కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/334వ మజిలీ

వికీసోర్స్ నుండి

334 వ మజిలీ

తారావళికథ

ఇట్లు మాట్లాడుచుండగనే యర్ధరాత్రము దాటిపోయెను. పిమ్మట నా విశ్వ భూతి యనుమతమున బుండరీకుండా తరుణతపస్విని వృత్తాంత మెరుంగ గుతూహల పడుచు నామె నిట్లని ప్రశ్నించెను. ఓ యసామాన్యశీలవతీ ? సాధుపధప్రచారిణీ ! విమలాశయా! నీ వృత్తాంత మెరిగింపుము. విష్ణువక్షస్థలమునకు కౌస్తుభమణిభూషణము వలె నీ వేకులమున కలంకారమైతివి ? యభీధాన‌ మెద్ది? అభినవలతవలె నొప్పు నీ విట్లేల జటావల్కలముల ధరించితివి? ఏ లోకమునుండి నీ విందవతరించితివి ? నీ నివాస మెచ్చట ? నీవంటి వారలు చేరరాని యాలంకాపురమున కేమి నిమిత్త మేగి తివి? అందు దురాపసందుడగు నా రక్కసుని కన్నుల కేల గోచరించితివి? నన్నిందు జూచినతోడనే శశికిరణములు సోక నెలరాలు స్రవించునట్లు నీ నయనేందు రత్నముల గన్నీరు విడచితి వేమిటికి? ఈ వృత్తాంతమెల్ల సవిస్తరముగ నెరుంగుటకు నా మనో వృత్తి కుతూహలపడుచున్నది. ఇంకను జాలారాత్రిగలదు. కావున సావధానముగ నీకధ దెలుపుమని పలుకు రాజేంద్రున కా తపస్విని యిట్లనియె.

ఓరాజ పరమేశ్వరా ! కళ్యాణప్రదుండవగు నీ వృత్తాంతమడుగకముందే నేను జెప్పవలసినది. అడిగినప్పుడై న జెప్పకుందునా ? అవధరింపుము. విస్తారభూతిచే నపారసుఖోపభోగ విభ్రమమువలన, సహజహర్షోపశాలురగు విలాసినీలోకంబుకతంబున నెల్లభువనముల బ్రసిద్ధికెక్కి న లోకము మీకు దెలిసియేయుండును. సంసారసాగరము లోని రత్ననిలయమువలె పన్నగఫణామండితమణి ప్రకరము లెల్లెడల బ్రకాశించు చుండ, బ్రహ్మాండరోషణమునందలి నిక్షేపము విధమున, ద్రిలోకకల్పవృక్షమునకు గూకటివేరులాగున, నొప్పుచు తపనుని సంచారము లేకున్నను సంచరద్భుజగ రాజ పుత్రోత్తమాంగమణి మయూఖవలయంబులచే ననేక రవిమండలములు గలుగుచుండ ననన్య సామాన్యసౌందర్యముతో నొప్పుగులుకు జలువజవరాండ్ర కునికిపట్టగుచు లోకములో మూడవదియగు పాతాళము సంసారఫలమున కారామమై జెలగియుండెను.

అందు బ్రసిద్ధములగు నెనిమిది నాగకులములలోను జన్మించిన వారెల్ల మిగుల బలశాలురు. కామరూపులై త్రిభువనముల యందును స్వేచ్చాసంచార మొనర్ప సమర్ధులు. దివ్యాభిరామస్వరూపులగు కామరూపులమాట యటుండనిమ్ము. సరళకీటక ప్రాయులై యున్న వారినిగూడ త్రిలోకగురుండగు పరమేశ్వరుండు నెమ్మేన నలం కారములుగా ధరించి యెంతయును గౌరవించుచుండెను. వారి నోటినుండి కారిన చొంగ దగిలినను నితరులకు విపత్తు సంభవించుచుండ నిక వారి విక్రమమున వర్ణింపనేల ? లోకములెల్ల దమ సర్వనిధులకు సంరక్షకులుగా నేర్పరచికొనవారి పరార్థనిప్పృ హత్వంబు నేమని గొనియాడగలను ? యోగులవలె వాయుభక్షకులైన వారి యదైన్య ప్రవృత్తి నెంతని గీర్తింతును? వృద్ధులలో వృద్ధుడైన శేషుడే నిజశిరంబున, సగిరి తరుషండ సాగరమహాభరయగు వసుంధరను లీలాకుసుమకళిలివలె ధరించియుండ వారి బల ప్రభావంబేమని చెప్పదగును ?


గీ. ఫణభృతులు సృష్టికదికులై పరగవారి
    సుగుణభంగుల నేమని పొగడఁదగును
    వారి తలఁబుట్టు నస్థిలవంబుగూడఁ
    బ్రస్తుతింగాంచె జగముల రత్నమనఁగ.

విప్రాకారముగనున్న శ్రీహరికి సర్వభూమండలమునుదానము జేసిన సుకృ తమువలననే బలిదానచక్రవర్తికి నాగలోకనివాససౌఖ్యం బబ్బెను. పూర్వము వసుంధ రోద్దరణ నెపమున రసాతలంబునకేగిన వరాహరూపుండగు జనార్దనుం డాలోకమును విడువజాలక యిప్పటికి నందే నివసించియుండెను. కూర్మావతారమున నతండు పాతాళమున కేగి లేక పండాంబువుల నిమగ్ను డై యుండెను. కావుననే యుత్కృష్ట విష్టపాలోకన కుతూహలుండగు వాని కితరలోక నివాసమునకు మనస్కరించినది కాదు.


చ. అతితర సత్తపోనియతినైనఁ గనంగ నశక్యమైన, యా
    యతలనివాససౌఖ్యము సురాధిప భూతగణాధిపాది దే
    వతలకుఁ గల్గలే దచటివస్తువులెల్ల నశేషసృష్టిలో
    నతిరమణీయముల్‌ తరమె యాఫణిలోకవిశేష మెన్నఁగన్‌.

అశేషసుఖసమంచిత మగు నా పాతాళలోకమందు ముంగిట గల ముగ్గు పట్టివలె, గోడమీది చిత్తరువుభాతి, తరుణీమణి మేననున్న యాభరణముగతి, మంజులతా నికుంజమున నున్న పుష్పము విధమున ముల్లోకములకు వన్నె దెచ్చుచు నిందీవర మను నగరముగలదు.


మ. స్తుతి విస్తారమదేల సప్పురమునందున్‌ సారసంసార సం
     భృతి కెల్లన్‌ ఫలమౌ మృగాక్షుల ముఖశ్రీసన్ని వేశంబులన్‌
     సతతామోదగ తాళిపాళిమిషచే స్వర్భానుడిందుభ్రమన్‌
     ప్రతిసంచార మొనర్చు దైవికముగా నబ్బెన్‌ వింధుం డంచటన్‌.

అట్టి పురమున వాసవుని విధమున నధికమగు సంపద్విశేషంబు గలిగి,

యాగ్నేయకసాయకయక ధరుండగుసాహరునివలె నరిబృందముల నెల్ల వశీకృతము లుగ నొనరించుకొను ప్రతాపము గలిగి, యాపూరిత శంఖస్వనుండగు హరివలె శుభ్ర యశస్సు గలిగి, శాపానుగ్రహసమర్థుండగు విరించివలె దుర్లంఘ్యశాసనము గలిగి, నిరా తపం బగు నా లోకమున నున్న మన్మధునకు హరనయనదహనదాహోపశాంతికై బొడమిన జలధరవితానమువలె నొప్పు నిజవినీలఫణాఫలకడంబరంబు గలిగి, యహి భువనమున గూడ బ్రసరింప నిచ్చఁ గొని పూర్వాద్రి నుదయించిన భానునివలె బ్రకా శించు నిజశిరోరుమండపమణికిరణచక్రుడై, యపరిమిత పరాక్రమక్రముడై , కాకోదర భటశ్రేష్టుఁడై, సురసన్మాన్యుఁడై, త్రివిష్టపభర్తకు మిత్రుఁడై, పాతాళనాయకుఁడగు వాసుకి, గాప్తుఁడై చరాచరగురుండగు శంకరునకుఁ బ్రియభక్తుడై, మహాత్ముఁడగు శంపాలునివంశమున కాభరణమైన క్షత్రియమహాస్వయమునకు మాణిక్యమై శిఖండ తిలకుం డను రాజశ్రేష్ఠుండు గలడు.

సహజముగా జలమందే నివసింప దలంపుగల కూర్మరాజు జలధిపక్షవత మున దదంగ మధనోపకరణంబగు మందరాద్రికి దిరుగుడు త్రాడుగా బరగి యప కార మొనర్చిన వాసుకి యెడల గుపితుడైనను శిఖండతిలకుని పరాక్రమం బెరింగి పరాహతశకచే సంకుచితదేహుండై నిజకటాహకర్పరంబున నడంగియుం డె గాని జగ త్రయమును దాల్చి మహాశక్తి గల యా యాదికూర్మ మా కోపమున నిముసములో వాసుకిని వానివాతాళమును గూడ రూపు మాపకుండునా ?

ఆ భయంబుననే వాసుకి పాతాళరక్షణ భారం బెల్ల శిఖండతిలకుని మూపునం బెట్టి యనాకులుడై కైలాసమున కేగి ధూర్జటికి శిఖాబంధముగా నేర్పడి సురనదీసలిల శీతలశీకర ప్రచారభాసురంబగు నాదేవుని జటావనమున సుఖముగా నివ సించి యున్నాడు. అట్టి శిఖండతిలకుడు నిజమండలాగ్రమునకు విజయకమలమువలె, భుజముల నొప్పు భూమివలె, వక్ష్షమందున్న లక్ష్మివలి, ముఖమందున్న సరస్వతివలె కంటిమీద ఱెప్పవలె, పరాక్రమమునకు వీరలక్ష్మివలె, గుణకలాపమునకు కీర్తివలె, వ్యాపారమునకు బుద్ధివలె, వ్యవహారమునకు నీతివలె, హృదయమున కనురాగమువలె నొప్పుచు సువంశసంజాతమగు మౌక్తికమువలెసువృత్తనిర్మలయై, యౌవనసంశ్రితయై, రూపపరిపూరితయై, లావణ్యపరిగతయై సాభాగ్యపరిభృతయై, వినయసంపన్నయై, సర్వలక్షణసమన్వితయై యలరారు విజయలేఖయను మానినీరత్నమును, ధర్మపత్నిగా బట్టమహిషిగా బడసెను.

ఆమె సతులకు బతియే దైవమని నమ్మి తదంఘ్రిశేవాసుషంగచిత్తయై సతీ వ్రతం బాచరించుచుండ నామెయందు దేవతలు గూడ బ్రసన్నులై యొసంగినట్లు పర మేష్టి నిజకటాక్షటంకమున జక్కదనము లెల్ల సానబెట్టి సృష్టింప, నారాయణుండు నాభికమల పరిమళపరాగమున మెరుగుపెట్ట, శంకరుండుమోళీందుకిరణధారల మార్జనం బొనర్ప, మన్మధుండు నిటశరప్రభావం బధిష్టింపజేయద్రిభువనైకసారయై యుదయ సుందరి యనుపుత్రికారత్నమాయిల్లాలి గర్భమున బొడమెను.

అయ్యది ప్రధమసంతానసంభవం బగుటచే నప్పుడా ఫణిరాజు మహోత్స వము లనేకములు జేయించెను, సూతికాగృహద్వారముమ్రోల షష్టిజాగరణంబులయందు జేయబడిన ఘటధ్వనుల కైతవమున సంకల్పజన్ముండు జగజ్జయమునకై భూజా స్పోటనం బొనరించుచున్నట్లు తోచెను ఆ బాలికకు నామకరణాదివిధులు యథావిధిగ నిర్వర్తింపబడిన పిదప జోతి‌ష్కు లామె దేవాంశసంభూతుడగు పురుషుని బెండ్లాడగల దని వచించిరి. యోగీశ్వరుల మోక్షేచ్చయు, సజ్జనులసుచరిత్రము, దపస్వుల నియ మము, గృపణుల ధనము, భయశీలుర ప్రాణరక్షణవ్యాపారము, దినదినం బెట్లభివృద్ది జెందుచుండునో యట్లే యాబాలిక తల్లిదండ్రులు మిగుల ప్రేమతో బెంచుచుండ బెద్దదగుచుండెను.

ఇట్లు కొంతకాల మరుగ సముచితసంభారముల సమకూర్చియుంచి, మనో హరలావణ్యరసమున మెరుగుబూతబెట్టి, సమున్మిషిత త్రివళుల రంగవల్లికల దీర్చి, వక్షోజముల నుపరిభాగమున మంగళకలశలగా నమర్చియనంగ ప్రభుని ప్రథమ ప్రవే శమునకు శుభపరికరముల నలంకరించిన దివ్యసౌధమువలె నబ్బాలికామణి యంగయష్టి యలరారుచుండెును. వర్షాంతమున నొప్పుచంద్రికవలె, సానఁబెట్టిన మాణిక్యదీపిక కై వడి విలాసాంభోజకళికవిధమున, వివిధవర్ణముల జిత్రింపబడీన చిత్తరువుభాతి, స్నిగ్ధతనుచ్ఛాయలం బరగు నవయౌవనం మామెయందు బొడసూపెను.


గీ. తరుణివక్షోజలకలశాంకితంబునై న
    దివ్యవేదికమీఁద దదీయకాయ
    కాంతి వారిప్రవాహసద్గరిమ మరుఁడు
    గరము సూత్న రాజ్యోభిషేకంబు వడసె.

గీ. చంచలాలోకధారిణీసరణి మీరఁ
    బ్రావృషములీల బాల యౌవనపులక్ష్మి
    యతిశయంబుగ వహ్నించె ననవరతము
    నమల లావణ్యవాహినీసముదయంబు.

మ. పతి లావణ్యసరిద్విహారపరుఁడౌ సంకల్పజన్ముండు వి
     స్మృతి నాత్మియసుహథనోత్కరమటన్‌ జేజార్ప‌ నందందు సం
     గతమై దోచెఁ గపోలసత్పులినభాగంబందుఁ బత్రాతి చి
     హ్నితమౌమీన, మపాంగతీరసరణిన్‌ దృగూపబాణంబు, లు
     న్నతరీతిన్‌ జులుకంపుటొడ్డునను నందంబైన భ్రూపీఠమున్‌.

అట్టి యనన్యసామాన్య లావణ్యమున నొప్పుచున్న కన్నెమిన్నంగాంచి

తజ్జనకుం డొకనా డిట్లని యోచించెను. ఇట్టి మనోహరాకృతి నలరారు యోషామణి యెన్నడైన బాతాళనాయకుండగు వాసుకికంట బడకుండునా? చూచినతోడనే యతండు మదనాతురుండు గాకుండునా? మదనమూఢుడై యీమెను దన కొసంగుమని నన్ను గోరకుండునా? అప్పుడు నేనేమి సేయవలయును? ప్రభునిమనోరధం బీడేర్పకుండుట సమంజసమగునా ? వానికి నాయందు గల సుహృద్భావము నెట్లు గాదనగలను? ఇది యునుంగాక కోరినదానిని లేదను బ్రవృత్తి నాకు గిట్టదు గదా? పోనిమ్మని నాపుత్రి కను వాని కిచ్చుటకు నామనంబొప్పదు. అతం డెంత రసాతల చక్రవర్తియైనను ముల్లోకసుందరియగు నాతనూజాత కనురూప వరుండు గానేరడు. కావున నాపుత్రిక నతండు జూడకుండ నీమె వృత్తాంత మతం డెఱుంగకుండ దగినట్లు జేయుటయే కర్తవ్యమని నిశ్చయించి సముద్రగర్భమందున్న యొక మనోహరమగు నంతర్ద్వీప మున గన్యాంతఃపురముల నిర్మించి యందు వలయు వస్తుసముదాయమెల్ల జేర్చి యనే కుల వృద్ధకంచుకుల నందు గాపుంచి సమవయస్కులగు కన్మకల బలువురతో నా యుదయసుందరి నావివిక్తస్థలమున నివసింపజేసెను.

ఆ శిఖండతిలకున కత్యంత ప్రేమాస్పదుడైన రత్నమౌళియను పద్మకులా భరణునకు వేణీమతియను సహధర్మిణియందు లేక లేక తారావళియను పుత్రికగా నే నుద్భవించితిని. ఉదయ సుందరికి నేను సమానవయస్కనై యామెతో నాహార విహార శయ్యాసనములయందు గలిసిమెలసి ప్రవర్తించుచు దదీయసభీమండలమున కెల్ల దలమానికమనైయుంటిని. నవయౌవనమున జెలంగియున్న కన్నకూతురునకు దగినవరుని సమకూర్ప నాశిఖండతిలకుండు మిక్కిలి తొందరపడుచుండెను. పదునాల్గు లోకములయందున్న రాజకుమారుల మనోహరాకారముల జిత్రపటముల మూలమున దెప్పించి యామెకుబంపి వారివారియుత్కృష్టచరిత్రములెల్ల సఖులచే జెప్పించి యొప్పింపజూచుచుండెను. కాని వారి నెల్లర దృణప్రాయులగా ద్రోసివైచినది. త్రిభు వనవిహార మొనరించు విద్యాధరుల నిరసించినది. దేవతామూర్తులగు మన్మ ధాదులగూడ దిరస్కరించినది. పురుషులరూపమునే చూడరాదని తలంచుకొనినది. అందువలన నామె తల్లిదండ్రులకెంతేని సంతాపము గలిగెను.

అట్లు పురుషదర్శన ద్వేషిణియై యుదయసుందరి మాతో గేవలము విచిత్రపత్రచ్చేదనవిద్యయందును, మనోజ్ఞచిత్రరచనా కౌశలమునందును ననల్పవేణు గానమాధుర్యతరంగములయందును, నమంద కందుకక్రీడావిశేష మందును, నిరంతర లోలావిలాసవైభవంబందును మనోహర శుకపికశారికాది శకుంతసంతాన మంజులాలాప శ్రవణ సంతోషమునందును, ననేకగృహమృగమరాళచంద్రకక్రీడాడంబరము నందును, నభినవలతానిషేవణము నందును, కుసుమాపరయ వినోదమునందును, క్రీడాసరోవర ముల జలకేళి దేలుటయందును, నిరంతరము మనములకు వినోదము గలిగించుకొనుచు గాలము గడపుచుండెను.

ఇట్లుండ నొకనాటి ప్రాతఃకాలమున ఇను డరుదెంచినతోడనే మోమున వికాసము గనుపింప నధికానందమున గమలినీరమణులు ప్రబోధతరశితములగు నర విందపత్రేక్షణముల ననురాగముతో వాని వీక్షించుచుండ, మధుపానమత్తమధువ్రత వ్రాతము ఝంకారగీతముల బఠించుచుండ, వేలావసతరుశిఖరములందు నిద్రనుండి లేచి సముద్రసైకతోత్సంగములననుసరించి బారులుగట్టి విహంగ మకులములెగురుచుచుండ, నంతఃపురపరిజనము ప్రాతఃకృత్యముల యందప్రమత్తులై సంచరించుచుండ నాయుదయ సుందరి సుఖప్రబోధయై చక్కగా నలంకరించుకొని ప్రభాతక్రియల నిర్వర్తించి విలాస భవనమున సుఖాసనమున గూర్చొని బ్రసన్న ముఖియై యున్నసమయమున జెలిమి కత్తియలెల్ల నుల్లాసమున నామెం బరివేష్టించికొందరు రాత్రి యుద్యానదీర్ఘికా చక్ర వాకవియోగ‌ వేదనాక్రందనము దాము విన్న చందమున వినిపించుచుండ గొందరు కలిసియున్న లీలామృగ మిధునమువలె నల్లి బిల్లి గ నల్లుకొనియున్న లతం జూపుచుండ నత్యంత వినోదమున నున్న సమయమున మయూరకాఖ్య కిన్నర మిధువ మతిరమున నట కేతెంచి యేలాలతావల్కల నియమితంబైన చిత్రపట మొకదానిని యుదయ సుందరిమ్రోల బడవైచెను.

అక్షివిక్షేపమాత్రమున నామెయాశయ మెరింగి నేనద్దాని గ్రహించి యచ్ఛాదనమును దొలగించి చూడ నందొకసుందర పురుషుని ప్రతిరూపము జిత్రింప బడియుండెను. ఆ యద్భుతస్వరూప సందర్శనమున విస్మితురాలనై యౌరా ! మయూరకా ! ఇందు లిఖింపబడిన సుందరపురుషుం డెవ్వడో చెప్పుమని బ్రశ్నింప వా డిట్లనియె. నేడు వేకువను సముద్రాంతర్ద్వీపమందలి పర్వతమందు విహరింపబోయి మేము తిరిగివచ్చుచుండ నొక చోట విచిత్రతరులతాప్రశోభితమగు సుందరజలాంతర స్థలమున బడియున్న యీ పటము మాకు గోచరమయ్యెను. అందున్న సుందరాకార మును నే నతికౌతుకమున వీక్షించి శంఖాకితకరుం డగుటచే నీతండు నిక్కముగ బురుషోత్తము డగునని నా ప్రియురాలు మయూరికతో బల్కితిని.

శంఖ రేఖాదులవలన మురారియని మీరు తలంచుచుంటిరి గాని ! యిట్టి సుందరాకారమున నెసంగు నితండు మన్మధుండని నాభార్య వచించినది. ఆ విధమున మాకు వాదోపవాదములు జరిగినవి. ఎవరి వాదము వారు సమర్థించుకొననెంచి చివురకు మే మిరువురము బందెములు వైచుకొని మీవలన నిశ్చయ మెరుంగుట కద్దాని నిందు దెచ్చితిమి కావున నీరూప మెవ్వరిదో మీరు నిర్ణయింపవలెనని బలికెను. అప్పుడా యుదయసుందరి విస్మయమందుచు తారావళీ ! ఏదీ ! పట మిటు దెమ్ము. ఆతం డెవ్వడో నేను విమర్శించి చెప్పెదనని నా చేతిలో నున్న యాపటము లాగికొని పరి కింప దొడంగెను.

ఆ సుందరపురుషరూప సందర్శనము మాత్రముననే యామె హృదయమున ననంగశరపరంపరలు నిండిపోయెను. సర్వాంగములు గంపింప దొండంగెను. నెమ్మేన చెమటబిందువు లుత్పన్నమయ్యెను. ఆపాదమస్తకము రోమాంచమును విజృంభింప సాగెను. తోడనే హృదయమున బ్రవేశించు ననురాగమునకు దారి యొసంగుచున్నట్లు కంపించు వక్షోసిఖర‌మువలన దరళితములై హారయష్టులు బ్రక్కకు దిరిగెను.

అట్లు నిరాటంకముగ బ్రవేసించు ననురాగమును దిలకించి పరపురుష సామీప్యద్వేషిణియగు కులాంగన విధమున మనముననుండి లజ్జ తొలగిపోయెను. దొంగ యరగిన వెనుక వచ్చు రక్షక భటునివలె త్రపాశూన్య మగు హృదయమున నున్మాద మధిష్టించి యుండెను. ఉన్మాదపురుషపూత్కారపవనదండము విధమున మనమున రవుల్కొన్న మన్మధాగ్నిచే వేడినిట్టూర్పులు మాటిమాటికి వెడల దొడంగెను. మదన దావానలజ్వాలలచే సరళనిస్వాసారణ్యము మండిపోవుచుండ ముఖకమలపరిమళోపలో బాంధము లగు నశిబృందము లాలేడి బడి యాక్రందించుచుండెను. అంతఃకరణ మందిరము మదనాగ్నివలన మండుచుండుట యిందిందిరాక్రందన కోలాహలమున నెరింగి దహనభీతి నందున్న ధైర్యము పారిపోయెను. అసమరోమాంచసూచికాగ్రపు బోటుల కాకజాలనట్లు స్వేదవారి ప్లుతంబగు కపోలపత్రహంసమిధునము ధైర్యమేవలెనే జెదరిపోయెను.


గీ. సతత పురుషాపరాగ సద్ర్వతమునామె
    మనసు విడిచినయట్టులే మనసిజుండు
    హర్షమున లింగభేదంబు నరయకుండ
    నిశిత సాయకపంక్తుల నిగుడదొడగే.

గీ. అతిదరిద్రత నిష్టార్దమందుఁ గాంచు
    క్షుద్రతతివోలె లుబ్దమై సుదతిచూపు
    లామనోహరచిత్రరూపామృతంబు
    నానుచున్నను బరితృప్తి నందవయ్యె.

అప్పుడు నేనామెయవస్థం దిలకించి యిట్లని తలంచితిని. ఔరా! చిర కాలమునకు మకరధ్వజుండీ చిత్రస్వరూపము నాశ్రయించి నిజసుమసాయకనికరమున కీమె హృదయమును లక్ష్యముగా జేసికొన గల్గెను. ఈతడు. దివిజుడో, మనుజుడో, యురగుడో మఱెవ్వడో యెరుంగక యన్వయాచారముల దెలిసికొనక యీ చిత్రపట మందు జూచినమాత్రముననే మన్మధునకు లోనై శృంగారసమున మునింగి చిత్త ముత్తలపాటు జెంద నింద్రియములు స్వేచ్చ వహింప మైమఱచి గాఢోత్కంఠయై యున్న యీమె ముం దేమగునో తెలిసికొనజాలకున్నాను. ఇట్లెంతకాలము మమ్మీమె దుఃఖింపఁజేయునో, యీయనురాగము తుదకెట్లు పరిణమించునో, యీమె యవస్థ విని తల్లి యెంత తల్లడిల్లునో, తండ్రి యేమిచేయఁ దలంచునో యార్యురేమని యాలో చింతురో, పరిజను లేమి చెప్పుకొందురో, పురాతనకర్మఫలం బెట్లున్నదో నిశ్చయింపఁ జాల కున్నాను. కార్యగతులు కర్మాయత్తము లగుటచే నీ యపౌరుషవ్యాపారము నందు విధినిర్ణయ మెట్లుండునో తెలిసికొనుటకు వేచియుందునుగాక యని నిశ్చయించు కొని తత్కాలోచితముగా నామె కిట్లంటిని.

ప్రియసఖీ ! కౌభికమల కాస్తుఖాది లక్షణంబులు లేకుండుటచే నిందు లిఖింపఃబడిన పురుషుం డుపేంద్రుండు గాకుండుట నిక్కువము. మరియు మకరేక్షు చాపాది పరికరములు లేకుండుటచేతఁ జేతోభవుండును గానేరడు. భర్తృదారిక తలంచు చున్న ట్లింతడు వేఱొక్కడై యుండును. కావున వీరిరువురు నోడిపోతిరని చెప్పి యీ కిన్నరద్వందమును బంపివేయుము. నీవింతకుఁ బ్రత్యక్షముగను జిత్రపట మూలమునను వినికి వలనను దెలిసికొన్న యశేష సుర సిద్ధ విద్యాధరోరగ నరేంద్ర రూప స్వరూపములకన్న వీకితం డపురూప స్వరూపుండుగాఁ దోఁచెనేని యిచ్చట నుండి సత్వరమ లెమ్ము. సావకాశముగ నంతఃపురమును బ్రవేశింపుము. అందేకాంత ముగఁ గలతలేని చూపులచేతను, మనస్సు చేతను వీని నిరూపింతువుగాక. అంతవరకు నిజ మెరుంగుట దుర్లభము. ఇచ్చట కెవ్వఁడైన నేపని మీఁదనైన మనకు దెలియకుండ పృధుల పటభరాక్రమణమైన నళినదళశిఖర సుకుమారములగు నీరజాంగుళుల యందలి వణకును నిశ్చలముగఁ గూర్చున్నను శ్రమజలంబుతో నిండియున్న నీ శరీరాయాస మును దిలకించి యీ విధము గులవృద్ధుల కెరింగెంచిన నిన్ను కష్ట పెట్టి యుంటిమని వారు సఖులమగు మాపైఁ గుపితు లగుదురని నేను చెప్పఁగా నా మాటలధోరణి వలన నామె నిజమగు నవస్థను నేను దెలిసికొంటినని గ్రహించి సస్మితాపాంగతరళి తాక్షి విక్షేపమున నాకుఁ దనహృదయము నెరింగించుచు నాచేతికా చిత్రపట మందిచ్చి పరి జనుల విడచిపెట్టి యతిరయంబున నంతఃపురమున కరిగెను.

అందు గోమలమగు మరాళ తూలికాతల్పమునఁ గూర్చుండి నాచేతి యందున్న పటము గైకొని యత్యంతాదరమున నాకిట్లనియె. సఖీ ! తారావళీ ! ఇట్టి పురుషుని నీ వెచ్చటనైనఁ జూచియుంటివా ? ముల్లోకముల యందలి యువకుల రూప ములు చిత్రించునప్పు డెందైన నిట్టి యుత్కృష్ట రూపమును గాంచినట్లు జ్ఞాపక మున్నదా? వీని నెట్లెరుంగనగునో వచింపుము. త్రిభువనములలో వీని నెచ్చట‌ వెదుకఁ గలము ? ఇతం డెట్లు నాకన్నులంబడును ? దురాత్ముఁ డగు మరుఁ డను వేఁటకాడు దీపహరిణివలె వీని రూపమును నాకుఁ జూపించి మదీయ నయనసారంగద్వయము నపహరించి చలించుచున్న మనమును గూడ వశము జేసికొనెనుగదా ? ఇందులకు బ్రతీకార మేమో సత్వరము చెప్పుమని తొందరఁబెట్టుచుండ నే నౌరా ! ఈ మత్త కాశిని చిత్త మనంగజాయత్తమై మిగుల యలజడిం బడుచున్నది ఇప్పు డీమెను మారు ధోరణిఁబెట్టి మనమున కించుక విశ్రాంతి గలుగఁజేసెదంగాక యని నిశ్చయించి యామె కిట్లంటిని.

నెచ్చెలీ ! చిత్తమున స్వస్థతం జెందుము. బుద్ధిమంతుల యంతఃకరణము నకుఁ గోచరింపని దేమికలదు ? మానసంబున కగమ్యమును నసాధ్యమును నెద్దియును లేదు. అశరీరుండగు మన్మధహతకునకు లోఁబడి నీవిట్లుండుట దగదు. ఆ పురుషుని నీవు చూడనట్లే తలంచుకొనుమని ప్రబోధించు నాతో మందహాస భాసురల ముఖార విందయై ప్రియసఖీ ! నా మనము నాకే స్వాధీనము గాకున్నది. నా మనోహరు నన్వే షించు భారమంతయును నీమీదనే యున్నదని వచించి యామె దీర్ఘనిశ్వాస మొన రించి యూఱకుండెను.

అప్పటినుండియును మన్మధగ్రహ మామె మనమున నావహించి నిశ్శంక ముగా బాధించుచుండెను. స్మరశరనికరా ఘాతమున నామె మేను గృశించుచుండెను. అనవరత నేత్రవారిధారలవలె నామె యుబలాటము మెండయ్యెను. స్వప్నమునఁ గనం బడిన యా సుందరాంగుని వృత్తాంతములే యామెకు ముచ్చట లయ్యెను. చిత్రపట నిరూపణమే వ్యాపారమయ్యెను. ఆశాప్రసర వినోదములగు మనః ప్రవృత్తులే సఖురాం డ్రయ్యెను. వానిఁగూడు తలంపులే లీలోపకరణము లయ్యెను. కుసుమశరవికారములే క్రీడలయ్యెను, మదనతాప నివారణమున కొనఁగూర్చిన చల్లని మైపూఁతలే సర్వాను గంధాను లేపనంబు లయ్యెను చెమ్మట లార్ప నొనర్చిన కర్పూర విరచనోపచారమే పత్రాంకరచనావిలాస మయ్యెను విన్యస్తసరస బినప్రవాళవలయాదులే దివ్యభూష ణములయ్యెను. మేన నుంపఁబడిన కమలకైరవాదులే కుసుమహారము లయ్యెను. కదళీ దళములచే విసరఁబడిన వాయువే నేపధ్యవిశేష మయ్యెను.


గీ. అతనుపరితాప దుర్దశ యను మహాప
    థంబు నందేగనెంచి యత్తరుణిమిన్ని
    కరములను బెట్టఁబడు బినకంకణముల
    నెపమునను శాంఖవలయముల్‌ నెమ్మిఁ దాల్చె

గీ. ఆమె నిర్మలహృదయాహతాతిపాత
    కమున మరుఁడు లూతాకృమిత్వమును గాంచెఁ


    జలువకై కూర్పబడిన బినవ్రజంబు
    దత్రచిత నూత్నతంతు సంతతుల గాఁగ

గీ. చెలువపైనున్న తృటితరాజీవదళమృ
    ణాళపద్మ సందోహనిర్ణయము గనఁగ
    నంగలావణ్యవారి నీరాకరమున
    మెలఁగు కరిలీల మదనార్తి మెలఁత యొప్పె.

ఇట్లా బాలికాభరణ మదనరస విమోహితయై తదాయత్తమగు చిత్తముతో మేన నేది సోఁకినను ద్వదాలింగనముగ నెంచుచు గనంబడిన దెల్లఁ ద్వదాకారపరిణ తంబుగఁ దిలకించుచు, నెవరేమనుకొన్నను త్వత్కథాప్రసంగమే యని సమీపమున కేఁగుచు, నెచ్చట నేమి చప్పుడైనను వాని మాటల పాటవమే యని చెవియొగ్గి వినుచు, నిట్లు మన్మధతాపమున ధైర్యము చెడియున్న యామెను సంతతము నా యండ జేర్చు కొని శుభనిమిత్తముల దెల్పి దిటవు గరపుచు, సుశకునము లెరింగించి భయము దీర్చుచు, నుపశ్రుతుల నిర్ణయించి యోదార్చుచు, ననేక విధముల, దదీయచిత్తమున కుపశాంతి గల్గించుచు, నా చిత్రపటమునం గల రూపమును ప్రతిపాంధునకు, బ్రతి చిత్రకారునకు, బ్రతి వృద్దునకును జూపించుచు నతండెవ్వరో యెరుంగుదురా యని ప్రశ్నించుచు నుండ గొంతకాలము గడచెను.

ఇట్లుండ నొకనాడు హాటకేశ్వరునిపూజ పాతాళగణుండను నొక వృద్ధ భుజంగతాపసి యట కేతెంచి యా చిత్రపటమున నున్న రూపమును జూచు స్మృతి నభినయించుచు నా ప్రియసఖి కిట్లనియె. పుత్రీ ? వెనుక నొక చైత్రపూర్ణిమయందు దేవునకు విశేషముగ బూజసేయ బ్రహ్మకమలములకై సురలోకమునకేగి యందుండి భూమండలముమీదుగా దిరిగి వచ్చుచుండ నొకానొక పర్వత సమీపమున నశోకవృక్ష చ్చాయ నాసీనుడై యున్న వీనిని జూచియుంటిని. కాని వృద్ధుండ నగుటచే నుత్సా హము లేకపోవుటవలనను బ్రయాణపు తొందరచేతను, వాని వృత్తాంత మరయనైతిని. మృగయాగతుండగు క్షోణీంద్రుడో, స్వైరవిహార మొనరించు విద్యాధరోత్తముడో, లేక పుడమి దిరుగు గుతూహలమున నేతెంచిన దివ్యుడో నే నెరుంగనని చెప్పిపోయెను.

ఆ పలుకు లాలించి మదనశరావిద్దహృదయయై యా యించుబోణి మించిన తమకమున నా పురుషు నెరింగునట్లు, చూచినట్లు సన్నిధి కతం డేతెంచినట్లు తనకను కూలుడైనట్లు దలంచుచు ససంభ్రమమున నాతో నిట్లనియె.


గీ. ఏదియో యొక్క విధమున నితని నన్ను
    గలుపుమా వేగఁ బ్రియసఖీ ! కలుపకున్న
    నిక్కము వచింతు వినుము యింకొక్క గడియ
    యైన మనఁజాల విడతుఁ బ్రాణనిలముల.

అని పలుకుచు దెలివిదప్పి శయ్యయందు బడిపోయెను. అప్పుడు నేనామె

నిశ్చయ మెఱింగి అయ్యో ! ఇదేమి ! ఆధారరహితమై, యచింత్యమై, యపౌరుషే యమై, యచిరోపసాధ్యమై, కడుంగడుదుష్కరమైనట్టి యిట్టిప్రయత్నమును బూనుచున్న దేమి? నేనిప్పు డేమిచేయుదును ? ఎందుబోవును ? ఏ యుపాయమును బన్నుదును ఏ దేవుని బ్రార్దింతునని నిముషమాత్రము జింతించి స్వయం ప్రభోధిత నై నాచిత్త మున కెట్లుతోచిన నట్లొనరింతుగాక, విధివిధాన మెట్లున్న నట్లు జరుగగలదని నిశ్చ యించి యందుల కనేకోపాయంబు లాలోచించుచు దుదకొక నిర్ణయమునకువచ్చి దానిని నిర్వహింపబోయి యతిత్వరితగతిదిరిగివచ్చి సఖీ ! నీ ప్రతిజ్ఞ నెరవేరినది. నీ వల్లభు నితో గలసికొంటివి. ముందు జూడుమని పలుకు నామాటల విని యా యబల చటు క్కున మోమెత్తి నిజస్వరూపము వేఱొక పటమున లిఖింపబడి యాపురుషపాంతికమున జేర్ప పడియుండుట దిలకించి యామెనవ్వుచు నిది యేమని యడుగ నేనిట్లంటి.

దేవీ ! ఏదియో యొకవిధమున నిన్నతని గూర్చుమని కదా నా కాదేశించి తివి. ఈ యుపాయమున నీ చిత్రమూర్తితో ని‌న్గూర్ప గలిగితిని. నే నిప్పుడు విద్ద విజయు డను చిత్రకారునియొద్ద కఱిగి జిత్రకళా నైపుణ్యము దేటపడురీతి నీ ప్రతి బింబమును. లిఖింపజేసి తెచ్చితిని. ఆ పటమును దీనితోగూర్చి చిత్రప్రకారమున మిమ్మిరువుర నిట్లు గలయజేసితిని. ఇందువలన నీ తలంపు పూర్తియైనది గదా ? మరియు నా దొక చిన్నవిన్నపము గలదు. గొప్ప ప్రయత్నముననైన సాధింపజాలని పదార్థమును తొందరపడి కోరుట సమంజసమేనా? నీ కోర్కె నెరవేర్చుటకు దగిన ప్రయత్నమును నేను దప్పక చేసెదను. అంతదనుక నీహృదయంబు దృఢపఱచుకొని వేచియుండు మని వచింప నా కామె యిట్లనియె. సరే. కానిమ్ము ఈరీతి నైన నా ప్రతిజ్ఞ నెఱవేర్చి మిగుల నుపకార మొనరించితివి. చిత్రరూపముననైన నేను నా మనో హరునితోగూడియుండుట దిలకించుచు జీవనములనిల్పికొందు నని బల్కి యాపటమును బ్రాణపదముగ నంతికమున బెట్టుకొని యెట్లో కాలము గడుపుచుండెను.

అట్లనంగతాదుస్సహమున ననేక విరహావస్థలం బడుచున్న యా యన్ను మిన్న హృదయాంధకారమును సాంద్రాంజనచ్చ విగలమేఘములచే దట్టముగ జేయుచు, ననేక వర్ణముల దాల్చిన నింద్రధనస్సుచే నామెకు విచిత్రములగు కోర్కెలం గలిగించుచు, శంఖదళమువలె దెల్లనైన బలాకపక్షులచే నామెకపోలములకు బాండిమం బాపాదించుచు, నగ్నివలె బ్రకాశించు మెరుపులచే నామె మన్మధతాపము నభివృద్ది నొనరించుచు, మధురావిరళమయూర కేకారవముచే పంచమస్వరంబున నొప్పు నామె హుంకారమును దీర్ఘముగ జేయుచు, మరకత మణిప్రదీపులం బరగు పచ్చిక బట్టులం గలిగి, స్వచ్చజలాపూరితములగు మనోజ్ఞపల్వలములు గలిగి చల్లనైన దినము లచే నొప్పుచు, విశాలములగు జలాశయముల బూరించుచున్నను వియోగినీ మాన నాశయముల శోషింపజేయుచు, జగజీవనైక హేతువయ్యును పాంధులకు బ్రాణాంత కారియై మదనమిత్రమైన వర్షకాలమేతెంచెను. అప్పుడు.


చ. ధరణి మనోజ్ఞ కందళ యుతంబు నభం బది మేఘడరంబం
    బరయ నటన్మయూర మధురారవరుద్దము లెల్ల దిక్కులున్‌
    సరసకదంబపుష్పవన సంక్రిమితంబులు శాంతవాతముల్‌.
    దొరఁగు ననంగ రాగజలధుల్‌ జలియింప వియోగిచిత్తముల్‌.

అప్పుడొక్క_ దినమున నామె తల్లి సన్నిధినుంచి శేఖరిక యను బ్రతీహారి సరగున నేతెంచి, భర్తృదారికా ! నీ జనని విజయరేఖ యిచ్చటకు వచ్చుచున్నది. ఎదు రేగి స్వాగతాదివిధుల నెరవేర్పుము. పూర్వము శ్రీదేవి పసితనమున జలధిమధ్యమున నున్న వైకుంఠము వీక్షించి దాని నభిలషింప యామె మరిపెమును దీర్చుటకు జనకుం డగు రత్నాకరుండు సముద్రమధ్యమున దుర్గమాగాధవిభ్రమణముల నడుమ నొకచోట నీటితుంపురులైన దూరమునుండియును స్పృశింప శక్యము గాకుండునటుల దేవతా ప్రభావంబున నసమశిల్పానాభిరామముగ నిర్మింపజేసిన మాణిక్యాయతనం బొండు గలదు. దానియందు జంద్రకేతుడను పేరం బరగు మహేశ్వరుండు బ్రతిష్టింపబడెను. ఆదేవోత్తము నారాధించియే యాశ్రీదేవి యభీష్టసిద్ధిం బడసెను. అట్లేవానిని భక్తితో నర్చించు యువతులకోర్కెలు సిద్ధించునను దలంపుననే సకలభువనవర్తినులగు ముగు దలు హృదయవాంఛితముల బడయుటకు సర్వదా యాదేవు నారాధించుచుందురు. ఈవర్షకాలమున నచ్చట బవిత్రకోత్సవము గొప్పగా జరుగును. ఆయుత్సవమునకు నిన్ను గూడ నేడు తోడ్కొనిపోవ మీతల్లి యిట కేతెంచుచున్నది. కావున కన్యాలంకార యోగ్యములగు భూషణముల దాల్పుము సత్వరమ లెమ్ము సర్వవాంఛితప్రదాతయగు శంకరుని దర్శింపుము. ఆ దేవుడు నీకు బ్రసన్నుడై యభీష్టముల దీర్చునని శేఖరిక పలుక నుదయసుందరి సంతోషముతో రహస్యముగా నాతో నిట్లనియె.

తారావళీ ! అంబ నన్ననుకూలదేవతాసేవకే నియోగించుచున్నది. నాయభీష్ట మును దీర్చువరకు నేనాదేవుని బ్రతిదినము నారాధించుచుందును. వాని యనుగ్రహము గలిగిన నీ చిత్రపటమున నున్న మనోహరుడు నాకు లభింపగలడని పలికి సకలసఖీ పరివారముతో గదలి ద్వారసమీపమున కేగునప్పటికే కుబ్జ వామన కిరాత కంచుకి పురంధ్రి కాప్రాయ పరిజనముతో విజయరేఖ యట కరుదెంచెను.

అప్పుడు కృతప్రణామయగు గూతురి నాలింగనపురస్సరముగ నక్కునం జేర్చుకొని తల్లి ముద్దాడెను పిమ్మట విజయరేఖ యుదయసుందరితో నందుండి వెడలి సముద్రగర్భోపకోణము ననుసరించి వలయాకారముగ మార్గమున నిర్గమించి సాగ రాంతరమున నున్న దేవాలయమును నెదుట వీక్షించి మణిప్రాకారాంతమున ననేక దివ్యరత్నకాంతులచే దేదీప్యమానముగ నున్న యా యూశ్వరాలయమును ప్రవేశించెను, అందు బ్రతిష్ఠింపబడిన సర్వలోకేశ్వరు నారాధింప నఖిలభువనములనుండి యేతెంచిన పురంధ్రీమణులహమహమికముగ ద్రోపులాడుకొనుచు జేయు వారిపూజలం బడయు చున్న నయ్యంబికానాధుని దర్శించి యా యాదిదేవుని యధావిధిగ విజయరేఖ యర్చించే యుదయసుందరిచేతగూడ పూజానమస్కారముల నిర్వర్తింపించి పిమ్మట నందు నివసించియున్న పారాయణియను తపస్విని సన్నిధికిం దోడ్కొనిపోయి యామెకు నమస్కరింపజేసెను. ఆ తపస్విని దీవనలం బడసిన తనూజతో విజయరేఖ వచ్చిన దారి నిజనివాసమున కేగెను. నాటినుండి యుదయసుందరి ప్రతిదిన మా చంద్ర కళాధరు నారాధించి వచ్చువరకు భుజింప నని నియమము జేసికొని యతి భక్తితో నాదేవు నుపాసించుచుండెను.

మఱొకనాడు నిత్యయాత్రానుక్రమముగ సకలసఖీపరివృతయై యా రమణి యత్యుత్సాహమున నమ్మ హేశ్వరుని బూజింప, నచ్చటి కరిగి పుష్పాచయమునకై యా యాయతనమందున్న బూదోటకు సఖులతో నేగెను. సారంగిక యను ఛత్ర వాహిని సురాలయాంతరమున నొరులు జొఱని చోటి కేగి యందొకమూల వాడుక ప్రకార మా చిత్రపటమును గొడుగున బెట్టి త్వరితగతి నేతెంచి మమ్ము గలసికొనెను.

అట్లు మేమందఱ మతిసంతోషమున బుష్పాపచయం బొనర్చుచుండగా నాదేవాలయమునుండి పారాయణి యుదగ్రకోపమున నోరోరి! మూఢ! శుక్తిభంగ దుష్కృతమున నీపటమును శిఖగా బడసి చిలుకవుగమ్మని యెవనినో శపించు కోలా హలము మాకు వినంబడెను. పట మనుమాట జెవి బడగనే యుదయసుందరి యులికి పడి యం దింకేపటమున్నదని సంశయించుచు కుసుమాపచయము మాని శరవేగమున నట కేగ నేనును నామెతో బోతిని.

ఆ దేవాలయము నొకమూలగా నున్న మండపముమీద నత్తపస్వినియెదుర దన కత్యంతప్రియమైన చిత్తరువును జేత బట్టుకొని శపింపబడిన పురుషుడు నిలువబడి యుండుట యుదయసుందరి తిలకించి అయ్యో ! ఈ యంధకారాతి నారాధించు చున్నందులకు నాకు మంచి ప్రాయశ్చిత్తమే జరిగినది. నిత్యమును మన్మనోహరుని చిత్రపటముననైన దిలకింపకుండ జేసెను గదా ! అని చింతించుచున్నను డెందమున జాలిగొని యా తపస్వినిని బ్రార్ధించి వానికి శాపాంతము గలుగజేసెను.

పిమ్మట దేవుడగు చంద్రచూడుని నిరుత్సాహమున బూజించి యనాదరమున దపస్వినికి నమస్కరించి సలిలసేకములేని మృణాళినివలె, సూర్యుని బాసిన పద్మిని విధమున, జంద్రుని విడచిన కుముదినిగతి, వెన్నెలను వదలిన రాత్రిలీల, యా చిత్ర పటమును నెడబాసిన యా బాలిక మిగుల పరితాప మందుచు జీవితమునం దాశ లేనట్లు మోము వంచుకొని త్వరితగమనమున నాశలడుగంట యెరిగినదారియైనను వడుగడుగు నకు నేనుదారి జూపించుచుండ నిజభవనమున కేతెంచెను.

పిమ్మట పరిజనుల నెల్లర విడచి నన్నుగూడ సంభావింపక భవనాభ్యంత రమున కరిగి తల్పమున శయనించెను. ఉదయమున నే ననేక విధముల బ్రబోధించు చుండ నెట్లో ప్రాతఃకృత్యముల నిర్వర్తించెను. అప్పటినుండియును నామె సూర్య మండలముచే బ్రకాశమానమగు బగళు బంగారపుంజమును వహించినట్లు శరీరమును దహించుచున్నవనియును జంద్రబింబముతో వన్నెకెక్కు రాత్రులు దృషద్గోళమును దాల్చినట్లు హృదయమును బాధించుచున్నవనియును దలంచుచు నెట్లో కాలము గడపు చుండెను.

అంత వానకారు గడచి బంధుజీవప్రబోధినియగు శరత్సమయ మేతెంచుట యును నదివలెనే యామె కృశింపసాగెను. మయూర జాతివలె హీనస్వరమయ్యెను. మేఘసంపదవలె వెల్లదనముబూనెను. సూర్యునిమూర్తివలె నత్యధికమగుతాపమును వహించెను. కుసుమ శర విసరాఘాతమున, నపరిమితతాపమున బడియున్న యా యన్నులమిన్న కెన్నివిధముల శిశిరోపచారము లొనరించుచున్నను శాంతి గలుగ దయ్యెను.

ఇట్లు మదనునిబారిం జిక్కి యామె పండువెన్నెలచే హృదయాహ్లాదకరమై, కైరవవనమునుండి ప్రసరించు శీతవాతముచే మనోహరమైన యొకనాటిరాత్రియందు సౌధశిఖరమున మంచు పడకుండ తామరబాకులతో గూర్పబడిన విశాలమగు పందిరి క్రింద హంసతూలికాతల్పమున శయనించినది ఉదయమున లేచిన పరిజను లందు రాజ పుత్రిక కనంబడుటలేదని తొందరపడుచుండ నేనును మేల్కొని తొట్రుపడుచు యా మేడమీదను, క్రిందిభాగమునను, బ్రక్కగదులయందును బరికించి యామెయెందులకైన నూతనగృహమునకేగినదేమోయని యచ్చటను, దరుచు దిరుగుచుండుచోటులను, క్రీడా స్థలములయందును నెంత వెదకినను నామె జాడ గనబడలేదు. ఆమె నెడబాయుటకు నేను మిగుల వగచుచు నిట్లని చింతించితిని.

ఔరా! నన్ను విడిచి యెన్నడు నెచ్చటికిని బోవని రాజపుత్రిక నే డెందేగి యుండును? బయట నిద్రించియున్న యామె త్రిభువనమోహనాకారమును గాంచి మోహించి యెవ్వడైన నభశ్చరుం డీమె నపహరించుకొని పోలేదుగదా? అత్యంతాద్భుత సౌందర్య సారముగల యీమెరూపమువలన దమప్రసిద్ధి కొరంతవడుచున్నదని యెంచి విద్యాధరాంగనలీమె నెందైన మరగుపరచి యుందురా, లేకున్న నెవడు కోరునను భయమున నీమె పాతాళము నుండి తొలగింపబడి యిచ్చట మరుగుపరుపబడెనో యా భుజంగాధిపు డీమెవృత్తాంత మెట్లో తెలిసికొని యీమెను దీసికొనిపోలేదుగదా ! నిద్రించుచున్న యీమెంగాంచి లక్ష్మియనుకొని అయ్యో! నాపట్టికెట్టి యిక్కట్టు సంభవించెనని జాలింగొని సముద్రుం డీమెను నిజనివాసమునకు దోడ్కొని పోయి యండడుగదా ! తన మనోనాయకుని నెందైన వెదుకనెంచి యుత్పన్నానేక సంకల్పయై యీమె యెచ్చటికైన దూరముగా బోయెనేమో? లేక తాను కోరిన పురు షుండు కలలో గాకుండ నెదుటకు వచ్చి ప్రణయకోపమున వెడలిపోవ వానియందలి యనురాగమున వెనువెంట నెచ్చటికైన నీమెపోయి యుండునా? అట్లుగాకున్న ననంగ తాపములు సహింపజాలక నెందైన జలాశయమున బడి యాత్మహత్య జేసికొనలేదు గదా? లేక ప్రాణముల నెడబాయ నెచ్చటనైన నొకవృక్షశాఖయందురిబోసికొని యసు విసర్జనం బొనర్చుకొనెనేమో?


చ. వదనక ళైక మత్సరవిపక్షుఁడు చంద్రుఁడు మ్రుచ్చులించెనో ?
    తదమలదంతచంద్రికలఁ దారలు గోరి హరించియుండెనో ?
    మదవతి కేశపాశతిమిరంబున లోఁ గొనెనో తమ్మిస్ర, యే
    మొదవెనె ! బైట శయ్యపయి నున్నకతంబున నీకృశాంగికిన్‌.

అటులఁ గాదేని -

గీ. ఇందుకిరణాంచలముల దీపించు ప్రబల
    మదనదావాగ్నిఁ దరుణి భస్మంబుగాఁగ
    దానిఁ గాసారశీతవాతంబు దాల్చి
    దూరముగఁ జిమ్మియుండు నస్తోకగతిని.

ఆమెజాడ యిందెచ్చటను గనుపింపదు, అత్యంతనిపుణ మగు నూహా ప్రపంచమందెందును నామె యునికి గోచరింపదయ్యెను. నా ప్రియసఖి లేకుండ నామె తల్లిదండ్రులయెదుటి కేమొగము బెట్టుకొని పోదును? ఉదయసుందరి యెచ్చటను గను పిం‌పలేదని యెట్లువారితో వచింతును ? ఆమాట విన్నతోడనే దుఃఖాపన్నములగు వారి ముఖముల నేనెట్లు వీక్షింపగలను? తల్లి విజయలేఖ పరిదేవనము విని నే నెట్లు ప్రాణ ముల నిల్పుకొనగలను? ఉదయసుందరి‌ కేదిగతియయ్యెనో నాకును నదియేయగుగాక? ఈవృత్తాంతమెల్ల విజయరేఖకు నాసఖి కాళిందిమూలమున నెరింగించినమీదట నేమి జరుగునో ప్రచ్ఛన్నముగ నుండి తెలిసికొని పిదప నెచ్చటికైన బోయెదను. తద నంతరమేది యుచితమో దానిం జేసెదనని నిశ్చయించుకొని యట్లొనరించి యూరి బయటనున్న చండీశుని జీర్ణాయతనమునకుం బోయి యందు వేచియుంటిని.

పిమ్మట కాళిందినీమూలమున దుఃఖవార్త నెరింగినతోడనే శిఖండతిలకుం డత్యంతచింతాకులస్వాంతుడై నలుగెలంకుల నామె నరయుటకుఁ బరిజనుల బుత్తెంచెను. వారారాజపుత్రిక నరయఁ బ్రతిగృహంబునకుఁ, బ్రతిదేవాలయమునకుఁ, బ్రతిసత్రము నకుఁ, బ్రతి కరితురఁగశాలకుఁ, బ్రతికర్మవిద్యాదిస్థానమునకు, బ్రతివనంబునకుఁ, బ్రతి జలాశయంబునకు నత్యంతవేగంబునఁ బోయి యందందు వెదకుచుండ నా రాజధాని యెల్ల క్షణములో వ్యాకులీభూతమయ్యెను.


గీ. వాద్యములు గీతములు మంగళోద్యమములు
    గలకలలు లేక పురమెల్లఁ గానుపించె
    సరసపాత్రప్రవేశ మాసన్నమైన
    రమ్యరంగస్థలంబు గరంబుబోలి

గీ. అప్పుడాహారవస్త్రంబు లానృపాల
    యమున నొకఁడైనఁ బడయలే దనగవచ్చు
    సిరినిఁ బాసినరీతి నాచెలువ విడచి
    దుస్థితినిఁ బొందె జనమెల్ల దుఃఖమునను.

ఇట్టి ప్రవృత్తియందున్న సమయమున నామెను వెదుకబోయిన పరిజనులెల్ల విఫలప్రయత్నులై వచ్చియుండుట యెరింగి దఃఖించుచున్న ఱేనితో మంత్రిసత్తముం డిట్లనియె.

ఆర్యా ! దఖింపకుము. సంసారరీతు లతివిచిత్రములు, వాంఛితములు వ్యవసాయసాధ్యములు, కార్యములు, ప్రజ్ఞానుబంధసిద్దములు. పౌరుషంబున బడయ రాని దెద్దియు లేదు. బుద్ధిబల మసాధ్యముల‌ గూడ సాధింపగలదు. హృదయస్థయిర్య మున దుర్దర్శనంబులనైన గనుంగొన వచ్చును. మనంబున కెందును జొఱరాని చోట్లు లేవు. అని తత్కాలోచిత భాషణముల నిదర్శనపూర్వకముగ వచించుచు ముందొనర్ప దగిన కృత్యముల నెరింగించుచు నా ఱేనిమనంబున కించుక యుపశాంతి గలిగించెను.

పిమ్మట శిఖండతిలకుండు మంత్రిసత్తముని యుపదేశానుసరణి నభీష్టసిద్ధికై కులవృద్దులచే దేవతాపూజలు చేయించుచు, నిమిత్తిజ్ఞులవలన నిమిత్తముల నెరుంగుచు, శాకునికులమూలమున శకునముల దెలిసికొనుచు, విదేశస్థులఁ ప్రశ్నింపఁ బరిజనుల నియోగించి విరోధినిలయంబులఁ బరీక్షింపఁ బ్రణిధివర్గము నియమించి, మిత్రస్థాన ములఁ బ్రస్తాపింప దూతలం బుచ్చి, త్రిభువనంబుల నెల్లెడలఁ బరిశీలింపఁజేయనెంచి నా తండ్రితో నిట్లనియె సైన్యాదినాయకా ! రత్నమౌళీ ! సకల భువన ప్రచార సమర్దు లగు పన్నగభటులచే సర్వలోకముల యందు నెందును విడువకుండ మదీయాన్వయైక జీవితమును వెదకింపు మని పుత్రికా వియోగవిధురిత చేతస్కుఁడై పలుకు రాజునకు మనఃప్రియంబు గలుగులాగున నా తండ్రి యిట్లనియె. దేవా! ఉదగ్రశక్తిగలిగి దుర్గమంబుల గమించుటయందును, దుష్ప్రవేశంబులబ్రవే శించుట యందును, దుర్లంఘ్యంబుల దాటుటయందును, నిపుణులై ప్రపంచమం దెల్ల డల సహజప్రభావంబున సంచార మొనర్చుచు మనోవేగంబు గలిగి‌ ప్రసిద్ధి కెక్కిన వీర భటులు గొంద ఱవంతకులజాతులు, గొందరు వాసుకివంశజులు, గొందరు తక్ష కాన్వయసంభవులు, గొందరు కర్కోటక గోత్రజులు, గొందరు కుళికసంతతిప్రభు వులు, గొందరు నీయాది పురుషుఁడగు శంఖపాలుని వంశోద్భవులు, గొందరు మహా పద్మసంతానప్రసూతులు గొందరు పద్మగోత్రసంభూతులు గలరు. ఈ యెనిమిది వంశములయందును బ్రసిద్దులైన భుజంగమభటులును స్వామిహితంబుపొందె సకల లోకంబుల యందును నుదయసుందరుని వెదకుటకు సమర్దులని వచించినవారి నెల్లర రావించి రాజుమ్రోల నిలిపెను.

రాజు వారి నెల్లర పేరుపేరువరుస నాదరించుచు, వారు వెదుకవలసిన యుదయసుందరి చిత్రపటంబు నొసంగుచు, వారి నుద్దేశించి యిట్లనియె. ఓ వీరులారా! మీ రెల్లరును ముందుగా నీ సప్త పాతాళంబుల వెదుకవలయును. పిమ్మట భూలోక మున కేగుఁడు. అందు జంబూద్వీపంబునఁ గదంబ మహావృక్షములచే సుందరమగు మందరగిరియందు గుంజాక్షుఁడును, జంబుద్రుమంబులచే వెలయు గంధమాదనంబున నుత్పలుండును, పిప్పలవృక్షములచేఁ బ్రకాశించు విపులమను మహీధరంబునఁ దీప కుండును, న్య గోధవృక్షములచే నొప్పు సానుమతియను నగధరంబునఁ గాలినృకుం డును, నలుగురు వీరులును నాలుగు మహాపర్వతములయందును వెదుకవలెను. మరియు నునిషథమందుఁ దమానకుండును, హేమకూటమునఁ గమలుండును, హిమాద్రి యందు గువలయుండును, శ్రద్ధగా నీమూఁడు పర్వతముల యందును వెదుకవల యును.

శృంగవతికిఁ బర్మకుండును, శ్వేతాచలంబునకుఁ బింగళుండును, నీలా చలంబునకు నీలరోచుండును నరుగవలెను. మహేంద్రము మలయపర్వతము, శక్తిమతి, సంహ్యాద్రి, వృక్షశైలము, వింధ్యభూధరము, పారియాత్రము, కన్యాచల మను నీ యెనిమిది కులపర్వతములయందును. బుష్కరాదు లెనమండ్రును నన్వేషించునది. చైత్రరథంబున శిఖండకుండు, నందనంబునఁ దారాక్షుండు, విభ్రాజమందె విశా లుండు, ధృతియందు సితాదరుండు సంచరించుచు, నా నాలుగు మహావనంబుల యందును నల్వురు భటులు వెదకవలెను. మీద నరుణోదమం దొకఁడును, మానసంబున రెండవవాఁడు, సితోదమందు మూఁడవవాఁడును, మహాభద్రమందు నాల్గవవాఁడును, నీ నాలుగు జలాస్పదంబులయందును ఫణాంకుశ ప్రభృతులు నలుగురును వెదక వలెను. భారతక్షేత్రమున దంభోళి పరికింపవలెను. ఇలావృతంబునకు రమసికేతుం డేగవలెను. తక్కినవారు లంకాలకాది నగరంబుల కేఁగునది. శ్రీశైల కైలాసాది భూధరములందును, జాహ్నవీ రేవారి మహానదులందును, సర్వప్రదేశములందును, జలాశయములందును, నుచితరీతుల భూలోకమునఁ దిరుగు భుజంగభటులకుఁ గమల కంఠుఁడు నాయకుఁడై యుండవలెను.

జంబూద్వీపంబున కావలఁ గల మహాద్వీపము లారింటిలో శాకద్వీపంబున దుర్మదుండును, కుశద్వీపంబునఁ గాలాంజనుండును, గ్రౌంచద్వీపంబునఁ జక్రాహ్వ యుండును, శాల్మలీద్వీపంబున సరళుందును, గోమేదంబున నసీముఖుండును, బుష్క్ల రంబునఁ దాపిచ్చకుండును బరికింపవలెను. అందులవణసాగరము మొదలు స్వాదూరక సముద్ర పర్యంతము గలసప్తాంబుధులయందునగమేద్యదణుప్రభృతి సర్పశౌండీరు లెల్ల దిరుగవలెను. పిమ్మట హృదయవేగుండు నాయకుండుగా నెనమండ్రు కాకోదర భట శ్రేష్ఠు లష్టదిక్పాలుర నగరంబుల సంచరింపవలెను. పిదప స్వర్లోకమున కేఁగి త్రిదశుల రాజధానుల, సిద్ధుల నగరంబుల, విధ్యాధనుల పురంబుల, మిగిలిన దేవతా స్థానముల, బ్రహ్మలోకమువరకు మేరుపర్వతము జుట్టును, వెదకుచు, సప్తోర్ధ్వలోక ములు సంచరించవలెను. ఈ సేన కెల్ల నింద్రవీలుం డధిపతిగా నుండఁగలవాఁడు అని యిట్లు పురాణకమఠమునుండి బ్రహ్మలోక పర్యంతము గల బ్రహ్మాండగర్భ మెల్ల గాలించి యుదయసుందరి యెచ్చటనున్నదో తెలిసికొనవలెనని యా భుజంగ వీరులనెల్ల నుత్సాహపరచి యతిత్వరితగతి నాశిఖండతిలకుఁడు వారిఁ బంపివేసెను.

335 వ మజిలీ

నేను నుదయసుందరీవియోగదుఃఖమును భరించి స్వయముగా నామె ప్రవృత్తి నరయదలంచి యామెకెట్టిగతి గలిగెనో తెలిసికొని యట్టిగతినే పొంద నిశ్చ యించుకొని యిట్లని యాలోచించుకొంటిని. ఉదయసుందరి కెట్టిగతి గలిగెనో యెరుంగకుండ ముందు నే నేమి జేయగలను ? అమె యెవనిచేతనై న నపహరింపఁబడి యుండునను ననుమానమున నెచ్చటికి బోదును ! సీతాపహరణమువలన స్ఫుటప్రతీతు లగు రక్కసులు స్త్రీల నపహరించుటయందు సహజవ్యసనులుగదా ? అట్టిరక్కసు లకు నిలయమైన లంకాపురం బీసముద్రాంతర ద్వీపమునకు సమీపముననే కలదు. కావున ముందుగ నందు వెదకి పిదప మఱొక చోటికిం బోయెదంగాక. భాగ్యవశమున నాకచ్చటనే యామె గనుపించిన నాహృదయవాంఛిత మీడేరగలదు యువకులకు విరాళిగొల్పునిట్టి తరుణీరూపమున నేనందు బోయియింటింటికి దిరుగుచున్న యెడల నాకు గూడ హాని గలుగగలదు. కావుల భస్మ జటావల్క_లాదులచే గృత్రిమతాపసిత్వమును