతులు, వాని రంగులును నచ్చుపడునట్లు అద్దేవి పీఠమున భువనేశ్వరీ దేవియనియు వెనుక గోడమీదనున్న పద్యము నుచితస్థానముల వ్రాసెను. మరియు నాయాచోటుల సంజ్ఞలు దెలియుటకయి అక్షరములతో గూడ వ్రాసెను. ఆ రీతి దాను చూచిన రహస్యమంతయు జిత్రఫలకమున వ్రాసి యెవ్వరును జూడకుండ మడచి అది యా రాజుగారికిచ్చెను.

అతండును గుప్తముగా దానిని గూతురి నంతఃపురమున కనిపెను. ప్రియంవదయు గలహంసికతో అప్పుడెద్దియో ముచ్చటింపుచు దాది తనయొద్ద తెచ్చి పెట్టిన చిత్రఫలకమును మొదట నంతశ్రద్ధగా జూడక సఖురాలి ప్రోత్సాహమున నెట్టకేనాపటమును విప్పి చూచినది. మున్ను సన్యాసి తనకు జెవిలో జెప్పిన విషయములన్నియు నందుంచుటచే విభ్రాంతస్వాంతయై అక్కాంత యొక్కింతసేపు వితర్కించి మేనంతయు గగుర్పొడున గ్రక్కున లేచి బిగ్గర గలహంసికం గౌగలించుకొనియెను. అదియును ముదము జెందుచు, మదవతీ! మన భాగ్యదేవత ప్రసన్ను రాలయ్యెనా యేమి? వడిగా జెప్పుము. నాకు శ్రోత్రానంద మాపాదింపుము లెమ్ము. విశేషములేమి అని అత్యాతురముగా నడుగుటయు నచ్చేడియ యెట్టకే సంతోష మాపుకొనుచు గలహంసిక కిట్లనియె.

చెలియా! కలయో నిజమో కాని యా పటములో నేను గోరిన యుత్తరములున్నవి. నా పూర్వపుణ్య ఫలంనిప్పటికి సఫలమైనది గాబోలు. చూడుమిదిగో! ఈ పటములోని విశేషములన్నియు యతి జెప్పినదే? ఇంతకు బూర్వ మీరహస్యము లేరికిం జెప్పలేదు. గుప్తముగా వ్రాసి దాచి యుంచితిని. చూతువుగాని రమ్మని యొక మందసము దాపునకు బోయి అందున్న యొక గ్రంథములో జ్ఞాపకార్ధమై సంక్షేపముగా సంజ్ఞాపూర్వకలిపితో నున్న యా విశేషములను దానికి జూపెను. కలహంసికయు ప్రియంవదయొక్క గాంభీర్యమునకు సంతసించుచు ఇంచుబోడి! నీవి రహస్యము నాతో జెప్పక యిన్నినాళ్ళెట్లు దాచితివో కాని యే సంగతియు నీతో జెప్పక నేనొక నిముషమైనను తాళలేను సుమీ? యని పలుకగా కక్కలికి యులికిపడి, అక్కా! నీ వట్లనుచున్నా వేమి? యతీశ్వరు డెవ్వరితోడను జెప్పవలదని యాస బెట్టియున్నవాడు. కావున దాచితినిగాని లేకున్న నేను మరల నీతో జెప్పక నిలువగలనా అని పలుకుటయు సంతసించి యాత్రమున గలహంసిక యిట్లనియె.

రమణీ! ఈ మాటలకేని ముందరికార్య మాలోచింపుము. ఈ హరిదత్తు నంతకు బూర్వము నీవు జూచితివిగదా! రూపంబున నీ కనుకూలుడైనవాడే యగునా అని పలికిన నక్కలకంఠియు నుత్కంఠతో దైవ మనుకూలకాలంబున మరియొక లాగున నెట్లు జేయును. అయినను నీవు ముందు నాకు బదులుగా బోయి యీ హార మతని మెడలో వైచి యిచ్చటికి దీసికొనిరమ్ము. దానసర్వము విదితమగునని పలుకుచు హరిదత్తుడు నా ప్రశ్నలకు సదుత్తరము లిచ్చెను. అతండు నా ప్రాణేశ్వరుడు. త్రికరణములచేత హరిదత్తుని నేను వరించితిని. తరువాత కృత్యములు నిర్వహించుటకు దేవరయే ప్రమాణమని యొకపత్రిక వ్రాసి తండ్రి కిమ్మని చెప్పి కలహంసిక నంపెను.

మిక్కిలి సంతోషముతో నాయోషామణి యాస్థానమునకు బోయి అందు రాజకింకరులచే నావృతుడై యున్న అదృష్టదీపుని, నతని గురించి విచారించుచున్న యా రాజవాహనునింజూచి యాశ్చర్యమందుచు రాజుగారికి నమస్కరించుచు బ్రియంవద యిచ్చిన యుత్తరము చేతికిచ్చి హరిదత్తు డెచ్చటనున్నవాడని యడిగెను. రాజవాహను డా యుత్తరమును జదువుకొని యపరిమితానందము జెందుచు నెదుర నున్న నదృష్టదీపుని నిరూపించి యితడే హరిదత్తుడు చూడుము కలహంసికా! నేటికి మా వంశము పవిత్రముచేయ వచ్చే సెనని పలుకుచు నతని గౌగలించుకొని, అనఘా! నిన్ను మేమిదివరకుబెట్టిన యిడుములన్నియు సైరింపవలయు. నీ మహిమ యెరుంగలేక నిన్ను మానవసామాన్యుండవని తలంచి వృధా శ్రమబెట్టితిమి. నిన్ను నా కూతురు వరించి నట్లుత్తరము వ్రాసినది. నీవు మా కల్లుడవైతివని పలుకుచు నతని మిక్కిలి గౌరవించి తమయర్థసింహాసనమున గూర్చుండ బెట్టుకొనియెను.

కలహంసికయు నతనింజూచియు వెఱగుపడుచు, అయ్మో! ఇది మేమివింత. ఇతండు మిత్రగుప్తుడనువాడుకాడా? హరిదత్తుడనుచున్నా రేమి? ఇతడింతకుముందు నాతో మాట్లాడివెళ్లెనే. బాగుబాగు. పురుషసింహా! పేరుమార్చిన లాభమేమియున్నది. మొదటినుండియు నీమాట లనుమానముగానే యున్నవి. సామాన్యుడు నీవు దెచ్చిన రత్నముల ముట్టుట కర్హుడగునా? తెలిసినది రమ్ము. అంతఃపురమునకు బోదము. నిన్ను జూచుటకై మా రాజపుత్రిక తొందరపడుచున్నదని యదృష్టదీపుని జూచి పలుకుచు నతని మెడలో ముత్యాలహారము వైచినది. అప్పుడు అచ్చటనున్న వారందరు జయ జయ అను శబ్దములతో గరతాళముల వైచిరి.

అదృష్టదీపుడట్టి సమయములో నేమియు బలుకక ప్రియంవదను హరిదత్తునికి వివాహముచేసి అతనికోరిక తీర్చెదనని మొదట శపథము చేసియున్నవాడు కావున నంతఃపురమునకు బోవుట కిష్టపడక హరిదత్తుని వెదకుటయందు దలంపుగలిగి యా రహస్యమేమియు వెల్లడించక సంతసం బభినయించుచు రాజవాహనునితో నిట్లనియె. దేవా! ఇప్పుడు ప్రియంవద నన్ను జేసిన గౌరవమున కెంతయు సంతసించితిని. ఆమె యానతి చొప్పున నీ యొప్పులకుప్ప నన్నంతిపురికి రమ్మని నిర్బంధించు చున్నది. కాని నాయాశయ మొక్క టరయవలయును. నేనిప్పుడొక దీక్షలో నుంటిని అది యిక పదిదినములకు ముగియును. అంత దనుక శుద్ధాంతమునకు బోరాదు. ఇప్పటికి సెలవిచ్చితిరేని తిరుగ దీక్షావసానంబున వచ్చువాడనని సహేతుకముగా నుడివిన విని రాజవాహనుడేమియు జెప్పలేక నిక్కముగా దలంచి యావార్త ప్రియవదకుం చెప్పుమని కలహంసిక కానతిచ్చెను.

ఆ పోడయు నా రాజకుమారునితో నెద్దియో ముచ్చటింపదలచి అభిప్రాయము సూచించుటయు అతండది యవసరము కాదని తిరిగి సూచించెను. పిమ్మట నక్కొమ్మయు అతనికి ప్రియంవద యందంత అనురాగములేదని గ్రహించియు వెల్లడిచేసినచో నా చిన్నది చింతించునని తలంచి యించుక శంకించుకొనుచు మెల్లగా గన్యాంతఃపురమునకు బోయెను. అదృష్టదీపుడు తన విడిదకుం బోవుటకు బయనమగుటయు రాజు అతండిచ్చగింపకున్నను బలవంతముగా నుత్తమాశ్వముల బూన్చిన శకటంబుపై నెక్కించి చుట్టును జయ జయ ధ్వనులతో రాజభటులు పరివేష్టింప రాజవైభవముతో బంపెను. ఆ వార్తవిని పౌరులందరు సంతోషముతో నతనిపై పుష్పములు జల్లదొడంగిరి. అతనినందరు హరిదత్తుడను బ్రాహ్మణకుమారుడనుకొనిరి, గాని అదృష్టదీపుడని యొకరును నెఱుంగరు.

అట్టి వైభవముతో నదృష్టదీపుడు బలభద్రుడున్న చోటికిబోయి తనరాకకై వేచియున్న యీ చిన్నివానిని గాంచి గౌగిలించుకొనియెను. భలభద్రుడును నతని వైభవ మంతయుం జూచి సంతసించుచు తత్కారణమడిగి తెలిసికొని మృతుండు జీవించినం బొడమునంత మురిపెమందుచు నతని యదృష్టదేవతను నేతెఱంగున నభినుతించెను. తరువాత నదృష్టదీపుడు అప్పరివారమునంతయు యథాస్థానమునకసిపి బలభద్రునితో నేకాంతముగ గూర్చుండి యిట్లు వితర్కించెను. తమ్ముడా! నేనిప్పుడు మృత్యుముఖంబునుండి వెల్వడితిని. కాని మఱియొక చింత యంకురించినది. పాపము హరి దత్తుడు బ్రియంవదకై ప్రాణత్యాగమున కైనను దెగించి చిక్కులం బడెనుగదా? అతనిని రక్షింపు తలంపుతో నేనడ్డుపడి దైవకృపచే నాయిక్కట్లు దాటించితిని.

నేను హరిదత్తుడనియే యెల్లరు భ్రాంతి పడుచున్నవారు. అతడు నేను నొక్కరూపని దీనిందేటబడుటయేకాక నీవుసైతము చూచినదేకదా? మొదటినుండియు బ్రియంవదను హరిదత్తునితో గూర్పవలయుననియే నా తలంపు. అట్టికాంత నిప్పుడు నేనెట్లు పెండ్లియాడుదును. వారు నన్నట నిర్బంధింపగా దీక్షాకైతవంబునం దాటించు కొనివచ్చితిని. బ్రాహ్మణాధీనము చేసినది మరల స్వీకరింపవచ్చునా! కావున నెట్లయినను హరిదత్తునితో నీమత్తగాశినిం గూర్పవలయు. అతండిప్పుడెచ్చటికి బారిపోయెనో తెలిసికొని తీసుకొనిరావలయును. ఇదియే మనము చేయదగిన కార్యము. రూప సాదృశ్యమువలన తనని నన్నుగా భావించి మన్నింతురు. ఇదియే నా నిశ్చయము. దీనికి నీవేమనియెదవని యడుగుచు దాను క్రీడాశైలంబున జూచిన విశేషములన్నియుం జెప్పెను.

అప్పుడా బలభద్రుడు మిక్కిలి యాశ్చర్యమందుచు నతని ధార్మికబుద్ధికి మెచ్చుకొనుచు జితేంద్రియత్వమునకు శిరఃకంపము చేయుచు దుద కదృష్టదీపుడు చెప్పినప్రకారము హరిదత్తుని వెదకి తీసికొని వచ్చుటయే యుత్తమమని యొప్పుకొనియెను. పిమ్మట వారిరువురు తిరుగవచ్చుటకు గడువేర్పరచుకొని యారాత్రియే చెరియొక మార్గంబునఁబడి పోయిరి.

హరిదత్తుని కథ

అందు బలభద్రుడు క్రమంబున బట్టణములును, బల్లెలును, గ్రామంబులును వెదకికొనుచు నొకనాడు సాయంకాలమునకు ధర్మాపురముచేరెను. పూర్వపరిచితమగు నదృష్టదీపుని సత్రములో బసజేసి యాపట్టణ విశేషములరయు తలంపున సాయంకాలమున రాజమార్గంబునంబడి పోవుచుండ బూర్వపరిచితుండగు నొక మిత్రుండెదురుపడి యోహో! బలభద్రా ఎచ్చటనుండి వచ్చితివి? ఇంత కాలము కుశలముగా నుంటివా? యని యడుగగా నతండును తగురీతి బ్రత్యుత్తరమిచ్చి, మిత్రమా! హరిదత్తుడను బ్రాహ్మణకుమారు డీయూరు వచ్చిన జాడ నీకేమైనం దెలియదు కదాయని అడిగెను.

అతండు నొక్కింత ధ్యానించి యోహో! మెల్లగా మాట్లాడుము. అతని నీవెరుంగుదువా యేమి? అతని గురించి యీ యూర గొప్పవితర్కముగా నున్నది. ఇప్పుడు నేను తొందరగా బోవుచుంటిని రేపటిదినంబున మా యింటికి వత్తువేని యా విశేషములన్నియు సావకాశముగా వక్కాణించెద. ఆ కథ ప్రకాశముగా జెప్పుకొనరాదు. ఇంకను రహస్యములో నున్నది. అని పలుకుటయు నెట్లెట్లూ కొంచెము జూడ చెప్పుమని బలభద్రుం డడుగుచుండగనే యతండు వడిగా నెచ్చటికోపోయెను. తరువాత బలభద్రుడు సంశయాకులితచిత్తుండై యున్మత్తుని క్రియ కొంతసేపా ప్రాంతభాగముల గ్రుమ్మరి చీకటిపడిన కొంతసేపటికి మరల సత్రములోనికి వచ్చెను.

సీ. ఒకచోట శ్రోత్రియప్రకరంబు జందెముల్
            వడకుచు వేదముల్వల్లె చేయ
    ఒకమూల శ్రోతల కకలంకముగ బుధుల్
            రాజుబురాణ ధోరణులుదెలుప
    ఒకవంక భూదేవనికరంబు రెడ్డిగం
            బులదీర్చివివిధగాథలవచింప
    ఒకప్రక్క బండితు లుధ్ధతిగావ్య నా
            టక సత్ప్రసంగంబులొనరజేయ.

గీ. ఒక్కదెస శాస్త్రపాఠంబు లొక్క వైపు
    సకలలౌకిక సంబంధ చర్చలొప్ప
    సందడించెడి సత్రంబు సత్రాముగతి
    విబుధలోక మనోజ్ఞమై వెలసియుండె.

అట్టి సత్రమంతయు బెక్కుదేశములనుండి రాబడిన బ్రాహ్మణులచే నావరింపబడియున్నది. బలభద్రుండును నాబ్రాహ్మణ బృందమునకు నమస్కరించి వీరి వలన భూలోకవృత్తాంత మంతయు విదితమగునని నిశ్చయించి వారి మాటలు విను తాత్పర్యముతో నాప్రాంత మందొకచోట గూర్చుండి యుండెను. అప్పుడందున్న వారిలో అచ్చన్న శాస్త్రి బ్రహ్మావధానియను బ్రాహ్మణులీ రీతి మాట్లాడుకొనిరి

అచ్చన్నశాస్త్రి :- బ్రహ్మావధానిగారూ ! మీరు మిగుల వృద్ధులై యింత దూరమెట్లు వచ్చితిరండి? మీకు సంతానమైనను లేదుగదా? హాయిగా యింటియొద్ద గూర్చుండి రామా! కృష్ణా! యని కాలక్షేపము చేసికొనరాదా! మాకనిన గుటుంబ భారము బలసినది కావున తిరుగక తప్పదు.

బ్రహ్మావధాని :- అచ్చన్నశాస్త్రిగారా? మిమ్ములను జూచి పెద్ద కాలమైనది. ఈ నడుమ నా యోగక్షేమ మేవి యు మీరు తెలిసికొనడములేదు. నాకును ఒక పిల్లకాయ కలిగినాడు. వాని పెండ్లికొరకే యింతదూరము వచ్చితిని.

ఆచ్చన్న :- ఆలాగునా? తెలియక పలికితిని క్షమించండి.

బహ్మావ :- దానికేమిలెండి. ఇచ్చట రేపు భారసాల జరుగునా? యేదియో యడ్డము వచ్చినదని చెప్పుచున్నారేమి? అదృష్టదీప మహారాజుగారికి కుమారుడు గలిగెననియు భారసాలయనియు విని వచ్చితిని. అమ్మహారాజు దానకర్ణుడనియు మా బుచ్చిగాడికి వివాహము జేయుదురను తాత్పర్యముతో ముసలిది చెప్పగా బయలుదేరి వచ్చితిని.

అచ్చన్న :- ఈ వచ్చిన వారందరు నట్టి యభిప్రాయము తోడనే వచ్చినారు కాని యింతలో నేదియో గడబిడ పుట్టినదట అదంతయు రహస్యముగా నున్నది. సూర్యోదయమున నంతయు దేటపడును.

బ్రహ్మావ :- అయ్యో ! నేను మిగుల కష్టపడి వచ్చితినయ్యా! దైవము నా యాశ యేమిచేయునో? ఇంతకు నదృష్టదీపమహారాజుగా రిచ్చటనున్న మాట నిజమేనా?

అచ్చన్న : :- ఏమో! యేసంగతి నాకు బాగా తెలియదు. నేనుగూడ యీ మధ్యాహ్నమునకే వచ్చితిని. ఈ రామసిద్ధాంతిగారు నాలుగు దినముల క్రిందట యిచ్చటికి వచ్చినారట ఈయన కంతయు దెలియగలదు.

బ్రహ్మావ :- ఏమండీ సిద్ధాంతిగారు! దాని బ్రూహి మీకేమయినం దెలిసినదేమో చెప్పండి నేను పెద్దవాడను గంపెడాశతో వచ్చితిని.

రామ :- ఇప్పుడు మొదటికే మోసము వచ్చినది. వినుండు. ఆదృష్టదీపుడు కొన్నినాళ్ళ క్రిందట నీయూరు రహస్యముగా వచ్చి ఈ రాజు కూతురు కాంతిమతి యను దానితో రహస్యముగా గ్రీడించెనట. దానికి గర్భమయినది అది గాంధర్వవివాహములో లెక్కించుకొని ఈ రాజుగారు కూతురి నిందింపక సురక్షితముగా గాపాడుచుండ గొన్ని దినముల క్రిందట గుమారుడుదయించెను.

బ్రహ్మావ :- ఆలాగునా? తరువాత తరువాత.

రామ :- అంతకుమున్నే యదృష్టదీపుడు తెలియకుండా పారిపోయెను. కావున నీరాజుగారతని చిత్రఫలకము చారులకిచ్చి నాల్గుదిక్కులకుంబుచ్చి వెదకి దీసికొనిరండని పంపిన వారును పోయి యొకని నదృష్టదీపుడే యని తీసికొనివచ్చిరి.

బ్రహ్మావ :- పిమ్మట ?

రామ :- ఆ వచ్చినవాడు నేనదృష్టదీపుడిని కాననియు నేను హరిదత్తుడను బ్రాహ్మణకుమారుడ ననియు గాంతిమతి నంతకుము న్నెన్నడును చూచియెరుంగననియు నీకుమారుడు నా కుమారుడు కాడనియు జెప్పుచున్నవాడట. రాజపుత్రిక తాను పూర్వము వరియించిన వాడితడే యనియు నితండెట్టి యభిప్రాయముతోనో యిట్లనుచున్నవాడు కావున నీతనింబోనీయరాదని నిశ్చయముగా బలికినదట. ఇప్పుడా మీమాంసలోనున్నది.

బ్రహ్మావ :- ఎద్దియో స్మరించుకొని కన్నీరువిడుచుచు, సిద్ధాంతిగారూ! ఆ హరిదత్తుడు మా హరిదత్తుడు కాడుగదా?

రామ :- అదేమిటయ్యో! మీకొక హరిదత్తుడుండెనా యేమి?

బ్రహ్మావ :- అయ్యో! ఆడనిర్బాగ్యురాలిమూలముగా నతని నెడ బాసితిని. వినుండొకనాడు, నేను జాము ప్రొద్దెక్కు సమయమున నొక అరణ్యమార్గమున ముష్టి మూట నెత్తిమీద బెట్టుకొని వచ్చుచు నెండతాకున నాయాసమువచ్చి యొక చెట్టుక్రింద గొంచెము సేపు విశ్రమించితిని. అప్పుడా చెట్టుమీద శిశురోదనము వినబడుటయు వెఱగుపడి తలపైకెత్తి చూచితిని. ఆ చెట్టుకొమ్మల సందున నొక కోతి చక్కనిబిడ్డను నొడిలోబెట్టుకొని ముద్దాడుచుండుటయు, శిశువు కేరుకేరుమని యేడ్చుచుండుటయు గనంబడినది. అప్పుడు నేను ఔరా! ఈ వానరము నక్కులోనికి నరశిశువెట్లు వచ్చెనో? యని యాశ్చర్యమందుచు నాకోతి యాబిడ్డను కొమ్మల సందున బెట్టుట దిలకించి తటాలున దుడ్డుగర్రతో నా వనచరణమును బెదరించి మెల్లన నా చెట్టు పైకి నెక్కి పదిలముగా నప్పట్టిని యొడిలో బెట్టుకొని చెట్టుదిగి భారముగానున్న బియ్యము మూటను విప్పి యచ్చటనున్న కోతుల కాహారముగా జిమ్మి యా బిడ్డతో నింటికి వచ్చితిని.

రామ :- ఆ ప్రాంతమందు మీకెవ్వరు గనంబడలేదా!

బ్రహ్మా :- దారిలో నొకయాడుదిమాత్ర మెదురుపడినది. దాని నేమియు బల్కరించలేదు. నాకప్పుడు సంతానములేదు గనుక బిడ్డ దొరకెనను సంతోషముతో వడివడిగా నింటికి వచ్చి నా భార్యకా వృత్తాంతమంతయుం జెప్పి యబ్బాలునిచ్చి వానికి హరిదత్తుడను పేరు పెట్టితిని.

రామ :- అగునగు మంచి పేరే పెట్టితివి. హరి యనగా కోతియు భగవంతుడును గనుక రెండు విధములచేతను జక్కగానే యున్నది. తరువాత-

బ్రహ్మా :-- అద్భుత తేజస్సంపన్నుండగు నాబాలునింజూచి నా భార్యయు మిగుల సంతసించుచు మిక్కిలి గారాబముతో గన్నపుత్రుని వలెనే పెనుచుచుండ బదిరెండేడుల ప్రాయమువచ్చెను. అప్పు డుపనయన సంస్కారము నిర్వర్తించితిని.

రామ :- తరువాత.

బ్రహ్మా :- వానిని బెంచిన మూలముననే గాబోలు పిమ్మట నాకును నొక కుమారుం డుదయించెను.

రామ :- ఔను. ఆలాగున గలుగుట లోకాచారమున్నది.

బ్రహ్మా :- వాడు గలిగినది మొదలు నా భార్య హరిదత్తుని యందీర్ష్యగలిగి యన్నపానాదుల యందు మరియొక రీతి జరుప దొడంగినది.

రామ :- అది స్త్రీజనసామాన్యమే కదా? తరువాత.

బ్రహ్మా :- అక్కపటమేను గ్రహించి యా చిన్నవానిని విద్యాభ్యాసమునకు మా ప్రాంతమున నున్న యొక అగ్రహారములో నొక యాచార్యునొద్ద నుంచితిని. హరిదత్తుడు గుణవంతుడును, రూపవంతుడును, బుద్ధిమంతుడునై యున్న వాడు గావున నతని యొద్దనే గొన్నిశాస్త్రము లభ్యసించి చివరకాయన కూతురు కారణమున నెచ్చటికో పారిపోయెనని తెలిసినది. ఇతడు వాడు కాడుగదా? అని యూహ బుట్టుచున్నది.

రామ :- అయినంగావచ్చును. రేపుపోయి మీరు చూడండి. గురుతుపట్ట గలరా?

బ్రహ్మా:- ఏమో! అతనికి నేను జ్ఞాపకముందునా? వాడు మట్టివాడు కాడు.

రామ :- అఘటనఘటనా సమర్ధుడు భగవంతు డేమిచేసినం జేయగలడు. ప్రొద్దున విచారింతము. పరుండునప్పుడు ప్రొద్దుపోయినదని యొండొరులు సంభాషించుకొని నిద్రపోయిరి.

ఆ మాటలన్నియు విని బలభద్రుండు విస్మయము జెందుచు మేలు మేలు. వీరివలన మంచివార్తయే వినబడినది. హరిదత్తుడు రాజకుమారుడని తోచుచున్నది. రూపసాదృశ్యమునుబట్టి చూడగా నదృష్టదీపునికి సోదరుండని నిశ్చయింపవచ్చును. సన్యాసి చెప్పినమాట యెప్పుడు నసత్యము కానేరదు. అదృష్టదీపునికి హరిదత్తునందు నిర్హేతుకమైన ప్రేమ జనించినది. అదియే బాంధవ్యమును దెలుపుచున్నది. కాంతిమతి యతని నదృష్టదీపుడని భ్రమజెందుట కేమి యాశ్చర్యము! నేనుగూడ నతడే అని భ్రమజెందితిని. వీరి యనుమానమంతయు దీర్చి హరిదత్తుని ప్రియంవదతో గూర్చెద నిదియే కదా యదృష్టదీపుని యభిలాష నేనిట్టి పని చేసితినేని నా మిత్రుడు నన్ను మిక్కిలి మన్నించునని యనేక ప్రకారముల నాలోచించు సమయంబున నచ్చట నొక మూల బరుండి యా మాటలన్నియు వినుచున్న యొక వృద్ధకాంత మెల్లగా లేచివచ్చి అయ్యా ! తమరెవ్వరు హరిదత్తునికథ చెప్పిన బ్రాహ్మణు డెచ్చట నున్నాడని బలభద్రు నడిగినది.

బలభద్రుడును దానికి తన పేరు చెప్పి నీవెవ్వతెవనియు నాబ్రాహ్మణుని యవసరము నీకేమిటికనియు నీవిచ్చటికేల వచ్చితివనియు నడిగిన నజ్ఞతర యిట్లనియె. అయ్యా! నా వృత్తాంతమేమని చెప్పుదును. నేను మాళవదేశాధీశ్వరుండయినా ధర్మపాలుని భార్య సునందయొక్క పరిచారికను. నా పేరు రత్నావతి యందురు. మా రాజుగారిని శత్రువులు కోట ముట్టడించి బందీగృహంబునం బెట్టుటయు మా యేలిక సానియైన సునందను గర్భభరాలసయైయుండ మూడేడుల ప్రాయముగల కుమారు నెత్తుకొని నింబవతియను దాది వెంటరాగా బ్రచ్ఛన్నమార్గంబున గోట దాటించి మేమందరము నొక అరణ్యమార్గంబున బడిపోయితిమి. ఆగమన వేగంబున నింబవతి యొక మార్గంబునను, నేనును సునందయు నొక మార్గంబునం బడిపోయితిమి. ఆ యరణ్యములో గ్రుమ్మరుచుండ నొక నాడుదయంబున సునందకు బ్రసవవేదన యావిర్భవించి చక్కని కుమారునింగనియెను. ఆమెయు నుదకము దీసికొనిరమ్మని నన్ను బంపుటయు నేనతి జవంబునంబోయి యాప్రాంత భాగముల నరసి పర్ణపుటంబున జలంబు బట్టి దీసికొనిపోయితిని. నాకు దారిలో నొక బ్రాహ్మణు డెదురుపడెను. కాని సునందను జూచు తొందరతో బోవుచుంటిని గాన నంత విమర్శించితిని కాను ఆయన యొడిలో బాలకు డున్నట్లే యున్నది. నేనట్లు వడిగా బోయి చూచువరకు నచ్చట సునంద లేదు. గురుతులు మాత్రమున్నవి అడుగులజాడబట్టి యా యరణ్యములో గొంతదూరము దిరిగి యామె కొరకు గొంతెత్తి యరచితిని కాని యెందును నా సునందజాడ దెలిసినది కాదు. మరలవచ్చి యడవి యంతయు వెదకి నిరాశ జేసికొని దైవోపహతులమగు మాకు సమాగమ మెట్లు లభించునని యదిమొదలు బ్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి పల్లెయు వెదకుచు భూమియంతయు దిరుగుచుంటిని. వారిజాడ యేమియుం దెలియలేదు.

రాజకుమారు నెత్తుకొని మరియొక మార్గమునం బోయిన నింబవతిజాడయు దెలిసినది కాదు. ఆ రాజకుమారు లిప్పటికి మంచి ప్రాయములో నుందురు. ఇప్పుడీ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు నేను వింటిని. హరిదత్తుడు మా రాజపుత్రుడు. వానిని జూచితినేని నా యాత్రమంతయుంబోవును. ఆ బ్రాహ్మణుడెచ్చట నున్నవాడో చెప్పుడు. నేను బెద్దదానను. మీకు మిక్కిలి పుణ్యము వచ్చునని చెప్పగా చిని బలభద్రుడు మరియు వెఱగందుచు నిట్లు తలంచెను. ఆహా! జగంబంతయు దైవాయత్తమై యున్నది. భగవదాజ్ఞ లేక పురుషుడు నిట్టూర్పు నిగుడ్చుటకయినను స్వతంత్రుడు కాడు. నియతిబలము లేక నేకార్యము సమకూడదు. మా మిత్రున కిప్పుడు మంచి దినములు వచ్చుచున్నట్లు తోచుచున్నది. నింబవతి తీసికొనిపోయిన బాలుడు నా మిత్రుడే హరిదత్తుడు సునందకన్న బిడ్డడు అని తోచుచున్నది.

ఇప్పుడు నా మిత్రుడు అదృష్టదీపు డీమాటవినినచో నెంత సంతసించునో అని అనేక ప్రకారముల విత్కరించుచు నా వృద్ధతో నిట్లనియె. అవ్వా! నీవు చింతింపకుము. నీ వాప్తులతో గొలదికాలములో గలిసికొందువు. నేను మీ రాజుగారి పెద్దకుమారుని మిత్రుడను అతడు కుశలముగా నున్నాడు. నింబవతియను దాది అతని నెత్తుకొని పోయినదని నీవు చెప్పితివి గదా! ఆ దాది యొక యరణ్యములో నా బాలుని బెట్టుకొని చెట్టుక్రింద బరుండియుండగా బాముగరచి మృతినొందెను. పశువుల గాచు పిల్లవాండ్రు, దాని శవముపైకెక్కి రోదనము చేయుచున్న యా చిన్నవాని నెత్తుకొని యీ ప్రాంతమందున్న పల్లెకు వచ్చిరి. అపుత్రకుండైన యొక గొల్లవాడు వానిని బెంచి పెద్దవానిని జేసెను.

అతండిప్పుడు మిక్కిలి గౌరవస్థితిలో నున్నవాడు. నీవు చెప్పిన హరిదత్తుడును నుత్తమస్థితికి రాగలడు. తల్లిమాత్ర మెచ్చట నున్నదో తెలియవలయు. వీరిరువురు శీఘ్రకాలములో దండ్రిచెఱ విడిపించి తమ రాజ్యముగైకొని భూచక్ర మంతయు నేలగలరని వక్కాణించుటయు నమృతప్రాయములైన అతనిమాటలు విని యావృద్ధ సంతోషహృదయంబున మునిగి దేలుచుండెను. బలభద్రుడా వృద్ధ కాంతతో నిష్టగోష్టివినోదమున నారాత్రి గడపి యుదయంబున లేచి యా బ్రాహ్మణుని రత్న వతినింగూడ తాను వచ్చుదనుక నచ్ఛటనే యుండ నియమించి కాంతిమతియొక్క చెలికత్తె యగు నిపుణిక యింటివీథిని బోయెను.

నిపుణికయు మేడమీదనుండి యతనిం జూచి గురుతుపట్టి వాని దోడితేర నొకశుకవాణి నంపినది. అదియు నతనిదారి కడ్డము వచ్చి, అయ్యా! మిమ్ము నీయింటి యజమానురాలు నిపుణిక యనునది యొకసారి లోపలకు దయచేయుటకు కోరుచున్నదని వేడగా నతండును సంతోషముతో దానిమేడమీదికి బోయెను. నిపుణికయు నతని కెదురేగి యుచితమర్యాదలు గావించి గద్దియనిడి కూర్చున్న తరువాత మెల్లగా నిట్లనియె. ఆర్యా! నీవు నీ మిత్రునితో విడి యెచ్చట నుంటివి? ఇచ్చటికెప్పుడు వచ్చితివి? నీ మిత్రుడు మునుపటిరీతి గాక మాపై గృపదక్కియున్నవాడు వింటివా? అతండెన్నడును మమ్ము జూచి యెఱుగడట. అతని కొఱకు మా నెచ్చెలి పడిన యిడుములన్నియు నీ వెఱింగినవేకదా! ఆ రాత్రి అతం డుద్యానవనములో జిక్కుపడిన తరి నా చెలి పాము గరచెనని యెంత కపట మభినయించినది.

అది యంతయు మరచి మీ రెవ్వరో నేనెరుగనని దుష్యంతునివలె ద్రోసి వేయుచున్నవాడు. యెంత చెప్పినను నొప్పుకొనడు. అతడు చివర మాకు వ్రాసిన యుత్తరము నీవేకదా తీసికొని వచ్చితివి? అదియు దానెరుగడట. తనపేరు సైతము మరియొకరని చెప్పుచున్నాడు. మీరు వెళ్ళినతరువాత గర్భవతియగు కాంతిమతి వృత్తాంతము విని మారాజు మంచి మగని సంపాదించుకొనెను. సంతోషముతో గూతునేమియు ననక పుంసవనసీమంతాతి కృత్యములు యధాశాస్త్రముగా జరిపించెను.

కాంతిమతియు బదియవమాసంబున జక్కని పుత్రుం గనినది. మారాజు గారిచే బంపబడిన దూతలు నీస్నేహితుని వెదకి పట్టుకొని తీసికొనివచ్చిరి. కాంతిమతియు సిగ్గు విడచి తన పుత్రుని జూపుచు బోలికిబట్టియైనను నమ్ముమని యెంత బ్రతిమాలినను నతండధర్మ భీరువువోలె సమ్మతింపకున్నవాడు. ఆ శిశువుగూడ నచ్చుగా నతని పోలికగానుండెను. ఇప్పుడు మా రాజుగా రా పిల్లవానికి జాతక కర్మాది సంస్కారములు చేయవలయునను సంతోషముతో నానాదిక్కులకు వర్తమానము చేసెను. పెక్కండ్రు విద్వాంసులు, బ్రాహ్మణులు వచ్చియున్నారు. పీటలమీద గూర్చుండుటకు నీ మిత్రుడు సమ్మతింపకున్న వాడు. నీవు సమయమునకు వచ్చితివి. చక్కగా బోధించి యీ కార్యము జక్క పరుపుమని వినయముగా బ్రార్ధించిన విని యతండు నవ్వుచు దాని కిట్లనియె. నిపుణికా! ఈశ్వరసృష్టి కడు చిత్రమయినది. పురుషునింబోలిన పురుషుం డుండుట సహజము కదా ! అట్టి వైపరీత్య మేదియేని జగినదేమో విచారించితివా! యెంత వెర్రిడివాడుగాని యూరక నే నెరుగననిన పూర్వపరిచయము గల వనితను నిరసించునా?

అతండెచ్చటనున్న వాడో చెప్పుము. నేనును బోయి మాట్లాడి వచ్చెదనని పలుకగా సంతోషింపుచు నతని కతని మేడజూపుటకై తన పరిచారికలలో నొకదాని నంపుచు నెట్లయినను, గార్యసాఫల్యము చేసికొని రండని పలికినది. బలభద్రుడు హరిదత్తుడున్న మేడమీదకు బోయెను. అందు నాయనా! మా మాటవినుము. నీ మతిభ్రమించి యిట్లనుచున్నావు. నీ పుత్రకు నెత్తికొనుము. అపుత్రకుడైన యీరాజు రాజ్యభారము వహింపుమని బ్రతిమాలుచున్న మంత్రులతో మీరెన్ని చెప్పినను నాకు సమ్మతికాదు. రాజలోభంబున జేసి పరకాంతను గళత్రముగా స్వీకంచి నరకయాతనల నెవ్వడనుభవింపగలడు. నాదారినన్ను బోనీయుడు. నామూలమున నొక పురుషుడు చిక్కులు పడుచుండును. నాకు మతిభ్రమ పుట్టి బందీగృహంబుననుండి తప్పించుకొని వచ్చితిని. మీకు బదివేలనమస్కారములు కావించెదను విడువుడు విడువుడు. అని వేడుకొనుచున్న హరిదత్తు మాటలు విని అచ్చటివారెల్ల నతనికి బిచ్చియెత్తినదని నిశ్చయించిరి.

అట్టిస్థితిలోనున్న హరిదత్తునిం జూచి బలభద్రుడు దాపునకుబోయి, మిత్రమా! నే నెవ్వడనొ యెరుంగుదువా? అని యడిగెను. అతండును నిదానించి అయ్యో! నిన్ను మరచిబోవుదునా? నా ప్రాణము గాపాడినవాడవు నీవేకదా? నా మూలమున మీరచ్చట జిక్కులు పడుచున్నవారు కాబోలు. వీరు నన్నిచ్చట నిది నీభార్య వీడు నీపుత్రుడు అని కదలనీయక నిర్బంధింపుచున్నవారు. వీరి నిదివరకు నేను గని విని యెరుంగను. నీవైనను వీరితోజెప్పి నన్ను విడిపించి తీసికొని పొమ్మని పలుకగా విని యతండును నతని యాకారవిశేషముజూచి అదృష్టదీపునికిని నతనికి నించుకేనియు భేదము లేనందునకు వెరగందుచు నెరగనివారు వీనినతడుగా భావించుట కేమియబ్బుర మని యాలోచించి జిరునవ్వు మొగంబలంకరింప నల్లన యిట్లనియె.

మిత్రమా! నీవు మమ్ము దాకట్టుపెట్టి పారిపోయివచ్చితివి. మమ్మువా రురి దీయుటకు సిద్ధపడినంతలో దైవకృపచే మిత్రగుప్తుడు ప్రియంవద యిచ్చిన ప్రశ్నలకు సమాధానము చెప్పెను. దానంజేసి మా మరణము తప్పినది. నీవు సంతోషముతో నుండుమని చెప్పుచు నీతో కొన్ని రహస్యవచనములు చెప్పవలసి యున్నవి. వివిక్తమునకు రమ్మనికోరిన నచ్చటి వారందరు వేరొక చోటికి బోయిరి. పిమ్మట బలభద్రుండతని జేరదీసికొని కన్నుల నానందబాష్పములు గ్రమ్మ, తమ్ముడా! నీ వృత్తాంతమే నీవెరుంగకున్నావు. నిన్ను వీరిట్లు నిర్బంధించుటకు వేరొక కారణమున్నది.

ఈ కాంతిమతిని నీ అన్నగారు గాంధర్వంబున గళత్రముగా స్వీకరించెను. అతండు వీరికి దెలియకుండ వేరొక కారణమునం బారిపోయెను. నీకును నీ యన్నకును నింతయేని భేదములేదు. నేను నీ యగ్రజుని మిత్రుడను. నిత్యముజూచుచున్న నేనుగూడ మీ తారతమ్యము గనిపెట్టలేనని చెప్పవచ్చును. నిన్నతనిగా భావించి వీరింతగా నిర్బంధించుచున్నవారని పలుకగా నతండు తెల్లపోయి యేమేమీ? నీమాటలు మరియు వింతగా నున్నవే! నాకు సోదరుడు లేడే? నీ మాటలెట్లునమ్ముదును? నా దత్తజనకునికి గొన్ని దినములకు మరియొక కుమారుడు గలిగెను. వాడు నాకు దమ్ముడు. కాని యన్న కాడు. వాడైనను నా పోలికగాలేడు. వీరట్లనుటకు మరియెద్దియేని గారణమున్న దేమోయని పలుకగా నవ్వుచు మరల బలభద్రుం డిట్లనియె.

తమ్ముడా! దాననేకదా నీ వృత్తాంతము నీ వెఱుంగవని చెప్పుచున్నాను. మంచిది. నీ దత్తజనకుని యింటికి నీవేరీతి వచ్చితివో చెప్పుమని యడుగగా నతండు కొంచె మాలోచించి యొకప్పుడు మాతండ్రి యొకరడుగగా జెప్పిన మాటలు నేను వింటి. అడవిలో జెట్టుపై ప్రాకుచున్న యొకకోతి యొడిలోనుండగా దానిని బెదరించి నన్ను మా తండ్రి తీసికొనివచ్చెనట ఇదియే నేనెరిగిన కథయని చెప్పెను. తరువాత బలభద్రుడతనితో రత్నవతి మాటలును బ్రాహ్మణుడు చెప్పిన విశేషములుం జెప్పి యదృష్టదీపుడను ప్రసిద్ధిజెందిన పురుషుడే నీ యన్న యని చెప్పెను.

అప్పుడు హరిదత్తుని చిత్తంబునం బొడమిన కౌతుక మింతింతని చెప్పుటకు నలవికాదు. అతి సంతోషంబున మాటరాక తగ్గుత్తికతో నొడలు గరపుజెంద బలభద్రుం గౌఁగలించుకొని, తమ్ముడా! యిట్టివార్త యెఱింగించినందులకు బారితోషికముగా నీ కిచ్చుటకు నాయొద్ద నేమియును లేకపోయినది. నా ప్రాణమే నీయధీనము చేయుచుంటిని. ఇది మొదలు నేను నీ యిష్టము వచ్చినట్లు నడుచువాడనని శపథ పూర్వకముగా బలికెను. యీరీతి వారిరువురు మాట్లాడుకొనుచుండగా నింతలో గాంతిమతియు జతురికయు బిడ్డ నెత్తుకొని యచ్చటికి వచ్చినది.

వారి రాక జూచి యచ్చటనున్న జనులందరు నవ్వలకు బోయిరి. వారిం జూచి హరిదత్తుడును బలభద్రుడును లేచిరి. అప్పుడు దాపుచేరిన తోడనే హరిదత్తుడు గాంతిమతి పాదంబులంబడియెను. అది చూచి సంకోచింపుచు గాంతిమతి, చూచితివా? బలభద్రా! నీ మిత్రుడేమి చేయుచున్నవాడో? యితనికి బిచ్చియెత్తినదేమో యరయు మనుటయు నతండు నవ్వుచు జవ్వనీ! యితనికేమియు బిచ్చియెత్తలేదు. వీని నమస్కారపాత్రునిగా దలంపుము మీరే భ్రమజెందుచున్నవారు. యితడు నీ వల్లభునికి దమ్ముడు. రూపసాదృశ్యమునం జేసి యతని నతనిగా భావించుచున్నారు.

ఇతండు నీకు మరిదియని సెప్పిన గాంతిమతియు నించుక సిగ్గు దోప నిదానించి చూచుచు, నౌరా! బ్రహ్మసృష్టి యెంత మోసము చేసినది! ఈతడు గుణవంతుడుగాన నింతపట్టు నిదానించెను. కాని మరియొకడైనచో నేమిచేయనగు అన్నా! యెంత యాపదదాటినది కటకటా! యూరక నీ మిత్రుని నిందించితిమే! యని పెక్కు తెఱంగుల బశ్చాత్తాప మందుచు ముద్దుమరందిని మన్నించుచు బుత్రకు నెత్తనిచ్చెను. హరిదత్తుడు నా పుత్రకు నెత్తుకొని పెక్కుగతుల ముద్దాడుచు జుంచుదువ్వుచు జబుకంబు మూర్కొనుచు గొంత సేపటికి బలభద్రున కందిచ్చెను. ఆతండును దగురీతి గారవించి కాంతిమతితో, అమ్మా! మేముపోయి యీ విశేషములన్నియు నీపతి కెఱింగించి అతనిందోడుకొని వచ్చెదము.

మేము నియమించుకొనిన మితియు సమీపించినది. అనుజ్ఞ యిత్తువే ? యనుటయు నక్కలకంఠి మెల్లన నిట్లనియె, వత్సా! భవత్సఖునకు మాయందనురాగము కొరంతయైనను బుత్రకుని దలంచి యైనను జూడరాదగదా! మాకు దయ యందుగల మక్కువ యెరింగియు నింతకాల మాలసించుట మిక్కిలి యద్భుతముగా నున్నది. ఇక స్వల్పకాలము జాగుచేసిన స్త్రీ సాహసము లోకప్రసిద్ధమైనదియే. తరుచు జెప్పవలసినదిలేదు. నీవార్తాశ్రవణమే యాగమనావధియని చెప్పుమని పెక్కు బోధించి హరిదత్తునికి జెప్పురీతి జెప్పి యెట్టకేలకు వారి నచ్చటినుండి పంపెను.

బలభద్రం డా హరిదత్తునితో గూడి యంతఃపురము వెడలి సత్రంబునకు బోయి యందున్న రత్నవతీ బ్రహ్మావధానుల గలసికొని వారితో హరిదత్తుని వృత్తాంత మంతకుమున్ను జెప్పియున్న వాడు కావున వారును నతనిజూచినంత బట్టరాని సంతోషముతో నతనిం గౌగలించుకొని పెద్దతడవు గారవించిరి. హరిదత్తుడును వారియెడల మిక్కిలి సౌహృదయము జూపుచు దానగ్రజుంగలసికొని వచ్చునందాక నచ్చోట నివసింప నియమించి యెట్టకేలకు వారిచే ననిపించుకొని యచ్చట వెడలి బలభద్రునితో నిట్లనియె. మిత్రమా! నాకిప్పుడు మా యన్ననుజూడ మిక్కిలి యాతురముగా నున్నది. కాలవ్యవధి సహింపనోప గావున జాగుసేయక వేగము నన్నతని యొద్దకు దీసికొని పొమ్మని పలుకుచు దొందరబెట్టుగా నతడును సంతసించి యతనితో నిట్లనియె.

తమ్ముడా! మేము నియమించుకొన్న సంకేత సమయము మూడుదినము లున్నది. అప్పటికి మనము సులభముగ బోగలము. అతండు నాటిదివసము సాయంకాలమున కచ్చోటునకు రాగలడు రమ్ము పోదమని పలుకుచు గతిపయ ప్రయాణముల బుష్పపురికి దీసికొని పోయెను బలభద్రు డందొకచోట బసజేసి తానుబోయి అదృష్టదీపుని దీసికొనివత్తుననియు నంతవరకు నీవిచ్చోట నివసించియుండు మనియు హరిదత్తునితో జెప్పి వారు సంకేత మేర్పరచుకొన్న స్థలమునకు బోయెను. ఇంతలో నూరక యింటియొద్ద కూర్చుండనేలయని హరిదత్తుడు చక్కనివేషముతో వింతలం జూచుటకు నంగడికి బోయెను. ఆ దివసము శుక్రవారమగుటచే బ్రియంవద కలహంసికతో గూడ బండియెక్కి విహారశైలమునకు బోవుచుండ దారిలో హరిదత్తు డెదురు పడుటయు శకటగవాక్షరంధ్రంబులనుండి చూచి కలహంసిక గురుతుపట్టి, అక్కా! అదిగో! చూడుము చూడుము నీ ప్రియుం డేగుదెంచినాడని చూపగా జూచి ప్రియంవద యంతకుమున్ను విరాళింగుందుచున్నది. కావున మిక్కిలి సంతోషముతో బండి యాపించి కలహంసికను బండి దింపి గ్రీడాశైలమున కతని దీసికొని రమ్మని చెప్పి తాను బండి తోలించుకొని యచ్చటికి బోయినది.

కలహంసికయు నతనిని మును తాను జూచిన యదృష్టదీపుండే యనుకొని మెల్లగా జెంతకుబోయి నమస్క రించినది. అతండును తెల్లబోయి లోకాచారప్రకారము దీవించెను. అదియు జిరునగవుతో దేవరవా రెప్పుడు దయచేసినారని యడుగగా నీ దినము ప్రాతఃకాలమున వచ్చితినని యుత్తరము చెప్పెను పిమ్మట నది దేవా! మీ రిన్నిదినము లాలస్యము చేయవచ్చునా? మీ కొరకు మానెచ్చలి పచ్చవిల్తుని తూపుల రాయిడికిం దాళలేక దినమొగయుగముగా గడుపుచున్నది ఇప్పుడే క్రీడాశైలమునకు బోయినది. మనమచ్చటికి బోవుదమురండు. నన్ను గురుతుపట్టితిరా? క్రొత్తగా జూచుచున్న వారు! నేను దేవర దాసిని కలహంసికననుటయు హరిదత్తుడు అద్భుతబంధువార్తశ్రవణంబునంజేసి యగ్రజదిదృక్షస్వాంతమున నిత్యావృత్తాంతరీతుల నంటనీయమిం జేసి పూర్వస్మృతి యించుకయేనియులేక యంతకుమున్ను తానాపట్టణమునకు వచ్చినదియు బ్రియంవదను పెండ్లియాడదలచినదియు, జెఱసాలనుండి దప్పించుకొని పోయినదియు మరచిపోయి యది మరియొక పట్టణముగా దలంచియున్న వాడు గావున రాజపుత్రులకు దరుచు విస్మృతి సహజమైయుండుటం బట్టియు బలభద్రు డచ్చట జరిగిన చర్య లన్నియు దెల్లముగా జెప్పకపోవుటచేతను విస్మయం యభినయించుచు దాని మొగము నిదానించి చూచి యల్లన నిట్లనియె.

కాంతా! నీ ప్రసంగము చక్కగా నున్నయది. నేనెవ్వడ ననుకొని యిట్లనుచున్నదానవు. నీవు నాతో నింతకుముందెన్నడేని మాట్లాడితివా! నీ సఖురా లెవ్వతియ? నా కొరకు విరాళిగుందనేల? నన్ను గురుతుపట్టజాలక యిట్లనుచున్నదానవని పలకగా గలహంసిక దెల్లబోయి యుల్లము ఝల్లుమన, నౌరా! హరిదత్తా! నిన్ను నేను యెరుగననుకొంటిరా! నీటక్కరిమాటలకేమిలే. రమ్ము పోదము మన రాకకు వాకోకస్తని వేచియుండునని పలికినది.

అప్పుడతండు మరియు వెరగందుచు భళిరే! ఇది మిక్కిలిచిత్రముగా నున్నది. ఈ చిన్నది నా పేరుగూడ చెప్పుచునే యున్నదే! దీని నేనెప్పుడును జూచిన జ్ఞాపకము లేదు. ఈ యూరి మహిమ యిట్టిది కాబోలునని మనంబునం దలంచి దానితో మానినీ నీదారిని నీవు పొమ్ము. నేను నీతో వచ్చువాడను కాను. నీకు నా పేరెవ్వరు చెప్పిరి నన్ను నీవిదివర కెట్లెరుంగుదువని యడుగగా నది పరిహాసమునకే యట్లనుచున్నవాడని కాలక్షేపము సహింపక నిసుగుకొనుచు నిట్లనియె. ఆర్యా! నిన్నటివరకు నేనెరుగను. ఇప్పుడే చూచితిని. నీవు నాతో నింతకుమున్నెప్పుడును మాట్లాడియుండలేదు. నీపేరు నేను దివ్యజ్ఞానమున దెలిసికొంటిని. నీతో గొంచెము మాకు బనియున్నది. మీ వంటివారు పరోపకారమునకు బాటుపడరా? కావున నొకసారి యాయుద్యానవనమువరకు రండని వేడుచున్న సమయములో బ్రియంవద ఎక్కి వెళ్ళిన గుర్రపుబండి అచ్చటికి వచ్చినది

అందున్నదాది కలహంసికతో, దరుణీ! భర్తృదారిక మీ కొరకే బండి యంపినది. నీతో నెవ్వరినో తీసికొని రమ్మని చెప్పినదట. వారిని దీసికొని వడిగా రమ్మని చెప్పినది. కేళీశైలప్రాంతమందలి యుద్యానవనములో నున్నదని చెప్పను అప్పుడు హరిదత్తుడు విభ్రాంతస్వాంతుడై దానిమాటలచే నేమియుదోచక తలపై కెత్తి యాలోచించుచున్న సమయంబున నతనిచేయి పట్టుకొని అది ఆర్యా! రమ్ము రమ్ము నీవేలాగైనను రాకతప్పదు. నిన్ను విడచి పోవుదానను కానని పలుకుచు బండిలోనికి లాగికొని పోయినది.

అతండు దానితో గూర్చున్న వెంటనే యాబండి తోలించుకొని యాకలహంసిక తృటిలో నుద్యానవనము లోనికి పోయినది. వారిరాక కెదురు చూచుచున్న ప్రియంవదయు నా బండి చప్పుడు వినినంత సంతోషముతో గొంతదూర మెదురుగా గొందర జెలికత్తెల నంపినది. వారును బుష్పమాలికలు గొని యెదురుగాబోయి కలహంసికతో వచ్చుచున్న అతని మెడలోవైచి పాదంబులుగడిగి తడియొత్తుచు వింజామరల వీచుచు ఛత్రంబు పట్టి వెనుక నడువదొడంగిరి.

అదియంతయు గాంచి అతండు విభ్రాంతుండువోలె జూచుచు అయ్యో! వీరు నన్నేమిచేయుదురో? ఇది కలలాగున దోచుచున్నది. లేక యింద్రజాలమో! నా స్నేహితుడు బలభద్రుడుగూడ మోసగాడు కాడుగదా? కానిమ్ము దైవమేమి చేయ దలచుకొనియెనో యట్లు కాకమానదుగదాయని అంతలోనే ధైర్యము దెచ్చుకొనుచు నీరీతి గొంతసేపు పలుతెఱంగుల స్వాంతమున దలపోయుచు నాకలహంసికతో నడిచెను. కలహంసికయు అతనిని గ్రమంబున బ్రియంవద యున్న లతాగృహంబునకు దీసికొనిపోయి యందమర్చిన పూవు పాన్పున గూర్చుండబెట్టినది

అతండప్పుడు కలహంసికతో బోఁటీ! ఈపాటికి నాతోనున్న పనిచెప్పి నన్ను విడిచి పెట్టుము. నా కొరకు నామిత్రుడు వేచియుండును. మీరందరు నిచ్చటికేల వచ్చితిరి. యింతగా నన్ను గౌరవించుటకు నేను మీకేమి కావలసినవాడను. ఇట్టి యాపదలు యిదివరకొకటి రెండనుభవించితిని. బలభద్రుని మూలమున నవి దాటితిని. ఇప్పుడు మరల దటస్థించినది. వేగమె నన్ను బంపుడని పలుకగా విని కలహంసికతో మాటుగా నిలువంబడి ప్రియంవద యిట్లనియె. చెలీ! ఆర్యపుత్రునకు మనయందనురాగము తప్పినదా యేమి? యీయన మాటలు మరియొక రీతి నున్నవే! యింతకాలము జాగైనందులకు జింతించుచున్న మనల నోదార్పక యెద్దియో పలుకుట యుత్తమ ధర్మమా? భవాగమనం బభిలషించు చాతకమువలె వారి రాక మనము వేచియుండ దిరస్కరింప వలయునా? తెలిసినది. తమ్ము మొదట అవమాన పరచితిమని కాబోలె పూర్వరాజకన్యల దలంచుకొనిన అది తప్పని తోచదు. శపథభంగము క్షత్రియధర్మము కాదుగదా? నా యపరాధములన్నియు మన్నింప మ్రొక్కుచున్నదాన రక్షింపుడని పలుకుచు దటాలున జనుదెంచి అతని పాదంబులబడినది.

అప్పుడు మెరపు తీగియవలె దళ్కుమని మెరయుచున్న యా చిన్నదానిని జూచి మోహపరవశుండయ్యెను. పరకాంతయను వెరపు హృదయంబున నుత్తలపెట్ట నిట్టట్టు దెమల్చుకొని, అయ్యో! కాంతలారా! మీరెవరో తెలియకున్నది. పూర్వపరిచయ మున్నట్లు మాటలాడుచున్నవారు. మీ మాటలేమియు నా కర్దమగుటలేదు. నిజము జెప్పుడు. తరువాత దగు సమాధానము జెప్పెదనని పలుకగా విని అక్కలకంఠి యిట్లనియె. ఆర్యా! నీ వెరిగియుండియు నిట్లడుగుచున్న మే మేమి చెప్పుదుము. నీవు నాకొరకు మొదటినుండియు నెన్నిపాట్లు పడితివి. బందీగృహవాస మనుభవించితివికదా? తుదకెట్లో నా ప్రశ్నమునకు సమాధానము చెప్పితివి. అట్టి సమయములో దీక్షాకైతవంబున మితిగోరి యెచ్చటికో బోయితివి. అన్నియు జేసి యిప్పుడు నే నేమియు నెఱుగ ననుచుండ మే మేమి జేయగలవారము నీ పేరు హరిదత్తుడగునా కాదా? నీవు వ్రాసిన యుత్తరము గూడ గలదు. కావలసిన దెప్పించెదనని పలికిన అతండొక్కింత ధ్యానించుచు నందులో గొన్ని చర్యలు తాను నడిపించినవే గనుక నిదానించి చివర జరిగిన కృత్యములు గురుతులేనందున మరల యిట్లనియె.

కాంతా! ఆ వృత్తాంతమేమియు అంతగా జ్ఞాపకములేదు. కొంత కొంత జరిగినట్లే యున్నది. దాన నేమియగు. నీవెవ్వని భార్యవు నీ తల్లిదండ్రులెవ్వరు? నీ పేరేమి? అని యడిగిన నమ్మగువయు దెల్లబోవుచు నోహో! యితండు నిజముగానే యిట్లనుచున్నడా యేమి? కలహంసికా! నాకు మెడలో పూవుదండవైచిన వాడితడే యగునా? బాగుగా గురుతుపట్టితివా? ఇతండిట్లనుటకు గారణమేమని అడిగిన నచ్చేడియ యిట్లనియె.

ఇంతీ! నేనంత వెర్రిదానననుకొంటివా యేమి? యితని నంతకు ముందు నుండియు నెఱుంగుదును. అతండిచ్చిన తాటిపండు ప్రశ్నలకు నీవుత్తరమిచ్చినప్పుడు దోసెడు రత్నములు కానుకగా దెచ్చి యిచ్చినవాడు యితడు కాడా? మనలను వెరపించుట కిట్లనుచున్న వాడు కాని మరియొకడు కాడని యా పైదలికి సమాధానము చెప్పినది అప్పుడు ప్రియంవద మరల నతనితో ఆర్యా! నీ వచనములన్నియు విపరీతముగా నున్నవి. అయినను నీవడిగితివి కావున జెప్పుచున్నదాన నా పేరు ప్రియంవద. మా తండ్రిపేరు రాజవాహనుడు. నేను హరిదత్తుడను వాని భార్యను. మనోవాక్కాయకర్మలచే నే నతనిని వరించితిని. యింతకన్న నేమియు నెఱుంగ. అతండు నా యిచ్చిన ప్రశ్నములకు సదుత్తరములిచ్చి నన్ను భార్యగా బడసెను. యీ మాటు దెలిసినదా యని యడుగగా నతండు విస్మయస్వాంతుడై మరల నిట్లనియె.

మదవతీ! మొదటి మాటలన్నియు నుచితముగా నున్నవి. కాని చివర మాటలకు నాకర్ధమైనది కాదు. హరిదత్తుడు నీ ప్రశ్నముల కెట్లు సమాధానము జెప్పెనో తెలియకున్నది. అతడు వ్రాసిన యుత్తరమున్నదని చెప్పితివి దాని నొకసారి రప్పింపుమని పలుకగా నక్కలికి తల కంపించుచు దిగ్గునలేచి సిగ్గువిడిచి బిగ్గర గౌగిలించుకొనుచు నాకీపాటి స్వతంత్రమున్నది. ఇక నీవేమి చేయుదువో చూతములే యని పలుకుచు అతని మొగము ముద్దుగొనుచు జెక్కుల నొక్కుచు పుష్పశయ్యపై జేర్చినది.

అంత మోహమాపుకొనలేక తరినరసి స్మరుడును విరితూపుల నిరువురను సరిగా గురిచేసి వేధింపుచుండ నా హరిదత్తుడేమియు మాటడలేక యాకోకస్తని చేయు కృత్యములకు బ్రతికృత్యములు గొన్ని గొన్ని గావించి యించుక నవ్వుచు, బువ్వుబోణీ నీ వెంతకైన సాహసికవు. నే నిదివరకు రెండు ప్రమాదములు దప్పించుకొంటిని. గాని యిప్పుడు దాటలేక పోయితిని. నిజముగా నీవు పరకాంతవు కావుగదా! నీయందు లగ్నమైన నా చిత్తమే కానట్లు చెప్పుచున్నది. అని యమ్ముదితను గారవించు సమయంబున దటాలున లేచి యా చిగురుబోడి అయ్యో! ప్రమాదము వచ్చినది. నేను క్రీడాశైలమునకు బోవుచు మిమ్ము జూచి యా మాట మరచి యీ యుద్యానవనము లోనికి వచ్చితిని. దేవిని సేవింప వేగమ బోవలయును. వివాహావధివరకు బ్రతి శుక్రవారము నిట్లు భువనేశ్వరీదేవి నర్చింపవలయునని మా గురువుగా రానతిచ్చిరి. నాటి నుండియు నియమము తప్పక నేటివరకు సేవించుచుంటిని. వేళ అతిక్రమించు చున్నది. నియమమున కంతరాయముగూడ వచ్చినది. మోహమాపలేక నూతనసమాగమము గనుక విస్మృతి నొందితిని కానిమ్ము . ఇప్పుడైన జ్ఞాపకము వచ్చినది. వేగమే పోయివచ్చెద. ఈ శయ్యయందు విశ్రమించియుండుడు. నా చెలులందరు నుపచారములు చేయుచుందురు. అని పలుకుచు దటాలున లేచి కలహంసిక నతని సేవార్థము నియమించి మరల బండినెక్కి అతివేగముగా గ్రీడాశైలమునకు బోయినది.

యథాప్రకారము బండి యాకొండదండదిగి అప్పడతి వడివడి పూజాద్రవ్యములుగల సజ్జచేతంబూని యగ్గిరిశిఖరమెక్కి తాను జపము చేసికొను ప్రదేశమునకు బోవు సమయములో దొందరచే నొక చిన్న రాయి కాలికి దగిలి తటాలున నేలం బడినది. అప్పుడు సజ్జలోనున్న పుష్పములు పత్రియు సజ్జ చేయి వీడినందున భూమి మీదంబడినవి. అయ్యిందుముఖియు జయ్యన బంతివలె లఘుగతిలేచి నేలబడియున్న పూవులను పత్రిని మరల సజ్జలోని కెత్తుకొనియెను. గోపా! వినుమల్లప్పుడదృష్ట దీపుడు భువనేశ్వరికి మ్రొక్కు సమయమున నదృశ్యౌషథీలత నేలంబెట్టి మరల వెదకిన గసంబడలేదని చెప్పితినిగదా? ఆ లత ప్రియంవదపడిన చోటనున్నది. కావున దైవవశమున నాపూవులతోగూడ నది తనచేతికి దగులుటచే దానినిగూడ నా పూజాపాత్రములోని కెత్తి యాసజ్జ జేతంబట్టుకొని అక్కాంత నడచునంతలో నాచెంత దేవీసౌధము గన్నుల పండువ గావించినది.

అప్పుడప్పుడతి మిక్కిలి వెఱగందుచు నోహో! ఇదియేమి చిత్రము. ఇంతకాలమునుండి యీ కొండకు నేను వచ్చుచుంటిని. కాని యెన్నడును నాకీమేడ గనంబడలేదే? ఇది యెవ్వరిది? ఇది మిగుల నద్భుతముగా నున్నదే! ఇందుగం విశేషము లేవియో చూచివచ్చెదంగాక అని నిశ్చయించుకొని యాసజ్జ చేతంబట్టుకొనియే యామేడలోనికి బోయినది. అందదృష్టదీపునికి గనంబడిన విశేషములన్నియు నా చిన్నదానికి గనంబడినవి. ఆ రత్నములు చూచే తన కతడు తెచ్చియిచ్చిన రత్నము లిచ్చటనే అని నిశ్చయించి యమ్మచ్చెకంటి విచ్చలవిడి అందుగల వింతలన్నియుం జూచి యతీశ్వరుడిచ్చిన ప్రశ్నము లీసౌధవిశేషములే అని యూహింపుచు నందున్న భువనేశ్వరీదేవి తన అభీష్టదేవత అని నిశ్చయించి తన సజ్జలోనున్న పూవులచేత నయ్యమ్మవారిని బ్రత్యక్షముగా నర్చించెను.

అప్పుడు యోషధీలత యప్పూవులతోగూడ నమ్మవారి పాదంబులం బడినది. కన్నులు దెరచి చూచినంత నాసౌధము ప్రియంవదకు గనంబడక అదృశ్యమైనది. ఆ సుందరియు యథాపూర్వకముగా నున్న శిఖరమును జూచి యాశ్చర్యమందుచు నదియొక యద్భుతమైన యింద్రజాలమని తలంచి యావిశేషములు తనసఖుల కెరిగింప నతివేగముగా బోవలయునని తలంచుచున్నంత నదృష్టదీపుడు పూర్వము బలభద్రునితో జేసిన సంకేతస్థల మదియే కావున నాసమయమున కచ్చటికి వచ్చెను.

అట్లొండొరులు తారసిలినంత నన్నెలంత యతని హరిదత్తుడే అనుకొని నమస్కరింపుచు ఆర్యా? మీరింతలో నిచ్చటికేల వచ్చితిరి. నేనును మీకొరకు వేగముగానే దేవినర్చించి వచ్చుచుంటిని ఇంతలో నాకొక విచిత్రసౌధము గనంబడినది. అది యిదివర కెన్నడును జూచినదికాదు. దానిలోనికిబోయి చూచితిని. ఆహాహా! అందలి విశేషములు చెప్పుటకు శేషుడైనను జాలడు నవరత్నములకు నదియే యాకరమని చెప్పవచ్చును. మీరు నా నెచ్చెలికిచ్చిన రత్నము లందలివే యని తోచుచున్నది. నేనట్టి విశేషములన్నియు జూచుచు నాసజ్జలోనున్న పూవులచే నమ్మవారి సర్చించితిని. ఇంతలో నదియంతయు నంతర్థానమైపోయినది.

ఇది యేమిమాయయో తెలియదని చెప్పగా నతడు గ్రహించి యయ్యువతి చేసిన చెయ్వులన్నియు నడిగి తెలిసికొని అచ్చటికిబోయి తానుగూడ నా లతను వెదకుచు బలభద్రుడు వడిగా గొండనెక్కు చుండుటయు నతని వెనుక రాజభటులు పోవలదు పోవలదు భర్తృదారిక మనోహరునితో విహరించుచున్నదని పలుకుచు వెనుకదరుముకొని వచ్చుచుండుటయు జూచెను. అప్పుడతండు ఓహో! రానీయుడు, రానీయుడు. ఆతడు మా మిత్రుడేయని హస్తసంజ్ఞచే వారిని వారించెను. ఆ సన్నగ్రహించి యాసన్నవర్తులగు రక్షకపురుషులు వానిని బోనిచ్చిరి.

అంతట బలభద్రుడు వనితాసహాయుండైయున్న యతనింజూచి యీతండు హరిదత్తుడా! అదృష్టదీపుడా! అను సందియముతో దాపునకు బోవుటకు వెరచుచుండగా జూచి అదృష్టదీపుడు మిత్రమా! రమ్ము రమ్ము. దవ్వుగా నిలచితి వేల? అన నతండు దాపునకు బోయెను, అప్పుడు ప్రియంవద పరపురుషసమాగమ శంకంజేసి యించుక గొంకుచు నోరగా బోయినది పిమ్మట బలభద్రుం జూచి అదృష్టదీపుడు గౌగలించుకొని తమ్ముడా! హరిదత్తునిజాడ నీకేమైనం దెలిసినదా! నీవు లేక పోవుటచే నాకేమియుం దోచినదికాదు సుమీ! ఇన్నిదినము లేయే చోట్లకు బోయితివి. ఏయే వింతలం జూచితివని అడుగగా నతండు నవ్వుచు అన్నా! నీ బుద్ధికి దైవసాన్నిధ్యము గలదుసుమీ? నీకు హరిదత్తునం దకారణవాత్సల్యము గలిగినందులకు నేనెంతయో వింతపడితిని. ఇప్పటికి దెలిసినది వినుము. హరిదత్తుడు నీ తమ్ముడు. మీ యిరువురకు రూపంబున నింతయేని బేధము లేదు. నేనును గ్రహింపలేక పోయితిని. కాంతిమంతియు నామె తండ్రియు జతురికయు నతనింజూచి నీవే యని భ్రమజెంది అతని బెక్కుచిక్కులంబెట్టిరి. రత్నపుగనిలో సామాన్యపు పాషాణమేల జనియించును. వారెన్ని గతుల నిర్బంధించినను బరకాంతయను వెఱపుతో వారి మాటలకు లోబడకుండె. నంతలో నేను బోయి వారి యనుమానము దీర్చి అతని నిచ్చటికి దోడ్కొని వచ్చితి. నిన్ను జూడ మిగుల వేడుకపడుచున్నవాడని తాను జూచివచ్చిన విశేషములును, సత్రములో గనంబడిన బ్రాహ్మణుని చరిత్రము, రత్నవతియను దాది చెప్పిన మాటలును నా మూలచూడముగా వక్కాణించెను.

అప్పుడు అదృష్టదీపుడు మేనంతయు జెమ్మటలుగ్రమ్మ గంపముతో, నేమేమి! నా ముద్దులతమ్ముడు హరిదత్తుడే? ఎంత ప్రియమైన వార్త వింటిని. ఈ దివసం బెంత సుదినము! నేడుదయముననే సుముఖుని మొగము జూచితిని! అత డెచ్చట నున్నాడు. మా తండ్రిని బందీగృహములో బెట్టిన దుర్మార్గుండెవ్వడో మరల జెప్పుము? ఆ రత్నవతి యెచ్చట నున్నది! నా తమ్ముని యుద్ధరించిన విప్రునివెంట దీసికొని రాక అచ్చట విడిచి వచ్చితివేమి? అయ్యయ్యో! మా తల్లి యెచ్చటనున్నదియో కదా! బాల్యంబున మా కెట్టి యిడుములు వచ్చినవి. కటకటా! నా మూలమున నింబవతి ప్రాణములు బోగొట్టుకొనియెనే అని అనేక ప్రకారముల విచారించుచుండ నతనితో బలభద్రుడు వెండియు నిట్లనియె.

అన్నా! గతమునకు వగచిన నేమి ప్రయోజన మున్నయది. ఇంతకును కాలము గదా మంచిచెడ్డలను గలుగజేయునది! అది యిప్పుడు మన కనుకూలమైనందున నన్నియు సమంచితముగా నున్నవి. యీ కాంత యెవ్వతె చిహ్నములఁబట్టి ప్రియంవద యని తలంచుచుంటి. ఈ వాల్గంటిని హరిదత్తునకు గూర్తునని యిదివర కనుచుంటివే. ఇప్పుడు ఆ మాటలు మరచితివా యేమి అని అడుగగా నతని కతండిట్లనియె. తమ్ముడా! మేరువు చలించినను నేను పట్టిన శపథమును విడుతునా? నేనిచ్చటికి వచ్చునప్పటికి ఆ మచ్చెకంటియు నిచ్చటనే యున్నది. నన్నెట్లు గురుతుపట్టినదో యెరిగినట్లు మాటలాడినది.

మరియు నోషధీలత యీ లతాంగి చేతజిక్కి జారిపోయినది. అది పడిన తావు గురుతు పట్టవచ్చును. దానికొర కాలోచింపుచుండగా నింతలో నీవు వచ్చితివి. అంతియ కాని యీ కాంతను నేను వరింపలేదని చెప్పెను. ఇట్లు వారిరువురు మాట్లాడుకొనుచుండగా నచ్చటికి గలహంసికతో గూడ హరిదత్తుడు వచ్చెను. వారిరువురను గాంచి అదృష్టదీపుడును వెఱగంది చూచుచుండెను ప్రియంవదయు గలహంసికయు సమానాకారములతో నొప్పుచున్న అన్నదమ్ముల జూచి యించుక భేదముగానక విస్మయలజ్జాసంభ్రమములు మనంబున బెనగొన నేమియు మూటాడక చూచుచుండిరి.

అప్పుడు కలహంసిక ప్రియంవద యొద్దకు బోయి, అక్కా! యిక్కాంతు డెవ్వడు. యింత యాలస్యము చేసితివేల? నీ వాలసింపగా హరిదత్తుడు పోయెదనని తొందర సేయగా నిచ్చటికే తీసికొని వచ్చితిని. అతండును హరిదత్తుని పోలికగానే యున్నవా డెవ్వడని యడుగగా నది యౌరా! ఇంత చిత్రము నేనిదివరకు చూచి యుండలేదు. ఈతడే హరిదత్తుడని నేను నమ్మి మాట్లాతిడిని అతండిచ్చటికే వచ్చెను గదా అని జాగు చేయుచున్నదాన నింతలో మీరే వచ్చితిరి. ఈతండెవ్వడో నేనెరుగనని జెప్పినది అట్టి సమయమున బలభద్రుడు హరిదత్తుని గురుతుపట్టి తమ్ముడా! ఇచ్చటి కెట్లు వచ్చితివి. ఈ కాంతతో నెట్లు మైత్రి గలసినది మీ అన్నగారిని జూడు మితడే యని చెప్పి అదృష్టదీపునికి గూడ వానిని జూపుచు నితడే నీ తమ్ముడు చూడుమని పలికెను. అప్పుడా యిరువురు నొండొరు లెరింగిన పిమ్మట అత్యంతానురాగముతో గౌగలించుకొనుచు బెద్దతడవు మైమరచి కన్నుల నానంద బాష్పములు గార మేనులు పులకరింప నెట్టకేల కెలుంగరాల్పడ అయ్యో! తమ్ముడా! మనమెంత దిక్కు లేని వారమైతిమి. అన్నన్నా! జన్మ ముత్క్రుష్టమైన దైనను మిక్కిలి దైన్యమనుభవింపవలసి వచ్చెనే! అని పలుకుచు దల్లినిగురించి యాలోచించుచు దండ్రిని గురించి విచారించుచు నీ రీతి కొంతతడవు నూతనసమాగమక్రియావిశేషకౌతుకం బనుభవించిరి.

పిమ్మట హరిదత్తుడు బలభద్రునిం జూచి అన్నా! నీవు నన్నిచ్చట విడచి వచ్చిన తరువాత నూరక గూర్చుండనేల నింతలో బురవిశేషములు చూచి వచ్చెదనని యూహించి అంగడికి బోయితిని. అచ్చట నన్నీ చిన్నది పూర్వమందెప్పుడో యెరింగినట్లు మాట్లాడి బలాత్కారంబుగా నన్ను బండిలో గూర్చుండబెట్టుకొని యీ ప్రాంతమందున్న యుద్యానవనములోనికి దీసికొని పోయినది. అందీ ప్రియంవద నన్ను ప్రియుండని పిలుచుచు నేమో కావించినది. ఇంతలో నీదేవీపూజ జ్ఞాపకము వచ్చినందున దటాలున లేచి నన్నందు నిలిపి యిచ్చటికి వచ్చినది.

ఎంతసేపటికి రాకుండుట విసిగి నేను బోయెదనని చెప్పిన నన్నీ కలహంసిక యిచ్చటికి దీసికొని వచ్చినది. యిచ్చట మీరు కనంబడితిరి. ఇదియే నీ వరిగిన తరువాత జరిగిన కథయని చెప్పెను. అదృష్టదీపుండును తన మనంబున దలంచుకొనిన ప్రకారము జరిగినందులకు మిక్కిలి సంతోషింపుచు దైవమును మెచ్చుకొనుచు, బలభద్రా! మనమిక జాగుచేయరాదు. తమ్ముని వెదకి తీసికొని వచ్చినట్లె తల్లినిం గూడ దీసికొనిరమ్ము. ముందుగా బ్రియంవదను దమ్మునికి వివాహము చేయవలయును. తరువాత బైకార్యములు చూచుకొందమని పలికెను. ప్రియంవదయు వారిరువురను జూచి యించుకయు భేదముగానక యాశ్చర్యమందుచు, గలహంసికా! ఇది యేమి చిత్రము! దేవమాయగా దోచుచున్నది. పూర్వము దమయంతిని వరించుటకు వచ్చిన దిక్పాలుర పోలికగా నిందెవ్వరో యిట్టి రూపమున వచ్చినట్లు తోచుచున్నది.

ఇందు నా ప్రశ్నముల కుత్తరము జెప్పిన వాడెవ్వడో నిరూపింపుము. వీరి వృత్తాంత మెట్టిదో చక్కగా దెలిసికొనుమని పలికిన నక్కలిహంసికయు వారి దాపునకుబోయి మ్రొక్కుచు నిట్లనియె ఆర్యులారా! మీరిరువురు నొక్కరూపున నున్నవారు. వీరన్నదమ్ములని తోచుచున్నది. మీలో మా మిత్రురాలు కోరిన ప్రియుండెవ్వడు? దాని ప్రశ్నములకు సదుత్తరములిచ్చిన బుద్ధిశాలిని నిరూపించి చెప్పుడు! ఇంతకుమున్ను యెఱుగక ప్రియుండని భ్రమజెందిన తప్పు మన్నింపవేడెదనని పలికిన విని యదృష్టదీపుం డిట్లనియె.

కాంతా! నీవు మమ్మడుగనేల? నీ నెచ్చెలి యెవ్వరిని వరించినదో వాడే ప్రియుండగుగాని యన్యుండెట్లగును. ఈ మాత్రమే తెలిసికొనలేదా? ఇటువచ్చి చూచుకొనుమని పలికిన నక్కలికియు గ్రహించి అచ్చటికి వచ్చిన వానిని గురుతు పట్టలేక విస్మయముతో జూచుచుండెను. అప్పుడు బలభద్రుడు అదృష్టదీపునితో, నన్నా! నీ మాటలలో నాకొక సందియము పుట్టుచున్నది. ఓషధిలత చేయిచిక్కినవాడే నిధులకధికారి యనియు బ్రియంవదకు బ్రియుండనియు నమ్మవారిగుడిలో వ్రాసియున్నది. కావున నది నీ చేత జిక్కెనుకదా! ప్రియంవదకు హరిదత్తుడెట్లు ప్రియుండగునని యడిగిన నతండొక్కింత ధ్యానించుచు హరిదత్తుని చేయిపట్టుకొని తమ్ముడా! రమ్ము ఇచ్చట నొకచెట్టు వెదుకవలయునని పలికి యతని నా దాపునకు దీసికొని పోయి అచ్చట నొకచోటబడియున్న నిర్మాల్యద్రవ్యములను జూచి గురుతుపట్టి యాపత్రిలో జేయి పెట్టించి వెదకించెను.

అప్పుడా లత హరిదత్తుని చేతికి దగిలినది. దానంజేసి మణిప్రభలతో వెలుగుచున్న యామేడ అతనికిం గనంబడినంత వెఱగందుచు. అన్నా! యిదియేమి చోద్యము. ఇప్పుడు నా కన్నుల కొకవింతభవనము గనంబడుచున్నది. యెచ్చటిదని అడుగగా గ్రహించి అప్పటి కతని చేతిలోనున్న యోషధి నంది పుచ్చుకొని, తమ్ముడా! యిప్పుడేమి కాన్పించుచున్నదని యడిగెను. ఆతండిప్పుడేమియు గనంబడుట లేదనియు మొదట గనంబడిన మేడ యదృశ్యమైనదనియు నుత్తరము జెప్పెను. అదృష్టదీపు డయ్యోషధీలతను విడువక దిట్టముగా బట్ట చెరగున మూటగట్టుకొని యందలి విశేషము లందరకును చూపదలంచి బలభద్రునితో, తమ్ముడా! నీవు చేసిన శంకకు సమాధానము దోచినది. చివరకీలత హరిదత్తునిచేతనే చిక్కినది. నేను తీసుకొంటిని కాన నయ్యనుమానము వదలినది. మరియు మీ కందరకు నమ్మేడలోనివిశేషము లన్నియుం చూపెదరండు. నన్ను బట్టికొని యుండుడని అందరికి బోధించి యొకరి వెనుక నొకరు బట్టుకొని నడచుచుండ గ్రమంబున నా ప్రాసాదములోనికి దీసికొనిపోయెను. అచ్చట నుండు వింతలను చూచుచుండ వారికది స్వర్గమనియు స్వప్న మనియు మాయయనియు దోచు చుండెను. అదృష్టదీపుడందలి వృత్తాంతము కొంత కొంత ప్రియంవదకు దెలిపి యా అమ్మవారి యెదుట హరిదత్తునిచే బ్రియంవద పాణి గ్రహింపజేసి తానుజేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనియెను. అప్పుడు హరిదత్తుడు ప్రియంవద చెయ్యిపట్టుకొని అమ్మవారికిని, అన్నకును నమస్కరించెను.

అదృష్టదీపుడు తమ్ముని దీవించి గారవించుచు, హరిదత్తా! నీవి మత్తకాశిని కొరకు బ్రాణత్యాగమున కొడంబడితివిగదా? దైవకృపచే నిప్పటికి గృతార్థుడ వైతివి! నా మనము చల్లనైయున్నది. నేడు మన యభీష్టదేవతలు ప్రసన్నులైరని పలుకగా నతండు చిరునగవు మొగంబునను మండనంబై యొప్పుచుండ నన్నతో నిట్లనియె.

సత్యవతి కథ

అన్నా! నేనీ ప్రియంవదను గామించి యట్టిపనికి బూనుకొనలేదు. బలవన్మరణము పాపమనియు నీరీతి మృతినొందిన నిరయము లేదనియు దలంచియే పూనుకొంటిని. అంత తెగువ యేల చేయవలయునంటేని వినుము. నన్ను మాపెంపుడుతండ్రి యింటిలో పోరు పడనేరక విద్యాభ్యాసకైతవంబున నన్నొక అగ్రహారంబున సోమశేఖరుడను పండితుని కప్పగించెను. నేనా యగ్రహారములో మధూకరవృత్తిచే జీవనము చేయుచు నాయనయొద్ద జక్కగా విద్యాభ్యాసము చేయుచుంటిని. నా బుద్ధికౌశల్యము, గుణసంపత్తియు దెలిసికొని మా యాచార్యుడు కొంచెము స్థితియున్నవాడు కావున గొన్నిదినముల కావృత్తి మానిపించి తన యింటనే భోజనసత్కారము చేయుచు జదువు జెప్పుచుండెను.

ఆయనకు బదియారేడుల ప్రాయముగల యొక కూతురు గలదు. దానిపేరు సత్యవతి. అది రూపంబునను గళాకౌశలంబునను ననన్యసామాన్యయై యున్నది. అట్టి చిన్నదానిభర్త పెండ్లియైన వెంటనే కాశికిబోయి యప్పటివరకు రానందున నా సుందరి పూర్ణయౌవనోదయమున జూచువారికి విచారము గలుగచేయుచుండెను. అట్టి సమయమున నే నచ్చట విద్యాభ్యాసము చేయుచుంటిని. దానికి మొదటనుండియు మంచివాడుకయే యున్నది. ఒకనాడు గురువుగారు రాత్రి భోజనముచేయుచు నెద్దియో పుస్త కము కావలసి పుస్తకాగారమునకుబోయి పుస్తకమును దీసికొని రమ్మని నన్ను నియమించెను.

ఆ గది కొంచెము మారుమూలగా నుండుటచే నేనొక దీపము చేత బుచ్చుకొని దానిలోనికి బోవుచుండగా సత్యవతి కొంతదూరమున కడ్డమువచ్చి నా చేతిలోని దీపము లాగికొని, అయ్యో! నీవు సహాయము లేక చీకటిలో బోయెదవేల? నేనుగూడ వత్తును నడువుమని పలుకుచు నాతోగూడ వచ్చినది. నేనును పుస్తకములకట్ట విప్పుచు వెదకుచుంటిని. ఆ సమయముననే యా చిన్నది, హరిదత్తా! నీవు కొక్కోకము మొదలగు లక్షణగ్రంథము లేమైనం చదివితివా? అని అడిగినది. నేను ప్రసంగమున నడిగినదని తలంచి అక్కా! చదివితినంటిని. ఆ గ్రంథమంతయు జక్కగా నావృత్తి యున్నదా అని అడుగగా నున్నదని యుత్తరము చెప్పితిని. అట్లయిన నేను వానిలో గొన్ని శ్లోకము లడిగెదను చదువగలవా? అనిన నేనప్పటికి బరీక్ష కడుగుచున్నదనియే తలంచి అడుగుమంటిని. అప్పుడీ క్రింద శ్లోకములు మొదలందిచ్చినంత నిట్లు చదివితిని.

శ్లో॥ ప్రాయోంగనానా! పురఏసతృప్రేర్బావావసానంపురుషాలంభంతె।
     ఇదంతువిజ్ఞాయతధోపచర్యాం యధాద్రదంత్యగ్రతఏవవార్యః।
     అభ్యర్చి తాబాహ్యర తేనభూయో యాదేశకాలప్రకృతీప్రతీత్య
     శ్లధాస్తరుణ్యప్రబలానునురాగాద్రవంతితుష్యంతిశీఘ్రమేవ॥

శ్లో॥ అంగుష్టే పవ గుల్ఫ జాను-జఘనే నాభౌచవక్షస్స్తనె।
     కక్షౌకంఠకపోలవంతవసనెనేత్రాళికేమూర్దని ।
     శుక్లాశుక్ల విభాగతోమమృగదృశామంగేష్వసంగస్థితొ
     హ్యూర్థా థోగమనేన వామపదగాఃపక్షద్వయెలక్షయేత్ ॥

శ్లో॥ బాలస్యాతీషోడశాబ్దాత్తదుపరితరుణీ త్రింశతిక్యావదూర్ధ్వం
     ఫ్రౌఢాస్యాత్పంచపంచాశదవవరతో వృద్ధతామెతినారీ
     బాలా తాంబూలమాలాఫలరససురసాహార సమానహార్యా
     ముగ్దాలంకారప్రముఖ వితరణైఃరజ్యతె యౌవనస్థా॥
     సద్భావారబ్ధగాడొచ్ఛటరతసుఖతా మధ్యమాకాలుబ్దా
     మృద్వాలాపైః ప్రహహ్టాభవతి గతవయాగౌరవెణాతి దూరం॥

అని యామె యందిచ్చిన శ్లోకములెల్ల జదువగా నవ్వుచు నిట్లనియె.

ఆమె - పురుషరత్నమా! నీవు లక్షణగ్రంథములు గట్టిగనే వల్లించితివి. లక్ష్యమెట్లుండునో తెలిసికొనవలయును. కనుక యెన్నియేండ్లవరకు బాల యనిపించుకొనును?

నేను - పదియారేండ్లవరకును.

ఆమె - తరువాత-

నేను - ముప్పదియేండ్లవఱకును దరుణియనంబడును.

ఆమె - బాలకేమి ప్రీతి?

నేను - తాంబూల మాల్యాను లేపనాదులు.

ఆమె - తరుణికో?

నేను - ఏమియుజెప్పక యూరకొంటిని.

ఆమె - సుందరుడా! నావంక చూడుము. నేను బాలనో, తరుణినో చెప్పగలవా?

నేను - నాకేమియుం దెలియదు.

అనుటయు నా చిన్నది నగుమొగముతో, హరిదత్తా? నీవు గ్రంథము చదివితివి కాని అనుభవమేమియు లేదుసుమీ! అని పలికినది అప్పుడు నేను అక్కా! ఇది మేమనుభవము కొరకు చదివినది కాదు. కావ్యలక్షణములకై చదివితి మని చెప్పితిని. అప్పుడప్పడతి అగునగు నీకు దాని అనుభవమే యుండినచో నింత చక్కనివాడవయ్యు నీ యౌవనమంతయు నూరకపోనిత్తువా? నీవు కోరిన నీ యూరిలో సమ్మతింపని మూఢకాంతయున్నదా? అని పలికినది. అప్పుడు నేను శివ శివా! రూపమును, విద్యయును దుష్టకార్యములు చేయుటకేనా! ఈ రీతి నెన్నడును తలంపగూడదని పలికితిని.

పిమ్మట అమ్మదవతి యీ మాటలకేమిలే! అబ్బిన అందాకనే. నీవింకను నాచవి చూచినవాడవు కావు కనుక నిటులనుచున్నావు. మహర్షులు గూడ నీ మోహములో బడిరను కథలను జదువలేదా యేమి? అని పలుకగా అక్కా! ఆ ప్రసంగ మిప్పుడేల? పుస్తకమును వెదుక నీదీపము తిన్నగా జూపుము. మీ యమ్మ పిలుచుచున్నటుల నున్నది దీపమందుంచి పొమ్మని బలుకగా అక్కలికి యించుక కొంకుచు అయ్యో! పోయెదనులే. నీతో నెన్నియో దినములనుండి యొక విషయము చెప్పవలయునని తలంచుకొని యుంటిని యెప్పుడును సమయము దొరికినది కాదు నేటికి దొరికినది. ఆ మాట నితరు లెవరును వినకూడదని పలుకగా నేను భయపడుచు నోహో! మోసము వచ్చుచున్నదే? ఈ చిన్నది యిదివరకు నీతిశాలి యయినను ఇప్పుడు చెదరినదని తోచుచున్నది. ఇంద్రియములు కడు చంచలములు గదా? ఎట్లైన నీయాపద దాటినజాలని తలంచుచు ధైర్యముతో అది యేమో చెప్పుమని పలికితిని.

అంత నన్నెలంత సిగ్గు విడచి నలుమూలలు తిరిగి చూచుచు మేను కంపింప సన్ననియెలుగుతో సుందరుడా! నేనొక్కటి చెప్పెద వినుము. భగవంతుడు ప్రజల సృజించుటయు అవయవము లిచ్చుటయు సుఖించుట కొరకేగదా? సుఖమన విషయాభిలాష యింద్రియవ్యాపారము సర్వజంతుసామాన్యమైనది. దానం జేసి పుణ్యాపుణ్యంబులు గలుగుననుట మనుష్యకల్పితము. తల్లిదండ్రు లెవ్వరికి కట్టిపెట్టినను వానిని దైవముగా జూడవలయుననిగదా శాస్త్రబోధ. అది యెంత యుక్తియుక్తముగా నున్నదియో చింతింపుము. వాండ్రు స్వల్పబుద్ధులయు అన్యాయము చేయబూనినచో గన్యబ్రతు కేమి కావలయును. అది నా మతము గాదు. మదవతి యౌవనంబున మొదట నెవ్వని వాంఛించునో వానిని దైవముగా జూచునది. వానిని విడచిన దోషము వచ్చును. ఇంత యేల? యిప్పుడు నేను పూర్ణయౌవనములో నుంటిని. నన్ను జిన్నప్పుడే యెవ్వనికో పెండ్లి చేసిరట. అది నే నెరుంగను. ఆ మూఢుడు కాశిలోనుండి విద్యాభ్యాస మేమిటికో చేయుచున్నవాడట !

నేను వానిని దైవముగా భావించి యేమి చేయదగినది? ఆకలి అగునప్పుడు గదా అన్నము తినవలయును. ఇంద్రియములనాప నెవ్వరితరము? ఇప్పుడు నిన్ను నేను కామించితి ననుకొనుము. తరువాత నిన్ను విడచితినేని యుత్కృష్టదోషము రాక మానదు. ఇదియే నా యభిప్రాయము నా మతములో నీవేకీభవింతువా లేదా? అని అడుగుచుండగనే గురువుగారు భోజనముచేసి లేచి వాకిటనిలచి, హరిదత్తా ! ఇంత యాలస్యము చేసితివేల? పుస్తకము దొరకలేదా యేమి? లేకున్న వచ్చి భోజనము సేయుము రేపు చూచుకొనవచ్చునని పలికెను.

ఆ మాట వినినతోడనే బెదరు గదుర నిదిగో! వచ్చుచున్నవాడినని పలుకుచు దటాలున లేచి అచ్చటికి బోయితిని. మా గురువుగారేమిరా యింత యాలస్యము చేసితివని అడుగగా బొత్తము గనంబడ నందున వెదకుచుంటినని యుత్తరము చెప్పితిని. నా వెనుకవచ్చిన యా చిన్నది నేను మరుగుబెట్టి చెప్పినందులకు సంతసించుచు నా మొగము జూచి నవ్వినది. నేను దాని నగుమొగము జూచి గుండె ఝల్లుమన నయ్యో! ఇదియేమి పాపము. నా యభిప్రాయ మీప్రోయాలు గ్రహింపకున్నది. మరల నేకతముగా దొరకినప్పుడు చెప్పెదనని తలంచుకొని యా రాత్రి భోజనముచేసి యథాపూర్వకముగా సరస్వతీమందిరములో బరుండి రెండుయామములు వరకు బాఠములు చదువుకొని నిద్రబోయితిని.

ఆ చిన్నదియు రాత్రి జక్కగా నలంకరించుకొని మనంబున గోరికలూర నేనున్న గదిలోకి వచ్చి దీపమారిపి నా యురముమీద వ్రాలినది. నేనును పిశాచమను వెరపుతో నరవబోయి అంతలో దాని మేని సుగంధంబు తావిం జేసి గురుతుపట్టి, అయ్యో! నే నిప్పు డల్లరి చేసినచో గురువుగారి కపకీర్తి వచ్చును. ఈ చిన్నదియు నింద పాల్పడును. కావున మెల్లగా జెప్పి పంపెదనని తలంచి లేచి కూర్చుండి అక్కాంత చేయి పట్టుకొని సంజ్ఞలచే నీ పని మంచిదికాదని చెప్పితిని. అదియు వేరొక అర్ధము చేసినది కాబోలు అందరును నిద్రబోవుచున్నవారు. మన కేమియు భయములేదు ఇష్టము తీర్చుకొనుట కింతకన్న నవసరము దొరకదని చెప్పినది. ఆ మాటలు విని నేను ఓహో! ఇది యిప్పుడున్మత్తయయియున్నది. దీనికేమి చెప్పినను నాటదు. తప్పించుకొని పోవుటకంటె మంచిమార్గములేదని యూహించుచు నది మీదబడుచు గౌగలించుకొన పోవుచుండ జేతులతో నాపుచు వాకిటకు పోయి చూచి వచ్చెదను నుండుమని దాని చెవిలో మెల్లగా నూదితిని. అది నిజమనుకొని నన్ను విడచినది. నేనును జీకటిలో దడుముకొనుచు వాకిటకు బోయినంత మాగురువుగా రచ్చటికి వచ్చి యెవ్వరని అడుగగా నేనని యుత్తరము జెప్పితిని. నీవకారణముగా నిట్లు వచ్చితివేమి అని అడుగగా బెదరుచు సరస్వతీమందిరములో దీపమారిపోయినది. వెలిగించటకు వచ్చితినని చెప్పగ నతండును దీపమిచ్చి మరల బోయి పరుండెను.

అప్పుడా చిన్నది యెట్లు తప్పించుకొని పోయినదో తల్లియున్న యింటిలోనికి బోయినది. అమ్మరునా డుదయమున లేచువరకు నా యొద్దకువచ్చి మొగము గడిగికొనుటకు నీళ్ళు దెచ్చి యిచ్చెను. మఱియు నూరక పలుమారు రాదొడంగినది. దాని చర్యలన్నియు హృదయంబున వెరపుగలుగజేయ దొడంగినవి. మఱియు నాలుగు దినములు గడచిన వెనుక నేను గురునానతి పుస్తకాగారమునకు బోగా దారిలో నడ్డము నిలిచి సుందరుడా మనకు మంచి సమయము దాటినది. ఆ దినము నీవు లేచి చూడకపోయితివేని ప్రమాదము వచ్చు సుమీ. ఇప్పుడు మంచి సమయము కాదు. నీ విచ్చటికి వచ్చుట చూచే వచ్చితిని. ఒకసారి చెక్కిలి ముద్దు బెట్టుకొని పోయెద గౌగలింతయైన యబ్బుటలేదు. ఎప్పుడు చూచినను విద్యార్థుల నడుమనే యుండెదవేమి? చాలులే నీ మూలమున నాకు నిద్రాహారములు లేకున్నవని పలుకుగా నేను, అక్కా! నా విషయములో నీవట్టి అభిప్రాయము గలిగియుండట తప్పు. నీవు నాకు గురుపుత్రికవు అక్క వగుదువు అదియునుంగాక నేను బరకాంత నంటువాడను కాను. నీవల్లరి పడియెదవని మెల్లగా జెప్పుచుంటిని. ఇక నిట్టియూహ విడువుమని చెప్పుచుండగా నది తల్లి పిలిచినందున నా మాటలు లెక్కగొనక తటాలున నా చెక్కులు ముద్దుపెట్టుకొని అవతలకు బోయినది. నేనును పాపభీతీచే నుల్లము ఝల్లుమన దుడుచుకొనుచు హరి హరీ అని పలుకుచు నా పుస్తకమును గొని మరల గురువునొద్దకు బోయితిని.

ఈరీతి బెక్కుసారులు నాకెదురుపడినప్పుడెల్ల తన అభిప్రాయము వెల్లడిచేయుచుండ నేను ద్రోసివేయుచుండువాడను. చివర కొకనాడు మా గురువుగారు గ్రామాంతరము వెళ్ళిరి. ఆ దినమున నా చిన్నది చక్కగా నలంకరించుకొనుట జూచి నేను మిక్కిలి భయపడుచు నేడేమి సాహసము చేయునో అని వెరచుచునే యుంటిని దైవ సంకల్ప మెవ్వడు తప్పింపగలడు?

ఆ రాత్రి జివరకు నాకు నొంటరిగానే పరుండుట తటస్థించినది. తల్లికి దానియందు నమ్మకము గనుక నెచ్చటికి బోయినను శంకించునదికాదు. అంతకు బూర్వము దాని నట్టిదానిగానే చెప్పవచ్చును. ఆ రాత్రి నేను బండుకొనిన కొంచెముసేపునకే ఘుమంఘుమితముగా బరిమళము వ్యాపింపగ నా యొద్దకు వచ్చి దీపమును మబ్బుచేయక నన్ను లేపుచు నేనును దల్లడిల్లి లేచినంత దన కౌగిటిలో బిగ్గరగా నదిమిపట్టి యిటునటు గదలనీయక గంఠంబు ముద్దుకొనుచు నీరీతి నల్లరిచేయ మొదలుపెట్టినది. అప్పుడు నేను మనంబు చలింపకుండ భగవంతుని ధ్యానము జేయుచు బ్రాణములుగ్గబట్టికొని దాని సందిటిలోనుండి తప్పించుకొనవలయునని యెంత ప్రయత్నము చేసినను దానికెంత బలము వచ్చినదో కదలలేక పోయితిని.

పట్టువిడచిన బారిపోవుదునని కాబోలు నది యెంత సేపటికిని విడిచినదికాదు. అప్పుడు నేను బాలా! నీవీ రీతి సతీధర్మమును విడుచుట మంచిదికాదు సుమీ! మీ తండ్రి యింటికి గళంకము తెచ్చి పెట్టుచున్నావు. దీన నేమియు లాభములేదు. నాకును నీకును వాసికాదు. నన్ను విడువుము. నేను నీ యభిలాషకు లోబడువాడను కాను నా వలన నీకేమియు బ్రయోజనములేదు. నిన్ను గుఱించియే నేను జింతించుచుంటినని యెన్నియో నీతులును సామ్యములు జెప్పితిని. కాని వానినేమియుం బాటింపక యా పాటలగంధి నా కిట్లనియె.

సుందరుడా! నా కిప్పు డించుకయు నొడలు దెలియుట లేదు. నీ నీతులేమియు నాచిత్తమున కెక్కవు పెక్కుదినములనుండి యవసరము చిక్కక యెన్ని యో చిక్కులు పడితిని. నేటికి నా పురాకృతము ఫలించినది. ఒక్కసారి నీయధరామృతము గ్రోలనిమ్ము. తరువాత నేమి చెప్పినను వినియెదను. బంధువులు వెలిబెట్టినను బెట్టుదురు గాక తల్లిదండ్రులు విడుతురుగాక. ఇట్టిసుఖము విడువనేర్తునే యని యధరరసంబాన నెన్నియో ప్రయత్నములు చేసినది. నేను దొరకనిచ్చితినికాను. నాకు దాని దప్పించుకొనుపాటి సామర్థ్యము గలిగియున్నను పెనంగినచో దాని అవయవములు ముట్టవలయునని యుగ్గబట్టుకొని యుంటిని. అంగస్పర్శ మాత్రమునకే యది సంతసించు చుండెను. నేనప్పుడు కామాహతకుని ప్రభావమును గురించి వే తెరంగుల దలపోయు చుంటిని. అదియు నా వీపు చుంబించుచు శిరమునం బొడుచుచు నీరీతి గొంతసేపు పెసంగి, పెసంగి చివరకు నాపలేక తటాలున పట్టువదలినంత నేను మృత్యుముఖంబు నుండియుబోలె నందుండి తప్పించుకొని పారిపోయితిని.

సత్యవతియు గొంతసేపు మరల నేను వత్తునేమో యని యింటిలో గూర్చుండెనుగాని యెంతసేపటికి నేను రానందున మిగుల కోపముతో నాయిల్లు వెడలి నలుమూలలు వెదకినది. నేను దానికి గనబడకుండ గాదిమూలను డాగియుంటిని. అప్పుడు దానికి మొదట నాయందెంత ప్రేమ గలినదో యంత కోపమువచ్చి నిరాస జేసికొని యావాకిటిలో నిలువంబడి, దుర్మార్గుడా! నీ కొరకు నేనెంత ప్రయాసపడివచ్చిన నిరసించితివే! ఇక నీ పాట్లు చూచుకొనుమని పలుకుచు వస్తువులు పారజిమ్మి తల విరియ బోసికొని మేను జీరికొనుచు అమ్మో! అని యరచినది ఆ ధ్వని వినినతోడనే దాని తల్లి జడియుచు వాకిటకువచ్చి యేమియని అడిగెను.

అప్పుడా సత్యవతి యేడ్చుచు తల్లి తో, అమ్మా! నేనేమి వక్కాణింతును. నీ మగడు వివేకములేక నిర్భాగ్యుని నింటబెట్టుకొనియెను వాడు నా మీదను మొదటి నుండియు గన్ను వైచి యుండెను. నేనది గ్రహించి తప్పించుకొని తిరుగుచుంటిని. ఈ రాత్రి నేను వాకిటికి వచ్చితిని. నీవు నిద్రలో నుంటివని లేపితినికాను. వీడది యేగతి గనపెట్టెనో తానుగూడ వాకిటకివచ్చి నా చేయి పట్టుకొని నిర్బంధింపగా వలదు వలదని నేనెన్నియో నీతులు జెప్పితిని. నా మాటలు లెక్క సేయక బలత్కారముగ నాపైబడి సమ్మతింపనందులకు గోపమువచ్చి మేనంతయు జీరెను. శిరోజములు గ్రహించెను. చూడుము నిన్ను బిలిచినంత బారిపోయి యెచ్చటనో దాగియున్నవాడు. నా తండ్రి యింటలేక పోవుటచే నా కిట్టి యాపద వచ్చినది అని బిగ్గరగా నేడువ దొడంగినది.

దాని యేడుపు వాడు చిక్కలేదనియే కాని మరియొకటి కాదు. అప్పుడు తల్లి కూతురినోదార్చుచు, హరిదత్తా! హరిదత్తా! అని నన్ను జీరినది. నేనును గాది మాటున నుండి అచ్చటికిబోయి యేమని అడుగగా నామె నన్ను దిట్టుచు నిన్నింట బెట్టుకొని జదువు చెప్పించుచున్నందులకు మంచిపనియే చేసితివిలే కానిమ్ము. నీ గురువు రానీ అని నన్ను మందలింపుచు నిరుగుపొరుగు వారిని కేకలు వైచినది. అప్పుడు వారు కొందరు వచ్చి అది చెప్పిన మాటలు నమ్మి నన్ను నిందింప దొడంగిరి. అంతకు మున్నది గుణవంతురాలని యెల్లరు చెప్పుకొనుచుందురు. కావున నేనేమి చెప్పినను లాభము లేకపోయినది నేను గాదిమాటున దాగియుండట దాని మాటలకే యుచితముగా నున్నది.

నేనును దప్పుచేసిన వానివలె దలవాల్చుకొని దైవకృత్యమునకు వగచుచు నెట్టకేల కారాత్రి వేగించితిని. ఉదయంబున సోమశేఖరుడు వచ్చినంత నా వృత్తాంత మంతయు భార్య చెప్పినది. అప్పు డతడు దుర్వాసునివలె మండిపడుచు నన్ను జీరి, యోరీ! కృతఘ్నుడా! తృణచ్ఛన్న కూపంబువలె గుణవంతుని పోలిక నొప్పుచుంటివే దరిద్ర చూడామణివైన నిన్నంటబెట్టిన నెట్లు సేయుదువు? నీ పోలిక పుస్తకము తీసికొని రమ్మని చెప్పి యంపినప్పుడును నర్థరాత్రము బైటకు వచ్చినప్పుడును ననుమానించితిని. ఆ సమయములలో నిర్బంధించితివనిగూడ మా సత్యవతి చెప్పుచున్నది. ఆసతీతిలకము నీ అందమునకు లోభించు ననుకొంటివి కాబోలునని పెక్కు తెరంగుల నిందించుచు మా యింటినుండి లేచిపోమ్మని దుడ్డుకర్ర తీసికొని కొట్టవచ్చెను.

అప్పుడు నేను దెబ్బలకు వెఱచి యిల్లు వెడలి పారిపోయితిని. నన్ను జూచిన వారెల్ల నన్నే యన్యాయము చేసినవానిగా భావించి నిందింప దొడంగిరి. అప్పుడు నేను దైవమును దిట్టుచు నిష్కారణము ప్రజలు నన్ను నిందించుచుండ బ్రతికియుండటకన్న మృతినొందిన యుక్తముగా నుండును. సత్యమునందు భగవంతు డుండునను మాట అసత్యమైనది. దైవమును వంచించుటకు సమయుటకన్న వేరొండుపాయములేదని యూహించి చాపుకొఱకు పెక్కుమార్గము లూహింపుచు దైవగతి నీయూరుజే రియిందీవృత్తాంతము విని నేనా ప్రశ్నలకుత్తరము జెప్పెదనని పూనుకొంటిని. ఇంతియేకాని ప్రియంవద యందుగల మక్కువచేతగాదు అని చెప్పగా అదృష్టదీపుడును తక్కినవారు ఆతని చిత్తనైర్మల్యమునకు మిక్కిలి సంతసించిరి.

అదృష్టదీపుడట్లు దేవీసౌధము తనయధీనము చేసికొని దానిలో గొన్ని రత్నములు బంగారము గైకొని అచ్చటనుండి వారితో గొండ దిగి బండియెక్కి మిగుల వైభవముతో రాజవాహనుని కోటలోనికి వచ్చెను. రాజవాహనుడును పుత్రికచే నతం డదృష్టదీపుడనియు అతని తమ్ముడు హరిదత్తుడనియు తెలిసికొని మిక్కిలి సంతసించుచు అతని పాదంబులంబడి తెలియకచేసిన యవజ్ఞను సైరింపుమని వేడుకొనెను. ఆ వార్త అంతలోనే పట్టణమంతయు వ్యాపించినది. అదృష్టదీపుడు వచ్చెనని విని నంత యాచకులు బ్రాహ్మణులును వేనవేలు ప్రోగుపడిరి. అదృష్టదీపుడప్పుడు గొప్ప శిబిరములను దెప్పించి కేళీశైలమున వేయించి అది నెలవుచేసికొని దేవీభవనమునంగల వస్తువులును, మణులును లోహములు నదివరకు దనకొరకు దీర్థములవెంబడి తిరుగుచున్న బ్రాహ్మణులకును, దరిద్రులకును దానముచేయదొడంగెను. దేవీసౌధమునంగల ద్రవ్యమంతయు అక్షయమైనది గనుక నతండెంత ద్రవ్యము గరుచుపెట్టినను కొదవ లేకున్నది. అదృష్టదీపుడు పుష్పపురిలో దమ్మునికి వివాహము చేయుననువార్త జగంబంతయు వ్యాపించినందున భూమియందుగల విద్వాంసులందరును అచ్చటికి రాదొడంగిరి.

ప్రియంవదా హరిదత్తుల వివాహము

వచ్చినవారినతండు కుబేరులంజేసి యనుపుచుండెను. దానితో నిది యొక రత్న మిచ్చెనేని గోటీశ్వరు లగుచుందురు. తరువాత అదృష్టదీపుడు ధర్మపురినుండి రత్నపతిని బ్రహ్మావధానిని బిలిపించి వారివలన మరల నెరుగనట్లు తమ పూర్వవృత్తాంతము దెలిసికొని మిక్కిలి విచారింపుచు దల్లిదండ్రుల చెఱ విడిపించుటకై ప్రయత్నించి కాంతిమతిని జతురికతో గూడ అచ్చటికి రప్పించి యుచితసంభాషణలచే నోదార్చెను.

మరియు ధర్మపాలుని భార్యయగు సునందజాడ జెప్పినవానికినిగాని, యామెను దీసికొని వచ్చువానికిగాని నూరుకోట్ల దీనారములు గానుకగా నిత్తుమని ప్రకటించుటయేగాక ప్రతిగ్రామము నందును జాటించున ట్లాజ్ఞాపించెను. అదృష్టదీపుడు ప్రతిదినము నెచ్చటనున్నను నూరుకోట్ల బంగారము బ్రాహ్మణులకు దానము చేయు చుండుటచే అతని ఖ్యాతి పూర్వముకన్న భూమియంతయు నెక్కువగా వ్యాపించినది.

భుమియందుగల రాజులకందరకును రావలయునని యుత్తరములు వ్రాసెను కాని చోళదేశప్రభువగు వసురక్షితునికి మాత్రము వర్తమానము చేయలేదు. అంతకు బూర్వమునుండియు నృపతులందరకును అదృష్టదీపుని జూడవలయునని అభిలాష గలిగియున్నది. కావున నా వార్త వినినతోడనే తమకుగల వస్తువాహనసామగ్రితో బయలుదేరి అతనియొద్దజేరిరి. వచ్చిన రాజులకు సుపచారములు జేయుటకు బెక్కండ్ర పరిచారకుల నియమించెను. ప్రతి భూపతియు అతండొక దివసము చేసిన విందు తమ జీతకాలములో నెరుగమని స్తుతిజేయదొడంగిరి.

వినినదానికన్న అతని యీవియెక్కుడుగా నున్నదనియు నిటువంటిదాత యిక పుట్టబోడనియు ఇతనికింత యైశ్వర్య మెచ్చటిదనియు అతండిచ్చు నొకమణి విలువ మనయైశ్వర్యమంతయు లేదనియు దమకు దోచినరీతిగా భూపతులు పొగడ దొడంగిరి అదృష్టదీపుడు ప్రకటించిన పదిదినముల కా సునందను వెంటబెట్టుకొని యొక బ్రాహ్మణుడు వారి యాస్థానమునకు వచ్చెను. ఆ వార్త రత్నవతిచే దెలిసికొని అదృష్టదీపుడు హరిదత్తుడును వేగముగా జనుదెంచి యా సునందంగాంచి యిరువురు చెరియొక ప్రక్కనుజేరి గౌగలించుకొనిరి. అప్పుడామె పాలిండ్లనుండి పాలు ప్రవాహముగా రాదొడంగినవి. వారిరువురు పుత్రులని తెలిసినప్పు డప్పడతి హృదయంబునం గల యానందము పట్టజాలక మగనిం దలచుకొని గోలుగోలున నేడ్చుచు నాయనలారా! మిమ్ములను గనటయే కాని మీ బాలక్రీడలను నర్మాలాపములను జూచుటకు నాకును, మీ తండ్రికిని యోగము లేకపోయినది.

దైవ మీరీతి మనకు వియోగము వ్రాసె నేమి చేయుదుము. కలిగియుండియు బేదలగతి జిక్కు బడితిరి. అన్నపానాదులవిషయమై సమయమునకు దొరకక యెన్ని చిక్కులంబడితిరో! మీ యాకలి యరసి పెట్టువారెవ్వరు! నేనేమి చేయుదును. దైవకృపచే జిక్కులంగడచి పెద్దవారైతిరి. నా కన్నులవాపు నేటికి తీరినదని శిరంబులు ముద్దుకొని తద్దయుం బ్రీతి గన్నుల బాష్పములు గార్చు తల్లినోదార్చుచు అదృష్టదీపుం డిట్లనియె. తల్లీ! నీవు వీరమాతవు సామాన్యకాంతవలె జింతింపదగదు. నీ విన్ని దినము లెవ్వనియింట నుంటివి. యెవ్వడు నిన్ను రక్షించెను. వాని బేర్కొనుము. వాని యిల్లంతయు బంగారము చేయుదును. మరి నీ కెవ్వడేని యువమానము గావించిన వాని హతము గావింతుము. నీ వృత్తాంతము దెలుపుమని యడుగగా అప్పడతియు గద్దియంగూర్చుండి కొడుకులు, కోడండ్రును, నాప్తులు జుట్టును బరివేష్టించి కొలుచుండ రత్నవతి మొగము జూచుచు నిట్లు చెప్పదొడంగెను.

సునందకథ

అల్లనాడు నే నరణ్యమధ్యములో బుత్రకునిం గని యొడలెరుంగక దాహము దెమ్మని రత్నవతికిం సంజ్ఞ చేసితిని కదా! రత్నవతి యుదకము దెచ్చుటకై యరిగిన వెనుక నాకు బరితాప మెక్కువైనది. అట్టి సమయమున నొక్కకోతివచ్చి నాయొడిలో నున్న ముద్దుపట్టి నెత్తుకొని పోవుచుండగా గన్నులార జూచుచుండియు వారించుటకు శక్తిలేమింజేసి చేతులు కాళ్ళును కదపలేక చింతించుచు మూర్చపోయితిని. ఇంతలో నాదారి నొక వర్తకుడు మణిమంతుడను వాడు అత్తవారి యింటియొద్ద నుండి పల్లకీమీద భార్యను దీసికొని వచ్చుచు దారిలో మూర్ఛ మునింగియున్న నన్ను జూచి దయామతి గావున జాలిపడుచు బిలిచి పలుకకున్నంత నన్ను గూడ నయ్యాందోళికమున నెక్కించుకొని తమపురికి దీసికొనిపోయెను.

ఇంటికడ మంచివైద్యుల బిలిపించి తగిన చికిత్స చేయించుటచే నాలుగు దినములకు స్మృతివచ్చినది. క్రమక్రమముగా బలము చేరినంత పుత్రకునికై చింతింపు చుండగా నాదంపతులు మిక్కిలి మంచివారు కావున నన్ను నిత్యము నోదార్చుచుండిరి. అని చెప్పినంత అదృష్టదీపు డతని పేరును వ్రాసికొని యప్పుడే యా మణిమంతుని యేనుగపై నెక్కించి తీసుకొని వచ్చునట్లు తగిన దూతల నంపెను. సునందయు దరువాయికథ యిట్లు చెప్పందొడంగెను. అట్లు నేనా మణిమంతుని యింటిలో సురక్షితముగా రెండుమూడు సంవత్సరము లుంటిని. అతని భార్య అంబిక అనునది నాయందు గౌరవముంచి నీచకృత్యములకు నియోగింపక సమానప్రతిపత్తిగా జూచుచుండెను.

అంత నొకనాడా యంబిక తమ్మునికి వివాహ మగుచుండ అమ్మహోత్సవమునకు నన్నుగూడ దీసికొని పోయినది. అచ్చటివారెల్ల నన్నామె దాసియని నీచ కృత్యములకు నియోగించువారు నేను బెద్దవారు చెప్పుచున్నవారు కదాయని తీసివేయ లేక యోపిక కొలది చేయుచుంటిని. నే నొకనా డుచ్ఛిష్టపాత్ర లెత్తుచుండ అందొక నీచుడు, ఏమే సునందా! దాసీకృత్యములు చేయనేల నన్నుంచుకొనిన నిన్ను మిక్కిలి గౌరవముగా జూతునని పలికెను. ఆ మాటలు విని నేను దలవాల్చుకొని దైవకృత్య మిట్టిదిగదా యని కన్నుల నీరు గార్చుచు నా కృత్యములు చేయుచుంటినని చెప్పుచుండగా బుత్రకు లిరువురు గన్గొనల అశ్రుధారలు గారుచుండ, అమ్మా! వానిం బేర్కొనుము. నాలుక ముక్కలు ముక్కలుగా జీరుదుమని బల్కుచుండ నా సునంద తండ్రులారా! వాని నిందింపనేల? మనకాల మట్టిది నేను నా యవస్థ చెప్పి మిమ్ము సైతము దుఃఖము పాలు సేయుచుంటిని వాని మాటలకు నేనేమియు బలుకక యూరకుండినంత నా మెత్తదనము గ్రహించి ప్రతి పురుషుడు అట్లే అడుగ దొడంగిరి. అప్పుడు నేను బోయి అంబికతో నాకథ యంతయుం చెప్పి నీవు వారిని మందలింపని నాడు నేనేమి చేయుదాన బలాత్కరముగా మృతినొందెదనని చెప్పితిని. అప్పుడామె నన్నోదార్చుచు నా బొజగుల నందరిని మందలించినది.

మరికొన్ని దినములు చనినంత మిక్కిలి ధనవంతుడగు వైదేశికుండను వర్తకుడు నన్ను కామించి అంబికను వేడికొనియెను నాబుద్ధి యెరింగినదైనను అయ్యంబిక స్త్రీచాపల్యంబునం జేసి యొకనా డేకాంతముగా నన్నుజేరి అతని గౌరవమును, భాగ్యమును, సౌందర్యమును బొగడుచు నిట్లనియె. సునందా! నీతో నే నొక్కటి చెప్పదలచుకొంటిని. నీవిప్పుడు నడిమి వయస్సులో నుంటివి. ఆప్తులెవ్వరును లేరు. కాలుసేతు లాడినంత సేపుగాని యితరులు పైన బోషింపరు కదా! వైదేశికుడను వర్తకుడు నిన్ను కామించి యున్న వాడు. అతడు కోటీశ్వరుడు. అతనికి భార్య చనిపోయినది. ప్రాయము కొంచెము మిగులుటచే తిరుగ బెండ్లియం దిష్టములేదు. సంతానము కలిగియున్నది.

అతని నీవాశ్రయించితివేని నీకు దగిన మర్యాద జరుగును. అతని యింటి కార్యములన్నియు నీవె చక్క బెట్టవచ్చును. అతడు మిగుల మంచివాడు. దీన నీకేమియు గొడవ యుండదు. అట్లుచేయుట నాయభిప్రాయము నేనున్నంతకాలము నీకేమియు లోటులేదు. కాని నా యనంతరము నీవేమి అగుదువో యని చింతించుచున్న దాన అతనిం జేరితివేని నా మనంబు సంతసించును. నీ యభిప్రాయమేమని అడిగినది. అప్పుడు నేను గన్నీరు గార్చుచు, అమ్మా! నీకు సైతము నాయందిష్టము తగ్గినది కాబోలు. నన్నెన్నడు నిట్టిమాట లనియెరుగవు. ఇదియు నా ప్రారబ్ధమే. ప్రాణములు పోయినను గులము చెడినను నా మనంబెప్పుడు నిట్టిపని కుద్యోగింపదని నమ్ముము. స్త్రీలకెన్ని దుర్గుణములున్నను పరపురుషసంగమము విడచెనేని యుత్తములని చెప్పుదురు.

పుంశ్చలియైన స్త్రీ యెన్ని నియమములు కలదైనను నింద్యురాలిగా జెప్పుదురు. శీలమువీడిన కాంత లోకాంతరములయందు నరకయాతనల ననుభవించును. ఎంతయాపదవచ్చినను శీలము విడువరాదు. శీలసంపన్నులైన చంద్రమతి ద్రౌపదీ ప్రముఖ సాధ్వుల చరిత్రము మనము వినియుండలేదా? నీవు మిగుల యుత్తమురాలవు. నీవిట్టిపనుల కెన్నడును నెవ్వరిని ప్రేరేపింపకుమని యొత్తిపలికితిని. నా మాటలచే నా పాటలగంధి సిగ్గుపడుచు నేమియుం బలుకలేకూరకుండెను. నేనును ఆమె చిన్నవోయినందుకు లజ్జించుచు మరల నామెకు సంతోషము గలుగుమాటలు పలికి రంజింప జేసితిని.

మరియు నేనారాత్రి పరుండినచోటునకా వైదేశికుడువచ్చి రత్నభూషణము జూపుచు సునందా లెమ్ము నేను వైదేశికుడ. నావార్త అంబిక నీకు జెప్పియేయుండును. నిన్నుత్తమస్థితికి దెచ్చెదనని చెప్పగా నేనా భయపడచు లేచి, అన్నా! నేనట్టిదాననుకాను. అంబికతో నా యభిప్రాయము చెప్పితిని. నీచకృత్యములుచేయుచున్న నన్ను గామించిన నీకేమి లాభమున్నది. మరియొకదానిని గోరుకొనుము. నేను నీకూతురువంటిదానను. నీకుకూడ పుత్రికలు గలిగియుండిరికదా? వారినడత చెడినప్పుడు నీకెట్టి విచారము గలుగునో నా విషయము నట్లే తలంపుమని పలుకగా నతనికి గోపమువచ్చి కన్నులెర్ర జేయుచు నాకిట్లనియె

ఓసిరండా! నీకును నా పుత్రికలకును సామ్యము దెచ్చుకొనిచుంటివే. నీవు చేయుకృత్యములు వారుచేయుచున్నారా! నీకును వారికిని హస్తిమశకాంతరముకలదు. మాయింటికి దాదిగావచ్చి పెద్దమాటలు చెప్పుచున్నావే. నీ టక్కులు నాకు దెలియును. నీవు సమ్మతింపనినాడు నిన్నుదన్ని మరియు దీసికొనిపోయెదను. మా మణిమంతుడు వెర్రివాడు కావున నిన్నూరక మేపుచున్నాడు. దుత్తలాగున దిని యేమిచేయుదువని పలుకగా రోషముతో నేనిట్లంటి. నీచుడా? నీవు భాగ్యవంతుడవని గర్వపడుచున్నవాడవు. నీ భాగ్యమంతయు నా కాలిగోరు విలువచేయదు. నీ మాటలకు నేను లోబడను నన్నూరక నిందింతువేని పాపము మూటగట్టికొని యెదవని పలుకగా నీసుబూని ఛీ ఛీ! రండా! ప్రేలెదవా! నా స్థితియెరుంగక మట్లాడుచున్నావని కాలెత్తి నన్నుదన్నెను.

ఆ తాపునకే నోపక నేలబడి మూర్చిల్లి యెట్టకే తెలిసి దైవకృత్యమునకు వగచుచుండ వెండియు వాడువచ్చి నిర్బంధించుచు నోటికిరాని కారు లరచెను. మరల బలాత్కారము సేయబోయినంత భీతస్వాంతనై యరచుచు నాప్రాంతమందున్న విప్రగృహమునకు బారిపోయితిని. అతడును నన్ను దరిమికొని వెంటవచ్చెను. నా మొరవిని యాయింటి బ్రాహ్మణుడు లేచి యేమి యేమి యని అడుగగా బాదంబుల బడి రక్షింపుమని వేడుకొంటిని. అతడును భయయులేదని చెప్పుచుండగా నా వెనువెంట నా వైదేశికుడువచ్చి బ్రాహ్మణుడా యారండ నిట్లు త్రోసివేయుమని పలికెను.

అతడును తొందరపడకుము ఇదియేమి తప్పుచేసినది? వైదేశికా! చెప్పుమని అడుగగా, నోహో! అదియంతయు నీకేల? నాస్థితి యెరుగుదువా? పంపకున్న నీపనిసైతము పట్టించెదజూడుమని చెప్పెను. అప్పుడా బ్రాహ్మణుడు వెరచుచు నన్ను విడువదలంచినంతలో నచ్చటనే అరుగుమీద బరుండియున్న రాజుకీయోద్యోగస్థుడొకడు నాయార్తి అంతయు నా వలనవిని జాలిపడి లేచి యావైదేశికునిమీద దిరుగబడి యెవ్వడ నీవు? అర్ధరాత్ర మిట్లు వచ్చి అల్లరిచేయుచున్నావని బెదరించెను. అతనిని జోరుల నరయుటకై ప్రచ్ఛన్నముగా భటులతో వచ్చిన దండనాయకుడని యెరుంగక సామాన్యుడని యూహించి యావైదేశికుడు ఓహో! నీవెవ్వడవు? కడుజులకనగా మాట్లాడుచున్నవాడవు. నా మర్యాద గురుతెరింగి పలుకుము. మీరందరు మా దాసిని యింటబెట్టుకొని యెదుర నన్నే బెదరింపుచున్నవారు. చూడుడు మిమ్మందర నిప్పుడు శిక్షింపజేసెదనని పలుకుచు దుడ్డుకర్రతో గొట్టవచ్చెను.

ఆ సమయమున నాయుద్యోగస్థుడు నోటితో నెద్దియో యూదిన యమకింకరులవంటి రాజభటులు పెక్కండ్రువచ్చిరి. వారింజూచి వైదేశికుడు జడిసి పారిపోవదలంచినంతలో వారతనిని బట్టుకొని పాదములకు నిగళములు దగిలించి వాడు చేసిన దుర్మార్గమును నావలన జెప్పించుకొని యాతని నగరికిం గొనిపోయి బందీగృహంబున వైచిరి. నేనును గొన్నిదినములా బ్రాహ్మణుని యింటనుండి వెండియు వేరొక రాజధాని జేరి యెవ్వరియింటనుండక వెర్రిదానివలె తలవిరియబోసి మేనంతయు ధూళిరాచికొని బిచ్చమెత్తుకొనచు నా యూరిలో నొకదేవాలయమున రాత్రులు శయనింపుచు మరికొన్ని దినములు దేశయాత్ర నడిపితిని.

ఒకనాడు సాయంకాలమున నేనా గుడిలో నుండగా గొందరు బ్రాహ్మణులు వచ్చి యొండొరు లిట్లు సంభాషించుకొనిరి వెంకటశాస్త్రి! యీ యూరిలో నేడు చాటిం చిన విశేషములు వింటివా! ధర్మపాలుని పత్నియైన సునంద నెవ్వరైన దీసికొని వచ్చినచో నూరకోట్ల బంగార మిత్తునని యదృష్టదీపమహారాజుగారు ప్రకటించిరట. ఆమె మనకు దొరకిన మన దరిద్రము దీరునుగదా. అనగా మరియొక బ్రాహ్మణుడు మన కంత మాత్ర మదృష్టము పట్టునా? ఆమె పోలిక యెట్లుండునో చెప్పిరా? అన మరియొకడు పేరును బట్టియే యూహింపవలయును. నాకామె గనంబడినచో నీ స్వామికి లక్షపత్రిపూజ జేయింతుననియె. వేరొకడు సత్యనారాయణవ్రతము. ఇంకొకడు దీపారాధన. ఈ రీతి నందరును మ్రొక్క మొదలు పెట్టె.

ఆ మాటలు నేను విని సంశయమందుచు నాయదృష్టదీపునికి నా యవసర మేల వచ్చె? అతడు నా కొమరుండు కాడుగద? నాకంత యదృష్టము పట్టునా? ఇతరులకు నా పని యేమి? అంత విత్తము కరుచుపెట్టనేల? అని యాలోచింపుచుండ సవ్యబాహువును నేత్రమును దౌడయు నదరినది. ఆ శకునములు గ్రహింపుచు సంతోషముతో నుండి యా బ్రాహ్మణుల దీనాలాపములు నాకు సంతాపము గలుగజేయు చుండ నందులో నొక వృద్ధబ్రాహ్మణుని జీరి యిట్లంటి. అయ్యా! తమరిట్లు సునంద కొరకు బరితాప మొందుచున్నారు. ఆమెతో మీకేమి ప్రయోజనమున్నది. ఆమె యున్న జాడ నేనెఱుంగుదును రేపువచ్చిన జెప్పెద ననుటయు నా మాట విని యందరు చుట్టుకొని చెప్పుము, చెప్పుమని ప్రార్థింప దొడంగిరి.

నేనును రేపు వచ్చిన జెప్పెదనంటిని నన్ను బిచ్చదానిగా గుర్తెఱింగిన వారందుండుట జేసి యిస్సిరో! ఇది వెర్రిది దీని మాటలు నమ్మి తిరుగ వచ్చితిమి. రండు పోదమని అందరు నవ్వుచు బోయిరి. ఈ బ్రాహ్మణుడు మాత్రము నన్ను విడువక అమ్మా! నేను మిక్కిలి దరిద్రుడను కుటుంబము పెద్దది. పోషింపలేక కడు చిక్కులు పడుచుంటిని. నన్ను రక్షించి యామె యున్న జాడ జెప్పుమని యారాత్రి యింటికిబోక నన్ను వేడుకొనుచుండెను. అప్పుడు నాకు జాలివొడముటచే నెన్నియో మాటలు సెప్పి చివరకు నేనే సునందనని జెప్పితిని. మొదట నమ్మలేదు కాని యతడు నా చరిత్రమంతయు జెప్పినంత సంతోషింపుచు నెవ్వరికిని జెప్పక యారాత్రియే ప్రయాణముజేసి యిచ్చటికి దీసికొనివచ్చెను. ఇదియే నా వృత్తాంతము. ఈ విప్రునకు మీరిత్తుమన్న ధన మియ్యవలయునని పలుకుచు మగని గురించి విచారింపదొడంగినది.

అప్పు డదృష్టదీపు డామె నోదార్చుచు నాబ్రాహ్మణునికి నూరుకోట్ల ధనమిచ్చి మరియు నాసంతోషముతో ననేకదానములుచేసి మిగుల వేడుకతో నాదినము గడిపెను. మరునాడు రాజులనందరం బిలచి సభఁజేసి యిప్పుడు మేము చోళదేశ ప్రభువైన వసురక్షతుని మీఁదికి యుద్ధమునకుఁ బోవుచుంటిమి. కావున మాకు సహాయ మెవ్వరు వత్తురని అడుగఁగా నందరును ముందే ప్రయాణమైరి. ఆతఁడు దుర్మార్గుఁడనియుఁ గపటోపాయములచే శత్రువుల వంచించెననియు నందరు నెరుంగుదురు. కావున నతనిపై దండయాత్రకుఁ బోవుటకు రాజులందరును మిక్కిలి సంతోషించిరి పిమ్మట మంచి సమయమునఁ జతురంగబలములతో నదృష్టదీపుఁడు చక్రవర్తులందరు సేవింప దాడివెడలి యా దేశమునకుఁబోయి పట్టణము ముట్టడించెను.

వసురక్షితుఁడా వార్త చారుల వలన విని యదృష్టదీపుఁడు ధర్మపాలుని కుమారుఁడగుటచే నతినిం జయించుట గష్టమనియు సంధి కొడఁబడ డనియు నిశ్చయించి పారిపోవఁ బ్రయత్నించెను. కాని యా రహస్యము దెలిసికొని యదృష్టదీపుఁ డతనిఁ బట్టుకొని తండ్రి యంఘ్రులం దగిలించియున్న సంకెళ్ళు విప్పించి అతని పాదములం గట్టించెను. ఆహా! కుమారుండన నతండే కదా! చింతాకులస్వాంతుఁడై యున్న ధర్మపాలుని యొద్దకు బోయి పుత్రకులిద్దరును పాదంబులఁబడి తమ వృత్తాంత మంతయు జెప్పి అతని కానందము గలుగఁజేసిరి

ధర్మపాలుఁడును పుత్రుల గారవింపుచుఁ దన యదృష్టమును గురించి భగవంతుని స్తుతిఁజేసెను. పిమ్మట నదృష్టదీపుఁడు దుర్వినీతుడును విహారభద్రుఁడు దెచ్చెటనున్నారని విమర్శింపగాఁ దమ రాజధాని యైన కౌశింబి యేలుచున్నారని తెలిసినది. అప్పుడు మిక్కిలి కోపముతో దండు లేవనెత్తి కతిపయప్రయాణములఁ గౌశాంబికిఁ బోయి వారినిద్దరిని బట్టుకొని కారాగృహమునం బెట్టించి సుముహుర్తమునఁ దమ కోటలోఁ బ్రవేశించి పట్టాభిషిక్తుడై సమస్తభూపతులకు వెలలేని రత్నములు గానుకల నిచ్చి నిజనివాసముల కనిపెను. మరియు నతండు వినయకేతుని వెదుకఁబంపి అతనిని రప్పించి అతని బుద్ధికిని సుగుణములకు మెచ్చుకొనుచు మరల నతనికి ప్రధానోద్యోగ మిప్పించెను.

దుర్జనుల రక్షించుట లోకమున కపకారమని తలంచి యాకోటద్వారమందు మంటపము గట్టించి దానిమీదఁ నడ్డముగా దూలములు వైచి విహారభద్రుని దుర్వినీతుని గొలసులచేఁ దలక్రిందుగా వ్రేలఁగట్టించి చిత్రవధ చేయించెను.

మరియు వారి శరీరముల మేదోమాంసముల నెండగట్టించి యెద్దియో యోషధి రాచి చిరకాలము దుర్జనులకు బుద్ధి వచ్చునట్లట్లనే యుండ నియమించిరి. గోపా! నీవు చూచినవారు విహారభద్రుఁడును. దుర్వినీతుఁడునులే! దానఁ బట్టియే "దుర్జనులకు బుద్ధివచ్చు పని" యని దానిపై వ్రాసిరి. ఇదియే దీని వృత్తాంతమని మణిసిద్ధుఁడు చెప్పి సంతోషపారావారంబునం దేలుచున్న శౌనకునితో బయలుదేరి తరువాయి మజిలీ చేరెను.

మాలిని. నిరుపమగుణభూషా! నిత్యసంతోషవేషా!
            సురగురమునిపూటా! స్తోత్రసంసక్తతేజా!
            నరహరిసదబిఖ్యా! నందితాదిత్వముఖ్యా!
            స్థిరతరగునుకీర్తీ! దేవతాచక్రవర్తీ!

గద్య. ఇది శ్రీమద్విశ్వనాథ సదనుకంపాసంపాదితకవితా విచి

త్రాత్రేయమునిసుత్రామగోత్రపవిత్రమధిర కులకలశజల

నిధీరాకాకుముదమిత్ర లక్ష్మీనారాయణపౌత్రకొండ

యార్యపుత్రసోమిదేవీ గర్భశుక్తముక్తాఫల

విభుధజనాభీరక్షిత సుబ్బనదీక్షితకవి

విరచితంబగు కాశీయాత్రాచరిత్ర

మను మహా ప్రబంధంబున

ద్వితీయ భాగము

సమాప్తము

శ్రీ విశ్వనాధార్పణమస్తు.