కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/325వ మజిలీ
చుండుటచే నారాక గ్రహింపని దీనింబట్టి తెచ్చితి. దీని నీకొసంగఁజాలను. ప్రాణముల కన్న నెక్కుడుగ నేను బ్రేమించుచున్న నాభార్య ప్రధమగర్భమున నంతర్వత్నియై పురుడు బోసికొనుటకు బుట్టినింటికి మేఖరికయను పురమున కరిగియున్నది. శుకా మిషమున నామెం దృప్తిపరుపనెంచి దీనిం గైకొంటిని. ప్రియురాలి యభీష్టము దీర్చుట యందు ద్రిలోకరాజ్యమైనను దృణప్రాయముగదా ? కావున నీవీచిలుక నడుగుట యుడుగుమని వచించుచు యా పంజరమల్లుట ముగించి యందా చిలుకను బద్రముగా బెట్టి తన్ను గృతార్థునిగా దలంచుచు దానిని దనుసెజ్జపజ్జ నుంచికొనెను.
325 వ మజిలీ
శుకలాభము
వాని నిశ్చయంబెరిగి నే నతిచింతాకుల స్వాంతుండనై ఆహా ! ఈ చిలుకను బడయుటకు నేనేమి యపాయము బన్నుదును. వీని నింకేమని యాచింతును. హఠా త్తుగా దీనింగై కొని పారిపోదునా ! లేక యర్దరాత్రమున వీఁడు నిద్రాముద్రితుఁడై యున్నతరి దీనిందస్కరించుకొని పోదునా ? అని విచారించుచున్న సమయమున నా చిలుక యట్టహాసముగ నవ్వి ప్రస్తుతార్థమును సూచించుచు నిట్లు పద్యద్వయమును పఠించెను.
గీ. ఒకనికన్నులఁబడియుఁ జిక్కకయె పారి
వచ్చితిని నింకొకనిచేత పట్టుబడి మ
ఱొక్కవ్యక్తివాతిఁబడగనుంటి నహహ !
దైవ యోగంబు మీర దుస్తరముగాదె ?
గీ. ఆరయ దేహిక నియామానుసరణినొప్ప
జీవితాంతంబునందునఁ జావుగూర్చి
మృత్యుముఖమున జీవితమెసఁగఁజేయు
విధికి విశ్రాంతిలేదెంచు విశ్వమందు
ఆ మాటలాలించు పామరుండు భయోద్రేకమున మేను గగుర్పొడువఁ ద్రుళ్ళిపడి లేచి కాలికొలది బరువెత్తదొడంగెను. వాని పిరికితనమునకు నేను గడుపుబ్బ నవ్వుచు భయపడకుము భయపడకుమని వానిననుసరించి పోయి పట్టుకొంటిని. అందు లకు వాడు తొట్రుపడుచు నన్ను వదలిపెట్టు వదలిపెట్టుమని పెద్ద యెలుంగున నఱ చుచు మఱియు నిట్లనియె. తమ్ముడా ! నేను పుట్టినది మొదలు నేటి దనుక నెందును మనుజునివలె నవ్వుచు మాటలాడు చిలుకను గనివిని యెరుగను. ఇది పిట్టగాదు. పెను భూతము. మరల విరచుకొని తినగలదు. దీనికి వెఱచియే నేను పారిపోవుచున్నాను. నీవును సత్వరమ యిందుండి పారిపొమ్ము. నీకు భయము లేకున్న నిందుండుమని భయార్తివిధురితచేతస్కుడై ప్రలపించుచు నా పట్టు తప్పించుకొని యొక్క పరుగున బారిపోయెను. నేనును నా యభీప్సిత మీడేరిన దని సంతసించుచు నా చిలుక యిక నలభ్యమని నిరాశ జేసికొని యున్న నాకు దాని దృటిలో దక్కజేసిన దైవమును నంతరంగమున గొనియాడుచు నా శుకశ్రేష్ఠమును గైకొని ప్రత్యూషముననందుండి పోవ నిశ్చయించుకొనుచు నా కుటీరమును వెండియు బ్రవేశించితిని. అందు శుకలాభ మునకు నెమ్మనంబున నుబ్బుచు తదీయాలాప విశేషము నెన్నుచు నవ్వుపుట్టించు పామరుని చేష్టితంబుల దలపోయుచుండుటచే నా కంటికి నిదురరాలేదు. ఆ రాత్రిశేష మా చిలుకతో బ్రసంగించుచు గడుపనెంచిన నా సంకల్పమెరింగి యా చిలుకయే నాతో నిట్లు ముచ్చటింపదొడంగెను.
మహాత్మా ! నా చిన్న విన్నపమొం డాలింప గోరుచున్నాను. పామర మహాగ్రహబాధనుండి బయటబడిన యీదీన శకుంతళాబకముతో దమకేమి పని గలదు ? మీరు మహాత్మ స్వరూపులు. మహాత్ములు దీనుల విన్నపము లాలింతురు. ఒరులకు కీడుసేయదలంపరు. యాచకుల కడిగినదాని నొసంగుదురు. కాన మిమ్ము ప్రార్థించుచున్నాను. పుడమిపై సర్వసంసార విషయములందును సారభూతమైనది ధర్మమని మిరుబోంట్లు వచింతురు. అట్టి ధర్మమునకు సారము ప్రాణకోటియందు దయయే యగును గదా ! దయాధర్మసార మార్తపరిత్రాణము. ఈ సద్గుణములు సజ్జనులకు సహజములై యుండును ! నన్ను మీరెవనికో యొక నరపతి కర్పింపదలంచు చున్నారు గదా ! అందువలన నిందు బంధింపబడి యుండుటకన్న మిన్నయగు బాధ నాకు మీరు కల్గించుచున్నారు. మనమున ప్రతిఫలితరాజసేవా పరిక్లేశభయము నాకు నితాంతము గల్గుచున్నది.
మ. భయదామాత్యదృగర్చిషాగ్నిముఖియై ద్వార్థ్సాగ్రహోదగ్ర వా
క్బయ ఫేత్కారియునై, నియోగికసనోద్యత్తీవ్రసత్క ర్తికన్
నియతిన్ సేవకశష్కశల్యవితతిన్ వే దాల్చుచున్ రాక్షస
క్రియ నేప్రాణినిరాజసేవ విడచున్ గీడెంచకుండన్ భువిన్.
కావున నో సుధీమణీ ! నన్ను వదలిపెట్టము. విహంగమకుటుంబమునుండి నన్ను వేరుచేయకుము. నికుంజతరుకోటరకుటీరావాససౌఖ్యమునకు దూరము జేయ కుము. యదృచ్చారామఫలరసోపభోగమునుండి తప్పింపకుము. వివిధవనసరణి సంచా రమునుండి తొలగింపకుము. సభస్థలోత్పతనవిలాస వైభవము శూన్యముగ జేయకుము. అనాధను, ఆర్తురాలను పతత్రిమాత్రమనని దుఃఖాతిశయిమున నిక మాటరాక యూర కుండెను. ఆ మాటలు విని నేను మైమరచి యవి శుక్రపోక్తములని యెరుంగక యొకానొక వ్యక్తి ప్రగల్భ వచనములుగ మొదట సంశయించి పిదప నిట్లు తలంచితిని. స్వార్ధవిషయికములగు దీని వచనములకు నేనును స్వార్ధము ననుసరించి ప్రత్యుత్తర మొసంగ జూచితినేని యిది మంచిమాటలచే నా హృదయమును దయార్ద్రం బగు నట్లొనరించి మనస్సును సహేతుక ప్రశ్నోత్తరముల న్వవశముగ జేసికొనగలదు. ఈ శకుంతచతురవచనములకు లోబడి పంజర బంధమునుండి తప్పించితినేని ప్రభువునకు దీనిని సమర్పించి మనఃప్రియం బొనరింప సమకట్టిన నా ప్రయత్నమెల్ల వ్యర్థము కాగలదు. దీని నెట్లయినను స్వామిసన్నిధికి గొనిపోవలయును. ఈ చిలుక వృత్తాంతమెల్ల ప్రభుసమక్షముననే వినెదంగాకయని నిశ్చయించుకొని దానిమాటల కేమియు బత్యుత్తరం బొసంగక యూరకుంటిని.
ఇంతలో శుకాలాపభయపలాయితుండైన హాలికుని వెన్నంటి పోయిన తిమిరకేశ పిశాచమువలెనే యా రాత్రి గతించెను. తెల్లవారె నింక చిలుకం గొని తెమ్మని నన్ను ప్రబోధించు తెరుంగున నిశోపాంతమందు మేతకై విడువబడి తిరుగు చున్న పశులమెడల నవలంబించియున్న కాష్ఠఘంటా నినాదము నా చెవులంబడెను నే నెప్పుడత్యంత సంతోషమున లేచి యదియ తగినసమయంబని తలంచి యా శుకముం గొని యందుండి బయలుదేరి యాదినాంతమునకు నందావటనగరము జేరుకొంటి. అంతవరకు నా జాడ దెలియక తహతహంబడుచు నారాక నెరింగినతోడనే ససంభ్రమ ముగ నెదురు వచ్చిన పరిజనుని చేతికా పంజరమిచ్చి దాని వృత్తాంతము వానికి సంగ్రహముగ జెప్పుచు విడిదెకుం బోయితిని. ఆ యద్భుతశకుంతమును దేవర కెప్పుడు చూపింతునను నుత్సాహముతో దానికి వేఱొక మణిఫలకపంజరమును నిర్మింప జేసి యా రాత్రి యందు విశ్రమించి నే డిచ్చటి కేతెంచితిని. ఇట్టి విహంగ రత్నము భూమండలాఖండలుండగు మహారాజు సమక్షమునం దుండిన మిగుల శోభింపగలదని దలంచి మద్గృహంబునకైన బోవక తిన్నగా నేలినవారి సమక్ష మునకే దానిం దోడ్కొని వచ్చితిని. అయ్యది ద్వారప్రదేశమున దారకునిచేతియందు న్నది. ముదలయేని గొనివచ్చెద, పిమ్మట దేవరచిత్తమే ప్రమాణమని యూరకుండెను.
ఆ పలుకు లాలించి రాజు విస్మయావేశహృదయుడై సత్వరమా శుక శ్రేష్టముం గొనితెమ్ము విమర్శింతమని యానతిచ్చెను. తోడనే వసంతశీలు డతివేగ మున ద్వారదేశమునకరిగి రత్నపంజరముతో నా చిలుకను స్వయముగా దెచ్చి రాజు మ్రోలను విడచెను. అప్పుడా చిలుక మెడయెత్తి ప్రసన్న దృష్టులా ఱేనిపై బరపుచు వాని నుద్దేశించి యిట్లనియె దేవా ! హరనయన హుతాశన శిఖాదందహ్యమానుండగు కుసుమాయుధునిచే విడువబడిన రూపమును, నహల్యాభిసరణ విషణ్ణుండగు శతమన్యు నిచే గోల్పోబడిన విలాసమును, పాల్కడలి నురగతల్పమున శయనసుఖవ్యసనపరా యణుండగు నారాయణునిచే విడువంబడిన భువనరక్షణవ్యాపారమును, నొక్కుమ్మడి నీ సమక్షమున కేతెంచి నీ యందు సుప్రతిష్టితములై యున్నవి. ఇట్టి నిన్నేమని స్తుతింపగలను ?
మ. ఘనదాన వ్రతతత్పరుండయినన్ గార్పణ్యమునంబూని యీ
వినుతాజాండఘటంబు నీ గుణ లసద్విఖ్యాత మాణిక్య రా
శిని నిండించి మహానిధానముగ వాసిన్‌గాంచియున్నాఁడ విం
కను దా వెయ్యది నీ ప్రతాపము వెలుంగన్ జ్యోతియై భూవరా.
ఇట్లత్యద్భుతముగ వచించిన చిలుకపలుకుల కానృపసత్తముండలరుచు విస్మయస్మేరాననుండై సమీపవర్తులతో దాని వర్ణనా వైదుష్యమును మాటలపొందికను ప్రగల్ఫవచో వైచిత్ర్యమును బొగడుచు నా చిలుకంగాంచి యిట్లనియె. ఓహో విహం గమప్రవరా ! నీవెవ్వడవు ? ఏ జాతివాడవు ? వస్తువివేకహీనమై వర్ణశూన్యాస్పష్ట శబ్దోచ్చారణ మాత్రకమై యెసగు విహంగమజాతియందు బొడమినను నీ వెట్లుమనుష్య భాష చక్కగా బలుకనేర్చుకొంటివి. శుకజాతి విరుద్ధముగ శిఖవహించిన నీ రూప మక్కజము గొలుపుచున్నదిగదా ! నీ విప్పు డతిచాతుర్యముగ వచించిన స్తుతిపఠన మంతకన్న మిన్నగ వింతగొల్పుచున్నది. మరియును నిస్సంధిరంధ్రోదరంబగు నా చైతన్యమునం దెట్లు ప్రవేశించి పైకి రాగలిగితివి ? అందుండి నీవు పఠించిన పద్య పవృత్త మెట్టిది? వసంతశీలునకు దొరకని నీవు హాలికునిచే నెట్లు పట్టుబడితివని యడుగు నరేంద్రున కా చిలుకనిజవృత్తాంతమిట్లు చెప్పదొడంగెను.
326 వ మజిలీ
చిలుకకథ
దేవా ! అవధారు, సన్యాగిరి పరిసరమున జనసంచార శూన్యంబై మహా మహి దుర్లంబై యతి భయంకరమైన మహారణ్యమొకటి గలదు. అందొక విశాలన్య గ్రోధ తరుకోటరమున నివసించియున్న శుకకుటుంబినికి పిల్లలుపుట్టి చచ్చుచుండుటచే గల్గునెగులు మాన్ఫ నుత్తరవయసునందు నే నుద్భవించితిని. నేనండమునుండి బయట పడీన తోడనే యే హేతువ వలననే శుకజాతి విరుద్ధముగ నీ శిఖ నా తలపై నుదయిం చెను. అట్టి పింఛముతో జాతి విలక్షణముగనున్న నా స్వరూపమును దిలకించి నా జాతి పక్షులేగాక కన్నతల్లికూడ నన్ను పరిత్యజించెను. ఇట్లు పురాకృతకర్మదోషమున గల్గిన కష్టముల ననుభవింపుచు నా యరణ్యమునందే బడియున్న నన్ను శారదియను వనదేవత దయార్థ్రహృదయమై చేపట్టి ప్రతిదినమును నాహారాదికంబొసంగి పోషించు చుండ గ్రమమున నాకు రెక్కలు వచ్చి యెగురుటకు శక్తి గల్గెను. ఈ పింఛముకూడ