Jump to content

కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/22వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఇరువది రెండవ మజిలీ.

కందర్పునికథ

ఇరువది రెండవ మజిలీ ప్రదేశ మొక పట్టణము. అందు వసించుట కెందును స్థలము దొరికినదికాదు. అప్పుడా స్వాములవారు శిష్యునితో నోరీ! ఇందు మనకు నివసింప దగిననెలవులేదు సత్రముమిగుల సమ్మర్దముగా నున్నది. ఈయూర మఠములులేవు, మఱియొక యూరికి బోవుదము లెమ్ము. జనసంవాధమున నిలుచుట తఱచు నాకిష్టము లేదని పలికిన విని యగ్గోపకుమారుండు స్వామీ! పెక్కుదూరము నడిచి వచ్చుటచే నలసటగా నున్నది. నేను భోజనము సేయక నడువజాలను. పరదేశములో నియమములు పూర్తిగా జరుగునా? ఎద్దియో యొకస్థలము జూచి పాకము గావింపుడని వేడుకొనగా నయ్యతి వానిమాట ద్రోయక అందొక దేవాలయమున వసియించి అంగడి వస్తువులకు వాని నంపి తాను స్నానము జేసి నిత్యాష్టానము తీర్చుకొనుచుండెను.

వా డంగడినుండి యేమియుం గొనక వట్టి చేతులతో వచ్చుటయు జపావసానమున బరీక్షించి యాపాకారికాంక్షి నవ్వుచు నీ వేమియుం దీసికొనిరాలేదే వంట యెట్లు చేయుదునని అడిగిన వా డిట్లనియె.

స్వామీ! యేమని చెప్పుదును. నేను జెప్పబోవు వింత జూచుచు నంగడివాడు ఏ వస్తువు నమ్ముటలేదు. మధ్యవయసులో నున్న యొక యాడుదానిని గాడిదమీద నెక్కించి యూరేగింపుచున్నవారు దాని ముందర విపరీతవాద్యములు వాయించుచున్న వారు. పౌరులందఱు నావింత బరిహాసముఖములతో నిందాగర్భితములైన వాక్యము లాడికొనుచు జూచుచుండిరి. అక్కారణమెవ్వరి నడిగినను నామాట బాటింపక యుత్తరమిచ్చిరికారు. దీనిమూలమున రిక్తహస్తుడనై వచ్చితిని. మఱికొంతసే పుండి అంగడికి బోయివస్తువులం దెచ్చెద నింతలో దద్వత్తాంతము చెప్పుడు ఆ కాంత యెవ్వతియ! అట్టి అవమానముచేయుట కామె యేమి యపరాధము గావించినది వేగ మెఱింగించి నా మనస్సంశయము దీర్పుడని మిక్కి,లి యాతురముగా వేడుకొనిన నమ్మణిసిద్ధుడు వాని నెట్టకే సమాధానపరచి తిరుగా నంగడికిం బంపి సామగ్రి దెప్పించి వంటచేసి భుజియించిన వెనుక మనోహరప్రదేశమునం గూర్చుండి తన మణివిశేషమున దదీయవృత్తాంతమంతయు నంతఃకరణగోచరము గావించుకొనుచు వాని కిట్లని చెప్పందొడంగెను.

దక్షిణదేశంబున గుంభఘోణమను పట్టణమున విక్రమకేతుడనురాజు గలడు. అతనికి ముదిమియం దొకపుత్రు డుదయించెను. రూపలావణ్యాదివిశేషములు చూచి దైవజ్ఞులు వానికి గందర్పుండని పేరు పెట్టించిరి.

ఆ రాజకుమారుని కైదేడుల ప్రాయమువచ్చినతోడనే చదువనేయుటయు సూక్ష్మబుద్ధి అగు నబ్బాలుం డశ్రమముగా బదియారేడుల ప్రాయమువచ్చు లోపలనే పెక్కువిద్యలు గ్రహించెను.

ఒకనాడతని యుపాధ్యాయుడు వానికి భూగోళవిషయమును చెప్పుచు బెక్కురంగులతో నొప్పుచున్న యొకపటమును జూపెను దానిఁజూచి యా రాజపుత్రుడు ఆచార్యా! యీ పటం బిన్నిరంగులతో నొప్పుచున్న దేమని అడిగిన నతఁ డిట్లని చెప్పందొడంగెను.

రాజపుత్రా! చూడు మీ పచ్చని రంగుగల ప్రదేశమంతయు భరతఖండము ఇందుగలయేబదియారు దేశములకు గుఱుతులుగలవు. నిరూపించి చూడుము మఱియు సన్నని గీటులన్నియు నదులు, ఇది గోదావరి, ఇది గంగ, ఇది కృష్ణవేణి, ఇది కావేరి, ఇది తుంగభద్ర, పేరులు వ్రాయబడియున్నవి పరికింపుము. ఏమియు వ్రాయక విడిచినది సముద్రము. ఇదిగో ఉత్తరముగా నున్న యవి హిమవత్పర్వతములు, పూర్వపర సముద్రములకు వ్యాపించియున్నవి అరయుము. ఇదిగో మూలగా నున్నది పారసీక దేశము. ఆ పశ్చిమోత్తరమున గనంబడుదేశమంతయు హూణులది. అందున్నవారు మంచి బుద్దిశాలురు. సృష్టికి బ్రతిసృష్టి జేయంగలరు. కనంబడునవి ద్వీపములన్నియు పేరుపేరు నిరూపించి చెప్పెను. అప్పుడా రాజకుమారుం డార్యా! వీనిలో మనదేశ మెచ్చట నున్నదియో చూపింపుమని అడిగెను.

అప్పు డుపాధ్యాయుండు నవ్వుచు వత్సా! మనది పాండ్యదేశములో అంతర్భాగము. అల్లదిగో! కపిలవర్ణముతో మచ్చెవలె గనంబడుచున్న యాచిన్నప్రదేశమే మనదేశమని చూపుటయు నా కందర్పుడు ముక్కు మీద వ్రేలువైచుకొని యేమేమి? ఇదియా మనరాజ్యము. చాలుజాలు యీ మాత్రమునకే మనవారు చక్రవర్తులమని గర్వపడియెదరు. గుమ్మడికాయలో నావగింజంతయైన లేదే! అయ్యారే? యెంతభూమి యున్నది. యాచార్యా! ఈపటము జూచినది మొదలు వెర్రి యెత్తుచున్నది. నిత్యము వందిమాగధులు చేయు స్తోత్రబాఠములు విని యథార్థము లనుకొని నేనే యీభూమి కంతయు ప్రభుండనని గర్వించుచుంటి నని తెలిసినది. యెవ్వరును ప్రభువులమని గర్వపడవలసిన అవసరము లేదు. సర్వేశ్వరుడే అందరకు ప్రభువని పలుకుచు వెండియు నిట్లనియె.

ఆర్యా! భగవంతుని సృష్టివైచిత్ర్యంబు మిక్కిలి అద్భుతమైనది. ఒక దేశములో నున్న వింతలు మఱియొక దేశములో లేకుండును. అయ్యారే ఈ దేశములన్నియు జూచినచో నెన్నిరోజులు బడునో! ఏలాటి విశేషములు చోద్యములు చూడ నగునో! యేరీతిపొలంతుల వీక్షింపవచ్చునో! యెట్టి విద్వాంసులు కాన్పింతురో? యెఱుంగరాదు గదా! సీ! కూటస్థకూర్మమువలె స్వదేశమును విడువక తనకుంగల అలంతిసిరిం బెద్దగా దలంచుకొనుచు గర్వించువానిజన్మ మొకజన్మమే? దేశాటనము పండితమిత్రతయుం గలుగుట యుత్తమపురుషలక్షణములు దీనివలన బెక్కులాభము గలిగియున్నవి. కన్నులు గలిగినందుల కెల్లదేశములు నొక్కసారి తిరిగివచ్చుటయే సాద్గుణ్యము. ఇందులకే గదా మనపెద్దలు తీర్థయాత్రలు కల్పించిరి. ఇంతకుమున్ను నే నిన్నిదేశము లున్నవని యెఱుంగను. ఈదేశమునకంతయు నేన ప్రభుడ నగుదునని తలంచుకొనుచుంటిని. నాదేశమెంత నేనెంత నాప్రభుత్వము తలంచుకొన సిగ్గగుచున్నది. ఇప్పుడు మీరు చిత్రపటంబునం జూపిన దేశములన్నియుం జూడవలయునని నాకెంతేని యౌత్సుక్యమంకురించుచున్నది. దీనికెద్దియేని దగిన యుపాయము సెప్పి నాయుద్యమము కొనసాగింపుడు. ఈదేశము లన్నిటికిని మార్గములుండకమానవు. యెట్లు పోవలయును? యెన్ని దినములుపట్టును? ఆచారము లెట్టివని అడిగిన ఆయ్యుపదేష్ట యిట్లనియె.

వత్సా! దేశాటనము మాటలతో లేదు. యెట్టివారికిని బరదేశవాసము సంకటప్రదము అదియునుంగాక నీయభిలాష అసాధ్యముగా గనంబడుచున్నది. గరుత్మంతుండు నాంజనేయులు మొదలైన వారికిసైత మీ దేశములన్నియుఁ జూడ వశము కాదు. కొన్నిటికి గుఱ్ఱములమీదను గొన్నిటికి నోడలమీదను బోవచ్చును. కొన్ని దేశముల కెట్లుపోవుటకును దారులులేవు. గగనమార్గంబునం బోవలయునది. మనుష్యుల కెట్లుశక్యమగునో చెప్పుము. భరతఖండమంతయు దిరిగిరావచ్చును కాని యితర ద్వీపములకు బోవశక్యముకాదు ఉత్తరమున హిమవత్పర్వతము లడ్డముగా నున్నయవి. దానంజేసి అవ్వలిభూమిం జూచుటకు వశముకాదు. అదియునుంగాక భరతఖండమంతయునుం జూచుటకే పురుషుని యాయుష్కాలము చాలదు. మిగిలిన వాని మాట చెప్పనేల. సేతుహిమాచల మధ్యంబునం గల కొన్ని దేశములు మాత్రము జూచి నీయభీష్టమును దృప్తిపరచుకొనుము. అంతియకాని వెఱ్ఱియూహలం జేయకుము. నీతండ్రి వృద్ధుండై యున్నవాడు రాజ్యభారంబు వహించి న్యాయంబున బ్రజలం బాలింపుము. దాన నన్ని విశేషములు దెల్లములగునని పలికిస నారాజ పుత్రుండు వెండియు నిట్లనియె.

ప్రజలం బాలింపుమని పలుమారు నాకు జెప్పకుడు. నాపాటి ప్రజాపాలనత్వ మందఱికినిగలదు. మీయింటిలో బ్రజలులేరా? మీప్రజల మీరును బాలించుకొందురు. అంతకన్న నాయందేమియు విశేషము కనబడలేదు. ఆమాటలటుండనిండు దేశాటనము మాట విచారింపుడు. యాత్రలకు బోవువారు జూచు దేశములు మాత్రము జూచినం దృప్తి తీరదు చూచిన ద్వీపాంతర విశేషములే చూడవలయును. అందుగల క్రొత్త నడత లచ్చెరువు గొల్పకమానవు! దీనికిని సాధనములుండకపోవు. ప్రవరాఖ్యుని చరిత్ర జ్ఞాపకమున్నదా! ఓషధుల వలనగాని యంత్రములవలన గాని అట్టిపని సాధ్యమై యుండును. అట్టి విశేషములు దెలిసినవారచ్చటచ్చట నుందురు. వారి నరసి యట్టి సాధనము లెవ్వియేని సంపాదింపవలయును. ఇది మొద లీప్రయత్నము లోనుండవలయు. నీవిషయము మాతండ్రికి దెలిసినచో అనుమతింపడు కావున రహస్యముగా నుంచవలయును. సుడీ! అనిచెప్పి అంతటితో నాగోష్టి చాలించె.

అది మొదలు ప్రతిదినము అయ్యుపాధ్యాయుడు వచ్చినతోడనే యారాజ కుమారుండు ఆర్యా! దేవాలయమునకు మఠమునకు బోయితిరా? యెవ్వరేని పెద్దలు గనంబడిరా? యే వేని విశేషములు దెలిసికొంటిరా? అని అడుగుచుండ నాయనయు నేనుందగిన ప్రయత్నము చేయుచుంటి నింతవఱ కేవిశేషము దెలియబడలేదని యుత్తరము చెప్పుచుండును.

మఱికొన్ని దినములు గడిచిన వెనుక నొకనా డయ్యుపాధ్యాయుండు సంతోషముతో వచ్చి రాజపుత్రు నేకాంత ప్రదేశమునకుదీసికొనిపోయి వత్సా! నేడొక విశేషము పొడకట్టినిది. ఉదరపోషణార్ధము గ్రుమ్మరు సన్యాసులును బైరాగులు నేమివిశేషములు సెప్పగలరు మత్పితామహుడు మిగులవృద్ధుండు పండితుడు పూర్వప్రాయంబున బెక్కు దేశములుదిరిగి పెక్కువిశేషములు చూచినవాడు ఆయనతో బ్రస్తావముగా నీసంగతింజెప్పితిని ఆయనజ్ఞప్తికి దెచ్చుకొని ఆయ్యో! అట్టివిశేషము లెఱింగిన వాడీయూర నొకండుండవలయువాడు బ్రతికియుండెనోలేదో నాకుదెలియదు అతనిపేరు మణివర్మ విశ్వకర్మకులస్థుడు వానితాతదండ్రులనాటినుండియు యంత్రములు సేయుట తంత్రములుబన్ని రూపములు మార్చుటలోనగు శక్తుల వాని యింట గలిగియున్నవి. వానితాత విశ్వకర్మయంతవాడు కీలుజింక నొకదానిఁ జేసి గగనమార్గంబున దిరుగువాడట. అదియు వానియింటనే గుప్తముగా నుండవచ్చును. మణివర్మ నాకన్న చిన్నవాడు వాని తండ్రియు నేను నొకప్రాయమువారము అతని సహవాసమున నేను దఱచు వారియింటికిబోవువాడ దానించేసి యీరహస్యములు నాకు మాత్రమే తెలియును. మణివర్మతండ్రి కాలముచేసిన తరువాత నేను వారి యింటికిబోవుట మానివేసితిని తరువాత నాత డిప్పు డెట్లున్నవాడో తెలియదని యా వృత్తాంతమంతయుం జెప్పెను అప్పుడు నేను మిగుల సంతసించుచు నమ్మణివర్మ వృత్తాంత మరయుటకై యీపట్టణ మంతయుం దిరిగి చివరకు వానియిల్లు గనుగొంటిని. అది రాజభవనమువలె జుట్టు నున్నతమైన గోడ గలిగి యున్నది. లోపల మిక్కిలి విశాలముగానున్నదట మణివర్మ జీవించియేయున్నవాడు. వాడు యిల్లువిడచి యెన్నడును బైటికిరాడట. పిత్రార్జితమైనధనము లక్షలకొలది యున్నదట. లోపలి కతనియానతిలేక పోవశక్యము కాదు. తలుపు లెప్పుడును మూసియే యుండునట. ఇంతవరకు దెలిసికొనుటకు రెండుమూడు దినములు పట్టినది ఇంతకన్న నెక్కుడు తెలిసినవారుసు జెప్పినవారును లేరు. నీవు మిగుల బుద్ధిమంతుడపు వానింగలిసికొని యా జింకను సంగ్రహించితివేని నీయభీష్టము కొనసాగును. అనిచెప్పి ఆతండరిగెను.


సుభద్రకథ

పిమ్మట నారాజపుత్రుం డక్కార్యంబు హస్తగతప్రాయంబుగా దలంచుచు మఱిరెండు వాసరము లఱిగిన వెనుక సమయము జేసికొని యొక్కనాడు సాయంకాలమున నొక్కరుఁడ బయలు వెడలి యొడలంతయు మలినపు వలువం గప్పికొని సామాన్యపురుషుడువలె దోచుచు ప్రజల నడిగి తెలిసికొని అమ్మణివర్మ యింటిదాపునకు బోయెను.

ఆ యింటిప్రహరియు సింహద్వారమును జూచుచు వెఱగుపడి ఓహో! వీని యింటిలోనికి బోవుటయే దుర్ఘటమని తోచుచున్న యది గుప్తముగా దాచినయాజింక యెట్లు లభ్యమగును వీడు ద్రవ్యసాధ్యుడు కాడు. దైవానుకూల్య మెట్లున్నదో తెలియదని తలంచుచు అందున్న వారిని మణివర్మతో మాటాడవలసి యున్నది. లోపలికి బోవచ్చునా? అని అడిగెను.

వారు అయ్యో! మణివర్మ యీ పట్టణపు రాజు వచ్చినను దర్శనం బియ్యడు నీ వెవ్వడవో యెఱుగనివాడవు గనుక అట్లడిగితివి. పోపొమ్ము, నీకు మణివర్మతో మాట్లాడుట యీ జన్మమునకు శక్యము కాదనిచెప్పిరి ఆ మాటలు విని అతండు, మనంబు దిగులువడ గర్తవ్యమేమి అని ఆలోచించుచు అందే యొకచోట గూర్చుండెను. ఇంతలో మణివర్మ యింటి పెరటిగుమ్మము తెరచుకొని యొక ముసలివాడు ఈవలకు వచ్చెను.

ఆ రాజకుమారుండు వానితో గొన్ని అడుగులు నడచి వెనుకకుజీరి యోరి, నీ పేరేమి? మీ యిల్లు యెందున్నదని అడిగిన వాడు కోపదృష్టిం జూచి నీ వెవ్వడు నన్నోరి యని పిలిచెదవు! నీకన్న తక్కువ వాడననుకొంటివా యేమి? అంతరము తెలసి మాట్లాడుమని చెప్పెను

అప్పుడా నృపనందనుండు లోన నవ్వుకొనుచు నోయీ! నీకు గోపమువలదు ప్రమాదముచే అట్లు వచ్చినది. నీతో గొంచెము పని యుండియే అడిగితిని. మొదటనే త్రోసివేసిన నెట్లు నే నడిగినమాటలకు సదుత్తరమిచ్చిన నీకు మంచిపారితోషిక మిచ్చెద. నమ్మకములేదేని ముందుగా నీ నాణెమును బుచ్చుకొనుమని చెప్పి యొక దీనారము చేతిలో బెట్టెను.

ఆ ముసలివాడు సంవత్సరము పాటుపడినను అంత ద్రవ్యము సంపాదింపలేదు. దానింజూచుకొని మిక్కిలి సంతసించుచు, బాబూ! నీవెవ్వరవో గొప్పవాడవు వలె దోచుచుంటివి. నీ వేషమునుబట్టి తిరస్కరించితిని. నాతప్పుసైరింపుము నావలన నీకేమి ప్రయోజన మున్న దియో చెప్పుము నాయోపినంత జేయుదును. మా యిల్లీ ప్రాంతమందే యున్నది. నా పేరు రామిరెడ్డి. నేను మణివర్మగారి యింటిలోనే పని చేయుచుందును. నెలకు నేబది కుంచముల ధాన్యమునిచ్చును. చిన్ననాటనుండియు నన్ను వారే పోషించుచుండిరి. యిదియే నా వృత్తి అని చెప్పెను.

అప్పుడతండు వానినొక రహస్యప్రదేశమునకు దీసికొనిపోయి రామిరెడ్డీ, మణివర్మ యెట్టి స్వభావము గలవాడు? అతని భార్య యెట్టిది? పిల్లలెందరు, ఇంటిలో నేమి చేయుచుండును. వారి యింటిలోఁ దఱచు నీవేమిపని చేయుచుందు వని అడిగిన వాడిట్లనియె.

అయ్యా! మణివర్మ మిక్కిలి కోపస్వభావుడు. ఆయనకు బిల్లలులేరు. పూర్వ మొక కూతురుండునది. ఆమె కొంతకాలము క్రిందట జనిపోయినది. ఆమెకొక పుత్రిక యున్నది దాని పేరు సుభద్ర. తల్లిచాపు పిల్ల గనుక నాచిన్నదానినిమాత్రం ప్రేమగా జూచుచుండెను. భార్యను సర్వదా దండించుచునే యుండును. ఆయనలోపలి మందిరములో నుండి శక్తిపూజ చేయుచుండును. ఆయన మనుమరాలు సుభద్ర దొడ్డిలో బుష్పవనము వైచికొన్నది ఆ పూవుతోటకు నేను నీరుతోడుచుందును. ఇదియే లోపలి వృత్తాంతమని చెప్పెను.

రాజపుత్రుడు వెండియు వానితో రామిరెడ్డి, సుభద్ర కెన్ని యేండ్లున్నవి? పెండ్లియైనదా? అని అడిగిన వాడు ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. తెలివిగలది చదువుకొన్నది. దానికి దిగిన సంబంధము రానందున ఇంకను బెండ్లిచేయలేదు. మణివర్మ యెట్టివారిని లెక్క సేయడు ఆచ్చేడియకు బదియారేడు లున్నవి ఆచిన్నదాని వివాహప్రయత్నమే యిప్పుడు సేయుచున్నారు కాని యింతలో నతనికిరోగము వచ్చినది. దానం చేసి యాగిపోయిన దనిచెవ్పగా నారుగ్మత కుదిరినదా అని అడిగిన నింకను నెమ్మది లేదని చెప్పెను.

ఆతండు తలయూచుచు గొంతసేపాలోచించి, రామిరెడ్డీ, నీవు నాకొక్క యుపకారము చేయవలయును మణివర్మ యిచ్చుదానికన్న నేను బదిమడంగు లెక్కువ యిత్తును. నేనును ధనికుడను కాని సామాన్యుడను కాను. వినుము నీతో గూడ నన్నొకసారి వారి యింటిలోనికిం గొనిపొమ్ము వీడెవ్వడని అడిగిన గూలివాడని చెప్పుము. ఏమిటికి దీసికొని వచ్చితి వందురేని నీరు తోడుట కీనాడు నాకు రుగ్మతచే శక్తిలేకున్న మానివేసినచో మొక్కలు వాడిపోవును. అందుమూలమున గూలి మాట్లాడి తీసికొని వచ్చితినని చెప్పుము. తరువాయి కృత్యము నేను సవరించు కొనియదనని చెప్పిన విని వాడు సంతసించుచు బాబు మీరు చెప్పినట్లుగా నప్పుడు డప్పుడు చేయుటయు వాడుకయున్నది. ఆలాగే చేయుదును మీరు ఱేపు జాము ప్రొద్దెక్కులోపల నిచ్చటికి వచ్చి ఉండుడు. నేనువచ్చి తీసికొని పోయెదనని చెప్పి వాడు తన యింటికిం బోయెను .

కందర్పుఁడదియు నొకఫలసూచకమే అని సంతసించుచు నప్పటి కింటికి బోయి మఱునాడుదయమున గన్నులమాత్రము గనిపించునట్లు దేహమంతయుమాసిన అంగీలు దొడిగి కూలివాని వేషము వైచుకొని యా పనివాడు చెప్పిన చోటునకుం బోయి నిలువంబడి ఉండెను.

ఇంతలో గూలివాడు వచ్చి అతనిని వెంటబెట్టుకొని పెరటిగుమ్మము దరి కరిగి కేకవైచెను. వాని కంఠధ్వని గురుతు పట్టి అప్పటికి మఱియొక రెవ్వరును దాపునలేమించేసి ముసలివానిరాక వేచి ఉన్న సుభద్రయే వచ్చి తలుపు తీసినది.

తలుపు తెఱచినతోడనే మబ్బు బాసినదళ్కుమని మెరయు చంద్రరేఖయుం బోలె మెరసిన అత్తరుణీమణిఁ జూసి విభ్రాంతుండైన కందర్పుం డామోహంబు తెలియనీయక ముసలివానితో గూడ పూవుతోటలోనికిం బోయెను.

అప్పుడప్పుడు వానితో రెండవ కూలివాడు వచ్చుట వాడుక ఉన్నది. కావున సుభద్ర క్రొత్తవానింజూచి అంతగా విమర్శించినది కాదు. చిత్రపటములు వ్రాయుటలో గందర్పునికి మిక్కిలి నైపుణ్యముగలిగి ఉన్నది. అట్టి సామాగ్రి గుప్తముగా దెచ్చి యుండుటచే నప్పుడొక లతామూలమున గూర్చుండి సుభద్ర యాకృతియు, దానిప్రక్కదన యాకృతియును యుద్యానవనమును మొదలగు విషయములన్నియ నొకపటమున వ్రాసి దగ్గర నుంచుకొనియెను.

ఇంతలో సుభద్ర వాడుకప్రకారము ముసలివాడు నీరు తోడుచుండ దాను పాదులు గట్టుటకై అచ్చటికి వచ్చి ముసలివానింజూచి యోరీ, ఇదియేమి? క్రొత్త వానిం దీసికొనివచ్చియు నీవే నీరుతోడుచుంటివే, వాడేమిచేయుచున్నాడని అడిగిన ముసలివాడు అమ్మా! వాడామూలగా బాదులు కట్టుతున్నాడని చెప్పెను.

ఆ మాటవిని తన్ను వెదకికొనుచు నాచిన్నది తన దాపునకు వచ్చుచుండుట చూచి కందర్పు డెద్దియో పనిచేయువాడువలె నేలం గీటులుగీయుచుండెను. సుభద్ర అక్కపటమరసి యేమిరా? అమ్ముసలివాడు పాటుపడి నీరు చేదుచుండ నీవూరకిందు శరీరమును దాచికొని కూర్చుంటివేల? భవదంగభవపరితాపం బంత యెక్క డే? కూలి సగబాలు పంచుకొనవా యేమి? అని అడిగిన నతండు చిఱునగవుతో నిట్లనియె.

బోటీ! నేనేమి చేయుదును? నాకీమోటుపని జేయుట అలవాటులేదు. నేను వీథిం బోవుచుండ ముసలివా డిట్టిపని అనిచెప్పక నన్ను బ్రతిమాలుకొని తీసుకొని వచ్చెను నాకు జిత్తరువువ్రాయు పని చక్కగా దెలియును. నాపనితీరు చూడుమిదిగో! ఉద్యానవనమును వ్రాసితినని తానువ్రాసిన పటము చూపెను.

అదిచూచి యాచిగురుబోడి అబ్బురపడుచు వాని మొగము చూచి యోరీ! దీనినెప్పుడు వ్రాసితివి? యిందున్న మిథునమెచ్చటిది? యీ రూపము నాదివలె నున్నదే? నన్నింతకు మున్నెప్పుడైన జూచితివా? యేమని అడిగిన అతడిట్లనియె.

అతివా నిన్ను దలుపు తీయవచ్చినప్పుడు చూచి వ్రాసితిని. పోలియున్నదా? అని అడిగిన యగును గాని నా ప్రక్క వ్రాసినయీపురుషుండెవ్వడు? ఇంత ప్రజ్ఞగలవాడ నీవీ ----------- మున కెట్టువచ్చితివి. ముసలివాడు నీకేమి యిచ్చెదనన్నాడు? నీరాక వింతగా నున్నదే నీమాటలును ప్రగల్భముగా నున్నవి? నిజము చెప్పుమన నతండిట్లనియె.

పొలతీ! యీముసలివానికిని నాకునుఁ బరిచయము గలిగియున్నది. అందు మూలమున నింతఅని కూలి నిర్ణయించుకొనలేదు. ఏమిచ్చినం బుచ్చుకొందును. నీ కింకను బెండ్లి కాలేదని చెప్పిన నీయాకృతి కిట్టియాకృతిగల పతియుండినం బాగుండునని వ్రాసితిని. తప్పుకాదుకదా? అని జడిసిన వానివలెఁ బలికిన నక్కలికి సిగ్గుపడుచు నేమియుంబలుకక అప్పటము చూచి తలయూచుచు నొక్కింతసేపు ధ్యానించి మరల నిట్లనియె.

ఓయీ! నాకీపని నేర్చుకొనవలయునని పెద్దకాలమునుండి యుత్సాహము గలిగియున్నది. తగిన యుపాధ్యాయుఁడెవ్వడును లభింపలేదు. దానంజేసి నాకీపని తెలిసినదికాదు. మంచిసమయము దొరికినది. ఇప్పుడు మాతాత యస్వస్థుడైయున్న వాడు. ప్రతిదినము నీవీ కూలివానివెంట నిచ్చటికి వచ్చుచుండుము. ఇందే నేర్చుకొందును. ఎన్ని దినములకు నేర్పగలవు? నీవుకోరినధన మిత్తును. త్వరగామాత్రము నేర్పుమని అడిగిన నతండు తన్వీ! నీబుద్ధి యెట్టిదో పరీక్షించికాని యెన్ని దినములకు వచ్చునది చెప్పనేరను. నీవు సూక్ష్మబుద్ధివని వింటి వేగములోనే గ్రహింపగలవు. అయిన నింతియేల! యిప్పుడు ప్రారంభింతము. గడియలో నీకెన్ని దినములకు దెలియునది చెప్పెదననుటయు సంతసించుచు నమ్మించుఁబోడి అట్లయిన గానిమ్ము సామగ్రిఅంతయు నీయొద్ద నున్నదికదా? అనిపలికిన విని యారాజకుమారుం డున్నదని చెప్పి అప్పుడే తూరుపుముఖముగా గూర్చుండబెట్టి దేవతాగురునమస్కారములం గావింపుమని చెప్పిన నప్పడఁతియు నట్లుచేసినది. తరువాత దూలిక అబ్బాలికచేతి కిచ్చి ముందుగా సరస్వతివిగ్రహము వ్రాయించెను. అట్టిసమయమున రత్నపుటుంగరముచే మెఱయుచున్న అతని అంగుళములపైనున్న వలు వదొలఁగుటయుఁ గనుంగొని విస్మయావేశితహృదయయై యయ్యిందువదన సందియము విడిచి యావ్రేళ్ళంటి యోహో! వీనికెద్దియేని రంగువైచితినాయేమి? యింత వింతకాంతి నీఅంగుళుల కెట్లు వచ్చినది? యిట్టివిలువగల యుంగరములు నీ కెక్కడివి? నీవెవ్వడవు? సామాన్యుడవువలె దోచుటలేదే అని అతనిచేతిపై నున్న వలువఁ బైకిఁ దొలఁగించినది.

అప్పుడతండది సవరించుకొనుచు మేలు మేలు నీ శిష్యరికము జక్కగా నున్నది. వ్రాతమాని నాచేతులు పరీక్షించెదవేల? అనిపలుకగా నవ్వెలఁది మారుపలుకక ఆతండు మొగముపైఁ గప్పికొనివున్న చేలంబు విడలాగినది అప్పుడు మేఘావరణంబు వ్రాసినచంద్రబింబమువలె బ్రకాశించుచున్న అతనిమొగంబు గనంబడినది.

ఆకర్ణాంతవిశాలనేత్రములును అలకభ్రాజితంబైన సుందరపాలంబును, మృదుకపోలములును, మనోజ్ఞరదనచ్చందంబులుం గలిగి మోహనజనకంబై యొప్పు నారాజకుమారుని మోము వీక్షించి యయ్యంబుజాక్షి వివశయై యొక్కింతసేపు తదీయలావణ్యంబు నక్షులంగ్రోలుదానివలెఁ జూచి చూచి తలయూచుచు మెల్లన నిట్లనియె.

పురుషోత్తమా! నిన్ను జూచినది మొదలు నాడెందము సందియమందుచునే యున్నది. అతి ప్రగల్భములైన భవదీయవచనంబులు వినినంత మఱింత శంక యంకురించినది. వ్రాతపనిచూచుట చేత మఱియుం బెచ్చుపెరిగె నిన్నుగురించి నీవిచ్చిన సంభోధనావాక్యంబులు సామాన్యుల నోటినుండి వచ్చునా? అప్రయత్నముగా నానోటినుండి వెల్వడిన “శరీరము దాచుకొనియదవేల? భవదంగభవపరితాపం బింత యెక్కుడే" అనుమాటలు విని నీపు మందహాసముచేసిన కారణ మిప్పటికి నాకుస్ఫురించినది. అది అట్లుండనిమ్ము. నీవిట్టినికృష్టవేషముతో నిందులకు రాఁగతం బేమి? కులంబెయ్యది? నివాసమెచ్చట? భవదీయాభిదానవర్ణము లేయవి? నిక్కము వక్కాణింపుము. ఇంక గప్పిపుచ్చితివేమి మ్రుచ్చుతనముగా నెంచఁబడుదువని సాకూతముగానడిగిన విని యారాజకుమారుడు చిఱునగవుతో నిట్లనియె.

బోటీ! చల్లకువచ్చి ముంతదాచిన లాభమేమి? యథార్ధము జెప్పెద నాకర్ణింపుము. నేనీపట్టపు రాజకుమారుండ! నా పేరు కందర్పుడందురు. భవదీయరూపలావణ్యాదివిశేషంబు లొరులవలన విని నిన్ను జూచి నీయాకృతి వ్రాసికొని పోవలయునని యిట్టిరూపముతో వచ్చితివని. లేకున్న నీదర్శనంబగుట దుర్ఘటముకదా! ఇదియ మదీయాగమనకారణంబని నొడివిన యాకామినీరత్న మబ్బురపాటుతో నిట్లనియె.

ఏమేమీ నాపుణ్యము? నికృష్ణటకథలందైన నుడువఁదగని మదీయచరిత్రంబు దేవరకు స్మరణపాత్రంబయ్యెనే? ఇంతదనుక నెఱుంగక దేవరవలనఁ బనిగొనిన నాతప్పు సైరింపవేడెదను. ఈ దీనురాలియాకృతితో దేవరకేమిపనియున్నదో తెలియదని మేను గంపమునొంద గద్గదస్వరముతోఁ బల్కుచున్న యాచిన్నదాని భయము వాయ మృదుమధురవచనంబుల నల్లన నతం డిట్లనియె.

అతివా! అట్లు వెఱచెదవేల? యిందు రాజభావంబు విడువుము. నీవుచేసిన తప్పేమి యున్నది? నీబేలతనం బెఱుగక యథార్ధము చెప్పితిని. మిత్రభావముతో మాటాడుము అంతఃపురప్రవేశదోషంబు నాయంద యున్నది. అది తప్పుగా గణించితివేమో అని వెఱచుచున్నవాఁడ ననుజ్ఞయిత్తువేని బోయివచ్చెదనని పలికిన నక్కలికియు నెడదం పొడమిన భయం బుడిమికొనుచు నతనికి సమస్కరించి యిట్లనియె.

రాజపుత్రా! మీప్రగల్భవాక్యంబులకు నేను త్తరంబిచ్చుదాననా? ఈ చిత్రపటంబున నాయాకృతి ప్రక్కను మీయాకృతి యెట్టి అభిప్రాయముతో వ్రాసితిరో యేమంటిరో మీర యెఱుంగుదురుగదా! ఇప్పుడు మఱియొకరీతి మాటలంబల్కిన సరిపడునా? ఎక్కడికిఁబోయెదరు? వచ్చినపని యేమయ్యె? నాకు దరువాయి వ్రాతపని నేరుపక అరుగనిత్తునా? అని పరిహాసగర్భితముగాఁ బలుకుచు అతనిహస్తము గైకొని ముద్దుపెట్టుకొనినది.

ఇంతలో లోపలనుండి సుభద్రా! అని యెవ్వరో పిలిచినట్లయిన అదరిపడి అప్పడంతి సుందరా! కందర్పా! నన్నెవ్వరో పిలుచుచున్నవారు. మాతాత సామా న్యుడు కాడు పోయివత్తు, మీతో బెద్దయుంబ్రొద్దు మాటాడవలసిన పనియున్నది, వెండియు శ్రమయనక సాయంకాలమున నీముసలివానితో రావలయునని ప్రార్థించుచున్నదాననని పలుకుచు ఆతని అనుమతి వడసి ముసలివాని నొద్దకరిగి యోరీ! సాయంకాలము వచ్చునప్పుడు రెండవవానింగూడ దీసికొనిరమ్మని చెప్పి లోపలకు బోయినది.

తరువాతఁ గందర్పుడు డెందంబు నయ్యిందుముఖి వచనంబుల దలంచుచు నుత్సాహంబు దీపింప మధ్యాహ్నంబగుడు ఆక్కూలివానితోఁగూడ నయ్యిల్లు వెడలి వెండియు సాయంకాలమున వత్తుననివానికిం జెప్పి అప్పుడు తన విహారసౌధంబునకు బోయెను.

పోయినది మొదలు గడియలు లెక్కిడుకొనుచు నిమిషము యుగముగా గడిపి ముసలివాడు చెప్పిన సమయమైనంత మాఱువేషముతో నరిగి తనకొఱకు వేచియున్న ముసలివానితోఁ గూడ మణివర్మ యింటికిం బోయెసు.

అంతకుమున్న యాతోటలోనికి వచ్చియున్న సుభద్ర ముసలివానిని మారుమూలఁ బనిచేయుమని నియమించి మిక్కిలి దట్టముగా అల్లుకొనియున్న పూలతల మాటున నారాజపుత్రునితోఁ గూడ అరిగి ఉచితసత్కారములు గావించి నమస్కరించుచు దేవా నన్నుగుఱించి మీరు మిక్కిలి అలసట జెందితిరి. భూతలస్పర్శక్లేశంబున మీపాదంబులు కందినవి. యించుక యొత్తి ఈ అపరాధంబు బాపుకొనియెదనని పలుకుచు వంగిపాదంబులు ముట్టబోవుడు వారించువాడుబోలె నారాజనందనుం డాకుందవదన చేతులు పట్టుకొని పై కెత్తి దాపునకులాగిన అప్పుడది యొక యాలింగనవిశేషంబయ్యె. దానంజేసి వారిమేనులు సాత్వికభావవికారములు నొందుటయు నొండొరుల అభిప్రాయములు చెప్పకయే అన్యోన్యము విదితములైనవి.

ఇంతలోఁ జీకటిపడుసమయమగుటయుఁ గందర్పుడు సుందరీ ప్రొద్దుగుంకినది. ఇక నిందుండరాదు. మీయింటి విశేషములేమియుం జప్పితివికావు. మీతాత మణివర్మ యేమిచేయుచుండును? నీకుఁ దల్లి లేదట? అతనికి నీయందనుగ్రహము కలదా? మీ యింటియందు విచిత్రవస్తువులు పెక్కులున్నవని చెప్పుదురు. వానిని నాకుఁజూపింతువా! అని క్రమంబున నాయింటి ప్రస్తావన దెచ్చుటయు అయ్యబల తనకథ అంతయు ఆతనికెఱిగించి వెండియు నిట్లనియె.

దేవా! మీరీరాత్రి యింటికిం బోవలదు. మాతాత యిప్పుడు జాఢ్యముచేత మంచము విడిచిరాలేడు. మాఅవ్వయు అతనిదాపున శయనించును. నాసౌధమునకు వారురారు. మీకు మాయింటి విశేషములన్నియు రాత్రి జూపెదనని చెప్పి అతని నొప్పించి కనుచీకటి పడినతోడనే గుప్తమార్గంబున దనమేడకుఁ దీసికొనిపోయి యొకచోట గూర్చుండబెట్టి తానుబోయి చేయవలసిన పనులుచేసి యావృద్ధులచే శయనించుట కనుజ్ఞ పుచ్చుకొని యేకాంతముగా నాహారపదార్థములు దీసికొని ఆతనియొద్దకుం బోయెను.

అతండు తదీయ సాహసంబు మెచ్చుకొనుచు తద్దత్తాహారంబు భుజియించి తాంబూలము వైచుకొని కొకంతసే పిష్టాగోష్టిం బ్రొద్దుపుచ్చి పిమ్మట భవనచిత్రంబులం జూపుమని అడిగెను.

సుభద్రతన తాత తలక్రిందనున్న తాళముచెవులు మొదటనే సంగ్రహించుకొని వచ్చినది. కావున దీప మొకదానిం గొని తాళములు తీయుచు భవనవిశేషములన్నియుంజూపెను. తద్భవనాలంకారములు చూచి యారాజనందనుండు విస్మయాంచితహృదయుండై యదివైజయంతమో యని భ్రాంతిపడఁజొచ్చెను. తరువాత మణివర్మ పూజాగృహమునకుం దీసికునిపోయి తద్విశేషము లన్నియుం జూపగా నందా మఱజింక కనంబడినది.

దానింజూచి పట్టరాని సంతోషముతో గందర్పు డప్పడంతి వీక్షించి ముదితా! ఇదియేమి? అని అడిగెను. ఇది యొక తోలుజింక. దీని నేమొకోకాని మాతాత మిక్కిలి ప్రియముగా గాపాడుచుండు. ఈగదిలోనికి నెట్టివారిని రానీయడు. నేనొక్కరితను మాత్రమువచ్చినం గివియడు. మాతాత మంత్రతంత్రములలో బ్రఖ్యాతుడు. అతనికి రోగమే లేనిచో మనమిట్లు నిర్భయముగా దిరుగవశమా? అని తత్కాలోచితముగా నతని వృత్తాంతము చెప్పినది.

అప్పుడు ముప్పిరిగొను సంతసముతో గందర్పుం డా జింకను మెల్లన గైకొని యెత్తి దీపము వెలుగున నందున్న లిపిం జదివి తన అభీష్టము సఫలమయ్యెనని యుబ్బుచు మెల్లన నప్పల్లవాధరి కిట్లనియె.

కామినీ! నీకు నాయందెట్టి అనురాగమునులేక యిట్టి రహస్యములం జూపుదువా? దీనికి నీకు బ్రతికృతి యేమియుం జేయజాలను నిన్ను నాప్రాణేశ్వరిగా జేయదలంచుకొంటి గావున నావాంఛితము దీర్చుట నీ కుచితంబ, నీవు చూపిన వస్తువులలో నీజింక మదీయమానసం బాకర్షించినది. ఇది యమానుషప్రభావము గలిగి యున్నదని దీనిపై వ్రాసియున్న శాసనమే చెప్పుచున్నది. దీని నాకొకసారి యిమ్ము కొనిపోయి పరీక్షించి కార్యంబు దీరిన వెనుక వెండియుం దెచ్చియిచ్చెద నిదియే నాకోరిక. యేమనియెద వని అడిగిన నమ్మగువ యొకింత ధ్యానించి యిట్లనియె.

నేను మీరడగిన బ్రాణములిచ్చుటకు సిద్ధముగా నుంటిని. ఈజింక మాట లెక్కయేమి? మాతాత అతిక్రూరుడు ఇదికనంబడనిచో నాయం దనుమానము మానడు. నేను గాక యొరుల కీగదిలోనికి రా వశముకాదు. కానిండు, మీకార్యము చేయుటకంటె లెస్సయేది. నాఅసువులం గొనెడుకాని మఱి యేమిచేయును? తీసికొని పొండని పలికిన విని అతం డవ్వనితామణి సాహసమును మెచ్చుకొనుచు బ్రియమార గౌగలించుకొని చెక్కులు ముద్దు బెట్టుకొనుచు నిట్లనియె.

పల్లవపాణీ! నీపట్లన నాయుల్లము తల్లడిల్లుచున్నది. నీప్రాణహానికి నేను సమ్మతింతునా? వేఱొక యుపాయ మాలోచించితి వినుము దీనివంటిది మఱియొకటి చేయించి అమ్ముసలివానిచేత నంపించెద. దాని నీగదిలో నిది యుండినచోట వ్రేలం గట్టుము. అదియే యిది అనుకొని మీతాత శంకించడు. దీన మనకు గార్యసిద్ధి అగునని చెప్పి యాపడితి నొప్పించి మెల్లన నాయిల్లు వెడలి యధాప్రకారము తాళములు వేయించి తిరుగా మేడమీదికి వచ్చెను. అప్పటికి వేకువజామగుటయు నానృపతిసూనుండు పండుకొనక అక్కనకగాత్రిం జూచి సానునయముగా నిట్లనె. తరుణీమణి యెవ్వరికిం స్వజాతియువతిం బెండ్లియాడిన పిమ్మటంగాని అన్యజాతి నాతిం బరిణయంబగుట కధికారములేదు. వేగిరించి అట్లు కావించినచో నప్పడతికి బొడమిన సంతానమునకు బుత్రత్వసిద్ధి లేదు. గూఢజు లని పిలువబడుదురు. కావున నిప్పుడు నీతో గ్రీడింప సమ్మతము లేకున్నది. నేనొక హాయనములోపలనే పట్టాభిషిక్తుండ నయ్యెద తోడనే నిన్ను విధివిధిం ద్వితీయపత్నిగా శ్వీకరించెద ఇమ్మాట శపథేరితమని నమ్ముము అని ముమ్మారు పలికి అక్క.లికిచేతం జేయివైచి యొప్పించి అమ్మించుబోడి సంతసించిన వెనుక దీపము వెలుంగున నజ్జింక బూరించు విధానంబంతయు వెండియు జదివి విస్మయముతో, అతివా! చూచితివా! ఈజింక కుడిచెవిలోనున్న బిరడా తీసి నోటిగాలిచే బూరించిన గుఱ్ఱమువలె నిలువంబడునట పిమ్మట అబ్బిరడా బిగియుంచి యెక్కి, యేచెవి యెట్లునొక్కిన నావైపుగా నెగిరిపోవునట. శిరంబు మీద నున్న చీలయొక్క కుడియెడమ త్రిప్పులవలన బైకిని గ్రిందికిని నడుచును. అందున్న రెండవ చీలవలన మనకు గావలసినంత వేగము పెట్టుకొనవచ్చును. యెడమచెవిలోని బిరడా తీసివేసినచో వట్టితోలువలె నుండునట. ఆహా! ఇది విశ్వకర్మవలన చేయబడినది. కాని మరియొకటి కాదు. ఇట్టి అద్భుతవస్తువు నీ సాంగత్యమున నాకు లభించినది. నీయెదుటనే పరీక్షించి చూచెదనని అప్పుడందున్న శాసనప్రకారము పూరించిన నెక్కుటకు వీలగునట్లు బిఱ్ఱబిగిసి నిలువంబడుటయు దాని నిరువురు గైకొని నిరావరణసౌధంబునకు దీసికొనిపోయిరి.

అప్పు డక్కందర్పుండు సుభద్ర కపోలములపై వ్రేళ్ళు విరిచి తరుణి! పోయివత్తు అనుమతి యిమ్ము వెండియు రేపు వత్తునని పలుకుచు చిన్నబోయి యాచిన్నది చూచుచుండ నాజింక నెక్కి కుడిచెవి నొక్కుటయు అది రివ్వున నెగసి గగనంబున నిలువంబడినది.

అందున్న మరలన్ని యు ఆతండు గ్రహించుటంజేసి దాని మెల్లగా నడిపించుచు అల్లన దనమేడమీద వ్రాలెను. అంతలో దెల్లవారుటయు ఆతం డుల్లంబున సంతసము వెల్లి విరియ అప్పుడొక చర్మకారునిం బిలిపించి దానిపోలికగా వేరొకటి చేయించి అది యాదినము సాయంకాలమున గూలివానియొద్దకు దీసికొనిపోయి వాని కిట్లనియె.

ఓరీ! నేను వేరొక పనిమీద నీతో జెప్పకుండ అఱిగితిని. నీవు నన్ను వెదకితివి కాబోలు! నీవెంత దనుకనుంటివని అడిగిన వాడు నవ్వుచు బాబూ? నాయొద్ద గపటముగా మాటాడెదవేల? నాకేమైన నియ్యవలసివచ్చుననియా యేమి? మీగుజుగుజ లన్నియు నేను వినుచునేయుంటిని. నేనెంత ముసలివాడనై నను నీలాటి చర్యల గనిపెట్టగలను.

ఎట్లయిన లెస్సయే కాని మణివర్మ చండశాసనుండు సుమీ! కనిపెట్టి తిఱుగ వలయునని పలికిన విని నవ్వుచు అతండు వానికి మఱియొక పారితోషికమిచ్చి యోరీ! మఱియేమియును లేదు. మీ సుభద్ర నాయొద్ద వ్రాతపని నేర్చుకొనుచున్నది నిన్న నీతోలు మఱిచిపోయి తెచ్చితిని, రహస్యముగా దీసికొనిపోయి సుభద్ర కియ్యవలయునని చెప్పిన వాడును సంతోషముతో గైకొని మీరు చెప్పినట్లు చేయువాడనని పలుకుచు మణివర్మ యింటిలోని బోయెను.

తరువాత గందర్పుం డింటికింబోయి ఉపాధ్యాయుని రప్పించి యాజింక విశేషములన్నియు జెప్పి యార్యా? యీ కార్యము మీ అనుగ్రహంబున లభించినది. ముందుగా నేదేశమునకు బోవలయు? నేనఱిగిన వెనుక నాకొరకు మా తలిదండ్రులు చింతింతురు. మాసము లోపున వత్తును. వారినోదార్చుచుండుడని చెప్పిన నాయనయు అతని సంకల్పసిద్దికి వెరగందుచు నిట్లనెను రాజపుత్రా! భరతఖండమంతయు సులభముగా జూడదగినదే. హిమాచలమున కవ్వల నేమియున్నదో తెలియదు. అచ్చటికి భూగమనంబున బోవుట అశక్యము. ముందుగా అచ్చటికి బోయిరమ్ము రేపే శుభముహూర్తమని చెప్పిన సంతసించుచు నాచార్యుని కెన్నియో చెప్పి యింటి కనిపెను.

అంత గందర్పుండు మఱునా డరుణోదయంబున లేచి ఇష్టదేవతానమస్కారములు గావించి యాహారపదార్ధములు కొన్ని మూటగట్టికొని యాజింకను బూరించి యెక్కి జయపరమేశ్వరా యని మర ద్రిప్పినంత అత్యంతవేగముగా నెగిరి గగనమున నిలిచినది. అప్పు డుత్తరముఖముగాఁ దిప్పి రెండు చెవులు నొక్కి శిరమునందలి చీలత్రిప్పగా గరుత్మంతునికన్న వేగముగా నడువజొచ్చినది దానిమహిమ యెట్టిదో కాని యొడలు త్రిప్పుటకొని కుదుపుకాని యించుకయుం దోపక వేగ మెక్కువైన కొలది నతని కుల్లాస మెక్కుడగుచుండెను. అతండు దానిని భూమి కనతిదూరములో నడిపించుచు దేశవిశేషములన్నియు బరికించుచు రెండు యామములలో హిమవంతమును జేరెను.

శీతసంఘాతపాతంబున జేసి దాని హిమగిరిగా నెరింగి ఆతండు తదీయశిఖరంబున జింకనాపి యొక్కింతసేపు విశ్రమించెను. మధ్యాహ్నసమయముగాన మంచుబాధ అతని కంతగా దోచినది కాదు. తదీయవిశేషము లన్నియు దిరుగా వచ్చునప్పుడు చూడ నిశ్చయించి యతండందు బెద్దతడపు నిలువక తాను దెచ్చిన యాహారమును భుజియించి వెంటనే యాజింక నెక్కి వెండియు నుత్తరాభిముఖుండై అరిగెను.

హిమవత్పర్వతోత్తరభాగంబున బెక్కుదూరమువరకు బర్వతములు, నడ వులే కాని మరియేమియును లేవు. అట్టి మహారణ్యము మీదుగా నరుగునపుడు తన జింకను భూమికి దాపుగా బోనిచ్చుచు భయంకరములైన వింతమృగములంజూచి సింహనాదంబు సేయుచు నపూర్వతరుకుసుమసౌరభవిశేషం బాఘ్రాణించి యాఘ్రాణించి యానందించుచు నున్నతవృక్షాగ్రశాఖాఫలంబులం గోయుచు నెడనెడ క్షుద్రమృగారవంబు లాకర్ణించి యుపరిభాగంబున కరుగుచు నీరీతి నుద్యానాంతరంబునంబోలె నక్కాంతరంబు వినోదవిహారప్రచారంబుల నతిక్రమించి మించిన మురిపెముతో నరుగుచుండ గొండొకవడికి ననంతజనాకీర్ణంబగు నొకపట్టణం బతనికి నేత్రపర్వతమై పొడకట్టినది.

తదుపరిభాగంబున నాజింక నాపి అప్పట్టణము నలుమూలలు కలయ గనుంగొని అంతంబు గానక యోహో! యిది యీ దేశమునకు రాజధాని కావచ్చును, ఈ దేశవిశేషములన్నియు నిందుండును. ఇందుదిగి యిచ్చటి వింతలంజూచెద నిచ్చటి యాచారములు కడువ్యత్యయములుగా నుండకమానవు. మా దేశమిచ్చటికనేక సహస్ర యోజనములుండును. అన్నన్నా! యింకను జాముపొద్దున్నది. ఎంతలో నెంత దూరము వచ్చితిని ఈయంత్రము చేసినవాని నెంత మెచ్చుకొనినను మెచ్చుకొనవచ్చు నని పలుదెరంగులదలంచుచు నల్లన నప్పట్టణము లోనికిం దిగి యాజింక యెడమచెవిలోని చీల తీసినంతగాలిపోయి అది తోలువలె సురుగుటయుం జుట్టుచుట్టి చంక నిడికొని అందొక వీథింబడి అరుగుచుండెను.

చండికకథ

పదిఅడుగులు నడచినతోడనే పురరక్షకు లడ్డమువచ్చి అతని విదేశస్థునిగా నెఱింగి నీ వెవ్వడవు? ఈ పట్టణమున కెప్పుడు వచ్చితివి. సొమ్ము చెల్లించిన చీటిం జూపుమని అడిగిరి. వారి భాషయేమియు నతనికి దెలిసినదికాదు. అప్పుడతండట్టి మాటచెప్పగా నతనిమాటలు వారికి దెలిసినవికావు వారట్లు రెండుమూడుసార్లు లడిగియు దగిన యుత్తరము రామింజేసి కినియుచు దలవరియొద్దకు బోవుదము రమ్మని చేయిపట్టుకొనిరి

అయ్యో! ఇదియేమి అన్యాయము. నేనేమినేరమును జేసితిని నాచేయిపట్టుకొంటిరేమిటికి? విడువుడు విడువుడు అని చేయి విదలించి లాగికొనగా జంకనున్న తోలు జింక జారి క్రిందబడినది. దాని జూచి యోహో! యీతండు తోలుకూడ దెచ్చి ఉన్నాడు. దీనికిని జీటియుండవలయు నిది రెండవ నేరమని యొండొరులు సెప్పుకొనుచు నత్తోలుంగైకొని మాసభకు పదమని త్రోయ దొడింగిరి. తాను జేసిననేర మెద్దియో తెలియక వారి నిందించుచు జింకనిమ్మని బలవంతము చేయుచు బెనకువ చేయదొడంగెను. కాని వాండ్రు పదుగురుండుటచే లక్ష్యము సేయక అతని బలాత్కారముగా తలవరికొట్టము నొద్దకు లాగికొనిపోయిరి.

అత్తలవరియు నతని వృత్తాంతము తన భటులవలనం దెలిసికొని తానుగూడ నతనితో నీవెవ్వడవు? ఈ పట్టణం బెట్లువచ్చితివి. ఈతోలు నీకెక్కడిది? అని అడిగెను కాని యేమియు బ్రయోజనము లేకపోయెను.

అప్పుడు కందర్పుడు సంజ్ఞలచే దన వృత్తాంతము కొంత జెప్పెను. అతని కేమియుం దెలిసినది గాదు. ఆ రాజపుత్రుని వింతపురుషునిగా దలంచి ప్రజలు మూగిచూడదొడంగిరి. వాండ్ర నతండును వింతగా జూచుచు దనజింక నన్యాయముగా రాజభటులు లాగికొనిరని సంజ్ఞాపూర్వకముగా జూడవచ్చిన వారికెల్ల జెప్పదొడంగెను.

అట్లు కొంతసేపు అతని విమర్శించి అతని నిజస్థితిని దెలిసికొనలేక చీటి లేకుండ బట్టణములోనికి వచ్చినందులకును దోలు దెచ్చినందుకును నపరాధిగానెంచి తమ అధికారప్రకారము కందర్పుని బందీగృహములో నుంచిరి.

ఆ చర్మకురంగమును చౌర్యవస్తువుల నిడు మందసములోనుంచిరి. అప్పుడు కందర్పుడు డెందంబున నిట్లు తలంచెను.

ఆహా! విధిపరిపాక మనివార్యమైనదికదా! నాకు విదేశదర్శనలాభఫలం బిది కాబోలు. నాకే బదియారు భాషలు వచ్చును. వానినన్నిటిని వినియోగపరచితిని. ఏమియు బ్రయోజనము లేకపోయెను సర్వదేశపూజ్యమైన సంస్కృతము సైత మీదేశమందు లేనట్లు తలంచెద. నీదేశాచారము లెట్టివో తెలియవు. నావలన నేమి అపరాధము గణించిరో యెఱుకపడదు. వీరిభాష యేమాత్రమున నాకు విశదము కాకున్నది. నా ప్రాణప్రదమైన తోలుజింకను పుచ్చుకొనిరి. ఇంక నే నేమి చేయుదు నెవ్వరితో చెప్పుకొందును ఈలోపల నీజింక మర్మము వారికి దెలిసినచో వారే సారింతురు. తిరుగా నాకీజన్మమున స్వదేశమును స్వజనమును జూచు భాగ్యము లేదుకాబోలు అన్నన్నా! యింటియొద్ద హాయిగా సుఖింపకుండ నాకిట్టి బుద్దియేమిటికి బుట్టవలయును. అని కొంతసేపు విచారించి అంతలో మరల దైర్యముతెచ్చుకొని యోహో, ప్రమాదమువలన నదైర్యపడితిని. నేనువచ్చినది విదేశాచారములు చూచుటకుగదాఁ ఇదియొక వింతయాచారము, తెలిసినది. పదిదినములకు వీరిభాష నేర్చికొని పై అధికారులతో జెప్పుకొనియెదను. ఇందుమాత్రము న్యాయమెఱింగిన వారుండరా యేమి? ఇచ్చటి ప్రజలంజూడ నాగరికత గలవారువలెనే తోచుచున్నారు. ఇచ్చట హిమము విస్తారముగనుక వీరలాపాదమస్తకపర్యంతము గప్పునటు లంగీలు దొడగియుండిరి. వీరియాహారము లెట్టివో తెలియవని అనేకప్రకారముల దలంచుచు నాచెరసాలలో నుండి అంతకుముందున్నవాండ్రతో మాట్లాడుచు వారి భాషను నేర్చుకొనవలయునను తలంపుతో నుండెను.

ఇంతలో నొక అధికారి అశ్వశకట మెక్కి, యాకొట్టమునకు వచ్చి అచ్చట బండి దిగి తలవరితో గలిసికొని అందు బద్ధులైయున్నవారి బరీక్షించుచు గందర్పునిం జూచి యీచోరు డెవ్వడని అడిగిన నతం డతని అపరాధప్రకార మెఱిగించె దాన . నతండు వెరగుపడుచు నతనిం బల్కరించిన గందర్పుడు మునుపటివలెనే తనజింకను బుచ్చుకొని తన్నన్యాయముగా బట్టుకొనిరని సంజ్ఞలచే సూచనజేసెను. వానిమాట లేమియు నర్థముకాలేదు. గాని తదీయరూపలావణ్యాది విశేషములఁ జూడ నతని కించుకజాలి బొడమినకతంబున దన బండిమీదనున్న యొక చిన్నదానిని తనదాపునకుఁజీరి యావింతపురుషునిం జూచితివా అని అడిగెను.

ఆ కాంత కందర్పునింజూచి విస్మయమందుచు అయ్యో! పాపమితడే దేశస్థుడో తెలియదు. మనదేశపు చట్టముల నెఱుగునో యెఱుగడో? ఇంతమాత్రము నేరమునకే వీని నిట్లు చెరసాలం బెట్టవలయునా? వీని ముఖవర్చస్సుచూడ గౌరవ కుటుంబములోనివాడుగా దోచుచున్నవాడు. వీనికి నేను బూటగానుండెద. వీని విడిపింపుడు. వీన మనయింటికి దీసికొనిపోయి నిజమైన వృత్తాంతము దెలిసికొని పిమ్మట నేరము విధింపవచ్చునని చెప్పగా అయ్యధికారి సమ్మతించి యాతలవరి కట్టిపత్రిక వ్రాసియిచ్చి వాని బైకి రప్పించి తమబండి యెక్కుమని సంజ్ఞచేసిరి.

కందర్పుడు వారి సంజ్ఞ గ్రహించి అయ్యో! ప్రాయములోనున్న యాచిన్నదానిప్రక్కన నన్ను గూర్చుండుమని వీరు సూచించుచున్నారు. ఈదేశమున స్త్రీలకు రాణివాసము లేదుకాబోలు. ఈనెలంత సౌందర్యవతికాని సామాన్య కాదు. కానిమ్ము! స్త్రీలలోనంగాని దేశమర్యాదలు దెలియవు నన్ను విడిపించిన యిప్పుణ్యాత్ములతో బోయి కృతజ్ఞత చూపించుకొనియెద ఆ కారణముగా వీనికి నాయందక్కర గలిగినది ఏ దేశమందైనను ధర్మాత్ములుండక మానరని తలంచుచున్న సమయంబున ద్వరగా బండియెక్కుమని తలవరి తొందరజేసెను.

అప్పుడు నాజింక నిచ్చినంగాని నే నెక్కుటకు సమ్మతింపనని కందర్పుడు సూచనచేయగా నాసంగతి యాఅధికారి తెలిసికొని యాతోలు నిచ్చుటకు వీలులేదనియు దరువాత నిత్తుననయు, అతనికిఁ దెలియునట్లు తలవరిచేతనే సంజ్ఞచేయించుటచే నాసన్న గ్రహించి స్త్రీసమక్షమున వసియించుటకు వెఱచుచు బలవంతముమీద నాబండియెక్కి వారికెదురుగా గూర్చుండెను.

అంతట నాబండివాడు గుఱ్ఱము నతివేగముగా దోలుటయు ముహూర్తమాత్రములో నాబండియొక మేడదాపునకు లాగికొనిపోయి నిలిచినది. బండియాగినతోడనే యా అధికారియు నాచిన్నదియుందిగి కందర్పునిం దిగుమని సంజ్ఞచేయగా అతండును వారితో దిగి యాయింటి అలంకారవిశేషము లబ్బురముగా జూడదొడంగెను.

అప్పటికి గొంచెము చీకటిపడినది. అప్పుడాయింటిలోనుండి కొందరు పరిచారకులు బండిదగ్గరకు వచ్చిరి. వారిలో నొకనిం జీరి అధికారి క్రొత్తవానిం జూపుచు నెద్దియా చెప్పెను. అప్పుడా పరిచారకుడు కందర్పుని దనవెంటరమ్మని సంజ్ఞ చేయుచు అతని అమ్మేడమీదనున్న యొకగదిలోనికి దీసికొనిపోయి కూర్చుండ బెట్టెను.

ఆగదిలోనున్న అలంకారములతీ రంతకుము న్నతండు చూచియుండనందున మిక్కిలి వెరఁగుపడుచు గాజుదీపముల యంత్రవిశేషముల కచ్చెరువందుచు నొకపీఠంబున గూర్చుండి తనరాకను గుఱించి యాలోచించుచుండెను.

ఇంతలో అందున్నబల్ల మీద వ్రాతసామగ్రి యుండుటజూచి కుంచికంగొని రంగులతో నొక పటముమీద దనదేశమును వ్రాసి అందొక సభయునందు దాను సింహానసమున గూర్చున్నట్లును పరివారము చుట్టును పరివేష్టించి యున్నట్లును చక్కగా వ్రాసెను. మఱికొంతసేపటికి వేఱొక పరిచారకుడు మాంసము మద్యము మొదలైన భోజనపదార్దముల దెచ్చి అందున్న బల్లమీదనుంచి భుజింపుమని సన్నఁ జేసెను.

అప్పు డతండు అయ్యో! ఈదేశమున నాచారనియమము లేనట్లున్నది. పాదప్రక్షాళనము చేయక సంధ్యావందనము గావింపక మడి గట్టుకొనక యెట్లుభుజింతును ఈ బట్టలతో నాహారమెట్లు సైచును సీ! గర్హితమైన భోజనము నేను గావింపను. ఇదియునుంగాక వీరికులమెద్దియో తెలియదు. నాయొద్దనున్న పదార్థములే భుజియించెదనని తలంచుచు అందు తెచ్చియుంచిన వానిలో బాలుమాత్రము పుచ్చుకొని తానుదెచ్చిన ఫలాదికమును దిని యాకలి నడంచుకొనియెను. తరువాత నాపరిచారకుడు మిగిలినపదార్థములన్నియు వెండియుం దీసికొనిపోయెను. మఱికొంతసేపునకు నొకయింతి యాగదిలోనికి వచ్చినది. ఆచిన్నదానం గురుతుపట్టి తాను పీఠమునుండి లేచి కందర్పుడు సంభ్రమముతో నేమి చేయవలయునో తెలియక యూరక నిలువంబడి చూచుచుండెను.

అప్పు డాపడతి ఆతని గూర్చుండుమని హస్తసంజ్ఞచేసి తానొకపీఠముపై గూర్చుండి సంతుష్టిగా భుజించితివా? అని సంజ్ఞచేయగా నతండు తలయూచి శరీరము నడంక ధైర్యముదెచ్చుకొని యామెకు నమస్కారము జేసెను.

ఆక్కేలుమోడ్పు సాంకేతికమెట్టిదో తెలియక, యాచిన్నది నవ్వుచు నీది యేదేశము పట్టణములోని కెట్లువచ్చితివి? నీవృత్తాంతమేమని సంజ్ఞాపూర్వకముగా నడిగినది.

ఆభాష అతనికి గొంచెము కొంచెము గురుతు తెలియుచుండెను. కావున నా మాట లర్థముజేసికొని తానువ్రాసిన చిత్రపట మా యింతికింజూపుచు నందున్నవాడ నేనేనని తెలియునట్లు సంజ్ఞచేసెను.

ఆ చిత్రపటమునుజూచి యాచిగురుబోడి వెరగుపడుచు నతని నొకదేశప్రభుఁవుగా దెలిసికొని యప్పటమును బలుమారు చూచుచు దలయూచుచు నప్పుడందున్న వేఱొకపటము గైకొని అందతని రూపమువ్రాసి అతనిప్రక్కను తనరూపము వ్రాసికొని అతనికిం జూపినది.

ఆ సంజ్ఞ గ్రహించి యారాజకుమారుడు మరల తానొక యువకునిరూపము వ్రాసి తన దేశస్త్రీని స్వదేశాలంకారముతో దనప్రక్క ------------------చిన్నదానిని వ్రాసి మీకును మాకును దేశభేదము గలుగుటచే నాచారభేదము గలిగి యున్నది. కావున బెండ్లియాడుటకు వీలులేదని సూచించెను.

తరువాత నానాతి నే నిన్నువరించితిననియు నీవు బెండ్లియాడకుండినచో విరహవేదనంజెంది మృతినొందుదుననియుం దెలుపుచు అతని రూపు వ్రాసి దానిం గౌగలించుకొని అధరరసం బానుచున్నట్లు తన రూపమును వ్రాసినది.

ఆసంజ్ఞ గ్రహించి కందర్పుడయ్యో! యిదియేమికర్మము? ఈచిన్నది యొంటిగావచ్చి నన్ను నిర్భంధించుచున్నది దీనియాప్తు లెవ్వరేని చూచిరేని ప్రమాదము. అదియునుంగాక తన్ను బెండ్లియాడుమనికూడ సూచించుచున్నది ఈపని కెట్లొడంబడుదును వీరేజాతివారో తెలియదు. స్వజాతినాతిం పెండ్లి యాడినంగాని అన్యజాతి యువతిం బెండ్లియాడగూడదు రెండవభార్యగా స్వీకరింతునని సుభద్రతో బ్రమాణికము చేసియుంటి అది అట్లుండె స్వదేశము విడిచి ఈదేశములో నుండుమనికూడ నిచ్చేడియ సూచించుచున్నది. ఈ నిబంధనము లేమియు నాయుల్లమున కెక్కుటలేదు. ఈపడతికి గోపము వచ్చిన వచ్చుగాక. వివాహమాడుటకు సమ్మతింపనని నిశ్చయించి యాయభిప్రాయము పటమున వ్రాసి చూపెను.

అప్పుడచిన్నదానికి మిక్కిలి కోపము వచ్చి నీ కంఠమును దఱిగింతును చూడుమని తెలియునట్లు వ్రాసి అంతలో నాగదిలోనుండి లేచిపోయినది

పిమ్మట నా రాజకుమారుడు పెక్కు తెరంగులదలపోయుచునిద్రబోవక ఎట్టకే నా రాత్రి వేగించెను. ప్రాతఃకాలమున అయ్యధికారివచ్చి అతని బరామర్శించి అతని ఉపచారములకై పరిచారకులను నియోగించి దాను బండియెక్కి విహారార్థ మరిగెను.

ఆ చిన్నది యాపాచకులంజూచి యోరీ! రాత్రి తీసికొని వెళ్ళిన పదార్థములలో నా క్రొత్తవాడెద్ది ప్రియముగా భుజించెనో చెప్పుడు. యిప్పుడు దాని వెండియు అమరింతు ననుటయు భుక్తశేషపదార్ధములు బానిసలకే కనుక తాము కుడువచుచ్చు నను తలంపుతో అమ్మా! ఆయనకు మద్యము మిక్కిలి యిష్టము రాత్రి బ్రీతిగా బుచ్చుకొనియెనని చెప్పిరి.

మాటనిజమని తలంచి యాచిన్నది అతని కాపుట బెందలకడ నాహారపదార్థముల బంపుచు మద్యపాత్రలో విషము గలిపినది. ఆహా! ఆదేశస్త్రీ లెంతధూర్తులో. అసమ్మతము తప్పునా. పాత్రలన్నియు రాత్రివలెనే పావకుడు బల్లమీద పెట్టెను కాని వానిలో నొక్కదాని దడవక కందర్పుడు పాలు మాత్రము ముట్టుకొని తాను తెచ్చుకొన్న పదార్థములే భుజించి యాకలి నడంచుకొనియెను.

అప్పుడవి అన్నియు నాపరిచారకులే తీసికొనిపోయిరి ఇంతలో దమ అధికారి వీథినుండి వచ్చెను. అతనికి భోజన మమరించు సమయమున మద్యపాత్ర పగిలి అందున్న మద్యము భూమిమీద బడినది. దానికి మాదకారుడు జడియుచు అది గుప్తముచేసి కందర్పునికై అమరించినది తాము దాచుకొన్న దైనను యజమానుని వలన మాట వచ్చునను వెరపుతో దెచ్చి అమరించుటయు అందు విషము గలిగి ఉన్నదని తెలియదుగావున దొందరగా దానింద్రావి విశ్రమించినంత నాయధికారి యమలోకమున కతిథియై అరిగెను.

కొంతసేపటికి అతండు శయ్య పై జచ్చియుండుట దెలిసికొని పరిచారకులు గుండెలు బాదుకొనుచు నేడువదొడంగిరి. ఆయల్లరి విని యాచిన్నదియు ఆతని భార్యయు బంధువులు వచ్చి పరీక్షించి మృతి నొందుటకు గారణ మరయక అడలజొచ్చిరి. ఇంతలో రాజవైద్యులు రాజభటులు వచ్చి పరీక్షించిరి. ఆ చిన్నది యా యజమానినికి మరదలు తనబావ మృతిని గురించి మిక్కిలి శోకించుచు గందర్పున కిచ్చిన విషప్రయోగ మెట్లో యితనికిం దగినదని యూహించియు బయలు పరుపక కందర్పునిమీద నీనేరము త్రోసివేయవలయునని తలంచుచుండెను. ఇంతలో నా వైద్యులు అతడు భుజించిన పాత్రలన్నియు శోధించి మద్యపాత్రయందు విషమున్నట్లు కనిపెట్టిరి. అప్పుడు తలవరి మొదలగువా రాయింటిలో నున్నవారినందరిని విమర్శింపుచుండ నాచిన్నది పరిచారకులతో మంతనమాడి యానేరము కందర్పుని మీద బెట్టుడని నియోగించినది.

అప్పుడా పరిచారకులు తలవరియొద్ద నిలువంబడి అయ్యా! రాత్రి విదేశస్థు డొక్కడు మా యజమానిచేత నాహూతుండై సత్కరింపబడెను. వానికీదినమున మేము భోజన పదార్ధములు తీసికొని వెళ్ళి బల్లమీద నుంచితిమి. అవి అన్నియు నతండు భుజించి మద్యము మాత్రము పుచ్చుకొనక దానిలో నెద్దియోకలిపి యిది మీ యజమానుని కియ్యుడు. దీనియందు సిద్ధరసము గలిపితిని. మంచిరుచిగా నుండునని చెప్పెను. ఆ మాటలు నిక్కువ మని మేమాపాత్రను దీసికొనిపోయి యాయన భోజనపు బల్లమీద నుంచితిమి. దానింగ్రోలి అతండిట్లయ్యెను. క్రొత్తవాని కులశీలనామంబులు తెలిసికొనక యింటికి దీసికొని వచ్చినందులకు మంచి యపకృతి గావించినాడని ఆతని నిందింపం దొడంగిరి.

అప్పుడు తలవరి అంతకు ముందటిదినమం దతని నెఱగి ఉన్నవాడుగావున గందర్పుని నిందించుచు బట్టించి చేతులకు గొలుసులు తగిలించి బందీగృహంబునకుం దీసుకొనిపోయెను. అప్పుడావార్త పట్టణమంతయు వ్యాపించినది. కందర్పుని నందరు గృతఘ్నుండని తిట్టదొడంగిరి. నిజ మెవ్వరి కెఱుక. కందర్పు డాయధికారి చావునకు బంధువుడులోలె నాత్మగతంబున వగచుచు దన్నిమిత్తమున దన్నుబద్దుజేసిరని తెలిసికొని చింతింపక కానిమ్ము! నిజమున దైవముండక మానడు అట్లుకాక ఇది మదీయ పురాకృతదుష్కృతమే యైనచో దప్పక అనుభవింపపలసినదేకదా? వీరి భాష నాకు వచ్చినచో నెద్దియేనిం జెప్పుకొందును? మాట వచ్చినను మూగవాడనైతినని అనేక ప్రకారముల దలంచుచు నాకారాగృహంబున నుండెను. మఱియొకనాడు సాక్షులతోగూడ గందర్పుని రాజసభకు దీసికొనిపోయి తలవరి అతని నేరము చేసిన వానిగా నిరూపించుచు దాను వ్రాసిన పత్రికలన్నియు నా పట్టణప్రభువునొద్ద కనిపెను.

ఆ వార్త అంతకుమున్నె యాపట్టణమంతయు వ్యాపించి ఉన్నది. నృపతియు విని ఉండెను. దానంజేసి అతండు కందర్పుని యెదుట నాసాక్షుల విచారించి నీవీ యజమానుని విషమిడిచంపినట్లు వీరు చెప్పుకొనుచున్నారు ఒడంబడెదవా? లేక చంపనట్లుగా నిదర్శనము లేమైనం జూపెదవా? అని యారాజడిగెను ఆ మాటలే తలవరి మెల్లగా నతనికి బోధించి యేమి చెప్పెదవని సూచించగా గందర్పుడు తెలిసికొని నేనేమియు నెఱుంగను నాకు సాక్షులెవ్వరునులేరు. న్యాయమును దెలిసికొని మీ యిష్టము వచ్చినట్లు చేయుడిని సంజ్ఞచేసెను.

అప్పు డారాజు నేరము చేసినట్లే నిశ్చయించి కందర్పునికి నుఱిశిక్ష విధించి కింకరుల యధీనము జేసెను. యమకింకరులవలె భయంకరులగు నారాజభటులతని నప్పుడే బండియెక్కించి పట్టణమంతయుం ద్రిప్పుచు గ్రమంబున వధ్యభూమికి గొనిపోయిరి. మరణము తనకాసన్నమైనదని యెఱింగి కందర్పుడాత్మ గతంబున నిట్లు తలంచెను. ఆహా!

శ్లో: నియతిర్విధాయ పుంసాం ప్రధమంసుఖ మవరిదారుణం
    దుఃఖం కృత్వాలోకంచవలాతటి దివ వజ్రం నిపాతయతి.

గీ. అతిచిరంబగు తేజుంబు జూపి పిదప
    పిడుగు మొత్తెడు మెఱపు కైవడిని ముందు
    సుఖము చవి జూపి పిదప హెచ్చుగను
    దుఃఖముల ఘటించును గాదె లోకులకు నియతి.

అన్నన్నా! సమానులలో నుత్తముండని పేరుపొందిన భూపాలునకు జనియించి పదియారేడు ప్రాయములో బెక్కువిద్యలు గ్రహించి విద్యారూపశీలములచే నసమానుండ ననిపించుకొని పట్టభద్రుడు కానున్న నాకిట్లు బంధుజనశూన్యంబైన పరదేశములో సహాయము చేయబూనిన యొకని జంపితినని నపయశము మీద బడ బలవన్మరణము విధించె నేమనవచ్చును. అనన్యజలబ్ధంబైన చర్మకురంగంబే నాకీయాపద దెచ్చి పెట్టినది. భరతఖండంబున ననేకదివ్యక్షేత్రంబులు పట్టణంబులు గలిగి యుండ దొలుతనే యీ క్రూరదేశమునకు రావలయునను బుద్ధి యేమిటికి బుట్టవలయును. అయ్యయ్యో! ఈకురంగంబు వలన నెన్నియో దేశములు తిరిగి ఎన్నియో విశేషములు సంపాదింపవలయునని ఎన్నియోఊహలతో నుంటి. అన్నియు దృటిలో నిష్ఫలములై పోయినవి కటకటా! మాలదైవమా! నాయుచ్ఛ్రయము నీకంటి కెంత వెగటైనది? ఈ రూపము నీ విద్యలు నీ గుణములు నీయూహలు, నాయుశూన్యముగా నాకేమిటికై యిచ్చితివి. హా! తల్లిదండ్రులారా, వృద్ధుల మదేకపుత్రుల మిమ్ములవిడిచితి నన్నుగానక యెంత చింతించెదరో! అక్కటా! గురువర్యా! నేని క్కువముగా దిరుగా వత్తుననుకొని మజ్జననీజనకులకు శోకోపశమనము గావింపుచుందువు కాబోలు! సుభద్రా! నన్ను భర్తగానెంచి ప్రాణసంకటమునకైన నొప్పుకొని చర్మకురంగం బిచ్చితివి. నీవైన వలదని వారించినచో నీయాపద రాకపోవునే! ఇక నిన్ను జూచుభాగ్య మీజన్మమున నాకు లేదని అనేకప్రకారముల నాత్మీయులం దలంచుకొని వెక్కి వెక్కి యేడ్చుచున్నంతలో శాస్త్రజన్యమైన వివేకంబు హృదయంబున దోప, సీ! దేహపాంతంబునకు వగచుట మూర్ఖతగదా.

శ్లో॥ ఏతస్మాద్విరమేన్ద్రియార్ధగహనా దయాసకాదాశ్రయ
     శ్రేయోమార్గ మశేషదుఃఖశమన వ్యాపారదక్షం క్షణాత్
     స్వాత్మిభావ ముపైహి, సంత్యజ కల్లోలలో లాంగతిం
     మాభూయో భజ భంగురాం భవరతిం చేతః ప్రసీధాధునా.

చిత్తమా! అత్యంతదుఃఖప్రదమైన విషయాశక్తిని విడువుమా! దుఃఖశూన్యమైన మోక్షమార్గము నాశ్రయించు స్వరూపానుసంధానమును బొందుము. చాంచల్యమును విడువుము. సంసారాశక్తి నేవగించి ప్రసన్నవగుము అని మానసబోధంబు గావించుకొని

శ్లో॥ మహేశ్వ రేవా జగతామధీశ్వరె జనార్దనేనా జగదంతరాత్మని
     నవస్తుభేదపతిఁతిపత్తిరస్తిమే తథాపిభక్తిస్తరుణేందుశేఖరె ॥

జగద్దేతుభూతులగు హరిహరులయందు సమానప్రతిపత్తియున్నను నారాజకుమారుడు భక్తిజనవశంకరుండైన శంకరుని ధ్యానించుచు దనశిరంబా యురిత్రాటం దగిలించెను. అప్పుడు రాజకింకరులా త్రాడు ముడి బిగియింపవచ్చునా? అనిదాపుననున్న అధికారి నడిగిరి అతండాజ్ఞ యియ్యవలయునని తలంచుచుండ అంతలో నిరువురు రాజభటులు బరుగిడి వచ్చుచు నురిదీయవలదు వలదని కేకలు వేసిరి. ఆకేకలు విని యా అధికారి వారలదెస జూచుచుండ నింతలో వారు సమీపించి రాజముద్రాంకితమైన పత్రికనొకదానిం జేతికిచ్చితిరి దానిం చదువుకొని యాఅధికారి వెరఁగుపడుచు నోహో! వీని కింకను నాయుశ్శేషమున్నది. వీనివెంటనే రాజసభకు దీసికొనిరమ్మని శాసనంబిచ్చిరి. కావున వెండియుం బండి యెక్కించి గొనిపొండని యాకింకరుల కాజ్ఞాపించెను.

అప్పుడా కింకరు లతని నుఱిత్రాటనుండి తప్పించి బండియెక్కించి వెండియు రాజసభకు దీసికొనిపోవుచు నాజ్ఞాపత్రికలం దెచ్చినవారిఁ జూచి సభలో నేమి వింతలు పుట్టినవి. వీని మరల దీసికొనిరమ్మనుటకు గారణంబేమని అడిగిన వారిట్లనిరి.

రాజుగా రితనికి నురిశిక్ష విధించి అంతఃపురమునకు బోయి తనపుత్రికతో సభావృత్తాంతములం జెప్పుచు నీతని యుఱిశిక్షతెఱం గెఱింగించి బాలా! అది యేమియో కాని వానికి శిక్ష విధించినది మొదలు నాహృదయుమున భీతి బొడముచున్నది. యిది అన్యాయము గాదుకదా! నీవు మిగుల బుద్ధిమంతురాలవు నిజ మూహింపుమని యందు గుఱించి జరిగిన గ్రంథ మాసింధురగమన కిచ్చెను.

ఆచిన్నది అదిఅంతయుం జదివికొని అప్పా! తప్పుతీరుపు చెప్పితివి. అకారణముగా దనకుపకారము చేయబూనినవానికొక విదేశస్థుడు విషమిడె నన్న నెట్లు నమ్మదగియున్నది. అయింటిలోనివారెవ్వరో యీ పనిచేసి ఈ క్రొత్తవానిమీద ద్రోసి రింతియ నిక్కువ మారహస్యము నేను బయలుపఱచెద జూడుమని చెప్పి అప్పుడే మమ్ముల నిచ్చటికి బంపి తా నాచనిపోయిన అధికారి యింటికి బోయినది. యిదియే వృత్తాంతము వీని అదృష్టమెట్లున్నదో తెలియదని చెప్పిరి. వారి భాష గొంచెము కొంచెము తెలియుచుండెను. కావున కందర్పు డామాటలన్నియు గ్రహించి రాజపుత్రిక మిక్కిలి సూక్ష్మబుద్ధిగలదని మెచ్చుకొనియె.

ఆదూతలట్లు మాటాడుకొనుచు నాకందర్పుని రాజసభకు దీసికొనిపోయి రాజు సింహాసనమున కెదురుగా నిలువంబెట్టిరి యింతలో రాజపుత్రిక మృతుండైన అధికారి యింటికి పోయి యా యిల్లంతయుం బరీక్షింప గందర్పుడును ఆచిన్నదియు సంజ్ఞాగ్రహణార్థమై వ్రాసికొనిన చిత్రపటంబులు మాత్రము దొరికినవాటిం గైకొని యాచిన్నది అందలి విశేషముల గ్రహించుటకై కొందఱ గూఢచారుల నియోగించి వెంటనే రాజసభకు వచ్చి తండ్రిప్రక్కను గూర్చుండి తనయెదురనున్న కందర్పు నాపాదమస్తకముగా శోధించి తదీయ రూపవిశేషమున కచ్చెరువందుచు దండ్రితో నిట్లనియె.

తాతా! ఈపురుషరత్న మేదేశమునకో ప్రభువు. కాని సామాన్యుడుకాడు. ఈతనిహృదయము కరుణాభూయిష్టమై యుండక మానదు ఇట్టివాడిట్టి క్రూరకృత్యమును జేసియుండడు నిష్కారణము దొంగసాక్ష్యముల నమ్మి వీనికి నుఱిశిక్ష విధించితివికదా! దీనినే రాజులకు రాజ్యాంతమున నరకమని చెప్పుదురు. ఇందలి నిజము నీకుబట్టి యిచ్చెదజూడుమని బల్కుచు దనకువచ్చిన భాషలన్నిటిచేత అతనిం బల్కరించినది అవియేమియు అతనికి దెలిసినవికావు. కాని యానమ (కస్త్వం) అని సంస్కృతము మాట్లాడినట్లుగా స్ఫురించి యోహో! దేవభాష యీ యోషామణికి వచ్చునట్లున్నది. అట్లయిన నీయాపద దప్పిపోయినట్లే తలంచెదనని సంతసించుచు -

హిమాచల దక్షిణదేశీయః కశ్బిద్రాజపుత్రోహం

అనియుత్తరము చెప్పగా నామత్తకాశిని శిరము గంపించుచు "తవదుదంత మాద్యంత ముచ్యతాం" అనిపలికినది అప్పుడతండు తాను దేశయాత్రచేయుచు నాపట్టణమునకు వచ్చుటయు రాజభటులు తన్ను బట్టుకొని తలవరి కొట్టమునకు దీసికొనిపోయి చెరసాలం బెట్టుటయు, వొక అధికారియు, చిన్నదియు బండిమీదవచ్చి తన్ను విడిపించి తనయింటికి దీసికొనిపోయి విందుచేయుటయు రాత్రి యా కనకగాత్రి వచ్చి తన్ను నిర్భంధించుటయు దా నొడంబడకపోవుటయు లోనగు వృత్తాంత మంతయుం జెప్పెను.

అప్పుడా రాజపుత్రిక అతని వకృత్వమునకు మిక్కిలి సంతసించుచు దమ దాపున నొకపీఠము వైపించి అందుగూర్చుండుమని సగౌరవముగా నియమించి తాను దెచ్చిన చిత్రపటము లతనికిం జూపి వానికారణములన్నియుం దెలిసికొని చివర సమ్మతించితివికావు గనుక నీశిరము ద్రుంపింతు చూడుమని యారీతి సంజ్ఞ వ్రాసి యున్న పటమెత్తి యాసంజ్ఞా ప్రకారమంతయు దండ్రి కెఱింగించి యీ హత్య యీ చిన్నదే చేసి యితనిమీద బెట్టినదని చెప్పినది.

ఈలోపల గూఢచారులలో నొకడువచ్చి యొక యుత్తరము దెచ్చి యారాజు పుత్రిక కిచ్చెను. దానిఁజదువ నిట్లున్నది. నాకిప్పుడొక శత్రువునిం బరిభవింవవలసి యున్నది. కావున నీచీటిందెచ్చిన చేటికకు విషరసంబిచ్చి వెంటనే పంపుము. నీ ప్రియురాలు చండిగ. ఆ చీటివ్రాసిన దివసము, ఆ యధికారి చచ్చిన దివసము నొక్కటియే ఆదినము సూర్యోదయకాలంబుస వ్రాసినట్లున్నది.

అట్టి చీటిని ముమ్మారు చదివి తండ్రికి బోధించుచు అప్పుడే యాచండికం బట్టితేర దూతలం బంచెను. ఆ చండిక వచ్చినతోడనే రాజపుత్రిక యాపత్రికం జూపుచు నిదియెవ్వరు వ్రాసిరి? చెప్పమన అత్తన్వి బెగడొందుచు నొకమాట జెప్ప దొడంగినది. ఆవ్యగ్రత గ్రహించి రాజపుత్రిక విషమప్రశ్నముల వైచి తుదకు యథార్థము దానిచేతనే చెప్పించెను ఆ రాజపుత్రికయొక్క. బుద్ధిసూక్ష్మతకు మిక్కిలి సంతసించుచు అప్పుడా చండికకు ద్వీపాంతరవాసశిక్షయు దానిపరిచారకులకు బంధనశిక్షయు విధించి కందర్పుని మిక్కిలి గౌరవించి అపచారము చెప్పుకొని తన అంతఃపురమునకు దీసికొనపోయి తగుసత్కారములు గావించెను.

అందు గందర్పుడు మద్యమంసాదుల ముట్టక స్వోచితంబైన భోజనమే కావించెను. రాజపుత్రికయు ఆతని బెండ్లి యాడవలయునని యిష్టమున్నను జండికను వలె దన్ను గూడ సమ్మతింపజేయ వచ్చునను తలంపుతో నతనితో సంతతము విద్యాప్రసంగములం గావింపుచు వినోదవిహారముల చేయుచు బరిహాసగర్భితములైన మాట లాడుచు భోజనభాజనములయందు సంగాంగమేళనం బాచరింపుచు అతని చిత్తవృత్తి ననుసరించి కొన్ని దినములు గడపినది

అతండును రాజభోగముల ననుభవించుచు సాయంప్రాతఃకాలములందు నశ్వశకట మెక్కి పట్టణమున నలుమూలలు విహరింపుచు నొకనాడా తలవరియొద్దకు బోయి తనయొద్ద లాగికొనిన తోలుజింక నేమిచేసిరని అడిగెను.

ఆతండయ్యా! అది యింతకాలము మాయొద్దనుండదు. ఆమఱునాడే వేలము, పాడితిమి. ఎవ్వరు తీసికొనిరో మాకు దెలియదని చెప్పెను. కందర్పుడు పదిదినములలో, నాభాషఅంతయు గ్రహించెను గనుక నాపట్టణ ప్రజలతో మైత్రిజేసి వారివారి యాచారములన్నియు దెలిసికొని రహస్యముగా నాతోలుజింక గుఱించి తర్కింపు చుండెను.

అతండొకనాడు ప్రాతఃకాలంబున నొకవీధింబడి పోవుచుండ నంత్యజుం డొకండు చర్మములను గావడివైచుకొని మోసుకొనివచ్చుచు నెదురుపడిన బండినిలిపి తన వాడుక ప్రకార మాకావడి దింపించి యాచర్మము లన్నియు బరీక్షింప నందా తోలుజింక కనంబడినది దానియందున్న లిపి యాదేశస్థులకు దెలియదు. కావున దాని మహత్యమెవ్వరికిని బోధపడినదికాదు. ఆ జింకం జూచి అతం డాత్మగతంబున సంతసము పట్టజాలక గంతువై చి యోరీ! యీతో లెంతకు గొంటివని వానినడిగెను.

వాడు అయ్యా! ఇది యేమిటికి నుపయోగములేదు. ఈ చర్మములపైన గొసరుగా దీసికొంటి మీకు గావలసినచో మీయిచ్చవచ్చిన సొమ్మిచ్చి పుచ్చుకొనుడని చెప్పెను.

ఆమాటలకు సంతసించుచు గందర్పుడు తనవ్రేలి యుంగరమొకటి పారితోషికముగా వానికిచ్చి యాజింకం బుచ్చుకొని యింతిం తనరాని సంతసముతో నప్పుడే యింటికివచ్చి యాత్మగతంబున నిట్లు తలంచె.

ఈ దేశమున జీవహింస కించుకయు వెరువరు స్త్రీలందఱు విద్యావతు లగుటచే సాహసము మెండు. చట్టములు వేనవేలు ఇట్టిదేశమున నివసియించుట బహుకష్టము. అదియునుంగాక యీరాజపుత్రిక నాకు జీవముపోసినది. ఆమె అభిప్రాయం నన్ను బెండ్లియాడవలయునని ఉన్నట్లు తోచుచున్నది దాని కొడంబడనిచో చండికవలెచే చేయునేమో! ఈదేశప్రజలనెవ్యరు నమ్మగలరు? కావున నిప్పుడే దేశము నుండిపోవుటయే ఉచితము విదేశయాత్రవలన మొగము మొత్తినది. భరతఖండము నందున్న వింతలనే చూచి అంతటితో దృప్తింబొంది యింటికిబోయెదనని నిశ్చయించి యామఱునాడుదయమున రహస్యముగా నాజింకను బూరించుకొని యెక్కి, మరద్రిప్పి యప్పురంబున కెగసిపోయెను.

అటనుండి పశ్చిమాభిముఖంబై యరిగి యరిగి యెద్దియేని వింత పట్టణము కాన్పించినచో బై నుండియే చూచుచు గ్రమ్మరం జనిచని పశ్చిమసముద్రతీరంబు వరకుం బోయెను. అప్పుడు సముద్రములోనున్న ద్వీపములంజూడ వేడుక బొడముటయు హనుమంతుండువోలె నా సముద్రము మీదుగా నరుగుటయు గొంతదూరము పోవువరకు నతని కేమూలంజూచినను మహార్ణవమేకాని మఱియేమియుంగనంబడమి డెందము వికలమైనది. ఇంతలో సూర్యుడస్తమించెను. నాటి దివసంబు పూర్ణిమ అగుటచే జంద్రకిరణంబు లంభః కణంబుల బ్రతిఫలించి వజ్రమువలె మెరయుచుండ రేయెండ బ్రహ్మాండకరంబునకు సుద్ద బూసిన వాని భాసల గన నతనికి దిగ్భ్రమయై వచ్చినదారిం బోవలయునని తలంచియు దెలియక నలుగడలు గ్రుమ్మరుచు గొంత వడికి జంద్రబింబమును గురుతుగా నిడికొని దక్షిణమునకు మరలి సూర్యోదయసమయమువరకునుం బోయెను. కాని దఱిదొరికినది కాదు.

బుద్ధిశాలియగు కందర్పు డప్పు డాలోచించి అంతనుండి తన జింకను సూర్యున కభిముఖముగా నడిపింపం దొడంగెను. అట్లు నడువ నడువ జాము ప్రొద్దువేళకు భూమి గనంబడినది.

అప్పు డతండు దన్ను బునర్జీవితుంగా దలంచుచు మిక్కిలి యాకలి అగుచుండుటంజేసి యాప్రాంతమం దేవేని ఫలవృక్షములు గనంబడునేమో ఫలములైనం దినవచ్చునను తలంపుతో భూమికి దాపుగా దన కురంగంబున నడిపించుచుండ నొకదండ కుసుమితపల్లవితఫలితతరువిసరమనోహరంబగు నుద్యానవనం బొండు గనంబడినది.

పెన్నిధింగన్న పేదయుంబోలె దానిం జూచి సంతసించుచు నతఁ డందు బ్రవేశించి అక్కురంగంబు నొకమఱుంగున నిడి అందుగల దీర్ఘి ------------------- నముచేసి కడుపునిండ నందలి ఫలరసంబులం గ్రోలి తదీయ వైభవ ------------------- ఈ తోట చుట్టును దిట్టమైన ప్రహరి గలిగియున్నది. వనపాల ----------------యందు జీమకైనం బ్రవేశింప శక్యముకాదు. లేనిచో దమంతన ---------------------యెల్లెడల నుండునా ! ఈ తరుశాఖల వ్రేలంబూన్చిన డోలికావిశేష ---------------తరచుగా నిందు జేడియ లాడుకొనుచుందురని తలంచెద మఱియు ----------------- లిందు బెక్కులు గనంబడుచున్నవి అవి స్త్రీల కర్హంబులగుటచే ------------------- బగుట నిక్కువంబు వివిధకుసుమవాసనా ------------------- లిందు మదీయ మార్గగమనాయనం బవనయించు ---------------------- అరిగెదకాక అని తలంచి యొక చెట్టునీడ గూర్చుండి అందలి వింతలం జూచుచుండెను.

మనోరమ కథ

ఇంతలో నొక చెంతనుండి లతాంతంబులంగోయు కాంతల నెలతనాదంబు వినంబడుటయు నతండదరిపడి యోహో! ఇందామూల వనితలు గ్రీడింపుచుండిరి. ఇందుండిన ప్రమాదము రాకమానదు. ఇదివరకు రెండుగండములు గడిచివచ్చితిని. వేగ నింటికింబోయి సుఖించెద ననితలంచి యాకురంగంబును సవరించుకొని యిది యే దేశమో తెలియదు. స్త్రీజనసంభాషణంబులంబట్టి దేశంబు గురుతుపట్టవచ్చును కావున నీ జింక మీదుగా గొమ్మలమాటునంబోయి యాకొమ్మల మాటలవినియెద దీన బ్రమాదముండదని నిశ్చయించి యాజింక నెక్కి దట్టముగా వ్యాపించియున్న శాఖల సందులనుండి మెల్లగా దప్పించుకొని యాపల్లవపాణులున్న చోటికి... గొందరుచేడియలు పూవులు గోయుచు జమత్కారముగా నిట్లు మాటాడు కొనుచుండిరి.

మనోరమ - మధురికా! దాడిమీఫలముల బక్షులు దినకుండ బైనముక్తాఫలంబులం గట్టితివా ?

మధురిక - రాజపుత్రీ! కట్టితిని ముక్తారత్నాభిరామంబులయి నఖక్షతంబుల నెఱుంగని భవదీయకుచంబులుంబోలె నవియు బతంగ త్రోటిపోటులం గాంచమి మిక్కిలి శోభించుచున్నయవి.

మనోరమ - పరిహాసవతీ 1 నీ వెప్పుడు డిట్లే పలుకుచుందువు. ఈతిలకంబు పూయలేదేమి?

మధురిక - పూబోడీ! నీ వొక్కసారి కన్నెత్తి చూడుము.

మాలతిక - యువతీ! పుష్పవతిఅగు నీ గోరంటను ముట్టితిని. తద్రజోదోషంబు నిన్నంటె. నన్నంటకుము.

పల్లవి - మాలతికా! నీవు చతురవే కాని, నీ పయ్యెదం దొలంగించుచున్న తత్కంటకోసద్రంబు దప్పించుకొనుము.

వసంతిక -- పల్లవికా! మన రాజపుత్రిక చేతులు పైకెత్తి పూవులుగోయుచుండ నా చెన్ను జూచితివా!

పల్లవిక - వసంతికా! మనకే మరులు గొలుపుచున్నది గదా కుసుమకోమలమైన యీ జవ్వని యౌవనం బనుభవింప నెవ్వడు తపంబు చేయుచున్నాడో?

మనోరమ - చెలులారా! మీరు పూవులు కోయుటమాని యనవసరప్రసంగము చేయుచున్నారు ఆయశోకమునకు దోహదము చేసితిరా?

మధురిక - అది నీచరణతాఁడనంబునంగాని చక్కఁబడదు.

వసంతిక - సఖీ! ఈ కామదేవపటం బీపాటికి బూజింతమా! పూవులుమిక్కుటముగా గోసితిమి.

మనోరమ - సఖులార. ఇప్పుడు కాదు. పుష్పాపచయంబున మన మేనులు చెమ్మటలు గ్రమ్మినవి జలక్రీడం దేలిన తరువాత బూజింతము. అనుటయు ..........................నొక్కపెట్టున అంటున్న తటాకంబునం బడి నీదులాడుచు రాజపుత్రికతోగూడ బెద్దదడవు గ్రీడించిరి. అంతలో సాయంసమయ మగుటయు నాట చాలించి యమ్మించుబోడులు తమ తమ పుట్టంబులం గట్టుకొని యింటికిం బోవుటకు అంతకుమున్ను వచ్చియున్న అశ్వశకటంబు లెక్కిరి.

అప్పుడు కందర్పుడు కొమ్మల మాటునుండి వారివిహారమును గ్రీడలుమాటలు రూపములు యౌవనములు కన్నులార జూచి స్మరశరవిద్ధహ్మదయుండై హృదయంబున అయ్యారే! యిది భరతఖండమని వీరి మాటలవలనం దేటయైనది. ఈ పాటలగంధుల నడుమ మనోరమ మనోరమయై మెరయుచున్నది. అదియే రాజపుత్రిక. ఆహా ! ఆ మోహనాంగి సోయగం బెంత వింతగానున్నది. పుట్టంబు విడిచినను తదీయ దేహప్రభయే యంశుకావకుంఠనమువలె మెఱసినది. అధరకాంతియే కుంకుమావలేపనంబయ్యె నౌరా. లోచనంబులు కర్ణోత్పలంబులట్లు కనంబడినవి అంగుళిరాగంబు చరణాలిక్తంబుడంబు గైకొనినది వదనచంద్రికామరీచికలు కన్నులకు మిఱుమిట్లు గొల్పినవి. బాపురే! ఆలాపంబులు తంత్రీనాదంబులవలె వినఁబడినవి. తదీయాలంకారచిహ్నంబులంజూడ క్షత్రియకన్యకవలె నున్నది అన్నన్నా! పరమేష్టిసృష్టి చాలా చాతుర్యంబునకు మేరలేదుగదా? మదీయ దేశాటనంబునకు ఫలంబిదియే ఇక్కాంతం గౌగిట జేర్చువానికి ద్రిభువనాధిపత్యం బేమిటికి? ఒక్కసారి మాటాడినం జాలదే! వీక్షించిన బట్టభద్రునిం జేసినట్లుకాదే! అని అనేక ప్రకారంబులదలం కొనుచు వారిబండ్ల వెంబడి అనతిదూరముగా గగనంబున దన కురంగంబును నడిపించుచుండ ఆయ్యండజయాన లాశకటంబులతో గూడ నాచేరువనున్న పట్టణంబు కోటలోనికి బోయిరి.

అది అంతయుం గుఱుతుగా జూచుకొని కందర్పు డాపట్టణములో నొకచోట నాజింకందిగి దానినిమడిచి చంక నిడికొని యొక బ్రాహ్మణుని యింటికిం బోయి భోజనంబు యాచించెను.

ఆపాఱుండు పేదయైనను అతిథుల సత్కరించు స్వభావము కలవాడగుట అతని సత్కరించి రుచి సంపన్నంబైన అన్నంబు పెట్టెను. భుజించు సమయంబున బ్రస్తావముగా నిది యేదేశము! దీనింబాలించు రాజెవ్వడు? పరిపాలన మెట్టిది? విశేషము లేమని అడిగిన గందర్పున కాబ్రాహ్మణుడు అయ్యా! మీ మాటలు వింతలుగా నున్నవి. దేశము పేరును పట్టణము పేరును తెలియక యిక్కడికెట్లు వచ్చితిరి. ఆకాశము నుండివచ్చినట్లడుగు చుండిరేమి? ఇది మహారాష్ట్రదేశము. దీనింబాలించు రాజు పేరు వీరసేనుడు! ఇచ్చటి చట్టములు మన్వాదిముని కల్పితములు. మా రాజునకు బుత్రసంతతిలేదు. మనోరమ యను కూతురుగలదు. అమ్ముదిత బరమేష్టిసృష్టిచాతుర్యమునకు దుదియను చెప్పనోపు నీనడుమ దానికి స్వయంవరము చాటించిన బెక్కండ్రు రాజపుత్రులు వచ్చిరి. కాని యావిదుషి యెవ్వరిని వరించినదికాదు తన్మూలమున నాధాత్రీపతికి బుత్రికపై గోపముగా నున్నది. ఇవియ ఇచ్చటి విశేషములు. మీదే దేశము? మీరిచ్చటికేమిటికై వచ్చితిరని అడిగిన ఆతడాయనకు దత్సమయోచితముగా నుత్తర మిచ్చెను.

వెండియు నాపాఱునివలనం గోటలోని విశేషము లన్నియుం దెలిసికొని కందర్పుడు మిక్కిలి యౌత్సుక్యముతో నంగడికిం బోయి పుష్పమాలికాగంధాను లేపనాదులం గొని మేనం గైసేసి మనోహరవేషముతో నాటిరాత్రి నాజింకనెక్కి గగనమార్గంబున నమ్మనోరమ శుద్ధాంతమునకుం బోయెను.

అల నయ్యిందువదన సఖులతోడ గూడుకొని వేడుకగా వీణ పాడుచుండెను. తదీయగానము ఆలకించుటచే నతనికి మన్మథోద్రేకం బంతకంత కెక్కుడు కాజొచ్చి - మ | ప్రతిక్షించుచు నాసౌధంబుననే మాటుగా గూర్చుండెను.

  • . . . నిమిషము యుగముగా దోచినది. అక్కాంత అట్లు కొంతసేపు

" పొద్దుపోయినంత నంతర్భవనంబునకుఁ బోయి శయనించి - 17 తమతమ శయ్యాభాగంబుల బండుకొని నిద్ర " నకు మారుం డదియంతయుం గనిపెట్టి చూచుచుండెను. - - - - - మూయకుందురు వారందఱు నిద్రబోయిరను 11, నతండు మెల్లగా లోపల ప్రవేశించి అందంద శయనించిన గా ఈ తప్పించుకొనుచు బోయిబోయి యారాజకన్య శయనించి శ్రీలం ణాపాడ

దివ్యమణిభూషాంబరములం దాల్చి ఆద్భుత తేజంబుతో హంసతూలికా తల్పంబున శయనించియున్న యాయన్ను లమిన్న కన్నులకు మిరుమిట్లు గొల్పుటయు నతండు వెరగుపడి

ఉ. ఔర! విలోచనాంబుజము లద్దిర! ముద్దులనెమ్మొగంబు సిం
    గారము బాపురే! యసదుకౌసు భళీ! వళు లమ్మచెల్ల! నూ
    గారు బలే యురోజము లహా ! నునుతళ్కు మృదూరశోభ య
    య్యరె! భుజంబులీనత సురాంగన గాక మనుష్యకాంతయే.

అనిపొగడుచు, కన్నులు మూసికొని యొక్కింతసేపు నిలువంబడి మెల్ల న కన్ను లు దెఱచి వెఱ పుడిసికొనుచు నత్తరుణీమణి పర్యంకము దాపునకుబోయి తదీయరూపం బాపాద మస్తకముగా గన్నుల కరవుదీర జూచిచూచి తనవి ననక యచటయే ముద్దిడుకొనుచు గపోలములు చుంబింపంబోవుచు నువ్విళ్ళూర నూరక నున్మత్త క్రియల ప్రకటించెను.

ముట్టినలేచి యేమనునోయను వెఱపును, ఏమైనం గానిమ్ము ముట్టకమాననను సాహసమును మనంబున గొంతసేపు తలపెట్ట నేట్టకేల కాతత్తరము హరించుకొని అందు నలుమూలలు పరికించి యామంచముక్రిందనున్న బంగారు గంథపుగిన్నెను గైకొని చేయంటకుండగపోలముల గంధ మలంది స్వనామాంకితమైన యుంగరము నద్దెను. ఇంతలో దెల్లవారుసమయమైనంత నెఱింగి అక్కురంగ మెక్కి యతండు రహస్యముగా నమ్మేడదిగిపోయెను. అంతలో బద్మినీకాంతుండు పూర్వగిరిశిఖర మలంకరించుటయు మనోరమ చెలులతో గూడ లేచి తంతధావనము చేయుచుండ దండనుగూర్చుండి మధురికయను సఖురాలు అమ్మగువ మొగంబు వీక్షించి యంబుజాక్షీ ! అదియేమి ? నీకపోలముల గంధపుముద్రలున్నవి. ద్వైతమతస్థు లిట్లే యద్ది కొందురు, నీకిట్లు మననయ్యెనా యేమి? అనిఅడిగిన నచ్చేడియ వెరగుపడుచు నగ మనము మన ఆహ్య! (170, "ii) నేనెఱుంగ జిత్ర చేయుచందువని పలుకుచు (. మెడనున్న హారంబులు సవరించుకొనబోయి కుచాంతరమున నట్టిముద్రలే యుండుట దిలకించి రవికముడి సవరించుకొనుచు తెగియుండుట దెలిసి కన్నులు వికసింప నా రాజపుత్రిక మధురిక కిట్లనియె.

బిగియంగట్టిన రవిక ముడి కత్తిరించి యిట్లు గంధ మద్దినవారెవ్వరు? నిజము చెప్పుము. నీవుకాక మఱియొకతె నాగదిలోనికి రాగలదా? ఇట్టిపనులు చేయుటకు నీకంత అవసరమేమి వచ్చినది? పరిహాసములు నిద్రలోనా? చాలులేయని యించుక అలుకదోపబలికిన విని అక్కలికి భయపడుచు సఖీ! నేనిట్లు కావించుటకు నాకు నీవు హాస్యమగుదువా! యెప్పుడైన గావించితినా? నేనేమియు నెఱుంగదక్కు గల సఖురాండైనం జేయుదురని నమ్మజాల. నిది యింద్రజాలమువలెనున్నది. వింతవారెవ్వరైన న నీయంతఃపురమునకు వచ్చి రేమో తెలియదు. దగ్గరగా రమ్ము. ఈ ముద్రలయం దక్షరము లున్నట్లున్నవి. ఓహో! ఇందు కందర్పయని యున్నది. మన్మథుడు నీరూపమునకు వలచి రాలేదుకద. ఇతరులకీ శుద్దాంతమునకు రాశక్యమా ఈరచ్చ అంతయుఁ జూడ బురుషులు గావించినట్లున్నది. కాని మఱియొకటి కాదు! అనిచెప్పగా నప్పడతియు దొందరపడుచు నాముద్రల వెండియు అద్దములో బరిశీలించి అక్షరము లుండంగని యొక్కంత యాలోచించి మధురికా! నీవు మన అంతఃపురము నలుమూలల వెదకిరమ్ము. రాత్రి క్రిందిమేడ తలుపులు వైచిరో లేదో విమర్శింపుమని యంపినది. అదిపోయి యామేడలన్నియు వెదకివచ్చి యెందును నేజాడయులేదు. క్రిందిమేడతలుపు లిప్పటికిని మూయబడియే యున్నవని చెప్పినది.

అట్టిసమయమున నారాచపట్టిక నెడమకన్ను నెడమభుజము తొడయు అదర జొచ్చినది. ఆలక్షణంబుల గ్రహించి యా రాజపుత్రి సంతసించుచు మధురికా! కానిమ్ము ఈవింత రహస్యముగా నుంచుము. యెవ్వరైనను వినినచో నవ్వుదురు. ఈరాత్రి నిద్రమేల్కాంచి యావింత పరీక్షింపవలయునని చెప్పి అప్పుడా గంధమంతయు దుడుచుకొని సాయంకాలమువరకు నావిషయమే యాలోచింపుచుండెను. రాత్రియైనతోడనే మనోరమ చక్కగా నలంకరించుకొని మధురికంజీరి సఖీ! ఈరాత్రి మనము నిద్రబోగూడదు. రాత్రివచ్చినవా డీరాత్రియు రాకమానడు భద్రముగా నుండుమని చెప్పుచు సంగీతగోష్టిచే రాత్రి పెద్దయుం బ్రొద్దు మేల్కొని పిమ్మట నిద్రకు దాళలేక మధురికా! నాకన్నులు నిలువకున్నివి. ఇక నేను మేల్కొనజాల నీవు యుండుమని చెప్పి తాను నిద్రబోయినది. మధురికయు బెద్దతడవు జాగరముచేసి యాగలేక చివరకు కునికినది.

కందర్పు డాపవలంతయు మనోరమరూపమును దనరూపమును జక్కగా నొక్కచిత్రపటంబున వ్రాసి తానే వింతగాజూచుచు రాత్రి మునుపటివలె నాసౌధం బున కెగరి యొక గవాక్షముసమక్షమున డాగి యాజవరాండ్రందఱు నిద్దురబోవు వరకు బ్రతీక్షించి సద్దుడిగిన వెనుక మెల్లగా లోనికిఁబోయెను. ఆగది అలంకారములన్నియు నాదినంబున వింతగానున్నవి. దారిలో మధురిక పరుండియుండెను. దానిం దాటి యాపాటలగంధి పర్యంకము దాపునకుం బోయెను. ఆచిన్నదియు నూత్నాంబరాలంకారములు ధరించి ఉన్నది. పెద్దయుం బ్రొద్దు మేల్కొన్నది కావున గాఢముగా నిద్రపోవుచున్నది.

ఆ రాజకుమారుండు వెనుకటి రేయింబలె అయ్యబలకుచకలశములయందును గండములయందును చందనచర్చగావించి పిమ్మట దన వ్రేలియుంగర మయ్యంగన వ్రేలనిడి అక్కల్కి ఉంగరము తానుధరించెను. అప్పటికిని లేవకున్నంత స్వాంతమున బరబుద్ధి యప్రత్యక్షమైనది యేమిప్రమాదము వచ్చునోయని తలంచుచు సాహసింపక యందొకచో బైడిపళ్ళెమున నమరించిఉన్న వీడియము వైచుకొని యోహో: ఇది పురుషులు వైచుకొనదగిన తాంబూలమైయున్నది. ఇందు గస్తురి కన్న కప్పుర మిబ్బడించియున్నది యిది నానిమిత్తమే చుట్టిఉంచిరి. కానిచో వనితల కిట్టిదిబెట్ట నేమి ప్రయోజనమని నిశ్చయించి యాతాంబూలరసం బత్తురుణిమణి మొగమునకు రాచి తానువ్రాసిన చిత్రపట మక్కలికి ప్రక్కలో'నిడి యింతలోఁ తెల్లవారుసమయమైనది. గావున నాజింకనెక్కి తనయిక్కకుంజనియె.

మరునాడుదయంబున లేచి యాచిగురుబోడి యాచిహ్నములన్నియుం జూచుకొని వెరగుజెందుచు మధురికా! నీవును రాత్రి నిద్రబోయితివి కాబోలు. మొన్నటి కన్న గురుతులెక్కుడు గనంబడుచున్నవి మనమీ పళ్ళెరములో నుంచిన వీడెము వైచుకొని యారసము నాకంటించెను చూడుము. ఇంత గాఢనిద్ర పట్టినదేమి? అయ్యో! ఇంకను జూచుకొనలేదు ఈ ఉంగరమెవ్వరిది? నాఉంగర మేమయ్యెనని అనేకప్రకారముల సందేహింపుచు నా ఉంగరమును శోధించి అందున్న అక్షరములం జదివి గంధమద్దిన ఉంగరమిద్దియే. బోటీ! యిటువంటిచిత్రమెప్పుడును కనివిని యెరుంగమే? పోతుటీగకేని నీఅంతఃపురమునకు రాశక్యము కాదు. ఈ కందర్పు డెవ్వడు? ఎట్లువచ్చుచున్నవాడు? భళిరే! చోద్యములు పుట్టెనని పలుకుచు నంతలో దల్పంబున నున్న చిత్రపటము జూచి కామినీ ఇదియేమిటిది? చిత్రఫలకము! అయ్యారే ఇందున్న మిథునము దర్శనీయముగానున్నదిసుమీ! ఈలాటి దాంపత్యమును గూర్చినచో చతుర్ముఖుడు స్తోత్రపాత్రు డగును. అనుటయు మధురిక యాచిత్రపటమును గైకొని శోధించి .... జవ్వనీ! యెంతముగ్ధవే! యిందున్న చిన్నది యెవ్వతెయో చెప్పుకొనుమని యడిగిన అది గ్రహించి మదవతీ! యిది మదీయప్రతిబింబమా యేమి? ఈపురుషుడు మనల వంచించుచున్న కందర్పుడగుట నిశ్చయమే అని అడిగెను

మథురిక నవ్వుచు నీభాగధేయము ఫలించినది. ఈతండు కంతు వసంత జయంతాదులలో నొకండు కావలె గానిచో నిట్టి సౌందర్యము మనుష్యమాత్రునికి గలుగునా? నిక్కువము కందర్పుడే నిన్ను వరించివచ్చె దివ్యపురుషునికి గాక యీ శుద్ధాంత మెట్లు చొరనగునని చెప్పెను.

మనోరమ యించుక సిగ్గభినయించుచు సఖీ! యూరక మనల మోహింపజేయుటకై యిట్లు వ్రాసెనేమోకాని నిజముగా నిట్టి యాకారము గలవాడుండునా? నాకు సందియముగా నున్నదనుటయు నామధురిక కాదుకాదు యదార్థమే ఏలన నీరూపమును బట్టి చూచుకొనుము. నీయాకృతికి ఈయాకృతికి నించుకయేని భేదమున్నదా? అదియు నట్టిదే. ఇట్టియాకారము గలవారు మనుష్యులలో నుండుట అరుదు కాని దేవతలలో నుందురు. అని మధురిక చెప్పిన విని మనోరమ మోహపరవశయై యాచిత్రపటమును గౌగిటంజేర్చి మోము వంచి ముద్దిడుకొనియెను.

అప్పుడు మధురిక మిక్కిలిగా నవ్వుచు జవ్వనీ! ప్రతిబింబము జూచియే యింతవలపు జెందుచుంటివి. నిక్కముగా నా పురుషత్నమును జూచినప్పు డేము చేయుదువోగదా! యని పరిహసించిన అమ్మించుబోడి సఖీ : ఈరహస్యమెవ్వరికిం జెప్పకుమీ! అంతభాగ్యము పట్టినప్పుడు చింతింతములే, కాంతా ! ఈదినమున మనము పగలంతయు నిద్రబోయి రాత్రి మేలుకొందుము. అట్లైన నిద్రరాదు. అని యొండొరు లాలోచించుకొని పగలంతయు నిద్రబోయిరి. సాయంకాలమున నాఅంతఃపుర మంతయు వింత అలంకారములు గావించిరి అక్కాంతయు మనోహరభూషణాంబరములు దాల్చినది. అతని రాక నిరీక్షించుచు మథురికతో గూడ నిద్రబోవు దానివలె బరుండి కన్నులు మూయుచు దెఱచుచు జీమ చిటుక్కుమన్న అతడే అనుకొనుచు నీరీతి గాచియుండెను.

అంత గందర్పుడును యథాప్రకార మలంకరించుకొని అక్కురంగంబు నెక్కి సత్వరముగా నామేడకుం బోయి అందేమియు సందడిలేకుండుటకు సంతసించుచు నల్ల నల్లని అప్పల్లవపాణియున్న గదిలోనికిం బోయి నలుమూలలు తొంగిచూచెను అప్పుడతనింజూచి యాచిగురుపోడి అబ్బురము జెందుచు సౌందర్యమునకు మెచ్చుకొని అతని నొక దివ్యపురుషునిగా దలచి కదలక అతం డేమిచేయునో చూచెదంగాక అని కన్నులమూసికొని నిద్రబోవుదానివలె అభినయించుచుండెను. ఆరాజకుమారుండు మారశరవేదన మేదురం బగుటయు నాత్మగతంబున అయ్యో! రెండు రాత్రులూరక వృధ పోనిచ్చితి. యిమ్మచ్చెకంటి యిచ్చయుం దెల్లము కాకున్నది. ఈరేయినిందు సఖురాండ్రెవ్వరు బరుండియుండలేదు. ఒక్కతియ మాత్రము దాపున పండుకొని యున్నది. పర్యంకము దాపున గాంచనపీఠం బుండుటకు గతంబేమియో తెలియదు చందనాగరు దాంబూలాదిసుగంధద్రవ్యంబులు సవ్యంబు రసల్పంబులుగా మునుపుండు చోటునంగాక తల్పంబు దాపున నిడియున్నవి. ఈచిహ్నంబులన్నియుం జూడ నచ్చేడియ నారాక కనుమతించునట్ల తలంచెద. ఏమైనను మేలయగుంగాని యీరాత్రి నా యభీష్టము దీర్చుకొనక పోవువాడ గానని నిశ్చయించి యమ్మంచముమీద నోరగా గూర్చుండి యమ్మత్తకాశిని మోముపలక్షించుచుండ అంతలో మోహమాపలేక తటాలున అతని చేయి బట్టికొని మథురికా! యిటురమ్ము దొంగ దొరకెనని మెల్లన పిలిచినది.

అప్పుడా కందర్పుండు నేర్పు మెఱయ దప్పించుకొనువానివలె తబ్బిబ్బోక యువతి బుజముల జేతులిడి త్రోయుచు గరచుచు వేణీబంధంబు లాగుచు గక్షంబులం గిల్లుచు నీరీతి జోరుండవోలె నాపట్టు విడిపించుకొననోపనట్లు పెనగులాడుచుండెను. అమ్ముదితయు ముదితహృదయయై అక్కాంత చెంతకు వచ్చుటం చూచి యాపట్టు వదలి మంచము పై గూర్చుండి నాతీ! ఈతండెవ్వడో కనుంగొనుము మేమెవ్వరమనుకొని యిట్లు కావించెనో అడుగుము. ఈసాహస మేమిటికో తెలిసికొనుము. ఈ శుద్ధాంతమున కెట్లు వచ్చెనో చెప్పుమనుము నిజము చెప్పకున్న బద్దునిం జేయింతుమని చెప్పమ నిపలికిన అమ్మథురిక సవినయముగా అతనిచేతులం బట్టుకొని అందున్న పీఠంబునం గూర్చుండబెట్టి యిట్లనియె.

అనఘా! మీ యాకృతించూడ గుణశీలగౌరవంబుల దెలుపుచున్నది మీ యట్టి మహానీయులు పరహృదయంబులం దెలిసికొనక యిట్టికృత్యంబుల గావింతురా? మూడు రాత్రులనుండి మాచేడియ పడియెడి మనోవ్యధ నేమని చెప్పుదును. ఆమె చిత్త మేమి అరసి యిట్టిసాహసము గావించితిరి? ఏను జక్కనివాడవుగావున నేమి చేసినను జెల్లుననుకొనియా యేమి? మీకులశీలనామంబులు లెట్టివి ఈశుద్ధాంతమున కెట్లవచ్చితిరని యడిగెను.

రాజపుత్రుం డాబోటి మాటల కించుక సిగ్గుపడుచు గామినీ! నేనేమి చేయుదును? మదనుం డవిలంఘ్యశాసనుండని నీవు నెఱుంగుదువుగదా? అతని శాసనమే యిట్టిసాహసము చేయించినది అదియునుగాక మీ సఖులింత వింత సౌందర్యముతో నుండనేల? ఉండెనుచో మదీయచిత్తమును హరింపవచ్చునా? ఇది చౌర్యముకాదా? ఈతప్పు దగ్గర నిడుకొని యొకరినిందించు టుచితమా? అనుటయు, నాజవ్వని నవ్వుచు నోహో! మాబోటియందు మంచితప్పే గణించితిరి. కానిండు ఆకొమ్మ నెప్పుడుచూచితిరి? మీహృదయమెట్లు హరించినది? మీవృత్తాంతమంతయుం జెప్పుడు. ఈతప్పుసైరింపజేసెద భయపడకుడని బలికిన అక్కలికి కతండు, తనకు నుపాధ్మాయుండు పృథివీ గోళంబు పటంబున చూపుటయు దాన దేశాలోకనకౌతుకంబు గలుగుటయు సుభద్రతోడి మైత్రి, చర్మకురంగసంపాదనము, ఉత్తరదేశయాత్ర, బంధనప్రాప్తి మరణశిక్షావిధియు రాజసన్మానంబును, పశ్చిమదేశయాత్ర, సముద్రదర్శనంబు నుద్యానవనప్రవేశము స్త్రీజనసంభాషణస్రవణము, మనోరమాదర్శనానందము ఆంతఃపురగమనము లోనగు తన వృత్తాంతమింతయు నామూలచూడముగా వక్కాణించెను.

ఆతనివృత్తాంతమును విని మనోరమ పర్యంకము దిగ్గ నుఱికి సిగ్గున దూరముగాబోయి రత్నకవాటము మాటున నిలిచినది. అప్పుడు మథురిక, సఖీ, దాగెద వేమిటికి! ఆయనగుట్టువెట్టుక తన వృత్తాంతమంతయుం జెప్పెనుకదా? చేసినకృత్యముల నెట్టుగా భావింతువు ఇప్పుడు చేయదగిన దేమి అని అడిగిన నవ్వనిత బోటీ! నన్నడిగెదవేమిటికి? చేసిననేరము నొప్పుకొనిన పిమ్మట జేయదగిన పనియెద్దియో అదియే కృత్యమని పలికినది. తప్పుచేసినవారిం గాపాడుటయు సాధుధర్మమైయున్న దని యారాజకుమారుడు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది కాపాడెడు నేరము కాదని యప్పైదలి తిరుగ బలికినది. అప్పుడు మథురిక రాజపుత్రీ ! నేనొక్కటిచెప్పెద నాకర్ణింపుము. ఎవ్వడేపనిచే నపరాధి అగుచున్నాడో, తిరుగా వానికట్టిపని చేయుటయే శిక్షఅని నాకుదోచినది దీనికిరువురు సన్ముతింపవలసినదే. కావున నీవిటువచ్చి నిన్నితండేమిచేసెనో నీతని కట్లుచేయుము. అని పలుకుచు బలాత్కారముగ లాగి కొనివచ్చి అతని వక్షమునందును గపోలములయందును గందము బూయించినది. పిమ్మట నేమిచేసె జెప్పుమనిఅడుగుచు నగునగు జ్ఞాపకమువచ్చినది. నీయుంగరమున ముద్రలు వేయుము. గిల్లుము అని యీరీతి జెప్పుచు నాయాయీపనులు చేయించి రాజపుత్రా ! నీవుమాత్ర మూరకుందువా యేమి, ప్రతిగావింపుమని కనుసన్న జేసి అవ్వలికేగినది. పిమ్మట వారిరువురు మన్మథుం గృతార్థు గావింపుచు పలసి యేకశయ్యాగతులై ప్రొద్దెక్కుదనుక నిద్రించుచుండిరి.

అప్పు డేమియుందోచక యాచేటిక రాజపుత్రిక యస్వస్థతగా నున్నది. కావున నీదినంబున సఖురాండ్రందఱు దూరముగా నుండవలయునని అందఱకుజెప్పి అట్లు కావించినది. ఆవార్త విని మనోరమతల్లి యుల్లంబున దల్లడిల్లుచు బుత్రికను విమర్శింప నచ్చటికి వచ్చినది.

ఆమెరాకంజూచి మధురిక వెఱచుచు ముందుగానే లోపలకుబోయి రాజపుత్రికనులేపి యాకధజెప్పినది. అదరిపడుచు నమ్మనవతి అతని లేపకయే తాను మంచముదిగి గుమ్మముదాపునకు దల్లి కెదురుగాబోయెను. రాజపత్ని పుత్రిక వైకల్యరూపముచూచి శంకించుకొనుచు నీయొడలిలోని యస్వస్థత యెట్టిదని అడిగిన దత్సమయోచితముగా జెప్పి అప్పడతి అప్పుడే తల్లిని సాగనంపినది. తరువాత నతని లేపి రహస్యముగా జలకమాడించి మధురాహారముల సంతృప్తి గావించిరి.

అదిమొద లతండు ప్రతిదినము వేకువజామునబోయి పగలంతయు నాపట్టణములో మొదటసత్కరించిన బ్రాహ్మణుని యింటవసించుచు రాత్రియైనతోడనే అమ్మనోరమ మేడకు బోవుచు నీరీతినారుమాసములు కేళిపారావారవీచికల దేలియాడెను.

అంతలో నాకాంత గర్భవతియైనది. ఆవార్త క్రమక్రమముగా నంతఃపురమంతము వ్యాపించినది. పిమ్మట రాజపత్నికి దెలిసినది. తరువాత వీరసేనునికి నెవ్వరో పేరులేని పత్రికాముఖంబున దెలియజేసిరి. ఆకథ వినినది మొదలారాజు నిద్రపోవక అన్నా? స్త్రీలకంటె దుర్మార్గులీలోకములో లేరు.

గీ. తేనెబూసినకత్తియల్ తెఱవ లరయ
     ఘనతృణచ్ఛన్న కూపముల్ కాంతలెన్న
     నిల పయోముఖవిషకుంభములు లలనలు
     మేకవన్నె పులుల్ గదా మెలఁతలహహ

చ. పిడుగరచేతబట్టి వెఱపింపగవచ్చును కాలకూటమున్
    గడగడఁ ద్రాపవచ్పు నురగంబు శిరంబున జుట్టవచ్చుఁ బెం
    పుడుగక సింహకేసరము లుయ్యెలలూగకవచ్చుఁగా కిలన్
    బడతుల మాయలం దెలియ బ్రాహ్మకుశక్యమె వాని అబ్బకున్.

నేను స్వయంవరము చాటించి రాజకుమారుల రావించిన నొకనిని వరించినది కాదు . ఇప్పుడిట్టి వార్త నాకు దెలియవచ్చె నింతచంచలచిత్తురా లేమిటికి బెండ్లియాడకుండవలయును? నిష్కళంకమైనకులము కళంకపఱచుటకేకదా. కానిమ్ము- అట్టి గూఢపురుషునిం బట్టుకొని యెదురంబెట్టి అడిగెను. వచ్చిన అపకీర్తి పోదుకదా అని తలంచి యకకింకరులవంటి పరిచారకుల నామందిరము చుట్టును కావలియుంచి విమర్శింప నెప్పటికి నేజాడయు దొరకినదికాదు.

అప్పుడు రాజావార్త శత్రువులెవ్వరో అట్లు తెలియజేసిరేమో అని సందియ మందుచు భార్యంబిలిచి నీ కూతురు మంచినీచిశాలిని యయ్యె, లోకవార్త చెడుగుగా నున్నది నిజమరసిరమ్మని పంపిన నామెయు నంతకుమున్ను దానును వినియుంటి నని చెప్పి పతికి నీతివాక్యములుపదేశించుచు గోపోపశమనము గావించినది.

తరువాత నతండు తనకత్యంత ప్రియుడైన మంత్రితో రహస్యముగా నా వర్తమానము జెప్పి ఆప్పురుషునింబట్టి యిమ్మని అడిగెను .

బుద్ధిమంతుడైన అమ్మంత్రియు నంతఃపురచారిణి వసంతిక అనుదానింజీరి శుద్దాంతతంత్రము లన్నియుం గ్రహించి కుందనపురేకులం దిలలంతలేసి కొట్టించి మనోరమ మేననలందుకొను గంధములో గలిపి రమ్మని రహస్యముగా నవ్వసంతికను నియమించిన నొకనాడది అట్లుచేసినది. పాముపాదములు పాముకేకాక యితరులకు దెలియునా! వసంతికకు మధురికయందు వైరము గలిగియున్నది. దాని మూలముగా నాగుట్టంతయు నది బయలు పెట్టినది.

ఆతంత్రమేమియు గ్రహింపక మనోరమ, యారాత్రి కందర్పుని మేన నాగందముబూసినది. అతండు నావ్యత్యాయము గ్రహింపలేకపోయెను. మఱియు యారాత్రి అంతయు అందుండి ఆతండు సూర్యోదయము కాక పూర్వము లేచి గగనముపై కెగసి యాయూరికి దూరముగానున్న యొక చెరువుగట్టున వ్రాలి యాజింక అందున్న చెట్టు కొమ్మల దగిల్చి తాను దంతధావనము జేసికొనుచుండెను.

అప్పుడు మంత్రి శాసనంబున నట్టివానిం బట్టుకొనుటకయి నలుమూలల గ్రుమ్మరుచున్న రాజభటులలో గొందరా చెరువు గట్టునకువచ్చి అతనిని విమర్శించి కెందమ్మినంటియున్న కింజల్కములవలె గపోలముల దళ్కు తళ్కుమని మెరయు కుందనపు రేకులంజూచి యీతడే యీతడే అతని యొండొరుల సంభాషించుకొనుచు నవసరములో గందర్పుడు గ్రహించి తటాలున నాచెట్టెక్కి అందున్న జింకను పూరించుకొని అంతరిక్షమున కెగసి దూరముగా బోయెను.

రాజకింకరులతని పోకంజూచి వెరగందుచు నేమియుం జేయలేక వచ్చిన దారింబట్టిపోయి మంత్రితో నావృత్తాంతమును జెప్పిరి.

కందర్పుడు నాటిరాత్రి యథాప్రకారము మనోరమ మేడకుబోవుటకు వెరచుచు అర్దరాత్రంబున విమర్శించుచు నరిగి తనరాక నిరీక్షించుచు నిద్రమాని అంతరిక్షమున దృష్టియిడి కూర్చున్న మనోరమకు సంతోషము గలుగజేసి క్రీడావసానమం దయ్యిందువదనతో నిట్లనియె.

ప్రేయసీ! నారాకపోకలు మీవారు గ్రహించిరి. నేటియుదయమున నన్ను బట్టుకొనుటకు గొందరు రాజభటులు వచ్చిరి కాని దైవవశమున దాటించుకొంటిని. రాత్రి గంధముతో బంగారురేకులవైచినది మనము దెలిసికొనలేకపోయితిమి. దాని మూలమున నన్ను వారు గురుతువట్టిరి. మన అంతఃపురమున దిరుగువారలలోనే గుట్టు చెప్పువారున్నారు. సందియమువలదు. ఇక నేనిందుండిన జిక్కకమానను నా కనుజ్ఞయిమ్ము పోయివచ్చెదను. యెప్పటికినన్ను మఱువవద్దు సుమీ! అని పలుకుచున్న విని అక్కలికి కన్నీరు గార్చుచు అతని వక్షముపై వ్రాలి హా, యేమంటిరి? మీరరిగిన నేనొంటరిగా నిందుండుదు ననుకొంటిరా? మీ మాటలు స్నేహపాత్రములు గానేయున్నవి. నేను గర్భవతినగుట మావారు లెస్సగా వినిన తరువాత నేలాగునను బ్రతకనీయరు. వారిచేతిలో జావనేల? మీరే నా ప్రాణములు పోగొట్టి అరుగుడు. యెక్కడికి బోయినను వెనుక చింతయుండదని పలుకుచు వెక్కి వెక్కి యేడువ దొడఁగినది.

అప్పుడప్పడతి కన్నీరు దుడుచుచు నూరడించి కపోలముల రాచుచు అతడు ప్రేయసీ! నీవిట్లు విచారింప నేనేమి చేయుదును. యిందుండినచో మర్యాద నిలువ నేరదు. నిన్ను విడచి పోవుటకును గాళ్ళాడవు. నిన్ను నా వెంట రమ్మనుటకును సందియముగా నున్నది. యిల్లువిడిచి సంవత్సరము కావచ్చినది. వృద్ధులైన తలిదండ్రులు నన్ను గానక యే అవస్థ బొందియుండిరో తెలియదు. ఈదివ్యసాధనంబున మా పట్టణంబున కొక దినములో బోవచ్చును. నీవును నావెంట వత్తువేని నేకొరంతయు నుండదని పలికిన యా రాజపుత్రి యిట్లనియె.

ప్రాణేశ్వరా! నేను నా బంధువుల విడిచి యిదివరకే మీయాధీననైతి. నన్ను రమ్మనుటకు సందియమేల. ఈ యంతఃపురమునకు, రాత్రులయందు జోరుండవలె శ్రమపడి మీరురానేల? మీ దేశమునకు బోయి నిర్భయముగా సుఖింతుము పోనీ, ఈవార్త మా తండ్రికి దెలియజేయుదమన్న గార్యము మిగిలినది, ఇప్పుడు చెప్పిన దప్పుగానెంచును. సతులకు బతియె తల్లియుదండ్రియు దైవమును, వీరిలెక్కనాకు లేదు. సత్వరముగా బోవుదము లెండు. యిందుండి యీ నిర్బంధముల బడనేల. యిందులకు బెద్ద యాలోచనలు చేయుచున్న వారని మధురిక చెప్పినది. ఆది యొక్కతియు నా కొఱకు విచారించును. మనము స్థిరపడిన తరువాత దానిని రప్పించుకొందమని పలుకుచు దాను ప్రయాణమునకు ఆతని దొందర పెట్టుచు అప్పుడే రత్నమండనములు మొదలైన వస్తువులు సవరించుకొనినది.

కందర్పుడు మిక్కిలి సంతసించుచు జీకటియండగనే యా జింకను బూరించి యాయించుబోణిని రమ్మని పిలిచెను. సంతసముతో అన్నెలతుక తదంతికమునకు వచ్చి నాథా? నేను ముందు గూర్చుండనా వెనుక గూర్చుండనా అని అడిగినది. ముందే కూర్చుండుమని చెప్పి తన గౌగిటిలో జిక్కబట్టుకొని కీలు ద్రిప్పుటయు ఆక్కురంగం బతిరయంబున గగనంబున కెగసి పఱవదొడగినది.

ఉ. అ పెనుచీకటింబడి రయంబున బోయెడివేళ వానితో
     నాపె హితానులాపముల నాడెడిఁగాని తదంతరిక్షయా
     త్రాపృధుఖేదమింత యహితంబని పల్కదు మన్మథాస్త్రసం
     తాపితచిత్తు లెన్నడును తక్కి న బాధల నెన్నరాత్మలోన్.

అని యెఱింగించి మణిసిద్దుడు వత్సా! ముందటికథ పెద్దదిగానున్నది. మనకు బయనము వేళయైనది లెమ్ము ముందటి యవసధనంబున దరువాయి వృత్తాంతము జెప్పెదనని యొప్పించి వాడు కావడిమోచికొని తనతోడనడచుచుండ ఆతండు ప్రణవజపము చేసికొనుచు నిరువదిమూడవ మజిలీ చేరి అందు తరువాయి కథ నిట్లని చెప్పందొడంగెను.