కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/329వ మజిలీ

వికీసోర్స్ నుండి

329 వ మజిలీ

చిత్రపటము కథ

దేవా ! ఇయ్యది మనసైన్యాధిపతి యగు పాంచాలసింహుని ధ్యానపటము. ఆతండు దేవపూజసమయమున నేలినవానియాకృతి నెదుర బెట్టుకొని యర్చించు చుండును. వెనుక నతండు దిగ్విజయార్ధ మరిగినప్పుడు భూమండలం బెల్ల జయించి ద్వీపాంతరముల నున్న రాజ్యములగూడ‌ స్వాధీనము జేసికొన సంబోధిమార్గమున నోడలమీద బయనము జేయుచు సముద్రమధ్యమున ధౌతిసితసైకతముల నతిరమ ణీయంబగు నొక యంతర్ద్వీపమున దిగి యచ్చట బౌర్వాహ్నిక కర్మముల నిర్వర్తించు కొని కొంత సేపు విశ్రమించెను.

ఇంతలో ననుకూలమగు గాలి వీచుటంజేసి ప్రయాణమునకు నావికులు తొందర పెట్ట సత్వరమ యందుండి బయలుదేరి యోడనెక్కెను. ఆ తొందరలో దేవ పూజోపకరణముల కధికారియైన విప్రుం డీ చిత్రపటము నయ్యంతర్ద్వీపమున మరచి వచ్చెను. వారెక్కిన ప్రవహణం బప్పుడు‌ నిముసములో ననేకయోజనము లేగువేగమున బోవుచుండుటచేతను, తాము విడిసిన ప్రదేశమున సముద్రమధ్యమున దెలిసికొనుట దుష్కరమని తలంచి యాచిత్రపటమునకై వారు ప్రయత్నింపలేదని యూరకుండెను.

ఆ పలుకుల నాలించి పుండరీకుడు తల పంకించుచు నాచిత్రఫలకమందు మరొకప్రతిరూప ముండుట యెఱింగి యతి కతూహలమున విమర్శింప నందొక స్త్రీ రూపముగూడ గోచరమయ్యెను. సృష్టికర్త నిర్మాణనైపుణ్యము నధిక్షేపించురీతి మనో భవుని పరిజ్ఞానతటినివలె శృంగారవీరుని రణవ్యూహకల్పనములాగున, త్రిభువన సీమంతనీరూప‌ సర్వస్వపహరణం బొనరించి యుశ్వాసనిశ్వాస శబ్దములులేక దాగి యున్న తస్కరీవిధమున నావృతపటావస్థితయై. హరలలాటలోచ నానలభయమున బారివచ్చి యడగియున్న యసమ శరీరసౌందర్య లక్ష్మివోలె నతి మనోహరాకారయై, శక్రశాపోపహతయగు నూర్వశీరమణివలె జిత్రాకృతియై, దేవీస్వరూపమువలె ననిమిష లోచనయై తపోనిష్టనున్న గౌరివలె ననావిలయై, మదనదాహమూర్చితయగు రతీదేవివలె నిశ్చలాంగలతాదయవయై, పరమేష్టిసృష్టి వద్యవలె ననేక వర్ణప్రశోభితయై చిత్రగతయై యొప్పు నాయొప్పులకుప్పరూప మీక్షించి సహర్షుడై యారాజేంద్రుం డిట్లని తలంచెను. ఆహా ! ఏమి యీ సౌందర్యస్వరూపము !


చ. అమలవిలాసలోక విజయధ్యజభూషణ చిహ్నమై నవా
     సమ సమవర్ణదీప్తమయి, సాధువధూజనరూపగర్వ సం


    క్రమితమునై, మనోజవిభుగాత్రనిగుప్తి దనుత్రమై, మనోజ్ఞ
    మయిన నీ స్వరూపము భృశం బెవఁడిట్లు లిఖింపగల్గెనో !

మరియును-

గీ. అమరహిమధామునందున్న యమృతరసము
    పొంగిపడ దానిఁ బటమందుఁ బూసి పుష్ప
    బాణుఁడు నిజేషుతూలిక వ్రాసె దీనిఁ
    గానిచో నింతసుఖ మెట్లు గనఁగఁ గలుగు ?

ఇట్లు గాకున్న నీ చిత్రము వజ్రులేపమున లిఖింపబడియుండవలెను. కావు ననే యీ చిత్రస్వరూపమున దృఢముగ దగుల్కొన్న నాదృష్టులయందుండి మరలు టకు సమర్థములు గాకున్నవి. ఈ మోహనాంగిరూపమున మన్మధరాజ్యచక్రవర్తి లక్ష ణములు నియమితములై యున్నవి. ఈమె విమల లలాటపట్టిక పైన నలుపురంగుతో లిఖింపబడిన ముంగురులు రూపవతులగు యోషిల్లలామల దర్పజ్వరాపహారకములగు మంత్రాక్షరశ్రేణులవలె నొప్పుచున్నవి. మరెయును దీనిం దిలకించిన పురుషులకు మనోవికారము గలుగునని వెరచియే రతీదేవి మన్మధునితోగూడి సర్వత్ర పరిభ్రమించు చున్నది. రోహిణి యరుంధతులు శశివష్టుల నుదయాస్తమయములనై నను విడువక పార్శ్వముల నుండిరి. లక్ష్మి విష్ణువక్షస్థలమున సంతతము నిలచియున్నది. శచీదేవి యనిమిషదృష్టుల నింద్రుని నెల్లప్పు డీక్షించుచు వాని బాయకున్నది. గౌరీసతిగూడ యంధకరిపుని యర్ధాంగమున గలసియున్నది. ఇట్టి యసమానరూపలావణ్యముల నొప్పియున్న యీరమణీమణి నేమని వర్ణింపగలనని తలంచుచు నత్యంతకౌతుకావేశ హృదయసరోజాతుడై యాభూపతి శుభస్వరూపమును విడిచివచ్చిన పురుషపుంగవు నుపలక్షించి యిట్లనియె.

మహాత్మా ! నీవెవ్వడవో నే నెరుంగనైతిని. నీకులమెయ్యది? కమనీయమగు నీ నామధేయ మెయ్యది? జన్మదేశ‌ మెయ్యది? ఎవని సన్నిధిని విద్యాభ్యాస మొనరించి తివి? ఈ చిత్రఫలకమునందు లిఖింపబడిన యువతి యెచ్చటనున్నది? ఈ ప్రకృతి నీకెట్లు లభించినది? ఎందుకొర కిట్లు చిత్రమున నీయువతీలలామ వ్రాయబడి యుండెను? నీవు శుకశకుంతభావము నెట్లుపొందితివి ? దేనివలన నీకు తిరిగి నిజస్వరూప లాభము సంప్రాప్తమయ్యెను? ఇట్లు ప్రశ్నించు పుండరీకుని కానూత్న పురుషుం డిట్లనియె.

స్వామీ ! అత్యంత కుతూహలమును గలిగించు నావృత్తాంతమెల్ల సవిస్త రముగ విన్నవించుకొందునని పలుకుచుండగనే సముచితార్థవేదియగు వసంతశీలుఁ డమ్మహారాజున కిట్లనియె. దేవా ! నవరసామేషంగమగు నీవృత్తాంత మాస్థానప్రదేశ మున విని నిర్హంబగును. ఇచ్చట పరిజనులు ప్రతీహారహుంకృతుల మౌనము వహించి యున్నను నాసన్న కుసుమమంజరుల ఝంకారమొనర్చు తుమ్మెదలును పక్వఫలముల మెసపుచు గలకలముసేయు శుకాదిశకుని సంతానములును, సహకారశాఖాగ్రముల నుండి కుహూకారమొనర్చు పికసంతతులును, తమాలషండములనెక్కి కేకారవమొనర్చు మయూరవారములును, దీర్ఘికాపులినముల గోలాహలం బొనర్చు మరాళకులములును దుర్నివారములై యేలినవారి మనమునకు సావధానమును బోఁగొట్టగలవని వచింప నమ్మహీపతి వల్లెయని సత్వరమ లేచెను. తత్కధాశ్రవణ కౌతుకభరమున నడచువాని కైదారడుగులదూరములోనున్న నమ్మణి మండపము గవ్యూతిరతాయితంబై గన్పట్ట నెట్టెట్టులో నాయుర్వీపతి మణిమండపముం జేరి యందు విమలమణి మయాసనమున సుఖోపవిష్టు డయ్యెను.


330 వ మజిలీ

కుమారకేసరికథ

అట్లుపవిష్టుండై వినోదకథ శ్రవణమునకై సావధానమనస్కుడై యున్న యన్నరేంద్రుని యభిప్రాయ మెరిగి వసంతశీలుఁడు తొందరబెట్ట శుకశరీరము విడిచి వచ్చిన యానూతన పురుషు డిట్లని చెప్పదొడంగెను.

దేవా ! అవధరింపుము. భువనంబులబ్రసిద్ధమగు మర్త్యలోకకీర్తివలె వివిధసౌధ సుధాదవళయై, జంబూద్వీప జయశ్రీవిధమున నున్న తాయతనధ్వజవిరాజమానయై, భారతవర్ష సౌభాగ్యములీలమాణిక్యమందిర ప్రశోభితయై, యుత్తరాపథ ప్రవృత్తికరణి ప్రభూతారామ రమణీయయై, భూచక్రమును జుట్టియున్న మహార్ణవముయొక్క రూపాంతరమువిధమున గభీరజలదుర్గమపరిఖావృత పరిసరయై, మిన్నునొరయుటచే జారివడియున్న రవిరధతురగతుండడిండీర పిండములబోలు చంద్ర కాంతకపిశీర్షము లతో వెలయు మరకత శిలానిర్మాణ ప్రాకారయై, సిరులకు నెలవగు ననేకచిత్రశాల కాకరమై, పరిశుద్ధవర్తనులగు పురజనుల కావాసయోగ్యమై, ముల్లోకములకు నగయై పొగడ్త కెక్కిన మధురయను పట్టణశ్రేష్ట మొకటి కలదు.

అం దుపేంద్రవిదళితుం డగు పంసదానవుని యంతఃపురపురంధ్రుల కాటుకకన్నీటిధారలచే నిండిదోన యన నల్లనైన ప్రవాహజలముగలిగి వసుంధరారమణి భ్రూపల్లరివలె, నుదగ్దిశాసీమంతిని మరకతరత్నహారమువలె, కళిందవీరుని కృపాణ పట్టికవలెను, పూర్వార్ణవకుంజరము చరణశృంఖములవలె, నలరారుచు కైటభారాతి భయమున లోన నడగియున్న కాళియభుజంగుని జీర్ణనిర్మోకదళ ఖండములవలెనొప్పు డిండీరశకలములు దీరమునగలిగి విమలజలకేళీరసప్రసక్త‌ గోపీగణాభ్యంతరవిహారి