Jump to content

కాశీమజిలీకథలు/నాల్గవ భాగము/38వ మజిలీ

వికీసోర్స్ నుండి

నిడుకొని మోము ముద్దాడుచుఁ దన యుంగరము నా వ్రేలికిడి నా యుంగరము దన వ్రేల నిడుకొని యెద్దియో సంభాషించు నభిప్రాయము సూచింపుచున్నంతలో హా! యెంత కష్టము? సోదరులారా! పైనఁ జెప్పజాలను గదా? అని పలుకుచు మూర్చపోయినది అప్పుడు వారిరువురు నొండొరుల మొగములు చూచికొనుచు సుభద్రను సేదదీర్చి చెల్లీ? నీవు పైనఁ జెప్పనక్కఱలేదు. మాకే బోధపడినది. మనము మువ్వురము నొక్కజాడయే యెక్కితిమి. ఇది యథార్ధము కాదు మహామాయ. దీని కొఱకుఁ జింతింపవలసిన పనిలేదు. మీ రట్టి యానందముతో నున్న సమయమున మొదట నీకుఁ గనబడిన యగ్నిజ్వాల వచ్చి మిమ్మైక్యముఁ జేసికొనినది. నీ వందులోఁ బడి తదర్చిస్ఫురణంబున నెగిరి యిచ్చట వచ్చి పడితివి. ఇదియేనా నీవు చెప్పునది యని యడిగిన నప్పడఁతి వెఱగుపడుచు అన్నలారా! దీని మీరెట్లు గ్రహించితిరి? వింతగా నున్నదని యడిగిన వారు తమ వృత్తాంత మంతయుంజెప్పి యంతయు నొక్క పోలికగా నుండుటచే గ్రహించితిమని పలికిరి.

అప్పుడు సుభద్ర తలయూచుచుఁ దెలిసినది తెలిసినది. ఇదియే భగవన్మాయ. దీనిని దేవతలు సైతము తెలిసికొనఁ జాలరు. మనమెట్లు తెలిసికొందుము. ఇఁక బుద్ధి గలిగి మన మింటికిం బోవుటయే యుచితము. మీ సందియములు దీఱినవియా? యని పలికిన విని వారిరువురు అవును దైవమాయ కడువిచిత్రమైన యింద్రజాలమువంటిది. దీనిని మనము తెలిసికొనలేము. ఇంటికిఁ బోవుదమని సమ్మతించిరి. అప్పుడు వారు గుఱ్ఱము లెక్కి స్వదేశాభిముఖులై యరుగుచు సాయంకాలమున కొకపల్లెం జేరిరి. తాము చూచిన విషయములు మహా మాయయని యెఱింగియు వారు మోహావేశంబునం జేసి హృదయంబున దయితాకారంబుల ధ్యానించుచు విభ్రాంతి పడుచుందురు. అందు బలభద్రుండు దాను జూచిన విషయములు పర్వతశిఖరము మహామందిరము కళ్యాణమంటపము గ్రీడావనము దాను బెండ్లియాడిన చేడియను జిత్రపటంబున వ్రాసి కృష్ణునికిఁ జూపుటయు నతండును తాను బెండ్లియాడిన చేడియను విచిత్రపటము హాటక మత్తగజము ప్రవాహములో నగునవి పటంబున వ్రాసి యన్నకుఁ జూపించెను. వానింజూచి సుభద్ర తన భర్తను ప్రాసాదమును అగ్నిజ్వాలను వ్రాసి వారికిఁ జూపినది ఒండొరులు వ్రాసిన చిత్తరువుల నొండొరులుజూచి విస్మయము జెందుచుండిరి. ఆ పటముల వారు సతతము హస్తములయం దుంచుకొని యా విషయములనే తలంచుకొనుచు యున్మత్తుల కియఁ గొన్న పయనములు సాగించిరి. అని యెఱింగించువఱకు సమయ మతిక్రమించుటయు మణిసిద్దుండు తత్కథఁ జెప్పుటమాని తదనంతరోదంతము పై దిట్లని చెప్పదొడగెను.

ముప్పది యెనిమిదవ మజిలీకథ.

గోపా! విను మట్లు వారు స్వదేశగమనోత్సుకులై గుఱ్ఱములెక్కి యరుగునప్పుడు

క. ఒకచేఁ గళ్ళెముగొని వే
   రొకచేతం జిత్రపటము లూనికనుచు నం
   గకములు బులకింపఁగ దలఁ
   చి కొనుచు నేగుదురు తద్వి • శేషములెల్ల న్.

అట్లు కొన్ని పయనములు సాగించి యొకనాడు సాయంకాలమునకు మధుమంత మను పట్టణమునకుం జని యందుఁ బాంథులు నివసింప నియమితంబగు సత్రమున బసఁజేసి భోజనాది కృత్యంబులు నిర్వర్తించి తదంతికవేదికపైఁ గూర్చున్న వారింజూచి యందుఁ గొందఱు విద్యార్థులిట్లు సంభాషించుకొనిరి.

ప్రథముఁడు - మిత్రమా! వీరిం గంటివా? వీరి యాకార భేదములు గనుగొనుట కడుదుర్ఘటము సుమీ!

ద్వితీయుఁడు — వయస్యా! సత్యమే. వీరు సోదరులు కాఁబోలు.

ప్రథ -- సందియమేల. కానిచో నిట్టి యేకరూపత్వ మెట్లు సిద్ధించెడిది.

ద్వితీ - నీ ప్రజ్ఞ చూతము. వీరి జ్యేష్ఠకనిష్ఠభావము లేర్పరుంపుము.

ప్రథ - నాకుఁగాదు. వీరిం గన్నతల్లిదండ్రులకు సైతము తెలియదనియే నా యభిప్రాయము. వీరు కవలపిల్లలు గావచ్చును.

ద్వితీ - ఆ రత్నమాల నురంబునఁ దాల్చినవాఁడు జ్యేష్ఠుడులాగునఁ గనంబడుచున్నాఁడు చూడుము.

తృతీ -- అది రత్నమాలయే?

ద్వితీ - సందియమేల?

తృతీ - ఎట్లు గ్రహించితివి?

ద్వితీ - అభిఖ్యను బట్టి -

తృతీ - (నవ్వుచు) అటులయిన నతండు ధన్యుఁడేకదా ?

ప్రథ - అవి రత్నములుగాక గాజుపూస లనుకొనుచుంటివా యేమి ?

ద్వితీ — కాదు కాదు. వాని శ్లేషవచనములు నేను గ్రహించితిని. నీకుఁ దెలియలేదా ?

ప్రథముడు - ఓహో! అదియా? తెలిసినది. ఈతఁడు ధన్యుఁడు కాఁడు. వీనియురముఁ జేరుటచే రత్నమాలయే ధన్యత్వము నొందెడును.

తృతీయుఁడు - ఆ మాటకు మేమును సమ్మతించితిమి కాని "అకార సదృశ ప్రజ్ఞః" అను నట్లదియుంగూడ నుండవలయుంగదా.

ప్రథముడు - "యత్రాకృతి స్తత్ర గుణాభవంతి" అనినట్లు తగినప్రజ్ఞ యేల యుండకుండెడిది.

అని మాటాడికొనుచు నా విద్యార్థులు నిష్క్రమించిరి. వారి సంవాదము బలభద్రుఁడు మాత్రము వినియెను. వాడుక ప్రకారము వేకువజామునలేచి ప్రయాణ మగునప్పుడు బలభద్రుఁడు గనంబడమిఁ దల్లడించుచు సుభద్రయుఁ గృష్ణుండును నలుదెసలం బరికించి కానక ముందరిగెనని నిశ్చయించి యావీడు విడిచి వడివడిం బోవుచుచు బలభద్రా! యని చీరుచుఁ గొంతదూర మరిగిరి. కాని యతని జాడ యేమియుం దెలిసినదికాదు. ఎదురుపడినవారి నడుగుచు నడుచుచుండ నెవ్వఁడో యొకఁ డా దారి గుఱ్ఱమెక్కి పోవుచున్నాఁడని యొక బాటసారి చెప్పిన నా మాటనమ్మి సత్వరముగా గుఱ్ఱములఁ దోలికొనిపోయిరి కాని యతండు గనంబడలేదు. అట్లరుగ నరుగ నా దారి చంద్రకాంతమను రాజధానికిఁ దీసికొనిపోయినది. వారావీటిలోఁ బ్రవేశించి బలభద్రు నరయుచుఁ బదిదినములు వసించిరి. ఒకనాఁ డావీటిలోఁ జాటింపుచుండ విని కృష్ణుండు తాను బసఁజేసిన యింటియిల్లాలితో “అవ్వా ఱేపు దివాణములో సభజేయుదు రనుమాట వినఁబడుచున్నది. ఆ సభ దేనిగుఱించియో యెఱుంగుదువా" యని యడిగిన నా వృద్ధ యిట్లనియె.

అయ్యా! మా పట్టపురాజు కనకాంగదునకు లేక లేక సువర్ణలేఖ యను పుత్రిక గలిగినది. తదీయ రూపలావణ్యాదివిశేషములు వర్ణింపఁ జతుర్ముఖునితరము గాదు. ఆ చిన్నది యిప్పుడు సమారూఢయౌవనయై మెఱుఁగుబట్టిన మరుశరంబోయన మెఱయుచున్నది. అమ్మగువకుఁ దగినవరు నెందునుంగానక స్వయంవరము చాటింపించెను. తన్నిమిత్తముగా ఱేపు సభఁజేయుచున్నాఁడు. ఆ యోలగమునకు వచ్చిన రాజకుమారులలోఁ దానిచ్చిన ప్రశ్నమునకు సదుత్తరమిచ్చినవానికిఁ దన రాజ్యముతోఁ బుత్రికఁ నిత్తునని ప్రకటించియున్నాఁడు. అదియే యా చాటింపని యా యవ్వ చెప్పినది.

కృష్ణుండు మఱునాఁడు సుభద్రకుఁ జెప్పకుండ నా సభకుం బోయెను. మఱియు నానాదేశములనుండి కులవయోగుణరూపవిద్యావిశేషంబుల స్తోత్రపాత్రులైన రాజపుత్రులు పెక్కండ్రువచ్చి యా సభ నలంకరించిరి. పిమ్మటఁ గనకాంగదుఁడు మంత్రిసామంతహితపురోహితసహితముగా నా యాస్థానమునకు వచ్చి నృపకుమారవారంబు గలయం గనుంకొని తదీయరూపవేషభాషావిశేషంబులకు సంతోషింపుచు నీ ప్రశ్నమును బత్రికాముఖముగా వారికెల్ల దెలియజేసెను.

ప్రశ్న - నిన్నెంద రెరుంగుదురు ?

దీనికి నిదర్శనపూర్వకముగా నుత్తరము వ్రాయవలయును. వ్రాసిన యుత్తరమువలన మాకుఁ దృప్తియయ్యెనేని మేమంగీకరింతుము. తాము వ్రాసిన విషయము దృఢపరచుకొనుటకుఁ బిమ్మట వాగ్రూపముగా సమాధానముఁ జెప్పవచ్చును అని యున్న పత్రికం జదువుకొని రాజకుమారులెల్ల దదభిప్రాయము గ్రహింపలేక ఖ్యాతిగలవానినిగదా పెక్కండ్రెఱింగియుందురు వీరిలో నెక్కుడుమంది యెవ్వని నెఱుంగుదురో వానికే తనకూతుఁ నిచ్చు తాత్పర్యముతో నిట్టి ప్రశ్నమువేసెను. అట్లెఱింగినందులకు నిదర్శనము మాత్రము చూపవలసి యున్నది. కానిమ్ము మా దేశములో నన్నెఱుంగనివారెవ్వరు? అవసరమువచ్చినచోఁ దెలియనివారికైనఁజెప్పి సాక్ష్యము దీసికొనిరావచ్చును. తక్కువ వ్రాసికొననేల. ఎల్లరకన్నఁ బదుగురు నన్నే యెఱింగినట్లు వ్రాయవలయునని యెవ్వనికి వాఁడే యూహించి కోటియనియు నాలుగు కోటులనియుఁ బదికోటులనియు నిరువదికోటులనియు నేఁబదికోటులనియు నూఱుకోటులనియు నీరీతిఁ దమసంఖ్య పైనుండవలయునని తన్నెఱింగిన జనులసంఖ్య దమ చిత్తమువచ్చినట్లెల్ల వ్రాసి యిచ్చిరి. అప్పుడు కృష్ణు డూహించి యీ రాజూరక యిట్టి ప్రశ్న వేసియుండఁడు. దీనికెద్దియో కారణ ముండవలయును. నన్నెఱింగిన వా రెవ్వరున్నారు. నన్ననఁగాఁ జర్మాస్థిమయమగు దేహముకాదు. నామనస్సని యర్థము. నా మనస్సులో నేమియుండునో నాకుఁగాక యొరుల కెట్లుతెలియును. నామనంబునఁ గోటానకోటుల సంకల్పములు గలిగియున్నవి. అవి యన్నియుఁ గప్పిపుచ్చి కొన్ని మాత్ర మొరులకు జెప్పుకున్నాను. కావున నన్ను నేనుకాక యొరు లెట్లెఱుంగుదురని నిశ్చయించి యా వాక్యమే పత్రికలో నన్నెఱింగిన వారెవ్వరును లేరు. నన్ను నేనే యెఱుంగుదును అని వ్రాసెను.

కనకాంగదుఁ డా పత్రికలన్నియు బుచ్చికొని వారి వారి వ్రాతలం బరీక్షించి యెకసక్కెములాడుచుఁ గృష్ణుండు వ్రాసిన పత్రికందీసి పరీక్షించి సంతసించుచు నెల్లరునిన ముమ్మారాపత్రికం జదివి యిట్లనియె. రాజపుత్రులారా! తన మది తనకేసాక్షి. తన్ను దాఁనే యెఱుంగు నితరులు తన్నెఱుంగరు. ఇదియే సత్యము. మిగుల బుద్ధిమంతుడగు నీ రాకుమారుఁ డామాటయే వ్రాసెను. అదియే నా యభిప్రాయము. మీరందఱు వేషములచే నధికులేగాని విద్యాగంధము గలవారుగాఁ దోచఁబడరు. మీలో నొక్కనికేని నీ యూహ తోచినదా ? నేనీయుత్తరమే వ్రాసి ముద్రవైచి యుంచితి జూడుఁడు. ఇట్లు చెప్పినవానికే నా పుత్రిక నిత్తునని నిశ్చయించుకొంటినని పలుకుచు నప్పుడాముద్ర విడజించి తాను వ్రాసియుంచిన పత్రికంజూపి చదివి వినిపించెను. దానిలోఁ గృష్ణుండు వ్రాసినమాటలే యుండెను.

అప్పు డందున్న రాజపుత్రులెల్లఁ గృష్ణుని బుద్ధిబలమును మిక్కిలి కొనియాడుచు లజ్జావిషాదములతో మాఱుమాటాడక గూఢముగాఁ దమతమ దేశములకు పోయిరి. తరువాత నా రాజు కృష్ణుని సోత్కర్షముగా సత్కరింపుచు నతనిమెడలోఁ బుష్పమాలికవైచి నీవే నా యల్లుండవు. ధరణీమణితోఁగూడ నా పుత్రికను గైకొనుమని పలికెను.

ఆ మాటలువిని యతం డనంగీకారము సూంచిచుచు దేవా ! మీరు నన్నిందఱిలో బుద్ధిమంతునిగాఁ గణించి గౌరవించితిరి. ఇదియే పదివేలు. నాకుఁ బరిణయముతోఁ బనిలేదు. ఇట్లీ యభిప్రాయముతో మీ ప్రశ్నమున కుత్తరము వ్రాయలేదు. దైవవశంబునం జనుదెంచితినని పలుకఁగా నాతని మాటలు పాటింపక కానిమ్ము రేపు విమర్శింతము గాని ఇప్పుడు విడిదికిం దయచేయుఁడని యతని నందలముపై యెక్కించి వైభవముతో బస కనిపెను.

కృష్ణు డా వృత్తాంతమంతయు సుభద్ర కెఱిగించి చెల్లీ! నాకు వీరు పెండ్లి చేయుదురఁట. నా హృదయంబునం గల కలకంఠిని విడిచి మఱియొక వాల్గంటి నెట్లు పెండ్లియాడుదును. నాకది సమ్మతముకాదు. మనదారిని మనము పోవుదము రమ్ము. మనయన్న యిందులేడని పలికిన నక్కలికియు నొక్కింత విచారించి కానిమ్ము, తొందరయేమి వలదన్న బలవంతముగఁ గట్టిపెట్టెదరా యేమి? మఱి రెండుదినములు చూచి పోవుదమని సమధానముఁ జెప్పినది. అవ్వార్త సఖులవలన నెఱింగిన సువర్ణలేఖ శుద్ధాంతనిశాంతమునఁ దనప్రాణసఖియగు సునందయనుదానితో నేకాంతముగా నిట్లనియె.

బొఁటీ! నా మాట మా తండ్రి కెఱింగించితివికావుగదా? నీతో నెన్నిసారులు చెప్పితిని. ఇప్పు డేమి చేయవలయునో చెప్పుము. ఎవ్వడో దారింబోవుచు వచ్చి మా తండ్రిగారిచ్చిన ప్రశ్నమున కుత్తరముఁ జెప్పెను. దానంజేసి యమ్మహారాజు వానికి నన్ను వివాహముఁ జేయుటకు నిశ్చయించెనఁట. హా! యెంతకష్టమని నిట్టూర్పు నిగుడించుటయు నా సునంద యిట్లనియె. యోషామణీ! నీయభిప్రాయ మేమియు నుచితముగాలేదు. కలలో నెవ్వనినో వరించితిననియు నితరులం బెండ్లి యాడనని చెప్పెడిమాట పాటింపఁదగినదా? పదివేలమందికిఁ దోచని యుత్తరము చెప్పినవాడు సామాన్యుఁడని యెట్లు తలంచెదవు. దారిం బోయెడువారుగాక మనకు మేనత్తకొడుకు లుండిరా యేమి? చాలు చాలు కలలోఁ గన్నవారికొఱకు నివారించెదవేల ? వినినవారు నవ్వుదురుసుమీ! యని యోదార్చిన నత్తన్వి యిట్లనియె. పుష్పబోణీ! ప్రజలు నవ్విన నవ్వుదురుగాక. నేనేమి చేయుదును. కలలోగన్నవాఁడని చులకనగాఁ బలికెదవు. అది కలయో నిక్కువమో నీకేమి తెలియును. ఇదిగో యిట్టి మనోహరుని విడిచి యన్యు నెట్లు వరింతునో చెప్పుము అని తానొక చిత్రపటముఁ జూపినది.

అప్పుడు సునంద సుందరీ! దీని నీవు వ్రాసినప్పుడే చూచితి నిందున్నవాఁడు కడు సుందరుడగును. ఏమి చేయుదుము. ఎండమావులలోని నీరు తియ్యగా నుండును. దాహ మిమ్మనిన నెట్లు సంపాదింతుము? నీ పలుకు లట్లేయున్నవి అనుటయు నవ్వనిత బోఁటీ! మున్ను బాణాసురుని కూఁతురు ఉషాకన్యక కోరినఁ జిత్రలేఖ యనిరుద్ధుం దీసికొనిరాలేదా? అది స్వప్నగతవృత్తాంతముగాదా ! అయినను నా కిప్పుడు వివాహమున కేమితొందర వచ్చినది. నెమ్మదిగా విచారించుకొందముగాక! నన్ను ముంపిన నా మనోహరుండే కనంబడును. అట్టివాని వెడలఁగొట్టి యన్యునియందు ------------- నోప ఏమన్ననుసరే మాతండ్రిని పోయిజూచి రమ్మని చెప్పినది. అవ్వనిత మాటవిని సునంద సఖీ ! నీవు తొందరపడకుము. ఆరాజకుమారుం ------చూచి యనకూలుండేని నేదియో మిష పన్ని వినిపించెదను. తగిన వాఁడైన జెప్ప నేమిటికని యోదార్చుచు నల్లన నా సాయంకాలమునఁ గృష్ణుండున్న నెలవుకు వచ్చి యతనిం జూచి విమర్శించి యతనిచేతనున్న చిత్రఫలక మెటులో సంగ్రహించికొని మిగుల సంతోషముతో రాజపుత్రిక యొద్దకు వచ్చి యిట్లనియె. ముద్దియా! నీవు సంకల్పసిద్ధురాలవు. అన్నన్నా! యెంత చిత్రము ఎంతచోద్యము ఔరౌరా! కలలు నిక్కము లగుట నేఁడుగా నిశ్చయింప వలసివచ్చినది. ఈ చిత్రపట మెవ్వరిదో చూచుకొనుము. నీపురాకృతసుకృతము ఫలించినది. విధి విచిత్రసంఘటనములు గావించుచుండును గదా యని పలుకుచు నా చిత్రఫలకముఁ జూపించినం జూచి యా చిన్నది వెఱఁగుపడుచు నిట్లనియె.

సఖీ! నీ మాట లేమియు నా కర్దము కాలేదు. ఏమిటి కట్లాశ్చర్యము నొందెదవు. దీని నెవ్వరు వ్రాసిరి. నిజము చెప్పుమని యడిగిన నప్పడఁతి తరుణీ! వినుము నీవు కలలో సేవించినవాఁడే వచ్చి మీ తండ్రి యిచ్చిన ప్రశ్నమున కుత్తర మిచ్చెను. అతండు మసుష్యమాత్రుండు. కాఁడు. కంతుఁడో వసంతుఁడో జయంతుఁడో కావలయును. నీ వనిన ట్లతనివ్రేల నీ యుంగర మున్నది అంతయు విమర్శించి వచ్చితిని. నీ వెట్లు పరితపించుచుంటివో యీ చిత్రపటము గరమునం దాల్చి యతండు నీనిమిత్త ముత్తలమందుచున్న వాఁడు అని యా కథయంతయుం జెప్పిన విని ముప్పిరిగొను సంతసముతో విని యేమేమీ! నా ప్రాణవల్లభుఁడే వచ్చెనా? నా హృదయతస్కరుని నిజముగా నీవు జూచితివా? నీవు కలలో నాకిట్లు చెప్పుట కాదుకదా? మనమిప్పు డేయవస్థలో నుంటిమి. నిజము చెప్పుమని వేడుకొనిన నా సునంద యిట్లనియె.

ఇది కలగాదు. యథార్థమే శీఘ్రకాలములో నీ యభీష్టము తీరఁగలదు. మాకుఁ బారితోషికము రాగలదని పలికిన నక్కలికి అయ్యో ముహూర్త మెన్నినాళ్ళున్నది? అబ్బా! నీ మాట వినినది మొదలు మేన నెద్దయో తాపము నొడమిన దేమి? నిమిష మీ బాధకుఁ దాళఁగలనా! నీ పాదంబులకు మ్రొక్కెదసు. వాని నొక్కసారి యీ రాత్రి నా యొద్దకుఁ దీసికొని రావలయుఁ గానిచో నన్నచ్చటికిఁ దీసికొని పొమ్ము ఇదియే నీవు చేయు సహాయము. నీవు కడుబుద్ధిమంతురాలవని యనంగ లీలాతరంగితయై ప్రార్దించిన నంగీకరించి యా సునంద యతనిం దీసికొని వచ్చెదనని సువర్ణ లేఖ కభయహస్తమిచ్చి యప్పుడు కృష్ణుని బసకుంబోయి మాటలచేఁ బరిచయముఁ గలుగజేసుకొని యతండు రాత్రి నిద్రించుచుండ మత్తు మందుజల్లి యిరువురి సఖురాండ్ర సహాయముగాఁ దీసికొని యతని జిన్నయందములపైఁ బరుండబెట్టి మెల్లన సువర్ణలేఖ యంతఃపురమునకు దీసికొనిపోయి తల్పంబునఁ బండుకొన బెట్టినది

అప్పుడు సువర్ణలేఖ సునందను గౌఁగలించుకొని కొనియాడుచు గృష్ణుని సాభిజ్ఞానముగాఁ జూచి మేను బులకింపఁ దల కపించుచు మోము మోమున జేర్చి ముద్దాడుచుఁ దద్దియు మోహంబున నుద్దవిడి గౌఁగిలింపఁబోయి బోఁటీ! ఇవి యేటి వేడుకలు! వీని మత్తు వదలించి మేల్కొనఁజేయుము. కాలయాపన సైపనని పలికిన నా సునంద వేఱొక మందుఁజల్లి యతనికిఁ దెలివి గలుగఁజేసినది. అప్పుడతండు కన్నులం దెఱచి నలుమూలల జూచి తన శయ్యయుఁ దనటెంకియుఁ గాదని తెలిసికొని కాచదీపికిలచేఁ బట్టపగలుగా నొప్పుచున్న యా శుద్ధాంతమందిర విశేషములన్నియుం జూచి యది స్వప్నముగా దలంచి అయ్యో నా కిట్టి కలలు వచ్చుచున్నవేమి ? వీని వలన దుఃఖమే కాని సుఖము లేశములేదు. పోనిమ్ము మొన్నటి పొన్నికొమ్మ యొకసారి వచ్చి నా కన్నులం బడిన నీ కల సార్థకమగుంగదా ? యని తలంచుచుండ నా సువర్ణలేఖ సువర్ణలేఖంబోలె మెఱయుచు దివ్యమాల్యాంబరాభరణాదుల ధరించి జగన్మోహనంబగు వేషంబుతో మైపూతవాసనలు దెసల నావరింప నల్లనవచ్చి యతనిం గౌఁగిలించుకొనినది.

అతం డాసుందరి గుఱుతుపట్టి మోహనసాగరంబున మునుంగుచు నోహోహో ! నీవా ప్రవాహవేగంబునఁ గొట్టికొని యెక్కడికిఁ బోయితివి ? నన్ను విరహాగ్ని పాల్పడఁజేసి యింత యుపేక్షసేయ న్యాయమేనాయని యేమేమో యున్మత్తాలాపములు పలికిన విని యక్కలికియుఁ బ్రాణేశ్వరా ! పిమ్మట నేమి జరిగినదో నే నిప్పుడు జెప్పఁజాలను. దైవ మెట్లు పంచిన నట్లు జేయువారము కదా ! మనకు స్వతంత్ర మెక్కడిది మరల మనము గలసినందులకే సంతోషింపఁ దగిన దని ప్రత్యుత్తర మిచ్చినది. పిమ్మట నా రాజనందనుం డయ్యిందువదన సంగీతప్రసంగమునఁ గొంతతడపు సంతసము గలుగఁజేయుటయు మోహావివశుండై యగ్గరితం బిగ్గరఁ గౌఁగిలించుకొని యధరామృతంబు గ్రోలెను.

అట్లు వారిరువురు మనమునం గల యభిలాషలు దీర స్మరపారవశ్యంబున సమబాహ్యాభ్యంతర విశేషంబులఁ గ్రీడించి యలసి సొలసి గాఢ నిద్రావశం వదులగుటయు నంతలోఁ దెల్లవాఱు సమయ మగుచున్నది. కావున సునంద యతని నెప్పటి యట్ల దీసికొని పోయి మునుపింటిలోఁ బరుండఁబెట్టి వచ్చినది. కృష్ణుండు వాడుక ప్రకారము సూర్యోదయము కాకమున్న లేచి రాత్రి చర్చలన్నియు స్వప్నలబ్దములని నిశ్చయించి సంతోష విషాదవిస్మయంబులు చిత్తంబుత్తల పెట్టఁదన యవయవములు చందన కస్తూరికాది పరిమళ ద్రవ్యమిళితములై ఘుమఘుమాయ మానంబులగుచుండ సత్యాసత్యవివేచనము సేయనేరక కలకఁ జెందుచు సుభద్రం జేరి యిట్లనియె.

చెల్లీ ! వింతలపై వింతలు గనంబడుచున్నవి. మొన్నటి చిన్నది రాత్రి స్వప్నములో వచ్చి ముచ్చటలు సూపినది సుమా ! నా మేని గంధము పరికింపుము. -------------- ఎన్నఁడు గనివిని యెఱుంగము. నేను బెండ్లి యాడఁ దలఁచుకొన్నా ఆచిన్నది వచ్చినది సుమా ! మనమికిం దుండరాదు. మన దారిని మనము బోవుదము. --------------- ఇందుకేమేని యీ రాజు పెండ్లి జేయక విడువడు. రహస్య మార్గం బున నరుగవలయునని బోధించి యప్పడఁతి నొప్పించెను. వారు నాఁటి రాత్రి యెవ్వరికి దెలియకుండ నొక యరణ్యమార్గంబునం బడి పాదచారులై పోఁదొడంగిరి

అస్వస్థుల చిత్తములు తరళములై యుండును గదా ? అట్లు దారి కాని దారింబడి పోవుచున్న సమయంబున సుభద్ర 'అన్నా ! మన చిత్తములు పూర్వము వలె మన స్వాధీనతలో లేవు సుమీ ? మన మెక్కడికిఁ బోవలయునో యెక్కడి నుండి వచ్చుచుంటిమో మనకు జ్ఞాపకము లేదు. ఎద్దియో మఱచిపోయిన వస్తువును వెదుకుచున్నట్లు తిరుగుచున్నాము. నీ కేమైన స్ఫురణ యున్నదా' యని యడిగిన నతండు 'చెల్లీ ! పాతాళ బిలములోఁ బడినది మొదలు మన మదుల కిట్టి వికారము గలిగినది. ఒక్కొక్కప్పు డంతయు జ్ఞాపకము వచ్చును. అప్పుడు నీతోఁ జెప్పవలయునని తలంచి పిమ్మట మఱచి పోవుదును. ఈ సారి యంతయుం జెప్పెదనులే' యని యుత్తరము జెప్పెను.

వారట్ల య్యరణ్యములో మఱునాఁడు సాయంకాలము వఱకు నడిచిరి. జనపదంబేదియుఁ గనంబడినది కాదు. చీకఁటి పడుచున్నదని కృష్ణుండు ముందుగావడిగా నడచుచుండ సుభద్రయు నోపినంత వేగముగా వెనుక నడువజొచ్చినది. ఒకచోట రెండు దారులు గనంబడినవి. అందు గృష్ణుఁడే దారిఁ బోయెనో తెలియక సుభద్ర నిలఁబడి యన్నా, యన్నా ! యని పిలిచినది కాని యతం డట్టి సమయమున రాత్రి జరిగిన క్రీడావిశేషములఁ దలంచుకొనుచు నడుచుచున్న వాఁడు గావున నాకోకస్తని కేక లేమియు వినబడినవి కావు. పెద్ద దూరము పోవు వఱకు సుభద్ర వచ్చుచున్నదో లేదో యను మాటయు విమర్శింపలేదు. అప్పుడు సుభద్ర కృష్ణుఁ డేదారిని బోయినది తెలిసికొనలేక యొక్కింతసేపు చింతించి దైవము తనకుఁజూపిన మార్గంబునం బడి నడువసాగినది.

అంతలో లోకబాంధవుడు తదీయగమన వ్యధఁజూచి సహింపని వాఁడుంబోలె పశ్చిమ సముద్రమున మునింగెను. తోడనే దదీయహృదయశోకాంధకారమునకు బంధుత్వమును దెలుపుచుఁ జీఁకటులు కాటుక పూసినట్లు నలుదెసల నావరింపఁ జొచ్చినవి. అప్పు డప్పడఁతి వనపక్షిమృగశూన్యంబగు నమ్మాహారణ్యములో గుండె ఱాయి చేసికొని దారి గనంబడినంత సేపు నడిచినది. క్రమంబునఁ జీఁకటి యతిశయింపుచుండెను. అప్పు డయ్యండజయాన మన్నును మిన్నునుం దెలియక నిలంబడి శయనింపఁ దగినతా వరయుచుండ నా దండ నొక రావిమ్రాను పృధులదళసాంద్రములైన శాఖాసమూహములచే దెసల నావరించి మార్గమున వ్యాపించియున్నది. అది నివాసయోగ్యంబని యెంచి యా యించుఁబోడి తదంతికధరణి కరిగి కరతలంబున నందలి జీర్ణవర్ణంబులఁ దొలగించుచు నొక నెలవిరపు పరచుకొని యుసురని నిట్టూర్పు నిగుడించుచు హస్తోపదానముగా శయనించె. అప్పు డాత్మవృత్తాంత మంతయు నంతఃకరణగోచర మగుటయు నిటు తలంచినది.

అయ్యో ? నేను మహారాజు కడుపునఁ బుట్టి యింటికడ సుఖంబుండక యన్నలతో దైవమాయఁ దెలిసికొందు నని యేమిటికి దేశాటనముఁ జేయవలయును ? చేసితిమిపో దైవము లేఁడని నిందింపనేల ? దానినే కదా దైవమాయామోహితులమై యున్మత్తులక్రియలఁ దిరుగుచుంటిమి. జగంబంతయు భగవంతుని చేతిలో నున్నది. మహామాయను మించినవాఁ డెవ్వఁడును లేఁడు ఊపిరి విడుచుటకైన జనుఁడు స్వతంత్రుఁడుగాడు. ఆహా ! ఇట్లని యెఱింగినను గ్రమ్మఱమోహం బావేశించుచుండును. ఏమి చేయుదుము. పరమేశ్వరుని శరణుఁ జొచ్చుటకంటె వేఱొక్క సాధనము లేదు. అన్నదమ్ముల విడదీసి యీ మహారణ్యములో నెవ్వఁడు ప్రవేశ పెట్టెనో యాతఁడే యీ యాపద దాటింపవలయు నొరులకు శక్యమా ? యని పరమేశ్వరుని ధ్యానించుచుఁ బరుండినది.

బ్రహ్మరాక్షసుని కథ

అయోముఖుండను బ్రహ్మరాక్షసుఁడు చిరకాలము నుండి యా రావిమ్రాను నాశ్రయించుకొని యుండెను. వానికి శివరాక్షసుడు విష్ణురాక్షసుఁడు నను దూత లిరువురు గలరు. వారితోఁ గూడికొని యాసక్తంచరుఁడా యరణ్యములో నున్న జంతువుల నెల్ల భక్షింపుచుండును. దానంజేసి యాయడవి పశుపక్షిమృగాదిశూన్యమై యున్నది. ఆ దారిని మనుష్యు లెవ్వరును సంచరింపరు. ఆ యశ్వత్థమునకు మూడు యోజనముల దూరములో నెటు చూచినను జనపదం బేదియును లేదు. నాఁటి రాత్రి బ్రహ్మరాక్షసుని కంటె శివవిష్ణురాక్షసులు ముందుగా వచ్చి యిట్లు సంభాషించుకొనిరి.

శివరాక్షసుఁడు - అన్నా ! మనయజమానుఁ డింకను రాలేదేమి. ఆహార పదార్ధములఁ దెచ్చి సిద్ధముగా నుంచితివా ?

విష్ణురా - ఇదిగో యా ఱాతి మందసము జంతుకళేబరములతో నిండించితిని. ఈ దినమున మనుష్య మాంసము గూడ దొరకినది. నేను లేచినవేళ మంచిదే.

శివరా - అట్ల నెద వేమిటికి.

విష్ణురా - అబ్బా ! ప్రతిదినము వీనితో నేను బడెడు నిడుములకు మితి యున్న దా ? రాత్రి వచ్చువఱకుఁ బలు విధములగు జంతువులఁ జంపి తెచ్చి యీ పెట్టె నిండింపవలయును. దానిలో మనుష్య మాంసము కూడ తప్పక యుండవలయునఁట. నే నెక్కడఁ దెత్తును. యీ యడవియంతయు బశుపక్షి మృగశూన్యముఁ జేసితిని. వీని వార్త విని మనుష్యులీ దారి నడచుట మానిరి ఏది లేకున్నను నాకుఁ బ్రహరణములే కదా ? అప్పా! నా కొకటి చెప్పుము. వీఁడు బ్రహ్మరాక్షసుఁడు నేను విష్ణురాక్షసుఁడను నీవు శివరాక్షసుఁడవు గదా ? బ్రహ్మకన్న శివవిష్ణులే యధికులు. వీనికి మనము పరిచారకత్వము జేయనేల? వీరి కన్న మన మేమిటికిఁ దక్కువవారలమైతిమి?

శివరా - త్రిమూర్తులలో బ్రహ్మ దక్కువవాఁడైనను రాక్షసులలో బ్రహ్మరాక్షసుఁడే యధికుఁడని బేతాళుఁడు శాసనము నిర్మించి యున్నాడు.

విష్ణురా - బేతాళున కట్టిచట్టము నిర్మించుట కేమి యవసరము వచ్చినది.

శివరా - అతండు సర్వభూతప్రేతపిశాచశాకినీఢాకినీరాక్షసాదిగణంబులకు సార్వభౌముండు. సేవ్యసేవకన్యాయములో వీరికి వీరికిఁ దగవులు వచ్చినవి. వానినెల్లఁ పరిష్కరింపుచుఁ గొన్ని శాసనములు నిర్మించెను.

విష్ణురా - అయ్యో ? యెంత మోసము. మన జీవితకాల మెల్ల వీనికి సేవ చేయవలసిన దేనా?

శివరా - విధాయకముగాఁ జేయవలసినదే.

విష్ణురా - అక్కటా ? యీ యిక్కట్టు నా కెట్టు తప్పునో కదా ? వీఁడు కుడుచునప్పుడు వేరు వేరు పక్షి మృగాది మాంసఖండములు పేరులు చెప్పుచుఁ గల్లులో ముంచి నోఁటి కందించుచుండవలయును. నడుమ నడుమ మనుష్యమాంసము నంజుకొనఁ బెట్టవలయును. ఈ పెట్టెడు వానిపొట్టం బెట్టుకొనునుకాని యొకముక్కైన నాకు మిగల్చఁడు నా వృత్తికన్న నీ వృత్తియే లెస్సగా నున్నది.

శివరా - నా పని మాత్రము తక్కువదియా ? ప్రపంచములో నున్న భూత ప్రేత పిశాచాదుల వార్తలన్నియుం దెలిసికొని వచ్చి చెప్పుచుండవలయును. ఒక్క నిమిషమైనఁ గూర్చుండుటకు నవకాశ మున్నదియా ? సేవక వృత్తియే కష్టమైనది. ఏమి చేయుదుము ? బ్రహ్మ మనకిట్లు విధించెను.

విష్ణురా - అదిగో అయోముఖుఁడు వచ్చుచున్నాఁడు. మాటాడకుము.

అని చెప్పుచుండఁగనే యయోముఖుఁడు వియద్గమనంబునఁ బ్రాంతపాదపశాఖలు పెళ పెళ విఱుగ నతిరయంబున వచ్చి యచ్చెట్టుపై వ్రాలెను. అప్పుడు విష్ణురాక్షసుఁడు రక్తమునఁ గాళులు గడిగి చర్మమునం దడి యొత్తుచు మనుష్యకేశరచితచామరంబుల వీచుచుఁ బెక్కుపచారములు సేయఁదొడంగెను. ఆ రాక్షసుఁడు వాడు ప్రకారము పృధుశాఖాంతరమున నమరింపబడియున్న పాషాణపేటికపైఁ గూర్చుండి పరిచారకులతో నేదియో సంభాషించుచున్న సమయంబున నా మందసము క్రిందనున్న కొమ్మలు నాలుగు పెళ పెళ విఱిగి గుభాలున నా పెట్టెతోఁ గూడ నేలం గూలినవి.

ఆ మందసము సుభద్రకు దాపుననే పడినది. ఆ ధ్వని విని సుభద్ర యదరిపడిలేచి కూర్చుండి యదేమియో యని విమర్శింపుచుండ నా మందసముపైఁ గొండవలెఁ గూర్చుండియున్న రాక్షసుఁడు గనంబడెను ? అప్పుడా చిన్నది ఏమియుం దోచక మ్రాన్పడియట్లే కూర్చున్నది. పెట్టెపై నున్న బ్రహ్మరాక్షసుం డాచిగురుఁ బోడిం జూచి మూపు లెగరవైచుచు నో హోహో ! నా పుణ్యమేనని జెప్పఁదగినది. కుందేలు వంటయింటికే వచ్చి పడినదికదా ? నా పరిచారకు లెక్కడను మనుష్యులే దొరకరని చెప్పదురు. ఎన్ని మాంసములైనను మనుష్య మాంసమున కెన యగునా ? నేఁడు నా యలసట దీఱుటకుఁ దగిన యాహారము దొరకినదని యుబ్బుచు నోరీ ? నీ వెవ్వఁడవు ? ఈ కారడవి కేమిటికి వచ్చితివి ? పాపము నీవు నాయునికి నెఱుంగవు కాఁబోలునని సాగేదముగాఁ బలికిన విని యక్కలికి యతండు బ్రహ్మరాక్షసుఁడని తెలిసివాని హింపుడిపికొని చావు నిక్కమమని నిశ్చయించి తెగువయై నిట్ల నియె.

మహాత్మా ? నా దేహము నీ కాహారముగాఁ జేసి కృతార్థురాలనని యర్దోక్తిగాఁ బలికి మఱలఁ గృతార్ధుండ నగుదునను తలంపుతో నీ యరణ్యములోఁ బ్రవేశించి మూఁడుదినముల నుండి యీ వృక్షమును వెదకుచుంటిని. నేఁడు దీని క్రిందికి వచ్చి కృతకృత్యుండనైతిని. నా దేహము భక్షించి నీ యభీష్టము దీర్చుకొమ్మని పలికినది. ఆ మాటలు విని యా బ్రహ్మరాక్షస్సు వెఱఁగుపడుచు నో హో నీ మాటలు వినఁగడు చోద్యముగా నున్నవి. లోకములో నే జంతువై నను మరణమునకు వెఱచు చుండును. తన జీవితమునకు భార్యా పుత్రాదుల నర్పించుచుందురు. జీవితాశ యెట్టి యాపదలయందును జీవుల విడువదు. నీ రూపముఁ జూడఁ గడువింతగా నున్నయది కృతార్థురాల ననఁబోయి మార్చితివి. నీ వాఁడుదానవా ? మగవాఁడవా? నీ వృత్తాంతము వినమాకుఁ గుతూహలమగుచున్నది. మఱి రెండు గడియలు నీ కాయుశ్శేష మున్నది. నీ తెఱంగెఱిం గింపుమని పలికిన నక్కలికి యులికిపడుచు జడిసినట్లు తెలియనీయక యల్లన నిట్లనియె.

దేవా ! నేనొక రాజకుమార్తెను స్వయంకృతాపరాధముగా నింటియొద్ద నుండక యన్నలతో దైవమహిమఁ దెలిసికొను తాత్పర్యముతో దేశాటనముఁ జేయ మొదలు పెట్టితిని. నాటంగోలెనన్నియు నిక్కట్టులే యన్నియు నాపదలే యిడుమలతో నా యొడలుకాయలు కాచినది. ఒకటి విడిచినవేఱొకటి తటస్థించుచున్నది. అప్పుడు మరణమే సుఖకరమని తోచినది. అందులకై యెన్నియో ప్రయత్నములు చేసితిని నా ప్రయత్నములు కొనసాగినవి కావు. ఏదియో యంతరాయము వచ్చి బ్రతుకుచుంటిని. అప్పుడు కొందఱు నా యుద్యమము దెలిసికొని నీ కట్టి తాత్పర్యమేయుండినచో నీ యరణ్యములోనికిం బొమ్మని యిందు మీరున్న వృత్తాంతము జెప్పిరి. అప్పుడు సంతసించుచు నిది యనివార్యము గదా ? యని యిచ్చటికి వచ్చితిని. నా పూర్వజన్మపరిపాకంబున మిమ్ము బొడగంటిని. నా మేను వృధగాఁ గాక గృధ్రములుపాలు గాకుండ మీ యట్టి మహాత్ముల కుక్షిం పడుచున్నది. ఇదియే నాకుఁ బదివేలు. స్త్రీవేషముతో దేశాటనము చేయుట కష్టమని పురుషవేషముతోఁ గ్రుమ్మరుదును. సంసార మపారమని యెఱింగియే మన పెద్దలు వైరాగ్యము విషయమై తద్దయు బుద్ధులు గర పిరి పరోపకారముకన్నఁ బుణ్యకారము మఱియొకటి లేదు. నేనొరులకు నేమి చేయగలను. వేగముగ నా మేను భక్షించి నన్ను స్వర్గమున కనుపుడు మీకును జాల పుణ్యము వచ్చునని పలికిన విని యా బ్రహ్మరాక్షస్సు అల్లన నవ్వుచు నిట్లనియె.

పువ్వుఁబోడి ! మేమెట్టి క్రూరాత్ముల మైనను మాకు మాత్రము కనికరము లేదను కుంటివా ? నిన్నుఁజూడ నా కేమియో కాని యక్కటికము జనించుచున్నది. నీ యాయువు దృఢమైనది గదా ? నీవు నా నిమిత్త మీ యరణ్యమునకు వచ్చితివి కావున బూజ్యురాలవైతివి. నిన్ను భక్షించుటకు వీలు లేదు.

శ్లో॥ మహతామపియజ్ఞానాం కాలేనక్షీయతే ఫలం
     ఫలస్యాభయదానస్య క్షయఏవనవిద్యతే ॥

అని యున్నది. కావున నీ కభయ మిచ్చితిమి. నీ కామిత మెద్దియో చెప్పుము. తీర్పవలసి యున్నదని పలికిన విని యవ్వనిత డెందము తట తట యొక్కింత తగ్గించుకొని క్రమ్మఱ నిట్ల నియె. స్వామీ ! నాకీ దేహము మీఁద నాస లేదు. నాకు మరణమే శ్రేయము కనికరించి నన్ను భక్షింపుఁడు దీని వలన మీకుఁ బుణ్యముగాని పాపము లేదు. ఇదియే మీ కతిథి కృత్యమని యెంతయో నై పుణ్యముగాఁ బలికిన నా రక్కసుఁడు సమ్మతింపక అయ్యో ? నీ వింత వెఱ్ఱిదానవేమి బ్రతికి యుండిన సౌఖ్యములఁ నొందవచ్చును. చచ్చిన నేమియున్నది. నెమ్మది నెమ్మదిగా విచారించుకొని కామితము దెలుపుము. ప్రీతితో నిచ్చుచున్నానని పలికి యా చెట్టుపైకిఁ బోయెను. పిమ్మట నయ్యువతి యాత్మగతంబున నిట్లు తలంచెను. ఆహా ! ఎందును స్తుతించిన నుబ్బనివారు లేరు. ఎదుటి మనసు కని పెట్టి మాటాడిన నెట్టివారికి నక్కటికము గలుగక మానదు. మసుష్య రక్తమును బానకమువలెఁ గ్రోలు నీదావునకు నా మాటలచే నక్కటికము గలిగినది. సమయస్ఫూర్తిగా నన్నిట్టి మాటలాడించినవాఁడు భగవంతుఁడు గాక మఱియెవ్వఁడు. దైవమాయ దెలియ నెవ్వరితరము. నా కింక నాయుశ్శేష మున్నది కాఁబోలు. కానిమ్ము. మఱికొంత సేపు వీని యొద్ద వైరాగ్యవృత్తి సూచించి పిమ్మట వర మడిగెదను. నాకు వీని వలనగు కార్యమేమి యున్నది. ఈయరణ్యము దాటించుటయే వరము అని తలంచునంతలో నా పాదప్రాంతము నుండి తదీయ పరిచారకు లిరువురు వారిలో వారు మాటలాడుకొనుచుఁ గ్రిందికి వచ్చి యచ్చిగురుఁబోడి కిట్లనిరి.

కాంతా ! నీ వృత్తాంతమంతయు మా యేలిక మాకుఁ జెప్పెను. మేమాతని దూతలము. ఈతండు విష్ణు రాక్షసుఁడు, నేను శివరాక్షసుడ. నీ కాయన వరము నిచ్చెదను కోరికొమ్మని యడిగిన మరణమే వేడు చున్న దాన వఁట యిదియేమి కర్మము చెరుకు ముక్కలవలె మనుష్య గాత్రముల విఱుచుకొని తినియెడు మా స్వామికి నీయం దక్కటికము గలుగుటయే మిక్కిలి చిత్రముగా నున్నది. మనుష్యమాంసమునకై మమ్ము నిత్యము వేచుకొని తినుచున్నాడు. నీ పూర్వపుణ్యము మంచిది యెక్కుడు శరీరములో లేచుటకు శక్తికలిగినది. ఆ లోపల నతని చిటికెన వ్రేలినున్న యుంగరము గురుతుఁ జూచి తనదని తెలిసికొని విస్మయము నొందుచు "అమ్మకచెల్లా! వీఁడే నా హృదయచోరుండు వీని నెక్కడనో చూచినట్లున్నదని మూడు దినముల నుండియు నూహింపుచుంటిని అయ్యో! వీని కిట్టయవస్థ యేమిటికి రావలయు? అక్కటా ! ఒక్క నిమిషము దాటిన వీఁడు జమువీటి కతిథియైపోవునుగదా? పాపమా రక్కసులు నన్నీ పెట్టె కోరమనక పోయిన వీఁడు జీవింపడు. దైవ సంఘటన మెంతవిచిత్రముగా నుండునో అయ్యారే! అని ముక్కుమీఁద వ్రేలిడికొని యాశ్చర్యమందుచు నతనితోఁ బరిచయము గలుగఁ జేసికొని యల్లన నిట్లనియె. ఆర్యా! నీ వెవ్వని కుమారుండవు? జన్మదేశ మెయ్యది? నీ యభిప్రాయమేమి? బ్రహ్మరాక్షసుని పాఠశాలకు శాకమువై యెట్లుపోతివి ? నీ వృత్తాంతము వినఁ గుతూహలమగుచున్నది. వక్కాణింపుమని కోరిన నా పురుషసింహము అతఁడు తనకుఁ జేయునుపకారము లన్నియుఁజూచు చున్నవాఁడు కావునఁ గృతజ్ఞతసూచించు పలుకుల వినుతించుచు నల్లన నిట్లనియె.

సుగుణసాగరుని కథ

వయస్యా! నా జన్మభూమి కాశ్మీరదేశరాజధానియగు విక్రమనగరము. మా తండ్రి పేరు విక్రమసేనుడు. నన్ను సుగుణసాగరుఁడని పిలుచుచుందురు. ఘృతకోశన్యాయంబున నాయందేగుణము లేకున్నను నాకాపేరు వాడుకయైనది. క్రమంబున నేను వేదశాస్త్రపురాణాది విద్యలం జదివితిని. భాషల గ్రహించితిని. లిపులు నేర్చితిని. శస్త్రాస్త్రవిద్యలలో నసమానుండని పేరు పొందితిని. చిత్తరువులు వ్రాయుటలో నన్ను మిగులఁ గొనియాడుచుందురు. చిన్నతనము నుండియు నా కేదియో క్రొత్తవిద్య సంపాదింపవలయుననియే కోరికయై యుండెను. ఇట్లుండ నామేనజవ్వనము పొడసూపినంత మా తండ్రి నాకు వివాహము సేయవలయునని ప్రయత్నముఁ జేయుచుండ నెఱింగి వలదని వారించితిని. అతం డందులకుఁ గారణ మేమని మంత్రులచే నడిగించిన నీ పద్యము వ్రాసి పంపితిని.

సీ॥ కాలహేటజ్వాలఁ ♦ గబళింప నగుఁ గాని
               యతివలతోడ మా ♦ టాడ నగునె
     పులుల మీసముల ను ♦ య్యెలలూగ నగుఁ గాని
               వారిజాక్షులచెంతఁ ♦ జేరనగునె
     దంభోళిహతిసము ♦ ద్దతి కోర్మనగుఁ గాని
              లేమలపల్కు లా ♦ లింప నగునె
     మదనాగ్నిఁ బిడికిట ♦ నొడియంగ నగుఁ గాని
             కుసుమ గంధులపొందుఁ ♦ గోరనగునె

గీ. కటకటా ! మూర్ఖమర్కట • కరతలస్థ
    కల్పతరుసూనమాలికా • కల్పుఁడగుచు
    సరసుఁడగు మర్త్యుఁ డంగనా • జనమహోగ్ర
    ఘోరసంసార విషధిలోఁ • గూలనగునె.

తన్మూలకముగా మదీయాంతరంగము శృంగారరసతరంగితము కాదని నిశ్చయించి మా తండ్రియొక్క యుద్యానవనములోఁ గ్రీడాసౌధ మొండు మనోహరవస్తుసంపూరితముగాఁ గట్టించి యందు నన్ను నివసింపజేసెను. మఱియు వారాంగనానృత్యగానప్రసంగములచేతను శృంగారనాటకప్రదర్శనములచేతను గావ్యనాటకాలంకారగ్రంథపఠనవిశేషములచేతను గాలక్షేపము జరుగునట్లు నిత్యము నియమించెను. అప్పటికి నామనసు తిరిగినదికాదు. అందులఁ గుఱించి మా తండ్రి నిత్యముఁ జింతింపుచుండెను. ఇట్లుండు నా కొక స్వప్నము వచ్చినది. అబ్బా ! తలంచుకొనిన బాష్పంబులు గన్నుల నావరింపు చున్నవి చూడుము. ఆహా ! యొక మనోహరాంగి నా పర్యంకముదాపునకువచ్చి నిలువంబడినది. అంతలోఁ గన్నులం దెఱచిచూచితిని.

సీ. భుగభుగ వాసింప . బొసగు పుత్తడిబొమ్మ
              మాటాడనేర్చిన • మణిశలాక
    కలికిచేతలనొప్పు - కమ్మక్రొవ్విరిబంతి
              తగుజీవకళల చి • త్తరువుప్రతిమ
    గమనశృంగారంబు • గనుపట్టు లతకూన
              కళదొలంగని తొల . కరి మెఱుంగు
    కరచిణాంగసం • గతిఁగన్న శశిరేఖ
              హావభావములఁ జె • న్నలరు సరసి

గీ. యగునని గణింప వినుతింప * నలవిగాదు
    దాని చరలూబ్జనఖలేఖ * తోను బోలఁ
    గలరె యీ లోకముననున్న * కాంతలెల్ల
    చెన్నుమీఱఁగనేమని * విన్నవింతు.

క. అమృదులోకు విలాసం
   బామోహనముఖవికాస మాదరహాసం
   జూపెద యానడ యాజడ
   యామేని మెఱుంగురంగు • నలవియె పొగడన్.

అక్కామినీరత్నమును శయ్యపై కొయ్యన జేర్చి మోము ముద్దాడి యధర సుధారసంబు గ్రోలంగ సుకించుచున్న సమయంబున ధటఢ్చటారావముతో విస్ఫులింగము లురులఁ దరులచాదుల భస్మము చేయుచు నొక యగ్నిజ్వాలవచ్చి మమ్మెగరఁ జిమ్మినది. ఆ యలజడి వలన నాకు మెలకువ వచ్చినది. ఆ చిన్నది యేమయ్యనో తెలియదు. అది మొదలు మదనగ్రహంబు మదీయహృదయంబున నావేశించినది. అది స్వప్నమని విరక్తి జెందుదమన్నను మేమప్పుడు మార్చుకొనిన యుంగరము నాజవ్వనిది నావ్రేలనున్నది. దానంజేసి యసత్యముకాదని యా పైదలి చెయ్వులే తలంచుచుఁ జిలుక గూసిన నాకలికి పలుకుచున్నదని యదరుచు గానంబు వినిన దదీయ కంఠనాదంబని యులుకుచు నీ తెఱంగున మదోన్మాదమునఁ బ్రవర్తింపుచుఁ గర్తవ్యాంశ మెఱుఁగక యొకనాఁడు వేకువజామున లేచి యెవ్వరికి జెప్పకుండ నందుండి యొక దారింబడి యెక్కఁడికో పోవఁదొడంగితిని. నా సంకల్ప మేమియో తెలియదు. అంతలో సాయంకాలమైనది. కన్నుగానక యందుండువోలె నక్కాంతా కాంతరమున సంచరింపుచుండ నాదండనుండి కొండవలె భయంకరమైన రూపముగల యొక భూతము నా యొద్ధకువచ్చి సింగంబు సారంగశాబకమును బట్టులీల నన్నొడిసి పట్టినది. అప్పుడే నా ప్రాణములు పోయినవని తలంచితిని. స్మృతి దప్పినది. తరువాత నన్నది మ్రింగినదో చంపినదో యేమిచేసినదో నాకుఁ దెలియదు. నీ వలన నాయాపద దాటినది గాఁబోలు. నీ వెట్లు విడిపించితివో దెలియదు. తరువాత వృత్తాంతమునకు నీవే ప్రమాణము. ఆ కారణముగా నాకిట్టి యువకారము గావించిన మీ కులశీలనామంబులు విని యానందించుట నాకు ముఖ్యముగదా ! యని పలికి యూరకుండెను.

ఆ కథవిని సుభద్ర హృదయంబునఁ బుట్టిన సంతోషము పట్టజాలక యట్టె నిలువంబడి యొక్కింత సేపేమియుం దెలియక యాశ్చర్యమందుచు నంతలోఁ దెప్పిరిల్లి మోహముగప్పి యప్పుడేమియు మాటాడక తన స్వప్నంబునఁ గనంబడిన మనోహరుం డతండని నిశ్చయించి నిలువఁజాలక యతనిని మిత్రుండువోలె బిగ్గరఁ గౌగిలించుకొనినది. అతండును సుహృదాశ్లేషసౌఖ్యంబు ప్రకటింపుచు సుభద్రను మన్నించెను. పిమ్మట సుభద్ర మొదటికథ యేమియుంజెప్పక తానాయరణ్యములోఁ బ్రవేశించుటయు బ్రహ్మరాక్షసుఁడు తన్నుఁజంపబోవుటయు దానన్నమాటలు విని తనకు వరమిచ్చుటయు నా మందసము గోరి కొనుటయు లోనగు వృత్తాంతమంతయుం జెప్పినది.

సుగుణసాగరుం డావృత్తాంతమువిని మిక్కిలి యాశ్చర్యము నొందుచు మృత్యుముఖమునుండి తప్పించిన యతనియందుఁ గృతజ్ఞతగలిగి తన దేశమునకుఁ దీసికొనిపోయి యెక్కుడుగా గౌరవింపఁదలంచి సుభద్రతోఁగూడ స్వదేశాభిముఖుఁడై యరిగెను.

కృష్ణుని కథ

అది యట్లుండె. కృష్ణుం డానాఁడు సుభద్రను పిడిచి ముందరిగి కొంత సేపటికి సుభద్రమాట జ్ఞాపకము వచ్చుటచే మిక్కిలి పరితపించుచుఁ గొంతదూరము వెనుకకువచ్చి యాయడవి ప్రతిధ్వని యిచ్చునట్లఱచి యఱచి ప్రతివచనంబుఁగానక చింతాకులస్వాంతుండై యొక చెట్టు కిందఁ గూర్చుండెను. ఇంతలోఁ బ్రొద్దుగ్రుంకినది. యా కటికి చీఁకటిలో నెటుపోవుటకుం దోచక నేలం బండుకొనియెను. అప్పుడు సుభద్రకుఁబోలె నాతనికిఁ దమవృత్తాంతమంతయు స్ఫురణకు వచ్చినది. ఆ రాత్రి నిద్రఁబోవక తమ చరిత్రముం దలంచుకొనుచు దైవమహిమ కచ్చెరువందుచు నతండు తెల్లవాఱినతోడనే తనయన్నను మధుమంతమున విడిచివచ్చితిమనియు నందేయున్నాడను నిశ్చయముతో బయలుదేరి కతిపయప్రయాణంబుల నారాజధాని కరిగెను

అతం డాపట్టణపు వీథిలో నడచుచుండ రాజభటులు చూచి వంగివంగి సలాములుచేయఁ దొడంగిరి. ఉద్యోగస్థు లోరగాఁ దొలంగు చుండిరి. సామంతులు నమస్కారములు చేయుచుండిరి. మంత్రులు కుశల మడుగఁజొచ్చిరి. పౌరులు వెంట వెంటఁ దిఱుగఁజొచ్చిరి. అది యంతయుంజూచి యతండు వింతపడుచు అయ్యో ? ఇది యేమి చిత్రము ? వీరందఱు నన్నెఱింగినట్లు మాటాడెదరు. ఈ పరిచయ మెక్కడిదో నాకుఁ దెలియదు. వీరి యభిప్రాయమేమియో నే నెఱుంగనని పలుతెఱంగులఁ దలంచుచు నావీధింబడి పోవుచుండెను. ఇంతలో ముఖ్యామాత్యుండు వచ్చి నమస్కరించి దేవా ! మీరు పరదేశస్థులవలె వీధులం దిరుగుచున్నా రిదియేమి? మీరాకవిని పరమసంతోషముతో మీ మామగారి యేనుగుఁ పై నెక్కించి తీసికొనిరమ్మని నన్నుఁ బుత్తెంచిరి. పోవుదమురండు మమ్ము మఱచితిరాయేమి ? యని పలికిన వెఱఁగుపడి యతండు మా మామగారెవ్వరు ? మీమాటలేమియు నాకర్థము కాలేదని యుత్తరముఁజెప్పెను.

అప్పు డామంత్రి "ఇది మధుమంత మనుపట్టణము ఈ పట్టణపు రాజుగారే మీ మామగారు. ఆయన కూతురు రత్నమాలను మీరు వివాహమాడితిరి. నేనాయన మంత్రిని. ఇదియే మీకును మాకునుగల బంధుత్వము. వేగము పోదుమురండు మీ మాయలకు మేము లోఁబడమని పలికిన విని యతండు బాగుబాగు మేలుమేలు. మీ మాటలు కడు విపరీతములుగా నున్న యవి. నన్నెవ్వనిఁగానో భావించి మీరు మాటలాడుచున్నారు. మిమ్ము నేనెఱుంగ నాకీవైభవములతోఁ బనిలేదు పో పొండని పలికినఁ జిన్న వోయి యయ్యమాత్యశేఖరుండు మాఱుమాట బలుకక రాజుగారియొద్దకరిగి యిట్లనియె. దేవా ! దేవరయల్లునింగాంచి తమ సందేశంబును విన్నవించిరమ్మని ప్రార్దించితిని. ఆయన కేమిటికో కోపమువచ్చినది. మొగమెఱుంగనివానితో మాటలాడినట్లు మాటలాడెను. మనయింటికి రారఁట నేనెంతయో బతిమాలితిని కార్యము లేకపోయినది. దేవరయేవెళ్ళి పిలిచిన వచ్చునేమోయని పలికిన నాభూపతి యప్పుడే యశ్వగజాందోళికాది వాహనములతో నరిగి యతండొక మఠములోనుండ దండకుంజని యల్లన నిట్లనియె.

ఆర్యా ! మేమేమి తప్పుచేసితిమి ? మాయింటికిరాక జోగివలె నీమఠముల వెంబడిఁ దిరుగనేటికి. చాలుచాలు. రారమ్ము సరివారు నవ్వుదురని పలికి పట్టుకొనుటయుఁ గృష్ణుండు ఔరా ! “యిది యెక్కడి బాంధవ్యము. మీరు భ్రాంతి పడుచున్నారు. మీరెవ్వరు? నేనెవ్వఁడను. బాపురే జోద్యముగా నున్నది. మీ యల్లుఁడ నేనుగాను వేఱయున్నాఁడు వెదకి తెప్పించుకొండని" పలికిన నారాజు మాన్పడి, యోహో? యీతని కేదియో యనుమానము గలిగినది. నాశత్రువు లెవ్వరో బోధించియుందురు. నాపుత్రికచారిత్ర యెఱుంగక యీతండిట్లనుచున్నాఁడు. అగ్గికి జెదలుపట్టునా యని తలంచి వెండియు నిట్లనియె. నాకు నీవల్లుఁడవు. నీకు నేను మామను. ఈ బంధుత్వము వలదన్నను పోవదు. నీ వేదియో లోనంబెట్టుకొని పైకి వేఱొకలాగున మాటలాడుచున్నావు . మా కులము కడుపవిత్రమైనది. మేమట్టివారముకాము నీ యల్లుఁడు వేఱొకడుండెనని యెత్తిపొడిచితివి. కులశీలాదులఁ బరిశీలింపక వీధింబడి పోవువానికిఁ బిల్లనిచ్చుటనేఁగదా యిట్లనుచుంటివి. కానిమ్ము ఎప్పటి కేది విధియో తప్పదుగదా యని పలికెను ఆ మాటలన్నియు విని యతండు వృశ్చిక దష్టమైన వానరముభంగిఁ జిరాకుపడుచు నేమియు నుత్తరముఁజెప్పక తటాలునలేచి యెక్కడికోపోవఁ బ్రయత్నముచేయుచున్న సమయంబున నతని రెండుచేతులు పట్టుకొని యా రాజు నీవు కోపించిపోయినను బోవనిత్తుమా ? రారమ్ము మా యపరాధము సైరింపుమని పలుకుచు బలాత్కారముగా నతని నొకయాందోళికంబునం గూర్చుండఁబెట్టి కోటలోనికిఁ దీసికొనిపోయెను.

వారు తనకుఁ కావించు నుపచారములుచూచి యతండు వెఱగుపడుచు "అయ్యో ? వీరు నన్నల్లునిఁగా భావించుచున్నారు. ఇట్టి మూఢులెందైనం గలరా ? ఇప్పుడు నేనేమి చేయుదును. వీరికి నేనల్లుఁడ నెప్పుడై తిని. నేనే మఱచిపోతినా ? కాదు. అది చంద్రకాంతమను పట్టణము ఇదియదికాదుగదా ? యెట్లగును అని యనేక ప్రకారములఁ దలపోయుచుండెను.

నాఁటి సాయంకాలమున నతని బలాత్కారముగా రత్నమాల యంతఃపురమునకుఁ దీసికొనిపోయిరి. రత్నమాలయుఁ జక్కగా నలంకరించుకొని బతిరాక నిరీక్షించుచున్నది. కావున నప్పుడెదురుబోయి పాదంబులఁ గడుగఁబోయిన నతండు సమ్మతింపక తప్పించుకొనిపోయి యా గదిలో నొకపీఠంబునఁ దలవాల్చుకొని కూర్చుండెను. అప్పుఁడా రత్నమాల దాపున నిలఁబడి క్రేగంటి ప్రసారము లతనిపై బరగించుచుఁ బైటచెరఁగు చేతంబూని నిదానించి చూచుచు నతండే తన భర్తయని నిశ్చయించి పాణేశ్వరా! నాయందు మీ కాగ్రహము వచ్చినదఁట నేనేమి తప్పు జేసితిని. మా తండ్రికి వేఱొక యల్లుఁడున్నట్లు సూచించినారఁట. అది నాకు హృదయ శూలముగాకపోవునా? నేను త్రికరణములచేతను మిమ్మే భర్తగాను దైవం గాను నమ్మియుంటిని నాతోఁ జెప్పకయే నాఁటి వేకువజామున మీరరిగినది మొదలు నేను నిద్రాహారములు మాని మీ నిమిత్తమే చింతింపుచుంటిని. నిజము విచారింపుఁడు. తప్పుచూపి దండింపుఁడు అంతియకాని యూరక కోపించిన నేమిచేయుదుమని యెంతయో నైపుణ్యముగా మాటాడినది. ఆ మాటలువిని కృష్ణుం డొక్కింతతడవు విచారించి సాధ్వీ! నీవు నన్నెప్పుడు పెండ్లియాడితివి? నన్నింతకుమున్నెన్నఁడైనఁ జూచితివా? యీ కల్పనలు నాకుఁ బిచ్చియెత్తింపుచున్నవి. నీవు నన్నెఱింగిన గుఱుతు లేమైనం గలిగెనేని చెప్పుమనుటయు నా యువతి చురచురంజూని యిట్ల నియె.

ఆర్యపుత్రా ! పురుషుల నెన్నఁడును నమ్మరాదుగా ? వినుండు మీరు మా యూరి సత్రములోనున్న మదీయ చిత్రఫలకముఁ జూచినప్పుడు కావించిన కృత్యంబులు -

శా. చూచు న్వేమఱుఁ జేతిచిత్తరువుఁ జూ • చుం దానిపై నున్న రా
     కాచంద్రాస్యను బిమ్మట న్మఱిశిరః • కంపంబు గావించు సం
     కోచం బందుచు వెండియుస్గనుఁ గలం • గున్నిక్కమంచున్ రతిన్
     జూచుం జేతులఁ గౌఁగిలింప నతఁడా • శ్చర్యంబు సంధిల్ల గాన్.

అని మా పరిచారికలువచ్చి చెప్పిరి. అట్టి మీ చర్యలేమైన జ్ఞాపకమున్నవియా? మఱియు వినుండు.

మ. కలలోఁగన్న వధూటియే యిదియ ని • క్కం బొక్కటేరూపమా
     లలనారత్నము గాలిలో నెగిరి యీ • లావచ్చెనా ? దీని క
     వ్వల నారూపు పటంబులోన లిఖయిం • పం గారణం బేమి యా
     కలయేనా యిది లేక నాకిటు తదా • కారంబు గన్పట్టెనా.

అని మఱియు నందున్న నన్నుద్దేశించి -

ఉ. ఓ పికవాణి ! యోఘనప • యోధర ? యోహరినీలవేణి ! నీ
    వీపగిదిం బటస్థితి వహించితి • వేమిటి కిందు సత్యమౌ
    రూపముదాచి తెందునసు • రూపమే నీకు ననున్ స్మరాగ్నిసం
    తాపముపాలు సేయ వల • దా కృపపల్క విదేమె కోమలీ.

చ. అమరులు దానవు ల్గలిసి • యంబునిధి న్మధియించి కన్న య
    యమృతముకన్నఁ జాలరుచి • యౌఁజుమి నీయధారామృతం యో
    రమణి ! యొకింత గ్రోలితి భ • రంబగు మోహనముగల్గె మేసితా
    పము గడు హెచ్చె బుద్ధిపరి • పాటి యడంగె గుణంబదేమెటో.

అని యున్మత్తుక్రియఁ బలవరించిన మాటయు స్మరణకు రాకుండెనా యనుటయు నతండు ముక్కు పై వ్రేలిడికొని అయ్యారే ! యిదియేమి యింద్రజాలము అని విస్మయ మభినయించుచుఁ దరువాత నేమి జరిగినదో జెప్పుమనియె. అప్పు డా చిన్నది మేల్కొనియున్నవాని నెవ్వరు లేపఁగలరు ? అయినను జెప్పెదను వినుండు. పిమ్మట నా వార్త నేనువిని మీ చిత్రఫలకము దెప్పించుకొనిచూచి మున్నుగలఁలో గన్న వాఁడేకదా యీతం డని నిశ్చయించి మా తండ్రికి నా యుద్యమ మెఱింగించి తిని. తరువాత నతండు మెండువైభవముతో వివాహము గావించెను ? అదియు నబద్దమే యనియెదరా యన నతండు కానిమ్ము. ఇందొకటి నిజమున్నదాయేమి ? నీ కథాకల్పన విని మానందింతుముగా ? దావుడు నా యిందువదన పోనిండు. మీకెట్లు తోచిన నట్లు కావింపుఁడనియె. తరువాత నతండు సాధ్వీ ! యివియేనా మఱి యేమైనం గురుతులుగలవా ? యని యడిగిన నప్పడఁతి బూటకపుదాని మాటలేమి నమ్మకమగును. (సిగ్గభినయించుచు- ) - 1 ) | గ్రీడాంతరమున -

19 న ర ది" - ము ) ||ని అన్ని పంచి నన్నయ
4) ము: న్న "లకు) . • . , సమ్మతంబయో
. in * న న . గలలు. ఏ - మునితా
1... - DUచ పు • మజవహిం నగరు ... సఖి.

అని మెచ్చుకొనుచు నీ పద్యము చదువలేదా అన విని యతండు చెవులు మూసికొని శివశివా ! నా కేమియు జ్ఞాపకములేదు. నీ వెవ్వతెవో నే నెఱుంగను. బ్రహ్మలోక పర్యంతము విచారించి చూచితిని. నన్ను విడిచి నీ శీలము కాపాడుకొమ్మని పలికెను. అప్పు డా చిన్నది గోలుగోలున నేడ్చుచు రక్షింపుము, రక్షింపుమని యతని పాదములం బడినది. అతండు మెడకు బట్టఁజుట్టుకొని సాధ్వీ ! నీవు నాకుఁ దల్లివి కాని భార్యవుకావు వేయిఁజెప్పినను వినను. మీరు తెలియక మోసపోవుచున్నారు. ఏ పాపమైన భరింతునుగాని పరాంగనా సంగమ దురితంబు భరింపనోపనని రూఢిగాఁజెప్పి యప్పడఁతి పాదంబులం బడియెను.

అప్పు డా సువర్ణమాల చెలికత్తెలువచ్చి యామె నోదార్చుచు బోఁటీ ! నీ వేటికి విచారించెదవు. ఈయనకు మతిపోయి యట్లను చున్నాఁడు. చికిత్స చేయించవలయు నీ యందు దైవములేడా ? విడిచివేయుము. నెమ్మదిగా విచారించిన నతనికే తెలియఁగలదని పలుకుచుఁ గృష్ణు నా యాస్థానమునకుఁ దీసికొనిపోయి యితం డున్ముత్తవతార పీడితుఁడై యున్నవాఁడు. చికిత్స చేయించవలయునని రాజుగారికిఁ జెప్పి యొప్పగించిరి. ఆ రాజు మంత్రులతో నాలోచించి వైద్యుల రప్పించి యతనిం బరీక్షింపుఁడని చెప్పిన నా భిషక్కులు పరీక్షించి కొందఱు పైత్యవికారమనియుఁ గొందఱు పిశాచలక్షణమనియుఁ గొంద ఱున్మత్త వికారములనియుఁ దలయొకరీతిం జెప్పిరి. అప్పు డా రాజు కృష్ణుని బద్దుంజేసి యా యా చికిత్సలఁ జేయించు చుండెను.

బలభద్రుని కథ

గోపా ! యా కథ యట్లుండనిమ్ము. మధమంతమను నగరమున నాఁటి రాత్రి సత్రములో వారు నివసించియున్న సమయంబున --------- లాడికొనినమాటలు బలభద్రుఁడు ------స్వాంతుండై సోదరు --------- నా విద్యార్థుల వెంట నరిగి రత్నమాలఁ గుఱించి మీరనుకొనిన సాంకేతిక మేమియో నాకుఁజెప్పుడు వారిం గోరికొనియెను. వారు నవ్వుచు దివాణము దాపుననున్న రాజుగారి సత్త్రమునకుం బోయిన నంతయుం దెలియునని చెప్పిరి. ఆ మాటలు విని యతఁడు సత్త్రమున కరిగి యందొకచోఁ గాంచనపటంబున వ్రాయబడియున్న అ విగ్రహమును జూచి తాను గలలోఁ బెండ్లియాడిన చేడియ యదియేనని తెలిసికొని విరహతురుండై విలపింపం దొడంగెను.

అప్పు డందున్న కావలివార లతనిం బట్టుకొని రాజుగారి యెదుట బెట్టిరి. అమ్మఱునాఁడా రాజు విషయము విమర్శించి యతని చిత్తరువు తన పుత్రికయగు రత్నమాలయొద్ద కనిపెను. ఆ చిన్నది యతని వరించినది ఆ నృపతి వారికి వివాహము గావించెను. బలభద్రుం డా రత్నమాలతోఁ గొన్ని దినములు యథేష్టకామోప భోగసుఖంబు లనుభవింపుచు నొకనాఁడెద్దియా కారణమున సోదరులమాట జ్ఞాపకము వచ్చుటయు నచ్చెల్వకుఁ జెప్పకుండ నన్నిశానంబున శుద్ధాంతోద వసితంబు విడిచి యేకాంతముగాఁ బురంబెల్ల విమర్శించి సోదరులం గానక విచారముతో నొక తెరువునం బడి నడువఁదొడంగెను అట్లు పోవుచుఁ గనంబడిన వారినెల్ల వారిజాడ నడుగుచుఁ బోయి పోయి యొకనాఁడు ప్రాతఃకాలమునకు జంద్రకాంతపురంబునకు వచ్చెను. అందు మార్గాయాసంబు వాయ నొక తటాకంబున జలకమాడుచున్న సమయంబునఁ గొందఱు స్త్రీ లిట్లు సంభాషించుకొనిరి.

రామలక్ష్మి - సోమిదేవమ్మక్కా! ప్రొద్దెక్కి వచ్చావేమి? బావగారూళ్ళోలేరా యేమిషి? నా యొక్క మాటిస్తావూ?

సోమిదేవి - ఇస్తా ఇస్తా అయినది. నిలుచో వూళ్ళోనా! లేరు.

రామలక్ష్మి - (నిలబడి) ఏ వూరువెళ్ళినారు. అ స్తమానము వూరికె వెడతారేమి.షి అగ్గిహోత్రా యున్నాయా?

సోమిదేవి - అగ్నిహోత్రాలు లేవు. మొన్ననే తీసివేసినాము. అఘ్ఘరారము వెళ్ళినారు. ధర్మశాస్త్రాలన్నీ మా మీఁదనే వున్నాయి కాదషో? మీ యాయన మల్లే మా ఆయన ఇంట్లో కూర్చోడానికి వల్లా?

రామ — అవును. మా ఆయనమల్లే మీ ఆయన యింట్లోగూర్చుంటే నీవున్ను నాకుమల్లేనే వుందువు. కంటెలు కాసుల పేర్లు వడ్డాణులు ఎట్లువస్తవి.

సోమిదేవి - సరి సరి. ఇది ఆయన ఘరణ అనుకున్నాడా యేనిగనియెగ్గంలో నాకువచ్చిన డబ్బుపెట్టి చేయించుకొన్నాను.

రామ - అదిమాత్రం ఆయన ఘరణకాదా యేమిషి? అవునుగాని అఘ్ఘరార మెందుకు వెళ్ళినారు. ధర్మశాస్త్రాలు యేమివచ్చినాయి?

సోమిదేవి - (మెల్లగా) రాజుగారి కూఁతురుమాట విన్నావా?

రామ - వినలేదు. ఏమిషది.

సోమిదేవి - పెళ్ళి కాకుండానే అయినది.

రామ - ఏమైనది.

సోమి – (చెవులో) కడుపు.

రామ - ఏలాగైనది.

సోమి - అదియే తెలియదు కల్లో ఎవ్వణ్ణో పెళ్ళాడినదష వాఁడేవచ్చి తండ్రి యడిగిన ప్రశ్న కుత్తరమిచ్చెనష. పెళ్ళికాకుండా యొకరాత్రి వానితో భోగించినదష. వాఁడు చెప్పకుండా పారిపోయినాడష. ఎంత చోద్యంగా వున్నదో విన్నావిషో.

రామ -- భళాభళ శబాసు ఎట్టివింతలు వినుచున్నామో దోపదా? ఆ మాట రాజుగారు నమ్మినారా?

సోమి - నమ్మబట్టే మా ఆయన్ని ధర్మశాస్త్రం కనక్కుని రమ్మని అఘ్ఘరారం పంపినారు. లేకుంటే పంపడం యెందురు?

రామ -- మంచి వచ్చినా చెడ్డ వచ్చినా ఆడుదాని మూలముగానే అక్కా! రాజుగారి కెంత చిక్కు వచ్చిందో చూచావు? ఆ కుఱ్ఱదాని పెండ్లి కోసరము దేశ దేశాలు వెదకి యెవ్వరిని సమ్మతింపకి సభలం చూపెట్టి చివరకిట్టి చిక్కులు పడుచున్నాఁడు. సువర్ణలేఖ మంచిదే. అయినను చెడుమాట వచ్చిందా? ఆడుపుట్టుక పుట్టకూడదు.

సోమి - మనమంతా ఆడవాళ్ళము గామషో. ఆలాగందా నేమిషి? యెప్పుడు జరిగితేనే కాని మాటరానుకో.

రామాబాయి -- “వృద్ధనారీ పతి ప్రతా" అనినట్లు మీ రిప్పుడందఱి నాక్షేపింపవచ్చును. సువర్ణలేఖను గురించి మీరు ఆషా ఇషా అంటున్నారు గాని ఆ చిన్నది మహా పతివ్రత, సుగుణాలవాల, సత్యసంధురాలు. ఆమె చరిత్ర మీ రెఱుంగరు.

సోమి - రామాబాయి నవనాగరికురాలు. మనము అష ఇష అంటున్నామని యాక్షేపించుచున్నది. దానికిమల్లే అంటు గింటు మనకు రావు. మన కాంచనము మనది.

సోమిదే - ఈ మధ్య మా పిల్ల వీళ్ళను జూచి యీలాగనే అంటుగింటు అది గిది అందు మాట్లాడ మొదలు పెట్టినది. దాని మామగారు అహిరాగ్గి కూడాను అనుడు. తండ్రితోఁ జెప్పి నాలుగు చీవాట్లు పెట్టించాడు. యిప్పుడు మునిసినది.

రామ -- మీ కాలాగున అభాస్య మైనది. మా కీలాగున మభ్యాసమైనది. మనకి యీ రాజపుత్రిక చారిత్రమును గుఱించి యోగ్యమైనదని చెప్పితిని.

సోమి - మేమంత చదువుకోలేదు. మా మాటలు స్వచ్ఛంగా వుండవు. పోనిస్తు రాజుగారి కూఁతురు ఏలాంటిదైతే మాకేమి? వూరుకో పెద్ద మనుష్యులు స్తానానికి వస్తున్నారు.

రామా - ఆక్షేపించితివి గనుక నేవద్దని చెప్పితిని. లేకున్న మీ జోలి మా కేల?

సోమి - సరి సరి. ఆక్షేపిస్తున్నారని సాక్ష్యమిస్తావా యేమిషి, చాలు చాలు మావారికి తెలిస్తే చంపివేస్తారు రామలక్ష్మీ! వేగము పోదాము రమ్ము ఈలాటి మాటలే కొంపలంటుకునేవి అని నిష్క్రమించిరి.

వారి మాట లన్నియు బలభద్రుని చెవిని బడినవి. పిమ్మట నతండచ్చోటు బాసి పురంబునఁ బ్రవేశించి రాజమార్గంబున నరుగునప్పుడు సువర్ణలేఖ సఖురాలు సునంద యారాజనందనునిఁ గృష్ణుం డనుకొని చేయి పట్టుకొని రాజపుత్రా! నన్నెఱుంగుదువా యని యడిగిన నతండు తెల్లఁబోయి పరిశీలించి చూచి నా కేమియుజ్ఞాపకము లేదు. నా పరిచయ మెక్కడఁ గలిగినదో నీవె చెప్పుమని పలికెను. అప్పుడా చిన్నది పోనిమ్ము నీ వెప్పుడైన నీయూరు వచ్చిన జ్ఞాపక మున్నదా? రాజుగారిచ్చిన ప్రశ్నమున కుత్తరము జెప్పితివా లేదా? నాఁటి రాత్రి విశేషము లేమనం గంటిరా లేదా నిజముఁ జెప్పుమన నతండు మీ రాజెవ్వఁడు? ప్రశ్న మెట్టిది? పుట్టిన తరువాత నీ పట్టణము రాలేదు. నా కేమియుం దెలియదు. నన్నెవఁరనుకొని మాట్లాడుచున్నావు? నీ మాటలేమియు నా కర్దము కాలేదని యుత్తరముఁ జెప్పెను అప్పు డది వెఱగుపడుచు మఱియు మఱియు నిదానించి చూచి యతండగా నిశ్చయించి రాజపుత్రా! నాఁటి రాత్రి నిన్నుఁ గపటముగా శుద్ధాంతమునకుఁ దీసికొని పోయితిని. అది స్వప్న మనుకొనుచున్నా వేమో సుమీ! కాదుకాదు. యథార్థమే నీకుఁ గుమారుఁడుదయింపఁ గలడు. నగరికిఁబోవుదము రమ్ము. సామంతరాజులు మా రాజుపైఁ గల యీసున నేమేమోయని యాక్షేపించుచున్నారు. పరిహాసముకైన నిది నే నెఱుఁగ నంటివేని ప్రజలు నిజమే యనుకొందురు. స్త్రీచాపల్యంబుస నాఁ డట్టిపని గావించితిమి. నీవే పెండ్లి యాడుదువుగదా యని సాహసించితిమి. వలపు నిదానము గలుగనీయదుగదా యని యా కథయంతయుం జెప్పిన నతండు నవ్వుచు నిట్లనియె.

బోఁటీ! నీ మాటలు బూటకములో యథార్థములో నాకుఁదెలియవు. నన్ను నీ వెఱుంగక యేమేమో చెప్పుచున్నావు. నీ మాటలకేమని యుత్తర మిత్తును. నీ దారి నీవు బొమ్మని చేయి విదలించుకొని యతండు మఱియొక వీథికిఁ బోయెను అప్పు డమ్మగువ దిగులుపడి సెగులుతో నంతిపురి కరిగి యవ్వార్త సువర్ణలేఖ కెఱింగించెను. అప్పల్లవపాణి డెందంబు గొందలమంద నత్తెఱంగు తండ్రి కెఱింగించెను. అప్పు డప్పుడమిరేడు దూతలంబుచ్చి దరించి యతనిఁ దన యాస్థానమునకు రప్పించుకొని సముచిత సత్కారంబులఁ గావింపుచు నల్లన నిట్లనియె.. రాజపుత్రా ! యనేక రాజకుమారవర్గంబులో నెక్కుడు బుద్ధిమంతుడుగను నుడువదగినవాఁడు నీవు నాతోఁ జెప్ప కయే యరిగితి వేల? స్వదేశంబునకుఁ బోయి వచ్చితివా యేమి? అప్పుడే రాజ్యముతో గూడ నా పుత్రిక నీయధీన యయ్యెనని చెప్పి నీ మెడలోఁ బుష్పమాలిక వేసితిని గదా! ఆ రాత్రియే నీవు నీ భార్యతోఁ గలిసికొంటివఁట. ఆ చిన్నది నీ కొఱకు బరితపించుచున్నది. ముద్దరాలి కెన్ని సుద్దులు తెచ్చి పెట్టితివి? అంతఃపురమునకు బోయి యాయింతి నూఱడించిరమ్ము పొమ్మని పలికిన నతండు నిట్టూర్పు నిగుడింపుచు నిట్ల నియె. దేవా! మీ మాటలు విన నాకు మతిపోయినట్లున్నది. విపణివీథిలో నిందాక యొక చిన్నది యిట్లే పలికినది. ఇంతకుఁ బూర్వ మెన్నడును నేను మీవీడు వచ్చి యుండలేదు. మీ ప్రశ్న యేదియో నే నెఱుఁగను. ఇట్టి నన్నుం బట్టుకొని యేమేమో చేసితినని యడిగిన నేమని సమాధానము చెప్పుదును. పైన మీరే యూహించుకొనుఁడని పలికెను. అప్పు డానృపశిఖామణి యత్యంత కోపంబునఁ గన్ను లెఱ్ఱ జేయుచు సునంద మొగముఁజూచెను. ఆ బోటి భయపడుచు వెనుక తాను వ్రాసిన చిత్రపటము దెచ్చి యెదురఁబెట్టినది. దానికిని బలభద్రునకు నించుకయు భేదము కనంబడలేదు. ఆ చిత్తరువు చేతంబూని యారాజు యిది యెవ్వని రూపో చూచితిరా? నీ వెన్నఁడును మా పట్టణమే రాలేదని చెప్పుచుంటివే నిన్నుఁ జూడక యీ చేడియ దీని నెట్లు వ్రాసినది. కల్లలాడినఁ బ్రయోజన మేమని పలికిన విని యతండాలోచించుకొని తానేమియు నెఱుంగ నని యుత్తర మిచ్చెను.

ఆ రేయి సునంద నృపతి యనుమతి వడసి యతని నంతఃపురమునకుఁ దీసికొని పోయినది సువర్ణలేఖ యతనిం జూచి భర్త యనుకొని యెన్నియో గురుతులు చెప్పినది కాని యతండు తల వాల్చుకుని కూర్చుండి యామె చెప్పెడు మాటలేమియు వినుపించుకొనక స్థాణువువలె వూరకొనియెను. ఏమియుఁ బ్రత్యుత్తర మీయలేదు. అంతలో నా తలోదరికిఁ బ్రసవవేదన యావిర్భవించినది కావున నాసందడిలో నతండు తప్పించుకొని యవ్వలికిం బోయెను.

ఆ రాత్రి యతండు సత్రంబునఁ బరుండియుండఁ గొందఱు బ్రాహ్మణులు భుజింపుచు నిట్లు సంభాషించుకొనిరి.

సోమ - సుధీనిధిగారు! మీరీ యూరేమిటికి విచ్చేసితిరి?

సుధీ - రాజుగారి కూఁతురు వివాహము కాక పూర్వమే యంతర్వత్ని యైనదష. తత్సంతతికి బుత్రత్వసిద్ధి యున్నదా? అను విషయము ధర్మశాస్త్రము చూచి చెప్పుటకు నన్ను రప్పించినారు.

సోమ - ఏమని చెప్పితిరి ?

సుధీ - ఇంతకుఁ బూర్వమేకా నేను వచ్చితిని. ఇంకను సభకుఁ బోవలేదు

సోమ - ధర్మశాస్త్రములో నామె నిర్దోషురాలనియే తేలినదా ?

సుధీ -- సందేహమేలా? వూరు వంశతిలకమగు భరతుఁడే దీనికిఁ బ్రమాణము. దీనికే గాంధర్వవివాహమని పేరు.

సోమ - శకుంతల దుష్యంతుని గాంధర్వవివాహంబున వరించి భరతునిం గనినది. కావున నది నిర్దుష్ట మైనది. ఇక్కడ పతి యెవ్వడు ?

సుధీ -- ఎవ్వఁడో యున్నాడష కాదు ?

సోమ - ఎవ్వఁడును లేకున్న గర్భమెట్లగును? వారనిన వాఁడు నేనెఱుఁగనని చెప్పుచున్నాఁడు.

సుధి - ఘట్టిచిక్కే వచ్చినదే నాకు వ్రాసిన చీటిలో రాజకుమారుని కెవ్వనితో పెండ్లి చేయ నిశ్చయించుకొన్నా రనియు ముహూర్తము దవ్వుగా నాండుటచే నీ లోపున వధూవరులు కలిసికొనిరనియు నంతలో నతండు చెప్పకయే వెళ్ళిపోయె ననియు నా చిన్నది గర్భవతి యయ్యెఁ గావున ధర్మశాస్త్రము చూడవలయునని వ్రాసిరి.

సోమ - ఆ మాటలెంత సందర్భముగా నున్నవియో యాలోచింపుఁడు? ఆ రాజకుమారుఁ డా చిన్నదానితో గలిసికొని మఱునాఁడు పారిపోవుటకు గారణమేమి యున్నది. ఆ నాతిని భూత మనుకొనియెనా యేమి?

విబుధమౌళి - ఎవ్వడో యొక రాజకుమారుఁడు రాజు ప్రశ్నమునకు సదుత్తరమిచ్చి కొన్ని దినంబులుండి పెండ్లి చేయఁ దలంచుచుండ నెవ్వరికి దెలియకుండ వెళ్ళిన మాట సత్యమగును.

సోమ - ఆ మాటకు సామంతరాజు లందఱు నొప్పుకొనుచున్నారు. అది కాదు. ఈ గర్భమున కతండే కారణమైనట్లు నిశ్చయము తేలవలయును.

విబుధ - సువర్ణలేఖ మహాసాధ్వి యని వాడుకయున్న దే.

సోమ - అయ్యా! స్త్రీల చేష్టితముల నెప్పుడును నమ్మఁగూడదనుకోండి.

శ్లో॥ అస్యం, సాహసం, మాయా, మాత్సర్యం, చాతిలుబ్దతా
     నిర్గుణత్వ, మశౌచత్వం, స్త్రీణాందోషాస్వభావజాః॥

అని యుండఁగా వారి మాటల నేల నిశ్చయింపపలయును.

విబుధ -- అట్లనరాదు. ఒక రాత్రి సునంద యందలముపైఁ బచ్చన్నముగా నతని నంతఃపురమునకుఁ దీసికొని పోవుచుండఁగా నా భార్య యేమిటికో వాకిటకుఁబోయి చూచినదఁట. ఆ సంగతి నిశ్చయమే కావచ్చును.

సోమ - (సోల్లాసముగా) ఆ మాట నిశ్చయమే యెవ్వనినో తీసికొనక పోయిన నా యింతికి గర్భమెట్లగును ? పెండ్లి చేయ నిశ్చయించుకొనినవాఁడు కాడని మా వాదము. మా వాదానికి దృష్టాంత మతండేమియు నే నెఱుఁగనని చెప్పుటయే.

విబుధ - అతం డీయూరెప్పుడు రాలేదని చెప్పుచున్నాఁడు. ఆ మాట నిజమా అబద్ధమా?

సోమ - ఆ సంగతి విమర్శింప మాకవసరము లేదు. విబుధ - ఇంత యేల? నిందాక యా కలికి నొప్పులు పడుచున్నదని చెప్పుకొనుచున్నారు. పుట్టినపట్టి పోలికంబట్టి నిశ్చయింప వచ్చునుగదా.

సూరి కేసరి - కుమారుఁ డుదయించినది. మీ రెఱుంగరు. కాఁబోలు? రెండు గడియలైనది. అప్పుడే కోటలో ఫిరంగి వైచిరి.

విబుధ - ఆ ధ్వని యదియేనా? అయ్యో ! మంచి సమయము మిగిలి బోవుచున్నది. వేగముగా భోజనము చేయుడు. కోటలోనికిం బోవుదుము. పుత్రోత్సవము పంచి పెట్టుదురు గదా.

సోమ - అగు నిదియే సమయము. ఈ యపకీర్తి మాపుకొనుటకై రాజు ద్రవ్యమెక్కుడు గానే ఖర్చు పెట్టును. పోవుఁదము రండు అని మాటాడుకొనుచు భోజనము చేసి నిష్క్రమించిరి.

బలభద్రుం డామాటలన్నియు విని ఔరా! ఇది కడు చిత్రముగానున్నది. ఆ చిన్నది యుత్తరములు వలెఁ గనంబడుచున్నది. ఎవ్వఁడో నన్నుఁబోలినవాఁడీ చర్యలఁ గావించి యుండవలయును లేకున్న నింత విపరీత ముండునా? అతండు నా తమ్ముఁడు కృష్ణుండు కాఁడుగదా? రాజు తానిచ్చిన ప్రశ్నమున కెవ్వఁడో యుత్తరము వ్రాసినట్లు చెప్పుచున్నాఁడు. ఆ వ్రాఁత జూచినఁ దేటవడునని తలపోయుచు నా రాత్రి నిద్రఁబోయెను.

కనకాంగదుండును రాత్రి పండుకొని మఱునాఁ డుదయమున నా ప్రశ్నమున కిచ్చిన యుత్తరము వ్రాలు చూడవలయునని తలంచి యుదయమున లేచి సభఁ జేసి యా సభకు బలభద్రుని రప్పించి మంత్రి సామంతహితపురోహితాదులు చూచు చుండ నా పత్రికం దెప్పించి యిది నీవు వ్రాసినది కాదా ? యని యడిగెను. అతండాపత్రికం జూచి మేను ఝల్లుమన అయ్యో! యిది మా తమ్ముఁడు కృష్ణుండు వ్రాసినది. నా పేరు కృష్ణుఁడు కాదు. బలభద్రుఁ డందురు. దీనం దెల్లమైనది కదా! ఎంతమోసము. నన్నూరక నిర్భంధించితిరి. అతం డీ యూరెప్పుడు వచ్చెను. అతని నిమిత్తమే నేను దిరుగుచుంటినని గద్గదకంఠముతోఁ బలికి యా పత్రికను ముద్దు పెట్టుకొనియెను. ఆ మాటలు వినిసభాసదులెల్ల వ్రాసిన బొమ్మలవలెఁ జేష్టలుడిగి యూరక చూచుచుండిరి. ఆ రాజు విస్మయం బభినయించుచు ఏమీ! మీ తమ్ముఁ డొకం డుండెనా? అన్నన్నా? మీయిరువురకు యించుకయున్ను భేదములేదుగదా? దుర్మార్గులు నీవేమియు నెఱుంగనని పలికినది మొదలూరక నిందించుచున్నారు. నేను రాజపుత్రికచారిత్ర మెఱింగినవాఁడ గావున నింత విమర్శించితి. కానిచో నెంత ప్రమాదము రాఁగలదు అని పెక్కుగతుల వాక్రుచ్చుచు మీతమ్ముఁ డెందున్నవాఁడని యడిగెను. అతండును వారికి సంక్షేపముగాఁ దమవృత్తాంతమంతయుఁజెప్పి వానిని వెదకి తీసికొనివత్తునని శపథముజేసెను. అతని పరస్త్రీపరాజ్ముఖతకు సభ్యులెల్ల వేతెఱంగుల స్తోత్రములు చేసిరి. సువర్ణలేఖకుఁబుట్టిన పట్టి కృష్ణుని బోలియుండుటఁ బలభద్రుండు మిక్కిలి సంతోషించెను. బలభద్రుండు కొన్ని దినములుమాత్ర మందుండి కృష్ణునిఁ దీసికొనివత్తునని చెప్పి యప్పుడమిఱేని యనుమతివడసి యటఁ గదలి భార్యంజూచి మఱియుం బోవలయునని తలంచి వెండియు మధుమంతమను నగరమునకుం బోయెను. బలభద్రుండు వీటిలోఁ బ్రవేశించినతోడనే చూచి రాజభటులు సంతసించుచు ఔరా! యెంతమోసము జేసితివి? నీకతంబున మాకుఁ జెఱసాల నుండవలసివచ్చెనుగదా? తస్కరులకన్న నధికుఁడవని తోఁచుచున్నది. ఎందఱిని గనుమూసి పాఱిపోయితివి? అని పలుకుచు నతని చేతులకు నిగళములఁ దగిలించిరి.

అయ్యో? ఇదియేమికర్మము. నేనేమినేరముఁ జేసితిని నా యిష్టము వచ్చినట్లు పోయితిని. అది తప్పుగా గణించితిరా? రాజుగారి యల్లుడననియు నిదానింపవలదా? యని యెన్నియో ప్రతికూలవాక్యములు జెప్పెను. కాని వానిమాట లేమియు వినుపించుకొనక రాజభటులతనిఁ గారాగృహంబునకుఁ దీసికొనిపోయి యందుంచిరి. అప్పుడు చికిత్సచేయుచున్న వైద్యులువచ్చి వానింజూచి "యెక్కడికిఁ బాఱిపోయితివి నీయున్మత్తవికారంబు లింకనుం దగ్గలేదా? ఇప్పుడైన నీవు రాజుగారి కల్లుఁడవని యొప్పుకొనియెదవా?" యని యడిగిన నతం డిట్లనియె. నాకు మా గ్రామము జూడవలయునని యభిలాష జనించినఁ బోయితిని. ఇది తప్పుగా గణించితిరా? నా భార్యను జూడవలయునని తలంపుగలిగి యిప్పుడు వచ్చితిని. నా యున్మత్తవికారము మీరేమి గ్రహించితిరి? నేను రాజుగారికి నల్లుఁడను గానని మీతో జెప్పితినా యేమి? అల్లుఁడననియే కాఁబోలు, నన్నిట్టి మర్యాదచేయుచున్నారు. మా మామగారితోఁ జెప్పి మిమ్మేమి చేయించెదనో చూడుఁడని బెదరించెను.

అతని మాటలువిని వైద్యులు పిచ్చి కుదిరినదని నిశ్చయించుచుఁ దమకుఁ బారితోషికము వచ్చునని సంతసించుచు నతని నిళగంబులు విప్పించి సగౌరవముగాఁ గొల్వుకూటంబునకుఁ దీసికొనిపోయి దేవా! మీ యల్లుని నిరామయుం జేసితిమి. ఈతని బుద్ధి చక్కఁబడినది. పరీక్షించుకొనుఁడని నుడివిన సంతసింపుచు నా రాజిట్ల నియె. ఆర్యా! యిప్పుడు నీ మనస్సు కుదురుగా నున్నదియా? నీవు నాకేమి యగుదువు? నీ పూర్వవృత్తాంతము స్మరణకు వచ్చినదియా? యని యడిగిన నతండు విస్మయమునొందుచు నన్నిట్ల డగు చున్నా రేమి? నేను మీ యల్లుండను గానా? మీ పుత్రిక రత్నమాలను నేను బెండ్లి యాడలేదా? క్రొత్తవానిగాఁ జూచుచుంటి రేమిటికి? నేను మీ యల్లుండననియైనను జూడక వీరు నన్ను లేనిపోని తప్పుడు గణించి చెఱసాలం బెట్టిరి. దీనికై వీరిం దండింపవలయునని చెప్పెను. ఆ మాటవిని యా రాజు సంతోషపారావారవీచికలఁ దేలియాడుచుఁ నా వైద్యులం గౌఁగిలించుకొని యార్యులారా! మీరు చేసిన యుపకార మెన్నఁటికిని మఱువఁజాలను. నా యల్లుని నిరామయుం జేసితిరి. చూచితిరా! వీనికిఁ బూర్వస్మృతి యేమియు లేగముఁడి మెచ్చుకొనుచు వారికిఁ దగిన పారితోషికము లిప్పించి యతని నప్పుడే రత్నమాల యంతఃపురమున కనిపెను.

తనభర్త యున్మత్తవికారములంబాసి నిరామయుండై యున్నవాఁడను వార్తవిని యా రత్నమాల యత్యంత ప్రహర్షంబుఁ జెందుచు నతని కెదురుచని పాదంబులఁగడిగి తడియొత్తి రత్నపీఠంబునం గూర్చుండఁబెట్టి పూసురటిచే వీచుచు నార్యపుత్రా! ఇప్పటికైనను మీ చిత్తవికారము దీఱినదా? నాయందక్కటికము గలిగినదా? మీ వికారము వాయనిచో నే నేమైపోవుదునోకదా? యని వెక్కి వెక్కి యేడువఁదొడంగినది. అప్పుడతం డయ్యంగనను జేరఁదిగిచి యక్కునం జేర్చికొనుచు నుత్తరీయమునఁ గన్నీరు దుడుచుచు ముద్దాడి బోఁటీ! విచారింపకుము. మా సోదరులమాట జ్ఞాపకము వచ్చుటచే నీతోఁ జెప్పకయే యఱిగితిని. అది నాతప్పగును. ఉన్మత్తవికార మనుచుంటివి. ఆ మాట నాకర్దమైనదికాదు. అదియే మనవుఁడు నచ్చేడియ వితర్కించి తన వికారం బెఱుఁగడు కావున నట్లడుగు చున్నాడని నిశ్చయించి “పోనిండు ఇప్పుడామాట స్మరింపనేల? తలంచినంతనే నా గుండె ఝల్లుమనుచున్న" దని పలికినది. అప్పుడతం డది యేదియో చెప్పక తీఱదని నిర్భంధించిన నయ్యించుబోఁడి వెనుక గృష్ణుఁడు కావించిన కృత్యములన్నియు వక్కాణించి ప్రాణేశ్వరా! నేనప్పుడు మీపాదంబులఁబడినను గుఱుతుఁబట్టక నీవు నాకుఁ దల్లి వని పలికితిరి. అప్పుడు నేనేమి చేయతగినదో చెప్పుఁడు. భగవంతునిమీఁదనే భారము వైచి యారాధింపుచుంటినని యా కథ యంతయుం జెప్పినది. అతండప్పుడు ముక్కుపై వ్రేలిడుకొనుచు “అన్నన్నా! యేమి యాశ్చర్యము నేనీ నడుమ మీయూరు రానిదే వచ్చి యేమేమో యంటినని చెప్పుచున్నావే. ఇంతకన్న వింతయేమున్న" దనుటయు నా కలకంఠి మీకా మాట జ్ఞాపకమే యుండినచో నన్నప్పుడట్లేల యందురు. అదియొక యవస్థగదా! అప్పటి చర్యలేమియు నిప్పుడు జ్ఞాపకముండవు. దానినేకదా యున్మత్తవికారమని చికిత్స చేయించితిమని పలికినది.

అప్పుడుడతండు అయ్యో! నా వృతాంతముఁ జెప్పినను మీరు నాకుఁ బిచ్చియెత్తినదని పలుకుచున్నారు వినుము. నేను నీతోఁ జెప్పక యల్లనాఁడు తెల్లవారుజామున బయలుదేరి పురమెల్ల వెదకి మాతమ్ముడు గానక తెరువునంబడి పది దినములు నడిచితిని మఱి యొకనాఁడు చంద్రకాంతమను పట్టణముఁ జేరితిని. అందు నన్నుఁజూచి రాజుగారి యల్లుఁడనని యెల్లరు మన్నింప దొడగిరి. తరువాత రాజుగారు వచ్చి తీసికొనిపోయి తన యల్లుఁడనని కూఁతు నంతఃపురమునకుఁ బంపిరి. ఆ వనిత నన్నే భర్తయనుకొని యేమేమో సంభాషించినది. నే నేమియు వినిపించుకొనలేదు. ఆమీద నానాతికిఁ గుమారుఁడు గలిగెను. అప్పుడంతయు విమర్శింప మా తమ్ముఁడు గృష్ణుఁడను వాఁడు దానిం బెండ్లియాడినట్లు దెలిసికొని యా తెఱంగు వారి కెఱింగించి యా చెఱఁదప్పించుకొని నిన్నుఁ జూడవలయునని నిన్న నిచ్చటికి వచ్చితిని. నన్ను రాజభటులు పట్టుకొని బందీగృహంబునం బెట్టరి.

నా వృత్తాంతము వైద్యులతో మొఱపెట్టుకొనగాఁ బిచ్చికుదిర్చితిమని నన్నిచటికి దీసికొని వచ్చినారు. ఇదియే నా వృత్తాంతము. పిమ్మట నాలోచించుకొనుమని తన కథనంతయుం జెప్పిన విని యా విదూషిమతల్లి యుల్లము ఝల్లుమన నల్లన యొకింత తడవు విచారించి యిట్లనియె. ప్రాణేశ్వరా! నిక్కము దెలిసింది. మీ తమ్ముఁడు మిమ్ము బోలియే యున్నవాఁడు కాఁబోలు. అతం డిక్కడికి వచ్చినం జూచి మీరనుకొని యిన్ని చిక్కులం బెట్టినారు. అతండు చెఱసాలనుండి తప్పించుకొని పారిపోయెను గాఁబోలు! ఆ వెంటనే మీరు వచ్చుటచే మిమ్మే యతఁడనుకొని బద్దుంజేసిరి. ఆహా! మీ తమ్ముఁ డెంత నిస్పృహుఁడోకదా? అయ్యో? తనయొద్ద పలికిన మాటలం దలఁచికొన సిగ్గగుచున్నది. మీరు క్రీడాంతరమునఁ జేసిన చేష్టల నెల్ల నుగ్గడించితిని. అన్నన్నా! యెంత ప్రమాదము దాటినది? అయ్యారే? మా తోడికోడలు సైతము మిమ్ముజూచి మోసపోయినదిగదా? కట్టా ? మీరిట్టులేక రూపముతో నుండుటబట్టికదా! యీ చిక్కులు మాకు వచ్చినవని పలుకుచు నారాత్రి యతనితోఁ గూడుకొని త్రుటిగా వెళ్ళించినది.

మఱునాఁ డుదయకాలంబుస నయ్యంబుజాక్షి తండ్రిని రప్పించికొని జనకా! మీయల్లునివృత్తాంతము వింటిరా? కడువిచిత్రమైనదిగదా? వీరిద్ద ఱన్నదమ్ములొక్కటియే పోలికగలిగి ప్రజలను మోసము చేయుచున్నారు. ఈయన తమ్ముఁడు కృష్ణుం డనువాఁడు చంద్రకాంత నగరంబునఁ గనకాంగదుఁ డిచ్చిన ప్రశ్నమున కుత్తరముఁజెప్పి యాయనకూతుఁరు సువర్ణలేఖం బెండ్లియాడుటకు నిశ్చయించుకొని యారాత్రియే యామెతోఁ గలిసికొని చెప్పకయే యెక్కడికో పోయెనట. అప్పర్వేందుముఖి గర్భిణియైనది. దానంజేసి సామంతరాజులందఱు తప్పుగా గణించి వెలివేసిరఁట. అంతలో మీయల్లుఁడు మనతోఁజెప్పక మార్గవశమున నక్కడి కరిగిరఁట. వీరింజూచి తమ యల్లుఁడనుకొని యారాజు మన్నించుచుఁ దనకూఁతు నంతఃపురమునకు బంపిరట. ఆ చిన్నది నావలెనే పరితపించుచు నెన్నియో మాటలాడినదఁట. ఏమియు వినిపించుకొనక నేను మీయల్లుడగానని పలుకుచు దప్పించుకొనివచ్చిరఁట. తరువాత నాఁడువ్రాసిన ప్రశ్నోత్తరముల వ్రాతంబట్టి కృష్ణుండని గుఱుఁతుపట్టి మీయల్లుడు వారిసందియము దీర్చెనఁట మనము వారివలనే మోసపోయితిమి వీరితమ్ముడు కృష్ణుం డిచ్చటికివచ్చిన మీయల్లుడే యనుకొని పెక్కు చిక్కులం బెట్టితిమి. వీరు మంచిగుణసంపత్తిగలవారు గనుక సరిపోయినది. లేకున్న నెంత ప్రమాదమో విచారించితి. కృష్ణుండు పారిపోయిన మఱునాడే యా నగరు చేరుటచే రాజభటులు పట్టుకొని చెఱసాలం బెట్టిరి. కాకతాలి న్యాయముగా నంతయుం గూడినది. ఇంతటిచోద్యము లెప్పుడై నను జరిగినవియా? యని యా వృత్తాంత మంతయు జెప్పినది.

ఆ రాజువిని మిక్కిలి వెఱగుపడుచు వారివురుసంపత్తినిగుఱించి వేనోళ్ళఁ గొనియాడఁదొడంగెను. ఆవార్తయంతయుఁ బట్టణములో వ్యాపించినది జనులెల్ల నద్భుతంబుగాఁ జెప్పుకొనదొడగిరి. రోగము కుదిర్చితిమని పారితోషికములందిన వైద్యులఁ గుఱించి పరిహసింపఁదొడగిరి. రాజకుమారులను మహర్షిప్రాయులని వినుతింపదొడంగిరి.

బలభద్రుండు కొన్నిదినములుమాత్ర మందుండి సోదరుల వెదకు తలంపుతో వారి యనుమతివడసి వీరవేషము వైచుకోని కరతాలకలితహస్తుండై యుత్తమాశ్వ మెక్కి యవ్వీడువెడలి పురవనపక్కణారణ్య భూములచఱయుచుఁ బోయిపోయి యొకనాడు సాయంకాలమునకు విక్రమనగరమునకుం జనియెను అప్పు డాపట్టణము చక్కగా నలంకరింపబడియున్నది. వీథులన్నియుఁ బందిళ్ళు వేయబడినవి. ముత్తెంబుల తోరణంబులుగట్టిరి. రాజమార్గములన్నియుఁ బన్నీటితోడ దడుపఁబడుచున్నవి. బలభద్రుఁడు కడు వీరావేశముతో గుఱ్ఱముతో నరుగుచుండ రాజభటు లడ్డమువచ్చి "అయ్యా యిప్పుడు మారాజుగారి కుమారుని వివాహమగుచున్నది. పురమంతయు నలంకరించిరి. గుఱ్ఱముతో వీథుల నడుచుటకు వీలులేదు. గుఱ్ఱముదిగి పాదచారులై యేగవలయు"నని చెప్పిరి.

వారి మాటల లెక్కఁగొనక బలభద్రుండు నిలువక వారిం దాటి గుఱ్ఱమును దోలికొని వడిగా వీథిలోఁ బ్రవేశించెను. అతని రౌద్రాకారముఁ జూచి పౌరులు వెఱఁగు పడఁజొచ్చిరి. దారిలో రాజభటు లతనింజూచి రాజబంధుడని నిశ్చయించి వారింపలేక పోయిరి. మఱి కొంతదూరము చనినంత నొకచోటఁ బదుగురు గుంపుఁగూడి కలహపడుచుండిరి. బలభద్రుం డాదాపునకు బోయి యాకోలహల మేమని యచ్చటి వారల నడిగెను. వారు “అయ్యా! ఏ దేశమునుండియో తస్కరుఁ డొకఁడు చెఱసాలనుండి తప్పించుకొని పారిపోయి వచ్చెను. వాని వెదకుచు వచ్చి రక్షకపురుషు లీయూర వానిం బట్టుకొనిరి. వాఁడు వారికి లోఁబడక త్రోసివేయుటయు వాండ్రు తమ రాజశాసన మిచ్చటి యధికారులకుఁ జూపి కొందరు రాజభటుల సహాయముగాఁ దీసికొని వానిం బట్టుకొనుచున్నారు. వాఁడు వీరందఱిని దిరస్కరించి పట్టువడకున్నాఁడు. ఇదియే యా కోలహల" మని చెప్పిరి.

ఆ మాట విని బలభద్రుండు "అతండు కృష్ణుం" డని నిర్ణయించి గుఱ్ఱము వారి గలను దాపుగాఁ దోలి వారినెల్ల నిలువుండని వారించుచు నేమిటికి మీరు వాని నిట్లు వెదకుచున్నారని యడిగెను. వీడుఁ దొంగ చెరసాల నుండి తప్పించుకొని వచ్చెను. ఇచ్చట బట్టికొంటిమి. రమ్మన్న మా వెంట రాఁడు. దీనంజేసి పోట్లాడుచుంటిమని చెప్పిరి. అప్పుడు బలభద్రుడు మీ దేయూరు? వీఁడేమి నేరము చేసెనని యడిగిన వాండ్రు "మాది మధుమన్నగరము. వీఁడేమి తప్పుజేసెనో మాకుఁ దెలియదు. మేము జెఱసాల గాచియుండ మమ్ము మఱపించి పారిపోయి వచ్చె "నని యా వృత్తాంతము జెప్పిరి. అప్పుడు కృష్ణుండు మిక్కిలి సంతోషించుచు నతనితో నీ వేమి నేరముఁ జేసితివని యడుగఁగా నతండు బలభద్రుని గుఱుఁతుపట్టక "అయ్యా! నే నేమియు నేరము చేయలేదు. నిరపరాధుని బట్టుకొని యీ పట్టణములో బాధింపుచున్నారు. ఇంత యన్యాయ మెందైనం గలదా?" యని యా కథ యంతయుం జెప్పెను.

అప్పుడు బలభద్రుఁడు నిలువలేక తమ్ముఁడా! నీ విట్లు చిక్కుల బడుచున్నావా? అయ్యో ! నీ కొఱకు నేను బలుదేశములు తిరుగుచున్నాను. నేను మీ యన్నను బలభద్రుఁడనని పలుకుచు గుఱ్ఱము దిగి యతనిం గౌఁగలించుకొనియెను. అతండును పరమానందముతో నన్నను గౌఁగిలించుకొనియె. నూత్నసమాగమప్రీతి సూచింపుచు నిరువురు మాటాడికొనుచున్న సమయంబున రాజభటులు చటులముగా నలుగుచు బాగు బాగు. మీ నిమిత్తమై మేమిం దెంతసేపు వేచియుందుము. రమ్ము రమ్ము అని కృష్ణుని చేయిపట్టుకొని లాఁగుచుండఁగ బలభద్రుం డలుగుచుఁ గరవాలము దీసికొని యొక వ్రేటున వారి కరములు ఖండించెను. అది చూచి యున్నవారెల్లఁ దల్లడిల్లుచు బాఱిపోయి యా దారుణము చమూపతి కెఱింగించిరి. అతండు పలువురు భటులతోఁ గూడుకొని వారిఁ బట్టికొనుటకై యరుదెంచెను. ఈ లోపున రాజకుమారు లిరువురు యుద్దసన్నదులై కరంబునఁ గరవాలంబుల ధరించి భయంకరాకారములతో నలుదెసలు దిరుగుచుండిరి. సేనానాయకుఁడు వీరిం బట్టుకొనుటకుఁ బ్రయత్నముఁ జేయుచు నాయుధములఁ ద్రిప్పుకొనుచు వచ్చినంజూచి రాజపుత్రు లిద్దఱు త్రుటిలో వారినెల్లం గడతేర్చి వారి యాయుధంబుల లాగికొనిరి. ఆ ఘోరకృత్యముఁ జూచి పౌరులెల్లఁ దల్లడమందుచు వారికి భయపడి తలుపులు వైచికొని దాగికొనుచుండిరి.

అప్పట్టణాధిపతియైన విక్రమసేనుఁ డా వార్త విని వెఱఁగుపడుచు సేనల నెల్లనంపి వారింబట్టుకొని తీసికొని రండని నియమించెను. భేరీభేంకారాదినినాదములతో నబ్బలములు మూఁగికొని పోరొనరించుటయు నయ్యిరువురు తురగారూఢులై కరవాలంబులఁ ద్రిప్పుచు విచిత్రగమనంబుల నరిగి యరిబలంబునెల్ల చీకాకు నొందించి ముహూర్త కాలములోఁ పీనుగుఁ పెంటలు గావించిరి. కాందిశీకులైన తమ వీరుల పరాజయము విని విక్రమసేనుండు మిక్కిలి చింతించుచుఁ దనకుమారుడు సుగణసాగరునిం జేరి "వత్సా! నీవు పెండ్లికుమారుండవై యుంటివి. ఆ వీరు లెవ్వరో తెలియదు. మన బలంబులనెల్ల సదమదంబుఁ జేయుచున్నారు. మన రాజ్యంబు గైకొందురేమో యని వెఱపు గలుగుచున్నది. నేను వృద్ధుండ. యుద్ధము సేయనోప. ఇప్పుడు వారితో సంధిచేయుటయే యుచితమని తోచుచున్నది. నీయభిప్రాయమే మనవుడు. నతండు సమ్మతింపక సీ! మన పరాక్రమమింత యలఁతియే? ఇరువురకు మన మోడినఁ బ్రజలు నవ్వరా? నే నరిగి వారిం బట్టించికొని వచ్చెదఁ జూడుమని వేగమం బాడి పసుపుబట్టలతోనే గుఱ్ఱమెక్కి కరవాలాది సాధనంబులు ధరించి చతురంగబలములు సేవింప సంగరమున కరిగెను.

కృష్ణార్జునులకుం బోలె సుగుణసాగరునకును బలభద్రునకు నద్భుతమైన ద్వంద్వయుద్ధము జరిగినది. వారొండొరుల నేయు నేరుపు, కాచుకొను పాటవము, పొడుచు ప్రవీణత, తప్పించుకొను నైపుణ్యము, లంఘించు లాఘవము, గతిచాతుర్యముఁ జూచి చూపఱులు మిక్కిలి యగ్గించిరి.

వారలట్లు ఘోరంబుగఁ బోరుచుండ సుగుణసాగరుని గుఱ్ఱము ముందరి కాలునకుఁ గత్తిపోటు దగిలి యది నేలం గూలినది. దానంజేసి యతండు సంగరదమను డగుటయు బలభద్రుండు సమయ మరసి పెండ్లికొడుకు గావున జంపనిష్ట పడక పట్టుకొని పెడకేలు గట్టి కృష్ణుని వశముఁ జేసి యున్న సైన్యమునెల్లఁ పరాజయము నొందించెను. హతశేషుల వలన సుగుణసాగరుఁడు పట్టుబడెనను వార్త విని యతని భార్య పెండ్లికూఁతురు మిగులరోషముఁ దెచ్చుకొని గంధమాల్యాలంకారములు దీసి కాశికోకలు బిగియించి కరవాలాది సాధనంబులు ధరియించి మించిన సంభ్రమముతో నశ్వారూఢయై రణభూమి కరుదెంచి విచిత్రగతులతో దన గుఱ్ఱ మును నడిపింపఁ జొచ్చినది.

తద్గతివిశేషంబు లరసి బలభద్రుండు విస్మయము నొందుచుఁ గృష్ణనితోఁ దమ్ముఁడా! రాచబిడ్డల పౌరుష మెట్టిదో చూచితివా? ఈ చిన్నది వీని భార్య కాఁబోలు? పాపము వివాహాంతరముననే సాంపరాయకము తటస్థించినదే? యీచేడియ బవరంబుల గడితేరినట్లు తోఁచుచున్నది. కాచికొని యుండుమని పలుకుచు నా యువతితోఁ గలియబడి పోరుగావింపఁ జొచ్చెను.

విచిత్రప్రహరణంబుల నా యిద్దఱు పెద్దతడవు దురము గావించిరి. కాని యెవ్వరికిని నోటును, గెల్పును గలిగినది కాదు. అప్పుడొండొరుల మెచ్చికొనుచుఁ బోరు సాలించి నిలువంబడిరి అప్పుడు బలభద్రుండు సాధ్వీమణీ! నీవెవ్వని కూఁతురవు? నీ పేరేమి? నీవీ విద్య యెవ్వని యొద్ద నేర్చుకొంటివి? మా గురువే నీకీ విద్య నేర్పినట్లు తోఁచుచున్నది. కానిచో మదీయప్రహరణంబులకు నాగ నొరులకు శక్యమా? యని పలికిన నక్కలికి యిట్లనియె. సౌమ్యా! నీవు కృష్ణా యని పిలుచుచున్నావు. అతండు నీ తమ్ముఁడా యేమి? అట్లయిన నీపేరు బలభద్రుడు కావలయును. ఆ మాట సత్యమేయైనచో నా వృత్తాంతము జెప్పెదనని పలికినఁ గంఠధ్వని గుఱుతుపట్టి మా ముద్దుచెల్లెలు సుభద్రా యేమి? అవును సందియములేదు. కానిచో నీ యుద్దనైపుణ్యము మఱియొకరికి రాదని వక్కాణించెను.

అప్పుడా చిన్నది గుఱ్ఱము డిగ్గనుఱికి యాయుధములఁ బాఱవైచి అన్నలారా! మీరా! ఆహా! నా భాగ్యమేమని చెప్పఁదగినది. మీ జాడ దెలియలేదని పరితపించుచున్న దాననని పలుకుచుండుఁగనే బలభద్రుఁడు గుఱ్ఱము దిగి యమ్మగువ నక్కునం జేర్చుకొని గారవింపుచు నిట్లనియె.

చెల్లీ! కృష్ణుండు నీ వృత్తాంతము కొంతఁ జెప్పెను. అతని విడిచిపోయి నీ వెందెందుఁ దిఱిగితివి? ఏమి చేసితివి? ఇచ్చటి కెట్లు వచ్చితి? నీ వృత్తాంతముఁ జెప్పమని యడిగిన నత్తన్వి తాను బ్రహ్మరాక్షసుని చేతిలోఁ బడుటయు నతని కనుగ్రహము వచ్చుటయు, మందసము గోరికొనుటయు నందు సుగుణసాగరుని రక్షించుటయు లోనగు వృత్తాంత మంతయుం జెప్పి మఱియు నిట్లనియె. అన్నా! సుగుణసాగరుడు నన్నుఁ బురుషుండనుకొని నేను తనకుఁ గావించిన యుపకృతికిఁ గృతజ్ఞతఁ జూపుచు నన్ను సగౌరవముగాఁ దన వీటికి దీసికొని వచ్చెను. మేమీయూరుకు చేరువఱకుఁ బ్రజలందఱు దల్ల డిల్లు చుండిరి బ్రహ్మరాక్షసుఁడు రాజపుత్రు నెత్తుకొని పోయెనను వార్త విని యతని తల్లి దండ్రులు సామంతరాజులు మొదలగు వారెల్ల నిద్రాహారములు మాని పరితపించుచుండిరి. అట్టి సమయమున మేము పట్టణములోఁ బ్రవేశించిన తోడనే రాచపట్టిని గుఱుతు పట్టి ప్రజలెల్ల మూగికొని యెక్కుడుగా నానందింపుచు ముందువోయి రాజుగారి కెఱింగించిరి. అప్పుడు నా వలన నతండు బ్రతికెనని విని యచ్చటిఁ బ్రజలు నన్ను దైవముగాఁ జూచుచుఁ బూజింపుచుండిరి. తల్లి దండ్రుల మాటఁ జెప్పనేల? అట్టి వైభవముతోఁ గొన్ని దినములు గడిపి గుట్టుపట్ట జాలక యొకనాఁడు నా వృత్తాంతమంతయు నీ రాజకుమారుని కెఱింగించి నా యభిప్రాయము వెల్లడించితిని. అతండు మితిలేని సంతసముతో నన్ను మన్నించుచుఁ దండ్రి కెఱింగింపుచు వివాహసన్నాహము గావింప నియోగించెను. దానం జేసి పట్టణమంతయు నలంకరించిరి. ఉత్సవములకు మితిలేదు. నేఁటికి వివాహము జరిగి నాలుగు దినములై నది హృదయమున మీ కొఱకుఁ బరితపించుచునే యుంటిని. ఇంతలో దైవయోగంబున మీరే యిచ్చటికి వచ్చితిరి. దైవమాయ యిట్టిదని తెలియ బ్రహ్మాదులకు శక్యము గాదు. మనకుఁ దెలియునా? చిన్నతనమున నెఱుంగక యట్టి పనికిఁ బూనుకొంటిమి. దానం జేసియే యమ్మహాత్ముఁడు మన కిన్ని చిత్రములు చూపెనని యా కథ యంతయుం జెప్పినది. తరువాత బలభద్రుండు వారు గాంచిన చిత్రములు వారు పొందిన మోహము లోనగు చర్యలన్నియు జెప్పెను. అప్పుడు సుగుణసాగరుని బంధవిముక్తునిఁ జేసి బలభద్ర గృష్ణులు మన్నించుచుఁ దమ వృత్తాంత మంతయుం జెప్పిరి. వారి కథ విని యతండును వెఱఁగు పడియెను.

ఆ వార్త ముఖాముఖిగాఁ బట్టణమంతయు వ్యాపించినది. వారి బలపరాక్రమములు పౌరులెల్లరు నాశ్చర్యముగాఁ జెప్పుకొన దొడంగిరి. సుభద్ర తనయన్నలు సేసిన పరాభవము మన్నింపుఁడని సుగుణసాగరునిఁ బార్ధించినది. వారు తన స్యాలకు లని విని యతండు మిక్కిలి సంతోషించుచుఁ దదీయ శౌర్య సాహసాది గుణంబులఁ బలు తెఱంగుల నగ్గించెను.

పిమ్మట వారి నగరికిం దీసికొనిపోయి సుగుణసాగరుండు తండ్రితో నా వృత్తాంత మంతయుం జెప్పెను. విక్రమ సేనుండు మొదట సుభద్ర వలననే తన కులము నిలిచినదనియు నిప్పుడు సైత మాచేడియ మూలమున బలము నిలిచినదనియు బలుకుచు నా యింతిని వారిని నెక్కుడుగా శ్లాఘించెను. మునుపటి కంటె నెక్కుడు వైభవముగా నా వివాహ శేషము జరిగించిరి. బలభద్ర కృష్ణుల భార్యల నిరువుర నచ్చటికి రప్పించి. వారి వృత్తాంతమంతయు విని యచ్చటి ప్రజలు మిక్కిలి యబ్బురముఁ జెందుచుఁ గీర్తనలుగను బద్యములుగను బాటలుగను వారి చరిత్రము రచించి గానముఁ జేయుచుండిరి. మిగుల వైభవముతోఁ గొన్ని దినములచ్చటఁ గడిపి వారు తమతల్లి దండ్రులు తమ కొఱకు విచారింపుచుందురని తలంచి చిత్రసేను ననుజ్ఞగొని సుగుణసాగరుఁడు తోడరాఁ జతురంగ బలపరివృతులై కతిపయ ప్రయాణంబుల దేవ దుర్గపురంబునకుం జనిరి. అందు బుధవర్మ పుత్రుల జాడఁ దెలియక చింతాకులస్వాంతుండై భార్యతోఁ గూడికొని సదాశివయోగి యను మహాయతీశ్వరుని చెంతఁ దత్త్వోపదేశములఁ బొంది వైరాగ్య ప్రవృత్తితోఁ గాలక్షేపముఁ జేయు చుండెను. అట్టి సమయంబునఁ దనబిడ్డలు ఘనవైభవముతో వచ్చిరను వార్త విని బ్రహ్మానందముఁ జెందుచు వారి నెదుర్కొనుటయు భార్యలతోఁ గొడుకులుసు భర్తతోఁగూతురును నతని పాదంబులఁబడి నమస్కరించిరి వారినెల్ల గ్రుచ్చి యెత్తి వేఱు వేఱ వారి వారి వృత్తాంతము లడిగి తెలిసికొని సంతోష విస్మయంబులు మనంబునం బెనఁగొనఁ దత్సుగుణ సంపత్తి నభినందించెను. మఱియు వారెల్ల దాము గ్రామము విడిచినది మొదలు నాఁటి తుదివఱకు జరిగిన కథయంతయుఁ బూసగ్రుచ్చినట్లు తల్లి దండ్రులకే కాక చూడ వచ్చిన పౌరులకెల్ల వక్కాణించుచు దైవమాయ నెవ్వరు నతిక్రమింపలేఁరని సిద్ధాంత పరచిరి.

పిమ్మట బుధవర్మ కుమారుల చరిత్ర విని తన గురువగు సదాశివ యోగిని రప్పించి పుత్రుల నతని పాదంబుల బడవైచి మహాత్మా వీరు నా పుత్రులు. హరిహర శక్తి దేవతాతారతమ్యముఁ దెలియఁగోరి నాకు దెలియకుండఁ దీర్థయాత్రలు సేవింప బోయిరి. అందుఁ దమ కేమహిమయుఁ గనంబడమి దైవంబుల నిందించిరి. ఆ రాత్రి మహాంధకారములో బడి చింతింపుచు నొక బిలములోఁ బడిపోయిరఁట. అందు మువ్వురకు మూఁడు వింతలు గనఁ బడినవని యా యుదంతమంతయు జెప్పి యోగీంద్రా ! యిట్టి వింత లెందును గనివిని యెఱుంగము. అది యట్లుండ నిమ్ము. ప్రవాహములో శంఖచక్రాది సాధనధరులైన వైష్ణవులు వేనవేలు కొట్టుకొని పోవుచున్న ట్లొకనికి జంఝామారుతములోఁ ద్రిశూలధారులైన మహేశ్వరులు కొట్టుకొనిపోవుచున్న ట్లొకనికి మహాగ్నిజ్వాలలో మహాశక్తులు మువ్వురు బిడ్డలఁ జంకనిడికొని యెగిరిపోవు చున్నట్లు నాకూఁతునకుఁ గనంబడిరఁట. అందలి సాంకేతిక మేమియో తెలియఁజేయవలయునని వేఁడుకొనియెను. అప్పు డయ్యోగి యించుక ధ్యానించి రాజా ! నీ సంతానము హరి యధికుండా ? శివుఁ డధికుఁడా? శక్తి యధికురాలా ? యను సందేహము గలిగి యా మువ్వురిలో జగత్కారణమైన వేల్పేదియో ! యని తీర్ధయాత్ర సేవించిరి గదా ? అందు దమ కేదియు నమ్మకము గనంబడినది కాదు. పిమ్మట నిందించిరి. వారి చిత్తములు యదార్థ నేత్తృత్వమందు నిశ్చయాయత్తములై యున్నవి. వారియందు భగవద నుగ్రహము గలిగినది. కావున నమ్మహాత్ముండు యదార్థమును జూపించెను. పరమాత్మతత్త్వ మొక్కటియే నిత్యమైనది. అది సుగుణ మనియు నిర్గుణ మనియు రెండు విధములు. హరిహరాది రూపకల్పనలు సగుణో పాసకులు సేయుచుందురు. తర్కింప నవియు యదార్ధములు కావు. మనుష్య లెట్లు కాలానుసరణముగాఁ బోవుచుందురో వారును బోవుదురని సూచించుటకై వాతాగ్ని ప్రకాహాదులు గనపఱచెను. కాల ప్రవాహంబునంబడి యెల్లరు గొట్టుకొని పోవుచు సుఖ దుఃఖముల నందుచుందురు అని తెలియుటకై నీ పుత్రులు తద్రూపమయిన సుఖదు:ఖముల నందిరి. ప్రపంచకము స్వప్న ప్రాయమని దీనం దెలియక మానదు. నీవు కడుపుణ్యాత్ముండవు ; నీ పుత్రులు కడు పవిత్రులు కృతకృత్యులైరని యాసంకేతము లన్నియుఁ దెలియఁ జేసెను. మాధవర్మ పుత్రులతోఁ గూడ నా వృత్తాంతమును విని పరమానందమును జెంది వారికిఁ గూడఁ దత్త్వోపదేశముఁ జేయుమని కోరికొనియెను. అప్పు డయ్యోగి, వారికెల్ల నద్వైతతత్వ మహత్వము నుపదేశించి కృతకృత్యుల గావించెను.

గోపా ! నీవు చూచిన పాషాణ పేటిక సుభద్రం గరుణించి యిచ్చిన బ్రహ్మరాక్షసుని భోజన పాత్రము. అల్ల నాఁడు శివవిష్ణు రాక్షసులు విసరిపాఱవైచిన నిచ్చట వచ్చిపడినది. నీ వెట్లయిన నన్ను విడువవని యా కథ యంతటితో ముగింపక సాంతముగా వక్కాణించితిని. ఇదియే దీని వృత్తాంతము అన యమ్మణిసిద్ధుండు శిష్యునితోఁ గూడిఁ దదనంతరావసధమునకుం జనియెను.

ముప్పది తొమ్మిదవ మజిలీథ.

ముప్పది తొమ్మిదవ మజిలీయందు గోపాలుండు వింతలంజూడ నరణ్యంబునకుం జని తిరుగుచు నొకచో రెండు బాఱల దంతమొకటి గనబడుటయు విస్మయముతో దాని వెండిదండము వోలె భుజమున నిడికొని తన యయ్యవారి యొద్దకువచ్చి నమస్కరింపుచు నా రదనం బతని కురంగట నిడి స్వామీ! ఇది దారువుగాదు, పాషాణము గాదు, లోహము గాదు. దీని స్వరూపముఁ జూడఁ బంటిపోలిక గనంబడు చున్నది. ఇట్టి పండ్లు ధరించిన జంతువు కళేబరమెంత యుండవలయును ? అది యే జంతువయి యుండును. దీని వృతాంతము విన వేఁడుక నాకు గాదు. మీకును సంతోషమే యైయుండక పోవదు. మీ మాణిక్యముచే దీనియుదంత మరసి వక్కాణింపుఁడని