Jump to content

కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/333వ మజిలీ

వికీసోర్స్ నుండి

333 వ మజిలీ

బాలయోగిని కథ

పిదప మేమిరువురమును లంకాపురమున కేఁగి జరిగిన వృత్తాంతమెల్ల విభీ షణున కెరింగించి కృపాణమును వాని కర్పించితిమి అందుల కారాక్షసేశ్వరుం డానం దమును బొంది యాకృపాణమును నాకుఁ గానుకగా నొసంగెను. దేవర కిప్పుడు నే నొసంగిన మండలాగ్రమదే యని విన్నవించుకొనుచున్నాను. ఈ తపస్విని యెవ్వరో నేనెరుంగను. ఏ కారణముచేతనో మాలంకాపురమునఁ బ్రతిదినము నందందు వల్క లములఁ దాల్చి తిరుగుచు నొకనాఁడు నా కంటఁబడినది. చూచిన మాత్రముననే నేను మదనుని పూములుకులకు గురియైతిని.


గీ. వల్కలపటావగుంఠనాపరత నాత్మ
    వర్షమును గప్పుకొన్న తాపసిని నీమెఁ
    గనఁగ నొరనున్న మదనవీరునికటారి
    చందమునఁదోచె నాదగు డెందమునకు.

మఱియును--

గీ. నడచినప్రయాసవలనఁ జొప్పడిన ఘర్మ
    వారిచే ధౌతమగు నీశరీరయష్టి
    యపుడె నీర్వట్టు వెడలిన యంగజన్ము
    నలినబాణంబువలె వెదనాటె నాకు.

అప్పుడు నేను మకరధ్వజుని తీవ్రబాణముల వేధింపఁబడుచు, మంచిచెడ్డ లెరుంగఁజాలక, ధైర్య మెడల, లజ్జను బరిత్యజించి యా మించుబోణివెంటఁ బోదొడం గితిని నా రాక నెరింగి యాబాల తపస్విని యందుండి పైకెగిరి నిరాలంబమగు నంబ రంబునకుఁ బోయినది. నేనును నుత్పాతవిద్యం బురస్కరించుకొని యామె యొక దివ్యనారీమణి యని తలంచుచుఁ గామగమనంబున నామెవెంట నరిగితిని. ఇట్లు బోవుచు చందనపవనయపరిమళోపగూఢమై గిరినిర్ఝరతుహార నిరాంచితమై యొసఁగు మంద మారుత మొకచో నెమ్మేన సోఁక నసంగతాప మతిశయించుటయును నేనా ప్రదేశమున మాయాద్విజుని రూపమునుబూని యామె ననుసరించి సరసవచనముల వశ్యురాలిగా జేసికొననెంచిన నాయాశయ మెరింగి యాతపస్విని నన్ను విడచి వెండియు మింటి కెగసెను. నన్నువంచించి పోవుచున్నదను కోపమున నిజస్వరూపమును దాల్చి హతాశుండనై యతిజవమున నామెవెంట బడతిని. రావణుఁడు సీతను బలాత్కారముగా నపహరించినట్లామెను గైకొనఁదలంచితిని. అట్లు పారిపోవుచు నామె యిచ్చటఁ బడినది. పుణ్యవశమున జగదేకరక్షకుండవగు నీశరణ్యమామెకు లభించినది పిదప దేవరతో నాకు సంగరము గలిగినది శవపిశిపేశితోత్కర్తన కర్మైకశక్తిగల యాకత్తి నీవు ధరింప దగినదికాదు. నేనొసంగిన కృపాణమో తలంచినంతనే సన్నిహితమగుచుండు దివ్య ప్రభావము గలది. వెనుక నొకప్పు డీ ఖడ్గరాజము స్వప్నమున నాకుఁ గనంబడి దేవాంశసంభూతుఁడగు పురుషునిమీఁద నన్నుఁ బ్రయోగించిన నుపయోగముండనేరదని బలికెను. అజ్ఞానుండనై దీనిని నీమీదఁ బ్రయోగించితిని.

దేవాంశసంభూతుండ వగుటచే నియ్యది నిన్నేమియుం జేయఁజాలక నమస్కరించునదివోలె పాదమూలమునం బడినది‌. కావున నే దీనిని నీ కొసంగితిని. ఈ తపస్విని యందుగల నా మోహమెల్ల ననౌచిత్యవిషయ మగుటవలన, దండధరుని భయమువలన, వివేకప్రబోధము వలన మనంబున నుదారాశయము గలుగుట వలన, బూర్తిగా నశించెను. ఇదియే నా వృత్తాంతము. ఇఁక నాకు సెల వొసంగుము. సత్వ రము పోవలయునని రాజేంద్రు ననుమతము బడసి యా నిశాచరపుంగవుండు సూర్యో దయమైనతోడనే పోవు చీఁకటివలెనే తిరోభూతుఁ డయ్యెను.

ఆ బాల తపస్విని రాక్షస భయిమునఁ గలిగిన వణకుచే నెమ్మేనఁ బొడ మిన చెమ్మటయెల్ల నడంగ స్వస్థచిత్తయె యా మేదినీకాంతుని రూపమును సచ్చ దృష్టులం దిలకించి యెద్దియో స్మృతినభినయించుచు మోమువంచి మృత్యుముఖమున నుండి బైటఁబడిన హృదయమును క్షాళన మొనరించురీతి నవిరళాశ్రుధారలు నయ నంబుననుండి గార వెక్కి వెక్కి యేడువఁదొడంగెను.

పుండరీకుం డామెంగాంచి జాలిఁగొని అన్నా ! రక్క.సుండను క్రూర గ్రహము వలన విడువంబడి వర్షానక్షత్రప్రవృత్తివలె ననివారితముగ నయనఘనజలా సారమును గురియుచున్నదా యేమి ? సహజోష్ణంబులగు నశ్రుధార లీమె హృదయం బునబడ నా యెదను దహింప జేయుచున్నవి గదా ? నేను సంగరమున బడిన కష్ట మును జూచి యామెడెంద మార్ధ్రతంబూని యిట్లు ద్రవించుచుండవచ్చును లేక తన్నట్లు చిక్కులం బెట్టినరక్కసుం డక్షతుండై పోవుటకు విచారించుచుండెనా ? వ్రతనియమము చెడెనని విలపించుచుండెనా ? లేక యితర దుస్సహఃఖానుస్మరణమున నిట్లాపన్నురాలగు చుండెనా ? అదేమై యుండును ? ఏమని నేను నిర్ణయింపగలను విచారకారణం బెరుంగక నేనేమని యంత్రపుం బొమ్మవలె గన్నీరు విడుచుచున్న యీమె నూరడింపగలను ? అని యా రాజేంద్రుండు విదర్కించుకొనుచుండ నా తప స్వినీ కన్యక కలంక ముడిగి నిజకల్కలోత్తరీయమున వక్త్రాంబుజమును దుడుచుకొని కువలయదళ కోమలములగు జూపుల నతనిపై బరపుచు మృధుమధుర వాక్కుల నా నరేంద్రున కిట్లనియె.


శా. ప్రేతస్త్రీగధితాస్రతోయయుతమై, వేతాళికాలూనమాం
    స్వాతిప్రోజ్వలమై, విశుష్కకీకస నికాయాకార వి
    జ్ఞాతంబై విలసచ్చితానలగ తాళ్మంతరంబై కసన్‌
    బ్రేతారణ్యము రక్తభోజనుల కర్ధి వ్‌ వంటయిల్లయ్యెడిన్‌.

మరియు నియ్యది పిశాచలోకనగరములో మహాసంఘసంభృతంబగు నడివీధి వలెనున్నది కదా ?


చ. శిరమున నాంత్రరజ్జువులఁ జేర్చి, మహాజగరోగ్రచర్మమం
    బరముగఁ దాల్చి మూఁపునను బ్రాంశుతరావిరశాస్థిదండమున్‌
    గరమువహించి ప్రేతతతి కంపమునొందఁగ ఫేత్కృతి ధ్వనుల్‌
    బరవుచు నీపరేతపురి భైరవుఁ డుండెను దండపాణియై.

ఇంద్రుగ్రీడాసంక్రాంతకౌణపవిముక్త ఫేత్కారముఖరములగునర కరంక ములయందు గూడ రాక్షసత్వము గనంబడుచున్నది. జంఝామారుతమువలనపైకి రేగు చితాభూతమునకు గూడఖేచరత్వము గలుగుచున్నది. కరాళకోటరకుటీరముల నాశ్ర యించియున్న మర్కటముల కిలకిలారావరౌద్రస్వనంబువలన నీ యశ్వత్ధభూరుహము గూడ భూతభావమును బొందియున్నది. మరియును -


చ. కరములఁ జిమ్మువేగమునఁ గల్గెడుగాలిని శ్రోత్రనాసికాళ
    తరములు మ్రోతబెట్ట, గణనం బొనరింపఁగ‌ నస్థియంత్రము‌ల్
    సరభసవృత్తి నాట్య మొనరించు బిశాచము లిందు గీతవా
    ద్యరతి లయానుగుణ్యముగ నస్రసురాపరితృప్తి నీచమై.

చ. ఫలలముగొంతఁ గక్షములఁ బాణుల గొంతయు శేష్యమాస్యమం
    దలవడఁ గొన్న లుబ్దకుణపాధము గాంచి హఠంబుజేసి యి
    మ్ముల హరియింప వేగ మొక భూతవుడింభకుఁ డడ్డు వచ్చి దో
    ర్బలమున హుంకరించి ప్రహరంబుల నొంచి యలంచు నల్లదే.

నిరంతరమును నరమాంసపుముద్దలం దినుచున్నను దృప్తిజెందని డింభ కుని దన యుత్సంగమున నిడుకొని యుపలాలించుచు నతి నచ్బటైకమగు నిజవక్షో జమును నోటి కందీయ వాడది గబళించి లలత్పిశితవల్లూరమని జప్పరించుచుండ నా బాధ కోర్వలేక కోరలు గనుపించునట్లు నోరు దెరచుకొని మోము బైకెత్తి వికటముగా పూత్కార మొనరించుచు రోదనము జేయుచున్న యీ ప్రేతజాయందిలకింపుము. ఒకచో బిచాచ యువకులు ప్రజ్నలితచితోదరమునుండి కించిదాపుష్టకుణపమును గొని వచ్చి హర్షమున గహకహారావం బొనరించుచున్నారు. మరొకచోట ప్రేతసంఘాతములు, వేరొకచోట వేతాళబృందములు, ఇంకొకచోట భూతకదంబములు, ఇట్లు సర్వత్ర భీభత్సదర్శితంబైన యీశ్మశానమున నిలిచియండుట సకలసౌభాగ్యసమేతుండవై ధరణీ రాజ్యలక్ష్మీధురంధరుండవగు నీకు మంగళప్రదము గాదనివచించు నా తపస్విని పలుకు లాదరించి యా రాజేంద్రుడిట్లని తలచెను.

ఈమె వచించినదెల్ల నిక్కము. ఇచ్చట సర్వత్ర భరింపరాని దుర్వాసన ప్రబలియున్నది. చితాధూమం బెల్లెడల వ్యాపించియున్నది. భూతప్రేతపిశాచముల కాటపట్టగు నీస్మశానమును సత్వరమె విడిచి పెట్టుట యుచితమగును. ఈమెను బ్రశాంతమ తపోధనాశ్రమమున సగౌరవముగ దోడ్కొనిపోయి యందు స్వస్థతం బొందిన పిదప నీమె యెవ్వరో యెచ్చటనుండి వచ్చినదో లంకాపురంబున కెందుల కేగినదో యింత లేబ్రాయమున దాపసి యేమిటి కయ్యెనో మొదలగు వృత్తాంతమెల్ల దెలిసికొనెదంగాక యని నిశ్చయించి యా రాజపుంగవుడు శ్మశానమున కధిష్టాత్రియైన భీషణయను దుర్గాదేవి సమీపమున కేగి ఫాలాక్రమిళిత కరసంపుకూంజలుండై ప్రణ మిల్లుచు నిట్లని సన్నుతించెను.


శ్లో. విద్యుత్పుంజోగ్రనేత్రం పృధుచపల లలజ్జింహ ముద్వర్తగల్లం
    సృక్కాంతోదగ్రదంష్ట్రాప్రకటమసరళసూలపింగోర్ధ్వకేశం
    వక్త్రం కల్పాంతకాల ప్రబలఘనఘటా ఘోష ఘోకాట్టహాసం
    చండ్యాఃస్వర్గారివర్గగ్రసనరకషద్దంత దండంనమామి.

ఇట్లద్దేవిం బ్రస్తుతించి యాతపస్వినిని వెంట దోడ్కొని శ్మశానవాటికనతి శీఘ్రముననిష్క్రమించి నగరమధ్యమున కేగియందు విశ్వభూతియను వృద్ధతపస్విని మఠమున బ్రవేశించెను. అనుచరవిరహితుండై యారాజేంద్రు డర్ధరాత్రమున నొక కన్యాతపస్వినిని వెంటబెట్టుకుని వచ్చుట కా విశ్వభూతి యక్కజంపడుచు నా భూజా నిని యధార్హరీతిని గౌరవించెను. పుండరీకుండా వృద్ధతపస్వినికి నాటిఱేయి జరిగిన వృత్తాంతమెల్ల జెప్పి యామె కానందమును కల్గించెను.