కాశీమజిలీకథలు/రెండవ భాగము/13వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శుభమస్తు - అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

రెండవ భాగము


13వ మజిలీ

శ్లో॥ యాకుందేందు తుషారహారధవళా యాశుభ్రవస్త్రావృతా।
      యావీణావరదండమండితకరా యాశ్వేతపద్మాసనా॥
      యాబ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్పదాపూజితా।
      సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా॥

వ॥ అట్లుమణిసిద్ధుండు శౌనకుండను నామాంతరముగల యగ్గోపాలుతోగూడ జగన్నాథంబు ప్రవేశించి యందొక మఠంబున వసించి భక్తజనపరాధీనుండగు సుభద్రానాథు నారాధించునుత్సుకంబు మనంబున నగ్గలంబగుచుండ వానితో నిట్లనియె.

వత్సా! సకలజగన్నాయకుండగు జగన్నాయకుం డిందు సుభద్రాభిధానలక్ష్మీసమేతుండై నివసించియున్నవాడు. ఇమ్మహానుభావుని ప్రభావము మిగుల నద్భుతమైనది. తన ప్రసాదము నిందించిన వారి నాక్షణమే యిడుమలంగుడిపించును. వేగమె యాగమోక్తవిధానంబున నాస్వామి నర్చింపవలయును. నేను స్నానముజేసి వచ్చెద నంతదనుక భద్రముగా నిందుండుమని పలికిన విని వాఁ డయ్యతితిలకున కిట్లనియె.

ఆర్యా ! భవదీయ సబోధావిశేషంబున నాకు వెనకటికన్న లౌకికజ్ఞానం బభివృద్ధియగుచున్నది. శ్రుతంబకాదే యెట్టివానినేనిఁ బండితునింజేయు నాకును దేవతాదర్శనము జేయ వేడుక యగుచున్నది. స్నానముచేయ మీ వెంటవత్తు మనసొత్తుఁ గొనువారెవ్వరు నిందు లేరు. అనుజ్ఞయిండని వేడుకొనిన నయ్యతి సంతసించి వాని రాక కియ్యకొని చయ్యన వానితోఁగూడ నింద్రద్యుమ్నసరస్సుకుం జని యథావిధిని దీర్థోపకృత్యములు నిర్వర్తించి మించిన భక్తివిశేషంబున నారాయణమంత్రంబు జపించుకొనుచు నాలయమునకుంబోయి ప్రదక్షిణపూర్వకముగా గర్భాలయమున ప్రవేశించి సుభద్రాబలభద్రసహితుండైయున్న జగన్నాయకుని జూచి మేను గరుపార నానందబాష్పములతో ఫాలతలంబున నంజలి ఘటియించి గద్గదస్వరంబున నిట్లని వినుతించెను.

ఉ. సాధుమనీషచేఁబురని ◆ శాచరులీల్గగ బుద్ధధర్మముల్
     బోధనఁజేసి తత్పతుల ◆ పుణ్యమతుల్ బెడబాపి నీలధా
     త్రీధరకూటమం దవత ◆ రించి జగంబులనేలువో జగ
     న్నాథ! వధూసనాథ! కరు ◆ ణన్ బరికింపుము నీకు మ్రొక్కెదన్.

అని మరియుం బెక్కుతెఱంగుల నంతరంగమ్మున నారథాంగపాణి సన్నిధానంబు గల్పించుకొని పెద్దతడవు ధ్యానించి కొండొకవడి కడనుండి కదలి యావరణదేవతల నర్చించు తాత్పర్యంబున నాలయప్రాంగణంబు జేరునంత నందించుక యలుకమొగంబునం బొడఁగట్ట నట్లె నిలుచుండి తన రాకకై వేచియున్న శిష్యుని గాంచి వానికిట్లనియె. గోపా! ఇంతదనుక నెందుంటివి? దేవునిగంటివా? సేవావశంవదుండనై నీమాట మరచితినిసుమీ! కోపము సేయకుము. లోనికిరమ్ము పోదము. నీ కులదేవతయగు వెన్నదొంగం గందువుగాని యని సానునయముగాఁ బలికిన నజ్జడదారికి వాఁ డిట్లనియె.

స్వామీ! నేను మీకుఁ గావడిమోచునప్పుడుగాక యిప్పుడు జ్ఞాపకము వత్తునా? కానిండు. మీదయ నామీద నింతమాత్రమే యున్నది ఏమి చేయుదును? స్నానము చేసినది మొదలు నామాటయే మీకు జ్ఞాపకము లేకపోయినది. నేను మాత్రము విడువక మీ వెంట దిరుగుఁచుంటిని. మీరు గుడిలోనికిఁ బోవునప్పుడు నేనుఁగూడ రాఁబోవుడునచ్చటఁ గాపున్న బెత్తములవా రడ్డుఁ పెట్టిరి. అప్పుడు నేను పెద్దయెలుంగున స్వామీ! స్వామీ! యని యరచుచు మిమ్ము బిలచితిని. మీరు నా మొర వినుపించుకొనక లోపలకుఁ బోయితిరి. నారొద వారించుచు లోపలనుండి యొక పండా బైటికివచ్చి నన్నుఁజూచి యోరీ ! యెవ్వడవు నీవు? ఇట్లూరక యరచెదవేల? యెవ్వరంజీరెదవని యడిగిన నే నిట్లంటిని.

అయ్యా! నేను గొల్లవారి చిన్నవాడను. మాయయ్యవారు లోపలనున్నవారు. వారితోఁగూడ నేను దేవునిఁజూడ దేవళములోనికిఁ బోవుచుండ వీరు వారించిరి. దానికై యరచుచున్నానని చెప్పితిని. అప్పు డాస్వామికి నామీద దయవచ్చినది. అల్పులవలె నున్నతులాపస్నుల మొరలాలకింపకుందురా! లోపల మిగుల సమ్మర్ధముగా నున్నది. కొంచెము సేపు తాళుము. వారు వెలుపలకు వచ్చినతోడనే నిన్నుఁ బంపెదనని చెప్పి యప్పుడె యందున్నవారినెల్ల మెల్లమెల్లన వెళ్ళఁగొట్టించి పిమ్మట నన్ను లోపలకుఁ బంపెను.

నేను లోపలకు వచ్చి మిమ్ము వెదకితినిగాని మీరు గర్భాలయములో నుండుటచేతఁ బల్కరించుట తటస్థించినది కాదు. తర్వాత నేను దేవునింజూచితిని. మొదట నా కేమియుందెలిసినదికాదు. చూడఁజూడఁ గన్నులు, మొగము మాత్రము గలిగియున్న మూఁడు మొండివిగ్రహములు గనఁబడినవి. వానినే దేవతలఁగా భావించి మ్రొక్కుచున్న నాతోడివారిని జూచి నేను మ్రొక్కితిని. ఇంతలో జనబాధ యెక్కుడగుడు నన్నందు నిలువనీయక వేత్రహస్తులు వెలుపలకుఁ దోసివేసిరి. ఆ విపరీతంబులఁ బెక్కుగతుల మతిందలంచుచు మీరాక వేచి యిందున్నవాఁడ. ఇంతలో మీ రిచ్చటికి వచ్చితిరి. ఇదియే నా వృత్తాంతము. నేనును లోకంబున ననేకదేవాలయంబులం జూచితిని. పెక్కెండ్ర వేల్పులగంటిని గాని యెందు నిట్టి వింతవేల్పులం జూచియుండలేదు. దీనికెద్దియేని కారణముండకమానదు. నాయందు దయయుంచి ముందు నాకీ సందియము దీర దీని వృత్తాంతము వక్కాణింపుడు. తరువాత జపమునుఁ జేసుకొందురుగాక యని నిర్బంధించిన, సంతసించి యాసిద్ధుండిట్ల నియె.

పుత్రా ! నీ వీప్రశ్న చేయుదువని యిదివరకే యనుకొంటిని. పుణ్యప్రదమైన యిక్కడ వక్కాణింప నాకునుఁ గుతూహలము గలిగి యున్నది. సావధానచిత్తుడవై యాకర్ణంపుమని యమ్ముఖమంటపంబునం గూర్చుండి మణిప్రబోధచేతద్వృత్తాంత మిట్లని చెప్పందొడంగెను.

ఇంద్రద్యుమ్నుని కథ

వత్సా! వినుము. పూర్వకాలంబున నిరావతియను పట్టణంబున నింద్రద్యుమ్నుఁ డను రాజు గలడు. అతఁడు చంద్రసేనయను భార్యం గూడి ధర్మంబున రాజ్యంబు సేయుచు స్వల్పకాలములో నెక్కుడు కీర్తిని సంపాదించెను. ఒకనాఁడమ్మహారాజు సభామంటపంబున సింహాసన మలంకరించియున్నసమయంబున ద్వారపాలకుడువచ్చి నమ్రతతో, దేవా! వింధ్యారణ్యమునుండి కిరాతులు కొందరు వచ్చి దేవరదర్శనము కొఱకు వేచియున్నారు ప్రవేశమున కవసరమేయని విన్నవించి తదీయమస్తకచలనంబున ననుమతి వడసి యబ్బోయెల నాస్థానమున బ్రవేశపెట్టెను.

పిమ్మట నయ్యెఱుకలు, పులిగోరులు, చామరములు, నెమలి పింఛములు, కస్తూరి మొదలగు నడవి వస్తువులు కానుకలు పెట్టి కట్టెదుట నిలువంబడి మ్రొక్కుచు నాగమనకారణం బడుగ నన్నరనాథున కిట్లని విన్నవించిరి.

ఏలికా! మేము వింధ్యాటవిలో నుండు దేవరదాసులము. మాకు పిన్ననాఁటినుండియు నూచలనేయు పాటవము గలిగియుండును. దానం బట్టియే నట్టడవులలో నెట్టి మెకపువెరపును లేక నేకతమకాపురము సేయుచున్నవారము. ఇప్పు డెప్పుడును జూడని వెడదమోము మెకంబొకటి మాయడవిం దిరుగుచున్నది. దానింబడనేయ నేయు మాతూపు లాపెనుసింగంపుటేపు మాపనోపకపోవుటయేకాక సైకపువేకి యేనిం బుట్టింపక లేకపోయినవి. అమ్మకచెల్లా! అల్లాటి మేటిమెకంబు నిఁక చూడబోము. దాని యఱపు వినినంత నేజంతువైన వెరపున సమయకమానదు. మానిసులం బేర్కొననేల? ఏయడలు నెఱుంగని మాపల్లెలవారెల్ల నుల్లములుపగుల రేయిఁ బగలు గన్నుమూయక నాలుబిడ్డల కెడమై పెనుమ్రాను లెక్కి పొక్కుచున్నవారు. సామీ! మాయావడి యుడిగింప దేవర చెచ్చెర నచ్చటికి విచ్చేయవలయును. భవదీయబాహుబలంబునంగాక యామెకంబు సమయదని విన్నవించిన నాలించి యారాజచంద్రుండు మందహాసము చేయుచు నిట్లనియె.

శబరులారా! వెరవకుడు. రేపకడవచ్చి యచ్చపలకేసరిం బరిమార్చి మిమ్ము నయ్యడవి నెల్లెడల విచ్చలవిడిఁ గ్రమ్మరఁజేసెద. మాకును దడవులంబట్టి యడవులం దిఱుగు వేడుకగలిగియున్నయది. దైవకృపచే నేటికది యొనగూడినది. తెఱవెఱింగింప నిరువురుమాత్రము నిలిచి తక్కినవారు పొండని యమ్మన్నెగాండ్ర కాజ్ఞయిచ్చి యప్పు డప్పుడమిఱేఁడు అఖేటనయాత్రాప్రకారంబు పురంబెల్లఁ జాటంబంచి తత్పరికరంబు సమకూర్ప నమాత్యవర్గమునకు నియమించి యంతఃపురమునకుఁ బోయెను.

చంద్రసేనయు నందుచితసఖీపరివృతయై మనోగతంబు వక్కాణింపుచు బతిరాక విని సంతోషముతో దిగ్గున లేచి డగ్గర నెదురేగి కైదండము యిచ్చి తోడి యిచ్చి మచ్చిక దోప గద్దియం గూర్చుండఁబెట్టి ప్రాంతమున నిలువంబడి యింపుగులుకు పలుకుల నతనిమతి కుతుకపరుచుచుండ నప్పు డొకయొప్పులకుప్ప తెప్పున నప్పూబోఁడి కిట్లనియె.

బోఁటీ! మనమేటికి సందియమందవలయును? మనమనుకొనిన కల తెఱంగి మహారాజున కెఱింగింపుము. సకలకళానిపుణుండగు నితండందలి శుభాశుభఫలంబుల వివరింపఁ గలఁడని నుడివిన విని సంతసించుచు నారాజపత్ని ఔనౌను మంచిసంగతి జ్ఞాపకము చేసితివి. నే నిమ్మానవనాథుని సేవావసరములో మరచిపోయితిని యడిగి తెలుసుకొనియెదంగాక యని యతని మొగమునం జూట్కులు నిగుడింపుచు మెల్లన నిట్లనియె.

నాథా! నిన్నటిరాత్రి వేకువజామున నాకొక కలవచ్చినది. దాని మంచిచెడ్డల నాప్రాణసఖుల నడిగిన వారు నిరూపింపలేకపోయిరి. అది దేవర నడిగి తెలిసికొనవలయు నని నిశ్చయించి తత్ప్రకారంబంతయుం జెప్ప మరతునని యీపత్రంబున వ్రాయించితిని. నిదిగో చూడుఁడని చేటికచే నాపత్రికం దెప్పించి న్బపతి కిచ్చినం బుచ్చుకొని యమ్మానవపతి పలుమారు పఠించి శిరఃకంపము చేయుచు నిట్లనియె.

అబలా! నీకలతెరం గరయ నాయంతరంగము కలంకఁజెందుచున్నయది. శీఘ్రకాలములో మనము వియోగము జెంది పెక్కిడుములం గుడిచి చివర జగద్విఖ్యాతమగు కీర్తియుం బడయునట్ల దానం బొడగట్టెడి నింతకు దైవమేమివ్రాసెనో తెలియదు. కర్మసూత్రంబు దాట నెవ్వనితరము? ఇప్పుడు తదనుగుణ్యముగ నరణ్యగమనము నాకుఁ దటస్తించినది. ఇదియు దైవప్రేరితము కావచ్చును. లేకున్న నిత్యము పెక్కుమృగంబులను జంపి తినుచున్న యక్కిరాతు లొక్కమెకమునకుఁ జిక్కి యిక్కడకు రావలయునా? కానిమ్ము. కానిమ్ము. అని దీర్ఘనిశ్వాసములు నిగుడ్చుచు దీనవదనుండై పలికిన యన్నరనాథుని జూచి వెఱగందుచు నాచంద్రసేన యిట్లనియె.

ఏమేమీ? నా కలలో నంతవంతయున్నదా? కటకటా? యెఱుంగకపోతినే. మీ యంతరంగంబు కలంకపెట్టి యెంత యపరాధినైతిని. అయ్యో! మనకు వియోగము కలుగునంటిరి. ఆమాట విన్నంత నాగుండెలు కొట్టుకొనుచున్నవి. యెట్లు సైరింతునని యతనికంఠము బిగ్గరగాఁ గౌగలించుకొని వెక్కి వెక్కి యేడువఁదొడంగినది. అప్పుడా రాజపుంగవుండు తెరవా! వెరవకుము. కలలునిజమగునా? యూరక నిన్ను వెరపించుట కట్లంటినిగాని యథార్ధముకాదు. నేను రేపటియుదయంబున వేటకుఁబోయి యస్త్రపాటవంబు దేటపడ నా సింహమును సంహరించి చెచ్చెర వచ్చెద నంతదనుక భద్రముగా నుండుమని యోదార్చిన నక్కలకంఠి కంఠంబు విడువకయే గద్గదకంఠముతో మరల నిట్లనియె.

ప్రాణేశ్వరా! మిమ్మువిడిచి యొంటియై నుండఁజాలను నాకును మీతోడరా ననుజ్ఞయిండు లేకున్న నెప్పుడేనిఁ బోవచ్చు నిప్పటి కప్పయనంబు మానిపింపుఁడని వగచుచున్న యమ్మత్తకాశినిం గ్రుచ్చి యెత్తి కౌఁగలించుకొనుచుఁ జెక్కులు ముద్దాడి తద్దయుం బ్రీతి నానేత ముద్దుగుమ్మా ? ఇప్పుడు వనంబునకుఁ బోవకతప్పదు. అబ్బోయల కభయప్రదానమిచ్చితి. కావున నాతోడ రమ్ము, ఉద్యానవనంబునం బోలె మన మందు విహరింపవచ్చునని మచ్చిక నమ్మచ్చెకంటి యిచ్చగింపఁబలికి తత్కాలోచితకృత్యముల నిర్వర్తించి యారేయి గడపెను.

అంత మరునాఁ డరుణోదయంబున వేటఁబాటవంబుగల మృగయులు పెక్కండ్రు తత్సాధనంబునం బూని పరివేష్టింప సముచితపరివారసహితుండై యయ్యింద్రద్యుమ్నుండు యౌవనరాజ్యపట్టభద్రుఁ డగు విజయుండను కుమారు నింటికడ భద్రముగానుండ నియమించి మంచిముహూర్తమ్మున వెడలి భార్యయెక్కిన శిబికవెంటఁ దన గుఱ్ఱమును నడిపించుచుఁ గతిపయప్రయాణముల శబరనిర్దిష్టమార్గంబున నవ్వింధ్యారణ్యమున కరిగెను. అంతకమున్న యందు నుపవనసౌధములభాతి నతివిచిత్రముగాఁ జిత్రకారకులచే నమర్చఁబడిన పటకుటీరములందు విడిచి చుట్టునుం దనవాహినుల వ్యూహంబున నిలఁబెట్టి కొంతవట్టు పట్టమహిషికందుఁ గన్పట్టు మెట్టలం బెట్టు లుసిరిపట్టుగా నిట్టట్టు గ్రుమ్మరు వింతపిట్టలచేష్టలఁ జూపుచు పరమేష్టి సృష్టి ప్రభావం బగ్గింపుచుండెను.

అంత సాయంకాలమున నమ్మనుజపతి వేటకాండ్రు చుట్టునుం బరివేష్టించి వేటకనుజ్ఞ యెప్పుడెప్పుడని తొందర పెట్టుచుండ నయ్యాటవికులం జీరి యోరీ! యా సింహ మెక్కడ నున్నది? యెప్పుడు వచ్చును? దాని చిహ్నము లెట్టివి యెఱింగింపుఁ డని యడిగిన వాండ్రు మొక్కు చేతులతో నిట్లనిరి దేవా! దేవరతో మనవి చేసికొని వచ్చినది మొదలు మా కామెకము గనఁబడుటలేదు. మీరాక విని వెరపున పారిపోయెనని యూహించుచున్నారము. అది యదిగో కనఁబడుచున్న గొందిలో నెప్పుడును గద్దెవైచుకొని కూర్చుండునది. యీ వేళకు నిందుఁజేరువారు యమునిచేరువారేయగుచుండిరి. కటకటా! మేము పడిన యిడుములేమని వక్కాణింతుము. నేఁడుగదా మా యాలుబిడ్డలం గూడికొంటిమి. మావింటికడిందియడర నియ్యడవియంతయు దడవి దానిని గడతేర్పుఁడు. ఎక్కడనో యడఁగియున్నదని వేడుకొనిన వారిమాటలు విని నవ్వుచు రాజశేఖరుండు వేటకాండ్ర కిట్లనియె.

ఓరీ! యా కేసరి మనరాయిడికోడి యెందేని నణగిఁయుండవచ్చును. విచ్చలవిడి నీరేయియంతయు నడవినెల్లడలఁ గలచి యలజడి సేయుఁడు ఉరులఁ బన్నుఁడు. వలల నొడ్డుఁడు, మఱియుం గ్రూరసత్వంబుల సత్వరంబునం బరిమార్పుఁడు. కుక్కల నుసిగొల్పుఁడని యానతిచ్చినంత సంతోషముతో వాండ్రందరు గాండ్రుమని యఱచుచు నొక్కుమ్మడి నయ్యడవియంతయుం జెలరేగి హల్లకల్లోలము చేయదొడఁగిరి.

అప్పుడా చప్పుడులకు వెఱచి యఱచుచుఁ బరచు మృగమ్ముల యెలుంగులు విని బెదురుఁగదురఁ దన్నుఁ గౌఁగలించుకొనిన చంద్రసేనను బిగియంబట్టి స్వయంగ్రాహసుఖపారవశ్యం బేపార నారాజశేఖరుం డారమణీమణి కుదుటుఁగఱపుచు నాశిబిరంబునఁ దదీయలీలావిశేషంబులతో నారాత్రియంతయుం దృటిగా వెళ్ళించెను. అంత నిశావసానంబగుటయు భార్యయుం దానును వందిమాగధసంస్తపరవంబుల మేల్కాంచి సమయకరణియములం దీర్చి రమణీయంబగు ప్రదేశంబున బ్రాతఃకాలమందమారుతమ్ములు మేనికిహాయి సేయ నుచితాసనంబులంగూర్చుండి యక్కాననసౌభాగ్యంబరయుచున్న సమయంబునం దళవాయి యరుదెంచి ఫాలంబునం గరయుగంబు గీలు కొల్పుచు నిట్లు విన్నవించెను.

దేవా! దేవర యనుమతి రాత్రియంతయు నీయరణ్యంబున గల మృగముల నరసి వేటాడితిమి పెక్కుమృగంబులం జంపితిమి. పెక్కుజంతువులం బట్టితిమి. పెక్కు మెకంబులం దోలితిమి మాయిచ్చవచ్చినట్లెల్ల నీయడవి నల్లరిఁజేసితిమి. కాని యెందును వాండ్రనిన సింగము చిక్కినదికాదు. అది నిక్కముగా నెక్కడికో పోయినది లేకున్న మాకు దొరకకపోదు. పెక్కేల నిక్కాననములోనున్న సత్వరంబు మాసత్వంబునకు దాటినది యొక్కటియులేదు. దేవర తలపూవువాడకుండ నశ్రమం బునం బురంబునకుఁ బోవచ్చునని పలుకుచు వలలచేఁ బొలియకుండబట్టిన వింతమృగంబులం దెప్పించి యెదుర పెట్టించెను.

వానిని జూచి యరాచమన్నీఁడు వేడుకపడుచుఁ దద్విశేషంబుల భార్య కెఱింగింపుచు నప్పటికిఁదగిన కానుక లామృగయుల కిచ్చి మఱలఁ బురంబునకుఁబోవ సేనల సన్నాహపరచుఁడని యాన తిచ్చుచున్న సమయంబున ననతిదూరములో, “హా! ప్రాణనాథ! హా! జీవితేశ్వరా! యేమైపోయితివోగదా? కటకటా! యూరక నీకు మృత్యుదేవతనై తోడ్కొనివచ్చితిని. అయ్యయో! ఎంత పాపాత్మురాలను? పరిశీలింపక నేలపాలు సేసితినే" అని యేడ్చుచున్న యార్తధ్వని యొండు వినంబడినది.

దానికందరును వెరగుపడుచు దలలుపైకెత్తి యాదీనారవంబు ఏతెంచిన దెసకు గర్ణములం జొసిపిరి, మరల నారీతినే వినంబడుటయు నదరిపడి యప్పుడమియొడయుండు వడిగలవారల బిలిచి యది యేమియో సరగున నరసిరండని పనిచిన వారునుంబోయి తద్విధంబంతయు దెలిసికొనివచ్చి యిట్లని విన్నవించిరి, దేవా ! దేవరయానతి మేమా రొదజాడబట్టి వేగమెపోవ నా త్రోవదాపున చెట్టునీడ నొకచేడియ కనబడినది. ఆతొయ్యలి తనపయ్యెద చెరంగు మెడకు బెనివైచికొని చెట్టుకొమ్మకు తగిలించి ప్రాణనాధునిదలంచుచు ప్రాణముల బోగొట్టుకొన నుద్యోగింపుచున్నయది అట్టితెగువకు వెరగందుచు మేము సత్వరంబును నా చేలము గంఠము బిగియకుండ జిక్కబట్టుకొని యబలా! నీ వెవ్వతెవు! ఇట్టి ఘోరసాహసమేల జేసెదవు. నీపతి యే మయ్యె నెఱింగింపుమని మేమెంత బ్రతిమాలి యడిగినను మాకు బ్రత్యుత్తరము చెప్పినది కాదు. ఆమె ప్రక్కనొక్క చక్కనిగుఱ్ఱము పెక్కుదూరము నడిచివచ్చినట్లు మేనెల్లం జెమ్మటలుగ్రమ్మ నొగర్చుచు నిలువబడియున్నది. అయ్యారే! అయ్యెలనాగసోయగం బేమని వక్కాణింతుము. దివ్యాంగన యని తోచుచున్న యది. దానిమాట పిదప విమర్శించుకొనవచ్చును. వేగమె యా మగువ సమయకుండ దేవర విచ్చేయవలయునని పలికిరి. దీనజనుల రక్షింప గంకణము గట్టుకొన్న యన్నరనాయకశిరోమణి వారిమాట విని సత్వరము తురగ మెక్కి చంద్రసేన వలదు వలదు, నన్ను గూడ గొనిపొమ్ము. కొనిపొమ్మని బ్రతిమాలు కొనుచుండ వినిపించుకొనక వడిగా నప్పడతియున్న విటపినికటమునకు బోయెను. అట్లా భూపుం డరుగునప్పటి కత్తలిరుబోడి నా చేలమువిడుపుడు. విడువుడు పాపాత్మురాలిని ముట్టకుడని పెనుగులాడుచుండ నాదండకు బోయి మెల్లన మెడయురి దప్పించి చల్లనిపలుకుల నిట్లనియె.

తల్లీ! నీ తల్లిదండ్రు లెవ్వరు? ఎవ్వనియిల్లాలవు? నీ పేరెయ్యది? అనన్యసామాన్యరూపలావణ్యములుగల నీ వంతఃపురములఁ జేటిక లూడిగములు సేయ నివసింపక యొంటియై నీయరణ్యమునకుఁ రాఁగతంబేమి? నీ కాపురమెచ్చట? నీ చందమరయఁ బతివియోగంబున శోకింపుచున్నట్లు కనంబడుచున్నది. నే నింద్రద్యుమ్నుండనువాఁడ. క్షత్రియకులుండ. వేఁటకారణంబునఁ నీ విపినంబు జేరితి. భవదీయ శోకాలాపంబులు మదీయకర్ణపుటంబులఁ గటువులై చొచ్చుటయు నొచ్చినడెందముతోఁ గారణంబరయ నిందు వచ్చితిని. నన్నన్యునిగాఁ దలంపకుము. నీ తండ్రివంటివాఁడ. నాయోపినంత యుపకారము సేసెద. నీ వృత్తాంత మాద్యంత మెఱింగింపుమని పలుదెఱంగులఁ బ్రతిమాలుచున్న యన్నరపతి యనునయవచనంబులఁ దనహృదయశోకం బించుక శాంతింప నవ్విద్రుమోష్టి తన యుద్యమం బుడిగి కన్నీరుఁ దుడుచుకొనుచు దదీయవిఖ్యాతి నంతకుమున్ను వినియున్నది కావున నతం డట్టివాఁడుగా నిశ్చయించి చూపులఁ దైన్యంబుఁ తోప లేచి మ్రొక్కుచుఁ దనవృత్తాంతం బిట్లని చెప్పందొడంగెను .

విశాలాక్షి కథ

ఆర్యా! మందభాగ్యురాలనగు నా వృత్తాంతము వినుటచే దేవరచిత్తము దుఃఖభాజనము కాకమానదు. అయినను దీనుల మొఱలాలించుట యుత్తమధర్మము గదా. నాకీసమయములో మరణమే శరణమై యున్నది. బలవన్మరణము నిరయకారణ మని వినియుండియు నిట్టితెగువునకుఁ బూనుకొంటిని. చింతసాగరంబు మునింగియున్న జనులకు బంధుదర్శనము తెప్పయగునని యార్యులు చెప్పుదురు మీ మాటలచేతనే నా సంతాపము కొంతచల్లారినది. నాయిడుములతెఱం గెఱింగించెద నాలింపుము.నేను హేమాంగదుఁడని ప్రసిద్ది వహించిన కాశీరాజుకూతురను. నా పేరు విశాలాక్షి యందురు. మా తల్లి యొక్కనాఁడు సంతతిలేమిఁ జంతింపుచుఁ న్నంతరంగమున ధ్యానించి నిదురించినంత జగద్రక్షణియగు విశాలాక్షి కలలోఁ బ్రత్యక్షమై నన్నిచ్చుటచే నాకద్దేవిపేరు పెట్టిరి. కటకటా! ఆఘటనాఘటనసమర్ధురాలగునట్టి దేవి వరంబునం బుట్టియు నిట్టి బాధలంబడుచుంటిని. ప్రారబ్దం బెట్టివారికిని దాటశక్యముగాదను మాట యథార్ధము లేక లేక కలిగిన దాననగుట నా తల్లిదండ్రులు నన్ను గారాబముగా బెంచిరి. కాశీపురము విద్యామందిరమనుమాట జగత్ప్రసిద్ధమైనదే కద! పూవునకుఁ దావింబోలె నారూపము నీకనురూపముగా విద్యయుండినచో నలంకారముగా నుండు నని యూహించి మా తండ్రి మాటలు వచ్చిన నాటఁగోలె నవ్వీటగల మేటిపండితులఁ బిలిపించి నాకువిద్యఁ జెప్పింప దొడంగెను. దానంబట్టి ప్రాయముతోఁగూడ విద్యయు నభివృద్ధిఁబొందెను. విద్వాంసులు మదీయగహణధారణసామర్ధ్యమునకు వెఱఁగందుచుండిరి. పదియారేఁడుల ప్రాయమువచ్చువరకు నాకు విద్యలన్నియు బూర్తియైనవి.

అప్పుడు మా తండ్రి మిగుల సంతసించుచు గురువులకు దగిన పారితోషికము లిప్పించి నాకనురూపుండగు వరుఁడెవ్వడో యని విచారింపదొడంగెను. ఒక్కొక్క రాజకుమారునియం దొక్కొక్క గుణమేకాని యన్నిగుణములఁ గలిగిన వాఁడెందునుఁ బొడఁగట్టలేదు. మా తండ్రి యొకనాఁడు దూతికాముఖంబున నీకెట్టివాఁడు పతికావలయునో చెప్పుమని యడిగిన నేనిట్లుత్తరముఁ వ్రాసితిని.

తండ్రీ! వరునియందు విద్యాశీలరూపసంపదలు ముఖ్యముగా నరయఁదగినవిగదా అందు మొదటిది విద్య! శాస్త్రపాటవము లేనివానిమనం బెంతవిన్నామ మైనను అగ్నిశోధితముగాని బంగారుచందమునఁ బ్రకాశింపనేరదు. బుద్ధిహీనుండగు వాఁడు మిగులసంపదఁగలవాఁడైననుఁ జెడిపోవును. శాస్త్రచక్షుస్సు దివ్యమైనది. భూతభవిష్యద్వర్తమానవిశేషములఁ జూడనోపును. విశాలనేత్రములు గలవాడయ్యును శాస్త్రప్రజ్ఞ లేనివాఁడు అర్థదర్శనముల యందు సామర్థ్యము లేకపోవుటచేత గ్రుడ్డివాఁడే యగును. కావున విద్యాబలసంపన్నంబగు బుద్ధిచే నొప్పువాఁ డుత్తముఁ డనంబరగును. రెండవది శీలము - శీలములేనివాఁ డెంత విద్వాంసుడయ్యును పన్నగశిరోమణియుంబోలె వాసి కెక్కనేరడు. మూడవది రూపము "యత్రాకృతిస్తత్రగుణాభవంతి" యను నార్యోక్తి చొప్పున సాముద్రికశాస్త్రదృష్టంబైన రూపముగలవాని కన్ని గుణములు పుష్పపరిమళముభాతి సహజంబులై యుండును నాలుగవది సంపద. త్యాగభోగము కది యావశ్యకము. ఇందు రెండవది లేక తక్కినవి గల్గియున్నను గర్వహేతుకములై యపయశము గలుగఁజేయును. మొదటిమూడునుం గలిగి నాలుగవది లేకున్నను నెప్పటికేని వీనిచేఁ దానిని బడయవచ్చును. లౌకికమర్యాదాభిజ్ఞులకు మీకు నేను జెప్పుదాననా. అయినను నాకుఁదోచినది వక్కాణించితిని. పిమ్మట మీ యిష్టమని వ్రాసి పంపితిని, ఆజాబు చదువుకొని యతం డెంతేని సంతసము జెందుచు నీభూమి నంతయుం బరిశీలించియైన దీనికిఁదగినమగనిఁ బెండ్లి చేయుదునని నిశ్చయించి నానాదేశములకుం దగిన దూతలఁబంపెను. నే నొక్కనాడు సాయంకాలమున ప్రాణతుల్యులగు చేడియలు తోడరాఁ బల్లకినెక్కి కేదారేశ్వరు నారాధింప బోవుచుండ నా ఘట్టంబున గంగాతీరంబున సౌపానంబులంగూర్చుండి కొందరు విద్వాంసులు భాగీరథీనీర జరాగచోరకంబులగు మలయమారుత కిశోరకములు మేనులకుహాయి సేయ శాస్త్రవాదంబులు చేయుచుండఁ దన్నాదంబులు మదీయ కర్ణగోళములకుఁబండువులగుటయు నాందోళికము నించుకయాపి తదీయగవాక్షవివరములనుండి తొంగిచూచితిని. అప్పుడా విద్వన్మండలమునడుమ జుక్కలలో చంద్రునివలె నొక్క బ్రాహ్మణకుమారుడు నాకు నేత్రపర్వమై తటాలున నామానసమాకర్షించెను. ఈశ్వరునివరము జేసికొన గంగాతటంబునకు దపముసేయ నరుదెంచిన కంచువిల్తుడోయన మనోహరవేషంబున నొప్పు నక్కుమారశేఖరుని జూచి స్వాంతముని నేనిట్లని తలంచితిని కంతువసంత జయంతాదుల సుందరులని చెప్పుటయేకాని వారిని జూచినవారు లేరు. వారు వీనివలె సర్వాంగంసౌష్టవము గరవారని తోచదు. అయ్యారే! వీనియవములన్నియు లావణ్యభూయిష్టములై మొలచినయట్లున్నవి. కలకలనవ్వు మొగంబును సొగసైన కన్నులు సుందరఫాలము, చక్కనిచెక్కులు, విశాలమైన వక్షము, దీర్ఘములైన బాహువులుంగలిగి సాముద్రికశాస్త్రలక్షణంబుల సార్వభౌముండుగా నుండదగు నీతం డిట్లు దైన్యంబు నొంది యుండుటకు గతంబేమియో గదా ? ఔనౌను తెలిసికొంటి వీనియోష్టంబులు పరిశీలింప బెక్కుశాస్త్రంబులు చదివినట్లు తోచుచున్నది. బ్రాహ్మణునికి విద్వత్తు గలుగుటయే రాజయోగమందురు. ఇట్టిసుందరు డీయూరనే యుండ నా తండ్రి బెక్కుదూరము వెదుకనేల? వీనియునికి దెలియకగాబోలు వీనిని జూచినది మొదలు నిర్దుష్టమగు నా మనంబు మదనావేశము జెందుచున్నది. భక్తజనపరాయణుడగు కేదారేశ్వరస్వామియే వీనిలనాకొరకు దెచ్చెనని తలంతు. విద్యారూపంబులుగల వీనియందు సంపద్విచారము చేయనేల? నేను వరించినచో మా తండ్రి రాజ్యంబున కీతడే యధికారి యగును గదా, కావున నేను వీనిని ద్రికరణంబులచే బతిగావరించితి. ఈతడే నాకు బతియని నిర్దేశించుకొని వానికులశీలనామంబులం దెలిసికొనిరమ్మని బ్రచ్చన్నముగా మదీయప్రాణసఖి నొకదానినంపి కేదారేశ్వరు నారాధించి యింటికి బోయితిని.

రాజేంద్రా! స్త్రీజనస్వభావం బెంతచాంచల్యమైనదో చూచితివా! ఎంత చదివినను వివేకములేక నే నతని జూచినంతనే వరించితిని. కులశీలంబులు దెలియునంత దనుక తాళలేకపోతిని. అట్లు నేనింటికి బోయి చెలికత్తెరాక వేచుచున్నంత నంతలో నది వచ్చినది దానిని జూచి నేనత్యాతురముగా చెలీ! నీవాయనతో మాట్లాడితివా? ఏమి ప్రసంగము జరిగినది? నీకతండేమియుత్తరము చెప్పెను? పండితుండౌనా! ఆ సుముఖుని ముఖమునుండి వెడలిన వర్ణముల గ్రమము దప్పకుండ నుడువుము. నీ ముఖవిలాసముజూడ వేఱొకలాగు దోచుచున్న దేమి? వేగమె యచ్చటి విశేషముల దెలుపుమని తొందరపెట్టిన నది నాకిట్లనియె.

బోటీ! నీ వేమిటికూరక తొందరపడియెదవు? క్రొత్తవాని యంతస్సారం బెరుంగక వరింపవచ్చునా? మనమెంత ప్రౌఢలమైనను బెద్దవారల యనుమతిలేక స్వతంత్రింపరాదు అచ్చటిచర్యల జెప్పెద వినుము. నేను పండితమండనులదండకు బోయి దండప్రణామంబులు చేయుచు వారిచే మన్ననలవడసి కొంతసేపు వారివాదముల నాకర్ణింపుచు బ్రాంతమున నిలువబడితిని. నీవు కోరిన చిన్నవా డెద్దియేని బ్రసంగించునేమో యని యెంతసేపు నిలిచినను వానినోటినుండి యొక మాటయైనను వచ్చినది కాదు. వారివాదములనైన వా డెరింగినట్లు నేను తలంపను. వారు ప్రసంగమ్ముల ముగించిన పిమ్మట నందరు లేచి నివాసములకు బోయెడితఱి నేనా బ్రాహ్మణకుమారుని నించుక చాటుగా జీరి, అయ్యా! తమ నివాసస్థలమెచ్చట! మీ పేరేమి! యేమిటికై యీపట్టణమునకు వచ్చితిరి? ఏమి చదువుకొంటిరని యడిగితిని. అప్పు డాయన నాతో జెప్పిన దేమనగా, “నాగ్రామము పేరు నాపేరు నాకు దెలియదు. నే నేమి చదుకొన్నది యెఱుంగను. ఇప్పుడు శబ్దాలు చదువుకొనుచున్నాను. మాగురువుగారు కింశుకశాస్త్రి యని మాత్రము నన్ను బిలుతురు." అని యుత్తరము జెప్పెను.

ఆమాటలకు నేను వెఱగుపడుచు అయ్యో! గ్రామము పేరు తనపేరు మరచువారుగలరా? మీమాటలుచూడ బరిహాసముగా దోచుచున్నవి. నేను మీతో నవ్వు లాటకు రాలేదు. కార్యముగలిగి వచ్చితిని. యథార్థము చెప్పుడని నేనెంతవేడినను మారుమాట జెప్పక పిలుచుచుండగనే లక్ష్యముజేయక యతండు లేచిపోయెను.

అంతట నేనేమియు జేయునది లేక వాని మాటలనే మాటిమాటికి స్మరించుకొనుచు నీయొద్దకు వచ్చితిని. వాని చర్యల జూడ వెఱ్ఱివాడువలె దోచుచున్నవాడు. అతండు నీకు దగడని నుడివినది. దాని మాటల విని నేను ఓహోహో! బుద్ధిమంతురాలా! నేటితో నీబుద్ధిబలంబంతయు దేటమైనది. నిన్ను మిగుల చతురవనుకొంటిని. చాలులే అతండు గంభీరహృదయుండును, ధీరుండును మీబోటి బోటులకు దనహృదయంబు దేటపడనిచ్చునా? వానిశ్లేషవచనంబులు నీవు గ్రహింపలేకపోయితివి. వాని యర్థము నేను జెప్పెదనువినుము. విద్వాంసుల కొకదేశము, ఒకనామము స్థిరముగా నుండదు. సర్వదేశములు సర్వనామములు నావేయనియర్ధము. శబ్దములు చదువు చున్నాననగా సకలశాస్త్రములు శబ్దకాలమే కావున నట్లనెను. మఱియుం గింశుకశాస్త్రి యనగా మోదుగపూవు వంటివాడనని స్వాతిశయశూన్యోక్తి గొప్పవారు ఆత్మస్తుతి జేయనొల్లరు. అభిజ్ఞులు సమానులతో గాని మనసిచ్చి మాట్లాడరు. నీవది గ్రహింప లేక వెఱ్ఱివాడని సులభముగానంటివి. పోపొమ్మని దానిని దిరస్కరించి వానిని నేను బెండ్లియాడక మాననని తదాయత్తచిత్తురాలనై మన్మథావస్థలకు బాల్పడితిని.

పిమ్మట నొకనాఁడు దాసీముఖంబున నాయవస్థయంతయు విని మాతల్లి నా యొద్దకు వచ్చి మదీయమనోగతంబడిగి తెలిసికొని మా తండ్రితోఁజెప్పెను. ఆతండు మిగుల సంతసించుచుఁ దక్షణము ఆ విప్రకుమారునిందోడ్కొని రండని దూతలం బుచ్చిన వారేఁగి తోడ్కొని వచ్చిరి. మా తండ్రి యంగజునిబోలియున్న యా చిన్నవానిని జూచి వెరగందుచు నోహో! యీ మోహనాంగుఁ డీయూర నెంతకాలము నుండి యుండెనో. యిట్టి సుందరుఁ డింత చేరువనుండఁ దెలిసికొనలేక యూరక శ్రమపడితిని. నాయందు మక్కువఁగల విశ్వనాధుండే యిక్కు మారునిం దెచ్చియిచ్చెను. నాకూఁతునకుఁ దగినవరుడు లబించెనేఁడుగా కృతార్థుండనైతినని పెక్కురీతులఁ గౌతుక మందుచు విద్యావిషయ మింతయేనిం పరీక్షింపక వానికి నన్నిచ్చుటకు నిశ్చయించి తగు ప్రచారకులతో వానినొక విడిదికిఁబంపెను

పిమ్మట సిద్ధాంతులచే నిర్దిష్టమగు సుమహూర్తమున మిగుల వైభవముతో నా తండ్రి మాకు వివాహము గావించెను. అతని నా యూరిలోని వారెవ్వరుఁ గింశుక శాస్త్రియని గురుతెఱుంగరు. ఎచ్చోటనుండియో చక్కని రాజకుమారుఁ డొక్క రుండు రాజపుత్రికకుఁ దగినఁవాడు దొరికెనని సంతసింపుచు నతని సౌందర్యమును వేతెరంగుల స్తుతిఁజేయ దొడగిరి.

అంత వివాహదీక్షావసానదివసంబున విలాససౌధంబు చక్కగా నలంకరించిరి. పవడపుఁకోళ్ళును బంగారుపందిరి ముత్తెముల జాలరు పట్టుదోమతెరయుఁ దంతపువింతనగిషియుం గలిగి హంసతూలికాతల్పముచే నింపుగాంచిన మంచము చుట్టును విచిత్రవస్తువులు పెక్కు గాజుదీపపుకాంతులు వింతలుగుల్కుచుండ నమర్చిరి. పెక్కేల నాగదియలంకారమంతయుంజూచి తీరవలయుగాని చెప్పశక్యము గాదు.

రాజా ! నీవు నాకు దండ్రివంటివాఁడవు. ఇది యాపత్కాలమునగుటచే నిటుమీద జరిగిన చర్యలను సిగ్గువిడిచి చెప్పుచుంటిని. గాని మీబోటివారికి జెప్పవలసినదిగాదు. మనంబునఁ బెక్కురీతులఁ గోరిక లువ్విళ్ళూర నాదివసంబున సాయంకాల మగుటకు నాకు గడియ యుగముగాఁ దోచినది. నావయస్య లాదినంబున నాకుఁ జేసిన యలంకార ప్రకారమంతయుఁ చెప్పుటకొక సంవత్సరము పట్టును. నిత్యము చూచుచున్నవారే నాసోయగమునకు గ్రొత్తవింత పడజొచ్చిరి. అంత నారాత్రి మా తండ్రి యాజ్ఞచొప్పున నా గదిలో దాంబూలచర్వణచందనానులేపనాది స్త్రీజనకృత్యము లన్నియు లఘువుగా జరుగుటచే జిరకాలమునుండి తలంచుకొనుచున్న నావయస్యల కోరికలేమియు దీరినవికావు.

పిమ్మట దమవెంట వచ్చుచున్న నన్ను లోనికి ద్రోసి బలత్కారముగా దలుపు బిగియించి నా చెలికత్తె లరిగినవెనుక నేనును దలుపు దాపున దలవంచుకొని నిలువబడితిని. ఎంతసేపట్లు నిలిచినను నన్ను బల్కరించినవారు లేరు. గొంతసేపునకు నేనే మెల్లనతలయెత్తి చూడ నా మహాపురుషుండు దుప్పటము ముసుంగుదన్ని యాతల్పముపై గుఱ్ఱువెట్టి నిదురించుచుండెను.

ఆ గుర్రువిని నేను వెరగుపడుచు మంచము దాపునకు బోయి యోహో ! యీతండు నన్ను బరామర్శింపక యిట్లు గాఢనిద్ర జెందుటకు గారణమేమియోగదా ? నాయందు వీనికి మక్కువ లేదా ? లేక యలసటచేత నిట్లు నిద్రించుచున్నవాడాయని యాలోచించుచు కానిమ్ము. నేనుమాత్రమంత తేలికపడనేల. నేటికూరకొని రేపు చూచెదంగాక అని యారాత్రి వేరొక మంచముమీద బరుండి నిద్రబోయితిని.

అతండును తెల్లవారకుండలేచి పరిచారకులు సేవింప విడిదికింబోయెను. ఆరాత్రియంతయు వృథయయ్యెనని వగచుచుండ నా సఖులు నన్ను జుట్టుకొని నా యంగములన్నియు బరీక్షింపుచు బెదవులు విరిచిరి.

శ్లో॥ కస్తూరీ వరపత్ర భంగనికరో భ్రష్టొ న గండస్థలె
     నోలుప్తం సఖి చందనం స్తనతటె ధౌతం ననేత్రాంజనం
     రాగో నస్ఫలిత స్స్తవాధరపుటె తాంబూల సంవర్దితో
     కింరుష్టోసి గజేంద్రమత్తగమనే! కింవా శిశు సైపతి!

ఓహో, చెలీ ! పెక్కు విద్యలం జదువంబట్టియా యిట్టి విలాసముల జూపితివి. మేని అలంకారములేమియు గలుగక పెట్టినవి పెట్టినట్లే యున్నవి. పుష్పములు వాడలేదే, నఖదంతచిహ్నము లెందునుంగానరావు ఇది నీ చమత్కృతియా? నీమగని పాటవమా? తేటపరుపుము. లజ్జావతీ? అని పరిహాసము సేయుచుండ పోపొండు మీరు సిగ్గుమాలినవారలు మీకుత్తరము చెప్పనని అప్పటికి దగినట్లు మాట్లాడుచు వారెంత గ్రుచ్చి గ్రుచ్చి అడిగినను నాగుట్టు చెప్పితిని గాను.

అంత మరునాడు రాత్రి యెప్పటివలెనే నన్నలంకరింపుచు దాచినం దాగవని కేళీచిహ్నంబులం గురుతుపట్టుటకై నాడు కేవలము పుష్పాలంకారములే నామేన నుంచిరి పూర్వమురీతి నాతలిరిబోండ్లు తలుపు మూసి పోయిన వెనుక నేనును తలుపుదాపున నిలువంబడి యోరజూపుల జూచుచుండు నంతలో నమ్మానుభావుని గుఱ్ఱు వినంబడినది.

అప్పుడు నేను బెక్కుతరంగుల దలపోసితిని. అన్నన్నా! ఈ విజ్ఞాని శుకాది మహర్షులకన్న నధికుడువలె దోచుచున్నవాడు. ఎట్టివారైనను నావంటి వాల్గంటు లెదురనిలిచినపుడు మనంబాపగలరా? విశ్వామిత్రుండంతటివాడు తపముచెడి స్త్రీలోలు డయ్యెను. వీనిధైర్యము కొనియాడదగినదే. ఇక నే నూరకొనిన నతడు మాటాడడు. సిగ్గుపడిన లాభములేదు. పురుషుల పంతము చెల్లును గాని స్త్రీలపంతము లెప్పుడైనను చెల్లునా? నేనే పల్కరించెదఁగాక యని దాపునకు బోయి నిద్రాభంగము సేయవెరచి రేపుతప్పక నితడు నిద్రింపకపూర్వమే పల్కరించెద నీరేయి నెట్టకే గడపెదనని నిశ్చయించి నాయలంకారమంతయు మంచము పాలు చేసి యారాత్రి వెళ్ళించితిని.

మూడవనాటి యుదయమున నతండు విడిదికి బోయిన వెనుక నా ప్రాణసఖులందరు తత్తరముతో నన్ను జుట్టుకొని పూవుదండల బరీక్షించి యెప్పటియట్ల నుండుటకు ముక్కు మీద వేళ్ళు వైచుచు నొకరిమొగ మొకరు చూచుకొనదొడంగిరి.

అప్పుడు నా ప్రాణసఖులలో ప్రౌఢురాలు చిత్రావతి అనునది నాకిట్లనియె చెలీ! నీమేనుజూడ నేపోడిమియుం గనంబడకున్నది. ఇట్టిదంపతుల నెందునుం జూడలేదు. నీవు నపరసరసికురాలవు. సకలకళాప్రవీణురాలవు. చిన్నదానవు కావుకదా? నీకు దెలిసిన సంగతులు పండితులైనను దెలిసికొనజాలరు. ఇట్టి నీవే లజ్జావతివై యూరకుండినచో మేమేమి చెప్పగలము. మగవాడు సిగ్గుగలవాడైనప్పుడు మగువయు లజ్జావతియైన నెట్లు పొసంగను! నీకు మేము బుద్ధులు సెప్పువారమా? ఇది నీ లోపమా? యతని లోపమా! తెలుపుమని పెక్కుగతుల బుజ్జగించి అడగిరి. నేనేమియు నుత్తరము చెప్పక వేరొకరీతి మాటలచే దాటవైచితిని.

అంత మూడవనాటి సాయంతనమున సఖులు నన్ను జక్కగా నలంకరింపుచు పుత్రీ! నీవీరాత్రి పూర్వమువలెనే గడిపితివేని మేము మీయమ్మకు జెప్పక మానము. అయినను నీవు పూర్వమువలె మాతో మనసిచ్చి మాట్లాడకుంటివి. చక్కని మగడు దొరకెనని గర్వమువచ్చినది. నీవిట్టిదానవగుదువని యెన్నడు ననుకొనలేదు. కానిమ్ము రేపుగూడ బరీక్షించి తర్వాత నాలోచించెదములే యని పల్కి యారాత్రి గదిలోనికినంపి కవాటము తటాలునమూసిరి. నేను పూర్వమువలె తలుపుదరి నిలబడక వెంటనే యతని మంచము చెంతకు బోయితిని. అంతలో అతడు దుప్పటము సవరించుకొనుచుండెను. నేను బోయి వాని బట్టపట్టుకొని సిగ్గున మాటాడలేక దాపున నిలువంబడితిని.

దానికతండు భయపడుచు లేచి కూర్చుండెను. నేనును మెల్లన గాళ్ళకడ గూర్చుండి పాదము లొత్తబోయిన ముడిచికొనియెను. పిమ్మట నేను గంధము మేనికి నలందబోయిన దుడిచికొనియెను. అప్పుడు నేను ఓహో! మోసమువచ్చినది. మొదటి దినంబున బల్కరించితిని కానని యీతండు కోపమువహించెను. తెలిసికొంటిని. తలంచికొన నాదేతప్పు. మగవారితో సమముగా నాడువాండ్రు పంతము పట్టవచ్చునా? అని పశ్చాత్తాపము జెందుచు నతని మనంబునంగల కోపముదీర్ప నుపాయంబెద్దియో అని యూహింపుచు గొంతసేపు పూసురటిం బుచ్చుకొని వీచితిని మఱికొంత సేపు వీణెం బూని పాడితిని కొంతసేపు శాస్త్రచర్చలధ్వని విశేషముల వెలయించితిని. దేనిచేత నైనను వాని మనస్సు రంజించినట్లు కనబడలేదు.

పిమ్మట బసిడిపళ్ళెరము లోని భక్ష్యములెత్తి చేతికందిచ్చిన నవి అందుకొని తినదొడగెను. దాన గోపముదీరెనని సంతోషముజెందుచు వలదనుదాక నందిచ్చితిని. తృప్తుడైన వెనుక మాట్లాడినం జాలునని పాలొకచేతను నీరొకచేతను బూని పాలు కావలయునా? నీరు కావలయునా! అని అడుగగా బాలున్న చేతిదెస గన్నులు ద్రిప్పుచు సైగజేసెను దానం బక్కున నవ్వుకొనుచు బాలు దాహమిచ్చి వెనుక కప్పురతాంబూలము మడుపుల నోటికందియ్య నందుకొనక చేతితో బుచ్చుకొని నోటిలో ద్రోసికొనియెను.

అదిచూచినంత నాస్వాంతమున గొంతవింత యంకురించినది. కానిమ్ము విచారించెదగాక అని మంచముమీద గూరుచుండ బోయిన నతండు భయపడువానివలె నొకప్రక్కకు నొదిగెను అంత నేను తెగువంబూని ప్రాణేశ్వరా! పెక్కు దినంబుల నుండి మిమ్మువరించి పెద్దయాసతో దరికిరా బల్కరింపక నలుకమై ముసుంగు బిగించి యుండుట న్యాయమేనా? ఒకవేళ నాయందు తప్పున్నను సైపవ యునుగాని బింకము వహించి యుండదగునా? మీరు కోపము బూనిన నేనేమి సేయుదాన నెవ్వరితో జెప్పుకొందును. మన్మథబాణపీడితనై మిమ్ము శరణము వేడెద రక్షింపుడు రక్షింపుడని పాదములంబడిన నా బుద్ధిమంతుడు నాచేతులం బట్టికొనుచు నిట్లనియె.

ఏమమ్మా ! కోపమువచ్చినదా కోపము సేయకుమని పలుమారు తర్కింపుచు నాపాదములం బడుచున్నావు నాకోపపు పను లేమికనుంగొని యిట్లంటివి. నీవుపెట్టిన యప్పములం దింటిని తాంబూలము నమిలితిని పాలు త్రాగితిని యింకేమి సేయవలయును. నీవు గొప్పదానవు నాకాళ్ళుముట్టిన వలదనుట తప్పా! పెండ్లి చేసెదమని తీసికొనివచ్చిన వచ్చితిని కాని నీవిట్లు నిందింతువని తెలిసిన మొదటనే రాకపోవుదును. ఇప్పుడైనను పొమ్మనిన బోవుదునని యతిమూర్ఖముగా బలుకుచున్న వానిమాటలాలించిన నాకు కొంతసేపేమియు దెలిసినదికాదు.

ఇది స్వప్నమా? నిక్కువమా ఇంద్రజాలమా? విభ్రమమా? యని కొంతసేపు మ్రానువలె నట్లే నిలువంబడి క్రమంబున ధైర్యము గరపుకొని హృదయమా తొందరపడకుము. ప్రారబ్ధ మీరీతినుండ మరియొకలాగెట్లగును. నేఁటితో వీని తెలివియంతయుఁ దేటపడినది. ఈతడు ప్రపంచపుధోరణి యేమియు నెఱుంగడు. దాననే వీని గురువు కింశుకశాస్త్రియని పేరుపెట్టెను. అది గ్రహింపలేక లేనిపోని యర్థములు చేసి గోతిలో బడితిని. నా చెలికత్తె మొదటనే చెప్పినది. దానిమాట యింత యైనను విమర్శించనైతిని. “బుద్ధిః కర్మానుసారణి" అను వచనం బేమిటికిఁ దప్పును. కాకున్న మాతండ్రియైనను బరీక్షింపరాదా! యెరకై భ్రమపడి బడిశమునం దగులుకొనిన మత్స్యములాగున వీని యందమును జూచి మోససోయితిని. వీఁడించుకయైనను లోక ధర్మములను గురుతెరుంగఁడు. కటకటా! కేదారేశ్వరస్వామీ! పెక్కుదినంబులనుండి నిన్నాశ్రయించుదానికి మంచి యుపకారమే చేసితివి. అయ్యో విశాలాక్షీ! నీవరంబునం బుట్టిన నాకిట్టి వెఱ్ఱిమగనిం గట్టిపెట్టితివా? అన్నన్నా! విశ్వనాథా! నీ ప్రేయసి కిష్టురాలనని నీవైనను గొంచము దయయుంచవైతివి. నాకింతవిద్యయు రూపమేటికిఁ గలుగ వలయును. స్త్రీల సౌందర్యము బతిసౌష్టవమే ఫలముగాఁగలదిగదా? ఇంక నా తెలివి తేటల నెవ్వరిముందర వినియోగపరచుదాన. నెవ్వరు సంతోషించిన నేమిలాభము. సంతోషింపఁదగిన వాఁడిట్టివాడైయుండ నేనెట్లు నలుగురులోఁ దలయెత్తుకొని తిరుగుదును. ఈరెండునాళ్ళకే నాసఖులు నన్నుఁ బెక్కుగతుల నిందింపుచున్నారు. వారితో నేమని చెప్పుదును. ఏమిచేయుదును. అని పరిపరిగతులఁ దలపోయుచు నాకునేన యుపశాంతింపరచుకొని కన్నుల నేకధారగా నీరుగారుచుండ నాశవదలక మరలనతనితో నిట్లంటిని.

బాహ్మణుడా! నీతో పరిహాసమున కట్లంటినికాని నీవేమియుఁ గోపము సేయలేదు. నీవెవ్వనికుమారుఁ డవు. నీ దేశమెద్ది! నీ పేరేమి? ఈ గ్రామ మేమిటికి వచ్చితివి? ఇంతకుపూర్వ మేమిచదువుకొంటివి? ఇప్పుడేమి చదువుకొనుచున్నావో యదార్థముగా జెప్పగలవా? అని అడిగిన నతండిట్లనియె. అమ్మా ! అవి యేమియు నాకు దెలియవు. మాగురువుగారు కింశుకశాస్త్రి యని పిలుచుట మాత్ర మెఱుంగుదును. రామశబ్దము చదువుచున్నాను. అది మొదలుపెట్టి యారుమాసములయినది యింకను రాలేదు. ఏదినమున కాదినమే మరచిపోవుచుందునని యుత్తరము సెప్పిన మనస్సు రాయిచేసుకొని నేను వానితో నిట్లంటిని. బ్రాహ్మణుడా! నీవు నన్ను అమ్మ అని పిలువరాదు. నీకు నేను భార్యను. భార్యయన నెట్టిదో యెఱుంగుదువాయన నెఱుంగనని తలద్రిప్పెను. అప్పుడు నేను గుండెలుబాదుకొనుచు భళిరే, దైవమా! నన్నెంత బాగు సేసితివి? నావిలాసములన్నియు నడవిగాసిన వెన్నెలం జేసితివిగదా? నాపూర్వకర్మ మంత యుగ్రమైనదా అని తలయూచుచు దరంగముల తెరంగున మనంబునం బొడము శోకపరంపరల నణగద్రోయుచు మరల వానితో బాహ్మణుడా! భార్య యనగా నెప్పుడును విడువదగనిది. కావున నీ వెన్నడును నన్నువిడిచి యుండకుము. మరియు నీవు కొన్ని పనుల చేయవలసి యున్నవి. నేను జెప్పినట్లు నడిచెదవా అని అడిగిన దాని కొడంబడినట్లు తలద్రిప్పెను.

పిమ్మట నేను బూవులన్నియు నలుపుకొని మేననెల్ల నఖదంత చిహ్నముల జొదమజేసి పురుషక్రియలన్నియు మేనగనబడ మనంబునం బెక్కుతెరంగుల జింతించుచు స్వయంకృతాపరాధమునకు వగచుచు నీగుట్టు బయలైనచో పదుగురు నవ్వుటయేకాని లాభమేమియు లేదనుచు నైదువతనంబు బాగున్నం జాలునని విరక్తి బూనుచు నొకమంచముమీద బరుండి ధ్యానించుచు నిదురించుచున్నంత నీవు శోకింపవలదు నీకు ముందు మేలయ్యెడినని యొకముత్తైదువ వచ్చి చెప్పినట్లు కల వచ్చినది.

ఆహాహా! ఇట్టివాడు నాకు మగడయ్యుండ నింక రాబోవుమే లెద్దియో? పతిసౌష్టవముగాక సతులకొం డెద్ది సంతోషము నిచ్చును? నన్నుజూచి దైవజ్ఞులు నీవు మిగుల నదృష్టవంతురాలవై మంచి వాల్లభ్యముగలదాన వగుదువని చెప్పువారు. ఈ కలయు వారిమాటలవంటిదే యగునని విరక్తిబూని యుదయంబున లేచి నావెఱ్ఱిమగడు విడిదికి బోయిన వెనుక నా చెలికత్తెల గలిసికొంటిని.

అంతవారు నాయవయవముల బరిశీలింపుచు సఖీ! ఈ రెండు దినములు నీ బతి చమత్కృతి యంతయు దాచితివిగాని యీనాడు దాచలేకపోయితివేమి? నీగుట్టంతయు తెలిసినదిలే. పాప మీ గోరుగీటు లింతమోటుగా నున్న వేమిటి? నీమగనివిన్నాణ మివియే చెప్పుచున్నవి. కొంచెము గంధమలందుదుమా? వాతెర యీ తెరగున నున్న దేమి? రక్తము స్రవించుచున్నది. మేలు మేలు రతిపారవశ్యమంత వింత గాబోలు అన్నన్నా! నీకన్నులు శోకనదశోభ వహించియున్నవి. యించుకయైన నిదురలేదా యేమియని పెక్కుతెరంగుల నన్ను బరిహాసవచనంబుల వేపుచున్నంత వారి మాట లన్నియు నాహృదయశోకాగ్ని కింధనములైనను మరుగుపరుచుచు లేనినవ్వు తెచ్చుకొని యప్పటికి దగిన యుత్తరములు చెప్పి వారినిగూడ సంతసపరచితిని.

అది మొదలా కింశుకశాస్త్రిని బైటికి రానీయక సంతతము నంతఃపురమందె యుంచుకుని యాగుట్టు బైటపడకుండ వానికి నిత్యము లోకవ్యవహారధర్మములు నేరపుచుంటిని. కాని వాని కేదినమున కాదినమే క్రొత్తగా నుండునది ఈరీతి గొన్నిదినము లఱిగినంత మా దురదృష్టవశమున నాతండ్రి హేమాంగదుడు పరలోకగతు డయ్యెను. మాతల్లియు నతనితో నగ్ని జొచ్చినది. పిమ్మట మంత్రులు నామగనికి బట్టాభిషేకము సేసిరి. నిత్యము నేనెంతో బోధజేసినను వాని తెలివితేటలు మంత్రులకే కాక ప్రజలకుగూడ స్వల్పకాలములోనే వెల్లడియైనవి.

అప్పుడు మంత్రు లీతడు రాజుగా నుండుటకు దగడనియు వీని బుద్ధిబలము ప్రజల యోగక్షేమములకు సమర్ధము కాదనియు వీనియసామర్థ్యము విని శత్రురాజులు సంఘముగా గూడుకొని రానున్నట్లు చారులవలన దెలియవచ్చినదనియు దీనికి నీవేమి యుత్తరమిత్తువో చెప్పుమని నాకొక పత్రిక నంపిరి. దానిం జదువుకొని యేమి చేయవలయునో తెలియక యాలోచించుచు బ్రత్యుత్తరము పంపుటకు రెండు మూడు దినములు జాగుచేసితిని. ఇంతలో మరల జాబు వచ్చినది. దాని విప్పి చదువుకొనిన నిట్లున్నది, మేము మీకు మూడుదినముల క్రిందట నొక పత్రిక నంపితిమి. దాని కుత్తరము వ్రాసితిరికారు. ఇప్పుడు పెక్కండ్రు రాజకుమరు లొక్కటియై చతురంగబలముతో మన పట్టణము ముట్టడించిరి. వారితో బోర మనకు దగినసేనలు లేవు. ఈ రాత్రి కోట వశపరచుకొందురని ధ్వని పుట్టినది. కావున నిక నెవరిమానము వారు దక్కించుకొనదగినదేగాని వేరుసాధనములేదు! తర్వాత మీచిత్తము అని వచ్చిన రాజుల సంఖ్యయు, నామములు వ్రాసియున్న యాచీటిం బలుమారు శోధించి యోహో ! ఈ వచ్చిన రాజపుత్రులందరు పూర్వము నన్ను వరించినవారే. తమ్ము వరించితినికానని యీర్ష్య మనంబునంబెట్టికొని యిప్పుడు సమయము కనిపెట్టి యూరు ముట్టడించిరి. ఇక మేమిచ్చట నిలిచినచో మమ్ము జెరపట్టక మానరు. కష్టపరంపర లిట్లొండొండు పయింబడుచుండ నొండుదలంపవలసినది యేమున్నది. కానిమ్ము కర్మసూత్రమెట్లుండు నట్లుకాక మానదుగదా ? జీవమున్నంతవరకు జికిత్స చేయవలయును. శాస్త్రరీతి నిప్పుడీకోట నుండి మేము తప్పించుకొనిపోవు నుపాయ మాలోచింప వలసియున్నది. ఇట్టి యాపదలు వచ్చినప్పుడు కోటదాటిపోవ బ్రచ్ఛన్న మార్గంబులు గోటగట్టునపుడుంచు నాచారము గలదు. దీనికి నెందేని దారియుండక మానదని యూహింపుచు కోటలో నలుమూలలు వెదకింపదొడంగితిని. కాని యాకోటనంతయు బరిశీలింపుటకు బెక్కండ్రకు నారుమాసములు పట్టును. అప్పుడు మరల నాలోచించి రహస్యపుస్తములు వెదకింప నొకదానిపై గోటలోని రహస్యముల గ్రంథమని వ్రాసి యున్నది. దానిం బుచ్చుకొని పరిశీలింప శత్రువులు కోట ముట్టడించినప్పుడు వారు లోనికి జొరకుండ జేయ గోటచుట్టును నమర్చియున్న యంత్రముల విషయమై పెక్కు వ్రాయబడి యున్నది. అది యంతయు బశీలింపగ చివరకు పోవబోవ బారిపోవు దారి సంగతి వ్రాయబడియున్నది. దానిని వ్రాసినవారిని బెక్కుగతుల నుతింపుచు దాని రీతినంతయు నిదానముగా విమర్శించి యెవ్వరికిని దెలియకుఁడ రాత్రివేళ నా మగని మాత్రము వెంటబెట్టుకొని ఈ గుఱ్ఱమునకు జీను గట్టించి విలువగల రత్నములు గొన్నిటి మూట గట్టుకొని యాగూఢద్వారము దాపునకు బోయితిని. ఆ గుమ్మముచెంత నమర్చిన యంత్రముల చిత్రమునకు వెరగుపడుచు దాని తలుపు తెరచువిధము పుస్తకము చూచి తెలిసికొంటిని. వేరొకవిధమున బ్రహ్మకు దెలియదు. ఆహా! పనినమర్చినవా డెంతనేర్పరియోగదా? తలుపు తెరచినంత గుహలాగున విశాలముగా నొకబిలము గనంబడినది. మే మీగుర్రముతో నా గుహలో ప్రవేశించి యాపుస్తకములో చెప్పిన చొప్పున మరల నాతలుపు మూసితిని ఆ పుస్తకమును విడువక యాదారింబడి నడువజొచ్చితిమి. అందు నడుమ నడుమ గొప్పమాణిక్యముల నమర్చి యుండుటచే నింతైన జీకటిలేక పట్టపవలు లాగున నున్నది. రాజవీధివలె నొప్పుచున్న యాబిలములో నీగుర్రము నెక్కి నామగని వెనక నెక్కించుకొని కళ్లెము పట్టుకొని కొంతసేపు మెల్లగా గుర్రమును నడిపించితిని.

నామగనికిఁ దురగమెక్కు పాటవము లేదు. కావున నే మాత్రము గుఱ్ఱమును వడిగా నడిపించినను నా నడుము బిగ్గరగాఁ బట్టుకొని మొర్రోయని యరచువాఁడు. వెరవకుము. నా నడుము గట్టిగాఁ బట్టుకొనుము నీకేమియు భయములేదు. కొంచెము వేగముగా నడిపించినంగాని యీ బిలము దాటి పోలేమని నేనెంత చెప్పినను నతని భయము పోయినదికాదు. అతఁడట్లెంత యరచినను నడుమ నడుమ వడిగా నడిపించుచు మరల మెల్లగా దోలుచు ఈరీతినిఁ బెద్దతడవు పోయితిమి. అందు దినరాత్రివిభేదము తెలియదు. కావున నెంతకాలము నడచితిమో యెఱుఁగము. ఆకలి యైనప్పుడు నేనుఁదెచ్చిన పచ్చిపిండి పంచదారతోఁ గలిపికొని తినువారము. అట్లు నడుమ నడుమ నిన్నటి సాయంకాలమునకు నియ్యడవిలోనున్న యొక పర్వత శిఖరమునకు వచ్చితిమి. ఆ బిల మాకొండశిఖరమున కమరించినట్లా పుస్తకములోనే యున్నది అచ్చటనొక విచిత్రమైన కవాటము గలదు. అది యడ్డము వచ్చినతోడనే యాపుస్తకమును జూచి యది తలుపుగా గ్రహించి తదుక్తపద్ధతిని నా తలుపు తెరచుకొని కొండమీదికి వచ్చితిమి.

అప్పర్వతశిఖరము మీదనుండి చూచినఁ బరమేశ్వరుండైన నాద్వారరహస్యము తెలిసికొనజాలఁడు. అప్పుడు నే నాపుస్తకమునే జీవనౌషధముగాఁ దలంచి దానిఁ గన్నుల నద్దుకొని యాగుమ్మము దాపున నొకచోట రహస్యముగాఁ బెట్టితిని. మరియు నాబిలవిశేషముల పరిమాణములు పెక్కులాపుస్తకములో వ్రాయబడి యున్నవి. కాని యాపత్సముద్రమున మునింగియున్న నాకు వానిఁ బరామర్శింప నిష్టము లేకపోయినది. పిమ్మట నేనొకచేత గుర్రపుకళ్లెము రెండవచేత నామగనిం బట్టుకొని మెల్లన నాకొండశిఖరమునుండి భూమికి దిగి యందున్న మార్గమునంబడి నడువజొచ్చితిమి. కొండ దిగువరకు జీకటిపడినది. అందు నిలిచినచో గ్రూరమృగములు బాధించునేమోయని గుఱ్ఱమును దిగుకయే రాత్రియంతయు నడిచితిమి. ఇట్లు నడచుచు నించుక రాత్రిశేషమున్న సమయంబున శత్రువులచేత జిక్కక బైట బడితిమిగదా? ఇది యాపదలో మేలని తలంచుచు గమ్యస్థాన మరయుచున్నంతలో బ్రాంతమున నొకమూల భయంకరముగా క్రూరసత్వధ్వని యొకటి వినబడినది. దానికి వెరచి యదరిపడి యీ గుఱ్ఱము నేనెంత కళ్ళెము బిగియబట్టినను లక్ష్యముసేయక యెగిరి యెగిరి యతివేగముగా బరువెత్త జొచ్చినది.

ఇక చెప్పునది యేమున్నది! మొదటిగంతులోనే గుఱ్ఱముపై నిలువలేక యరచుచు నా పెనిమిటి తటాలున దలక్రిందుగా నేలబడియెను. కన్నులార జూచియు గుఱ్ఱము నాపలేక యింతదూరము దాటి వచ్చితిని. వాయువేగముగా బరువిడి వచ్చిన యీ గుఱ్ఱము యిచ్చటికి వచ్చియాగినది. అతడు పడినతావు మిగుల దూరముగా నుండవచ్చును. అప్పుణ్యాత్ముం డీపాటికి నాకలోకసుఖం బనుభవింపుచుండును. పాప మాయన నే నేమి చెప్పినను దానింజేయువాడుగాని నామాట నించుక యతిక్రమింప లేదు. దైవమువంటి పెనిమిటిం జంపిన పాపాత్మురాలను, గ్రుక్కెడు ప్రాణమునకై యాసపడినప్పుడు గదా యిన్ని చిక్కులంబడ వలసి వచ్చినది. ఇంక నీజన్మమునకు నాకు సుఖము గలుగదని తలంచి ప్రాణము పోగొట్టుకొన నురి కంఠమునకు దగిలించికొంటిని ఇంతలో మీ దూతలువచ్చి నన్నాటంకపరచిరి. పిమ్మట మీరు వచ్చితిరి గదా? ఇదియ నా వృత్తాంతము నన్ను జావనిండు మీ పాదములకు మ్రొక్కెదనని యేడ్చుచు నాచిన్నది మిక్కిలి బ్రతిమాలుకొన్నది.

అట్లు విశాలాక్షి వృత్తాంతమువిని యింద్రద్యుమ్నుండు పెక్కుగతుల బొక్కుచు నయ్యో! తల్లీ! నీవా! నీతండ్రి నాకు బినతల్లి కుమారుడు. అతండు మృతుండైన వార్త నేను వినలేదు. కటకటా! నీవు తగని యిడుములం గుడిచితివి. చింతింపకుము. నీమగడు సురక్షితముగా నున్నట్లు నీ మొగమే చెప్పుచున్నది. అది యిసుకనేల యగుటచే గ్రిందబడినను దెబ్బ తగులదు. నీపెనిమిటిని శీఘ్రమ వెదకి తెప్పించి నీతో గూర్చెద. నావెంట రమ్ము పోద మాశిబిరంబున మీ పినతల్లియున్నది.

అని బల్కి యోదార్చుచున్న సమయంబున దన శిబిరము వైపున హల్లకల్లోలముగా, గోలాహలధ్వని వినంబడినది. అదేమియోయని దృష్టి నాదెసకు జొనిపి విమర్శింపుచుండ గొందరు రాజభటులు పరుగున వచ్చుచున్నట్లు గనబడినది. వారిరాకకు వెరచుచు నారాజు కొంచె మెదురు నడిచి యింత తొందరగా వచ్చుచున్నా రేమి యని యడుగుచుండగనే యొగర్చుచు స్వామీ ! యా సింహము వచ్చి మనసేనలనెల్ల చెల్లాచెదరు చేసినది. ఏనుగులు గొలుసులు ద్రెంచుకొని గుర్రములను, గాల్బలములను నుగ్గునుగ్గుగా ద్రొక్కుచు బారిపోవుచున్నవి. సింహము సేనానివేశము చుట్టు కొరవి త్రిప్పినట్లు తిరిగివచ్చి ముందు గజముల భుజింపుచున్నది.

దేవిగారి కేమిమోసము వచ్చునోయని వాహినీపతు లందరు భయపడుచున్నారు. దేవరవారు త్వరగా విచ్చేయవలయునని పలికిన నులికిపడుచు గడువడిగా గుర్రమునెక్కి యచ్చటికి బోవుచుండ మరి కొందరడ్డమువచ్చి దేవా! యాసింహ మిప్పుడే యీ వైపుగా బోయినది. అది యొక చోట నిలిచియుండదని చెప్పిన నాదెసకు గుర్రమును దోలెను. సాయంకాలము వరకు నయ్యడవి యంతయు దిరిగినను సింగము గనబడలేదు. అంత మరునాడుగూడ వెదకుచు బోయినను దృష్టిగోచరము గాలేదు. ఈ రీతి బదిదినములు దారి తెలియక చూచిన పొదలే చూచుచు జొచ్చిన కోనలే చొచ్చుచు దిరుగుచుండగానొకకోయపల్లె గనబడినది.

ఆ పల్లెలోనికి బోయి వాండ్ర నందరింజీరి యోరీ! యీ యడవిలో దిరుగుచున్న సింహ మీపెడకు రాలేదుకద! దానిజాడ మీకేమైనం దెలిసినదా! యని యడిగిన నవ్వుచు వాండ్రిట్లనిరి. సామీ! మీకు దెలియదుకాబోలు! సింగము సచ్చి పది దినములైనది. దాని మాంసము మేమే తింటిమి. పదిదినములనుండి నిర్భయముగా నిదురించుచుంటిమని చెప్పగా నతం డాశ్చర్యము జెందుచు నేమేమీ! సింహము చచ్చిపోయినదా! దాని జంపిన బలశాలి ఎవ్వడు? మా యోధుడా లేక మరియొకడా? తెలిసినచో జెప్పుడని యడిగిన వాండ్రిట్లనిరి.

అయ్యా ! అతండు మీయోధుడో మరియొకడో మాకు దెలియదు. పదిదినములక్రిందట యుదయమున మాయూరివారు కొందరు పొలమునకు బోవుచుండగా నొక పుంతదారిలో నొకడు పడియుండెనట. వానికి మొలలో కత్తియున్నది. మంచిదుస్తులు ధరించియున్నవాడు. నీవెవ్వడవని యడిగిన స్మృతిలేనందున గన్నులు మాత్రము దెరచెనుగాని మాట్లాడలేదు. పిమ్మట వాండ్రు వానిని దప్పికొని యున్నవానిగా నిశ్చయించి వెదురుగొట్టములోనున్న నీటిచే నతని స్నానము చేయించిరట. దాన దెప్పిరిలి యతడు లేచి కూర్చుండి వానితో నెద్దియో మాట్లాడబోవు సమయమున సింగము సింగమని యరచుచు నీ పల్లెలోనివారెల్ల నామీదుగా బారిపోవ దొడంగిరి.

అప్పు డమ్మహాపురుషుండు తనకట్టిబల మెచ్చటినుండి వచ్చినదో వెరవకు డని పలుకుచు లేచి వరనుండి కత్తిదీసి యాసింహమున కెదురుపోయెను. అదియు గాండ్రుమని మీదికురికిన బెడిదంపుటడిదము వ్రేటున దానిం బరిమార్చెను. పిమ్మట మేమందరము ముక్కలుముక్కలుగా నరికి మాకసిదీరునట్లుగా నేటివరకు దాని మాంసమే తినుచుంటిమి. ఆవీరుడంతట నెద్దియో ధ్యానించుచు గన్నీరు నించుచు మే మెంత స్తుతియించుచున్నను సంతసింపక తనతోవనుబట్టిపోయెను. అని చెప్పగా విని యారాజు వెరగుపడి యోహో! ఆతఁడు విశాలాక్షి మగడు గాడుగద. వాని కంతబల మెచ్చటినుండి వచ్చినది? మొదట చిహ్నములన్నియు వానివిలాగేయున్నవి. ఇట్టి వాడైనచో విశాలాక్షికి జింతయేలగలుగును? పాప మయ్యయో! విశాలాక్షి మాట మరచిపోతినే? సింహవార్తలచే దటాలున జనుదెంచితినని ఆమె పిమ్మటనేమయ్యెనో! వేగబోయి యరయవలయునని నిశ్చయించి యాగుర్రమెక్కి వడిగా నామార్గమునం బట్టి పోయెను.

అతండెంతవడిగా బోయినను నాలుగు దినములకుగాని యచ్చటికే జేరలేక పోయెను. అందు ముందు సేనానివేశస్థానమే కనంబడినది. శిబిరమంతయు దునకలై పడియున్నవి. ఏనుగులు గుర్రములు కాల్బలము నుగ్గయియున్నవి. భటులెవ్వరును లేరు అప్పుడారాజు భార్యందలచుకొని అయ్యో? నిన్ను నిష్కారణ మీ యడవిపాలు సేసితినే. నీ విషయమంతయు బరామర్శింపనైతిని అక్కటా! అక్కల ఫలంబిది కాబోలునని పరిపరిగతుల శోకించుచు దద్విధంబరయ కొంచెము దూరముపోయెను. అప్పుడొక చెట్టుమీదనుండి యొకడు స్వామీ! యని కేకలుపెట్టెను. ఆ కేకలు విని యింద్రద్యుమ్నుడు తల పైకెత్తగా నందు మనుష్యుడున్నట్లు కనబడిన నిలువంబడి నీవెవ్వడవు? చెట్టుపైన నేటికుంటివని యడుగగా వాడు మెల్లన చెట్టుదిగివచ్చి మ్రొక్కుచు నిట్లనియె.

దేవా! నేను దేవరపరిచారకుడ సింహభీతిచే జెట్టెక్కితిని. మీ రెచ్చటనుండి వచ్చితిరి? సింహమేమైనది తెలుపుడని యడిగిన నారాజిట్లనియె ఓరీ! సింహము చచ్చి పదిదినములైనది. నీవెఱుగక యింకను జెట్టుపైనేయుంటివి మరియు మన సైన్య మంతయు నేమైనది? నా పట్టమహిషి కుశలముగా నున్నదా! ముందు జెప్పుమని యడిగిన వాడిట్లనియె. స్వామీ! మాయమ్మగారి కేమియు గష్టములేదు. సింహము విజృంభించినతోడనే చుట్టును బలములాయుధపాణులై తోడరా బల్లకీనెక్కి పట్టణమునకు వెళ్ళినది. వాహినీపతియు సహాయార్థమై యామె వెంటనే పోయెను. ఆమెను సురక్షితముగా నీపాటి కింటికి జేర్చును. దేవరవారికి వర్తమానము జెప్పుటకు దండనాయకుడు నన్నిందుంచెను. నేనును దేవరరాకకై వేచుచు సింహభయమున నీ చెట్టుపైన నిలిచితిని. ప్రాణమన్న నందరకు భయమెగదా? మిమ్ముంబొడగంటి. నాకు మరల ప్రాణములువచ్చినవి. ఇంతవరకు నాసింహమెప్పుడు వచ్చునోయని యొంటిప్రాణముతో నుంటిని. అమ్మగారి రక్షణము మిష పెట్టుకొని యీ భయముచేతనే యందరు నింటికి బోయిరి. ఇదివరకెన్నడును నిట్టి భయంకరమైన మృగమును చూచియుండలేదు. దానిని దేవరగాబట్టి చంపిరి. మరియొకరు చంపలేరని స్తుతిజేయ మొదలు పెట్టెను.

అప్పు డారాజు భార్య సురక్షితముగా నున్నందులకు సంతోషించుచు సింహము చచ్చినరీతి వానికిజెప్పి యొకచీటివ్రాసి తన కుమారుడు విజయున కిమ్మని చెప్పి వాని నంపెను. పిమ్మట నమ్మనుజనాయకుడు విశాలాక్షి క్షేమమరయుటకై వెదకికొనుచు మునుపుచూచిన తావునకరిగెగాని యందామెజాడ యేమియులేదు. గుర్రమును గనబడ లేదు. గుర్రపుటడుగులు మాత్ర మెచ్చటికో పోయినట్లు చెప్పుచున్నవి. అపథచిహ్నములబట్టి కొంతదూర మయ్యడివిలో వెదకజొచ్చెను "విశాలాక్షి" యని పెద్దయెలుంగునం బిలువజొచ్చెను. ఎందును విశాలాక్షి యున్నట్లు కనంబడలేదు. పిమ్మట నతం డాప్రాంతమందున్న కోయపల్లెలకుబోవుచు నాపూబోడివృత్తాంత మడుగుచుండెనుకాని యెవ్వరును నేజాడయు జెప్పలేదు.

మిక్కిలి పొడవగు నక్కానలో నమ్మానవతిని వెదకుచుండ నారుమాసములు గతించినవి. అప్పు డతండు విసిగి యా చిన్నది చెప్పిన కొండకు గురుతుగా బోయెను. అప్పర్వతశిఖరమెక్కి యక్కలికి చెప్పిన చిహ్నంబులన్నియు నరయుచు నెట్టకేలకు నాపుస్తకమును గనిపెట్టెను. అది యందుకొని యందులోని విశేషములన్నియు జదివి యౌరా! విశ్వకర్మసృష్టికాని యది మానవసృష్టి కాదు. ఇట్టికోటలు గలిగినచో శత్రువులేమి చేయగలరు ధైర్యమాపలేక విశాలాక్షి పారిపోయినది గాని దానిలో జెప్పినట్లుందుండి నడిపించినచో బ్రపంచమంతయు నేకమైవచ్చినను నేమియు జేయలేదు. అన్నన్నా! ఇట్టికోటను గూడ శత్రువులుబట్టుకొనిరే. దైవగతి యసాధ్యమైనదిగదా? అని పెక్కువిధముల దర్కింపుచు నాపుస్తకమునం దున్నరీతి నాతలుపు తెరచి యాబిలమునుజూచి వాని విశేషములకు వెరగందుచు గొంతదూరము పోయెను.

ఇప్పుడు నేను బోయినను లాభ మేమియులేదు. విశాలాక్షి యీద్వారమున గోటలోనికి బోవన ట్లాపుస్తకమే చెప్పుచున్నది. అట్లేగివున్న నీపుస్తక మిందుంచదు. అచ్పేడియ బైటనెక్కడనో యున్నది కావున నేనిప్పటికి మరలి యత్తలిరుబోడింగలిసికొని పిమ్మట నీ బిలమార్గంబున బోయి పగరం బరిమార్చెదనని నిశ్చయించి యందుండి మరలబైటికివచ్చి యాతలుపుమూసి యాపుస్తకమును బుచ్చుకొని కొండదిగెను.

తురగమెక్కు పాటవముగల యప్పాటలగంధి యింతదనుక నియ్యటవిలో నేమిటికై యుండును. ఈపాటి కెవ్వీటికైనం జేరకమానదు. కావున నిక నీకానలో నరయుటమాని పురంబులకుబోయి వెదకెదను. విశాలాక్షి మగడైనను విపినమం దేటికి యుండును. తెలియక నిన్నా ళ్ళూరక యలసితిని. వారిరువురం గూర్చి కాని యింటికి బోనని మొదటనే శపథము చేసితినిగదా? వారు బ్రతికియుండినచో నెప్పటికైనను గూర్పక మానను. వారు సజీవులై యున్నందులకు మదీయమానసంబే తార్కాణము. అని తలంచుచు నయ్యరణ్యమార్గము విడిచి గ్రామములమీదుగా నడువజొచ్చెను. ప్రతి గ్రామమునకు దప్పక పోయి వారిజాడ నరయుచుండ మరియు నారుమాసములైనది. అదివరకెన్నడును గనివిని యెఱుగని యొకవిదేశమార్గంబునం బడి పోవుచుండ నాదారి యొకనాటి సాయంకాలమున కొకపట్టణము దాపునకు దీసికొనిపోయినది. అం దొకపురుషుం డెదురుపడిన వాని కింద్రద్యుమ్నుం డిట్లనియె.

మళయాళ దేశము కథ

ఆర్యా! ఈ దేశముపేరేమి? ఈ పట్టణ మెవ్వరిది? ఇచ్చటి రాజధర్మము లెట్టివి? ప్రజ లెటువంటివారు? ఇచ్చటినుండి మార్గ మెచ్చటికిగలదు విశేషములేమైనం గలిగిన వక్కాణింపుమని యడిగిన నా బాటసారి యిట్లనియె. అయ్యా! ఇది మళయాళదేశము. దీనిని సంవత్సరమునుండి చండవర్మ యల్లుడు సింహకేతుండను రాజు పాలింపుచున్నవాడు ఇందలి ప్రజలు శక్తి నారాధింపుచు విదేశస్థులు వచ్చిరేని వారిని దాచి నవరాత్రిదినములలో బలియిచ్చుచుందురు. స్త్రీలపెత్తన మధికము సింహకేతుడు కడు ధర్మాత్ముడు సంవత్సరమునుండి యిచ్చటి దురాచారము కొంచెము తగ్గించెను. నీ వీచిక్కుల నెరుగవు కాబోలు నిం దెవ్వరింటను బసచేయకుము ఆ రాజుగారే విదేశస్తులకై సంవత్సరము క్రిందట నొక సత్రము నూతనముగా గట్టించినారు. అచ్చటికి బొమ్ము భోజనము పెట్టుదురు. గ్రామస్థుల మాయలం జిక్కకుండ రాజభటులు కావలియున్నారు. నేనును విదేశస్థుడనే నిన్న నొకపనిమీద నిచ్చటికివచ్చి యాసత్రములోనే భోజనము చేసి మా యూరికి బోవుచున్నాను. వెనుక పరదేశస్థుని బలాత్కారముగా బట్టుకొని పోవువారు. ఇప్పుడు చాలాభాగము తగ్గినది ఐనను, స్త్రీలయెడ కడుజాగ్రత్తగా నుండవలయును. లేనిచో మోసపుత్తురని యచ్చటి విశేషము లన్నియుం జెప్పెను.

ఇంద్రద్యుమ్నుం డాతని మాటలు విని సంతసింపుచు అయ్యా! నీవు కడు పుణ్యాత్ముడవు. ఈ పట్టణము గుట్టంతయు జెప్పితివి. లేనిచో నేను గూడ మోసపోవుదును కొత్తవారి కేమి తెలియును అని యతని స్తుతిజేయుచు వానిచే ననిపించుకొని గ్రామములో ప్రవేశించెను. ఇరుపక్కలను చక్కని మేడలపంక్తి యింపుగా గనంబడినది ఆ సౌధంబులన్నియు నలంకారభూయిష్టములై కుబేరుని తిరస్కరించు నా గ్రామస్థుల యైశ్వర్యమును ప్రకటించుచున్నవి. అది చూచువారికి స్వర్గమోయని తోచక మానదు. అన్నియు మేడలేకాని సాధారణమైన యిల్లొకటియులేదు. అంతకుమున్న తానుచూచిన పట్టణములలో నంత విచిత్రమైనది లేదు. కావున నింద్రద్యుమ్నుడు దాని రీతి నెంతయు మెచ్చుకొనుచు వింతలజూచుచు నా వీధింబడి నడువజొచ్చెను. అడుగడుగునకు నొకవిశేషము గనంబడుచున్న నిలబడి చూచుచుబోవ నాతనికి నడకసాగినది కాదు. ఆరీతిని కొంత దూరముపోయి యొక మేడకడ నిలువంబడి యొకరిని అయ్యా! విదేశస్థులు నివసించు సత్రమెంత దూరమున్నదని యడిగెను.

ఆ మాటవిని యాయింటిలోనుండి యొకవాల్గంటి పసిండిబొమ్మయనం దళ్కుతళ్కు మని మేనికాంతులు నలుదెసల బొదల చటాలున జనుదెంచి అయ్యా! ఇటు రండని తమరు పరదేశస్థులు గాబోలు సత్రము పెక్కుదూరములోనున్నది. ఈ రేయి నిచ్చట నుండి మాయిల్లు పవిత్రముసేసి యుదయమున పోవచ్చును. మీకిష్టమువచ్చినట్లు భోజనము పెట్టుదుమని యతివినయముగా బ్రార్థించినది.

దానిమృదుమధురగంభీరవచనములకు వెరగుపడుచు నింద్రద్యుమ్నుండు ఓహో! ఈ చిన్నది మిగుల పతివ్రతలాగున దోచుచున్నది. సౌందర్యము గలిగి గర్వ మించుకయైనను బూనక యతిథిమర్యాద జేయుచున్నది. కొందరు మందమతు లింటికివచ్చిన బంధువునైనను తగురీతుల సత్కరింపరు. సాధ్వియైన భార్యవలన గదా యజమానునకు గీర్తిగల్గుట భార్యవశ్యురాలును, గుణవంతురాలును, పుత్రవంతురాలు నైనయెడల ధర్మార్థ కామములు దానియందేయున్నవని పెద్దలు చెప్పుదురు "భార్యామూల మిదం గృహ"మని దానంజేసియే వచింతురని పెక్కుగతుల మెచ్చుకొనుచు నింతతో బాటసారిమాట జ్ఞాపకము వచ్చుటచే నయ్యిందువదనతో సుందరీ! నేనిందు నిలువను. సత్రమునకు బోవలసిన యగత్యమున్నయది. నీ యాతిథ్యమునకు సంతసించితి బోయి వచ్చెదనని పలికి యందుండి పయికినడిచెను. మరి కొంతదూరము నడచి యొక యింటి యజమానునితో నయ్యా! పరదేశస్థులు నిలుచుటకై క్రొత్తగా గట్టిన సత్రమెంత దూరములో నున్నది. యీ మార్గమున బోయిన బోవునాయని యడిగెను.

అప్పుడాగృహము నుండి యొకజవ్వని రివ్వున మేడదిగి వచ్చి యతనిమది కచ్చెరువుగొలుపుచు నెదురుగా నిలిచి స్వామీ! మీరు పరదేశస్థులు సత్రము దూరములో నున్నది. ప్రొద్దుపోయినది యుదయమున బోవుదురుగాక. ఈ రాత్రి మా యిల్లు పావనము సేయుడని వేడుకొనినది. దాని మాటలువిని యారాజు వెరగు జెందుచు నోహో ! యీ యూరువారు మిగుల మర్యాద నెరిగినవారు. బాటసారి నాతో మరి యొకరీతిని చెప్పెను. ఇచ్చటివారి చర్యలేమియు గౄరముగా గనబడుటలేదు. సుగుణసంపత్తిలేక నీయూ రింతభాగ్యసంపన్నం బగునా వాని కేమి తోచి యట్లనెనో కాని నాకంత విశ్వాసయోగ్యముగా గనంబడలేదు. కానిమ్ము మరియు బరీక్షించెదంగాక యని తలంచుచు బోటీ! నీమాటలకు నేను సంతసించితిని నా కచ్చోటికి బోవలసిన యవసరము కలదు. పోయివచ్చెద నేటి కానతిమ్మని పలికి యా యిల్లుదాటి మరికొంత దూరము నడిచెను.

ఆరీతి నడిగినతావున నెల్ల నచ్చటియింటిచిన్నది వచ్చి లోపలకు రమ్మని వేడుకొనుచుండుటయు నన్నరవరు డద్భుతపడి తుదకు బాటసారిమాట బూటకముగా దలంచెను. అట్లు పెక్కిండ్లు దాటిపోయి మరియొక్కచోట దొంటితెరగున సత్ర మెంతదూరములో నున్నదని యడిగెను. ఆ మాట మేడమీదనుండి విని కృష్ణదాసనువాని భార్య ప్రజ్ఞావతి యనునది వడివడి మేడ దిగి వచ్చి దారి కడ్డముగా నిలువంబడి వినయంబున నిట్లనియె. అయ్యా! తమదేశ మెద్ది? యెచ్చటికి బోవుచు నిచ్చటికి వచ్చితిరి. సత్ర మడిగితి రేమిటికని యడిగిన నా రాజపుంగవుం డంగనామణీ! మాదేశము పెక్కుదూరములో నున్నది. ఒక కార్యార్థినై యిచ్చటికే వచ్చితిని. బసచేయుటకయి సత్ర మడి గితినని యుత్తరము చెప్పెను. అయ్యా! యీ యూర నిన్నియిండ్లు గలిగి యుండగా మీకు బసజేయుటకు స్థల మెచ్చటను దొరకినది కాదు కాబోలు? యీ యర్ధరాత్ర మెచ్చటనో యున్న సత్రమునకు బోవలయునా? మీవంటివారు నిమిత్తము లేక ప్రార్థించినను వత్తురా? గృహస్థులై యున్నందులకు ఫలము మీ వంటివారిని బూజించుటయేకదా అతిథిపదధూళిసోకని భవనము వనమని యార్యులు చెప్పుదురు. గంధర్వనగరప్రాయమైన యీ సంసారమందున్న సారంబింతియకాక మరేమియున్నది. మీరు మా పుణ్యవశమున సత్రమునకు బోవుచు దారితప్పి యిట్లు వచ్చితిరి. ఈ రాత్రి మా యింట నింతయాతిథ్యము పుచ్చుకొని యుదయమునం బోయెదరుగాక లోనికి రండని మిక్కిలి భక్తితో బ్రార్ధింపదొడగినది.

అమ్మానవపతి యా మానవతి భయభక్తివిశ్వాసములకు మిగుల నానందము నొందుచు నౌరా! వీరి మర్యాద లెంత వింతగానున్నవి. పట్టణంబున నెంతధర్మాత్ములైనను బసయిచ్చుటకు సమ్మతింపరు. బాటసారి నన్ను మోసపుచ్చుటకై యట్లు చెప్పెను కాబోలు. విదేశస్థుని మాయలెట్లు గ్రహింపనగును. తఱుచు టక్కరివాడే మంచివారిని టక్కరులని చాటుచుండును. లోకంబున నందరు దుర్మార్గులుగా నుందురా ? ఇందు జూచిన వారెల్ల నన్ను దమయింటికి రమ్మని బ్రతిమాలుచుండిరి. ఇదియునుగాక సత్రమునకు బోవుదారి తప్పితినట. ఈ యర్థరాత్రి మెచ్చటగనుం గొనగలను. ఈ రాత్రి వీరి యింటనుండి యుదయంబున బోయెద. నింతలో నేమి మోసము చేయుదురని తలంచుచు నామె యింటికి వచ్చుటకు సమ్మతించెను.

పిమ్మట నా ముద్దుగుమ్మ యమ్మనుజపతిని దోడ్కొని పోపుచు గనుసంజ్ఞ జేసినంత బరిచారికలు బంగారు కలశములతో నీళ్ళు దెచ్చి యిచ్చిరి. వానిని బుచ్చుకొని అతడు తన యొద్దనున్న పుస్తకము మూటయు నా చావడి గుమ్మముపై యరలోనుంచి కాళ్ళు గడిగికొని లోనికి బోయెను. ఆ చిన్నది అతనిని మేడ మీదికి దీసికొనిపోయి ఒక కనకపీఠమునం గూర్చుండబెట్టినది. అమ్మేడయందు గలఅలంకార మతినిస్వాంతమునకు వింతవేడుక గూర్చినది. వారుచేయు నుపచారములన్నియు రాజోచితముగా నున్నవి. తన్నుఁ జక్రవర్తిగా నెరింగి అట్లు చేయుచున్నవారని అతడు భ్రాంతిపడి సంతోషము జెందుచు వీరు కోరిరేని తన దేశములో గొన్ని గ్రామము లిత్తునని నిశ్చయించుకొని యుండెను.

పిమ్మట అతనికి బెక్కుపిండివంటలతో భోజనము పెట్టిరి. భోజనము సేయు సమయమున నా రమణి అతనియొద్ద కూర్చుండి ఆర్యా! నెమ్మదిగా భుజింపుము. శాకము లేమియు లేవు. ప్రొద్దు పోవుటచే వంటకములు తరుచు లభ్యములు కాలేదు. యెట్లో ఆకలి దీర్చుకొనుడు అని పలుకుచు సురటి గైకొని వీచుచు నడుమ నడుమ నేయి తానే వడ్డించుచు నీరీతి అతనిని లేచుదాక బలవంతబెట్టుచుండెను.

ఆబ్బోటిమాటలకు మోమాటము జెందుచు అతండు భుజించెను. తర్వాత ఆతనిని పరిచారికలు శయనగృహమునకు దీసికొనిపోయి యందు హంసతూలికాతల్పంబునం గూర్చుండబెట్టిరి. ఇంతలో అక్కాంతయు గప్పురపువీడెము చేతంబుచ్చుకొని యాగదిలోనికి బోయి అతనికందిచ్చుచు దానసంతుష్టి వడసిన పిమ్మట వీణంబుచ్చుకొని హాయిగా దంత్రీనాదముతో కంఠనాదము మేళగించి పాడదొడంగినది. సంగీతప్రియుండగు నారా జాపాటలగంధి పాటకు మనంబు గరుగ అచ్చెరువందుచు అప్పుడు దానిని దివ్యాంగనగా దలంచెను. అచ్చేడియ పాడుచుండగనే అందున్న పరిచారకులు క్రమక్రమముగా అవ్వలకు బోయిరి.

ఒంటరిగా నుండి పాడుచున్న యాచిన్నదానింజూచి యాఱేడు వేరొకలాగున సందియమందు చుండెను. అంత పాటచాలించి యా యించుబోడి మెల్లగ అతని చెంతకువచ్చి ఆర్యా! పెక్కు దూరము నడిచి వచ్చితిరి. అలసటదీర బాదము లొత్తుదునా అని అడిగెను. ఆ మాటలకు సంశయమందుచు అతం డహో! యింత వరకు చేసిన యుపచారములన్నియు గృహస్థురాలికి దగునుగాని పరపురుషునంటి పాదములొత్తుట సతీధర్మముకాదు. ఈ చిన్నది దానికి యొడంబడుచున్నది. ఈదేశాచార మిట్టిది కాబోలు, యెంత అతిథియైనను పతివ్రత పెనిమిటికాక ఇతరునియొద్ద నొంటిగా నిలుచునా? అట్లు నిలుచుటయే తగదు మరియు బాదము లొత్తినచో మనము చాంచల్యమందక యాగునా? ఇంద్రియవ్యామోహము బలవంతమైనది విద్వాంసుని కూడ మోసము చేయగలదు. మళయాళదేశములో జారత్వసంకోచము లేదని వాడుక గలదు. దీనియభిప్రాయ మట్టిదిగా దోచుచున్నది. దీనినిజెంత నుండనిచ్చిన నేనును భ్రమజెందుదునేమో అని తలంచుచు దానికిట్లనియె.

సాధ్వీ ! నాకు శ్రమ యెంతమాత్రము లేదు. ఇంతదనుక నీవు చేసిన యుపచారమున కెంతేని సంతసించితిని. ఇక చాలును. ప్రొద్దుపోయినది. నీవుపోయి పండుకొనుము. నాపాదము లంటరాదని పలికిన అక్కలికియు బయ్యెట సవరించు కొనుచు మొగంబున జిరునగవు జిలుక దొలకరిమెరుపుతెరుగున మైదీగె మెరయ మరల అతని కిట్లనియె. ఆర్యా! మా దేశాచారము మీకు దెలియదు కాబోలు. మాకు నతిథిని సంతోషపెట్టుట కంటె యుత్తమవ్రతంబులేదు. అతిథినే దైవముగా భావింతుము. అతం డేమి కోరినను వలదన కిత్తుము. నీవు సంశయింపవలదు నీ యిష్టము దీర్చుకొమ్మని పలికెను. అతండా మాటలు సహింపక మంచము నుండి నేలకురికి యావల కరుగసాగెను . పిమ్మట నమ్మదవతియు నతని మతి కఱుగదని నిశ్చయించి ఆర్యా! పోకుము పోకుము రమ్ము. మంచముమీద బరుండుము. నీచిత్తమరయ నిట్లు చేసితిని. ఇక నిన్ను ముట్టనని యొట్టు పెట్టుకొని యతడు శయనించిన తరువాత నాగదినుండి మరి యొక యింటిలోనికి బోయినది. దానికృత్యములన్నియుం దలపోయుచు నది కైతవమా? యదార్ధమా యని వితర్కింపుచు నిశ్చయింపలేక మనంబుయ్యెల లూగుచుండ నతండెట్టకే నిదురించెను. అతండుదయమున లేచి చూచువరకు బాదములకు జేతులకు సంకెళ్ళు తగిలి యున్నవి. ఇనుపనాళములచేత గట్టంబడి బోనురీతినున్న యొకగదిలో నుండెను. ఆ గదికి నవ్వలవైపునం దాళమువైచి యున్నది. అట్టి విధమంతయుం జూచి అయ్యో! నేనేమి నేరము చేసితిని? నన్ను కారాగృహములో నుంచుటకు గతంబెద్ది? అమ్ముద్దియకోరినరీతి నడువకునికి కాబోలు. మేలు మేలు. పాపమా బాటసారి యీ యూరిలో నాడువారు మోసపుత్తురని మొదటనే చెప్పియున్నవాడు అమ్మాటల నమ్మక యీకొమ్మ చేజిక్కితి నిక నేమి సేయగలను? ఎంత బలము గలిగి యున్నను బోనునంబడిన సింహమేమి చేయగలదు? కటకటా! నవరాత్రదినములు సమీపమునందే యున్నవి. ఇప్పుడు నన్ను శక్తికి బలి యిత్తురు కాబోలు. కానిమ్ము దానికి నేను వగవను. ఎప్పటికైనను మరణమున్నదియేకదా? శపధము దీర్చుకొనలేక పోతినను చింతమాత్రమున్నది నాకు దైవ మీరీతి మృతి వ్రాసియుండగా మరియొకరీతి నెట్లు జరుగును?

శ్లో॥ అభావీనభవత్యర్థో నాభావో భావినః క్వచిత్ ॥
      ఏతద్వదంతో విద్వాంసః క్లిశ్యంతె దేవమోహితాః॥

అనగా కానిప్రయోజన మెన్ని విధముల బ్రయత్నము చేసినను కానేరదు. ఏమియు బ్రయత్నము చేయకనే కానున్నది కాకమానదు. అని చెప్పుచు విద్వాంసులు సైతము దేవమోహితులై భ్రాంతి నొందుచున్నారు. కావున నే నిప్పుడు చింతించనేల కర్మసూత్రమెట్లున్నదియో యట్లు జరుగక మానదు.

శ్లో॥ వికటోర్వ్యామప్యటనం శైలారోహణ మపాంనిధేస్స్తరణం
      నిగళంగుహాప్రవేశోవిధిపరిపాకః కథంనుసంతార్యః॥

విదేశసంచారము పర్వతారోహణము సముద్రముమీద బోవుట కారాగృహప్రాప్తి, గుహలో ప్రవేశించుట లోనగునవి దైవవశమున సంప్రాప్తించునందురు. వాని దాట నెవ్వనికి శక్యము కాదు. అని బెక్కుతెరగుల విచారించుచు నింద్రద్యుమ్నుం డా బందీగృహంబున గొన్ని దినంబులుండెను. పుణ్యపురుషులలో నగ్రగణ్యుండగు నమ్మహారాజు ప్రాకృతజనుండువోలె నొకయింట బంధముపడి యుండెను. అన్నన్నా? పుడమిలో నిడుముల గడవనివారు లేరుగదా? ఇట్లుండునంత నాయూరి సభాపతులు కొందరొకనాడు రహస్యముగా నొకసభజేసి యీరీతి సంభాషించుకొనిరి. సభాధ్యక్షుడు సభాపతులతో మనకు ప్రభువగు సింహకేతుడు పూర్వపురాజు దండవర్మవలెగాక మనమంత్రశాస్త్రపుస్తకములన్నియు ముట్టడించి లాగుకొనియెను. నవరాత్రములలో మనము చేయుశక్తిబలులు సాగనిచ్చుటలేదు. విదేశస్థులు మనయిళ్ళకు రాకుండ సత్రమొకటి యుంచెను. మరియు పుస్తకములుగాని బలినిచ్చువారిగాని దాచెద మేమోయని వత్సరమున కొకటి రెండుసారులు మన గృహములు పరీక్షించుచుండెను గదా? ఇక మన కృత్యములెట్లు సాగును? దీనంబడసిన యీ యైశ్వర్యము లెట్లు నిలుచును? నవరాత్రదినములు సమీపించుచున్నవి. యీపాటికి మన యిళ్ళన్ని యు బలిపురుషులతోడను స్త్రీలతోను నిండియుండినవి. ఇప్పు డెచ్చట నున్నట్లు తెలియదు. అమ్మకమునకు దెచ్చువారు కూడ రాజభీతిచే పూర్వమువలె నరుదెంచుటలేదు. ఈ సంవత్సర ముత్సవము లెట్లు జరుగునో తెలియకున్నది. ఐనను నేటికి సిద్ధముజేయ బడిన బలిపురుషుల సంఖ్య యెంతయో చెప్పుడని యడిగెను. అప్పుడు సభాపతు లందరు తమ తమ యిండ్లలో నున్న పురుషులను స్త్రీలను లెక్కింప నూటపదమువ్వు రైరి. వారిలో స్త్రీలు పదమువ్వురు. తక్కిన నూర్గురు పురుషులు. విత్తమిచ్చి కొనిన వారు ముప్పదిమంది తక్కినవారందరు నింద్రద్యుమ్నునివలె లభ్యమైనవారే యని యాసంఖ్యను సభాపతులు వేరువేర నిరూపించి చెప్పిరి.

పిమ్మట సభాధ్యక్షుడు మరల వారికిట్లనియె. ఈనూట పదమువ్వుర నింతవరకు గాపాడితిరి. ఇంక దాచుట కష్టము. నిన్నటిదినమున చాటింపు సంగతివింటిరా? మన గృహములన్నియు బరీక్షింతురట. దీని కేమి చేయవలయునో యాలోచింపుడనుటయు నందొక వృద్ధసభాపతి యిట్లనియె. అయ్యా! నాకు దోచిన సంగతి నేను జెప్పెదను వినుండు. ఒక్కడేని మనయింట దొరికినచో మనలను శిక్షింపకమానరు. కావున నీలోపుననే మనము వీరినందరిని వేరొకచోటున దాచవలసియున్నది. అట్టిజో టెద్దియంటేని యీ చండివర్మ రాజ్యమునకు వచ్చిననాటంగోలె లేదు గాని మన పూర్వులు గూడ నీ దినములలో రాజభీతిచే బలిపురుషుల బ్రచ్చన్నముగా దాచువారు. దానికై యీ పట్టణమునకు బ్రాంతమందుగల యడవిలో నొక పాతాళగృహము గట్టించిరి. అందు రెండు గదులున్నవి. ఒకటి పురుషులకు, రెండవది స్త్రీలకునుగా నేర్పరచిరి. ఒక్కొక్కదానిలో వేయిమంది పట్టుదురు. దానిలో భోజనాదిక్రియలు జరుగటకు దగిన యరలున్నవి. కావున వీరినందరిని రహస్యముగా నందుజేర్చి బరీక్షదినములు దాటినతోడనే మరల మన యిండ్లకు దీసికొని రావచ్చును. అట్లు చేసిన యుక్తముగా నుండునని చెప్పెను.

వృద్ధసభాపతి చెప్పిన యాలోచన యుక్తముగా నున్నదని యందరు నొప్పుకొనిరి. పిమ్మట మరల సభాధ్యక్షుడు వారితో నిట్లనియె. ఈతడు చెప్పిన పద్ధతి సమంజసముగా నున్నదని యందరు సమ్మతించిరి. నాకును సమ్మతమేకాని మరి యొకటి విచారింపుడు. మనము నూర్వరనేకముగా నొకతావున నుంచినచో వారందరు నేకమైన మన యాజ్ఞలో నుందురా ? ఎదిరించి పరిచారకులను దండింతురు. ఇదియునుం గాక నిందరనేకముగా నచ్చటికి దీసికొనిపోవుచుండ నా యలజడి రాజభటులకు దెలియక మానదు. దెలిసిన పిమ్మట శిక్షింపక మానరు. కావున దీనికేమి చెప్పెదరని యడిగెను.

అప్పుడు మరల వృద్ధసభాపతి అయ్యా! మనము బలిపురుషులకందరి కాళ్ళకు జేతులకు సంకెళ్ళువైచికదా యొకచోట నుంచుచుంటిమి. అట్లు బద్ధులైనవా రేమి చేయగలరు. నూర్వురైన నొకటియే, యొకండైన నొకటియే, రావణుడంతవాడు బద్ధుడై యేమియు జేయనేరక కారాగృహంబున పెద్దకాలము పడియుండలేదా? తక్కినవారి నెన్న నేల? మఱియు వారినందరిని నొక్కనా డొక్కసారియే తీసుకొనిపోకూడదు, వారందరు నొకచోట లేరుగదా? యెవరింటియొద్దనుండి వారే రహస్యముగా దీసికొనిపోయిన నలజడి యుండదు. కావున నట్లు చేయుటయే యుత్తమము ఇంతకన్న వేరొక యుపాయము లేదని నాకు దోచుచున్న దని పలికెను. ఆ మాటలకందరు సమ్మతించిరి. అట్లు చేయుటకు రేపటి నుండియే యారంభింపవలయునని స్థిరపరచుకొని యంతటితో సభ ముగించుకొని తమ నెలవులకు బోయిరి

ఆమ్మరునాడు రాత్రి సభాపతులందరు నిరూపించుకొనినట్లు తమతమ గృహంబులలో నున్న బలిపురుషులను బ్రచ్ఛన్నముగా నా పాతాళగృహములకు జేర్చిరి. ఇంద్రద్యుమ్నుండు నాటి యుదయంబున స్థలాంతరమందు దానువోలె గరచరణంబులకు నిగళంబులు దగిలింపబడియున్న పెక్కండ్రు పురుషులంజూచి వెరగందుచు నిట్లు తలంచెను. ఆహా! వీరిమంత్రశక్తి మిగుల గొనియాడదగియున్నది. అంటినమాత్రమే మేల్కొను నేనుసైత మిచ్చటి కెట్లు వచ్చితినో తెలియకుంటిని. లేకున్న వీరందరు నెట్లు మాయజేయగలరు? అన్ననా! యీ యూర నిన్నినరహత్యలు జరుగుచుండ దెలియకున్నవా డీరాజెంత మందమతియోగదా! నాకీ సంకెళ్ళు లేకున్న నీయూరి ప్రజల నందరను శక్తికి బలియిత్తునుగదా! కాలవశమున నిట్లయితినేమి సేయుదును! పాపము! నేనువలె వీరును మోసపోయిరి కాబోలు. దైవ మాయువు మూడిన వారి నీయూరికి జేర్చుచుండును. వీరందరు నెట్లుచిక్కిరో యడిగి తెలిసికొనియెదగాకయని నిశ్చయించి ప్రతిపురుషు నొద్దకునుబోయి నిష్కారణబంధమునకయి వగచుచుండ మంచిమాటల నూరడింపుచు నీ వెట్లు వీరికి జిక్కితివో చెప్పుమని యడుగుచు నతండు చెప్పినరీతిని విని వెరగుపడుచు నీప్రకారంబు క్రమంబున నందరిని దెలిసికొనిపోయెను. వారిలో గడ్డమును. మీసములుసు బెంచి దివ్యతేజంబున నొప్పుచు, యోగిరూపము వహించి యెద్దియో తలంచి చింతించుచున్న యొక పురుషు నొద్దకు బోయి అయ్యా! తమ నివాస మెచ్చట? కుల మెయ్యది? యీపురం బేమిటికి వచ్చిరి? మి మ్మెట్లు వశపరచుకొనిరి? మీయాకారము జూడ వేడుక యగుచున్నది. మీవృత్తాంతము వినవలతుం జెప్పెదరే ! ఏ నింద్రద్యుమ్నుండనునాడు. మాది ద్రోణపురము. సింహమును జంపుటకై యడవికివచ్చితి. అచ్చట కాశీరాజుకూతురు విశాలాక్షి యనునది మగనితోగూడ శత్రుభీతిచే బారిపోయి వచ్చుచు మార్గంబున గుర్రముమీదనుండి మగడు జారిపడుటయు నతండు మృతినొందెనని శోకింపుచుండ నాధ్వని విని యక్కాంత చెంతకుపోయి యామె నోదార్చి మగనింగూర్చెదనని శపథము చేసితిని. ఇంతలో సింహము నా సైన్యంబుల నురుముచేయ దొడఁంగిన దానిం జంపుటకై పోయితిని. నేను పోవువరకు మరియొక వీరుడు దానిని గడతేర్చెను. నేను మరల వెనుకకు పోవునప్పటికి విశాలాక్షి యచ్చటలేదు. నా భార్య సేనలతో నింటికి పోయినది. పిమ్మట నేనా చిన్నదానిని దానిమగనిని వెదకుచు నారు మాసము లాయడవిలో గ్రుమ్మరితిని. పిమ్మట గ్రామములలో నరయుచు దుద కీయూరు జేరితిని. బాటసారిమాట వినక యిందొకనియింట నాతిథ్యమున కంగీకరించి యిట్టియవస్థకు బాల్పడితిని ఇదియె నావృత్తాంతము. ఇందున్నవారందరు నావలెనే మోసపోయిరి. మీ రేమిటికో విచారింపుచుండిరి. ఈబంధనమునగాక వే రెద్దియేని గారణమున్నదా యేమి? తెలుపుడని యడిగిన నతండు తలయెత్తి యతనిని బరామర్శింపుచు నిట్లనియె.

హా ! విశాలాక్షి! హా! ప్రాణనాయకీ! వెర్రిగా నుండినప్పుడే నాయందు భక్తి నీకు మెండుగా నుండునది. ఇప్పు డెంత సంతోషించెదవోగదా? రాజేంద్రా ! నీవు కడుపుణ్యాత్ముడవు. భార్యనైనను గణింపక పరులనిమిత్తము పాటుపడుచుంటివి. నన్నా విశాలాక్షి మగనిగా భావింపుము. సింహమునుజంపిన వాడను నేనే యని నుడివి నంత నాభూకాంతు డత్యంతసంతోషము జెందుచు నోహో మావిశాలాక్షి మగడవు నీవేనా? రూప మామె చెప్పినట్లున్నది. కాని నీతెలివి జూడ వేరొకలాగున దోచుచున్నది. ఇదియునుఁగాక సింహమును గూడ నేనే చంపితినని చెప్పితివి. విశాలాక్షి తనమగడు వెర్రివాడని చెప్పియున్నది. నీ వట్టివాడవే యని యడిగిన నతండు మరల నిట్లనియె.

మదనుని కథ

రాజా! విశాలాక్షి చెప్పినమాట యదార్ధమే నా పూర్వవృత్తాంతము వినిన నీసంశయము వాయును. చెప్పెద నాకర్ణింపుము. మా కాపురము గోదావరీతీరమున నున్న వీరభద్రపురంబను నగ్రహారము. మా తండ్రిపేరు సోమశేఖరుడు. ఆయన చిన్నతనమందే కాశికిబోయియందు బెక్కువిద్యలఁ జదివి యాచార్యులని బిరుదువహించి మరల నింటికివచ్చి యచ్చట బెక్కుక్రతువులు సేసెను. మహర్షితుల్యుండగు నత డొకనా డుదయంబున నగ్నిహోత్రగృహంబుననుండ మాతల్లి పుత్రార్థమై యాచింప సంతసింపుచు బుత్రజన్మహేతుభూతమగు నిష్టినొకటి గావించుటయు దత్ప్రసాదంబున నేను వారికి బుట్టితిని. బాల్యంబున నా రూపంబునకు వెరగందుచు బ్రజలందరు నన్ను మదనుడని పిలవందోడింగిరి. మా తండ్రి నాకు ధనంజయదాసని పేరు పెట్టెను గాని యా పేరున నన్నెవ్వరును పిలవనందున నాకు మదనుడను నామమే వాడుకలోనికి వచ్చినది.

మాతండ్రి నాకు బదియేనువత్సరములప్రాయము వచ్చువరకే తనకు వచ్చిన విద్యలన్నియుంజెప్పెను. నా బుద్ధి మిగుల సూక్ష్మమైనది. కావున నా విద్య లన్నియు చక్కగా గ్రహించితిని. అధర్వణవేద మొక్కటిమాత్రము మా తండ్రికి రాదు. మాతండ్రిగారు సహాధ్యాయుడు విశ్వనాధభట్టను నతండు మాతండ్రికంటె నెక్కుడుదినంబులు కాశిలోనుండి యావేదముకూడ గ్రహించెను. అతండును మా గ్రామమునకు సమీపములో నున్న కుక్కుటేశ్వరమను నగ్రహారంబున విద్యార్థులకు బాఠములుజెప్పుచు నివసించియుండెను. నేను మాతండ్రి యనుజ్ఞవడసి విద్యార్ధినై యాతనియొద్దకు బోయితిని. ఆయనయు మాతండ్రియందుండు గౌరవస్నేహములం బట్టి నన్ను దన యింటబెట్టుకొని యధర్వణవేదము మొదలుబెట్టెను.

అయనభార్య సురుచి యనునది మిగుల రూపవంతురాలు. విశ్వనాథభట్టు ప్రాయము మిగిలిన తరువాత గాశినుండివచ్చి పెండ్లియాడెను. కావున నా దాంపత్యము చూచువారికి హాస్యాస్పదముగా గనంబడకమానదు. సురుచి రూపవతియు విద్యావతియు నగుటచేత వృద్ధుండైనను మగని కనుకూలవర్తనమున మెలంగుచు గుణవతియనియే పేరుపొందినది. నన్నును భోజనభాజనములయందు మిగుల వాత్సల్యముతో జూచుచుండునది. ఇట్లుండ నంత నొక్కనాడు విశ్వనాధభట్టుగా రెద్దియో కార్యావసరమున గ్రామాంతర మరిగిరి. విద్యార్ధులును తలయొకపనికై మరియొకచోటునకు బోయిరి. తుదకు మేమిరువురము గాక యింటిలో మరియెవ్వరునులేరు. నాటియుదయము మొదలుకొని సురుచిబుద్ధి మారిపోయినది. మధ్యాహ్నము నేను భోజనముసేయుచుండ దాపునం గూరుచుండి విసనకర్రచే నన్నమువిసరి చల్లార్చుచు గురుతుపట్టరాని వంటకములు కొన్ని వడ్డించి నవ్వుచు నా కిట్లనియె.

మదనా! మీతండ్రి పండితుడుగనుక నీకుదగిన పేరుపెట్టెను సుమీ! నీ రూపమునకుదగిన విద్యకూడ నున్నది. పూపునందావియుంబోలె విద్యారూపములు గలిగిన నిన్ను జూచునప్పుడెల్ల నాయుల్లమున సంతోషము వెల్లివిరియుచుండును. ఈ వడ్డించిన భక్ష్యము లేవియో చెప్పుకొనుము. చూతము. నీ బుద్ధి యని నన్ను బరిహాసములో దింపినది. అప్పు డామెయభిప్రాయము పూర్ణముగా గ్రహింపనేరక నేను బూర్వపురీతియేయనుకొని యావంటకముల బరీక్షించియు దెలిసికొనలేక సాధ్వీ! యవి సురుచిగా నున్నవిగాని వీనిమర్మముమాత్రము నాకు దెలియలేదని చెప్పితిని. నా నోటనుండి యప్రయత్నముగా బయలు వెడలిన మాటలలో శ్లేషగ్రహించి యాయించుబోణి దృగంచలములు నాపైని బరగించుచు చిరునగవుమొగమునకు నగయైమెరయ నౌనౌను మదనగ్రహము సోకక యీగుట్టెట్లు తేటబడును ? నీవు చెప్పినమాట యదార్థమే యైనను జెప్పెద విను మివి మనోహరములు. చేటికలను నామముగల వంటకములు. సుస్నేహరితములని చెప్పనొప్పు. వీనిదినిన భారమేమియు నుండదని చెప్పినది.

అప్పుడామెయన్న మాటలకు నర్దమువిచారింప శ్లేషగనంబడినది. పిమ్మట నేననినమాటలు దలంచుకొంటిని. అందు శ్లేషయున్నది. అవియెరిగియనిన మాటలుకావు దైవము నానోటనుండి యట్లనిపించెను. ఇవి సురుచిగా నున్నవిగాని మర్మము తెలియ లేదంటిననగా సురుచియొక్క మర్మము నాకు దెలియలేదను ధ్వని సూచించుచున్నది. దాని కామె యుత్తరము చెప్పినది. మదనుగ్రహము సోకక నీసురుచిగు ట్టెట్లు తెలియును. అనుదానితో నాదయలేక యీవంటకములసంగతి నీకెట్లు తెలియుననియు నీ యందు మదనావేశము జెందినప్పుడుగాని నా గుట్టు తెలియ నీ కవసరము లేదనియు మనోహరమగుచేటికలు మనస్సును హరించు దూతికలనియు సుస్నేహరితము లనగా మంచి చమురువల్ల పుట్టినవని వంటకములకును అనురాగమున కివియే హేతువులని రెండవ యర్ధము స్ఫురించుచున్నది. నేను జెప్పినదానికి దగునుత్తరమిచ్చినది. ఇది మంచి చతుర. మాగురువు చతురుండైనను వృద్ధుడగుటచే నీమెకు సరిపడడు. వృద్ధునకు దరుణి విషమనుమాట సత్మము గదా. అని పెక్కుతెఱంగుల దలంచుచు దల వాల్చుకొని భోజనము చేసి పిమ్మట నేను విద్యామందిరమునకు బోయితిని.

విద్యార్థులందరునుగూడ పాఠములు చదువుకొనుమందిరమునకు విద్యామందిరమనిపేరు. అదియు వారింటిని జేరియే కొంచెమెడముగా నున్నది. అచ్చటికి బోయి నేను బాఠములు చదువ బూనుటయు నా మనం బందుజొర సురుచి యనిన మాటలు తలంచుకొనుచు నోహో! ఆమెయభిప్రాయ మేమియోకదా? చివర దిసినం భారముండదనికూడ యనినది. ఆ మాటలో ననుభవింపుమనియుం దోచు చున్నది. అట్టి మాట యనునా? ఇదివర కీమె గుణవంతురాలని ప్రఖ్యాతి యున్నదే. ఇప్పుడుమాత్ర మావ్రతమేల చెరుపుకొనుచు, విద్యావతిగనుక చమత్కృతికయి యట్లనెనని తోచుచున్నది. వేరొకయభిప్రాయము నిక్కముగా గలిగినచో నీ లోపున నిచ్చటి కెద్దియో మిషబన్ని రాకమానదు. అది నిజమైన నేనీయాపద నెట్లు దాటుదును. దైవవశమున నీరాత్రి మాగురువుగారు వచ్చిన లెస్సయగుంగదా! అని పరిపరిగతుల దలంచుచు సంశయాకులచిత్తుండనై తల్లడిల్లుచుంటిని. ఇంతలో సాయంతన సమయమగుచుండ నా యండజగమన నా దండకు వచ్చి మదనా! యీ రాత్రి నీకిష్టమైన శాకమెద్దియా చెప్పుము. వండెదనని యడిగినది. అప్పుడు నేను దద్దరిల్లి యేమియుందోచక నీకిష్టమైన శాకము వండుమని చెప్పితిని. ఆ మాట విని యాజవ్వని నవ్వుచు మదనా! నా యిష్టమైనది నీకిష్టమేనా యని ముమ్మారు పలికినది. దానికి నేనౌను నీకిష్టమగు కూర నాకునిష్టమే యని చెప్పితిని. అప్పుడప్పాటలగంధి మదనా! యీ మాట మరువకుము. పిమ్మట నీకిష్టము లేదన్నను దప్పదుసుమీ యని పలికి తిరిగి జూచుచు లోపలికి బోయినది.

అప్పుడు నామనంబునగల యనుమానము తీరినది. ఆ చిన్నది యెన్నడును మా విద్యామందిరమునకు వచ్చినదికాదు. నా యిష్టము నీ యిష్టమా యని యూరక ముమ్మారు తర్కింపనవసరమేమి? తిరిగి చూచుచుబోయినది. ఈ చిహ్నము లన్నియుం బరిశీలింప నా మదవతి హృదయము చాంచల్యమందినదనుట కేమియు సందియము లేదు. ఇటుమీద నేనేమి చేయదగినది. ఈ రాత్రి భోజనమునకు బోయినప్పుడు మిగిలిన సందియముగూడ దీర్చును. అనర్థమురాకమున్నే ప్రతీకార మూహింపవలసియున్నది. ఇప్పు డామెకు జెప్పకుండ నేనెక్కడి కేనింబోయి గురువు వచ్చినవెనుక వచ్చెదమనుకొనిన నీచిన్నది యొంటరిగా నుండుట జూచి యిల్లు మ్రుచ్చులు కొల్లబెట్టినచో నేమిచేయనగు? ఇదియునుంగాక మాటలచాతుర్యమువలన నూహించుటయేకాని తన యభిప్రాయము నాకు వెల్లడించినదా? అంతమాత్రమునకే నేను లేచిపోయినచో మా గురువు నన్ను మందలింపకమానడు. ఇప్పటికైన నత్తరుణి చిత్తవృత్తి యిట్టిదని నిరూపింప శక్యమగునా? కావున నాకేమిచేయుటకు దోచుట లేదు. కానిమ్మంతపని వచ్చినప్పు డక్కంతామణి స్వాంతము నీతిబోధచేసి మరలించెదనని నిశ్చయించుకొని భగవంతుని వేడుకొనుచుంటిని

ఇంచుక చీకటిపడినదో లేదో యంతలోనే నన్ను భోజనమునకు రమ్మని కేకవై చినది. మేను కంపమునొంద మెల్లనలేచి భోజనమునకు బోయితిని. నాకు గాళ్ళు గడిగికొనుటకు సుష్ణోదకము దెచ్చి యిచ్చినది. నేనును బాదప్రక్షాళనముచేసి తడిబట్ట గట్టికొని లోనికి పోవునంత మంచివిలువగల మాగురువుగారి పట్టుపుట్టము నెదురుగా దెచ్చి యీయబోయిన నేనిట్లంటి అయ్యో! ఇది మా గురువుగారిది నేను గట్టుకొనగూడదు. వేరొకటి తెమ్మని యడిగిన నచ్చేడియ నవ్వుచు గురువుబట్ట గట్టుకొనగూడదని యే గ్రంథములో వ్రాసియున్నదో చూపింపుము. వేరొకబట్ట యారవేయలేదు. ఇది ధరింపక తప్పదని బలాత్కారముగా నాచేతం బెట్టినది. దానిని గట్టుకొని పీటమీద గూర్చుండునంత మూడుభాగములు మిగిల్చి కోసిన యరటియాకు వైచి యందు సన్నని యన్నము కూరలు పచ్చడులు భక్ష్యములు వింతవింతలు వడ్డించినది.

రాజేంద్రా! నే నేమని చెప్పుదును. ఆదినమున నాకు జేయునుపచారము లన్నియు గ్రొత్తవియె కాని యెన్నడును జేసినవిగావు. అదేమిపాపమో, యెప్పుడో తన యభిప్రాయము స్పష్టంగా వెల్లడించిన తరువాత నీతి చెప్పెదనని తలంచితినిగాని మొదటనే యివి యేమి చర్యలు విపరీతముగా నున్నవి. తగ వని చెప్పుటకు నోరు వచ్చినది కాదు. ఆమె యేమిచెప్పిన నొప్పుకొనువానివలె నూరకుండి చేయుటచే గ్రమ క్రమముగా నాయువతి మితిమీర దొడంగినది. నాకు మాట్లాడబోయినంత కంపము వచ్చుచుండును. ఏమి చేయుదును. మనంబున నెన్నయో యూహలున్నవి. యొక్కటియు నోటినుండి వెలువడలేదు. నేను దలవాల్చుకొని భుజింపుచుండ చెంతగూరుచుండి రుచులు చక్కగా నున్నవియా, నీకిష్టమైనవేనా యని యడుగుచు పలువిధముల జతురతగా బల్కదొడంగినది. తలద్రిప్పుటయే కాని నే నొక్కదానికి నుత్తరము జెప్ప లేదు.

భోజనముజేసి నేను వాకిటకు బోవ యత్నము చేయుచుండగా సురుచి నాతో మదనా! నే నొంటిగా నుండలేను, నేను గుడుచునప్పుడు దాపున గూరుచుండవలయును. నేడు విద్యామందిరమునకు బోవుట మానివేయుము. నాకు భయము చాల గలదు. నీవిందు గూర్చుండనిచో నేను కుడువనని చెప్పగా నేనేమి చేయవలెనో నీవే చెప్పుము. దానికేమియు నుత్తరము చెప్పలేక యూరకున్నంత దాపున నొక పీటవైచి యందు గూరుచుండుమని చెప్పినది. నే నందు గూరుచున్నంత దన తళుకుచూపులు నడుమనడుమ నాపై బరగించుచు నెద్దియో పలికి నవ్వుచు దృటిలో భోజనముచేసి లేచినది. పిమ్మట నన్ను జూచి మదనా! నీవెచ్చట బరుండెదవో చెప్పుము మంచము వాల్చెద నని యడిగిన మేను గజగజవణంక కంఠము డగ్గుత్తికపడి స్వరమురాక హీనస్వరముతో నీ నీ యిష్టమని పలికితిని. అప్పుడా సురుచి యట్లయిన నా గదిలో బరుండెదవా? యని యడిగినది. ఆ ద్వంద్వార్థము గ్రహంచి నేను శిరఃకంపము సేయుచు నేమియు ననలేక యూరకున్నంత నక్కాంతయు నంతకుబూర్వమె యలంకరించి యున్న తనగదిలోనికి దీసికొనిపోయినది.

నే నాగది నంతకు మున్నెన్నడు జూచి యుండలేదు. కడువింతగనున్నది. అట్లుపోయి యందున్న పట్టుపందిరిమంచముమీద గూరుచుంటిని. అప్పటి నా యభిప్రాయమెద్దియో మీరు గ్రహించితిరా? అయ్యోష తన యభిలాష బూర్ణముగా వెల్లడించినప్పుడు నీతి జెప్పెద మని యంతదనుక నామె చెప్పినటుల చేయుచుంటిని కాని మరియొక కారణముగాదుసుడీ! అంత నక్కాంతయు వేరొకగదిలోనికి పోయి నిమిషములో జగన్మోహనంబైన యలంకారముబూనివచ్చింది. రాజేంద్రా! నీకు దాచనేల? అప్పుడు దానిని జూచిన నంతకు బూర్వముగల నా మనస్థయిర్యము కొంచెము సాంకర్యము నొందినది. దానిని దృఢపరచుకొనుచున్న నాచెంతకువచ్చి యచ్చేడియ మదనా! నేనెందు బరుండనో చెప్పుమని యడిగినది. నీయిష్టము వచ్చినచోట బరుండమని యుత్తరము చెప్పితిని. నాచేత ననిపించుకొన వలయునని యామెకును, ఆమె తనకోరిక వెల్లడించిన పిదప నీతిజెప్పుదమని నాకును మనంబున గలిగియున్నది.

నా మాటవిని యబ్బోటి మదనా! చాలుచాలు. నీ వెప్పుడును పుల్ల విరచినట్లే మాటలాడెదవు. అన్నింటికిని నీయిష్టమే యందువుగాని యొకదానికి దగునుత్తర మియ్యవు. అన్నియు నా యిష్టమైనచో నిక నీయిష్టమేది. నామంచము మీద నీవు పరుండితివి. నాకు వేరొక శుభ్రమైన మంచములేదు. దానికై యాలోచించుచు నిన్నడిగితిగాని నా యిష్టమైనచో నిన్నడుగనేల? పోనీ నేలనే పరుండెదనులే యని పలుకుచు జాప సవరింపబోయినది. అప్పుడు నేను మంచము డిగ్గనురికి అయ్యో! నీవు క్రింద బరుండగా నేను మంచముమీద బండుకొందునా? నీకన్న నేనెక్కుడు సుకుమార వంతుడను కాను. నీవు దీనిమీద బవ్వళింపుము. నేను వేరొకచోట శయనించెదనని చెప్పితిని. అంత నక్కాంత శిరఃకంపము సేయుచు వద్దు వద్దు. నీ వామంచముమీదనే పరుండుము. కొంచెము శుభ్రమైనమంచమొకటి యున్నది. దానిని దెచ్చుకొని యిందు వైచి పరుండెదనులే యని చెప్పి యాప్రకారము చేసినది. అంతలో మరల లేచి మదనా! యిదుగో యిందాక నీకు దాంబూల మియ్యవలయునని యిచ్చట బెట్టి మరచిపోయితిని, వైచుకొనుమని నా మంచముదాపునకు వచ్చినది.

నాకు దాంబూలము వైచుకొను నలవాటులేదు. ఇదియునుంగాక నేను బ్రహ్మచారిని. బ్రహ్మచర్యవ్రతమం దున్నవారు తాంబూలము వైచుకొనగూడదు. నీవే వైచుకొనుము. పొమ్ము పరుండుమని కొంచెము ధైర్యము దెచ్చుకొని చురుకుగా బలికితిని. అప్పు డామె నవ్వుచు నోహో! చాలు చాలు, ఏమి నీబ్రహ్మచర్యవ్రతము పాపము తాంబూల మొక్కటిమాని తక్కినపను లన్నియుం జేయవచ్చును గాబోలు, నాముందరనా నీడాంబికములు బ్రహ్మచారిగారూ! మంచముమీద బరుండవచ్చునా? ధోవతులు గట్టవచ్చునా? గంధమలందు కొనవచ్చునా? ఏది! గ్రంథములో నెట్లున్నదియో చూతము. దోషమని యుండినచో నుదయమున బ్రాయశ్చిత్తము చేయించుకొని యెదవుగానిలే? యని బలుకుచు నాకు మడుపులం జేతబట్టుకొని నానోటం బెట్టబోయిన నేనును దొందరపడి దాని చేయింబట్టుకొని సురుచీ! నిలునిలు, నీకు గొంత జెప్పవలసి యున్నది. నామాట వినిన పిమ్మట నిత్తువుగాని యని యెంత జెప్పినను వినక నా యెదుట బెక్కు కామవికారములం బ్రకటించినది.

అప్పుడు నే నహంకారముతో అన్నా! సురుచీ! ఇది యేమిపని? నీ వెంతో గుణవంతురాలవను కొంటినే, నేటితో దేటయైనది. నీవంటివారలు నీతిమాలిన పనులు చేయుదురా? విశ్వనాథబట్టుగారు వచ్చినచో దండింపరా? యుదయము నుండియు నేను గనిపెట్టుచునే యున్నాను. నీచర్యలన్నియు విపరీతముగా నున్నవి. వెళ్ళుము నీమంచముమీద బరుండుమని యెన్నియో నీతివాక్యములు చెప్పదలంచుకొన్న నాకాపాటి మాటలు నోటినుండి వచ్చువరకు గృత్యాద్యవస్థయైనది. అప్పటి నాచిత్తవృత్తి యెట్లున్నదియో యదార్థముగా నీకుజెప్పెద వినుము. ఉదయముకన్న మధ్యాహ్నము, మధ్యాహ్నము కంటే సాయంతనము, సాయంతనముకన్న రాత్రియు, రాత్రికన్న నప్పుడు క్రమంబున నామనము చాంచల్యమందినది.

శ్లో॥ బలవానింద్రియగ్రామో విద్వాంసమపికర్షతి॥

ఇంద్రియములు చంచలమైనవి విద్వాంసుని సైతము మోసము జేయునను నార్యోక్తి నాకు బాగుగ నచ్చినది. అట్టి మాటలువిని యాచిన్నది కన్నులెర్రజేయుచు నోహోహో! బుద్ధిమంతుడా! శ్లేషలు నీకేకాని యెవ్వరికి దెలియవనుకొంటివి గాబోలు నాదుర్గుణం బేమి కనిపెట్టి యిట్లంటివి. యింకొకసారి యనుము. తర్వాత జెప్పెదను తప్పంతయు దనయొద్ద బెట్టుకొని యెదిరిననుట లోకస్వభావమేకదా? నేను పుణ్యమునకు వంటకములు వండిపెట్టి యెట్లున్నవని యడిగిన సురుచిగానే యున్నవికాని మర్మము మాత్రము తెలియలేదని పలికిన మాట మరచిపోయితివేమో! సురుచియని నామాట ముందుగా నేమిటికి దలపెట్టవలయును. ఈతప్పెవ్వరిదో చిన్న దానినిజేసి యొంటిపాటు చూచి యాడించుచుంటివిలే! యని పరిహాసమాడెను.

అప్పుడు నామనంబున నొకమూల బాపభీతియు నొకమూల దాపభీతియు వేధింపదొడంగినది దాని క్రియలకు బ్రతి క్రియజేయ నుద్యుక్తుండనగుటకు దెగింప బోవుచు నంతలో నయ్యో! ఇంత చదువు చదివియు బావిలేని పూవుబోణి నెట్లుగూడుదును లోకులు వినిన నిందితురేయని మరఁగొంకుచు నీరితి గొంతసేపా పైదలిసేయు కృత్యముల సైతము గుర్తెరుంగక చింతింపుచుంటిని. తరువాత చెప్పునదేమి గలదు.

శ్లో॥ సంసారేపటలాంత తోయచపలే సారంయదేకః పరం
     తస్యాయంచపునస్సమస్తవిషయగ్రామః ప్రపంచోమతః
     యత్సౌఖ్యం పరతత్వవేదన మహానందోపమం మందధీః
     కోవావిందతి సూక్ష్మమన్మథకళావైచిత్ర్యమూఢోజనః॥

ఇంటిమీదబడు జలమువలెనే చంచలమగు సంసారంబున నింద్రియములే ప్రపంచకమననొప్పు. కామసౌఖ్యము మిగుల సారవంతమైనదియు బ్రహ్మానందతుల్యమైనదియు నట్టిదానిని మన్మథరహస్యవేత్త కానివా డేమి తెలిసికొనగలడని పూర్వ మొకపండితుడు వ్రాసెను. వానిమాట యదార్థమయినది. అంత నుదయంబున మేము లేచునప్పటికి మించిపోయినటుల మా గురువుగారింటికి వచ్చిరి. ఆయన నను జూచినతోడనే నాహృదయము ఝల్లుమనినది. ఆయనయు నన్ను జూచి రాత్రి యింటియొద్ద నెవ్వరుండిరి. బదిలముగా బండుకొనిరా. నీకన్నులంత యెఱ్ఱగా నున్నవేమి రాత్రి యెక్కువ సేపు మేల్కొనియుంటివా యేమి? యని యడిగిన నేనును నించుక గొంకుచు నిట్లంటిని. అయ్యా! మీరు గ్రామాంతర మరుగుటచే విద్యార్థులందరు తలయొకపనికిం బోయిరి. మీరాక విని నేడే రాగలరు. ఇంటియొద్ద భద్రముగానే పండుకొంటిమి. రాత్రి పాఠచింతన తడవుదనుక జేయుచుంటిని. ఇదియునుంకాక మీరు లేకపోవుటచే మీ భారమంతయు నామీద బడుటచే నిల్లుగాయుటకై మేలుకొంటిని. దానం జేసి నాకన్ను లెర్రగా నున్నవని పలికితిని. నాయందు మిగులనమ్మకము గలదు కావున నాయన మాయొంటిపాటును గురించి యంత విచారింపడయ్యెను. మనము తఱిదొరకినప్పుడుగాక మఱి ఎప్పుడును నవ్వుచు మాట్లాడగూడదు, చూడగూడదు, చేరగూడదు. గూఢముగా నుండవలయునని నేను మొదటనే యమ్మదవతితో జెప్పియుంటిని గాని యామాట లేమియు నిలిచినవికావు.

అమ్ముద్దియ ఎద్దియో యొకమిషమీద నాయొద్దకు వచ్చుచు నన్ను బల్క రింపుచు నవ్వుచు సాభిప్రాయముగా జూచుచు నింటిలో నేపనిచేయుచున్నను నాయందే బుద్ధినిల్పికొని యీరీతిని కొన్ని దినములు గడిపినది. మరికొన్ని దినములు సిగ్గువిడిచి ఎవ్వ రేమన్నను సరేయని పలుమారు నేను బోధించుచున్నను వినక నెల్లరకు దెల్లమగు నటుల నాతో సంభాషింపదొడగినది. నేనును దానికి బోధించుటయే కాని మన్మథవికారములకు బెక్కింటికి బాత్రుడనైతిని. ఆహా !

శ్లో॥ సప్రత్యచాయదుర్లభ నిషేధవిషయోషియోషితాంవిషయః
     కామస్యభావపాతః ప్రసరతితత్రైవదుర్నివారః॥

శ్లో॥ ప్రభవతిమనసివినేకొ విదుషామపిశాస్త్ర సంభవస్త్సావత్
     నివతంతి దృష్టివిశిఖా యావన్నేందీనరాక్షిణాం॥

అను శ్లోకముల బఠించుచు వానింజెప్పిన వారిని బొగడుచు వివేక మింతైనను లేక స్మరపిశాచగ్రస్తుండనై యుక్తాయుక్తముల నెఱుంగక సంచరింపదొడంగితిని. చోరత్వము జరిగిన యారుమాసములకును, జారత్వమిక నారుమాసములకు జరుగుననునప్పుడే వెల్లడియౌనను వాడుకగలదుగదా? మాచర్యలు మరునాటి నుండియు నిరుగుపొరుగువారు చెప్పుకొనదొడంగిరి. కాని యది మేమెఱుగక గూఢముగానే యున్నదని తలంచుచుంటిమి మరికొన్ని దినములు జరిగిన వెనుక తుదకు మా ఎదుటనే పరిహాసము చేయదొడంగిరి. ఒకనాడు నా స్నేహితుడొకడు రహస్యముగా నన్ను బిలిచి మదనా నీనడత ఏమియు లెస్సగా నుండలేదు. నిన్ను ప్రజలు మిక్కిలి నిందించుచున్నారు. నీవు పండితుడవయ్యు నిట్టికొరమాలిన పలుకులకు దొడంగరాదు. పరకాంతాభిలాషయే దూష్యము. గురుకాంతతో రాత్రింబగళ్ళు నీ విట్లు లోకోపవాదమునకు వెఱువక వర్తింప నేమనగలవారము. మీ కేమియుం దెలియకున్నది. మీచిత్తజవికారము లరయ బరిహాసాస్పదములైయున్నవి. కొంచెము కాలములోనే మన గురువుగారికి గూడ తెలియునట్లు తోచుచున్నది. నీ వీలోపల నింటికి బోయిన బాగుగనుండునని నాకు దోచుచున్నది నీకు బ్రాణమిత్రుండ గావున నింతజెప్పితిని. పిమ్మట నీయిష్టమని మందలించెను.

పైత్యరోగము గలవాని నాలుకకు పంచదార సైతము చేదుగా నుండునట్లు మదనవికారమత్తుండనగు నాకు వాని నీతివాక్యము లేమియుం జెవులకెక్కి నవికావు. అంత నొక్కనాడు మా గురువుగారెద్దియో పనిబన్ని మరల నూరికి బోయెదననిచెప్పి విద్యార్థుల నెవ్వరిని వెంటదీసికొనిపోక తానొక్కరుండే పయనమైపోయెను. అప్పుడు సురుచియునట్టి అవసరము పెక్కుకాలమునకు దొరికినదని మిగుల సంతసించుచు మనంబున కోరికె లువ్విళ్ళూరుచుండ సాయంకాలమగుటకు వేచియుండెను. విదార్ధులు మరికొందరుగూడ నుండిరి. గనుక పగలేమియు మాటాడుటకు వీలు చిక్కినదికాదు. ఆ దినమున సూర్యుని గుఱ్ఱముల పాదములు విరిగిపోయినని కాబోలు నెప్పటికిని ప్రొద్దు కుంకినదిగాదు.

అంత దివసాంతమగుటయు నా కాంత వింతగా అలంకరించుకొని స్వాంతంబున కంతుసంతాప మెంతేని వేధింప నెట్లో భోజనాదిక్రియలు నిర్వర్తించి విద్యార్థులందరు సరస్వతీనిలయమునకు బోయిరోలేదో అంతలోనే తాను శయనగృహమునకు బోయి నారాకకై వేచుచుండెను. నేనును దోడివారిని దాటించుకొని యా గదిలో జేరితిని. ఆపైన నేమి జరిగెనో నేను జెప్పలేను.

రాజా! మఱి జెప్పవలసిన దేమున్నది? మేమిరువురము స్మరానందసాగరమగ్నులమై యొడలెరుంగక మేనులుపెనివైచుకొని మంచముపై బండుకొనియున్న సమయంబున మాగురువుగారు తటాలున తలుపు తెరచుకొని లోపలకువచ్చిరి. విద్యార్ధు లుండుమందిరము దూరముగా నున్నది. ఇతరు లీలోపలకు వచ్చువాడుకలేదు. కావున మేము తలుపు బిగించుకొనకయే పండుకొంటిమి. దానంజేసి యతఁడు నిరాటంకముగా మేమున్న గదిలోనికి వచ్చెను. ఆయన మాచర్యల గ్రహించి మ్ముబట్టుకొనుతాత్పర్యముననే యట్లూరికిబోయెదనని చెప్పి యెచ్చటనో డాగి అప్పుడు వచ్చినట్లు తర్వాత నూహించితిమి.

అట్టి యవస్థలో నాయననుజూచినప్పుడు మాహృదయము లెట్లుండునో నీవే యూహింపుము. తలలు శరీరమునుండి వేరై పోవుచున్నట్ల తలంచి యేమియుం బలుకనేరక కొంతసేపు మ్రాన్పడియుండి యెట్టకే నామంచము దిగి సిగ్గుచేత తలలువాల్చి కొని నిలుచుంటిమి. అప్పుడా బ్రాహ్మణుడు దూర్వాసునివలె మండిపడి కన్ను లెర్ర జేసి దంతములు పటపట గొరుకుచు గటములదర నుత్కటకముగా మమ్ముదూరెను. గాని అవియేమియు భయకంపితులమైనమాకు వినంబడినవికావు.

ఆడుదానిసాహస మెట్టిదో చూడుము. వీరభద్రునివలె నహంకార మావేశించి తిట్టుచున్న యావిప్రుని పాదములం బడి యప్పడతి నాథా! ఈ తప్పు నాదిగాని మదనునిది కాదు. నాదుర్బోధచేతనే యాతం డిందులకు సమ్మతించెను. వానికిజేయుశిక్ష నాకు విధింపుము. ఆడుపుట్టుకయే తప్పుగలది. అట్టివారు తప్పుచేసినప్పుడు మగవాండ్రు సైరింపకున్న నే నేమి సేయనగును. గురుడంతవాడు తనచేడియం బాడిదప్పినదని నిరసింపక దేవతలసన్నిధి స్వీకరింపలేదా? సకలశాస్త్రజ్ఞులైన మీ రెఱుంగనిది గలదే? స్త్రీస్వభావమును గురించి కవిశిఖామణియగు కొక్కోకుడు వ్రాసినది జ్ఞాపకము దెచ్చుకొనుడు.

శ్లో॥ ఉజ్వలవపుషంపురుషంకాయమతే స్త్రీవరోపితాం దృష్ట్వా
     అనయోరేషవిశేషస్త్రీకాంక్షతి ధర్మనరపేక్షా॥
     భృశమసురాగఃపత్యావపత్య వాత్సల్యమతివయస్స్త్వంచ
     వ్యతికరనిర్వేదిత్వం ధర్మాపేక్షావ్యస్తి నకస్యాశ్చిత్॥

ఈ శ్లోకములు నేను జెప్పినవికావుగదా? లోకస్వభావమును మానిపింప నెవ్వనిశక్యము. రక్షింపుడని పెక్కుతెరంగుల బ్రార్ధించినది.

నేయిబోసిన యగ్నివలె దానిమాటలచే నతండు మఱియు మండిపడుచు సురుచిని విరూపగా శపించి నన్ను జురచురంజూచి యోరీమూర్ఖా! నీవు విద్యలచే నాకు సమానుండవయ్యుమ వివేకమింతైనం దలంపక నిట్టి ఘోరకృత్యమునకు బూనుకొంటివి. కానిమ్ము నీవు విద్యలన్నియు మరపుజెంద బూర్వపుస్మృతి యించుకయు లేక వెర్రివాడవయి చరింపు మీపాటి ప్రాయశ్చిత్తము నీకు జాలునని నన్ను శపించి యరుగనున్న సమయంబున నేనును బాదంబులంబడి యార్యా! కడుశ్రమపడి చదివితిని. ప్రమాదవశంబున భ్రష్టుండనైతిని. నాగుణము మీరెఱుంగనిదియా? నన్ను గటాక్షించి శాపాంతము గూడ ననుగ్రహింపుడని వేడుకొనగా గరుణాహృదయుండగు నాభూసురుం డోరీ! నీవు మరణప్రాయమైన యిడుములం గుడిచినప్పుడు నీకు మరల నీవిద్యలన్నియు జ్ఞాపకము వచ్చును. నీ పూర్వపుణ్యము మంచిది పో పొమ్ము. బ్రతికి పోతివని పలికి అతండెందేని పోయెను. అప్పుడు నేను పశ్చాత్తాపతప్తచిత్తుండనై అదియు నొక ప్రారబ్ధముగా దలంచి విచారింపక ధైర్యముతో నన్నా శాపవైకల్య మాశ్రయించులోపున గాశికి బ్రయాణమై కతిపయదినములకు గాశింజేరితిని.

అందు ప్రవేశించిన కొన్ని దినములకు విశాలాక్షిం బెండ్లియాడితిని. ఆ తర్వాత వృత్తాంతము మీ రెఱింగినదేకదా? అట్టి విశాలాక్షి నీపాటి తెలివితో వీక్షించు భాగ్యము లేకపోయినది. అన్నన్నా ఇప్పుడు నన్ను జూచి యెంతసంతసించునో? ఆ చిన్నదాని చర్యలం దలంచుకొన గన్నులనుండి అశ్రువులు ప్రవాహముగా వెడలుచున్నవి. నేను తిన్నగా మాటాడునంత గోటిదీనారములు దొరికినట్లు సంతసించునది. నానిమిత్తము ప్రాణములు పోగొట్టుకొనదలంచిన యా మహాపతివ్రత యెట్లున్నదియో గదా? నేను వెర్రివాడనని యించుకయు నామాట నిరసించునదిగాదు. రాజా యేమి చెప్పుదును. అట్టి కాంత నిక యీజన్మమునం జూడనని తోచుచున్నది. గుర్రమునుండి నేలబడినంత నాకు శాపాంతమైనది. అప్పుడే సింహమును జంపితిని. నాపరాక్రమము సంగతి మొదట నీతో జెప్పుట మఱచితిని. నేను బాల్యమునుండియు శస్త్రవిద్యయందును బరిశ్రమ చేయుచుంటిని. దానంబట్టియే యక్కేసరి నవలీలం బరిమార్చితిని. పిమ్మట నా విశాలాక్షిని వెదకుచు బెక్కుదేశములకుబోయి తుద కీయూరు చేరితిని. ఈగ్రామమున నిట్టిఘోరకృత్యములు జరుగుచున్నవని తెలిసికొనలేకపోయితిని.

సాయంకాలమున కిందుజేరిన నొకయిల్లాలు దారికడ్డము వచ్చి మర్యాదగా దనయింటికి భోజనమునకు దీసికొనిపోయినది. ఆ రాత్రి వారియింట నాకు జేసిన విందు అల్లునకైనం జేయరని చెప్పగలను. దాచనేల నాయింటిలో నొకసుందరి నేను శయ్యాగతుండనై యున్న సమయంబున జక్కగా నలంకరించుకొని నాయొద్దకు వచ్చి నది. మొదట నమ్మదవతి యుపచారములు సేయుదానివలె నటించి క్రమంబున దన చతురవిలోకన సంభాషణాది విలాసములచేత నామనం బనంగాయత్తంబు గావించినది.

అప్పుడు సురుచి సంగమముమాట జ్ఞాపకమువచ్చిన బుద్ధితెచ్చుకొని వస్తునిరూపణ చేయుచుండ నీశ్లోకము స్మరణకు వచ్చినది.

శ్లో॥ కాంతేత్యుత్పలలోచనేతి విపులశ్రోణీభరేత్యున్నమ
     త్పీనోత్తుంగపయోధరేతి సుముఖాంభోజేతి సుభ్రూరిని
     దృష్ట్యామాద్యతిమోదతేభిరమతెప్రస్తౌతి విద్యానపి
     ప్రత్యక్షాశుచిభస్త్రికాంస్త్రియమహోకామస్యదుశ్చేష్టితం

క్రొత్తవాడనని యించుకయు గొంకులేక పెక్కుపోకలం బోవునమ్మత్తకాశిని తత్తరమువారించుచు నించుబోడి మేమింద్రియంబుల జయించినవారము నీవిలాసములు మాకుల్లాసము గావింపనేరవు. నీవిందుండిన లాభమేమియులేదు. పోపొమ్ము. మీమగవారు జూచిన మోసమువచ్చును ఉత్తమస్త్రీలకిది ధర్మముకాదని మందలించిన జలించిన డెందముతో నమ్మందయాన మందయానమున దానువచ్చిన త్రోవంబోయినది పిమ్మట నేను శయ్యయందు బరుండి యుదయంబునలేచి చూచువరకు బాదములకు సంకెళులు దగిలించి యొక బందీగృహంబున బద్దుడనై యుంటిని. నాయవస్థ యంతయు నీవుసైత మనుభవించినదే. మఱియు జెప్పనేల. నేటిప్రొద్దున నేమిటికో యీ పాతాళగృహంబునకుదెచ్చిరి. ఇందు మీదర్శనలాభము కలిగినది ఆపదలయందును శుభములు గలుగునని చెప్పిన పెద్దలమాటలు యదార్ధములని నమ్మవచ్చును. మిమ్ము జూచుటచే నాపడిన యిడుములన్నియు మఱచితిని. ధన్యుడనైతిని. ఇదియే నావృత్తాంతమని పలుకుచు నత డూరకుండెను.

అతని వృత్తాంతమంతయును విని యీ యింద్రద్యుమ్నుడు మిగుల వెఱగుపడుచు నతనిం గౌగలించుకొని యోహో! మిత్రమా ! విశాలాక్షి యిప్పుడు నిన్ను జూచిన నెంతసంతోషించునో గదా! ఆపూబోడికి నీవు తగినవాడవగుదువు. దానంజేసియే నీపెండ్లియైనపిమ్మట చింతించుచున్న యాచిన్నదాని స్వప్నములో నీవు చింతింపకుము. నీకు మేలయ్యెడినని యమ్మవారు చెప్పినది. అద్దేవిపలుకు పోలి బోవునా? ఈయిడుములు సైతముదాటి యాబోటితో గలిసికొనగలవని నాకు దోచుచున్నది. ఇప్పటికి దీనిని దాటుపాటవమెద్దియుం దోచకున్నది. కానిమ్ము. ఈయిక్కట్టు తెచ్చిపెట్టిన దైవమే దీనిని మరలించును. నా ప్రతిన నెరవేర మీయిరుపు రెన్నడు గలిసికొందురో యని పలుకుచు నతనిశోకమును శాంతిపఱచుచున్న సమయంబున వారిమాటలన్నియు వినుచున్న యొకపురుషుడు వినమ్రుడై యారాజున కిట్లనియె.

దేవా! నేను దేవరదాసుడను వీరుడనువాడ, మీ సంవాదమునంతయు విని యుంటిని. మిమ్ము నాయేలికయైన యింద్రద్యుమ్నునిగా దెలిసికొంటిని. మీవంటివా రిట్టి కట్టునం బడియుండుట లోకం బిట్టటగుటకని తోచుచున్నది. అగ్ని నొడిగట్టిన యట్లు మిమ్మెరుగక చెరబెట్టిరి గదా మఱియు దేవరకు గోరుచుట్టుపై రోకటిపోటునాటి నట్టి యార్తిపై దారుణంబగు నొకవార్త నెరింగించుచున్నవాడ వినుండు.

అల్లనా డడవిలో సింగపురొదవిని భయపడి చిత్రసేన సేనలంగూర్చుకొని తమయానతిలేకయే పురంబునకు బోవుచుండ నడుమదారిలో శబరసైన్యమెదురుపడి మనసైన్యమునంతయు బారదోలెను. మనభటులందరు బ్రాణభీతిచే దలయొకదారిని బారిపోయిరి. ఒక్కరితయే దిక్కుమాలియున్న యక్కలికిమిన్నను బల్లకీతోడనే వశము చేసికొని యక్కిరాతులు పోవుచుండ నేనదిజూచి యోర్వజాలక యొక్కరుండ నేమి సేయునని యించుక శంకింపక విడువుడు విడువుడు అని కేకలు వేయుచు వారివెంట బడితిని.

అప్పుడు నన్ను వాండ్రుపట్టుకొని రెక్కలుగట్టి యెచ్చటికో దీసికొని పోయిరి. కొన్నిదినములు నన్నెచ్చటనో దాచిదాచి తుద కీయూ రొకనాడు దీసికొనివచ్చి నన్నొకగృహస్తునికి విక్రయించిరి. ఆతఁడును నాకన్నము పెట్టుచు స్వేచ్చగా మాత్రము తిరుగనీయక నొక బందీగృహముననుంచి నిన్నటిదినమున నిచ్చటికి దీసికొనివచ్చెను. కారణమేమియో నాకు దెలియదు. దేవిగారినిసైత మీయూరే తీసికొనివచ్చినట్లు వాండ్ర మాటలవలన నూహించితిని. ఎచ్చటనున్నదియో నాకు దెలియదు. ఇంతపట్టు నా యెరింగినదని యాదూత చెప్పెను.

అప్పుడమ్మహారాజు మూర్ఛమునింగి నేలబడి యొక్కింతకు దెప్పిరిలి అయ్యో? నా ప్రేయసి యింటికి బోయి సుఖంబున్నదని యెంతయు సంతసించుచున్నవాడ అచ్చేడియయు నావలెనేయాతనము జెందుచున్నయది. కటకటా! కిరాతు లానాతి నెంతకష్టపెట్టిరో యిప్పుడెచ్చటనున్నదియో నాకైయెంత పరితపించుచండెనో అన్నన్నా పాపపువేటకారణంబునగదా యిన్ని యాపదలు తటస్థించినవి. దుర్నిమిత్తంబు లప్పుడే పొడగట్టినవి. శంకించుకొనియు మానితినిగాను. నాభాగధేయం బిట్లుండ మంచిబుద్ధి యేల పుట్టును? ఇప్పుడు చింతించుటకంటె కొంచపుపనిలేదు. లోకంబంతయు దైవాయత్తంబై యున్నది. గదా యతని యానతిలేక నేపనియు జరుగదు. తదనుగ్రహము గలిగెనేని ఇన్ని యాపదలు తృటిలో బాయగలవని ధైర్యము దెచ్చుకొని భక్తి పూర్వకముగా బరమేశ్వరుని ధ్యానించుచుండెను.

అప్పటి కర్ధరాత్రమైనది. అందరు నిద్రించుచున్నవారని తలంచి యందు గావలియున్న కళింగుడు పుళిందుడు ననువారలిట్లు సంభాషించుకొనిరి.

పుళిందుడు - కళింగా! యిటురమ్ము గ్రామవిశేషము లేమి? నీబావమరది పురసంరక్షకులలో నొక్కడగుటచే నీకు స్పష్టముగా దెలియును గదా. ఇచ్చటి వారందరు గాఢముగా నిద్రబోవుచున్న వారులే, మన మాటలను వినరు రహస్యములను జెప్పుకొనవచ్చును.

కళింగుడు — అన్న! పుళిందా! ఈ జీవచ్ఛవములు మేలుకొని మాత్ర మేమి చేయగలరు? మాబావమరిది చెప్పిన విశేషములు గొన్నిగలవు వానిని జెప్పెద వినుము.

పుళిందుడు — ఏలాగునైనను కొంచెము మెల్లగా జెప్పుము. గోడకు జెవు లుండునను సామెతగలదు.

కళింగుడు - మఱేమియు భయములేదు. విను. నేటియుదయమున బురమంతయు రాజభటులు పరీక్షింపగా నెవ్వరియింటిలో నేమియు దొరకలేదు. కృష్ణదాసు మందిరమునందు మాత్ర మొక పుస్తకము దొరికినదట.

పుళిందుడు — కృష్ణదాసుడు రాజశాసనము వినలేదా ఏమి? మంత్రశాస్త్ర పుస్తకములన్నియు లాగికొని యట్టివి దాచినచో శిక్షింతుమని రాజుగారు చాటింపలేదా; ఆ పుస్తకమచ్చట నేమిటికుంచవలయును ?

కళింగుడు — అది మంత్రశాస్త్ర పుస్తకము కాదు. దేవభాషతో నేమియో వ్రాసియున్నది ఆ లిపి యిచ్చటివారి కెవ్వరికి దెలియదట

పుళిందుడు -- అట్టిపుస్తకమచ్చటి కెట్లువచ్చినది ?

కళింగుడు — అదియేమో యెవ్వరికి దెలియదు. (చెవులో) కృష్ణదాసు చర్యలు మనకు క్రొత్తవాయేమి భోజనమునకు పిలిచి యేపండితుని జెరపెట్టెనో. వాని పెండ్లాముగూడ మిగులజాణ బాటసారులను మాటలచేతనే మోహముపెట్టి యింటికి రప్పించును.

పుళిందుడు - తర్వాత నేమిజరిగినది?

కళింగుడు - ఆపుస్తకము దీసికొనిపోయి రాజునెదుట బెట్టిరట. పిమ్మట నేమిజరిగినది నాకు దెలియదు, అందులకు గృష్ణదాసుడు కొంచెము వెరచుచున్న వాడని వాడుకగా నున్నది.

పుళిందుడు - కృష్ణదాసు కడుమొండిలే! ఇట్టివానికి జడియడు. అయినను గట్టిగాబట్టి యీపుస్తక మెచ్చటిది చెప్పుమని రాజుగారడిగిననేమి చెప్పునో!

కళింగుడు — ఎద్దియోచెప్పి దాటిపోవగలడు.

పుళిందుడు — రేపటిదినమున మరల వీరినందరను బూర్వపు స్థలములలో జేరుతురా? ఇంకను నిందేయుంతురా?

కళింగుడు -- ఇంకేమి పనియున్నది? యిళ్ళన్నియు బరీక్షించిరిగదా? రేపు రాత్రి మరల వీరిని దీసికొనిపోవుటయే పని.

పుళిందుడు – పుస్తకమునుగురించి కృష్ణదాసుడు శంకించుచు దన బలిపురుషుని దీసికొనిపోక ఇంకను గొన్ని దినము లుంచునేమో!

కళింగుడు — ఎల్లుండి మధ్యాహ్నము కృష్ణదాసుగారి యింటిలో దేవీపూజ జరుగును. అప్పుడు దేవికి బలియియ్యవలయును. దాచి ఏమిచేయును? పుళిందుడు — అవును, రే పమావాస్యయే కాదా! కలశస్థాపనము ఎల్లుండియే! మరచితిని. తప్పక రేపే వీరిని దీసికొనిపోదగినదే.

కళింగుడు - అయినను మనకు మరల జాబు రాకమానదు.

పుళిందుడు — ఎట్లైన నీయేడు రాజుగారు కడుదీక్షగా బరీక్షించుచున్నారు. వెల్లడి కాకమానదు.

కళింగుడు — ఏమో తెలియదు. ప్రొద్దుపోయినది యికనిద్రబోవుదుము అని వారిరువురు నిద్రబోయిరి.

ఆ మాటలన్నియు నింద్రద్యుమ్నుని చెవినిబడినవి. పుస్తకమును గూర్చి సంభాషించిరి గావున నది తనదేయనియు నా కృష్ణదాసు తన్ను బట్టినవాడేయనియు నెల్లుండి దప్పక తనకు మరణము విధియైయున్నదనియు నిశ్చయించి యింద్రద్యుమ్నుడు ధైర్యము విడువక యోగం బవలంబించి

చ॥ జలదములోని క్రొమ్మెరుగు చాయలు భోగపరంపరల్, మహా
      నిలపరిఘట్టితా జ్ఞతళనీరతుగా జీవితంబు చం
      చల తరముల్ వయోభిమత సౌఖ్యసునీగతి నాకలించి స
      భ్యులు పరమాత్మ యోగమున బుద్ధిఘటింపగ జేయుటొప్పగున్.

అని వైరాగ్యాయత్తచిత్తుండై భగవదారాధనము జేయుచుండెను.

అంత మరునాటి యర్దరాత్రంబున వారినెల్ల దొంటినెలవులకు జేర్చిరి. ఇంద్రద్యుమ్నుని గృష్ణదాసు తనయింటికి దీసికొనిపోయి వెనుకటి గదిలోనేకట్టి పెట్టించెను. మరునాడుదయంబున నవరాత్రి ప్రారంభము. అతడు మొదటి దివసమునందే యమ్మవారికి బలియిచ్చువాడుక వున్నది. కనుక నాడు ఇంద్రద్యుమ్నునికి దలయంటి మేన మంతయు బసుపు బూసిరి. మెడకు వేపరొట్ట గట్టిరి. మంచిమంచి యలంకారము లుంచిరి. అదియేమియు నమ్మహాపురుషుడెరుగడు. బాహ్యప్రచారము ఏమియు లేదు. ఆయింటిలోనే యొకగదిలో భయంకరరూపముగానున్న మహాకాళి కెదురుగా నొక స్తంభము పాతి బంగారుగొలుసులతో నతని నందు గట్టిపెట్టిరి. డమ్మహాశక్తి కెదురుగా నిలబడి తన దేహమూరకపోక కాళికకు వినియోగ మగుచున్నందులకు మిగుల సంతసించుచు విశాలాక్షిని మగనితో గూర్పుమని దేవిని బ్రార్థించుచు సర్వసంగములు విడిచి మనం బీశ్వరాయత్తంబు గావించి తనమెడకు కత్తివ్రేటునకు వాటముగా నుండు నట్లు వాల్చి మరణసమయ మాకాంక్షించి యుండెను.

వానిధైర్యమునకు నర్చకులందరు వెరగుపడిరి. కాళియు గజగజ వణకజొచ్చినది. అర్చకులు పుష్పపూజావసానమున ధూపమును దీపమునుం దీర్చి మహానైవేద్య సమయమైనది. ఇక బలి యియ్యవచ్చును. వ్రేయుడని పలుకుచున్న సమయములో గృష్ణదాసు వీధి తలుపులు తీయుడని యరచుచు నెవ్వరో వీధిలో సందడిచేయు చున్నట్లు వినంబడినది. అదివిని కృష్ణదాసు తటాలునబోయి తలుపుల దెరపించెను. వీధిలోగొందరు పరిచారకులతో రాజుగారి గుఱ్ఱమెక్కి పౌరులు చుట్టును బరివేష్టింప నెద్దియో పుస్తకము చేతంబూని నిలువబడియుండిరి.

కృష్ణదాసు తలుపుతెరచినతోడనే రాజుగారు గుఱ్ఱమును దిగి లోనికిబోయిరి. కృష్ణదాసు మిగుల భయపడుచు నోహో! నాగుట్టెవ్వరో తెలియపరచిరి. పరీక్షించుటకై వీరువచ్చిరి. ఇప్పుడు తలుపులుతీసి మోసపోయితినని పశ్చాత్తాపముజెందుచు నప్పుడేమియు జేయునదిలేక జేతులుజోడించి రాజుగారి యెదుట నిలువబడియుండెను

రాజు - కృష్ణదాసనువా డెవ్వడు ?

కృ - చిత్తము మహాప్రభూ ! నేనండి.

రాజు - ఈయిల్లు నీదేకాదా ?

కృ - చిత్తము. చితము. నాదేనండి.

రాజు - నీయింటిలో నీపుస్తకము దొరికినట్లు మాభటులు చెప్పుచున్నవారు నిజమేనా?

కృ – చిత్తము నేనాసమయమం దింటిలోలేను. కావున నాకు నిజము తెలియదు.

రా - నీ వింటిలోనున్నట్టు వారుచెప్పిరే? నీవబద్ధమాడుచుంటివేమి ?

కృ – చిత్తము మొదటలేను తర్వాత వచ్చితిని.

రా - ఓహో! ఎప్పుడు వచ్చిననేమి? ఈ పుస్తకము మీయింటిలో దొరికినదా లేదా? చెప్పుమని యడిగిన నెద్దియో చదివెదవేమిటికి ?

కృ – చిత్తము. చిత్తము. నాయింటిలోనే దొరికినది.

రా - ఇది నీయింటికెట్లు వచ్చినది?

కృ - (కొంచెము సేపాలోచించి) దేవా ! యొకనాడు మాయింటికొక బాటసారివచ్చి భోజనముచేసి దీని నిందు వదలి వెళ్ళిపోయెను. నాటినుండియు నిది మాద్వారము మీదనే యున్నది కాబోలు. మేము సైతము చూడలేదు. మొన్న మాకింకరులు దీనిని దీసికొనిపోయిరి. ఇదియె యదార్ధము.

రా - ఆవచ్చినవా డెందుబోయెనో యెయంగుదువా?

కృ– నాకు దెలియదు.

రా -- నీ మాటలు విన శంకాస్పదములుగా నున్నవి నీయిల్లు బరీక్షింపవలసి యున్నది. నీవేమి చెప్పెదవు ?

కృ – తమరు నాకు గ్రొత్తవారా ? మాయిల్లు జక్కగా బరీక్షింపవచ్చును. ఇప్పుడు పూజాసమయము కొంతసేపుండి మరలరండు.

రా - మీపూజ మేము చూడగూడదా ఏమి ?

కృ – మా నియమ మట్టిది. అని యిట్లు కృష్ణదాసు పలికిన విని యనుమానముపడి యారాజు తక్షణమే యతని యిల్లు బరీక్షింపుడని భటుల కాజ్ఞాపించెను.

అప్పుడు కృష్ణదాసు భయపడుచు లోనికిబోవ బ్రయత్నించెను. రాజభటులు కదలనిచ్చిరికారు. తర్వాత రాజుగారు భటులతోగూడ నాలోనికిబోయి నలుమూలలు వెదకించిరి. అంతకు పూర్వమే యాయలజడివిని యర్చకులందరు తలయొకదారిని బారిపోయిరి. అందున్న యింద్రద్యుమ్ను డొక్కరుండు మాత్రము యూపంబుననున్న యజ్ఞపశువువలె స్తంభమున గట్టంబడి యొడలెరుంగక శక్తి కభిముఖముగా నిలువంబడి యుండెను. అట్టివానినిజూచి యారాజు శంకించుచు నీతండెవ్వడు? ఇట్లు గట్టబడియుండుటకు గారణమేమి? అని అడుగగా నొక్కరుండును మాటాడలేదు. పిమ్మట నతని మెడనున్న గొలుసుల విప్పించి నీ వెవ్వండవని యడిగెంచెను. ఆతడు గన్నులు దెరవకయే నేనిప్పుడు పరమాత్మను. వేగమశిరము నరుకుడని యుత్తరము చెప్పెను. ఆమాటలువిని యాపుడమిఱేడు పరితపించుచు నోహో! వీనిని బలియిచ్చుటకు నిచ్చట గట్టిరి. దాననే వీని నిట్లు పసుపుకుంకుమము మొదలగువస్తువులచే నలంకరించిరి అన్నన్నా! యొకనిమిషము దాటిన నిష్కారణము వీడు చచ్చిమేవునుగదా? కృష్ణదాసు నిటు రప్పింపుడని దూతలంబంపుటయు నదివరకే సగముచచ్చియున్న అతం డామాట విని వెరచుచు నెట్టకే యక్కడికి వచ్చెను.

ఆ రాజు కృష్ణదాసుని జూచి యోరీ! ఈతనినిట్లు స్తంభమునం గట్టించితివేమి? ఇతడెవ్వడు? నిజము చెప్పుము లేకున్న నిన్నిప్పుడు చిత్రవధ సేయంబత్తు ననుటయు నతండు గడగడ వడంకుచు మహారాజా! మేము వీనిని జంపుట కిందు గట్టలేదు. అమ్మవారి ప్రీతికై యిట్లు గట్టితిమి పిమ్మట విడిచివేయుదుము. ఇది మా కులచారమైయున్నది. ఈ విషయము మీదు పౌరుల నడిగి దెలిసికొనుడని నిర్భయముగా బొంకెను. ఆ రాజు వాని మాటలు విని కినియుచు ఓహో! మీ యాచార మంతయు వినియే యిచ్చటికి వచ్చితిని. మరల బౌరుల నడుగవలసిన యగత్యములేదు.

ఈ యూరివారెల్ల నిట్లే చేయుచుండిరి. కానిండు నేను మునుపటి రాజుగాను. వీని చేతనే యదార్ధమంతయుం జెప్పించెద జూడుమని పలుకుచు నింద్రద్యుమ్నునిం గట్టిన గొలుసులు విప్పించి వానిచే నా కృష్ణదాసుని గట్టించి యింద్రద్యుమ్నున కిట్లనియె. అయ్యా! మీ యాపద తొలగిపోయినది. నేనీ పట్టణపు రాజును. నా పేరు సింహకేతుడు. వీరి చర్యల విని పట్టుకొనుటకై యిచ్చటికి వచ్చితిని. మీరెవ్వరు? మీ పేరేమి? ఇట్లేల కట్టబడితిరి! మీవృత్తాంత మంతయుం జెప్పుడని యడిగెను. ఆ మాటలు విని యింద్రద్యుమ్నుడు. మనం బెట్టకే బాహ్యప్రచారమునకు జొనిపి మెల్లన గనులు దెరచి యెదురనున్న అతిని రేనిగా దెలిసికొని నమస్కరించుచు నిట్లనియె. అనఘా! నన్ను దేవలోకము నుండి మరల నీ లోకమునకు దెచ్చితివి. ప్రాణదానసుకృతము నీకు దక్కినది. మీవంటివారు పాలించుచుండ నీ గ్రామమున నిట్టి క్రూరకృత్యములు జరుగుట వింతగా నున్నది. ప్రజల యిడుమల నరయని రాజు నిరయమును బొందునని చెప్పుదురు. నా వృత్తాంతము వినుండు. నేనింద్ర ద్యుమ్ను డనువాడను. దైవవశమున వీరికి జిక్కి బలిపురుషుడ నైతినని తాను వేటకు బయలుదేరినది మొదలు నాటి దనుక జరిగిన వృత్తాంత మామూలచూడముగా వక్కాణించెను.

ఆ వృత్తాంతమంతయును విని యా భూకాంతుడు సంతోషభయసంభ్రమశోకంబులు చిత్తంబులబెట్ట నురముపై గరం బిడుకొని కటకటా! ఈ గ్రామవాసు లెంత క్రూరులు! వీరినందర నేకముగా జంపించినను దోషము లేదుగదా! మార్గస్థుల నందర నీరీతిని వేధించుచున్నారు గాబోలు. తెలిసికొనలేకబోయితినే. కానిమ్ము దైవకృపచే నిప్పటికైనం బట్టుకొంటినని సంతసించుచు కృష్ణదాసుని జూచి యోరీ ! తులువా ! ఇక నీవేమి చెప్పెదవురా? నిన్ను గత్తులబోనులో ద్రోయింతును చూడుమని పండ్లు పటపట గొరుకుచు నా క్షణమె గ్రామములో నన్నియిండ్లును బరీక్షించి యచ్చట నున్నవారినందర దనయొద్దకు దీసికొనిరండని యమకింకరులంబోలు కింకరుల కానతిచ్చి యింద్రద్యుమ్నుని వెంటబెట్టుకొని తనకోటలోనికి బోయెను. రాజభటులు తదానతి బటురయంబున బోయి ప్రతిమందిరమును వెదకి యందున్న బలిపురుషుల గనుగొనుచు వారికి వైచిన సంకెళులు విప్పి యా యింటి యజమానుని బంధించుచు గ్రమంబున నీరీతి అందరం బట్టుకొని సాయంకాలమునకు రాజుగారి యాస్థానమునకు దీసికొనివచ్చిరి.

ఆ భూపతి వారి వారివృత్తాంతములన్నియు విని పౌరులు గావించిన క్రూరాచారములకు మిక్కిలి సంతసించుచు నయ్యపరాధులకెల్ల దగినశిక్ష విధించి బలిపురుషులనెల్ల నాదరింపుచు గానుకలతో గూడ వారి వారి దేశముల కనిపెను. వారిలో నున్న యింద్రద్యుమ్నుని భార్య చిత్రసేనను మదనుని బ్రత్యేకముగ గౌరవించి యంతఃపురమునకు దీసికొనిపోయెను. ఇంద్రద్యుమ్నుడందు దన భార్య జిత్రసేనను గురుతుపట్టి తన్నామెకుం దెలియజేసి యా సతీమణి పడిన యిడుమ లన్నియు విని మిక్కిలి పరితపించెను.

క్షత్రియదంపతులును మదనుండును సింహకేతుడు తమకు గావించు అపూర్వసత్కారములకు మిక్కిలి విస్మయము జెందుచు పలువిధంబుల గొనియాడ దొడంగిరి. పిమ్మట సింహకేతుండు వారి మువ్వుర నొక రహస్మస్థలమునకు దీసికొని పోయి యుచితాసనంబులం గూర్చుండబెట్టి యిట్లు సంభాషించెను. ఇంద్రద్యుమ్నమహారాజా! నీవును నీ భార్యయు నీ మదనుడును కాశీరాజు కూతురు విశాలాక్షికతంబున గదా యిట్టి యిక్కట్టులంబడితిరి? నీవు గడు బుణ్యాత్ముడవు. నీ పరోపకారపారీణత దీనం దేటబడుచున్నది మరియు నీ పుస్తకము మొదట విశాలాక్షి యాపద దాటించినది. ఇప్పుడు మీ యిక్కట్టును నిదియే పోగొట్టినది. దీనిని జూచియే గదా నేనా యిల్లు పరీక్షించితిని. ఈ పుస్తకము వ్రాసినవారు కడుపుణ్యాత్ము లగుదురని పల్కుటయు నింద్రద్యుమ్నుం డానృపతి కిట్లనియె. అనఘా! నీవు మాకు చేసిన యుపకార మెన్నటికిని మరువవలసినది కాదు. యమలోకమునుండి వెనుకకు లాగికొని వచ్చితివి. నా యావజ్జీవము నీయందు గృతజ్ఞుండనై యుండెద. మాకు బోవ అనుజ్ఞయిమ్ము. నాకిక విశాలాక్షిని వెదకి యీ మదనునితో గూర్పవలసినపని యొకటి మిగిలియున్నది. అమ్మహాసాధ్వి యెందున్నదో తెలియదు. ఆకొరంత దీరెనేని నేను గృతకృత్యుండ నగదునని పలికిన విని యజ్జనపతి నవ్వుచు నిట్లనియె.

నరేంద్రా! ఈ మదనుండు శాపగ్రస్తుండై యున్నతరి అత్తలోదరిని బెండ్లియాడెను. అప్పడంతియు నితని విడిచి చాల కాలమైనది. మీరిప్పు డాపూవుబోడి వెదకి తీసికొనివచ్చినను నీతం డానాతి బరిగ్రహించునా! ఆ మాట దెలిసికొని మరియుం బొండని నుడువుటయు నయ్యొడయుం డమ్మదనుని మొగముజూచెను. ఆతండప్పుడు భూపా! నేను శాపగ్రస్తుండనైయున్నను అమ్మహాసాధ్వి మనోవృత్తి నెరుంగుదును. మేరువైనం జలించునుగాని యమ్మదవతి హృదయము చలింపదు అక్కాంచనగాత్రిని గాంచుటకంటె భాగ్యమున్నదియా! ఎట్లయిన నా ప్రేయసిని గూర్పుడు మీ కనేక వందనముల గావించెదనని పలికెను. ఇంద్రద్యుమ్నుండును విశాలాక్షి గుణంబులట్టివేయని స్తోత్రము జేసెను.

అప్పుడా సింహకేతుడు నవ్వుచు నా చిన్నది యీ యింటిలోనే యున్నది. మీకు జూడ వేడుక యేని నిందు రప్పించెద నుండుడని తటాలున లేచి లోపలికిం బొయెను. ఒక ముహూర్తములో నా లోపలి నుండి యొక చిన్నది వారికి నమస్కరించిన మదనుండు గురుతుబట్టి హా! ప్రేయసి! హా! విశాలాక్షీ! యని పలుకుచు నాయెలనాగం గౌగలించుకొనియెను. ఇంద్రద్యుమ్నుండును అమ్మా! నీవు మావిశాలక్షివే! ఇచ్చటి కెట్లు వచ్చితివి! ఎందెందు తిరిగితివి. ఈ నృపతి యాశ్రయం బెట్లబ్బెను నీవృత్తాంతము జెప్పుమని యడిగిన నప్పడతి నవ్వుచు నార్యా నాకథ మిక్కిలి యద్భుతమైనది. సావధానముగా జెప్పవలయు నిప్పుడు ప్రొద్దుబోయినది. భోజనాదిక్రియలు నిర్వర్తింపవలయునని పలికి వారిని లోపలికిం దీసికొనిపోయి తగు నుపచారముల జేయించినది. అని యెరింగించి మణిసిద్ధుండు వేళ యతిక్రమించుటయు నప్పటికి కథ జెప్పుటమాని తదనంతరోదంతం బవ్వలిమజిలీయం దిట్లని చెప్పదొడంగెను.