Jump to content

కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/25వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

మూడవభాగము

ఇరువదిఐదవ మజిలీ

దుష్టవర్మకథ

గోపా ! రామలింగకవి రాజప్రబోధితుండై శుభముహూర్తంబున ఢిల్లీ పట్టణంబునకు బయనంబై ప్రియమిత్రుండగు సుభద్రుడు తోడురా నుచితపరివారములతో బురంబు వెలువడి అరుగుచు గొన్ని పయనంబులు గడచి యొకనాడు సాయంకాలమునకు భర్గదుర్గమను గ్రామముజేరి అందొక బ్రాహ్మణుని యింట బసజేసి యారాత్రి నాదాపునున్న దేవళంబున గొందఱు బ్రాహ్మణులు స్వస్తి చెప్పుచుండ నా వేదనాద మాలించి సంతసించుచు అచ్చటికిబోయి యొకచోట గూర్చుండి అందరి విశేషముల జూచుచుండెను.

అప్పాఱులు కొంతసేపు స్వస్తిజెప్పి యర్చకునివలన ప్రసాదము గైకొని ముఖమంటపమున గూర్చుండి యొండొరులిట్లు సంభాషించుకొనిరి.

గోవిందశాస్త్రి - పేరావధానిగారూ! మీరీ మధ్య దేశయాత్రకు బోయితిరిగదా ? ఎప్పుడు వచ్చితిరి? వార్షికములు పూర్ణముగా ముట్టినవియా ? విశేషములేమి?

పేరావ - నేను రాత్రియే వచ్చితిని. విశేషము లేమియున్నవి? ఈ కాలములో వేదము జదువుకొనగూడదు. ఏ తప్పుపద్యములో నాలుగల్లిన వానిని గౌరవింతురు. నాకట్టి పాటవము లేదుకదా? నా కెక్కడను వార్షికములు లేవు. మందారవల్లి యను మహావిద్వాంసురాలు కాశీలో నాకు నూటపదారులు వార్షికము చేసినది. ఆ చేడియం జూడబోయితిని.

గోవింద - ఆ పద్దు ముట్టినదా?

పేరావ - ఏలముట్టును నా యభాగ్యదేవత నాకన్న ముందుబోయినది. ఆ విదుషి రాయలవారి యాస్థానకవులతో బ్రసంగింప విజయనగరమునకుం బోయినదట అందుమూలమున బోయినట్లుగానే వచ్చితిని

గోవింద --- మీరుకూడ నచ్చటికి బోక పోయితిరా?

పేరావ -- బాగుబాగు. అదియే ముష్టి యెత్తుకొన బోయినదట.

గోవింద - ముష్టిలో ముష్టియని యున్నదికాదా.

పేరావ - నేనుబోయిన దానికిగూడ దొరకదు. వెంకటకవి - అదియునైనది.

గోవింద - ఈ వెంకటకవి విజయనగరంబునకుంబోయెనని వింటిని. అచ్చటి విశేషము లీయనకుం దెలియగలవు. కవిగారు అచ్చటి వింతలేమి ?

వెంకట - మందారవల్లి మిగుల జంఝాటముతో విజయనగరి కరిగి మొదట సభజేసి యందు భట్టుమూర్తిలోనగు పండితుల బరాజితులం గావించినది తరువాత తెనాలి రామలింగకవి లవిత్రయను పేరుతో బోయి శిష్యవర్గముతోగూడ నా చేడియను నోరు మెదల్పకుండ జేసెను.

గోవింద --- మొదటి సభలో అతండు లేడా యేమి ?

వెంకట - లేడట! ఉండిన అంతయేలవచ్చును. మొదటి విజయదివసంబున మందారవల్లి బ్రాహ్మణులకు మిక్కుటముగా ద్రవ్యము పంచిపెట్టినది. వానిలో మాకును కొంతలాభము కలిగినది.

గోవింద - తరువాత నేమిజరిగినది.

వెంకట - రాయలవారు దాని వస్తువాహనములన్నియు లాగికొనిరి. పిమ్మట నా కొమ్మ తగవునకై ఢిల్లీ చక్రవర్తి యొద్దకుంబోయినదట.

పేరావ - కటకటా! యెంతమాట వింటిమి? ఆ పుణ్యాత్మురాలి కట్టి యాపద రావలసినదికాదు. ప్రతిదినము బ్రాహ్మణుల కనేక దానములు గావించునది.

గోవింద - రామలింగకవి చర్యలు కడునద్భుతముగా వినుచుంటిమి. అతండు మన దుష్టవర్మకు బురాణము జెప్పగలడేమో.

వెంకట - విపరీతపురాణము చెప్పి బుద్దివచ్చునట్లు చేయును. క్రూరబుద్ధులని తెలిసినచో వారింబరిభవించుటయే. యతనికి వ్రతము.

గోవింద - అతని యొద్దకుబోయి యొకసారి రమ్మని ప్రార్థించినం బాగుండును. దుర్మార్గుడు క్రొత్తయర్థములం జెప్పుమని యూరక వేపుచున్నాడు. రామాయణములో భారతార్థము భారతములో రామాయణార్థము జెప్పవలయునట.

వెంకట - వీనికి గ్రొత్తయర్ధములు బాగుగా జెప్పగలడు. సీ! ద్రవ్యాశచే యనవారు వోయి యతండు పీఠముపై గూర్చుండ గ్రింద గూర్చుండి పురాణము చెప్పుచుందురు. ఇంతకన్న యధమమున్నదా.

గోవిం - ఏమిచేయుదుము. వెళ్ళకపోయితిమేని పూర్వులిచ్చిన మాన్యములు లాగికొనును. నీవు చెప్పినదే శాస్త్రమని స్తోత్రములు చేయుచు నేలాగో కాలక్షేపము చేయుచున్నాము. వాని పాపము వానిదే మనకేమి.

అని యిట్లు కొంతసేపు ముచ్చటించుకొని యా బాడబులు నిష్క్రమించిరి. వారి మాటలువిని రామలింగకవి యింటికివచ్చి యా వృత్తాంతము సుభద్రునకుంజెప్పి యా దుష్టవర్మం గుఱించి ఒక యింటి బాహ్మణుని అడిగిన అతండిట్లనియె.

అయ్యా! దుష్టవర్మకు రెండుమూడు గ్రామములు గలిగియున్నవి. అతని పూర్వులు మిక్కిలి విఖ్యాతులు. బ్రాహ్మణులనేక భూదానములు గావించిరి. గ్రామములోనున్న విప్రులందఱికి నా భూములే యాధారమై యున్నయవి. అదికారణంబున దుష్టవర్మ యిందున్న బ్రాహ్మణులనెల్ల నిత్యము పురాణము చెప్పుటకు రమ్మని యాజ్ఞాపించును. ఆయన యానతిగైకొనక పురాణమునకు బోవడేని యతని భూమి జరుగనీయడు. పురాణము చెప్పునప్పుడందున్న యర్థములుగాక విశేషార్థములు చెప్పుడని మందలించును. చెప్పినవానికి సమాధానము బొందక లేనిపోని శంకలు సేయును. చెప్పుకున్న బుద్ధిహీనులని నిందించును. యేమేని యిమ్మని యాచించిన బూర్వులిచ్చిన మాన్యములే చాలునని అన్నింటికిం జెప్పెను. ఈః యూరి పాఱుల కిదియొక యాపదలాగున్నది. మఱియొక చోటికింబోయి యాచించుకొనుటకు అవకాశములేదని యతని వృత్తాంతమంతయుం జెప్పెను.

ఆ మాటలు విని రామలింగకవి సుభద్రునితో నాలోచించి యా రాత్రి పయనముసేయక మఱునాడు పురాణము చెప్పువేళకు దుష్టవర్మ యింటికిం బోయెను అప్పుడు దుష్టవర్మ యున్నతపీఠంబునం గూర్చుండి చుట్టును చాపలమీద వసియించి బ్రమాణము చెప్పుచున్న బ్రాహ్మణులపై బూర్వపక్షములు చేయుచుండెను.

అతని పూర్వపక్షములు విని రామలింగకవి మిక్కిలి యీసుబూని యా ప్రాంతమున కరిగి నిలువంబడి యెల్లరును విన నెద్దియో చెప్పబోవు సమయమున దుష్టవర్మ రామలింగకవిం జూచి యడుగ వారిరువురకు నిట్లు సంవాదము జరిగెను.

దుష్ట - ఎవరుమీరు? ఏయూరు.

రామ - మేము బ్రాహ్మణులము, అద్భుత పౌరాణికులము. మా కాపురము కాశీపురము.

దుష్ట - అచ్చో! నా యెదుటనే పౌరాణికులమని చెప్పుకొనుట మా యొక్క వృత్తాంత మెఱుంగక యిట్లనుచున్నారు. ఈ బ్రాహ్మణుల నడిగి తెలిసికొనుడు.

రామ - మీ వృత్తాంతము వినియేవచ్చితిమి. ఈ బ్రాహ్మణులుం జెప్పిరి. మిమ్ముంజూచినంతనే వినినదానికి సరిపోయినదని తోచినది. మాపురాణ విశేషములు వినినచో మీరట్లనరు.

దుష్ట - అలాగునా! నాపే రింతకుము న్నెచ్చట వినిరి. కాశీపట్టణమువఱకు వ్యాపించినదా?

రామ - అయ్యో యిచ్చట గూరుచుండిన మీకేమియుం దెలియకున్నది. కాశీలో నెల్లెడలను మీనడతలే హల్లకల్లోలముగా జెప్పుకొనుచున్నారు. అదియుంగాక ధర్మలోకములో మీకొఱకు క్రొత్తగృహములు నిర్మించుచున్నారని వాడుకపుట్టినది.

దుష్ట - మీరేటికై యిచ్చటికి వచ్చిరి.

రామ - మా పురాణవిశేషములు మీకుం జూపుటకై ప్రత్యేకము మిమ్ముఁ జూడవచ్చితిమి.

దుష్ట - మీ పురాణవిశేషము లెట్టివి?

రామ - వినుండు. ప్రత్యక్షబాహాటకై యటశాకల్యవాత్స్యాయన శాకటాయన వాల్మికాది మహర్షికల్పభేదంబును నూటపది విధంబుల బురాణము సెప్పగలము. ప్రతిమతంబునను యెన్నడో జరిగిన విషయము ప్రత్యక్షముగా నిప్పుడు జరుగునట్లు చూపుటయు జూచినవారు చెప్పినట్లప్పుడు వినినవారు వినిపించినట్లు మాపురాణము వలనం దెల్లముకాగలదు. ఇదియునుంగాక రామాయణములో భారతార్థము భారతములో రామాయణార్ధము, భారతరామాయణములలో భాగవతార్థము భాగవతములో భారతరామాయణార్థములు యీ మూటిలో విపరీతార్థములు విస్పష్టముగా జెప్పగలము. పెక్కులేల? ఇవి అన్నియు బ్రాహ్మణార్థము క్రింద మార్పగలము. మా ప్రజ్ఞ నిప్పుడేమిచెప్పిన మీరు నమ్మగలరు. చూచిన తరువాత మీకే విశదమగును.

దుష్ట - దీనికి మీరేమి పారితోషికము గోరెదరు?

రామ - మీరు సంతసించి తగినవారని యొప్పుకొనుటయే పారితోషికము. అంతకన్న మఱియేదియు మాకు నక్కరలేదు.

దుష్ట - అట్లయిన నావింతల మాకెప్పుడు చూపుదురు.

రామ - ఎప్పుడో అననేల యీ రాత్రియే.

దుష్ట - కావలసిన సంభారము లెట్టివి. ఏయే పురాణములు దెప్పించవలయును.

రామ - ఏదియు నక్కరలేదు. పురాణములన్నియు మా ముఖమందేఉన్నవి. సభాభవనము చక్కగా నలంకరింపుము. దూది కొంతతెప్పించియుంచు డింతకన్న మఱేమియు నవసరములేదు.

అని యీరీతి నతనితో సంభాషించి రామలింగకవి తన నివాసమునకువచ్చెను. అందున్న బ్రాహ్మణు లతనిమాటలువిని నివ్వెరపడుచు నంతటితో బురాణము ముగించిరి. కావున రామలింగకవి యొద్దకుఁబోయి తదీయవిశేషంబు లడుగం జొచ్చిరి.

ఆతండు వారినందఱను తాను జెప్పినట్లు వినువారిగా నొడంబడజేసి చేయందగిన కృత్యములన్నియు బోధించి యారాత్రి యా గ్రామములోనున్న బ్రాహ్మణు లెల్ల పరివేష్టింప దేవసహితుండయిన గురుడువోలె నొప్పుచు నా సభాభవనమునకు బోయెను.

దండహస్తులై వచ్చిన పౌరుల గాంచి దుష్టవర్మ యించుక వెఱచుచుండ రామలింగకవి అందున్న పీఠంబుల నందరం గూర్చుండ నియమించి దానును సుభద్రుండును బ్రధానాసనంబులం గూర్చుండిరి. అప్పుడు దుష్టవర్మ యా అద్భుతపురాణమును వినుటకు మిక్కిలి వేడుక పడుచు వేగముగా జదువుడనియు యుద్దపంచకములోని భాగములు వినిపింపుడనియు అతనిని దొందరపెట్టెను. సుభద్రుండు చదువుచుండ రామలింగకవి యర్ధము చెప్పుచుండెను.

సు౼ గీ. తివిరి గురుకృతవర్మాది ధృతివిలసిత
         విగ్రహస్ఫూర్తిఁ గడుమించి విజయ సత్స
         హాయతాలోలుడై వచ్చు నలఘుమన్యు
         దశముఖుని భీము నర్కనందనుండు దాకె.

రామ౼ద్రోణాచార్య కృతవర్మాదియోధులు అర్జునుండును సహాయము చేయుచుండ మిక్కిలి కోపముతో యుద్దమొనర్చు దశముఖుని అనగా రావణాసురుని అతని ప్రక్కనున్న భీమునిన్ని అర్కనందనుండు అనగా కర్ణుడు దాకెన్ జావగొట్టెను అనగా రావణాసురుండు పాండవులను యుద్దమునకు సహాయము బిలువగా శ్రీరాముడు కర్ణునింగోరెనని చెప్పుకొనవలయును. అట్టికర్ణుడే రావణునిగొట్టెను. ఇది రామాయణములో భారతార్దము.

దుష్ట - ఇది యేమి యర్థము? ఇది యేమి పురాణము, రావణాసురు డేనాటివాడు పాండవు లేనాటివారు బాగుయున్నది.

రామ - అయ్యా! తమరు మా పురాణమంతయు విని తరువాత శంకను చేయవలయు నడుమ నేమియు నడుగవలదు. ఊరక వినుచుండుడు.

దుష్ట - అలాగునా? చదువుడు.

సుభ ......

క. ఈగతి దక్షిణదిశయం, దాగోగ్రహ దుష్టచేష్టు నదిపప్రమదై
     కాగారికు నిర్దాముని, గాగర్వమడంచి విడిచె గాడ్పుకొడు గొగిన్.

భారతార్థము. ఈ ప్రకారముగా గర్ణుడు తన తమ్ముడయిన భీముని గొట్టుట చూచి కోపించి గాడ్పుకొడుకు అనగా ఆంజనేయులవా రొక్కగంతులో బోయి దక్షిణగోగ్రహణము చేయుచున్న సుశర్మను రెండు గ్రుద్దులు గ్రుద్ది యిది ఆధ్యాహారము నిర్థామునిగా అనగా వాలావాగ్నిచే అతని యిల్లు తగులబెట్టి ఇల్లులేనివానిగ జేసి గర్వము పోగొట్టిన వాడాయెను.

దుష్ట - ఆంజనేయులు కొట్టుట యెట్లు?

రామ - మీ రిప్పుడేమియు మాట్లాడవలదని చెప్పలేదా అంతయువినిన తరువాత శంకలు చేయవచ్చును. భారతములో రామాయణార్థ మిదియే సుభద్రా! చదువుము.

సుభ -

క. గురుఁ డమలయోగనిష్టం, దిరమై యుండంగజూచి దృష్టద్యుమ్నుం
     డరదము మీదికురికి త, చ్ఛిరోజములు పట్టుకొని యసిం దునుముటయున్.

రామ - అట్టిసమయమున గురుడు అనగా బ్రహస్పతిగారు శుక్రాచార్యుల వారితో గూడావచ్చి రావణాసురునికి నీతిచెప్పగా వినకపోయినప్పుడు తనరథము మీదగూర్చుండి ధ్యానించుచుండగా నాంజనేయులవారు తమకు సహాయము చేసినందులకు బదులుగా దృష్టద్యుమ్నుండు వడిగావచ్చి కత్తిదూసి ఆతని వెండ్రుకలు పట్టుకుని తునిమినవాడాయెను.

దు -- (పకపక నవ్వుచు) వహవ్వా? వహవ్వా? మాబాగా యున్నది. భాగవతార్థము - ఇదియా యింకా ముందున్నది చూడు. చదువు. చదువు.

సుభ - మ. జంఘాలత్వముతో నగోపరిచర త్సారంగహింసేచ్ఛను
          ల్లంఘింపగమకించుసింహము క్రియన్ లంఘించిపౌరప్రజా
          సంఘాతంబులు తల్లడిల్ల హరికంసప్రాణ హింసార్దియై
          లంఘించెం వెసఁగంసుమీదిఁకిరణోల్లాసంబు భాసిల్లగాన్.

రామ - అట్లు రాక్షసగురువునకు మిత్రుండయిన బ్రహస్పతిని దృష్టద్యుమ్నుడు వంచింపగాజూచి యా యవమానము తనదేయనుకొన మిక్కిలి కోపించి కంసుడు యుద్ధమునకురాగా జూచి హరి అనగా యిక్కడ సుగ్రీవుడని చెప్పుకొన వలయును, పర్వతముమీదనుండి లేడిపిల్లమీదికి నుఱికెడు సింహములాగునేయుఱికి గొంతువుపట్టుకొని నులిమినవాడాయెను.

దు - అయ్యా! అంతటితో జాలును కాని దీనికి సమాధానమెద్దియో తరువాత జెప్పెదనంటిరి. సామరస్యమెట్లో చెప్పుడు పప్పుబియ్యము కలిపినట్లే యున్నది.

రామ - సామరస్యము చెప్పవలయునా ? మొదటిది రామాయణములో భారతార్థము. రెండవది భారతములో రామాయణార్థము. మూడవది రెండును నాలుగవది రెండిటిలో భాగవతార్థము తెలియదా సహాయము వారికి వీరు చేయగా వీరికి వారు చేసినారు. తప్పేమి.

దు - మేలుమేలు. భళిభళి బాగుబాగు ఇదియా చివరకు చెప్పినది. సంతసించితిమి కాని ఇక ప్రత్యక్షపురాణమెట్లో చెప్పుడు అదియును విని సభ చాలింతము.

రామ - చిత్తము అని వెనుకటి పద్యములు వెండియుం జదువుచు బ్రాహ్మణులు తన సహాయము చేయుచుండ గర్ణుడు రావణు నిట్లు తాకెనని యత్యాగ్రహముతో లేచి సింహాసనమున గూర్చున్న యీ దుష్టవర్మను క్రిందబడవేసి దృష్టద్యుమ్నుడు బృహస్పతి నిట్లు తలగొరిగెనని యొకకత్తిచే జుట్టుకోసి సుగ్రీవుండు కంసు నిట్లు తన్నెనని నాలుగు తన్ని హనుమంతుండు సుశర్మయిల్లు ఇట్లంటించెనని యంతకు మున్ను సిద్దపరచియుంచిన కరదీపిక వెలిగించి యందున్న దూదిరాశి నటించెను. అప్పుడు సభాభవనమంతయు నంటుకొని ఛటచ్ఛటారావములతో నింగి పొడువున వెడలి అగ్నిహోత్రుడు రెండుగడియలలో నాభవనము లన్నియు భస్మావశేషము గావించెను. అప్పుడందున్న పౌరులెల్ల నాహాకారములు సేయుచు వీధిలోబడిరి. దుష్టవర్మ గుండెలు బాదుకొనుచు నేలబడి పొరలిపొరలి యేడువదొడంగెను. అప్పుడు రామలింగకవి యీక్రింది శ్లోకములం జదివెను.

శ్లో॥ తతస్తులంకా సహనా ప్రదగ్ధా నరాక్షసా సాశ్వరధాసనాగా
      హాతాత హాపుత్రక కాంతమిత్ర హాజీవితం భోగయుతం సుపుణ్యం
      ---------- సహంధాబ్రు సద్భశ్శబ్దః కృతో భీమతతస్సుభీమః॥

పూర్వకాలంబున నాంజనేయ భగవానులువారు లంకాపట్టణము తగులబెట్టినపుడు గృహమునుండి వెలువడి వీధులబడి రాక్షసులు అమ్మో బాబో కొడుకో అని యీలాగుననే భయంకరముగా విలపించిరిసుమా? ఇదియే ప్రత్యక్షపురాణము.

అని యిట్లు తన్ను బరిహసింపుచున్న రామలింగకవింజూచి అతికోపముతో దుష్టవర్మ లేచి కొట్టబోయెను కాని అతనిచుట్టునున్న జన్నిగట్టులు బిట్టదల్చుటచే దరికి రాశక్యమైనదికాదు.

ఆయుపద్రవము వారించుటకు గ్రామస్తులందఱు నచ్చటజేరిరి. వారితో దుష్టవర్మ రామలింగకవిచేసిన అపరాధము నిరూపించి చెప్పి యతనిం బట్టుకొన దనకు సహాయము రమ్మని కోరుకొనియెను. కాని వారిలో బ్రాహ్మణబృంద మెక్కుడుగా నుండుటచే తమకట్టిపని చేయుటకుం గష్టమనియెంచి పౌరులు సామముగా రామలింగకవిని బిలిచి అట్టిపని యేమిటికి జేసితివని అడిగిరి.

అప్పుడతండు అయ్యా! నేనీపని అతని అనుమతిమీదనే చేసితినికాని మఱియొకటికాదు. యుద్ధపంచకము చదువుమనియు నెన్నడో జరిగిన విషయ మిప్పుడు జరుగుచున్నట్లు చెప్పుమనియు నొకపురాణము చదువుచు వేరొక పురాణార్థము చెప్పుమనియు నిన్నియు నతనిముఖమునుండి చెప్పినమాటలు. కావలసిన నీబ్రాహ్మణుల నడుగవచ్చుననియు దనవలన నించుకంతయు నేరములేదనియుం జెప్పెను.

ఆమాటలువిని దుష్టవర్మ పళ్ళు పటపటకొరుకుచు దురాత్మ! అద్భుతపురాణము జెప్పెదననిన నెద్దియో యనుకొంటిని. భారతభాగవతరామాయణార్ధములు మార్చుమనిన నిదియా? ఇట్టిపురాణము లడవివాండ్రయొద్ద జెప్పుము. ఆంజనేయులు దక్షిణగోగ్రహణము చేయుచున్న సుశర్మను కర్ణుడు రావణుని దృష్టద్యుమ్నుడు బృహస్పతిని సుగ్రీవుండు కంసుని కొట్టెనట. ఎంత అసందర్భముగానుండునో చూడుడు. అది యట్లుండె. నాజుట్టుకోసి తన్నుచు భవనములు గాల్చెను, దీనికతండు చెప్పినమాటలు మీకు నుచితముగా నున్నవని తోచేనేయని యడిగిన బౌరులు నవ్వుచు రామలింగకవి మొగముచూచిరి.

అప్పుడతండు కన్నులెఱ్ఱచేయుచు నుచితము కానివారల కుచితములుగా దోచవు. నేనుజెప్పిన యర్ధము లెవ్వరుకాదన్నను జుట్టుకోసిపంపెదను. బ్రాహ్మణు లెల్లరు క్రిందగూర్చుండి పురాణము జెప్పుచుండ బెద్దయెద్దులాగున గద్దియం గూర్చుండి శంకలువేయుట యనుకొంటివి కాబోలు. మాపురాణము లట్టివికావు. దుష్టవర్మచ్చేదకములని యెరుంగుము. నాయపరాధము నిరూపించుట కిచ్చటివారి కధికారము లేదు. కావలసిన ఢిల్లీచక్రవర్తియొద్దకు రమ్ము. ఆయన చెప్పినట్లు చేయువాడనని తనకుగల యధికారపత్రికల జూపెను.

పౌరులు దానింజూచి యేమియుం బలుకలేక ఆతని ననన్యసామన్యునిగా దలంచి గడువేర్పరచి యప్పటికి ఢిల్లీకి వచ్చునట్లుగా ఆతనిచే వ్రాయించి దుష్టవర్మ కిప్పించిరి. బ్రాహ్మణులెల్లరు తమవంత నేటితో నంతము నొందినదని సంత సించుచు రామలింగకవిం బెక్కుతెరంగుల వినుతించి యాగడువునకు మేమందరము డిల్లీకి వత్తుమని చెప్పుచు నప్పురంబున రెండుదినము లుండుమని నిర్భంధించి దేవతలు వాసవునిబోలె నారాధించిరి అతండు తన కులగోత్రనామములు గుట్టుపరచి యట్లు దుష్టవర్మను వంచించి యత్పురంబున మఱియొక దివసము మాత్రము నివసించి యమ్మఱునాడు మధ్యాహ్నమునుండి పయనముసాగించి అందున్న ధరణీబృందారకులందఱు పెద్దదూర మతని సాగనంపి అతనిచేత ననిపించుకొని వెనుకకుం బోయిరి.

మంగమణి కథ

రామలింగకవియు సుభద్రునితోగూడ బండియెక్కి యిష్టాలాపములాడికొనుచు బోవుచుండ గొంతదూర మరుగునప్పటికి సాయంకాలమైనది గ్రామ మేదియు గనంబడినదికాదు. చీకటికి వెరచుచు బండివా డెద్దులను వడిగాదోలుచుండెను. అట్టిసమయమున దారిలో నొకచోట నొకబండి అడ్డముగా నుండుట జూచి బండివాడు తనబండి నిలిపి యీబండి నిట్లు దారి కడ్డముబెట్టినవా రెవ్వరని యరచెను. ఆమాటవిని యాబండిలోనుండి యొకతొయ్యలి అయ్యా! మేము మార్గస్తులము. ఢిల్లీకి బోవుచున్నవారము మాబండియెద్దొకటి యందెద్దియో చూచి బెదరి త్రాడుత్రెంపుకొని పారిపోయినది దానిని వెదకుటకై బండివాడు పోయెను. పెద్దతడవైనది యింకను రాలేదు. చీకటిపడినది మేమాడువాండ్ర మిందుంటిమి. మా మగవారు ముందు బోయిరి. మాబండివాడు వచ్చువరకు నిలుతురేని మీకు మంచిపుణ్యము రాగలదు. రెండుబండ్లును గలిసిపోవచ్చును. ఆ బండిలోనున్న పుణ్యాత్ములెవ్వరో తెలియదు. ఈపాటి యుపకారముసేయ నొడంబడుడని వినయముగా వేడుకోగా నాపాటలగంధి మాటలువిని రామలింగకవి సుభద్రునికి సంజ్ఞచేసి తటాలున బండిదిగి మగువలారా? వెరవకుడు? మేము బ్రాహ్మణులము. విద్వాంసులము. ఉదరపోషణార్దమై దేశాటనము చేయుచున్నవారము. ఉపకారమెవ్వరికి నవసరముండకపోవదు. మీబండివాడు వచ్చుదనుక నిలిచియుందుము. రాకున్న వెదకి దీసికొనివత్తుము. దొరకకున్న మా బండి యెక్కించుకొని గ్రామమును జేర్పుదుము మిమ్ము బ్రాణప్రదముగా జూచుకొని మీమగవారి కప్పగింతుమని అత్యంతప్రియముగా బలికి అప్పుడే తనబండి దింపించెను.

ఆతని వాగ్దోరణి కత్తరుణి వెరగందుచు సంతోషముతో అయ్యా! మీరు బ్రాహ్మణులని వినినంతనే మాచింత పోయినది. విద్వాంసులైన మీ సహవాసము మంగళములం గూర్పకపోవునా? మీకిదే నమస్కారమని కాలక్షేపమునకై ఆతని వినుతింపుచు గొంతసేపు గడపినది. కాని యెంతకు నాబండివాని జాడ కనిపించినది కాదు. అప్పుడు వారు తమనిమిత్తమై నిలిచిరని మోమాటము చెందుచు నయ్యిందు వదన గృతజ్ఞతాసూచకములగు మాటలచే నతనిని బొగడుచుండ రామలింగకవి యా బండిదాపునకుం బోయి క్రమంబున బరిచయము రెట్టింప జనువుచేసి బోటీ, మీ రేమిటివారు? ఢిల్లీ కేటికి బోవుచున్నవారు? మీ పేరెయ్యది? రెండవయువతి నీ కేమి కావలయునని అడిగిన నప్పడతి యిట్లనియె.

అయ్యా! మేము వైష్ణవులము. మామగవారు ఢిల్లీ చక్రవర్తిం జూడబోయిరి. వారి యొద్దకు మేము పోవుచున్నారము. నా పేరు మంగమణి. ఈ చిన్నది నాకు బినతల్లి కూతురు. దీనిపేరు ప్రియంవద. నేటిరాత్రి మీ సహాయము దొరకకున్న నీ అడవిలో మడియవలసివచ్చును పాపము. మీరు మానిమిత్త మీరాత్రి భోజనము విడిచితిరి. మీ యుపకార మెన్నటికిని మఱువము. మీ అభిధేయమెద్ది? ఏయే విద్యలం జదివితిరి? జన్మభూమి యెచ్చటనని యెంతయో నైపుణ్యముగా నడిగినది.

రామలింగకవి తనపేరు రామకవిఅనియు దన శిష్యునిపేరు సుభద్రుడనియుఁ దన జన్మభూమి యుత్తర కురుదేశమనియు దనకన్నివిద్యలలో బాండిత్యమున్నదనియుం జెప్పెను. ఈరీతి వారు మాటలాడుకొను చుండగనే తెల్లవారినది. ఇంతలో బండివాడెద్దును దోలుకొనివచ్చెను. మంగమణియు బ్రియంవదయు బండిలో ముసుగులు వైచికొని కూర్చుండుటచే సామాన్యయువతులవలె గనంబడుచుండిరి. అంత బ్రాతఃకృత్యములు దీర్చుకొని వారు బండ్లలో కూర్చుండిరి. బండివాండ్రు అతివేగముగా దోలి మధ్యాహ్నమున కొక అగ్రహారము జేరిరి.

అందొకచో బసచేసి ప్రత్యేకముగా వండుకొన ప్రయత్నము జేయుచున్న మంగమణిని బ్రియంవదను వారించుచు రామలింగకవి మంచిమాటలు జెప్పి తమపాకములో గుడుచునట్లొడంబడ జేసెను. అదిమొదలు వారందరు నొక్కపాకములోనే భుజించుచుండిరి. మఱియు దారినడుచునప్పుడా పడతులబండి ముందిడి తమబండి వెనుక నడిపించుచు నిమ్నోన్నత ప్రదేశములు వచ్చునప్పుడు బండ్లు నిలిపి వారిం దింపి వెండియు వారెక్కిన తరువాత దమ రెక్కుచుందురు.

ఈరీతి వారితో నాలుగుదినములు దారినడుచువరకు నాతరుణులిరువురకు రామలింగకవియం దత్యంతప్రేమానుబంధము గలిగినది. అతనిం బరమోత్తముడని తలంచిరి. పరోపకారపారీణుడింతకన్న వేఱొకడు లేడని పొగడుచుండిరి. ఆతని ఋణ మేమిచ్చినను దీర్చుకొనలేమని నుడువదొడంగిరి.

అట్లు దినదినప్రవర్దమానంబగు స్నేహానురాగప్రయాణాభిలాషలతో నా యోషారత్నంబులు తన్ననుసరింప రామలింగకవి కొన్ని పయనంబులు నడిచి యొకనాటి సాయంకాలమునకు విద్యానగరమను పట్టణమునకుం బోయెను.

అప్పురము ధర్మకేతుండను రాజు పాలించుచుండెను. బహుజనాకీర్ణమైన యవ్వీట నొకసత్రంబున బసజేసి అమ్మఱునాడరుణోదయంబున స్నాన సంధ్యా వందనాద్యనుష్టానము దీర్చుకొని పట్టణమెల్లడలం దిరిగివచ్చి భుజించిన వెనుక యజ్జవరాండ్రయొద్దకు వచ్చి మంగమణితో మెల్లగా రామలింగకవి యిట్లనియె.

రమణీ! సఖ్యము సాప్తవదీనమని చెప్పుదురుగదా! పది దినములనుండి నీ సహవాసపరిచయము మాకు గలుగుచున్నది. కావున మ మ్ముత్తమమిత్రులుగా భావింపవలయును నీ యాకారగౌరవంబులు చూడ నాశ్రితమందారవల్లివని తోచకమానదు. నీ ప్రాపు లభించినప్పుడ మా యిడుములన్నియుం బోయినవనుకొంటిమి ధనము సంపాదించుట మిక్కిలి కష్టముగదా. నేను చిన్ననాటనుండియు దేశాటనము సేయుచున్నవాడను. కాని యెందైనను జాలినంత ద్రవ్యము దొరకలేదు. నే డొకయాధారము కనబడినది. దానికి మీ సహాయము కావలసియున్నది. మీరించుకసేపు శ్రమ వహించిన మేము భార్యాపుత్రులతో జిరకాలము సుఖింతుము. ఉత్తములకు జేయరాని పనులుండవు సాహసించి చెప్పుటకు వాక్కు రాకున్నది. ధనచాపల్యంబు చెప్పుమని యూరక ప్రేరేపించుచున్నయది. యేమిచేయుదును. నీ సౌహార్ద్రంబె యింతకును మూలంబని యూరకున్న రామలింగకవికి మంగమణి యిట్లనియె.

ఆర్యా! యీ మార్గములో మీరు మాకు జేయు సహాయంబే తాదృశంబే. ఏ బంధువు డిట్లు మన్నించును? ఏ మిత్రుం డిట్లు పచరించును? ఇట్టి మీ విషయమై కృతజ్ఞత జూపుటకాని యుపకారము సేయుటకాదు. దీనికి నన్నింత పొగడవలదు. నా వలన గావలసిన పని యెద్దియో వక్కాణింపుడు. వేగముగా జేసి మీ ఋణము దీర్చుకొందునని పలికిన నక్కలికి కతండిట్లనియె.

కలకంఠీ! యిట్లనుట నీకే తగును. మదీయవాంఛితం బాలింపుము. ఈపట్టణపు రాజు ధర్మకేతుడు, సార్ధకాహ్వయుం డతని పత్ని సుశీల. సుశీలయే ఆ సాధ్వీతిలకంబు వేల్పుటావుంగా జెప్పుదురు. ఆమె ప్రతి శుక్రవారము దంపతీపూజ గావించి యా దంపతుల కనల్పముగా గాంచనమణిభూషాంబరముల నొసఁగునట. అవ్వార్త నాలించి మేము ప్రొద్దుట రాజదర్శనమునకుంబోయి మా విద్యాపాటవముల జూపించితిమి. అతండు మెచ్చుకొని మీరు కుటుంబసహితముగా వచ్చితిరా అని అడిగెను. వచ్చితిమని యుత్తరమిచ్చితిమి. తృష్ణాప్రభావం బెట్టిదొ చూచితివా? మా మాటలు విని యా రాజు మీ రిరువురు భార్యాసహితముగ రేపుప్రొద్దుట దయచేయుడనిన గౌరవముగా ననిపిన వచ్చితిమి. అందుమూలమున మా యిరువురను రమ్మనిరి. ఇప్పు డేమి చేయవలయునో తోచకున్నది. దీని కెద్దియేని సాధనము చెప్పుదువని నిన్ను వేడుకొనుచున్నవాడనని అత్యంతనిపుణముగా బలికి యూరకుండెను.

అప్పుడా సుందరి మందహాసము చేయుచు బ్రియంవద మొగముజూచి బోటీ యీయన మాటలు వింటివా, దీనికి సాధన మెద్దియేని చెప్పవలయునట. ఏమని చెప్పుటకును నుపచారపరిగ్రహము మొగమాట పెట్టుచున్నది. మన మొకసారి వారిపజ్జల గూర్చుండవలయునని సూచించుచున్నవాడు. కానిమ్ము నింద్యకృత్యములచేత నై నను బరోపకృతి జేయవలయునని ఉన్నది. అందు బ్రాహ్మణులు, విద్వాంసులును, మనకు పరమమిత్రులు. అట్టివారి విషయమై యేమిజేసినను నింద్యముకాదు, మన మగవారు వినినను నెగ్గుపట్టరు. అన్నింటికిని మనస్సు ప్రధానము. మనము వారియొద్ద నిచ్చట గూర్చుండలేదా? అట్లే అచ్చటను గూర్చుందము. నీ వెవ్వరిదాపున గూర్చుందువు అయ్యో! నవ్వెదవేల? మన బ్రాహ్మణులే కారటే నీమగడు శంకించిన నేను సమాధానము చెప్పెదనులే? అని పలుకుచు నార్యా! మీ కార్యము మీరు చూచుకొనుడు. మమ్ము మీప్రక్కలం గూర్చుండి దానమందవలయుననియే కదా మీ యభిప్రాయము. మీ లాభము బోగొట్టనేల. అలాగుననే కూర్చుండెదము. వేగముగా బంపవలయు నెవ్వరేని యెఱింగినవా రుండిన మోసము వచ్చుజుడీ యని పలికిన సంతసించుచు నా రామలింగకవి యిట్లనియె.

చానా! నేనామాట మొదటనే చెప్పితిని. మనము పోవుటయే తడవు పీటలు వైచి కూర్చుండబెట్టి ధారవోయుదురట. ఈ మాట చెప్పుటకు వెరచుచున్నవాడ. నిట్టిసాహసము చేయుటకు నీకే తగును. నీయౌదార్యము గొనియాడుటకు వేయినోళ్ళు కావలయునని స్తోత్రములు సేయుచుండ వారించుచు మంగమణి వేఱొక ప్రస్తావము దెచ్చినది. పిమ్మట నాకొమ్మలిరువురు నావిషయమే చెప్పుకొనుచు నవ్వులాటలమాటలతో నాదివసమును గడిపిరి.

మఱునాడు సూర్యుండు పూర్వగిరిశిఖర మలంకరించినతోడనే రాజపత్ని వారిం దోటితేర అశ్వశకటముల నంపినది అమ్ముద్దియులిద్దరు బ్రాహ్మణాంగనల పోలిక మెరయ భూషాంబరములు దాల్చి మేలిముసుగుతో జెరియొకరి పజ్జనుం గూర్చుండిరి అంతకుమున్ను చనువుగా మాట్లాడు నాచేడియలకు బత్నీభావంబు వహించుటచే నపూర్వలజ్జావిభ్రమంబులు మనంబున నంకురించినవి.

ఆశకటంబులు తృటిలో వారి నంతఃపురము జేర్చుటయు బండ్లుదిగి యందు బరిచారికులచే జూపబడిన గదులలో వారు నివసించిరి. ఇంతలో వాడుకప్రకారము ముత్తెదవలువచ్చి యభ్యంగనము చేయుడని వారి బలవంతముపెట్టిన సమ్మతించిరి కారు. ఆ మాట విని సుశీల స్వయముగావచ్చి వారింజూచి తదీయ రూపలావణ్యాదివిశేషముల కచ్చెరువందుచు నట్లె నిలువంబడి చూచుచుండెను.

స్వభావసుందరులకు వికృతియు శోభం దెచ్చునుగదా మసిపాతగట్టినను మాణిక్యము మెఱయకుండునా? మేలిముసుగు వైచుకొని యున్నను వారు చూచువారికి వింతలు గలుగజేయుచుండిరి.

అప్పుడా సుశీల మంగమణి వలదువలదనుచుండ బలాత్కారముగా దానే తలయంటి పన్నీట జలకమార్చినది. తదంగలావణ్య మరసి యరసి సుశీల విస్మయము బొందుచు నాహా! ఇట్టి మోహనాంగిని సార్వభౌమునికి భార్యజేయక యొక నిరుపేదకు గట్టిపెట్టిన మరమేష్టి నెంతదిట్టినను దోషములేదుగదా. ఔరా! ఈ యొయ్యారము, ఈ లావణ్యము, ఈసోయగము, ఈ జవ్వనము, ఈబింకము, దేవతాకాంతల కుండునంద్రు. మనుష్యాంగనలలో నట్టి సుందరిం జూచియెఱుంగనని యనేకప్రకారముల పొగడుచు మెచ్చుకొనుచు దలయూచుచు అపూర్వసంతోషముతో మనోహరనూత్నాంబరాలంకారముల చేగొన చేసినది.

పిమ్మట బ్రియంవదకును నభ్యంగనవిధి నిర్వర్తింపజేసి తరుణీ యీనాతి నీ కేమి కావలయు? వాల్లభ్యం బనుకూలముగా నున్నదియా సంతతి యేమాత్రమని ఆడిగిన బ్రియంవద పక్కున నవ్వినది.

అప్పుడు మంగమణి సుశీలతో దేవీ! ఈవెలది సంతతి గురించి అడిగినందులకు నవ్వినది. బాల్యచేష్ట లింకను విడువలేదు. మఱియొకలాగున తలంపకుమా? మాకు సంతతిలేదు. వాల్లభ్యంబునకు యువతుల నడతలేకదా కారణములు. అట్టి కొరంతయేమియును లేదు. నాకిది పినతల్లికూతురు మా భర్తలకు యట్టిబాంధవ్యమే కలిగియున్నదని యామెకు సమాధానము చెప్పినది.

ఇంతలో బూజాగృహంబున గంట వాయించుటయు సుశీల యదరిపడి స్నానగృహంబునకుబోయి జలకమాడి దేవీపూజగావించి అర్చాభవనమునకు వచ్చినది.

అంతకుమున్ను పరిచారకులు మంగమణిని బ్రియంవదను బూజామంటపములో బైడిపీటలపయిన గూర్చుండియున్న రామలింగకవి ప్రక్కను సుభద్రుని ప్రక్కను యథానుమతముగా గూర్చుండబెట్టిరి. అప్పుడు రాజపత్ని భర్తతో వచ్చి యా దంపతులకు బ్రత్యేకము షోడశోపచారపూజలం గావించి పార్వతీపరమేశ్వరులనియు లక్ష్మీనారాయణులనియు భావించి అనేక దానములం గావించి బ్రాహ్వణాశీర్వాదములనంది యానందముతో బిమ్మట అందఱును మధురాహారములచే సంతృప్తుల గావించినది.

భోజనానంతరమున నేకాంతనిశాంతముననున్న సమయంబున బ్రియంవద మంగమణితో సఖీ! ఇందాక రామకవి మనతో బీటలపై గూర్చుండుటేతడవు పిమ్మట బోవచ్చునని చెప్పెనే యీ గొడవలన్నియు నేమిటియవి. అయ్యో! ఆశీర్వాదములు బ్రహ్మముడులు సేసలు జల్లుట దలంచుకొన వింతయగుచున్నది. ఈబ్రహ్మముడులు బ్రహ్మముడులు కావుగదా! చక్రవర్తులకైన లక్ష్యముచేయని నీ వీతనిపజ్జ గూర్చుంటివి. ఏమి కాలమహిమయని పలికిన విని మంగమణి నిట్టూర్పు నిగుడింపుచు నిట్లనియె.

చెలీ! నీవు దానికే వింతపడుచుంటివి ముందరికథ యెఱుంగవు భోజనముచేసి వచ్చునప్పుడు నాతో సుశీల యాడుబిడ్డ చెప్పినది. ఈ రాత్రి మనకు శోభనము చేయించునట. అంతఃపురములు చక్కగా నలంకరించుమని పరిచారికలతో జెప్పుచున్నది. ఆమె వ్రతమట్టిది కాబోలు. నీలాటి కల్పితము లామె కేమి తెలియును. మనల జూసినది మొదలు మఱియు మురియుచున్నది. మన మిప్పు డేమి చేయవలయును మొగమాటమునకు బోవ నెద్దియోయైనదట. సహవాసబరిచయంబునకు గలిగిన ఫలమిది. నీవనిన ట్లీముడులు బ్రహ్మముడులే కాబోలు? నిరుపేద పాఱుల కుపకృతి యగునని తలంచినందులకు సుకృతము ఫలించినది యెల్లరుచూడ వారిపజ్జల గూర్చుండి యాశీర్వాదములంది యిప్పుడు మేమట్టివారము కామనిన నెవ్వరు సమ్మతింతురు నిజము చెప్పితిమేని దండ్యుల మగుదుము. పాపపువిధి యెట్లు విధించెనో యట్లు జరుగకమానదు. చింతించుట నిష్ప్రయోజనమని పలికిన విని ప్రియంవద అదిరిపడి భళాభళ మిక్కిలి చక్కగానున్న దే? రామకవి యెఱింగియే మనలను మోసముచేసెను. చాలు నీబాపనసాంగత్యము యేమయినను సరియే మనము పోవుదము రమ్ము శిక్షించిన ముందువారినే శిక్షింతురని బలుకుచున్న సమయంబున రామలింగకవి యెద్దియో పనికల్పించుకొని యచ్చటికి వచ్చెను.

ఆతని జూచి ప్రియంవద కన్నులెర్రజేయుచు రామకవీ! మమ్ము జక్కగా వంచించితివే. మొదట నీ పేరిట దానిచేతనే వంచింపబడితిమి. నీవంతకన్న మోసగాడవైతివి నిజముచెప్పి నిన్ను దండింపజేయుదుము జూడుమనియు నతండు వెరచుచున్న ట్లభినయించుచు కాంతలారా! మొదట నీగొడవేమియు నేనెరుంగను దానము లందుకొనుటగదాయని మిమ్ము బ్రార్థించితిని. ఇట్టిదవి తెలిసినచో గోరకయేపోదును మిమ్ముజూడ నాకును సిగ్గగుచున్నది. ఏ త్రోవయు గానరాదు. ఏమి చేయుదును? ఇప్పుడువచ్చిన ద్రవ్యమంతయు వదులుకొనియెదను యేదియేని యుపాయముండిన జెప్పుడు మర్యాద నిలిచెనేని ధనము మఱియొకరీతిని సంపాదించుకొనవచ్చును. మీవంటి సతీమణుల క్లేశపరచుట యుచితమా? అని వినయముతో బలుకుచున్న ఆతనికి మంగమణి యిట్లనియె.

ఆర్యా! రాజపత్ని యుత్సాహము వారింప బ్రహ్మతరముగాదు. యిప్పుడు వేరొకయుపాయ మేమియును లేదు. రోటిలో తలపెట్టి రోకటిపోటునకు వెరచిన బ్రయోజనమేమియున్నది. మొదటనే యాలోచించుకొనవలసినది యిప్పుడొండు వినుడు బంధమోక్షమునకు గారణము మనస్సుకదా, అట్టిమనస్సు దృఢపరచుకొని యున్నయెడల నేప్రమాదము గలుగనేరదు. విద్వాంసులైన మీకు నేనింతకన్న జెప్పనవసరములేదు. "బలవానింద్రియగ్రామోవిద్యాంసమపికర్షతి" అనియున్న యార్యోక్తిమరువవద్దని పలికినవిని యతండు నమ్రతతో నింతీ! నీవు నాకింతఁ జెప్పవలయునా? సందియమందకుము మీడెంద మెట్లుండె నట్లె వర్తింతుమని పలుకుచున్న సమయంబున నచ్చటికి సుశీల వచ్చుచున్నదని యొక దాదివచ్చి చెప్పినది.

ఆమాటవిని రామలింగకవి తన నెలవునకుం బోయెను సుశీల వచ్చినవారితో గొంతసేపు ముచ్చటించుచు ననర్ఘరత్నమండనములచే నలంకరింపజేసి శయ్యాగృహంబులకు దీసికొనిపోయినది.

ఇంతలో సాయంకాలమగుటయు నామె గ్రామంబునంగల పేరంటాండ్రనెల్ల రప్పించి యాదంపతుల మనోహర సౌధాంతరములలోనున్న హంసతూలికతల్పంబుల యథాయోగ్యముగా గూర్చుండంబెట్టి గంధమాల్యానులేపన తాంబూలచర్వణాది వినోదవిధానంబులం దీర్చి పేరంటాండ్రకు తాంబూలము లిప్పించి మంగళహారతులు పాడించినది.

అట్లు పెద్దతడపు సుశీల పేరంటాండ్రతోగూడ వేడుకలు దీర వినోదములు నిర్వర్తించి యాదంపతులం గాంచుటచే దనకన్నులు సాద్గుణ్యము నొందినవని యానందించినది. రాజపత్ని ముత్తైదువలతో గూడ దలుపులు బిగియించి యరిగిన వెనుక రామలింగకవి యాకాంతను గన్ను లెత్తిచూచి మోహపరవశుడై యోహో జగన్మోహిని ఇంతకుమున్ను ముసుంగిడుకొని యుండుటచే లెస్సగాజూచి యుండలేదు మున్నువిన్నదానికన్న మిన్నగా నున్నయది శ్రీశుకుండైన నీ చిగురుబోడిని జూచెనేని మోహింపకుండునా? అయ్యారే! చతురాస్యుని సృష్టివై చిత్రమునకు మేరలేదుగదా! సాధుసాధు. ఇట్టి ముద్దుగుమ్మను నాయొద్ద గూర్చుండజేసిన విధి యుపకృతికి బ్రకృతి జేయలేను సార్వబౌముని కయిన నీయదృష్టము పట్టుట దుర్ఘటము. ఒక్కసారి యిక్కురంగాక్షిచే జూడబడిన జాలదే. త్రిభువనరాజ్యం బేమిటికని యనేకప్రకారంబుల దదంగసౌభాగ్యంబుల గొనియాడుచు బరవశమైన చిత్తమును స్వాయత్తము చేసికొని 'యక్కామినితో బెక్కులు నీతివాక్యములు సెప్పితి. నేను వేగిరించితినేని దేలికసేయకమానదు. ఈచిలుకలకొలికి చూపులఁ జాపల్యము పొడగట్టుచున్నది. ఇంచుక సైరించిన బంచశరుండు మంచి యుపకారం సేయకమానడని తలంచి, యమ్మానధనుండు దిగ్గున శయ్యడిగ్గనురికి తన మేన బూయబడిన గంధము దుడుచుకొని మాలికలదీసి ప్రాంతమందున్న పీఠంబున గూరుచుండెను.

మంగమణియు నతనితోడ పర్యంతము డిగ్గి యలంకారములేమియు దీయక యందొకచో నమర్చియున్న విపంచి పుచ్చుకొని శ్రుతి మేళగించి యపూర్వరాగోదయంబు దీపింప సంగీతము పాడినది. తదాగ్రశక్తి యెట్టిదో గాంధర్వాస్త్రంబువోలె నన్నాదం బాలించిన వారినెల్లం మోహవివశుల గావించినది.

అక్కాంత కొంతసేపు అట్లు వీణవాయించి ప్రొద్దుపోయిన వెనుక వీణం గట్టిపెట్టి యందున్న రత్నకంబళమున బరుండి చిత్తంబున బెక్కుతలంపు లుప్పతిల్ల జింతించుచు నిద్రబోయినది.

అంతలో దెల్లవారుటయు నత్తరుణీమణి యరుణోదయంబు కాకమున్న లేచి గదిలోనికి బోయి అంతకుమున్న వచ్చియున్న ప్రియంవదం జూచి నవ్వుచు నిట్లనియె. సఖీ! ప్రియంవదా! నీవు రాత్రి యెట్లుగడిపితివి. మనమేడ? ఈ బాడబులేడ? ఈ పత్నీభావమేడ? ఇట్టి దాంపత్య మేపురాణములోనయిన వర్ణింపబడి యున్నదా? మన మనంబులుమాత్రము పాషాణములా! ఉద్దీపనవిభావంబులబలంతియే! రామకవి పేదపాఱుం డనుకొంటిమి కాని కాడు. కాడు. ఆయన యాకారము మహనీయత సూచించెడిది. కలికీ నీచక్కని నిక్కము దాపనేల? తల్పగతుండయిన యతని జూడంజూడ నాకేవేడుక పొడమినది. వజ్రమువంటి నాహృదయము నేటికిం దేలికయినది. ఎట్టివానినీ గణియింపని నాచిత్త మితనియందు లగ్నమగుటకు గారణమేమో తెలియదు. ఈతనితో దేశాటనముచేయుచు దిఱిపెమెత్తుకొన విధి నాకు విధించెను గాబోలు వలపు విధి నిషేధంబులం దెలియనీయదుగదా? చెదిరినమతి నతి ప్రయత్నంబున బిగియబట్టితి. నీవేమి చేసితివి? నిక్కము చెప్పుమని యడిగిన నప్పడంతి సిగ్గభినయించుచు నల్లన నిట్లనియె.

చెలియా! మనల నిమిత్తము వీరిరువురం బరమేష్టి సృష్టించినట్లు తలంచెదను. కానిచో వీరితో మనము బీటలపై గూర్చుండుటకు సమ్మతింతుమా? విధి విచిత్ర సంఘటనముల గావింపుచుండును. నేను నీకన్న ప్రౌఢురాలనా యేమి ? నాకు రాత్రి సుభద్రుని యాకారవిలాసము లపూర్వములట్ల తోచినవి. వానినెఱచేసి పూవింటిజూడు విరితూపుల నామది విదళంచెను. చిత్తము మెత్తనైనంత దత్తంముతో దేలికవడికొన కతనికి నా హృదయాభిలాష వెల్లడించితిని ఆతడెంత ధైర్యధనుండో చూడుము. గాంభీర్య మెట్టిదొ బరికింపుము నాచేననిపించుకొనువరకు నాస గొలిపి పిమ్మట నాగురు నానతిలేనిదే యేకార్యము సేయనని నన్ను సిగ్గుపుచ్చెను. ఇందులకు నీవేమనెదవో యని వెరచుచున్నదాననని చెప్పుచున్న సమయంబున రాజపత్ని యచ్చటికి వచ్చి తలుపుగొట్టినది.

ఆమె తలుపుతీసినతోడనే వారి దోడ్కొనిపోయి యిష్టాహారములచే సంతుష్టిం నొందజేసినది మూడురాత్రులు గడిచిన పిమ్మట నాల్గవనాటి యుదయంబున మంగమణి ప్రియంవదతో నిట్లనియె సఖీ! రెండవరాత్రి వృత్తాంతము వినియుంటివిగదా! అంతవరకు గుట్టు నిలుపుకొంటిని. నిన్నటిరాత్రి యెంత యాపుకొనెదమన్నను సారథిని లక్ష్యముచేయని గుఱ్ఱములు బండినిలాగినట్లు నా యింద్రియము లాగినవికావు. సీ! యనంగునివంటి చపలు డెందుననులేడు. నానియమమంతయు నీటగలిపెను. అన్నన్నా! యెంత మోసమువచ్చినది. రామకవివంటి చతురుడీ పుడమిలో లేడు. మంచి నేర్పరి. ఎక్కుడు రసికుడు. మేటిగంభీరుడు బాపురే! రతిరహస్యవేత్త యయిన నాతనినే చెప్పవలయు పరేంగితజ్ఞుఁడతనికన్న బుడమిలోలేడు. నా ప్రౌఢిమి యంతయు నతనిచెంత గవ్వచేసినదికాదు. నాకెప్పటికిని దన మనస్సియ్యమి డెంద మాపజాలక యతండు మెడనుండితీసి శయ్యయందుంచిన మాలికలం గయికొని మరి యే అవకాశమును గానక ఆర్యా! వీని మీకంఠమున నుంచక తీయుచుందురేల? వీని దాల్చిన దర్శనీయముగా నుందురని మెడయందు వైచితిని. ఆతండెంత చతురుండో చూడుము ననినప్పుడే తనమెడనుండి తీసి బాలా! యివి మాకేల? యువతులు వీనిం దాల్చ నర్హులని పలుకుచు నవి నామెడ యందుంచెను. నేను వలదు వలదని పెనుగులాడు సమయములో నామేన నెందుముట్టెనో నాకు గళాభిదురమై మేను వివశత్వము నొందినది. ఆహా! తత్సుఖపారవశ్య మనుభవైకవేద్యముగదా? ఎంత రతిప్రౌఢుండయినను నంతలో గళాస్థాన మరయుట దుర్ఘటము ఏమియు నెఱుంగనట్లేయుండెను. అప్పుడు నేను సిగ్గుపడి డగ్గున లోనికి బోయితిని. ఈచర్య లతఁ డెరిగింయే చేసెనని తలంచెదను. నాడెందము సందియ మందుచున్నది. చెప్పుమని యడిగిన నవ్వుచు బ్రియంవద యిట్లనియె.

సఖీ ! అతడెఱుగనివాడుకాడు. మనమే బేలలమైతిమి. గురుశిష్యులిద్దరు మాట్లాడుకొనిరని తలంచెదను. సాయంకాలమువరకు యీ రేయి నతనితో మాటాడను. ఉపేక్షభావముతో గాలక్షేపము చేసెదనని యనుకొని యతనిం జేరినతోడనే యంతయుం మరచి వేఱొకదారి బడుచుండును. శూలాయుధునంతవానిని గోలకు దెచ్చిన పచ్చనివిల్కాని పూముల్కులకు నగ్గపడకుండుటకు మనమెంతవారము. వ్రతమువిడిచినను సుఖము దక్కినదికాదే 'వలచివచ్చిసను రంభనయిన వాని కాదనుట' మగవానికి సహజగుణము. రాత్రి నాశక్తియంతయు జూపితినికాని యతనికి వలపు గలిగింపలేకపోతిని. ఇంక నేమి చేయవలయు? వారిమొగములు జూచుటకు సిగ్గగుచుండును. కావున మనదారిని మనముపోవుటయే యుచితమని తోచుచున్నది. అనిపలికిన విని మంగమణి యిట్లనియె.

అయ్యో! ఎంత మోసపోతిమి ఏదియేటి యఖిలాష. పాపము వారిని నిందించెదవేల? మనవృత్తాంత మంతయును మరచి మనమే మోహజలధిలో మునింగితిమి. వారే యుద్దరించిరి. జాతిలక్షణము లేమిటికి పోవును? చాలుజాలు. పురుషసాంగత్యం వలదింక పోవుదమురమ్ము. ఢిల్లీచక్రవర్తి మంత్రి విజయవర్మ భార్య సుశీల అక్కయట సుశీల నడిగి పరిచయపత్రిక దీసికొనిపోవుదము దాన గార్యసాఫల్యమగునని నిశ్చయించి యామెం బ్రార్థించి యట్టిపత్రికకుం దీసికొని రామలింగకవికిని సుభద్రునకు దెలియకుండ నారాత్రి బండి తోలించుకొని యాయించుబోడు లిరువురు కతిపయప్రయాణంబున ఢిల్లీపురంబున కరిగిరి.

రామలింగకవియు మరునాడు తమకు రాజపత్ని యిచ్చిన వస్తువాహనములన్నియు నావీటిలో నుత్తములగు బ్రాహ్మణులకు బంచిపెట్టి ధర్మకేతు నమమతి వడసి యప్పురంబు వెలువడి క్రమంబు ననేక జనపదంబులు గడచి యందందు గర్వాధికులయినవారిని వంచించుచు గొన్నిదినంబులకు ఢిల్లీపురి చేరెను.

అట్లు మంగమణి ప్రియంవదయు ఢిల్లీపట్టణము చేరి చూచువారి కసహ్యము దోచునట్లుగా మలినాంబరములు ధరించి ముందుగా నొకసత్రంబున నివసించిరి. అందెద్దియో కారణమున నూరక వగచుచున్న యొక వృద్దాంగన జూచి సాయంకాలమున మంగమణి అవ్వా! ప్రొద్దుటనుండి నిన్ను జూచుచున్నదాన నూరక వగచెదవు ఓదార్చువారెవ్వరు గనంబడరు కారణమేమని యడిగిన నాజరఠ యిట్లనియె.

అవ్వ కథ

అమ్మా! నన్ను భగవంతుడే యోదార్చవలయుంగాని మనుష్యుల శక్యముకాదు వినుము. నాకాపుర మంబాపురము. నేనొకనాడు మాగ్రామములో గుమ్మరుచు నొకవీధిలో నొకపురుషునింగాంచి యతని యాకారగౌరవముచూచి దాతయని తలంచి దాపునకుం బోయితిని. అతడు నన్ను మన్నించుచు అవ్వా! నీవిచ్చటి కేమిటికై వచ్చితివని యడిగెను. నేను పేద ముత్తైదువను. పెక్కండ్రు బిడ్డలుగలరు. మగడు శతవృద్ధు. దరిద్రము బాధించుచున్నది. మీవంటి పుణ్యాత్ము లేమేని యిచ్చినదినము గడుచును లేకున్న బిల్లలు నేను నుపవాసముండవలసివచ్చునని యతిదైన్యంబుతో వేడుకొంటిని. నామాటలు వినిన నతనికి జాలిపుట్టినది. శివశివా యని చెవులు మూసికొనుచు నా కెద్దియో యిచ్చుటకు నెవ్వనినో జీరెను. అతని పరితాపముజూచి నాకు విరోధియైన యొక బ్రాహ్మణు డతనితో అయ్యా! ఈయవ్వ విషయమై మీరింత చింతింపవలసినపనిలేదు. ఈ వృద్ధకు సంతతిలేదు. వేలకొలది ధనమున్నది నిత్యము పేరంటకమునకు దిరుగుచు క్రొత్తవారియొద్ద నేమియులేదని యసత్యము లాడునని నావిషయమెన్నియో లేనిపోనివి చెప్పెను.

అప్పు డతండు తలపంకించుచు నీకు మంచి జీర గొనిపెట్టెద నాతోడ నంగడికి రమ్మని యప్పుడే తీసికొనిపోయెను నేను దురాశతో నతనివెంట బోయితిని. అవ్వా! నీ వెరింగిన మంచిదుకాణ మెద్దియేని కలదాయని యడిగిన గలదని నాకు బరిచయము గల్గియున్న యొక బట్టలకొట్టు దగ్గరకు దీసికొనిపోయితిని. అప్పుడతం డందున్న వర్తకుని జూచి విలువగల చీరయొకటి తీయుమని యడిగెను. ఆ వర్తకు డొక చీరదీసి చూపగా నాకిచ్చి అవ్వా! ఇది నీకు బాగున్నదా! లేకున్న మఱియొకటి యేరికొమ్ము వెలకు సంశయింపకుమని పలికిన సంతసించుచు నేనంతకన్న విలువ గల మరియొకకోక నేరికొని చూపితిని. ఇది నీకు జాలునాయని యతండడిగిన మరియు నాసజెంది వేఱొకవస్త్రంబు గనపరచితిని. అదిచూచి అతండు అయ్యో! ఈ దుకాణములో విలువగల చీరలు లేవాయేమి? సామాన్యపుచీరలే తీయుచుంటివి. నా సారము నీవెఱుంగవు? వెఱవకుము. నీ యిష్టమువచ్చిన చీరం గోరికొనుము యిచ్చెదనని చెప్పిన నిజమని నమ్మి యా వర్తకుని వేసి వేపి చివరకొక కాశీదేశపు జరీపట్టంచు చీరందీసి చూపితిని. ఇది యెంత వెలయని యడిగిన వేయిమాడలని చెప్పితిని. ఇంతేనాయని యాతడు పెదవి విరువగా నింతకన్న నెక్కుడు వెలగలది యీగ్రామములో లేదని యావర్తకుడు చెప్పెను అయ్యో వర్తకుడా పెద్దచీర యుండిన తెమ్ము నాకు మంచిసమయము వచ్చినది అని నేను వర్తకుని బ్రతిమాలితిని యతండంతకన్న గొప్పచీర నాయొద్దలేదని స్పష్టముగా జెప్పెను.

అందులకు నేను మిక్కిలి వగచుచు అయ్యా! నా దురదృష్టమునకు మీరేమి చేయుదురు? ఇంతకన్న పెద్దచీర లేదట. మీ దయయుండిన మరియొకరీతి ననుగ్ర హింపవచ్చును. ఆ వెలపెట్టి మాయింటనున్న వారికందరకు వస్త్రంబులు కొని యియ్యుడు మీదయవలన బెద్దకాలము సుఖియింతుమనిన వల్లెయని యతండొప్పుకొని అవ్వా! నీవాపుట్టంబుల నేరికొనియుంచుము. ఇంతలో నీచీర నాభార్యకు జూపివచ్చెద నదియు మెచ్చవలయుంగదా. ఇదిగాక మఱియేమైన నిమ్మని చెప్పునేమో మాబస యిందాక నీవు చూచినదే తృటిలోవత్తునని పలుకగా సమ్మతించి వేగము రమ్మని చెప్పితిని

అప్పుడతం డావర్తకునితో నేనీచీరను మాయాడువాండ్రకు జూపివత్తు నంత దనుక యీయవ్వ తాకట్టుగా నుండును మానివాసము దాపుననే యున్నదని పలుకగా నతండు నన్ను జూచి యేమమ్మా నీవీయన నెఱుంగుదువా యని అడిగెను. అయ్యో! ఈయన యెంతవాడనుకొంటివి. నేనుకాదు లోకమంతయు నెఱుంగును. నీ సొమ్మున కేమియు భయములేదు. నేను పూటయని చెప్పి యాదొంగను చేతులార ననిపితిని. పిమ్మట మా కుటుంబమున కతండిత్తునన్న చీరలు జామారులు నేరి మూటగట్టి యతనిరాక కెదురుచూచుచుంటిని. ఎక్కడరాక సాయంకాలమువరకును జూచితిని. కన్నులు చిల్లులు పడినవి అతనిజాడ యేమియుం గనబడినదికాదు. అప్పుడు భయపడుచు నాతనిం దీసికొనివత్తుఁ బోనీయుడనిన వర్తకుడు గదలనీయడయ్యె. ఏమి చేయుదును! మఱికొంతసేపటికి నిరాశజేసుకొని గుండెలు బాదుకొనుచు అయ్యో! వర్తకుడా! వాడెవ్వడో నేనెఱుంగను వీధిలో గనంబడి చీరలిత్తును రమ్మనిన వచ్చితిని. ఇంతమోసకాడని యెఱుంగనైతిని. నన్నేటిలో దింపినాడు యేమిచేయుదును. నన్ను బోనిమ్ము! గ్రామమంతయు వెదకి తీసుకొనివచ్కెద నిందున్న లాభ మేమి? యని యనేక ప్రకారముల వేడికొనగా నావర్తకుడు దురాశాపాంకురాలవు నీకిట్లు కావలసినదే. నేనడిగిన జగమంతయు నెఱిగినవాడనియే చెప్పితివే? నాకేమి నీకొంప నమ్మించి పుచ్చుకొనియెదనని నన్నుదిట్టుచు నావెంట గొందఱ మనుష్యుల నంపెను.

వాండ్రును నేనును గ్రామమంతయు వెదకితిమి యెందును వాని జాడ గనంబడినదికాదు. అప్పుడు నేనా వర్తకునియొద్దకు బోయి దీనురాలను, ముష్టిముండను, విడువుము తెలియక మోసపోయితినని యెంత బ్రతిమాలినను వానికి దయవచ్చినది కాదు. అందుల గురించి పత్రికాముఖంబున నీచక్రవర్తిగారియొద్ద దగవుపెట్టెను. ఆ తగవునకే నేను వచ్చితిని. ఈ పుణ్యాత్ముడేమి చేయునో తెలియదు తినినదికాదు, కుడిచినదికాదు. వీధిలోబోవుచుండ మీదబడినది అని తన వృత్తాంతమంతయుం జెప్పుకొని యాయవ్వ విలపించినది.

ఆకథవిని మంగమణియుఁ బ్రియంవదయు లోన నవ్వుకొనుచు లోభిజనుల ద్రవ్య మీలాగుననే పోవును. ఆ బ్రాహ్మణు డెవ్వడో మిక్కిలి చతురుడు. మన రామకవియేమో యని తలంచుచు దత్కా,లోచితములయిన మాటలచే నా యవ్వను వోదార్చిరి.

సుప్రభకథ

అట్లాకాంతలు ప్రచ్చన్నముగా బదిదినములు విజయవర్మ భార్య యగు సుప్రభతో దమవృత్తాంతము చెప్పుకొనుట కవకాశ మరయచుండ నొకపర్వదివసంబున నామె దేవాలయమున కరుగుచుండెనను వార్తవిని సత్వరముగా నచటికి బోయిరి సుప్రభ దేవతాదర్శనముచేసికొని ముఖమంటపమున మంగమణియు బ్రియంవదయు ముసుంగులతో నెదుటకుబోయి మెల్లగా సుశీల వ్రాసిన యుత్తర మామె గందిచ్చిరి అత్తరుణి యాయుత్తరము విప్పి చదువ నిట్లున్నది.

అక్కా! ఇక్కాంత లసమానరూపవయోవిద్యావనవద్య లని చూచినవారికి తెల్లముగాకమానదు. ఉత్తమజాతివారును నాకు బుత్రికాతుల్యలగుటచే నీకు మాననీయులని వ్రాయనవసరములేదు. వీరి నపత్యభావంబున మన్నించి వీరుకోరిన కోరికలదీర్ప నీమగనిం బ్రార్ధింతువని యీ యుత్తరము వ్రాసియిచ్చితిని. నా ముద్దు చెల్లింతువని తద్దయు గోరుచున్న దాన ఇట్లు నీ ప్రియసోదరి సుశీల.

అనియున్న యుత్తర మమ్మదవతి ముమ్మారు చదువుకొని యత్యంతసంతోషముతో నా పత్రికను ముద్దిడుకొనుచు వారిపై జూడ్కులు నిగుడజేసి మలినాంబరచ్ఛన్న లై యున్న యాయన్నుమిన్నలసోయగము తెల్లము కామింజేసి నా ముద్దు చెల్లెలకు వీరియం దంతయనురాగ మేటికి గలిగెనో యని వితర్కించుచు వారిం గూర్చుండ గనుసన్న జేసినది.

వారును యథోచితప్రదేశముల గూర్చుండిరి. అప్పటికేమియు వారిం బ్రశంసింపక యక్కాంత కొంతసేపందుండి యింటికిం బోవునపుడు వారిరువురను దమబండి యెక్కించుకొని యింటికిం దీసికొనిపోయినది

సుప్రభ తనయింటిలోవారికి నెక్కుడు గౌరవముగా నుపచారములు గావింపదగు పరిచారికల నియమించినది. ఇంటిలోనున్నను రెండుమూడు దినములదనక సుప్రభతో మాటలాడుటకు వారి కవసరము చిక్కినదికాదు ఒకనాడు సాయంకాలమున సుప్రభ యంతఃపురంబున గూర్చుండి వారిని రావించి గద్దియల గూర్చుండ నియమించి కాంతలారా! మీరెవ్వని పుత్రికలు? ఏదేశము? సుశీలకు మీకు మైత్రి ఏల కలిగినది? మీకు మావలన గావలసిన పనియెద్ది అని యడిగిన విని మంగమణి కొంతపరిచయము గలిగినవెనుక తమకార్యం బెఱింగింప దగునని నిశ్చయించి యప్పటికి దగినట్లుగా నామె మాటలకు గొంతగొంత యుత్తరమిచ్చి యల్లన నిట్లనియె.

సాధ్వీ! నీవు కడు నుత్తమురాలవని ప్రజలెల్లడలం జెప్పుకొనుచుండి. ధనమున్న యప్పుడుగదా గుణము లలవడును. సుశీల సతతము నీ శీలము గురించియే చెప్పుచుండును. నీయపత్యము విషయమై ముచ్చటింప మఱచితిమి. సంతతి యేమయినం గలదా? యని యడిగిన విని యా సుశీల నిట్టూర్పు నిగుడించుచు నెద్దియో స్మరించుకొని కన్నులనీరు విడువంజొచ్చినది.

అప్పుడు మంగమణి యయ్యంగన దైన్యంబు దిలకించి యించుక కొంకుచు గాంతా! సంతతిగురించి యడిగినంత చింతించుచుంటివి. నదీనెద్దియో కొరంతయున్నదని తలంచెదను. దైవకృత్యంబులకు జింతించుట నిరర్థకంబుగదా! నీచింతాకారణం బెఱింగింపుమని యుపశమనపూర్వకముగా నడిగిన సుప్రభ కన్నీరు దుడుచుకొనుచు నిట్లనియె.

వాల్గంటీ! నావంటి దురదృష్టవంతురాలు యెందునను లేదు. నన్నేల పొగడెదవు. నాకు సంతతిలేదు. ఇరువదేండ్ల క్రిందట నొకయాడుబిడ్డ పుట్టినది. నాపట్టికి సంవత్సరము నిండగనే పేరప్పగించుటకై మేము సకుటుంబముగా గాశికిం బోయితిమి. ఆ సమయంబున గంగానది నింగిపొడవున పొంగినది. అప్పుడు మాకు గంగపూజ చేయవలయునని యుత్సాహము పుట్టినది. పిమ్మట నాపతి మారేడుపత్రియు తులసిపత్రియు పెక్కురకముల పువ్వులును అరుణగమలములను వేనవేలు తెప్పించెను.

తరువాత నొకయోడమీద నేనునుం బతియు బిడ్డయు నాగమణి అనుదాదియు గొందఱు బ్రాహ్మణులు నెక్కితిమి. నావికు లాయోడను బ్రవాహాభిముఖముగా నడిపించుచుండ బ్రాహ్మణులు గంగాసహస్రనామములు జదువ బయిడిపల్లెరమున బూవుల నిడుకొని నేను పతితో నత్యంతభక్తిపూర్వమున పూజ గావింపుచుంటిని.

అప్పుడు నాగమణి నాపుత్రికను జంకనిడుకొని మాయొద్ద నిలువంబడిన మమ్ములను జూచి నాముద్దుబాల తశయలోనున్న పూవు లందుకొని తానుగూడ గంగలో వైవ దొడంగినది. అదియు మాకు మిక్కిలి ముద్దుగాదోచినది. ఆ దాదియు బూవులందించు చుండ నాపాప తేవకు నీటిలో వైచుచుండెను. అంతటితో మానుమని చెప్పుటకు మాకు బుద్దిపుట్టినదికాదు. అదియు నొకవేడుకగా నుండెను. మఱియొకమాటు మా దాది పూవు చేతికందించి విడువిడుమని నీటివయిపున కించుక వంగినంత నాబాల బూవు వైచునప్పు డుంకించుటయు బరువై చేయిపట్టు వదలి తటాలున నీటిలో బడినది. దానితో నాగమణియు దటాలున గంగలో నుఱికినది. ఇరువురు కొట్టుకొనిపోయిరి. ఎల్లరు గొల్లుమన జూచితిమి. ఏమియు గనంబడినదికాదు. జీవితాశ వదలి గంగలో బడవలయునని యెంత సాహసించినను అందున్నవారు నన్ను గదలనిచ్చిరి కారు.

తరువాత వారికొఱ కెన్నియో ప్రయత్నములు చేసిరిగాని కళేబరములయినను గనంబడినవికావు. ఆ బాలికామణి సౌందర్య మేమని చెప్పుదును. ఆలాటి ముద్దుకూతురు నాకు దక్కునా? ఇదియొక నిర్భాగ్యజన్మము దానినిప్పుడు స్మరింపనేల? మీరు వచ్చిన కార్యమె ద్దియో చెప్పుడు అని యడిగినది.

వారట్లు మాటలాడుకొనుచున్న సమయంబున విజయవర్మ ఇంచుక ప్రాయము మీరియున్న యొకయాడుదానని వెంటబెట్టుకొని యాయంతఃపురమునకు వచ్చెను. అతనిరాక చూచి మంగమణియు, ప్రియంవదయు లేచి లోపలకుంబోయిరి. అప్పుడు మంత్రి భార్యం జూచి ముదితా! ఇది యెవ్వతియో యెఱుంగుదువా! అని యడిగిన నామె నిదానంచూచి అయ్యో! మన నాగమణికాదా? ఎట్లు వచ్చితివే! బ్రతికియుంటివా? నా ముద్దులపట్టి నేమిచేసితివని పలుకుచు లేచి దానిం గౌగలించుకొనినది అదియు నందరము సురక్షితముగా నుంటిమి నీవు విచారింపకుము నీకూతురు సజీవయై యున్నట్లు దైవకృపవలన మీ యొద్దకు రాగలదని పలికిన విని యమృతవర్షము గురిసినట్లు సంతసించుచు యేమీ? నా బిడ్డబ్రతికి యున్నదా? యథార్థమే! పసిపాప యిప్పటికి పెద్దదికావలయునే నన్ను గురుతుపట్టునేమో? ఎక్కడ నున్నది? ఏమిటికి దీసికొని వచ్చితివికావు . మా యొద్దకు రానన్నదియా యేమి దయలేనివారమని నిందించుచున్నది కాబోలు? నీ వృత్తాంతమంతయు సవిస్తరముగా జెప్పుము. ఇన్నినా ళ్ళెందుంటివి. ఏమేమి పనులంగావించితివి? ఏయేదేశములు దిరిగితివని యడిగిన నన్నాగమణి యిట్లనియె.

నాగమణి కథ

అమ్మా! నా వృత్తాంతము భారతమంతయున్నది. సంక్షిప్తముగా జెప్పెద వినుము. మీరట్లు చూచుచుండగ శిశువును బట్టుకొనుటకయి నీటంబడితినిగదా! పడిన తోడనే యాబిడ్డ నాచేతికి జిక్కినది అంతలో నొక సుడివచ్చి మమ్ము నిరువురని ముంచి దూరముగా దేలవైచినది. అప్పుడొక దారువు దైవవశమున నాజేతికి దొరికినది. అది యూతగాగొని యొకచేతబిడ్డను మునుంగకుండ నెత్తిపట్టుకొని నీటిపయి దేలియుంటిమి. నీటివేగమున దృటిలో మఱియొకపట్టణప్రాంతమునకు బోయితిని.

అచ్చట నీటితట్టులకయి యాడుచున్న యొక పల్లెవాడు మమ్ము సమీపించెను. వానింజూచి నేను రక్షింపుము రక్షింపుమని యరచితిని వాడు వడిగా మా యొద్దకు నీదుకొనివచ్చి నాచేతిపయినున్న బిడ్డను మెల్లగా దన తెప్పవలు నెక్కించుకొని యొకచేతితో బట్టుకొని నన్నుగూడ బ్రక్కకు జేర్చుకొనవలయునని ప్రయత్నించు నంతలో నూతివంటి సుడి వచ్చి మా యిద్దరను దూరముగా త్రోసివేసినది. పాపము వాడు నాయొద్దకు నీదుకొనిరావలయునని యెంతయో ప్రయత్నము చేసెను కాని శిశువు తెప్పమీదనుండుటచే గాపాడుచు నీదుట దుర్ఘటమైనది.

పిమ్మట నన్ను వదలి వాడు వేగముగా నీదుకొనిపోయి నేను జూచుచుండగనే తీరముజేరెను. అదిచూచినేను మిగుల సంతసించుచు నా బాలికను రక్షించినందులకు భగవంతున కనేకవందనంబుల గావించితిని తరువాత నేనాకర్ర నూతగాబూని ప్రవాహవేగమున గొట్టుకొని పోవుచుంటిని. సాయంకాలముదనుక బోయితిని.ఎవ్వరు గనబడలేదు రాత్రిపడినతోడనే భయము జనించినది. కాని చచ్చుటకు సిద్దముగా నున్న దానగాన దైవమునే ప్రార్థించుచు నా కట్టెను మాత్రము విడువక యరుగు చుంటిని. తెల్లవారువఱకు నట్లెపోయితిని తీరము మెరకలేదు. మరల సాయంకాలము వరకు బోయితిని అప్పటికి మేను వివశత్వము నొందినది. మిక్కిలి యాకలి యగుచున్నది. కన్నులు చూచుటకు వశముకాక మూసికొని యా దారువునందు శిరము మోపి యట్లు పడియుంటిని. శరీరమంతయు నీటిలోనున్నది. రెండుచేతులు నా దారువునకు బెనవైచితిని. అప్పుడు నిద్రయో, మూర్ఛయో నేనెఱుంగను, న న్నావేశించినది. తరువాత నేమి జరిగినదో నాకు దెలియదు. ఎంతదూర మెన్నిదినములు పోయితినో చెప్పలేను. తిరిగి నేను గన్నులు తెరచి చూచువరకు నొకపట్టణము రేవులో నొక బ్రాహ్మణుండు నానోట నన్నరసము పోయుచుండెను. ఆ పుణ్యాత్ముని వలన నేను జీవించితిని. అతండు స్నానముచేయుచుండ నేనా దారువుతో నా రేవులోనికి గొట్టుకొనిపోయి మారువడిలో నిటునటు తిరుగుచుంటినట. దారువుపయి చేరియున్న నామొగ మాపాఱునికి గనఁబడినది. తరువాత నా ముక్కెరలోనున్న వజ్రపురవ్వ తళుక్కుమని మెరసినదట. అదిచూచి యావిప్రుడు నన్ను శవముగా నిశ్చయించి ద్రవ్యాశచే నా దారువును పట్టుకొని మెల్లగా తీరమునకు లాగెను. నా మొగము దగ్గరగా జూచినంత ముక్కున నూపిరియున్నట్టు పొడగట్టినదట. ఇంతలో మఱియొకరెవ్వరో యచటికి వచ్చిరట వారిరువురు విమర్శించి నన్ను శవముకానియట్లు నిశ్చయించి చేతులతో నన్నుబట్టుకొని యొడ్డున బరుండబెట్టిరి. ఊర్పు లుండుటచూచి యా పుణ్యాత్ముండు వడిగా దనయింటికిబోయి మజ్జిగలో నన్నముం పిండిదెచ్చి నానోటిలో నెక్కించెను.

ఆన్నసారము తగిలినతోడనే నాకు స్మృతివచ్చినది. తరువాత నేనడుగంగా నతండీ వృత్తాంతమంతయుం జెప్పెను నాకు స్మృతియు బలము నించుక గలిగిన తోడనే నన్నా బ్రాహ్మణుండు తన యింటికి దీసికొనిపోయి యెక్కుడుగా యుపచారములుచేసి నాలుగుదినములలో నన్ను యథాస్థితికి దెచ్చెను, నేనా పాఱునకు నా యొడలి నగలన్నియు నిచ్చితిని. నా వృత్తాంతమంతయు జెప్పి నన్ను మా దేశమునకు దీసికొనిపోయితివేని మంచి పారితోషిక మిప్పింతునని చెప్పితిని ఆతఁడును సమ్మతించెను.

ఇంతలో దైవవశమున నా బ్రాహ్మణుడెద్దియో రోగము వచ్చి హఠాత్తుగా ప్రాణములు వదిలెను పుణ్యాత్ములు చిరకాలము జీవింపరుగదా. తండ్రిపోయినదానివలె నేనతనికొరకు విలపించితిని. ఆయనభార్య నాపాదము మంచిదికాని నన్ను వారింటిలో నుండనీయక లేవగొట్టినది. గ్రహచారము చాలని దినములలో నెచ్చటికి బోయినను కష్టములు రాకమానవని నిశ్చయించి నేను స్వదేశమునకు బోవుటకు సహాయులెవ్వరయిన దొరకుదురేమోయని విమర్శింపుచు గదలి నలుమూలలు దిరుగుచు నా పట్టణములోనున్న దేవాలయములోనికి బోయితిని. ఆ పట్టణముపేరు కలిఘాతానగరమట నేను సాయంకాలమున కా దేవాలయములోనికి బోయితిని. అందు గన్నులపండువుగా దీపములు పెట్టబడియున్నవి. ఒకమూల వేదమంత్రములు నొకమూల హరిభజనలును నాకు శ్రవణానందము గావించెను. చాల ప్రొద్దుపోవు వరకు నుత్సవములందు కావింపుచుండిరి. నేను విమర్శింప ద్వీపాంతంరమునుండి యెవ్వడో రాచకుమారుడువచ్చి యాస్వామి కాదినమున భోగము గావింపుచున్నవాడని తెలియవచ్చి నది. ఆ యుత్సవములు చూచుటచే నేను నాదుఃఖము నించుక సేపు మరచితిని. అట్లారాత్రి రెండుయామములు దనుక నాగుడిలో సందడిగా నున్నందున నేనును నిర్భయముగా నందు గాలక్షేపము జేసితిని.

క్రమక్రమముగా జనులు తమతమ నెలవులకు బోయిరి. తరువాత నర్చకులు గుడికి తాళమువైచి యావరణములో నున్నవారినెల్ల బైటకు బొమ్మనిరి. అప్పుడు నేను చావడియరుగుపైకి బోయితిని. చావడిగుమ్మము తలుపులుగూడ బీగమువైచి వారు తమగృహంబునకు బోయిరి. అప్పుడా యరుగుమీద నేనొక్కరితనే యుంటిని. నావెరపునకుదోడు చీకటియు నెక్కుడుగానుండెను. అవీథి మారుమూలగా నుండుటచే తఱుచు జనులా వీథిని బోవరు. ఒక ప్రక్కను కోటగోడ పర్వతమువలె నుండుటచే నచ్చట మఱింత చీకటిగానున్నది.

ఆ యరుగుమీద నొక గదియున్నది. దానికి దలుపులు లేమింజేసి లోపలకు బోవుట కభ్యంతరములేదు, బయట నివసింప భయమయినంత నేనా గదిలోనికిబోయి యొకమూల గూర్చుండి యెప్పుడు తెల్లవారునని భగవంతుని ధ్యానము చేయుచుంటిని.

అట్టిసమయమున మెల్లగా నడుగులిడుచు నొకపల్లవపాణియా గదిలోనికి వచ్చినది. ఆ నాతి మేని యాభరణ కాంతులు నాకన్నులకు మిఱుమిట్లుగొల్పినవి. నగల సోయగము జూచి పార్వతియో, లక్ష్మియోయని భ్రమించితిని. కాని యంతలో భూతభేతాళములు యక్షిణీరూపములతో సంచరింపుచుండునను సంగతి జ్ఞాపకము వచ్చుటచే గుండెపగిలినది. ఆకుమరుంగు పిందెవలె నణంగియుంటిని. గట్టిగానూపిరి విడిచినచో దెలిసికొనునని ప్రాణము లుగ్గబట్టుకొనియుంటిని. అట్టిసమయమున నన్నది నలుమూలలు బరికింపుచు నేనుండుట యరసి నన్ను నిద్రబోవునట్లు తలంచి రామామణీ! యని మెల్లగా బిలిచినది. నాపేరు నాగమణిగాన రామాయను మాట విస్పష్టముగా దెలియక నన్నే పిలుచుచున్నదనుకొని ఓయి యని పలికితిని. అయ్యో! ముందుకువచ్చి నిద్రపోవుచున్నదానవా? గోడదాపున నుందువనుకొంటిని. కోటగోడ దాటుట మిక్కిలి దుర్ఘటమయినది సుమీ! తుదకు దాటలేననుకొంటిని గొలుసు నేలంట దిగినదికాదు. క్రిందనేమియున్న సరేయని దుమికితిని ఇంచుక తప్పినది కదా. యాప్రాంతమునందే నేలనుయ్యియున్నది. దానిలో బడిపోవుదును ------సితినిలే. ఇంతకు దలంచుకొన్నవేళ దాటినదే. కానిమ్ము చెప్పవలసిన యంశములు చాలనున్నవి. వానినన్నియు మార్గములో జెప్పెదను. రాజకుమారుడు వ్రాసినచీటిలో బండి పండ్రెండుగంటలకు సరిగా బంపుదునని యున్నది. ఇప్పుడే గంటలు గొట్టినారు బండివచ్చినదేమో చూడుము అనిచెప్పిన మాటలన్నియు నేను విని యోహో తెలిసినది. ఈచిన్నది యొక రాజకుమారునితో సంకేత మేర్పరచు కొనివచ్చినది. నన్ను దన సఖురాలననుకొన్నది. కానిమ్ము నిజము దెలియనీయక దీనితోబోయి కొంతసహాయము గావించెదనని తలంచి యేమియు మాటాడక ఊఁ ఊఁ యని యుత్తరమిచ్చెతిని.

అప్పుడప్పడతి నా మేను తట్టుచు రామామణీ? లేవ వేమి? మంచిదానవే ఇప్పుడు నిద్రపోవు సమయమే? బండిచూచిరా? అని పలికిన నేను మెల్లగాలేచి వాకిటకు బోయినంత నప్పుడే బండివచ్చి యచ్చట నిలువంబడినది.

అమ్మదవతి యా ధ్వనివిని తానుగూడ నచ్చటికివచ్చి బండిదాపునకు నా చేయిపట్టుకొనిపోయినది. అప్పుడు బండిలోనుండి యొక మగువ క్రిందికిదిగి వినయయముగా నందులో నెక్కుడని సంజ్ఞచేసినది. నేనేమియు మాట్లాడక యందెక్కితిని. తరువాత నా నాతియు దానితో వచ్చి మగువయు నెక్కి తలుపులు బిగించిరి.

బండివాడు దాని నతివేగముగా నడిపించుచు స్వల్పకాలములలో నొక సముద్రము రేవునకు దీసికొనిపోయెను బండి నిలిచినతోడనే యొక పరిచారిక వచ్చి తలుపు తెరచి రండు రండని పిలిచినది. మేమందరము బండిదిగి దానివెంట బోయితిమి. అందొక యోడ సిద్ధముగా నున్నది. దానిలోనికి మమ్మాపరిచారిక దీసికొనిపోయినది.

ఆ యోడ మిక్కిలి విశాలముగానున్నయది. మనోహరములైన వస్తువులచే నలంకరింపబడియున్నది. నలుమూలలకు గాజుదీపములు పెట్టియుంచిరి. రాజభవనము కన్నను సుందరమైన యా యోడలో నొక గదిలో మమ్ము బ్రవేశపెట్టి యా పరిచారిక యరిగినది

ఆ దీపముల వెలుంగున నన్ను నిదానించి చూచి యా చిగురుబోడి అయ్యో! రామామణి యేది? బండిలో దిగబడినదియా యేమి? లలనామణీ పిలిపింపుము. ఓడ త్రోయుదురేమో నిలుపుమనుము. అని తొందరగా బలుకుచు గట్టుదెసంజూడ దొడంగినది.

అప్పుడు నేనించుక నవ్వుచు జవ్వనీ! రామామణి యెవ్వతె? ఎందున్నది? నీతో వచ్చినదా యేమని యడిగితిని. అవును నాతో వచ్చినది. బండిలో దిగబడెనో, యెందేని బోయెనో తెలియదు. అది నా ప్రాణసఖురాలు దానిజాడ తెలిసికొనలయునని పలికినది.

నేను నీతో బండిలో వచ్చితినే? నేనుగాక మఱియెవ్వరుసు బండిలో నెక్కలేదు. మొదట బండితో వచ్చిన స్త్రీ యీ లోనికింబోయినది. రామామణి యెప్పుడు వచ్చినదని పలికితిని. అయ్యో! నీవేమియు నెఱుగవు మా రామామణి యీ యోడదాక నాతోడనే నడచినది. దారితెలియక యేమూలకో పోయి యుండవచ్చును. కొంచెము పిలిచిపెట్టుము. నీ యుపకారము మఱువనని యత్యాతురముగా నడిగిన విని నేను నవ్వుచు నిట్లంటిని.

పూవుబోడీ! నీ వేమియు నెఱుంగవు. నిన్ను నేను మోసముజేసితిని. దేవాలయము గదిలో నుస్నదానను నేనేకాని మీ రామామణికాదు నా పేరు నాగమణి వృత్తాంతము వినవలయునేని చెప్పెద సావకాశముగా వినుము. నీకు మీ రామామణి యెట్టిపనులం గావించునో యంతకు నిబ్బడిగా నేనును జేయంగలదాననని పలికితిని.

అప్పు డప్పల్లవపాణి తెల్లబోయి యొక్కింత సేపేమియుం బలుకక నన్నాపాదమస్తముగా శోధించి నీ వెవ్వతెవు? ఆ గదిలోనికెట్లు వచ్చితివి? నన్నిట్లు మోసముచేయుట యుచితముగా నున్నదియా యని యడిగిన నేనిట్లంటి.

యువతీ? నిన్నేమియు నేను మోసము చేయలేదు. నా వృత్తాంతము వినిన తరువాత నిందింపుము. నేను ఢిల్లీ చక్రవర్తిగారి మంత్రి విజయవర్మ భార్యకు సఖురాలను. నా పేరు నాగమణి. ఆ దంపతులు ఏడాది యీడుగల బాలికితోగూడ గాశీయాత్రకువచ్చి యుత్సాహముతో గంగాపూజ చేయుచుండగా నాచంకనుండి జారి యాబిడ్డ నీటిలో బడినది. నేనును దానితో గంగలో నుఱికితిని. ఇరువురము కొట్టుకొని పోయితిమి. ఆ శిశువు నొకపల్లెవాడు బ్రతికించెను నేనును కొట్టుకువచ్చి మీ పట్టణములో బ్రాహ్మణుని మూలమున గట్టుజేరి బ్రతికితిని. మా దేశమునకు బోవుటకు సహాయము దొరకక చింతించుచు నేటి సాయంకాలమున నా దేవాలయమునకువచ్చి యెచ్చటికి బోవనేరక యచ్చటనే పరుండితిని ఇంతలో నీవువచ్చి పిలిచితివి నీ మాటలచే నీ వృత్తాంతము కొంతగ్రహించి కానిమ్ము ఇమ్ముదిత పిలుచుచుండెడి రామామణి యిచ్చటలేదు. నేనే దానిపని నెరవేర్తునను తలంపు నా చిత్తంబున జనియించిన నేమియు బలికితినికాను. నీ రామామణి యెద్దియో యాటంకమువచ్చి రాలేదని తలంచెదను.

ఇందులకు నీవేమియు జింతింపవలదు. నన్నే దానిగా భావించుకొనుము. ప్రాణము పోయినను నేను నీమాటకు మాఱుజేయుదాననుగాను. కాలగతిచే నింత చెప్పవలసివచ్చెను. దైవ మిట్టిబుద్ది నాకిప్పుడు పుట్టించుట కొంతకాలము నాకు విదేశ యాత్ర గలుగునని తలంచెదను. నామాట నమ్ముము. నీవే రాజుకూతురవు. నీ పేరేమి? నీ విప్పు డెవ్వని వరించి యరుగుచున్నదానవని మిక్కిలి నేర్పుగా విశ్వాసము గలుగునట్లు పలికితిని.

నా మాటలు విని యా బోటి తల కంపించుచు నీవు చెప్పినది యథార్ధమేనా? ఏమి దైవఘటనము? అయ్యో! విజయవర్మ భార్య సుప్రభ నాకు పెదతల్లి యగునామె కెంత యాపదపచ్చినది. లేకలేక కలిగిన బాల గంగలో బడినదియా బ్రతికినట్లు వారెఱుంగుదురో యెఱుంగరో విధివిలాస మద్భుతమైనదిగదా కానిమ్ము. అందుమూలమున నీకును మాకును బాంధవ్యము గలిగియున్నదిలే నిన్ను నా ప్రాణసఖురాలిగా నెంచి నీతో నా వృత్తాంతము చెప్పుచున్నాను. వినుము.

కల్పవల్లి కథ

నా పేరు కల్పవల్లి మా తల్లి పేరు సునంద. ఈ పట్టణపురాజు సింధువర్మ నన్నతని కూతురిగా నెఱుంగుము. నేను కొన్నినాళ్ళ క్రిందట సాయంకాలమున జలకమాడి యలంకరించుకొని తలయారవిప్పుచు నుప్పరిగమీదికి బోయి యటునిటు తిరుగుచు జల్లగాలి మేనికి హాయిసేయ జిలుకల కలకలరవంబులు చెవులకు విందొనర్ప నప్పుడు నాడెందంబున నపూర్వమైన యానందమొకటి యుదయించినది దానితెర గిట్టిదని చెప్పుటకు వశముకాదు. అప్పుడు నే నేమియుం దోచక పురవిశేషములం జూడ వేడుకగా నాయుప్పరిగనుండి క్రింది వీథికి దొంగిచూచితిని.

అప్పుడు కంతు వసంత జయంతాదుల మించిన సోయగముగల రాజకుమారు డొకండావీథిని బోవుచు నా హృదయ మాకర్షించెను. అంతకుబూర్వము నాహృదయంబున నుదయించిన మదనవికార మతని జూచినతోడనే పెచ్చుపెరిగి విచ్చలవిడి పిచ్చిచేష్టల గావింప బురిగొల్పినది. ఏమియుందోచక మల్లికాకుసుమంబులిన్నిగైకొని యతని మీద జల్లితిని. ఆహా నా సాహసమేమియో నేనెఱుంగను ఆసొగసుకాడు పుష్పపతనమునకు వెరగందుచు దల పై కెత్తి చూచెను. నేనతనిం జూచుచుంటిని కావున నప్పుడు మా యిరువురచూపులు నిగళములవలె నొండొరులకు దగిలికొనినవి. మా పుణ్యవశంబున నప్పుడావీథిని మఱి యెవ్వరును జనకుండుటవలన మా కొండొరులకు సాభిలాషముగా జూచుకొనుట తటస్థించినది. చూపులవలననే యొండొరుల యభిప్రాయములు తెల్లమైనవి. అప్పుడు నేనతని రషికత్వమెట్టిదో చూడవలయునని యీ క్రింది శ్లోకము వ్రాసి పూవుబంతిలో నిమిడ్చి యతని కందునట్లు దిగవిడిచితిని.

శ్లో॥ గచ్చామ్యచ్యుతా! దర్శనేన భవతః కింతృప్తిరుత్పద్యతే!
     కింత్వెవం విజనస్థయో ర్హతజన స్సంభావయత్యన్యధా!
     ఇత్యామంత్రణభంగి సూచిత వృధావస్థానభేదాలసా!
     మాశ్లిష్యన్ పులకోత్కరాంచితతనుం కోపీం హరింః పాతునః॥

అచ్యుతుడా! నిను జూచుటచేతనే నాకు దృప్తి కలిగినదాయేమి యూరకిట్టుల మనల రహస్యస్థలమందుండగ జూచినజనులు శంకించమానరు. దీని ప్రయోజనము లేకపోయెను. నేను వోయెదనని పలికిన గోపికన మేనబులకలు జనించునట్లుగా కౌగలించుకొని ముద్దాడిన శ్రీకృష్ణుడు మిమ్ము రక్షించుగాక - అనియున్న పదార్థములో నిన్ను నేను వరించితిననియు నాయభీష్టమును దీర్పుమనుభావము సూచించుట గ్రహించి యా రసికుడు మరల నేను చూచుచుండగనే పత్రికలో నెద్దియోవ్రాసి యది తన చేతిలోనున్న పావురము ముక్కునకు దగిలించి విడిచెను. అది యెంత నేర్పరియో రివ్వున నెగసినా యొద్దకువచ్చి నాముందర నాపత్రికను విడిచి యేగినది అందు

శ్లో. సౌధేసుధాకిరణచుంబిని లంబమాన
    ముక్తావితానవతి మంచతలే శయానః!
    ఆరోప్యపక్షసిమమానిశ మంగనేత్వా!
    మజ్ఞాత రాత్రిదినభేద మహంనసేయం.

అ॥ ఉన్నతమైన మేడయందు ముత్తెపుజాలరులతో నొప్పుచున్న తల్పంబున నిన్ను వక్షమున నిడుకొని యిది రాత్రి యిది పగలు అనుభేదము తెలియకుండ గాలక్షేపము జేయుదును.

అను శ్లోకమును దిలకించి మేను బులకింప దత్తరముజెందుచు బ్రత్యుత్తర మేమి వ్రాయవలయునో తెలియక కొంతసేపు ధ్యానించి సాహసించి యొక ఉత్తర మిట్లు వ్రాసితిని. ఆర్యా! భవదీయ కులశీలదేశనామంబు లెట్టివో తెలియక రూపైకపక్షపాతియగు మన్మథునిచేత వివశత్వంబు నొందింపబడితిని. అది యట్లుండె. శుద్ధాంతసంచారిణినగు నేనెట్లు మీ వాంఛితం బీడేర్చుదాననని చింతింపుచుంటిని. సిగ్గువిడిచి వెఱపుబాపుకొని యపవాదము సహించి బంధుప్రీతి దిగనాడి కులపరిపాటి నీటబుచ్చి స్వేచ్ఛావిహారంబున నభీష్టంబు దీర్చుకొందమన్నను సాగుట యెట్లో తెలియకున్నది. ఇంతకును సర్వజ్ఞులైన మీరెఱుంగని విశేషములుండవు ప్రత్యుత్తరమున కెదురుచూచుచున్న దాననని వ్రాసి వెండియు నాపత్రిక పుష్పగుచ్ఛమున నిమిడ్చి క్రిందికి దిగవిడిచితిని.

మఱికొంతసేపటికి దానికి బ్రత్యుత్తర మాపావురమే తీసికొనివచ్చినది. ఆ పత్రికయం దిట్లున్నది. నేను సింహళద్వీప ప్రభువగు సింహకేతుఁడను రాజకుమారుండ నాపేరు మకరందుడందురు నేనీదేశము జూచుటకై పదిదినముల క్రిందట వచ్చితిని. తిరుగా నాలుగుదినములలో మాదీవికి బోవుదును. నీకభీష్టమేని వెంటగొనిపోయి యభీష్టంబుల దీర్చుదును దీనికి జింతింపవలసిన పనిలేదు. క్షత్రియులకు గాంధర్వవివాహము శాస్త్రసమ్మతమని చెప్పుదురు. నీవు శుద్దాంతసంచారిణివయినను నిగళసాధనంబున కార్యంబు సాధింపవచ్చును. ఆప్తబంధువుల విడనాడుమని వ్రాయుటకు జేయాడుకున్నది. నీయభీష్టమెట్లు నేనట్లు వర్తించువాడ రేపటి శుక్రవారము ప్రయాణము తప్పదు.

అనియున్న యుత్తరము పలుమారు చదివికొని యందుల కియ్యకొంటినని యప్పుడే యుత్తరము వ్రాసి యాపావురము నోటబెట్టితిని. ఆహా ! నా స్వాంతమున నెట్టి సాహసము పుట్టినదియో చూడుము. యౌవనము పిశాచావేశము వంటిదిసుమీ! అట్టి యుత్తరము వ్రాసి బంధువుల దలంచుకొని తద్వియోగ మగుట విమర్శించి గుండె ఝల్లుమన నేమియుందోచక తొట్రుపడుచున్న సమయంబున నా ప్రాణసఖురాలు రామామణి నాయొద్దకువచ్చి నాదైన్యమడిగినది.

నేనును దానితో గొంతసేపు యథార్ధము చెప్పుటకు సందియమందితినిగాని యువలాలసమువలన జెప్పకతీరినదికాదు. జరిగిన కథయంతయుంజెప్పి యా యుత్తరములన్నియు జేతికిచ్చితిని. అప్పుడది ముక్కుపై వ్రేలిడుకొనుచు ఏమేమీ! కామినీ! నీవింత సాహసమునకు బూనుకుందువా? నాతోనయినం జెప్పవలదా? నీతల్లి యనురాగ మెట్లు త్రోయమనసాడెను. అయ్యో! సఖురాండ్రము మామాట చెప్పనేల నిన్నొకదినము చూడక మనసొల్లని నీతండ్రికేది దిక్కు? చాలులే ఇటువంటి ప్రయత్నము లెన్నటికి జేయకుము. నీవు కోరితివేని యారాచకుమారు నిందుండ నియమించెద అతండు కాకున్న వాని తాత మఱియొకని రప్పింతు నీ యుద్యమము విడచితినని యిప్పుడే తిరుగ నుత్తరమునిమ్ము. నేను తీసికొనిపోయి యీయన కిచ్చి వత్తునని నయము, భయము, చనువు మెరయబలికిన విని యులికిపడుచు నేమియుం బలుకక తలవంచుకొని వెక్కి వెక్కి యేడువదొడఁగితిని.

అప్పుడది వెరచుచు కన్నీరుదుడిచి ప్రియసఖీ! నా మాటలు నీకు రుచింపలేదా యేమి? లోకపరిపాటి గణియించి యిట్లు చెప్పితిని దీనికి జింతింపనేల? ఇందలి మంచిచెడ్డలు నీవే యాలోచించుకొని యుత్తరమిత్తువేని నీయిష్టము వచ్చినట్లుచేయు దాననని పలికిన విని నేనును వెడవెడ జూపుల దానిచూచుచు నిట్లంటిని.

బోటీ! మాటలెన్నియేనిం జెప్పవచ్చును. ఆ రాజకుమారుని జూచిన నీ విట్లనవు. అతడు మన సిరికిలోబడి యుండువాడుకాడు తానొక దీవికి బ్రభువట. యన్ని యతిశయగుణంబులు మఱియొకరి యందుండుట జూడము దీని నీ వేమియుం బ్రతిజెప్పక యొడంబడుము.

ఆడుదానికి తల్లిదండ్రులు బాల్యమునందే కాని ప్రాయమునందు దూరస్థులే. తల్లిదండ్రులవిడిచి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వరించి యరుగలేదా? నీవొకదానవు నాతో వచ్చిన నేకొరతయు నుండదు. లెమ్ము పయనము సవరించుకొనుమని యెన్నియో దృష్టాంతరములు చెప్పి దాని మతి గరగించితిని.

పిమ్మట నాకొమ్మయు సమ్మతించి ప్రయాణసన్నాహము గావించినది. రాత్రి ప్రొద్దుపోవువరకు నాయొద్దనేయున్నది. ఆ దేవాలయము దాపున నుండుమని చెప్పి యంపితిని. అంతకుమున్నా యిరువు చూచివచ్చి యదియే చెప్పినది. నియమించుకొన్నప్రకారము నేను కోటగోడకు గొలుసువైచి దిగివచ్చితిని. తరువాయికృత్యము నీవెఱింగినదియేకదా! మా రామామణి కెద్దియో యంతరాయము కలిగినది. లేకున్న రాకుండినదికాదు. మనుష్యసంకల్పము లెప్పుడును తలచిన యట్లు నెరవేరవుకదా? దానికన్న నెక్కుడుదాని నిన్ను భగవంతుడు నాకు సమకూర్చెను. నీమాట లతిప్రగల్భములుగా నున్నయవి. నీవు మంచినేర్పరివని తోచెడిది. అదియునుంగాక మా పెదతల్లికి హితురాలవు. నన్ను దాని జూచినట్లు జూడుము ఇటుమీద నేమి చేయవలయునో నాకు దెలియదు. ఆ రాజకుమారునకు నాకు జరిగిన ప్రసంగము వింటివిగదా! తరువాయి కృత్యము నీవే యాలోచింపుము. నా ప్రాణము నీయధీనము చేసితిని. అనాథను నన్ను రక్షింపుమని నాపాదములం బడినది.

అప్పుడు నే ననుకంపముతో గ్రుచ్చియెత్తి తత్సమయోచితములయిన మాటలచే నారాజపుత్రి మనస్సంతాపము వాయజేసితిని. మే మట్లు మాట్లాడుకొనుచుండ తెల్లవారినది. ఎటుజూచినను సముద్రమేకాని మరేమియు గనంబడలేదు అతివేగముగా నాయోడ నడచుచుండెను కొంచెము ప్రొద్దెక్కినతోడనే కొందరు పరిచారకలు మేమున్నగదిలో నాహారపదార్థములు దెచ్చియుంచిరి. నేనా చిన్నదానికి వేడుక గలుగజేయు మాటలజెప్పుచు నాహారము భుజియింపజేసితిని నేనును గుడిచిన పిమ్మట నమ్మదవతి నాతో దనపయనమును గుఱించినమాటలే చెప్పుచు నారాజకుమారునియొద్దకు బోయి తదీయచిత్తవృత్తి యెట్టిదో యరసిరమ్మని చెప్పినది.

నేనును సమయమరసి పరిచారకులచే నారాక తెలియజేసి యాయనయొద్ద కరిగితిని. అతండు న న్నుచితమర్యాదలచే సంతోషపరచెను. నేనును నమస్కరించుచు వినయవిశ్వాసములు తెల్ల మగునట్లు అతనితో జెప్పవలసిన మాటలన్నియు జెప్పి యతని నొప్పించితిని. అతని వాగ్ధోరణిబట్టి మిక్కిలి రసికుడని తోచినది. అంత నతని యనుజ్ఞవడసి రాజపుత్రియొద్దకు వచ్చి మచ్చికతో దద్వృత్తాంతమంతయు జెప్పి యామెకును సంతోషము గలుగజేసితిని. వారిరువురి చిత్తంబులును నువ్విళ్ళూరుచుండ నింతలో సూర్యాస్తమయమైనది. అంతకు పూర్వమే యందులో నొకగది యలంకరించి యుంచిరి. రాజపుత్రికను విచిత్రమయిన యలంకారములచే మోహినీదేవతలె మెలయజేసితిని. ఆచిన్నదానియందము జూడజూడ నాకే వింతయైనది అనుకూలవాల్లభ్యంబు లభింపజేసినందులకు జతురాననుని మెచ్చుకొని యమ్మచ్చెకంటి చేయిపట్టుకొని యతండున్న గదిలోనికి దీసికొనిపోయి యతని పజ్జ సజ్జం గూర్చుండబెట్టితిని. అప్పు డప్పడంతి కెక్కడనుండి వచ్చినదో సిగ్గు దిగ్గున మంచము దిగి యొకమూలకు బోయినది. నే నాక్షేపించుచు బలాత్కారముగా బట్టి తీసికొనిరమ్మని యాయనతో జెప్పి యట్లు చేయించితిని పెక్కులేల? వారిరువురచేతను నూత్నవినోదకృత్యంబు లన్నియు జేయించి సిబ్బితవాయజేసి తలుపుబిగియించి యేగితిని అదియు నాకొక వినోద కాలక్షేపమని సంతోషించుచు నారాత్రి నిద్రపోయితిని.

అంత సూర్యోదయము కాకమున్నవచ్చి యచ్చిగురుబోడి నాప్రక్కలోఁ బరుండియున్నది ఎంత ప్రౌఢులయినను చేడియలకు నూతనపతి సంగమము లజ్జాహేతువుగదా, అంతఁ బ్రాతకాలంబున నేనాయింతితో రాత్రివిశేషము లేమియని వినోదముగా నడిగిన నించుక నవ్వుచు నా జవ్వని యీ క్రింది శ్లోకము చదివినది.

శ్లో॥ కా తేకల్పముపాగతే విగళితా నీవీన్వయం తత్ క్షణాత్
     తద్వాసశ్ల ధమేఖలా గుణధృతం కించినితంబే స్థితం
     ఏతావత్సఖీ వేద్మి కేవలమహం తస్యాంగనంగే పునః
     కో సౌ కాస్మిరతంచ కిం కధమితి స్వల్పావిమేనస్మతిః॥

తా॥ ఇంతీ! కాంతుండు నాచెంతజేరినతోడనే కోకముడివిడిపోవుటయును గట్టు పుట్టంబు కాంచీగుణంబుపట్టున నితంబమున మాత్రమించుక నిలిచినట్లు కొంచెము జ్ఞాపకమున్నది.

తదంగసంగమైన వెనుక నతండెవ్వడో నేనెవ్వతెనో యారతియెట్టిదో యేమిచేసెనో యించుకయు నెఱుంగ. నీతో నేమని వక్కాణింతునని తత్సమయోచితములైన మాటలచే నాకు సంతోషము గలుగజేసినది. అట్టి సంతోషముతో మేము మురియుచుండ నాయోడ పదిదివసంబులకు సింహళద్వీపపు రేవునకుబోయినది. ఆకాలము మాకొక గడియలాగున వెళ్ళినది.

ఓడ రేవుచేరినతోడనే యందు వేచియున్న రాచకింకరులు పెక్కండ్రువచ్చి యందున్న వస్తువాహనము లన్నియు రాజగృహంబునకుజేర్చిరి. పిమ్మట మమ్మా రాజకుమారుడు రహస్యముగా నొక యుద్యానవన సౌధములోనికిం దీసికొనిపోయి యుంచెను.

కొన్నిదినములందు మేము సుఖముగా కాలము గడిపితిమి. మకరందుడు ప్రతి దినము వచ్చి యభీష్టవినోదములతో గొంతసేపు సంతోషమనుభవించి యరుగుచుండువాడు అతండు యువరాజగుటచే మారాక నేరికి దెలియకుండునట్లు గూఢచారుల నియమించెను. ఆతండంతకుమున్ను పెండ్లి యాడిన భార్య పేరు రోలంబయట. ఆ ద్వీపమున దఱుచు గాంతలకు భ్రమరనామంబులు బెట్టుచుందురు. మకరందునికి రోలంబయందుగల కూర్మి గ్రమంబున గొరతవడజొచ్చెను నూతనాభిలాష బలమైనది గదా?

ఒకనాడు సాయంకాలమున నతండు బండిమీద మా యుద్యానవనంబునకు వచ్చుచుండ నతనిబండి వెంబడిని యొక చేటికవచ్చి యచ్చటచ్చట నిలువబడుచు మా యుద్యానవనము గుఱుతుచూచుకొని యేగినది. సౌధోపరిభాగమునుండియే నది జూచినది. ఆ వృత్తాంత మారాజపుత్రునితో జెప్పవలయునని తలంచియు నంతలో మరియొకగోష్టి వచ్చుటచే మరచితిని.

మఱునాడుదయంబున మాయింట బనిచేయుచున్న దాది యొకతెవచ్చి "అమ్మా! ఈ దేశమున నెఱుకలసానులు ఎఱుక చక్కగా జెప్పుదురు. అట్టిసాని యొకతె యిప్పుడు మనవీథిలోనుండి మీ కెఱుక కావలయునా! అని అడుగుచున్నది. అడిగి వత్తునని వచ్చితిని. ఏమనియెదరని పలికిన విని నేను మారాజపుత్రిక కప్పటికి నెలదప్పెననియనుమానముగా నున్నందున నావిషయము దెలిసికొను తలంపుతో చప్పున రప్పింపుమని చెప్పిన నదివోయి నిముషములో దీసికొనివచ్చినది. దానితో మఱియొక చిన్నదిగూడ వచ్చినది. అది దానిపుత్రికయట. వాండ్రనొకగదిలోనుండ నియమించి నేను మా రాజపుత్రిక యొద్దకుబోయి యా సంగతి జెప్పిన నమ్ముద్దియ పోపొమ్ము యెక్కడిదానవు మూడుదినములయినదో లేదో వెఱ్ఱితలంపులం బెట్టిదంబులు చాలులేయని యాక్షేపింప లక్ష్యముసేయక చేయిపట్టుకొని లాగికొనిపోయి యయ్యెఱుకసానిముందు గూర్చుండబెట్టి పొగ వేయించితిని అది యాధూమ మాఘ్రాణించినతోడనే పూసగ్రుచ్చినట్లుగా మా హృదయాభిలాష వాక్రుచ్చినది.

మా రాజపుత్రి గర్భవతియగుట నిజమనివిని మిక్కిలి సంతసించుచు నేను దాని కమూల్యాభరణంబు లొసంగ మేడపయి కేగితిని. అట్టిసమయంబున చిన్ని యెఱుకత తల్లితో అమ్మా! రోలంబసాని మనలంజూచి రమ్మన్న తానిదియేనా? అని యడుగగా మాటలాడకుమని తల్లి పలికినదట వారాడికొనిన భాష కల్పవల్లి చదివి యున్నది. గావున వాండ్రు కానుకలందివోయిన వెనుక నావిషయము నాతో ముచ్చటించినది.

అప్పుడు నేను వెనుకటి దినంబున జరిగిన కధ జెప్పి యిది రోలంబచేసిన కైతవముగా వచ్చునని పరితపించుచున్న సమయంబున మకరందుడు వచ్చుటయు నతనికా వృత్తాంతమంతయు జెప్పితిని. నా మాటవిని యతడు తలగంపిచుచు నగు నగు నమ్మగువ మీరాక వినియున్నదని తలంచెద. నన్ను జురచురం జూచుచున్నది. కానిండు? దీన మీ కేమిగొదవ. ఊరినుండివచ్చి యంతయు సవరించెద. అంతదనుక సైరించి యుండుడని పలికిన నులికిపడి కల్పవల్లి యిట్లనియె.

అయ్యో? మీ రెక్కడికేగెదరు? మీతోడన మమ్ము దీసికొనిపొండు. మీరులేక మేమిందుండువారమా! యని పలికిన నతడు సుందరీ! గుశద్వీపంబున కొందరు రాజులు కలహించి చివరకు సంధిజేసికొని యిరుతెగలవారును మా తండ్రి చెప్పిన చొప్పున వినునట్లొడంబడికలు వ్రాసికొనిరట. ఆ తగవుతీర్చుటకయి మా తండ్రి నన్ను గూడ రమ్మనుచున్నవాడు. పోవకతీరదు. ఆతండుండ మీ రెటులవత్తురు? వేగమేవత్తు. నాలుగుదినంబుల నెటులో గడుపుడని సాంతనపూర్వకముగా బలికి మమ్మొప్పించి యతఁడరిగెను.

మకరందుడరిగిన కొన్ని దినంబులకు సాయంకాలమున రోలంబ కొందరు బరిచారికల వెంటబెట్టుకొని మేమున్న యుద్యానవనంబునకు వచ్చినది. ఆమె రాకవిని నేను కల్పవల్లి నొకగదిలోనుంచి తాళమువయిచి యా దాపుననే పూలదండలు గుచ్చుచుంటిని. అంతలో నారోలంబ యా వనవిశేషములు జూచుదానివలె తిరిగితిరిగి మా యొద్దకువచ్చి యిందులో నెవ్వరుండిరని యడిగినది. అప్పుడు నేనులేచి యెదుర నిలువంబడి నమస్కరించితిని. మా ఇరువురకు నిట్లు సంవాదము జరిగినది.

రోలం - ఎవతెవు? ఏయూరు?

నేను - మాది జంబూద్వీపముననున్న కాశీపట్టణము. నేనొక వర్తకురాలను నా పేరు నాగమణి యందురు.

రోలం -- ఈదేశ మేమిటికి వచ్చితివి?

నేను - వర్తకము నిమిత్తము -

రోలం -- ఏమివర్తకము చేయుదువు?

నేను - రత్నముల వర్తకము చేయుదును. మా వారందరు సరకులం దీసికొని గ్రామముల మీదకు బోయిరి.

రోలం - ఎప్పుడు వత్తురు?

నేను - అది నాకుతెలియదు సరకులమ్మినవెంటనే వత్తురు.

రోలం - ఈ సౌధములో నెవ్వరి యానతిం బ్రవేశించితిరి?

నేను - ఈ సౌధమెవ్వరిదో వారియనుజ్ఞనే కై కొంటిమి.

రోలం - నీవు తిరస్కారభావముగా నుత్తరమిచుచ్చుంటివి. నేనెవ్వతెనో యెఱుంగుదువా! నీ యాజ్ఞాపత్రిక యేది?

నేను - మీకట్లు తోచినదికాని నా మాటయందదిలేదు. ఆజ్ఞాపత్రిక మావారియొద్ద నున్నది.

రోలం - కానిమ్ము. ఈ గదిలో నేమియున్నదో చూడవలయును. బీగము దీయింపుము.

నేను - ఇందు సరకులువైచికొని మావారు కొందఱు తాళము బిగించి యెచ్చటికో పోయిరి కావున బీగము దీయుటకు నాకు స్వతంత్రము చాలదు.

రోలం - నీకు స్వతంత్రము లేదుగాని నాకు గలిగియున్నది చూడుము అని పలుకుచు నెద్దియో యూదినది. అప్పుడు పెక్కండ్రు ఆయుధంబులం ధరించియచ్చటికి వచ్చిరి. వారింజూచి నాకు కంపము జనించినది. వారిచే నా బీగము పగుల వేయించి తలుపులు తీయించి లోనికింబోయి యందున్న కల్పవల్లింజూచి నన్నుం జీరి యా చేడియ యహంకారముతో నిట్లనియె.

ఏమే! బొంకులాడి. ఇందు సరకులున్నవని నాతో చెప్పితివే? ఈ వగలాడి యెవతె? మీ వార్త యెరుంగక వచ్చితిననుకొంటివా? ఇక మీపాట్లు చూచుకొనుడని పలుకుచు మేమెన్నియో తెరంగుల వేడికొనుచుండ మా మాటలు లెక్క సేయక యప్పుడే మా పాదములకు సంకెళ్ళలు వైపించి మమ్ముందీసికొనిపోయి చెరియొక చెఱసాలలో నుంపించినది.

అప్పటి మా దుఃఖమేమని వర్ణింతును. ఒకరినొక రోదార్చుటకైన వశమైనదిగాదు. గర్భవతియైన యారాజపుత్రిక యంతఃపురములలో పెక్కండ్రు పరిచారిక లూడిగములుసేయ మురిపెముగా బంధువుల విందులారగింపవలసిన దానికి బదులు చెఱసాలయుదు రాతినేలంబండుచు నంబలిగూడు దినవలసివచ్చె. ఆహా! దైవనిర్ణయము బెట్టిదో చూడుడు.

మఱికొన్ని మాసము లరిగిన వెనుక నా రోలంబ చెరసాలలోనుండి మమ్ము దన యొద్దకు రప్పించుకొని వెందులారా? మీరు మీ దేశమునకుబోవ తలంపు గలిగియున్న యడల జెప్పుడు. ఇప్పుడే ప్రత్యేకముగా నోడ నెక్కించి యంపించెదను. కానిచో వేరొక చెరసాలం బెట్టించవలయునని యడిగిన విని మేము విననందున జూడ నించుకయు దెలియక గుందుచు నిరాశచేసికొని పోయెదము, వేగముగా బంపుమని యామెను బ్రార్థించితిమి.

అంతకుమున్ను సన్నాహము చేసియుండిన యోడలోని కప్పుడే గూఢముగా పంపినది. మేమా ఓడ నెక్కినతోడనే నావికులు తెరచాపనెత్తి ఓడను వదలి నడిపింప దొడంగిరి. మేము పెద్దతడ వరుగువరకు రోలంబ తీరమున నిలువంబడి చూచుచునే యున్నది. అప్పుడు గాలి వినిమయముగా నుండుటచే నా యోడ జంబూద్వీపమునకు రావలసినదానికి మారుగా నిర్మానుష్యంబైన మరియెక దీవికింగొట్టుకొని పోయినది. ఓడవాండ్రు మమ్మందు దింపి మంచిగాలి తిరుగువరకు నిందుండవలయునని మాతో జెప్పిరి. భోజనపదార్దములు సమృద్ధిగా మాయొద్దనుండుటచే నందు సుఖముగా గొన్నిదినంబులు గడిపితిమి.

ఇంతలో నొకనాడు కల్పవల్లికి బ్రసవవేదన యావిర్బవించుటయు నేను మిక్కిలి భయపడుచు దైవమును పార్థింపుచుండ నా చేడియ శుభలగ్నమందు నొక కూతుంగనియెను. నేనప్పడతి కప్పటికి దగిన రీతిగా గొదవరానీయక పురుడుపోసితిని రత్నకళికవలె నాబాలిక మెరయుచు మామకహృదయ శోకాంధకార మించుక విరియజేసినది నావికులును కొంచముకాలములో మంచిగాలి వీచునని మమ్ము నోదార్చుచుండిరి.

అంతలో మఱియొక యోడ మా యోడవలెనే యా దీవికిం గొట్టుకొని వచ్చినది విధిఘటిత మక్కజమైనదిగదా? అందెవ్వరుందురో యని యరచుచుండ నందుండి మకరందుండు తీరమునకు వచ్చెను. మేమతనిం జూచి విస్మయశోకంబులు మనంబు నుత్తలపెట్ట నతనిపై బడి యేడ్చితిమి. అతండు మమ్ము నోదార్చుచు మా వృత్తాంత మాద్యంతము విని దుఃఖింపుచు నిట్లనియె.

కాంతలారా? నేను మీచెంతనే స్వాంతము నిడికొని ద్వీపాంతరమునకుం బోయి కొన్నిదినంబులకు నింటికివచ్చి మిమ్మా ఉద్యానవనంబునంగానక యందున్న వారిని మీ వృత్తాంతమడిగితిని. ఆ దుష్టురాలు వారికిం జెప్పియుంచినది కాబోలు? వాండ్రు నాతో గొన్నిదినములక్రిందట జంబూద్వీపమునుండి యొక యోడ వచ్చినదనియు నందులోనున్న తమ పరిచితులం గలిసికొని యా చేడియ లాయోడ యెక్కి, యాద్వీపమునకు బోయిరనియు జెప్పిరి.

అప్పుడు నేను బెక్కుతెరగుల నంతరంగంబునందలపోయుచు నేమియుంతోచక బెక్కండ్ర నడిగితిని. అందరు నొక్కరీతినే నుడుపుటచే నిక్కువమనికొని విరక్తి దోప గతమును దలచికొనుచు నాలుగుదినంబులునుండి వెండియు మా తండ్రియొద్దకు బోయితిని. కుశద్వీపమునకు బోయిన కార్యము దీరకున్నను మిమ్ము జూచు దలంపుతో వేఱొకపని గల్పించుకొని వచ్చితిని. కావున వెంటనే పోవలసివచ్చినది అందు రెండునెలలుండి వెండియు మా వీటికి వచ్చితిని. అప్పుడు మరల మా విష యమై విమర్శింప నాగూఢచారుల కెద్దియో కలహమువచ్చి యొండొరులపై నేరములు మోపుచు తుదకు జరిగిన వృత్తాంతమంతయు నాతోజెప్పిరి

అప్పుడు నేను మిక్కిలి పరితపించుచు నెవ్వరికింజెప్పక యాక్షణమునందే యోడ సన్నాహము చేయించుకొని బయలువెడలి వచ్చితిని. దైవకృపచే గాలిత్రోపు నన్నీదీవికే తీసికొనివచ్చినది. మిమ్మిందు బొడగాంచితిని. నాకతంబున మీరు దారుణదుఃఖంబు లనుభవించితిరి. యేమిచేయుదును? గతంబునకు వగచినం బ్రయోజనము లేదుగదా యిప్పుడు మాదీవికిం బోవుదమురండు. మీయెదుటనే రోలంబకు సంకిళులు వైచి చెఱసాలం బెట్టించెద కల్పవల్లిం బెండ్లియాడితినని నా తండ్రికిజెప్పి పట్టమహిషిగా జేసికొనెదను అని యెన్నియో మాటలు చెప్పి మాహృదయపరితాపము వాయజేసెను. అత డమ్మఱునాడే నావికులింకను మంచిగాలి విసరుటలేదని చెప్పినను వినక యక్కలముల రెంటిని జాపలెత్తించి పయనము సాగింపజేసెను. గాలి ననుసరించి యోడలు నడుచుచుండుటజేసి యతివేగముగా బోయిబోయి నాలుగు దినములలో మేమెక్కినయోడ జంబూద్వీపమును సమీపించెను. ఇఁక గడియలో రేవు చేరుదుమని తలంచుకొనుచున్న సమయములో నొకసుడిగాలి వచ్చి మా ఓడను గిరగిరద్రిప్పి నీటిలో ముంచివేసినది.

ఆయోడ మునుగువరకు నేను కల్పవల్లి గనిన శిశువును జంకనిడికొని యుంటిని. నీటిలో బడినతోడనే నేనాశిశువును వదలక దైవగతిచే జేతికి దొరకినబల్ల నూతగాబూని మునుంగక బైకిదేలి మునుపటి యలవాటుచొప్పున బిడ్డను మునుంగ కుండ బట్టుకొని నాశక్తి కొలంది నీదుచుంటిని. ఆయలల రాయడిచే పై కెగసినప్పుడు తీరముదాపున నున్నటులే కనంబడినది. అడుగంటినప్పుడు నూతిలో నుండునటులే తోచునది.

అట్టిసమయమున నేను జీవితాశవదలి దైవమును ప్రార్థింపుచుంటిని. ఇంతలో నొకచిన్నయోడ దైవికముగా మాయొద్దకు వచ్చినది. అందొకయువతియు బురుషుడును కూర్చునియుండిరి ఆ దయాళుండు నన్ను జూచి నావ నిలిపి మెల్లన మమ్ము దానిలోని కెక్కించుకొని తీరమునకుం దీసికొనిపోయెను. అందు నేను సేదదీర్చుకొని నీటితాకుడున జెక్కుచెదరక మెరయుచున్న యాబాలిక యాయువునకు వెరగుపడుచు వారడుగ నావృత్తాంతమంతయు సమయోచితముగాజెప్పి నా మిత్రుల గురించి విచారించుచుండ నాపుణ్యాత్ముం డోదార్చుచు నా కిట్లనియె.

బోటీ! మాది కాశీపట్టణము. నా పేరు విష్ణుశర్మ నేను బ్రాహ్మణుడ. నాకు మడిమాన్యము లేన్నియేని కలవు. ఈబాలికను మాకిమ్ము మేము ప్రాణప్రదముగా బెంచుకొనెదము. నీవును మాయొద్దనుండవచ్చును. ఏ కొదవయు నుండదని పలికిన విని నేనించుక ధ్యానించి పరమనిర్భాగ్యురాల నాకీశిశువేలనని యప్పుడే కన్నీరు విడుచుచు నాపసికూనను వారిచేతులలో నుంచితిని. అమ్మఱునాడే యా బ్రాహ్మణుడు ఆశిశువును దీసికొని స్వగ్రామమునకు బోయెను.

తరువాత నేనాస వదలక యాదంపతుల జాడదెలియ సముద్రప్రాంతపట్టణంబు లరయుచు దిరుగుచుంటిని. నాగ్రహచారదినంబు లెంత క్రూరమయినవో చూడుడు. ఒకనాడు వారి వృత్తాంతము విమర్శింప కలిఘాతానగరంబునకు బోయితిని. నవరత్నస్థాపితమగు రాజపుత్రి కంఠాభరణమొండు నామెడలో నున్న యది. దారిభత్యమునకై నేనా భూషణము నాయూరి యంగడిలో నమ్మజూపితిని. రాజభటు లదిచూచి యింత విలువగల నగ నీకెటులవచ్చినదని యడిగిరి. నేను నిజముచెప్పిన బ్రమాదమని యెద్దియో బొంకితిని నామాటవలన నారాజభటులనుమానము చెంది యా వస్తువుతో గూడ నన్నా రాజస్థానమునకు గొనిపోయిరి

ఆభూపతి యామండనము తనపుత్రిక ధరించునదిగా గురుతుపట్టి నీకిది యెట్లువచ్చినదని నన్నడిగెను. నిజముచెప్పిన రాజపుత్రి దుశ్చారిత్రము లోకులకు వెల్లడియగుటయేకాక మఱేమియు లాభములేదని తలచి ప్రాణవ్యయమునకు సమ్మతించి యతడెన్నివిధముల నడిగినను నిజముజెప్పక నిది నడచుచుండ మార్గములో దొరికినదని చెప్పితిని. నామాటలతడు నమ్మక మిక్కిలి కోపించుచు నాకప్పుడు యావజ్జీవము కఠినశిక్ష విధించెను. చావదెగించియున్న నాకతని డండన యేమి వెరపు గొల్పెడిది.

నేనాశిక్షకు మిక్కిలి సంతసించుచుండ నప్పుడే నన్ను రాజభటులు చెరసాలకు గొనిపోయి యందుంచిరి. నేను గారాగారక్లేశముల పదునాలుగువత్సరము లనుభవించితివి. అంత నొకనాడు రాజభటులు నాయొద్దకువచ్చి సంకెళుల విప్పి నన్ను సబహుమానముగా రాజుగారి యంతఃపురమునకు దీసికొనిపోయిరి. అందు నారాకకై యెదురుచూచుచున్న కల్పవల్లి నాకన్నులం బడినది. నాయవస్థజూచి యాచిన్నది గోలుననేడ్చుచు నన్ను బిగ్గరగా కౌగలించుకొనినది.

నేనును విస్మయశోక సంభ్రమములు మనంబునం బెనంగొన బెద్దతడవు పరవశనై వాపోయితిని. అప్పుడయ్యువతి నన్నోదార్చుచు సఖీ! నీవెట్లు బ్రతికితివి? నాకంకణాభరణము గురుతుబట్టి నిన్ను జెఱసాల బెట్టిరట. నిజమేమిటికి జెప్పితివి గావు. నిన్నందు బిట్టుగా నిర్భంధించిరిగాబోలును. కటకటా? ఏమిచేయుదునని విలపింప నూరడింపుచు మీరెట్లు బ్రతికితిరి ? ఇచ్చటికెట్లు పచ్చితిరి? నీ ప్రియుం డెందున్నవాడు? అని యడిగిన గల్పవల్లి యిట్లనియె.

ఇంతీ! ఆయోడ మునుగువఱకు మేమిరువురము నొక శయ్యయందు గూర్చుండి సంగీతము బాడుకొనుచుంటిమిగదా? అదిమునిగినతోడనే యాశయ్యయే మాకు దెప్పయై తెప్పున తేలినది. దాని యాదారమున సముద్రములో మునుంగక గాలివిసరున గొట్టికొనిపోవుచుంటిమి. శుభాశుభఫలంబులు దైవికములుగదా! అంతలో నొకయోడ మాయొద్దకు వచ్చుటయు నానావికులు మమ్ముజూచి తొందరజెందుచు వడిగా దానిలోని కెక్కించుకొనిరి. ఆఓడ విమర్శింపగా మనవెనుక రాజకుమారుడు వెళ్ళివచ్చినదైనది.

నావికులు మమ్ము గురుతుపట్టి మాయాపదకొరకు బరితపించుచు మిక్కిలి నైపుణ్యముగా బదిదినములకు సింహళద్వీపమునకు జేర్చిరి. అతనిరాకకై వేచిఉన్న సింహకేతుడు కుమారుని వృత్తాంతమంతయువిని మిక్కిలి శోకించుచు నప్పుడే మకరందుని బట్టాభిషిక్తుని జేసెను. అతండు రోలంబ కావించిన ఘోరకృత్యము లన్నియు దండ్రికెఱింగించి నన్ను బట్టమహిషిగా స్వీకరించి రోలంబను జెరసాలం బెట్టింప నియమించిన నేను గరుణించి విడిపించితిని. నేను మహారాజభోగము లందుచున్నను నీవు లేకపోతివనియు, నీవున్న దీనికెంత సంతసింతువో యనియు రేయిం బవలు చింతించుచునే యుంటిని.

కొన్ని సంవత్సరములు గడచినంత నాకు నా తల్లిదండ్రులజూడ వేడుకపుట్టి కోరిన సుహృదయుండై న నాదయితుండు నామాట మన్నించి చతురంగసేనలతో బెక్కుయోడలం గట్టించుకొని యప్పుడే పయనమయ్యెను. మొన్నటిదినంబున కీపట్టణంబు జేరితిమి మా సన్నాహమంతయుజూచి నా తండ్రి శత్రుసైన్య మనుకొని వెరచుచు నప్పుడే సంధికి రాయబారము నంపెను.

అప్పుడు మేము శత్రువులము కాము. మీ కాప్తులము, మిమ్ము జూడవచ్చితిమి. వెఱవవలదని ప్రత్యుత్తరమువ్రాయ నతండప్పుడే సంతసించుచు కానుకలంగొని మా యొద్దకు వచ్చెను. మే మతనికి నమస్కరించి యెదురనిలువంబడియుండ నేమియుం బలుకక యూరక చూచుచున్న నవ్వుచు మకరందుడు ఆర్యా! ఈ జవ్వనియెవ్వతియో! యెఱుంగుదువా యని అడిగెను. అంతలో నేను సై పక హా! తండ్రీ నన్ను మరచితివా అని పై బడి విలపించితిని.

అతండు నన్ను గురుతుపట్టి యెత్తుచు నూరడించి మమ్ము గోటలోనికి దీసికొనిపోయి మా వృత్తాంతమంతయు నా తల్లికి జెప్పెను. ఈరెండుదినంబులు గడచిన వృత్తాంతమంతములం జెప్పికొనుచు గడియలాగున వెళ్ళించితిమి. నేటి యుదయంబున నెద్దియో ప్రసంగముమీద నీ కంఠాభరణ మొక యాడుది తీసికొనివచ్చి యీ యూరిలో నమ్మ జూపినదట. దాని కెటులవచ్చినదో చెప్పినదికాదని మా తల్లి నాకు జెప్పినది.

ఆ మాటవిని నేనదరిపడుచు నా యాడుదానవు నీవేయగుదువని నిశ్చయించి యప్పుడే నిన్ను దీసికొనిరా దూతలం బుచ్చితిని. దైవానుగ్రహంబున మనమందరము బ్రతికి యొకచోట గూడితిమి. ఈ దినంబెంత సుప్రభాతంబని సంతసించుచున్న సమయంబున మకరందు డచ్చటికివచ్చి నన్ను జూచి మిక్కిలి యబ్బురం బందుచు నా వృత్తాంత మడుగుటయు వారిరువురకు నోడ మునిగినది మొదలు నాటి వరకు జరిగిన విశేషముల నన్నియుం జెప్పితిని.

నా మాటలు విని వారు తమ పుత్రికంగూర్చి చింతింపుచు నప్పాపం జూడ నప్పుడే కాశీకిఁ బోవ బయనమైన వారించుచు నే నిట్లంటిని. మీ రిట్లు పెద్దసన్నాహముతోబోయి యడిగిన నబ్బాలిక వృత్తాంత మెవ్వరును జెప్పరు. ఇప్పటికి బదియాఱే డుల ప్రాయము గలిగియుండును. నేనుబోయి రహస్యముగా విమర్శించి మీకు వార్తనంపెద నంతదనుక నిందుండుడు. మా మంత్రిపుత్రికయు నా ప్రాంతమందే యుండవలయు నిరువుర చరిత్రముల నరసివచ్చెద నన్నంపుడని పలికిన నందఱు సమ్మతించి యప్పుడే నన్ను బయనముచేసిరి. నేను జాలినంత విత్తముగై కొని సుముహూర్తంబున బయలువెడలి గంగానదీ కూలంబున నున్న పట్టణంబు లన్నియు జూచుచు గొన్నిదినంబులకొక పట్టణము చేరితిని.

నేను గంగానదిలో గొట్టుకొనిపోవునప్పుడు పల్లెవాడు శిశువుం దీసికొనిపోయి గట్టెక్కిన గ్రామములో దీరముననున్న వృక్షములలో గొన్నిటి గురుతుపట్టుకొని యుంటిని గావున నా నీటిరేవులో నట్టి మ్రాకులంగాంచి యాపురిలో గొన్ని దినంబులు నివసించితిని. మఱియు గంగానదిలో నీదెడు పల్లెవాండ్ర యిళ్ళకుంబోయి క్రమంబున వాండ్రతో మైత్రి సంపాదించి ఆడువాండ్రకు బారితోషికములిచ్చి కొన్ని యేండ్లక్రిందట గంగలో గొట్టుకొనివచ్చిన పిల్లను దీసిన పల్లెవాడెవ్వడని యడుగ జొచ్చితిని.

అడుగ నడుగ ముసలిది నే యిచ్చిన పారితోషికమునకు సంతసించుచు మెల్లననాతో నమ్మా! నీవడిగిన రహస్యము నాకుగాక మఱియెవ్వరికి దెలియదు. నీవడిగిన నాకు జ్ఞాపకము వచ్చినది. నా కుమారుడొకనాడు గంగలో గట్టెలకై నీదుచుండ నొకయాడుది శిశువుతో గొట్టుకొని పోవుచుండ జూచి బాలికను మాత్రము తెప్పపై నెక్కించుకొని వచ్చి యా కథ నాకు జెప్పుచు నా శిశువును జూపెను.

బంగారు కణికవలె మెఱయుచున్న యా బాలికంజూచి నేను విస్మయమందుచు అన్నా! ఈ చిన్నది సిరిగలవారి పుత్రికయని తోచుచున్నది మనము దీనిబెంపజాలము. మన పొరుగుననున్న మనోరంజనికి సంతానములేదు కావున మనకు దగిన సొమ్మిచ్చెనేని దానికిత్త మడిగిరమ్మని చెప్పితిని. వాడుబోయి దానికాకథ యంతయు జెప్ప ముప్పిరిగొను సంతసముతో నప్పడతి తెప్పున మా యింటికివచ్చి ముచ్చట పడుచు నచ్చేఱుతకూనం జూచి ముద్దిడుకొనుచు నప్పుడే తన యింటికి దీసికొని పోయినది.

మేము కోరినంత ధనమిచ్చి యీ రహస్యమెవ్వరికిం జెప్పవద్దని మాచే బ్రమాణికము చేయించుకొనినది. కొన్నియేండ్లకు నా కుమారుడు నీటిగండంబువలననే మడిసెను ఆనాథనై నేనిట్లున్నదాననని కన్నీరు విడువజొచ్చినది. అప్పుడు నేను మిక్కిలి సంతసించుచు నోసీ! ఆ చిన్నది యిప్పటికి బెద్దదికావలయునే యెందున్నదియో అని అడిగిన నది అబ్బో! అబ్బాలికామణి మిక్కిలి విఖ్యాతి బొందినది. మనోరంజని దానికి మందారవల్లియని పేరుబెట్టి చాలయేడులు వచ్చుదనుక నెవ్వరికిం జూపక మిక్కిలి గారవముగా బెనుచుచు మేలిచీరలు బంగారుదొడుగులు దొడిగి సంగీతము సాహిత్యము లోనగు విద్యలన్నియుం జెప్పుటకుదగిన గురువుల నియమించినది. ఆ చిన్నదానిబుద్ది మిక్కిలి సూక్ష్మమయినదనియు గురువులకే తప్పులు దిద్దుననియు నెల్లరుం జెప్పుకొనువారు. ఇందుగల విద్వాంసులు చదువు చెప్పుటకు చాలకున్నంత నా కాంతామణిని కాశీపట్టణమున కంపినది. అందా యిందువదన పెక్కువిద్యల సంపాదించి చక్రవర్తులకు సైతము దర్శనమీయక యొప్పుచున్నదని వాడుక యున్నది. ఆ మనోరంజనియు నాలుగేండ్లక్రింద కాలధర్మము నొందినది. ఆ కనంబడునదే దానిమేడ ఇప్పుడు పాడుపడినదని యాకథయంతయు జెప్పినది.

అప్పుడు నేను తద్దయుం జెలంగుచు నందువెడలి మఱి రెండు దినంబులకు గాశీపట్టణంబు ప్రవేశించి యందు మందారవల్లి వృత్తాంతంబు విమర్శింప నది బదియారేడులు వచ్చుదనుక గాశీలో విద్యాభ్యాసముజేసి సకలవిద్యలందును నసమానపాండిత్యము సంపాదించి పెక్కండ్రు శిష్యురాండ్ర వెంటబెట్టుకొని దేశాటనము చేయుచున్నదని తెలియవచ్చినది.

తరువాత నేను విష్ణుశర్మను గుఱించి వితర్కించుచు నతడెఱింగించిన గురుతుల నడిగి తెలిసికొని యతని యింటికిం బోయితిని. అందొక బ్రాహ్మణుండు గనంబడిన నమస్కరింపుచు నయ్యా! విష్ణుశర్మయను బ్రాహ్మణుని యిల్లి దియేనా? ఆయన యింటిలోనుండిరాయని యడిగిన నవ్వుచు నిటనియె.

బోటీ! ఇది యాయనయిల్లేయగుంగాని యాయన స్వర్గస్తుడై పదియేండ్లుదాటినది. అతనికి భార్యాపుత్రులులేరు. మేము దాయాదుల మగుటచే నీయిల్లు మాస్వాధీనమైనదని చెప్పెను. అప్పుడు నేను చింతించుచు నయ్యో! పాపమాయన భార్యయుం బోయినదా? కటకటా? ఎంత కష్టము? కొన్ని యేండ్ల క్రిందట నా దంపతులు హేలాపురినుండి యొక బాలికం చేసికొని వచ్చిరి. ఆ చిన్నది యేమైనదోయని యడుగగా నతండిట్లనియె.

ఓహో! నీవెవ్వతెవు? వారి యాంతరంగిక వృత్తాంత మడుగుచుంటివి హేలాపురినుండి వచ్చినది తన భార్యయని విష్ణుశర్మ నీతో జెప్పెను గాబోలును? కాదు. అదియొక వారకాంత దానిపేరు మంజుభాషిణి, విష్ణుశర్మ కెప్పుడును భార్య లేదు. చిన్నతనములోనే భార్యపోయినది? తిరుగ వివాహము చేసికొనలేదు. ఆ మంజుభాషిణినే భార్యగా జూచుకొని తన సొత్తంతయు దదాయత్తము గావించెను. ఎఱుగని వారా మంజుభాషిణినే భార్యయని తలచుసట్లు సంచరించువాడు.

అతండు పోయినవెనుక మంజుభాషిణి యతని దినవారకృత్యములకై యీ యిల్లు మాకిచ్చినది. దానంజేసి మేమిందుంటిమి హేలాపురినుండి దీసికొనివచ్చిన చిన్నది చక్కగానున్నది దానికి మంజుభాషిణి ప్రియంవదయని పేరుబెట్టి విద్యాబుద్దులం గఱపి పెద్దజేసినది. మహావిద్వాంసురాలని ప్రసిద్ధిబొందిన మందారవల్లికి ప్రఖ్యాతశిష్యురాలయి దానితో నిప్పుడు దేశాటనము చేయుచుండెనని వింటిని దానిం బెంచిన మంజుభాషిణియుం గాలధర్మము నొందినది. ఇదియే నేనెరింగిన కథ అని యతండు చెప్పిన సంతసించుచు నమస్కరించి నేనాయన యనుజ్జపుచ్చుకొని మఱియు విమర్శింప బ్రియంవద వృత్తాంతము నతండు చెప్పినట్లే చెప్పిరి.

పిమ్మట నేను వారిరువురిజాడ నరయుచు గొన్ని దినంబులు దేశాటనంబు జేసితిని. మందారవల్లి వాడుక జగంబంతయు వ్యాపించినది. కావున కృష్ణదేవరాయల యాస్థానకవీంద్రులతో బ్రసంగింప విజయనగరంబున కరిగెనను వార్తవని యచ్చటికి బోయితిని. అందు గపటోపాయమున నాయాస్థానకవీంద్రులు దానినోడించి వస్తువాహనములన్నియు లాగికొనగా దగవునకై ఢిల్లీ పట్టణంబునకు వచ్చినదని చెప్పిరి. ఆమాటవిని నేవెంటేని సంతసముతో వారింజూడ నిచటకు జనుదెంచితిని. ఇందు మీరు గాన్పించితిరి. ఇదియే జరిగిన వృత్తాంతము. భగవంతుని యనుగ్రహవిశేషమున నాచే బెంపబడిన బాలిక లిరువురు నొక్కచోటనే పెరిగి విద్యలలో ప్రౌఢలైరను వార్తవిని నేనపారసంతోషము జెందుచున్న దాన. వారిందువచ్చియే యుందురు. మీ బాంధవ్యము దెలియక యెందుండిరో అని కన్నుల నానందబాష్పముల వెడలించినది.

ఆ వృత్తాంతమంతయు విని సుప్రభ సంతోష వివశస్వాంతయై యొక్కింత సేపేమియుం బలుకక యంతలో చెప్పిరిల్లి నాగమణీ! నీవు చెప్పినకధ యంతయు నిక్కువమే. ఇది కలగాదుకద! ఏమేమీ వెండియుం జెప్పుము. కాశీలో వారు నీతో నేమని చెప్పిరి. జీవించియున్నదన్నమాట స్పష్టముగా వింటివా? అయ్యో? తాను క్షత్రియకన్యకయని యెఱుంగ వారకాంతవలె దేశాటనము చేయుచున్న దా? ఎంత పాపము? అని వెర్రిదానివలె నడిగినమాటయే యడుగుచు జెప్పినమాటయే చెప్పుచు వినినమాటయే వినుచు దద్దయు భ్రమింపదొడంగినది

అప్పుడు విజయవర్మయు నా వృత్తాంతమంతయుం వెండియుం దెల్లముగా దెలిసికొని అగునగు మందారవల్లి తగవును గురించి పత్రికలు రాయలవారి యాస్థానమునుండి మా సభకు వచ్చినవి. ఇంకను విమర్శింపలేదు. నీవూరక తొందరపడకుము. నేను పరిశీలించి రప్పించెదను. ఆ చిన్నది వారకాంత యనిపించుకొనినను శీలము గాపాడుకొనుచున్నది. యిది యొకటియే మనము మేలుగా నెంచుకొనదగి యున్నదని భార్య నూరడించి నాగమణిని మిక్కిలి గారవించెను.

అంతలో మంగమణి ప్రియంవదతో సఖీ! మనవృత్తాంతము సుప్రభతో జెప్పుట కెద్దియో యంతరాయము వచ్చుచున్నది. మంత్రిగారు వెళ్ళిరేమో చూచిరమ్ము. ఆమెయు దన యిడుమల మనతో జెప్పుకొన దొడంగినది. దుఃఖములు లేని వారులేరుగదా? ఏమందుము! పాపమామెకు మొదట జనించిన పుత్రిక గంగలో బడిపోయినది. తిరుగా సంతానములేదు. కావలసినంత సంపద యున్నది. ఏమి చేయును? దైవమెవ్వరిని సుఖముగా నుండనీయడుగదా? యని పలికినది. ప్రియంవదయు మెల్లన నాయంతఃపురమునకు బోయి తొంగిచూచి వచ్చి నెచ్చెలీ! మంత్రి గారింకను నచ్చటనేయున్నవారు. సుప్రభ ఏమివార్త వినినదో కన్నీరు నించుచున్నది. పెనిమిటి ఓదార్చుచున్నవాడు. విదేశవార్తలేమయిన దెలిసినవేమో మనము వచ్చినవేళ మంచిదే. మనకార్యము చెప్పుకొనుటకే సమయమయినదికాదు. ఇప్పు డెట్లు చెప్పుదుము. తొందరపడిన గార్యము చెడునుగదా యని వితర్కింపుచు మంత్రిగా రచ్చటనుండి వెళ్ళినతర్వాత మంగమణితోడ వెండియు సుప్రభయొద్దకు బోయినది.

అప్పుడు సుప్రభ తలవాల్చుకొని యెద్దియో ధ్యానింపుచుండ మంగమణి దాపునకుబోయి అమ్మా! ఇట్లు ఖిన్నురాలవయి యుంటివేమి? విదేశవార్త లేమయిన దెలియవచ్చెనా? యని యడిగిన నప్పడతి మెల్లన తలయెత్తి యిట్లనియెను.

బిడ్డలారా? ఇదివర కడుగంటియున్న నా దుఃఖము నీ నాగమణి వచ్చి బైట పెట్టినది. ఇందాక మీతో గంగలో బడినదని చెప్పిన నాగమణి యిదియె. గంగలో బడి కొట్టుకొనిపోయి యెక్కడనో గట్టెక్కి, సుఖదుఃఖము లనుభవించి వచ్చెనదట. నా పసికూనయు జీవించియున్నదని చెప్పుచున్నది. అని నాగమణి చెప్పిన వృత్తాంత మంతయు సుప్రభ మంగమణికి జెప్పినది.

ఆ కథ విని మంగమణి ప్రియంవద మొగము జూచుచు నామె మాటకేమియు నుత్తరమీయక చయ్యన నాప్రియంవదతో గూడ నవ్వలికింబోయి నివ్వెరపడుచు సఖీ! మన చరిత్రము లిట్లున్నవేమి ? ఇది కల్పితము కాదుగదా? కాదు నిక్కువమే? అన్నా! మనము క్షత్రియకన్యలమని తెలిసికొనక వారకాంతల మనుకొని కులమున కపఖ్యాతిదెచ్చితిని. అయ్యో! వీరు నా తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు కలిఘాతాపురిలో నుండిరట. మనల గురించి యీ నాగమణి యెన్ని యిడుమలం బడినదో చూచితివా! దాని ఋణ మెన్నటికిం దీర్చుకొనలేము ఇప్పుడు మన వృత్తాంతములను గురించి వీరేమి చెప్పుకొనియెదరో యరసి పిమ్మట మనలం జెప్పుదుముగాక? అయ్యారే! దైవసంఘటన మెంత చిత్రమయినది. మనము గావించిన కృత్యములలో నెందేని దూష్యకృత్యమున్నదేమో యరయుము. నాకేమియు జ్ఞాపకములేదు. అని వారు మాటలాడుకొనుచున్న సమయమున నచ్చటికి సుప్రభ వచ్చి బోటు లారా! అచ్చోటనుండక వచ్చితిరేమి? నాపుత్రిక చారిత్ర మశ్రావ్యముగా నున్నది కాబోలు. నేమిచేయుదును? అది యట్లుండనిమ్ము. మీరువచ్చిన కార్య మెద్దియో యెఱింగింపుడు. నాలుగుదినములనుండియు వినుటకే యవకాశము కుదిరినదికాదు. నేను జేయవలసిన పనియేమి? ఎట్టికార్యమయినను నా ప్రియునిం బ్రార్థించి చేయించెదనని యడిగిన విని మంగమణి యించుక నవ్వుచు నిట్లనియె.

తల్లీ ! నీ పుత్రిక మందారవల్లిని బ్రియంవదను నే నెఱుంగుదును. వారి చరిత్రలను వినియే యాశ్చర్యమును బొందుచున్నారము. వారును మేమును గొంత కాలము కలిసి దేశాటనము జేసితిమి. పెక్కులేల? వారే మేముగా సంచరించితిమి. తెలియమిచే వేశ్యలమని చెప్పుకొనిరి. గాని వారిని దృఢవ్రతశీలలని చెప్పవలయును. వారి విషయమై మీకెట్టి యభిప్రాయమున్నది. వారు వచ్చిన స్వీకరించి మన్నింతురా? యని యడిగిన సుప్రభ యిట్లనియె.

అయ్యో? ప్రాణప్రియులయిన నాముద్దుకూనల నెప్పుడు చూతునని యాతురము చెందుచున్నదాన. స్వీకరింతురా? యని పలుకుచుంటిరే? మీరెక్కడ జూచితిరి! నా పసికూన యేలాగుననున్నది? మామాట యెఱుంగదు కాబోలు. తన కథ యేమని చెప్పుచుండునది. తన్ను కన్నతల్లి మనోరంజని యనియే చెప్పుచుండునది. యా నిర్దయురాలైన యీ పాపాత్మురాలి నెఱుంగనని పలుకుచు బెద్ద యెలుంగున శోకింప దొడంగినది.

ఆమె శోకవృత్తిజూచి మంగమణి నిలువలేక హా! తల్లీ నేనే నీకీ శోకము గలుగజేసిన కష్టాత్మురాల. ఇదియే ప్రియంవదయని చెప్పుచు నామెం గౌగలించుకొని పరితపింప దొడంగినది. అప్పుడు సుప్రభయు నాగమణియు నంతఃపురకాంతలు నామాటలువిని విస్మయసాగరంబున మునుంగుచు మంగమణిని, బ్రియంవదను వితర్కపూర్యకముగా నాలింగనము చేసికొనుచు ముసుంగులు దీసి తదీయ రూపలావణ్యాది విశేషముల కచ్చెరువందుచుండ నావార్తవిని మంత్రియు నచ్చోటికి వచ్చి వారి వృత్తాంతమంతయును విని యపారసంతోషముతో గన్నుల నానంద బాష్పములు గ్రమ్మ గద్గదకంఠముతో వారిం గ్రుచ్చియెత్తి పెద్దతడవు తదాలాపవిశేషములతో గాలక్షేపము గావించెను

మఱికొంతసేపునకు మందారవల్లి తండ్రితో తండ్రీ! మాతగవు వృత్తాంత మంతయు నీవు వినియేయుందువు నన్ను రామలింగకవి లవిత్రయను పేరుతో వచ్చి కపటంబున జయించెను. శాపకారణంబున నెదురునిలిచి నేను వాదింపలేను. ఆ విషయ మతండెట్లో గ్రహించెనని తలంచెదను. ఇప్పుడు మేమేమి చేయదగినది వేశ్యలమనుకొని యిట్టివాదములకు బూనుకొంటిమి. మాయోటమి స్థిరపడెనేని పెక్కు చిక్కులురాగలవు. ఎట్లయిన గెలుచు నుపాయంబు జూడవలయునని తన ప్రసంగవృత్తాంతమంతయు జెప్పుటయు నతండు సంశయాకులహృదయుండై యప్పటి కేమియుం జెప్పక వారి నోదార్చుచు నూత్నభరణాదు లొసంగి యంతరంగగతవృత్తాంతప్రసంగముతో నాదివసము తృటిగా వెళ్ళించెను.

అమ్మఱునాడు సాయంకాలమున మంత్రి యంతఃపురమున గూర్చుండి పుత్రికల రప్పించుకొని యల్లన నిట్లనియె పట్టీ! ఈదివసంబున మోహనచంద్రుడు మీ తగవు విచారించెను. విజయనగరమునుండి తెనాలిరామలింగకవి వాదింపవచ్చెను. తన వాదమంతయు నధికారి నెఱుంగజేసెను. మీవిషయమై నేను పెద్దతడవు వాదించితిని. కాని చక్రవర్తి యభిప్రాయము వారిపక్షముగా నుస్నయది. నీవు స్త్రీలయెదుటకూడ నిలువవని చెప్పుట కవకాశమేమియు గనంబడదు. నీవాయూరిలో నితరస్త్రీలతో సంభాషించినట్లు సాక్ష్యమును జూపుచున్నవారు. తలపోయ మన వాదము మనకే సరిపడలేదు. శాపలోపము మనల బాధించునుగాని వారికేమి? నీ వృత్తాంతము రహస్యముగా బాదుషాగారికి జెప్పి యెల్లుండివరకు దగవు నిలుపజేసితిని. నీవోడినప్పుడు వాని బ్రోచెడుఱేని యానతిచొప్పున నడతునని వ్రాసితిని. దాని కర్ధమేమి? నీయభిప్రాయము చెప్పుము. గెలిచిన పండితుని బాలించెడువాని యాజ్ఞ వహింపనేల యని పాదుషాగా రాక్షేపించిరి దీనిలో నంతరమేమైనంగలదా? యని యడిగిన విని మందారవల్లి యిట్లనియె:

తండ్రీ! నేనేమి చెప్పుదును? అప్పటియూహ నిప్పుడేమి పనికివచ్చును? నే నెవ్వరికి నోడనసు విద్యాగర్వముచేత దరిద్రులైన విద్యాంసులవలన ధనమాకర్షించుట సరిపడదని దదాధారభూతులగు రాజులనే ముఖ్యులుగా నెంచితిని. అదియే విషమించినది. దీనికి సాధనము మీరే యోచింపవలయుననుటయు విజయవర్మ పోనీ, యమ్మహారాజు మిగుల బ్రఖ్యాతు డతనిం బెండ్లియాడెదవేని యేకొరంతయు నుండదు. దీనం దప్పేమియని యడిగిన నాకాంత యతనితో మార్గములో రామకవి పజ్జ పత్నీభావంబు వహించి గూర్చున్న వృత్తాంతమంతయుఁజెప్పి యతనిగాక వేఱొకని బెండ్లియాడుట సతీధర్మముకాదని చెప్పినది. ఆకథవిని యతండు మరియు వెరగందుచు నేమిచేయుటకుం దోచక మంచిచి ఱేపు విచారింతమని పలికి యంతటితో నాసభ చాలించి యాలోచన మందిరంబునకు బోయెను.

అమ్మరునాఁ డుదయకాలంబున సుప్రభ మంగమణింజీరి అమ్మా! నీ తండ్రికి మీ విషయమై రాత్రియంతయు నిద్రలేదు. పాదుషాగారు రేపటిదినము నీవోడినట్లు త్తర మిత్తురట. అప్పుడు కృష్ణదేవరాయలకు దాదివై యుండవలయును. అతండు మఱియేమి శంకించునో రామకవి సుభద్రుండు నెందున్న వారు? వారినెందు విడిచి వచ్చితిరి? వారినిరప్పింపవలయునని తలంచుచున్నారు. ఏదియుం దోచకున్నదట. కులప్రవృత్తి తెలియకపోవుటచే నిన్నిపాట్లు వచ్చినవి. అచ్చటినుండి వచ్చిన రామలింగకవిం బ్రార్ధించిన నెద్దియో నుపాయము చెప్పునని తలంచిరి. అతండేకదా యింతకును మూలమని పలుకుచున్న సమయంబున వీధినుండి నాగమణి వడిగావచ్చి అమ్మా ఇప్పుడు మనవీధిలోనుండి తెనాలి రామలింగకవియట పదుగురు బ్రాహ్మణులు చుట్టునుం బరివేష్టించి రాననగుచున్నాడు. దుష్టవర్మయను సామంతరాజునకు నద్బుతపురాణముచెప్పి పూర్వము మోసపుచ్చెనట. ఆతగ వీదినమున విచారించి మోహనచంద్రుడు రామలింగకవిని మిక్కిలి మెచ్చుకొనుచు నతనిపక్షమే తీరుపు జెప్పెనట ఆమాటలే చెప్పుకొనుచు బోవుచున్నారు. అతనిమెడలో బుష్పమాలికలు వైచి బ్రాహ్మణులెల్లరు స్తోత్రములు చేయుచున్నారు. ఎవ్వరో యెదురుపడిన నిలువంబడి మాటలాడుచున్నారు. మన వీధి మేడమీదికిబోయి చూచిన గనంబడుడు రని పలికినవిని యదరిపడుచు మంగమణియు బ్రియంవదయు సుప్రభయు నాగమణియు నామేడమీదికి బోయి గవాక్షకవాటములు తెరచుకొనిచూచిరి.

అప్పుడు మంగమణి మే నుప్పొంగ బ్రియంవదతో సఖీ! చూడుచూడు ఈతడు రామలింగకవివలె నున్నా డేమి అగు నిశ్చయమే. నడక గురుతుజెప్పుచున్నది సందియమేమి? అదిగో చూపుల చాతుర్యమతనిదే ఈమాటు తెలిసినదా? ఒడలు త్రిప్పుకొనుటవలన స్పష్టమైనది. ఆమాటల గాంభీర్య మింకొకరి కెట్లువచ్చును" అనుటయు బ్రియంవద తలయెత్తిచూచి "మదవతీ! నీమాట నిక్కువమే. అదిగో అవ్వలి ప్రక్కను సుభద్రుడు నడుచుచున్నాడు. నీవతని గుఱుతుపట్టలేదు కాబోలు నాగమణి యతనిని రామలింగకవియని చెప్పినదేమి? ప్రమాదముగా వినియుండవచ్చును. రామకవి యిచ్చటి కేమిటికై వచ్చెనో" యనిపలికిన మంగమణి పనియేలేదా? మనకొరకు రాగూడదా. అది యట్లుండె నాగమణి! నీవితని నెవ్వరిని వింటివని యడిగిన రామలింగకవి యని వింటినని చెప్పినది.

ఆమెయు మరలబోయి యతనిపేరు స్పష్టముగా దెలిసికొని రమ్మని దాని ననిపి ప్రియంవదా! నాకు మఱిరియొక యూహ పొడముచున్నయది అది నిక్కువమేని విస్మయమే. రామలింగకవియే రామకవియని చెప్పిమరల మోసపుచ్చెనని తలంచుచున్నదాన గానిచో నితరుల కాబుద్దిసూక్ష్మత యెక్కడిది వితర్కింప నాకిప్పటికి నిశ్చయమని తెల్లమైన"దని యా విషయము ముచ్చటింపుచున్న సమయంబున నాగమణివచ్చి యిట్లనియె.

పుత్రికలారా! నేనతండు రామలింగకవియేయని స్పష్టముగా జెప్పలేదా? మఱియొక వింతగూడ వినివచ్చితిని. నిన్నమీరు చెప్పిన యవ్వను మోసముచేసినవా డతండేనట. రాజసభలో నాయవ్వపొందెడు దుఃఖమునుజూచి మోహనచంద్రునితో నిజముచెప్ప యా సొమ్ము తానిత్తునని యొప్పుకొని యవ్వను విడిపించెనట ఆవార్త నప్పనివాని నడుగ జెప్పినాడు. మఱియు మీవాదముమాట రాగా రేపటిదినము నిరూపింతుమనిజెప్పెను. పెద్దతడవందుంటి నతండు తెనాలిరామలింగకవి యగుట నిశ్చయముగా వినివచ్చితినని చెప్పినది

ఆ మాటలువిని మందారవల్లి ప్రియంవదా మంచివార్త వింటిమి. మన చిక్కులు వదలినవి. బుద్ధిః కర్మానుసారిణి! యను నార్యోక్తి యెంతసత్యమైనదో చూచితివా? మొదటనుండియు రామలింగకవి పేరు వినినప్పుడెల్ల నాయుల్లమున నెద్దియో వింత సంతసము బొడమినది కానిమ్ము యావార్త నాతండ్రి కెఱింగించి వారి నీరాత్రి విందునకు బిలిపింతును. అప్పుడు వారితో బ్రసంగింపవచ్చునని చెప్పి యప్పుడే తండ్రియొద్దకుబోయి యావృత్తాంతము జెప్పినది.

విజయవర్మ రామలింగకవిని నమిత్రముగా విందునకు బిలిపించెను అందరు రాత్రిభోజనములు చేయుచుండ మందారవల్లియు బ్రియంవదయు వింతగా నలంకరించుకొని పట్టుచీరలు కట్టుకొని పంక్తుల వెంబడి దిరుగుచు గొసరికొసరి వడ్డింప దొడంగిరి. వారిచమత్కార వచనంబులువిని రామలింగకవి మిక్కిలి యక్కజము చెందజొచ్చెను.

మఱికొంతసేపునకు మందారవల్లి యొకమూల నిలువంబడి తండ్రీ! రామలింగకవిగారి ప్రఖ్యాతి వినుటయేకాని చూచియుండలేదు. నేడు సుదినముగా దలచెద నీయన మందారవల్లి నోడించెనని చెప్పితిరి. ఏవిద్యలో నోడించెను. లవిత్ర యోడించినదని యొక వాడుకగా నున్నది.ఆమె యెవ్వతె? ఈ కథవిన నౌత్సుక్యముగానున్నది. ఎఱిగింపవలదే యనుటయు విజయవర్మ రామలింగకవి మొగము చూచెను.

అప్పుడు రామలింగకవి యోహో! ఈ సుందరి మందారవల్లివలె నున్నదే? మంత్రిని దండ్రియని పిలుచుచున్నది. ఈ బాంధవ్య మెట్లు కలిసినది . ద్విజులకు వేశ్యలకు సంబంధము లుండునా? సర్వము విమర్శింప దప్పక మందారవల్లియని స్థిరపడుచున్నది. ఇది మిక్కిలి వింతగా నున్నదని తలంచుచు నేదియు నిశ్చయింపలేక యట్లే ధ్యానించుచు మంత్రిమాట కుత్తరము చెప్పడయ్యెను.

అప్పుడు సుభద్రుడు ఆర్యా! మందారవల్లిని జయించుటకు విద్యలదాక పోవ నక్కరలేదు. ఈతండు మాటలలోనే యాబోటిని నిరుత్తరం జేసెను. లవిత్రయన నీయనిశక్తియని తెలిసికొండని తత్సమయోచితముగా నుత్తరమిచ్చెను.

రామలింగకవి యామాట లేమియు మనమున బట్టింపక వారచూపులచే నా యువతింజూచి మోహవివశుండై మందారవల్లి యే యని నిశ్చయించి వితర్కింపుచు భోజనము సేయుట సయితము మఱచి యాలోచింపుచుండెను.

మందారవల్లి తదీయహృదయాభిలాష దెలిసికొని భోజనానంతరము నవరత్నాస్తరణంబునం గూర్చుండి యందరు తాంబూలములు వైచుకొనుచు నిష్టాలాపము లాడుకొనుచున్న సమయమున బదిరెండేడుల ప్రాయముగల యొకచిన్నదాని కొక పద్యము చెప్పి సంగీతము పాడించు నెపంబున వారియొద్ద జదివి రమ్మని యంపిన నబ్బాలికపోయి యాపద్యం బిట్లు చదివినది.

సీ. దాదిహస్తమున దద్దయు ముద్దుగను బెంప
            బడు రాజసుత పెనుజలధిబడుట!
    పడి మునుంగకయుండు ప్రాపున దఱిఁజేరి
            యట వారకామిని కమ్మఁబడుట!
    గణికయై కులవృత్తిఁ గొనక విద్యలనేర్చి
            దేశదేశంబులఁ దిరిగి తిరిగి!
    సిరిఁగోలుపోయి భూసురున కిల్లాలుగా
            మెలఁగి దానములందఁ గలిసికొనుట!
గీ. కొసకు దలిదండ్రులను గూడికొనుట యహహ!
    తలఁచిచూడంగ దైవతంత్రంబుగాదె.

అని వీణమీదబాడి యాబాలిక పైచరణములు రెండును చదువమఱచినది. ఆ పద్యమువిని రామలింగకవి తన హృదయంబునఁ గలికిన సందియమువాయ విస్మయము నొందుచు దచ్చారిత్రమంతయు దానివలన గ్రహించి "చిత్రమిది చిత్రమిది. సుచిత్రమిదియ" అని చదువగా వెంటనే సుభద్రుడు ఆపాదమే “చిత్రమిది చిత్రమిది కడుచిత్రమిదియ" అని తానును జదివెను తాను రచియించిన చరణములే వారు చదువుట విని తెరమాటుననున్న మందారవల్లి యుల్లంబు రంజిల్ల దదీయమతి ప్రౌఢిమకు సంతసించుచు నావిషయమే ప్రియంవదతో ముచ్చటింపుచు గాలవ్యవధి సైపక యప్పుడే తెరవెలువడి యొకపుష్పమాలికంగైకొని రామలింగకవి మెడలోవైచి నమస్కరించుచు ఆర్యా! పూర్వము భోజరాజు తన సమస్యను బూర్తిజేసినవారికి నక్షరలక్ష లిచ్చువాడట. నేనీమాలిక నర్పించితి నిది మదీయహృదయానుబంధముగా నెంచుకొనుడని పలికి యొకప్రక్క నిలువంబడినది. అంతలో బ్రియంవదయు నొకమాలికం గైకొని సుభద్రుని మెడలోవైచి యిది యంత్యచరణము బూర్తిజేసినందులకుగానుక యని పలికి యక్కవివెనుక నిలువంబడినది.

అప్పుడు రామలింగకవి మంత్రితో అనఘా! ఈ కలకంఠుల కంఠధ్వని విని నెక్కడనో పరిచయము గలిగినట్లున్నది. మంగమణియు బ్రియంవదయు ననువారు కదుగదా! వారు మాకు జేసిన మేలెన్నటికిని మరువదగినది కాదని పలికిన మందారవల్లి నవ్వుచు నిట్లనియె. అగునగు మీయెత్తిపొడుపుమాటల కర్థము కాకమానదు. వాండ్రు మాతో నంతయుజెప్పిరి. పేదపాఱులమని పేరులు మార్చుకొని దానము లందుటకై తమపజ్జల గూర్చుండబెట్టుకొని కపటదాంపత్యక్రియల నెఱపితిరట. ఎంతయుచితముగానున్నది. వారు మీరేనా? భళిభళీ! ఆయాడువాండ్ర నేమిచేసివచ్చితిరి అంతటితో మీ పేదరికము వాసినదిగద యని పలికిన విని సుభద్రుం డిట్లనియె యువతీ! యభిక్య గప్పినవారని యాక్షేపించుచుండ నేమనదగినది. పేదరికము వాయుట కంతముండునా? బిచ్చమెత్తువారు గ్రామమున కొక వేషమువైతురు. దానం బరిహసింపగూడదని పలికినవిని ప్రియంవద యెద్దియో యుత్తరమిచ్చినది. దానికి రామలింగకవి సమాధానము చెప్పెను ఆ మాటకు మందారవల్లి పూర్వపక్షము చూపెను. దానిని రామలింగకవి ఖండించెను. ఈరీతి యుక్తిప్రయుక్తులపయి వారికి బెద్దతడవు వాదముజరిగినది ఆ వాదములో రామలింగకవి మాటయే పై మిగిలి యుండెను. అప్పుడు విజయవర్మ మిక్కిలి సంతసించుచు రామలింగకవిని గౌరవించి మందారవల్లి వృత్తాంతమంతయు నా మూలచూడముగా వక్కాణించి యిది మదీయపుత్రిక, జాతిస్మృతిలేక పెక్కుచిక్కులంబడినది నిర్దుష్టరాలని నీవు యెఱుంగుదువు . దీని భార్యగా స్వీకరింపుము. బ్రాహ్మణులకు క్షత్రియకన్యకలం బరిగ్రహించుట యాచారమున్నదని వేడికొనియెను. రామలింగకవి యెద్దియో ధ్యానించిన ట్లభినయంచుచు నగుంగాని యాబోటి మొదట బత్రికలో వ్రాసినమాటలు జ్ఞాపకమున్నవియా? వాని కర్థమేమి యనిన నది యేమియు మాకు దెలియదు. నీవు నిగ్రహానుగ్రహసమర్థుడవు నీవు సమ్మతించినంజాలు పాదుషాగారిచే నారాజునకు వ్రాయించి మీ వివాహమునకు రప్పించెదనని చెప్పిన నెట్టకేల కొడబడెను అంతలో నాకాంత లిరువురు నేకాంతగృహంబునకుం బోయిరి

అమ్మఱునాడు విజయవర్మ మోహనచంద్రుని యొద్దకుంబోయి యాకథయం తయుం జెప్పి యాకార్యమునకు నాతనింగూడ నౌత్సుక్యము గలవానిగా జేసెను. వివాహముహూర్తము దాపుననే పెట్టించి సామంతరాజులకెల్ల శుభలేఖలు వ్రాయించి రప్పించెను. ఆ విజయవార్తవివి కృష్ణదేవరాయలు సంతోషపారావారవీచికలం దేలుచు అష్టదిగ్గజకవీంద్రులతో హితమంత్రిపరిజనసహితుండై యచ్చటికి వచ్చెను. తమకువ్రాసిన శుభలేఖలు చూచుకొని మితిలేని యానందముతో కలిఘాతాపురినుండి కల్పవల్లియు సునందయు మకరందుడు సింధువర్మ లోనగు బంధువులందరు సపరివారంగా వచ్చి మందారవల్లిని, బ్రియంవదను జూచి గాఢాలింగనము జేసికొనుచు బెద్దతడవు తత్కథాశ్రవణాసక్తచిత్తులై గడపిరి. అంత శుభముహూర్తంబున వారికి లోకాతీతమగు విభవముతో వివాహము జరిగినది.

అందు రామలింగకవిని గొన్నిదినంబు లుంచవలయునని యవన ప్రభుడు కృష్ణదేవరాయలవారిం గోరుటయు నుత్సవదినము లన్నియుంగడపి యారాజు పరివారముతోగూడ విజయపురికిబోయెను. రామలింగకవి చమత్కారకృత్యములన్నియు జూచుచు మోహనచంద్రుడు వార మొకగడియలాగున వెళ్ళించుచుండెను. ఆవింతల నొడువుట కిప్పుడు సమయముచాలదు. రాయలవారు చంద్రగిరికి బోవునపు డొకనా డీయూరిలో నివసించి యీ పద్య మొకశిలపై జెక్కించి యిందు స్థాపించిరి. ఇదేగాక యీ పద్యము పెక్కుచోట్ల వ్రాయించెను గోపా! నీవు జూచిన పద్యవృత్తాంత మిది యని చెప్పిన వాడు అయ్యవారూ! మంచికథ చెప్పితిరి. ఇంత సంతసమెప్పుడును గలిగియుండలేదు. వేళయింక చాలయున్నది గదా! రామలింగకవి ఢిల్లీపట్టణములో బెక్కువింతచర్యలం గావించెనని చెప్పితిరి ఇంతలో గొన్నిటి జెప్పుడు. మీ యడుగు లొత్తెదనని వేడిన మణిసిద్ధుడు ఓహో? కర్మము చాలక నోటినుండి వచ్చినందులకు బట్టికొంటివి. ఎప్పుడయిన ముందు జెప్పెదగాని యిప్పుడుగాదు. కొంచెము విశ్రాంతి వహింపవలయునని చెప్పి యాదివసంబు గడపి మఱునాడు తదనంతరనివాసప్రదేశంబు చేరెను.