కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/21వ మజిలీ

వికీసోర్స్ నుండి

చీకటిపడుచున్నది. నాకు గ్రూరమృగములు వచ్చునని వెరపుగానున్నది. ఈ రాత్రి యెచ్చట బరుండను? నీపెట్ట నన్నట్ల నుచున్న దేమి ఎచ్చటికిబోయినది? మరల నీ రాత్రి వచ్చునాయని అడుగుటయు నక్కిరాతుఁడిట్లనియె.

“పెట్టా! నీకేమియు భయములేదు. నీవు పులిచర్మమును గప్పికొనుము. నీ దాపునకే మృగమునురాదు నా పెట్ట కల్లుద్రావి యట్లరచుచున్నది. యెచ్చటకో బోయినది రేపదియే వచ్చును. సుఖముగా నిద్రఁ బొమ్మని యోదార్చి యాచర్మము తెచ్చి నాకిచ్చెను.

దుర్గంధయు క్తమగు నాతోలు ముట్టుట కేవగించుచు నెట్టకే వెరపుపెంపునఁ జేసి దానిం గప్పుకొని పరుండి నిద్రపట్టక నాయవస్థ యంతయు స్మరణకు దెచ్చుకొని పెక్కు దెరంగుల దలపోయుచుంటిని.

అట్టి సమయమున వాని యాలు, పదుగుండ్ర యమకింకరుల బోలువాండ్ర వెంటబెట్టుకొని అచ్చటకి వచ్చి, నా కాపురము పడద్రొబ్బిన రంకులాడి యిదియే యని వారికి నన్నుఁజూపినది.

ఆ క్రూరులు నన్నుఁజూచి నిందించుచు, వానితో ఓరీ! కులము మర్యాద విడిచి, మఱియొక దాని నుంచుకొని, పెండ్లామును జావమోదెదవా? దాని కెవ్వరు దిక్కు లేరనుకొంటివా? కులములో నీకుఁ దప్పు పెట్టించెదము. చూడుము. నీవు తీసికొనివచ్చిన చెడిపసంగతి యేమి చేయుదుమో చూడుము" అని అరచుచు, నన్ను బలాత్కారముగా లేవనెత్తి, కాళ్ళు కొందఱు, చేతులు కొందఱు పట్టుకొని రక్షింపుడు రక్షింపుడు అని కేకలు వేయుచుండగనే వినిపించుకొనక, భుజములపై నెత్తుకొని అతి వేగముగా, బరుగుపెట్టుచు నీ నూతియొద్దకు వచ్చి చావుము రండా! అని పలుకుచు నీ నూతిలో బడవేసిపోయిరి. తరువాయి వృత్తాంతము దేవర యెరిఁగినదే. ఆపత్సముద్రములో మునుగుచున్న నాకు నార్యునిఁ దెప్పగాఁ జూపిన భగవంతుని కనేకనమస్కారములు చేయుచున్నానని పలికి యానారీమణి యూరకుండెను. అని చెప్పి మణిసిద్ధుఁడు తరువాయి కధ పై మజిలీ యందిట్లు చెప్పదొడగె.

21 వ మజిలీ

శిష్యా! వినుము. ఆ జయభద్రుఁడు హైమవతి చరిత్ర అంతయును విని మిక్కిలి యాశ్చర్యమందుచు నౌరా! భగవంతుని సంకల్పము కడు విచిత్రమైనదే! మనుష్య సంకల్ప మేమియుఁ గొనసాగదు కదా? మానవు లూరక వెఱ్ఱిప్రయత్నములు స్వతంత్రులవలెఁ జేయుచుందురు. పురుషు డెన్నడును కర్తగాఁడు. అని చెప్పిన పురాణగాథ యథార్థమైన దగునని అనేక ప్రకారములఁ దలపోయుచు నాహైమవతి రూపలావణ్యాది విశేషముల కచ్ఛరువందుచుఁ బచ్చవిల్తుఁడు పూపుట మ్ముల హృదయమ్ము నాటనేయ, నా పాటలగంధి చిత్తవృత్తి లెస్సగా దెలియమిఁ దెల్లముగా వెల్లడి కాకుండ దొందర పడరాదని నిశ్చయింపుచు నాయింతి కిట్లనియె.

యువతీ, యిప్పుడు మార్తాండుఁడు లలాటభాగము నాతపముచే గ్లేశము నొందింపుచున్నవాఁడు ఇది క్రూరప్రచారము గల మహారణ్యము. రాత్రివేళ నీ యరణ్యములో నుండరాదు. చీకటి పడకముందు యెద్దియేని జనపదముం జేరవలయును. పల్లవకోమలములగు నీయడుగు లీరాళ్ళ త్రాకుడునగందును. యెట్లు నడచెదవు నీవు నాభుజములపై గూర్చుండుము, మెల్లగా దీసికొనిపోయెదనని పలుకగా అక్కలికి యిట్లనియె.

ఆర్యా! దేవర విషయమై అట్టి అపరాధము చేయుటకు నేను గఠినచిత్తురాలను కాను. ఆత్మసుఖావసానము చేతనయినను, ఆర్యుని సుఖమే గోరదలచితిని. దేవయానిని యయాతివలె నూతిలోనుండి నన్నుద్దరించిన యార్యుని యుపకృతికిఁ బ్రతికృతి యొద్దియు జేయమికి లజ్జించుచున్నదాన. నేను నడువనోపుదు దేవర యడుగు లూతగాఁ గొనిన నాకేమియు శ్రమయుండదు. కష్టము గట్టెక్కినట్లు తలచుచున్నదాన పోదము లెండని పలుకగా నతండు సంతసించుచు నచ్చట దృఢముగా గనంబడిన యొకదారింబడి యామెతో గూడ నడువజొచ్చెను.

ఆ చిన్నది. మాటలు ప్రౌఢముగా, జెప్పనదిగాని నడచునప్పుడు మిక్కిలి యాయాసము జెందినది. మోముదామరకు శ్రమజలబిందుసందోహ మలంకృతియై వెలయు బయ్యెదచేనొత్తికొనుచు నెండవేడిమి సహింపక చెరంగు నాతపత్రముగాఁ బట్టుకొనుచు బొక్కు లెక్కిన పాదములు దడిమికొని యుస్పరని కూర్చుండియతం డేమియమకొనునో అని అంతలో లేచి మరల నడచుచు నెట్టకేలకు సాయంకాలము దనుక నడిచినది కాని జనపదం బేమియు గనంబడినదికాదు

రాత్రి పడినతోడనే యాచిన్నది అతనితో ఆర్యా! చీకటి పడినది. మృగముల యార్పులు వినంబడుచున్నయని మనకెట్లు తెల్ల వారునో తెలియకున్నది. ఈ రాత్రి దాటించితిమేని ఱేపటి కేదియేని గ్రామము కనఁబడక మానదు.

అని బెదరుఁ గదురఁ బలికిన నచ్చిలుకలకొలికి నోదార్చుచుఁ దరుణీ, వెరవకుము, నిన్ను నాభుజాంతరమున నిడుకొని రక్షించెదను. నీ ప్రాణముల నాయసువులనిడి కాపాడెదను. ఇందుగల సత్వముల నాభుజసత్వంబునం బారద్రోలెదనని యుదుటు గరపుచు నొకరమ్యమైన శిలాతలంబునం గూర్చిండి చేడియా! రమ్ము, రమ్ము నాతొడపై శిరమిడుకొని యథేచ్ఛముగా నిద్రబొమ్ము. నిద్రయుడిగి యీ రే యెల్ల గాపాడుచుందునని పలికెను.

అప్పు డప్పడతియు నెడదజెలంగుచు మొదట వెరపునంబోలె నతనియురము గౌగలించుకొనియెను, అతండును ఓదార్చువాడు వలె నెడమచేత నదిమిపట్టుచు మోము మోమునంజేర్పి కుడిచేతితో నధరము బుడుకుచు నూరడింపుచుండెను.

అప్పు డిరువురకు మేనులు సాత్వికభావవికారముల నొందినవి.

ఒండొరుల అభిప్రాయములు తెలిసికొనియును నిద్దరును తమకు దామయై వాచకముగా జెప్పరప్పుడు కాని వెల్లడి చేయరాదని తలంచుకొని యుండిరి. దానం చేసి వారు చేయుకృత్యములు లన్నియు నన్యాపదేశములుగా నుండెను.

అప్పడతి అతనితొడమీద శిరంబిడి పరుండి వారచూపులచే నడుమ నడుమ నతని ముఖవిలాస మవలోకింపుచుండెను.

జయభద్రుండును వెరపుడుపువాడువలె హృదయంబున జేయివైచి నిమురుచుండె. అప్పు డయ్యిరవురకు నూతనసంతోషముతో నారాత్రి దృటిగా వెళ్ళినది.

ఉదయంబున లేచి చూచువరకు జీనుగట్టిన గుర్రమొకటి యా ప్రాంత మందు మేయుచుండెను.

దానింజూచి జయభద్రుఁ డదిగో! అశ్వమొకటి కనంబడుచున్నయది. ఈ ప్రాంతమున గ్రామమెద్దియేని యుండవచ్చును. వడిఁగాబోదము ముదితా! లెమ్మని పలుకఁగా నయ్యువతి యిట్లనియె.

ఆర్యా! ఈ యశ్వము మొన్నను వచ్చిన దొంగలది. దీనిపైన నేను వచ్చితి. ఈ గుఱ్ఱపుదొంగ సమసెం గావున నీయడవిలో నిది తిరుగుచున్నది.

ఈ యడవిలో నాదొంగలు గూడఁ తిరుగుచుందురేమో, మనలను జూచినచో నిర్భంధింపకమానరు. మఱియొకదారిని వేగముగాబోదమనుటయు నతండా గుఱ్ఱముదాపునకు బోగా నదియట్లే నిలువంబడియుండెను.

మచ్చిక గలదు. కావున దాని కళ్ళెము పట్టుకొని వీపుపయిం దట్టుచు నారాపట్టి కిట్లనియె.

బోటీ! నీవీ ఘోటకముపై నెక్కుము. నేను నీవెనుక నెక్కెదను; నీ కేమియు భయములేదు. మెల్లగా దోలెదను. ఈ యడవిలో నీవు నడువలేవనియే దైవము నీకీ యాధారమును జూపెను. రమ్మనగా నా కొమ్మ యిట్లనియె.

ఆర్యా! నాకును గుఱ్ఱమెక్కు పాటవముగలదు. వడిగాఁదోలినను వెఱవనని పలుకుచుఁ గళ్ళెము గైకొని లఘుగలి నాతురగ మెక్కినది. జయభద్రుడును వెనుక భాగమెక్కి యక్కలికి నెడమచేతితో కౌగలించుకొని కుడిచేతితో గళ్ళెము పట్టుకొని గుఱ్ఱమును మెల్లగా నడిపింపఁ దొడంగిన నక్కు రంగనయన నవ్వుచు నోహో! నాకేమియు వెఱుపులేదు. త్వరగా దోలుఁడని పలికి తానే గుఱ్ఱమును కాళ్ళతోఁ గొట్టెను.

అప్పు డత్తురంగము లేఁడివలె నెగురుచు వాయువేగముగా బోదొడంగినది. దానికి నడవిలో నడచు పాటవము గలిగియున్నది. కావున పొదలును రాళ్ళును లెక్క సేయకయే యొక్కరీతిగా సాయంకాలము వరకుఁ బోయినంత నొకపల్లె గనంబడినది.

ఇరువు రొక్కగుర్రముమీద నెక్కిన జక్కగానుండదని యక్కడ నాయశ్వ మును దిగి జయభద్రుఁ డయ్యతివతో నిట్లనియె. తరుణీ! మనము జనపదమునకు వచ్చితిమి. నీవు గుర్రముమీద రమ్ము. నేను నడచిపోయి యొక తావు చూచెదను. వంటజేసి భుజింతము. అనుటయు నత్తన్వియుఁ దటాలున గుర్రముదిగి తానుగూడ నడచివచ్చెదనని చెప్పుచు నాగుర్రపుకళ్ళెమును జయభద్రుని కందించెను.

అప్పుడతం డాగుర్రపుకళ్ళెముం గైకొని మెల్లగా నడచుచు నచ్చటి గ్రామమునకు బోయి అందొకచోట బసఁజేసి రెండుదినములనుండి భోజనము లేమింజేసి నాడు భోజనసామగ్రి అంతయు యాచనమూలముగాఁ దెచ్చి హైమవతి కిచ్చెను.

హైమవతియుఁ జక్కగా వంటజేసి అతనికి బెట్టి తాను భుజించి మార్గాయాసమును దీర్చుకొనియెను. అచ్చటనున్న వారందఱు వారిని దంపతులని నిశ్చయించి బ్రహ్మదేవుని కూర్పును గుఱించి మిక్కిలి స్తుతిఁజేయఁ దొడంగిరి.

హైమవతి కోరుటచే జయభద్రుడు అమరావతి నగరమునకు బోవుటకు నిశ్చయించి యవ్వీటికి మార్గమడిగి తెలిసికొని అనతిదూరములోనున్న అప్పురమున కరుగుచుండ నొకనాడు దారిలో నొకపట్టణమును గనంబడినది.

అందుఁ బ్రసిద్ధిచెందిన యొకసత్రములో నివసించి వంటజేసికొని భుజించి చక్కగా వెన్నెల గాయుచుండగా వారిరువురు నోరగానున్న యొక్క అరుగుమీఁద బరుండి యిష్టాగోష్టి వచనములచే గొంతసేపు వెళ్ళించిరి. మఱియు నాసత్రంబున కాదివసంబున నానాదేశపు బ్రాహ్మణులు వచ్చిరి. వారందఱు భోజనముచేసి అరగు మీద బండుకొని యొండొరులిట్లు సంభాషించుకొనిరి.

రామావధాని --- ఆకూర్చున్నవారెవ్వరు? ఏ యూరు బాబూ కొంచెము పొడుము పెట్టెదరా?

సుబ్బావధాని - నా పేరు సుబ్బావధాని అంటారు. మాది యుజ్జయని పొడుము సరిపోయినదండి.

రామా - అయ్యో నాముక్కు దిబ్బడి వేసినదండి. కొంచెమైనను లేదా? అయినా కాయ యీలాగున యిస్తారా? అడుగుననేమైనా యున్నదేమో చూస్తాను.

సుబ్బా - లేదండి, గీకిగీకి, యిప్పుడే, పీల్చుకున్నాను.

అప్పయ్యశాస్త్రి - ఇదిగోనయ్యా! నాయొద్దనున్నది. పాపమెంత బాధపడు చున్నావో!

రామా - పుణ్యాత్ములెవ్వరు?

అప్ప - నేను అప్పయ్యశాస్త్రిని. (అని పొడుము పెట్టుచున్నాడు)

రామా - ( పొడుము పీల్చుకొని) అప్పయ్యశాస్త్రిగారా! తమరెచ్చటనుండి వచ్చుచున్నారు?

అప్పయ్య - మేము పదుగురుము గూడి యీనడుమ దేశయాత్రకు వెడలి తిరుగుచు అమరావతిలో గొప్పవివాహము జరుగునని అచ్చటికిఁ బోయితిమి.

రామా - అచ్చట సంభావనాది సత్కారములు అధికముగా జరిగినవియా?

అప్పయ్య - సంభావనలాగే యున్నది. తుద కన్న మైనను దొరకినదిగాదు.

రామా - ఎందువలన?

అప్పయ్య - ఆ చిత్రము వినిన మిగుల హాస్యాస్పదముగా నుండును. ఇంతకుము న్నెన్నడును వినియుండలేదు.

రామా - ఎట్లెట్లూ? వడిగాఁ జెప్పుడు.

అప్పయ్య - చెప్పెద వినుడు. అమరావతీ చక్రవర్తి మంత్రపాలుఁడను రాజు హైమవతియను కూతుఁరు వీరపాలనృపాలుని కుమారుడు గుణవర్మకు గన్యాదానము చేయ నిశ్చయించి నానాదేశములనుండి పండితులను, బంధువులను, మిత్రులను బిలిపించి మిగుల వైభవముతో సుముహూర్తమునఁ గన్యాదానము గావించెను.

రామా - ఉచితముగానే యున్నది తరువాత తరువాత.

అప్పయ్య - ఆశీర్వచనమైన తరువాత కన్యకను లోపలకు దీసికొనిపోయిరి బ్రాహ్మణునకు బహుమతు లియ్యఁదలంచుకొనునంతలో నింటిలో అల్లరి పుట్టినది.

రామా - మంచిసమయములోనే అడ్డువచ్చినదే. అదియేమి?

అప్పయ్య - కన్యక అత్తగారికికి నమస్కరింపబోవునంత, యామె నిదానించి చూచి, తమకుఁ జిత్రపటంబున జూపిన పిల్ల యిదికా దనియు మాయఁజేసిరనియుఁ జెప్పి తగవుపెట్టినది. దానిమూలమున పెద్ద కలహము పెఱిగినది తొలుత వాక్ప్రహరణములచే పెండ్లివా రొండొరులం గొట్టుకొనిరి.

రామా - అట్లుచేయుటకుఁ గారణమేమి?

అప్పయ్య - ఆ అలజడిలో నిజము బయలుపడినది; వినుము రాజుగారిభార్య గుణవర్మ దరిద్రుడను కారణమున గూఁతు నిచ్చుటకు సమ్మతిలేక ధనవర్మను రహస్యముగా రప్పించి గంపలో గన్యనిడి అచ్చటికి బంపినదఁట. మగని నిర్భంధముమీద మరియొక కన్యక అలంకరించి అప్పుడు పీటలపై గూర్చుండబెట్టి కన్యాదానము చేసినఁదట

రామా - స్త్రీలెంతకైనను సాహసము కలవారగుదురు. తరువాత?

అప్పయ్య - చివర కాకన్యకను ధనవర్మయుఁ బెండ్లియాడలేదు. నడుమ యేమైపోయినదో తెలియకున్నది.

రామా - బాగు! బాగూ! యిట్టి చిత్రమెందును వినియుండలేదు పిమ్మట.

అప్పయ్య - అప్పుడు మంత్రపాలుడు భార్యను నిర్బంధించి అడిగి నిజము తెలిసికొని యాగ్రామమంతయు వెదకించెను, కాని అచ్చట నాచిన్నదాని జాడ గనంబడినదికాదు. దానంజేసి శూరపాల వీరపాలురు మంత్రపాలునియందు ద్వేషించిరి.

రామా - మంత్రపాలునికి గొప్పచిక్కే తటస్థించినదే. తరువాత ?

అప్పయ్య - మంత్రపాలుం డెఱింగియే యిరువురు మోసము చేసినాడనియు బిల్ల నెచ్చటనో దాచినవాడనియు నిశ్చయించి యిరువురు నేకమై అతని నిర్భంధించుచుదర్జించుచున్నారు. మంత్రపాలుడు దీనుడై వారిని వేడుకొనుచు నాకన్యక వృత్తాంతము చెప్పినవారికి గొప్ప పారితోషిక మిత్తునని యెల్ల దేశములకు దూతల పంపెను.

రామా - బాగానే జరిగినది. బ్రాహ్మణులకు సంభావన యియ్య లేదా?

అప్ప --- సంభావనమాట కేమి, యానాఁడు భోజనము లేకపోవుటయేకాక వేత్రహస్తులచేత దెబ్బలు తిననివాడెవ్వడు?

రామా - తరువాత నేమి జరిగినదో మాకుఁ దెలియదు. అచ్చటినుండి లేచి వచ్చితిమి. మేము వచ్చువరకు మంచి కలహములో నున్నారు.

రామా - ఇప్పుడెచ్చటికి పోవుచున్నారు?

అప్ప -- మణిప్రస్థమునకుఁ బోవుచున్నాను. ఆదేశపు రాజు కుంతిభోజుండు అతనికుమారుడు జయభద్రుడు, అతనిభార్య పేరు సునీతి. ఆ చిన్నది తనపేరు సార్దకముచేయుచు నిత్యము బ్రాహ్మణులకు అనేకదానములు చేయుచున్నది. ఆమెచే దానమందినవాడు మఱియొకరిని యాచింపడు. ఈనడుమ మాయూరినుండి కొందరు బ్రాహ్మణులు వెళ్ళి, పెక్కు ధనము సంపాదించుకొని వచ్చిరి.

అప్ప -- ఇదిగో ? తూర్యఘోషములు వినిపించుచున్నవి. యెచ్చటనో, వివాహము జరుగుచున్నట్లున్నది. సంభావనకు బోవుదము వచ్చెదరా ?

రామా - అలాగే వెళ్ళుదములెండు, అని పలుకుచు దోడివారలతో గూడ నిష్క్రమించుచున్నారు.

ఆ మాటలన్నియు విని హైమవతి, జయభద్రునితో ఆర్యా ! ఈబ్రాహ్మణులసంవాదము వింటిరికదా, నామూలమున మాతల్లి దండ్రుల కెట్టిచిక్కు సంప్రాప్తించినదో చూసితిరా ఆరాజు లిరువురునేకమై అతని నిర్భంధింతురేమో, కటకటా! నేనెంత దోషకారినైతిని. నాచరిత్ర మెంత కంటకమయ్యె. అయ్యయ్యో! నేను సంతోషముతో నింటికి బోవలయునని నన్ను వారు మిక్కిలి గౌరవించుచుందు రనియు దలచు కొనియుంటినే? నాతల్లిదండ్రులు తప్పక శత్రురాజుల పరాభవమునకు వగచి బలవన్మరణము నొందుదురు. ఇకనన్ను మన్నించువా రెవ్వరు అని యనేక ప్రకారముల వగచుచున్న యా చిన్నదాని నోదార్చుచుచు జయభద్రుం డిట్లనియె.

బోటి! నీవేటికి జింతింపవలయును. నేను బోయి యావైరుల భంగపఱచి మీతండ్రికి సంతోషము గలుగజేయుదును. ఊరడిల్లుము వేగముగా నమరావతికి బోవుదమని పలికి యామెనోదార్చెను.

మఱియు నాతరుణి అతనితో, ఆర్యా! మీభార్య చర్యలు నాశ్చర్యముగా చెప్పుకొనుచున్నారే! అట్లు దానము చేయుటకు నామెకు ధనమెచ్చటనున్నది. మీరే యిచ్చివచ్చితిరాయేమి? ఆహా? ఆసాధ్వి యెంత పుణ్యాత్మురాలో, ఇంతదూరములో నామె దానమహిమను, గొనియాడుచున్నవారే! అంతకన్న జన్మమున కుత్కృష్ట మేదియున్నది. అని పెక్కుగతుల నయ్యువతిని వినుతింపుచుండ నతండేమియు మాటాడక మందహాసము చేయుచుండెను.

అట్టివినోదములతో వారివురు నారాత్రి వేగించి యుదయంబున లేచి వేషములు మార్చి పయనమై నడచి రెండుమూడు దినములకు మఱియొక గ్రామము జేరిరి.

అందొకయింట వసించి వారిచేత రొక్క మేదియు లేమింజేసి భోజనసామాగ్రికై సందేహించుచున్నంత నక్కాంత జరభద్రున కిట్టనియె.

ఆర్యా! మనము ద్రవ్యమునకు జిక్కుపడవలసిన అవసరము లేదు. నామేని అలంకారములమ్మి సొమ్ము తీసికొనిరండు దాన యథేచ్ఛగా వ్యయపెట్టుకొనవచ్చు నని పలుకుచు నవరత్నములచే జెక్కబడిన కర్ణభూషణమొకటి అతనిచేతి కిచ్చినది .

మిక్కిలి వెలగల యామండనము గైకొని అతండురహస్యముగా నంగడికి బోయి రత్నవర్తకు నొక్కనినరసి అతనికి నావస్తువులు జూపుచు దీనికేమి వెల యిచ్చెదవని అడిగెను.

ఆవర్తకుడు అతని మొగము పరిశోధించి గౌరవముకలవాడని యూహించియు నవసరముతో నమ్ముచున్నట్లు నిశ్చయించి యాభూషణము లక్షలకొలది వెలగలిగి యున్నను ఇంచుక శోధింపుచు బెదవి విరచి యిట్లనియె

అయ్యా! ఈవస్తువు నాకవసరములేదు. అయినను మీరెంత కిచ్చెదరో చెప్పుడు నచ్చెనేని బుచ్చుకొనియెద ననుటయు నతఁడు నా కీవిషయమ నాణెము తెలియదు వర్తకులగు మీకు దీని వెల దెలియును. కావున నించుమించుగా నడుగుడని చెప్పెను

ఆప్పుడా వర్తకు డొక్కింత విమర్శించి ఆయ్యా! ఇది జోడువిడిపోవుటచే మండనమునకు బనికిరాదు. విడదీసి రాళ్ళ నమ్ముకొనవలయును. కావున నాకేమి నిరూపించుటకు దోచకున్నది. అయినను నూఱురూప్యము లియ్యవచ్చునుకాని నాకు బది తగ్గించి బుచ్చుకొనియెద ననుటయు నతండు నిజముగా నట్టివస్తువుల వెలనెఱుగమి నంత మా త్రమునకే సంతసించుచు మంచిది యాసొమ్మే తెమ్మనిపలికెను.

అతనిమాటలువిని యావర్తకుడు పశ్చాత్తాపము చెందుచు అయ్యో! వీరికేమియు ధరలు తెలియవు. నిష్కారణము సొమ్మెక్కువ బెట్టితినే కానిమ్ముఅని యాలోచించి లోనికిబోయి మరల వచ్చి అయ్యా! మాయన్నగారీ కుందనమింత వెలచేయదని చెప్పినాడు. ఏబదిరూప్యము లిచ్చెదను యిచ్చెదరా? అనుటయు అతండు అప్పటికే ప్రొద్దెక్కి కతంబున భోజనమునకు దొందరపడుచు గానిమ్ము. అంతియే తెమ్ము వేగము పోవలయునని పలికెను.

అప్పుడా వర్తకుడు అయ్యో! యితడు, దీనికిని సులభముగా సమ్మతించు చున్నవాడు. యిరువది యనక యేబది అంటిని. ఇదియు బ్రమాదమే. అని యాలోచించుకొని యావస్తువును రెండుసారులు తిప్పి అతని కిట్లనియె.

అయ్యా? జయభద్రునిభార్య సునీతియను చిన్నది. రత్నభూషణములు బ్రాహ్మణులకు నిత్యము కోట్లకొలది దానము జేయుచున్నది. యావస్తువులు సులభముగా నాబ్రాహ్మణు లమ్మజూపుచున్నారు. దానంజేసి ఇప్పుడు రత్నముల వెలకు తగ్గినది. రత్నభూషలు కొనుటకే భయమగుచున్నది. చివరమాట దీని కిరువది రూప్యము లిచ్చెద సమ్మితమేని బుచ్చుకొనుడు, లేనిచొ బొండనిపలుకగా అతడు నవ్వుచు ఓహో! వర్తకుడా? క్రమక్రమముగా దగ్గించుచుంటివే మాకు వేళ మించుచున్నది. యేదియో వడిగా నిచ్చి పంపమనగా నావర్తకునికి తిరుగా నాస పుట్టినది అరీతి గ్రమక్రమముగా దగ్గించి చివర కొక స్వయంపాక మిచ్చి యంపెను.

ఆదినమునకు సరిపడిన భోజనసామాగ్రి పుచ్చుకొని అతఁడు సంతోషించుచు నింటికివచ్చి హైమవతి కిచ్చిన అచ్చిలుకలకొలికియు జక్కగా బాకము జేసినది.

ఇంతలో అతండెద్దియో పనిమీద అంగడికి బోవుచు దారిలో నొక దేవాలయము గనంబడినంత దానిలోనికి బోయెను.

ఆచ్చట దుఃఖితుండై యున్న యొక సన్యాసింజూచి, వందనము చేసి అతఁడు అయ్యా ! తమరు శోకరహితమైన యాశ్రమమున నుండియు నిట్లు చింతించుచున్నారే అని అడిగెను.

అప్పుడయ్యతి అతని వాక్ప్రఢిమకు సంతసించుచు అనఘా నాకు మూడునాళ్ళనుండి భోజనములేదు. ఏ గృహస్థుడును బిక్షకు బిలిచినవాడుకాడె. నాకు మిక్కిలి యాకలి అగుచున్నది. దానంజేసి చింతించుచున్నవాడ. కష్టాత్కష్టతరంక్షుధా అను నార్యోక్తి వినియుంటిరికదా! అని పలికిన జయభద్రుడు శివ, శివా, ఈయూరిలో బ్రాహ్మణులులేరా? ఆయ్యో! మిమ్మునుపవాసములుంచి వారెట్లు భుజించిరి? కట కటా? యెంతకఠినహృదయులు! అని పలుకుచు మరియు నిట్లనియె. స్వామీ? మేముక్షత్రియులము సత్రములో వంటచేసికొనుచున్నాము. మాయింటికి విచ్చేసి ఇంత యాతిధ్యము పుచ్చుకొని మమ్ములను కృతార్థులను జేయుడని వేడుకొనగా అయ్యతి సంతోషించుచు మంచిది. త్వరలో వంటచేయించి వర్తమానము పంపుమని పలికెను.

జయభద్రుడు యథావిధి బిక్షావందనము జేసి యింటికి బోయి హైమవతి కావార్త నెఱింగించిన అయ్యించుబోడియు సంతోషముతో దృటిలో వంట చేసినది.

తరువాత జయభద్రుడు స్వాములవారిని భయభక్తులతో దీసికొనివచ్చి అర్చించెను. పాదములు కడుగు సమయమున జయభద్రునితో వత్సా! నీభార్య నిటు రమ్మనుము. పాదోదకము శిరముపై జల్లవలయుననగా అతండు నవ్వుచు చిత్తము చిత్తము అని పలుకుచుండెను.

ఆమాటలు విని హైమవతి నిస్సంశయముగా వచ్చి అతనిఅడుగులు గడుగుచు తీర్దము శిరముపై జల్లుకొనినది.

అప్పుడా స్వాములవారు అక్షతలు ఇరువుర మీదను జల్లెను. అదియే తమకు శుభలగ్నమని యిరువురు మనంబుల సంతోషించిరి. తరువాత అయ్యది యాపోశనమును హస్తతలంబునం దుంచుకొని తన వాడుక ప్రకారము ఒక వరహా దక్షిణగా నాకీయవలయును లేకున్న భుజింపక లేచిపోయెనని జయభద్రు నడిగెను.

అతఁడు తనయొద్ద నేమియును లేమింజేసి చింతాక్రాంతుడై ఆయ్యో! స్వామీ! మీరిప్పుడు భుజింపక విస్తరి విడిచిపోయినచో బ్రత్యవాయము కాదా? నాయొద్ద మీకిచ్చుట కేమియునులేదు. భుజించి నన్ను గృతార్దు చేయుడని యెన్నోరీతుల బ్రతిమాల దొడంగెను. కానియయ్యతి చిత్తము గఱగినది కాదు.

ఆస్వాములవా రట్టివాడు గనుకయె సొమ్మిచ్చుకొనలేక యెవ్వరును భిక్షకు బిలుచుట మానివేసిరి. ఎన్ని జెప్పినను వరహా కన్నులం జూపినగాని భుజింపనని గట్టి పట్టుపట్టును. ఆరీతినే అయ్యతి యెన్నియో వరహాలు సంపాదించి భూమిలో బాతిపెట్టుచుండెను.

అయ్యతి చేయుచున్న క్రౌర్యమును జూచి యాచిన్నది తన కుడిచేతనున్న రత్నకంకణము నూడదీసి స్వామీ! మీరొక వరహా నడిగితిరి కాని యిది వేన వేలు వెలచేయును. దీనిని దక్షణగా మీకిచ్చుచున్న దాన భుజింపుడని వేడుకొనెను.

అప్పుడు మిక్కిలి సంతోషించి యాపచ్చలకడియ మందుకొని యాసన్యాసి సంతుష్టిగా భుజించి వారిం దీవించుచు నాలయమునకు బోయెను.

హైమవతీ జయభద్రులు ఆసన్యాసి చర్యల నాశ్చర్యముగా జెప్పుకోనుచు శేషపదార్ధములు భుజించి మరల పయనమై వారుమఱియొక యూరు చేరిరి. ఈరీతి వారు గ్రమక్రమముగా నమరావతీ నగరమార్గమునంబడి పోవుచు నొకనాడు రాత్రి అమరావతి ప్రాంతమందున్న యొక గ్రామముచేరి అందొక వర్తకుని యింటి యరగుమీద బరుండిరి. అప్పుడు కొందరు వర్తకులయొక్క సంవాదమీరీతి విననయ్యె.

సుబ్బిశెట్టి -- రామశెట్టీ విశేషములు? ధరవరలెట్లున్నవి?

రామశెట్టి - సుబ్బి శెట్టిగారా! దరవరలకేమి? సునీతి పుణ్యమున బంగారమును రత్నములును చవకయైనవిగదా! బ్రాహ్మణులూరక తెచ్చి, వచ్చినవెలకే యమ్ముచున్నారు. ధరలకేమి భాగ్యము?

సుబ్బి -- ఆసునీతి, యెంతభాగ్యవంతురాలో, ఆహా! దానమిచ్చిన వస్తువులలో నున్న రత్నములు దేవతారత్నములు సుమీ ఆమె వాడుకయే కాని యామె మగని వాని వాడుకయేమియు లేదేమి?

రామ - ఆమెమగనిపేరు జయభద్రుడట. యావస్తువులన్నియు నాయనయే తెచ్చి భార్యకిచ్చుచున్న వాడట. దాన మామె చేయుచున్నది. కావున నామెపేరు వాడుకగా నున్నది. ఈలాగునని అచ్చటి నుండి వచ్చిన బ్రాహ్మణు డొకడు నాకు జెప్పెను.

సుబ్బి - అగునకు మగవాడు సంపాదించుటయే కాని పేరుప్రతిష్ట లాడుదాని మూలముననే రావలయును.

రామ - మీరావస్తువు లేమైనను గొంటిరా ?

సుబ్బి. - లేదుబాబూ సాదారణముగా వస్తువుల బరీక్షించిగాని కొనగూడదు. ఈనడుమ వీరశెట్టికి జరిగిన ప్రాయశ్చిత్తము విన్నావా ?

రామ - అదేమియో నేనెఱుఁగను చెప్పుము.

సుబ్బి - మొదట మనరాజుగారి కూఁతురు హైమవతి వివాహము సంగతి వింటివా?

రామ - ఆసంగతి కొంచెము వింటిని.

సుబ్బి — పాపము శూరపాల వీరపాలు లిరువురు నేకమై హైమవతి తల్లిదండ్రుల చెరసాలలో బెట్టి యాచిన్నదానిజాడ నరయుటకై నానాదేశములకు దూతలం బుచ్చిరట.

రామ - భార్యభర్తలమాట యొకటిగానిచో నీరీతినే జరుగును తరువాత.

సుబ్బి - ఆమెను బాగుగా గురుతెఱింగిన వారెవ్వరో వీరిశెట్టి దగ్గర నామె కర్ణభూషణ మొకటి పట్టుకొనిరట.

రామ — వీరిశెట్టి కామె వస్తువెట్లు దొరికినది.

సుబ్బి -- వినుము వీరిశెట్టి దొంగవస్తువులు సులభక్రయమునకు బుచ్చుకొను నను వాడుక వినియుంటివా ?

రాము - అవును ఎరుంగుదును. అతనికట్టివాడుక యున్నది.

సుబ్బి - ఎవ్వడో యొకడావస్తువు నమ్మజూపుటయు వీరిశెట్టి స్వయంపాకం మాత్రమిచ్చి యదిపుచ్చుకొని అమరావతికింబోయి తిరుగ విక్రయింప నంగటిలో బెట్టినంత రాజభటులు గురుతుపట్టి అతనిం బట్టుకొని చెఱసాలలో బెట్టిరట.

రామ - అయ్యో! పాపమెంతపని జరిగినది. తరువాత విడిచిపెట్టిరా?

సుబ్బి — ఎట్లు విడచిపెట్టుదురు. ఆతనిమాట లేమియును విశ్వసింపక వస్తువిచ్చిన వానింజూపువఱకు విడువదగదని తీర్పు చేసిరట. దానంజేసి ఇప్పటికిని ఆతండు కారాగృహములోనే యుండెను.

రామ - సుబ్బిశెట్టి అటువంటి చిత్రము నేనును మఱియొకటి వింటినిసుమీ?

సుబ్బి - అదియెట్లు?

రామ - ఈప్రాంతమందొక సన్యాసి యుండెనట ఆయన పేరెద్దియో చెప్పిరి గాని నాకుజ్ఞాపకములేదు. ఆయన నిత్యము వరహా యిచ్చువాని యింటకాని భుజించువాడు కాడట. వరహా యియ్యనిచో నాపోశనము నేలజిమ్మివేచి పోవువాడట. ఈరీతి బెక్కుధనము సంపాదించెను. పాపమా స్వాములవారు మొన్న నీనడుమ నెచ్చటకో భిక్షకుపోయి వారొక రత్నకంకణము దక్షిణగా నిచ్చిన సంతోషముతో బుచ్చుకొనియెనట.

సుబ్బి - ఓహో! ఆయనా! అంతకఠినాత్ము డెచ్చటను లేడు సాదారణముగా నాస్వామిని భిక్షకెవ్వరును బిలువరు. పదేసి దినములుపవాసముగానే యుండును. తరువాత నేమి జరిగినది ?

రామ - ఆకడియమును వీరిశెట్టివలెనే స్వాములవారును అమరావతికి అమ్ముటకు దీసుకొనిపోయిరి. అచ్చట రాజభటులు గురుతుపట్టి యతీశ్వరుడని సంశయింపక యాయననుగూడ గారాగృహములో బెట్టిరట. ఆప్రభువుల శాసనము లెంత యుగ్రముగా నున్నవియో చూచితివా?

సుబ్బి - ఆ యతికి మాత్రమట్టు కావలసిందే ! ఆయన పూర్వధనముగూడ లాగికొనిన మఱియు సంతసింతురు. అయన బిక్షకుబోయి బ్రాహ్మణులను యెన్ని చిక్కులు పెట్టెనో తత్ఫలం బనుభవింపవలదా ?

రామ - నీవు చెప్పినట్లు ఈదినములలో బరీక్షింపక వస్తువులు కొనరాదు సుమీ ?

సుబ్బి - మరియు వీరపాలుడును శూరపాలుడును ప్రజలను వేపుచున్నారు మన చంద్రపాలుడైనచో నింత కఠినముగా చేయడు.

రామ - యేమైనను గాలానుగుణ్యముగా నడచుచుండ పలయును. ఈదినములలో నేజోలికి బోవనివాడే యుత్తముడు.

సుబ్బి - సత్యమే ప్రొద్దుపోయినది నిద్రపోవుటకు బోదము లెమ్మనిపలుకుచు నిష్క్రమించుచున్నారు.

వారి మాటలన్నియు విని హైమవతి మిక్కలి పరితాపము జెందుచు ఆర్యా! నాకతంబున నాతలిదండ్రులు చోరులవలె బద్దులైరఁట యెంత కష్టము, నేను వేగముపోయి వారికిఁ గనంబడితినేని వారి చెర విడఁగలదు. యెట్లయినను వారీ యాపద యుడిగింప మీరు తగిన ప్రయత్నం చేయవలయును. పోదము లెండని యూరక తొందరపెట్టిన నాజయభద్రుఁడు నవ్వుచు నిట్లనియె.

పువ్వుబోడీ! నీవచ్చటికిబోయి యేమిచేసెదవు. ధనవర్మ గుణవర్మలలో నెవ్వరిని వరింతువు? యెవరిపక్ష మవలంబింతువు. ముందుగా మీ తలిదండ్రులకుఁ గనంబడిన నేమి ప్రయోజనము. నీకతంబున వారిరువురకుఁ గలహము రాఁగలదు. నీపక్షము చెప్పితినేని నేనుగూడ నావైపుననుండి జయము గలిగించెదనని పలికిన కలికి కనుదమ్ముల జలమ్ము గ్రమ్మదలవాల్చుకొని వెక్కి వెక్కి, యేడువ దొడంగినది.

అప్పుడతండు అయ్యో! తొయ్యలీ! తొయ్యలీ ! నీవింతబేలవని యెఱుంగనే ? నామాటలలో నేమి శంకించి యిట్లు శోకించుచున్నదానవు. నేను నీవు చెప్పినట్లు నడుచువాడ నూఱడిల్లుము. నాబుద్దిబలముచేత నీ తల్లిదండ్రుల చెఱవిడిపించెదనని పలికి యాపడతి మనస్తాపము వాయఁజేసెను. అంత నానిశావసానమున లేచి వారు మరునాటి రాత్రికి అమరావతిఁజేరి అందొక పేద బ్రాహ్మణునియింట బసఁజేసి యచ్చటి విశేషములన్నియు నాగృహస్తువలనం దెలిసికొనిరి.

హైమవతియు జయభద్రుడును దినమున కొకరీతి వేషములు వైచుకొనుచుండిరి. కావున వారి నెవ్వరును గురుతుపట్టలేకపోయిరి.

అంతకు బూర్వము హైమవతియొక్క రత్నభూషణములు గొనిన స్వాములవారు రత్నవర్తకుడు మొదలగు వారందఱు చోతులవలె బద్ధులై అప్పురంబున జెరసాల పెట్టబడి అప్పుడప్పుడు వీథుల వెంబడి త్రిప్పబడుటచే వారినందఱం జూచి జయభద్రుడు జాలిపడుచుండెను.

జయభద్రు డాపట్టణములో మారువేషమున గౌరవవేషముతో గ్రుమ్మరుచు నొకనాడు గుణవర్మయు ధనవర్మయు సభాభాగమందున్నతఱి వారియొద్దకు బోయి తననిద్యాపాటన మంతయు జూపి వారి మైత్రి సంపాదించుకొనియెను.

అది మొదలు ప్రతిదినము అతండు వారియొద్దకుబోయి వినోదము గలుగ జేయుచు ననతికాలములోనే వారిని దానుజెప్పినట్లు వినువారిగా జేసికొనియెను.

వారిరువురు తమరహస్యములన్నియు జయభద్రునితో జెప్పుచుండిరి.

ఒకనాడు మంధాంథుండైన ధనవర్మ అతనితో రహస్యముగా నిట్లనియె. మిత్రమా! నీకంటెనాకు నాప్తు డెవ్వడును లేడు. నీతో జెప్పని రహస్యము లుండవు. హైమవతి మిగుల రూపవతి అని విని నేను అవమానము లెక్కకొనక కులపరిపాటి పాటింపక చంద్రపాలుని భార్య రహస్యముగా రమ్మని పత్రిక వ్రాయగా వచ్చితిని. ఆచిన్నదియు దక్కినదికాదు గుణవర్మయు నావలెనే యవమానముబొందెను. దాని తలిదండ్రు లాచిన్నదాని నెచ్చటినో దాచియుందురు. ఎన్నిగతుల నిర్బంధించి అడిగినను నిజము జెప్పకున్నారు. తుదకు మేమిరువురము గలసి వారని జెఱశాలం బెట్టించితిమి. అప్పుడును నిజము జెప్పిరికారు. ఇకనేమి చేయవలయును. ఆచిన్నదానిమేని అలంకారము లెచ్చటనో దొరికినవని కొందఱం దీసికొనివచ్చి బద్దులం జేసిరి కాని తన్మూలమునను దేటబడలేదు. నీవుమిగుల బుద్ధిమంతుడవు. హైమవతిజాడ నెటులయినను గనుగొని మంత్రపాలుని జంపింపవలయు. అతండు నాకాయుపతి నిచ్చుటకు మొదటనే యొప్పుకొనలేదు. నేనిట్టిపని నిదివరకే చేసెదనని ప్రయత్నించితికాని, గుణవర్మ యొప్పుకొనకున్నవాడు. ఈవిషయమై నీవు నాకు సహాయము చేయవలయును. అప్పటినుండియు నా కారాజునందు నీర్ష్యగలిగియున్నది. నాకు హైమవతి లభింపకున్నను, మంత్రపాలునియందుగల కసితీఱినం జాలునని యుగ్రముఖముతో బలికినవిని జయభద్రుడు అతనియుద్యమమునకు వెరగుపడుచు నిట్లనియె.

మిత్రమా! నీవు తొందరపడవలదు. నేనానిజము తెలిసికొని నీకు జెప్పెదను నాకిదివఱకే కొంచెము దెలిసియున్నది? అదినిస్సంశయముగా దెలిసినపిమ్మటగాని నీతో జెప్పదలచుకొసలేదు. ఈవిషయమై మంత్రపాలు డేమియు నెఱుంగడు. రేపంతయు జెప్పెద దాళియుండుమని పలుకగా నిలువక ధనవర్మ అదేమియో అప్పుడే చెప్పమని యెంతో నిర్భంధించెను. కాని, జయభద్రుడు సెప్పక కాలవ్యవధి కోరెను.

ధనవర్మయు నాగడువు నెట్టకేరకు దాటించి అమ్మఱునాడు జయభద్రుని యొద్దకువచ్చి యారహస్య మెద్దియో చెప్పుమని అడిగెను.

అప్పుడు జయభద్రుడు లోపల దాను జేయబూనిన కపటోపాయమునకు దైవ మనుకూలించెనని సంతసించుచు నలుదిక్కులు జూచుచు నతని కిట్లనియె.

ధనవర్మా! నీతో నేనేమని చెప్పుదును. లోకములో గొందరు మిత్రులవలె నటించుచు దాము జేయదలచుకొన్న పగదీర్చుకొందురు. దానంచేసి యెవ్వరిని నమ్మగూడదు. హైమవతి యెచ్చటికిని బోలేదు. ఈగ్రామమందే యున్నది. ఇక దాచనేల. నీకు మిత్రుడుగానున్న గుణవర్మ స్వాధీనములోనే యున్నది. అతండు నిత్యము ప్రచ్ఛన్నముగా నాచిన్నదానితో యథేష్టసౌఖ్యంబు లనుభవించుచునే యున్నాడు. అదేమియు నీ వెరుంగక అమాయకపు మాటలు చెప్పుచుంటివి. వెల్లడియైనచో నీవూరకొనవనియే ఆతని తాత్పర్యము! నేను చెప్పినమాట నీకు నమ్మకము లేనిచో బ్రత్యక్ష్యముగా జూపెదను అచిన్ దాని ప్రకృతి నీయొద్దనున్నదిగదా! దానింబట్టి నీవు గురుతు జూడవచ్చునని పలుకగా ధనవర్మయెట్టెట్టూ! మరల జెప్పుము! నీవు జెప్పిన విషయము నాకన్నులకు జూపెదవా? అట్లు చూపితివేని నాయర్ధరాజ్య మిచ్చెదను. గుణవర్మ నాముందర నెంతటివాడు? వాని దేశముపై నేను ఋణమిచ్చితిని. అట్లు జరిగినచో తృటిలో నంతకపురి కనుపనా! నా కావిశేష మెప్పుడు చూపెదనని గట్టిగా నిర్భంధించెను.

అప్పుడు జయభద్రుడు ఆలోచించి నాలుగుదినములు వ్యవధిగోరెను. మఱియు గుణవర్మయొద్దగూడ నెద్దియో ప్రసంగముమీద హైమవతి వృత్తాంతమును గుఱించి వితర్కము వచ్చినంత జయభద్రుడు సంతసించుచు ధనవర్మతో జెప్పినట్లు చెప్పి అతనికి రోషమెక్కించెను.

ఆహా బుద్ధికిసాధ్యము కాని పని యేదియును లేదుకదా!

అరిదివిలుకాని యుజ్వల, శర మొక్కని జంపు తప్పి చనినం జనునే
నేర్పరియైనవాని స్ఫురణము పగవారలెల్ల బొలియించు దుదిన్.

జయభద్రు డొకనాడు రాత్రి తనయుద్యమమున కనుగుణమగు నొకసౌధము చక్కగా నలంకరింప చేసి అందు హంసతూలికాతల్పంబున దివ్యమాల్యాలంకారశోభితయైన హైమవతిని గూర్చుండ బెట్టి వింతవింతలుగా బూవుదండలు గట్టుటయు ఆకుమడుపులు జుట్టుటయు మొదలగు విన్నాణపు పనులు చేయించుచుండెను.

ఇంతలో ధనవర్మ గుణవర్మలకు నారాత్రియే తాను జెప్పిన విషయమును జూపుటకు నచ్చటికిరమ్మని సంకేత మేర్పఱచి యుండుటంచేసి చీకటిలో వెదకికొనుచు ముందుగా నచ్చటికి ధనవర్మ వచ్చెను.

జయభద్రుడు వానిచేయి పట్టుకొని మెల్లమెల్లగా నామేడమీదికి దీసికొనిపోయి గది గవాక్షమునుండి హైమవతిం జూపి మిత్రమా! హైమవతి అదుగో! చూడుము. నీవద్ద చిత్రములో నున్నట్లున్నదియో లేదో అరయుము అనిచూపగా జూచి ధనవర్మ తనచేతనున్న చిత్రఫలకమును చూచి దానించూచి తలయూచుచు గుణవర్మ దలంచుకొని వెఱచుచు ఆహా! విధిసృష్టి యెంత చోద్యముగా నున్నది. ఈలాటిపాటలగంధిని పొందనివాని జన్మమేల? సీ? దుర్మార్గుడైన గుణవర్మ నాకడ్డమువచ్చెనే. సరియే వానిపని రేపుదయమున బట్టెదనని యనేకప్రకారముల నవరసములు ... ... ... ... నెట్టకేలకు జయభద్రుం చూచి మిత్రమా! నీవుచెప్పిన మాటలు వింటిని. హైమవతిం జూపితివి. కన్నుల కలిమిసార్ధక మైనది. కానిమ్ము ఈకొమ్మ యెచ్చటికి బోగలదు? దుర్మార్గుడైన గుణవర్మ యెక్కడ నున్నాడని అడిగెను.

అప్పుడు జయభద్ రుడతని మఱియొకగదిలోనికి దీసికొనిపోయి అందొక గవాక్షము దాపున గూర్చుండబెట్టి మిత్రమా ! నీ వీవిడెము వైచుకొనుచు నీపీఠముపైన గూర్చుండుము. ఆచిన్నది యిప్పుడు పూబంతులు గట్టుచున్నదిగదా? యిప్పుడే ఈదారిని నీచాయ గుణవర్మ వచ్చి యాలోపలకు బోవును. నీ వీకిటికిలో నుండి చూచుచుండుము. లోపలకు బోయిన తరువాత తలుపులు బిగించుకొని యిరువురు మనోహరముగా వీణాగానము పాడుకొనుచు యథేష్టకామంబుల దృప్తి నొందుదురు. నీ విచ్చటనే కూర్చుండిన వారు పాడుకొను సంగీతము కూడ వినిపించును. మాట్లాడక కూర్చుండుము. నేను వెలపల గాచి యుండెదను. నేనువచ్చి పిలుచుదనుక నీ వీవలకు రావలదు సుమీ అని చెప్పి యాగదిలోనుండి తాను వెలుపలకువచ్చి పైన దలుపు గొణ్ణెము పెట్టి గుణవర్మ రాక వేచి సోపానముల . మొదట గూర్చుండెను.

ఇంతలో గుణవర్మయు జక్కగా అలంకరించుకొని అచ్చటికి వచ్చి జయభద్రుజాడ అరయుచుండ అతం డాతని చేయి పట్టుకొని మాటాడకుండముందుగా వేఱొకదారిని నామేడమీదకు దీసికొనిబోయి ధనవర్మయున్న గదివెనుకటి భాగమున నిలువబెట్టి సన్నని గవాక్షరంధ్రమునుండి ముందు ధనవర్మం జూపెను.

అప్పుడు గుణవర్మ ధనవర్మంజూచి తలయూచుచు నీమిత్రద్రోహుడు నాతో జెప్పక యెట్టిపని చేయుచున్నాడు. కానిమ్ము వీని సంగతి రేపు చూచెద. నార్యా! హైమవతి యెచ్చట నున్నదని అడిగెను.

అప్పుడతండు గుణవర్మను ధనవర్మ చూచుచున్న కిటికీదాపున నుండి రమ్మని చెప్పి తాను వేరొకదారిం దిరిగివచ్చి అతనిం గలిసికొనియెను.

తనప్రాంతమునుండి పోవుచున్న గుణవర్మను చూచి ధనవర్మ గుఱుతుపట్టి యిప్పుడే చంపవలయునని అహంకారము పుట్టినది కాని బోనులోబెట్టిన వ్యాఘ్రమువలె దలుపులు వైచిన నాగదిలో నుండుటచే నేమి సేయుటకు వీలు చిక్కినదికాదు.

తరువాత జయభద్రుడు గుణవర్మను గవాక్షము దాపునకు దీసికొనిబోయి లోపలనున్న హైమవతి విలాసము లన్నియుం జూపెను.

అప్పుడు గుణవర్మకును ధనవర్మ వెఱ్ఱియూహ లన్నియుం బుట్టినవి. జయభద్రు డెట్టకేలకు అతని నాగవాక్షము దగ్గిర నుండి తప్పించి అవతలప్రక్క నున్న వేరొకగదిలో గూర్చుండబెట్టి మిత్రమా నీ విందు గూర్పుండుము. ఆగదిలో నున్న నీచాయ లోపలకు వచ్చి హైమవతితో గూడి వేడుకగా సంగీతము పాడును. అదియు నీకు వినిపించును. పిమ్మట నేను వచ్చెదనని ధనవర్మకు జెప్పినట్లు చెప్పి అతని నందు గూర్చుండబెట్టి పైదలుపులువైచి తాను హైమవతియున్న గదిలోనికి బోయి యాగది తలుపులన్నియు మూసి వారిరువురకు వినిపించులాగున నాచిన్నదానితో నెద్దియో గుసగుసలాడుచు సంగీతము పాడవలయునని కనుసన్న జేసెను.

అప్పు డప్పూబోడియు బాణిని వీణెంబూని కొంతసేపు హాయిగా గీతముబాడినది ఆ గానస్వానమునకు ధాక్కి యారాజపుత్రు లిరువురు మేనులు మఱచి చేష్టలుదక్కి పీఠములపై కొరిగిరి.

మఱియు హైమవతి యారాత్రి మిక్కిలి చక్కగా అలంకరించుకొన్నది కావున జగన్మోహనాకారముతో నున్న యా యన్నుమిన్నంజూచి జయభద్రు డంతకుమున్ను గుట్టుపట్టుకొని యుండెను. కానిఅప్పుడు మనంబుబట్టజాలక మన్మథశరపీడితుండై యాలంబనోద్దీపనవిభావాది విశేషంబుల గమక్రమంబున నుత్సాహంబు దీపింప అన్యాపదేశంబున గొంతసేపు తదవయవంబు లంటుచు చివరకు మోహమాప లేక బిగ్గరగా గౌగిలించుకొనెను. అప్పుడప్పడంతి యలంతి నవ్వొలయ ఓహో! మోహనాంగా! మీ కిప్పుడు సమయము దొరికినది కాబోలు. యిన్నిదినము లేకాంతముగా నున్నప్పుడు డుపేక్ష సేయనేల మంచిసమయమే కనిపెట్టితిరి? చాలు చాలు! యిరువంకలను శత్రురాజుల నిడికొని వారిని వంచింపబోయి మీరే యిట్లు పంచశరునిచేత వంచింపబడుచుంటిరే? నేను ఱే పెక్కడికి బోయెదను ఇప్పుడు వారి విషయమై చేయదగిన కృత్యముల నాలోచింపు డనుటయు నా జయభద్రు డిట్లనియె.

ఇంతీ! యింతదనుక నీరూపముజూపి శత్రువుల వంచింపదలచితిని. కాని ఇప్పుడు నేనే వంచితుడనైతిని. నీయాకృతిఁ జూచి మహామునులుగూడ మోహింతు రనుచో మా బోటుల మాట నొడువనేల! అని పలికి అచ్చిలుకలకొలికిని బాహ్యరతోద్యోగంబున గుతుకబఱచుటయు అత్తరుణి, యార్యా! యిది యాపత్సమయము. జననీజనకులు జెఱసాలనుండ నాకేయుత్సాహమును గలుగకున్నది. విధివిధానంబున వారివలన నన్ను స్వీకరించి యథేష్టసౌఖ్యంబులం బొందుదురుగాక! శత్రువులం బరాభవించు తెరం గరయుడని యెన్నియో నీతులు జెప్పి అతని యుద్యమము వారించినది.

అప్పు డతండు యెట్టకే నచ్చటినుండి యీవలకు వచ్చి ముందుగా ధనవర్మ యున్నగదిలోనికి బోయి మోహపరవశుండై యున్నయతనిని లేపి యాయిల్లు దాటించి యింటికి బంపెను.

తరువాత గుణవర్మనుగూడ నిల్లుదాటించి నేను జెప్పిన విషయము యథార్థమని నీ కిప్పటికైనను దెల్లమైనది గదా యని పలుకుచు అతని నివాసమునకు బంపెను.

అంత మఱునా డుదయంబున నారాజకుమారు లిరువురు రాత్రి తాము చూచిన విషయమును మనమున బలుమారు వితర్కించుచు నొండొరుల వధోపాయ మాలోచించిరి.

ఆహా ! మిత్రద్రోహుడైన నాచాయ నన్నువంచించి హైమవతిని బ్రచ్ఛన్నముగా అనుభవించుచున్నాడు. యేమియు నెఱుగనట్లు నాతో దానుగూడ నాచేడియ కొరకు పరితపించుచున్నాడు. ఈకుట్రను తెలియక నిష్కారణము పరమనైష్ఠికుడైన సన్యాసిని మర్యాదకుటుంబములో జనించిన రత్నవర్తకుని మఱికొందరిని జెఱసాలలో బెట్టించితిని అన్నన్నా! యెంత తెలియకపోయితిని. ఇప్పుడు వీని నేమి చేసినను దోసములేదు. సభకు బోయినప్పుడు మే మొండొరులము సౌహార్ద్రసూచకముగా హస్తగ్రహణము చేయుట వాడుకయున్నది. గదా! ఈదినమున వానికి నెడమచేయనందిచ్చి కుడిచేతితో ఆడిదము బెఱికి వానితల దెగనరికెద దానితో నాయహంకారము వాయునని యిరువురు నూహించిరి.

వారిచర్యలం గనిపెట్టుచు జయభద్రుండు ఆనాడు పెందలకడ భుజించి సభకు వచ్చెను. సభ్యులందఱు యథాకాలమున సభకువచ్చి వారివారిస్థానముల గూర్చుండిరి

అప్పుడు వాడుకప్రకారము ముందుగా గుణవర్మ సభకువచ్చి తనపీఠముపై గూర్పుండ ధనవర్మరాక నిరీక్షించియుండెను. అతని అప్పటి యాకారము ముఖవైఖరినిజూచి సభ్యులందఱు వెరగుపడజొచ్చిరి.

ఇంతలో ధనవర్మయు నశ్వారూఢుండై పెక్కండ్ర పరిచారకులతో నాయాస్థానమునకు వచ్చెను.

అప్పుడందున్న వారందఱు లేచిరి గుణవర్మయు బీఠమునుండి లేచి రెండు మూఁడడుగు లెదురుగా నడిచి యతనికి నెడమచేయి అందిచ్చెను దాని కత డించుక శంకించుచు నెడమచేతితోఁ బట్టుకొని రహస్యముగా మొలలో దాచియుంచిన అడిదము వడిగాఁ గుడిచేతితోఁ బెఱికి చెడుగా! చావుమని మెడమీదఁవేసి తలనఱికెను. గుణవర్మయు నట్టి ప్రయత్నముతో నుండుటఁబట్టి ధనవర్మవలెనే యాసమయమున దక్షిణహస్తముతో వాలుబెఱికి ధనవర్మ తలనరికెను.

ఇరువుర వ్రేటులు నేకక్షణమున నొండొరుల కంఠంబులంబడుటచే వారిద్దరు నొకసారి స్వర్గమునకు నిర్గమించి అచ్చటం గూడ రంభకొరకు జగడమాడఁ దొడంగిరి.

వారిచిత్రవధఁ జూచి సభాసదులందఱు నాశ్చర్యమందుచు నుభయపక్షములవారు నొండొరుల గలహింపం దొడంగిరి. అప్పుడందఱును వారించి జయభద్రుడుఁ ఆక్షణమునందే వారితండ్రులగు వీరపాల శూరపాలురకు వర్తమానము పంపుటయు దన్మూలమున వారిరువురు సేనలం గూర్చుకొని యొండొరులు ఘోరముగాఁ బోరి చివర కిరువురును వీరస్వర్గమునొందిరి.

ఆహా! జయభద్రుని బుద్దిబల మెందర శత్రువుల నిర్మూలము చేసినదో చూడుము. ఈ లోపలనే జయభద్రుఁడు సేనలనెల్ల లోబఱచుకొని యామంత్రపాలుని భార్యతోఁగూడఁ జెఱ విడిపించి యాదినమునందే తిరుగ సింహాసన మెక్కించెను. అప్పుడు ప్రజలందరు మిక్కిలి సంతసించి అతనియందు మిగుల విశ్వాసము గలవారైరి.

మఱియు వీరపాల శూరపాలురు సంగరములో హతులైరను మాటవిని జయభద్రుఁడు మంత్రపాలసమేతుఁడై యాయిరువుర దేశములకుఁ బోయి వానిం గూడ స్వాధీనము చేసికొని యాదేశములకుఁ గూడ బరిపాలనఁ గావింపఁ దొడంగెను.

ఒక్కనాఁడు మంత్రపాలుఁడు తనకకారణముగా మిక్కిలి యుపకారము చేయుచున్న జయభద్రునింజూచి వినయవిశ్వాసముతోఁ దమవృత్తాంత మెట్టిదొ చెప్పుమని యడిగిన సంతసించుచు హైమవతి సహింతుండై వచ్చి అతనికి నమస్కరించెను.

అప్పుడు మంత్రపాలుఁడు పుత్రికను గుఱుతుపట్టి పట్టరాని సంతోషముతోఁ గౌగలించుకొని కనుల నానందబాష్పములు గ్రమ్మ పెద్దతడవు సంతోషపారావారవీచికలం దేలుచు భార్యతో నా వృత్తాంతము జెప్పి సంతోషము కలుగఁజేసెను.

అప్పుడు హైమవతి తల్లిదండ్రులకు సంతసము గలుగఁజేయుచు వా రడిగినంత దన వృత్తాంత మాద్యంత మెఱుఁగ జెప్పినది.

మంత్రపాలునికి జయభద్రుడు అల్లుడని తెలిసినపిమ్మట గలిగిన యానంద మీపాటిది అని నుడువుటకు నలవికాదు.

పిమ్మట విధివిధానంబున మంత్రపాలుండు హైమవతికి జయభద్రుని కిచ్చి పాణిగ్రహణమహోత్సవము సేయించి తన రాజ్యమునకు నధిపతిగా నతనికిఁ బట్టాభిషేకము గావించెను.

అటు సంప్రాప్తరాజ్యభారుడై జయభద్రుండు రామభద్రుండు బోలె న్యాయంబునఁ బాలింపుచు స్వదేశాగతులైన బ్రాహ్మణులవలన నిత్యము సునీతి ఖ్యాతి మిక్కిలిగా వినుచు నాశ్చర్యపారావానిమగ్నుఁడై యవ్విధంబంతయుఁ బరీక్షింప నరుగదలచుకొన్న సమయంబున సుదేవుండను బ్రాహ్మణుడు ఆ రాజు గృహమున కతిథిగా వచ్చి అర్చితుండై కూర్చున్నతఱి జయభద్రుడు స్వాగతప్రశ్నపూర్వకముగా నతని కిట్లనియె.

పండితమండనా! భూమండలమున మీరు వీక్షింపని దేశములుండవుగదా! దేశాటనము పండితధర్మమే ఇప్పుడు సకలదేశములలో నెన్నఁదగు వదాన్యుం డెవ్వడు యెవ్వని గృహమున కరుదెంచి అతిథులు సంపూర్ణకాములై అరుగుచుందురు? అప్పుణ్యాత్మునిం బేర్కొనుమని అనుటయు నాసుదేవ భూదేవుండు సంతుష్టాంతరంగుండై యితని కిట్లనియె.

దేవా! దేవర కరుణావిశేషంబున నే చూడని దేశంబులు లేవు. బాల్యము మొదలు నాకు దేశాటనమే వృత్తిగనున్నయది. పుడమిఁగల దాతల అందరం బరీక్షించి చూచితిని కాని యీ కాలములో విదర్భదేశములో సునీతి అను సాధ్వీమణి వంటి దాత నెందును గనివిని యెఱుంగను.

ఆ సతీతిలకము పతి జయభద్రుఁ డెంత సంపాదనకర్తయో తెలియరాదు. ఆమె నిత్యము ఆర్తులకు గోటిరత్నమండలములు దానము చేయుచుండును. ఆ రత్నములు భూలోకములోనివి కావు. నా పాండిత్యమునకు మెచ్చుకొని నాకొక రత్నాల పతకము కానుకగా నిచ్చినది. ఇదిగో చూడుడు అని తన మూటలోనున్న హారమును జూపెను.

ఆపచ్చలపేరు చూచి జయభద్రుడు వెరగుపడుచు బరీక్షకు రప్పించి అందుగల రత్నములు వెలగట్టింప నివి నిరూపించుటకు మావశము కాదనియు నివి అమూల్యములనియుం జెప్పిరి.

పిమ్మట జయభద్రుడు ఆ బ్రాహ్మణునిం జూచి విప్రోత్తమా! నీవా సతీమణి భర్తయగు జయభద్రునిం జూచితివా? అతని పోలిక యెట్లుండునని అడిగిన అప్పాఱుండిట్లనియె.

దేవా! దేవర యేమనుకొనినను మేలగుఁగాని యా సాధ్వీమణి పతికిని మీకు నించుక తారతమ్యము లేదు. ఆతండు మీ పోలికనుండు మీ యిరువురకు నెద్దియేని బాంధవ్యము గలిగియున్నదేమో తెలియదు దేవరను జూచిన నాటవోలె నాకీ సందియము గలిగియే యున్నది, ఆసునీతి పతితోగూడ బీటలపై గూర్చుండి బ్రాహ్మణులకు దానము గావింపుచుండును. దానంజేసి మాకు ఆయనను గూడ జూడంగలిగెనని అచ్చటి విశేషము లన్నియుం జెప్పెను.

ఆ మాటలు విని జయభద్రుడు మఱియు వెరంగు పడుచు సవినయముగా నా బ్రాహ్మణుని ననిపి అంతఃపురమునకు బోయి హైమవతింజూచి మచ్చెకంటీ! వింతలు వినవచ్చుచున్నయవి మా దేశమునకు బోయి చూచి రావలయును సునీతి విఖ్యాతి నీవును వినియుంటివి కదా? అచ్చట మఱియొక జయభద్రుడు నా పోలికవాడు పీటలపై గూర్చుండునట ఆ చిత్రములు చూడ నెంతయు నౌత్సుక్యముగా నున్నవి. నేను రహస్యముగా బోయివత్తును. నీవిచ్చట భద్రముగా నుండుమని చెప్పిన నా యొప్పులకుప్పయు దానుకూడ వత్తునని యెంతేని నిర్బంధించెను గాని అతండందులకు సమ్మతింపక తానొక్కరుఁడ రహస్యముగా బయలు వెడలి కతిప్రయ ప్రయాణముల స్వగ్రామమునకు బోయెను.

పూర్వపు వేషముతో నా పట్టణవీథిలో బోవుచుండగాఁ బెక్కండ్రు వచ్చి పరిచయముతో బల్కరించుచు నేయవియో వ్యవహారములు మాటాడదొరంగిరి. కాని అవి యేమియు జయభద్రుని కర్థమైనవి కావు.

ఒకడు వచ్చి నమస్కరించి యెదుర నిలువబడి అయ్యా! తమశెలవు ప్రకారము వచ్చితిని. ఆజ్ఞ యేమి అనియు మఱియొకడు దేవా! దేవరయానతిం బోయి పండితులం దీసికొని వచ్చితిని వీరె చూడుడు, విమర్శింపక పోవుచున్నా రేమి? అనియు బల్కుచుండ వెఱుఁగుపడుచు మాటాడక నడుచుచుండ అతని వెంట బెక్కండ్రు బ్రాహ్మణులు దానార్థులై నడువ దొడంగిరి.

స్తోత్రపాఠములు పఠింపుచు నిట్లు బ్రాహ్మణులు పెక్కండ్రు చుట్టునుం బరివేష్టించిరా వారితో నేమియు మాట డక వడిగా నడిచి కోటలోనికి బోయి తల్లిదండ్రులం గాంచి నమస్కరించెను.

వారును అతని దీవించుచుఁ గ్రొత్తగాఁ జూడక పూర్వపురీతినే మాటాడం దొడంగిరి. అట్లు తల్లిదండ్రులు నన్నదమ్ములు బంధువులు మిత్రులు మొదలగు వారెల్ల తన్ను గ్రొత్తగాఁ జూడక పాతవానితో మాట్లాడి నట్లు మాట్లాడుచుండుట నతండు మిక్కిలి విస్మయము చెందుచు వారందఱు తన్నవమానించునట్లు తలంచి యీర్ష్యజనింప సీ? వీరిని నేను మాత్రము పల్కరించనేల? నేను వేశ్యాలోలుండని కాబోలు వీరు నన్ను మన్నించిరి కారు ఎల్లకాలము నొక్కరుండొక్క రీతినుండునా? ఇప్పుడు నాకును వేరొకచోట రాజ్యమున్నదని తెలిసినచో వీరునన్ను మిక్కిలి గారవింతురు కానిమ్ము నాకేమియు లోపము లేదుకదా! సునీతి వ్యాపార మెట్లున్నదిమో చూచి నాత్రోవఁబట్టి నేను బోయెదనని నిశ్చయించి మగుడు సమయంబున తల్లి వచ్చి వత్సా! నేడిచ్చటి కకాలమున వచ్చితివేల? దానధర్మములు చేయలేదా యేమి? వంటయైనది భుజించి పొమ్మని పలికెను.

ఆ మాటలు విని పెక్కుతెరంగుల శంకించుకొనుచు దల్లి కేమియు నుత్తరము చెప్పకయే వడిగా సునీతి మేడకుబోయెను.

అట్టి సమయమున ఆచిన్నది మాయాజయభద్రునితోఁ బీటలపై గూర్చుండి యొక బ్రాహ్మణునికి బాదములు గడుగుచున్నది. జయభద్రుడు ద్వారము దాటి లోపల బ్రవేశించు నంతలో బీటమీద నున్న అతం డదృశ్యుడయ్యెను.

వస్తుపదానకాలములో బీటమీద మగనిం గానక సునీతి నలుమూలలు చూచి నంత ద్వారదేశమందు నిలువంబడి యున్న జయభద్రుడు గనంబడియెను.

అతనిం జూచి యాచిన్నది. అయ్యో! ఇది యేమి చిత్రము నాపీటమీదనుండి అచ్చటి కెట్లు పోయిరి? ఇది గాంధర్వమువలె నున్నదియే అని విస్మయమందుచుఁ దానులేచి జయభద్రునికడ కరిగి అతని చేయిపట్టుకొని ప్రాణేశ్వరా? బ్రాహ్మణునికిఁ బాదములు గడిగి వస్తు వొసంగక నడుమ లేచి యింతలో నిచ్చటికి వచ్చితిరేల? అట్లు చేయుట శాస్త్రదూష్యము కాదా! నాయపరాధ మెద్దియేని గణించి కోపముతో నిట్లు వచ్చితిరా? క్షమింపుడు వేగమరండని చేయి పట్టుకొని లాగగా జూచి జయభద్రు డాసునీతి నంతకుమున్ను జూచి యెఱుగడు కావున విస్మయాకులహృదయుండయి యేమియుం దోచక యామెతో నిట్లనియె.

జవ్వనీ! నీ వెవ్వతెవు? నేనెవ్వడనుకొని ఇట్లనుచుంటివి? ఇంతకుముం దెన్నడేని నన్ను జూచియుంటివా? నీ మాట లేమియు నా కర్థములు కావు ముందుగా నీ యుదంతము జెప్పుమని పలుకగా నాకలకియు బరిహాసమున కట్లనుచున్న వాడని నిశ్చయించి నవ్వుచు నిట్లనియె.

ప్రాణేశ్వరా మీకు కుంతిభోజుని యేడవకుమారులు. మీపేరు జయభద్రుడు. నాపేరు సునీతి నేను మీకు భార్యను. మిమ్ము బెద్దతడవులబట్టి చూచుచుంటిని. ముందటి జన్మములో గూడ విడువను. ఇదియే మనకుగల బాంధవ్యము. ఈమాటు నా మాట లర్దమైనవియా? ఇది పరిహాసకాలముకాదు. పాపము బ్రాహ్మణుడు చేయి చాపి పీట మీద గూర్చునియున్నవాడు. వేగమరండు. అని పలుకగా విని జయభద్రుండు తదీయమృదుమధురగంభీరసంభాషణముల కచ్చెరు వందుచు నంతరంగంబున నిట్లు తలంచెను.

ఆహా? యీమోహనాంగి నా భార్య అగుట నిక్కువంబ. కంటిలో మచ్చయున్నదన్నమాట వేశ్యాకల్పితము, ఈ కాంచనగాత్రిని జగన్మోహిని అనవచ్చును కాని యీ చిన్నది చెప్పుచున్న మాటలు మిక్కిలి విపరీతముగా నున్నయవి. ఇప్పుడు నేను తనపీటమీద గూర్చుని లేచి వచ్చినట్లుగా మాటాడుచున్నదే తానెవ్వరినో గూర్చుండబెట్టుకొని యాగుట్టు తెలియకుండ నన్ను జూచి యిట్లనుచున్నది కాబోలు! భళిరే! స్త్రీలు యెట్టి పనులకైనను సాహసికలగుదురు గదా? ఇదియును గాక, యిచ్చటివారి చర్యలన్నియుం జూడ వేఱొకజాడగా నున్నవి. నన్ను మాయ పుచ్చుట కిట్లనుచున్నారు కాబోలు! కానిమ్ము వీరి దంభమునకు నేను వెఱతునా? ఈలంజపడఁతి గావించు దానంబులు బుచ్చుకొని బ్రాహ్మణబ్రువు లెల్లెడలం జెప్పుకొనుచుందురు. బ్రాహ్మణులకు నీతియున్నదా?

వారి కీకక్కురితి మెండుగా నుండును. చండాలుండైనను దానమిచ్చెనేని వాని నింద్రునిగా బొగడుచుందురు. అట్టివారి మాటలు నమ్మవచ్చునా? అని అనేక ప్రకారములఁ దలపోయుచుండగా మరియు నత్తరుణి యిట్లనియె.

ఆర్యపుత్రా మీరెద్దియో మనంబున ధ్యానించుచు జాగుసేయుచున్నవారేమి? ఆలస్యమగుచున్నది. రారేమి? దానమధ్యమున జాగైనచోఁ బ్రత్యవాయము వచ్చునని యార్యులు చెప్పుదురు వడిగా రండు ప్రొద్దెక్కినది. అని పలుకగా ముఖమునం దలుక జిలుక నచ్చిలుకలకొలికి కతం డి ట్లనియె.

బోఁటీఁ నీవేటికి నన్ను మాటిమాటికి రమ్మని నిర్బంధించెదవు? నీగుట్టు దాగునని నీవిట్లనుచున్నావు కాని నిజము గ్రహించితినిలే. ఇన్ని దినంబు లెవ్వరినో పెట్టుకొని వర్తించుచు నాతప్పు మాయుటకిట్లు దానములు చేయుచుంటివి. ఇప్పుడు నేనువచ్చి చూచితినని యెద్దియో బొంకబోయెదవు కాని సరిపడదు.

ఈలంజ నియమముల కేమిలే. నేనీయూరు దాటిపోయి పెక్కుదినములై నది. నిన్ను నేను బెండ్లియైన తరువాత చూచియుండలేదు. ఇప్పుడు చూచితిని. నిత్యము నేను నీయొద్దనున్నట్లె మాట్లాడుచుంటివి. దీనికి నేనేమి చెప్పుదును. నేను రాను పోపొమ్మని పలుకఁగా అక్కలికి యులికిపడి అయ్యో! నా మనోహరునికి బిచ్చి యెత్తినది. అసందర్భముగా మాటలాడుచున్న వాడు. వేగమ దీనికి బ్రక్రియఁ జేయింపవలయు మామామను బిలువుడో యని అరచినది.

అయ్యార్పులతో అందరు తొందరపడుచుఁ దలయొకమూలకుఁ బోయి అనేకుల వైద్యులం దోడ్కొని వచ్చిరి. కుంతిభోజుడును భార్య మొదలగువారందరుఁ అచ్చటికి వచ్చిరి.

వారినందఱంజూచి జయభద్రుడు నవ్వుచు ఓహో! మీ రెల్లరకు పిచ్చి యెత్తి నట్లున్నది. ఈ పుంశ్చలి మాటవిని యిచ్చటికి వచ్చితిరేల? నా మాటలన్నియు యథార్థములు: నే నున్మత్తుడను కాను నన్ను నమ్మించుటకై ఈకొమ్మ యిట్లను చున్నది. మీరే యాలోచింపుడు నేను తనతోనున్నట్లు చెప్పుచున్నది. యెప్పుడేని నన్ను మీరిచ్చట జూచితిరా? నే నడవుల పాల్పడిపోయి నేటికి వచ్చితిని. నన్ను మీరందరు అవమానింపనక్కరలేదు. నాకును నీపాటి రాజ్యముగలిగియున్నది లెండు అని వారితో మాటాడగా వారికి అతనిమాటలు విపరీతముగాఁ దోచుటచే బిచ్చియెత్తినట్లే నిశ్చయించిరి.

అప్పుడు జయభద్రుని తల్లి మిక్కిలి పరితపించుచుఁ బుత్రకునిపై బడి, అయ్యో! కొడుకా! నీ విప్పుడు నాయొద్దకువచ్చి పల్కరించినను మాట్లాడితివికావు. అప్పుడే నాకనుమానము గలిగినది. నన్ను జూచినపుడెల్ల అతివినయముతో మాట్లాడు వాడవు. నేఁడు నీ కెవరో భూతమును బెట్టియుందురు. నాముద్దలతండ్రీ! నీ చిత్త మెట్లు స్వస్థతనుజెందునో తెలియదుగదా యని పెక్కుగతుల విలపింపఁ దొడగినది.

అప్పుడు జయభద్రుడు తెల్ల బోవుచు తల్లితో ఔను అమ్మా నేను బెక్కు దినములు పరదేశములోనుండి నీయొద్దకు వచ్చినందులకు దిన్నగా మాట్లాడినాను కాను. ఇప్పుడు నాభార్యచెప్పిన కపటపుమాటలు విని నీవుకూడ నాకు బిచ్చియెత్తినదని యేడ్చుచున్న దానవు చాలుజాలు నాకు మిమ్మునందఱిం జూడఁ బిచ్చియే యెత్తు చున్నది. ఒకరై నను నన్ను గ్రొత్తగా బెక్కిడుములు పడివచ్చితినని పరామర్శింపరైరి. ఇప్పుడీ ఱంకులాడిమాటలు నమ్మి గంతులు వైచుచున్నారు పో పొండు నా యొద్దకు రాకుడు నాతో మాటాడవద్దని పలుకగా మఱియు బిచ్చియెత్తినట్లు నిశ్చయించి అయ్యో! ఇఁక నేమియున్నది. వీనిమాటలన్నియు విపరీతముగానే యున్నవి. వేగము వైద్యులు చికిత్సచేయరో అని ఆతనితల్లి తొందర బెట్టదొడంగినది

అప్పుడు వైద్యు లుప్యగ్రచిత్తులై తత్తరముతో నతని బలాత్కారముగాఁ బట్టుకొని పైత్యోద్రేక ముడుగునట్లు చికిత్సచేయదొడంగిరి.

జయభద్రుడు పకపకనగుచు అయ్యో! నిష్కారణము నాకు బిచ్చియెత్తినదని వైద్యముచేయుచు నన్ను వేపుచున్నారే. ఈలాగునని తెలిసినచో నేనిచటకు రాకయేపోవుదును తెలియకవచ్చితిని. నన్నునిడువుడు. నాదేశము నేను బోయెదనిఁక నెన్నడును రాకుండ చేయుచున్నారని పలుకగా విని భూతవైద్యు లతని తండ్రితో నిట్లనిరి.

రాజా! వీనిమాటలు వినుచుంటిరికదా! వీనికిదిపిచ్చికాదు గాలిసోకినది. ఎఱుగకవచ్చితిని. విడువుడు. ఇకరాను అనుమాటలు భూతాలాపములు కాని యున్మత్త వచనములుకావు కావున వీనికి భూతవైద్యము చేసెదమని చెప్పిన నతండును అట్ల కాదలంచి యావైద్యము వారిచేత చేయించెను. అతని బందీగృహంబునం బెట్టి భూతవైద్యులు భూతమా! నీవు మా రాజపుత్రు విడువుము. లేకున్న నిన్ను కట్టివైచి శపింతుమని మంత్రము లుచ్చరించుచు, బెత్తములచే నతని గొట్టదొడంగిరి.

ఆ దెబ్బలకుఁ దాళలేక యతం డుచ్ఛస్వరంబున జనకుంజీరి "తండ్రీ! నేను చిరకాలమునకు నీయొద్దకు వచ్చినందులకు మంచిశిక్షయే చేయించుచుంటివి. వీరు నన్నూరక బాదుచున్నారు కటకటా! కన్నతండ్రివి నీకైన నక్కటికములేదా! నా కేమియు బిచ్చియెత్తలేదు. భూతము సోకలేదు. నామాటలు మీరు తిన్నగా నర్థము సేసికొనలేక అట్టి భ్రమపడుచున్నారు ఇంతకును కారకురాలు నాయాలు నేను స్వస్థ చిత్తుడనై యుంటిని నామాటలన్నియు మీరు సావకాశముగా విని తరువాత బ్రతిక్రియజేయుడు. మీకు దెలియనిచో నామిత్రుడు సుమిత్రు నొక్కసారి యిచ్చటికి రప్పింపుడు . వాని కన్నియుంజెప్పి యొప్పించెద"నని కన్నుల నీనుగ్రమ్మ దైన్యముగా బలుకుచున్న పుత్రకునిఁ జూచి తండ్రి శోకించుచు నాక్షణమునందే సుమిత్రుని రప్పించి అతనితో నిట్లనియె.

సుమిత్రా! నీమిత్రుని అవస్థ యెట్లున్నదియో చూడుము. మాటలు దేటగానే యాడునుగాని మనకేమియు నన్వయింపవు నీతో నెద్దియేచెప్పియొప్పించునట. వాని మాటలువిని మాకుఁ జెప్పుము; అని పలుకుచు నతనిని జయభద్రుడున్న గదిలోని కంపెను.

సుమిత్రుని జూచినతోడనే జయభద్రుడు మిక్కిలి సంతసించుచు పెద్దతడవు గాఢాలింగనము జేసికొని కనుల నానందభాష్పములు గ్రమ్మ నతనితో నిట్లనియె.

వయస్యా! నేను నీమాటలు వినకపోవుటచేఁ బెక్కిడుమలంబడితిని. దైవకృపచే నవియన్నియుం దాటి నేఁటికి సంతోషముతోఁ గన్నవారున్నవారుకదా అని యిచ్చటికి వచ్చితిని. వీరిఅభిప్రాయ మెద్దియో నాకుఁ దెలియకున్నది. నామాటలు విని వీనికిఁ బిచ్చియెత్తినదని కొంతసేపు నన్ను నిర్భంధించుచున్నారు. ఈ భూతవైద్యులు నన్నెట్లు బాదిరో చూడుము నావృత్తాంతమంతయు నీకుజెప్పెదను. విను మని తాను బోగముదాని యిల్లు విడువకుండుటయు నది దొంగలచే దన్ను నూతిలో బారద్రోయించుటయు నందు హైమవతితో గలసికొనుటయు నామెతోగలసి యమరావతికిఁ బోవుటయు నచ్చట ధనవర్మగుణవర్మల మాయోపాయముచేత సంహరించుటయు శూరపాల వీరపాలుర వధ, హైమవతి పరిణయము, తసపట్టాభిషేకము మొదలుగాగల కథఅంతయుంజెప్పి నామాటలలో బిచ్చి యెచ్చటనున్నది? కావలసిన యెడ నమరావతికిఁబోయి నేజెప్పిన విషయములన్నియు నరసికొనిరమ్మని నిగూఢముగా వక్కాణించెను.

అతని వృత్తాంతమంతయును విని సుమిత్రుడు విస్మయాకులచిత్తుండై అమరావతిలో జరిగిన చర్యలన్నియు నంతకుమున్న తానుగూడ వినియున్న కతంబున నట్టిపని చేసినవాఁ డితడగునో కాడో అను సందియము డెందమున కెఱింగించెను.

అప్పుడతండు సుమిత్రునింజూచి ఆతనిమాటలు నీ వెట్లు నమ్ముదువు? ప్రతిదినము ఈతని నిచ్చట మనము జూచుటలేదా ? కన్నులారా చూచుచున్నవాని నెట్లు మఱతుము. వీనికి తప్పక భూతముసోకిన మాట నిక్కువమని పలుకుచుండగాఁ ప్రతిహారి వచ్చి దేవా! యవధారు అమరావతీ మంత్రపాలమహారాజు కూఁతురు హైమవతిఅఁట. తనప్రాణేశ్వరుండైన జయభద్రుం డున్మత్తుండై యున్నవాఁడను వార్తవిని యుచితపరివారముతోవచ్చి ద్వారమున నున్నది వల్లభుం జూచుటకు మిక్కిలి తొందరపడుచున్నది. దేవర యానతి యేమని అడిగెను. ఆద్వారపాలుని మాటలు విని యారాజు విస్మయావేశ హృదయుండై సుమిత్ ! ఈ చిత్రము వింటివా! ఇప్పుడు నీతో చిరంజీవి చెప్పిన మాట లన్నియు నిక్కువమగునట్లే తోచుచున్నది. మంత్రపాలు గూతురు హైమవతి మావత్సను, బతిగా వరించినట్లు యీ ప్రతిహారి వచనంబున దేటయగుచున్న యది. కానిమ్ము ఆ సాధ్వీతిలకమువలన సర్వమును దెలిసికొని తరువాత విచారింతము. అనియాలోచించుచు వేగమ యాగజగమనను ప్రవేశపెట్టుమని ద్వారపాలుని కుత్తరము జేసెను.

ఆవేత్రహస్తుడు వడిగా బోయి అచ్చేటియుం దోడ్కొనివచ్చి జయభద్రు డచ్చట నున్నవాడని పలుకుచు నచ్చట విడిచిబోయెను. హైమవతి బద్ధుండైయున్న జయభద్రునిఁజూచి. హా! ప్రాణేశ్వరా! నీవెట్టి అవస్థ అనుభవించుచుంటివి. నేను పోవలదని యెంతచెప్పినను వింటివికావు అయ్యయ్యో! నిన్ను దయ్యమిట్లు సేయ నేమియపకారము సేసితివి? అచ్చట మా చుట్టము లందఱున్నారని యత్యాతురఁతో వచ్చితివే? బుద్ధినైపుణ్యముచేత బలవంతులగు శత్రువులను వంచించిన నీయూహ లన్నియు నెందుబోయినవి. కటకటా! నూతిలో బడిననాకు దెప్పవై యుద్ధరించిన సుకృతమైనను నిన్ను గాచినది కాదే అన్నన్నా. అమరావతి ప్రజల దురదృష్టము కాబోలు స్వల్పకాలము పాలించినను వారిని మిక్కిలి రంజింపజేసితివి. అని యీరీతి నతని వృత్తాంతమంతయును జెప్పుకొనుచు శోకింపదొడగినది.

జయభద్రు డాకురంగనయనం జూచి, అయ్యో! తొయ్యలీ! నీవు విచారింపకుము నా కేమియు బిచ్చియెత్త లేదు భూతమును సోకలేదు. నాచిత్తము స్వస్థతగానే యున్నది. వీరిట్లు నన్నూరక నిర్బంధించుచున్నారు. కారణమేమియో తెలియదు నీవైనను వీరికి జెప్పి నన్ను విడిపింపుము. మనదేశమునకు బోవుదము ఆని పలుకగా విని అవ్వనిత విభ్రాంతయై, మామగారితో నిట్లనియె.

ఆర్యా, నావల్లభునికి బిచ్చియెత్తినట్లు మీరెట్లు నిశ్చయించినారు ఆయన మాటలు తేటగనేయున్నవే! వేరెద్దియేని కారణముచేత నిట్లు బద్దుంజేసితిరా! నిక్కువ మేదియో చెప్పుడు. పతివ్రతయైన సునీతి మా అక్క యెక్కడనున్నది. అక్కలికి మా ప్రాణేశ్వరుని యిక్కట్టులకు సమ్మతించినదా! అచేడియ వాడుక పుడమిఅంతయు వ్యాపించినదే! అని అనేక ప్రకారముల దైన్యముగా బలుకుచున్న యాచిన్నదాని వచనంబులన్నియు విని యారాజు మాటలచేత దద్వృతాంతమంతయు దేటపరచుకొని విభ్రాంతచిత్తుండై యున్మత్తుని క్రియ నొక్కింతసేపూరకుండి శిరఃకంపము చేయుచు నాజేడియ కిట్లనియె.

సాధ్వీ! మీ మాటలన్నియు వినవిన మాకును బిచ్చి యెత్తుచున్నది. మా జయభద్రుడు మమ్ము విడిచి యెప్పుడు ఎచ్చటకిని బోలేదు. ఆతని నిత్యము చూచుచునే యుంటిమి. ఆదంపతులవలన దానములందిన విప్రకోటి నడిగిన దెలియక మానదు . అతండెన్నియో దేశములు దిరిగినట్టును నెన్నియో వ్యాపారములు చేసినట్లును జెప్పుచున్నాడు దానింబట్టి యున్మత్తుడని నిశ్చయించితిమి. నీవు యిప్పు డతని మాటలు స్థిరపరచుచుంటివి యిప్పుడేమియు దోచకున్నది. ఇదియొక యింద్రజాలమువలె దోచుచున్నది. కావున నీవు బాగుగా విచారించి యందలి నిక్కువము వక్కాణింపుమని అడిగెను.

అప్పు డక్కలికి ముక్కు మీద వ్రేలువైచుకొని యోహో! మీరిట్లీ రాజకుమారుని నిర్బంధించుట ఇందులకా, కటకటా! అంత మాత్రమునకే అట్లు చేయవలయునా. ఇంచుక నిదానింపరాదా? ఆయన మాటలు సావధానముగా, వినగూడదా, అన్నన్నా! యెంత పనిచేసిరి. యిప్పుడైనను వడిగా బంధవిముక్తిని జేయుడు. అని మిక్కిలి తొందరపెట్టగా రాజశాసనంబునంజేసి కింకరు లప్పుడే ఆతని కట్లు విప్పి చెరసాలనుండి తప్పించిరి. సాధ్వీమతల్లియైన సునీతిని నిరసించి వేశ్యాలోలుండైన జయభద్రుని దుష్కార్యదోషంబాజం ధనరూపంబున బరిణమించినది.

అట్లు బంధవిముక్తుడయి జయభద్రుడు తండ్రింజూచి ఆర్యా! మీరు సెప్పెడి మాటలు నాకు వింతగా నున్నవి. నేనెప్పుడు మీ దగ్గరనే యున్నట్లు చెప్పుచున్నారు కదా. తార్కాణ మొక్కడు జూపింపుడని అడుగగా అచ్చట నున్న వారందరు ప్రతి దినము మిమ్ము మేమిచ్చట జూచుచున్న వారమని యేకవాక్యముగా బలికిరి.

మఱియు ఆతండు బ్రాహ్మణులకు వ్రాసియిచ్చిన దానశాసనములం జూపిరి స్వహస్తలిఖితాక్షరములతో నున్న యా శాసనములం జూచి జయభద్రుడు మిక్కిలి వెరగందుచు దన్ను గుఱించి వారు పడిన భ్రమ అంతయు గర్హితము కాదని పలుకుచు హైమవతిం జూచి యిది యేమి చోద్యమని అడిగెను.

బుద్ధిమంతురాలగు నాప్రోయాలు చక్కగా నిదానించి ప్రాణేశ్వరా! ఆ విషయము దెలిసికొనుటకు నాకొకదినము గడువియ్యుడు రేపంతయు అరసి చెప్పెదనవి పలుకగా వల్లెయని అందరును తమ తమ నివాసములకు బోయిరి.

జయభద్రుడు హైమవతితో గూడ సునీతి మేడకు బోయి యక్కాంతామణిచేత అర్చితుండై తాను వేశ్యాగృహము విడిచినది మొదలు తిరుగవచ్చువరకు జరిగిన కధ అంతయు నాయింతి కెఱింగించెను. ఆలలనయు, అతని చరిత్రము విని, డెందం బాందోళనమంద పాతివ్రత్యవ్రతభంగభీతి నాతురత జెందుచున్న జూచి ఆమెతో హైమవతి యిట్లనియె.

అక్కా! నీయుదంతమంతయు నాకు చెప్పుము. జయభద్రుండే దినమున నీ యొద్దకు వచ్చెనో యాదినము మొదలు నిత్యము జరుగుచున్న చర్యలం దెలుపుము. నడుమ విశేషము లేమైనంజూచినం దాచవలదని అడుగగా నా సతీమణియు భగవం తునికి నమస్కరించి యిట్లనియె. చెల్లెలా! నావల్లభుని పాదపద్మము నుల్లమునం బెట్టుకొని దైవముఖము సూచుచు నిక్కము వక్కాణింపుచున్నదాన. నా ప్రియుండు మొదట వేశ్యాలోలుండై నాయం దప్రియుండై యుండె. దానికి సుమిత్రుండె సాక్షి ఒక్కనాడు భ్రమరిక అను నాచేటిక వశ్యౌషధి యొకటి దెచ్చి నా కిచ్చి మగని శిరంబున నిడుమని చెప్పినది నేనును మొదటి నట్టి ప్రయత్నముతో బోయితినిగాని యమ్మనోహరునిం జూచినంత వెరపున నామం దిడక మరలి వచ్చి అప్పసరు నొకపుట్టలో బోసితిని.

ఆ రాత్రి అది యేమిమహిమయో తెలియదు. నామనోహరుడు చక్కనివేషముతో నాయొద్దకు వచ్చి నా యిష్టముల దీర్చెను. అది మొదలు ప్రతిదినము వచ్చుచు రత్నమండనముల దెచ్చి నాకిచ్చుచు నా అభీష్టములు దీర్చుచుండెను. మఱికొన్ని దినము లఱిగినంత సంతతము నాయొద్దనే నివసించి నేను గోరిన వస్తువాహనము లిచ్చుచు విప్రకోటిం దనుపుచుండెను

మఱియు నడుమ నొక్కవిశేషము గంటి నాకర్ణింపుము. నే నొక్కనాడు రతిక్రీడల నలసి సొలసి నిద్రించితిని ఎద్దియో యకారణముగా నాకు మెలకువ వచ్చినది. అప్పుడు నేను లేచి చూచువరకు నామనోహరుడు శయ్యపై సహస్రముఖముల శేషుడువలె తోచి యుండెను. అప్పుడు నేను భయపడుచు గన్నులు మూసికొని యుచ్చస్వరంబున నరచినంత నొయ్యన నతండు లేచి యథాప్రకారరూపముతో నొప్పుచు “ఏమి! ఏమి! కామినీ! అట్లడలెదవని నన్నూరడించెను. '

నేనును గన్నులు తెరచిచూడగా బూర్వపురూపమే అగుపడెను. కాన వెర పుడిగి దరికరిగి ప్రాణేశ్వరా! మీకు నిద్రలో నట్టి వికృతరూవము వచ్చుటకు గారణ మేమని అడిగితిని అప్పు డాయన నవ్వుచు జవ్వనీ! అది నా వికృతరూపము కాదు. నీవు నిద్రలో లేచి యట్లు చూచినట్లు పలవరించితివి. స్వప్నములో ననేక వికృతాకారములు గనంబడుచుండును. దానికి శంకలేల? భయము విడువుము. అని నన్నూరడించెను.

నేనును నట్లు కాబోలు ననుకొని యధాప్రకారము పతిసేవజేయుచుంటిని. ఇంతకన్న నేవిశేషము చూచి యెఱుంగను. మీతో నిజము చెప్పితివి. తరువాత మీకెట్లు తోచిన నట్లు తలంచుడని పలికెను.

సునీతి మాటలు విని హైమవతి, శిరఃకంపముజేయుచు ప్రాణేశ్వరా! నిక్కము దొరికినది. సునీతియెడ నించుకయు దోషములేదు ఆ సాధ్వీమణిని నిందించినవారికి గన్నులుపోగలవు. ఈ యింద్రజాల మంతయు వశ్యౌషధిమహిమ వలనం బుట్టినది. ఆ సునీతి విఖ్యాతికిని అదియే కారణము. ఆపస రీబిసరుహాక్షి పుట్టలో బోసినప్పుడు పాతాళలోకవాసిఅగు శేషుని శిరముపై బడనోపు దాన వశ్యుండై కామరూపంబున నతండు వచ్చి యిమ్మచ్చెకంటిం సంతోషపరచుచున్నవాడు. సామాన్యపురుషుల కిటువంటి దివ్యరత్నభూషణము లెచ్చట లభ్యమగును, నిద్రాసమయమున గామ రూపము నిలువదు. కావున సునీతి కట్టివేళ నిజరూపము గనంబడినది. నానుడివినదంత నిక్కువము మీరు వచ్చినంత బీటలమీద నంతర్ధానమైపోయెను. దేవతాసంపర్కంబున స్త్రీలకు ప్రతభంగము కానేరదు. కావున సునీతి నిర్దోషురాలుగా స్వీకరింపవచ్చునని యాబుద్ధిమంతురాలు జరిగిన స్థితియంతయు, జూచి నట్లు చెప్పినది. అప్పుడందఱికి మేనులు గఱుపు జెందినవి అప్పుడు జయభద్రుడు మిక్కిలి సంతోషించుచు సునీతిని నిర్దోషురాలిగా నెంచి యాయించుబోడిని మన్నించి యక్కునం జేర్చి యుపలాలనము సేయుచుండెను.

అప్పుడా వార్త అంతయు గ్రామములో వ్యాపించుటచే నెల్లరు నద్బుతముగా జెప్పుకొన దొడంగిరి. మరియు గొందఱు మంచిగాను గొందరు చెడ్డగాను ఆవార్త జెప్పుకొనుట విని సునీతి మిక్కిలి పరితపించుచు అయ్యో! నేనెంత దోషకారినైతిని. పూర్వజన్మమునందేమి దుష్కార్యము జేసితినో! ఇంతకుమున్ను నన్నుత్తమరాలుగా జెప్పుకొనిన ప్రజలు ఆనోటనే దుష్టురాలిగా నుడువుచుండిరి. సీ! ఇట్టి నిందాపాత్రమైన జన్మము భరించుటకన్న నీచమున్నదియా? అవును తర్కింపగా శేషుడుమాత్రము పరపురుషుడు గాడా పరపురుషసంపర్కమున అపవిత్రమైన శరీరమును అగ్నిలో బడవైచి శుద్దిగావించెద ననుజ్ఞయిండు అని దుఃఖించుచు వల్లభుని పాదంబులంబడి వేడుకొనదొడంగినది.

జయభద్రు డాసాధ్వీమణి యుద్యమమును మానిపింప నెంతేని ప్రయత్నము జేసెను కాని యేమియు బ్రయోజనము లేకపోయెను.

అప్పడతి యొడయనింజూచి యార్యా! ఈవిషయమున మీరేమియు నడ్డు సెప్పవలదు. నేను త్రికరణములచేతను మీ పాదములనే నమ్మియుంటినేని అగ్ని నన్నేమియు జేరనేరదు. కళంకము గలిగెనేవి దగ్ధము గావించును. ప్రజల నిందావాక్యముల నేను భరింపలేను. పైడియొక్క గుణాగుణంబులు అగ్నివలననేకదా దెలియుచున్నవి. అట్లే మదీయబుద్ధినైర్మల్యము తన్ముఖమున దెలసికొనవచ్చును. చితి యేర్పరపింపుడు మీపాదములు నమ్మియున్న నన్ను గరుణింపుడని అనేక ప్రకారముల వేడికొనియెను.

అప్పుడు జయభద్రుడు ఆపట్టణపుకోట ముంగల మంచిగంధపుదారువులతో జితి బేరిపించి యావార్త పురమంతయు జాటంబంచెను. అప్పుడు పౌరులు గుంపులు గుంపులుగా గూడుకొని యాసునీతి నీతివిశేషమునకు మెచ్చుకొనుచు జూడవచ్చిరి. మఱియు సామంతులు మంత్రులు బంధువులు హితులు పురోహితులు మొదలగు వారందఱు చుట్టును బరివేష్టించి యావింత జూచుచుండిరి.

అప్పుడా చితిని బ్రజ్వరిల్లంజేసిరి. పిమ్మట సునీతి జలక మాడి గంధమాల్యానులేపనములు ధరించి బ్రాహ్మణులకు అనేకదానములు గావించి వారి యాశీర్వచనములందుచు వచ్చి సూర్యునికి నమస్కరించి యాచితిచుట్టు ముమ్మారు వలగొని అందులో దుమికినది. ఆసతీమణి పాతివ్రత్యమహిమచే అగ్నిలోబడియు దగ్ధముగాక మెఱుగు పెట్టినబంగారమువలె నొప్పుచు నెల్లరకు దనచిత్తనైర్మల్యము వెల్లడిచేయుచు అయ్యగ్ని చల్లార్చినది. అప్పుడు ప్రజలు కరతాళములు తట్టుచు జయజయధ్వనులు గావించిరి.

అప్పుడు సీతవలెనే పాతివ్రత్యమహిమచే ప్రకాశింపుచున్న యాసునీతిని జయభద్రుడు మిక్కిలి సంతోషముతో బోయి చేయిపట్టుకొని యెల్లరు చూచుచుండ గోటలోనికి దీసికొనిపోయెను. ఆమెను బట్టమహిషిగా జేసికొని హైమవతి యుపచారములు చేయుచుండ నిరువురు భార్యలతోడను అతండు పెద్దకాలము పుడమి సౌఖ్యముల బొందగలిగెను.

వత్సా! నీవు చూచిన చిన్నది యాసునీతి. ఆనాటి పాతివ్రత్యమహిమచే అగ్నిలో బడినను దగ్దముకాక నిలిచినది. ఈ కధావిశేషము వినినవారికి నాయుర్భాగ్యములు వృద్ధియగు నిక లెమ్ము వంటచేసికొని భుజింపవలయు నని చెప్పిన వాడు మిక్కిలి సంతసించుచు అయ్యతీశ్వరుని అనేకప్రకారముల స్తుతిజేసెను. పిమ్మట మణిసిద్ధుండు లేచి స్నానముజేసి వంటచేసికొని భుజించి వానికి పెట్టి సంతుష్టి వహించి తదనంతరప్రదేశమునకు బయనమయ్యెను.