కాశీమజిలీకథలు/రెండవ భాగము/14వ మజిలీ

వికీసోర్స్ నుండి

14వ మజిలీ

విశాలాక్షీ ప్రవాసము కథ

గోపా! విను మా కాశీరాజపుత్రిక విశాలాక్షి తనవృత్తాంతము వారి కిట్లని చెప్పదొడంగినది తండ్రీ! నీవటు సింహమును బరిమార్పనరిగి యెంతదనుక రాకునికి బరితపించుచు సీ! నా కిక బ్రతికినం బ్రయోజనము గాన్పింపదు. శోకపరంపరలు నన్నూరక బాధింపుచున్నవని నన్నుగాక నాకుపకారము చేయవచ్చిన వారినిగూడ వేధింపుచున్నవి. యాహా! కాలమహిమ యని తలంచుచు మరణకృతనిశ్చయనై యందులకు సాధనమాలోచించుచున్నంతలో నించుక నిద్రపట్టినది.

అప్పుడొక కామినీలలామంబుకలలో నాకు గనబడినది తల్లీ! నీ యుల్లంబున జింతమానుము. నీకు మేలయ్యెడినని దయామేదురములగుచూపులు నాపై వాలపింపజేయుచు నానతిచ్చినది. అంతలో నేను మేల్కొని యాకల్కిని నలుమూలలు వెదకుచు నెందునుగానక కలయని నిశ్చయించుకొని యెహో! నాకు బలుమారిట్టికలలు వచ్చుచున్న వేమి? శుభమో యశుభమో తెలియదు. కానిమ్ము. మరికొంతకాల మరసెదంగాక యని నిశ్చయించి మరణోద్యోగంబు మాని వెండియు దురగమెక్కి యక్కడ గనంబడిన త్రోవంబడి నడువ దొడంగితిని. ఆదారి ఎక్కడికిబోవునో నాకుదెలియదు మిట్టమధ్యాహ్నము దనుక వడిగా నాతత్తడిని నడిపించితిని. యాయరణ్యమున కంతము గనంబడలేదు.

తీవ్రతప్తనగుట మేనం జమ్మటలు గ్రమ్మ క్షుత్పిపాసలతో నలసి యరుగుచున్న నాకు రోగార్తున కమృతంబువోలె మధురజలపూరితంబగు సరోవరం బొండు గన్నులపండువ గావించినది. అప్పుడు సీతకరణచోరకములగు మారుతకిశోరములు మార్గాయాస ముపనయించినవి. వికచసారసవాసనలు నాసాపర్వమొనర్చినవి. జలవిహంగమవిరుతంబులు శ్రవణసుఖంబుజేసినవి. అట్లాసరసి నాకతిథిసత్కారంబుల గావించిన సంతసించుచు నేనందు గఱ్ఱము దిగి మోకాలిబంటినీటిలో నిలువంబడి కరతలంబున నెరయజిమ్ముచు నిర్మలజలంబు గడపునిండ గ్రోలి యందు నిలవంబడి కొంతసేపు తదీయవిలాసంబు లరసితిని. అన్నన్నా! యనుంగువయస్యలు సేవింప బ్రియునితో గూడికొని యిట్టి తటాకంబున గ్రీడించు చేడియదిగదా భాగ్యమని తలపోయుచు దటంబుజేరి యవ్వటవిటపిశీతలచ్చాయ హస్తోపధానముగా శయనించి యాత్మీయగహనసంచారాదిప్రచారంబుల దలంచుకొనుచుండ నంతలో గాఢముగా నిద్రపట్టినది. నేనెంత సేపు నిద్రబోయితినో నాకు దెలియదు. మరికొంతసేపటికి గన్నుల దెరచి చూచినంత నేనొక యుద్యానవనంబులో బండుకొనియుంటిని. అప్పుడు లేచి కన్నులు నులిమికొని నలుదెసలు పరికించునంత నా గుర్రము నా తటాకము నావటవృక్షము గనంబడినది కాదు. అప్పుడు భ్రమజెందుచు నోహో! ఇదియేమివిచిత్రము. ఇప్పుడు నేను తటాకము దాపుననున్న మర్రినీడను బవ్వళించితినే. ఇచ్చటి కెప్పుడు వచ్చితిని. నన్నెవ్వరైనం దెచ్చిరా ఏమి. ఇది కడుచిత్రముగా నున్నది. ఇప్పూవుదోట యెక్కడిది? నేను విశాలాక్షి నౌదునా? మరియొకతెనా అగునగు, ఇదికల నిజమనుకొని భ్రమపడుచుంటిని. కాకున్న నే నెరుంగకుండ నిచ్చటి కేలవత్తును. అయ్యో! ఇది కలయని యెట్లు నమ్ముదును. స్వప్నము నిద్రలోవచ్చునుగదా! ఇప్పుడు నా కన్నులు తెరవబడి యున్నవి. ఇదిగో కర్మేంద్రియము లన్నియు బ్రసరింపుచున్నవి. ఇదిరాత్రియా! పగలా! సూర్యచంద్రు లిరువురు గనంబడుట లేదు. వెల్తురుమాత్రము చక్కగానున్నది. నా జన్మావధిలో నిట్టి యద్భుత మెన్నడును జూచియుండలేదే! యని పెద్దతడవు పెక్కుగతుల దలపోసి యది యేదియైనను నిశ్చయింప లేకపోయితిని.

ఏది యెట్లయినను మేలుయగుంగాక యని యప్పూవుదోట సోయగం బరయదరించి మెల్లన నమ్మంటపము దిగి యత్తోటలో బ్రవేశించితిని. అందు మగరాల చేత గట్టంబడి విశాలమగు మార్గముల ప్రక్క మొక్క మొక్కకును నీటితుంపురు లెగర జిత్రవిచిత్రములగు జలయంత్రము లమర్పబడియున్నవి. కుసుమఫలభారమున వంగి నేలంటియున్న లతాకుడుంగములు కన్నులపండువులై పొడగట్టినవి. అందున్న పుష్పజాతులు ఫలజాతులు భూలోకములో నెన్నడును గనివిని ఎరింగినవికావు. వాని పరిమళవిధ మీరీతి దని చెప్పుటకు శక్యము కాదు. విరులయందేగాక ఫలముయందు సైత మద్భుతమైన పరిమళము గలిగియున్నది.

పలుతెఱంగులరంగులుగల విరులచే నొరయు గుత్తుల మొత్తముల నెత్తావుల గుత్తకొని యత్తోటలెల్లడల గ్రుమ్మరు తెమ్మెర లమ్మమ్మా! యొకమాటు మేనికి సోకినంజాలదా! సుమరసంబు గ్రోలి సొమ్మసిలి ఝమ్మని మ్రోయు తుమ్మెదల రొదలు వినిన మునుల హృదయములకు సైతము మదనవికారము బొడమకమానదు. మొదట తీవియల పందిళులు వానిచుట్టు విరిమ్రానులు వానిపైన ఫలజాతులు సూత్ర పట్టి పెక్కుతరములుగా నాటబడియున్నవి. నాటిన రకము వెందెందును మరల నాట బడియుండలేదు. ప్రతిపాదపమునకు యేదో యాధారముగ గలిగియున్నది. అట్టి వినోదకరమగు వనవిశేషములు జూడదలచి యొక మార్గమునంబడి పోవదొడంగితిని. ఎంత దూరము పోయినను తుద మొదలు కనబడలేదు. మరియు వచ్చిన త్రోవయు, బోయిన త్రోవయు సైతము తెలిసినదికాదు.

ఆ మార్గమువిడిచి మరియొకదారిం బడి నడువ దొడంగితిని గాని యదియు నట్లేయుండెను. ఈ రీతి నందున్న మార్గములన్ని యుం దిరిగి చూచితినిగాని దేని సుతయు గనంబడలేదు. అందుజూచిన జాతి మరల జూడలేదు. అవ్వనములో గ్రమ్మరునప్పుడు నాకు పూర్వపు విచారమంతయు జ్ఞాపకము లేదు. దిరిగినకొలది సంతసమేగాని యలసటలేదు. నాకు దిరుగునప్పు డొకచోట నొక వింతయైన ఫలము గనంబడిన దానిం ద్రుంచి భక్షించితిని. అయ్యారే, ఆమాధుర్యమేమని వక్కాణింతును? దానిని దినినది మొదలు నాకు బలముగలిగి క్షుత్పిపాసలు నశించినవి. ఆ మ్రానునం దట్టిఫలము మరియొకటిమాత్రముండుట బరికించి దానిని గోసి మూటగట్టితిని. మరియుం దిరుగ దిరుగ నొకమ్రానున మిక్కిలివింతైన పూవొక్కటియే వికసించి పరిమళము వెదజల్లుచు బ్రకాశించుట బరికించి దానింగూడ గోసి పైటచెరంగున మూటగట్టితిని.

పెక్కేల నక్కాననసౌభాగ్యమంతయు దేటబడ మీకు వక్కాణింప నారుమాసములు పట్టును. వినుమట్లు నేనత్తోటలో దిరుగుచుండ నొక దండ నవరత్నములచే గట్టబడిన దేవాలయ మొకటి గనబడినది. దానిని మొదట దూరము నుండి చూచి కాంతిపుంజ మనుకొంటిని దాపు చేరిన కొలది యాలయమని తెలియవచ్చినది. ఆహా! మనోహరోద్యానవనములో నాదేవాగార మెంతటి శోభగా నున్నదని చెప్పను? కేవలము నాణెమైన రత్నములే బంగారునీటితో అతికి గట్టబడినవి. అందు జనులందరును సంతోషముతో అల్లనజేరినంత నమ్ముఖమంటపమునందు గూర్చుండి వీణ సవరించుచున్న యొక తరుణీలలామంబు నాకు నేత్రపర్వము గావించినది.

కాశీలోనున్న విశాలాక్షి పోలికగా అందొక మహాదేవి యున్నది. పిమ్మట ఆ శక్తిని జూచినంత నాకు మా అన్నపూర్ణ జ్ఞాపకమువచ్చినది పిమ్మట నేనా వీణావతి దాపున అతివినయముతో నిలువఁబడితిని ఆమెయు నన్ను గూర్చుండమని కనుసన్న జేసినది. నేను అతిభక్తిపూర్వకముగా అద్దేవికి మ్రొక్కి అచ్చట నోరగా గూర్చుంటిని. అప్పూవుబోడి పాణియుగంబున వీణధరించి యింపుగా స్వరంబుల వెలయింపుచు అద్దేవిమీద దాను రచించిన కృతుల గాంధర్వాకృతులుగా గలకంఠ నాదము మేళవించి హాయిగా బాడినది. వీణావతి అను పేరుగల అయ్యంబుజాక్షి తుంబురు నొద్ద సంగీత మభ్యసించినదట! విశాలాక్షి అను అద్దేవతను ప్రతిదిన మనుకూలప్రియసమాగమమునకు సేవించుచున్ నట్లచ్చేడియ పాడినకృతిమూలముననే నాకు దెల్లమైనది ఎట్టి కాంతకు అనుగుణప్రియసమాగమం బభిలషించుట సహజగుణముగదా! నేను భూలోకగానవిశేషము లన్నియు వినుటయేగాక సంపూర్ణముగా అభ్యసించి గాయనీ గాయకులలో నుత్తమురాలనని ప్రసిద్ధి నొందితిని. అన్నన్నా! అన్నాళీకవదన చేసిన స్వరకల్పనల కే నెంతేని విస్మయము జెందితిని. చేతనము లచేతనములుగా అచేతనములు చేతనములుగా సంగీతము బాడిరను కవి ప్రౌఢోక్తి యదార్ధమని నాకప్పుడు దోచినది. అట్టి శాస్త్రము మన లోకములో లేదు. ఆ వీణావతి పాడిన స్వరవిశేషములన్నియు సులభముగా నేను గ్రహించితిని.

మరియు గానావసానమున అక్కాంతతో గొంత ముచ్చటింప దలంచుకొని సమయ మరయు చున్నంత నా చిన్నది మోహనం బనురాగము తంత్రీనాదముతో గంఠనాదము మేళగించి మనోహరముగా పాడినది. ఆహా! ఆ రాగము నిజముగా జగన్మోహనంబని చెప్పవచ్చును. దానివిశేషముల సైతము గ్రహింపు చున్నంత నాకంతలో భ్రాంతి బొదమి మనంబు నీరై మేను పరవశమైనందున నేల కొరిగితిని. అంత గాఢముగా నిద్రపట్టినది. మరికొంతసేపటికి లేచి చూచినంత మునుపటి మఱ్ఱిచెట్టు నీడను బండుకొని యుంటిని. అప్పుడులేచి నలుమూలలు పరికించుచు అప్పటికి జాము ప్రొద్దుండుటజూచి నేను నిద్రబోయినది జామని తెలిసికొని జాములో నెన్ని విశేషముల గంటినని వెరగందుచు అట్టికల యెన్నడేని మరలవచ్చునాయని ధ్యానించుచు దద్విశేషంబులన్నియూ స్మరించుకొనుచు నా తొయ్యలితో సంభాషింపక పోయితినే అని పశ్చాత్తాపపడుచు గానవిశేషములన్నియు జ్ఞాపకమున్నందులకు అద్భుతపడుచు నీరీతి కొంతసేపు డోలాయచిత్తురాలనై విచారింపుచుంటిని.

లోకములో మంచిస్వప్నములు వచ్చినప్పు డందరికి మరం అట్టిది కనంబడిన బాగుండునని తోచుట సహజముకదా! అట్లు నేనది కలయని భ్రాంతితో గొంతదనుక దొట్రుపడుచు అంతలో నా పైటకొంగున గట్టిన మూట జూచుకొని ఇదియేమి? వింతగా నున్నదె? నేను కలలో గట్టిన మూట అట్లే యున్నదేమి? అని వెరగందుచు నా మూట విప్పి చూచిన నా ఫలము పుష్పము దానిలో నున్నవి.

అప్పుడు నే నోహో! ఇందాకటిది స్వప్నమనుకొంటినే; కాదు కాదు. నిజముగా అట్టిపని జరిగినది. లేకున్న నాకోక కప్పుడుగట్టిన పూవును పండు నెట్లుండును. ఆ! ఏమి నిజముగానే అప్పూతోట కెప్పుడుపోయితిని. పోలేదే, తెలిసినది. నాకిది స్వప్నమే. నిజముగా నేనీ మఱ్ఱిక్రింద బరుండలేదు. అయ్యో! మరల భ్రాంతిజెందు చున్నానేమి నేనిందాక గుఱ్ఱమెక్కి యిచ్చటికివచ్చి యిచ్చెరువులో నీరు ద్రాగి మార్గ శ్రమవాయుటకయి యిందు, బరుండలేదా! ఇదియే స్వప్నమనుకొనుచున్నానే! కాదు కాదు. నిజమేయని పలుదెరంగుల జింతించుచు నాపూవును ఫలమును ముందుబెట్టుకొని వాని సౌరభ మాఘ్రాణించుచు మెచ్చుకొనుచు నొక్కింత సేపేమియుం దోచక యూరక కూర్చుంటిని.

మరికొంతసేపు ధ్యానించి ఫలభక్షణంబున క్షుత్పిపాస లుడుగుటయు, గానవిద్యాపరిశ్రమము విశాలాక్షి దర్శనము, ఫలపుష్పప్రాప్తి లోనగు చర్యలన్నియు దలంచుకొని అది అంతయు విశాలాక్షి కృపావిశేషముగాక మరియొకటి కాదని నిశ్చయించితిని.

అదిమొదలు నాకెట్టి చింతయును లేదు. ప్రియసమాగమము కూడ శీఘ్రముగాకాగలదని ధైర్యము మనంబున గుదురుపడ సంతతము పరిపూర్ణానందముతో నుంటిని. అట్టి సంతోషముతో లేచి యా పుష్పమును ఫలమును మరల పయ్యెద కొంగున మూటగట్టికొని యా గుర్రమెక్కి పశ్చిమాభిముఖముగా నడువ జొచ్చితిని. అప్పటికి జాము ప్రొద్దున్నది సాయంకాలము కాకమున్న యెద్దియేని యొకయూరు చేరవలయునని తలంచి తత్తడిని వడివడిగా దోలితిని. ఆ దారి కొంతదూరము పశ్చిమముగాబోయి పిమ్మట దక్షిణమునకు మరలినది.

భీమశర్మ యను బ్రహ్మచారి కథ

దానింబడి పోవబోవ సాయంకాలమున కొక అగ్రహారము దాపునకు జేరితిని. అం దిరువది సంత్సరములు ప్రాయముగల యొక బ్రహ్మచారి మ్రానుకొమ్మకు ద్రాడు బిగియించి అది తనమెడ కురిగా దగిలించుకొని ప్రాణముల బోగొట్టుకొనుటకు సిద్ధముగా నుండుట జూచి తటాలున గుర్రముదిగి నేను వాని చేయి బట్టుకొని ఇట్లంటిని. వటుడా! నీవెవ్వడవు? ఇ ట్లురిబోసికొని బలత్కారముగా మృతినొందనేల? ఆప్తు లెవ్వరును లేరా? ఈ తెగువకు గారణంబేమి అని మెల్లగా అడిగిన అతండు నన్ను గనుచీకటిలో గురుతుపట్టనేరక పురుషుడననుకొని నా కిట్లనియె. అయ్యా! నీవు నాచేయి వదలుము. నేను బ్రతికియుండినను లాభమేమియును లేదు. ఈ పడిన యిడుమలు చాలవా! లోకంబున దరిద్రుడును విద్యలేనివాడును బ్రతికియుండుటకంటె నీచము లేదు. అని పలుకుచు బెక్కుతెరంగుల బొక్కుచున్న యా చిన్నవానితో మరల నే నిట్లంటి.

విప్రుడా! నీజన్మముత్కృష్టమైనది. దరిద్రముచేత నీకుజావవలసిన యగత్యములేదు. నీవృత్తాంతము చెప్పుము. నిన్ను భాగ్యవంతుని జేసెదనని అనునయపూర్వకముగా నడిగిన అతండిట్లనియె. అయ్యా! ఇచ్చటికి గ్రోశదూరములోనున్న విజయపురి యను నగ్రహారము నా కాపురము. నాపేరు భీమశర్మయండ్రు. మే మేడ్వుర మన్నదమ్ములము. నేను గడపటివాడను. నాకు విద్యయేమియు నబ్బినదికాదు. దానం జేసి యందరకు బానిసవాడనై వర్తింపుచుంటిని. నాకు దల్లిదండ్రులు పుట్టినప్పుడే మృతినొందిరి. నేను మా అన్నలుచెప్పిన పనులు శ్రద్ధతో జేయుచు వారికిష్టముగానే మెలంగుచుంటిని. మావదినెలందరు కాపురమునకు వచ్చిన తరువాత సైతము నాకు దాసత్వము తప్పలేదు. మఱికొంతపని ఎక్కు వైనది. వారికిని నుపచారములు చేయవలసివచ్చినది. అందరకును దాసుడనై పరిచర్యలజేయుచున్నను నాకు నిత్యము వారివలన బ్రహరణములు తప్పలేదు. వానిని గణియింపక నేను నాయోపినంత పనిజేయుచుంటిని. నేడు రెండుజాములవరకు నింటిలో బనులుజేసి బ్రాహ్మణార్థమై పిలువబడి యొకరింటికిబోయితిని. అచ్చట బిండివంటలు శాకములు మొదలగు పదార్దములు దృప్తిగా దిని భోజనమైనవెనుక కొంతసేపచ్చట విశ్రమించి యింటికిబోయితిని. అప్పుడు మాపెద్దన్న భార్య నన్ను గోపదృష్టింజూచుచు భీమశర్మా! నీవు బోజనము జేసి వెంటనే యింటికిరాక యింత యాలసించితివేల యింటిలోని పనులన్నియు నెవ్వరు చేయుదరనుకొంటివి. ఈదివసమున మాత్రము భోజనముదొరికిన జాలునా? రేపక్కర లేదా ఏమి? నీవు మునుపటివలె గాదు మిక్కిలి ప్రాల్మాలుచుంటివని కసరుచు దానుయ్యెలలో బరుండి ఇంటిలో మంచినీరులేదు. బావికి బోయి కావడియెత్తుకొని రమ్మని యాజ్ఞాపించినది.

అప్పుడు నామనంబునంబొడమిన కినుక నాపుకొనుచు వదినా! నాకీదినమున భోజనము బరువైనది. దాననాయాసముచేత నింటికి రాలేక యచ్చటనే విశ్రమించితిని. ఇంకను నాయాసముదీరలేదు. ఇప్పుడు బావికి బోలేను. కొంచెముతాళి వెళ్ళెదనని యుత్తరము చెప్పితిని. దీనిలో నేమితప్పున్నదియో నీవేచెప్పుము తానుచెప్పిన మాట వింటినికాకని అహంకారముచేయుచు నౌరా, నేనుజెప్పిన పని చేయక యిక నాయింటిలో నుండెదవా, నీకెవ్వరో దుర్బోధచేయుచున్నారు. కానిమ్ము మీయన్న వచ్చినతరువాత నిన్నేమిచేయించెదనో చూడుమని పెక్కుదుర్భాషలాడినది. అప్పుడు నేను జడియుచు పోనీ నీకింత కోపము వచ్చినచో నిప్పుడే పోయెదనులే అని కావడి సవరించుకొని బిందె లందులో నుంచుకొనునంతలో దటాలున నుయ్యెలదిగివచ్చి యాకలశము లాగికొని ఛీ! నీవు మాకు నీరుతేవలదు తెచ్చిననీరు త్రాగినది మాదిగదే సరియని యొట్టుబెట్టుకొనుచు బెక్కుతిట్లు తిట్టినది.

ఏమమ్మా! నేనేమంటినని యింతకోపము చేసెదవు. ఆయాసముగా నున్నది గనుక ఆనకదెత్తునంటినిగాని నీకెదిరించితినా? ఈతప్పు గావుము ఇకనెన్నడిట్లననని ఎంతబ్రతిమాలినను నామె కోపము తీరినదికాదు. ఆమె గయ్యాళితనమునకు భయపడియో స్వభావము చేతనోకాని తక్కినవదినలు సైతము నాదే తప్పనిరి. కాని యామె నేమియు ననరైరి.

పిమ్మట నావిడ తలగట్టుకొని పండుకొని మగడువచ్చిన తరువాత నాపై లేనిపోని నేరములుచెప్పి యతని కహంకారముగలుగజేసినది. అతడెంతమాత్రము నిదానించక పెండ్లాము మాటనమ్మి నిర్బాగ్యుడా! నీవింతపోతరింతువేయని యరచుచు నన్ను లావుపాటి దుడ్డుగర్రతో జావమోదెను. అప్పుడు తక్కినయన్నలుగాని, యన్నల భార్యలుగాని యొక్కరైనను నడ్డపడరైరి. దిక్కుమాలిన నాబ్రతుకునకు నేను నిందించుకొనుచు దెబ్బలచే మేనంతయు నొచ్చినందున బ్రాణములం దిచ్చలేక ఎవ్వరికిని దెలియకుండ జావవలయునని యీ యడవిలోనికి వచ్చి యిట్లు చేయుచుంటిని. ఇంతలో నీవడ్డుపడితివి. యిదియే నావృత్తాంతము. పైన నేనేమిచేయవలయునో నీవే చెప్పుము. ఎంతయాపదయునులేక యూరక నేనుమాత్రము జావయత్నింతునా యని పలికిన నవ్వడుగు నుడువులు విని నేను మిగుల జాలిపడి బ్రాహ్మణుడా ! నీవు వెరవకుము. నీయావడి యుడిగించెదను. "జీవన్భద్రాణిపశ్యతి" యను నార్యోక్తి గలదు. అని యోదార్చుచు నాకొంగు ముడినున్న పండుతీసి ఆతని చేతిలో బెట్టి యిట్లంటిని.

వడుగా ! ఈఫలము మిగులమహిమగలది. ఎన్నిదినములున్నను వాడక ఇట్లే యుండును. దీనిని దినిన వారికి క్షుత్పిపాసలుండవు. మీదేశపురాజునకు దీనినిచ్చిన నీకు వలయునంత విత్తమియ్యగలడు. దాన యధేచ్ఛముగా జీవింపుము పోపొమ్ము. చావవలదని యతని మరణము తప్పించి యాఫలము నిచ్చి యంపితిని.

నేను నారాత్రి యాయగ్రహారములో బ్రచ్చన్నముగా నొకచోట బండుకొని యుదయమున లేచి మరల ద్రోవంబడి నడవజొచ్చితిని. అచ్చటనుండి యామార్గము తూర్పుగాబోయినది. అట్లు మధ్యాహ్నము దాక నడిచి యెండ మిక్కుటముగా నున్నది కావున కొంచెము విశ్రమించిపోయెదంగాక యని తలంచి యందొక చెట్టునీడ నా గుర్రమునుగట్టి యందు గూర్చుండి యా ప్రాంతవిశేషము లరయుచుంటిని.

అంతలో నొకముసలిబ్రాహ్మణుడు పదుగురుపిల్లలతో నా మార్గమున నెందేని బోవుచు నాతపభీతిచే విశ్రమించుకొరకు నాచెట్టునీడకే వచ్చెను. ఆతనిని జూచి నే నిట్లంటి. అయ్యా! తమ దేశ మెద్ది? ఎచ్చటికి బోవుచుంటిరి? ఈపిల్లలు మీ కేమగుదురు? మీ వృత్తాంత మెరిగింపుడని యడిగిన నతండు కంటనీరు నించుచు మెల్లన నిట్లనియె.

అమ్మా! మాది విదర్బదేశము. నా పేరు కృష్ణశర్మ. ఈపిల్లలు నాసంతానమే. నాభార్య ప్రసూతివికారమువలన స్వల్పకాలముక్రిందటనే పరలోకగతురాలయినది. ఈపసికూనలతో మిగుల చిక్కులు పడుచుంటిని. కడుబీదవాడను. వేరే యాడుదిక్కునులేదు. నిత్యము భిక్షాటనముచేత కాలక్షేపము సేయుచుంటిని. ఇప్పుడు మా దేశమందు వర్షములులేక క్షామముబుట్టినది. ఆ బిచ్చమైనను చాలినంత దొరకుటలేదు. ఎచ్చటకేనిం బోయిన జీవనములు నిలుచునేమో యని బయలుదేరితిని. కాని నాకన్న ముందరనే నాదురదృష్టదేవత నడుచుచున్నట్లు తలంచుకొంటిని. ఎచ్చటికిబోయినను యన్నము దొరకుటలేదు. మేము భోజనముచేసి రెండుదినములైనది. ఈపసిబాలురు నడువలేరు. ఆకలిదాళలేక యూరక యరచుచున్నారు. ఈకుటుంబభారము భరింపలేక బలవంతమున జచ్చిన బాగుండునని తోచుచున్నది. తల్లీ! నీవుచూడ మిగుల గౌరవము గలదానివలె తోచుచుంటివి. నాకేమైనం దయచేయుదువే అని కన్నీరునించుచు అడిగెను.

అప్పుడు నే నాతని దీనాలాపములు విని సహింపనేరక శివశివా యని చెవులు మూసికొనుచు నించుక చింతించి యిట్టి దరిద్రుని బాగుచేయుటకంటె పుణ్యము లేదని నిశ్చయించి నాయొద్దనున్న యా అద్భుతపుష్పము నాతని కిచ్చి యిట్లంటిని.

బ్రాహ్మణుడా! ఇది పారుజాతమువంటిది. దీనిని బయటనుంచినచో యోజనదూరము దీని పరిమళము వ్యాపించును. ఎన్ని దినములున్నను వాడక యిట్లే యుండును. ఇది భూలోకములో దొరుకునది కాదు. మిగుల వెలగలది. నీయందలి జాలిచే నీకిచ్చితిని. నీవు దీనిం దీసికొనిపోయి నీ కుటుంబమంతయు నెల్లకాలమును బోషించువానికే యిమ్ము పొమ్మని అతని కాకుసుమ మిచ్చి గుఱ్ఱమెక్కి మరల దారిం బడితిని.

ఆ మార్గము కొంతవరకు దూరుపుగాబోయి మరల నుత్తరమునకు మరలినది. అప్పుడు నేను బరిశీలించి అయ్యో! ఈ దారి మరల నుత్తరదిశకు గొనిపోవుచున్నది. అం దరణ్యమేకాని గ్రామములు లేవు. నే నెక్కడికి బోవలసియున్నదో నాకు దెలియకున్నది. నా ప్రాణనాయకుండెందున్నది ఎఱుంగరాదు. స్వప్నమునం జెప్పిన మహాదేవి మాటలనమ్మి యిట్లు గ్రుమ్మరుచుంటిని. దారితప్పి యిటు వచ్చితిని. వృద్ధబ్రాహ్మణుడు గనంబడినచోటనే వేరొక తెరవున్నది దానింబడిపోవలసినది అయినను మరల వెనుకకు బోనేల? ఈ మార్గముననే పోయి చూచెదనని పెక్కుగతుల దలపోసి యాదారినే గుఱ్ఱమును నడిపించితిని.

అట్లు సాయంకాలమువరకు నడిచినను జనపదం బేదియు గనంబడినదిగాదు. అప్పుడు మనంబు దిగులుపడి యోహో! ఇది మిగులయరణ్యప్రదేశము. ఇందు కౄరసత్వరములుండక మానవు. చీకటులు దెసల నాక్రమించుచున్నవి. శకుంతసంతానంబులు గురాయములకు జేరుచున్నయవి. నే నీఱేయి నెటుల వేగించుదాననో తెలియకున్నది. అయ్యో! నా కిట్టిచింత యేల జనింపవలయును ప్రాణత్యాగమునకు దెగించి యున్ననా కీమృగభీతి యేల? యెట్లయినను మేలేయగుంగాక అని మరల ధైర్యము దెచ్చుకొని యారాత్రి నివసింపదగు స్థల మరయుచు మరికొంతదూరము నడచితిని.

కోయపల్లెకథ

అంత నచ్చట పశువుల యార్పులు వినంబడినవి. దానింబట్టి యాప్రాంత మందెద్దియో పల్లె యున్నదని నిశ్చయించి యారొద అనుసరించి అల్లన అప్పల్లెలోనికి బోయితిని. అందున్న కోయదొరలందరు రక్కసులవంటివారే. నాడెద్దియో యుత్సవముచేయుచు నాబాలవృద్ధముగా నొకచావడిలో దీపము పెట్టి పెక్కురీతుల అడవివాద్యములు వాయించి మిక్కుటముగా ద్రాగి యాడుచుండిరి. వారిని జూచినంత నాగుండియ లవిసిపోయినవి. ఎట్టియాపదలోనున్నను మరణభీతి మాత్రము విడువదు సుడీ! వాండ్రు నన్ను జూడలేదు.

వాండ్రందరు నుత్సవము సందడిలోనుండిరి. ఆ పల్లెలో నెచ్చటను దీపము లేదు. ఆ చావడిలో మాత్రమున్నది! అప్పుడు నేను మెల్లన గుఱ్ఱముదిగి నాపొలములో నొకచోట గట్టివైచి, ఆ పల్లెలో వేరొక మూలకు బోయితిని. ఆ గుడిసెలకు నావరణములులేవు. అద్భుతములైన కుక్కలున్నవి. అవి క్రొత్తవారిని జూచిన వెంటనే కరచి చంపక మానవు. నా పుణ్యమువలన అవియు నాచావడియొద్దకే చేరినవి. గుడిసెలలో నెవ్వరును లేరు.

అంత నేనొక గుడిసెతిన్నెమీదకు బోయి మెల్లగా గూరుచుంటిని. అంత కొంత సేపటికి నాయుత్సవము నుండి యొకయాడుది యా గుడిసెలోనికి వచ్చి యరుగుమీదనున్న నన్ను జూచి కోయభాషతో నెవరువారని యడిగినది. నాకు నేబదియారు భాషలు వచ్చునుగాని కోయభాష రాదు. అదియు నాంధ్రభాష ననుసరించియే యుండెను గావున నూహనుబట్టి దాని యభిప్రాయము గ్రహించి అవ్వా ! నేను బరదేశిని దారితప్పి యిట్లు వచ్చితిని. ప్రొద్దున లేచి పోయెదనని చెప్పితిని.

అది నా మాటలర్ధము జేసికొనలేక అమ్మయ్యో! మన కొండదేవత మా యింటి అరుగుమీదికివచ్చి కూర్చున్నదిరోయని పెద్దయెలుంగున అరచుచు నాచావడి యొద్దకు బరుగెత్తినది. ఆ మాటలు విని వాండ్రందరు నాగందదీపముతో వాద్యములు మ్రోగించుచు నా యొద్దకు వచ్చిరి. అప్పుడు నామేన ప్రాణములులేవు. చచ్చితినేయని నిశ్చయించితిని. కాని అంతలో మరల నాకొక యూహతోచినది.

అది నన్ను గొండదేవతయని అరచిన అరపు వినబడినది. కొండదేవతకై వారట్లుత్సవము జేయుచున్నారని నిశ్చయించి వారు వచ్చులోపల నాపొడవుపాటి వెంట్రుకలన్ని విరజిమ్మి శివముపూనిన దానివలె నాడుచుంటిని. ప్రాణభీతి ఎన్ని పనులు చేయించునో చూచితివా? అంతలో వాండ్రు నన్ను జూచి అమ్మారో, యని యరచుచు వాద్యములు వాయింపదొడగిరి. నేను లేచి యానాదానుగుణ్యముగా నాట్యమాడ దొడంగితిని. నాతో గూడ వాండ్రందరు చిందులు ద్రొక్కుచుండిరి.

అట్లు కొంతసేపు గంతులు వైచిన తరువాత డప్పులు వాయించుట మానిపించి నాకు మ్రొక్కుచు అమ్మోరో! నీకు బలులిత్తుమో పానకాలిత్తుమో, మమ్మేలో, మాగుడిలోనికిరమ్మో! యని మాటిమాటికి డప్పుపై గొట్టుచు బదాలుపాడగా నేనును దలద్రిప్పుచు అప్పుడా చావడికే పరుగెత్తుకొని పోయితిని.

అప్పుడు నాతో గూడ అందరు, అమ్మోరుగుడికి బోవుచున్నదని యుపచారములు చెప్పుచు లెంపలువాయించుకొనుచు దండములు పెట్టుచు నాచావడియొద్దకు వచ్చిరి. అదివరకే యమర్చబడియున్న వెదురుబద్ధలగద్దెపై నేనుబోయి గూర్చుండి వాండ్రనందరను నాట్యమాడుడని వ్రేలితో సూచనజేసినంత అందరును దమయిష్టము వచ్చినట్లు అడవిపదాలు బాడుచు జిందులు ద్రొక్క దొడంగిరి. అట్టి సమయమున నావెనుకదెసనున్న యాడువాండ్రిట్లు సంభాషించుకొనిరి.

ఒకతె - ఓసీ ! ఈయేడు మనకొండదేవత మంచిరూపముతో పచ్చించి సుమీ! అమ్మోరువెంట్రుక లెంతపొడవుగా నున్నవో చూచితివా ?

మరియొకతె - ఔను. మొన్నను మాదొర కలలో నిట్లావత్తునని చెప్పినదట! ఈభేమ్మాండములన్నియు చేసేదేవతకు తలవెంట్రుకలు పొడుగుగానుండుట యేమియాశ్చర్యము.

ఇంకొకతె - ఓసీ. మనయమ్మవారు ఎంతమంచిబట్ట గట్టుకొనినదో చూచితివా? ఈమెకు మగ డున్నాడా?

వేరొకతె - ఓసీ. అయ్యో! ఈమెకుమాత్రము మగ డుండడా! ఈమె మగనిపేరు పోతురాజు. పిల్లలుమాత్రము లేరట.

మరియొకతె - మనమందరము యీమెపిల్లలముకామా? ఈమె కృపలేక పోయిన నిక్కడుండగలమా? మనలను బుట్టించినదే ఈమె.

ఇంకొకతె - ఓసీ. నే నెరిగిన తరువాత మనకొండదేవత యిట్టిరూపముతో రాలేదుసుమీ!

వేరొకతె - అవును. నిరుడు పులిరూపమున వచ్చి తెల్లవారకముందే వెళ్ళిపోయినది. ఆ వెనుకటేడు చిరుతపులిగా వచ్చినది. అప్పుడును దెల్లవారకముందే వెళ్ళిపోయినది.

ఇంకొకతె – నే డీయమ్మవా రెంతసేపుండునో ?

వేరొకతె - ఓసీ! తెల్లవారుదనుక నుండి పిమ్మట వెళ్ళునని తలంచెదను ఈయేడు మాత్ర మెక్కువగా నిలుచునా?

ఇంకొకతె — ఓసీ ! అమ్మవారిదేహము బంగారములాగే యున్నది. రెండు దినములుండినం జూచుచుందుముగదా?

అని యిట్లాడువాండ్రు సంభాషించుకొను మాటలన్నియు వింటిని. మహారాజా ! ఆసంగతి దలంచుకొనిన నిప్పుడు సైతము నాకు నవ్వువచ్చుచున్నది అట్లు తెల్లవారువరకు గ్రామదేవతవలె వారిచే నర్చింపబడి తెల్లతెల్లవారుచున్న సమయంబు నాగద్దెనుండి లేచితిని.

అప్పు డందరు అమ్మోరు వెళ్ళుచున్నదని కేకలుపెట్టుచు గ్రామదేవతను సాగనంపునటుల నావెంబడి రాదొడంగిరి. నాగుర్రమున్న చోటికిబోయి దానినెక్కి అందరు వెనుకకు బొండని సంజ్ఞచేయుచు గుర్రమును మునుపువచ్చినదారికి దోలితిని. వాండ్రందరు కొంతవరకు వెనుకనువచ్చి నాకు దండములు పెట్టుచు నాగుర్రముతో బరుగెత్తలేక క్రమక్రమముగా వెనుకకుబోయిరి. నేనును యమపురి దాటివచ్చినట్లు సంతోషించుచు నాకట్టి యుపాయము దోపించి యా యాపద, దాటించినవాడు భగవంతుడేయని తలంచి అతనిని మిక్కిలి స్తుతిజేసితిని.

నే నట్లుచేయనిచో నన్ను దప్పక నాకొండదేవతకు బలియిత్తురు. వాండ్ర కౄరకృత్యములన్నియు నాయాడువాండ్ర సంభాషణలో నాకు దేటపడినవి. పాపమా కోయదియే నన్ను గొండదేవతగా నిరూపించినది. ఇంతకు దైవమిట్లు శుభము గూర్పు దలచియుండ మఱియొకరీతి నెట్లుజరుగును. అట్లు వడిగా బోవుచు నొకనాడు సాయంకాలమున కొకయూరు చేరితిని. నాడు శివరాత్రి యగుటచే బెక్కండ్రుజనులు కోటీశ్వరమను పేరుగల యాక్షేత్రమునకు వచ్చిరి.

ఆక్షేత్రాధినాయకుండగు కోటీశ్వరునిమహిమ పురాణప్రసిద్ధమగుట దూరదేశములనుండి వేలకొలది జనులు వచ్చుటచే అచ్చట మిగుల సమ్మర్దముగానున్నది. అప్పుడు నాగుర్రమును దూరముగా విడిచి నేను స్నానముచేసి రాత్రివేళ నాగుడిలోనికి బోయితిని. ఆ యాలయములో నొకతరుణి నాకెదురుపడినది దా నెచ్చటనో చూచినట్లుండి పరిశీలింపుచుండగా నత్తలోదరి నన్నుజూచి ఏమమ్మా! నన్ను సాభిప్రాయముగా జూచుచున్నావు. ఎక్కడనైనా జూచిన జ్ఞాపకమున్నదా యని నవ్వుచు నడిగినది.

అప్పుడు నేను అవును. నిన్నెక్కడనో చూచినట్లేయున్నది. అదియే తలచుకొనుచున్నానని చెప్పితిని. పిమ్మట నమ్మదవతియు జ్ఞాపకమురాలేదా? అల్లనా డుద్యానవనములో విశాలాక్షి గుడి ముఖమంటపముమీద నేను వీణబాడుచుండగా నీవచ్చటికి రాలేదా? గానావసానమందు నీతో గొంత ముచ్చటింతమనుకొనునంతలో నీవు నిద్రపోయితివి. పిమ్మట నాకు గనంబడితివికావు. ఇప్పుడైన జ్ఞాపకమువచ్చినదా యని అడిగినది.

అప్పుడు నేనక్కజమందుచు నేమేమీ! ఇది కడువింతగానున్నదే. ఈకలకంఠిని గలలోగంటి. నదినిజమెట్లగును? కలలోగన్న పదార్ధము మేల్కొనినయప్పుడు కనంబడుట వింతకాదా? ఒకవేళ నది కలగాదేమో నిజమే. ఫలపుష్పములసంగతి ఎట్టిదో నిదియునట్టిదే! యీమాయ దెలిసికొన నెవ్వరికి శక్యముగాదు. నాజన్మావధిలో నిట్టి వింతల గని యెఱుంగనని తలయూచుచు నామెతో నమ్మా! జ్ఞాపకమువచ్చినదని పలికితిని. మరల నాకాంత కొమ్మా! నీవత్తోటనుండి యొకఫలము పూవును దెచ్చితివి. వానిమహిమ నీకు దెలియునా ? భద్రముగా దాచుకొంటివాయని యడిగినది. అమ్మా! నాకు వానిమహిమ దెలియదు. ఇరువుర బ్రాహ్మణుల దైన్యము చూడలేక వారి కిచ్చితి నని చెప్పితిని.

అప్పుడక్కలికి ముక్కుమీద వ్రేలిడికొని ఎంతపనిచేసితివి? అమ్మవారు నీకై వాని నిచ్చెంగదా! అట్టివస్తువుల మఱియొకరికి నియ్యవచ్చునా యని పలుకుచు గానిమ్ము, దైవకృపగలిగిన నవి ఎక్కడికి బోవునని పలికినది. నేను బిమ్మట నవ్వన వృత్తాంత మడుగుదమని తలంచుచున్నంతలో నక్కాంతారత్నంబు ఇదిగో లోనికి బోయివచ్చెద నిందుండుమని గర్భాలయములోనికిబోయి మరల గనంబడినదికాదు. ఆమె మరలవచ్చునని పెద్దతడవచ్చట గాచుకొనియుంటిని. గాని ఎంత సేపటికినీ నామె జాడ గనంబడినదిగాదు. నేను గర్భాలయములోనికి బోయి వెదకితిని. అందును లేదు.

అప్పుడు అన్నన్నా! ఆ చిన్న దానిచేయి గట్టిగా బట్టుకొని యడుగక యూరక విడిచిపెట్టితినే! ఇప్పు డే మనుకొన్నను లాభము లేదు. ఆమె విశాలాక్షి కాప్తురాలుగా దోచుచున్నది. దానంబట్టియే నాయందును దయగలిగియున్నది. ఇట్టిచిత్ర మెవ్వరితో జెప్పినను నమ్మరుగదా! ఫలపుష్పములు రెండును అమ్మవారు నాకిచ్చినట్లు చెప్పినది. అద్దేవి ప్రచ్ఛన్నముగా నన్ను కాపాడుచునే యున్నది. అమ్మహాదేవినే నమ్మియుంటి నెట్లుచేసినను లెస్సయేయని పలువిధంబుల దలంచుచు మరల వెలపటికివచ్చి యచ్చేడియను వెదకితిని కనంబడలేదు.

పిమ్మట నేనక్కడబయలుదేరి యశ్వయానమున మరునాటి సాయంకాలమునకు ధర్మపురియను రాజధానిం జేరితిని. అరాత్రి యొక సత్రమువేదిక పై బండుకొని యున్న సమయంబున నందు గొందరు బ్రాహ్మణు లిట్లు సంభాషించుకొనిరి.

సుబ్రహ్మణ్యశాస్త్రి - ఆ వీధినట్లు జనులు గుంపులుగా బోవుచున్నా రెక్క డికో ఎరుంగుదువా!

రామశాస్త్రి - ఎఱుంగుదును. రాత్రి గోటలో గొప్పసభ జరుగునట.

సుబ్రహ్మ - సభావిశేషము లేమి ?

రామ — ధర్మాంగద మహారాజుగారి దివాణమున కొక యద్భుతమైన ఫలమువచ్చినదట దానిజాతి యిట్టిదని ఎవ్వరును జెప్పలేకపోయిరి. అదియెన్ని దినములుండినను వాడదు. మనోహరమైన పరిమళముగలిగియున్నది. దానిందినిన నేమిజరుగునో ఎవ్వరికిని దెలియదు. అట్టి ఫలమునుగురించి యుపన్యాసమిచ్చుటకు నీరాజు నానాదేశములకు వర్తమానములు పంపెను. దానికై పెక్కండ్రు మహారాజులు వచ్చిరి. ఈరాజు స్నేహితుడు మళయాళదేశపురాజు చండవర్మ యను నాతడుగూడ యద్భుతమైన పుష్పమును దెచ్చెనట. అదియు నెన్నిదినములున్నను వాడదట. దాని పరిమళము యోజనదూరము వ్యాపించును. చూడగా నా రెండు నొకజాతివృక్షమున బుట్టినవియేయని వాసనంబట్టి చెప్పిరి. వానింగురించి ఉపన్యాసములు జరుగును. పిమ్మట సభాసదులు వినోదము నిమిత్తము మదనమంజరియను వేశ్య సంగీతముపాడును. ఇవియే సభలో జరుగు విషయములని చెప్పెను.

వారిమాటలు విని నేను తటాలునలేచి యాఫలపుష్పముల గురించి ఏమేమి మాట్లాడికొనియెదరో వినియెదంగాకయని నిశ్చయించి స్త్రీవేషముతో సభకు పోరాదని తలంచి పురుషవేషము వైచికొని యాసభకు బోయితిని. ఆసభ చక్కనిదీపములచేతను వింతవస్తువులచేత గద్దియలచేత నలంకరింపబడి యున్నది. ఆసభామధ్యంబున నా ఫలపుష్పములు రెండును వ్రేలగట్టిరి. వానిపరిమళ మాసభ్యులకు నాసాపర్వము గావించుచున్నది.

అందు మండలాకృతిగా నమరింపబడియున్న సింహాసనముల మహారాజులు గూర్చుండిరి. రెండవశ్రేణియందు దరతరముగా నధికారులు కూర్చుండిరి. యొకదెస పండితులు నొకదెస గాయకులు మొదలగువారు సభ నలంకరించిరి.

అట్టిసభలో నే నొకమూల పీఠముపై గూర్చుండి వారు చేయబోవు నుపన్యాసమునకు చెవియొగ్గి యుంటిని. ఇంతలో నగ్రాసనాధిపతి యానతింబూని యాగ్రామ ప్రభువైన ధర్మాంగదమహారాజుగారు నిలువంబడి యెల్లరు విన దెల్లముగా నిట్లనిరి.

ఆర్యులారా! లోకాతీతమగు వస్తువెద్దియేని సంప్రాప్తిమగు నప్పు డద్దానివిశేష మెల్లరకు దెలియజేయుట రాజధర్మము. ఈ యద్భుతఫలమాహాత్మ్యము నేను జెప్పకయే మీకు దెలియబడు చున్నయదిగదా! ఈ పుష్పము సైతము పరిమళమును నీఫలవృక్షసంజాతమైనట్లే తోచుచున్నది. ఇది యెన్నిదినములున్నను వాడక యీరీతినే యుండును. నేను పదిదినములనుండి చూచుచున్నాను. ఇంచుకయైనకాంతి దప్పలేదు. ఇట్టిమహిమ కల్పవృక్షసంజాతములకుగాక మరియొకవానికి గలుగదు. ఈఫలమును దినుట వలన కలుగులాభ మెట్టిదియో యెవ్వరికిని దెలియదు. ఎద్దియో విశేషములుండకపోదని నేను రూఢముగా జెప్పగలను. అయినను నివి మాయొద్దకు పెక్కంతరముల నుండి వచ్చినవి. వచ్చినవిధమంతయు నాయాయీజనులచేత మీకు దెలియజేయుంచెదను. బుద్ధిమంతులగు మీరును తరువాత వీని పూర్వోత్తరములను గురించి యాలోచింతురు గాకయని పలుకుచు నా ఫలపుష్పముల సంగతి గురుతెరిగిన మనుష్యులముందర నంతకుమున్నే యప్పటికి రప్పించియున్నవాడు గావున వారికెల్ల మీకు దెలిసినసంగతులు యదార్ధముగా గ్రమము దప్పక జెప్పుడని యాజ్ఞాపించెను. అందు ముందుగా భీమశర్మయను బ్రహ్మచారి లేచి సభ్యులకు నమస్కరింపుచు నిట్లనియె.

అద్భుతఫలము కథ

సభాసదులారా! నా కాపురము విజయపురియను నగ్రహారము. నాపేరు భీమశర్మ యందురు. నేనొకనాఁటి సాయంకాలమున మాయన్న చేసిన యవమానము సహింపలేక చావవలయునను తాత్పర్యముతో మాయూరిప్రాంతమందున్న యడవికి బోయి యందు మెడకురి దగిలించుకొని బిగించుకొనుసమయములో నెవ్వడో యొకపురుషుడు పంచకళ్యాణిగుర్ర మెక్కి యాదారింబోవుచు నాయుద్యమము చూచి తటాలున గుర్రము దిగివచ్చి నాచేయి బట్టికొని యిట్టిసాహసము జేయ గారణమేమియని యడిగి నావృత్తాంతమంతయు విని జాలిపడి నన్నోదార్చుచు మనంబున నెద్దియో ధ్యానించి పిమ్మట దనచెంగు ముడివిప్పెను.

అందు నీఫలమును పుష్పమును ప్రకాశించుచున్నవి. ఫలము మాత్రము నాకిచ్చుచు వడుగా! ఇదిమిగుల మహిమగలది. నీదరిద్రము తీర్చువానికే దీనినిమ్ము. సాధారణులకియ్యవద్దు. పోపొమ్మని నాకనుజ్ఞయిచ్చి యతండు గుర్రమెక్కి యెక్కడకో పోయెను. పిమ్మట నేను మిగుల సంతోషించుచు కాఫలమును పదిలముగా ధోవతిని మూటగట్టికొని మాదేశప్రభువగు నీధర్మాంగద మహారాజుగారి కిచ్చినచో నాకు గొప్పబహుమతి జేయునని నిశ్చయించి కతిపయప్రయాణముల నీధర్మపురి జేరితిని.

నేను వీధింబడి బోవుచుండగా నెన్నిపొరలలో నిమిడ్చి కట్టినను దీని పరిమళము నిలుపక దెసల వ్యాపింపం దొడంగినది. వీధియరుగున గూర్చుండిన కుబేరదత్తుడను కోమటి కావాసన కొట్టుటయు వీధింబోవుచున్న నన్ను దరికి బిలిచి బ్రాహ్మణుడా! మీ దేయూరు ఆబట్టలో నున్న వస్తువేమియని యడగెను. ఆ శెట్టి మిగుల భాగ్యవంతుడని యెఱిగియున్నవాడగావున గొప్పవానితో బొంకనేలయని యాతనితో నాఫలవృత్తాంతమంతయు జెప్పితిని. ఆకుబేరదత్తుండును నామాట విని నన్ను మిక్కిలి గౌరవముగా దనమేడమీదికి దీసికొనిపోయి యేదేది ఫలమెట్టిదో మూటవిప్పి చూపింపుమని తొందరబెట్టెను.

అప్పుడు నేను మెల్లన మూటవిప్పి యాఫలమతనికి జూపించితిని. దానిం జూచి యతండు మిగుల నద్భుతమందుచు బ్రాహ్మణుడా! దీని దినిన సంతానము గలుగునాయని యడిగెను.

ఆ సంగతి నాకుదెలియదు. నేనెఱింగిన సంగతి నీకుదెలియ జెప్పితినని యుత్తరము సెప్పితిని. తరువాత నత డయ్యా ! నీకు బదికాసు లిచ్చెద దీని నాకిచ్చెదవా యని యడిగెను. నేను రాజుగారికై దీని దీసికొనిపోవుచున్నాను. పదికాసులకు నిరువది కాసులకు నమ్మను. దీనివలన గ్రామముగాని ముఠాగాని రావలయునని కోరికయున్నది. సామాన్యుల కియ్యవద్దని మొదటనే యమ్మహాపురుషుడు చెప్పియున్నాడు. పోయివచ్చెద ననుజ్జయిమ్మ నిలేవబోవునంత నతండు నన్ను జేయిబట్టుకొని కూర్చుండబెట్టి కొసరికొసరి చివరకు లక్షరూపాయ లిచ్చెదనని చెప్పెను. అప్పుడతని మాటలకు మోమోటపడి నేను రాజుగారు మాత్రమింతకన్న నెక్కువనిత్తురా ? యీవిత్తమున నాయంతరము సుఖముగా గడుపుకొనవచ్చును. ఎక్కడికి? ఆశ కంతమున్నదియా యని సంతుష్టితో దానికి సమ్మతించి యాఫల మాశీర్వచన పూర్వకముగా నతనిచేతిలోనుంచి యాధన మిమ్మని యడిగితిని.

అతం డాఫలము నొకపెట్టెలో దాచి నన్ను వీథిలోనికి దీసికొని వచ్చి అయ్యా! ధనమంతయు నిప్పుడు సిద్ధముగాలేదు. రేపటియుదయమునకువచ్చును. శ్రమయని యాలోచింపక ప్రొద్దున్న దయచేయుడు. మీవిత్తమున కేమియు భయము లేదు. మీపెట్టెలోనిదేయని తలంచుకొని యుండుడు. ఇప్పుడే దానికి మనుష్యుని పంపుచున్నానని చెప్పెను. వర్తకులమాయ లెవ్వరికిదెలియును? వానిమాటలు యథార్థము లేయని యప్పటికి బసలోనికి బోయితిని. మరునాడుదయముననే నా కుబేరదత్తుని ఇంటికి బోయితిని! ఆతండు నన్నుజూచి అయ్యో! తెల్లవారకుండ వచ్చితివేమయ్యా! యూరికిబోయిన మనుష్యుడు రావలయునా? మీసొత్తున కేమియు భయము లేదు. ఒకవేళ వాడు మధ్యాహ్నమునకు వచ్చునేమో! తమరు సాయంకాలమున రండి. మీసొమ్ము తీసికొని పొండని సమాధానపరచి మరల బసకు బంపెను.

అతడు చెప్పినప్రకారము నేను సంజవేళ వానియింటికి బోయితిని. అప్పుడు నన్నుజూచి అయ్యా! ఆకూలివా డింకను కాలేదు కారణమేమో తెలియదు. ఉదయమునకు దప్పకవచ్చును. ఇప్పటికి వెళ్ళి ప్రొద్దుటరండి అనిచెప్పెను. వానిమాట యథార్థమే యనుకొని అప్పటికిబోయి యుదయమున మరలవచ్చితిని. అప్పుడును వెళ్ళిన మనుష్యుడు రాలేదేయని చెప్పెను. ఆరీతి నాలుగుదినములు త్రిప్పి అయిదవదినమున మనుష్యుడు వచ్చినాడు కాని సొమ్ముతీసికొని రాలేదు, వారము దినములలో బంపెదనని అచ్చటివర్తకుడు చెప్పినాడట. అతండు నాకు బాకీయున్న వాడు. కాబట్టి మీరు వారము తాళివచ్చినచో మీసొమ్మంతయు నిచ్చెదమని చెప్పెను. అప్పుడు నే ననుమానము జెందుచు వర్తకుడా! నీకుసొమ్ము నిలువుగాయున్నప్పుడే కొనవచ్చును. ఈపాటికి నాపండు నాకిమ్ము. పోయెదనని యడిగితిని. అవ్వర్తకుండు అయ్యో! ఇంతమాత్రమునకే నన్ను నమ్మవా? అని యొండురెండుమాడ లైనచో నెక్కడనైన, సర్దుదును నిలవంబడి నూరురూకలు తెమ్మన్న నెట్లుతెచ్చును? ఆనక రండు యెక్కడనో చూచి యిచ్చెదనని చెప్పెను. అప్పుడు నేను తొందరపడుచు నేమీ ! నూరురూకలా? నామొగమువంక దిన్నగాజూచి చెప్పుము. నేను దీని నీ కమ్మను. నాఫలము నాకుదెమ్ము నీపాటివారా దానిఁగొనువారని యుగ్రముగా బలికితిని.

నా మాటవిని యా కోమటి యో వెఱ్ఱిబ్రాహ్మణుడా! నిజముగా నాఫలమునకు లక్షరూపాయ లితువనుకొంటివి గాబోలు నీవు గ్రామమనియు ముఠాయనియు పలికినమాటలువిని యపేక్షకు నద్భుతపడి లక్షరూపాయలని పరిహాసముగా నంటినిగాని యది యథార్థముకాదు. ఊరక వెర్రియాశపడక నేనిచ్చిన దానితో సంతోషించి వెళ్ళుడు. నేను కావున నింతమాత్రమైన నిత్తునని చెప్పుచుంటిని రాజుగారైన నూరకయె పంపుదురు. అని చెప్పచు పదిరూపాయలు నాకియ్యవచ్చెను.

అప్పుడు నేను మిగుల నహంకారముచేయుచు నాకీసొమ్మక్కరలేదు. నాపండు నాకిమ్మని బలవంత పెట్టితిని. ఆ ఫల మిదివరకే తింటిమి. చేదుగానున్నది. దానిగుణ మేమియు నాకు గనంబడలేదు. నీ కాసబెట్టితిని గదా అని యిచ్చుచుంటిని. కాని అది కానియైన చేయదని యా కోమటి నాకు బదులుచెప్పెను. అతనిమాటలు విని నేను గుండెలు బాదుకొనుచు అయ్యో! ఈకోమటి నన్ను మోసపుచ్చి నాఫలము హరించి నాడు. నా కియ్యవలసినసొ మ్మియ్యకున్నాడు. చూచితిరా పెద్దమనుష్యలని యాప్రాంతమం దున్నవారితో జెప్పి తగవుపెట్టితిని. అచ్చటి పెద్దమనుష్యులు వచ్చి యాకోమటితో నీబ్రాహ్మణుడు తన ఫలము హరించి యిచ్చెదనన్న సొమ్మిచ్చితివి కావని తగవుపెట్టుచున్నాడు. దీనికి నీ వేమి చెప్పెదవని అడిగిరి.

అప్పుడా కుబేరదత్తుడు వారితో అయ్యా! ఈ బ్రాహ్మణుడు పదిదినముల క్రిందట నడవిపండెద్దియో మూటగట్టుకొని యీదారిం బోవుచుండెను. అత్తరి నేనది యేమిఅని అడిగితిని. ఈపారుడిది యద్భుతమైన ఫలమని నాతో డాంబికపుమాటలు కొన్ని చెప్పెను. ఆమాటలు యథార్థమని యెంతకిత్తువని అడిగితిని. ఆయన దురాశగా జెప్పెను. నేనుదానికి దగినట్టు పరిహాసముగానే మాటలాడితిని పిమ్మట నీ యిష్టమువచ్చి నంత యిమ్మని సమ్మతిపడెను.

వల్లెయని నేనాఫలము దినగా జేదుగానున్నది రుచియేమియు గనంబడలేదు. పైన వికారముగానున్నది. పిచ్చి యెత్తునేమోఅని వెరచుచున్నవాడ. ఇట్టిస్థితిలోవచ్చి మేము పండుతినిన సంగతి తెలిసికొని దానికి లక్షరూపాయలు గావలయునని నిర్బంధించు చున్నాడు. ఎక్కడనైన నొకఫలము లక్షరూకల వెల జేయునేమో మీరే చెప్పుడు. అయినను బ్రాహ్మణుడుగదా! ఫలముమాటకేమి? నాకు ఫలమైన నుండదాయని పది రూపాయ లియ్యబోయిన బుచ్చుకొనక యూరక పిచ్చికేకలు వైచుచున్నవాడు. ఇట్టి దరిద్రుని నాచెంతకు బిలుచుట నాదేతప్పుఅని యుక్తయుక్తముగా వారితో జెప్పెను.

వాండ్రందరు వాని మాటనమ్మి ఎట్టిఫలమైనను లక్షరూపాయల వెలిజేయదని పలుకుచు నెదురునన్నే బూటకమువానిగా దలంచి మిక్కిలి మందలించిరి. అంత నేను చింతాకులస్వాంతుడనయి యేమియు జేయునది లేక ఎవ్వరితో జెప్పినను నమ్మకుండుటచే చివరికిది నా దురదృష్టమని తలంచుచు గలంకపడి రెండుమూడుపవాసములతో నీధర్మాంగదమహారాజుగారి యొద్దకు వచ్చి చెప్పుకొంటిని.

ధర్మప్రభువగు నీ మహారాజు నామొర నాలించి యాక్షణమందే యాకుబేరదత్తుని తీసికొనిరండని తనదూతలనంపెను. ఆ క్రిందటిరాత్రియే వాని యిల్లంతయు దొంగలు కొల్ల బెట్టి యింటిలోనున్న ధనమంతయు బెట్టెలతో గూడ నెత్తుకొనిపోవుటచే వీధిలోబడి గుండెలు బాదుకొనుచు కుబేరదత్తుం డేడ్చుచుండెను.

సీ. నరనాథ కులకాననముల దహింపంగ
             నవనీసురులవిత్త మగ్నికీల
    జననాయకుల నిజైశ్వర్యాబ్దు లింకింప
             బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు

    పార్థివోత్తముల సంపచ్చైలముల గూల్ప
             భూసురధనము దంభోళిధార
    జగతీవరులకీర్తిచంద్రిక మాయింప
             సూర్యోదయము ధరాసురుల సొమ్ము

గీ. విప్రతితిసొమ్ము కంటెను విషము మేలు
    గరళమునకును బ్రతికృతి గలదు గాని
    దాని మాన్పంగ భువి నౌషధములు లేవు
    గాన బ్రాహ్మస్వరములు గొంట గాదు జగతి.

అని భాగవతంబున జెప్పబడియున్న నీతి యేంతప్పును. పిమ్మట నాభటులు పటురయంబున నక్కుబేరదత్తు నానృపసత్తము నొద్దకు దీసికొనివచ్చిరి. ఇచ్చటను మొదట బెక్కు పోకలంబోయెను. గాని రాజదండన భయంబున జివరకు నిజముజెప్పి యాఫలమున్న మందసము గూడ దొంగలెత్తుకొని పోయిరని విన్నవించుకొనియెను.

తర్వాత నీభూతలపతి యతిప్రయత్నముతో నెట్లో వెదికించి తుదకు నీ ఫలమును బట్టికొనెను. ఇంతియ నేనెరింగినది యని యాబ్రహ్మచారి యుపన్యసించి తర్వాత తన పీఠముమీద గూర్చుండెను. అప్పుడందరు గరతాళములు వాయించిరి.

అటుపిమ్మట నందున్న కుబేరదత్తుడులేచి సభకు మ్రొక్కుచు అయ్యా! యీ భీమశర్మ చెప్పినదంతయు నిక్కువము. నేను ధనలోభమున బ్రాహ్మణుని మోసము జేసినందులకు మంచి ప్రాయశ్చిత్తమైనది. క్రొత్తకాసైన నింటిలోలేదు సర్వస్వము చోరులు కొల్లబెట్టిరి. నిందల పాల్పడితిని. ఇకనెప్పుడు నిట్టిపనులు చేయకుండ బుద్ధివచ్చునట్లందరిలో నపరాధము జెప్పుకొనుచున్నవాడనని లెంపలు వాయించుకొని కూర్చుండెను.

తరువాత రాజు నానతి రెక్కలుగట్టి తీసికొని రాబడిన తస్కరులిట్లనిరి. అయ్యలారా ! దైవప్రేరితమైన బుద్ధిచే మేమా కుబేరదత్తునిల్లు గొల్లబెట్టి యాపెట్టెలన్నియు నీయూరనే వాడుక ప్రకారము నిపుణికుడను కంసాలియింటికి దీసికొనిపోయితిమి. ఆ స్వర్ణకారుడు మాయెదుటనే యిన్ని పెట్టెలు విడదీసి యందున్న సరుకులన్నియు జూపించెను.

తుదకొక పెట్టెలో నీ ఫలమున్నది. దీని పరిమళమునకు వెఱగంది యిట్టి ఫల మీ శెట్టి ఎచ్చటనుండి తెచ్చునోయని పలుతెరంగుల చింతించితిమి. తరువాత మేమా ధనమంతయు బంచుకొనుచు నీ ఫలమును నిపుణికుడు కోరినందున వాని కిచ్చితిమి. అతండేమి చేసెనో మేమెఱుగము. ఇదియే మాకు తెలిసినది యని చెప్పిరి. పిమ్మట నా కంసాలి అయ్యా ! నేనాఫల సువాసనకు వెఱగపడి యాదొంగలను కోరి దీనిం బుచ్చుకొంటి రెండుమూడు దినములు నాయొద్దనే దాచి యిట్టి యద్భుతఫలము నేను దినిన నేమి లాభమున్నది తారావళి కిచ్చిన మిగుల సంతసించునని నాకు భోగభామినియైన తారావళి యనువేశ్య కిచ్చితిని.

అదియు దాని విశేషము లరసి మిగుల మురియుచు దానుసైతము భక్షింపక కేళీసౌధంబున గందుకముగా వ్రేలగట్టినది. ఇంతలో రాజభటు లాఫలమును గురించి వెదకుచుండుట విని మోసము వచ్చునని జడియుచు దాని నెచ్చటనయిన బారవేయుమని యావేశ్యకు బోధించితిని. అదియు భయపడుచు దానినొకపెట్టెలో బెట్టి తన దాదికిచ్చి కందకములో పారవేసి రమ్మని రాత్రివేళ నంపినది ఇంతవరకె నేనెరుంగుదునని యా కంసాలి నుడివెను.

పిమ్మట నాదాసిని నిలబెట్టి చెప్పమని రాజభటులు బంధించిన నాదాది గజగజ వణంకుచు నిట్లనియె అయ్యా! నే నాఫలమున్న పెట్టెను నెత్తిమీద బెట్టుకొని యాకందకమునకు బోవుచు దారిలోనున్న నావిటపురుషునిం జూడవలయునని వాని యింటికి బోయిన వాడు నన్ను జూచి సంతోషించుచు నీపెట్టెలో నున్నదియేమని యడిగెను.

అప్పుడు నేనిదియొక యద్భుతఫలము దీనిని నీకొరకెంతో కష్టపడి తెచ్చితిని. చూడుమని యాపెట్టెతీసి చూపించితిని. వాడు దానికి సంతసించుచు నాకు దన యందుగల ప్రేమాతిశయమును గురించి మిక్కిలి మెచ్చుకొనియెను. ఆ రాత్రి యచ్చటనుండి యుదయమున మరల మాయేలికసానియైన తారావళి యింటికివచ్చి యాఫలమును గందకములో బారవైచితినని చెప్పితిని. అని యిట్లు దాది చెప్పిన తరువాత రాజభటచోదితుడైన యావిటపురుషుడు సభవారికిట్లనియె.

అయ్యా ! నేనిట్టిపండు తినిన లాభమేమియు గలుగదు. అంగడికి దీసికొనిపోయి యమ్మిన నెక్కుడువెల రాగలదని నిశ్చయించి దీనికాపట్య మెరుగక ధారాళముగా నంగడికి దీసికొనిపోవుచుంటిని. దాని పరిమళము నలుమూలలు వ్యాపించినది. జనులందరు వెఱగందుచు నీగల ముసిరినట్లు మూగిరి.

అంతలో రాజభటులు వచ్చి నన్ను బట్టుకొని నికీఫల మెక్కడ దొరికినదని నిర్భందించుచు బందీగృహంబునకు దీసికొనిపోయిరి. వారి దెబ్బలకు దాళలేక నేను యథార్ధము జెప్పితిని. తరువాత గ్రమముగా నాదాదిని తారావళిని కంపాలిని దొంగలను బట్టుకొని యీ రాజభటులు దాని గుట్టంతయు బయలుపరచిరి. అని యావిటపురుషుడు చెప్పెను. అప్పుడందరు కరతాళములు వాయించిరి. ఈరీతి ఫలాగమనవృత్తాంతమంతయు సభ్యులకు దేటబడిన పిమ్మట నాపుష్పసమాగమవిధముగూడ దెలుపుటకయి వారివారి నాజ్ఞాపించిరి. అందుమూలముగా వృద్ధబ్రాహ్మణుడు లేచి మెల్లన నిట్లనియె.

అద్భుతపుష్పముకథ

అయ్యా! నేనొక్కనాటి మధ్యాహ్నపువేళ నొకయడవిమార్గమున బోవుచుండగా నొకచెట్టుక్రింద జక్కని చిన్నదియొకతె కూర్చున్నది ఆమె కన్నులు తెల్లతామరరేకులవలె సోగలై కర్ణముల పర్యంతము వ్యాపించియున్నవి. శరీరచ్చాయ పచ్చనిది. తెల్లనిచీర గట్టుకొని యున్నది. నగలేమియును లేకున్నను దేవకన్యవలె బ్రకాశించుచున్నది. ఆమె ప్రక్కనొక్క పెద్దగుఱ్ఱ మున్నది. దానినెక్కి ఎక్కడికో పోవుచున్నది. ఆచిన్నది నాదరిద్రమంతయును విని జాలిపడి కొంతసే పెద్దియో యాలోచించి తన చెంగున మూటగట్టియున్న ఈ పుష్పము నాకిచ్చి ఎల్లకాలము నీకుటుంబము పోషించువారికే ఈ పుష్పం బియ్యవలయునని చెప్పి యామె ఎచ్చటకో పోయినది.

ఆమెను నాభాగ్యదేవతనుగా భావించి యామె చెప్పినమాటలు మంత్రోపదేశముగా జపించుకొనుచు నాకనాటి సాయంకాలమున కొక యూరుచేరితిని. ఆ గ్రామము పేరెద్దియో నేనెరుగను. నేను గ్రామములో ప్రవేశింపకమున్నే యిద్దరు మనుష్యులు గుర్రము లెక్కి విహారర్థమై పోవుచు నాకెదురుపడిరి.

అట్లు గుర్రములెక్కి వడిగా బోవుచున్న వారిని నా మూటలోనున్న పుష్పపరిమళముసోకి యడుగయినను గదలనిచ్చినది కాదు అపూర్వమైన యాసువాసనకు వారు వెఱగందుచు నలుమూలలు వెదకుచు నాయొద్దకువచ్చి బ్రాహ్మణుడా! నీ యొద్దనేమైనను బరిమళద్రవ్యమున్నదియా అని యడిగిరి.

లఘుబుద్ధినైన నేనాగుట్టుదాపలేక వారి మాటవిని ఔను. ఉన్నది. ఇదిగో అద్భుతమైనపూవని యా మూటవిప్పి వారికి జూపితిని. వారు దానింజూచి మిక్కిలి యక్కజమందుచు నీకీ పూవెక్కడదని యడిగిన గుట్టు దాచక యథార్ధమంతయుం జెప్పితిని. ఆ మాటలు విని వారు మిగుల సంతోషించుచు అయ్యా, మీ కుటుంబము నెల్లకాలము మేము పోషించెదము. మా యింటికి రండు ఈ పుష్పము మాకిమ్మని వేడుకొనిరి. వారి మాటలకు నేను సంతోషము జెంది నాకుటుంబమును మీరు పోషించుటకు ద్రికరణములచేతను బాధ్యతపడియెదరేని యిప్పుడే యీ సుమము మీకిచ్చుచున్నానని పలికి ముమ్మారువారిచే బ్రమాణికము జేయించి యా ప్రసూనరాజము వారి కిచ్చితిని.

పిమ్మట వారు మమ్ముదమయింటికి దీసికొనిపోయి చెప్పిన ప్రకారము గౌరవముగా బోషింపుచుండిరి. ఆజన్మదరిద్రులకు స్వల్పలాభము సైతము రాజ్యపదవిగా దోచుచుండును. వారు చేయుచున్న భోజనము మాత్రపు సదుపాయమే నాకు బట్టాభిషేకములాగున దోగుచున్నది. మొదట నేను వారిద్దరు నొక్కటియే అనుకొంటిని గాని పదిదినములు విచారించినంత వారిద్దరు మిత్రులనియు మమ్ము బోషించు విషయములో నిరువురు సవరించుచున్నారనియుం దెలిసికొంటిని. వారిరువురకు నొక్కతెయే విటకత్తెకలదు. దానిమూలముననే వారికట్లు మైత్రిగలిగెను.

ఆవృత్తాంతమంతయు నాకు మరి పదిదినములకు వెల్లడియైనది. ఇట్లీ యధమవృత్తిగలవారి కీప్రసూన మిచ్చితినే యని పశ్చాత్తాపము జెందుచుంటిని. ఇట్లుండునంత మరిపదిదినములకు నావిటకత్తియ మూలముననే వారిరువురకు విరోధము పుట్టి క్రమక్రమంబున బలసి తుదకు వారికి ముఖావలోకనములు లేకపోయినవి.

శ్లో॥ అవజ్ఞాస్పుటితంప్రేమ యేకీకర్తుంక ఈశ్వరః।
     సంధింనయాతిస్ఫుటితం లాక్షాలేపేనమౌక్తికం॥

బద్ధలైన ముత్తెము లత్తుకచే నత్తుకొననట్లు సమానముచేత విడిపోయిన స్నేహము మరల గూడికొనదు. ఒకనిమిషమైనను విడువక యేకదేహముగా వర్తించు వారిరువురును కాంతామూలమున శత్రువులైన తిరస్కారవాక్యములచే రోషము బెంచుకొని యొకనాటిరాత్రి దొమ్మియుద్ధములో నొకరిచేత నొకరు చంపబడిరి.

పిమ్మట మమ్ము బోషించువారు లేక యాపూవు విషయమై వారి ఇండ్లలో వెదకి యెందునుంగానక చింతించుచు జివరకా విటకత్తియ యింటిలో నుండుట విని దానియొద్దకుబోయి యాపుష్పమును గురించి జరిగిన శపథముల తెరంగెరింగించి యిమ్మని యడిగితిని. ఆలంజతొత్తు ఇది నాసొత్తయినది. అవసరమున్నయెడల వారి దాయాదులమీద ఋణముగట్టి అధికారులతో జెప్పుకొనుము. పొమ్మని నన్ను దిరస్కరించి పలికినది.

అప్పు డాసంగతి నేను గ్రామాధికారులతో జెప్పితిని. వారు దానిని రప్పించి యడుగగా నాయొద్ద జెప్పినట్లే వారియొద్దను బింకముగా జెప్పినది. వారును కర్తవ్యమెద్దియో తెలియక చింతించుచుండిరి. ఇంతలో మాదేశప్రభువగు చండవర్మ మహారాజుగా రిచ్చట సభకు వచ్చుచు నాదినమున మాగ్రామములో బసజేసిరి. కావున నాసంగతులన్నియు వారికి దెలియజేసితిని.

"రత్నహారీతుపాధిన్‌వః" అని యున్నదిగదా! శ్రేష్టమైన వస్తువుల విషయమై రాజులు అభిలాష వహింతురు. చండవర్మ మహారాజుగారు పైసంగతులన్నియు దరువాత విచారించెదగాక యని యాపూవు పుచ్చుకొని మమ్ముగూడ రమ్మని చెప్పి యీసభకు వచ్చిరి. ఇదియే దీనివృత్తాంతమని చెప్పి యాబ్రాహ్మణుడు గూర్చుండెను. అప్పుడు సభ్యులందరు మఱల గరతాళధ్వనులచే నాసభామంటపమంతయు మ్రోగింపజేసిరి. అంతట చండవర్మ మహారాజు లేచి సామాజికుల కిట్లనియె.

అయ్యా! ఈఫలపుష్పాగమములరీతి మనమందరము వినియుంటిమి గదా! బ్రహ్మచారి తనకీఫల మిచ్చినవాడు పురుషు డనియు నప్పు డీపువ్వు వాని మూటలోనుండగా జూచితిననియుం జెప్పెను. ఈవృద్ధబ్రాహ్మణుడు చక్కని స్త్రీ యీపూవు నిచ్చెనని చెప్పుచున్నాడు. ఈవిషయములో గొంచె మాలోచించవలసి యున్నది అని చెప్పుచు నా బ్రహ్మచారిం బిలిచి అయ్యా! నీకు ఫలమిచ్చిన పురుషుని పోలిక యెట్లున్నదో చెప్పగలవా యని యడిగెను.

ఆ బ్రహ్మచారి యప్పుడు కనుచీకటిగా నుండుటచే నిదానముగా బరిశీలింప లేదు. పురుషుడనుకొంటినేకాని యదియు నిశ్చయముగా జెప్పలేను. మూటవిప్పినప్పుడు పయ్యెద చెంగులాగున గనంబడినది గుర్రమెక్కివచ్చెను గావున బురుషుడని చెప్పు చుంటిని. గుర్రము మాత్రము పంచకళ్యాణి రంగుగలది. అని చెప్పగా మరల చండవర్మ యిట్లనియె.

ఆ ఫలమును పుష్పమును నిచ్చిన మచ్చెకంటి యొక్కరీతియే. ఆమె దేవకన్య గాని మనుష్యస్త్రీ గాదు. దేవతలు భూలోకములో విలాసార్థము విహరింతురను వాడుక కలదు. ఈఫలపుష్పములు రెండును దేవలోకములోనివే. యెద్దియోకారణముచేత నానాతి వీనిందీసి కొనిపోవుచుండగా నడుమ వీరిదైన్యమువిని దయాబుద్ధితో నిచ్చినది. దేవతలు కృపాస్వభావులు గదా? ఇంతకంటె మరియొకటికాదు. ఈ బ్రహ్మచారి గురుతుపట్టజాలక పురుషడని చెప్పెను. వీరి పూర్వపుణ్యవశంబున అద్దేవికి దయ బుట్టినది. వీరి దురదృష్టవశమున బరుల చేతంబడినవి. కాని దాతృత్వమహత్వమునం బట్టి దాగినవికావు. ఇవి రాజార్హమయిన వస్తువులు. సామాన్యులకడ నుండదగవు. వీని నిత్యము బూజించుచుండవలయును. ఈబ్రాహ్మణుల కిరువురకు దగు బహుమతు లియ్యదగినది. ఇదియే నాకుదోచిన యబిప్రాయము. యింతకన్న బుద్ధిమంతుల కెద్ది యేని దోచిన వక్కాణింపనగునని పలికిన నాసభ్యులందరు నారాజు మాటలే యదార్ధము లనియు సహేతుకములనియు గర్తవ్యములనియు నేక వాక్యము గా బలికిరి.

ఇట్లు కొంతసేపా ఫలపుష్పముల గురించి యుపన్యాసము జరిగినపిమ్మట సభావినోదార్ధము సంగీతము బాడుటకై మణిమంజరి కాజ్ఞయిచ్చిరి. అప్పుడు మణిమంజరి హాయిగా వీణ బుచ్చుకొని పాడి సభ్యులకు సంతోషము గలుగజేసినది.

సాధారణముగా గానవిద్యాభ్యాసముగలవారికి బరులు పాడునపుడు తమకు గూడ బాడవలయునని నుత్సాహము గలుగుట సహజమైయుండును. అప్పుడు నాకు వీణవతిచేసిన స్వరకల్పనలన్నియు మనంబున గురుతుగా నున్నందున వాని పాడవలయునని యొకవెర్రి యానందము గలిగినది. మణిమంజరి పాట ముగించినతోడనే నేను సభాముఖమునకు బోయి అగ్రాసనాధిపతితో అయ్యా ! నాకును గానవిద్యాపాటవము కొంచెము గలిగియున్నది. ముహూర్తమాత్రము మదీయగాంధర్వవిశేషము గూడ నవధరించి నన్ను గృతార్దుని జేయబ్రార్ధించుచున్నవాడ అనుజ్జయిత్తురేయని వేడుకొనిన ఆతండు సమ్మతించి నాకొక వీణ నిప్పించెను.

అప్పుడు మిగుల సంతోషముతో నేనావీణ బుచ్చుకొని సారెల జక్కగా సవరించి కొంతసేపు పూర్వమునేర్చిన విశేషములన్నియుం బాడి పిమ్మట వీణావతి స్వరకల్పన లెత్తుకొని యొక కృతిబాడితిని. అప్పుడు సభ్యులందరు చిత్రప్రతిమలవలె కదలక వినుచుండిరి. మరియొక కృతిబాడగా లేచి గంతులువైచుచు నృత్యము జేయ దొడగిరి. ఇంకొకకృతికి వారుగూడ నెద్దియో పాడువారివలె కూనరాగములు తీయ దొడంగిరి. ఈరీతి మేనులు పరవశమొంద సభ్యులందరు కృతికొక వకృతియాకృతితో మెలగదొడంగిరి.

అట్లు కొంతసేపు సభ్యుల వికారము నొందించి పిమ్మట మోహనరాగంబు బాడితిని. దానిని వినుటచే అందరు నరగనుమోడ్పుతో నిద్రావశంవదులైరి. అంతటితో గానము ముగింపగా దెప్పిరిలి యందరు ఏమేమీ! అనన్నా! ఔరా! యని అద్బుతము జెందుచు నిది దేవగానము కాని మనుష్యగానము గాదనియు నితడు తుంబురుడో నారదుడో కాని మనుష్యమాత్రుడు కాదనియు నిటువంటి విచిత్ర మిదివరకు విని యుండలేదనియు జేతనము లచేతనములుగాగ గానముపాడిరను మాట యథార్థమయ్యె ననియు నీ మొదలగు స్తుతివాక్యముల సభ్యులందరు అద్భుతముగా జెప్పుకొన దొడంగిరి.

మణిమంజరియు నాస్వరకల్పన లిట్టివని తెలియక వెఱగందుచుండెను. పిమ్మట ధర్మాంగదుడు నన్ను గౌరవముగా జేరబిలిచి పీఠమిచ్చి అయ్యా! తమదేశ మెద్ది? ఎచ్చటికి బోవుచున్నారు? మీ నామవర్ణంబులేయవి? ఇచ్చటి కెప్పుడు వచ్చితిరి. ఈ అద్భుతగీత మెం దభ్యసించినారు? ఇట్టి విద్య జెప్పదగిన యుపాధ్యాయు డీలోకములో నున్నవాడా? మీఫలపుష్పముల లాగున మీరును నయత్నోపలబ్ధముగా దటస్థించిరి. మాయదృష్టము మంచిదని యనేకవిధముగా స్తుతిచేసెను.

అప్పుడు నేనాఱేనిమాటలు విని కొంత యాలోచించి సంతసించు వానివలె అభినయించుచు అయ్యా! నాపేరు సింహకేతు డందురు. నాజాతి క్షత్రియజాతి, మాది కాశీపురము, దేశాటనము సేయవలయునను అభిలాషతో నిందువచ్చితిని. నేనీ గానము స్వయంకృషివలననే కాని యొకరివలన నేర్చుకొనియుండలేదు. ఇచ్చట సభ జరుగునని విని చూచుటకై వచ్చితి నిదియే నా వృత్తాంతమని చెప్పితిని.

అప్పుడు చండవర్మ నన్ను మీకు వివాహమైనదియా? అని యడిగెను. కాలేదని చెప్పితిని. మరల నతండు మరియు దమ కేయేవిద్యలలో బరిశ్రమగలదని యడుగగా నాకు కొంచెము కొంచెముగా నన్ని విద్యలలోను ప్రశంసయున్నదని చెప్పితిని. తరుచు గాయకులకు నితర విద్యాపరిశ్రమ గలిగియుండుట అరుదు. నాకన్ని విద్యలయందు పాటవము గలదని చెప్పినతోడనే సభ్యులందరు నా విద్యాపరిశ్రమ మెట్టిదో వినవలయునని కుతూహలము గలిగి మరునాడు శాస్త్ర ప్రసంగమునకు మరల సభ చేయవలయునని యమ్మహారాజుగారిని వేడుకొనిరి. అందు మిగుల శాస్త్రపరిచయము గల పండితులు పెక్కండ్రు గలిగియుండిరి. వారితో వాదమునిమిత్తము మరునాడు సభచేయుదుమనియు నందుగూడ దమ విద్యామహత్వము జూపి మ మ్మానందింపచేయవలయునని ధర్మాంగదమహారాజుగారు నన్ను ప్రార్ధించిరి.

దీనికింత నన్ను స్తుతిసేయవలదనియు నట్టి ప్రసంగములకయి ఎన్ని దినములుండుమనిన నుందుననియు దీనికే నేను దేశాటనము చేయుచున్నాననియు జెప్పితిని. అంతటితో నాటిసభముగించిరి. అంత మరునాడు మధ్యాహ్నమే యాసమాజ మారంభమయినది. అదివరకు నాప్రఖ్యాతి విని యాదినమున జరుగబోవు ప్రసంగముల జూచుటకు బాలవృద్ధముగా వేలవేలు జను లాసభకు వచ్చిరి. అందు దిగ్దంతులను ప్రసిద్ధిగలిగి యనేక రాజసభలలో జయపత్రికలు గొన్న మహాపండితులు నలుగురు నాతో బూర్వపక్షసిద్ధాంతములుసేయ నిరూపింపబడిరి. వారికి నన్ని విద్యలలో బరిశ్రమ గలిగియున్నది. ఒక్కొక్క శాస్త్రమునందు రెండుమూడు పూర్వపక్షములుచేసి యోడంబుచ్చి వారు చెప్పినది తప్పనియు నేను జెప్పినది యొప్పునియు వారిచేతనే యొప్పించితిని. అప్పుడు నావాదనైపుణ్యము బూర్వపక్షసిద్ధాంతముల చాతుర్యము ప్రశాంతతాబోధత్వము గ్రహణధారణలపొందు లోనగు నాప్రజ్ఞలజూచి నాప్రతివాదులే నన్ను స్తుతిజేసిరి. అప్పుడు మదీయాద్భుత విద్యావైశారధ్యమునకు మెచ్చుకొనుచు ధర్మాంగదుండు చండవర్మ మొదలగు రాజులు దమలోనెద్దియో యాలోచించుకొని స్తుతివాక్యపురస్సరముగా నాకిట్లనిరి.

రాజకుమారా ! నీవమానుషప్రభావము గలవాడవు. నీవిద్యలన్నియు నట్టివే. మరియు విశేషించి నీరూపమువలెనే సంగీతము త్రిలోకమోహజనక మైనది. ఈ విషయములచే మాకు మిగుల నానందము గలుగజేసితివి. ఇట్టి నీకు బారితోషికమిచ్చుటకు మాయొద్ద దగిన వేమియును లేవు. మారాజ్యమంతయు నిచ్చినను నీవిద్యకు బ్రతికాదు. నీవిద్య జగత్ప్రకాశమైనది. దానికితోడుగా నిట్టి మహిమగల యీఫలపుష్పములు రెండును నీయొద్దనుండినచో బంగారునకు పరిమళము గలిగినట్లుండును. భగవంతుడుసైతము భక్తితో వచ్చిన ఫలపుష్పములచేతనేకదా సంతసించును. నీవును అట్లే సంతసింపవలయునని పలుకుచు నా ఫలపుష్పములు రెండును నాకిచ్చిరి.

వానిని నేను వినయపూర్వకముగా స్వీకరించి వారితో నిట్లంటిని. అయ్యా! మీరు నా కివి ప్రసాదపూర్వకముగా నిచ్చితిరి వీని వృత్తాంతము నిన్న సభలో గూర్చుండి వింటిని. ఆ బ్రాహ్మణులకు గరుణాపూర్వకముగా నెవరో యిచ్చిరి. వారి నపారధనికులుగా జేయుట వారియభిప్రాయమై యుండవచ్చును. కావున ముందు వారికి దగిన ధనమిచ్చి సంతసపరుపవలయునని బలికితిని. నా మాటలు విని వారందరు మిగుల సంతసించుచు నాబ్రాహ్మణులకు జెరియొక యగ్రహారము నిచ్చిరి. నేనాధర్మపురిలో నున్నప్పు డెప్పుడేని విహారార్థమై రాజమార్గంబున నడిచితినేని నా చుట్టునుం బెక్కండ్రు చుట్టుకొని యపురూపముగా జూచుచు దేవునికివలె నాకు వందనములుచేయుచు స్తుతి చేయ దొడంగుదురు. ఆ గ్రామమందే యొకమాసము వసించితిని. ఒకనాడు నా గుర్రము బందెపడి గ్రమముగా రాజుగారి కోటముఖమునకు దేబడినది. దానింజూచి నేను మిగుల సంతసించుచు నృపతియనుమతిని దానిని స్వీకరించితిని. ఆహా! దైవగతి ఎంత వింతయైనదో చూడుడు. న్యాయమైనసొమ్ము నట్టేట బారజిమ్మినను నట్టింటికి వచ్చునను సామెత యథార్థమైనది.

ఇదియంతయు భగవతీకటాక్షముకాక మరియొకటి కాదని నిశ్చయించుకొని కర్మానుసారముగా బుద్ధినడచుననుమాట దృఢపరచుచు మనంబు నెట్లుతోచిన నట్లు చేయుట తప్ప వేరే యాలోచింపక వ్యసనములకు జింతింపక వర్తింపుచుంటిని. అంత మళయాళ దేశప్రభువగు చండవర్మ తనగ్రామమునకు బోపు సమయమున నన్ను దనతో రమ్మని మిక్కిలి ప్రార్ధించిన సంతసించుచు నతనితో గూడ నీ గ్రామము వచ్చితిని. అతండు నాకు నెక్కుడు గౌరవముచేయుచు దనకోటలోనే యొకవిడిది నియమించి యందు నన్ను బ్రవేశపెట్టి యుపచారములకయి తగుపరిచారకుల నియమించెను. నేను సంతతము నావిలాస సౌధంబునం గూర్చుండి యావీణావతివలన దెలియబడిన స్వరవిశేషములనే పాడుచు హాయిగా గాలక్షేపము సేయుచుంటిని. ఒక నాడు సాయంకాలమున నేనా ఫలపుష్పముల రెంటిని ముందిడికొని మనోహరముగా విపంచి వాయించుచుండగా నామ్రోల నొకచిలుక వచ్చి వాలినది.

నేనును బాటసందడిలో దానిని బరామర్శింపకపోతిని. అదియు గొంతసేపు నాయవసరము వీక్షించుదానివలె నిలువంబడి నేనాగానము ముగించి యూరకున్నప్పుడు తనముక్కున దగిలించుకొని పట్టియున్న యొకపత్రికను నామ్రోలవిడిచినది. నేనా చీటిని బుచ్చుకొని విప్పి చదువుకొనినంత నందిట్లున్నది

పురుషోత్తమా! నీయపూర్వగాంధర్వమహిమాతిశయంబును మించిన కళావిలాసమునకు వన్నె వెట్టుచున్న నీసౌందర్యచాతుర్యాదివిశేషములు శ్రుతిపుటద్వారంబున హృద్గతంబులయి మదీయమానసమును హరించినవి. గాంధర్వమహిమంగాక యిట్టి యదృష్టవస్తుచోరక శక్తిగలుగునా? అపూర్వవస్తుదిదృక్ష యెవ్వారికి గలుగకుండును? అద్భుతఫలపుష్పముల నొకసారి జూచితినిగాని తన్నాయకుని సైతము చూచినప్పుడు గదా మదీయచక్షుస్సులు సాద్గుణ్యమును బొందుట. మఱియు నీ మురిపెంపు వీణాగానరసంబాన చెవులు పోరువెట్టుచున్నవి. నాచక్షుశ్రవణంబుల కలహము మాన్ప పాత్రుండవు నీవే వసంతతిలకాభిఖ్యసహకారప్రాప్తి మూలముననేకదా నశేషశోభ వహించును. మఱియును,

వసంతతిలకావృత్తము.

సౌందర్యగానకులశీల కళావిలాసాః
ప్రత్యేకతోపిచనయంతియశః పుమాంసం।
కింవాచ్యమత్ర తదశేషవిశేషలాభే।
తాదృగనంనను నవాంఛతికా వధూటీ॥

అని యున్న పత్రికను పలుమరు పఠించి దాని కల్పనకు వెఱగందుచు నోహో! ఈపత్రిక వ్రాసిన చిన్నది మిగుల చతురయు విద్వాంసురాలు నగును. ఈవృత్తమూలమున మదీయవృత్తాభిఖ్యల తెఱగెరుంగనగు నని వ్రాసినది. అభిఖ్య యనగా పేరు. వృత్తము వసంతతిలక కావున దానిపేరు వసంతతిలకయై యుండవచ్చును. దానిలోనున్న యర్థము సౌందర్యము, సంగీతము, మంచివంశము, మంచిస్వభావము, మంచివిద్య మొదలైన గుణములు. ఒక్కొక్కటి యున్నను పురుషుని గొప్పఖ్యాతి గలవానిగా జేయును. అన్నిగుణములు నొకచోట నుండినచో నేమి చెప్పదగినది. అట్టి పురుషుని ఏకామిని వరించదు, అని యున్నదిగదా! అట్టి పురుషుడవు నీవనియు నిన్ను వరించుటచేత నావృత్తము మంచిదేకాని చెడ్డదికాదనియు మరియు నా విద్యాదిగుణసంపతి దీనిమూలముననే తెల్లమగుచున్నదనియు ప్రౌఢముగా వ్రాసినది. కానిమ్ము దీని మరిగొంత పరీక్షించి చూచెదంగాక యని మఱల నొకపత్రికలో నీ క్రిందిశ్లోకము వ్రాసితిని.

శ్లో॥ జగమిషుభిః పరదారాన్ సిద్ధ్యాయతి ప్రత్యవాయ పరిహారాః॥
      ప్రాగేవచింతనీయా లబ్దావసరోహి దుర్జయోమదనః॥

ఇట్టి శ్లోకమువ్రాసి పత్రికముడిచి యా చిలుకముక్కున కందిచ్చితిని. అదియెంతనేర్పరియో చక్కగా నాచీటిని ముక్కునబిగియ గఱచుకొని రివ్వున నెగిరి పోయెను. నేను దాని మక్కువకు మిక్కిలి సంతోషించితిని. నేనును దానిపోయిన వలను చూచుచుండ నదియుంబోయి కొంతసేపటికి మరల నాయొద్దకు వచ్చి వ్రాలినది. అప్పుడు దానిముక్కుననున్న పత్రిక మరల నరసిపుచ్చుకొని విప్పి చదుకొన నందు ఆర్యా పరశబ్ద ముత్కృష్టార్థముగా భావించినచో దక్కిన శ్రమ లేమియు నుండవు కదా?

అని వ్రాయబడియున్నది. నన్ను బరదారగా భావించవద్దనియు స్వదారగా స్వీకరింపవలనియు సూచించుచున్న యాయుత్తరము చూచుకొని నేను మరల నీ భావము భాగవతమైనది కాని క్రియాభావమగునని వెఱచుచుంటినని వ్రాసి యంపుటయు భావము దిరమైయుండ గ్రియాభావ మెన్నడును కానేరదని దానికి ప్రత్యుత్తరము వ్రాసినది. ఈరీతి నుత్తరప్రత్యుత్తరములచేత మాకు బరిచయము గలిగిన పిమ్మట నొకనాటిరాత్రి నేనామేడమీద గూర్చుండి సంగీతము పాడుకొనుచుండగా నొకనెలతుక వచ్చి నాకు నమస్కరించిన నీవెవ్వతెవని యడిగితిని. అది ఆర్యా! నేను వసంతతిలక సఖురాలను. నాపేరు త్రిలోత్తమయండ్రు, మారాజపుత్రిక తమసంగీతరసంబు శ్రుతిపుటంబులగ్రోల నుత్సుకముజెంది యిక్కడి కరుదెంచినది. ప్రవేశింప ననుజ్ఞయిత్తురే యని సవినయముగా బ్రార్ధించిన నాలించి ఏమనుటకుదోచక యొక్కింతతడపు ధ్యానించి యిట్లంటి.

రాజపుత్రిక లిట్టి అర్థరాత్రమున నొరులమేడలకు సంగీతము వినుటకు వచ్చిన దప్పుకాదా? కానిమ్ము. మిగుల వచ్చినదిగదా తీసికొనిరమ్మని చెప్పిన విని యప్పడతిపోయి వసంతతిలకను బ్రవేశపెట్టినది తదీయ సౌందర్యాతిశయము నాకే విస్మయము గలుగజేసినది. అప్పుడు నే నాయింతిని గూర్చుండ గనుసన్న జేసితిని. ఆకోకస్తని నాకు నమస్కరించి కూర్చున్న యనంతరంబు నేను మనోహరముగా మోహనరాగముబాడి అచ్చేడియను మోహనివశం జేసితిని.

అప్పు డప్పడతి సిగ్గువిడచి సఖురాలితో ముదితా! ఇతడు రాగంబున మదనుండువోలె మదవతుల హృదయములు భేదింపుచున్నాడు. ఈతప్పునకు గట్టింతు మని చెప్పుమని ఏమియో పలికి మదనవికారములు నాయెదుట నభినయించిన నేనును మందలింపుచు బెద్దవారుండ గన్యకలు స్వతంత్రింపరాదు. తొందర యేమి వచ్చినది. వలదు వల దుడుగుమ‌ని యమ్మగువ యపస్మారవికారములు గుదురుపరచి సానునయముగా జెలికత్తెయతో గూడ నంపితిని.

అది యంతయు వారిపెద్దలందరు నెరింగిన కపటము కాబోలు? ఆమరునాడే రాజు నాయొద్దకువచ్చి మెల్లన నిట్టనియె. ఆర్యా! నాకు బుత్రసంతతిలేదు. వసంతతిలకయను కూతురుమాత్ర మొక్కతెగలదు అదియు విద్యాగుణరూపంబుల నీకుదగినది. దాని పాణిగ్రహణము సేసికొని యీరాజ్యభారమంతయు వహించి నీవు పాలింపుము. నేను పెద్దవాడనైతిని. ఇది నాయభీష్ట మందులకే నిన్నీయూరు దీసికొనివచ్చితి నని పలికినవిని నే నేమియు బలుకనేరక సమ్మతించిన వానివలె నభినయించుచు లజ్జావశంబున నూరకుంటిని. అంత నా వసుంధరాకాంతుండు మిగుల సంతోషించుచు నాసన్నశుభముహూర్తమున మిగుల వైభవముతో నాకా వసంతతిలక నిచ్చి వివాహము గావించెను. నే నేమిటికి నప్పూబోడిని బెండ్లియాడితినో నాకే తెలియదు. లోకములో నెట్టివారును సంకల్పపూర్వకముగ బనులు చేయుదురుగదా? నేనట్లు చేయకపోవుటకు విధినియామకముతప్ప వేరొండులేదు.

శ్లో॥ అఘటితఘటితానిఘటయతి ఘటితఘటితాని దుర్ఘటీకురుతే
     విధిరేవతానిఘటయతియాని పుమాన్నైవచింతయతి.

ఈ శ్లోకమును పలుమారు పఠించుకొనుచు నీరాజ్యలక్ష్మితో గూడ వసంతతిలకను స్వీకరించితిని. మరియు నత్తరుణితో గలసికొనినప్పుడు యుక్తియుక్తముగా నిట్లంటి. మదవతీ! నీతో మొదట నొకసంగతి చెప్పుట మరచితిని. అది యిప్పడు జ్ఞాపకమువచ్చి మిగుల చింతించుచుంటిని. నేను బెండ్లి యయిన సంవత్సరములోపల భా‌ర్యను గలిసిన మృతినొందుదును. పూర్వము నా కొకయపరాధమూలమున నిట్టిశాప మొకసన్యాసి యిచ్చెను. అంతదనుక నే నెంత బ్రతిమాలినను నీవు సమ్మతింపవద్దు సుమీ. పాండురాజు వృత్తాంత మెరుంగుదువా? ఇదియే మనస్సులో దృఢముగా జ్ఞాపక ముంచుకొనుము. సంవత్సరము దాటిన వెనుక మనయిష్టమువచ్చినట్లు క్రీడింపవచ్చు. నీ సంగతి రహస్యముగా నుంచుమని చెప్పి నాచతురతచే నాయువతి నొప్పించి సంతసము గలగజేసితిని.

అంత శీఘ్రకాలములో చండవర్మ స్వర్గస్తుడైనంత యమాత్యులు నన్ను రాజుగాజేసిరి. నేను సింహాసన మెక్కి నతోడనే నీయూర శక్తిపూజ మూలమున జరుగుచున్న జీవహింసల తెఱగంతయు విని యిట్టిపనులు చేసినచో శిక్షింతునని యాజ్ఞాపత్రికల పంపుటయే కాక రాజభటులను బురంబంతయు నెల కొకసారి పరీక్షించి బలిపురుషుల నరయునట్లు నియమించితిని మరియు వీరి మంత్రశాస్త్రపుస్తకము లన్నియు లాగికొనున ట్లాజ్ఞాపించితిని. మొన్నటినెల పరీక్షలో నీపుస్తకము తెచ్చి నాకిచ్చిరి. దానిం జూచి కాదే గురుతుబట్టి యోయింటికి వచ్చితిని ఇదియే నావృత్తాంతము దైవకృపచే నేటికి మనమందరము సుఖముగా నొకస్థలమునకు జేరితిమి. ఇదంతయు భగవతియగు విశాలాక్షి కృపగాని వేరొకటికాదు. అని తన వృత్తాంతమంతయుం జెప్పి యాఫలపుష్పములం దెచ్చి వారికి జూపినది.

వానింజూచి యారాజును మదనుడును మిగుల వెఱగుపడిరి. పిమ్మట నక్కాంత వసంతతిలకను రప్పించి యావృత్తాంత మంతయుం జెప్పి మనమనోహరుం డీతడే యని మదనుని జూపిన జూచి యాచిన్నది మిగుల సంతసించినది. పిమ్మట నావిశాలాక్షి యాఫలమహిమ యంతయు నెరింగినది గావున నమ్మహారాజుతో దేవా ! ఈఫలము నాకు విశాలాక్షి మహాదేవి పసాదపూర్వకముగా నిచ్చినది. దీనిని భక్షించిన వారికి క్షుత్పిపాసలు గలుగవు. స్వప్నమందు దినిన నాకు సైత మవి యిప్పటికి గలుగలేదుగదా! ఎందరిచేత చిక్కి నను చివరకీ ఫలము విశాలాక్షి కృపచే మనయొద్దకే వచ్చినదని పలుకుచు దానినిగోసి నాలుగు ఖండములు చేసి యింద్రద్యుమ్నునికి అతనిభార్యకును మదనునకు వసంతతిలకకును సమానముగా బంచి యిచ్చినది.

ఆ ఖండముల దినినంత వారికి క్షుత్పిపాసలు హరించినవి. అందరును దాని యాశ్చర్యకరమైన మహిమను గురించి యూరక స్తుతిపాఠములు చేయదొడంగిరి. అంతట నింద్రద్యుమ్నుడు విశాలాక్షినిం జూచి అమ్మా! మేము మాదేశము విడిచి వచ్చి పెద్దకాలమైనది. నాకుమారుడు విజయుడు మా జాడ దెలియక చింతింపు చుండును. ఇచ్చటనుండి మాదేశమునకు నోడమీదబోయిన వేగిరముగా జేరుదుము యోడ సిద్ధపరచి మాదేశమునకు మమ్ము బంపుప్రయత్నము చేయుము ఇప్పటికి మనమందరము కృతకృత్యులమైతి మని పలికిన నక్కలికి యిట్లనియె.

ఇచ్చట మదనునికి పట్టాభిషేకము చేయించి పిమ్మట మనమందరము కాశీపురమునకుబోయి యందున్న శత్రువుల బారదోలిపదపడి మీదేశమునకు బోవలయునని నాకభిలాషగానున్నది. దీనికి మీ అనుమతి యెట్టిదని అడిగిన అప్పడతి కతం డెట్ల నియె. అమ్మా ! నీయందు విశాలాక్షికి మిక్కిలి దయగలదు. నీకవశ్యము జయము గలుగును. మీరు సేనలతో గుహమార్గమునబోయి కోటలో బ్రవేశించి వైరుల సులభముగా గెలువుడు. నేనువచ్చి కడు తడవైనది. కాబట్టి నౌకాయానమున మాయూరికి బోయెదము, అట్లు సమ్మతింపుము. నీవు కాశీపురము వశముజేసికొనిన పిమ్మట మాయూరికొకసారి రావలయు నిదె నాకోరికయని చెప్పిన అప్పడతియు అతని మాటలకు సమ్మతించి శ్రీఘ్రకాలములోనె అట్టియోడను ప్రయాణమునకు సిద్ధపరపించినది.

ఇంద్రద్యుమ్నుని సముద్రప్రయాణము

అంత నింద్రద్యుమ్నుండు మంచిసమయమున విశాలాక్షి యనుమతి వడసి సముచితపరివారము సేవింప భార్యతోగూడ నొకయోడనెక్కి మంచిగాలి విసరుచుండ దెరచాపలెత్తించి రేవు విడిపించెను. అందప్పుడెక్కిన జనమునకు సంవత్సరమునకు సరిపడిన భోజనసామాగ్రి యున్నది. మంచి నేర్పరులగు నావికులచేత నా ప్రవహణము నడుపబడుచుండుట గడువేగముగా మూడువారములు నడచినది. అట్లు నడచుచుండ నొకనాడు సాయంకాలమున గర్ణధారుడు మింటిచిహ్నముల బరీక్షించి గాలివానలక్షణములు గాన్పించుచున్నవని తొందరగా బలుకుచు దెరచాపల దింపి యోడకు లంగరు వైపించెను.

వానిపరీక్ష ఎట్టిదో అంతలోనే గాలి అద్భుతముగా విసరజొచ్చినది. అప్పుడు నావలోని జనులందరు జడియదొడంగిరి. ఓడ సరదారుడు వాండ్రకందరకు ధైర్యము గరపుచు రెండుమూడుదినములు గడపెను. నాలుగవదినమున విసరెడు గాలినిజూచి యిక పడవ నిలువదు. ఎవరి యిష్టదైవముల వారు స్మరించుకొనవలసినదే మరియొక సాధనములేదు. భూమి దాపునలేదు. ఈరాత్రి మిక్కిలి జంఝావాతము విసరును. ఓడ తలక్రిందగునని చెప్పుచు గన్నుల నీరువిడువజొచ్చెను. అప్పుడతని యధైర్యమును జూచి అందున్నవారెల్ల గొల్లుమని యేడువదొడంగినది. ఇంద్రద్యుమ్నమహారాజు వారియలజడి అంతయు నడిపి మరణభీతిచే దొట్రుపడుచు దన్నుగౌగలించుకొను భార్యను దగ్గరదీసి కన్నీరు దుడుచుచు వెఱపుగ వైరాగ్యవాక్యంబుల నిట్లుపన్యసించెను. బోటీ! నీ వేటికి జింతించెదవు. పుట్టినవారి కెప్పటికైనను చావు నిక్కమైయున్నదిగదా! మనకు దైవ మీయుదకమధ్యమున మరణము విధించి యుండబోలును. అమ్మితి దాటశక్యమగునా? సుఖదుఃఖములకు దాను పూర్వమున జేసినకర్మయే మూలమై యున్నది.

శ్లో॥ సుఖస్యదుఃఖస్యనకోపిదాతా పరోదదాతీతికుబుద్ధిరేషా
     అహంకరోమీతివృధాభిమానః స్మకర్మసూత్రగ్రధితోహిజంతుః

          అనియుండగా యెట్లుతప్పును ? దాననేకాదా మనపెద్దలు,

శ్లో॥ అలంహర్ష విషాదాభ్యాం శుభాశుభఫలోదయె
      విధాత్రానిహితం యద్యత్తపలంఘ్యం సురాసురైః॥

శభమునకు సంతసమును అశుభమునకు విచారము నెన్నడును బొందగూడదు. బ్రహ్మపిహితమైనది సురాసురులైనను దాటజాలరు. మనుష్యుడెప్పుడును సుఖదుఃఖములలో బొరలుచునేయుండును. సుఖదుఃఖములనుండియే శరీరము పుట్టినది. సుఖానంతరము దుఃఖము, దుఃఖానంతరము సుఖము దినరాత్రులవలె జంతువులకు నియమితముగా వచ్చుచుండును. మరియు సుఖములో దుఃఖము, దుఃఖములో సుఖమును గలిగియున్నవి. కాబట్టి విద్వాంసులు ఆపత్తుల జలింపకుండ వలయును. సర్వమును మాయ యని ఎరింగినచో మోహమేల గలుగును? అది ఎరుంగక సంసారపంకనిమగ్నులై పశువులవలె జరించినచో మూఢత్వము దట్టమై యురక యిడుమలం గుడిపించును ఇదియునుంగాక,

శ్లో॥ పాధానామివవర్త్మని క్షితిరుహాంనద్యామివభ్రశ్యతాం
     మేఘనామివపుష్క రేజలధౌసాయాంత్రికాణామివ
     సంయోగః పితృమాతృబంధుతనయ భ్రాతృప్రియాణామహో
     సిద్దోదూరవియోగ ఏవ విదుషాం కాతత్రచింతాభవేత్

మార్గంబున బాటసారులు, నదులయందు దారువులు, గగనమున మేఘములు, సముద్రమున నావికులును గలిసి విడిపోవునటుల తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్యాభర్తలు లోనగువారు గలసికొనిపోవుచుందురు. అట్టి వియోగము లెప్పటికైనను దప్పనివే దీనికై విచారింపనేల? కావున మన మిప్పుడీ సముద్రమునంబడి మునిగిపోవుదుమను విచారమింతయేని స్వాంతమునం దగులనీయకుము. మనమిది వరకు బడిన యిడుముల కన్న నిది పెద్దదియా? వానిని దాటించిన భగవంతుడిప్పుడు లేడా? మనకిందు చాపు విహితమైనచో నెట్లును దప్పదు. సుఖమున కాసబడినప్పుడు గదా దుఃఖము గలుగుచున్నది. అట్టియాశయే వదలుకొనినచో నెట్టిసుఖమున్నదో బరీక్షింపుము. దీనికి నీవు వగవకుము. లెమ్ము సముద్రమునంబడుటకు సిద్ధముగా నుండుము. సముద్ర మన నెద్దియనుకొంటివి? మనల రక్షించుచున్న నారాయణమూర్తి శయనగృహము.

అని డగ్గుత్తికతో బలుకుచున్న యాఱేని నీతివాక్యములచే దేరి యానారీశిరోమణి చింతవిడచి ధైర్యముతో భగవంతుని ధ్యానించుచుండెను. ఇంతలో నాసరదారుడు చెప్పినప్రకారము గాలి క్రమక్రమముగా నతిశయించుచు జివరకు నాయోడ మునుగునంత వడిగా విసరినది. అప్పుడు పర్వతమువలె నలలు కొట్టుకొనుటచే నాయోడ నిలువలేక యొరిగి సముద్రములో మునిగిపోయినది.

అందున్న జనులందరు నప్పుడు హాహాకారరవముతో భగవన్నామస్మరణము చేయుచు దమకు దొరకిన సాధనములం బట్టుకొని సముద్రములో దూకిరి. అప్పుడింద్రద్యుమ్నుడు భార్యను బిగ్గరగౌగలించుకొని చిత్త మీశ్వరాయత్తము చేసి కొని మహాసాహసముగా సముద్రములో దూకెను. అప్పు డతని కేమియు దెలియలేదు. పిమ్మట గొంతసేపు నీళ్ళలో మునిగి కొంతదూరము పోయి పైకి తేలినట్లు దెలిసినది ఎంత వైరాగ్యము గలిగియున్నను మృతియన వెరువకమానరు.

అతను నీటిపై దేలినప్పుడు తన సందిటనుండి చిత్రసేన జారిపడినదని తెలిసికొని మితములేని శోకముజెందియు నామున్నీటితరంగములలో నోపినకొలది నీదుచుండెను. ఆహా! ప్రాణ మెంతతీపైనదో చూచితివా. బాహువునచే సముద్రము నీద దొడంగిన యతని యుద్యమము నూతబడినవాడు దరినున్న గడ్డిపోచను నూతగా బూన దలంచునను సామెతను దృఢపరచుచున్నది. కొంతసేపట్లు భుజములచే నీది యీది యాయాసముజెంది మనంబున నిట్లు తలంచెను.

అయ్యో! అజ్ఞానపురుషుడు మోహాంధుడై దరిలేని సంసారసాగరమువోలె నే నీసముద్రము నీదుట దరిజేరుటకే! యెంతదూర మి ట్లీదగలను. శ్రమ బలియుచున్నది. నేను బ్రతికియున్న లాభములేదు. ప్రాణతుల్యయగు భార్యను గోలుపోయితిని. ఇక బ్రతుకు మీద నాస యేలకలుగ వలయును? నేను గూడ మృతినొంది ప్రాణనాయికిం కలిసికొందు. మరణావసానంబున భగవదారాధన సేయుట యుచితముగదా. అమ్మహాత్ముని హృదయంబున నిలిపి పరమపదంబు నొందెదనని పెక్కు గతుల దలంచుచు మనంబీశ్వరాతత్తంబు గావించి మరణకృతనిశ్చయుండై యీదుట మానివేసెను. అప్పు డతనికి నాసాపర్వముగ నొక యద్భుతమైన పరిమళము గొట్టినది. అట్టి సువాసనకు వెఱగందుచు నతండు గన్నులం దెరచిచూడ దాపున నొక దారువు గొప్ప తరంగమును బోలి గొట్టుకొని వచ్చుచున్నది. దానిం జూచి యది యోడఁగూర్చిన దారువుగా నిశ్చయించి దానిదాపునకు గొంచెమీదెను.

అదియు నీటివాలున తన కభిముఖముగా వచ్చుచున్నది. కావున వేగిరమే దానింజేరి పైకెక్కెను. అదియు నోడవలె విశాలమై గూర్చుండుటకు నుపయుక్తముగా నున్నది. దానిమీద నొక వనిత పండుకొని యున్నది. ఆమెంజూచి తనయోడలో నొకతె దీనిం గ్రహించెనని నిశ్చయించి మరలదాని పరిమళము పరీక్షించి మంచిగంధపుతరువుగా దెలిసికొని యట్టిది యోడకేల గట్టెదరని శంకించుకొనియెను. తరువాత నతం డానాతిని లేపి నీవెవ్వతె వీదారువున నేమిటికి వసించితివని యడుగగా నాచేడియ శోకభరముతో గన్నులు దెరువకయే హా ! ప్రాణేశ్వరా ! నన్ను విడిచి సముద్రములో మునిగిపోయితివే. నేనుగూడ మునుగకుండ నీయాధారమేటికి దొరకవలయును. ఈ దుఃఖ మనుభవించుటకా? యని చింతింపుచు నంతలో గన్నులు దెరచి యెదురనున్న యింద్రద్యుమ్నునిం జూచి గురుతుపట్టి యింతింతనరాని సంతోషముతో నతనిం గౌగలించుకొన్నది.

అతం డాచేడియ తనభార్యయని తెలిసికొని దైవసంఘటమునకు వెరగుపడుచు నోహో! ఇందుముఖీ! మనకీ సంయోగము గలుగుటకు భగవంతుని యనుగ్రహముగాక వేరొకటికాదు. ఈ దారు వాధారముగా జూపి మనల రక్షించిన యద్దయామయుని బెక్కు తెరంగుల వినుతింపదగినదిగదా? ఈ దారువే భగవంతుడని తలంపుము. దీనియాధారమున మనము తీరము జేరుదుమని యూహించెదను. నాకట్టి శకునము లగుచున్నవి మనకు క్షుత్పిపాసలు లేవుగదా? కానిమ్ము. ఎన్ని దినములకైన దీరము జేరకపోదుమాయని పలుకుచు నాదారువునందు భగవద్బుద్ది నిలిపి మనఃకుసుమములచే నర్చింపుచుండెను.

అట్లు రెండుమూడు దినములు గడిచినంత నొకనాటి యుదయమునకా దారువు వారినొకతీరమున జేర్చినది. ఉదయమున లేచి చూచువరకు భూమిగనంబడి నంత వారియానందమేమి చెప్పుదును. భూమి భూమి యని కేకలువైచి యింద్రద్యుమ్నుడు భార్యకు దెలుపుచు నాదారువు దీరధారుణిం జేరినది. కావున సులభముగా నతండు భార్యతోగూడ నొడ్డెక్కెను పిమ్మట వారా పారావారమును గన్నులారజూచి గుండెలు బాదుకొనుచు వా రనుభవించిన కస్తి యంతయు దలంచుకొని యాచందనదారువే తమ్ము రక్షించెను గావున దైవమని తలంచి మొక్కి దానిని నున్నతస్థితికిదే దలచి కర్తవ్యమరయుచు దానిని విడిచిపోలేక యాదేశనామము సైతము గురుతెరంగరు గనుక యచ్చటనే తిరుగ జొచ్చిరి.

అంతలో నాప్రాంతమున నొక సేనానివేశము సందడి వినంబడినది. దానిం బారజూచి ధారుణిభర్త యచ్చటికిబోయి యాదేశ మెద్దియో తెలిసికొనవలయునని తలంచి భార్యతోగూడ మెల్లన నా సేనానివేశమునకుబోయెను. పటకుటీరవారముచే గ్రామము వలె గనంబడినది. దానిదావునకుబోయి యందొకనింజేరి యీ సేనానివేశ మెవ్వరిది? యీ దేశము పేరేమి? యిది యేసంవత్సరము తిథివారనక్షత్రము లెట్టివో తెలుపుమని అడిగెను.

వా డతని మాటలు విని వెరగుపడి యోహో! నీప్రశ్న మిగుల వింతగా నున్నదే! తిథివారనక్షత్రములు చెప్పుటకు నేను పంచాంగపు బ్రాహ్మణుడ సనుకొంటివాయేమి? నీ కామాత్రము తెలియదా? సంవత్సరము పేరు సైతము మరచితివా? బాగుబాగు! అని పరిహాసమాడుచు నిది యోఢ్రదేశము యీసేనానివేశ మింద్రద్యుమ్నమహారాజు కుమారుడు విజయునిది. అతండు తండ్రిని వెదకుచు దైవజ్ఞునిమాట ననుసరించి మూడుదినములక్రిందట నిచ్చటికివచ్చెను. ఇది చిత్రభానుసంవత్సరము. నే డాషాఢశుద్ధపాడ్యమి, వారము శుక్రవారము, నక్షత్రము పునర్వసు ఇప్పుడే బ్రాహ్మణుడు చెప్పిపోయెనని చెప్పెను.

ఆ మాటలు విని రాజు ముక్కున వ్రేలువైచుచు బోటీ! వింటివా మన విజయుడు మనల వెదకుచు నిచ్చటకే వచ్చెనట. అన్నా! భగవత్సంకల్ప మిట్టిది కాబోలు. మనము సముద్రములో మూడుసంవత్సరములు చిక్కుబడినట్లు వీడు చెప్పిన కాలపరిమాణమున దెలిసినది కానిమ్ము. వేగరము బోవుదము రమ్మని పలుకుచు జనుల నడిగి తెలిసికొనుచు విజయుని శిబిరములకు బోవునంత ద్వారపాలకు అడ్డము వచ్చి అయ్యా! ఇప్పుడే కాశీరాజుగారు మలయాళదేశపురాజుగారును లోనికిబోయిరి. విజయమహారాజుగారితో వారెద్దియో యాలోచించు చున్నవారు తమరిప్పుడు పోవుటకు సమయముకాదు. పోవలదని చెప్పిన వాని కత డిట్లనియె.

ఓరీమూఢా! మీతండ్రియగు నింద్రద్యుమ్నుడు వచ్చియున్నవాడని మా విజయునికి జెప్పిరమ్మనగా వాడు తెల్లపోవుచు నేమేమీ? తమరింద్రద్యుమ్న మహారాజుగారా? యిట్టిరూపముతో నున్నా రేమి. నాయపరాధము క్షమింతురుగాక యని పాదముల వ్రాలుచు మన పెద్దరాజుగారు వచ్చినారో అని అరచెను. ఆ ధ్వనివిని అందరు తొందరపడుచు నేమేమి! అని వాని దాపునకు వచ్చిరి. వాడును గడువేగముగా లోనికిబోయి విజయునితో దమ తల్లిదండ్రులు వచ్చినారని చెప్పగా నమృతోపమానములగు వాని మాటవిని అతండు దిగ్గునలేచి యెక్కడెక్కడ అని పలుకుచు బరుగెత్త జొచ్చెను. ఎదురుగా వచ్చిన విజయుని జూచి కన్నుల నానందబాష్పములు గ్రమ్మ నాయిరువురు పెద్దతడవు గాఢాలింగనములు చేసుకొని డగ్గుత్తికచే మాటరాక సంతోషదృష్టులచే నొండొరుల జూచుకొనుచుండిరి. అంతలో మదనుడు విశాలాక్షియు వచ్చిరి. వారింజాచి యారాజు ఓహో మాబంధువ్యూహంబంతయు నిచ్చటనే యున్నదే యీ దినంబెంత సుదినము అని మెచ్చుకొనుచు వారిని గుశలప్రశ్నజేసెను.

వారందరు శిబిరములోనికి బోయి యందు గూర్చుండి యొండొరుల క్షేమసమాచారము దెలిసికొనుచుండగా, నింద్రద్యుమ్నుడు తన వృత్తాంతమంతయు నామూలచూడముగా విజయునకు జెప్పి నీ విప్పు డిచ్చటి కెట్లు వచ్చితివని అడుగగా నితండిట్లనియె. తండ్రీ! మీరు కానకుబోయిన గొన్నిదినములకు మన సైనికులు వచ్చి యచట జరిగిన విశేషములన్నియుం జెప్పిరి. మా యమ్మను దారిలో శబరసైన్యము వచ్చి యడ్డగించుకొని తీసికునిపోయిన వార్త వినినతోడనే నేను మిగుల బరితపించుచు జతురంగబలముతో బయలుదేరి యయ్యరణ్యములన్నియు నరసితినిగాని యెందును యీయమ జాడ గనంబడినది కాదు.

అది మొదలు నేను స్వస్థతలేక రాజ్యము మంత్రియధీనము జేసి ప్రతి యూరు ప్రతి అరణ్యము ప్రతిపల్లెయు వెదకుచు బెక్కుదేశములు తిరిగితిని. నేను శోకించుచు మాతృపితృహీనంబయిన నగరంబు సొరనొల్లక వైరాగ్యంబు వహించి దేశాటనముచేయుచు గ్రమంబున గాశీపురము నరిగితిని. అందు పరమభక్తితో విశ్వ నాథు నర్చించుచు గంగాస్నానమున బాపముల నిర్జించి పూర్వజన్మోపార్జతఫలంబున గొన్నిదినంబు లందు వసించితిని.

ఒక్కనాడు సాయంకాలమున విశ్వేశు దేవళమునకు బోయిన నందు నప్పటి యప్పట్టపురాజు మహాపూజ చేయుచుండుటచే లోనకిబోవ నవసరముజిక్కినది కాదు. నన్ను బ్రతీహారులు దూరముగా ద్రోసివేసిన నేను నానీచవృత్తికి జింతాక్రాంతుడనై అయ్యో చక్రవర్తికుమారుండైన యిట్టి వారిచేత నవమానితుండనై తినే ఇది కాల మహిమయేకదా నా గౌరవమిచ్చటి వా రెవ్వరెరుంగదురు ? యేమిచేయుదును అని చింతించుచు నా వీధివేదికపై గూర్చుండి యుండగా నందొకసన్యాసి నాయవస్థ యంతయు గ్రహించి నన్ను గౌరవముగా మన్నించి మెల్లననిట్లనియె అయ్యా! నీ వెవ్వడవు? నీ దేశ మెచ్చట? ఇచ్చట కెప్పుడు వచ్చితివి. నీ వేమిటికో విచారింపుచున్నావు. కారణమేమి నీవృత్తాంతము మెరిగింపుమని యకారణస్నేహముగా నతండడిగిన నేనును నావృతాంతమాద్యంత మెరింగించి నమస్కరింపుచు అయ్యా! తమరు త్రికాలవేదులు మీరెరుగని రహస్యములుండవు. నాతలిదండ్రులెచ్చటనున్నారో చెప్పుడని అడిగితిని అమ్మహానుభావుడు నాదీనాలాపము లాలించి దయారసంబు చిలుకపలుకులచే నన్నోదార్చుచు వత్సా! మీ తండ్రి జగధ్వితుండు. కడుధర్మాత్ముండు. అతండు చిరకాలజీవి. యతని విషయము నీవు చింతింప నవసరములేదు. వానియున్న తావు చెప్పెద వినుమని యెద్దియో గణించి యిప్పుడు మీ తల్లిదండ్రులు నీటిలో జిక్కులుపడుచున్నారనియు నాషాఢశుద్ద పాడ్యమి నాడుదయమునకు నోఢ్రదేశమున నీరేవునకు వత్తురని నప్పటికి నీవచ్చటికి బొమ్మనియుం జెప్పెను.

అతితాగతముల గుర్తెరింగిన యుమ్మహర్షి వచనంబులువిని నేను మితిలేని సంతోషముతో నతని యడుగులంబడి మ్రొక్కుచు నతని యనుమతివడసి యమ్మరునాడు మా గ్రామమునకు బయనమై పోవ బ్రయత్నించు సమయమున నయ్యూరిలో హల్లకల్లోలముగా జనులు వీధుల గ్రుమ్మరుచుండుట జూచి యిదియే మని అడిగితిని. అప్పుడు నాతో నొకడు అయ్యా ! ఈ దేశపురాజైన హేమాంగద మహారాజుగారి అల్లుండును గూతురునువచ్చి కోటలో బ్రవేశించి అందున్న శత్రురాజును బారదోలుచున్నారట. వారు ప్రచ్ఛన్నముగా గోటలో దూరిరట. పాపము శత్రురాజు లాలుబిడ్డల విడిచి పారిపోవుచున్నారు. వారిని సైనికులు తరుమ గంగానది నోడలందాటుచు గొందరు భీతిచే నందులో బడిపోయిరట అన్నన్నా! యెంత యాపదవచ్చినది? వారి కట్లు కావలసినదే, పాపము హేమాంగదుడు పరలోకగతుండైన వెనుక యున్నవారు చిన్నవారని గ్రహించి నిష్కారణముగ గోటముట్టడించి వారిని బారదోలలేదా? యిన్ని దినములెచట దాగియున్నదో హేమాంగదుని కూతురు. విశాలాక్షి మహాబుద్దిశాలిని యుండియుండి తగిన సేనలం గూర్చుకొని శత్రువులం బారదోలినది ఈ యలజడి యంతయు నదియని చెప్పగా నేను మిగుల సంతసించుచు వారికి బారితోషికమిచ్చి అయ్యో ! నాకు మంచివార్త దెలిపితివి. వారు నాకు బంధువులు, వారి జయము వినుటచే నాకు గొంత చింత మానినది. అని అతనితో మాటలాడచు నాడు పయనము మాని హేమాంగదుని బంధువులతో గొంత ముచ్చటించి పోయెదంగాక యని నిశ్చయించి యప్పుడు కోటయొద్దకు బోయితిని.

అప్పటికే శత్రురాజులం బారదోలి హేమాంగదుని యల్లుండు మదనుడు గూతురు విశాలాక్షి సేనలతో గోటలో బ్రవేశించినట్లు తెలిసినది. వారి ప్రవేశమును గురించి అచ్చటివారందరు నద్భుతముగా జెప్పుకొనుచుండిరి. శత్రురాజుల స్త్రీలను చెర బెట్టక గౌరవముగా వారి మగల యొద్దకు బంపిన విశాలాక్షి దయాహృదయమును గురించి చేయు స్తుతివాక్యములు నాకు సంతోషము గలుగజేసినవి.

అప్పుడు నేను సంతోషించుచు నా పేరును తండ్రి పేరును గ్రామము పేరును వ్రాసి దర్శనార్దమయి వచ్చి ద్వారముననున్నానని పత్రిక లోనికి నంపితిని. వాని నంపినక్షణములో మదనుండు నాయొద్దకు వచ్చి నన్ను సగౌరవముగా దన యంతఃపురమునకు దీసికొనిపోయి భార్యకు జూపెను. ఆమెయు నన్ను సోదరీభావంబున మన్నించి గద్దియనిడి కుశల బ్రశ్నముసేయుచు నేనడిగినంత తన వృత్తాంత మంతయు జెప్పినది. అప్పుడు నేను పట్టరాని మోదముతో నా వృత్తాంతమంతయుం జెప్పి యాయూరిలో సన్యాసి చెప్పిన వర్తమానము సైతము తెలియజేసితిని. దానికి వారు సందియమందుచు నీదంపతు లిన్ని దినములు నీటిలో నుండుటకు కతంబేమియో యని తలపోసి మిమ్మునరయుటకై నాతో గూడ వారును ప్రయాణమైరి.

ఆ కోటకు దగిన కావలియుంచి మేమందరము బయలుదేరి దారిలో మీరు పడిన యిడుమల జెప్పికొనుచు గొన్నిదినముల మొదట మన పట్టణమునకు వచ్చితిమి. అందు మీ జాడ యేమియు దెలిసినది కాదు. వెంటనే బయల దేరి యాసన్యాసి మాట దలచుకొనుచు మొన్నటికీ తావు జేరితిమి ఇందు శిబిరములచే గ్రామము గట్టించి మీరాక వేచుచుండ మా పురాతనసుకృతవిశేషంబున మీరు వచ్చితిరి. మిమ్ము గాంచి కృతార్ధులమైతిమి. దైవము మా కాసన్యాసి రూపమున వచ్చి చెప్పిన ట్లూహించెదము. లేకున్న నిష్కారణ మడుగకుండ నతం డేమిటికి జెప్పును. దైవకృపచే మన కిప్పటికి మంచిదినములు వచ్చినవి. ఇదియే నా వృత్తాంతమని చెప్పిన రాజు మిగుల కుతుక మందుచు నతనితో నిట్లనియె.

వత్సా! మనల గర్మసూత్ర మిన్ని దినములు ద్రిప్పినది గానిమ్ము. గతమునకు వగవనేల నిప్పటికి దైవానుగ్రహము గలిగినది. మరియు నొకటి వినుము మమ్ము సముద్రములో మునుగకుండ జందనదారు స్వరూపమున వచ్చి భగవంతుడు గట్టున దాటవైచెను. ఆదారువునందు నాకు దైవభక్తి కలిగినది కావున నిందు క్షేత్రముగా నేర్పరచి యాదారువు దేవతావిగ్రహములుగా జేయించి స్థాపించెదను. అమ్మహాసముద్రమధ్యమందున్న సమయంబున నట్లు సంకల్పించుకొంటిని. ఇప్పుడా మ్రాని నిచ్చటికి దీసికొనివచ్చుటకు దగువారి నియమింపుము. మరియు శిల్పికర్మవిశారదుల రప్పించి గొప్ప యాలయముల గట్టింపవలయు అంత దనుక నేను మన పురమునకు రాను. అట్టి ప్రయత్నమంతయు శీఘ్రకాలములో జరుగవలయునని పలికిన సంతోషింపుచు విజయుడప్పుడే పెక్కండ్ర జనులచేత నా మంచిగంధపు తరువును పైకిలాగించి యొక స్థలములోనుంచి అప్పటినుండియు బూజాసంస్కారములు జరుపుచుండెను.

మరియు సమర్దులగు శిల్పికారుల రప్పించి కడువిచిత్రములైన యాలయముల గట్టించెను అంతనద్దారువు విగ్రహముగా జేయు సమర్దుడెవ్వడో యని యాలోచించుచుండగా నొక నాడాకస్మికముగా నొక శిల్పివచ్చి అయ్యా నేను విగ్రహములు శాస్త్రీయముగా చేయగలను. శిల్పశాస్త్రమంతయు జూచితిని. సెలవిచ్చినచో మీ చిత్తమువచ్చిన విగ్రహముల జేసెదనని చెప్పెను. అందులకు సమ్మతించి యింద్రద్యుమ్నుడు సామగ్రి యేమికావలయునని యడిగిన అతం డయ్యా! నా కేమియు అక్కరలేదు. నీ విగ్రహంబుల నొకరహస్యగృహంబున దెరవైచుకొని చేయుచుందును. నాయంతట నేను సమాప్తమైనవని చెప్పువరకు నా తెరలోపల కెవ్వరు రాగూడదు. వచ్చినచో బ్రమాదమగును. ఇదియే నాకు మీరు చేయవలసిన పని అని జెప్పిన అందులకు సమ్మతించి అట్టి రహస్యస్థల మతని కేర్పరచిరి.

పిమ్మట నా శిల్పి యాదారువు నందు జేర్పించి తెరవైచుకొని విగ్రహంబుల జేయ మొదలుపెట్టెను. అట్టి సమయమున నింద్రద్యుమ్నుడు ప్రతిదినము ప్రాతఃకాలంబున బ్రాహ్మణులకు అనేక గోదానంబులు కొమ్ములయందును డెక్కల యందును బంగారముంచి జగంబెన్న జేయుచుండెను. మరియు నతండు జేయు నితరదానంబునకు లెక్కయేలేదు. పెక్కేల అతండు దానము జేయునపుడు బ్రతిదినము పొద్దుటమందగా నిలిపిన గోవుల డెక్కలరాయిడిచే నానేలయంతయు బల్లమై యగాధమైన తటాకమైనది. అదియేకదా? మనము తీర్ధమాడిన సరస్సు దానంబట్టియే దాని కింద్రద్యుమ్న మనుపేరు వచ్చినది

అట్లు రెండుమూడు సంవత్సరములు జరిగినను నా శిల్పి తెరదీసికొని వెలుపలకు రాలేదు. దానికి శంకించుకొనుచు అయ్యా? ఆలయంబులు సిద్ధముగా నున్నవి. విగ్రహంబులపని పూర్తికాలేదు ఎన్నిదినంబులైన నాశిల్పి యీవలకు రాడు బ్రతికి యుండెనో లేదో అని అనుమానంబు గలుగుచున్నది. ఇన్నిదినంబు లూరకుండుటయు దప్పేయని నిశ్చయించి యాఱే డొకనాడు సాయంకాలంబున మెల్లన బోయి అచ్చటనున్న దెరయెత్తి అతండేమి చేయుచున్నవాడో యని తొంగిచూచెను.

అప్పు డం దెవ్వరును గనంబడలేదు. విగ్రహంబులు మాత్రము కరచరణశూన్యముగా దక్కిన యవయవంబులు బూర్తిచేయబడినవి మిక్కిలి చక్కగానున్నవి. అవిఘ్నమునకు వెఱచుచు అత డంతర్థానంబు నొందెను. ఈయంగము లెవ్వడు బూర్తి జేయగలడని దుఃఖించుచు బశ్చాత్తాపంబున దల్లడిల్లజొచ్చెను. అప్పుడు భగవంతు డతని స్వప్నములో గనంబడి అనఘా నీవు చింతింపకుము. నేనిట్టి రూపముతోనే పుడమియందు జగన్నాధస్వామియను పేరుచే నొప్పుచుందును నీకీర్తి భూమియందు స్థిరముగా నుండును. నీ భక్తికి మెచ్చితిని అని చెప్పెను.

అట్టి కల తెఱంగెల్లరకు జెప్పి యాస్వామికి దనయందుగల ప్రేమాతిశయమునకు సంతసించుచు నింద్రద్యుమ్నుడు శుభలగ్నమున స్థాపన జేయదలంచి అట్టి లగ్నమును దెలిసికొనుటకై యోగబలంబున బ్రహ్మలోకమునకు బోయెను. అందు ద్వారమందు నిలిచి ద్వారపాలకునిచే దనరాక బరమేష్టికి విన్నవించిన అతండు లోనికి రప్పించుకొని నీవు వచ్చినపని యేమని అడిగెను. ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మకు నమస్కరించి అయ్యా నేను! జగన్నాధస్వామిని బ్రతిష్ఠ జేయదలచుకొని యాలయంబుల గట్టించితిని. అందులకు ముహూర్తము మీవలన బెట్టించుకొనవలయునని వచ్చితినని చెప్పెను. ఆ మాటలు విని చతురాననుండు నవ్వుచు నోహో ! ముహూర్తమునకై యింత దూరము వచ్చితివా చాలులే అన్నియునైనవి పోపొమ్మని యానతిచ్చెను.

పిమ్మట నామనుజపతి మరల జగన్నాధమునకు వచ్చి చూడ నా స్వామి వేరొకయాలయంబున స్థాపింపబడి అద్భుతములైన యుత్సవముల ననుభవింపు చుండెను. అందు దన్నెరింగిన వారెవ్వరును లేరు. కాలవ్యత్యయము మిక్కిలి గనంబడుచున్నది. దానికి తొందరయు నాశ్చర్యమును జెందుచు నా యాలయములోనికి బోవ నావల్లభుని గావలివారలాటంక పెట్టుటయు అయ్యో ! ఇదియేమి కర్మము. నేను మహారాజునను సంగతి గురుతెరుంగక వీండ్రు తోసివేయుచున్నారే! మవారందరు నెందు బోయిరో ? అని తలంచుచు వారితో నేను చక్రవర్తిని యీ వేల్పులు నాయిష్టదైవములు నన్ను ద్రోచివేసెదరేల ? అని యెన్ని విధముల జెప్పుకొనినను అతని మొర వినినవారు లేరు.

అప్పుడతడు సముద్రతీరమునకుబోయి భక్తివిశ్వాసపురస్సరముగా నాస్వామిని ధ్యానించిన నాభక్తరక్షకుం డంతరిక్షగతుండై రాజా! నీవు చింతింపకుము. నేను గారణాంతరమున నీవు రాకమున్న నిందు బ్రతిష్టింపబడితిని. నీయాలయమునకు గూడ నేటేట నొకసారివచ్చి యుత్సవముల నొందుచుండెదను. నీకీర్తి చిరకాలము బుడమియందు నిలుచును. నీవు స్వర్గసుఖముల ననుభవింతువుగాక నీ బంధువులందరు చిరకాలమగుటచే లోకాంతరగతులైరి. నీ విక్కడనుండి పోయి పెద్దకాలమైనది. దేవమానమున బట్టి నీకేమియుం దెలియకున్నది. నాకంబున రాకకై వేచియున్న నీభార్యను గలిసికొనియెదవు లెమ్ము. అదిగో! నీకొరకు దేవలోకమునుండి విమానము వచ్చుచున్నది. దాని నెక్కి పొమ్మని పలికి యూరకుండెను. గగనతలమునుండి యేతెంచిన భగవద్వచనములు విని యారాజు వింతసంతసముతో నున్నంత నా దేవయానము వాని మ్రోల నిలిచెను. అతడు భక్తిపూర్వకముగా దాని నధిష్టించి యందున్న దివ్యాంబరాభరణములు ధరించి దేవదూతలు సేవింప స్వర్గమునకు నిర్గమించెను.

గోపా ! దానంజేసి యా జగన్నాధుని రూపమట్లున్నది. సుభద్రాదేవి యాయన భార్య, బలభద్రుడు శేషుడు దీనినే బుద్ధావతారమని చెప్పుదురు. ఈస్వామి నారాధించిన వారిపాపము లగ్నివలన దూలికవోలె హరించును. ఇతండు కలివేళ బ్రత్యక్షదైవము. మన పూర్వపుణ్యవిశేషంబున నిద్దేవుని సేవలభించినది. నీ ప్రశ్నంబున కిదియే యుత్తరము వింటివిగద! ఇంక లెమ్మని పలికిన, వాడు మిక్కిలి సంతోషించుచు నాస్థలమహిమ కచ్చెరువందుచు బలుమారా కధావిశేషముల దలపోసికొనుచు గురునితో గూడ గావడియెత్తుకొని నడుచుచుండ నిరువురును దరువాతి మజిలీ చేరిరి.

శ్లో॥ సమ్రత్వేనోన్న మంతః పరగుణకథనైస్వాన్‌గుణాన్ ఖ్యాపయంతః
     స్వార్థాన్ సంపాదయంతః వితతపృదుతరారంభయత్నాః పరార్థే
     క్షాంత్యైవాక్షేప రూక్షాక్షరముఖరముఖాన్ దుర్జనాన్ దుఃఖయంతః
     సంతస్సాశ్చర్యచర్యా జగతిబహుమతాః కన్యనాభ్యర్చనీయాః