కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/342వ మజిలీ

వికీసోర్స్ నుండి

సంభవించిన కిరణకోశమనురత్నము. సకల విషకారమూర్చాంగ పరివర్తనాద్య శేషాపాయములఁ దప్పింప సమర్దమయినది. ఆపదలకు నెలవగు నీ వననివాసంబున దీనిం బడయుట శ్రేయస్కరమని ప్రియముమీఱ బలుకుచుఁ నామెకుఁ దీనిని జూడా రత్నముగా నొసంగి యూఱకుండెను.

అప్పుడు నేను వానిదుర్వారశాపోక్తులవిని దుర్భరదావానల జ్వాలలంవడు వనవృక్షములలీల తోడనే వివర్ణుడనై పరయువతీ రత్నాపహారపాపంబునకు ఫలంబు గంటినని పశ్చాత్తాపమందుచు నవనమితమౌళినై యా మునీంద్రునకుఁ బ్రణమిల్లుచు వినయంబున నిట్లంటిని. మహాత్మా ! శాంతి వహింపుము. అజ్ఞానతిమిరంబునఁ గన్ను గానక వివేకహీనుడనై యధర్మంబునఁ ప్రవర్తించిన నాకు కరుణాతరంగుడవై శాపాంత మును బ్రసాదింపుమని ప్రార్థింప నా మునీంద్రుండు దయార్ద్రహృదయుండై తల పంకించుచు “సరే, కానిమ్ము. ఈ యరణ్యంబున‌ నీమెను ప్రతిష్టాననగరాధీశ్వరుండగు పుండరీక రాజేంద్రుం డెప్పుడు జేపట్టి నీచెంప వాయఁగొట్టునో యా క్షణముననే నీకు శాపాంతమగునని నన్ననుగ్రహించెను.

పిదప నేనా మునీంద్రుని యానతి నౌదలందాల్చి తోడనే కోఁతినై యిమ్మణి భవనంబున నీమెను సంరక్షించుచు భవదాగమనమును బ్రతీక్షించి యుంటిని. నేఁటికి నా పుణ్యవశంబున నీ వేతెంచి నా శాపదోషమును బోఁగొట్టితివి. ఈ పర్వతము రవిశృంగమనియును సరోవరము కువలయామోద మనియును మునీంద్రుని మాటల ధోరణిని మనవిచేసియే యుంటిని. ఈ మణిమందిరము వానియాజ్ఞాసిద్ధమైనదనికూడ మనవిచేసికొని యుంటిని. ఓ లోకోపకారపరాయణా ! పుణ్యాత్మా ! నీ వడిగిన వృత్తాంతమెల్లఁ జెప్పితిని. ఇఁక నాకు సెలవొసంగుమని వచించి యా రాజేంద్రు ననుమతంబు వడసి యా విద్యాధరుఁడు మింటికెగసి నిముసములో నదృశ్యుఁ డయ్యెను.

342 వ మజిలీ

పురప్రవేశము

అట్లు మర్కటరూపమునువిడచి నిజవృత్తాంత మెఱిగించి విద్యాధరుఁ డఱి గినపిమ్మట నా రాజశేఖరుండు నల్దెసలఁ బరికించుచు నభీష్టయువతీసంగమాభినందన పురస్పరంబుగ నిట్లని విచారింపఁ దొడంగెను. అనుకూలదైవప్రభావంబున నా ప్లవం గము ననుసరించి వచ్చి నే నిచ్చోట నాప్రాణేశ్వరి నత్యద్భుతంబుగఁ గలిసికొనఁ గలిగతిని. ఇష్టజనయోగదుఃఖముదప్ప మఱొకకష్ట మేమియు నీమె యనుభవించి యుండలేదు. ఈ మహారణ్యము దిక్కులనెల్ల నాక్రమించుకొని యుండుటచేఁ బుడ మిలో నీ ప్రదేశమెచ్చటిదో తెలియకున్నది. ప్రతిష్టాననగర మేదిక్కున నెంతదూర ములో నుండెనో నేనించుకయును గ్రహింపజాలకున్నాను అదృష్టవశంబునఁ దారా వళికూడ యిచ్చటనే‌ యున్నది. ఆమె యంబరమునఁ దిరుగుశక్తిఁ గలిగియున్నను నబలయగుటచే సంతోషమున మైమఱచియుండెను. కావున నిప్పుడు దిక్కుల నిర్ణ యింపనేరదు జంతుసంచారశూన్యంబగు నిక్కాననంబున నేదిక్కునకుఁ బోవలెనని యడుగుటకుఁగూడ మనుష్యుఁ డెందును గోచరింపఁడు ఈ యడవి దాటిపోవుట కుపాయ మేదియును దోఁపకున్నది ఆ విద్యాధరునికథ వినుచు మాకుధోరణింబడి వాని నీమాట యడుగుటయే మఱచిపోతిని. అంబరమున సంచరించచు ఖేచరులు సాధారణముగా భూలోకమందలి పట్టణంబులనెల్ల నెఱిఁగియుందురు ఆ విద్యాధరుఁ డట్లు పోవుచు నెద్దియేని యాటంకమునఁ కదల నింకను నిలచియున్నాఁడేమో పరికిం చెదంగాక యని తలంచుచు రిత్తకోరికతో గగన మీక్షించుచుండ నన్యోన్యసంగతమై, యేకప్రమాణమై. యేకరూపమగు స్వరూపముతో, నుదారపక్షములతో నొప్పు పక్షి యుగళమొకటి వానికి గోచరించెను. చూచుచుండఁగనే యది పక్షిభావమునువిడచి సుందరపురుషస్వరూంపబులఁ దాల్చి గగనమునుండి భూమికిదిగి ప్రియురాలిం గూడి యున్న నరేంద్రుని దూరమునుండియేచూచి రయంబున నికటంబున కేతెంచి వారిరు వురకు నమస్కరించెను.

మీరెవరని యాభూజాని విస్మయంబున నడుగ నందొకండు కృతాంజలియై వినయంబున నిట్లనియె. దేవా ! విశ్వోదరాంతరమగు కామినీరత్నమును వెదుక నాఁడు భవదీయాదేశసారుండను నేను మాయాబలుండును నిశాచరుఁడను. ఇతఁడు పాతాళనాయకుండగు శిఖండతిలకున కాప్తుఁడు. దంభోళియను భుజంగవీరుఁడు. స్వామి యాదేశమున భరతవర్షంబున నీమెను వెదకుటకు వచ్చినవాఁడు. నేను తమయానతి పాతాళమును దివంబును నామూలచూడముగ విమర్శించి యీ భూలోకమున కేతెంచి తిరుగుచుండ సౌరాష్ట్ర దేశమందలి ప్రభాసతీర్థంబున నీతండు నాకుఁ గనిపించెను. అం దనవరితయాత్రాయాత జనసమ్మర్థంబున దుర్దర్శనుండై దర్శనమాత్రంబుననే యర్దులకోర్కె లీడేర్పగల శ్రీ సోమనాధేశ్వరుని నిష్టార్ధసిద్ధికై ప్రస్తుతించు సందర్భం బున మేమిరువుర మొక్కపనిమీఁదనే తిరుగుచుండుటఁ దెలిసికొని మిత్రులమైతిమి. నాఁటినుండియు స్వేచ్చావిహారమున కనుకూలమగురీతిని బక్షులమై సంచరించుచు నిం దనింద్య జలశకుంతకూజితారావసూచితమైయొప్పు సరోవరము నీక్షించి యంబరమునఁ దిరుగుచుండుటచే మేమిరువురమును శ్రమజెంది చల్లని యీ మహాసరస్తీరంబున నించుక విశ్రమింపనెంచి మనుష్యరూపంబులఁదాల్చి యిచ్చటి కేతెంచితిమి. తోడనే భాగ్యవశంబున వధూసమేతుఁడవైయున్న నిన్నీక్షించి దంభోళి కెఱింగించితిని. అభీష్ట పరలాభంబున జెలంగియున్న యన్నుమిన్న తనయేలిక కన్న కూఁతురని యతండు

వచించెను. మాకోరిక సిద్ధించెను. మా మనోరథము ఫలించెను, వేయేల ?


మ. అతిలావణ్యచేత నింపెసఁగు నీయబ్జాక్షిలోఁగూడి యు
     న్నతిరీతిన్‌ గను నిన్నుజూచి తలఁతున్‌ గౌరీయుతుండౌ జగ
     త్పతిరీతిన్‌ శచితోడి యింద్రుగతి నాపద్మాలయాయుక్తుఁడ
     చ్యుతలీలన్‌ ధరణీతలేంద్ర ! మదిలో నుత్సాహమేపారఁగన్‌.

అని వచింప పుండరీకుండు తా నాదుర్గమారణ్యంబున నుదయసుందరిని గనుంగొనినవిధాన మంతయును మాయాబలున కెఱింగించి వానికిం ముదము గూర్చెను. మఱియు నాదుస్తరారణ్యమధ్యమునుండి వెడలి ప్రతిష్టానపురంబును జేరు కొనఁదగు తెఱవు నిఖిలమాయా ప్రయోగనిపుణుండవగు నీ వాలోచింపవలయునని యా రాజేంద్రుం డనినతోడనే మాయాబలుం డదృశ్యుం డయ్యెను.

తోడనే విమలమణికింకిణీచక్రవాకపూరితమై స్వర్గనిర్మాణరమ్యమై యొప్పు గులుకు విమానమొండు వారియెదట నిలచెను. అప్పు డశరీరవాక్కు‌ నిట్లు వినం బడెను, ఓహో ! క్ష్మాపాలపుంగవా ! నేను మాయాబలుండను. గగనమార్గంబున మిమ్ముఁ బ్రతిష్టానగరంబునకుఁ గొనిపోవ మాయచే విమానముగమారి మీయెదుట నున్నవాఁడను. దీని నధిష్టించినతోడనే మిమ్ము మనోవేగంబునఁ మీ నగరమునకుఁ దోడ్కొనిపోఁగలవాఁడనని మాయాబలుం డదృష్టమూర్తియై పలికినమాటల నాలకించి యత్యంతానందమునుబొంది మనంబునఁ గలంకమునుబాపి దంభోళినందుండియే పంపి వేయ నుద్దేశించి యుదయసుందరివంక జూచెను.

ఆమెయును బ్రాణేశ్వరుని యింగితమెఱింగి దంభోళివలనం దారావళి తమ బందుగుల యోగక్షేమము లెఱిగింప పిదప నత్యాదరంబున వాని కిట్లనియె. సోదరా ! ఇప్పటికే జాగయ్యెను. అభీష్ట సిద్ధింబడసిన నీవతిజవంబునఁ బాతాళంబున నా జనకుని సమక్షమునకేగి మదీయశుభోదర్క మెఱింగింపుము. మర్త్యలోకములోఁ ద్రిభువనం బులఁ బ్రసిద్ధికెక్కిన ప్రతిష్టానపురంబునందు నే నతిసంతోషముతో సుఖముగా నుంటి నని వచింపుము. తారావళి మాతోఁ బ్రతిష్టానపురంబున కేతెంచి యచ్చటఁ దన కిచ్చ యున్న నాసన్నిధి నుండుటగాని లేక పాతాళమునకుఁ దిరిగివచ్చుటగాని జేయఁగలదని చెప్పుము అని వచించి వాని నతివినయంబున వీడ్కొల్పెను. వాఁడును బంధుభావోచి తంబుగ నుదయసుందరితో సంభాషించి, సంతతము నామె నేమరకుండుమని తారా వళితోఁ జెప్పి యా రాజేంద్రునకు వినయంబునఁ బ్రమాణంబు లర్పించి విమాన రూపముననున్న మాయాబలుని యనుజ్ఞఁ గైకొని యా క్షణంబుననే పవనభావంబంది యంత ర్హితుం డయ్యెను.

పిమ్మట నా రాజేంద్రుం డపరిమితసంతోషముతోఁ దొలుత నుదయ సుందరి బిదపఁ దారావళిని నా విమాన మెక్కించి వారిమధ్య దానాసీనుఁ డయ్యెను. తోడనే యది యందుండి పైకిలేచి గగన మూర్గంబున నిముషములోఁ బ్రతిష్టానగరము జేరెను. ఆ నగరము వెలుపల నా విమానమునుదిగి సమీపముననున్న నందివృక్ష శీతలచ్ఛాయకేఁగి యందుఁ బుండరీకుండు బ్రక్క నుదయసుందరియును నెదురఁ దారావళియునుండఁ గూర్చుండెను. పిమ్మట విమానరూపమును విడచి దివ్యాకృతిం బూని మాయాబలుండు కృతాంజలియై వారియెదుట నిలిచి యిట్లనియె.

దేవా ! అటుచూడుము. కోఁతిం దరుముకొనిపోయిన మన భూనాధుండు దానుగోరిన తరుణీమణి నెచ్చటనో లభింప నామెం దోఁడ్కొని తిరిగి యేతెంచియున్న వాఁడని జెప్పికొనుచుఁ బరుగుపరుగున బరిజనులెల్ల నిం దఱుదెంచుచున్నారు. కావున నోక్షితిపాల పుంగవా! నన్నిందే విడచిపపెట్టుము. నీవు తలంచికొనినంతనే నే నెవరి కిని జెప్పకుండ త్వరితగతి నేతెంచితిని. నీ వియోగంబున నెంతకాలము మసలితినో యెఱుంగను. ఇందులకుఁ బ్రభువగు విభీషణుఁ డేమని తలంచుచున్నాఁడో తెలియదు. అని పలుకుచు వానిమాటల నాదరించి యా ధాత్రీశ్వరుండు నావాంఛితమెల్ల సమకూర్ప గలిగిన నీకేమి పారితోషిక మొసఁగగలను ? వలసినప్పుడు నా శరీరమే నీ యధీన మొనరింపఁగలవాడనని యత్యంత స్నేహభావంబున వచించి యా రాత్రించరుని వీడ్కొల్పెను.

ఇంతలో నలువైపులనుండి యత్యంతానందమునఁ బురజనులు గుంపులు గుంపులుగా నచ్చోటి కరుదెంచసాఁగిరి గ్రమంబున మంత్రిసామంత హిత పురోహిత బృందమెల్ల నేతెంచెను. ఛత్రచామరాది రాజలాంఛనములెల్ల గైకొని సకలపరివార మేతెంచెను. అందఱికన్న ముందుగఁ గుమారకేసరి ఱేనిసమీపముకఱిగి వానికి నమ స్కరించి జరిగిన వృత్తాంతమెల్ల దెలిసికొనెను. పిదప నా చక్రవర్తి యెల్ల వారిని దగిన రీతి నాదరించి యుదయసుందరితో భద్రదంతావళం బధిష్టించి ముందు మంగళధ్వనులు జలరేగుచుండ మహావైభవంబున బురప్రవేశ మొనరించెను.

అట్లు వారేఁగుచుండ వారిని జూచువేడ్కచే విలాస వ్యాపారములనెల్ల విసర్జింను యతిరయంబునఁ బరువెత్తుకొనివచ్చి కామినీలోకము సౌధశిఖరములయందును గవాక్షములయందును దోరణ ద్వారములయందును నిల్చియుండిరి. అమ్మహారాజు ప్రియురాలితో నాపురవీధుల నూరేఁగును. నూరిజనులచే ననేకవిధంబులఁ బొగడ బడుచు ప్రకృతివర్గమువలన నభినందింపబడుచు, బ్రతి గృహద్వారము మ్రోలను బుణ్యస్త్రీలవలన నీరాజనంబులఁ వడయుచుఁ, బౌరజన సువాసినీ‌ బృందము మధుర మంగళగీతములఁ బాడుచుండ, వందిజనులొనర్చు జయధ్వానము నింగి ముట్టుచుండ దేవేంద్రవైభవంబున వివిధమణి తోరణోపచార చర్చితంబయిన రాజమందిరమును ప్రవేశించెను.

343 వ మజిలీ

మఱునాఁడు సాయంకాలమున బుండరీక రాజేంద్రుండు కమారకేసరి