కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/30వ మజిలీ

వికీసోర్స్ నుండి

అని యెఱింగించువఱకు వేళయతిక్రమించుటయు నాటికక్కథం జాలించి మణిసిద్ధుండు తదనంతర వృత్తాంతంబు తరువాత మజిలీయం దిట్లని చెప్పదొడంగెను.

ముప్పదవ మజిలీ

మాలతి కథ

వత్సా! వినమట్లు మాలతీలలనభోగంబులు స్వప్నోపగముల మాడ్కి యనిత్యంబులని నిరసించి కాషాయవస్త్రధారిణియయి యరుగుచు నొకనాఁడొక యరణ్యంబులో నెదురుపడినయొక బ్రాహ్మణునకు నమస్కరించుచు నయ్యా! మీరు తరచు దేశాటనము జేయువారువలె గనబడుచున్నారు. మీకెందయిన మువ్వురు వెఱ్ఱివారలు కనంబడిరాయని యడిగిన నప్పారుఁడు స్మృతినభినయించుచు నిట్లనియె.

కాంతా! ఈ ప్రాంతమందలి గ్రామములో నధికారులచే నాటంకబెట్టబడి యెవ్యరో మువ్వురుండుటమాత్రము జూచితిని. వారు మందపాల మహారాజుగారి యంతఃపురద్రోహముచేసి చెరసాలలో పెట్టబడి తప్పించుకొని పారిపోయినారట. వారిం బట్టుకొని యా గ్రామాధికారు లావార్త ఱేనికనిపినారట. వాండ్రను వెర్రివారని కొందఱును కారని కొందఱును నిరూపించుచున్నారు. నీవడిగినవారు వారేమయి యుండవచ్చును. వారు నీకేమి కావలయును? నీవిట్టి ప్రాయంబున గాషాయవస్త్రంబులం ధరించి యొంటియయి నడవుల గ్రుమ్మరుచుండనేల? నీరూపము త్రిలోకమోహనజనకమయి యున్నదే యని యడిగిన నప్పడతి యిట్లనియె.

ఆర్యా! నేనొక జోగురాలను, శిష్యురాలనగుటచే వారియవసరము కావలసి వచ్చినది. అంతకన్న మరేమియులేదని పలికి యక్కలకి యావిప్రుని ననుమతిం బడసి వడిగా నడచుచు నాటి సాయంకాలమున కాగ్రామముచేరి వారిం గలిసికొనినది. అప్పుడు వారొక చావడిలో బడవేయబడి యున్నారు. కావున నాపువ్వుబోణి వారి యవస్థకు మిక్కిలి పరితపించుచు నతిదీనములగు విలోకనములచే వారిమొగములు పరీక్షించుచు దాపున నిలువంబడియే యారాత్రి యెట్టకేల వేగించినది.

తమ్మెంత దైన్యముగా చూచినను యాచించినను యా చిగురుబోణితో వారేమియు మాటాడినవారుకారు వారిం గాచియున్న తలవరులు మరునాఁ డుదయ కాలంబున నధికారులయొద్దకుంబోయి అయ్యా! రాత్రి నాపిచ్చివాండ్రదాపున కొక తొయ్యలి వచ్చినది. ఏమి రహస్యముల మాటలాడికొనిరో తెలియదు. ఇంతదనుక నందేయున్నది. మీరువచ్చి చూడుడని చెప్పిన వారప్పు డక్కడకుఁజని యవ్వనితం గాంచి వెఱగుపడుచు పడుచా! నీ వేమిటికయి యిచ్చటికి వచ్చితివి? వీండ్రు నీ కాప్తులా ? నిజము చెప్పుమని యడిగిన నబ్ఫోటి యేమాటయుం జెప్పక తలవాల్చు కొన్నది.

అప్పుడా గ్రామాధికారులు కోపముతో తస్కరులు సామమున నిజము చెప్పుదురా? దండనమే వారియెడల బ్రయోగింపదగినది. వీరితోగూడ నీచేడియం గట్టి పెట్టిన నిజము దేలునని పరుషవచనంబు లాడుచున్న సమయంబున మందపాలుని యొద్ద కనిపిన దూతలువచ్చి అయ్యయ్యో? ప్రమాదము సేసితిరి వీండ్రు దొంగలు కారట. అవధూతలట? వీరి నెవ్వరును బాధింపగూడదని రాజుగారు శాసనము వ్రాసి యిచ్చినారు. చూడుడవి పలికిన విని యా యధికారులట్టి పత్రికం జదువుకొని వెరచుచు నప్పుడే బంధవిముక్తులంజేసి భోజనములం బెట్టించి సత్కారపూర్వకముగా వారి నాయూరినుండి వేఱొక గ్రామంబున కనిపిరి.

వారు నలువురు నొకరివెనుక నొకరు నడుచుచు నొకనా డొకదారిం బోవుచుండ దారిలో భూపాలదేవమహారాజుగారి మంత్రిని కొంతదూర మనిపి వచ్చుచుండెడి భట్టియు విక్రమార్కుడును దారిలో దారసిల్లిరి. విక్రమార్కుడు వారి యాకారవిచేష్టితములం గాంచి విస్మయముజెందుచు మీరెవ్వరు యెందుబోవుచున్నారని యడిగిన వారు మువ్వురు తమతమ వాడుకమాటలం బలికిరి. మాలతి యేమియు మాటాడినదికాదు. అప్పుడు విక్రమార్కుడు భట్టితో మిత్రమా! వీరిమాటలు చిత్రముగా నున్న యవి వీరివేషములు వైరాగ్యోదయములు బోధించుచున్నవి. ఆకారచిహ్నములు మహానుభావత సూచించెడివి. వీరి నెఱుంగనివార లున్మత్తులని తలంచెదరు. ఈమాటలకు తగిన కారణమెద్దియో యున్నది. దానిం తెలిసికొనుదాక మనమింటికిం బోవలదని పలికిన భట్టియు సమ్మతించెను.

అదిమొదలు భట్టియు విక్రమార్కుండునుగూడ వారుపోయిన చోటికిఁ బోవుచు నిలిచినచోట నిలుచుచు వారితో కొన్నిదినంబులు దేశాటనమునం జేసిరి. వారు నివసించిన స్థలములో సయితము దూరముగానుండుట వాడుక కావున నొక్కచోట నబ్బోటినిజూచి విక్రమార్కుండు సాధ్వీ! నేను విక్రమార్కుడ. వింతలజూచు వేడుకచే తరుచు దేశాటనముం జేయుచుందును. నీవెవ్వతెవు వీరెవ్వరు మీ వైరాగ్య వేషములకుం గారణ మేమి? నిక్కువము నెప్పుము కొఱంతగల పనులు నెఱవేర్పఁ గంకణము గట్టుకొంటినని యత్యంతప్రీతిపూర్వకముగానడిగిన నప్పడతి యెట్టకేలకు సన్ననియెలుగు రాల్పడ నయ్యొడయని కిట్లనియె.

ఆర్యా! నేనెవ్వరితో మాటాడనని నేమము జేసికొన్నను నీపేరు వినుటచే చెప్పుచున్నాను వినుము. నేను మందపాల మహారాజు కూతురును. నాపేరు మాలతి యండ్రు దైవచోదితమయిన బుద్ధిచే నొకనాడు రాత్రి నన్ను మాతండ్రి వీరిలో నొకనికి వివాహము గావించెను నాపాణి గ్రహించినవా డెవ్వడో తెలియదు. ఆ నిక్కువము దెలిసికొనుటకై నే నిట్టివేషము వైచికొని వీరివెంట దిరుగుచున్నదానను. వీరెవ్వరో నాకు తెలియదు. నీవు నృపతి సామాన్యుడవుకావు నీ చరిత్రములు నేను వినుచుంటిని వీరిలో నాపతి యెవ్వడో నిరూపించి నన్నుద్దరింపుము. నేను నీ పుత్రికవంటిదాననని కన్నీరువిడచుచు తనవృత్తాంతమంతయుం జెప్పి యతనిపాదంబులం బడినది.

దీనులంగావ కంకణము గట్టుకొనిన యప్పుణ్యాత్ముడు హృదయంబునఁ గనికరంబు జనింప తరుణీ! నీవు వెరవకుము. ఇది దైవకృతము నాజీవితము ధారవోసి యయిన నీకు శుభము గూర్చెదను. వీరు వెర్రివాండ్రుకారు. కారణముచే నిట్లు తిరుగుచున్న వారలని తత్కాలోచితమయిన మాటలచే నాబోటికి ధైర్యము గలుగ జేసెను. గూఢముగా వారిచర్యలు బరీక్షించుచు కొన్నిదినములు దిరిగెను.

ఒకనాడు విక్రమార్కుండును భట్టియు బ్రచ్ఛన్నముగా జయంతమను పట్టణములో రచ్చబల్ల పై కూర్చుండి వినుచుండఁ గొందఱు విటపురుషు లిట్లు సంభాషించుకొనిరి.

శృంగార శేఖరుడు - వీరభద్రా? వేళయగుచున్నది. మనమనుకొనిన ప్రకారము నాలుగువీథుల మొగలయందును మనమిత్రులు నిలచియుండిరా? మయూరుఁ డెందున్నవాడు.

వీరభద్రుడు - మయూరుడు తూరుపువీథిని గాచియుండెను. వివక్షణుడు దక్షిణవీథిని, రాజశేఖరుడు పడమరవీథిని వీథ్యంతముల వాని సోదరులును నిలిచి యుండిరి. నీ విందుంటివో లేదో యని చూడవచ్చితిని. నేనుత్తరవీథికి పోవుచున్నాడ నేనుగతోఁ దిరుగుచుండుఁడని జంబుకాదులకు నియమించితిని.

శృంగా - ఆమాతంగ మెవ్వరిని వరించినను మనమందర మీ రాజ్యము సమముగా పంచుకొందమని ప్రమాణపత్రికలు వ్రాసికొంటిమిగదా? దానిలో నిన్నను మయూరుడు వ్రాలు చేయలేదు. తరవాత చేయించితివా? ఆనక తగవు పెట్టగలడు .

వీర - ఏనంత వెర్రి వాడననుకొంటివాయేమి? అన్ని కొఱతలు దీర్చితిని. దైవానుగ్రహముమాత్ర ముండవలయును.

శృంగా - మిత్రమా! మనకుఁ దప్పక రాజ్యము రాగలదు. రెండు మూడు దినములనుండి నేను కళత్రముగా స్వీకరించిన నాగరత్నమునకు మంచిస్వప్నములు వచ్చుచున్నవట.

వీర - దానిస్వప్నములు మనకేమి లాభము జేయగలవు.

శృంగా - అయ్యో! నీవింత యెఱుంగవేమి ? మనకు రాజ్యము వచ్చిన అనుభవమెవ్వరిది? వాండ్ర మేనులన్నియు బంగారుమయములు కావా? మనరాజునకు సంతతి లేకపోవుటయు నకాలమృత్యు వతని కబళించుటయు భూపాలదేవమహారాజు గారి మంత్రి దేశయాత్ర వచ్చుటయు నిటవచ్చి యిట్టి యేర్పాటు చేయుటయు నీ రాజ్యము మనకు రానయియుండుటయు నిది యంతయు మనముంచిన వారకాంతల యదృష్టము కాక యెవ్వరిది?

వీర - పట్టపువేదండము తొండమునకు బూవుదండయు జలయుక్త సువర్ణ కలశము నిచ్చి యాగజ మెవ్వనిపై యాజల మభిషేకముజేసి పూవులదండ మెడలో నిడునో యాతడే యీదేశమునకు రాజని బలవర్ధనుడు నియమించెనా యేమి?

శృం - ఔను. సంతతిలేనిరాజులు మృతినొందినప్పుడు తరుచిట్లు చేయుచుందురు. బలవర్ధను డిచ్చటికి రాకున్న నిట్టియేర్పాటు జరుగదు.

వీర — వయస్యా! నీకు రాజ్యమువచ్చిన నేమేమి క్రొత్త నిబంధనలు జేయింతువో చెప్పుము.

శృంగార - చెప్పవలయునా? వినుము. లోకమునకు ప్రధానమగురసము శృంగారము. శృంగారరసమునకు స్థాయి భావము రతి. దానిసారస్య మెఱిగిన వారలు వేశ్యలు. అట్టివేశ్యలకు సర్వోత్కృష్ట పదంబొసంగి తద్గోష్టియే దేశమునఁ ప్రధానముగా వ్యాపింపచేయుచు సంగీత ప్రసంగంబుల మేనుప్పొంగ సంతత పాన ప్రమత్తచిత్తుడనయి ద్యూత క్రీడలచే వినోదము కలుగజేయుచు జన్మము సార్థకము నొందఁ జేసికొనియెదను పెక్కులేల? ఇదివరకు నిషేధింపబడిన జారత్వము, ద్యూతము, పానములు సదనుష్ఠేయములుగా నియమించి శృంగారరసము జగమంతయును వెదజల్లెదను. ఇదియే నాక్రొత్త ఏర్పాటు. నీవేమి చేయుదువు?

వీర - నీ సంకల్పము మంచిదియేకాని దీనశృంగార రసప్రధానమయిన జారత్వమునకుఁ గలనిషేధము పోనేరదు. నీవు పోగొట్టుటకు వారస్త్రీలకు మునుపొక జారత్వదోషము గలిగియున్నదియా? కులస్త్రీలయెడ నది దృఢమయియున్నది. కావున నట్టివారి విషయమయి వ్యాపించినట్లూహింప వలయు నామతము వినుము.

శృంగార - వినినం దప్పేమి చెప్పుము.

వీర - శృంగారమునకు ప్రధాన భూతమయినది స్త్రీజాతముగదా? అట్టి స్త్రీలలో వైధవ్యదోషంబున వికృతరూపముల నొందినవారు సగబాలుకన్న నెక్కు.డుగా వున్నాఱు. అట్టియువతుల నందర శృంగారవతులఁ గావించి పునర్వివాహితల జేసితిమేని జనహితముగా నుండును. అప్పుడుగదా జారత్వమునకు దూష్యముపోయి శృంగారరసము విస్తరిల్లుట నాడుగదా మనమేయింటికి పోయనను నాటంకములేక పోవుట శృంగారము విరోధమనియే చెప్పుదము. వారకాంతల మోములు చూడఁ గూడదనియే వాదింతము . రామరామ! ఇప్పుడేయింటికిపోయి చూచినను ముసుంగిడుకొనిన బడంతులేకదా ఎందువెదకినను ఏడ దడవినను శూన్యాంగములు గల యంగనలేకదా. ఏడ దడవినను సూత్రములులేని పద్మనేత్రలేకదా. కై సేయక ముద్దు మోములుగల కలకంఠులు సైతము వలపు గలుగఁజేయుదురా?

శృంగార - ఇస్సెరో! విధవాసంగమము దూష్యముకాదా? అందఱును సమ్మతింతురా?

వీర - దూష్యముకాదు. పెక్కు ధర్మశాస్త్రములలో వ్రాయబడియున్నది. లోకహితమయిన పనికి ప్రజలేమిటికి సమ్మతింపరు.

శృంగా - కులకాంతలకు వేశ్యలకువలె హావభావములయందు జాతుర్యము గలిగియుండదు. దానికేమి చెప్పెదవు?

వీర — ఎంతమూఢుడవయితివి. వేశ్యల కది యెట్లుగలుగుచున్నదో యెఱుంగవు వినుము. చదువుకొనుటవలనను బహుపురుషసంపర్కమువలనను. వారి కట్టి చాతుర్యము కలుగుచున్నది మనము సైతము స్త్రీవిద్య యభివృద్ధినొందజేయుదము. పునఃపునర్వివాహములు జరుగుటచే బహుపురుషసంపర్కంబు లభించునుగదా. ఈ రెంటివలనను కులస్త్రీలు సైతము వారస్త్రీలవలె శృంగారచేష్టానైపుణ్యముగలవా రగుదురు.

శృంగా -- పునర్వివాహితలకు మాత్రము బహుపురుషసంపర్కము గలుగునా?

వీర - బహుశబ్దమున కర్దమేమనుకొంటివి. ఒకటిరెండు మించిన దానికీ యర్థము. అదియునుంగాక వివాహము వివాహమునడుమ నవకాశముండును. అప్పుడు వితంతువు స్వతంత్రురాలు గనుక యేమిచేసినను వలదనువారుండరు.

శృంగా - అయ్యో! మన మీమాటలసందడిలో బ్రస్తుతాంశమును మరచితిమి అదిగో మయూరు డిట్లువచ్చుచున్నాడు. ఏనుగబయలుదేరినది కాబోలు.

మయూరుడు - (ప్రవేశించి) వీరభద్రు డుత్తరవీథి నుండెదనని చెప్పి ఇందుడెనేమీ? భేరీ నినాదము మీకు వినంబడలేదా? భద్రగజము బయలుదేరినది. దానితో మంత్రియు సామంతరాజులు, పురోహితుడును నడుచుచున్నారు. మొదటనే పడమరవీథికి బోదొడంగినది. తూర్పునకు వచ్చుట కష్టముగా యని యీవార్త మీ కెఱింగింప వచ్చితిని.

శృంగార - ఆ వీథిని రాజశేఖరుడు భద్రముగా నుండెనా? మనముకూడ పోవుదమురండు. ఏమిజరుగునో! అదిగో రాజుశేఖరుడు సైతమిట్లు తొందరగా వచ్చుచున్నాడు. ఏదియో జరిగినట్లున్నది.

రాజ - (ప్రవేశించి) అయిపోయినది. అయిపోయినది. మిత్రులారా! మన సంకల్పము లేమియు గొనసాగినవికావు.

శృంగార - తమ్ముడా! ఎవని పుణ్యము పండినది చెప్పుము చెప్పుము.

రాజ — నాలుగుదినములనుండి మనవీటిలో వికారవేషముతో దిరిగెడు వెఱ్రివాండ్రలో నొకని వరించినది. అమూఢజంతువున కంతకంటె వివేకము గల్గియుండునా? శృంగారవేషములతో మనోహరుల మయియన్నిటికి జాలియున్న మనలనందరను విడిచి యూరిబయల గాడిదపెంటలో పరుండియున్న దైవాయత్తమను వెర్రివా డీరాజ్యము సేయుటకు సమర్థుండని దానికి దోచినది కాబోలు. ఈతప్పుదారిది కాదు. యుక్తాయుక్తవివేకశూన్య మగుజంతువున కట్టి యధికార మిచ్చినవారిది .

శృంగార - అచ్చట జరిగిన రీతినంతయు దెల్లముగా జెప్పుము.

రాజ — ఆమూఢజంతువు కోటలోనుండి వెడలి యేవీథికింబోవక యెవ్వరి వంకజూడక యేరచ్చయందునను నిలువక యెరింగిన దానివలె తిన్నగా వడివడినడచుచు నాయున్మత్తుని యొద్దకుంబోయి నిలువంబడి సువర్ణకలశజలంబు వానిశిరంబున నిడి పుష్పమాలిక గంఠంబున వైచి తొండమున దదంగముల మూర్కొనుచున్నది. దానికి వాడు సంతసింపక దైవాయత్తము దైవాయత్తమని పలుకుచు నెవ్వరు చెప్పినను దానిపయి కెక్కకున్నాడు. అప్పుడు బలవర్ధనునికి నావార్త దెలియజేయనతఁడు వచ్చుచున్నాడు ఇంతవట్టు చూచి వచ్చితిని. దాని నీవు చూచితివా

శృంగార - చూచితిని. నీవుచెప్పినది సత్యమే. కాని యేలాగైన విజయవర్థనుడు వాని రాజుగా జేయుటకు సమ్మతింపడు. వెండియు నెద్దియో యేర్పాటుచేయును అప్పుడయినను మనకు రాజ్యమురాదా? ఇదుండనేల? అచ్చటికిబోయి యేమిజరుగునో చూతము రండని పలుకగా నందఱు నిష్క్రమించిరి.

వారిమాటలు విని విక్రమార్కుడు వెరగుపడుచు భట్టితో కూడ నచ్చోటికి బోయెను. ఇంతలో విజయవర్ధను డేనుగుమీద నచ్చటికి వచ్చి దూరమునందే దిగి యున్మత్తులతో దిరుగుచున్న యతని చరిత్ర మంతయును విని స్వాంతమున నేదియో వింత సంతసము జనియింప జేతులు జోడించి దైవాయత్తము నెదుర నిలువంబడి ఈ పద్యము జదివెను.

సీ. పైదలుల్ దుష్టచేష్టాదూషితస్వాంత
                 లుత్తమాంగన లోక ముద్దరించు
    నరయ దైవాయత్తమై యొప్పు జనమెల్ల
                వసుధ నెవ్వరికి నెవ్వరును లేరు
    తలపోసిచూడ నంతయు మహాచిత్రంబు
                సంసార మనియెడు సాగరమునఁ
    గల్లోలముల భాతిఁ గలుగు నిమ్నోన్నత
               గతురు లోకుల కర్మగతులఁబట్టి
గీ. పూని నిట్టూర్పు విడుచుటకైనఁ బురుషుఁ
    డస్వతంత్రుఁడు మది నిట్టు లరసి యెపుడు
    ప్రజలఁ బాలింపు మయ్య భూపాలదేవ
    సార్వభౌమ! మహాయశశ్శౌరంథామ!

అని చదువగా విని దైవాయత్తము నిద్రితుండు మేల్కొనిన భంగి తలఎత్తి చూచి విజయవర్ధనుడా యేమి? ఎన్నిదినములకు బొడగంటిని. మన ప్రజలందఱు సుఖులయి యున్నవారాయని యడిగిన నతండు దేవరలేని కొరంత యొక్కటియే ప్రజలసుఖమునకు నవరోధకముగా నున్నదని బలుకుచు నుత్కంఠముచే గంఠము స్తంభింప నెలుంగ రాక యొక్కింతసేపూరకొనియెను. అప్పుడు జనులందఱు తల యొకరీతిం దలంచుచుండిరి.

విక్రమార్కుడు భట్టితో మిత్రమా? ఈతండు భూపాలదేవచక్రవర్తి సుమీ! తెలిసికొంటివా ? ఆతండిట్లుండుటకు కారణమెద్దియో యుగ్రాహ్యమై ఉన్నది. మాలతి వరించినవా డీతండే యగు చూడుము. ఆదైవజ్ఞుడు దైవజ్ఞుడే అని ప్రశంసించుకొనియెను మాలతియు తక్కిననిరువురు నతనిచెంతకువచ్చి నిలువంబడిజూడదొడంగిరి.

అప్పుడు విజయవర్ధనుడు తెరపి దెచ్చుకొని దేవా! పడినయిడుములు చాలవా? ఇంకను జాగుసేయనేల యని పలుకుచు గైదండగొని యమ్మత్తేభముపయి నెక్కించెను. ఊర్ధముకులయి తనదెస జూచుచున్న యా మువ్వురనుగూడ నెక్కింపుమని దైవాయత్తము మంత్రికి గనుసన్న సేయ నతండట్లుచేసెను. ఇంతలో మాతంగ ప్రాంతమందు జనసంబాధములో వడివడి నడచుచున్న భట్టివిక్రమార్కులు గనంబడుటయు నా పుణ్యపురుషుడు దంతావళమును నిలిపించి వారినిసైతము దానిపైనెక్కించు కొనియెను.

పిమ్మట వారి నపారవై భవముతో నూరేగించి యవ్వీటి కోటలోనికిం దీసికొనిపోయిరి. అందొకచోట సభచేసి యిష్టగోష్టి వినోదముల గాలక్షేపము చేయబూను సమయంబున వాచాలుండైన విక్రమార్కభూపాలుండు వినమ్రుఁడయి యెల్లరు విన దైవాయత్తము మొగము జూచుచు విజయవర్థనునితో నిట్లనియె.

ఆర్యా! మేము మిమ్ములను సాగనంపి యరుగుచుండ నొకదారిలో వీరందఱు కనంబడిరి. వీరి యాకారములుచూచి విస్మయము జెందుచు బల్కరించి తగిన సమాధానము వడయక వీరి వృత్తాంతము దెలిసికొను తలంపుతో మేమును వీరితో నున్మత్తులమయి తిరిగితిమి కొన్ని దినముల కీసాధ్వీతిలకంబు తనవృత్తాంతము చెప్పినది. వీరికథ నేటివరకు దెలిసినదికాదు. ఇప్పుడు మీ సంభాషణములచే నితండు భూపాలదేవచక్రవర్తియని స్పష్టపడినది. ఇప్పుడపుణ్యాత్ముండిట్టి నీచవృత్తింగైకొని సంచరించుటకు గారణమేమియో దెలియకున్నది. సహవాసపరిచయమే నన్నీ ప్రశ్న కర్మకు బ్రోత్సాహపరచు చున్నది. గావున నీయుదంత మెఱింగింపవలయునని మిక్కిలి వినయముగా బ్రార్థించిన విని విజయవర్థనుడతని మొగము జూచుచు ననుమతివడసి యిట్లనియె.

భూపాలదేవ మహారాజు కథ

అనఘా! ఈతండు భూపాలదేవ చక్రవరియగుట నిశ్చయము. ఈతని వెనుకటి చారిత్రమంతయు మీరెఱింగియే యుందురు. కర్మానుగుణ్యమయిన బుద్ధిపొడము చుండునని చెప్పెడిమాట యదార్థమగును. ఈయన ప్రథమప్రాయమున నొప్పుచుండియు దారాపరిగ్రహము సేయక యువతులదుష్కృతకృత్యంబు బెత్తిపొడుచుచున్నంత సంతానాపేక్షంజేసి నే ననేక విధముల బ్రార్థించితి. నందుల కాయన యంగీకరింపడయ్యె. అప్పుడు నేను దైవసంకల్పము గలిగియుండిన మీ రిప్పని దప్పించుకొన గలరాయని పలికితిని దైవసంకల్పమన నేమియది? పురుషసంకల్పము లేనియప్పుడు దైవసంకల్ప మేమి సేయగలదని యతం డాక్షేపించెను. దైవకారపురుషకారములలో దైవకారమే బలమయినదని నేననిన పురుషకారమే బలమైనదని చక్రవర్తిగారును పెద్దతడవు వాదించి నామాట లంగీకరించిరికారు.

అది రాజ్య మదవికారమని నేను తలంచి సమయమరసి యా విషయమే ప్రతి దినము ముచ్చటించుచుంటిని. కానియాయన మతి తిరిగినదికాదు, ఇట్లుండ నొకనాడు మావీటిదేవాలయములోనికి దపంబు మూర్తీభవించిన ట్లొప్పుచున్న మహాయోగియొకండు వచ్చెనను వార్త విని మావల్లభుడుల్లంబు మరలించుననుతలంపుతో నిచ్చగింపకున్నను బలాత్కారముగా వాదనెపము బన్ని యాయన నాయతియొద్దకు తీసికొనిపోయితిని.

రెండవశంకరునివలె నొప్పుచున్న యయ్యోగిపుంగవుం జూచి మాఱేడు నమస్కృతియయినం జేయక తిరస్కారభావముతో జూచుచు నా మొగముజూచి మందహాసము సేయ డెందమున దొట్రుపడుచు నేనమ్ముని యడుగుదమ్ములబడి మహాత్మా! సర్వసంగపరిత్యాగంబు సేసియు పామరుల నుద్దరింప దేశయాత్ర గావించెడు మీవంటి మహానుభావు లజ్ఞులు గావించుతప్పులు లెక్క సేయుదురా? ఎఱుగని మాయపరాధములు సైపుడు మా చక్రవర్తిగారికి దైవకార్యముకన్న బురుషకార్యమే ప్రధానమైనదని మనంబునం బట్టియున్నది. నేను సమాధానపెట్టి యప్పట్టు త్రిప్పలేకున్న వాడ. దేవరయనుగ్రహ లేశము గలిగియున్న దృటిలో నతని భావము మరలగలదని పెద్దతడవు బ్రార్థించితిని.

అప్పుడతం డెట్టకే కన్నులెత్తి రాజుంజూచుచు నీ పద్యమును చదివెను.

సీ. పై దలుల్ దుష్టచేష్టాదూషితస్వాంత
                 లుత్తమాంగన లోక ముద్థరించు
    నరయ దైవాయత్తమైయొప్పు కనమెల్ల
                 వసుధ నెవ్వరికి నెవ్వరును లేరు
    తలపోసిచూడ నంతయు మహాచిత్రంబు
                 సంసార మనియెడు సాగరమునఁ
    గల్లోలముల భాతిఁ గలుగు నిమ్నోన్నత
                గతులు లోకుల కర్మగతులఁ బట్టి
గీ. పూని నిట్టూర్పు విడుచుటకై న బురుషుఁ
    డస్వతంత్రుడు మది నిట్టు లరసి యెపుడు
    ప్రజలఁ బాలింపు మయ్య భూపాలదేవ !
    సౌర్వభౌమ! మహియశశ్శౌర్య థామ!

అని చదువుచు నామతము సిద్ధాంతము గావింప శాస్త్రదృష్టాంతము లెన్ని యేనిం చూపుచు బోధించెను కాని యిన్నరనాథుం డందులకు సమ్మతింపక తానన్నమాటయే యాడుచు నాయతిని సైతము మతిరహితునిగా దలంచెను.

మహాత్ముల ప్రభావ మంచిత్యముగదా మరునాడు ప్రాతఃకాలమున యథాప్రకారము నేను కోటలోనికి పోయి చూచిన చక్రవర్తి యెందునుఁ గనంబడలేదు. సాయంకాలమువరకు వెదకి కానక విసిగి యది యోగికి కావించిన యపరాధమువలన జరిగిన పరాభవమని నిశ్చయించి యయ్యోగీంద్రుం బ్రార్థింపఁబోయితిని కాని యీలోపలనే యయ్యోగి యేందేనిం బోయెను. కావున డెందంబున బలుచందంబులఁ దలంచుచు నాగుట్టు తెలియనీయక యతండున్నట్లే రాజ్యాంగముల చక్కపెట్టుచు నాటగోలె రాజ్యతంత్రపరీక్షకై తపంబుఁ బన్ని దేశాటనము చేయదొడఁగితిని.

ఒక సిద్దక్షేత్రంబున నయ్యతి హఠాత్తుగా తారసిల్లుటయు నతని యడుగుదమ్ముల వ్రాలి నృపతివృత్తాంతము చెప్పుమని ప్రార్థించితిని. అప్పుడయ్యోగి మీరాజు వెఱ్రివాడయి తిరుగుచున్నాడు. నీకుఁ గొన్నిదినములలో కనఁబడును. ఆతండని నీకు తోచినప్పు డానాడు చదివిన పద్యమును జదువుము. అప్పుడు పూర్వస్మృతి కలవాడగునని చెప్పుచు నావలన ప్రతివచనమును బడయకయే యతండవ్వలికిం బోయెను.

అప్పటినుండియు వెఱ్రివాండ్ల నరయుచు కానుకలిప్పింతునను కైతవమున వారిని రప్పించుచుంటిని. మీగ్రామము వచ్చినప్పుడట్లు చేసిన విషయము మీకును జ్ఞాపకము నుండవచ్చును.

ఆరీతి చూచుచుండ దైవనియోగంబున నిందు బొడగంటిని తరువాత కథ మీరెఱింగినదేకదా. చక్రవర్తిగా రెందెందు దిరిగిరో యేమేమి పనులు గావించిరో యాకథ వారు చెప్పవలసినదేకాని నేనెఱుంగనని బలికి యూరకున్నంత విక్రమార్కుండా విషయమును సయితము వినుటకు తమకు మిక్కిలి వేడుకయగుచున్నదని ప్రార్ధించిన నాచక్రవర్తి తనకథ యిట్లని చెప్పదొడంగెను.

ఆదివసంబున నయ్యోగింద్రునితో సంవాదముజేసి యింటికింబోయి కంటికి నిద్రరాక యందలి సత్యాసత్యములగురించి వితర్కించుచున్నంతలో కొంత ప్రొద్దు పోయినతరువాత నేను పరుండియున్న మంచపుదాపున కెవ్వడో యొక వీరపురుషుడు చనుదెంచి యట్టహాసము చేయుచు నాచేయిపట్టుకొని యెక్కడికో వడివడి లాగికొని పోదొడంగెను. అప్పుడు నేనతని చేతిపట్టు వదలించుకొన వలయునని యెంతయో ప్రయత్నము సేసితినికాని శక్యమయినదికాదు. వీటిని కోటను దాటించి క్రమంబున నమ్మహాపురుషుడు నన్ను వాయువేగమున లాగికొనిపోవుచుండ గడియలో ననేక పురనదీపట్టణారణ్యంబులు దాటిపోయినవి. నాకతనివెంట పరుగిడుటకు సామర్థ్య మెట్లు వచ్చినదో నేనెఱుంగను. అదియంతయు నతనిశక్తియేయని యూహింపుచు నరుగుచుంటిని.

అతండట్టి వేగముతో తెల్లవారువరకు నీడ్చుకొనిపోయి వెలుగువచ్చునంత నన్నొకతోట ప్రాంతమున విడిచి యెందేనిం బోయెను పిమ్మటనే నాహా! నామనంబుగల సందియముతీరినది. నన్నీడ్చుకొని వచ్చినవాడె దైవము కాబోలు. నిన్నను యోగిచెప్పిన విషయములన్నియు యథార్ధములని తలంచెను తెలియక నమ్మహాత్మువి తిరస్కరించిన పాతకమే నన్నిట్లుచేసినది. జగంబంతయు దైవాయత్తమయి యున్నదనుమాట సత్యము. సత్యమని నిశ్చయించి యిదిమొదలు దైవాయత్తమనుమాట తప్ప మఱేమియుం బలుకకుండువట్లు వాఙ్నియమము జేసికొని వెర్రివాడనయి యనేక గ్రామంబులు తిరిగితిని! కొన్నిదినములకు నీ యున్మత్తు లిరు వురు నాకు తోడుపడిరి మేము మువ్వురము నొక వీటిలో దేవాలయములో నుండగా నొకనాటిరాత్రి యెవ్వరో యొకచిన్నదానిని నాచెంతకు దీసికొనివచ్చి నన్ను లేపి కూర్చుండబెట్టి వివాహము గావించిరి. వారెట్లుచెప్పిన నట్లు చేసితినని తరువాత నాటివరకు తానుగావించిన కృత్యములన్నియుం జెప్పెను.

ఆచక్రవర్తి చరిత్రమువిని విక్రమార్కుడు మిక్కిలి వింతపడుచు నాచెంత నున్న యిరువుర యున్మత్తులంగాంచి అయ్యా, మీవృత్తాంతము సయితము శ్రోత్రానందనముగా నుండకమానదు. చక్రవర్తిగారికి వినవలయునని యుత్సుకముగా నున్నది. ఎద్దియో కారణంబున నిట్లుండిరి. కాని మీరును మహానుభావులని తోచుచున్నది మీకథ యెఱింగింపుడని కోరిన ముందుగా దేవశర్మ తన యదంత మంతయు నెఱింగించి వారికి సంతసము గలుగజేసెను. పిమ్మట రెండవయతండు శిరంబున చేతులుమోడ్చి నమస్కరించుచుఁ దన వృత్తాంత మిట్లని చెప్పఁదొడఁగెను.

నవకుబేరుని కథ

అయ్యా! నాకాపురము కాంచీపట్టణము. నేను వైశ్యజాతివాడ. నన్ను నవకుబేరుడందురు. నేను వాణిజ్యముచేసి మితిలేని ధనము సంపాదించితిని. దానం జేసియే నాకిట్టిపేరు వచ్చినది కాలక్రమంబున నాకుఁ బదుగురుపుత్రులును, బదుగురు పుత్రికలును జనించిరి మిగుల వైభవముతో వారికందరకు వివాహములు గావించితిని కూతుండ్ర నల్లుండ్రతో నింటియొద్దనే యుంచుకొని వారికి వ్యవహారములు కల్పించుచుఁ బెక్కురీతుల ధనము వృద్ధిబొందఁ జేయుచుంటిని. నాకు ధనముతోడనే కుటుంబము సైతము వృద్ధినొందుచుండెను. పెక్కేల నాసంతతి యనతికాలములో దుర్యోధనసంతతి యంత యయ్యె, మిగులవైభవముతో మహారాజులను సయితము లక్ష్యముచేయక దానధర్మముల విషయమయి కాసయినం గర్చుపెట్టక యతిలుబ్దచిత్తుఁడనయి మహామోహముతోఁ గొంతకాలము గడపితిని.

సీ. కాశీగయా ప్రయాగములలోనగు పుణ్య
                  తీర్థంబులకునైనఁ దిరుగనైతి
    నర్చింపలేనైతి నఖిలలోకైకనా
                 యకుఁ బుండరీకాక్షునభవు నైన
    సలుపంగలేనై తి సద్బ్రాహ్మణుల కెల్ల
                దానాళిలొ నొక్కదానినైనఁ
    జపియింపలేనైతిఁ సన్మంత్రముల నైనఁ
               బూజింపలేనైతిఁ బుణ్యతముల
గీ. కొరతవడునంచు ద్రవ్యంబు కూర్చి
    తలఁపు లుదయింప ముల్లెలదాఁచి దాఁచి
    కాసువీసము బోనీక కాల మెల్ల
    నకటఁ గడపితి మీఁద నేమగుదురొక్కొ .

పామరుల నుద్దరించుటకుఁ గదా మహాత్ములు లోకయాత్ర సేయుచుందురు. నేనటు మోహాంధుండనయి సంసారసాగరమున మునిగియున్న సమయంబున నొకనా డొకబైరాగి బిక్షకై మాయింటికివచ్చి నన్నాపూట భోజనము యాచించుటయు నేమియు నియ్యక సామాన్యపు బిచ్చగానివలెఁ జూచుచు ముచ్ఛా? పోపొ మ్మెచ్చట నుండి వచ్చితివని నిరసించి పలికితిని నేను ముచ్చునయినచో నిన్ను యాచింపనేల యని యతండన నీలాటివారే ముచ్చులును, గుట్టు తెలియుటకయి యాచింతురని నే నంటిని ఆమాటలమీద మాయిరువురకు వాదము జరిగినది. నేను ధనమదుడయి యున్నవాడ గావున నిముషమునకు వేలు సంపాదించెడు నావేళయంతయు వృథాలాపములచే జెరిపెనను కోపముతో నమ్మహానుభావునిఁ బరిచారకులచే గెంటించితిని.

నాగెంటువడి యతండించుకయు నలుగక ధూళియైన యొడలు తుడిచి కొనుచు నామూఢత్వమును గుఱించి చింతించుచు నెచ్చటికిం బోవక మా వీథిలోనే కూర్చుండి యుండెను. సాయంకాలమువఱకు నట్లుండినను నేను స్వయంపాక మిచ్చితినికాను. స్వయంపాకము దీసికొని కాని యరుగనని యతండును, నీవిందు బలాత్కారముగా జచ్చినను స్వయంపాకమియ్యనని నేనును బట్టుపట్టికొని యుంటిమి. మూఁడహోరాత్రంబు లతం డట్లే కుడువక యావీథిలో నుండుట జూచి నా విహితులు కొందఱు వచ్చి యతడు శపించునని వెఱపించిరి కాని నేను భయపడలేదు. వీథి తలుపులు మూయించి రెండవదారిని నడువ దొడంగితిమి. అతండట్లు కొన్ని దినంబులుండి విసిగి యెందేనిం బోయెను.

అప్పుడు నేను భూచక్రమును గెలిచినట్లుగా సంతసించుచు వీథితలుపులు తెరపించి సంచరింపఁ దొడంగితిని. కాని యమ్మఱునాడే యయ్యోగి వెండియువచ్చి వీథిలో గూర్చుండుటచే మరల తలుపులు మూయించితిని. మేమేవైపున మసలు చుందుమో యాదెసనే ఆతఁడు వచ్చి కూర్చుండుటయుంజూచి యోహో ! యాతని నాశత్రువులెవ్వరో బోధించిరి లేకున్న మాద్వారములన్నియు నీతని కెట్లెఱుగబడును? మాయింటికి వాణిజ్యమునకై నిత్యము పెక్కండ్రు వర్తకులు వచ్చుచుం బోవుచుందురు. అన్నితలుపులు మూసికొని యెట్లు వేగించుకొందు నితండు పిశాచములాగున వదలకున్నాడు. ఊరక స్వయంపాకమెట్లు వ్యయపెట్టుదునని చింతించుచు నీవు తిరుగా నేమిటికై వచ్చితివని యొక మిత్రునిచే నతనియొద్దకు రాయబారము పంపితిని.

అప్పు డయ్యోగి నాకు స్వయంపాక మక్కరలేదు నీతో గొన్ని సంగతులు ముచ్చటింపవలసియున్నది రెండుగడియ లవకాశమిచ్చినఁజాలు నిదియే నా కోరిక యని యతం డతనిచేత నాకు తెలియజేసెను. అయ్యో? గడియకు కొన్ని వేలు సంపాదించెడు నేనందుల కెట్లియ్యకొందును. లేకున్న స్వయంపాక మీయవలసివచ్చు నేమిచేయుదును దైవమాయని విచారించుచు నెట్టకేలకు నామిత్రుని నిర్భంధముమీద మఱియాఱునెలల కట్టియవకాశమిచ్చుటకు వీలుండునని చెప్పి యవ్వార్త నంపితిని.

ఆ మాటవిని సమ్మతించి యతండరిగి యారునెలలు చనినపిమ్మట నరుదెంచి వీథిలో నిలుచుటయుఁ జూచి మఱిరెండునెలలు మితిజెప్పితిని. ఆగడువున కతండు వచ్చినంత మఱియొకమాసమునకు రమ్మంటి నీరీతి నొకసంవత్సరము గడపితిని. కాని యతం డెప్పటికప్పుడే సిద్దమగుచుండెను అతనికిమాట సెప్పుటయుఁ బని చెరుపుగాఁ దలంచి యొకనాఁ డెట్టకేలకుఁ దెరపి చేసికొని వీథియరుగుపయికిఁబోయి నేను వానిఁజీరి యోరీ! నీవు నాతో మాటాడవలసిన విషయము లేమియో త్వరగా మాటాడుము. తృటికాలముకన్న నెక్కుడు నిలువను. మహారాజువచ్చినను నింత యవకాశమియ్యలేదని పలికితిని. అప్పుడు మా యిరువురకు నిట్లు సంవాదము జరిగినది.

యోగి - వర్తకుడా! సంవత్సరమునుండి నీచారిత్ర మరయుచుంటిని. నీవు కాలప్రవృత్తి తెలిసికొనలేక సంసారసముద్రంబున మునింగి యందుఁగల భార్యా పుత్రాదిక జలజంతువులచే గృసియింపఁబడుచు నాముష్మికమును గురించి యించు కంతయు విచారింపకున్నాడవు అయ్యో! నిన్ను జూచిన జాలిబొడముచున్నది. పిమ్మట నేమయ్యెదవో గదా!

నేను - భార్యాపుత్రులను విడువమనియాయేమి? నీవేదాంతోపదేశము చాలు చాలు. "ముష్ట్యంతందాసరేః పద" మనుమాట నేనెఱింగినదే.

యోగి - నీవేమియు ముష్టి పెట్టనక్కరలేదు. అట్టి యూహతో నీకీమాట చెప్పుటకాదు. నీమూఢత్వమునుజూచి దానిని తొలగించు తాత్పర్యముతో నింత చెప్పుచున్నాను.

నేను — చిరకాలమునుండియున్న నా మూఢత్వము నీవిప్పుడు తొలగింప గలవా? నీ మూఢత్వమును వదల్చుకొని నీవు ముక్తిబొందుము.

యోగి - మాటమాటకు శంకింపక నామాటలన్నియుఁ జెవి నెక్కించుకొనుచు తరువాత నీయిష్టము వచ్చినట్లుగాఁ జేయుదువుగాక.

నేను - నీమాట లివియేనా మఱియేమైనం గలవా?

యోగి - కలవు వినుము. ఏబదియేండ్లక్రిందట నీవులేవు. ఇంక నేబదియేండ్లు దాటినపిమ్మట నీవుండవుగదా. నీకంటె యెక్కుడు మమత్వముచే నొప్పిన నీతాత ముత్తాతలు గాలధర్మమునొందిరి చూచికొనుము.

నేను -- అరువ దేండ్లక్రిందట నీవులేవు ఇక నరువదియేండ్లకు నీవుండవు. వేదాంతముచే దిరుగుచున్న నీ తాతముత్తాతలుమాత్రము భూమి నుట్టికట్టుకొని యూగుచున్నారాయేమి?

యోగి - ఓహో! నీవు నాకేమియు నుత్తరము చెప్పవలదు. నా మాటలు మాత్రము చెవి నెక్కించుకొనుము ఇదియే నాకోరిక

అని పలికి నాశిరంబున దనకరంబిడి యజ్ఞానతిమిరమిహిరోదయంబై న ఉపన్యాసప్రక్రమంబుననే ఱాయివంటి నాహృదయంబును గొంతమెత్తన గావించెను. ఆయనమాటలయందు నాకప్పుడు కొంచెము విశ్వాసము గలిగినది కుటుంబమునంగల మమత్వదోషంబున లోభియై యాముష్మికము చెరుపుకొనగూడదు. తన గతి కడుపడువాడొక్కఁడును లేడని చెప్పిన యాయనమాటలు విని నేను అయ్యా! మీరట్లనిన నేమిచెప్పుదును నాసంతతి రెండువందల సంఖ్యకు మించియున్నది. వాండ్ర నందరను బోషించిన వూరకపోవునాయని యడిగితిని. అప్పుడతఁడు మోహమనునది ఇదియే వీండ్రలో నీసుకృత దుష్కృతములు బంచుకొనువా డొక్కడును లేడు అది యట్లుండె నైహికసుఖమున కైన బూనుకొనువాడులేడు. చుట్టాలు దొంగలు, ఎంత దనుక సంపాదించి పెట్టుచుందువో యంతదనుక నీకీస్నేహములు గలిగియుందురు. అది యుడిగినపిమ్మట జీవచ్చవముగా జూతురు దీనికి నీకు దృష్టాంతము చూపెదను. ఇట్లుచేయుమని చెవిలో నెద్దియో చెప్పెను. అందులకు నేనును సమ్మతించి యతనిం బంపితిని. పిమ్మట కొంతకాలము కపటరోగ మభినయించుచు గడపితిని.

ఒకనాటిరాత్రి భోజనము చేసినపిమ్మట నేను నాభార్యం బిలిచి నాకు తలనొప్పి వచ్చినది. మేనంతయు వివశముగా నున్నది. జీవము నిలుచునట్లు కనంబడలేదు. నేను జేయవలసిన పనులన్నియుం జేసితిని కాని మిమ్ముల నమ్మి యాముష్మికము విషయమై యించుకయు బనిచేయనైతి నింకొక సంవత్సరము జీవించితినేని యాకొరంత తీర్చుకొందును గదా యని పలుకుచు గన్నులుమూసి దుప్పటము ముసింగిడుకొని చచ్చెడివానివలె యట్టె పరుండితిని అప్పుడు నాబంధువులందరు హాహాకారనాదములు గావింపుచు నన్ను జుట్టుకొని యేడువదొడంగిరి. మఱి కొందరు మాంత్రికులం దీపికొనివచ్చి తెల్లవారువరకు జికిత్సలు చేయింపుచుండిరి. దేనివలనను నాకు స్వస్థతపడునట్లు తోచనందున వైద్యులీరోగము కుదురునది కాదనిచెప్పి వదలివేసిరి. ఊపిరి బిగపట్టి యట్లుండనట్టియోగ మయ్యోగియే నాకుపదేశించెను.

నేను జీవింపనని తోచి నప్పుడు నాభార్య నూతిలోబడ ప్రయత్నించినఁ బదుగురుపట్టుకొని కూర్చుండబెట్టిరి. పెక్కు లేల నాయందు భక్తివిశ్వాసములుగలవారందరు నేమిహత్యలు గావించుకొందురోయని తలయొకరిం గాచికొనుచునాప్తులు విరక్తి మాటలం జెప్పుచుండిరి. అట్టిసమయమున నయ్యోగి శర్కరామిళితము లయిన దుగ్ధములనొక పాత్రతో దీసికొనివచ్చి నామంచముదాపున నిలిచి దుఃఖించు వారినందరకు హస్తసంజ్ఞచే వారించుచు నిట్లనియె.

ఈతండు పూర్వకర్మఫలంబున నిప్పుడు కాలధర్మమునొందెను. ఇతనిగురించి చింతించిన బ్రయోజన యేమియులేదు మానుషచికిత్స లేమియు నితని జీవితము నిలుపజాలవు. ఈతనితో మీకెక్కుడు కార్యము గలిగియుండినం చెప్పుడు. ఈ సిద్దౌషధప్రయోగంబున నితని బ్రతికింతునని పలికినతోడనే నా భార్యాపుత్రు లతనిపాదంబులబడి మహాత్మా! రక్షింపుము రక్షింపుము. నీకేమి కావలయునో యిత్తుము ఇతనితోడిదే మాజీవనము! మా సిరియంతయు నిచ్చియైన నితని బ్రతికించుకొనుటయే మా కావశ్యకమయినపని యని ప్రార్థించిన నయ్యోగి యిట్లనియె.

ఈతని కాయువుమూడినది. కావున నితడిట్లు మృత్యుండయ్యెను. ఈసిద్దౌషధ బెవ్వరు పుచ్చుకొనునో యతండు మృతుండగును. ఆతని యాయువు వీనియందు సంక్రమించి యితండు బ్రుతుకును. ఇదియే యీసిద్దౌషధివలన గలిగెడు గుణము. దీనిని మీలో నొక్కడు త్రాగుడు వీడు జీవించును. వీడు చేయగల కార్యములన్నియు దీరగలవని పలికి యూరకుండెను.

అతనిమాటలువిని నా బంధువులలో నొక్కండయినను నేను త్రాగెదనని ముందరికి వచ్చినవాడులేడు. అప్పుడా యోగి తిరుగా నామాటలే చెప్పెను కాని యెవ్వరు నేమాటయు చెప్పిరికారు. కొంతసేప ట్లూరకొని యాసిద్దుడు నా భార్య జీరి నారీమణీ! స్త్రీలకు బతియే భూషణము. పతితో మృతినొందిన యువతి ఏడుతరముల నుద్థరించును. పతివిహీనయైన స్త్రీ జీవించుటకంటె బాతకములేదు నీకును సగంకాలం తీరినది. సంతతిం బడసితివి. శుభములంజూచితివి నీకు గొదువయేమియునులేదు. నీ వీసిద్దౌషధమును ద్రాగుము పతిని బ్రతికించిన పుణ్యమునుజెంది యుత్తమలోకంబున కరిగెదవని పలికిన నాభార్య యామాట కేమియు నుత్తరమియ్యక మెల్లగా నావలకు జారినది.

ఆతం డంతటితో నూరకొనక యేమమ్మా? మాటాడక యవ్వలికిబోయితివి నామాట కేమియుత్తర మిచ్చితివి? ప్రాణనాథుని కీపాటి యుపకృతి సేయలేవాయని పలికిన నాదుష్టురాలు యెదుటకు రాక మాటుననుండి అయ్యో ఇదియేమికర్మము ఇందరిలో సిద్ధునకు జావుమనుటకు నేను గనంబడితిని కాబోలు నేను జచ్చిన తరువాత నెవ్వరుండిన నాకేమి? చాలు నీవైద్యమని మెల్లగా బలుకుచు నచ్చటనుండి కదలినది కాదు.

అప్పు డతండు విడువక నాభార్యచేత నేను జావజాలను. పుణ్యము నాకక్కర లేదు. ఈ సిద్దౌషదమును నేను బుచ్చుకొననని ముమ్మారు స్పష్టముగా బలికించెను. ఆసందడిలో నందున్న బంధువులు నెపములుపన్ని యందుండి యవ్వలికి బోదొడంగిరి. అది యంతయు దువ్వలువ సందునుండి జూచుచునే యుంటివి. అయ్యోగి నా భార్యను విడిచి నాపెద్దకుమారుని జీరి దాని నడిగినట్లుగానే యడిగెను. వాడును సమ్మతింపడయ్యె ఇక జెప్పనేల? నాకుగల కొడుకులను, కోడండ్రను, కూతుండ్రను, మనుమలను, నాప్తులను, బరిచారకులను దాసదాసి జనంబులనతండు నందరను బేరు పేరు వరుస నారీతిగానే యడిగెను కాని యొక్కడయిన సమ్మతించినవాడులేడు

అప్పుడతండయ్యో ఈతని కిందఱు ప్రాణబంధువులు గలిగియుండి యొక్కడయిన వీనిప్రాణములు కాపాడకపోయెను. ఈతండు వీండ్రకొరకు చేయరాని పనులన్నియుంజేసెను. ద్రోహబుద్ధితో బెక్కురొక్కము సంపాదించెను దానధర్మములను మాటయే ఎరుంగడు. కుడుచుటయు, దొడుగుటయు, నిచ్చుటయు మునుపేలేవు. ఇట్టి పాపకృత్యములన్నియు వీరికొఱకు కావించి ద్రవ్యము కొఱంతపడనీయక కాపాడుచుండెను. ఇట్టివాని విషయమై యైహికమునకయిన నడ్డుపడకున్నారు. పర మున కెట్లు సహాయము చేయుదురు. ఇతని బుద్ధిహీనత యిప్పుడు స్పష్టమగుచున్నదికదా! తానుచేసిన సుకృతముతప్ప తన్ను కాపాడువారు లేరు. కావున నొరులకొరకుఁ దనదారిఁ జెరుపుకొనరాదు. సంవత్సరమునుండి నాకొక స్వయంపాక మియ్యవలయునని యెన్నియోపాట్లు పడెను. ఇట్టి లుబ్ధునకుఁ జివర జరిగిన పని యిది. తానైనం గొనిపోవుచున్నాడా! ప్రోగుచేసి మీకిచ్చిన మీ కృతజ్ఞత యిట్లున్నది కానిండు సంవత్సరమునుండి నాకు వీనిసాంగత్యము గలుగుచున్నది. మీరు కృతఘ్నులు కావున వీనిం కాపాడితిరికారు నేను దీనింగ్రోలి వీనిం బ్రతికించెదఁ జూడుడని పలుకుచు నాపాత్రలోనున్న పాలుద్రావి నావీపు తట్టుచు వర్తకుడా? లెమ్ము లెమ్ము సిద్దరసాయంబున బ్రాణంబు లిచ్చితినని పలికిన నేనప్పుడు ముసుగుతీసి వారిమాటలన్నియు వినుచుంటిని కావున నందరయందును విరక్తి జనింప లేచి కూర్చుంటిని.

అప్పుడు నాబంధువులందఱు నన్నుఁ జుట్టుకొని యేడువఁదొడంగిరి. నేను ఛీ! ఛీ! పోపొండు యీదొంగరోదన మేల సేసెదరు. మీ ప్రీతియంతయుం దెల్లమైనది. మీకతంబున నే నధోగతిం బడుచుండ నీమహానుభావుం డుద్ధరించెను. నిక్కము తెలిసికొంటి నెవ్వరి కెవ్వరును లేరు. ఎవ్వరులేరు. ఇదియంతయు వట్టిదియని పలుకుచు నాబంధువుల నందఱిని విడిచి యప్పుడే నా ధనమంతయు శ్రోత్రియులకుఁ బంచిపెట్టి యయ్యోగి పాదంబులు శరణంబులుగా వేడికొనుచు నతనితో దేశాటనము చేయుటకు పూనుకొంటిని. కాని యయ్మోగి యమ్మఱునాఁడుదయంబున నాకు తెలియకుండ నెచ్చటికో చనియెను నే నతనిజాడ నరయుచు నెవ్వరి కెవ్వరును లేరనుమాటతప్ప మఱియేమియుం బలుకక వెఱ్ఱివాడనై యనేక విశేషములం గంటిని. ఒక్కచో వీరిరువురు గనంబడుటయు నావంటివారేకదా యని నాటగోలె వీరివెనువెంట తిరుగుచుంటిని. తదనంతర వృత్తాంతము మీరెఱింగినదేకదా యని తన కథయతంయు జెప్పి యా వర్తకుడు వారికి విస్మయంబు కలుగచేసెను.

తచ్చారిత్రములు విని చక్రవర్తి విక్రమార్కునితో నార్యా అమ్మహాయోగి తాను జదివిన పద్యమునంగల విషయములు ప్రత్యక్షముగా నాకిట్లు చూపెను. అమ్మహాత్ముని భగవంతుడనియే నిశ్చయింపఁదగినది ఒరుల కిట్టిసామర్థ్యము గలుగునాయని పొగడుచు మంత్రి దిక్కు మొగంబయి విజయవర్దనా! ఈ బ్రాహ్మణుడును వర్తకుడు నాకత్యంత ప్రాణమిత్రులై నాతోఁ గష్టసుఖంబుల ననుభవించిరి. వీరికి ముందుగా మేలుగూర్పవలయును. దేవశర్మ నీరాజ్యమునకు బట్టభద్రునిగాఁ జేసి యీవర్తకుని మంత్రిగాఁ జేయుము. వీరు కారణాంతరమున నావలెనే విరక్తులైరి. కావున వెండియు సుఖంబులం గుడువనోపుదురు. శ్రోత్రియ బ్రాహ్మణ పుత్రికను నితనికి పెండ్లి చేయుమని యాజ్ఞాపించుచున్న యన్నరపతి ముఖ్యునితో విక్రమార్కుం డిట్లనియె.

దేవా! దేవరయానతి యెంతయు నుచితముగా నున్నది. ఉత్తమాంగన లోక ముద్దరించునని యయ్యోగి చెప్పిన విషయ మిమ్మాలతి యందు వర్తించుచున్నది. ఈ సాధ్వీతిలకము మీరెఱింగినదేకదా. ఈ కాంతారత్నమును ధర్మపత్నిగా నింతకు మునుపే మీరు స్వీకరించితిరి. కాని యది రహస్యకృత్వమైనది కావున నిప్పుడు వెండియుఁ బ్రఖ్యాతముగా నమ్మహోత్సవము జరిగింపవలయునని మాకు వేడుకగా నున్నది. అనుజ్ఞయిండని ప్రార్థించినఁ జిఱునగవు నవ్వుచుఁ జక్రవర్తి మంత్రిని జూచిన నతండును నట్టి ప్రార్థనయే కావించెను. ఇంతలో నావార్తవిని మందపాలమహారాజు కుటుంబసహితముగా నచ్చటికివచ్చి సంతోషసాగరమున మునుంగుచుఁ జక్రవర్తిగారిని సపరివారముగాఁ దనగ్రామమునకు రమ్మని ప్రార్థించెను. భూపాలదేవ మహారాజు దేవశర్మను నవకుబేరునితోఁగూడ శుభముహూర్తమునఁ దద్రాజ్యమున నిలచి యనంతరమున మందపాలుని పోలికింజని యందు మాలతిం బెండ్లి యాడి యాచేడియతోఁగూడ తన గ్రామమునకుఁబోయి విజయవర్ధనునితోఁ బెద్దకాలము రాజ్యము గావించెను.

విక్రమార్కుడును భట్టియు మాలతి వివాహానంతరమునఁ జక్రవర్తిగారి యనుజ్ఞ గైకొని యుజ్జయినికిం బోవుచు నొకనాఁడిందు నివసించిరి. అప్పుడీతటాక ప్రాంతమున మార్గస్తులు విశ్రమింప నీమంటపము గట్టింపుచు నొక పుణ్యాత్ముం డిందేవేని విగ్రహముల నిలుపవలయునని తలంపుతో విక్రమార్కుని కోరికొనిన నతండా పుణ్యాత్ముల విగ్రహముల నిందు స్థాపించి వీనిపై నిట్టి నామములు వ్రాయించి యఱిగెను నాటనుండియు నీవిగ్రహము లందున్నవి. జాత్యనుసారముగా ముఖమందు బాహ్మణునకు, భుజముల క్షత్రియునకును, దొడల వైశ్యునకును, బేరులు వ్రాయబడినవి. నీవు చూచిన విగ్రహముల వృత్తాంతమిది యని చెప్పి మణిసిద్దుండు శిష్యునితోఁగూడ తదనంతర నివాసప్రదేశమున కరిగెను.

క. అచలాత్మజా మనోహర | రుచిర శ్యామాంగ బహుళ రూపాక్షజగ
   న్నిచయ ప్రపాలనాతి | ప్రచురిత నిజసుప్రతవాభావా!

క. స్వస్తియగుఁ బ్రజలకెల్ల నీ | రస్తత మోహహృదయులగుచు రాజులుగోని
   ప్రస్తోమముల లరంగ శ| సాస్తజనులు సుఖమునొంద మహిఁబ్రోతురొగిన్ .

గద్య :- ఇది శ్రీ విశ్వనాధ సదనుకంపాసంపాదిత కవితావిచిత్రాత్రే

యముని సుత్రామిగోత్రపవిత్ర, మథిరకుల కలశజలనిధి రాకా

కుముదమిత్ర, లక్ష్మీనారాయణపౌత్ర, కొండయార్యపుత్ర,

సోమిదేవి గర్భశుక్తి ముక్తాఫల విబుధజనాభిరక్షిత సుబ్బన్న

దీక్షితకవి విరచితంబగు, కాశీయాత్రా చరిత్రమను

మహాప్రబంధమునందు తృతీయభాగము

సంపూర్ణము.

శ్రీ శ్రీ శ్రీ