కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/328వ మజిలీ

వికీసోర్స్ నుండి

లతామండపముల నుత్తరీయముల బరచుకొని శయనించిరి. కొందరు చల్లని ప్రదేశముల కరిగి నిదాఘతాపంబడగ విసరుకొనుచుండిరి. కొందరు క్రిందబడియున్న ఫలముల నేరికొని తినుచుండిరి. అప్పు డమ్మహారాజు దివ్యాశ్వమునుండి దిగి విజయవర్ధనునిపై జేయూని నడచుచు సమ్ముఖంబున కేతెంచి నమస్కరించిన వనపాలుని వసంతశీలుని‌ సన్మానించుచు, మందగమనమున నతిశీతలమైన ప్రదేశమందు విమలమణిశిలాఫలక వినిర్మితంబైన దివ్యమాణిక్య మందిరమును బ్రవేశించెను.


328 వ మజిలీ

చిలుక పురుషుండైన కథ

అందు మాధ్యాహ్నికకృత్యముల యధార్హంబగు రీతి నిర్వర్తించి పిమ్మట సమీపమున సుందర కాసారతీరమునగల సహకార విటపిచ్చాయల శిశిరజలసమీరసం గమసుఖం బనుభవించుచు విశ్రమించియుండి యా యుద్యానవన రామణీయకంబును దిలకించుచుండ వాని యభిమతంబెరింగి యింగితజ్ఞుండైన విజయవర్థనుండా మహా రాజున కిట్లనియె.

దేవా ! పరిపక్వఫలస్తబకములతో నిండియున్న యీ ద్రాక్షలతామండప మెంత మనోహరముగా నున్నదో చూడుము. మీదుగా నున్న తరులతాకుసుమముల నుండి స్రవించు మకరందమువలన దడిసిన యీ మాలతీలతామతల్లిక మదనరాజ్యాభి షేకవేదికవలె నెంత వింత గొల్పుచున్నదో కనుంగొనుము. మణిమండపాంగణంబున జంద్రకాంతశిలాసోపానములతో నతి సుందరముగ నిర్మింపబడిన యా దిగుడుబావి యెంత సంతోషప్రదముగ నున్నదో తిలకింపుము. అల్లదేదూరంబున వివిధ తరు లతా ప్రశోభితంబగు విలాసభూధర ప్రదేశంబెంత మనోజ్ఞముగ నున్నదో పరికిం పుము. ఈ బాలమాతులుంగీ వనంబునకు వామభాగమున కదళీఖర్జూర నారికేళాది పాదపసమూహంబునకు నీరెత్తు మోటనూతు లెంత వైశాల్యము గలిగియున్నవో గ్రహింపుము. అనేక జలవిహంగమ విహారయోగ్యమై కురవకనికురంబునకు దక్షిణం బున నున్న యా దివ్య సరోవర సౌందర్య మెంత యొప్పిదముగా నున్నదో వీక్షిం పుము. అని యిట్లనేక విధంబుల నా యుద్యానవన విశేషంబుల నంగుళీనిర్దేశంబున జూపించుచుండ జేరువనుండి వారికిట్లు వినంబడెను.


శా. ఓ చంద్రోపల గౌరి ! యో మరకత ప్రోజ్జృంభిత శ్యామలా !
    యో చామీకర భిన్న వర్ణవిమలా ? యో పద్మరాగాంబరా ?


    యీ చక్కిన్‌ గఠినాత్మ దీనిఁగనరారే ? యీ ఫలంబీయఁగా
    యాచింపగ మదుక్తికుత్తరము నీయన్‌జూడ దొక్కింతయున్‌.

ఆ మాట లాలించి నల్దెసల దృష్టుల బ్రసరించుచు వసంతశీలు నుద్దేశించి, ఓహో ! ఇచ్చట నెవ్వడో యవధీరితప్రియుండై చెలిమి కత్తియలతో నుపాలంభ పూర్వకంబుగ నిట్లు పలుకుచున్నాడు కాబోలునని వంచించు నా నృపసత్తమునితో వసంతశీలుండు మందస్మితంబున నిట్లనియె. స్వామీ ! ఇచ్చట నెవ్వడును బ్రియు రాలిచే దిరస్కృతుండైనవాడు లేడు. చెలికత్తెలతో జెప్పుకొనువాడును నిందులేడు అయ్యవి దేవరవారిమనంబున కనవరతంబు వినోదమొనగూర్చు చిత్రశిఖుని చిలుక పలుకులు నేడిందు విచ్చేసిన ప్రభుసేవావ్యగ్ర హృదయుండనై యా చిలుక కాహార మొసంగుట మఱచితిని. కావున నయ్యది క్షుదాంధీభూత చేతస్కయై యమ్మణి మండ పమునందు మరకత స్తంభాంతరి పంజరమునుండి యందుగల వజ్రోపలసాలభంజి కాకరమున నున్న కమలరాగ దాడిమీఫలంబు గని నిజమైనదానిగా నమ్మి యెంత బ్రార్దించినను దాని నొసంగకుండుటచే మిగుల వగచుచు నందందు గల వివిధమజెణి పుత్రికల జెలువలనిభ్రమించి తనకోర్కె వారికి దెలుపుచు నాక్రోశించుచుండెనని విన్న వించెను.

ఆ మాటలు విని యా భూజాని మిగుల నక్కజంపడుచు నౌరా ! సకల తత్వావబోధబుద్ధి గలిగిన యా చిత్రశిఖుని చైతన్యము కృత్రిమ ఫలాభిలాషచే నిట్లు తారుమారయ్యె నేమి చెపుమా ? మందబుద్ధియై వీడు ముందెట్లు ప్రవర్తించునో చూచె దముగాక యని పలికి యా నరేంద్రుండావంక దిలకించుచుండెను.

అప్పుడా చిలుక తన యభిలాష దీర్చుకొన నుద్యమించి మిగుల రొద సేయుచు దృఢచంచూపుటంబున నా పంజర ద్వారంబున కమర్పబడిన విద్రుమ శలాకల మాటిమాటికి నాకర్షించుచు గట్టిగా బొడుచుటచే నా కవాటము భగ్నమైనది. దాన నేర్పడిన మార్గంబున నయ్యది బైటకేతెంచి యతిరయంబున సింహాసనస్థానవేదికపై కెక్కి సమీపమందలి రత్నపుత్రికావాస్తంగతమైయున్న పద్మరాగ దాడి మీ ఫలం బును ముక్కుతో దీవ్రముగా బొడువ దొడంగెను. దృడమణి శిలాస్పాలనంబున దాని చంచువు విగ్యళితమయ్యెను. చంచుభంగమైనతోడనే చిత్రశిఖుండు శుకశకుంతస్వరూ పంబు విడచి కరకర బాహుండును, నాయతభుజుండును, పరిఘవక్షస్థలుండును, విశాలలలాటుండును, నష్టాదశవర్ష ప్రాయుడునునైన పురుషపుంగవుడయ్యెను.

ఆ యద్భుత దృశ్యమును జూచుచున్న పుండరీక రాజేంద్రు డత్యంతా శ్చర్య సావేశ హృదయుండై యేమేమి ! ఈ వింత ! ఇంతలో నీ చిత్రశిఖుం డేమయ్యెనని సంభ్రమంబున పలుకుచు బార్శ్వ వర్తులతో నా వంక జూచుచుండెమ. ఇంతలో నందున్న పురుషుండు తన శుకశరీరమునుండి జారి యా ప్రదేశమందు బడి యున్న‌ దాని నెద్దియో గ్రహించి చేతియందు చుట్టగా బట్టుకొని యున్న యొక వస్తువును జూచి యెద్దియో జ్ఞప్తికి వచ్చినట్లు తల పంకించుచు మందహాసభాసుర వద నార విందుడైరమణీయంబగు‌ నా మణిమండపము నలువంకల దిలకించి పిదప జూపుల బైటకు‌ బరపినతోడనే యెదురవు ననేక నవశరంబుల గ్రహింపనున్న కుసుమ సాయకునిలీల, నందనంబను భ్రమమున నివసించినపురందరునివలె, కమలకుల భవనావాసినియైన సిరిని గొనిపోవ నేతెంచిన పద్మనాభునిరీతి, నతిసుందరాకారమున నొప్పుచు, ననేక చక్రవర్తిలక్షణలక్షితుండై యనంత లావణ్యలలితుండై, యశేష సామంతభూపాలాశ్రితుండై, యసామాన్యవైభవోపేతుండైయనల్పగుణగణగరిష్టుండై లీలాసర స్త్సటంబున నుచితాసనంబున నుపవిష్టుం డై యున్న యా భూలోక రాజదేవేంద్రు నుపలక్షించెను.

తోడనే హృదయానందంబు మొగంబున గనుపింప నత్యంత జవంబున నా రాజేంద్రుని సమీపంబున కేతెంచి ప్రతీహారిముఖమున రాజానుమతంబు వడసి వాని యంతికంబున కరిగి యుచితప్రణామాదికం బొనరించి తదనుజ్ఞ నర్హాసనంబున నుపవిష్టుండై వాని నిట్లు స్తుతించెను.


మ. అనఘా ! గంధగజౌఘకుంభదళనం బందున్‌ భవత్కడ్గమం
     దున నగ్నంబయి చూడఁగల్గిన ద్యుతిస్తోమాతిగోళంబులన్‌
     జనముల్‌ ముత్యములందు రయ్యది‌ వృధాజల్పంబు సత్యంబదే
     మన ధారాజలమజ్గదూర్జిత రిపోద్యద్బుద్బుదవ్రాతముల్‌.

శా. దేవా ! నీ యసిధార నాజిఁ దెగి యుద్వృత్తిన్‌ ద్విషచ్చీర్షముల్‌
    ద్యోవీధిన్‌ బహురత్న సంయుతకిరీటోద్యద్యుతుల్‌ మారఁగాఁ
    బోవన్‌ నా కమయూరికబ్బె సుషమాపూరంబు, సౌరాంగనల్‌
    భావోన్మేషతఁ బెండ్లి వేడుకలకై వర్తింప నప్పట్టునన్‌.

పిమ్మట నాదూతనపురుషుండు నిజవామకరమున బట్టుకొనియున్న యా వస్తువును సవ్యకంబున గ్రహించి యారాజచంద్రునితో నిట్లనియె దేవా ! జగత్రయ నియామకుండగు బిడౌజునకైన బొందరానిదియును నెల్లజనులకును జూడ దలంపు బుట్టించునదియునునైన నీ వస్తువును పశుపతిప్రసాదమునకు బాత్రులైన దేవరకు సమ ర్పించు కొనుచున్నానని పలుకుచుండగనే వసంతశీలు డద్దాని నందుకొని పుండరీకున కర్పించెను. దానిం గ్రహించి యాభూకాంతుం డిదేమని‌ పలుకుచు నతిరయమున నాచుట్ట విప్పి చూడ నదియొక చిత్రఫలకముగా గనంబడెను. అందు దన స్వరూపమే లిఖింపబడియుండుట దిలకించి యత్యంతాశ్చర్యస్వాంతమున నౌరా ! నా స్వరూప మెట్లతనిచేత నిందు వ్రాయబడెనని విస్మయ మందుచున్న నరేంద్రునితో సర్వసేనా నాయకుండైన సింఘలాంగదుండిట్లనియె.