కాశీమజిలీకథలు/రెండవ భాగము/17వ మజిలీ

వికీసోర్స్ నుండి

కాశీమజిలీ కథలు

రెండవ భాగము

17వ మజిలీ

పదియేడవ మజిలీ ప్రదేశము గొప్పపట్టణము అందు విశాలముగానున్న సత్రంబున బసజేసిరి. స్వాములవారు స్నానముచేసి జపముజేసికొనుచున్న సమయమునందు శౌనకుడు పురవిశేషముల చూచు తాత్పర్యముతో నంగడికి బోయెను. ఆ విపణి మార్గము మిక్కిలి విశాలముగను రమ్యవస్తువులు గలదిగా నుండుటచే నచ్చటివింతలం జూచి క్రమక్రమముగా దూరముగా బోవుచుండెను. పోవంబోవ బట్టణపుకోట గనంబడనది. అది మిక్కిలి యెత్తుగాను బొడవుగా నుండుటచే దానిచుట్టు తిరిగిరా దలంపుతో బోయిన పెద్దతడవు పట్టినది. మరియుం గోటముఖమునకు బోయినంత నచ్చటి వింతలన్నియు నతని స్వాంతమున కచ్చెరువు గలుగజేసినవి.

మరియొకచోట మంటపములో నడ్డముగావై చిన దూలమున దలక్రిందుగా నిరువుర నినుపగొలుసులతో వ్రేలగట్టియుంచిరి. వారినట్లుకట్టి చిరకాలమైనను జీవించిన మనుష్యులవలె నున్నారు. ఆప్రక్కనున్న శిలమీద “దుర్జనులకు బుద్ధివచ్చుపని" యని వ్రాయంబడియున్నది. ఆవిశేషముజూచి శౌనకుడు అచ్చటనున్నవారిని వ్రేలంగట్టిన పురుషులెవ్వరనియు నేమితప్పుచేసిరనియు నడిగెను. కాని యెవ్వరును చెప్పినవారు లేకపోయిరి.

ఆవింత పలుమారు పరిశోధించి వాడు కడువేగముగా సత్రమునకుబోయి భోజనముచేసి తనరాక నిరీక్షించియున్న మణిసిద్ధునిగాంచి నమస్కరించి యెదుర నిలువబడినంత నయ్యతి కోపమిశ్రితమైన స్మితముతో నిట్లనియె. గోపా! నీకింతభయము లేకపోయినదేమి! నీకొఱ కెంతసేపు కాచియుందును. ఎచ్చటికి బోయితివి? భోజనము మాట మరచిపోయితివా యేమి! యెద్దియో యొకగొడవ బెట్టుకొని తిరుగుచుందువు. ఈ దినం బెద్దియేని వింత గనంబడినదికాదా చాలు లేలెమ్ము అని పలుకగా వాడు నించుక సిగ్గుతో నవ్వుతో నిట్లనియె.

స్వామీ! నేను భోజనముకొరకు మీవెంట రాలేదు. దేశవిశేషము లరయు తలంపుతోగదా వచ్చితిని. మరి వానింజూడ బోవక యేమిచేయుదును? ఈపట్టణము మిక్కిలి పెద్దదిసుండి. అంగడిలో నెన్నివిశేషములు చూచితి ననుకొంటిరి. ఇందున్న కోటలో దులయగు దాని నిదివరకు మనము చూచియుండలేదు. ఆకోటముందర మంటపములో నిరువుర బురుషుల నినుపగొలుసులతో దలక్రిందుగా వ్రేలగట్టిరి. వారు చచ్చిరికదా వారిశరీరములు చెడక చిరకాలమట్లె యున్నవెట్లు? అది దుర్జనులకు బుద్ధివచ్చు పనియట ఈ దినమున నేనుజూచు విశేషములలో నదిమిక్కిలి యబ్బురము గలుగజేయుచున్నది. వారెవ్వరు? ఏమితప్పు జేసిరి? ఈవృత్తాంతము ముందుగ జెప్పకతప్పదు. నాయందు గోపము సేయకుడు ఈకథ వినినతరువాతగాని నాకు భోజనము రుచింపదని పాదంబులపైబడి యెక్కుడు దీనత్వముతో వేడుకొనుటయు నయ్యతిపుంగవుండు నవ్వుచు నిట్లనియె.

నీవు జాగుచేసినప్పుడే యెద్దియో గొడవతో వచ్చెద వనుకొంటిని. దాని వృత్తాంతము చెప్పెదనులే నే నెక్కడికి బోవను. భోజనము చేయుము. సావకాశముగా జెప్పెదనని పలికి యెట్టకేలకు వాని నొప్పించి భోజనానంతరము నొకచోట సావధానముగా గూర్చుండి యమ్మాణిక్యప్రభావంబున దద్వృత్తాంత మంతయు గరతలామలకముగా దెలిసికొని యిట్లని చెప్పదొడంగెను.

ధర్మపాలుని కథ

తొల్లి మాళవదేశంబున ధర్మపాలుండనురాజు విహారభద్రుడు విజయకేతుడను మంత్రులతో గూడి కౌశాంబియనుపట్టణము రాజధానిగా జేసికొని ధర్మంబున రాజ్యము సేయుచుండెను. అతనిపత్ని సునంద. ఆసుందరియు బతియెడ భయభక్తివినయవిశ్వాసములు గలిగి సతీధర్మ మించుకేనియు దప్పక వల్లభునకు శుశ్రూష జేయుచుండెను. అత డొకనాడు పేరోలగంబుండి మంత్రుల నిరువురంజూచి రాజులకు దండనీతి నెరింగిన గలుగులాభ మేమని యడిగిన నందు ముందు రెండవ మంత్రియైన విజయకేతుడు లేచి నమస్కరించుచు దనకు ప్రభువునందుగల వినయవిశ్వాసములు తేటబడునట్లు యుక్తియుక్తముగా నిట్లనియె.

దేవా! అగ్నిశోధితముగాక హేమము ప్రకాశించనట్లు నీతిపాటవము లేనివాని బుద్ధిబల మనామకమై యుండును. బుద్ధిబలములేనివా డెంత యున్నతుడైనను పర్వతమువలె దనబై కెక్కినవారి నైనను గుర్తెరుఁగకుండును సాధ్యసాధనముల విభజించి నడచుటకు సమర్థుడు కానేరడు. నియమములేక వ్యాపారముల జక్కజేసుకొనలేనివాని బరులు స్వీయులుగూడ నవమానింతురు. అదియునుంగాక నతనియాజ్ఞకులోనై ప్రజలు వర్తింపరు. అతిక్రాంతశాసనులగుప్రజలు స్వేచ్ఛావిహారులై సర్వవ్యాపారముల యందు సంకరులగుదురు. నిర్మర్యాదమైనలోక ముభయలోకముల దాను జెడుటయేకాక రాజునుగూడ జెరుచును. కావున నాగమదీపమునజూచి నడిచిరేని లోకయాత్ర సుఖముగా జరుగును. త్రికాలచర్యలం దెలిసికొనుటకు శాస్త్రచక్షుస్సు దివ్యమైనది కదా? విశాలమగునేత్రములు గలిగియున్నను అదిలేనివా డర్దదర్శనముల గ్రుడ్డివాడేయగును. కావున బాహ్యవిద్యావ్యాసంగము విడిచి రాజు కులవిద్యయైన దండనీతి నభ్యసింపవలయు. దానంచేసి మిక్కిలి ఖ్యాతిగలిగి సంకల్పసిద్ధుడై ప్రజల వశపరచుకొని సుఖముగా రాజ్యము సేయును. ఇదియే దండనీతివలన గలుగులాభమని విజయకేతుడు చెప్పగా విని రాజు సంతసించుచు దరువాత విహారభద్రుని మొగము జూచెను.

అప్పుడు సకలతంత్రదుర్నయోపాధ్యాయుడగు విహారభద్రుడు లేచి రాజుగారికి మ్రొక్కుచు దేవా! మదీయవిజ్ఞాపనముగూడ నవధరింపుడు. లోకములో దైవానుగ్రహమువలన నెద్దియేని యైశ్వర్యము గలిగినచో ధూర్తులు దాంబికవచనములచే బ్రభువుల భ్రమపెట్టి స్వప్రయోజకత్వమును వెల్లడిచేసికొనుచున్నారు. మరికొందరు యోగులమని శిఖాయజ్ఞోపవీతముల దీసి యనశనవ్రతము బూనితిమని చెప్పుచు నాశాపాశమునుమాత్రము విడువలేక సర్వస్వమును స్వీకరింతురు. కొందరు అల్పులనైనను జక్రవర్తిని జేయుదుమనియు కొందరు శస్త్రములేకనే శత్రువుల సంహరింతుమనియు నీ రీతి ననేకవిధముల డాంబికములబన్ని రాజుల నమ్మించి వారు చెప్పినట్లు చేయించుచుందురు.

ఇప్పుడు విజయకేతుడు చెప్పినదండనీతి యట్టివారు చెప్పినదే. అందలి విషయములను సంక్షేపముగా జెప్పెద వినుడు త్రయీవార్తాఅన్వీక్షకీ దండనీతి అను నామములచే రాజ్యవిద్య నాలుగువిధములుగా జెప్పబడియున్నది. అందు ద్రయి వార్తాన్వీక్షకులు మూడును గొప్పవి వానివార్తలటుండనిండు. నాలుగవది యగు దండనీతిని విష్ణుగుప్తుండు సంక్షేపముజేసి యారువేల శ్లోకములుగా రచించెను. అట్టిదాని నధ్యయనము చేయుమనిగదా వీరియభిప్రాయము. అలాగుననే చదువుదము. దానికొఱకు శబ్దశాస్త్రముగూడ జదువవలయును. ఇదియంతయు బూర్తియగువరకు ముదిమియేవచ్చును. మరి సుఖపడుట యెన్నడు?

మరియు రాజకుమారు డుదయంబున లేచి దంతధావనము చేసికొని ప్రథమభాగంబున న్యాయవ్యయంబులం దెలిసికొనదగినది ద్వితీయభాగంబున నన్యోన్యము గలహించెడి ప్రజల పరుషవచనములచే దర్ణముల బాధింపవలయును. తృతీయభాగంబున వీరభటుల దిగ్విజయయాత్రావిశేషములు వినవలయును. మరియు స్నానభోజనాది వ్యాపారములచే ముగియునుగదా! చతుర్ధంబున నర్ధగ్రహణమునను బంచమమున మంత్రిచింతచేతను మహాయాన మనుభవింపవలయును. షష్టభాగమున మంత్రియైనను విహారమైన జేయదగినది సప్తమమున జతురంగబలప్రత్యవేక్షణాయాసము జెందవల యును. అష్టమమున బరాక్రమచింత ఈరీతి పగలు వెళ్ళించదగినది. మఱల రాత్రి ప్రథమభాగంబున సంధ్యోపాసనయు గూడపురుషనియోగము ద్వితీయభాగమున శ్రోత్రియుడువోలె భోజనానంతరము స్వాధ్యాయనము జదువవలయునట తృతీయము దూర్యఘోషములచే గడుపవలయును. చతుర్థదపంచమభాగముల నిద్ర తిరుగా షష్టభాగంబున లేచి శాస్త్రచింతయు గార్యచింతయు జేయవలయును. సప్తమమున దూతాదిప్రేషణము. అష్టమమున బురోహితాదివిప్రబృందము దయచేసి స్వప్నఫలముల జెప్పుచు హోమము దానము తర్పణము చేయవలయును. దీనికంతయు బంగారమే కావలయును. బ్రాహ్మణులనగా బ్రహ్మకల్పులు వీరికి దానమిచ్చినచో నైశ్వర్యములు వృద్ధియగును. ఇంతకు మున్నెచ్చటను దానముపట్టనివారు పుత్రవంతులు వీరికిచ్చిన సకలారిష్టములు నశించునని యిట్లుపలుకుచు గష్టపెట్టుదురు.

ఈరీతి రాత్రింబగళ్ళు వెళ్ళించువానికి సుఖము లేశమైనను గలుగునా! వాడు రాష్ట్రము నేమి రక్షించుకొనును. దండనీతియందు జెప్పినరీతి యిది. ఇట్టి శాస్త్రము ననుసరించినంగాని సంపదలు నిలువవట అది వట్టి ప్రల్లదము. లోకమువలననే యనుభవము తెలిసికొనదగినదిగాని శాస్త్రప్రయోగములేదు. శిశువు సహితము తల్లియొక్క లాలనచేత నుపాయముగా బాలు గుడుచుకొనుచుండును. కావున యథేష్టముగా నింద్రియసుఖముల ననుభవింపదగినదే. విషయాభిలాషల జయింపదగినది. అరిషడ్వర్గము విడువవలయును. సుఖమందిచ్చ యుండకూడదు అని యుపదేశించెడి పండితులు గూడ దివాణములలో దొంగిలించిన ధనమంతయు వేశ్యలపాలు జేయుచున్నారు. వీరి మాటయేల! పరాశర ప్రభృతులు మాత్రము విషయాభిలాష విడిచిరా! శాస్త్రప్రకారము వారుమాత్రము నడచిరా? సుఖదుఃఖములు వారికి మాత్రము తప్పినవియా! కావున దీనిలో నేమియునులేదు. రాజా! నీవిట్టి డాంబికపు మాటలు నమ్మకుము. ఉత్తమజాతిని బుట్టితివి. తొలిప్రాయమున సుందరశరీరము నపరిమితైశ్వర్యము గలిగి యుంటివి. ఈ వెర్రిమాటల నమ్మి విద్యాగ్రహణప్రయాసమునకు బోకుము. నీకోశగృహములోనున్న ధనము మూడుతరములదాక సరిపడును. పెక్కేల రాజ్యభారమంతయు సమర్దుడగు వానియందు బెట్టి యచ్చరలంబోలియున్న శుద్ధాంతకాంతలతోఁ గ్రీడింపుచు సంగీతపానగోష్టివిశేషముల శరీరలాభమును సార్ధకమును జేసికొనుము అని బోధించెను

ఇట్లు మంత్రులిద్దరు నుపన్యసించిన విని యారాజు శిరఃకంపపూర్వకముగా నవ్వుచు నోహో! మీరిరువురు హితోపదేశము చేయుటచే గురువులయిరి. మీ యుపన్యాసము శ్రవణానుకూలముగానే యున్నది. అని చెప్పుచు లేచి అంతటితో సభ జాలించి యంతఃపురమునకు బోయెను. తరువాత గపటక్రియాదక్షుడయిన విహార భద్రుడు సంతతము రాజున కాబోధయే చేయుచు గ్రమంబున నతని చిత్తము నిజాయుత్తముగా జేసికొనియెను.

క్రమక్రమముగా ధర్మపాలుడు విహారభద్రుని యాలోచనకు లోనయి రాజకీయవ్యవహారములన్నియు నతనిమీద వేయించి విజయకేతుని నించుకేనియు మన్నింపక తాను సంతతము నంతఃపురమున గాంతోపభోగములతో గాలక్షేపము చేయుచుండెను. అవ్విధమంతయు గ్రహించి విజయకేతు డొకనా డాత్మగతంబున నిట్లు తలంచె. ఆహా! యీరాజు మిగుల మూర్ఖుడయి వీని మాటలచే జెడిపోవుచున్నవాడు ఈరాజు చేష్టలుచూడ బూర్వమురీతిని గనంబడుటలేదు. పూర్వమువలె నాతో నవ్వుచు మాట్లాడడు. కన్నెత్తిచూడడు. నాతో రహస్యములు జెప్పుట మానివేసెను. మంచిపనులకు నన్ను నియోగింపక నీచకార్యములకు బంపుచున్నవాడు. నా కుశల మేమియు దెలిసికొనడు నాపన్నులయినవారిని మన్నించుటలేదు. నా శత్రువులయెడ విశ్వాసము జూపుచుండెను. నామాటకు బ్రత్యుత్తరమయిన నీయడు. నేను దాపుననున్నను మఱి యొకరితో వేఱొకరిని నిందించును. ఇదియంతయు విహారభద్రుని యుపదేశమహిమయే గదా ఆహా! చిత్తజ్ఞానాను వర్తులగువార నర్థులయినను రాజులకు బ్రియులగుదురు. సమర్ధులయినను దద్భావబహిష్కృతులయినచో ద్వేషులగుదురుగదా.

శ్లో॥ సులభాఃపురుషాలోకే సతతం ప్రియవాదినః।
     అప్రియస్య పథ్యస్యవ్యక్తాశ్రోతాచ దుర్లభః॥

అనినట్లు ప్రియవాదులనేకులు గలరు గాని యప్రియమును నపథ్యమునగు వాక్యములను జెప్పువాడును వినువాడును గూడలేడు. ఈతని రాజ్యము స్వల్పకాలములోనే శత్రువుల యధీనము కాగలదు. నేనేమి జేయువాడ. చిరకాలము నుండి యాశ్రయించియున్న యీ దివాణమును విడిచిపోవుటకు మనసొప్పకున్నది. కానిమ్ము నేనేమి నోరు మెదల్పక మూగవానివలె నెట్లో కాలము వెళ్ళించెదనని యూహించి యారీతినే నడుచుకొనుచుండెను.

అట్లు ధర్మపాలుడు కామతంత్రుడై రాజ్యమును దుర్మంత్రి యధీనముచేసి సంతతము నంతఃపురమందే వసింపుచుండ నొకనాడు చోళదేశపు రాజుయొక్క మంత్రిపుత్రుడు దుర్వినీతుడను వాడు గూఢపురుషులతో గూడికొని కౌశాంబికివచ్చి మిక్కిలి విచిత్రములగు గ్రీడలచేత విహారభద్రుని వశము చేసికొనెను. ఒకనాడా దుర్వినీతుని వెంటబెట్టుకుని విహారభద్రుడు రాజసభకువచ్చి రాజునకు వానిం జూపుచు నిట్లనియె. దేవా! ఈతడు చోళదేశపు రాజుయొక్క మంత్రి చంద్రపాలితుడనువాని కుమారుడు, దుర్వినీతుడనువాడు వీడు మిగుల శూరుడు. రాజుతో ద్వేషించి యెచ్చటనైన గొలువుచేయుటకు వచ్చినాడు మనకారాజు సహజశత్రుడుగదా! శత్రువునకు శత్రువు మిత్రుండగు నితండట్టి యూహతోడనే మనయొద్దకు వచ్చెను. వీడు పెక్కు విద్యలయందు బ్రవీణుడు. ద్యూతక్రీడయందును వేటయందును వీనికిగల పాటవము మఱియొకరికిలేదు. వీనికి మన యాస్థానములో దగిన యుద్యోగ మిప్పించవలయును. వీడుండినచో శత్రువులు భయపడుచుందురని యెన్నియో బోధించుచున్న విహారభద్రుని మాటలు విని సైరింపలేక రెండవ మంత్రియగు విజయకేతుం డిట్లనియె. నరేంద్రా! నన్ను మీ రేయాలోచనయు నడుగకున్నను నాకు దివాణము మీదగల విశ్వాస మూరకొననీయక చెప్పుచెప్పుమని యూరక ప్రేరేపించుచున్నది. వినుండు. వీడు మనకు సహజశత్రువగు చోళదేశపు రాజుగారి మంత్రిపుత్రుడు అట్టివాని బరీక్షింపక గోటలోనికి రానీయవచ్చునా? వీడు మనకోటగుట్టు దెలిసికొనుటకయి వచ్చి యుండవచ్చును. ఉద్యోగపు నెపమున, గొన్నిదినము లుండి రహస్మములన్నియు దెలిసికొని వెళ్ళినచో మనమేమిచేయగలము? మీకు నామాట లేమియు హితముగా నుండవు. నీతిమాట దలపెట్టవలసిన బనిలేదుగదా! నీతిశాస్త్రములో శత్రుపక్షపువాడు వచ్చినపుడు వానింబట్టుకొని బందీగృహమున నుంచవలయునని యున్నది. మీ పెద్దమంత్రి యట్టితంత్రమున కొడంబడునా? నేను జెప్పవలసినమాట జెప్పితిని. తరువాత మీ యిష్టము వీనిని మాత్రము నమ్మి విడిచిపెట్టగూడదని ముమ్మారు పలికెను.

అప్పుడు విహారభద్రుడు పకపక నవ్వుచు నోహో! ఈతండు రాజునకు క్షేమముగోరువాడును మేమందరము కోరనివారము కాబోలు. ఇక వీనిబుద్ధిబలము కొనియాడతగినదే! నేను జేయబూనినపని కాదనుట వీనికి సహజము. కానిమ్ము దాన నాకు జెడిపోవునది యేమియున్నది. మనగుట్టు దెలిసికొనుటకు నీతడు రావలయునా? కోట ముట్టడించునప్పుడు మనగట్టు నిలుచును కాబోలు. ఈ దుర్మంత్రములతో బ్రయోజనములేదు. వీనిని మనయొద్ద నుంచుకొనకతప్పదు. నే నభయహస్త మిచ్చితిని. వీనివలన మనకు శత్రువుల మర్మములు దెలియవచ్చును. అని నిర్భయముగా బలుకుచున్న పెద్దమంత్రిమాటలు కాదనలేక యాధాత్రీపతి యందులకు సమ్మతించినట్లు సూచించుచు నంతఃపురమునకు బోయెను.

అప్పుడు విహారభద్రుడు విజయకేతు నాక్షేపించుచు దుర్వినీతుని దనకు సహాయుడుగా నుండునట్టి యుద్యోగమిచ్చునట్లు వ్రాసెను. దుర్వినీతుడును క్రమంబున నయ్యాస్థానములో నగ్రేసరుడయి రాజుతో సప్తవ్యసనములును మిక్కిలి యుత్తమములని చెప్పి యతని చిత్తమును దదాయత్తమగునట్లు చేసెను. రాజు దుర్వృత్తి కుద్యోగించుచుండ రాష్ట్రంబున ద్యూతక్రీడ లధికమైనవి. చౌర్యము తన్మూలక మగుటచే దానిమాట జెప్పనేల? పానగోష్టి యన్నిటికిని మొదటిదే కదా! కామప్రవృత్తి లోకమునకు స్వభావసిద్ధమయినదే.

ఈరీతి గ్రమక్రమముగా బ్రజలు భయము విడిచి దుర్వ్యాపారములకు దొడంగుచుండిరి. మందలించువారు లేమింజేసి బలవంతులల్పుల పసుక్షేత్రాదుల హరింప దొడంగిరి. దానంజేసి ప్రజల కొండొరులకు గలహము లధికమయినవి. నరు లాశ్రమధర్మముల విడిచి సంకరులై ప్రవర్తింపదొడంగిరి. ఆరీతి రాజ్యంబంతయు గ్రమక్రమంబున క్షీణదశకు వచ్చుచుండుట జూచి దుర్వినీతుడు మిగుల సంతసించుచు రహస్యముగా దనదేశమునుండి యుత్తరప్రత్యుత్తరములు దెప్పించుకొనుచుండెను. విజయకేతు డొకనా డారహస్యము దెలిసికొని యొక యుత్తరమును సంగ్రహించి రాజునకు జూపించి దుర్వినీతుని కుచ్చిత మంతయు దెలియజేసెను. కాని సురాపానమత్తుండగు నా రాజున కతనిబోధ యేమియు దలకెక్కినదికాదు.

దుర్వినీతు డాపట్టణములో నొకచోట స్థలము సంపాదించి దానిచుట్టును నున్నతమగు ప్రహరి పెట్టి రహస్యముగా దానిలోని సేనలం జేర్చుచుండెను. విజయకేతు డావృత్తాంతమునుఁ దెలిసికొని పట్టఁజాలక పట్టమహిషి సునంద కిట్లు వ్రాసెను. అమ్మా! నీపతి విహారభద్రుని బోధకు లోనై రాజతంత్రము లేమియుఁ జూచుటలేదు. రాష్ట్ర మంతయు భ్రష్టమై పోవుచున్నది. అదియుంగాక శత్రుపక్షపాతి యగు దుర్వినీతుని దెచ్చి యింటిఁలోబెట్టిరి. వాడు కుచ్చితపు వ్యాపారమున నుండి చోళదేశమునుండి సేనల రప్పించుచున్నాడు. ఎప్పుడో హఠాత్తుగాఁగోట బట్టుకొందురు రాజ్యహానియే కాక మానహాని గూఁడ గాగలదు. దుర్వినీతుడు చోళదేశపురాజు మంత్రి పుత్రుఁడు ఈ సంగతి నేనేమి చెప్పినను నీపతి వినిపించుకొనడు, నీవు పట్టమహిషిని గాన నీకుఁ దెలియపరచితిని ఇచ్చట నా మాట వినువారెవ్వరునులేరు. దుర్వినీతుని యిల్లు పరీక్షించినచో శత్రుసేనలు గనంబడును. రాబోవు ననర్దమునకుఁ బ్రతీకార మిప్పుడే చేయవలయునుగదా? నీవు గూడ నశ్రద్ధ చేసినచో శత్రువులువచ్చి పై బడుదురని వ్రాసి యాయుత్తరము దాసీజనమువలన నామె కందజేసెను. విద్యావతియు, రూపవతియు, గుణవతియునగు నాయువతి యాయుత్తరమునుఁ జదువుకొని విజయకేతుని సుగుణసంపత్తి నంతకుఁ బూర్వమేవినియున్నది కావున నతని వినయవిశ్వాసములకు సంతసించుచుఁ బ్రమత్తుండైయున్న ధర్మపాలున కారాత్రియంతయు నీతిబోధఁ జేసి యంతకుఁ బూర్వముకలిగిన దుర్బుద్ధియంతయుం బోగొట్టిఁ విహారభద్రునియం దసూయయు విజయకేతునందుఁ బ్రీతియుం గలుగునట్లు చేసినది.

అంత మరునాడుదయంబున నారాజు ఆహంకారముఖముతో సభకు వచ్చి మంత్రుల రప్పించి యిప్పుడు రాష్ట్రస్థితి యెట్లున్నదని యడుగగా విహారభద్రుఁడు పూర్వమువలెనే యెద్దియో చెప్పబోయెను. కాని వాని మాటలన్నియు ననర్థమూలములుగాఁ దోచినందున వినిపించుకొనక పట్టణమంతయుఁ జూడవలసి యున్నది. కావున నశ్వమును సిద్ధపరపింపుమని విజయకేతుని మొగము జూచి చెప్పెను. అతండది గ్రహించి రాజుబుద్ధి మరల్చినందులకు సునందాదేవిని మిక్కిలి మెచ్చుకొనుచు నపుడే యొక యుత్తమాశ్వమును జీను కట్టించి సిద్ధపరచెను.

రాజు మంత్రు లిద్దరిని దుర్వినీతుని వెంటరమ్మని యా హయమెక్కి కొంతవరకుఁ బురవీధులందిరిగి తరువాత దుర్వినీతుని గృహమెక్కడ యని యడిగెను. దాని కతఁడు భయపడుచుఁ దన యిల్లు చూపింపక వేరొక గృహము చూపెను. అప్పుడు రాజు విజయకేతుని మొగము చూచుటయు నతఁడది గ్రహించి దేవా! ఇది దుర్వినీతునిదికాదు. మఱియొకరిది. వెనుకఁ గొన్నిదినము లిందుండెను. కాని యిప్పుడు లేడు. వేరొకచోట గొప్పభవనము గట్టెను. చూపించెదరండని పలుకుచు నప్పుడే యా సేనానివేశమునకుఁ దీసికొనిపోయెను.

రెండవ కోటవలె నొప్పుచున్న యతని గేహము చూచి యారాజు విస్మయము జెందుచు విహారభద్రునిం జూచి కన్ను లెర్రజేయుచు నచ్చట గుఱ్ఱమును దిగి యాద్వారము దాపునకుఁ బోయి తలుపులు తీయించుమని దుర్వినీతునిఁ జూచి చెప్పెను. అప్పుడతండు తడబడుచు అయ్యా! దీని తాళముచెవి నాదగ్గర లేదు. దీనిలో నెవ్వరును లేరని చెప్పగాఁ గోపముచేయుచు నప్పుడే తాళము బడఁగొట్టించి తలుపులు తీయించెను. నాలుగైదువేలమంది యాయుధములla నుండిరి. వారింజూచి రాజు భయమును క్రోధమును సంభ్రమము మనంబున నావేశింప దుర్వినీతునిం గాంచి యీసైన్య మెవ్వరిదని యడుగఁగా నతండిది దేవరవారిదే యని చెప్పెను.

ఆ మాటవిని రాజు వెంటనే తలుపులు వేయించమని యాజ్ఞాపించెను. దుర్వినీతుఁడు అడ్డముగా నిలువంబడి లోపల వారికెద్దియో సంజ్ఞఁజేసెను. అప్పుడందులోని వారందరు నాయుధములు సవరించు కొనుచుండిరి. ఆ విధము దెలిసికొని విజయకేతుఁడు తొందరపడుచు నచటనున్న రాజభటులతో బలత్కారముగాఁ దలుపులు మూయుడని యాజ్ఞాపించగా విని వారును ద్వారములో నిలువబడియున్న దుర్వినీతునిఁ గూడ లోనికిఁ ద్రోసి తలుపులు మూసిరి.

అప్పుడు రాజు విహారభద్రునిఁజూచి దుర్వినీతుని యవినీతియంతయుం దెలిసినదా ! ఇదియంతయు నీకతంబున వచ్చినది. నిన్నేమి చేసినను ద్రోహములేదు. కానిమ్ము. ఇప్పుడు వచ్చిన యుపద్రవము దాటించుకొని తిరువాత నీ పని కనుగొనియెద నని పల్కుచు విజయకేతుం జూచి ఆర్యా ! మనసేనలన్నియు నెచ్చటనున్నవి! వేగము సన్నాహము సేయింపుము ఇప్పుడు తప్పక యుద్ధము జరుగఁగలదు. ఇది యంతయు చోళదేశపురాజు వసురక్షితుని కపటోపాయమని తోచుచున్నది అతఁడు మనకు సహజశత్రువు. మనలనెట్లయినను జయింప వలయునని కోరుచున్నాఁడు. ఇప్పుడు బలములు గూర్చుకొని వచ్చునని తోఁచుచున్నది. ఇందులోనివారు బైటికి రాకుండునట్లెద్దియేని యాలోచింపుము. నీవు బుద్ధిమంతుఁడవు. వెనుకటి కోపముంచు కొనకుమని పలికిన నతఁడు విచారించుచు అయ్యో! నే నిప్పుడేమి సేయువాఁడ సేనలెచ్చట నున్నవియో తెలియదు. ఈ లోపలవాండ్రు బైటికి వచ్చిరేని నిలువలేము. కర్తవ్యమేమియని యాలోచించుచు నచ్చటఁ గొందరిని గావలియుంచి యప్పుడే పురమంతయుఁ జాటింపించెను.

ఆ చాటింపువలన సిద్ధముగా యున్న సైన్యమువచ్చి కోటముంగిటనిలచెను. దానిలోఁ గొంతసేనను దుర్వినీతు నింటిచుట్టును నిలిపెను. తరువాత దేశములోనున్న వాహినికి వార్తలనంపెను ఇంతలో నాచోళదేశ ప్రభువగు వసురక్షితుఁడు ఆవార్తవిని మితిలేని సేనలం గూర్చుకొని యా యూరుముట్టడించి భేరీవాయించెను. ఆ ధ్వనివినినతోడనే రాజు గుండియలు భేదిల్లినవి. కోటతలుపులు మూయించిరి. బురుజులమీఁదను గోడలమీఁదను ఆయుధములతో యోధుల నిలిపిరి ఈరీతి నోపినంతవరకు వ్యూహము పన్నించి విజయకేతుఁడు రాజునొద్దకుఁ బోయి నమస్కరించి యిట్లనియె.

దేవా! వసుమిత్రుడు చతురంగబలములతో వచ్చి పట్టణము ముట్టడించినాడు. వారిసేనలో మనసేన నాలుగవవంతైనను లేదు కోటనిలుచుట గష్టముగా నున్నది. యోపినంతవరకుఁ బోరుదము. కాని కోటలోనున్న ప్రచ్ఛన్నమార్గము తలుపులు తీయింపుడని చెప్పగా రాజుమిగుల శోకాక్రాంతుడగుచు నట్టియేర్పాటు చేయించెను. అప్పుడది చూచి యంతఃపురకాంతలెల్ల గొల్లుమని యేడ్వసాగిరి అప్పటికి రాజునకు మూడేండ్ల ప్రాయముగల యొకకుమారుఁడుండెను. మరియు నతని పట్టమహిషి తొమ్మిదినెలల గర్భముతో నున్నది. అట్టి సమయములో నెట్టియవస్థ వచ్చెనోచూడుము. వారిట్లు సవరించుకొనుచున్న సమయములో రణభేరీధ్వనులు సమీపముగా వినిపింప దొడంగినవి.

అప్పుడు శత్రుసైన్యము గ్రామములోఁ బ్రవేశించి కోటముట్టడించినట్లు తెలియవచ్చినది. దానికి మిక్కిలి భయపడచు రాజును మంత్రియుఁ నాయుధంబులు ధరించి బురుజులపైనెక్కి శత్రుసైన్యము నంతయు జూచి యధైర్యపడియు నంతలో ధైర్యము తెచ్చుకొని పగతుర కోటదరికిఁ జేరకుండునట్టు కొంతసే పాయుధములఁ బ్రయోగించిరి. దానంజేసి వారి గోట దాపునకుఁజేరుట గష్టమైనది. గుట్టంతయుఁ దెలిసిన దుర్వినీతుఁడు కోటదుర్గముల నెరిగియుండుటం జేసి వారిరువురు లేచి రెండవ పెడకు సేనలం దీసికొనిపోయి కోటపై తుపాకులఁ గాల్పించెను.

ఆ చప్పుడులకు వెఱచి కోటలోనున్న స్త్రీలు తల్లడమందఁజొచ్చిరి. రాజును మంత్రుయు నోపినకొలది దుపాకులఁగాల్చుచుండిరి. కాని సముద్రమువలె నావరించి యున్న సేన నంతము నొందింప లేకపోయిరి. అప్పుడు శత్రుసైన్యము హద్దుమీరి రెండవదారిని లోపలఁ బ్రవేశింపఁ దొడంగుటయు విజయకేతుఁడు విచారించి సత్వరముగా నిరువురదాదులతో రాజపుత్రునితో రాజపత్ని సునందనుఁ బ్రచ్ఛన్నమార్గమునఁ గోటదాటించెను. ఆసమ్మర్దములో రత్నవతియను దాదియు సునందయు నొకమార్గమునను రాజపుత్రునెత్తుకొని నింబవతియను దాదియొకమార్గంబునఁ బోవుటచే నొకరిజాడ యొకరికిం దెలిసినదికాదు. తరువాత రెండవదారిని వచ్చి శత్రుబలము గోటలో బ్రవేశించుటఁజూచి రాజు పారిపోవుట కుద్యోగించుచున్న సమయమున దుర్వినీతుఁడు వీరభటులతో వచ్చి యతనిం బట్టుకొనియెను.

అప్పుడు రాజు దుర్వినీతునింజూచి యోరీచెడుగ! ఇట్టిద్రోహముచేయుదు వనుకొనక నీకుద్యోమిచ్చి నందులకు గదా యిట్టి యుపద్రవము దెచ్చిపెట్టితివి కానిమ్ము దైవము నీకెప్పటికేని నాపదలు గలుగఁజేయకుండునా? నీవుమాత్రమెల్లకాల మిట్లుందువా? మోసము సేసి హఠాత్తుగావచ్చి జయించుట బంటుతనముకాదు. కాలవ్యవధి నిచ్చిన నీపౌరుషము గనుఁగొని యుందును. కానిమ్ము మాకిప్పుడు చెడుకాలము వచ్చినది. విజయకేతుని మాటలువినక విహారభద్రుని నమ్మినందులకు మంచిప్రాయశ్చిత్తమె యైనది. అని యీరీతిఁ బెక్కుగతుల దుర్వినీతుని నిందించెను. కాని దేనికి వాడు సమాధానము జెప్పక యతని పాదములకునుఁ జేతులకు నిగళంబులు దగిలించి తీసికొనిపోయెను.

అప్పుడు వసురక్షితుని సేనలో జయజయధ్వను లెసంగినవి. పిమ్మట విజయకేతునికై ప్రయత్నములు సేసరికాని యతఁడెందునుఁ గనఁబడలేదు. పిమ్మట వసురక్షితుడు దుర్వినీతుని కొంతబలముతో నాకోటలోనుండ నియమించి తానును మంత్రియు ధర్మపాలుని తీసికొని బలములతో నింటికిఁబోయి యతినినొక చెరసాలలోఁ బెట్టించిరి. ఆహా! అవినీతుఁడగువారి కాపదలు రాకమానునా! ఇంతకు నది కాలమహిమ కాక వేఱొకటి కాదు.

అదృష్టదీపుని కథ

వత్సా ! రాజపత్ని సునంద పుత్రునెత్తుకొని యిరువుర దాదులతో నరణ్యమార్గంబునం బడిపోయెనని చెప్పితినిగదా! వారిలో నింబవతియనుదాది రాజకుమారు నెత్తుకొని ముందుగా వడివడి పరుగెత్తుచు శత్రువులు వెనుక వచ్చుచున్నా రేమోయని తిరిగితిరిగి చూచుచు నొకపగలును రాత్రియు నడచి మఱునాడు సూర్యోదయము వేళ కొక మహారణ్యములోనికిఁ బోయినది. రాత్రియంతయు మిగుల శ్రమపడి నడచినది కావున యుదయంబునఁ గదలలేక రాచపట్టి నక్కునం బెట్టుకొని యొక చెట్టునీడం బండుకొని నిద్రఁబోయినది.

ఇంతలో నాచెట్టుతొర్రలోనుండి యొకకృష్ణసర్పమువచ్చి యా నింబవతిం గరచి దానిప్రక్కలో నాడుకొనుచున్న చిన్నవాని శిరముపై బడగపట్టి యాడందొడంగినది ఆ దాదియు సర్పగరళము తలకెక్కినంత దృటిలోఁ బ్రాణములు విడిచినది. అయర్భకుఁడు దాది యెంతసేపటికిని లేపోవుటచేత నడలుచు గొంతెత్తి యేడువసాగెను. ఇంతలో నాప్రాంతమందుఁ బశువులు గాచుకొనుచున్న గొల్లపిల్లవాండ్రు ఆదారినివచ్చి యాపామును బాలకునిం జూచి వెఱచుచుఁ గర్రతో సర్పమును బెదరించిరి.

అదియు దండతాడనభీతిచేఁ బారిపోయి వివరములో దూరినది. పిమ్మట నాబాలుడు నింబవతి నోటినుండిఁ వెడలెడు నురుగునుఁ జూచి యది పాముగరచి చచ్చెనని యూహించికొని యా డింభకు నెత్తుకొని సంతోషముతో నా ప్రాంతమందే యున్న తమ పల్లెకుఁ బోయి పెద్దల కావృత్తాంతమంతయుం జెప్పి యా బాలునిఁ జూపించిరి. ఆపల్లెలోఁ పెద్దగొల్ల పింగళకుడను వాఁడా వార్తవిని తనకు సంతతి లేదు కావునఁ దానిబాలునిఁ బెంచుకొనియెదనని చెప్పి యప్పాపనిం దెప్పి తనయింటం బెట్టుకొని వెన్నయు మీగడయుఁబెట్టి గారాబముగాఁ బెనుచుచుండెను. ఆపిల్లవాని కులగోత్రనామంబు లెవ్వరికిఁ దెలియవు మరియుఁ బింగళకునితల్లి తలపై సర్పమునీడఁబట్టిన వాఁ డదృష్టవంతుఁ డగునని జెప్పఁగా వానికి దండ్రి యదృష్టదీపుఁడని పేరుపెట్టెను.

అదృష్టదీపుని కయిదేడులు ప్రాయమువచ్చినతోడనే యాపల్లెలోనున్న బడిలోఁ జదువవేసిరి. ఆబడిలోఁ జదువుచెప్పువానికి నక్షరములపలుకుబడిమాత్రము తెలియును. అచట వాఁడే మిగుల పండితుఁడు. అదృష్టదీపుఁడట్టి చదువును స్వల్పకాలములో గ్రహించి క్రమక్రమముగాఁ దనబుద్ధిబలముచే జురుకుగా వ్రాయుటయుఁ జదువుటయుఁ నేర్చుకొనియెను. రత్నము బొగ్గులలోఁ బెట్టినను సజమైన కాంతిని విడుచునా! ఆపిల్లవాని కేడెనిమిదేండ్ల ప్రాయమువచ్చినప్పుడు పింగళికుఁడు కొంతమంది బాలురజతయిచ్చి తనపశువులవెంట నడవికిఁ బంపుచుండును. అదృష్టదీపుఁడును తోడిబాలురతోఁ బశువుల వెంట నడవికిఁబోవుచు సాయంత్రము దనుకఁ బశువులమేపి రాత్రికింటికివచ్చుచుండును.

రాత్రిసమయములం దదృష్టదీపునికి పింగళికుని తల్లి మిగులవృద్ధురాలు పూర్వపురాజుల చరిత్రలు కధలుగాఁ జెప్పుచుండ సంతోషముతో వినుచు నతం డడవిలో నున్నను లోకమర్యాదలన్నియు జక్కగా గ్రహించెను. విశాలమైన నేత్రములు, చంద్రబింబమువంటి మొగము, విండ్లవంటి బొమముడులు, చక్కనిచెక్కులు, నాజానుబాహువులు, సింహసంహననము గలిగి యదృష్టదీపుఁడు మసిపాతనుఁ గట్టిన మాణిక్యమువలె నగ్గొల్లవాని యింటిలోఁ బెరుగుచు నడవికిఁబోయి పశువులం గాచుచుండెను. అత నికిఁ బదియేడుల ప్రాయమువచ్చినప్పుడు బాలురతోఁగూడ నడవికిబోయి యొకనాఁ డాత్మగతంబున నిట్లు తలంచెను.

ఆహా! మాయవ్వ చెప్పుచుండెడి కథలనుఁ బట్టిచూడ నీభూమియం దనేకవిచిత్రములగు పట్టణములను గ్రామములు రాజులు సేనలు రథములు, గుఱ్ఱములు మొదలగునవి యెన్నియేనిఁ గలిగి యున్నట్లు తోఁచుచున్నది. ఈ యడవిలోనేమియుఁ గనంబడవు భూమిలో నొకఁడు సేవకుఁడు నొకడు సేవ్యుండుగా నుండుటకుఁ గారణ మేది? మనుష్యజాతి యంతయు నొక్కటియేగదా! అది వీరివీరి బుద్ధిబలమునుఁబట్టి వచ్చి యుండవచ్చును. మా పల్లెలోని వారిచర్యలన్నియు నేను జూచుచుంటిని. ఒక్కనికైన బుద్ధిబలమున్నట్లు తోఁచదు. వారి యాకారములును వికృతముగా నున్నవి. నేనట్టి వారికిఁ బుట్టియు నట్టిరూపము బూనక వేఱొకరీతి నుండుటకుఁ గారణమేదియో యుండవచ్చును. ఈ పల్లెలోనున్న వారిలో నొక్కనికై నను నా పోలికలేదు. ఇప్పుడు నా బుద్ధిబలముచేత నీయూరంతయు నాయధికారమునకు లోఁబడునట్లు చేసికొనియెద నని తలంచుచు నచ్చటనున్న బాలుర నందరంజీరి యిట్లనియె.

బాలకులారా! మనమీయడవిలో నూరక తిరుగుచుండనేల! నే నొకయుపాయము జెప్పెదను. నేను జెప్పినప్రకారము మీరందరు వినియెదరా యని యడిగిన వాండ్రెల్ల నొడంబడిన పిమ్మట మరల నిట్లనియె. ఈభూమిని పాలించెడు రాజునకొక మంత్రియు భటులు గలిగి యుందురు. ఆరాజు క్రమప్రకారము ప్రజలపాలించుచుండును గదా అలాగుననే మనముగూడ బాలించుకొందము. నేనురాజును, మీరు మంత్రులు, వీరు పరిచారకులు, వీరు ప్రజలు ఈరీతి నిర్ణయించిన యీయడవిలో నాడుకొందము. ఈయాట మిగుల విచిత్రముగా నుండునని పలికిన నందరు వానిమాటకు సంతసించిరి.

అప్పుడు వారందరిచేత నొక విశాలమగు మర్రిచెట్టుక్రింద జక్కగా బాగు చేయించి యడవికర్రలచే నెత్తుగా నొక మంచె సింహాసనములాగున గట్టించెను. దాని చుట్టును మంత్రులకును సామంతులకును లేఖకులకును దగినట్లు దారువులతోనే బీఠముల గట్టించెను. చుట్టును ఆవరణము , ద్వారము, ద్వారపాలురు మొదలైనరాజసభాలక్షణము లన్నియు గలుగునట్లు మ్రానులతో గట్టించెను. ఆబాలకులలో గొందర మంత్రులగాను మరికొందర లేఖకులగాను గొందర బ్రజలగాను వారి వారి బుద్ధిబలమునకు దగినట్లు నిర్ణయించి తాను రాజుగా నాసింహాసనమునగూర్చుండి వారువారు చెప్పదగినమాటలన్నియు నుపదేశించుచు నదృష్టదీపు డయ్యడవిలో రాజ్యము సేయుచుండెను.

నిజముగా రాజునకు బ్రజలు జడిసినట్లా బాలకులందరు వానికి జడియుచుందురు. తానురాజుగా నుండి యాపరిచారకులలోనే పశువులు గాచుటకు దినమునకొక్కనికి వంతువేయుచుండును. దానంజేసి తక్కిన బాలుర కందరకును దీరుబడిగా నుండునది. మరియు నేరములు నిరూపించుచు శిక్షల విధించుచు దీరుపులు వ్రాయుచు నుద్యో గము లిచ్చుచు బనుల జెప్పుచు ధర్మములం బలుకుచు జట్టముల రచించుచు నిజమైన రాజువలె రాజ్యము చేయుచుండెను. ఈరీతి బ్రతిదినము నుదయమున వచ్చి సాయంకాలమువరకు నాడుకొనుచు రాత్రికింటికి బోపువారు. తమ పెద్దలెప్పుడైన నడవివస్తువులం దీసికొని పట్టణప్రాంతములకుబోయినప్పుడు ఆపిల్లలు వ్రాసుకొనుటకు గాగితములును గలములందెచ్చి యిచ్చువారు కావున నవి యన్నియు నదృష్టదీపుడు తన రాజ్యాధికారమునకుగాను వినియోగము చేయుచుండెను.

అది మిక్కిలి భయంకరమైన యరణ్యమగుటచే నచ్చటికి నెన్నడును నితరమనుష్యులు వచ్చువారుకారు. అచ్చటికి మిక్కిలి దూరములోగాని దాపున పట్టణముగాని గ్రామముగాని లేదు. ఇట్లుండగా నొకనాడు సింధుదేశపురాజు వేటవేడుకచే నయ్యడవికివచ్చి యచ్చోట శిబిరములు వేయించి రెండుమూడు దినములుండి వేటాడెను. ఆ వార్త నదృష్టదీపుడు బాలురచే దెలిసికొని వెదురుబియ్యము, తేనె, ముత్తియములు, చారపప్పు, చామరములు మొదలగువస్తువులు సంగ్రహించి యవియన్నియు మూట గట్టించి విజ్ఞాపనపత్రికాపూర్వకముగా నొక గోపబాలునిజేతికిచ్చి యంపెను

ఆయుత్తరము జదువుకొనిన నిట్లున్నది. మహారాజు సింధుదేశ రాజుగారికి నమరావతీచక్రవర్తి యదృష్టదీపమహారాజు చేయు విజ్ఞాపనము. తాము మా యడవికి వచ్చుటచే మిక్కిలి సంతోషమైనది. ప్రస్తుతము వచ్చి మీదర్శనముచేయుటకు నవకాశము చిక్కినదికాదు. మేము మీ మైత్రినిగోరి మాజ్ఞాపకార్థ మీయడవివస్తువుల బంపితిమి. మీరు మాకీ యడవిలో వసించినందుల కీయవలసినపన్ను స్వీకరింపుము. సర్వదా తలంచుచుండవలయును. ఇవియే పదివేల విజ్ఞాపనములు.

- అమరావతీచక్రవర్తి, అదృష్టదీప మహారాజు.

అనియున్న యుత్తరమును జదువుకొని నిజముగా నట్టిచక్రవర్తి యున్నాడు కాబోవుననుకొని చక్రవర్తిశబ్దమునుబట్టి తనకంటె నతడే యధికుడని తలంచుచు దన కాయనజేసినమర్యాదకు మిక్కిలి సంతసించి యాకానుకల స్వీకరించి మరల నొక యేనుగయు రెండులొట్టియలు నాలుగు గుఱ్ఱములు మణిఖచితమగు నొకపతకమును గొన్ని చీనాంబరములు లెక్కించి మీరు వ్రాయించినయుత్తరమును బంపించిన కానుకలు నందినవి. మిక్కిలి సంతోషించి యావస్తువులు మీజ్ఞాపకార్థము సంతతము, దాపున నుంచుకొనియెదను. మమ్ముగూడ మీరు మరువగూడదు తిరిగి యీ వస్తువుల నంపితిమి మన్నింప వలయు సర్వదా వార్తల దెలుపుచుండవలయునని వ్రాసి యావస్తువులతో నుత్తరమిచ్చి తమభటుల నా గొల్లపిల్ల వానివెంట నంపెను.

అదృష్టదీపు డట్టియుత్తరముతో నాకానుకను నందుకొని సంతోషించుచు నంతకుబూర్వమే పెక్కెండ్ర రాజుల పేరులు వినియున్న వాడు కావున నప్పుడే నేపాళ దేశపురాజు పేర నారీతినే యుత్తరము వ్రాసి సింధుభూపతియిచ్చిన వస్తువాహనము లన్నియు గానుకగా గోపబాలురకిచ్చి యంపెను. నేపాళదేశపురాజు ఆ వస్తువాహనములు స్వీకరించి మీతో మైత్రి నంగీకరించితినని సగౌరవముగా తిరుగ నుత్తరము వ్రాయుచు నావస్తువులకు నిబ్బడిగా మరల వారిచేతి కిచ్చియేయంపెను. ఆ గోపకులు నట్టివస్తువులన్నియుందెచ్చి యదృష్టదీపున కిచ్చిరి. వాని మొత్తమును అతడప్పుడే యుత్తరముతో విదర్భదేశపు ప్రభువునొద్ద కనుప నావైదర్భుడును సంతసింపుచు దానికి రెండు రెట్లధికముగా మరల నంపెను.

ఈరీతి ప్రతి భూపతికిని బంపుచుండ నదృష్టదీపుని పేరు భూమియంతయు మిగుల విఖ్యాతిగా వ్యాపించినది మరియు వేలకొలది గుఱ్ఱములు, నేనుగులు, లొట్టియలు, రత్నభూషాంబరములు కానుకలుగా వచ్చుచుండుటయు వానిలో గొన్నిటి నమ్మించి దానవచ్చిన విత్తంబు పెట్టి ప్రతిరాజధానిలో నదృష్టదీపునిపేరిట సత్రములు వేయించు చుండెను. క్రమంబున నచ్చటనున్న గోపాలకుల కందరికిని మంచి దుస్తులిప్పించి గుఱ్ఱమును, నేనుగులు నెక్కుపాటవము నేర్పించెను.

ఒక్కొక్క రాజు నొద్దనుండి వచ్చిన కానుకలు లక్షలకొలది నుండుటచే వానిలో సగము సగముగా విభజించి యిరువురు రాజులకు బంపుచుండెను. మఱియు నాయారాజధానులలో బర్వదినములయందు దానధర్మములక్రింద గొంతసొమ్ము వ్యయపరచుచుండెను జగంబంతయు నదృష్టదీపుని పేరు వ్యాపించినది. కాని యతం డెచ్చటనుండునో మాత్రమెవ్వరికిని దెలియదు. అతడు కానుకలుగా వచ్చు ధనము వెంటనే వినియోగము చేయుటగాని మరియొక రాజుగారికి బంపుటగాని చేయును. దానిలో గాసైనను ముట్టలేదు. యథాప్రకార ముదయమున బశువుల వెనుక నడవికి వచ్చి యచ్చట పిల్లలతో నామర్రిచెట్టుక్రింద దారు పీఠమున గూర్చుని యావేడుక రాజ్యము సేయుచుండెను.

ఈరీతి రెండుమూడు సంవత్సరములు జరుగువరకు పుడమిలోనున్న రాజు లందరు మిత్రులయిరి. ప్రతిసంస్థానములో నతనిపేరే చెప్పుకొనదొడంగిరి. పెక్కేల! ప్రజలు వాడుకమాటలతో గూడ కన్యలం జూచినప్పు డదృష్టదీపునంతవానిం బెండ్లియాడుదువులే యనియు వీడదృష్టదీపునివలె వచ్చుచున్నవాడనియు నతండటుల గర్వపడుట కదృష్టదీపుడా యేమి యనియు నీరీతి నతని ప్రస్తావన దెచ్చుచుందురు. ఒకనాడు పుడమిగల మహారాజులందరు విశ్వేశ్వరమహాదేవుని మహాపూజామహోత్సవమునకు గాశికివచ్చిరి. అప్పుడందరును గలసి మాటలాడుకొనుటలో ప్రతిరాజును నదృష్టదీపుడు తనకు మిత్రుడనియు నతని పరిచయము తమకు నెక్కుడుగా నున్నదనియు చెప్పదొడంగెను. ఆ యుత్సవమునకు నదృష్టదీపుడు గాశికి వచ్చునేమోయని యనేకులు జూడవచ్చిరి. కాని యతనికాడ యేమియు గనంబడినదికాదు.

కాశీలో నదృష్టదీపుని సత్రములు నాలుగు గలవు. ఒక్కొక్క మారే లక్షల కొలది ధనమిచ్చియున్నవాడు కావున దాని వడ్డివలననే రాత్రింబగళ్ళు నిరభ్యంతరముగా వేలకొలది భుజించుటకు నుపయుక్తముగా నున్నవి. పుడమిలో నదృష్టదీపుని పేరనున్న సత్రములన్నియు నారీతిగానే వేయబడినవి. కావున వానిలో నేకొదవయు నుండదు. యజమానుని యవసర మెప్పటికిని దిరుగా గలుగదు. సత్రాధికారులు గూడ నా యదృష్టదీపు డెచ్చటివాడో యెట్టివాడో యెవ్వడో గురుతెఱుగరు. రాజులందరు నొండొరు లతని ప్రశంస దెచ్చుటచే వెఱగందుచు నతండెచ్చటివాడనియు నమరావతీరాజధాని యే దేశములోనిదనియు నతనికెంత దేశమున్నదనియు నత డెంత బలవంతుడనియు బ్రశంసింపజొచ్చిరి. కాని యతని నిజస్థితి యిట్టిదని యొక్కనికిని దెలిసినదికాదు.

అప్పుడు రాజులందరు సభజేసి మనకందరకు మిత్రుడైన యదృష్టదీపుని వృత్తాంతము దెలియకుండుట యుచితముగా నుండలేదు. ఇప్పుడు తప్పక యతని చరిత దెలిసికొని మనమందరముపోయి చూడవలయును. అతడు మిగుల సుగుణవంతుడు అతని సుగుణసంపత్తి యంతయు నతడు వ్రాసిన యుత్తరములబట్టియే తేటమగుచున్నది. అతని సత్రము లీయూరిలో బెక్కుగలవని చెప్పుచున్నారు. సత్రాధిపతులకు దానిసంగతి తెలియకమానదు. వారి రప్పించి యడుగుదమని యూహించుచు నప్పుడే వారికి వర్తమానము చేసిరి. సత్రోద్యోగస్తులును సత్వరముగా నా సభకు వచ్చిరి. వారిం జూచి మీరున్న సత్రములెవ్వరివని యడుగగా నదృష్టదీపమహారాజు గారివని చెప్పిరి. అతండెందున్నవాడని మరల బ్రశ్న వేయ నదిమాత్రము మాకు దెలియదని యుత్తరము జెప్పిరి.

అట్లయిన మీకు విత్తమెవ్వరు పంపుచున్నారనగా మొదట నొక్కమారుగానే యెల్లకాలము సరిపడునట్లు వారి యుద్యోగస్థులు వచ్చియిచ్చిరని చెప్పిరి. ఆ మాటలు వినినతోడనే యారాజులందరు మిక్కిలి యద్భుతమందుచు వెండియు భూమి యొక్క పటమును దెప్పించి యందుగల దేశములన్నియు వేరువేర నిరూపించి చూచిరి కాని యమరావతీ రాజధానిగల దేశమెందును గనంబడినదికాదు. కానుకలు దెచ్చినప్పు డక్కింకరుల నతని నివాసము నడుగకపోయితిమే యని పశ్చాత్తాపపడుచు నతని వృత్తాంతము దెలియుటకై పెక్కుతెఱంగుల బ్రయత్నించుచుండిరి.

తరువాత వారందఱు విఫ ప్రయత్నులై యీసారి యదృష్టదీపు డెవ్వరికేని గానుకలు పంపినచో నా వచ్చిన భటులవెంట మన కింకరులంగూడ ననిపి యతని దేశము తెలిసికొనివచ్చునట్లు చేయుదమని నిశ్చయించుకొని తమ తమ దేశములకు బోయిరి. మరియు నొక్కనా డదృష్టదీపుడు పాండ్యదేశప్రభువగు మలయధ్వజమహారాజుగారికి బదివేలు గుర్రములు, నారువేల యుష్ట్రంబులు, రెండువేల యేనుగులు, లక్ష వెలజేయు రత్నహారములు, పదివేల వాహనంబులు మరియు జీనిచీనాంబరములు కానుకగా పంపినం జూచి యారాజు విభ్రాంతుండగుచు నోహో! యదృష్టదీపుడు నాకుం గానుకగా నిచ్చిన వాని మొత్తమునకు నాయైశ్వర్యము సరిగానుండునో లేదో ఇట్టివి నేనీ రాజుగారికి మరల నేమియంపుదును! అమ్మహాత్ముని యైశ్వర్య మేపాటి యదియోకదా ! ఆయన దర్శనముజేసిన ధన్యులగుదుము. మరల నివియే పంపుచు మరికొన్ని యేనుగులమాత్ర మధికముగా నిచ్చువాడ. నేనుగూడబోయి యమ్మహాపురుషుని పాదములంబడి యపరాధము జెప్పుకొనియెదనని తలంచి యా కానుకలు దెచ్చిన కింకరులతో నిట్లనియె.

రాజభటులారా! మీ రాజుగారుచేసిన సత్కారమునకు నేను మిక్కిలి సంతసించితిని. ఆయనకు బ్రతిసత్కారము నేనేమియు జేయలేను. స్వయముగావచ్చి యాయన పాదంబులం బడియెద, ఆయన ప్రసిద్ధి జగంబంతయు నిండియున్నది. అట్టివారి దర్శనము చేయుటకంటె పుణ్యమున్నదా ఆదేశ మెచ్చటనున్నది! అయ్యమరావతికి బోవుమర్గమెట్లు? నాకు రాజుగారిదర్శనము జేయింతురా? యని యడుగగా నాకింకరులిట్లనిరి. దేవా! ముందుగా నేను వచ్చుచున్నానని యాయనపేర యుత్తరము వ్రాసి యాయన యనుమతి వడసిపోవలయును. మీకట్టి యుత్సాహము గలిగియున్నచో నుత్తరము వ్రాసి మా చేతికిండు మేము పోయి ప్రత్యుత్తరము తీసుకొని వత్తుమని చెప్పగా నా రాజు సమ్మతించుచు నారీతి ప్రార్ధనాపూర్వకముగా నుత్తరము వ్రాసి యా వస్తువాహనములతో గూడ దమభటుల గొందర బంపి బ్రత్యుత్తరము తెమ్మని యాజ్ఞాపించెను.

అదృష్టదీపుడు తన భటులకు జేయవలసిన కృత్యములన్నియు నంతకు పూర్వమే బోధించియున్నవాడు. కావున వాండ్రలో గొందరు ముందుగాబోయి మలయధ్వజుని దూతలువచ్చుచున్నట్లు చెప్పిరి. అదృష్టదీపు డప్పు డాలోచించి యోహో! పెక్కెండ్రు రాజులు నన్ను జూడవలయునని ప్రయత్నించుచున్నట్లు దెలియుచున్నది. నా గుట్టుబయలైనచొ నిదివరకు వ్యాపించిన కీ ర్తియంతయు గళంకమై పోవును. కనుక నీరీతియంతయు గట్టిపెట్టి కొన్నిదినములు ప్రచ్ఛన్నముగా నుండుటయే యుత్తమమని తోయుచున్నది. ఇప్పుడా భటుల నిచ్చటికి రానీయగూడదు.

అని తలంచుచు మలయధ్వజునిపేర నదృష్టదీపమహారాజుగా రిప్పుడు తీర్థయాత్రకు బోయినారనియు గొలదిదినములలో వచ్చుననియు వచ్చిన తరువాత మేముత్తరము వ్రాయుదుమనియు నప్పుడు రావలయుననియు నొకయుత్తరము మంత్రి వ్రాసినట్లు వ్రాసి దానిమలయధ్వజుని కింకరుల కెదురుగా దీసుకొనివెళ్ళుమని పంపెను. మరియు మలయధ్వజు డిచ్చిన ద్రవ్యమంతయు దానధర్మముల క్రింద నొక్కదినమున పుణ్యక్షేత్రములలో బంచిపెట్టవలయునని కింకరుల కాజ్ఞాపించె. ఆయుత్తరముల జూచికొని మలయధ్వజుని దూతలు అదృష్టదీపుని దాతృత్వమునకు విస్మయమందుచు నతండు లేనప్పుడు పోవుటయేలనని యచ్చటనుండియే మరలి తమ పురమునకు వచ్చి యాయనచర్యలన్నియు నన్నియు నద్భుతముగా జెప్పియతని నాశ్చర్యసాగరంబున నీదులాడజేసిరి.

ఎంత మహారాజయినను అంతద్రవ్యము నొక దినములో పంచి పెట్టుటకు సమ్మతించునా! అప్పటికి నదృష్టదీపునికి బదునెనిమిదేడుల ప్రాయమువచ్చినది. అంత దనరూపము జూచుకొని యాగోపకుల కంటె మిక్కిలి వ్యత్యయముగా నుండుటచే ననుమానము జెందుచు నొకనాడు తనకు గథలు చెప్పుచుండెడి ముసలిదాని యొద్దను బోయి మెల్లన నిట్లనియె అవ్వా! నీవు నాకు జెప్పెడికథలచే లోకమేమియు జూడకున్నను జూచినట్లె పొడగట్టుచున్నది మరియు నొకసారి దేశముగూడ జూడవలయునని యభిలాష గలుగుచున్నది. ఒక్కొక్కటి యడిగెదను. రహస్యమైనను దాచక చెప్పవలయును. నేను పుట్టిన దినము, ప్రదేశము దెలిసికొన నవసరమై యున్నది. ఎవ్వరినడిగినను జెప్పిరి కారు. నీవు పెద్దదానవు. నీకు జ్ఞాపకముండక మానదు. నీకు నాయందు మొదటనుండియు నక్కటితము పెంపుగదా? యని పలుకగా నదివిని యోహో! యితండక్కటిజము పెంపుగదా యనుచున్నవాడు పెంపుసంగతి తెలిసినది కాబోలు. నిక నేను మాత్రము దాచనేల? నా కొడుకు వీనితో నా సంగతి చెప్పవలదని బోధించెనుగాని దీనంజెడిపోయిన దేమున్నది.

అని నిశ్చయించుకొనుచు బాబూ! నీవు మా యింట బుట్టలేదు. మా పిల్లవాండ్రందరు నడవికి బోగా నచ్చట నొక మర్రిచెట్టు క్రింద బాముగరచి యొకస్త్రీ చచ్చియున్నదట. ఆమె ప్రక్కలో నీవు దాని లేపుచు నేడ్చుచుంటివట. ఆపాము నిన్ను గరువక సర్పమునెత్తి నెత్తిమీద గొడుగుగా బట్టుచున్నదట. అదిచూచి బాలకులా యురగమును బెదిరించుచు నిన్నెత్తుకొని మాయూరిలోనికి దీసికొనివచ్చిరి. మాపింగళకు డదివిని యపుత్రుకుడుగావున నిన్నింట బెట్టుకొని పెంచుకొనుచుండెను. అప్పటికి నీకు మూడు సంవత్సరములు ప్రాయముండును. ఇప్పటికి పదునైదు సంవత్సరములు దాటినవి. దీనింబట్టి యూహించు కొనుమని జరిగిన వృత్తాంతమంతయుం జెప్పినది. చేతగాసులేక జగమంతయు దనకీర్తి వ్యాపింపజేసినదిట్ట యొక గొల్ దానియొద్దనుండి రహస్యము తెలిసికొనుట యేమియాశ్చర్యము.

అదృష్టదీపుడట్టి మాటలు విని మిగుల విచారింపుచు నయ్యో! పాముగరచిచచ్చినది మా తల్లికాబోలు. నన్ను దీసుకుని యొంటరిగానడవికి వచ్చుటకు గారణమేదియో గదా! మా తండ్రి యేమయిపోయినో? యే కులమువారో నాకు మరి యెవ్వరేని బంధువులు గలిగి యుందురేమో యీవిషయము నాకెట్లు దెలియును. దేశములన్నియు దిరుగుచుండ నెప్పటికేని తెలియక మానునా? కూపస్థకూర్మమువలె నీ యడవిలో నుండనేల నొకసారి యెట్లయినను దేశయాత్ర చేయుటయే యుచితమని తలంచి తన కత్యంతమిత్రుడయిన బలభద్రుడను వానితో జెప్పి యింతకుమున్ను కానుకలుగా వచ్చిన గుఱ్ఱములలో నుత్తమమయినదాని దాచికొని యుండుటచే నొకనా డెవ్వరికిని దెలియకుండ బలభద్రునితో నడవికి బోయినట్లే పోయి యా గుఱ్ఱమెక్కి యొక మార్గమునంబడి బోయెను.

ఆదారింబడి పోవబోవ గొన్నిదినముల కొకపట్టణము గనంబడినది. అది విదర్బదేశపు రాజధానియయిన భర్మాపురము. దాని ననంతవర్మయనురాజు పాలించు చున్నవాడు. అవ్వీటిలో విదేశస్థులకు నివసింపదగినది యదృష్టదీపుండుంచిన సత్రమే. కావున నతండును బౌరులవలన నదియున్న చోటు దెలిసికొని యా మిత్రునితో గూడ నచ్చటికి బోయెసు. అశ్వారూఢుడై యతండట్లు వెళ్ళినతోడనే యచ్చటి సత్రాధికారులు వాడుక ప్రకారము నెదురుగా బోయి యర్ఘ్యపాద్యాదులచే నర్చించి యల్లునికి జేయునట్లుగా సుపచారములచేయ దొడంగిరి. ఆ రీతినంతయు మొదట సత్ర ముంచునపుడు అదృష్టదీపు డేర్పరచినదే. అతండట్టి పద్ధతులతో వ్రాసిన పత్రికల యందొకచోట గట్టంబడి యున్నవి. దానింజదువుకొనుచు నతడు మిక్కిలి సంతోషించుచుండెను. తాను జూచుచుండగనే యనేకులాసత్రములోనికి వచ్చిరి. సతాధిపతులు వారినెల్ల నట్టి మర్యాదలతోనే తోడి తెచ్చిరి. సత్రములో సతతము నదృష్టదీప మహారాజు పేరు మ్రోగుచునే యుండును. అతనిపేరు పద్యములచేత గీతములచేత రచించి యనేకులా గోడలమీద వ్రాసిరి మరికొందరు విగ్రహములు వ్రాసి క్రింద నదృష్టదీపుడని విలాసముల వైచిరి. ఈరీతి నందెచ్చట జూచినను తనపేరే వ్యాపించి యున్నది. ఆ సత్రములో గుటుంబములతో వచ్చియున్న బ్రాహ్మణులందరు సంభాషించుకొనుచుండి నిట్లు విననయ్యె.

రామశాస్త్రి - వెంకటశాస్త్రిగారూ! తమరిచ్చటికి వచ్చి యెన్ని దినములయినది. యింకనుగొన్ని నాళ్ళుందురా?

వెంకటశాస్త్రి - రామశాస్త్రిగారా! తమ రెచ్చటనుండి వచ్చుచున్నారు. నేను గుటుంబముతో వచ్చి యారు మాసములైనది. మరికొన్ని దినములుండెదను. ఆయదృష్టదీపమహారాజు సత్రము వేసెను గదా ! యెంతకాలముండినను నేలోపములేదు. ఇంటికన్న గుడి పదిల మనునట్లు మనయిండ్లలో నేమియున్నది. ఆహా! ఆ మహారాజు యెచ్చటనుండెనో కాని ఎంత పుణ్యాత్ముడండి! ఆయనయుంచిన సత్రములన్నియు నీతీరుననే యున్నవి. ఎన్నిదినములుండినను బొమ్మను మాటలేదు.

రామ - ఆయన సత్రములు మీరేమి చూచిరి. నేను జూచిన వానిలో నిది యెంత. నేనాయనను జూడవలయునని యెన్ని యో దేశములు తిరిగితినికాని యెచ్చటను కనంబడలేదు. ఎచ్చటజూచినను ఆయన ప్రఖ్యాతిమాత్ర మొక చోటకంటె మరియొకచోట నెక్కుడుగా నున్నది. నేను సమస్త శాస్త్రములు జదివితిని నన్ను జూచినంత నాయన సంతోషించుచు జక్రవర్తిగా జేయడా? ఆయన యీవికి మేరలేదు. మనము వినియున్న కర్ణదధీచిశిబివిక్రమార్కాదులను మించిపోయినాడు. మొన్న రామేశ్వరములో నమ్మహానుభావుడు చేయించిన దానములకు నెంతసొమ్ము వ్యయమైనదో లెక్కింప శక్యమా? మొన్ననొక బ్రాహ్మణుడు నూరేనుగులతో బోవుచు దారిలో నొకచోట నాకు గనంబడెను అతని శుద్ధదరిద్రునిగా నంతకు బూర్వము నే నెఱుగుదును. కావున నీయేనుగు లెక్కడివని యడిగితిని. అప్పుడతండు నన్ను గురుతుపట్టి రామశాస్త్రిగారా! అయ్యో! ఎంత పొరబాటు చేసితిరండి! మీరుకూడ రామేశ్వరము వచ్చినచో నెంతో ద్రవ్యము దొరుకునుగదా? అదృష్ట దీపమహారాజుగారు పదిదినములక్రిందట ననేకకోట్ల ధనము పంచి పెట్టిరి. నేనంతయు నైన తరువాత బోయితినిగాని నీయేనుగులు మాత్రము దొరికినవి. మెదటనున్న బ్రాహ్మణులకు మితిలేని ద్రవ్యమిచ్చిరి. ఈలాగున జరుగునని యెవ్వరికిని దెలిసినదికాదు. లేనిచో నీ భూమిలో నున్న బ్రాహ్మణులందరు నచ్చటికి రాకపోవుదురా? ఆహాహా! అచ్చటికి వచ్చిన బ్రాహ్మణులందరు గుబేరులైరి. అమ్మహారాజు పుణ్యమేమని స్తుతియింపుచు నాయేనుగుల దోలుకొనిపోయెను. అట్టి పుణ్యాత్ముడిప్పుడు తీర్థయాత్రకు వెళ్ళినట్లు ప్రతీతిగా నున్నది. అందువలన నేనును ప్రతి తీర్థమునకును బోవుచున్నాను.

వెంకట - దేనికైనను ప్రాప్తముండవలయునుగదా! నేను జిర కాలమునుండి యీ దరిద్రదేవతచే బాధింపబడుచున్నాను. అయ్యయ్యో! రామేశ్వరమైన బోయితిని గానే? అట్టి బుద్ది నా కేలబుట్టును.

అని యిట్లు తన సంగతి వారిరువురు మాట్లాడుకొనుచుండగా విని యదృష్టదీపుడు సంతోషించుచు వారి కేమైన నీయదలంచుకొని నను తనయొద్ద నేమియు లేక పోవుటచే జింతింపుచు నా సత్రములోనే యొకచోట బసజేసియుండెను. మఱియు నా పట్టణములో దమవారి జాడ యేమైన దెలియనేమో యని కొన్ని దినములందుండి నిత్యము సాయంకాలమునందు బలభద్రునితో గూడ వీధులవెంబడి విహారార్థమై తిరుగుచుండెను.

ఇట్లు తిరుగు నొకనాడాయూరి దేవాలయములో సాముద్రిక శాస్త్రవేత్తయగు సన్యాసియుండుట విని యాయన యొద్దకు బోయి స్తుతివాక్యపురస్సరముగా నాశ్రయించి హస్తము చాపుచు రేఖలం జూపి తల్లిదండ్రుల విషయము సోదరభావమును గురించి ఫలము చెప్పుడని వేడుకొనియెను. అప్పుడా సన్యాసి యతని హస్తరేఖల జూచి విస్మయ మందుచు ఆహా! నా జన్మావధిలో నిటువంటి చేయి జూచియుండలేదు. సాముద్రికశాస్త్రములో జెప్పిన యుత్తమపురుషలక్షణము లన్నియు నీ యందు యున్నవి. నీవు సామాన్యవేషముతో నుండుటకు నాకు మిక్కిలి యాశ్చర్యముగానున్నది. అదృష్టదీపునికి వచ్చినంత ఖ్యాతి నీకు రావలసియున్నది. నీ తల్లిదండ్రు లిప్పుడు బ్రతికియున్నవారు. నీ కొకసోదరు డుండవలయు. బెక్కేల నీవొక్కడవే యీ భూమి యంతయు బాలింపదగి యున్నదని చెప్పెను.

ఆ సన్యాసి మాటలు విని యతం డదరిపడుచు అయ్యో! నా తల్లిదండ్రు లెక్కడనున్నవారో కదా? పాముగరచి చనిపోయినది మాతల్లి కాదు కాబోలు. నాకొక తమ్ముడుగూడ గలిగియున్న వాడట. అట్టి వాడెప్పుడు గనంబడునో? ఈ సన్యాసి మాటలు తథ్యములు. అని తలంచుకొనుచు నా సన్యాసితో స్వామీ? మీ దయయుండినచో నేకొదవయు లేదని చెప్పి యతనిచే ననుజ్ఞాతుడై యింటికి బోయెను.

కాంతిమతి కథ

ఆ సమయంబున నాపట్టణపు రాజకూతురు కాంతిమతియను కన్యామణి చెలికత్తెయ చతురికయనునది యందు గూర్చుండి యా సన్యాసి చెప్పిన మాటలన్నియు వినుచుండెను. అచ్చతురికయు దన ప్రాణసఖురాలి కనుకూలుడగు భర్త లభించునో లభింపడో యా సన్యాసిని దెలిసికొను తాత్పర్యముతో నచ్చటికి వచ్చినది. కావున నట్టి మాటలు వినినతోడనే యదృష్టదీపుని బరీక్షించి చూచి యతని సౌందర్యవిశేషమున కచ్చెరువందుచు నితండే కాంతిమతికి దగినవాడు. వీనివెంట రహస్యముగా బోయి కులశీలనామంబులు దెలిసికొనివచ్చెదఁగాకయని నిశ్చయించి యట్లు చేసినది. అతని వెంట రహస్యముగా రెండు మూడు దినములు తిరిగి యతని చర్యలన్నియుం గ్రహించి తరువాత గాంతిమతి యొద్దకు బోయినది.

అక్కాంతిమతియు దాని ముఖవిలాసముల గనిపెట్టి యేమే చెలీ! ఇన్నాళ్ళు చేసితివేమి? యాస్వాములవారి దర్శనమైనదా? మాట్లాడుటకవసర మిచ్చెనా? మన సంగతులన్నియుం జెప్పితివా? ఆయన యేమి సెలవిచ్చెనో చెప్పుము. మన కోరిక సఫలమెప్పటికైన నగునా? వేగము జరిగిన విశేషములన్నియుం జెప్పమన నది ముసి ముసి నగవులు నవ్వుచు గాంతిమతి కిట్లనియె. భర్తృదారికా! మనకు సన్యాసి యేమియు జెప్పనక్కరలేదు. భగవంతుడు తానే తీసికొనివచ్చెను. నీయభీష్టదేవతలు ప్రసన్నులైరని చెప్పగా విని యవ్వనిత తొందర పడచు చెలీ! ఎట్లెట్లూ వేగము చెప్పుము. నీ మాట వినుదాక తాళకుంటినే యని యడుగ నది మరల నిట్లనియె.

బోఁటీ! నేనా సన్యాసియొద్దకు బోవువర కొకచక్కని కుమారరత్న మయ్యతిచేత జేయిజూపించు కొనుచుండెను. అతని చేతిరేఖలు చూచినతోడనే నాలుక గరచుకొనుచు నాసన్యాసి మిక్కిలి వెఱగుపడి నీవీభూమండలమంతయు నేలగలవనియు నదృష్టదీపునంత ఖ్యాతి సంపాదింతువనియు జెప్పెను. అక్కుమారుని సౌందర్య మడిగితివేని కంతువసంత జయంతాదులకన్న మిన్నగానున్న వాడు ఆహా! వాని జవ్వనము, పొంకము, లావణ్యము, సౌకుమార్యము, చూచి తీరవలయుంగాని చెప్పిన దెలియదు. అట్టివాడు నీకు దగినవాడని నిశ్చయించి మరియు నాతనివృత్తాంతము దెలియగోరి ప్రచ్ఛన్నముగా నతనివెంట రెండుమూడునాళులు తిరిగితిని. ఒకనాడు వానికిని వాని మిత్రునికిని జరిగిన సంవాదమిట్లున్నది.

మిత్రమా! పుడమియంతయు నీకీర్తి వ్యాపించినది. నిన్ను మాత్ర మెవ్వరు నెరుగరు. నీచాతుర్యము మిగుల గొనియాడదగినదే. నీవు మిగుల పుణ్యాత్ముడవని యాప్తుడు పలుకగా విని యాప్రోడ బలభద్రా! నేనెంతవాడినైన నేమిలాభమున్నది. నాతల్లిదండ్రులును సోదరుడు గనంబడినప్పుడుగదా నాకీఖ్యాతికి సార్ధకము. అడవిగాచిన వెన్నెలవలె నాచాతుర్యము నౌన్నత్యమును జూచి మెచ్చువారెవరు? ఆహా! తలిదండ్రులచే మన్ననల జెందువారెంత పుణ్యాత్ములోకదా యని పలుకుచు విచారింప దొడంగెను. దీనిబట్టి చూడనతండెవ్వడో విఖ్యాతిగల పురుషుడువలె దోచుచున్నది. కారణాంతరమున బ్రచ్ఛన్నవేషముతో దిరుగుచున్నవాడని తలంచెదను. అతడు తప్పక నీకు దగినపురుషుడు. నీవువానిం జూచితివేని విరహవేదన జెందగలవని పలుకగా విని యాకాంతిమతి రాగవిష్టహృదయయై సంభ్రమముతో నిట్లనియె.

చెలీ! యాభాగ్యశాలి నాకెట్లు కనంబడును. వాని నాకు జూపి నీవాక్యము లన్వర్ధములు చేసికొనవా! యేది యుపాయము వానిందర్శింప నాహృదయము తత్తర మందుచున్నయది. యేమిచేయుదము! వేగము చెప్పుమని యత్యాతురముగా బలుకుటయు నచ్చతురిక నవ్వుచు నోహో! సఖీ! నీవాతనింజూడకయే యింత తొందర పడుచునుంటివి! చూచినతరువాత నన్నెంత వేసెదవోకదా! కానిమ్ము ముందుగా నతని యాకృతి జిత్రపటంబున వ్రాసికొనివచ్చెదను. దానింజూచిన తరువాత నీకు నింపుగా గనంబడినచో నతనింజూచు ప్రయత్నము చేయుదమని పలుకుచు గాంతిమతి యనుమతి వడసి తూలికయు బటమునుగొని యదృష్టదీపుడున్న చోటికి బోయినది.

ఆ సమయమున నతండు బలభద్రునితో నిష్టగోష్టి మాటలాడుచుండెను. అతనియొద్దకు మెల్లనబోయి నమస్కరింపుచు ఆర్యా ! మిమ్ము నీయూరిలో పదిదినములనుండి చూచుచుంటిని. మిమ్ముజూచినపుడెల్ల మీవృత్తాంతమించుక దెలిసికొన వలయునని యభిలాషకలుగనదికాని యెప్పుడును ప్రశ్నావకాశము దొరికినదికాదు. నేడిదియే పనిగా నిచ్చటికి వచ్చితిని. నాకు జిత్రపటములు వ్రాయునేరుపు గలిగియున్నది. చక్కనివారి పటములు వ్రాసి యమ్ముకొనుచుందును. నాకిదియే జీవనము. మీయాకృతిజూడ ననన్యసామాన్యమై యున్నది. మీరూపము వ్రాయవలయునని యుత్సవముగానున్నది. నా విజ్ఞాపనము మన్నింపవలయునని వినయముగా బ్రార్ధించిన నతండు నవ్వుచు నిట్లనియె.

బోఁటీ! మా కాపురము కాశీపురము. నా పేరు హరిదాసు. నే నీయూరు విహారార్ధమై వచ్చితిని. సామాన్యమానవుడైన నా రూపము వ్రాసికొనిన నీకేమి లాభము దొరకును. ఈ ప్రయాసము నీకేల నని పలుకగా విని యది యతని నప్పటి ముఖచర్యలం బట్టి మరుగుపెట్టి పలికి నట్లూహించుచు నార్యా! నాకిది ప్రయాసము కాదు. సంతోషమైన పనియే. మీవలన గొప్పలాభము పొందవలయునను తాత్పర్యముతోనే యిట్టిపని కుద్యోగింపుచున్నదాన ననుగ్రహింపుడు. ఒకనిముషము మాత్రము స్థిరులై యుండుడని పలుకుచు నతండొడంబడి యట్లు నిలుచున్న యాతని యాకృతి నచ్చుగ్రుద్దినట్లు వ్రాసి యతనికి జూపినది.

ప్రతిబింబమువలెనున్న తన యాకారము జూచికొని యదృష్టదీపుడు దాని శిల్పినైపుణ్యమునకు మెచ్చుకొనుచు నాఫలకము దాని చేతికిచ్చెను. అమ్మగువయు నగుమొగముతో దానినందుకొని కడు వేగముగాబోయి కాంతిమతిచేతి కా పటమిచ్చినది. దానింజూచినతోడనే కాంతిమతి మూర్ఛవోయి కొంతకు దెలిసికొని చతురికా! నిజముగా నతండిట్లుండెనే లేక నన్నాడించుటకిట్లు వ్రాసితివా! యిట్టి రూపముగల పురుషం డుండుట కథలమాటకాని సత్యమగునా! ఏమే చెప్పుము. చెప్పుము. నీకన్న నా కెవ్వరు. ఇట్టి సమయములో నాతో బరిహాసమాడకుము నేనీ పాదంబులకు మ్రొక్కెదనని మిక్కిలి విరాళిందూలి పలుకుచున్న యాజవరాలింజూచి యాచతురిక నవ్వుచు జవ్వనీ? నీతో నేను పరిహాసమాడుదునా ? నిజముగా నతనియాకృతి యంతయును వ్రాయుటకు నలవడినదికాదు. అట్టిరంగులు నాయొద్దలేవు. పోలిక మాత్రము వ్రాసితిని. అతని చక్కదనం బింతయని చెప్ప శక్యమా? తొందరపడకుము. నీకతనిం జూపెదనని పలుకగా నాచిలుకలకొలికి మరల నిట్లనియె.

అయ్యో! నీవెన్నడో చూపెదనని పలికిన నేను దాళగలనా? యెప్పుడు చూపెదవో నిజముగా జెప్పుము. స్వాంతమున గంతుసంతాప మంతకంత కగ్గలమగుచున్నది. లెమ్ము లెమ్ము ఇప్పుడేపోయి వానిందీసికొనిరమ్ము. నీకు మంచిపారితోషిక మిత్తునని మిక్కిలి తత్తరముగా బలికిన విని, కలికీ! నీతొందర చూడ నాకు వింతగా నున్నది. అతనిని దీసికొని వచ్చుటకు పైపైనున్నవా డనుకొంటివా యేమి? నాతో మాట్లాడుటయే దుర్ఘటమైనది నేనట్టి కారణము పన్నబట్టి యందులకొడంబడెను. కానిమ్ము మరలబోయి నాయోపినంత యుపాయములబన్ని వానిం దీసికొని వచ్చెద. ననుజ్ఞ యిమ్మని పలికి కాంతిమతి చిత్రపటమునుగూడ తీసికొని యతనియొద్దకు బోయినది.

దానించూచి యదృష్టదీపుడు నవ్వుచు ఏమే మరలవచ్చితివి? వ్రాయుటలో మరియేదైనను మఱచిపోయితివా యేమి? విశేషము లెట్టివని చనువుగా మట్లాడుటయు నచ్చతురిక కృతపరిచయు డైన యతనితో మెల్లన నిట్లనియె. అయ్యా! నేను దమ యనుగ్రహమువలన నా చిత్రఫలకము నద్ది యనేక పటములు తీసితిని. పెక్కండ్రు కొనగలరు. యేశంకయు జేయలేదు. మారాజుగారికి గాంతిమతియను యథార్ధనామము గల కూతురుగలదు అక్కన్యక విద్యావయోరూపవిషంబుల ననపద్యయై యున్నది. నేనీచిత్రఫలకమును గొనియెదవాయని దాని యొద్దకు దీసికొనిపోయితిని. అయ్యతివయు దానిని బరీక్షించి చూచి నేను జెప్పినమాట నమ్మక యిట్టిపురుషుడు లేడనియు నీబుద్ధికుశ లతచే నట్లు వ్రాసితివనియు నాతో బంతమాడినది. నే నెంత జెప్పినను నొప్పుకొనినదికాదు. అందుమూలమున మాయిరువురకు వాదముగలిగినది. నిజముగా నట్టిపురుషుని జూచియే వ్రాసితినని నేనును యిట్టిసుందరు డీలోకమున లేడని యచ్చేడియయును బెద్దతడవట్లు పట్టుదలతో వాదులాడికొంటిమి. తుదకిట్లు వానిజూపితివేని నీకు వేయిదీనారములు బారితోషికమిత్తునని యమ్మత్తకాశిని నాతో యొత్తి పలికినది.

అట్టి శపధ మారాచపట్టి చేసినతోడనే నేను మిగుల సంతోషించుచు మీయొద్దకు బరుగెత్తుకొని వచ్చితిని. ఆర్యా! ఆ సొమ్మంతయు మీరిచ్చినట్లు సంతోషించెదను. నన్ను గురించి కొంచెము శ్రమపడవేడెదను. మాబోటిదీనుల మొరవినుట మీవంటి యుత్తములకు సహజ ధర్మముగదా? ఒక్కసారి యాచక్కెరబొమ్మ కన్నులం బడినంజాలును. అసొమ్ము నాకుదక్కును. అక్కలకంఠియు మిక్కిలి చక్కనిది. చూడు డిదిగో? దాని యాకృతిసైతము దీసికొనివచ్చితినని తనచేతిలోనున్న యాచిన్నదాని పటమును వానికి జూపించెను.

దానింజూచినతోడనే యతనికిగూడ చిత్తవిభ్రాంతి గలిగినది. అంతలో దెలిసికొని యమ్మోహము వెల్లడికానీయక యోహో! యిట్టి మోహనాంగి భార్యగా నుండినప్పుడుగదా సౌందర్యవంతునికి సాద్గుణ్యముగలుగును. ఇది నన్ను మాయ జేయుటలేదుగదా? నిక్కముగా నిట్టి సుందరీమణు లుందురా? కానిమ్ము. నాకు దానిం జూపింతునని చెప్పుచున్నది. పిమ్మటనే యాలోచింపవచ్చును. అని తలంచుచు దన హృదయముననున్న యభిలాష ప్రకటనగానీయక దానితో నల్లన నిట్లనియె.

చతురికా! నీవతి చతురవు. ఎట్లు వ్రాసినను వ్రాయగలవు. సంతతము నంతఃపురములలో గ్రుమ్మరు మీకాంతిమతికి నన్నెట్లు చూపెదవు? ఇక్కడకువచ్చునా? ఈ పటమువిషయమై నాకును నట్టి యనుమానము గలిగియున్నది కానిమ్ము. తీసుకొని వచ్చితివేని నాసంశయమునుగూడ విడగొట్టినదాన వగుదువు. పొమ్మని పలుకగా నద్దూతిక మరల నిట్లనియె. అయ్యా ! మీకు సర్వమును తెలియును. మీమాట కాదనుటకు నాకు సామర్థ్యమున్నదియా? ఆ కాంతిమతి నిచ్చటికి రమ్మనినచో ముచ్చటతో వచ్చుట కెంతమాత్రము సందియములేదు. కాని లోకోపవాదమునకుఁ గొంచెము వెఱవవలయును గదా! మగవారనిన స్వతంత్రులు. మీ రంతఃపురమునకు రానవసరములేదు. ఆచిన్నదాని మేడక్రిందనుండి వెళ్ళినచో నాకొమ్మ మిమ్మును జూచును. పిమ్మట నాయభీష్టము నెరవేరగలదు. అని వేడుకొనగా నతడు కాంతిమతిని జూచుటకు దనకు మిక్కిలి యుత్సాహము గలిగియున్నది గావున దనవలపు వెల్లడిగానీయక పరోపకారమునకై యొడంబడువానివలె సమ్మతించెను.

తరువాత నచ్చతురిక యారెండుచిత్రఫలకములు సరిగాబట్టుకొని యతనికి జూపుచు ఆహా! యీరెండుపటములు నెంతవింతగా నున్నవియో చూచితిరా యని పలి కెను. అతడు దాని యభిప్రాయము గ్రహించియు నెఱుగని వానివలె నీవు మిగుల నేరుపుగా వ్రాసినప్ పుడింపుగానుండ కెట్లుండునని యుత్తరముజెప్పెను. అద్దూతిక సంతసించుచు సాయంకాలమునకు గాంతిమతి మేడక్రిందుగా బోవున ట్లతనిచే నొప్పించుకొని యామార్గము గురుతుజెప్పి యప్పుడే పోయినది.

అంతట నయ్యదృష్టదీపుడు దాని మాటలధోరణియంతయుం జూచి యా చిన్నది తన్ను వలచియుండినట్లు గ్రహించి యాసంగతు లన్నియు బలభద్రునితో ముచ్చటించుచు నెట్లైనను మెలేయని యది చెప్పినచొప్పున సాయంకాలమునకు జక్కనివేషముతో నామేడక్రిందనుండి యిటునటు మూడుసారులు తిరిగెను. అప్పుడు పైనుండి కొన్నిపూవు లతనిమీద బడినవి. దానికి వెరగందుచు దలపైకెత్తి చూడగా జంద్రబింబమో యన నొప్పుచున్న చక్కని మొగంబొకటి గనబడినది. దానినట్లు రెండు మూడుసారులు చూచుచు మరల తలవంచుకొనుచు నింతలో నితరు లామార్గమున నడచుచుండిరి కావున నిలుచుటకు వీలులేక మరల నింటికిబోయెను. ఆవెంటనే యా చతురిక చనుదెంచిన జూచి యారాజకుమారుడు మందహాసము సేయుచు సుందరీ! నీయభీష్టము తీరినదా! అనిన ప్రకారము నీకు రాజకుమార్తె సొమ్మిచ్చినదా యని యడుగగా నది తలయూచుచు నిట్లనియె. ఆర్యా! మిమ్ము వృథాశ్రమ పెట్టినందులకు జింతించుచున్న దానను. ఎంతవారికైనను సొమ్ము విడుచుట గష్టముగదా! అమ్ముద్దియ యెద్దియో వంకబెట్టి పన్నిదము గెలువ వలయునని తలంపు గలిగియున్నది దూరముగా నుండుటచే మిమ్ము బరిశీలించుటకు వీలుపడినదికాదట. ఆచిత్రఫలకమును మిమ్మును దగ్గరనుంచుకొని చూచునప్పుడుగాని నమ్మదట. దీనికి నేనేమి సేయుదును. అట్టిపని యెట్లు తటస్థించునని నేను దానినే యడిగితిని దాని కచ్చిన్నది కొంతేసేపాలోచించి నేను రేపు ఉద్యానవనములోనికి వత్తుననియు నచ్చటికి దీసికొనిరమ్మనియు జెప్పినది. ఆవార్త దేవరవారికి విజ్ఞాపన సేయుటకై వచ్చితిని. నన్ను గురించి యిందొక్కసారి శ్రమపడవలయును. మీయుపకార మెప్పటికి మరచుదానను కానని ప్రార్థించినది.

దానిమాటలు విని యతం డోహో! కొంచెము చనువిచ్చిన నెక్కుడు చొరవ చేయుచుంటివే! పాపము దీనురాలుగదా యని యొకసారి మాటవినినచో వెండియు రమ్మని నిర్బంధించుచుంటివి. శుద్ధాంతకాంతల చెంతకు మేము వచ్చినచో భూకాంతు డెఱింగిన శిక్షింపడా? ఇదియుంగాక ద్వారరక్షకులు శంకింపరా! మా కంత శ్రమపడవలసిన యవసరమేమని తన హృదయమున నవ్వనితంజూడ వేడుకయున్నను బోవనీయక దానితో నిష్టములేనివానివలె బలికెను. ఆ మాటలకది యించుక గొంకుచు అయ్యా! ఇప్పుడు మీరు రానిచో నామాట దబ్బర అగుటయేకాక ద్రవ్యనష్టము కాగలదు. మీరు మొదటబడిన ప్రయాసమున కించుకయు సార్ధకములేదు. నాయందు దయయుంచి యొక్కసారి రావలయును మిమ్ము ద్వారరక్షకులు శంకింపకుండ నేను దీసికొనిపోయెదను. అయ్యుద్యానసౌధమునకు రెండుద్వారములు గలవు. రెండవదారిం బోయిన నెవ్వరును జూడరని బ్రతిమాలుచు బలికినది.

అతం డెట్టకేల కిష్టములేక సమ్మతించువానివలె నభినయించుచు గానిమ్ము ఈమారుగాక మరల రమ్మనినచో రానుసుమీ! అని పలుకుచు నచ్చటి కెప్పుడు పోవలయునని అడిగెను. అప్పుడది మన మిప్పుడే పోవుదమురండు. ఆ చిన్నదానికన్న ముందుగా బోయి అందులోనుందుము. పిమ్మట నాసుందరి రాగలదని పలుకుచు నతండొడంబడిన వెనుక రహస్యముగా దనవెనుక నతనిం దీసికొనిపోయి యాయుద్యానవనంబునంగల మేడలో బ్రవేశపెట్టినది ఆపట్టణములో రాజుగారికి గ్రీడావనము లనేకము లున్నవి. వానిలో నది మిక్కిలి చిన్నదియు మారుమూల నుండినదియు నగుటచే నందు దరుచు రక్షకపురుషులుండరు. ఎప్పుడేని రాజపుత్రిక విహరింప దానిలోనికి వచ్చుచుండును. అదృష్టదీపు డట్టి మేడలో బ్రవేశించి అందలివిశేషము లన్నియుం జూచుచు జతురికతో మీరాజకుమార్తె యెప్పుడు వచ్చునని అడిగెను.

అదియు మదవతిమదనా! మీరీసదనంబునం గూర్చుండుడు. నేనుబోయి యామదవతిని వేగమ తీసికొనివచ్చెద మన మిచ్చటికి వచ్చినట్లు తెలియకయే అక్కలికి జాగుచేసినట్లు తలంచెను అంతదనుక మీరీ చిత్రఫలకముల తారతమ్యం బరయుచుండు డని పలికి యా ప్రతిమ నిచ్చి అచ్చటనుండి కదిలి గుప్తముగా రాజకుమార్తె మేడమీదికి బోయినది. ఇంతలో నా రాజకుమారు డా కాంతిమతి చిత్రఫలకమును జూచుచు దాని సోయగంబంతయు నాపాదమస్తపర్యంతము వర్ణించి యచ్చెరువందుచు శిరఃకంపము జేయుచు ముద్దుబెట్టుకొనుచు గ్రమక్రమంబున మన్మథావస్థకులోనై మరుడు విరితూపుల దన హృదయము జురుకుచురుకున నాటింప నేమియుం దోచక యారాచపట్టి రాక నిరీక్షించుచు గడియ యుగముగా నెంచుచు దన మోహవిభ్రాంతి దెలిసికొనియు జిత్తమాపలేక తత్తరమందు చుండెను.

అంతలో నుత్తమాశ్వంబుల బూన్చిన శకటంబుమీద నప్పైదలిం దీసికొనివచ్చి అచ్చతురిక మెల్లన రెండవ ద్వారంబున లోపలకు బోయినది. ఆ బండి చప్పుడు వినినతోడనే రాజకుమారుని హృదయము బెదరుతో గూడిన ముదమును జెందుచుండ స్వాతిభావలక్షణము లన్నియు మేనంబొడగట్టినవి. ఆ సమయమున జతురిక కాంతిమతిని వెంటబెట్టుకొని యామేడపై కెక్కినది. అతండట్టితరి నేమియుం దోచక పీఠమునం గూర్చుండి విలాసముగా నెడమకాలు గదుపుచు నచ్చట నున్న వింతలు చూచువానివలె దృష్టి ప్రసారములు నలుమూలలకు నెరయజేయుచుండెను. అక్కాంతిమతియు నల్లంతదవ్వున నాతని జూచి లజ్జావశంబున దలవాల్చుచు నచ్చటనే నిలువంబడగా నప్పుడు చతురిక దాని చేయింబట్టుకొని రమ్ము రమ్ము. నేను జిత్రఫలకములో వ్రాసిన పురుషు డితడే చూడుము. ఇంచుకేని భేదము గనంబడిన నాకియ్యకొనినవిత్త మియ్యవద్దని పలుకుచు నతనియొద్దకు లాగికొని పోయినది.

కాంతిమతియు నడుమనడుమ బెడదచూపులచే నతని సోయగము చూచుచు అయ్యో! లాగకుము. తాళుము, తాళుము. నీ సొమ్మిచ్చెదనులే. అని పలుకుచు బలాత్కారము సేయుదానివలె నభినయించుచు నెట్టకేలకు నారాజకుమారుని యొద్దకు బోయి నిలిచినది. అతండును విలాసదృష్టుల దానిం జూచుచు చతురికా! తొందరపడియెదవేల నూరకొనుము. పరీక్షకులే వచ్చి చూతురు. అని పలుకుచు దనయొద్దనున్న తన చిత్రపట మాచతురిక చేతి కందిచ్చుచు గాంతిమతి పటమును దాను గైకొని తత్తారతమ్య మరయుచుండెను. కాంతమతియు నతని ప్రతిబింబమును జూచిచూచి విస్మయముజెంది మరల నతని మొగముజూచుచు మొగమున శృంగారచేష్ట లభినయించుచు దరువాత నా వ్రాత జూచి మొగము ద్రిప్పుచు నీరీతి గొంతసేపు మఱియొక మిషచే మనంబునం బుట్టిన యభిలాష లడచికొని వింతనగవుతో జతురికా! నీవు గెలిచితివి. నీకియ్యకొన్న విత్త మిచ్చివేసెదను. అని పలికి మరల నొకమారతని మొగమున దృష్టి నెరయ జేసినది.

పిమ్మట నదృష్టదీపుడును దానింజూచి చతురికా! నీవు నాకు జూపినపటము తథ్యమైనదని యిప్పుడు నమ్మితిని. నీవు సత్యవచన వగుదువని పలికి యూరకుండెను. అప్పుడొక నిముష మా మువ్వురు చిత్రప్రతిమలవలె జలింపక నిశ్శబ్దముగా నుండిరి. తరువాత నా చతురిక వారి చిత్రఫలకములు రెండును సమముగా బట్టుకొని అదృష్టదీపునితో నయ్యా! యీ రెంటిలో నేది చక్కదనముగా నున్నదియో నాకు దెలియకున్నది. మీరు బుద్ధిమంతులు నిరూపించి చెప్పుడని అడిగిన నతండొకింత నవ్వుచు నోహో! నన్నిట్లడుగ నేల? స్త్రీ పురుష భేదముగల యీరెంటికిని సామ్య మెప్పుడును గలిగియుండదు. దేని కదియే చక్కగా నున్నదని పలికెను.

పిమ్మట నాకొమ్మ కాంతిమతి దగ్గరబట్టి అడుగగా నప్పుడదియు సిగ్గు పెంపున నేమియుం బలుకనేరక సన్నని యెలుంగున బోఁటీ! నీవు పన్నిదము గెలిచితివికాని చిత్రఫలకమును నార్యపుత్రునికి సరిగా వ్రాయలేకపోయితివి. ఇదియే నీ యందుగల న్యూనత. ఈ రెంటికి దారతమ్యములు చిత్తానుగుణ్యములై నున్నవి. అది పరమేశ్వరునికి గాక యొరులకు జెప్పక శక్యమా? అని తెలిసియు దెలియనట్లు పలికినది. అంత నా రాజనందనుడు చతురికం జూచి యింతీ! నేను వచ్చి తడవైనది. నీవు మిక్కిలి ప్రార్థింప నింతదూరము వచ్చితిని నాకొరకు నామిత్రుడు బలభద్రుడు వెదకుచుండును. ఇక బోవచ్చునాయని యడుగగా నది మందహాసముసేయుచు ఆర్యా! నీవు నా కార్యము చక్కజేసితివి. నీవృత్తాంతము సమగ్రముగా విని నీకెద్దియేని నా యోపిన యుపకారము సేయదలచికొంటిని. నీ పేరేమి? నీవేరాజు కుమారుడవు? ప్రచ్ఛన్నముగా నీయూర విహరించుటకు గారణమేది? నీదేదేశమని నడుగగా నతడిట్లనియె. మేమెప్పుడు అసత్యములు పలుకు వారము కాము. నేను మొదట జెప్పినదే నిక్కువము. ఈ విషయమై సారెసారెకడుగకుము. నీవు నాకు జేయదలచికొనిన యుపకార మెద్దియో చెప్పుము. నేను ద్వరగ బోవలయుననియు పలుకుచుండగనే సాయంకాలచిహ్నము తెలుపు భేరీవాయించిరి.

అప్పుడా యింటి ద్వారరక్షకులు వచ్చి తలుపు తట్టుచు చతురికా! సాయంకాలపుభేరిని వాయించుచున్నారు. ఇక తోట తలుపులు మూయుదురు. భర్తృదారిక శకటములో నంతఃపురమునకు బోవలసియున్నది. గావున వడిగా బోవలయునని పిలిచిరి. ఆ మాటలు విని యదృష్టదీపుడు వెరచుచు జతురికం జూచి యిప్పుడు నేనెట్లు మాయింటికి బోదునని యడిగెను. అప్పటికి వారికి గోటలోనికి బోవక దీరదు గనుక నది సమ్మతించుచు కానిండు మీతో ముచ్చటింపవలసిన సంగతులు పెక్కుగలవు. అవి యన్నియు బిమ్మట జెప్పెదను. ఇప్పు డీదారిం బొండు మి మ్మెవ్వరు నడ్డపెట్టరని పలుకుచు రెండవగుమ్మమునుండి యతని నాయిల్లు వెడలించినది. పిమ్మట గాంతిమతియు జతురికతో గూడ నాతలుపులు తెరచుకొనుచు నిల్లువెడలి బండి యెక్కి యతివేగముగా నింటికి బోయినది.

అట్లు పోయి యక్కాంతిమతి యంతఃపురమున నేకాంతముగా జతురికతో గూడ శయ్యాతలంబున మేను జేర్చి యిట్లు చింతించెను. చతురికా! నీ చాతుర్యమంతయు నెచ్చట దాచితివి! అక్కుమారరత్న మెదురునున్నప్పు డేమియు మాట్లాడలేకపోయితివే. నాహృదయంబున నెన్నియో కోరిక లూరుచున్నవి. నేనేమి చేయుదును? ఈ దుర్మార్గపు సిగ్గు నన్ను మాటాడనిచ్చినది కాదు. అయ్యో! దొరకిన ఫలము చెడిపోయినదే తటాలున బోయి వానిం గౌగలింపక యెద్దియో యాలోచింపుచు దెల్లబోయి యూరకుంటిని. అన్నన్నా! నా యభిప్రాయమయిన వెల్లడి చేసితిని కాదేమి? చివరి కతని యభిలాష సైతము మనకు దెలియలేదు. మంచిపని చేసితివిలే? ఏమేమో చెప్పబోయి యేమో చెప్పితిని. నా యొద్ద నెన్నియా యుక్తులు పలుకుదానవు. నాకీ సిగ్గడ్డము లేనిచో నా చమత్కార మంతయు జూపకబోవుదునా? కార్యము చెడగొట్టితిని. ఇంక నెప్పుడో చెప్పెద ననుకొను నంతలో సాయంకాలమైనదేమి? మన మా మేడలో నెంతసేపుంటిమి. నిమిషములాగైన దోచలేదే? అబ్బబ్బా! మేనంతయు భగ్గున మండిపోవుచున్న దేమి? ఇట్టి బాధ యిదివరకు నే నెప్పుడు ననుభవించి యెఱుగను. అతనికి మనయందిష్టమున్నదా? అతండైనను సాహసింపలేకపోయె నేమి? ఒకవేళ నతండు నీకుపకారము సేయవలయునని తాత్పర్యముతో వచ్చెనేమో? నీవు భ్రమపెట్టి తీసికొని వచ్చితివి. నిజము చెప్పితివి కావు. ఇదియు నీతప్పే! ఈ రాత్రి నే నెట్లు వేగించుదాన? మనము నిజముగా వానిం జూచితిమా? అది స్వప్నమా! మన మిప్పు డెచ్చటనుంటిమి? ఇది రాత్రియా పగలా? నా కేమియు దెలియకున్నది. సఖీ! మన మచ్చట గొంతసేపు నిలువక వచ్చితి మేమి? అదియా. తెలిసినది. పోనీ ఆరాత్రి నచ్చట నుండిన బాగుండును సుమీ! మన ముండినచో నతం డుండునా చెప్పుము? అట్లు చేయవలసినది. అంతలో దొందరపడి వచ్చితిమి. నీ బుద్ధియంతయు నప్పుడు మొద్దుపడిపోయినది. ఈ రాత్రి మరల నచ్చటికి బోవుదమా పోయెన నేమి లాభము? ఆ పురుషసింహుం డప్పుడే యింటికి బోయెను గదా? ఉదయమున నేమి చేయుదము. మరల నతండు కనంబడునో లేదో? కటకటా! నేనుదయమువరకు దాళగలనా? ఈ రాత్రి యెట్లైన నతని దీసికొని వత్తువేని బ్రాణములు నిలుచును. లేకున్న బ్రాణములు విడుచుచున్న దానను. విరహవేదన యన నెద్దియో యనుకొంటిని. ఇప్పటికి తెలిసినది. అక్కటా! ఇట్టి యవస్థ శత్రువులకైన రావలదు. హా! పురుషసింహా! యని యనేకప్రకారముల నున్మత్తవలె బలవరింపుచు నుస్సురనుచు నా మంచము మీదబడి కొట్టుకొనుచన్న యాచిన్నదానిం జూచి చతురిక యిట్లనియె.

కాంతిమతీ! నీ వెంతో ధైర్యశాలి వనుకొంటి నంతయు నిప్పుడు తెలిసినది. ప్రథమసమాగమముననే తేలిక పడనేల నని నే నూరకుంటిని. ఒక రాత్రికే తాళలేవా? అట్టిదాన వప్పుడేమిటి కూరకొంటివి ఎదుర నన్ను నిందింపుచున్న దానవే? కానిమ్ము . ఇంత బేలవని తెలియక యశ్రద్ధచేసితిని. ఈ రాత్రి యెట్లో వేగింపుము. ఉదయంబున వానిందెచ్చి నీతల్పంబునం నుంచెదనని చెప్పి శైతోపచారములు చేయ దొడంగినది. కాని యేమియు నుపయోగము లేకపోయినది.

మేన నలందిన చందనమంతయు ధూళియైపోయినది. అవయవములం జుట్టిన బిసతంతువులు పెళుసెక్కి విరికి బోయినవి. తప్తాయన పాత్రంబునం బోసిన జలంబువలె తనువునం జిలికిన పన్నీరంతయు బేరులేక హరించినది. ఈరీతి లోనికాకచే దాజేయు నుపచారము లించుకేనియు బనిచేయకుండుట జూచి యా చతురిక దాని కంతుసంతాపమున కాశ్చర్యమందుచు జిన్ననాటనుండియు నెన్నడేని యిట్టి వికారములు కనివిని యెరుగని యా చిన్నదానికి చిన్నె లెట్లభ్యస్తము లయ్యెనో యని వెఱగందుచు నోపినంతనట్టు నుపశాంతి జేయుచు నెట్టకేల నా రాత్రి దానితోడ వేగించినది.

సూర్యోదయమైనతోడనే యాచతురిక కాంతిమతికి గొన్ని రహస్యములు బోధించి తాను మరల నదృష్టదీపుడున్న యింటికి వచ్చి యచ్చట రహస్యముగా నొక చోట డాగి వారనుకొను మాటలు వినుచుండెను. అదృష్టదీపుడు మిత్రునితో బలభద్రా నేనెంత తెలివిహీనుడనో చూచితివా? హస్తగతప్రాయమైన ఫలము స్వీకరింపక ద్రోసివేసితిని. దైవ మెద్దియేని సంప్రాప్తమగునట్లు చేయునుగాని తినిపించునా! మంచిసమయము మించిపోయినది. సాహసము చేయలేకపోయితిని. అయ్యో! యీ సంతాప మెట్లు వారించుకొందును. మిత్రమా సూర్యోదయమయినట్లున్నది చూడుము. మనము పరుండి యెన్ని రాత్రులైనది. ఒక్క టియే? పెక్కులాగున దోచుచున్నదే యని బహువిధంబుల బలవరింపుచున్న యా రాజపుత్రుని వాక్యములు విని చతురిక మిక్కిలి సంతోషింపుచు గాంతిమతి నంటిన స్మరపిశాచము ఈ చిన్నవానికిగూడ నావేశించినది. మేలు మేలు. ఇక నా సఖీమణి యభీష్టము దృటిలో నెరవేర్చెదనని తలంచుచు వారున్న యింటి తలుపులు తట్టుచు బలభద్రా! బలభద్ ! యని పిలిచినది.

ఆకంఠధ్వని గురుతుపట్టి యదృష్టదీపుడు మిగుల సంతోషముతో బలభద్రా! చూడు మెవ్వరో పిలుచుచున్న వారని పలుకగా వాడులేచి తలుపు తెరచి ద్వారములో నున్న చతురికంజూచి వయస్యా! నిన్న నీతో మాట్లాడిన చేడియ వచ్చినదని చెప్పెను. అప్పుడతడు లోనికిదీసికొని రమ్మని చెప్పిన బలభద్రుండట్లు చేసెను. మంచముమీద గూర్చుండి చతురిక కొకగద్దె వేయించి చతురికా! నేడు ప్రొద్దుననే వచ్చితివేమని యడిగెను.

అదియు ఆర్యా! మరేమియు గార్యము లేదు. నిన్న మీతో మాట్లాడుట కవకాశము చిక్కినది కాదు. నన్ను గుఱించి మీరు మిక్కిలి శ్రమపడిరి. కృతజ్ఞత జూపించుకొనుటకై వచ్చితిని. మఱియు మా రాజపుత్రికయు మీతో ముచ్చటింప వలసియున్నదని చెప్పినది. దేనికిని నిన్న వేళ చాలినది కాదు ఈ దినము సావకాశముగా మాటలాడుకొనవచ్చును. ఇప్పుడే యప్పడతి మఱియొక యుద్యానవనమునకు బోయియున్నది. మిమ్ము నచ్చటికి దీసికొని రమ్మని నన్ను బంపినది నిన్నటిదినంబున దా నేమియు దమకు నతిథిపూజ సేయలేదట. దానికి నార్యపుత్రుని చిత్తంబున మఱియొక రీతి దలంపు గలిగెనేమో యని రాత్రి బరితపించుచున్న యది. ఆ యుద్యానవనము మిక్కిలి విశాలమైనది. అరణ్యమును బోలియుండును. అందు సుందరములగు మందిరములు గలవు. ఇప్పుడే దేవర యచ్చటికి విచ్చేయవలయునని ప్రార్ధించిన నతండు చిరునగవు మొగమునందొలుక నల్లన దానితో నిట్లనియె

చతురికా! నీవు కృతపరిచయురాలవగుటచే నీమాట నేను ద్రోయలేకున్నాను. నీ కృతజ్ఞత్వమునకు మిక్కిలి సంతోషించితిని. మీ రాజపుత్రిక నాకు సపర్యలు చేయలేదని సందియ మందవలదని చెప్పుము. దర్శనమాత్రముననే యర్చితుడ నైతిని. మరల నన్నేల శ్రమపెట్టెదవు? రాజభటరక్షితమగు నాయుద్యానవనమునకు బోవుట దుర్ఘటము గదాయని యర్ధాంగీకారముతో బలుకుచున్న యాచిన్నవాని చేయిపట్టుకుని యచ్చతురిక లెండు. లెండు. తక్కినవాని గురించి మీకేమియు చింతింపవలసిన యవసరములేదు. అవియన్నియు మేము చక్కబెట్టుకొనియెదము. మన మిప్పుడే పోవలయును. మనకొరకు రాజపుత్రిక నిరీక్షించుకొని యుండునని పలుకగా నతండు అయ్యో! ప్రాతఃకృత్యములు నిర్వర్తించుకొని పెందలకడ భుజించివత్తునని పలికెను.

అప్పుడచ్చతురిక ఆర్యా! అవియన్నియు నచ్చటనే తీర్చుకొనవచ్చును. మీకు విందుచేయవలయునను తాత్పర్యముతోడనే రాజపుత్రిక మిమ్ముదీసికొనిరమ్మన్నది. ప్రాతఃకృత్యములు మాయింటియొద్ద జరిగించవచ్చును. రండు రండు అని మిక్కిలి తొందరపెట్టగా నా బలభద్రు నింటికడ నుండుమని చెప్పి యప్పురుషసింహు డప్పుడే దానివెంట బోయెను.

అచ్చతురిక యారాజపుత్రుని ముందుగా దనయింటికి దీసికొనిపోయి కృతజ్ఞత జూపించుదానివలె నభినయించుచు బన్నీట జలక మార్చినది మరియు జీనాంబరములు గట్టనిచ్చినది. మణివిభూషణములు దెచ్చి స్వయముగా నలంకరించినది. అది యంతయు జూచి యతడు చతురికా! యీవేషము నాకేల? నేను ద్వరగా బోవలయును. మీరాజపుత్రిక యెచ్చటనున్నదని యడుగగా నప్పడతి ఆర్యా! నీవు తొందరపడకుము. రాజపుత్రికను జూపుటకొరకే మీకీ యలంకారము చేయుచుంటిని. ఈ యలంకారములకు మీశరీర మలంకారము దెచ్చుచున్నది. చూచితిరా! యని పలుకుచు నతనిమతికి గుతుకము గూర్చుచున్న సమయమున నశ్వశకటమువచ్చి చతురికా! భర్తృదారిక యుద్యానవనమునకు బోయి నీకొరకు బండి పంపినది. సత్వరముగా రావలయుననుటయు నది నీవు పొమ్ము నే నీబండి నెక్కి యిప్పుడే పోయెదనని చెప్పి యప్పరిచారిక పోయిన తరువాత నదృష్టదీపుని మేనంతయుబట్టు మేలిముసుగువైచి స్త్రీపురుషవివక్షత దెలియకుండ నాబండి యెక్కించినది.

అప్పుడతం డిట్టట్టనక యదిచెప్పినట్లు చేయుచు నాబండిలో గూర్చుండెను. పిమ్మట నమ్ముదితయు సమ్మోదముతో శకటమెక్కి వడిగాదోలి యుద్యానవనములోనికి దీసికొనిపొమ్మని యాబండితోలువాని కాజ్ఞాపించెను. ఆబండివాడు అది చెప్పిన ప్రకారముగా వడిగా గుఱ్ఱముల నడిపించుచు దృటిలో నాయుద్యానవనములోనున్న విలాససౌధమునకు దీసికొనిపోయెను.

అచ్చట జతురిక రాజపుత్రునితోగూడ లోపలకు బోయినది. అంతకు బూర్వమే వారేర్పరచుకొనియున్నవారు కావున నామేడలో నితరు లెవ్వరునులేరు. ముందు తలుపులు బిగించి యాచతురిక యాతనిని మేడ యెక్కించి యాముసుగు దీయుచు రాజపుత్రికయున్న గదిలోనికి దీసికొనిపోయినది.

అతనిరాక చూచి యాచిన్నది సంతోషముతో మేను గరపుజెంద దత్తరిల్లుచు బంగారుపళ్లెరముతో నివాళిదెచ్చి యెదురవచ్చెను. అక్కలికి తొలుత నతనిపాదంబులం గడగి తడియొత్తుచు గర్పూరపునివాళియిచ్చి లజ్జావశంబున నూరకున్నంత జతురిక దానింజూచి భర్తృదారికా! నీవతిథిపూజ చక్కగా జేయుము. సిగ్గుపడి యూరకుండిన నతిథికి గోపము వచ్చునుసుమీ? యని పలుకగా నక్కాంతిమతి యానృపసూతి చెట్ట పట్టుకొని ఆర్యపుత్రా! మీరాకచే మాగృహము పవిత్రమైనది లోపలకు దయచేసి మమ్ము గృతార్దులం జేయుడని పలుకుచు నల్లన దీసికొనిపోయి యంతకమున్న యమర్చి యున్న సయ్యపై గూర్చుండబెట్టి తానాదాపున నిలువంబడియెను.

ఇంతలో జతురికవచ్చి మచ్చెకంటీ! నీవిచ్చట నిలువబడితివేల? అతిథి నర్పింప దల్పమెత్తుగానున్నది. నీవుగూడ దానిమీద గూర్చుండి పూజింపుము. ఇట్టి సమయములో సందియమందగూడదని పలుకుచు దానినెక్కించి చందనపుగిన్నె చేతికందిచ్చినది. అప్పుడాపడతి యాగందమతని మేన బూయదొడగినది కాని యత డించుక సంశయించువానివలె నభినయించుచు నించుబోడి! చాలుచాలు నీసపర్యకు సంతసించితిని నాకు జెప్పవలసినసంగతు లేమైనం గలిగిన నుడువుము నేను వేగముగా బోవలయుననగా విని యాచతురిక వాని కిట్లనియె.

ఆర్యా! చల్లకువచ్చి ముంతదాచనేల? మిమ్మూరక బోయెదననిన బోనిత్తుమా? మీరేమియు మాటాడగూడదు. మేముచేసినట్లొడం బడుడని పలుకుచు గాంతిమతింజూచి రమణీ! నీవు సంశయింపకుము మేనంతయు జక్కగా గంద మలందు మని పలికిన నక్కలికియు నట్లుచేయుచు జివర జెక్కులకుగూడ రాచినది అప్పుడచ్చతురిక కాంతిమతింజూచి యోహో! నీవు అతిథికి మంచిమర్యాదయే చేయుచుంటివి ఆయనమాత్ర మూరకొనునా? నీకు దగినట్లు మరలజేయును చూడుమని యాగందపు గిన్నె యాతినిచేతి కందిచ్చినది. అతం డది యందిపుచ్చుకొని సాహసముతో గాంతిమతి జెక్కులయందు నొక్కి రాచెను.

అప్పు డయ్యిరువురకు మేనం బులకలు బొడమినవి కంప మావిర్భవించినది చెమ్మటలు గ్రమ్మినవి మరియు జిత్తభవుండే వారికి బురోహితుండై పాణిగ్రహణోత్సవమునకు సంకల్పము జెప్పదొడంగెను. పిమ్మట నెద్దియో మిషబన్ని చతురిక యవతలకు జారినది. అప్పు డక్కాంతిమతి మొగంబున నించుక కినుక యభినయించుచు అయ్యో! అతిథి యింటికి వచ్చెనని మర్యాదజేయుచుండ నిట్టిపనులు చేయవచ్చునా? ఈగంద మిట్లెయుంచి మా పెద్దలకు జూపించెద నుండుడు అని బెదరించిన నతడు నవ్వుచు నౌను నేను జేసినదితప్పే? మరల దుడిచెదగాకయని పలుకుచు తుడుచువాని వలె నభినయించుచు జెక్కులు నొక్కుచు నీరీతి గొంతసేపు కేళీవిలాసములు చూపుచు-

శ్లో॥ కంఠెసంశ్లిష్యగాఢం మృదుకరజచయం గండపాళీనితంబె
     పృష్టెపార్స్వోదరెవా విధధదైః ఖండయన్ దంతవాసః
     ప్రేమాచుంబన్ లలాటంవపుషిచ జనయన్‌రోమహషన్ నితాంతం
     సీత్కారాకారి వక్త్రామతిలఘునళినీంద్రావయేత్తాం విదగ్ధాః॥

అని చెప్పినట్లుగా నాపద్మినీకాంత నాద్యంతక్రీడావిశేషంబుల సంతోషవివశం గావించెను.

అంతలో సాయంకాలమగుటయు జతురికవచ్చి యువతీ! మనమింటికి బోవలయును. రేపు మరల రావచ్చును. పోదము లెమ్మని పలుకగా నెట్టకేల కతని కౌగిలి విడదీసికొని ఆర్యా! నీవు మరల మేలిముసుగు వైచుకొని మాతో వచ్చి బండిలో గూర్చుండుము. మిమ్ము జతురికయింటియొద్ద దింపెదనని చెప్పి యట్టివేషముతో నతని దీసికొనిపోయి బండియెక్కినది. చతురికయు నొకప్రక్కను గూర్చుండెను. పిమ్మట బండివాడు బండిదోలుచు ముందుగా రాజపుత్రిక యాజ్ఞప్రకారము చతురిక యింటియొద్దకు దీసికొనిపోయెను. అచ్చట మేలిముసుగుతో నదృష్టదీపుడును చతురికయు బండిదిగి యింటిలోనికి బోయిరి. పిమ్మట నా శకటమును గన్యాంతఃపురమునకు దీసికొనిపోయెను.

కాంతిమతియు బండిదిగి యింటిలోనికిబోయి యాహారనిద్రాసమయంబుల సైత మతని క్రీడావిశేషములనే స్మరించుచు నతిప్రయత్నమున నారాత్రి వేగించినది. అంత మరునాడు పూర్వదివసంబువలెనే తాను ముందుగా బండి యెక్కిపోయి తరువాత నచ్చతురిక యింటికి బంపిన నదృష్టదీపునితో నచ్చతురిక దానిలో నెక్కి యుద్యానవనము లోనికిబోయి యక్కుమారు నంతఃపురమునకుం బంపి తాను ద్వారమున గాచి యుండెను.

ఆ యిరువురు యధేష్టగా కామక్రీడావిశేషంబులం దేలుచుండ వారి కాదివసంబంతయు నరనిముషములాగైన దోచినదిగాదు. సాయంకాలమైన తోడనే పూర్వపురీతి వారు మువ్వురును బండియెక్కి యిండ్లకు బోయిరి. ఆ ప్రకారము ప్రతిదినము నుదయమున నా బండియెక్కి యుద్యానవనమునకు బోయి సాయంకాలమువరకు గ్రీడించుచు రాత్రి కిండ్లకు బోవుచు నారుమాసము లఱిగిన నాయిరువురకు నక్కాలమొక దివసములాగైన దోచినదికాదు.

అట్లుండనంత నొక్కనాడక్కాంతిమతి తండ్రి యనంతవర్మ యాస్థానమునం గూర్చుండి రాజకార్యములు వితర్కింపుచుండ నతని బల్లమీద నొక యుత్తరము గనంబడుటయు నతండది విప్పి చదువ నిట్లున్నది. రాజా! నీవు వట్టిగ్రుడ్డివాడవు. నీ యింట జరుగుచున్న యవమానకృత్యము లేమియు గురుతెఱుగకున్నావు. నీవు కూతురు నందుగల మక్కువచే దానినేమియు నాజ్ఞ బెట్టక స్వేచ్ఛగా దిఱుగుచుండ నిచ్చితివి. అప్పడతి యిప్పుడు నిష్కుటములో బ్రతిదినము నొకపురుషునితో గ్రీడింపు చున్నది. ఉదయమునబోయి సాయంకాలమున కంతఃపురము జేరును. ఆ విషయము నీ వేమియు విమర్శింపకుంటివి. యౌవనములోనున్న రాజకన్య లెవ్వరేని గోటదాటి క్రీడింపబోవుదురా! స్త్రీలకు స్వతంత్ర మిచ్చినచో మర్యాద నిలుచునా! తనయయెడ మక్కు వగలిగినచో మిక్కిలి గుడుచుటకును గట్టుటకును బెట్టవలయునుగాని యిట్లు స్వేచ్చగా దిరుగనీయరాదు. అదియునుం గాక పురుషులకంటె స్త్రీలకు గామమధికము గదా? యౌవనము వచ్చిన మచ్చకంటికి వెంటనే వివాహము జేయకుండినతప్పు నీయదియే. మఱియు నత్తరుణి యిప్పుడు గర్భవతిగూడ నయ్యెనని నాకు దెలిసినది. స్వచ్ఛమైన నీ కులమునకు గళంకము వచ్చెనని నేను జింతించుచున్నవాడ. నీకు నేను నత్యంతప్రియుండగాన నింతగా వ్రాసితిని. నామాట నిక్కువమరయ తలంపుకలిగెనేని సాయంకాల మాయుద్యాన వనమునకు బోయిన నంతయు నీకే విశదము కాగలదు. ఇంతకన్న విస్తరించి వ్రాయనవసరములేదు. అనియున్న పేరులేని యుత్తరము ముమ్మారు చదువుకొని చింతాక్రాంతస్వాతుండై యొక్కింతసేపు ధ్యానింపుచు దల యూచుచు అన్నన్నా! యీ వ్రాసినరీతియంతయు యథార్థమయి యుండవచ్చును స్త్రీ లెట్టిపనులకును సాహసులే కదా.

కానిమ్ము ఇవ్విధమంతయు నేడు పరీక్షించి నిజమైనచో నా కులపాంసురాలను శిక్షించి కులము నిష్కళంకము చేసెదనని నిశ్చయించి యప్పుడే సభజాలించి యంతఃపురమునకు బోయి భార్యం జీరి యింతీ! మనకాంతిమతి యిప్పుడేమి చేయుచున్నది పనియున్నది. యొకసారిచ్చటికి రప్పింపుమని జెప్పెను. ఆ మాటవిని భయపడుచు నోహో! పుత్రిక నెప్పుడును జిరంజీవని యని పిలుచుచుండును గాని పేరుతో పిలుచువాడుకాడు. నేడెద్దియో కారణమున్నది. ఆ చిన్నది యెద్దియేని తప్పు చేయలేదుగదా? యని తలంచుచు గూతురిం దీసికొని రమ్మని యొక పరిచారికం బంపినది. అదియు కన్యాంతఃపురమునకు పోయివచ్చి యమ్మా అమ్మాయిగా రుదయముననే యుద్యానవనమునకు బోయినారట. రాత్రికిగాని యింటికిరారట. అచ్చటి వారు చెప్పినారని రాజు వినుచుండ జెప్పినది.

ఆరాజప్పులుకులు విని నిప్పు ద్రొక్కిన కోతివలె నా రహస్యము భార్యకును జెప్పక నాటి సాయంకాల సమయమున నుచితపరివారముతో బండియెక్కి యా యుద్యానవనమునకు బోయెను. ఆ ద్వారమున మరియు బెక్కండ్ర కింకరుల గాపు బెట్టి యా లోపలనుండి క్రొత్తవాడెవ్వడేని వచ్చిన బోనీయక పట్టుకొని యుండుడని యాజ్ఞాపించుచు తా నొక్కరుడ యత్తోటలో బ్రవేశించి వెదకుచు గాంతిమతియున్న సౌధము దాపునకు బోయెను. ద్వారముననున్న చతురిక దూరముగానే రాజుగారిని గురుతుపట్టి తమ గుట్టు దెలిసికొనుటకై యరుదెంచినట్లు గ్రహించి తొట్రుపడుచు వడివడి లోనికిపోయి మన్మథకేళిపారావారవీచికలం దేలియాడుచున్న వారితో మనలను బరీక్షించుటకు రాజుగారు వచ్చుచున్నవా రని జెప్పినది.

ఆ మాటలు విని యదృష్టదీపు డదిరిపడి యేమేమి? రాజుగారే వచ్చుచున్నారా? అయ్యో! యేమి చేయుదునని తల్లడిల్లుచు నలుమూలలు వెదకి యా సౌథమువరకు నెదిగియున్న యొక మ్రాను జూచి కాంతిమతి వలదువలదని చెప్పుచుండగనే వినిపించుకొనక యాచెట్టుకొమ్మలు వంచిపట్టుకొని మెల్లగా యాధారము చేసికొని యా మ్రాకుమూలమునుండి భూమిమీదికి దిగెను. అప్పటికి గనుచీకటి పడుచున్నది. గావున నరణ్యమువలె లతలచే దట్టముగా నల్లుకొనబడియున్న యాయుద్యానవనములో దాగికొనియున్నవాని నరయుటకు బ్రహ్మతరముకాదు.

ఇంతలో నారాజు మేడ యెక్కుచు దారిలోనున్న చతురికం జూచి యేమే చతురికా! కాంతిమతి యెచ్చట నున్నదని యడిగెను. అదియు దేవరా! యీ మేడ మీదనేయున్నది. ఇంటికి రావలయునని పయనమగుచున్నదని చెప్పి యచ్చటికి దీసికొని పోవుటకు శంకించుచు నటునిటు కొంతసేపు తిప్పినది. కాని యతండచ్చట నిలువక తిన్నగా నయ్యంతఃపురమునకు బోయెను. అక్కాంతిమతియు నప్పుడు శృంగారవేషము తీసివేయు విషయమై సవరించుకొనుచున్నది. గావున దండ్రిని జూచినతోడనే దద్దరిల్లుచు దెల్లబోయి నిలువంబడినది.

అప్పుడు గదిలోనున్న పరిమళవస్తువిశేషములన్నియు జూచి శంకించుకొనుచు బ్రత్యక్షముగా జూచిగాని యడుగరాదని నిశ్చయించి యా మేడనంతయు వెదకెను. ఎచ్చట నెవ్వరు గనంబడలేదు. కాంతిమతి యాకృతిజూడ వేరొకరీతి గనంబడినది. మొగమునంగల దంతనఖచిహ్నములే సంభోగసూచన సేయుచున్నవి. కాని కూతురు కావున దాపునకుబోయి యంతగా బరీక్షించుటకు వీలుపడినదికాదు. అయ్యెడయుం డయ్యువతిని సంభోగవతిగా నిశ్చయించి కానిమ్ము. ఆ పురుషుం డిత్తోట నెచ్చటనో దాగియున్నవాడు. నేడు చీకటి పడినది. ఱేపువచ్చి వెదకించి పట్టుకొని శిక్షించెదంగాక యని నిశ్చయించుచు గాంతిమతింజూచి చిరంజీవినీ! నీవింత స్వతంత్రురాలి వైతివేమి? కోటవిడిచి యింతరాత్రివరకు నిచ్చట నొంటరిగా నుండవచ్చునా? పో పొమ్ము . పిమ్మట జెప్పెదనని పలికిన నులికిపడుచు నత్తరుణి మరుమాట పలుకక యప్పుడే చతురికతో గూడ మేడవదలి బండియెక్కి మిర్రునకుంబోవు ప్రవాహమువలె నంతఃపురమునకు బోయినది. ప్రాణములన్నియు నుద్యానవనములోనే యున్నవి

పిమ్మట నయ్యనంతవర్మయు గొంతసే పాప్రాంతభాగముల నరసి చీకటిలో నేమియు గనంబడమి మరలి ద్వారము దాపునకు వచ్చి యీరాత్రి మా సెలవులేక నీ తోటలోనుండి యెవ్వరికిని రాకపోకలు జరుగనీయగూడదు. అట్టిపని జరుగనిచ్చితిరేని మిమ్ము గఠినముగా శిక్షింతునని ద్వారరక్షకుల కాజ్ఞాపించి కోటలోనికిం బోయెను. ఆ వార్త దూతికాముఖంబున గాంతిమతి విని మిక్కిలి పరితపించుచు జతురికంజూచి, సఖీమణీ! నేనేమి చేయుదును. రాజుగారి శాసనము వింటివా? ఉదయమునబోయి నా మనోహరుని బట్టుకొని శిక్షింతురు కాబోలు. అయ్యో! ఆ తోటకు రెండవదారిగూడ లేదే? ఈ దివసముతో నా యాయుర్దాయము సరిపడినది. వారికేమాత్రము ప్రమాదము సంభవించినను నేను బ్రతుకనని నమ్ముము.

పోనీ మా తల్లితో యదార్ధముచెప్పిన నీ యాపద దప్పించునేమో! యేమనియెదవు ఇంతయేల! గాంధర్వవివాహంబున నతనిని బరిగ్రహించితినని మా తండ్రితో చెప్పుదునా! నీవు మిగుల బుద్ధిమంతురాలవు. ఉపాయమేదియో యాలోచింపుడు నే నెంతకఠినురాలనోకదా? నా ప్రియుండటుల భయార్తుండై చీకటిలో ముండ్లకంపలో దాగియుండ నే నిచ్చటికి వచ్చితిని ఎటులైన నీరాత్రి యా యడవిలోనుండి బయటకు దీసికొని రావలయును. అంతవరకు నేను భుజింపనని కన్నులవెంబడి ప్రవాహముగా నీరుగారుచుండ వేక్కి వెక్కి యేడ్చుచున్న యా చిన్నదాని నోదార్చుచు జతురిక యిట్లనియె.

బోటీ! నీవేటికి జింతించెదవు. నేను దీనికి దగిన యుపాయమాలోచించితిని. ఈ రాత్రి నీ మనోహరునందుండనీయను. మీ తల్లిదండ్రుల కీవార్త నిప్పుడు చెప్పరాదు. కోపము దీరినవెనుక గ్రమముగా వెల్లడిపరుచుదము. ఇప్పుడు నీవు నేను చెప్పినట్లు చేయుము. మన కార్యమంతయు జక్కబడునని చెవిలో నెద్దియో బోధించినది. అప్పు డప్పూబోణి యందులకు సమ్మతింపుచు మంచి యుపాయమే యూహించితివని చతురికను మెచ్చుకొనుచు నప్పుడే యొకమందెద్దియో వికటించునది దిని మేనవేకి జనింప మూర్ఛపోయినట్లు మంచముమీద విరుచుకొని పడిపోయినది.

అప్పు డచ్చతురిక యుచ్ఛస్వరంబున నేడ్చుచు గాంతిమతిని బాముగరచినదో యని యరచుచు గాంతిమతి తల్లియొద్దకుబోయి యా వర్తమానము జెప్పినది. అప్పుడామె గుండెలు బాదుకొనుచు వడివడి కన్యాంతఃపురమునకు వచ్చి యచ్చట స్మృతిదప్పి నోటనుండి నురుగు వెల్వరించుచు నెద్దియో బాధచే నిట్టట్టు గొట్టుకొనుచున్న కూతురింజూచి శోకపరవశంబున మూర్ఛబోయి తెప్పిరిలి అమ్మా! అమ్మా! యని యనేకసారులు బిలిచియు బ్రతివచనంబుగానక పెద్ద యెలుంగున నేడ్చుచుండెను. ఇంతలో ననంతవర్మ యా వార్తవిని భయపడుచు బదుగుర విషవైద్యులతో నచ్చటికి వచ్చి పుత్రిక యవస్థ యంతయు జూచి పెక్కు తెరంగుల విలపించెను.

ఆ వైద్యులు మంత్రములు వైచుచు నౌషధమును మ్రింగింప బ్రయత్నించిరి కాని పళ్లునొక్కి పట్టుటచే మందులేమియు లోపలకు బోయినవికావు మఱియు మ్రింగుటకు నెక్కుడు ప్రయత్నము చేయబూనునంతలో జతురిక నేను మ్రింగించెదనని యా మందులు బుచ్చుకొని నోటిలో వైచిన ట్లభినయించుచు గుప్తముగా దాచి పారవైచినది. ఈ రీతి గొంతసేపు జరిగినతరువాత వైద్యులందరు నేమియుం జెప్పలేక తమయోపిన కొలది ప్రయత్నములు చేయుచున్నామని చెప్పిరి. అప్పుడు రాజును, భార్యయు మిక్కిలి విచారింప దొడంగిరి. ఆ శోకవేగమున రాజు మధ్యాహ్నము తాను గోపము చేసిన సంగతియే మరచిపోయెను.

అప్పుడు చతురిక లేచి స్మృతి నభినయించుకొనుచు రాజపత్నితో అమ్మా! మన కాంతిమతి కేమియు భయములేదు. నాకొక మందు జ్ఞాపకము వచ్చినది. అది మొన్న నొకయోగి మన యుద్యానవనములోనికి వచ్చి పాముకాటునకు నిది మంచి యౌషధమని మాకొక చెట్టు చూపించెను. అది నేను జ్ఞాపకము పెట్టుకొనియున్నాను. పోయితీసికొనిరానా? యని యడుగగా నా రాజపత్ని అయ్యో! సంశయమేల వడిగాబోయి తీసికొనివచ్చి నీ నెచ్చలిం బ్రతికించుకొనుము. ఏ మందులో నే మహిమ యున్నదో యని పలుకుచు నచ్చటికి వెళ్లుటకు తొందరపెట్టెను.

అప్పుడు చతురిక కొంతదూరముపోయి మరలవచ్చి అమ్మా! ఆ తోటలోనికి పోవుటకు రాజశాసనము లేకున్న వీలుపడదు. నేను మరచిపోయి వెళ్లుచుంటిని. అయ్యగారు సాయంకాలమున నట్టిశాసనము చేసియున్నారు. కావున నట్లుపోవుటకు నాకొక చీటి నిప్పింపుమని యడిగెను. ఆ మాట విని రాజపత్ని యాక్షేపించుచు ఓసీ! నీకును శాసనము కావలయునే యూరక యాలస్యమగుచున్నది, త్వరగా వెళ్ళుమనుటయు నది సమ్మతింపక యట్టి పత్రిక యిప్పింపకతీరదని చెప్పెను.

అప్పుడు రాజపత్ని వల్లభునితో నామాట జెప్పగా నతండంత విమర్శింపక యీకాంతనుమాత్రము లోనికి పోనీయుడని చీటివ్రాసి యిచ్చెను. అట్టి శాసనపత్రికం గైకొని యచ్చతురిక మిక్కిలి సంతోషించుచు యంత్రప్రదీప్తహస్తయై వడిగా నత్తోట యొద్దకుబోయి ద్వారపాలురతో గోటలోజరిగిన యుపద్రవము చెప్పుచు నచ్చీటిని వారికి జూపి లోనికి బోయినది

ఆహా! దాని బుద్ధినైపుణ్య మెంతవింతయైనదో చూడుము. అట్లు లోనికి పోయి యాదీపము వెల్తురున నత్తోటలో నలుమూలలు దిరుగుచు నొక మేడగోడప్రక్కను సోపానముమీద గూర్చుండి తన యవస్థగురించి విచారించుచున్న యదృష్టదీపునింగాంచి తన్నెరింగించి యతనికొరకు రాజపుత్రిక పడుచున్న యిడుమలన్నియు దెలిపిన నతండును కాంతిమతికి దనయందుగల మక్కువను గురించి మిక్కిలి మెచ్చుకొనియెను.

తరువాత నచ్చతురిక తానుదెచ్చిన బట్టలతనికి గట్టనిచ్చి స్త్రీ పురుషభేదము దెలియకుండునటుల మేలిముసుగుగప్పి యా చీటి నతనికిచ్చి దీపము జేతంబట్టుకొని యాదారిం బొమ్మని చెప్పినది అతడట్టి వేషముతో బోవుచు దారిలోనున్న ద్వారపాలుర కాచీటిం జూపింపగా వాండ్రు మొదట వెళ్ళిన చిన్నదియే యనుకొని యంతగా బరీక్షింపక దానిని విడిచిపెట్టిరి. దానంజేసి యతండు నిరాటంకముగా నింటికిబోయి తన రాకకు వేచియున్న బలభద్రునకా వృత్తాంతమంతయుంజెప్పి యా రాత్రి సుఖముగా వెళ్ళించెను.

అంత నచ్చట దోటలోకి జతురికయు మరికొంతసేపుండి యెద్దియో యొక వేరు త్రవ్వుకొని మొదటనే ప్రచ్ఛన్నముగా దెచ్చిన దీపమును వెలిగించుకొనుచు నా దారింబోవునంతలో ద్వారరక్షకు లడ్డమువచ్చి నీ వెవ్వతెవు! యీ తోటలోని కెటుల పోయితివి. నీవిపుడు పోవలదు నిలువుమని పలుకగా నది నవ్వుచు నోహో మీరు గట్టి శూరులే! నే నిప్పుడు మీకు జీటిజూపి లోనికిబోలేదా? ఆ చీటీ నెచ్చటనో మరచిపోయితిని. నేను నిత్యము వచ్చుచున్నదాననే. కాంతిమతి స్నేహితురాలను. ఆ చిన్నది యిప్పుడు పాము గఱచి చచ్చుటకు సిద్ధముగా నున్నది. ఈ వేరుకొరకు నిచ్చటకు వచ్చితిని. వేగముగా తీసికొనిపోవలయును. లేనిచో రాజపుత్రిక జీవింపదు. రాజుగారు నాపయి గోపము చేయుదురు. నా పేరు చతురిక. నా సంగతి ప్రొద్దున రాజుగారితో జెప్పుడు. వేగము పోనీయుడని చెప్పగా వారు నీ వెవ్వతెవైనను మాకు భయములేదు. నీ మాటలు చూడ వింతగానున్నవి. ఇంతకుబూర్వమే మొదటవచ్చినకాంత మాకు జీటీచూపించి వెడలినది ఈరాత్రియొకతె లోనికిబోయినది. ఇరువురువచ్చిన బోనిత్తుమా! నీవు మమ్ము గ్రొత్తవారము గదాయని మాయజేసి పోవలయుననుకొంటివి. నీ విషయమై యనుమానముగానున్నది. ఉదయమువరకు గదలనీయమని రూఢముగా జెప్పిరి.

అప్పు డది కోపించుచు మీరు బుద్దిహీనులవలె దోచుచున్నారు. నేనెవ్వతె ననుకొంటిరి! ఇప్పుడు క్షణమాలస్యమైనచో రాజపుత్రిక జీవింపదు. ఈ యపరాధము మీమీదబడును. మీ కనుమానమున్నచో నా వెంటరండు. మీ సందియము దీరుతునని పలుకగా వారు సందియమందుచున్నంతలో మరికొందరు రాజకింకరులు వడిగావచ్చి చతురికా! చతురికా! యని పిలువదొడఁగిరి. అప్పుడప్పడతి యాధ్వని విని ఓ! యని పలుకుచు నయ్యో నేనేమి చేయుదును? వీరు నన్ను రానియ్యకున్న వారు. వేరు త్రవ్వుకొని వచ్చితినని చెప్పగా నా కింకరులు ద్వారరక్షకుల మందలింపుచు అయ్యో! దీని నాపుచున్నా రేమి? దీని రాకకై రాజుగారు వేచియున్నారు. ఈ మాట తెలిసినచో మిమ్ము శిక్షించును. రాజపుత్రిక చావుబ్రతుకులమీద నున్నది. ఆమెకొరకు నోషధి దెచ్చుటకు నీమచ్చకంటి యిచ్చటికి వచ్చినది. ఇది కాంతిమతికి మిత్రురాలు. దీని మీ రాటంకము చేయుచున్నారేమి యని యాక్షేపింపగా వారేమియు బలుకలేక మొదట పోయినదే తమ్ము మాయజేసినదని నిశ్చయించుకొని యారహస్య మెవ్వరికి జెప్పక యప్పుడప్పడతిం బోనిచ్చిరి.

పిమ్మట నా కొమ్మయు సమ్మోదముతో బోయి యావేరుదెచ్చిన వార్త యెల్లరకు దెల్లముచేసి యది యరుగదీసి యాగంధము గాటువైచినచోట నంటించుచు దాని చెవులో నూదుదానివలె నీ మనోహరుడు సుఖముగా దోటదాటిపోయెను. నీవింక స్మృతి దెచ్చుకొమ్మని చెప్పినది. అమృతప్రాయమైన యామాట వినినతోడనే యా చేడియ ప్రాణములు గూడికొనినట్ల నభినయించుచు మెల్లమెల్లగా గన్నులుదెరచి చూచుచు దనకు గొంచెము నింపాదిగా నున్నదని సంజ్ఞాపూర్వకముగా జెప్పినది.

అప్పుడందరు చతురిక వైద్యమును గురించి పెక్కు తెఱంగుల స్తుతి సేయదొడంగిరి. తరువాత జతురిక కాంతిమతికి విషము విరిగి రోగము తిరిగినదనియు మాటలాడక నిద్రబోనీయుడనియు నందరితో జెప్పి యట్లు నిద్రబొమ్మని చెప్పినది. కాంతిమతియు సుఖముగా నిద్రబోయి యుదయమున లేచినది. అనంతవర్మ ప్రొద్దున్న లేచి యా యుద్యానవనమునకు బోయి యత్తోటలో నలుమూలలు మిక్కిలి శ్రద్ధాపూర్వకముగా వెదకించెనుగాని యందు నెవ్వరు గనంబడలేదు. ద్వారపాలుర బరీక్షించి యడిగెను. వారు రాత్రి జరిగిన మోసము జెప్పినచో దమ్ము శిక్షించునను వెఱపున నేమియుం జెప్పిరికారు. అప్పుడు రాజు తన శత్రువు లెవ్వరో యట్టి యుత్తరము వ్రాసినారని నిశ్చయించుకొని పుత్రికయందుగల కోపమంతయు బోగొట్టుకొని యక్కాంతామణి నెంతేని సంతోషముతో మన్నించుచుండెను,

అదృష్టదీపు డట్లు రాత్రివేళ నింటికిబోయి పశ్చాత్తాపము నొందుచు ఆహా! జగంబంతయు గామహతకునిచే వంచింపబడుచున్నది కదా?

శ్లో॥ కాంతేత్యుత్పలలోచనేతి విపులశ్రోణీ భరేత్యున్నమ
     త్పీనోత్తుంగ పయోధరేతి సుముఖాంభోజేతి సుభ్రూరితి
     దృష్ట్వామాద్యతిమోదతేభిరమతే ప్రస్తాతి ద్వానపి
     ప్రత్యక్షాశుచిభస్త్రికాం స్త్రయమహోమోహస్యదుశ్చేష్టితం.

విద్వాంసులుగూడ మాంసాదులచే రచింపబడిన తోలుబొమ్మను జూచి కాంత సుముఖ, సుభ్రూ మొదలగు నలంకారములు గల్పించుచు స్తుతిజేయుచు గ్రీడింపుచుందురు. నేను జగద్విదితమగు ఖ్యాతిని సంపాదించి చివరకీ కాంతమూలమున చోరునివలె నాతోటలో దాగియుండవలసివచ్చినది. దైవానుగ్రహమువలన నా లలన దాటించినదికాని లేనిచో గారాగారంబునకు బంపబడియుందును. నాకింత ప్రారబ్ధమేల వచ్చెను. ఆ మచ్చెకంటిం బెండ్లిచేయుమని యడిగినచో సంతసించుచు దండ్రి యూరకుండునా? మరికొన్నిదినములు దేశము దిరిగివచ్చి తరువాత నడిగెదను. కాంతిమతి రాత్రి నాకొరకుబడినకష్టము తలంచుకొన్న విడిచిపోవుటకు నిష్టములేకున్నది. ఆ చిన్నదానికి జెప్పితినేని వెళ్ళుటకు సమ్మతింపదు. ఇచ్చటనుంటినేని క్రమముగా రాజుగారికి దెలియకమానదు. అప్పుడతని కెట్టిబుద్ధిపుట్టునో! కావున నిప్పుడు తెలియకుండ పోవుటయే యుచితముగానున్నది. అని యూహించి యొక యుత్తరమిట్లు వ్రాసెను.

కాంతా! నీవీరాత్రి జరిగించిన కృతమున కెంతేని సంతసించితిని. నీవట్టి యుపాయము పన్ననిచో నన్ను బట్టుకొందురు. నన్ను గురించి నీవు పొందిన యాయాసమునకు మిక్కిలి చింతించుచున్నవాడ. నీవు నాతో జెప్పినమాటలు జ్ఞాపకమున్నవి. నేను దప్పక పట్టమహిషిగా నిన్ను స్వీకరింతును. ఇదివరకే మన యిరువురకు గాంధర్వ వివాహమైనది. నా కులశీలనామంబులు నీకు జెప్పకపోవుటకు గారణమున్నది. ఇప్పుడు పేరు మాత్రము తెలియజేయుచున్నవాడ. నేను గొన్నిదినములు దేశాటనము జేసి మరల వచ్చెను నీవేమియు జింతింపకుము. సర్వదా తలంచుకొనుచుండము. ఈ చిత్రఫలకమును సంతతము నంతికమున నుంచుకొని నిన్నుగా భావింపుచుందును. స్వల్పకాలములోనే తిరుగవచ్చెద గ్రహింపుము.

ఇట్లు, అదృష్టదీపమహారాజు.

అని వ్రాసి యట్టి యుత్తరమును బలభద్రునిచేతికిచ్చి యోరీ! నే నిప్పుడే పోయి యూరిబైట నివసించియుందును. చతురిక యిచ్చటికి వచ్చును వచ్చినతోడనే యీ యుత్తరము మాత్రము దానికిచ్చి మరి యేమియు జెప్పక యది యా యుత్తరమును జదువుకొనులోపలనే దానికి దెలియకుండ బయలుదేరివచ్చి నన్ను గలిసికొనుము. మన మిక నీయూర నుండవలదనిచెప్పి యప్పుడే బయలుదేరి వానితో జెప్పిన సంకేతస్థలము నకు బోయెను. అంత నుదయంబున నచ్చటికి జతురిక వచ్చిన నదృష్టదీపుడు చెప్పిన ప్రకార ముత్తర మిచ్చి యది చదువుచున్న సమయములోనే యిదిగో వచ్చెదనని చెప్పి పారిపోయెను.

ఆ యుత్తరము జదువుకొని యావ్రాలుజూచి యదృష్టదీపమహారాజు ప్రసిద్ధి యంతకు బూర్వము వినియున్నది కావున సన్యాసిమాటలు స్మరించుచు నతండు తప్పక యట్టివాడే యని నిశ్చయించి సంతోషవిచారంబులు మనంబునం బెనంగొన వడివడిబోయి యా యుత్తరము గాంతిమతికి జూపినది.

అమ్మత్తకాశిని తత్తరముతో నా యుత్తరమును జదువుకొనిన తరువాత నిరువురకును నీరీతి సంవాదము జరిగినది.

కాంతిమతి - చతురికా! నిజముగా నతండు మనము ప్రసిద్ధిగా జెప్పుకొనుచున్న యదృష్టదీపమహారాజే!

చతురిక - దానికి సందేహమా! అతని మొగము చూచినం దెలియదా? వట్టివాని కంతసౌందర్యము గలుగునా?

కాంతిమతి - అతడు సౌందర్యముచేతనేగాదు గుణములచేతగూడ గొనియాడ దగినవాడు సుమీ?

చతురిక - కనుకనే యంతప్రసిద్ధి వచ్చినది.

కాంతిమతి - నాకు మొదటినుండియు నట్టివాడే మగడు కావలయునని కోరికయుండునది నీకును జ్ఞాపకముండవచ్చును. నీతో చెప్పియే యుందును.

చతురిక - ఇంతకును నీ యదృష్టము మంచిది. శకుంతలవలె మంచిమగని సంపాదించుకొంటివి.

కాంతిమతి - నేనే! నీ వట్లనక యేమందువు ఉత్తములెప్పుడైన స్వప్రయోజకత్వమును బ్రకటించుకొందురా?

చతురిక - దానికేమి నీయుఛ్రయము నాదికాదా? ఇప్పుడు మీ తండ్రి వినినను సంతసించును.

కాంతిమతి - ఇక మనము నిర్భయముగా జెప్పవచ్చును.

చతురిక - మనము జెప్పనక్కరలేదు. నీ గర్భమే చెప్పగలదు.

కాంతిమతి - (సిగ్గుతో దల వంచుకొని) ఇది నిజమని నిశ్చయించితివా యేమి ?

చతురిక - భవదీయచూచుకముఖంబుల నీలసితవర్ణంబులే నిశ్చయింపుచున్నవి.

కాంతిమతి - అగుంగాని యీ వియోగభారంబెట్లు సైతును అతండెప్పుడు వచ్చునో?

చతురిక - అతనితో నీకేమి పనియున్నది? నీకు గావలసినపనియైనదిగదా?

కాంతిమతి - నాతో బరిహాసములాడక నిజము చెప్పుము. అతండు తిరిగి యిచ్చటికి వచ్చి నన్నాదరించునా?

చతురిక - ఏమిచేయునది యా యుత్తరమే చెప్పుచున్నది.

కాంతిమతి - దానింజూడ ననురాగసూచకముగానే యున్నది. అతండిట్లు ప్రచ్ఛన్నముగా దిరుగుట కేమి కారణమున్నదియో ?

చతురిక - సన్యాసి చేయి చూచినప్పుడే చెప్పెను. అయ్యోగి మిక్కిలి తెలిసినవాడు. యెద్దియో కారణమున్నది. మరియేమియో యననేల. నిన్ను వరించుటకే.

కాంతిమతి - ఇట్టి యుత్సాహముగూర్చిన నీకు బ్రతి యేమి చేయగలను. ఇదిగో! గాఢముగా నాలింగనము జేసికొనుచున్నదాన నని యట్లు చేసినది.

తరువాత జతురిక యావార్త మెల్లగా గాంతిమతి తల్లితో జెప్పినది. ఆమె సంతోషింపుచు నొకనా డేకాంతముగా నున్న సమయంబున మగనితో నదృష్టదీపుని ప్రశంస వచ్చుటయు నాయన మీ కల్లుడయ్యెనని చెప్పినది. ఆ మాటవిని యతం డదరిపడుచు నది యెట్లని యడుగ తనకు గూతురు జెప్పిన వృత్తాంతమంతయుం జెప్పి యా యుత్తరమును జేతి కిచ్చెను. ఆ రాజు మొదట గొంతసేపు నమ్మలేదు. కాని అదృష్టదీపు డంతకు బూర్వము తనకు వ్రాసినయుత్తరము దెచ్చి చూచి యందలివ్రాలును నిదియు నొక్కరూపున నుండుటచే నమ్మక తీరినదికాదు. అట్టివాడు తనకు నల్లుడగుటయే చాలునను సంతోషముతో గూతు నేమియు నిందింపక గాంధర్వవివాహము దూష్యము కాదని శాస్త్రవేత్తలచే దెలిసికొని యయ్యువతి గర్భవతి యగుటకు మిక్కిలి సంతసించెను. పిమ్మట నా రాజపుత్రికను సురక్షితముగా గాపాడుచు నదృష్టదీపుని వార్త దెలిసికొనుటకయి నలుమూలలకు బెక్కండ్ర దూతల నంపెను.

అచ్చట అదృష్టదీపుడు బలభద్రుడు వచ్చినతోడనే యా యూరువెడలి యొకమార్గమునంబడి నడుచుచు గాంతిమతి యొక్క క్రీడావిశేషములన్నియు బలభద్రునితో జెప్పుచు దద్వియోగమునకు మిక్కిలి పరితపించుచుండ బలభద్రుం డోదార్చుచుండెను. ఆ రీతి బదిదినములు ప్రయాణము చేసినంత మరియొక పట్టణము గనంబడినది. దానిపేరు పుష్పగిరి. దానిని రాజవాహనుడనురాజు పాలించుచున్నవాడు. అదృష్టదీపుడు మిత్రునితో గూడ నట్టిపట్టణములో బ్రవేశించి తన పేరం బ్రసిద్ధిజెందిన సత్రములో బసచేసెను.

ఆ గ్రామములోగూడ నదృష్టదీపునిపేరు మిక్కిలి వాడుకగా నున్నది. అతం డట్టివిశేషములన్నియుం బరీక్షింపుచు గొన్నిదినము లాయూర వసియించెను. ఒకనా డదృష్టదీపు డాసత్రములో నొకవేదికపై గూర్చున్న సమయంబున నొక బ్రాహ్మడు డతనిముఖము సాభిప్రాయముగా జూచెను. అదిగ్రహించి యదృష్టదీపు డాబ్రాహ్మణునితో అయ్యా! మీదేదేశము? ఇచ్చటి కెప్పుడు వచ్చిరి? ఎచ్చటికి బోయె దరు. నన్ను విమర్శించి చూచుటకు కారణ మెద్దియేనిం గలదా యని యడిగిన నవ్విప్రుండు వానితో నిట్లనియె.

అయ్యా! మా కాపురము మాళవదేశరాజధానియైన కోశాంబి యను పట్టణము. నేను తద్దేశ ప్రభువైన ధర్మపాలుని పురోహితుడను నా పేరు విష్ణుశర్మయందురు. మా రాజు కొన్ని సంవత్సరముల క్రిందట శత్రువులచే నోడింపబడి బద్దుండగుటచే నప్పట్టణమును శాతృవులాక్రమించిరి. నేను మిగుల పండితుండను. నాకు బెద్దకుటుంబము గలదు. ఆ క్రొత్తరాజు మిగుల దుర్మార్గుడగుటచే ధర్మపాలునియందుగల విరోధమునుబట్టి నాకతం డంతకుమున్ను పారితోషికముగా నిచ్చిన ధనకనకవస్తువాహనాదిక మంతయు గొల్లపెట్టుటయే గాక నన్ను గుటుంబముతో గూడ నాయూరినుండి లేవగొట్టెను. పిమ్మట నేనచ్చట రక్షకులు లేమింజేసి మిక్కిలి పరితపించుచు నతికష్టముతో నాయూరు విడిచి కుటుంబముతోగూడ దేశాటనము చేయ మొదలు పెట్టితిని. కుటుంబము పెద్దదగుటచే నెచ్చటికి బోయినను గడుచుట కష్టముగా నున్నది. ధర్మస్వరూపుడైన యదృష్టదీపమహారాజుగారి ఖ్యాతిని విని యాయన దర్శనమైనచో నీ దరిద్రము వాయు నను తాత్పర్యముతో నీయూరువచ్చి యీ సత్రములో బ్రవేశించితిమి. భోజనమున కేలోపములేదు. ఎన్నిదినము లున్నను పొమ్మనరట. ఇదియు గొంతమేలేయని యిందు వసించియుంటిమి. ఆయన తీర్థయాత్రకు వెడలెననిం వదంతిగానున్నది. ఏ తీర్థ మందున్నదియు దెలియదు. బ్రాహ్మణులందరు ప్రతితీర్థమునందు వేచియున్నారు. అమ్మహానుభావుని దర్శనమైన వానికి దరిద్రముండదు. వాడు కుబేరునంతవాడగును. అతని యీవి యింతింతని పొగడుట శక్యములేదు. ఎప్పటికేని యప్పుణ్యాత్ముని దర్శనము కాకపోవునాయని యాసతో నున్నాడను ఇదియే నా వృత్తాంతము. మరియు మీ మొగముచూడ మా ధర్మపాలుని మొగముపోలిక యగుపడుచున్నది దానంజేసి నిరూపించి చూచితినని చెప్పగా నదృష్టదీపుం డిట్లనియె.

అయ్యా! మీ రాజుగారి నోడించి బద్దుజేసిన రాజు పేరేమి? మీ ధర్మపాలునికి భార్యాపుత్రులుకలరా? యుండిన వారేమైరని యడుగగా నతండు ఆర్యా! మా పట్టణము ముట్టడించిన రాజు చోళదేశ ప్రభువైన సురక్షితుడు. అతడు కపటముచేసి మా రాజు నోడించెను. అదియు పెద్దమంత్రియైన విహారభద్రుని మూలమున వచ్చినది. మా రాజుగారిభార్య సునందయను సుందరి గర్భభరాలసయై మూడేండ్లప్రాయముగల పుత్రు నెత్తుకొని యాయుద్ధములోనే నెచ్చటికో పారిపోయినది. నాటినుండియు నామెజాడ యేమియుం దెలియకున్నది. వసురక్షితునివంటి దుర్మార్గు డీలోకములో నెచ్చటను లేడని కొంతసేపతని క్రూరకృత్యములు జెప్పదొడంగెను. అదృష్టదీపుడా బ్రాహ్మణుని వచనంబులు విని యించుక శంకించుకొనుచు నాకాలప్రమాణము వారివారి నామములు వ్రాసికొని గుత్తముగా నుంచుకొనియెను.

ఇట్లు బ్రాహ్మణునితో నదృష్టదీపుడు మాట్లాడుచున్న సమయంబున బట్టణ విశేషంబులు జూచుటకై యంగడికి పోయిన బలభద్రుడు వడివడిగా జనుదెంచి యూర్పులు నిగుడించుచు నిట్లనియె. మిత్రమా! నే నిప్పు డంగడివీథి నొకవిశేషమును జూచితిని. ఒక చక్కని చిన్నవానిని బండిమీద నెక్కించి యూరేగింపుచున్నవారు. వానింజూచి నీ వనుకొని పేరబోయితిని. కాని చుట్టును విచ్చుకత్తులతో గాచియున్న రాజకింకరుల రాయిడిచే మాట్లాడుటకు వీలుచిక్కినదికాదు.

ప్రియంవద కథ

అప్పుడు నేను మిక్కిలి తొందరపడుచు నాకింకరులతో నితండేమి యపవాధము చేసినవాడని యడుగగా వాండ్రు నాకు సదుత్తర మిచ్చిరి కారు. పిమ్మట నేనూర కొనక యాప్రాంతమందున్న మరికొందరి నడుగగా వారిట్లనిరి. ఇతండొక బ్రాహ్మణకుమారుడు. వీనిపేరు హరిదత్తుడట. వీడిపట్టణపు రాజుకూతురు ప్రియంవద యడిగిన మాటల కుత్తరమునిత్తునని యొప్పుకొని యామెయంతఃపురమున బ్రవేశించి తుదకు ఆ చిగురుబోడియిచ్చిన ప్రశ్నలకు నుత్తరము చెప్పలేకపోయెను. మొదటనే యట్టిశాసన మేర్పరచియున్నవారు కావున నిప్పు డితని నురిదీయుటకై యూరేగింపుచున్న వారు. వీనిగురించి మరియొక రెవ్వరైన నాప్రశ్నలకు నుత్తరమిత్రుమని వచ్చినయెడల వీనిని విడుతురు వారు గూడ చెప్పనియెడల నిరువురను నురిదీతురు. ఇదియే వీని వృత్తాంత మని నాతో జెప్పిరి.

ఆ మాటవిని నేను మిక్కి లి పరితపించుచు నిన్నుజూచు తాత్పర్యముతో వచ్చితిని. అన్నా! పాపమా బ్రాహ్మణకుమారుడు నీవలె నున్నాడుసుమీ! తలవాల్చుకొని బండిమీద గూర్చుండియున్నాడు. తెలియక యట్టిపని కెట్లు పూనుకొనెనోకదా! వానిని విడిపించు బుద్ధిమంతుడీ యూరలేకపోయెను. ఆ ప్రశ్నలు నీకేమైన నర్థమగునేమో యని పలుకగా నతం డదరిపడుచు అయ్యయ్యో! బ్రాహ్మణకుమారు నన్యాయముగా నురిదీయుచున్న నీరాజు నేమనదగినది. అతని కూతురింత యన్యాయపువ్రత మేల పూనినది? కానిమ్ము. నే నిప్పుడే పోయి యాప్రశ్నల కుత్తరము చెప్పెదననిచెప్పి యాబ్రాహ్మణకుమారుని విడిపించెదను. దైవము నాకట్టియూహ తోపించిన దోపించుగాక లేనిచో నిరువురము పరమపదము నొందుదుము. బలభద్రా! నీ వే మనియెదవని యడిగిన వాడిట్లనియె.

అన్నా! తొందరపడకుము. ముందుగా నాప్రశ్నము లెట్టివో తెలిసికొని తరు వాత నాలోచింపుము. లేనిచో వృథాగా జిక్కు పడవలసి వచ్చునని పలుకుచుండగనే లేచి యతడు తమ్ముడా! రమ్ము. పోదమా విప్రకుమారుడు డెచ్చటనున్నాడని యడిగిన నబ్బలభద్రుండు నతని నప్పుడే యాయంగడికి దీసికొనిపోయెను. కాని యంతలో నారక్షకపురుషులా భూసురతనూభవుని వధ్యభూమికి దీసికొనిపోయిరి. వీధులలో నిలబడి పౌరులు అయ్యయ్యో! ఎంతచక్కనివానికి మృతి ప్రాప్తించుచున్నదోకదా? పాపము వీనికి తలిదండ్రులుగాని యన్నదమ్ములుగాని లేరుకాబోలు. ఏ బుద్ధిమంతుడైన వచ్చి వీనికడ్డుపడిన బాగుండును. కటకటా! ఆ రాజకుమార్తె యింక నెందరి నిట్లు జంపునో! ఇట్టి వ్రతము కూడదని తండ్రియైన బుద్ధిచెప్పరాదా? అసందర్భప్రశ్నముల కుత్తరము చెప్పువాడెవ్వడు అన్నన్నా! తెలియక యీ బ్రాహ్మణకుమారుడు మోసపోయెను. ఇంతకుముందెవ్వరు నిట్టికఠినదండనకు వెఱచియే మేము చెప్పెదమనిరాలేదు. ఇంతకు వానికీరీతి మరణము విధించియుంచెను కాబోలు. ప్రారబ్ధ మతిక్రమింప నెవ్వరి తరమని తమకు దోచిన ప్రకారము చెప్పుకొనదొడగిరి.

అదృష్టదీపు డట్టిమాటలన్నియు వినుచు, "మిత్రగుప్తుడనువా డితని ప్రాణముల గాపాడుటకు రాజుగారియొద్దకు బోయెను అంతదనుక హరిదత్తు నురిదీయవలదని చెప్పుము" నీవచ్చటనుండుమని బలభద్రుని వధ్యభూమికిననిపి తాను రాజవాహను నాస్థానమునకుబోయి యారాజుగారికి నమస్కరింపుచు నిట్లనియె. అయ్యా! మాది కాశీదేశము. నాపేరు మిత్రగుప్తుడందురు. నేను మీ కూతురువేసిన ప్రశ్నములకు హరిదత్తు నిమిత్త ముత్తరమిచ్చువాడ. దీనికి నాకు నారుమాసములు గడువీయవలయును. ఇప్పుడే హరిదత్తు నురిదీయకుండ నాజ్ఞాపత్రిక బంపుడని పలుకుటయు నతనిధైర్యమునకు, సాహసమునకు నాసభ్యులెల్లరు మెచ్చుకొనుచు నితం డతని కెద్దియో కావలయునని యూహించుకొనుచు బెక్కుగతుల దలపోయుచుండిరి.

పిమ్మట నారాజవాహను డతని తెగువకు వెఱగందుచు నేను దారుణమైన శపథము జేసియున్నాడను. నీవట్టిదానిని వినియుంటివో లేదో! హరిదత్తుని గురించియే యందరు నన్ను నిందింపుచున్నారు. నీవు గూడ సదుత్తరం బియ్యలేకపోతివేని మీ యిరువురను నురిదీయవలసి వచ్చును. నీవు చక్కగా నిదానించుకొనుమని యారాజు చెప్పగా విని యతడు మీశపథప్రకారమంతయు వినియే యిచ్చటికి వచ్చితిని. ఆ విషయమై నాకెంతమాత్రము సందియములేదు. వడిగా వధ్యభూమికి నాజ్ఞాపత్రికను బంపుడని తొందర పెట్టుచు బలికెను. పిమ్మట రాజవాహను డతనిపేరు వ్రాసికొని యతనిచేత నారుమాసములకు దిరిగివచ్చునట్లుగా బ్రమాణికము చేయించుకొనుచు నంతవరకు నురిదీయక హరిదత్తుని గారాగృహమున నుంచునట్లాజ్ఞా పత్రికవ్రాసి యప్పుడే పంపెను.

ఆ పత్రిక చేరినతోడనే రక్షకభటులు హరిదత్తు నురిదీయక మరల దీసికొని వచ్చి బంధీగృహములో నుంచిరి. అదృష్టదీపునికి హరిదత్తుని జూడవలయునని యభిలాష గలిగినది కాని యప్పటి కార్యపుతొందరచే జూచుట దటస్థించినదికాదు. తరు వాత నదృష్టదీపు డాప్రశ్నము లేవియని యడుగగా నారాజుగా రట్టి ప్రశ్నములు గల పత్రికను దెప్పించి యతనిచేతి కిప్పించెను.

గీ. ఎన్నభువనేశ్వరీదేవి కెన్ని మొగము?
    లవియు నేయేరుచులచేత నమఱు! మఱి త
    దాలయం బెట? నటదగు నట్టిలిపియ
    దేమి? యది చెప్పుడివి మదీయేచ్ఛపగిది.

క. వీనికి సదుత్తరము లెవఁ
   డైన నొసంగినను వాని బ్రాణాధీశుం
   గా నెంచెద మడియించెద
   బూనుచు నటు చెప్పలేకపోయిన యంతన్.

అట్టి పద్యములు గల యా పత్రికను రెండు మూడుసారులు చదువుకొని తలయూచుచు నారాజు ననుజ్ఞ బుచ్చుకొని యింటికిబోయి తన కెదురుగా వచ్చినమిత్రునితో నిట్లనియె. బలభద్రా! నాకాయువింక నారుమాసములున్నది. ఈ ప్రశ్నముల కెవ్వడు నుత్తరము చెప్పలేడు. మిగుల నసందర్భముగా నున్నవి. భువనేశ్వరీదేవి యాలయ మెచ్చటనున్నదో యెవ్వరు చెప్పగలరు? అయినను మనయోపినంత ప్రయత్నము చేయుదుము. నీ విచ్చటనే యుండుము. నేనొకసారి దేశాటనము చేసి వచ్చెదనని పలుకగా నబ్బలభద్రుడు కన్నీరు విడుచుచు నిట్లనియె. అయ్యో! నేను మొదటనే నిదానించుమని చెప్పితిని కాదా! అట్లు చేయక తొందరపడి యొప్పుకొని వచ్చితివేమి? దీని కేమిచేయుదము. ఈ ప్రశ్నల కెవడు నుత్తరము చెప్పలేడట. ఏమి చెప్పినను కాదని యురిదీయించునట. నీతో నీ సంగతి యెఱుగక జెప్పితినే. నీ వింత సాహసము చేయుదు వనుకొనలేదు. జగద్విదితమగు కీర్తి వహించి చివరికొక యాడుదాని మూలమున బలవన్మరణము జెందవలసివచ్చినదా! కటకటా! నేనందులకు సమ్మతింతునా? మనమిప్పు డెవ్వరికి దెలియకుండ మన పల్లెకు బారిపోయిన మనలను బట్టుకొనలేరు. తరువాత హరిదత్తుని సంగతి యేదియో యొకటి యగును. అంతియ కాని మనమూరక వీరికి బ్రాణము లప్పగించమా యని పలుకుచు దీనాసనుడై యున్న బలభద్రునికి నదృష్టదీపుం డిట్లనియె.

తమ్ముడా! నీ విందుల కేమియు విచారింపకుము. దేహమనునది గ్రుక్కెడు ప్రాణముతో నున్నది. ఇట్టి దానికొరకు నసత్యమెట్లు యాడుదును? మన పూర్వులీసత్యముకొరకు బడినయిడుము లెట్టివో యెఱుంగుదువా! బ్రాహ్మణుని నిమిత్తము శరీరము విడుచుటకంటె సుకృతమున్నదా? ఈ శరీర మెప్పటికైన నస్థిరమైనదే కదా? అదియునుంగాక కాలమొక్కరీతి నెవ్వరికిని నడువదు. మనము మంచిదినములలో విత్తమేమియును లేకయే యెంతఖ్యాతి సంపాదించితిమో చూచితివా? ఆ కాలము గతించినతోడనే కాసునకైన గొరగాకుంటిమి. దరిద్రులయొక్క దీనాలాప ములు వినుచుండ నా చెవులు చిల్లులు పడుచున్నయవి. ఏమి చేయుదును? జీవచ్ఛవములాగున నూరకుంటిని. మనమప్పటివారిమేయైన కాలభేదమును బట్టి యిప్పుడు మరియొకరమైతిమి. కావున బురుషు డేకార్యము చేయుటకును కర్తగాడు. నాకిప్పుడు కర్మానుగుణ్యమైనబుద్ధి పుట్టినది. ఏమికానున్నదో యట్లు జరుగక మానదుకదా. దీనికై విచారింపనేల? పారిపోవుట పురుషకారము కాదు. అట్టి పనికి నేనెన్నడు నొప్పుకొనను. ఈ యారుమాసములలో నావార్త దెలిసికొనుటకై ప్రయత్నింతము దైవానుగ్రహము మనయందు గలిగియుండినచో నెట్లు తెలియకపోవును. నీవు ధైర్యముగా నుండుము.

శ్లో॥ యోమేగర్భ గతస్యాపి వృత్తింకల్పి తవాన్విభుః
      ఒషవృత్తిం విధానాయ సుప్తఃకింను మృతోధవా.

పుట్టించిన భగవంతుడు తరువాయివృత్తి గలిగించుటకు నిద్రబోవుచున్నాడా? లేక మృతినొందెనా? యని చెప్పినట్లు మనకిదివరకంత ఖ్యాతి గలుగజేసిన విధి యిప్పుడు మాత్రమూరకుండునా? మన కెన్నడును నవమానము రాదని నమ్ముము. ఈ యాపద సైత మెట్లో దాటెదమని పలుకుచు బలభద్రునికి ధైర్యము గలుగజేసెను.

అతని మాటలచేత బలభద్రుడు విచారమును విడిచి యెడదను బూని, మిత్రమా! నీవు జనియించిన సమయము మంచిది. నీవు చెప్పిన ప్రకారము నీకెన్నడు నవమానము రానిమాట నిశ్చయిమే. ఈ యారుమాసములలోను దేశాటనము చేయుదము. నీతో నేనును వత్తునని పలుకగా నతండు మరల నిట్లనియె. తమ్ముడా! మనము దేశము తిరుగవలసిన యవసరము లేదు. ఆ ప్రశ్నము లీయూర నుండియే యరయదగినది. ఆ రాజపుత్రిక నిత్యము చేయు కృత్యములెట్టివో గ్రహింపవలయును. కావున నీ వీనగరములో గుమ్మరుచు ననుదినము నా చిన్నదానిచర్యలం దెలిసికొనుచుండుము. నేనును తగుప్రయత్నము చేసెదనని పలికి యతండది మొదలు ప్రతిదినము నట్టి ప్రయత్నము చేయుచుండెను.

అని యీ కథ నింత పట్టు జెప్పువరకు నర్ధరాత్ర మగుటయు మణిసిద్ధుం డాగోపాలుని జూచి వత్సా యిప్పుడు నిద్రవేళయైనది. తరువాత కథయు పెద్దదిగా నున్నది ఈ రాత్రి ముగియులాగున దోచుటలేదు. సంక్షేపముగా ముగింపనా? లేక యా తరువాయి కథ ముందర మజిలీలో జెప్పనా? యని యడుగగా వాడు కథ సవిస్తరముగా జెప్పవలయునుగాని ముగింపరాదు. పోనిండు మీకు నిద్రగానుండినం బరుండుడు రేపు చెప్పవచ్చునని పలుకుచు నప్పుడు భుజించి లేచి యయ్యతిచంద్రుని పాదంబు లొత్తుచుండెను. అయ్యోగియు నారాత్రి సుఖముగా వెళ్ళించి వేగుజామున లేచి గోపకుమారుని కావడి యెత్తుమని పలుకుచు మౌన మవలంబించి తనతో వాడు కావడి మోచుకొని నడచుచుండ నీరెండ ప్రొద్దెక్కువరకే ముందరి మజిలీ చేరెను.