కాశీమజిలీకథలు/మూఁడవ భాగము/20వ మజిలీ

వికీసోర్స్ నుండి

హైమవతి కథ

20వ మజిలీ

వత్సా! విను మప్పు డప్పడంతియు నతని వృత్తాంతము వినుటచే దన హృదయపరితాప మభివృద్దియైనట్లు సూచించుచు, దీర్ఘనిశ్వాసమారుతములచే వాతెరపోడిమి చెడ గన్గొనలఁ గ్రమ్మిన నశ్రుజలమ్ము గొనగోరఁ జిమ్ముచుఁ బికస్వరముతో మెల్లన నిట్లనియె.

ఆర్యా! సైంధవలవణమును, ఆటవికామలకమును గలసినట్లు విధి విచిత్రసంఘటనల గావింపుచుండును. ఒకానొకప్పుడు దుఃఖము సుఖమునకును, సుఖము దుఃఖమునకునుఁ గారణమగునని చెప్పిన పెద్దలమాటలు నిక్కువములగును. నా వృత్తాంతము వినుటచే నార్యునకు విస్మయమును, సంతాపమును గలుగకమానదు. ఆర్యుని కులశీలనామములు వినినదిమొదలు నాహృదయపరితాప మటమటమైనది. విపత్తులయం దాప్తులు గనఁబడిరేని చింతవాయునుగదా. దేవరతండ్రి కుంతిభోజుడు మత్పితృసఖుఁడగుట నార్యునగు సైతము విదితముకాఁగలదు.

వినుడు మాతండ్రిపేరు మంత్రపాలుడు. మాకాపురస్థలము మగధదేశ రాజధానియైన యమరావతి. మాతల్లి పేరు చంద్రమతి. మాతండ్రి ధర్మంబున రాజ్యంబు సేయుచుండ, లేకలేక, యీశ్వరీకటాక్షంబున నేనుదయించితిని. దానంబట్టి నాకు హైమవతియను పేరుపెట్టిరి. నేను జనించినప్పుడు మజ్జననీజనకులకును బౌరులకును రాష్ట్ర ప్రజలకును గలిగిన యానంద మేమియందును!

మంత్రపాలు డుత్తమబ్రాహ్మణుల కనేకదానములు గావించెను. బాల్యంబుననే నా యాకృతివిశేషము జూచి బంధువు లచ్చెరువు నొందుచుండిరట.

అప్పటినుండియు మాతండ్రికి నావివాహవిషయమై చింత యంకురించియే యున్నది. కావున మదీయప్రాయముతోగూడ నదియు నభివృద్ధినొందదొడంగినది.

దానంజేసి నాకు మాతండ్రి తగినవరునరయుటకై అనేకదేశములకు చిత్రపటములు పంపదొడంగెను. మఱియు నేను సమారూఢయౌవననై యున్నతఱి బ్రసిద్దిచెందిన రాజకుమారుల లెక్కగొనినప్పుడు మిమ్ముంగూడ గణియించినట్లే జ్ఞాపకము వచ్చుచున్నది. మీ చిత్రపట మిదివరకు నేను జూచితిని నేను సమ్మతించి మజ్జనకున కెఱింగించినంత వారును సంతసించుచు మిత్రుండైన కుంతిభోజునకు వార్తనంపదలంచి నంతలో మీకు మఱియొకచోట వివాహము నిశ్చయించినట్లు తెలిసినది.

అప్పుడు నేనును మా తల్లిదండ్రులును మిక్కిలి పశ్చాత్తాపము చెందితిమి. తరువాత దూతలను దేశములన్నియుఁ ద్రిప్పినంత గళింగదేశప్రభువగు వీరపాలునికుమారుడు గుణవర్మయనునాతడును, లాటదేశప్రభువగు సూరపాలుని కుమారుడు ధనవర్మయను నాతడును దగినవారని నిశ్చయించి యాదూతలు వారివారి చరిత్రములతోగూడ జిత్రపటములు దీసికొనివచ్చిరి. మాతండ్రి వానినెల్ల నందికొని మాతల్లిం జీరి నాసమక్షమందు నారాజకుమారులచరిత్ర మిట్లు చెప్పదొడంగెను.

ఇంతీ! యీతండు కళింగదేశరాజు వీరపాలుని కుమారుడు వీనిపేరు గుణవర్మ వీడు సమస్తశాస్త్రములు సాంగముగా గ్రహించినవాడు రూపంబున మన్మథునిసై తము దిరస్కరించునని చెప్పవచ్చును. వీనిస్థితి ప్రస్తుతము సామాన్యముగా నున్నదట. దేశము ఫలవంతమైనది కాదు. కాపులవలన సమముగ సొమ్మువచ్చుటలేదు. దానధర్మముల మూలమున నాదాయముకంటె వ్యయ మెక్కువైనందున కొంచము ఋణము గలిగియున్నదట.

మరియు రెండవవాఁడు లాటదేశమహారాజు శూరపాలుని కుమారుఁడు ధనవర్మ. ఈతడు రూపంబున సామాన్యుడు. విద్య యేమియును లేదు. రాజ్యభూమియంతయు ఫలవంతమైనది ధనమున గుబేరునితో సముడని చెప్పవచ్చును. ఈయిరువురిలో నుత్తముడెవ్వడో నిరూపించి చెప్పుము వారికి వర్తమానము బంపెదనని అడుగగా మాతల్లి యొక్కింత ధ్యానించుచు మాతండ్రి కిట్లనియె.

ఆర్యా! సర్వజ్ఞులైన మీకంటె నేనెక్కుడెఱుంగుదునా. అయిన నడిగితిరకాన నాకుం దోచినది చెప్పెదను.

శ్లో॥ కన్యావరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం
     బాంధవాః కునమిచ్ఛంతి మృష్టాన్న మితరేజనాః ॥

అని చెప్పినచొప్పున గన్యరూపమును, తల్లి ధనము, తండ్రి విద్యయుం గోరుదురను శాస్త్రము మీరెరింగినదె అదియుగాక ధనములేక యెన్నిగుణములున్నను, ఎంత విద్య యున్నను, ఎట్టిరూపమున్నను, వ్యర్ధము. ధనముగలవాడే పండితుడు. ధనికుడే కులీనుడు. భాగ్యవంతుడే దాత. శ్రీమంతుడే వక్త. వేయునేల సకలగుణములు ధనమునందే యున్నవి. ధనములేని విద్యయు, నైశ్వర్యములేని రూపము, విత్తము లేని గుణములును, శోభింపవు కావున ధనవర్మనే మన హైమవతికి మగనిగా నేర్పరపుడు అని చెప్పగా విని మాతండ్రి నవ్వుచు ఓహో! స్త్రీస్వభావము వెల్లడిచేసితివి గదా! ఇదివరకు విద్యాధనముల విషయమై పెక్కండ్రు తర్కించి ధనముకన్న, విద్యాధనమేయధికమని స్థిరపరిచిరి. సమస్తదేశమాననీయ మగు విద్యకన్న ధనమెక్కుడా? ఎంతధనమున్న నేమి, విద్యాగంధము లేనివాడు ద్విపాదపశువు. విద్యవలన దెలివి యభివృద్ధియగు తెలివిగలవా డెద్దియోమార్గమున ధనము సంపాదించుకొనగలడు. అపండితునియొద్ద నున్నవిత్తము రిత్త యైనచో మరల నెప్పటికిని సంపాదింపబడదు దీనిగుఱించి పూర్వ మొకపండితుడు పరీక్షించి ధనికునికన్న విద్యాధికుడే యధికుడని గ్రహించెను.

చంద్రమతీ! ధనవర్మ యెంత ధనికుడై నను విద్యాశూన్యుండగుటచే మాననీయుడు కాడు. ధనహీనుడై నను, గుణవర్మకే మనపట్టి నిత్తము. నీవు సమ్మతింపుమని పలుకగా విని మాతల్లి ప్రాణవల్లభున కిట్లనియె.

ఆర్యా! మీరెన్ని సాదృశ్యములు చెప్పినను నాకొప్పిదములు కావు. ధనాగమనమునకు విద్యయు గౌరణముకాదు. అదృష్టము ముఖ్యము. దానిబట్టియె లాభాలాభములు గలుగుచుండును. "విద్యత్సుదారిద్రతా" అను నార్యోక్తి వినరా! విద్వాంసులే తఱచు దరిద్రులైయుందురు. నాకు మనపట్టిని గుణవర్మకిచ్చుట యెంత మాత్రము సమ్మతములేదు. ధనవర్మకే యియ్యవలయునని పతి కెదురుకొని యుత్తరము జెప్పినది.

తన్మూలముగా నాదంపతులకు బెద్దతడవు వాదము జరిగినది. అప్పుడు భార్యపై గోపము వచ్చి మాతండ్రి యామె చెప్పిన మాటలు లక్ష్యము సేయక అప్పుడే గుణవర్మకు నన్నిత్తునని గుణవర్మ తండ్రి వీరపాలునికి శుభలేఖ వ్రాయించెను. మాతల్లి చంద్రమతియు ధనవర్మ తండ్రి శూరపాలునికి నీకుమారుడు ధనవర్మకు నాకూతు నిత్తుననియు ముహూర్తమునాటికి రహస్యముగామీరువచ్చి నిరూపింపబడిన గృహమునం దుండవలయుననియు చేటిక చేతికిచ్చి యచ్చిగురుబోణిని మీయొద్ద కనిపెదననియు మీరు వివాహము జేసికొని తీసుకొని పోవలయునని ప్రచ్ఛన్నగా శుభలేఖ వ్రాయించినది.

ఆయిరువురు మదీయసౌందర్యవిభవాతిశయములు విని యెట్లైన నాపడుచును పెండ్లియాడినంజాలు నని యున్నవారు కావున నట్టిశుభలేఖ వచ్చినతోడనే సంతోషించుచు నందు నిరూపింపబడిన శుభముహూర్తము కిరువురు నాపట్టణములోనికి వచ్చిరి.

మాతండ్రి వీరపాలునికి పరివారముతోగూడ దగిన విడిదెల నియమించి మించినసంతోషముతో లుపచారములు చేయింపుచుండెను.

మాతల్లి రహస్యముగా వచ్చియున్న శూరపాలుని వార్తవిని సంతోషించుచు గూఢముగానే విడిదినియమించి అందు బ్రవేశపెట్టి ముహూర్తకాల మరయుచుండెను.

ఆముహూర్తము వేకువజామున నిశ్చయింపబడినది. కావున రాత్రి పడినతోడనే వీరసేనుడు మెండువైభవముతో బెండ్లికుమారుని బల్లకిలో నెక్కించి దీపికాసపుంజమున రా వెలఁగ వేణువీణాపటహాది వాద్యఘోషముచే నాకసము బీటలువార, వారాంగనానృత్యగానవినోదములతో నూరేగింపుచుండెను.

శూరపాలుడు సైతము పేరుసెప్పక తనకుమారు నొక పల్లకిలో నెక్కించి తగువైభవముతో నేగి పెండ్లి ప్రయత్నము చేయింపుచుండెను.

జయభద్రా! నేనేమని చెప్పుదును? ఆట్టిసమయములో నన్ను బెండ్లికూతురుగా జేసి వింతనగలచే నలంకరించిరి. మఱియు మాతల్లి నన్ను జీరి రహస్యముగా నిట్లనియె.

అమ్మా! ని న్నొకదరిద్రుని కిచ్చి మీతండ్రి నీగొంతువు గోయదలంచుకొన్నారు. నిన్ను కడుగారాముగా బెంచితిని. ఆదరిద్రమెట్లు సైరింతువు. ఇందులకు వేఱొక యూపాయ మాలోచించితిని. వినుము నీవిషయమై శూరపాలుని కుమారుడు ధనవర్మను రహస్యముగా రప్పించితిని. అతని భాగ్యాతిశయము నీవు వినియేయుందువు. వారిప్పుడు నాపేరగట్టిన సత్రములో బీటలు వైచుకొని సిద్ధముగానున్నారు. నీకొఱకు పుట్టిక నల్లించితిని. దానిలో గూర్యుంటివేని చేటికి నెత్తిపై నిడుకొని యచ్చటికి దీసికొని పోగలదు. పైకిజూడ దమలపాకుతట్టవలె దోచును. ఇమిడిగా నుండుటచే నీవు దానిలోనున్నట్లే తోచదు. నీకును శ్రమముగాఁ నుండదని చెప్పిన విని నేను స్త్రీనే గనుక స్త్రీచాపల్యం బెట్లు వొడమకుండును?

ఆమె మాటలు తీసివేయలేక నేనందులకు సమ్మతించితిని. ఇంతకు దైవమిట్లు చేయదలచికొనియుండ వేఱొకబుద్ది యెట్లుపుట్టును.

మాతల్లియు, సుముహూర్త మాసన్నమగుచున్నదని యాప్తుడగు దైవజ్ఞుడు చెప్పినంత న న్నాగంపలో నిమిడికగా కూర్చుండబెట్టి సన్నని మూతిపై మూతగట్టి యొకదాది నెత్తిమీద బెట్టి యా సత్రమున కనిపినది.

ఆకుసూలమునకు రంధ్రములు గలిగియుండుటచే లోపలకు గాలి వచ్చుచున్నది. దానంజేసి నాకేమియు గష్టముగా లేదు. తరువాత నాదూతిక యాగంప నెత్తిపై నిడికొని యాకోటదాటి వీథివెంబడి యరుగుచుండెను.

కోటసింహహద్వారమున గాపున్న రాజకింకరులు దానిని రాణిగారి చేటికగా నెఱిగియున్న వారగుట బ్రశ్నచేయక పోనిచ్చిరి.

అట్లది నన్ను నెత్తిపై నిడికొని యొకవీధిఁ బోవుచుండగా నప్పుడఁ దొకచోట హటాత్తుగా నిండ్లంటుకొని చటచ్చటారావములతో మంటలు నలుదెసలం గ్రమ్ముచు భువనభీషణమై యొప్ప నప్పుడు పౌరుల హాహాకారనినాదములు భూనభోంతరాళములు నిండినవి మఱియు నాప్రాంతమందుగల గృహములలోనున్న వస్తువాహనసామగ్రి అంతయు నారాజమార్గమున జేర్చుచుండిరి.

దానంజేసి యావీథియంతయు గృహోపకరణములచే నిండి యడుగిడుటకు తావులేకపొయినది. అట్టియలజడిలో నాదూతిక గంప నెత్తిమీద బెట్టికొని జనులను దప్పించుకొనిపోవుచుండగా రక్షకపురషులు దానింజూచి అనుమానము జెందుచు అగ్నిభయమువలన మార్గమున నిడిన గృహస్థుల సామాగ్రిలోని గంపనెత్తుకొని పోవుచున్నదని నిశ్చయించి నీవెవ్వతవు? ఈగంపలోనిది యేమి? యెచ్చటికిగొని పోవుచుంటివని అడిగిరి. అప్పుడది దద్దరిల్లుచు నొకమాటకు వేఱొకమాట జెప్ప దొడంగినది. దానంజేసి, దానిని దొంగగా నిశ్చయించి యాగంప లాగికొని యా వీధిలో నొకచోట బెట్టించిరి. అదియు దండనభయమువలన నిజముజెప్పక యాసంవాదములో నెట్లో పాఱిపోయినది. ఆరాజభటులు నాగంపనంతగా విమర్శింపక అగ్నిజ్వాలలచే నావృతములగుచున్న భవనములను గాపాడుటకై తొందరగా బోయిరి.

ఆచిత్రమంతయు రంధ్రములనుండి నేనుజూచుచునేయుంటిని. అప్పుడు నేను గర్తవ్య మరయలేక నిభ్రాంతనై యాచేఁటిక మరలవచ్చి తీసికొని పోవునేమోయను నాసతో నుంటిగాని దానిఁజాడ యెప్పటికిని గనంబడినదికాదు. ఇంతలోఁ గొందఱు పురుషులు గుర్రముల నెక్కి యాదారిం బోవుచు నేనున్నచోట నిలిచి అందున్న గృహస్థుల పెట్టెలు కొన్ని చిక్కములో నిమిడ్చి తమ గుఱ్ఱములపై వైచుకొనిరి. వారిలో నొకఁడు నేనున్న గంపనెత్తిచూచి బరువుగానున్నదిరా అని పలుకుచు నొక చిక్కములో నిమిడ్చి తన గుర్రముపై వైచుకొని యా గుర్రమెక్కి వడిగా దోలుకొని పోవుచుండెను. మఱియునొకమూల నగ్నిజ్వాలలెక్కువయయ్యెఁ గావున జను లందఱు నాసందడిలో నుండుటచే దొంగల విమర్శింపఁ దటస్థించినది కాదు.

అట్లు వాండ్రందఱును గుర్రములను వడివడిగాఁ దోలుచు నొక అరణ్య మార్గంబునం బడి పోవుచు నొండొరు లిట్లుసంభాషింపుకొనిరి.

ప్రధముఁడు -- ఓరీ! మనము వచ్చినవేళ మంచిది సుమీ ? యిండ్లంటుకొనక పోయినచోఁ బెండ్లివారింత అశ్రద్ధగానుండరు అప్పుడు వారిమందరము లింతసులభముగా దొరకవు.

ద్వితీయుఁడు -- అగును. ఇండ్లంటుకొనినది పెండ్లివారిమూలముననే. ఏవిచ్చుబుడ్డిరవ్వో తగిలి అగ్ని ప్రజ్వరిల్లినది. ఎట్లైనను పెండ్లి సమయములలో దొందరగా నుందురులే.

తృతీయ - మనవేషములు చూచి మనలను దొంగలని యెవ్వరును గురుతు పట్టలేరు. పెండ్లివారే యనుకొందురు. రాణిగారి సత్రములో నెవ్వరో పెండ్లివారున్నారు చూచితిరా.

ద్వితీయ - చూడకేమి, నా గుర్రముపైనున్న మందసములు అచ్చటివే అగుంగాని వారి జాడ భాగ్యవంతులువలె దోచుచున్నది. మేళతాళములు లేమియును లేవేమి?

తృతీయ - అందఱును వృధాగా రొక్కము వ్యయపెట్టుదురా? ఆ పెండ్లికొడు కేమియుఁ జక్కగాలేడు సుమీ.

ద్వితీయ — రాజుగారు కూఁతురునిచ్చే పెండ్లికుమారుఁడు మంచి చక్కనివాడు కాని వస్తువాహనము లంతగానున్నట్లు తోఁచదు.

తృతీయ - సత్రములోనున్న పెండ్లివారెవ్వరింటికి వచ్చిరి?

ద్వితీయ - ఏమో. అది యెవ్వరికి గావలయును మనము బంధువులవలెఁ బోయి కొంపముంచితిమి గదా?

తృతీ - ఆ మాత్రము తెలిసికొనలేక పోయిరేమి?

ద్వి - క్రొత్తవాండ్ర కేమి తెలియును. మేము రాజభటులమని చెప్పినతోడనే కాబోలు ననుకొన్నారు.

తృ - మనల వెనుక తరుముకొని రారుగదా?

ప్రధమ - అబ్బో! మనమిప్పు డెంతదూరము వచ్చితిమనుకొంటివి? పది యోజనములు వచ్చితిమి అదియునుంగాక నీ అడవిలోదారి తెలిసికొనగలరా? మన కలవాటుగనుక సులభముగా వచ్చితిమి.

ద్వితీ - మనము పోవలసిన తావింకెంత దూరమున్నది.

తృతీ - మనకు గమ్యస్థానమొకటిగలదా? ఎచ్చట తెల్లవారునో అచ్చటనేయీ పెట్టెను విడగొట్టి సొమ్ముపంచుకొని యిండ్లకు పోవుదము.

ప్రధమ - ఇచ్చటగూడ జనులుందురు. తెల్లవారినచో నిచ్చట నెవ్వరేని చూచిరేని శంకింతురని నాయభిప్రాయము. తెల్లవారక పూర్వమే సొమ్ము పంచుకొనిన జక్కగా నుండునని యున్నది.

తృతీ - ఇప్పుడు తెల్లవారుట కెంత ప్రొద్దున్నది?

ప్రధమ - ప్రొద్దెక్కడ. తూరుపు తెల్లవారుచుండగనే, అదిగో! చూడుము వేగుచుక్క పొడిచినది.

తృతీ - అట్లయిన నిచ్చట బయలుగానున్నది. అందఱికి కేక వైచి చెప్పుడు ఇచ్చోట నిలిచి పెట్టెల శోధించి సొమ్ముదీసికొందము.

ద్వితీయ - అలాగుననే అనిపలికి అందఱకు దెలియ జేసెను. అప్పుడందఱు గుర్రముల నాపి దిగి యాచిక్కములన్నియువిప్పి పెట్టె లొకచోటకు దెచ్చిపెట్టిరి.

వాండ్రమాటలను చర్యలంజూచినంత నాస్వాంతమున నెట్లుండునో చింతింపుడు. అప్పుడు నేను మనసురాయిచేసుకొని ధైర్యమవలంబించుచు నిట్లు తలంచేతిని

శ్లో॥ నదైవం ప్రజ్ఞయాజాతు నచలోత్సాహశక్తిభిః
      న సహాయ బలై ర్వాపి కశ్చిదప్యతివర్తతే॥

లోకములో నెవ్వడును ప్రజ్ఞవలననుగాని ఉత్సాహశక్తి మొదలగు సహాయములవలనగాని, దైవము నతిక్రమించలేదు.

సుఖదుఃఖములు గలిగించు విషయమై దైవమునకు భారమేమియును లేదు. ప్రజ్ఞయు, శౌర్యమును, సంపదలకు గారణములని తలంతమన్నను ఒకానొకప్పుడు ప్రజ్ఞావంతులు శూరులును దుఃఖపడచుండుటయు మూర్ఖులు సుఖపడుచుండుటయుం దటస్థించుచున్నది. కావున సుఖదుఃఖములు దైవము గలుగ జేయుచున్నాడు. కాని వేఱొకటి కాదు. దీనికై విచారించిన నేమి లాభమున్నది.

ఆపత్తులయందును దైర్యమును విడువరాదనియుఁ బెద్దలు చెప్పుదురుకదా, ఇప్పుడు దైవము నన్నుద్దరింపఁ దలచుకొన్న మంచియే గలుగవచ్చును. కానిమ్ము తటస్థురాలివలె నాయవస్థ యంతయుం జూచుచుండెదనని యుపాధ్యాయుఁడు సెప్పిన నీతి అంతయు జ్ఞాపకము జేసికొనుచు మెడమీదఁ జేయు వైచుకొని యొంటిప్రాణముతో నుంటిని.

అట్టి సమయములో అందరు గుర్రములమీదనున్న పెట్టెలందింపుకొని అందున్న సువర్ణభూషణములు రత్నమండనములు, రాసులుగాఁ బోసికొని పంచుకొనుచుండిరి. మఱియు నన్నెక్కించుకొన్న రౌతు వెనుకటి దెస గుర్రము దిగి యేమిటికో అవ్వలకుబోయి మరల రాలేదు. దానంజేసి యాగుర్రము, అచ్చట నిలువక గ్రాసాపేక్షచేత నించుక తొలఁగి తరువులచాటుగా మేయుచుండెను.

వాండ్రందఱు పంచుకొను సమయములో మాగుర్రము రౌతుమాట విమర్శింపలేకపోయిరి. ఆ పెట్టె లన్నియు విడగొట్టి ధనము గోనెలలో నెక్కించుకొని వాండ్రందరు నాగుర్రములెక్కి యెచ్చటికో పోయిరి. అప్పటికి గొంచెము వెల్తురు వచ్చుచున్నది. కావున రంధ్రములవెంబడినేనది అంతయును జూచుచునే యుంటిని. నాగుర్ర మా ప్రాంతమందే యున్నది. కాని వాండ్రకు మాత్రము గనబడలేదు. వాడ్రందరు వెళ్ళినవెనుక నేను ఆ గుర్రపు రౌతు వచ్చునేమో యను వెఱపుతో జాము ప్రొద్దెక్కువఱకు గదలక అట్లే యుంటిని. ఆ గుర్ర మాయడవిలో మేయుచు అటునిటు దిరుఁగజొచ్చినది. కావున బైనఁబరువు లేనందున నొకచోట గంపకు గంప తగులుకొని యాచిక్కము జారి నేలంబడినది.

అప్పుడు నేను మెల్లగా మూత నెగద్రోసికొని యాగంపలోనుండి పైకి వచ్చితిని. అప్పుడు నాకు దిరిగి తల్లి గర్భమునుండి వెల్వడినట్లు తోచినది.

అప్పుడు నేను వెఱ వడఁచికొనుచు, నిర్జనమును, గ్రూరమృగ భూయిష్టము నయి యొప్పు అమ్మహారణ్యములో దారి అరయలేక యిటునటుఁ దిరుగుచుండఁగా నొకచోట నాగుర్రపురౌతు చచ్చిపడి యుండెను.

వాని విమర్శించి చూచునంత సర్పదష్టుండైనట్లు తోచినది. అప్పుడు నేను తలయూచుచు నాహా! దైవవియోగ మీపాటిది కదా?

శ్లో॥ సుఖంవా యదివాదుః ప్రియంవా యసి వా ప్రియం
     ప్రాప్తా ప్రాప్త ముపాసీత హృదయేనా పరాజితః।
     శోకస్థాన సహస్రాణి భయస్థాస శతానిచ
     దివసె దివనెమూఢ మానిశంతి నవందితః॥

సుఖమైనను, దుఃఖమైనను, బ్రియమైనను అప్రియమైనను తటస్థించినప్పుడు బుద్దిని బ్రమాదము నొందనీయక తజ్ఞత్యములైన శోకసంతోషముల నొందగూడదు.నిత్యము మూర్ఖుడు యేమిటికో చింతించుచునే యుండును. ప్రాజ్ఞుడట్టి భయము నొందడు సుఖము దుఃఖాంత మనియు బెద్దలు జెప్పియున్నారు. కావున నేనిప్పుడు విచారించినంబ్రయోజనములేదు. దైర్యముతో నీ అడవియంతయుం దిరిగెదనని తలంచుచు నా ప్రాంతమందు గ్రుమ్మరుచున్నంత విడగొట్టిన పెట్టెలు గనంబడినవి.

అచ్చటికిఁ బోయిచూడఁ బెక్కు మందసములు విలువగల పుట్టములు నా పెట్టెలలో జిక్కియున్నవి. వానింజూచి నేను మిక్కిలి యాశ్చర్యమందుచు విమర్శించినంత భక్ష్యములున్న గంపయొకటి కనంబడినది. నాకు మిక్కిలి యాకలిగా నుండుటచే సంతోషముతో వాని దిని యాకలి అడంచుకొంటిని. అమ్మహారణ్యములో అట్టియుపకారము కావించిన భగవంతున కనేకవందనములు జేయుచు నాకరుణాత్మునిపై భారమువైచి యెద్దియో యొక సన్ననిమార్గము గాన్పించుటయు దానింబడి కొంతదూరము పోయితిని.

మరియు నాయరణ్యమునఁ గ్రూరమృగముల ఘోషములు వెఱపుగొలుప నొకచోట నిలువంబడి వెనుకటి స్థితి తలంచుకొని నంత నాస్వాంతమున నిట్లు తోచినది.

ఏమేమీ! ఈ మహారణ్యమునకు నేనెప్పుడు వచ్చితిని! నిజముగా వచ్చితినా? లేదు. ఇదికల. కలలో సూర్యుడు కనంబడునా! నేనెవ్వతెను? హైమవతినే! మా వారందరు నెచ్చటికిబోయిరి? అయ్యో! నాకీరాత్రి బెండ్లి చేయుదురే. ఇదిగో! నా మేనంతయు శుభలక్షణములు గనంబడుచున్నవి. మాయంతఃపుర మెందుబోయినది. ఆ! తెలిసినది. భ్రాంతిపడి మఱియొకలాగునఁ దలంచుచుంటిని. యిది స్వప్నములో స్వప్నము. అరణ్యములోఁ గ్రుమ్మరుచున్నట్లు యింతకుముందు బెక్కుసారులు కలవచ్చినది. కాకున్న నేనీ కారడవిలోని కెట్లురాఁగలను? గాదు కాదు. మరల భ్రమసితిని. రాత్రి గుర్రపుదొంగలు నన్నుఁ తీసికొనివచ్చిరి. స్వప్నముకాదు. నిజమువలెనే తోచుచున్నది కటాకటా! యెట్టియాపద పాల్పడితిని. నన్నీ అరణ్యములో రక్షించువారెవ్వరు? నిష్కారణముగా నాచక్కని రూపమిక్కడి మృగముల పాలు చేయవలసివచ్చెనే. హా విధీ! నా బ్రతుకు నీకెంత బరువైనదిరా? నేను బూర్వజన్మమున నెట్టిపాపము గావించితిని. ఇట్టి దారుణకష్టములను గుడిపించుచుంటివే; యెప్పుడైనను గరుణించి యుద్ధరింపవా! దీనశరణ్యా! పరమేశ్వరా! కరుణాంతరంగితాంతరంగా అని అనేక ప్రకారము లాయడవి అంతయుఁ బ్రతిధ్వనులిచ్చు నట్లు యెలుగెత్తి ఏడువఁదొడంగితిని.

నాయరణ్యరోదనము వినువారెవ్వరు? నాకు నేను యుపశమించుకొని మరల ధైర్య మవలంబించి యొకదారిఁబడి యెచ్చటికో పోవుచుండ నాదండనున్న యొక పొదలోనున్న పులి నన్నుఁజూచి గాండ్రుమని అరచినది.

ఆ అరపుతోడ నా గుండె పగిలి ప్రాణము లెగిరిపోయిన నేలంబడి మూర్ఛిల్లితిని. ఆ పులి మొదట నన్ను మ్రింగినదే అనుకుంటిని. జామువఱకు నాకుఁ దెలివి వచ్చినదిగాదు. అప్పుడెచ్చట దాగియున్నవియో మొండిప్రాణములు తిరిగి శరీరములోఁ బ్రవేశించినవి. కన్నులు దెఱచి మెల్లగా లేచిచూచినంత నా వ్యాఘ్ర మచ్చట నూచదెబ్బతిని చచ్చియున్నది.

అప్పుడు నేను విస్మయసాగరములో నీదులాడుచు నాయూచవైచినవా రెవ్వరో అని పలుమూలలు బరికించుచున్నంత నొకదెసనుండి నల్లనిముఖమును చిఱువెండ్రుకలు గోరపండ్లు మిట్టగ్రుడ్డులుంగలిగి విల్లమ్ముల ధరించి యెవ్వఁడో వచ్చుచున్నట్లు కనంబడియెను.

వానిని మొదట నొకమృగమే అనుకొంటిని. ధనుర్బాణధారణంబునంజేసి మనుష్యజాతిలోనివాఁడని యూహించితిని.

నన్నుఁ బులివాఁత దప్పించిన భగవంతుని సంకల్ప మీతనిచేత జిక్కఁజేయుటకు గాబోలు, నడవిబోయనకు దయాపత్యములుండవు వీడు తప్పక నన్ను సంహరించును. కానిమ్ము ఎన్నిటికి విచారింతును? చావునకుఁ దెగించియున్న నన్నెవ రేమి చేయగలరు? అని మరల ధైర్యమవలంబించుచు వానిపై దృష్టిప్రచారములు వెలయింపుచున్నంత నయ్యాటవికుడు వడివడిగా నాయొద్దకు వచ్చెను.

నేనును వానింజూచి యించుక వెఱచుచు వెనుకటడుగులతో నోరసిల్లుటయు వాడదిచూచి వికృతస్వరముతో పెట్టా! ఎవ్వతెవు నీవు? ఈ అడవినడుమ కెట్లు వచ్చితివి? నీయూరెక్కడ అని అడగెను.

వాఁడడిగినమాటలు అంత స్పష్టములేకున్నను స్వభాషలోనివే అగుట నేను గొంత సంతసించి యోరీ! మాది అమరావతి; మాతండ్రిపేరు మంత్రపాలుఁడు నన్ను నిన్నరాత్రి గుఱ్రపుదొంగలు దీసికొనివచ్చి యీ అడవిలో విడిచిపోయిరి. దారితెలియక క్రుమ్మరుచుంటిని నీకుగావలసినంత ధనమిత్తును. నన్ను మాయూరు జేర్పగలవా? అని అడిగితిని.

అప్పుడువాఁడు నవ్వుచు పెట్టా! నీమాటలు నాకేమియుఁ దెలియలేదు. ధన మనగానేమి? మీయూరెచ్చటనో నేనెఱుంగుదునా? నిన్ను దొంగలేల తీసికొని వచ్చిరి? అని పలుకగా నేను వానికేమియు దెలియదనియు మృగతుల్యుడనియు నిశ్చయించి యాహారార్ధమై మూటగట్టి తెచ్చిన భక్ష్యములు విప్పి వానికిచ్చితిని.

వానిందిని వాడు గంతులువైచుచు పెట్టా! ఇలాంటిపండ్లు యేచెట్టున దొరికినవి? ఆ చెట్టు నాకుఁ చూపుము? మంచిరుచిగానున్నవి సుమీ? ధనమనగా నివియేనా యేమి? నిన్నెచ్చటికిం తీసికొని పోవలయునో చెప్పుము. నీవు మేనంబెట్టుకొన్నవి యేచెట్టు పూవులు? నీవు గట్టుకొన్న యాకు మంచి మృదువుగా నున్నదిగదా! ఈలాటివి మా అడవులలో లేవు మీఅడవి యెచ్చటనున్నదో చూపుదువా అనిపాకృతపు మాటలు పలుకగా నాకు నవ్వువచ్చినది. వాని చర్యలన్నియుఁ జూడ నాకప్పుడు ఋష్యశృంగుని చరిత్రము జ్ఞాపకమువచ్చినది వానికిఁ ఔర్వమను మాటయే తెలియదు. మహర్షితుల్యుడగు వానింగాంచినంత నాకుఁ గొంత దుఃఖము తగ్గినది. నేను వానింజూచి యోరీ? మీఅడవిలో నేమిదినియెదరు? నీకు నాలుబిడ్డలుగలరా? మీపల్లె యెక్కడన్నది? అని అడుగగా వాఁడు పెట్టా! మేము అడవిపండ్లను పచ్చిమాంసము దిని బ్రతుకుదుము. నాకుఁబిల్లలు లేరు. భార్యయున్నది. మాయూ రీప్రాంతమందే యున్నది. మాయింటికిఁ దీసికొనిపోయెదను. నాతోఁగూడ వచ్చెదవాయని అడుగగా నేనును వానిమాటలకు సంతసించుచు నాలాగే వత్తును పదయని పలికితిని.

వాఁడు మాట్లాడు మాటలలో బదింటికి నొకటిరెండు తెలిసినవి. నేను మీతో నిట్లు చెప్పుచుంటిని కాని వాఁడు మిక్కిలి వికృతముగా మాట్లాడెను.

వానితో నడుచునప్పుడు నడుమ పెట్టా! నీవు నాకిందాక యిచ్చినపండ్లు మఱిరెండు యియ్యవా అనిఅడుగగా నాకును వానిదైన్యమునకు జాలివొడముటచే నాయొద్దనున్న భక్ష్యము లన్నియు నిచ్చివేసితిని.

భక్ష్యములం దిని వాడువైచినగంతు లేమని చెప్పుదును. ఆ నాట్యము చూచితీరవలయును. అంతకష్టములో నున్నప్పుడును నాకుఁబట్టలేని నవ్వువచ్చినది పులివాతనుండి తప్పించిన యప్పుణ్యాత్ముని ఋణంబు నేనెట్లు తీర్చుకుంటును.

వాడు కొంతదూరము నాతో వచ్చి పెట్టా! నీమాటలసందడిలో బులిమాంసము మాట మరచిపోయితివి. నీవిచ్చటనేయుండుము నేనుబోయి యా పులిమాంసము గోసికొని వచ్చెదను. దానిచర్మము చలికాలములో మిక్కిలి యుపయుక్తముగా నుండును. ఆలాటి చర్మములు మాయింటినిండ నున్నవికాని యీనాఁడు దినుటకు మాంసమేది అని నాపెట్ట అడిగినచో నేనేమి చెప్పుదును. ఊరకపోయినచో నన్ను బాదగలదు. వేగమ పోయివచ్చెద ననుటయు భయపడుచు నిట్లంటి. ఓరీ !నేను నిన్ను విడిచి నేనొక్కరితను యిక్కడనుండలేను ఇచ్చట మృగములబాధ మెండుగా నుండినది. నీధనుర్బాణములు చూచి దరికిరాక పాఱిపోవుచున్నవి. నీతో వెనుకకు వచ్చుటకు గాళ్ళు నొప్పులుగా నున్నవి. ఆచోటు దూరముగానున్నది. నన్ను మీ యిల్లుజేర్చి తరువాత నీవువెళ్ళి మాంసము తీసికొనిరమ్ము. నాయందు దయయుంచి యీమాత్రముపకారము సేయుమని బ్రతిమాలుకొనగా నావనచరునికిని దయవచ్చి నాతో నిట్లనియె.

పెట్టా! అట్లైన నేనింటికి వత్తునుగాని నాపెట్టతో నేను బులినిం గొట్టినట్టు చెప్పకుము. చెప్పితివేని యూరకవచ్చితివేల యని నన్ను నాభార్య వింటిబద్దతో గొట్టును. ఏమియు దొరకలేదని బొంకెదను. నిన్ను జూచినది మొదలు నాకేమియో కనికరము పుట్టుచున్నది నీకొఱకే యిట్లు బొంకెదనని పలుకగా నేనును సంతసించుచు వల్లెయని వానితోఁగూడ నడవఁదొడంగితిని.

వాడును గొంతదూరము దీసికొనిపోయి యొకచెట్టుక్రింద నిలువంబడి ప్రాత తాటియాకులచే గప్పబడియున్న యొక డొంకఁజూపుచు నిదియే మాయిల్లని చెప్పెను.

అదిచూచి నేను విస్మయమందుచు అహో! భళిరే, బాగు బాగు వనచరా! నీయిల్లు చక్కగానున్నది. నీ పెట్ట యెచ్చటికిఁబోయినది? మీపల్లె యెందున్నదని అడిగితిని.

వాడు నా పెట్ట యీచుట్టుపట్ల నెచ్చటికో బోయినది. వచ్చు వేళయైనది. మా పల్లె యిదియే. ఇలాటి యిండ్లె; అవిగో! కనంబడుచున్నవి చూడుము. లెవ్వుచుంటి వేమి? చక్కగా లేవాయేమి? అనయడుగగా నేను ఓరీ! వర్షము వచ్చినప్పుడీ డొంకలలో నెట్లుండెదరు? మీకు జలిలేదా? అని అడిగితిని.

వాడు వర్షముగురియునప్పుడు మేము మృగచర్మములు గప్పుకొందుము. గాన మాకేమియు జలియుండదు. లోపలకురమ్ము. మాయిల్లు చూచెదవుగాని అని పలికి ద్వారమున కడ్డుగానున్న యాకులాగెను. అప్పుడు నేను వానితో లోపలికిబోయి చూడనేమియునులేదు. కొన్ని చర్మములు మాత్రము పఱువబడియున్నవి. అచ్చట నున్న దుర్వాసన పొలసుకంపు ఏమందును. నిమిషము నిలువలేకపోయితిని. వెంటనే వెలుపలకు వచ్చి కక్కుకుంటిని.

అదిచూచి వాడు అయ్యో! పెట్టా! నీకు జబ్బుచేసినదాయేమి మాగొట్టములో మంచితేనెయున్నది త్రాగుమని పలుకుచు నొక చెట్టున వ్రేలంకట్టిన వెదురుగొట్టము దీసికొనివచ్చి యా తేనె కొంత యిచ్చెను.

నేను మిక్కిలి యాకలిగొని యుంటిని ఆమధువు గొంతబుచ్చుకొని వాడు తమ వృత్తాంతము లన్నియు జెప్పుచుండ వినుచు నాచెట్టుక్రింద గూర్చుండి ముందు కర్తవ్యమేమని యాలోచించుచుంటిని.

ఇంతలో నొక మూలనుండి నల్లని మొగము వికృతరోమములు మిట్టగుడ్లు మిట్టకు గలిగిన యొకరూపము మాయొద్దకు వచ్చుచున్నట్లు కనబడినది.

అదిచూచి నేను ఆమ్మో! మృగమేదియో వచ్చుచుచున్నది. చూడుము! చూడుము? లెమ్ము అనివానితో చెప్పితిని. వాడు ఆదిక్కు చూచి అయ్యో! నీకింత తెలియదేమి? అడవిమనిషివలె నుంటివే ఆ వచ్చుచున్నది. నాపెట్టయే మెకమనియద వేల? జడియకుమని పలుకగా నేనును వెరగంది చూచుచు గొంతవఱకు నమ్మలేదు.

అదియు సమీపించిన కొలది నిరూపించిచూడ మనుష్యజాతి అని తెలిసినది. ఆహ! దానిరూప మేమని చెప్పుదును మహాజనునికి గూడ నవ్వుపుట్టించక మానదు. అదియొకరీతి యాకు పుట్టముగా గట్టికొనియెను. అదియు వడివడివచ్చి యా డొంకలోపలకుబోయి నలుమూలలు దిరిగి మరల వెలుపలకువచ్చి యేమిదొరా! మాంస మేమియుం నీవేళ దీసికొనిరాలేదా ? అని అడగినది. వాడును భయపడుచు పెట్ ! ఈ దినమున నేమృగము గనఁబడలేదు. పెద్దతడవు ఎరబన్ని మాటులో గూర్చుండి చివరకూరకయే యింటికివచ్చితినని చెప్పెను.

అప్పుడది మరలయగునుకాని పిశాచమువలెఁ గూర్చున్న యీ పెట్ట యెవ్వతియె; యెచ్చటనుంచి తీసుకొనివచ్చితివి? నన్ను జూచి యాలాగున బెదురుచున్న దేమి.? తనపాటి అందము నాకు లేదనుకున్నదా నిజము జెప్పుము లేకున్న నిన్ను ను దానిని, లేవగొట్టి వేయించెద జూడుమనుటయు అక్కిరాతుడు భీతునఁబోలె మెల్లన నిట్లనియె.

పెట్టా! నేను నిజము చెప్పెదను. వినుము నేను మాటులో గూర్చుండి మృగములరాక నిరీక్షించుచుండగా నొకపులి గనంబడినది. అని అర్దోక్తిగాజెప్పి నాలుక గఱచుకొనుచు గొంతసేపూరకొని మరల లేదు లేదు. ఈపెట్ట అచ్చట కనంబడినది. కాదుకాదు. నేను దిగి వెళ్ళిచూచితిని ఉండుఉండు. మనయింటికి నేను రమ్మనలేదు. నిజమే అదియే వచ్చినది అనిబెదరుచు నొకమాట కొకమాట సందర్బములేనియట్లు చెప్పగా నారండ తలకంపించుచు అవును. నీమాటలు చక్కగా నున్న యవి. నాకనుమానము తోచుచున్నది. దీనినీవు తగులుకొని వచ్చినట్లు తోచుచున్నది. మనవారి కందఱికి జెప్పి నిన్ను గులములో వెలివేయింతుమ జూడుము. అన్నా! యెంతవాడ వైతివి. అని వానిం బెదరించుచు నుల్కాయుగమువలె నొప్పుచున్న గ్రుడ్డులు త్రిప్పుచు నన్ను జూచి యిట్లనియె.

ఏమీ! రాకాసీ! నాఫ్రౌఢిమంయెఱుగక నీవు వీనిదగులుకొని వచ్చితివి? నిజము చెప్పుము లేకున్న మీయిద్దరిపనియు బట్టించెదను, నీవెవ్వతెవు? యెచ్చట వచ్చితివి? వీనికి నీకు సంఘటన మెట్లయ్యెను. జెప్పుమనగా దానిమాటలకు నేను జడియుచు నిట్లంటిని

ఓసీ! నేను నిజము జెప్పెదను వినుమనువఱకు అదిలేచి చీ! చీ? రంఢా నన్ను ఓసీ! అనిపిలుచుటకు నీతొత్తుననుకుంటివా? నిన్నేమి చేయుదునో చూడుమని పలుకుచు లేచి నన్ను గొట్టవచ్చినది.

అప్పుడు వాడు లేచి అడ్డగించుకొని పెట్టా! మాలో నోశీ అని పిలిచినం దప్పు. పెట్ట అని పిలువవలయును జ్ఞాపకముంచుకొనుమని చెప్పెను.

నేనును, మంచిదని, దానితో బెట్ ? కోపము సేయకుము. నేనెఱుగక, అట్లంటి నేనొక రాజు కూతురను. నాపేరు హైమవతి నాకు బెండ్లిచేయుచుండగా, గుర్రపుదొంగలు నన్నెత్తుకొనివచ్చి నిన్నటిరాత్రి యీ అడవి నడుమ బడవైచి లేచిపోయిరి దారి దెలియక క్రుమ్మరుచుండ నాపై బులి జంపదుమికినది. ఇంతలో నీమగఁడు దైవమువలె నాయాపదఁదప్పించి యీ యింటికిఁ దీసికొని వచ్చెను. ఇంతియ నిజము. దీనిలోఁ గొంచెమేనియు నసత్యములేదు అని చెప్పితిని.

అప్పుడది నిప్పు తొక్కిన కోతిఁవలె నెగురుచు, మగనింజూచి యౌరా! యెంతదబ్బరలాడితివి. తరువాతఁ బులి, పులి అని యెద్దియో కొంతవరకుంజెప్పి మరల దప్పించితివి. నీవు పులిని జంపినట్లీ రాకాసి చెప్పుచున్నది. దాని మాంసమేమి చేసితివి. ఇంటి కేమటికిఁ దెచ్చితివి చూడుము నిన్నేమిచేయుదునో? అని పండ్లు పటపట గొరుకుచు లేచి అచ్చటనున్న వింటిబద్ద దీసికొని వానిని దెగబాదినది.

అప్పుడు వాడు తోక ద్రొక్కిన సర్పమువలె రోజుచు నాబద్దలాగికొని దానిని యమలోకము చూచి వచ్చినట్లు మరల గొట్టెను.

అదియు వానిం జుట్టు పట్టుకొని నేలబడద్రోచినది. అప్పుడయ్యిరువురుఁ గొంత సేపు ముష్టియుద్ధము చేసిరి. నాయోపిన కొలది వాండ్రను విడదీయవలయునని ప్రయత్నము జేసితిని. కాని రెండు మూడు పాదప్రహరణములు తగిలినంతఁ దరి కఱుగలేక పోయితిని.

అట్లాచెడిప కొంతసేపు మగనితో జగడమాడి వడివడి లేచి నన్ను బద్దతోఁ గొట్టబోవుచు ఛీ, ఛీ, పెట్టా! నా కొంపముంచితివి. నా కాపురము పడద్రోయవచ్చితివా? నీవు నాకన్న జక్కనిదానవా? ఈ నీచుఁడు నిన్ను వరించెనే? కానిమ్ము. నా బంధువులతో జెప్పి నిన్నేమి చేయించెదనో చూడుము. అని చురచురం జూచిమేను నంటికొని యున్న ధూళి రాల్చుకొనుచు నెచ్చటకో పోయినది.

అంతలో సాయంకాలమగుటయు నేను మిక్కిలి భయపడుచు వానితోఁ వోరి! చీకటిపడుచున్నది. నాకు గ్రూరమృగములు వచ్చునని వెరపుగానున్నది. ఈ రాత్రి యెచ్చట బరుండను? నీపెట్ట నన్నట్ల నుచున్న దేమి ఎచ్చటికిబోయినది? మరల నీ రాత్రి వచ్చునాయని అడుగుటయు నక్కిరాతుఁడిట్లనియె.

“పెట్టా! నీకేమియు భయములేదు. నీవు పులిచర్మమును గప్పికొనుము. నీ దాపునకే మృగమునురాదు నా పెట్ట కల్లుద్రావి యట్లరచుచున్నది. యెచ్చటకో బోయినది రేపదియే వచ్చును. సుఖముగా నిద్రఁ బొమ్మని యోదార్చి యాచర్మము తెచ్చి నాకిచ్చెను.

దుర్గంధయు క్తమగు నాతోలు ముట్టుట కేవగించుచు నెట్టకే వెరపుపెంపునఁ జేసి దానిం గప్పుకొని పరుండి నిద్రపట్టక నాయవస్థ యంతయు స్మరణకు దెచ్చుకొని పెక్కు దెరంగుల దలపోయుచుంటిని.

అట్టి సమయమున వాని యాలు, పదుగుండ్ర యమకింకరుల బోలువాండ్ర వెంటబెట్టుకొని అచ్చటకి వచ్చి, నా కాపురము పడద్రొబ్బిన రంకులాడి యిదియే యని వారికి నన్నుఁజూపినది.

ఆ క్రూరులు నన్నుఁజూచి నిందించుచు, వానితో ఓరీ! కులము మర్యాద విడిచి, మఱియొక దాని నుంచుకొని, పెండ్లామును జావమోదెదవా? దాని కెవ్వరు దిక్కు లేరనుకొంటివా? కులములో నీకుఁ దప్పు పెట్టించెదము. చూడుము. నీవు తీసికొనివచ్చిన చెడిపసంగతి యేమి చేయుదుమో చూడుము" అని అరచుచు, నన్ను బలాత్కారముగా లేవనెత్తి, కాళ్ళు కొందఱు, చేతులు కొందఱు పట్టుకొని రక్షింపుడు రక్షింపుడు అని కేకలు వేయుచుండగనే వినిపించుకొనక, భుజములపై నెత్తుకొని అతి వేగముగా, బరుగుపెట్టుచు నీ నూతియొద్దకు వచ్చి చావుము రండా! అని పలుకుచు నీ నూతిలో బడవేసిపోయిరి. తరువాయి వృత్తాంతము దేవర యెరిఁగినదే. ఆపత్సముద్రములో మునుగుచున్న నాకు నార్యునిఁ దెప్పగాఁ జూపిన భగవంతుని కనేకనమస్కారములు చేయుచున్నానని పలికి యానారీమణి యూరకుండెను. అని చెప్పి మణిసిద్ధుఁడు తరువాయి కధ పై మజిలీ యందిట్లు చెప్పదొడగె.

21 వ మజిలీ

శిష్యా! వినుము. ఆ జయభద్రుఁడు హైమవతి చరిత్ర అంతయును విని మిక్కిలి యాశ్చర్యమందుచు నౌరా! భగవంతుని సంకల్పము కడు విచిత్రమైనదే! మనుష్య సంకల్ప మేమియుఁ గొనసాగదు కదా? మానవు లూరక వెఱ్ఱిప్రయత్నములు స్వతంత్రులవలెఁ జేయుచుందురు. పురుషు డెన్నడును కర్తగాఁడు. అని చెప్పిన పురాణగాథ యథార్థమైన దగునని అనేక ప్రకారములఁ దలపోయుచు నాహైమవతి రూపలావణ్యాది విశేషముల కచ్ఛరువందుచుఁ బచ్చవిల్తుఁడు పూపుట