Jump to content

కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/24వ మజిలీ

వికీసోర్స్ నుండి

అక్కలికి యూరకుండెను. వారందఱు నాదివసము పరమానందసాగరమగ్నులై, యననుభూత హృదయానురాగ సూచకమగు సంభాషణములచే దృటిగా వెళ్ళించిరి.

అంత మఱునాడు నాగదత్తుడు తండ్రి అనుమతిని రత్నావతిని సభకు రప్పించి అదిచేసిన క్రూరకృత్యములన్నియు బ్రజలవలన విని యుగ్గడించి యిట్లనియె. ఓసీ! రత్నావతీ! నీకు వైకుంఠము కావలసియున్నదికాదా? కందర్పుని చేత నైనదికాదు. నేనంపెదను చూడుమని పలుకుచు నప్పుడే నా పితల రప్పించి తండ్రి చేసిన ప్రతిజ్ఞాప్రకారము సిగగొరిగించి విరూపమును జేసి గాడిదపై నెక్కించి రత్నావతి వైకుంఠమునకు బోవుచున్నది. ప్రజలువచ్చి చూడుడోయని చాటించుచు వీధులన్నియు ద్రిప్పుడని తనకింకరుల కాజ్ఞాపించెను. దీనికి శిక్ష చక్కగానున్నదని యెల్లరు సంతసించిరి. రాజభటులు తదీయ శాసనప్రకారము రత్నావతి నారీతి నూరంతయు నూరేగించుచున్న వారు. ఇదియే నీవుచూచిన వృత్తాంతము విద్యావతి తల్లికంటె గుణవంతురాలని కందర్పుడు చెప్పగా నాగదత్తుడు దానికి గొంత పారితోషికమిచ్చి యంపెను. నీవడిగిన ప్రశ్నమున కిది సమాధానముగా నున్నది. కాదాఅని అడిగిన మణిసిద్ధునకు వాడు వెండియు నిట్లనియె. తండ్రీ మీకు నిరుత్తరముగా గాక మరియొకలాగున జెప్పుదురా ? దీన నాకు మిక్కిలి సంతసమైనది. తరువాత కందర్పుడు భార్యాపుత్రులతో నింటికి బోవునా? అందేయుండునా? అనినడిగిన నయ్యతి యోహో ముందురాగల వార్తలుకూడ నీకు గావలయునా? ఇంచుకయు విడువవు. కానిమ్ము. చెప్పెద వినుము. కందర్పుడు తల్లిదండ్రుల స్మరించుకొని అమ్మఱునాడే భార్యాపుత్రులతో బయలుదేరి మిక్కిలి విభవముగా గుంభఘోణమునకు బోయి అందు దనరాక వేచియున్న జననీజనకులకు సంతోషము గలుగజేసెడిని చిలుకరూపముతో నుండుటచే సుభద్ర కొంతకాల మతిక్రమించినను సమారూఢ యౌవనయై కందర్పునకు రెండవభార్యయై సకల సుఖములం జెందెను.

మఱియు దానందు బట్టాభిషిక్తుండై పుత్రకు గొన్నిదినము లుంచుకొని స్వదేశమున కనుపును. అదృష్టవంతుల కెందేగినను లాభమేయగుంగదా అనిచెప్పి మణిసిద్ధుండు శిష్యున కధికప్రహర్షము గలుగజేసెను.

శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్నమస్తు

కాశీమజిలీ కథలు

మూడవ భాగము

ఇరువదినాలుగవ మజిలీ

క. శ్రీమదగణ్యప్రావీణా'! మునిమానసవివాసః నానాభువన
   స్తోమావన నిరతగిరీశా ముక్తిదః భక్తపరవశా! పరమేశా

వ. దేవా ! యవధరింపు మట్లు త్రిభువనప్రసిద్ధుడైన మణిసిద్ధుండు కాశీయాత్రా
    ప్రమోదిత హృదయుండై శౌనకుండను గోపకుమారునితో నరుగుచు నొక్క
    నాడొక్కపట్టణంబున నివసించి నిత్యక్రియాకలాపంబు దీర్చుకొని భుజిం
    చిన పిమ్మట అద్భుతవిషయంబులంజూడ నెందేని జనిన శిష్యునిజాడ అర
    యుచున్న సమయంబున వాడొక మూలనుండి యత్యాతురముగా అరుగు
    దెంచి యెదురనున్న ఆయ్యవారింగాంచి నమస్కరించుచు--

గీ. చిత్రమిది చిత్రమిది సువిచిత్రమిదియ
    చిత్రమిది చిత్రమిది కడుచిత్రమిదియ.

అను పద్యవిశేషమును జదివెను. అమ్మహానుభావుండది విని నవ్వుచు ఏమిరా ? నీకు గవిత్వము వచ్చినదాయేమి? పద్యముగా జెప్పుచుంటివి? ఇంతదనుక నెందుంటివి? నీవు చూచిన యాచిత్ర మెట్టిది? ఎప్పుడు వీధికిబోయిన నూరక రావుగదా? అన్నము చల్లారిపోవుచున్నది. కుడువలెమ్మని పలికిన విని గోపాలుండు మెల్లన నిట్లనియె.

స్వామీ! మీకటాక్షంబు నాపయింగలిగియుండ నేను గవినగుట అబ్బురమా? వినుండు. నేనీవీటి వింతలజూడ అరుగుచు దేవాలయంబునకుం బోయితిని. కొందరు బుద్ధిమంతు లందొక శిలాశాసనంబు జదువ నెక్కుడు ప్రయత్నముచేసి కొరకుపసరు విశేషంబునంజూడ జివరనున్న రెండుపాదములు మాత్రము వారికి దెలిసినవి మొదటి పాదము లెంతప్రయత్నము జేసినను విశదమైనవి కావట. వారీ రెండుపాదములు జదువుచు అందలి విచిత్రయేమియో యని సందియమందుచు దెలిసికొనలేక పోయిరి. నేనాపాదములు వల్లించుకొని మీ యొద్దకువచ్చి వానినే చదివితినిగాని ఇది నాకవిత్వముకాదు. అది యెట్లుండె. ఈ పాదములంబట్టిచూడ దక్కుగల పద్యమం దెద్దియో విచిత్రవిషయంబు వర్ణింపబడి యున్నట్లు తోచుచున్న యది త్రికాలవేదులైన మీకాపద్యము చదువుట సులభముకదా. కావున నన్ననుగ్రహించి యాపద్యంబు బూర్తిగాజదువుడు తరువాత నేను భుజియింతు నిట్టి విషయంబువిన నెవ్వరి కుత్సాహముండదని వేడిన అయ్యతిచంద్రు డంతరంగమున నా తెఱంగు తెలిసికొనుట కౌత్సుక్యముగా నుండుటం జేసి మారుమాట పలుకక అప్పుడే అమ్మాణిక్యంబు దన మ్రోల నిడుకొని కన్నులు మూసికొని ధ్యానించుటయు అవ్విశేషంబంతయు అంతఃకరణగోచరంబైనది అప్పుడా పద్యమిట్లు చదివెను.

సీ. దాది హస్తమున దద్దయు ముద్దుగను పెంపఁ
               బడు రాచసుత పెను జడధిబడుట
    పడి మునుంగక యొండు ప్రాపున దఱిజేరి
               యట వారకామిని కమ్మఁబడుట
    గణికయై కులవృత్తి గొనక విద్యల నేర్చి
               దేశదేశంబుల దిరిగి యొకట
    సిరి గోలుపోయి భూసురున కిల్లాలుగ
               మెలఁగి దానములంద గలిసికొనుట
గీ. కొనకుఁ దలిదండ్రులను గూడికొనుట యహహ
    తలఁచి చూడఁగ దైవతంత్రంబుగాదె
    చిత్రమిది చిత్రమిది సువిచిత్రమిదియ
    చిత్రమిది చిత్రమిది కడుచిత్రమిదియ.

అట్లు చదివిన పద్యము విని వాడు మూపు లెగరవైచుచు అయ్యవారూ! ఈ పద్యంబున నామ దలంచినయట్లేయున్నది. ఈ పద్యమెవ్వరు రచియించి యిందు వ్రాసిరి. ఈపద్య మొకస్త్రీని గుఱించి చెప్పినట్లు తోచుచున్నది. నేనీ దివసంబున మంచివేళ లేచితిని చమత్కార విషయము జూడంగలిగె నేతద్వృత్తాంతఁబంతయు నెఱింగించి నన్ను గృతార్థుఁ జేయుండని వేడుకొనుచున్న శిష్యుని మన్నించుచు అయ్యతి సార్వభౌముండును శిష్యుడును భోజనముచేసినపిదప నొకచోట గూర్చుండి అక్కథ యిట్లు చెప్పఁదొడంగెను.

తెనాలిరామలింగకవి కథ

వత్సా! వినుము. ఆంధ్రదేశరాజులలో మిక్కిలి విఖ్యాతింగాంచిన కృష్ణదేవరాయల చరిత్రము సంక్షేపముగా నీకిదివఱకే చెప్పి యుంటినికదా! అమ్మహారాజుగారి యాస్థానకవీశ్వరులు, అల్లసాని పెద్దన్న, ముక్కుతిమ్మన్న, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, మాదయగాని మల్లన, పింగళిసూరన్న, ధూర్జటి, తెనాలి రామలింగకవి. వీరి కష్టదిగ్గజములని బిరుదులుగలవు. అప్పటి కాలములో బండితులు గాని, కవీశ్వరులుగాని, శాస్త్రజ్ఞులుగాని వీరితో సమాను లెందును లేరని వాడుక యున్నది. వీరిలో యుక్తిప్రయుక్తులయందును సమయస్ఫూర్తియందును, హాస్య కల్పనా చాతుర్యమందును మిక్కిలి ప్రౌఢుండయి పండితుల హృదయశూలమై యొప్పుచుండెడి తెనాలిరామలింగకవి పూర్వజన్మమున పెద్దకాలము పరమేశ్వరి నారాధించెను.

అమ్మహాదేవి యెప్పటికిని బ్రత్యక్షముకాకుండిన విసిగి అతండు జన్మపరంపరాలబ్ధమైన వికటహాస్య చాటూక్తి పాటవంబున అద్దేవి నెత్తిపొడిచి దూఱుటయుం గినిసి యా దుర్గ యశరీరవాక్కులచే వికటహాస్యకవిత్వమే ప్రాప్తించునట్లు శపించినది.

అది యెఱింగి అతండామె అంతరంగంబు గఱుంగునట్లు వినుతించినమెప్పు బడసి అప్పరమేశ్వరీ నీవట్టివాడ వయ్యును మనోజ్ఞమైన సమయస్ఫూర్తితో రాజసభయందు గొనియాడబడుచుందువు. నీచర్య లెవ్వరికిని దీర్ఘక్రోధమును గలుగ జేయవు. నీ కవిత్వము మిక్కిలి శ్లాఘనీయమై యుండును. మిగుల విఖ్యాతిబొందగల విదియంతయు నుత్తరజన్మంబున బ్రాప్తించునని యోదార్చినది.

దానంజేసి రామలింగకవి వికటచర్యాకరణదక్షుండైనను స్తుతిపాత్రుండయ్యెను. ఆతని చర్యలనేకములు కలవు. వానినన్నింటి చెప్పుటకు మిక్కిలి కాలముపట్టును. కావున నిప్పుడు నీప్రశ్నానుగుణ్యమైన కథ యొక్కటి చెప్పెద. నదియు మనోహరముగా నుండును. సావధానుండవై యాకర్ణింపుము.

కృష్ణదేవరాయలవా రొకనాడు ప్రాతఃకాలంబున నష్టదిగ్గజకవీంద్రులు, పండితులు, పౌరాణిక గాయక పరిహాసకాది పరిజనము సేవింప నిండుకొలువుండి పండితులతో విద్యావిషయమై ముచ్చటించుచు నిట్లనిరి.

కవీంద్రులారా! పూర్వకాలంబున భోజరాజ సభామండనులైన పండితులు కాళిదాస బాణ మయూరాదులు సంస్కృతగ్రంథనిర్మాణదక్షులై వాడుకబడసిరికదా? అట్టివారి నాదరించిన భోజుని యదృష్టమేమనదగినది? దానంబట్టియే అతనిఖ్యాతి భూతలంబున స్థిరంబై యున్న యది పండితుల నాదరింపని రాజు సంపద సంపదయే! సర్వదా విద్వాంసులతో కాలక్షేపము చేయువానిదేజన్మము మద్భాగ్యవశంబునంగదా మీవంటి మహాకవులతో మైత్రి వాటిల్లినది నా జన్మమునకిదియే చాలును మదీయ శ్రవణంబులు సంతతము విద్వాంసుల విద్యావాదముల వినుట నుత్సహింపుచుండును. మీమీ వాదముల పలుమారు వింటిని. అయినను దృప్తిదీరకున్నయది. విలాసార్థము మీకొండొరులకు వాదములు గల్పించితినేని మత్సరగ్రస్తులై మీరు దీర్ఘక్రోధులయ్యెదరని వెరచుచున్నవాడ. కావున నిప్పుడు మీ మదికెక్కిన పండితుం డెందేని గలడేని వక్కాణింపుడు ఆతని బిలిపించి వాదము కల్పించి శ్రోత్రానందము గావించుకొనియెద అది నాకు మిక్కిలి వేడుకగా నున్నదని నుడివిన విని అందఱును మనంబుల నెద్దియో ధ్యానింపుచుండిరి.

అంతలో భట్టుమూర్తి లేచి దేవా! దేవర యభీష్టమెంతయు నొప్పిదమై యున్నది? నాడు భోజుండువోలె నేటికాలంబున దేవరయే విద్యాలంబనమూర్తియై యున్నవారు. మానస సరోవరములను పరమహంసము లాశ్రయించినట్లు పుడిమి గల మహాకవులందఱు నిదివఱకే దేవరయాస్థాన మలంకరించిరి. పెక్కులేల? వీరిలో నొక్కొక్కరుండ జగంబునకు జాలిన పండితుఁడు అట్టి వీరియెదుట బెదవిగదుప మఱియొక పండితునికి సామర్థ్యముగలదా? అట్టివాడెందును మావినికిలో లేడు. సెల వొసంగెదరేని మేమ యొండొరులము ప్రసంగము కావింతుము. గెలిచినవానికి బారితోషిక మిప్పింతురు గాక ఈ ప్రసంగమునకు రామలింగమును మాత్రము దూరస్థుని జేయవలయు నతండుండిన గపటోపాయంబున నెవ్వరికిని జయములేకుండ జేయునని పలుకుచున్న సమయములో ద్వారపాలుడువచ్చి జయశబ్దపూర్వకముగా నిట్లనియె.

దేవా! కాశీదేశమునుండి నిన్న రాత్రి వేశ్యయొక్కతె గజతురగాందోళికాది వైభవముతో వచ్చి బాహ్యారామమున బటకుటీరమున విడిసియున్నదట. దేవర కెద్దియో పత్రిక నంపినది. చూడుడిదియే అని అందిచ్చుటయుంగైకొని అప్పుడమిఱేడు వడివడివిప్పిం ముప్పిరిగొను సంతసముతో నెల్లరువిన నిట్లు చదివెను.

సీ. అరువదినాల్గు విద్యలనుఁ గూలంకష
                 మ్ముగ నెఱింగిన దాన బుధులుమెచ్చ
    రచియింపనేర్తు పద్రపయుక్తి నాశుగాఁ
                 గావ్యనాటక ముఖ గ్రంథవితతి
    కవితావిచిత్ర వైఖరులు దేడపడంగ
                నవధానములు పెక్కులాచరింతుఁ
    బెక్కుదేశము లేగి పృధుకళామతుల ను
               ద్ధతులఁ బండితుల వాదముల గెల్చి
గీ. పేర్మి జయపత్రికలఁగొంటిఁ బృథులనిష్ఠ
    విడచితిని యేవగించి వంగడపువృత్తి
    వ్రతము గైకొంటిఁ విద్యావివాదములకు
    వారకాంతను పేరు మందారవల్లి

ఉ. పండితు లెందఱేని తమపజ్జగలారని యాలకించి మీ
    దండకు వచ్చితిన్ నృపవసంతమ! వాదము సేయఁ బ్రౌఢులై
    యుండినవారిఁ బంపు సభనోటమి గెల్పునుఁజూతురట్టు కా
    కుండినఁ జాలరంచు మఱియుం జయపత్రిక నిచ్చి యంపుమా.

శా. ఏ నేపండితుచేత వాదమున నోడింపఁబడంగాంతునో
    వానింబ్రోచెడురేని యానతి మెయి న్వర్తింతు నీయందగున్
    నేనే గెల్చితినేని దత్పతియు మన్నిర్దిష్టవిత్తంబు స
    న్మానంబున్ జయపత్రికాళి నిదేసుమ్మా ! నావ్రతంబీశ్వరా.

అనియున్న పద్యంబుల జిరునగవుతో ముమ్మారు విస్ఫుటముగా జదివి యా రాజమార్తాండుండు పండితులపై జూడ్కి మెఱయఁజేయుటయు వారు ఏమేమి వెలయాలికింత గర్వమా యనువారును, రాయల యాస్థానకవీంద్రుల మహిమ యెఱుంగక యిట్లు వ్రాసినదనువారును, ఎచ్చటనో పండితుల గొందఱ జయించినదట ఆ జయపత్రిక లెట్టివో చూడవలయుననువారును, రూపముచే జీరి చెడి పడుపుపడంతులే పండితుల నోడించినచో నికేమియున్నదనువారును, యీ మారు దీని గర్వప్రాయశ్చత్తము చేసికొనుటకే యిచ్చటికి వచ్చినదనువారును, దీని బరిభవింపక విడువరాదనువారును, రాజుగారి నాశ్రయించు తలంపుతో నీరీతి బన్నిన దనువారును, పెక్కండ్రు పెక్కురీతుల సంభాషింప జొచ్చిరి.

అట్టి సమయంబున మఱియొక పరిచారకుడు జయపత్రికల పెట్టెనొకదానిఁ దీసికొనివచ్చి యా సభలో భూభర్త ముంగలబెట్టును. పత్రికల నాధాత్రీపతి వేరు వేరనిరూపించి చదివించిన నిట్లున్నది. "మేము మూడుదినములు నీతోశబ్దశాస్త్రములో వాదించితిమి. నీ ప్రశ్నలకు సదుత్తరము లీయలేక పోయితిమి, యోడితిమి. నీవే గెలిచితివి. తర్కములో నీ కెవ్వరును సాటిలేరు. కవిత్వముతో నిన్ను సరస్వతీయే యని కొనియాడదగినది. మేము నీకు జాలము మేమే కాదు సమస్త విద్యలలో నీకు జాలినవారీ పుడమిలోలేరు. అని ఈ రీతి పేరుబొందిన విద్వాంసులు వ్రాసియిచ్చిన పత్రికలం జదివించి యానరపతి వెరగుపడుచు అంతకుముందు అందు వ్రాసియిచ్చిన పండితుల ప్రఖ్యాతి వినియున్న కతంబున అప్పుడప్పడంతి అనన్యసామాన్యముగా దలంచి తన పండితులతో నిట్లనియె.

ఆర్యులారా! పండితుల విద్యాప్రసంగంబులను నాలింపవలయునని నా యంతరంగమున భావిసూచకముగా నుత్సాహముదయించినది. దానికి దార్కాణ మీ యుత్తరమే! అది యట్లుండె నాచేడియ విద్యలలో బలుప్రోడవలె దోచుచున్నది. దానికి జయపత్రికల నిచ్చిన విద్వాంసులెల్ల మన మక్కజముగా జెప్పుకొనువారే సుడీ. కావున దీని సామాన్యముగా నెన్నదగదు. దీని జంఝాటము వింతగానున్నది. మన మోడిపోయితిమేన అది యిచ్చటికి వచ్చిందులకైన సొమ్మిచ్చు కొనవలయునట. ఏమి దీని ధైర్యము . ఏమి దీనిగర్వము. దాని విద్యామదమే యిట్లు వ్రాయించినది. కానిండు దానిం బరిభవించనప్పుడు గదా మన మసూయపడవలసినది. ఖ్యాతియో అపఖ్యాతియో మనకా నాతివలన రావై యున్నది. ఇందులకు బ్రధానులు మీరలు గదా. ప్రచ్ఛన్నముగా దదీయవిద్యాబలవిశేషము లరసి దానినోడించు నుపాయము నిరూపించుకొనుడు. ఈ సంస్థానమున కపయశము రాకుండ గాపాడుకొనుడని పలికిన విని అందఱు డెందంబుల దలంప దొడంగిరి. అప్పుడు భట్టుమూర్తి సావలేపముగా లేచి యెల్లరువిన నిట్లనియె.

దేవా! దేవరవారి యాస్థానపండితుల మహిమ యెరుంగక అగ్గణిక యింతగా వ్రాసినది. దానిం బరిభవించుట యెంతపని మన పండితుల నందరనట్లుండనిండు. నేనొక్కరుండ దానిం దేవరకు దాసురాలింజేసి పంపెద సందేహము వలదు. ఒండు వినుండు మన వికటకవిగారికి నాచేయు పూనిక జెడద్రోయుట సహజగుణమైఉన్నది అతండుండిన నుభయపక్షముల నిర్దూమధామంబు జేయును. కావున అమ్మహానుభావుని కెద్దియేని బనిగల్పించి దూరస్థుంజేయుడు. ఇదియే నా ప్రార్థన అట్లయిన హేలగా నాజవరాలిం దాకట్టుబెట్టెద నిది శపథేరిత మని పలికిన విని యించుక అలుక అభినయించుచు ధూర్జటి యిట్లనియె.

కవిరాజా! యెంతవారికిని బలికిన యట్లుచేయుట దుర్ఘటంబు మందారవల్లి నోడించుట కించుక యాలోచించి చెప్పుము ఊరక డంబములు కొట్టకుము. రామలింగకవి యందుగల యీసు మఱియొక రీతి దీర్చుకొనుము. అతని దూరస్థుని జేసితిమేని ముప్పురాగలదు. ఆ చతురుండుగాక చతుర్ముఖుండు విద్యలలో నోడింపలేడు. నీవు దాని వృత్తాంత మెరుంగక యిట్లు బీరము పల్కుచుంటివి. అందరివలె నూరకుండక యెద్దియో పలికినంతనే గౌరవము రానేరదు. ఈ కార్యమంతయు రామలింగకవి పై బెట్టిన ఆతండెట్లో కార్యము నెరవేర్చును. ఇదియే నాకు దోచినపని యనియూర కుండెను.

అప్పుడు భట్టుమూర్తి మిక్కిలి కోపించుచు వేశ్యలయం దభిమానముండిన నుండుగాక యిట్టిసభలో సూచించుట నీతియే! చాలుచాలు! పిరికితనమెల్లవారి నుద్దండులవలె దోపింపజేయును. సర్వదా యవమానింపుచున్నను వీనికి నాతనియందభిమానము వదలినదికాదు. జాత్యభిమాన మెంతధృఢమైనది? అని యాక్షేపించిన భట్టుమూర్తికి దగుసమాధానము చెప్పుటకు నిలువంబడి అతని వచనవిరామ మరయుచున్న ధూర్జటిని వారించుచు నా రాజచంద్రుం డంతకు బూర్వదినంబున రామలింగకవి తనకు గావించిన యవజ్ఞ మనంబెఱియజేయ రామలింగకవిని దూరస్థుని జేసి అప్పటి విజయంబు భట్టుమూర్తికి గట్టిపెట్టదలంచి వారి కిట్లనియె.

కవిపుంగవులారా! మీరిట్లొండొరులు కలహించి కార్యవిఘాతుకములు చేయరాదు భట్టుమూర్తి విద్యల దిట్టకాని వట్టివాడు కాడు. అతనిదైర్యం బెట్టిదో పరీక్షింపవలసినదే! దీనికి మీరుకపటం చేయక అతనికిం దోడ్పడియుండుడు. రామలింగకవిని రాజ్యకార్యమిషచే దూరముగా నంపెదను. అతనికింగలగర్వ మీమూలమున గొంత అడగగలదు. ఈ రహస్యము వెల్లడిపుచ్చవలదుసుండీ? రహస్యముగా దాని విద్యామర్మంబుల నరసిరండు పొండని పలుకుచు నంతటితో సభ చాలించి యానృపశిఖామణి అంతఃపురమునకుం బోయెను.

నా డేమిటికో రామలింగకవి యీసభకు రాలేదు. రామలింగకవికి సుభద్రుండను మిత్రుండుగలడు. ఆతండు రూపయౌవనవిద్యావిశేషబుద్దిచాతుర్యంబుల రామలింగని అంతవాడని చెప్పనోపు! ఆతం డాసభావిషయంబుల విని అతని కెఱిగింపు చున్న సమయమున రాజశాసనము దీసికొనివచ్చి రాజకింకరుం డతనికిచ్చెను. ఆ పత్రికఁజూచిన తత్క్షణ మిప్పుడే పోవుచున్నారని ప్రత్యుత్తరమువ్రాసి అంపి ప్రచ్ఛన్నముగా నందేయుండి సుభద్రునివలన నందు జరుగుచున్న విశేషంబులు దెలిసికొనుచుండెను అమ్మఱునా డొకరహస్యప్రవేశమున భట్టుమూర్తి పెద్దన్న లోనగు పండితులందఱు గుమిగూడుకొన యిట్లు సంభాషించుకొవిరి

భట్టుమూర్తి -- (దీనస్వరముతో) పెద్దన్నగారూ మనకుఁ దీర్పరాని అవమానమురానున్నది. ఏమి చేయుదును. మనము మందారవల్లి నేవిద్యలోను జయింపలేము. ఎంతకష్టము.

పెద్దన్న --- అంత అధైర్యముగా జెప్పుచున్నావు. దానింజూచి మాట్లాడితిరా యేమి?

భట్టు - ఏమని చెప్పుదును. చెప్పుకొన సిగ్గగుచున్నది. మీకేమి? మీరందఱు నెమ్మదిగానేయుండిరి నా కేమియు దోచుటలేదు. ఈ భారము రాజుగారును మీరును నామీద వైచితిరికదా? నిన్న సాయంకాలమున నేను కాంతాకృతితో బుష్పలావికాకైతవంబున నొకచేటికను సహాయముగాదీసికొని తదీయారామమునకు బోయితినిని.

ధూర్జ -- ఓహో! కాంతకృతిఅని మాటలలోను శ్లేషల నుపయోగింపవలయునా? మాకు విడిపోవదు. ఆడురూపు గైకొంటినని స్పష్టముగా జెప్పుము.

భట్టు - చూచితిరా! ఈత డిప్పుడే నన్ను బరిహసింపుచున్నాడు. ఈలాటివారియొద్ద రహస్యము లెట్లు చెప్పనగును.

పెద్ద -- ధూర్జటీ! ఇది పరిహాససమయముగాదు. ఈ యవమాన మతనిదే కాదు. మనమందఱిదిని ఎద్దియో వేషమువేసి యాసతియంబరిభవించుటయే పౌరుషము కవిరాజా! వీనితోనేమి తరువాత జెప్పుము.

భట్టు - ఆర్యా ! దానివైభవ మేమని చెప్పుదును. క్రోశద్వయ వైశాల్యము గల యాతోటలో నేనుంగులు, గుఱ్ఱములు, బండ్లు, వృషభములు, ధేనువులు లెక్కింపనలవిగాక యెక్కొక్కటియే మిక్కిలి వెలగలిగి మనోహరాకారములతో నొప్పుచున్న యవి, దినమునకు దానికెంత వ్యయమగునో తెలియరాదు బరిచారికలు కలిగియుండిరి పిమ్మట నేను హృదయంబున విస్మయం బావేశింప అందున్న ద్వారరక్షకులతో నేను మీయేలికసానిం జూడవచ్చితిం బోవచ్చునా అని అడిగితిని.

పెద్ద ---- ఆడువాండ్రు పోవుటకు నాటంకమేనా ?

భట్టు --- విద్యావంతులుగాని యువతులతోగూడ నానాతి మాట్లాడదట.

పెద్ద - మంచి నియమమే తరువాత ?

భట్టు - నామాటనిని వాండ్రు నీవు విదుషివైనచో బోవచ్చునని నుడివిరి. నేనట్టిదాననే అని వారికిజెప్పి క్రమంబున నేడు ద్వారంబుల గడచితిని. ప్రతి ద్వారమునందును రక్షకులు నన్ను విదుషియగుదువా యని అడుగచుండ అగుదునని పలుకదు లోపలకుంబోయి ఆయువతియున్న అంతర్బవనము జూచితిని. ఆహా ! దానిలోనున్న అలంకార మింద్రసభలోనైన లేదనుకొనియెదను. నానాదేశ విచిత్ర వస్తుమండితంబై యాకుటీరం బెంతేని విశాలముగానున్న యది. దానింజేసిన వాడెంత నేర్పరియో? పైకిజూడ నేమియుం గనంబడదు. లోపల నెన్నియో అంతర్భవనములు రాజభవనంబులవలె శోభిల్లుచున్నవి.

పిమ్మట అమ్మందిరాభ్యంతరమున రత్నపర్యంకంబున నోరగా గూర్చుండి శిష్యురాండ్రకు శాస్త్రములు గఱుపుచున్న యాయన్నులమిన్న నా కన్నులంబడినది. కవీంద్రా! మనము గ్రంథములం జదివి భావనాపూర్వకముగా నింతుల వర్ణించుటయే గాని సర్వావయవసుందరులగు నిందుముఖుల నెందును జూచియెఱుంగము అమ్మకచెల్లా! మొదట అమ్మదవతి యొడలితళ్కు మెఱుపుతీగలవలె నాకన్నులకు మిరుమిట్లు గొల్పినది. నేను జెప్పునది అతిశయోక్తి ఆనుకొందురేమో అంతయు స్వభావోక్తియేసుఁడీ? మఱికొంతసేపు దానిమెఱుగిడిన కుందనపుబొమ్మ అనుకొంటిని. తరువాత మేనునకెద్దియో తళ్కురంగు అలందికొనినదని తలంచితి మఱియు దర్కింప సహజశరీరలావణ్యం బగుట వెఱగుబడితిని. ప్రత్యవయవముసౌరును విమర్శింపదలంచి నేను దానిం దిలకించునంతలో నాతలోదరిమెరుగుచూపులు నాపై బరగించినది.

అయ్యారే! దానిమొగమంతయుఁ గన్నులుగానేయున్నట్లు తోచినది. చారలు గీరలు కొలుచుటకుజాలవు. ఆచూపులతోడనే నేను వివశుండనైతిని. కొంతసేపు నే నెందుంటినో యేమిటికి వచ్చితినో యే వేషము వైచుకొంటినో నాకేమియు దెలియ లేదు. ఆసమయమున దాని చెలికత్తెలెద్దియో నన్నడిగిరి. నాచేటిక సమాధానముచెప్పి నాగౌరవము నిలిపినది నేను స్త్రీవేషముతో వెళ్ళితిని కావున నాబూవుఁబోణి పయ్యెద జక్కగా సవరించుకొనలేదు. దానంజేసి లావణ్యభూయిష్ఠంబులైన తదవయవము లన్నియు దెల్లముగాఁ జూడనయ్యె. మదీయవికారంబుఁ జూచి యాచిగురుబోడి గ్రహించునేమోయని వెఱపుచెందుచు నెట్టికేడెందంబు త్రిప్పుకొంటిని.

దానిసోయగముమాట అటుండనిమ్ము. మనోహర రూప యౌవనవతులగు యువతులు పెక్కండ్రు చుట్టును గూర్చుండి శాస్త్రపాఠములు చదువుచుండ నందరకు అన్నిరూపులై సమాధానము చెప్పుచున్న యది. నేను కొంతసేపు వింటిని. వాండ్రువేయు ప్రశ్నలకును అదిచెప్పు సమాధానములకు గూడ నాకేమియు నర్థమేయైనది కాదు. అది పత్రికలో వ్రాసిన సంగతియంతయు యథార్థమని నమ్మవచ్చు. అరువదినాలుగువిద్యలును పాఠములు చెప్పుచున్నది. తరువాత వినుము. నేనట్లు నిలువబడి తదేకదృష్టిగా జూచుచుండ రెండుమూడుసారులు నాపై జూడ్కుల బరగించి యా బోటి యేమిటికై వచ్చినదో యరయుమని యొకనాతికి గనుసన్న జేయగా అది నన్నడిగినది.

నేనతప్రయత్నముతో ధైర్యము తెచ్చుకొని యెలుంగ రాల్పడ మేను గంపమునొంద నిందుముఖీ! నేనీ మందారవల్లిపై నొకపుష్పమాలికాబంధము పుష్పమాలికాబంధమునంగట్టి కానుక దెచ్చితిని. అప్పుడొక యొప్పులకుప్ప తెప్పునలేచి సుందరీ! యాబంధము నిర్దుష్టమేని మా యుపాధ్యాయిని నీకు బారితోషికం బిచ్చునది. ఏది చదువుమని పలికినది. నేనాబంధము సంగీతముగా జదువవలయునని తలంచితిని కాని డగ్గుత్తికచే నా కెలుంగువచ్చునట్లు తోచమి అట్లు చదువక పుష్పములు వర్ణములుగా చేసి అతిప్రయత్నముతో శక్తినంతయు వినియోగపరచి రచించిన మూలికాబంధము నొకబాలిక కందిచ్చితిని.

అదియు నామాలికను మందారవల్లి కిచ్చినం బుచ్చుకొని అచ్చెలువయు నెచ్చెలులు వినఁ జదివి పెదవి విరచుచు నొకమదవతి కందిచ్చి యెద్దియో సన్న జేసినది. ఆజవ్వనియు రివ్వునలేచి పికస్వరముతో శాస్త్రదృష్టాంతముల జూపుచు తప్పులుబట్టి దాని శతథా ఖండించినది. అప్పుడు వానికెద్దియేని నేను సమాధానము చెప్పుదునేమో యని కొంతసేపూరకుండినది నానోటినుండి మాటయే వచ్చినదికాదు. సమాధానము తోచినదికాదు. వెయ్యేల ఆదోషములు మనము ఎఱుగనే యెఱుగము. అంతలో మందారవల్లి మఱియొక పల్లవాధరిపై దృష్టియిడినంత నానెలంతయు లేచి మిక్కిలి చతురముగా మొదటియువతి చేసిన పూర్వపక్షములన్నిటిని ఖండించి సిద్ధాంతములు చూపినది.

దానివిషయమై వారిరువురకు బెద్దతడవు వాదము జరిగినది కాని నాకేమియు బోధపడినదికాదు. తెల్లబోయి యూరక చూచుచుంటిని. దానిమాటవిని మందారవల్లి దాపున గూర్చున్న యొకచిన్నది అయ్యో! సఖీ! నీవు పుష్పలావికచేసిన పద్యములో దప్పులున్నవని పరిహసింపుచున్నదానవు. ఈ పట్టణపు రాజుగారి యాస్థానకవుల గ్రంథములలో దోషములమాట యేమి చెప్పెదవు. బూవులమ్ముకొనుదాని కింతకంటె బెక్కుడు పాండిత్య ముండునా యని పలికినది.

అంతట నేను లజ్జావశంకరుండనై యేమియు మాటాడక తలవంచుకొని తిరిగిరానున్నసమయంబున నాకొక ముక్తాహార మందిచ్చుచు నొక మచ్చెకంటి వనితా! నీకవితో మాకు బనిలేదు. దీనులంబ్రోవ గంకణము గట్టుకొనిన మామందారవల్లి నీకిది యిమ్మని చెప్పినది. కావున దత్ప్రసాదముగా స్వీకరింపుమని పలుకగా నేనేమియు బ్రత్యుత్తరమీయక దానిం గైకొనక వడిగాలేచి వచ్చితిని.

ధూర్జ - ముత్తెపుపేరు విడిచివచ్చి రాజధర్మంబు నిల్పితివిగదా?

భట్టు - నీకేమియు నేను సమాధానము చెప్పను.

రామభద్రుడు - నిన్నటిదినము రాజసభలో బలికిన డాంబికపు పలుకుల కర్థమేమి? ఊరక అన్యుల నిందించిన అవమానము రాకయుండునా? నిజముగా జయించువాఁడుంబోలె రామలింగకవిని గ్రామాంతరమంపితివే! అతండుండిన దీని గర్వ ప్రాయశ్చిత్తము చేయకపోవునా?

భట్టు — అతండుమాత్రము మనకన్న నెక్కుడువాడా? విద్యలలో దానిగోరునకు బోలడు.

రామభద్రుడు - ఇంకను నీవసూయోక్తులను మానవు.

భట్టు - నీకు రామలింగమునందు పక్షముండిన నుండుగాక! నాతో నలంతిగా మాటాడకుము. నీ రామాభ్యుదయ గ్రంథములో నుపకృతి గావించిన అతనియం దీపాటివిశ్వాసము చూపవలసినదే.

రామభ -- అతండు నీకిరీటము తన్నెనని నీవసూయగా మటాడుచున్న వాడవు. కాని నేను యథార్థమే పలికితిని.

భట్టు - గౌరవము మన్నింపరేని యెట్టిపనినై నను జేయవచ్చును. అతండు నన్నొక్కనినే అవమానించలేదు. మిమ్ములనందఱిని మోసపఱచెను. మీరభిమాన శూన్యులు కావున వానిమాటయే పలుకుచుందురు. మొన్నటిసభలో ధూర్జటికవిని వేశ్యాసంగముమాట వెల్లడిచేసి మానభంగము జేయలేదా?

ధూర్జ - నీవామిషచేత నన్నిప్పుడెత్తిపొడుచుచున్నవాడవు నేనెఱుంగుదును. నాకది అవమానముకాదు. కాని నీదగు బాలచంద్రికాపరిచయ కళంకముమాత్రము స్మరించుకొనుము.

పెద్ద - చాలుచాలు మీరలూరక కలహింపక రేపటిసభలో జేయదగిన వాదవిషయముల నాలోచించుడు.

భట్టు - వాదము లిచ్చటనే. సభలో మాటయేరాదు.

ధూర్జ -- అదియుందీరినదికాదా. పాప మభిమాన ముడిగి వనితావేషము వైచుకొనినను లాభము లేకపోయినది.

భట్టు --- ఊరక అట్లంటినిగాని రేపటిసభలో నా ప్రతాపమును జూతురుగాక . సరస్వతినై నను విద్యలలో దిరస్కరింపగలను. మఱియు రామలింగమువలెనే వీరిరువురను గ్రామాంతరంబు బంపిన జక్కగానుండును. వీరు మనలోనివారని యుంచితిని. ఇంకొకసారి అట్లేచేసెదను.

ధూర్జ - ఇంకొకసారిమాటకు నీసారి నీకు జయముకలిగినప్పుడు కదా ?

పెద్ద - ధూర్జటీ! ఇట్టి సమయమున మీరీతిగా మాటాడుట యుచితముగాలేదు . ఊరకొ'ని చెప్పినట్లు చేయుడు.

ధూర్జ - చిత్తము. మీయాజ్ఞ నుల్లంఘింతుమా! మందారవల్లిని జయించు నుపాయము జూడక యూరక రామలింగకవిని నిందించుచున్నాడని యిట్లంటిని . అతండుండిన మనకిన్ని యాలోచనలు కావలయునా?

పెద్ద --- అగు నామాట సత్యమేకాని గతించినదానికి జింతించిన లాభములేదు. రేపటిసభలో మన మేయేవిద్యలలో వాదింపవలయునో యాలోచించి ఘట్టస్థలములు పరిశీలించి యుంచవలయును. శాస్త్రముల నావృత్తిగా జూడవలయును.

అని యొండొరు లాలోచించుకొని అందరు నిష్క్రమించిరి.

అమ్మరునాడు సాయంకాలమున రామలింగకవికి ప్రాణమ్మిత్రుండు సుభద్రుం డనువాడు రహస్యవిశేషములన్నియు విని చెప్పుటకు నంతకుమున్ను నియమింపబడి యున్నవాడు కావున తత్సభావిశేషములన్నియు చూచివచ్చి అతనికిట్లని చెప్ప దొడంగె.

మందారవల్లి కథ

కవీంద్రా! ఈదినంబున రెండుగంటలకు చిత్రశాలలో సభ జరిగినది. రాయలవారు మిక్కిలి సంతసముతో మనదిగ్గజములను భద్రగజంబుపై నెక్కించుకొని మంగళధ్వనులతో నూరేగించుచు చిత్రశాలకరిగిరి పౌరులు, రాయలవారు పండితులకుఁజేయు నపూర్వగౌరవంబునకు వెఱగుపడజొచ్చిరి. ఆసభయందు రెండుపంక్తులుగా బీఠము లమర్పబడి యున్నవి. వానిలో నొకదెసనున్న ముఖ్యాసనంబుల మన పండితులు గూర్చుండిరి. వారిదాపుననే రాజుగారు మంత్రసామంత్ర్యాది ప్రధానవర్గములతో నివసించిరి. ఆసభావిశేషముల నరయుటకై పెక్కుదేశములవారు వచ్చిరి. అందఱును నిశ్శబ్దముగా గూర్చుండబెట్టుటకు తగుభటులను నియోగించిరి. ఎందఱు గూర్చుండినను పుష్పకమువలె జోటుకలిగియుండుటంబట్టి సభ్యులకు సభావిశేషము లాలోకించుట కవకాశము కలిగియున్నది. రెండవశ్రేణి పీఠములనంటి యొక పట్టుతెర వేయబడియున్నది.

అట్టి సభ అంతయు నిండియున్న సమయంబున మందారవల్లి పల్లకీనెక్కి శిష్యురాండ్రుచుట్టును జయజయధ్వనుల గావింపుచుండ రెండవసరస్వతివలెనొప్పుచు మంగళధ్వనులతో నాయాస్థానమున కరుదెంచినది. అట్టిసమయమున సభాసదుల దృష్టిప్రసారములన్నియు నొక్కసారి అక్కలికిమిన్న దెస వ్యాపించినవి. రాయలవారు మిక్కిలి అబ్బురపాటుతో నచ్చోటి వైభవంబు జూడందొడంగిరి అప్పుడా సుందరి సపరివారముగా నాతెరలోనికిం బోయినది.

దానిరాక చూచినంత మనపండితుల స్వాంతంబులు విభ్రాంతి నొందినట్లు యెల్లరకు దెల్లముకావచ్చినది. మఱికొంతసేపునకు నాతెఱలో గంటమ్రోగినది. ఆనాదముతోడనే సమానవిద్యారూపవయస్కలగు జవరాండ్రు నూఱుగురు గానసాధనముల ధరియించి మనోహరములగు గీతముల బాడుచు విచిత్రగమనంబులతో నాతెర వెలుపటికివచ్చి శ్రేణిగా నిలువంబడి సభ్యులకు మ్రొక్కుచు దమ యుపాధ్యాయిని అగు మందారవల్లి విద్యావిజయప్రచారములఁ దెలుపు గీతములను పద్యములను జదివిరి.

అట్లు గొంతసేపు స్తుతిపాఠములం బఠియించి యాతెఱవలు తెరలోనికిం బోయి వేఱొక అలంకారములతో మఱల తెర వెలుపలికివచ్చిరి. అట్లు వెలువడి సభ్యులదిక్కు మొగంబై అమ్మగువలు ఆర్యులారా! మేమందరము మందారవల్లి శిష్యురాండ్రము. మాకు సకలవిద్యలలో బాండిత్యము గలిగియున్నది. ఇందు బ్రతివాదులెవ్వరో దెలుపవలయును. మాతో వాదించి మమ్ములను జయించినతరువాత మందారవల్లితో బ్రసంగించవలయును.

అని తమతమ అభిమానవిద్యల బేర్కొనిరి. ఆబ్బోటులమాటల విని మన పండితులలో నొక్కరుండైన నేను సమర్థుఁడ నీవిద్యలో వాదింతునని ముందర నిలువబడినవాడులేడు. నీవు నీవని యొకరినొకరు ప్రేరేపింప దొడంగిరి.

వారు బేర్కొనిన విద్యలపేరులే వీరికి తెలియవని తెల్లమగుచుండెను. అట్లు కొంతసేపు నిశ్శబ్దముగా నున్నంత నానెలంతుకలు భూకాంతు నుద్దేశించి మహారాజా!

శ్లో॥ క్షోరోదదెచ్చ గాంభీర్యం జానాతి మధనాద్దరిః
     లేహనాయ తటం ప్రాప్తంః కధం విద్యాద్బిడాలకః॥

పాలసముద్రముయొక్కలోతు మధించినహరికిఁ దెలియుగాని పాలంగ్రోల వచ్చిన పిల్లి కేమిదెలియును. విద్యామర్మమునెల్ల గూలంకషంబుగా వెఱింగి జగద్విఖ్యాతిగాంచిన మాయుపాధ్యాయముందర యుదరపోషణార్ధమై చదివిన యీ పండితపుత్ రులేమిలెక్క. ఇందులకు మీరెవ్వరి నేర్పరచితిరి. వారి కేవిద్యవచ్చును. మాలో నిచ్చవచ్చిన మచ్చకంటితో బ్రసంగింపుడు లేకున్న లేదని జయపత్రిక నిప్పింపుడు ఊరక కాలహరణము సేయనేల? అని సావలేపముగా బలికిన నాభూపతి లజ్జాభిమానవిస్మయసంభ్రమంబు లొక్కసారి చిత్తంబు తలపెట్ట గొండొకవడి యూరకుండి కనులెర్రజేయుచు పెద్దన్నగారూ, మందారవల్లి శిష్యురాండ్రు చదివిన శ్లోకం వినబడినదా! కవిరాజుగారికి దృష్టి యిక్కడలేదేమో? సూరన్నగారేమి చేయుచున్నారు. తిమ్మన్నగారు పరాకుగాయుండిరాయేమి? ధూర్జటిగారికి చిత్తచాంచల్యము గలిగినది కాబోలు.

అని యీరీతి నందరం బేర్కొని చురచురబల్కిన నభిమానము దెచ్చుకొని వారు చిత్తము చిత్తము మేమందరము నొక విషయమై యాలోచించుటఁబట్టి యింత దనుక నుపేక్షింపవలసివచ్చెను. ఇదిగో భట్టుమూర్తిగారు వారితో బ్రసంగించుటకు నుద్యుక్తులైయున్నవారని ఆతని ముందరికి ద్రోసిరి.

అతండెట్టకేలేచి ముందరకుబోయి నిలువబడినంత సభ్యులందఱు గరతాళముల వాయించిన పిమ్మట ఆతండెద్ది చదువబోయెనుగాని కంఠము డగ్గుత్తిక జెందుటచే స్వరము వచ్చినది కాదు. మేనంతయు జెమ్మటలుగ్రమ్మ వణకజొచ్చినది. అప్పు డాయువతు లతనింజూచి నవ్వుచు అయ్యా! తమ అభిధేయ మేమి? ఏ శాస్త్రములలో బరిశ్రమజేసితిరి. ఇప్పుడు ప్రతివాదులుగా వచ్చితిరా? రాయలవారి యాస్థానపండితులలో ప్రధానులు మీరే అగుదురా? అని అడిగిన అతండు నొకమాటకు వేఱొకమాట జెప్పుచు వారిమాటలకు వినిమయముగా బ్రత్యుత్తర మిచ్చెను.

ఆతని తొట్రుపాటుచూచి సామాజికులు పకపక నవ్వజొచ్చిరి. అప్పుడాపండితులు ఓహో! వసుచరిత్రము వ్రాసినవారలు మీరేనా? రామరాజకవి అను మఱియొకపేరు మీకేకదా గలిగియున్నది. వసుచరిత్రములో-

మ. నను శ్రీరామ పదారవింద భజనానందున్ జగత్ప్రాణనం
     దన కారుణ్యకటాక్ష లబ్థకవితాధారాసుధారాశి సం
     జనితై కైక దినప్రబంధఘటికా నద్యశ్శత గ్రంథక
     ల్పను సంగీతకళారహస్యనిధి బిల్వంబంచి పల్కె న్గృపన్.

అని వ్రాసికొంటిరి. శాస్త్రములేమియు చదివినట్లు వ్రాయకపోవుటచే శ్లో॥"శాస్త్రేషుహీనాః కవయోభవంతి " అనియున్న యార్యోక్తి మీయందు రూఢమై యున్నది. దానంజేసియేకాబోలు మీ గ్రంథమందన్ని తప్పులున్నవి. మేము మీ గ్రంథముమీదనే పూర్వపక్షము చేసెదము. శిద్దాంతము చేయగలరా? మీకు బాఠము లేమి శాస్త్రముల త్రోవదొక్కనేల? సంగీతమున నిధినని ప్రయోగించుకొంటిరి. దానిలో గొంత ముచ్చటింతము. మీరు వాదులుగా నుండెదరా, ప్రతివాదు లయ్యెదరా?

అని నిర్లక్ష్యముగా బరిహాసగర్భితములైన వాక్యములచే ఆతని రోసమెక్కించినది. మఱి చెప్పనేమి యున్నది. వసుచరిత్రములో శబ్దదోషములు అర్థదోషములు పద్యవాక్యదోషములు నిరూపించు శాస్త్రములు లుదహరించుచు అయ్యించుబోణులు చక్కని వాక్యపద్ధతులచే నా భట్టుమూర్తిని క్షణములో నిరుత్తరుంజేసిరి. ఆహా! వారి వాదశక్తినైపుణ్యము వక్తృత్వము వినితీరవలయును. ఒక్క మాటకు బదిమాటలు జెప్పదొడంగిరి. వాదములో దొందరమేమియుం జూపక మెల్లగా వ్యక్తముగా యుక్తియుక్తముగా బలుకుచు తమసిద్ధాంతములన్నియు బ్రతివాదిచేతనే యొప్పించుచు అవలీల నెత్తివేసిరి. ఆసభలో వారిలో నొకమాటయేని భట్టుమూర్తి సదుత్తముగా జెప్పలేడని పిల్లవానికి సైతము వెల్లడియైనది.

అట్లు నిరుత్తరుండైన భట్టుమూర్తింజూచి బరితపించుచుఁ దమయుపాధ్యాయ వృథాశ్రమపడి యింతదూరము వచ్చినది. దూరపు కొండలు నునుపు అనుసామెత నిక్కువమగును. రాయలవారి యాస్థానమున అష్టదిగ్గజములను బిరుదులుగలపండితు లుండిరను వాడుక మాత్రము గొప్పది. పాపమీమహారాజుగారు వీరిని గజములవలెనే పోషించుచున్నవాడు. మొదటి గజ మీయనయే కాబోలును. ఇక రెండవ గజ మేమి చేయుచున్నదియో?

అని యీరీతి మర్మచ్ఛేదములగు మాటలచే మన పండితుల దూలనాడిరి? అమ్మాటలు విని మన పండితులు మారుపలుకక నేల వ్రాయుచుండుటజూచి రాయల వారు తలయూచుచు నెద్దియో ధ్యానింపుచుండ అక్కామినులు మహారాజా! మీరు నిరూపించిన పండితుం డోడిపోయెను. రెండవవానిం బంపెదరా? జయపత్రిక నిప్పింతురా? వృథాకాలహరణముసకు మా యుపాధ్యాయిని సైచదు అని యూరక తొందర బెట్టగా నేమియుఁదోచక యా భూపతి ప్రధానమంత్రి మొగము పై దృష్టి నెర జేసెను.

అప్పుడతండులేచి విద్యావతులారా! మా దివాణములో బెక్కండ్రు పండితులు గలరు కొందఱు గ్రామాంతర మరిగిరి. వారు వచ్చువరకు నూరకుండనేల అని ఈ చిన్న సభ జేయించితిమి. ఇంతమాత్రమునకే గెలిచితిమని పొంగకుండు. ఉద్దఁడులైన పండితులు మిగిలియుండిరి. వారినిగూడ యోడించినప్పుడుగదా జయపత్రిక లందుట. ముందటి సభలో మీప్రజ్ఞజూపుడు. ఇప్పటికి మీ నివాసంబునకుబోవచ్చును సభజేయు దివసము వెనుకవ్రాసి యంపెదము ఈ విషయము మీ యుపాధ్యాయినికి దెలుపుఁడని జెప్పెను. ఆ మాటలువిని అమ్మదవతులు పెదవులు విఱుచుచు నిప్పు డింతయ్యె ముందుగా బోవునది యెంతయో చూతుముగదా? అని పరిహసించుచు తత్రగమనంబుల నా తెరలోనికిఁబోయిరి వెంటనే మందారవల్లి యాందోళికమెక్కి పరిచారికలు సేవింప విజయధ్వనులతో విడిదెకుంబోయెను. తరువాత రాయలవారును బండితులును చిన్నబోయిన మొగంబులతో నివాసంబులకు జనిరి. భట్టుమూర్తి యేదారింబోయెనో యెవ్వరికిం గానుపించలేదు. ఇవియే సభావిశేషములని సుభద్రుఁడు రామలింగకవికి జెప్పెను.

ఆ వృత్తాంతమంతయు విని అతండొక్కింత ధ్యానించి సుభద్రా! ఇప్పుడు మన దివాణమునకు మిక్కిలి అపయశము బ్రాప్తించినది మందారవల్లి సామాన్య అనుకొని మన పండితులు మోసపోయిరి. మాలో మేమెవ్వరి నోడించననులెస్సగాక యొరులచే నోటుపడుట అలంతికదా! భట్టుమూర్తి నాయందుగల యీసున నన్ను దూరస్థునింజేసెను. కానిమ్ము దీనిని నేను కపటోపాయంబున బరిభవించెద. మన ప్రధానమంత్రి మిక్కిలి బుద్ధిమంతుడు. నాయునికి యెఱిగియే అట్లు చెప్పనగును. దివాణములో నేమి యాలోచింపుచుండిరో అరసిరమ్ము. పొమ్మని అతనింబుచ్చి అతండారాత్రి యిష్టదేవతం బ్రార్థించుకొని నిద్దురపోయెను.

అతనికి భగవతీకటాక్షంబున ముందుజేయదగిన విధానమంతయు స్వప్నంబున బొడగట్టినది. అమ్మఱునాడు సుభద్రుండు వచ్చి సంసారరహస్యములం జెప్పుచుండగనే రాజకింకరుడు వచ్చి తలుపు దెరవుడని అరిచెను. సుభద్రుడువచ్చి తలుపు దీయగా రాయలవారి భార్య రామలింగకవి భార్యతో ముచ్చటింప వచ్చినదని యా దూత అతనికి జెప్పెను.

అంతకు మున్ను యా విషయం బెఱింగియున్న రామలింగకవి తన భార్యకు భావికృత్యంబు లన్నియు బోధించెను. ఆమాట విని తాను ప్రచ్ఛన్నముగా నుండి రాజపత్నిని సత్కరించుటకు తన భార్యను నియోగించెను. రాజపత్ని కవిపత్నిచే జేయబడిన సత్కారములకు మిక్కిలి అభినందించుచు జెంత గూర్చుండ బెట్టుకొని గృహకృత్యముల విషయమై కొంత విమర్శించి ప్రశంసాపూర్వకముగా నిట్లనియె. సాధ్వీ! పృథ్వీపతుల గీర్తిమూర్తులజేయ హేతుభూతులగు సకవీంద్రుల మహిమ మిక్కిలి అక్కజమైనదిగదా! సకలప్రపంచము హృద్గతము చేసికొని చూచిన దానికన్న నెక్కుడుగా లోకులకు బూర్వవృత్తముల దెలియజేయు సుకవులకు రాజ్యముతో నేమిపని, పండితుండగుటయే దుర్లభము. అంతకన్న సుకవి మిక్కిలి శ్లాఘనీయుడు. ఆతడు నిరంకుశుం డయ్యెనేని చెప్పనేల? అట్టి సత్కవికి భార్యవైన నీ అదృష్టము మిగుల కొనియాడదగినది. మందారవల్లి వృత్తాంతము నీవును వినియుందువు. స్త్రీలలోగూడ విద్యలలో ప్రౌఢలైన వారుండిరి సుమీ! అయ్యారే? ఆ తొయ్యలిని సరస్వతి అని చెప్పనోపునట దాని శిష్యకోటిచేతనే మన పండితులు పరాజితులైరి భట్టుమూర్తికి జరిగిన పరాభవము చెప్పనలవికాదట. మొదట నీవిజయలాభము తామే కుడువవలయునని నీ వల్లభుని దూరస్థుని జేసిరట. ఆ కృత్యంబునకు ఫలం బనుభవించిరి. ఆ విషయమైన రాయలవారు మిక్కిలి లజ్జించున్నవారు. ఇప్పుడు వచ్చిన అవమానము వారిదేకాదు. మన అందరిదిని. ఇదివరకు జేసిన కాపట్యము మనంబునం దలంపక యీ యాపద దాటింపుమని భవదీయవల్లభుని మిక్కిలి ప్రార్థించుచున్నా నని రాయలవారు విజ్ఞాపన జేయమనిరి.

శ్లో॥ నభవతి నచిరంభవతి చిరంచేత్పలే విసంవాదీ?
      కోపస్సత్పురుషాణాం తుల్య స్నేహేన నీచానాం॥

దుర్జనమైత్రియుంబోలె సత్పురుషునకు కోపము కలుగదు. కలిగినను చిరకాల ముండదు ఉండినను ఫలసమయంబున విసంవాదిగా నుండును.

అని మిక్కిలి చాతుర్యముగా బలికిన విని కవిపత్ని దేవీ! దీనికి మమ్మింతగా గొనియాడవలయునా? మీ అవమానము మాయదికాదా? ఆయన గ్రామాంతర మరిగి నందులకు నేనేమిచేయుదానను? మందారవల్లిం బరిభవించుటకు ఆయన యుండవలయునా? ఆయనకూతురు యీ మాత్రపు బని జక్కబెట్టగలదు. అని యేమేమోచెప్పి నమ్మించి చేయదగిన కృత్యములన్నియుం బోధించి సవినయముగా రాజపత్నినింటి కంపినది.

ఆసాయంకాలమున పురరహస్య విశేషములన్నియు దెలిసికొని వచ్చి సుభద్రుడు రామలింగకవితో నేకాంతముగా నిట్లనియె కవీంద్రా ! నేను పూజారిభార్య వేషము వైచుకొని పూవులను ఫలముల దీసికొని దేవీప్రసాదము మందారవల్లి కీయవలయునని ద్వారపాలురతో జెప్పి లోపలకుబోయి యెదురుబడక పరిచారకలనడుమ తద్విశేషము లరయుదానింవలె మెలగజొచ్చితిని లోపల నన్నెవరు అంతగా విమర్శింపలేదు. అట్టిసమయమున మందారవల్లి శిష్యురాండ్రతో నీరీతి సంభాషింప దొడంగినది.

మందా — ప్రియంవదా! అష్టదిగ్గజములన నెట్టివారో యనుకొంటిని. మీ తోడనే మాటాడలేకపోయిరేమి? వీరిలో రామలింగకవి యున్నవాడా?

ప్రియం - ఏమో మాకు దెలియదు మాతో బ్రసంగించినవాడు భట్టుమూర్తి యట. సభాకంపముస్నది కాబోలు, మమ్ములజూచి బెదరజొచ్చెను. రామలింగకవిమాత్ర మీయనకంటె అధికుడా యేమి?

మం -- ఆతం డసాధ్యుడు. నిన్నటి సభలో ఆతం డుండినట్లు తలంచను.

ప్రియం - ఆతం డేయే విద్యలలో బ్రౌఢుండు? మీకును బ్రశంసనీయు డగుచుండెనే.

మందా - ఆ విషయమే స్పష్టముగా దెలియకున్నది. ఆతండన్ని విద్యలలో బ్రసంగించి యోడించుచున్నాడని వార్తాపత్రికలు చెప్పుచున్నవి.

ప్రయం - అట్టివాడు సభలోనుండిన నిన్నటిదిన మూరకుండునా?

మందా - ఆతని వృత్తాంతము రహస్యముగా నరసిరమ్మని హేమలతను నియమించితిని. అది యెక్కడనున్నది?

హేమ - అమ్మా! నేనిదిగో యిచ్చటనే యుంటిని.

మందా - ఇటురా? విశేషములేమి?

హేమ --- అమ్మా! మీయాజ్ఞ చొప్పున నిప్పురమున రామలింగకవి విషయమై చర్చించగా అతడిపుడు గ్రామాంతర మరిగినటుల కొందరు చెప్పిరి. ఆయన పాండిత్యము సైత మనన్యసామాన్యముగా జెప్పుదురు. రేపటిదినమున గాబోవు సభలో అతనినే బ్రతివాదిగా నుంచుదురని వాడుకగా నున్నది.

మందా - నీవు వినినది అసత్యము రేపటిసభలో బ్రతివాదిగా లవిత్రయను కాంత వచ్చి వాదించునటఁ అని యిప్పుడే పత్రిక వచ్చినది. దీని అర్ధము గ్రహించితిరా?

ప్రియం - ఓహో! మందారవల్లి యన తీగెగావున లవిత్రశబ్దము కొడవలి. దానిచే భరిభవింపవచ్చునని వారి అభిప్రాయము. కాని యా తీగ యుక్కుది. కొడవలికి వశమగునదికాదు. దీనిం గోయబూనునేని కొడవలియే మొనపోవును.

మందా - ఏదోయొక కారణమున గాలహరణము జేయవచ్చునుకదా! యెవ్వరైననేమి?

అని ఈరీతి వారు మాట్లడుకొనుసమయంబున నేను ప్రాంతమందుండి వినుచుంటిని. ఇంతలో నొక నెలంత వచ్చి పల్కరించినది. మఱి నిలుచుట కవకాశము చిక్కినదికాదు. అప్పుడు మెల్లగా మందారవల్లి దాపునకుంబోయి దీవించుచు నామగోత్రము లెఱిగించి దేవతాప్రసాద మిచ్చితిని. అదియు భక్తిపూర్వకముగా స్వీకరించి పూవులఁ గన్నుల నద్దికొనుచు గొప్పున నిడికొని నాకు గద్దెవేయించి గూర్చున్న యంత నమస్కరించుచు నావృత్తాంత మడిగిన నేనిట్లంటిని.

గణికామణీ! నేను సావిత్రీ దేవాలయముననున్న అర్చకుని భార్యను. నా పేరు మంజుల. నీవైదుష్యము సౌందర్యము దాతృత్వము నీయూర ఆక్కజముగా జెప్పుకొనుచుండ నిన్ను జూడవచ్చితిని. మా సావిత్రీదేవి ఆశ్రితకల్పలత యని ప్రసిద్ధి చెందియున్నది. జగత్ప్రసిద్దుండైన తెనాలి రామలింగకవియు దత్సేవ వల ననే అంతవాడయ్యె తత్ప్రసాదస్వీకారమున నీకును విజయమగుంగాత అని దీవించి పల్కితిని.

అదియు సంతసించుచు నాకొక పారితోషిక మిప్పించి నీ విద్యాబలప్రభావముల గుఱించి తరచితరచి అడిగినది. నేనును దానికి వెరపుదోచునట్లు నీ వృత్తాంతము జెప్పితిని. పిమ్మట లవిత్ర చరిత్రము అడిగిన నాచిన్నది నీ శిష్యురాలే అని చెప్పితిని. ఆట్లు కొంతసేపు దానితో ముచ్చటించి అనిపించుకొని వచ్చితిని. నిన్ను దలంచికొని అది వెఱచుచునేయున్నది. ముందరికార్యము నీవే యోచించుకొనుమని చెప్పిన సంతసించుచు ఆతనిం బెక్కు తెరగుల బ్రశంసించెను.

ఇంతలో రాజనియోగమున మంత్రియు బాఠశాలకు బోయి అందు చదువుచున్న విప్రకుమారుల సమవయస్కుల వాచాలుర మనోజ్ఞరూపయౌవనశోభితుల వివాదపటువుల వటువుల నూర్వుర నేరి వారిం జాంబూనదాంబరాలంకారపండితులం గావించి రామలింగకవిశేఖరుని యింటికనిపెను. వారిం దనయింట బెట్టుకొని అతండు బోధింపవలసిన యంశములన్నియు సంక్షేపముగా దెలిపెను. చూసిన ముట్టికొను స్వభావముగల యావిప్రవటువులు తదుక్తవిధులన్నియు మనంబునం బట్టించుకొని విజయాభిలాషతో హెచ్చరికలు చేసికొనుచు యుద్ధమునకుబోవు శూరులవలె బొంగు చుండిరి. పిమ్మట రామలింగకవి యొక యుత్తరమిట్లు వ్రాయించెను.

విదుషీ! నీవు విద్యలచే ననవద్యవై నను గులంబున సామాన్యవగుట నశేషవర్ణపూజనీయులగు బ్రాహ్మణోత్తములచేతను వసుంధరాభారవహప్రవణులగు రాజన్యులచేతను అలంకరింపబడియున్న సభాభ్యంతరంబునకు నీవు పల్లకీ నెక్కి వచ్చుట యనర్హకృత్యంబని నీకును దెలిసియుండును. యెరింగియు ఆధిమకృత్యములం గావించిన వారికి నిష్కృతి లేదండ్రు అది అట్లుండె స్వకులోచితధర్మంబుల యథాన్యాయంబుగా నాచరింపనివారు దండనీతి బట్టి శిక్షాపాత్రులగుదురు. ఇంతకు మున్ను చేసిన యపరాధము మొదటితప్పుగా నెంచి మన్నించడమైనది. అని వ్రాయించి రాజముద్రాముద్రితమైన యయ్యాజ్ఞాపత్రిక సంపుటయు దానిం జదువుకొని యా చిగురుబోడి వేడి నిట్టూర్పు నిగుడ్చుచు బ్రియంవదతో బోటీ యీ చీటిం జూచితివా? నేను సభకు బోవుట తప్పట కులంబున సామాన్యనట. ఈమాటకర్దమైనదా? కానిమ్ము. జయపత్రిక నందిన పిమ్మట వీనికన్నిటికి సమాధానము చెప్పుదము మనలను విద్యలచేగాక కపటోపాయంబుల బరిభవింపవలయునని తలంచుచుండిరి. వీరిదేశములో వీరేమిచేసినను సాగునుకదా.

అని కొంతసేపు దానితో నావిషయము చర్చించి సభకూడకమున్ను పల్లకీ నెక్కిపోవుటకు నాజ్ఞయిమ్మని వినయముగా నుత్తరము వ్రాసికొని అట్లు గావించినది. మొదట సభనాడు మంత్రి సామంతపౌరపండిత మండితుండై పేరోలగమున నున్న యానృపాలుని మ్రోలనుండి మెండువైభవముతో బల్లకీనెక్కి యేగిన యయ్యెలనాగకు ఆనాడు అందఱికన్న ముందు జనశూన్యమగు సభకు బోవుటయే అపజయసూచకమని యెల్లరు దలంచిరి.

అంతకుబూర్వమే యావింత జూచుటకై దేశదేశములనుండి వచ్చిన జనులు సభాభవనము నిండిరి. అంత విజయసమయంబున రామలింగకవి పల్లకీ నెక్కి తలుపులు బిగించుకొని చుట్టును పండితవేషములతో విప్రవటువులు విజయశ్లోకములం జదువుచు బరివేష్టించి రా సుభద్రుండు పల్లకి దండినాని రహస్యముల నెఱిగింపుచుండ మంగళధ్వనులు నింగిముట్ట లవిత్రయనుకాంత అరుగుచున్నదని ప్రజలు చెప్పుకొనుచుండ నాసభాభవనమున కరిగి అంతకుమున్ను తననిమిత్తమై అమర్చి యుంచిన తెరలో బ్రవేశించెను.

శిష్యులందఱు నాతెరముందర శ్రేణిగా నిలువబడిరి. రామలింగకవి విదేశపండితుల నోడించుటకై చిరకాలముక్రిందటనే యెవ్వరికిని దెలియని లిపి వ్రాయించి నూఱుబండ్లపుస్తకములు సంగ్రహించి యుంచెను. అవిఅన్నియు బట్టించుకొనివచ్చి సుభద్రుండు యథాయోగ్యముగా నాశిష్యుల మ్రోలనుంచెను.

రాయలవారు మంత్రిసామాది పరిజనముతో వచ్చి సభ నలంకరించిరి. పెద్దన్న లోనగు పండితులును వారివారి పీఠంబుల గూర్చుండిరి. సభ్యుల సమ్మర్ద ముడుపుటకై రాజభటు లాయాప్రదేశములందు దండధరులై నిలువంబడిరి. ఒక ముహూర్తకాలము సభ అంతయు నిశ్శబ్దముగా నుండుటచే చిత్రితంబో అని వర్ణింపనయ్యెను.

అట్టిసమయంబున ప్రధానమంత్రి లేచి కుడిహస్తమెత్తి యిట్లనియె ఆర్యులారా! ఇప్పుడు కాబోవు విద్యాప్రసంగములో వాది ప్రతివాదులు అనపేక్షితముల భాషింపగూడదు. యుక్తిప్రయుక్తులలో శాస్త్రవిరుద్దముగా ననుధత వ్యతిరేకములు నగువానిని సూచించిరేని పరాజితులుగా నెన్నబడుదురు. అహంకారసూచకములగు వచనములు నపరాధనిర్దిష్టములని యెఱుంగునది. ఎవ్వరెవ్వరితో మాట్లాడుచుందురో వారుగాక యితరు లప్రార్థితులై ముత్తరములీయరాదు. శంకకు దగునుత్తరము రానిచో బై వాక్యమున కుత్తరమియ్యకున్నను దోషములేదు. ఈ నిబంధనలకిరు తెగలవారును బద్దులై యుండవలయునని యిందుమూలముగా దెలియజేయడమైనది.

అనిచెప్పి మంత్రి ముగించినతోడనే మబ్బు వెల్వడిన మెఱుపుతీగియలో యన మందారవల్లి శిష్యురాండ్రు నూర్వురు తెరవెల్వడ మునుపటివలెనే శ్రేణిగా నిలువంబడి మనోజ్ఞమైన గానస్వరములచే సభ్యుల యుల్లంబులు రంజిల్లంజేసిరి. వారి యాకారములును గీతములు, గమనములు, వేషములు, సామాజికులకు మనోవిభ్రాంతి గలుగజేసినవి.

అప్పుడు రామలింగకవి శిష్యులలో మొదటివాడులేచి అగ్రాసనాధిపతిం జూచి దేవా! ఇది రంగముకాదు. పండితసభ. అట్లయినను వీరు జాతిస్వభావమునుబట్టి అభినయమును జూపుచున్నారు. మేము వీరితో బాండిత్యవిషయమై వాదింపవచ్చితిమి గాని వీరియాటపాటల జూచుటకుగాదు. శృంగారలీలావిశేషములచే సభ్యుల మోహింపజేసి జయపత్రికలనందుట వీరికలవాటు కాబోలును లేనిచో యీసంగీత మేల? కాక యెద్దియేని రూపకము ప్రదర్శింతురేమో? అట్లయిన మేమును సావకాశముగా జూచి యానందింతుము.

అని సాక్షేపముగా బల్కిన విని సభాసదు లతనిమాటలు సమయోచితముగ నున్న వని సంతసించిరి. అప్పుడు మందారవల్లి శిష్యురాలొకతె ముందరికివచ్చి ఓహో! ఈవటూత్తముని యుపన్యస్త మెంతేని వింతగా నున్నయది దూరదేశాగతులగు సభ్యుల గమనాయాసము వాయ హాయిగా బాడిన మాగానము వీరిచెవుల కెంత కటువైనదో! అప్రవేశితగృహస్థాశ్రమములకు వీరి కిట్లనుట యుచితమే?

శ్లో. మార్జాలో లభితేన మంజులశుకాలాపేన కౌతూహలం ॥

అనినట్లు మధురములగు చిలుకలపలుకులు పిల్లి కింపగునా? ఆటపాటలని చులుకనగా బలికిరి వాటిలోనైనను వాదించి గెలిసినంజాలుగదా. సంగీతశాస్త్రము కళావళిలోనిదికాదు కాబోలును. అనుటయు మఱియొకతె అంతమాత్ర మెఱింగిన నిట్లేల పల్కునేయను అంతలో వేరొకతె (స్త్రీ బ్రహ్మచారి కెఱుంగఁ బడునె రసము) అని చదివినది. అప్పు డతనిం బరిహసింపుచు నామువ్వురు నూరుశ్లోకముల జదివిరి.

ఆవడుగు కన్ను లెఱ్ఱజేయుచు రాజుదిక్కు మొగంబై యీయాటవెలదుల మాటలు సభ్యులును మీరును వింటిరిగదా? అనపేక్షితముల బ్రసంగింపగూడదను నిబంధన మిప్పుడు విమర్శింపవలయు నిబంధనాతిక్రమణదోషము లేదంటిరేని యిప్పుడు మేమెల్లరము వీరిమాటల కుత్తరము లిచ్చువారము. ఈ విషయము తప్పొప్పులు తేలిన పిదపగాని మేమేమియు మాట్లాడువారముకాము. అని యుక్తియుక్తముగా బలికిన విని రాయలవారు న్యాయవాదులుగా నిరూపింపబడిన పండితులదెస చూపుల వ్యాపింపజేసిరి. ఆ పండితులా విషయమై వారిని ప్రశ్నచేసి వారుచెప్పిన సమాధానము లుచితములుగాలేవని యొప్పించి యా మువ్వురు జవ్వనులకు సభ ముగియువరకు మాటాడకుండునటుల శిక్షవిధించిరి.

దానంజేసి మందారవల్లి శిష్యురాండ్రు అది మొదలు యేమి అనిన నేమి అపరాధము గణింతురో అను వెరపుతో మునుపటివలె విజృంభింపక అడకువతో మాట్లాడ దొడంగిరి. తరువాత రామలింగకవి శిష్యులు నూర్వురును వరుసగా నిలువంబడి ఇట్లు చదివిరి.

గీ. పరభుజంగాఢ్య మందారవల్లియైనఁ
    బెనగొనంగ లవిత్ర సాధన సమృద్ధిఁ
    బరిభవించుట యుచితంబు యరయ నన్మ
    దీయ గురుకార్య పటిమకిది యొకపనియె.

అని చదివిన పద్యమును విని మందారవల్లి శిష్యురాండ్రు తదర్థము గ్రహించి అర్థము జనింప దాని అర్దదోషములు శబ్దదోషములపట్టి శతథా ఖండించుటకు నిశ్చయించుకొని అప్పటి కేమియుం బలుకక పూర్వమువలెనే వరుసగా నిలువంబడి నేనఖి లశాస్త్రజ్ఞను, నేనశేషభాషావేదినిని, నేను సర్వలిపిశాస్త్రవేత్తను నే నష్టశతావధాననిపుణను నే vనర్గళసాహితీcjdమజ్ఞానధురీణనని యీరీతి నూర్వురును తమతమప్రజ్ఞాప్రభావములం జెప్పుకొనిరి.

పిమ్మట రామలింగకవి శిష్యులును నే నఖిలసిద్ధాంతశాస్త్రజ్ఞుడ నే నశేషసిద్దాంతభాషావేదిని, నేను సర్వసిద్ధాంతలిపిజ్ఞానకౌశలుండనని క్రమముగా నూఱ్వురువారు చెప్పిన విద్యలకు మొదటసిద్దాంతపదము ప్రయోగించుచు దమవిద్యలు సిద్దాంతమై నటులను వారివి కానియటులను సూచించునట్లు చెప్పిరి.

పిమ్మట రామలింగకవి శిష్యునకును మందారవల్లి శిష్యురాలికిని నీరీతి సంవాదము జరిగినది.

శిష్యురాలు -- ఆర్యా! నేను వ్యాకరణము భాష్యాంత మధ్యయనము చేసితిని. అంతయు ముఖస్థమై యున్నయది సిద్ధాంతము గావించెదను. యెందైన పూర్వపక్షం చేయుడు.

శిష్యుడు -- ముదితా! నీవు చదివిన వ్యాకరణ మెవ్వరు లిఖించినదో చెప్పుము పూర్వపక్షము చేసెదను.

శిష్యురాలు - ఆర్యా! అట్టి ప్రశ్నమునకే అవకాశములేదే?

శిష్యుడు - ఇందువదనా! ఎందువలన?

శిష్యురాలు - శ్లో. యేనాక్షరసమామ్నాయ మధిగమ్యమహేశ్వరాత్

కృత్స్నం వ్యాకరణం ప్రోక్తస్మైపాణినయేనమః!!

తా. ఏ మహానుభావుడు ఈశ్వరనటనసమయంబున బుట్టిన ఢక్కానాదం బూతగా బదునాలుగువేల సూత్రంబులు రచియించి విఖ్యాతిబడసెనో అట్టి పాణిని గాక వ్యాకరణమురచించిన ప్రఖ్యాతుడు మఱియెవడు?

శిష్యుడు - అల్పజ్ఞులే అంతయుం తెలియునని చెప్పుకొందురు.

శిష్యురాలు -- అట్లనుటకు గారణమేమి?

శిష్యుడు - నీ మాటలంబట్టిచూడ నీకాపాణిని వ్యాకరణముగూడరాదని తలంచెదను.

శిష్యురాలు - నామాటలు సంస్కారహీనములుగా నున్నవియా యేమి. తెలియ జెప్పినచో సవరించుకొనియెదను. ఇంతయేల యెందైన నడుగరాదా.

శిష్యుడు - ఎనిమిదవ అధ్యాయము మూడవపాదము పందొమ్మిదవసూత్రం చదువుము.

శిష్యురాలు -- లోపశ్శాకల్యస్య ఇదియేనా ?

శిష్యుడు - అగు నర్థము చెప్పుము.

శిష్యురాలు - అవర్ణపూర్వయోః పదాంతయోర్యపయో లోపోవాశి వలె అనగా ఆకారము పూర్వమందు గలిగినట్టియు బదాంతములైన యవలకు ఆశిప్రత్యాహారము పరమగునపుడు లోపము వైకల్పితముగా వచ్చును. -----యేచోయనాయావః అను సూత్రమువలన హరయ్-ఏహి అని రాగా ఆ యకారము లోపించినప్పుడు హర -ఏహి అనియు లోపించినపుడు హర-యేహి యనియురూపములు విష్పన్నము లగుచున్నవి.

శిష్యుడు - గట్టిగానే వల్లించితివి. లోపశ్శాకల్యస్య "త్రిప్రభృతిఘశాకటా యనన్య" "అవజ్‌స్ఫోటాయనన్య" ఝయోహోన్యతరస్యాం అను సూత్రములలో శాకల్యస్య శాకటాయనన్య స్ఫోటాయనన్య అన్యంతర స్యాం అను శబ్దము లేమి తెలియజేయుచున్నవి?

శిష్యురాలు - ఆ పదముల వలన సూత్రార్ధము వైకల్పికములని తేలుచున్నది.

శిష్యుడు - ఆ పదముల కా యర్ధము లాక్షణికమా రూఢమా?

శిష్యురాలు - రూఢముగాదు లాక్షణికమే అనగా శాకల్యాదులయొక్క మతము అట్లున్నవి. వానిలో పాణినియు నేకీభవించి యొప్పుకొనుటచేతను రెండు విధముల ప్రయోగములుండుట వలనను వైకల్పికమని లక్షణచే నా అర్ధము వచ్చినది.

శిష్యుడు - మంచిమాట జెప్పితివి. కాని శాకల్యాదులు పాణినికి బూర్వకాలికులా తరువాతవారా?

శిష్యురాలు - తరువాత వారెట్లగుదురు. పూర్వులనియే చెప్పవలయును.

శిష్యుడు -- పాణినికి పూర్వులైన శాకల్యాదులు పాణినియుదహరించిన సూత్రములలోని విషయములేనా. మఱియేవియైన గ్రంథములు వ్రాసియుందురా ?

శిష్యురాలు - అది యెవ్వరికి దెలియును.

శిష్యుడు --- పాణిని యుదహరించిన సూత్రములలోనున్న మతాంతరములం బట్టి అంతకు బూర్వము వ్యాకరణములున్నట్లు స్పష్టముగా దెలియబడుచుండలేదా? నీకు దెలియకున్న నీయుపాధ్యాయ నడిగిరమ్ము.

శిష్యురాలు -- అయిన నగుంగాక దానం దప్పేమి?

శిష్యుడు - నీ తప్పు నీకు దెలియదు మొదటనాతో నేమంటివో జ్ఞాపకము దెచ్చుకొనుము.

శిష్యురాలు - అదియు మీరే చెప్పుడు.

శిష్యుడు - నేనే చెప్పెద వినుము నీవు చదివిన వ్యాకరణమెవ్వరు రచియించినదనగా బాణినియొక్క,డే వ్యాకరణమును రచించినట్లును, ఇతరవ్యాకరణములు లేనట్లును అట్టిప్రశ్నమునకే అవకాశములేదని నీవు చెప్పలేదా? ఇప్పుడేమనియెదవు.

శిష్యురాలు - బాగుబాగు! ఇదియా మీరు వెదకినతప్పు.

శిష్యుడు - ఇంతకన్న యెక్కుట మెద్ది? నీకు బూర్వోత్తర సందర్భములే తెలియకున్నవి ప్రసంగమెట్లు చేసెదము?

శిష్యురాలు - పొల్లుమాటలకేమి? శాస్త్రవిషయముల పూర్వపక్షము చేయుడు.

శిష్యుడు - వీని నీవు పొల్లుమాటలనుకొంటివి. కావు, కావు. నీవు వేసిన ప్రశ్నలు తప్పని యొప్పుకొనువరకు బూర్వపక్షము చేయను

శిష్యురాలు - సరే యొప్పుకొన్నాను. ఇంతటితో అయ్యెనాయేమి.

శిష్యుడు - ముమ్మారనుము.

శిష్యురాలు - ముమ్మారనిన వచ్చిన విశేషమేమి! అట్లేయంటిని.

శిష్యుడు - (తనముందరనున్న ప్రాతతాటియాకుల పుస్తకములం గొన్నిటిం జూపుచు) కాంతా! నీవు చదివిన పాణిని వ్యాకరణమే మాచేత బూర్వపక్షమున చేయబడినది. వానిలోనున్న సూత్రములు లెక్కయేమి? ఈ గ్రంధములన్నియు సిద్ధాంతవ్యాకరణములు. చూడుము. (అని కొన్ని అర్థము లేని సూత్రముల నేవియో చదివెను)

శిష్యురాలు -- (అతడు చదివిన సూత్రముల కేమియు అర్థముగాక ఆతని ముందరనున్న పుస్తకమొకటి విప్పిచూచి) అయ్యో! ఇది యేమి గ్రంథము. ఇందు గీటులేగాని అక్షరములు లేవేమి?

శిష్యుడు - ఓహో! సకలలిపిజ్ఞానకౌశలనని చెప్పుకొంటివే ఇదియే తెలియదా? ఇది దేవనాగరలిపి.

శిష్యురాలు - దేవనాగర మిట్లేలయుండును. అది మేము చదివినదే.

శిష్యుడు - మీరు చదివినది మనుష్యనాగరము. ఇది దేవనాగరము. ఈ తారతమ్యము మీకు దెలియదు. ఇందువలననే మీకేమియుం దెలియదని మొదటనే యంటిని. సిద్ధాంతశాస్త్రములన్నియు నీలిపిలో నేయున్నవి. ఈ లిపియే తెలియనివారితో బ్రసంగమేమిటి చాలులే?

శిష్యురాలు - దీని దేవనాగరమనిన నెవ్వ రేని నమ్ముదురా? మేము సంస్కృత గ్రంథములన్నియు దేవనాగరలిపిలోనే చదివితిమి.

శిష్యుడు - నీకు జెప్పినం తెలియకున్నది. మనుష్యనాగరముతోడనే కొన్ని సంస్కృతగ్రంథము లున్నయవి. దానినే తెలియనివారు దేవనాగరమని వాడుదురు. సిద్ధాంతశాస్త్రములన్నియు నీ లిపితోనే యున్నవి. దేవలోకములో దేవతలు వాడు లిపి ఇదియే అని ఈ గ్రంథములో నున్నది చూడుము. ఈ లిపియే దెలియక మీరు పెద్దపెద్దబిరుదములతో దేశాటనము చేయుచున్నారా? మా యుపాధ్యాయ అగులవిత్ర శక్తి మీ మందారవల్లి యెఱుంగక యిచటికి వచ్చినది. అయినను నీ లిపి మందారవల్లికి దెలియునేమో చూపించిరమ్ము.

శిష్యురాలు - ఆమె ఈ విషయమై పిమ్మట విచారించగలదు. కాని మీరీ గ్రంథములో నేమేమియున్నదో చదువుడు. అని అందున్న మఱియొక పుస్తకమతనిచేతి కందిచ్చెను.

శిష్యుడు - ఒహో! ఇది నేను చూడకుండగనే చదువగలను చూచి చదు వుటయేమి అబ్బురము (అని యెద్దియో సూత్రములు గణ గణ జదివెను) ఆసూత్రములే ముమ్మారు చదివించినది. మిక్కిలి బుద్ధిమంతుండగు నా శిష్యుండు ఆ కల్పన సూత్రములను మూడుసారులు యేకరీతిగానే చదివెను. ఆ పాఠము రామలింగకవి విద్యార్థులకు బోధించియున్నదే. తెరలోనుండి యా వాదము వినుచున్న మందారవల్లి యుల్లంబు దల్లడిల్లనవి యే శాస్త్రములోని సూత్రములో అని శాస్త్రనామముల జ్ఞాపకము చేసికొనుచుండెను. అప్పుడా శిష్యురాలు ఆ పుస్తకముల వ్రాతబట్టిచూడ మిక్కిలి ప్రాతదగుటచే నిజమేమో అను వెఱుపుతో ఆర్యా! లోకమంతయు వ్యాపించియున్న పాణినీయసూత్రములు ప్రత్యాఖ్యాతములై నవనియు క్రొత్తవాక్యరణముల ప్రమాణమేమియో చెప్పుడని అడిగినది అప్పుడు శిష్యుడు సకలసిద్ధాంతశాస్త్రసారంగతురాలగు లవిత్రయే దీనికి ప్రమాణమని చెప్పెను.

మీకు లవిత్ర ప్రమాణమైనచో మాకు మందారవల్లియే ప్రమాణము అని శిష్యురాలు చెప్పెను. అట్లయిన వారిరువురి వలననే యీ సిద్ధాంతము తేలవలసి యున్నది. కావున నీవు లోనికింబోయి ఈ విషయము లన్నియు నా వేశ్యాలలామమునకు బోధింపుము. పొమ్మని సావలేపముగా బలికి యీ శిష్యుడు తన పీఠముపై గూర్చుండెను భట్టుమూర్తిని మాటాడనీయక అక్షరమునకు నూఱు తప్పులంబట్టి సిగ్గుపఱచిన ఆగ్గరిత సిద్దాంతకౌముదియైనను తిన్నగా జదువని యొక విద్యార్థికి సమాధానము చెప్పలేక తొట్రుపడుచు లోనికిం బోయినది. తక్కిన శిష్యులను మందారవల్లి శిష్యురాండ్రకెల్లర నా రీతినే యతికి ప్రతి జెప్పుచు తమ ముందర నున్న గ్రంధముల జూపుచు నా లిపి వారికి దెలియమి సులభముగా పరాజితలం గావించిరి.

అట్లు మందారవల్లి శిష్యురాండ్రందరు రామలింగకవి శిష్యులచే నోడిపోయి వారు చెప్పిన ప్రమాణముల నొప్పుకొనక మందారవల్లినే మధ్యవర్తిగా గోరికొనిరి. వారితో రతిరహస్య విశేషములు తనకంటె విశేషముగా దెలిసిన వారెందును లేరని అభిమానముగల కలికికిని మఱియొక శిష్యునకు నీరీతి సంవాదము జరిగినది.

శిష్యు - యువతీ! నీవేశాస్త్రము చదివితివి. వాదశక్తి దేనియందు మిక్కుటమో వక్కాణింపుము ప్రసంగింతును

శిష్యురాలు -

శ్లో॥ భూయోభూయో మునివర గవీరర్థదుగ్థాని డుగ్ధ్వా
      నిర్మధ్యాతి ప్రణిహితధియా సోమయా దాయతః
      స్వాధుః వథ్యో లలిత యువతీ యౌవనాభోగభోగ్యో
      ముఖ్యోదేవైరపి బహుమత స్సేవ్యతాం ----తేంద్రాః

మిక్కుటమగు శ్రద్దచే బెక్కుసారులు వాత్స్యాయనాది మహామునులయొక్క వాక్యములనెడి పాలును తరచితరచి సారము దీవపట్టియు మందయగు యువతుల యౌవనముయొక్క అనుభవమే ప్రధానముగా గలిగినట్టియు దేవతా--------- భీష్ట మైనట్టియు, కొక్కొకమహామునియొక్క రచనయనెడు నవనీతమును పండితులు అనుభవింతురుగాక అను శ్లోకమునుజదివి నేనీశాస్త్రమును, సాంగముగా జదివితిని, ఎందేని బరీక్షింపుడు.

శిషు - ఆహా! ఉచితమేతత్ (ఇది నీకు దగినదే) కాని కామినీ! శాస్త్రానుభవమేనా, లోకానుభవ మేమైనంగలదా?

శిష్యురాలు - లోకానుభవములేనిశాస్త్రము. శాస్త్రానుభవము లేని లోకానుభవము శోభింపవుగదా?

శిష్యు - శోభింపవనుమాట యెఱుంగును నీకు రెండునుంగలిగియున్నవా లేవా? అవిషయమే చెప్పవలసినది.

శిష్యురాలు -- నాకు రెండునుం బూర్తిగా గలిగియున్నవి.

శిష్యు --- అట్లయిన బట్టణపుజంగశిఖామణులు ధన్యులేకదా?

శిష్యురాలు --- అప్రస్తుతముతో బనియేమి? ప్రస్తుతాంశముల సంభాషింపుడు.

శిష్యు -- కానిమ్ము! నీ రెంటిలో ముందు దేనిం బరీక్షింపను.

శిష్యురాలు — మీకేది యభీష్టమో దానినే.

శిష్యు — యుక్తతయుం (మంచిమాట బలికితివి) మన్మథశాస్త్ర ప్రయుక్తములైన గ్రంథము లేమేమి చదివితివో చెప్పుము.

శిష్యురాలు -- సకలగ్రంథసారంభూతంబైన రతిరహస్యంబు క్షుణ్ణముగా జదివితినని మొదటనే చెప్పితిని.

శిష్యు -- ఆలాగునా అట్లయిన మొదటి పరిచ్ఛేదమునందు నెనిమిదవశ్లోకం జదువుము.

శిష్యురాలు-

శ్లో॥ యద్వాత్స్యాయనసూత్ర సంగ్రహబహిర్భూతం కిమస్త్యాగమే
     దృష్టం వాచ్యమిదం మయా మునిగిరాంశ్రద్దాహి సాధారణా
     భావివ్యంజత మన్యభంగిరచితం తత్రైవచే దస్తియ
     న్మందానాముపయుజ్యతే తదితిహి స్పష్ణోభిధేయం కృతిః॥

వాత్స్యాయన మహర్షిసూత్రములుగా రచియించిన గ్రంథవిషయములనే నేను మందబుద్ధులగువారికి నుపయోగించు నిమిత్తము స్పష్టముగా వ్రాసితినిగాని యిందలి కల్పనలు నాయవికావు. మునివాక్యములయందుండిన నమ్మకము దీని యందును నుండదగినదని గ్రంథకర్త వ్రాసికొనినాడు ఇదియేనా.

శిష్యు -- అగునగు మందమతులకు సుపయోగము నిమిత్తము రచించిన గ్రంథము చదివి మన్మథకళారహస్యము లన్నియు నెఱుంగుదునని చెప్పుచుంటివా? మేలు మేలు!

శిష్యురాలు - ఓహో! ఇదియా మీకు దోచినశంక. మంచిదినుండు. చతు------- సృజించు సమయమున వేదప్రయుక్తముగా ద్రివర్గసాధనమను గ్రంథము (ధర్మార్థకామవిషయములం దెలుపునది) నూఱువేల అధ్యాయంబులుగా రచించెను. శంకరానుచరుండైన నందికేశ్వరుండు దానిలోనేకదేశంబగు కామతంత్రంబును విమర్శించి సహస్రాధ్యాయములుగా రచించెను. పిమ్మట దానినే క్లుప్తపరచి శ్వేతకేతు డైదువందల అధ్యాయములుగల గ్రంథమును రచించెను. మరియుం దత్తక, కూచిమార, గోణికాపుత్రాదులు పారదారికము కన్యావ్రిసంభము భార్యాదికారము లోనగు నొక్కొక్క విషయమును మాత్రము గైకొని రచించిరి. తరువాత వాత్స్యాయనమహర్షి సర్వవిషయములంగూర్చి సప్తాధికరణములు సూత్రములు వ్రాసెను. అందు నందికేశ్వర శ్వేతకేతు భాభ్రవ్యాదులగ్రంథములు సులభముగా గ్రహింపదగినవికావు. దత్తకాదుల గ్రంథము లేకదేశోక్తములు, వాత్స్యాయనసూత్రములు గూడార్ధములు. కావున సర్వగ్రంధమతసారము గ్రహించి యీకవి ఈ గ్రంథమును రచించెను. అద్దమందు జగంబంతయు ప్రతిఫలించునట్లు యీకృతి యందు నన్నివిషయములు గలిగియున్నవని కవి వ్రాసికొన్నాడు. ఇంతకన్న మంచి గ్రంథము మఱియొకటిలేదని నానమ్మకము.

శిష్యు -- కూర్మము తాదిరుగుచున్న నూతికన్న లోకము లేదనుకొను. గొల్లకలాపమంతయు నేకరుపెట్టియు స్వవచనవ్యాఘాతమును దెలిసికొనలేకుంటివి.

శిష్యురాలు ---- ఎట్లు?

శిష్యు --- బ్రహ్మనిర్మితమైన త్రివర్గసాధనములో మూడవభాగము కామతంత్రము ముప్పదిమూడువేల అధ్యాయములుగలది అది యుండగా పదివేల అధ్యాయములుగల నందికేశ్వర కృత గ్రంథముండగా , వాత్యాయనసూత్రము లుండగా వానినెల్ల విడిచి వానిలో సామాన్యవిషయములందీసి చదువురానివారికి దెలియుటకై పదిపరిచ్ఛేదములుగా రచించిన యొకగ్రంధమునుం జదివి నాపాటి రసికురాలులేదని గర్వపడుచుంటివే! పై గ్రంథములున్నటుల నీవు చదివిన దండకములోనేయున్నయది చూచుకొనుము బ్రహ్మనిర్మితంబయిన త్రివర్గసాధనము నందికేశ్వర వాత్స్యాయనాదిమహర్షి ప్రణీతంబయిన గ్రంథములు మాయొద్దనున్న యవి. మేమవి అన్నియు బాఠముగా జదివికొంటిమి వానికిని నీవు చదివిన గ్రంథములకును హస్తిమశకాంతరము గలిగియున్నయది. కావలసినంజూసుకొనవచ్చును. (అని కొన్ని పుస్తకములు జూపుచున్నాడు.)

శిష్యురాలు -- (విప్పిచూచి) అయ్యో! వీనియందున్నలిపి యేమిలిపి?

శిష్యు - బ్రహ్మలిపి యీలిపియే తెలియక వాదమునకు బూనుకొంటివా? పో పొమ్ము.

శిష్యురాలు - ఇందలి విశేషము లేమి?

శిష్యు --- ఏమియా! చెప్పెదవినుము. నీగ్రంథమందు స్త్రీజాతు లెన్నివిధములు?

శిష్యురాలు — పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని అని నాలుగువిధములు. శిష్యు --- ఇంతేనా? మరియేవిధమైన నంతర్భాగములు కలవా?

శిష్యురాలు -- కలవు . హరిణి, బడబా, కరిణి అని మూడుజాతులు ప్రతి జాతికిం గలవని చెప్పబడియున్నది

శిష్యు - ప్రపంచములోనున్న స్త్రీలందరు పై నుదహరించిన నాలుగుజాతులలోను, ఈమూడుజాతుల లోను జేరియుండవలయును గదా?

శిష్యురాలు --- ఏలచేరకుందురు.

శిష్యు - అట్లయిన హరిణ్యాదిజాతులలో నీ వేజాతిలోని దానవో చెప్పుము. నీ అనుభము చూతము.

శిష్యురాలు - (సిగ్గభినయించుచు) అది యెట్లు తెలియనగు?

శిష్యు - శాస్త్రానుభవముగలిగియున్న వారికి దెలియకమానదు.

శిష్యురాలు — తెలిసినను జెప్ప నగునా?

శిష్యు - అన్నియు నెట్లుచెప్పితివో యిదియు నట్లే.

శిష్యురాలు - ఈలాటి విషమప్రశ్నలు స్త్రీల నడుగవచ్చునా ?

శిష్యు - ప్రతివాదినిలుగావచ్చి స్త్రీలు సభలు చేయుచుండ బురుషుల నెట్లడుగుదును.

శిష్యురాలు - విద్యావిషయముల నడుగక రహస్యప్రశంస సేయవచ్చునా ?

శిష్యు -- రతిరహస్యమునెల్ల నెఱింగిన ప్రౌఢనని నీవు బీరములు పల్కుచుండ నిన్ను నా విషయములలో నడుగక బాలరామాయణములో నడుగవలయునా యేమి?

శిష్యురాలు — సరే! మీరుద్గ్రంధములు చూచితిరికదా! తద్విశేషము లేమియో చెప్పుడు.

శిష్యు - ఆఁ ఆలాగున నడుగుము. బ్రహ్మనిర్మితంబైన త్రివర్గసాధనమను గ్రంథంబున జెప్పబడినజాతులు పద్మినీప్రభృతులు ఒక్కొక్కటి లక్షభేదములు గాగలవిగా నున్నయవి. అవి తఱుచు పశుపక్షిమృగాది నామంబులు గలిగి యున్నవి. హరిణ్యాదిజాతిభేదంబులు ముప్పదివేలు. పురుషజాతులు శశ, వృష్ఠాశ్వాదులుసైతము తొంబదివేలభేదములుగా జెప్పబడియున్నవి. ఈ చెప్పినలక్షణములన్నియు నీగ్రంధములో నున్నవిచూడుము. అని పలుకుచు దత్సమయోచితముగా గొన్నిశ్లోకములంజదివి తన ముందరనున్న యొకతాటియాకుల పుస్తకమునుజూపెను అందున్న లిపి అప్పడతి కేమియు దెలియమి నేమియుంజెప్పలేక లజ్జావనతవదనయై యూరకుండెను. అప్పుడు సభ్యులందఱు నావటూత్తముని వాక్పటిమకు మిక్కిలి సంతసించుచు జయజయధ్వనులతో బుష్పముల జల్లిరి.

మందారవల్లి శిష్యకోటి ఆంతయు దెల్ల బోయిన ముఖములతో దెరలోనికి బోయినది. అప్పటికాలము మిగిలినందున నంతటితోసభ ముగించుటకును మరునాడావేళకే సభ మరలజేయుటకును, రాయల వారుత్తరువు చేసిరి. అందఱును యథా క్రమంబునా దమతమ విడెదములకుంబోయిరి. అమ్మరునాడుదయంబున రహస్యవిశేషంబుల దెలిసికొన బంపిన సుభద్రుండువచ్చి మిత్రమా! నేను బూర్వమువలె నమ్మవారి ప్రసాదంబిచ్చు నెపంబున మందారవల్లి ఆవనధంబునకుబోయి కొంచెము మాటుగా నిలువంబడినంత వారిమాట లిట్లు విననయ్యెను.

మందా - కాంతలారా! మీరింత పిరికితనంబు బూనితిరేల? నిన్నటిసభలో నొక్కమాటయు యుక్తియుక్తముగా జెప్పలేదు. కారణమేమి?

శిష్యురాండ్రు - అమ్మా ! మేమేమి చెప్పుదుము. ఆబ్రహ్మచారు లెదగిత్తలవలెనుండి మమ్ము మాటాడనిచ్చిరికారు. మేమెద్దియేని చెప్పితిమేని కాదని ఏదియో పుస్తకముంజూపురు. ఆలిపి బ్రహ్మలిపి అట. ఎవ్వరికిందెలియదు. అశ్రుతపూర్వము అదృష్టపూర్వము పోనీ తప్పందమన్నను ఆలిపి క్రొత్తగా వ్రాసినట్లు కనబడదు. అందలివిషయములు దేవతలు వాడునవి అట . భాషలులిపులు అనంతములని యున్నది గదా? ఆలిపి తెలియమి నింతవచ్చినది. విద్యలచేగాక మాటలచేతనే యోడిపోయితిమని విచారముగా నున్నది. ఏమి చేయుదుము . అదేమిపాపమో యొక్కమాటయు తోచినదికాదు. ఆ కొదవరేపు మీరు తీరుతురసు నాసతో నున్నారము .

మందా - అయ్యో! వట్టిమాటలకే సదుత్తరము లీయలేక పోతిమిగదా. ఇది అంతయు రామలింగకవి కల్పితముగాని మఱియొకటి గాదు. మనము పులియున్న పొదకు రాగూడదు. నామది నపజయసూచకములు పెక్కులు పొడముచున్నవి. అతండు లవిత్ర అని పేరు పెట్టుకొని స్త్రీ వేషముతో వచ్చిన కారణము ఱేపునొడివెద. లోకమంతయు జయించి తుదకు వీరిచేత నోడిపోవలసివచ్చినది నాకెవ్వనియందు సందియమో ఆతండే భంగపఱచెను. పెక్కు దేశములుండ నీతనిచరిత్రములు వినియు నిందురానేల. కాలగతియే విపరీతబుద్దులం బుట్టించును.

శిష్యు - అమ్మా నీవు వీరిని బరిభవింతువని నెంతయో యాశతో నుంటిమి. ఈలాగు నధైర్యపడుచుంటివేమి? రామలింగకవి పేరు యెక్కడను లేనిదే ఆతనిం దలంచుకొని వెఱచుచుంటి వేమిటికి! నీ విద్యామహిమ మఱచితివా ?

మందా - అయ్యో? మీ కేమి తెలియును. నేనాగతము గురు తెఱింగినదానఁ గాన నింతగా వక్కాణించుచుంటిని కానిండు యేమి చేయుదుము. ఉచితముకొలది యాలోచించుకొందము.

అని యట్లు వారుసంభాషించుకొనుచుండగా నేను ప్రసాదము దీసికొని దాని యెదుటికింబోయితిని మొగమునందేమియు గళలేదు. విచారముగా నున్నది. నన్ను జూచి యొక చేటికకుం గనుసన్నజేయ నదివచ్చి ప్రసాదము గైకొనినది. నేను కూర్చుండక పూర్వమే ప్రొద్దుబోయినది. నేటి కింటికి దయచేయుమని సూచించగా సంతసించు లేచివచ్చితిని ఇదియ రాత్రిజరిగిన విశేషంబు. నీకతంబున దానికి కంపము జనించినది. అని చెప్పిన విని రామలింగకవి ఆతని మిక్కిలి గారవించెను.

అంత మఱునాడు యథాకాలమునకు సభ కూడినది. అమాత్యుండులేచి మును వోలె నిబంధనాంశములం జెప్పి కూర్చుండెను. తరువాత నుభయుల శిష్యవర్గము తెరలముందర నిలువఁ బడి తమతమ యుపాధ్యాయుల ప్రభావములం బేర్కొనిరి. పిమ్మట మందారవల్లి శిష్యురాండ్రు వినోదముగా సంగీతముపాడ దొడంగిరి అప్పుడు రామలింగకవి శిష్యులు స్వకల్పితములైన సామగానముచే సభ్యులకు నవ్వుగలుగ జేసిరి. అమ్మహానాదంబు వారించుచు నమాత్యుఁడు నక్రోధంబుగా నోహో! మీరిపుడు నిబంధనాతిక్రమణదోషంబు గావించితిరి. తుదమొదలు లేని యీ వెఱ్ఱిగాన మెవ్వరు గావింపుమనిరి? ఇప్పుడు మీరుదండ్యులు. తగుసమాధానము చెప్పుడని అడిగిన శిష్యులిట్లనిరి.

అయ్యా! ఈ దినమున మందారవల్లితో మా యుపాధ్యాయ ప్రసంగించునని మేము గురుస్తుతి మాత్రముచేసి తెరముందర బొమ్మలవలె నూరక నిలువంబడితిమి. ఈమచ్చెకంటులెల్ల విచ్చలవిడి పాటలు బాడదొడంగిరి. వారికవి యెవ్వరియుత్తరువో చెప్పుడు దానికిబదులుగా మేము కులోచితమైన సామగానంబులం జదివితిమి. మేము దండ్యులమైనచో వాండ్రును దండ్యులే మమ్ము నందఱ నొక్క బందీగృహంబునం బెట్టింపుడు అని చెప్పగా అందరు అద్భుతముగా నవ్వదొడంగిరి.

అంతలో మందారవల్లి తెరలోనుండి సన్ననియెలుంగున సభ్యులారా! మేము వారకాంతలమనియు విదేశస్థులమనియు అలంతిగా జూడక మా విద్యావిషయములనే ఆరయగోరెదను. నిన్నటిదినంబున మా శిష్యురాండ్ర నీబ్రాహ్మణవటువులు కపటవాక్యములచే మోసపుచ్చిరి. అది పాండిత్యప్రకర్షముగాదు. ఇదివఱకు జరిగిన ప్రసంగములో శాస్త్రప్రవృత్తి యెంతయున్నదియో మీర యాలోచింపుడు. వట్టి మాటలచే గ్రంధములపేరులు సెప్పి గద్దించిన బోవువారమా? సకలశాస్త్రంబులు మాయెమ్ములంబట్టి యున్నయవి. గుణదోషతారతారతమ్యమరయ మీర యర్హులు. మీకిదే మ్రొక్కుచున్నదాననని పలికినది.

తరువాత మందారవల్లికిని లవిత్రకును నీ క్రింది విధమున సంవాదము జరిగినది.

మందారవల్లి - అయిలవిత్రే! కాఃకాః కళా భవత్యాధీతాః కస్యామధికః పరిశ్రమః కస్యాం వాదశక్తి రసల్పా బ్రూహిమే తస్యాంపృచ్ఛామి నోచేన్మాం పృచ్ఛయస్యాం కస్యామపి.

లవిత్రా! నీవేయే విద్యలం జదివితివి? ఏ విద్యయం దెక్కుడు పరిశ్రమచేసితివి? దేనియందు నెక్కుడుగా వాదింపగలవో నాకు జెప్పుడు. దానిలో నిన్ను నేను బ్రశ్నచేసెదను. లేనియెడల నీ యిష్టము వచ్చిన విద్యలలో నన్నడుగుము.

లవిత్ర - కింబ్రూషే ? ఉచ్చైర్వద మమ బధిరమస్తి ఏమంటివి? బిగ్గరగా చెప్పుడు నాకు చెవుడున్నది?

మందా - కాఃకాః అనుమాట వెండియుం చెప్పినది. లవిత్ర -- కింవచ్చి ఏకోపి వర్ణో మచ్చృతౌ నపతిత; పటుర్మేబధిరదోష, కింకరోమి?

ఎమందును? నీవన్న మాటలలో నొక్కక్కరమేని నాచెవిలో బడలేదు. నాకు జెవుడుమెండు ఏమిచేయుదును?

మందా - తధాచేత్కధ మావయో సంవాదః అట్లయిన మనకు ప్రసంగ మెట్లు?

లవిత్ర - కింవదసి? - ఏమనుచుంటివి?

అనువరకు సామాజికులందఱు పక్కుననవ్విరి. మందారవల్లి సోపహాసముగా పెద్దయెలుంగున వెండియుఁ జెప్పినది.

లవిత్ర - తరుణీ! మరియొక్క. విశేషము వినుము. నాకు శ్రవణదోష మింత యున్నను వీక్షణకౌశల్యమది హరింపుచున్నయది నేను జూచుచుండగా నెంతమందముగా మాటాడినను దెలిసికొనగలను. ఇదియే దైవము నాకు జేసినకీడులో మేలు. ఇప్పుడు రెండు తెరలడ్డముగా నుండ నీవెంత బిగ్గరగా అరచినను ప్రయోజనము లేదు.

మందా - పోనీ, పత్రికావాదము చేయుదుమా? (అని తన శిష్యురాలిచేత బిగ్గరగా అఱపించినది.)

లవిత్ర - పత్రికావాదమువలన బాండిత్యము తెలియబడదు. పుస్తకములు దగ్గరనుంచుకొని వ్రాయవచ్చును నీవింతదూరము రానేల! ఇంటియొద్దనుండియే వాదింపవచ్చునుగదా?

మందా - మఱియెట్లు?

లవిత్ర - మనమిరువురము స్త్రీలమేగదా? ఒండొరులమిట్లు తెరలువైచుకొని మాట్లాడుట యుచితముగా లేదు. రాజపత్నులకు సైతము స్త్రీలయెడల మాటులేదు . కావున నిరువురము నొక్క తెరలోనుండి గ్రంథము జరిగింతము . బలాబలములు తేలినపిమ్మట పొరితోషికము నందవచ్చును

మందా -- (కంపముతో) ఇందులకు నేను సమ్మతింపను. అని తాను జెప్పిన సంగతులన్నియు దెలియజెప్పుటకొక శిష్యురాలిని దెరముందర నిలువబెట్టినది.

లవిత్ర - నీవు సమ్మతింపనందులకు శాస్త్రప్రదృష్టాంతముల జూపవలయును. వట్టిమాటలకు మేమును సమ్మతింపము.

మందా — నావ్రతమట్టిది. స్త్రీలైనను బురుషులైనను వారియెదుట నిలిచి నేను వాదింపను.

లవిత్ర - కపటవ్రతంబులం బూని సంస్థానములం దోచికొనుటగాదు. ఇచ్చట అట్టివ్రతములు సాగవు. ఇందులకు శాస్త్ర మనావశ్యకమంటివేని అంతకన్న విషమవ్రతంబుల మాకునుం గలిగియుండునని దెలిసికొనుము. మందా --- పెక్కుదేశములం దిరిగితిని. పెక్కండ్రు సంస్థానపండితులతో వాదించితిని కాని నన్నెవ్వరు నీప్రశ్నము చేయలేదు. ఏనెవ్వరికి గనంబడనని, నియమము చేసికొంటిని దీనం దప్పేమి. వ్రతమునకు శాస్త్రప్రయోజనమేల?

లవిత్ర - మా సంస్థాన పండితులకుసైత మొక వ్రతము గలిగియున్నది. నీవెఱుంగవు కాబోలును. ఎవ్వరేని విద్యావతులగు వారయువతులు వాదింపవచ్చిన వారిం దీసికొనిపోయి తమయింటిలో నుంచుకొనుట నేమము చేసికొనిరి. ముందు మావ్రతము సఫలము చేయుము.

మందా - ఓహో! అనుచితవచనంబులం బల్కుచుంటిరే. చాలుచాలు మీ ప్రజ్ఞాప్రభావంబులు తెల్ల మయినవి.

లవిత్ర - ఇదియేమి తెల్లము! ముందు కాబోవునది చూచుకొనుము.

మందా - స్థానబలంబునంగదా యిట్లు పల్కుట! ఈశ్లేషవచనంబులు మాకునువచ్చును కాని స్వభావముచేతనే స్త్రీలమగుటచేత నీసభలో నాడవెరతుము.

లవిత్ర -- ఆడకున్నను తెరవచ్చినది ఇదియే విపరీతము ఆడువారికిగదా యవనిక.

మందా - ఈ పొల్లుమాటల కేమి ? మీరు చదివిన శాస్త్రము లేవియో పేర్కొనుడు.

లవిత్ర - నేను నీవు చదివినవాటికన్న నూఱుశాస్త్రము లెక్కువ జదివితిని నీయిష్టమువచ్చినదానిలో వాదింపవచ్చును. తెరచాటువాదములకు మేముత్తరము చెప్పము.

మందా - అందులకు నేనొప్పనని మొదటనే చెప్పితినికాదా పెక్కుసారులా మాట ప్రస్తావింపనేల?

లవిత్ర - దానికిసయితము ప్రత్యుత్తర మిచ్చియుంటిమి చాలవేని యోడిపోయితినని పలుకుము.

అని యీరీతిని నిర్భయముగా బలికిన విని యక్కలికి యులికి యతండెట్లో తనగుట్టు గ్రహించెనని తలంచి యప్పు డావిషయమును విమర్శించుటకు న్యాయవాదుల గోరికొనినది.

వారును దమలో గొంతసేపు చర్చించి యాయించుబోడితోఁ గనకగాత్రీ, లవిత్ర నీకన్న నెక్కుడుగా జదువుకొనినదానవని చెప్పుచున్నది. వాదించుటకు సిద్దముగా నున్నదట. బధిరదోషంబునజేసి తెరలోనుండి ప్రసంగింపలేనని చెప్పుచున్నది. స్త్రీలకు స్త్రీలయెడ రాణివాసములేదు. ఇతరస్త్రీలను నీవు చూచుచుంటివిగదా కావున ముఖాముఖీవాదముచేయుట యుచితమని మాకు దోచినది.

శ్లో॥ దిజ్నౌ గానాంపదిపరిహరన్ స్థూలహస్తాపలేపాన్ ॥ అని యున్న కాళిదాస ప్రయోగమునుబట్టి చూడ శాస్త్రవాదములు ముఖాముఖిగా జేయవలయునని స్పష్టమగుచున్నది. ఇప్పుడేని అట్లువాదించి గెలువుము. లేనిచో నీయంద యోటమి యున్నది. అని మధ్యస్థులు చెప్పగా మందారవల్లి అందులకు సమ్మతించినదికాదు.

అప్పుడు ప్రధానమంత్రి లేచి పూఁబోడీ! నీవు కోరిన న్యాయవాదులు నీ వోడినట్లు చెప్పుచున్నారు సభ్యులకట్లే తోచినది. ఇంక పదినిమిషములలో బ్రసంగమునకు బూనుకొనవేని, నీ వోడిపోయిన ట్లెంచబడుదువు. తరువాత బత్రికలో వ్రాసినప్రకారము జరిగింపబడునని చెప్పి యూరకుండెను.

అప్పుడు మందారవల్లి తల్లడించుచు గద్గదకంఠముతో మహారాజా! అష్టదిక్పతులవంశమున జనించి ధర్మపాలనముగాంచు మీరి ట్లన్యాయమునకు బూనుకొన రక్షించువారెవ్వరు? నాకు బ్రతివాదులుగా నుండి మీరే తీరుపు విధించుట యుచితమా న్యాయవాదులు మాత్రము మీవారుకారా! మనతగవు మఱియొకరాజు నొద్దకు బంపవలయు ఆయన చెప్పినట్లు వినుట కర్జము అట్లుగాక బలవంతముగా ద్రోయింతుమనిన నేమిసేయుదాననని దైన్యముతో వేడుకొనిన విని అప్పుడమిఱేడు చిఱునగవుతో నిట్లనియె.

బోటీ! నీమాటకు మేమంగీకరించితిమి. ఈ గ్రంథమంతయు వ్రాతమూలముగా మనకు జక్రవర్తిగానున్న ఫాదుషాగారియొద్ద కనిపెదము నీవు ఢిల్లీకిబోయి వాదించుకొనుము. మేమును దగినవారిం బంపెదము. అంతదనుక నీయాస్తియంతయు మాస్వాధీనములో నుంచికొందుము. అందు జయాపజయంబులు దేలిన యట్లుగా నాచరింపబడునని అప్పుడే అట్టి యాజ్ఞాపత్రిక వ్రాయించి యిచ్చెను.

అప్పుడు సభ్యులందఱు పెద్దయెలుంగున లవిత్రను బ్రశంసించిరి అంతటితో సభముగిసినది. లవిత్ర యాందోళిక మెక్కి శిష్యవర్గముతో గూడ విజయనాదములతో నింటికిం జనియె. వారివెంటనే రాయలవారు పండితులతో రామలింగకవి యింటికిబోయి ఆతడున్న తావు తెలిసికొని లోపలికి జని బండితమండలితో నతని పాదంబులం బడియెను.

రామలింగకవి వారినందర మన్నించుచు నుచితాసనంబులం గూర్చుండజేసి యాత్మాపచారమును తెలియంజేయుచు నందఱు తన యింటికిం దయచేసిన కారణ మేమని యెఱుగ నట్లడిగెను.

అప్పుడా నృపతి ఆతని గౌగిలించుకొనుచు కవీంద్రా! ఇంకను మమ్ము నేమిటికి వేపెదవు నీవు లవిత్రమువలె మందారవల్లిం ద్రెంపితివి నీచేసిన యుపకృతి యెన్నటికి మఱవదగినదికాదు. సంస్థానము ఖ్యాతినిలిపితివి. ఆ పండితులు వారు గావించిన కాపట్యము మఱువవలయునని నిన్ను బ్రార్ధింపవచ్చిరి. మాఅపరాధములు మరచిపోవలయును నీవురాక మందారవల్లిని బరమేశ్వరు డోడింపలేడు. దేవీకటాక్షపాత్రుండవు. నీకు నసాధ్యమేమియున్నదని పెద్దతడ వతని వినుతించెను.

రామలింగకవియును దత్కాలోచితములయిన మాటలచే రాయలవారికిని బండితులకు లజ్జాసంతోషములం గలుగజేసెను. అప్పు డప్పుడమిఱేడు ఆర్యా! పండితకంటకురాలగు మందారవల్లి నిందు బరిభవించితివి. కొదవకార్యముకూడ నీవ యాచరించవలయు నీయానతిమీదనేకదా ఢిల్లీకిబోవుటకు దానికాజ్ఞ యిచ్చితిని. అది విద్యావతి అగుటచే దన విద్యాపాటవము చూపి అచ్చటివారి వశపరచుకొని తన పక్షము తీరుపు చెప్పించుకొనగలదు కావున దగినపరివారముతో నీ వచటికి బోయి కార్యము సాధించుకొని రమ్ము. విజయమును బొందుమని పలికి అతని నొప్పించి సపరివారముగా నింటికిం బోయెను.

మందారవల్లియు నట్లు రామలింగకవిచే నవమానింపబడి మిక్కిలి విచారముతో నెవ్వరికి దెలియకుండ నిజనివాసమునకు బోయినది. ఆరాత్రి శిష్యవర్గంబునకు దానికి నీరీతి సంవాదము జరిగినది

హేమలత - ఏమమ్మా! ఇంచుకంతయు బ్రసంగము సేయకయే యోడిన ట్లొప్పుకొంటివి. లవిత్ర అంత ప్రజ్ఞావతియా యేమి! అయ్యో! నీవు సులభముగా వారిం బరిభవింతువని గంపెడాశలో నుంటిమి. ఏమియును లేకపోయెను. నీ వేసభలోను నింత పిఱికితనము బూనలేదే. ఇది గ్రహచారము గాబోలు.

మందా – (నిట్టూర్పుతో) హేమలతా! నీతో నేమి చెప్పుదును. గ్రహచారము చాలకయే మనమీ యూరు వచ్చితమి. లవిత్ర అనునదియొకతె యున్నదనుకొంటివా లేదు. లేదు. రామలింగకవియే అట్టివేషము వేసికొనివచ్చెను. కంఠధ్వనింబట్టి పురుషుడని తెలియలేదా.

మంజువాణి - అగుఁ గాక వెరవనేల? మనకు స్త్రీ పురుష వివక్షతతో బని యేమి? చూడతగినది విద్యాప్రసక్తిగదా. ప్రసంగ మేమిటికి గావింపలేదు. ఇదియే మాకందరికి సందియముగా నున్నది.

మందా - దేవరహస్య మొకటియున్నది అది మీకు దెలియకపోవుటచే నిట్లనుచున్నారు. ఎదుర నిలువంబడి నేనెవ్వరితో బ్రసంగింపలేను ప్రసంగించితి నేని నేమాటయు దోచదు. పూర్వ మొక యపచారనిమిత్తంబున సిద్దుడొకడు నన్ను శపియించెను. ఆ రహస్యమెట్లో గ్రహించి రామలింగకవి యిట్టివేషము వేసికొనియెను. ఏమిచేయుదును? ఆడువాండ్రచెంత రాణివాసమని చెప్పుట యుక్తియుక్తముగా నుండునా? యుక్తులలో మనకంటె నతడు పదియాకులెక్కువ చదివినవాడు.

హేమలత - ఓహో! ఇదియా తల్లీ ! ఈ రహస్యము మేమెఱుగము సుమీ! అన్నన్నా! ఎంతమోసము? ఎట్లుగ్రహించెనో తెలియదు. ఇందులకా నీవతండనిన నూరక బెదరుచుందువు. ఇప్పుడు మనమేమి చేయదగినది .

మందా - మనము ఢిల్లీపట్టణమునకుబోయి అందు జూడదగిన వారింజూచి మనవాదము గెలుచుకొనునట్లు చేసికొనవలయును.

ప్రియంవద - అది యెంతపని. మనల జూచినంత నాయవనప్రభువు మనపక్షమున దీరుపు చెప్పకుండునా. అందులకు నేనీపూట పనివాండ్రకు బయనము నియమింపనా?

మందా - అయ్యో! రాజశాసనము నీవు వినలేదు కాబోలు. జయాపజయ ములు తేలువరకు మనయాస్తి ముద్రవేయించుదురట. మనము సామాన్యవేషముతో బోవలయును. కాని యీ జంఝాటముతో వీలులేదు.

మంజువాణి - అయ్యో! అట్లయిన మనలం జూచువారెవ్వవ్వరు? మా వస్తువాహనములను ముట్టనీయరా యేమి?

మందా - మీ మా వివక్ష వారికేమి తెలియును అందు పూచికపుల్ల యేవిఁ దీసికొననీయరట. పోవుటకు బండియొకటియు నన్నవస్త్రములకు దగినంత విత్త మిత్తురట.

మంజువాణి — మనకు మంచిదశయే వచ్చినదే. ఎవ్వరికిని గాలము సమముగా నడువదు. జయజయధ్వనులతో బరిచారకులు చుట్టునుం బరివేష్టించిరా నాందోళికమెక్కి అరుగు నీవిప్పుడొక బండిపయి బేదముత్తయిదువవలె నరుగవలయును హా! యెంతకష్టము.

మందా - కానిండు. దానికేమి పూర్వులలో బేరుపొందినవారు పడిన యిడుమ లెవ్వరుపడిరి. వారికన్న మన మెక్కుడువారమా ఇప్పుడు మీరందఱు నాతోవత్తురా ?

మంజువాణి - నాకు మఱేమియు నభ్యంతరము లేదుకాని మాతల్లి పెద్దది. యింటియొద్ద నున్నది. ఒకసారి చూచి మిమ్ములను ఢిల్లీ లో గలిసికొనియెదను.

మందా - హేమలతా! నీవో?

హేమలత - మంజువాణితో నింటికిబోయి మావారిం జూచివచ్చెద, నాకును సెలవిప్పింపుము.

మందా - భ్రమరవేణి యేమనుచున్నది.

భ్రమరవేణి - అమ్మా నేను వెనుకటి మజిలీలోనే సెలవడిగితిని. మఱచి పోతివా?

మందా - విద్యుత్ప్రభకును పనియున్నదా?

విద్యుత్ప్రభ - దేవీ! నాకిప్పుడే ఇంటియొద్దనుంచి యుత్తరము వచ్చినది. ఒక జమీందారుడు నాకు కన్నెరికము చేయునట. పోక యేమిచేయుదునో అని చెప్పినది.

మందా - ఔరా! కాలము మంచిది. వసంతసేనా! నీవేమీ అనెదవు?

వసంతసేన - ఇంతీ! కుంతలేశ్వరుని కుమారుని వశములో నేనున్నదానని నీ వెఱుంగుదువుగదా. అతడు సంగీతప్రియుడగుటచే గొఱుతవడిన సంగీతము నీవలన నేర్చుకొనిరమ్మని నన్ను నియమించిన నీ శిష్యరికమునకు వచ్చితిని. నీ కృపచే నది పూర్తిఅయినది. నేను వచ్చినది మొదలు మద్విరహవేదనచే గుందుచు నతడు వార్తలనంపుచునే యున్నవాడు, రాయలవారి యాస్థానకవుల ప్రసంగములు వినిపోవలయునని యింతదనుక నాగితిని. ఇక పోవకున్న మాటదక్కదు. పరాధీననుగాకున్న నీకన్న ముందుగా ఢిల్లీకి బయనము గాకుందునా?

మందా - మేలు. మేలు. సరే విద్రుమోష్టియు నిట్లే చెప్పునా ?

విద్రు - నేనట్లనుదాననని తలంచితివా? నామాట విని పిమ్మట నాక్షేపింపుము. (చెవులో) "నాకిపుడు రోగములబాధ అతిశయించుచున్నది. మార్గములో బధ్యపానాదులు సరిపడవుగదా!" ఇంటికిబోక యేమిచేయుదును? ఇదివఱకు రాజభోగముగా జరిగినది. గావున నే లోపము కనిపించలేదు.

మందా - భళాభళ! ఒక్క దానను బోవలయును గాబోలు. శరచ్చంద్రిక యెక్కడనున్నది. దాని సంకల్ప మేమి?

శరచ్చంద్రిక - అమ్మా! నేనిక్కడనేయుంటిని. నాసంకల్పము మఱియేమియునులేదు. మాచెల్లెలు తల్లి లేనిది. దాని నేను పెంచి పెద్దజేసితిని. అది యిప్పుడు గర్భవతి అయ్యెనని యుత్తరము వచ్చినది. దాని జూడవలయునని మిక్కిలి వేడుకగా నున్న యది. ఈ సమయముదాటిన నా వేడుక యెట్లుతీరును. అది బిడ్డగనినతోడనే బయలుదేరి వత్ తునిదియే మదీయవాంఛితము.

మందా - సేఔను. దైవమా!: నీపట్టు దిట్టమైనదికదా ! మా ప్రియంవదయు నిటులే పలుకునా? పలుకదు. అది నాప్రాణములలో నొకటి. ఏమో, నిర్భాగ్యులను ప్రాణమిత్రులును పరిహసింతురను వచనమున్నది ప్రియంవద యెక్కడ .

ప్రియంవద - (కన్నీరునించుచు) వయస్యా? నీ హీనస్థితిని గుఱించి చింతించుచు నిందేయున్నదాన. ఏమి యాజ్ఞ.

మందా - వీరిమాటలన్నియును వింటివా ? ఢిల్లీకి నాతో నెవ్వరును రారట. తలయొక మిషను జెప్పుకొనుచున్నారు. కానిమ్ము. వారి ననవలసిన పనిలేదు. నీవైన వత్తువా!

ప్రియంవద - నేను నీతోరాక యెక్కడికి బోదును. నాకు వేఱొకదిక్కు గలదా? నేను నీతో మంచిచెడ్డల ననుభవింపగలదాననే. వీరినందరం బోనిమ్ము, మనయిరువురమే పోయి విజయమును గయికొని వత్తుముగాక.

అని చెప్పువరకు వేళ అతిక్రమించుటయు మణిసిద్దుడా కథదేసంతవరకు నిలిపి తరువాయి వృత్తాంతము తదనంతరనివాస ప్రదేశంబున చెప్పదొడంగెను.

శ్లో॥ యెనథ్వ స్తనునోభవేన బలిజిత్కాయఃపురాస్త్రీకృతో।
     యశ్చోద్వృత్తభుజంగహాలవలయో గంగాంచయోధీధరతీ।
     యస్యాహుశ్శశిమచ్ఛిరో హరఇతిస్తుత్యంచ నామాపరం ।
     పాయాత్పస్వృయమంధకక్షయకరోమాంసర్వదోమాధవః ॥