కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/207వ మజిలీ

వికీసోర్స్ నుండి

దీక్షి - అదిగో మృదంగధ్వని వినంబడుచున్నది. నాటకము ప్రారంభించిరి కాఁబోలు. మీరు చూడవత్తురా నేను బోవుచున్నాను బాబూ.

సోమ - నా కాయాసముగా నున్నది రాలేను.

అని వారు మాట్లాడికొనిన మాట లాలించి విక్రమార్కుండు బాగు బాగు. వీరి మాటలవలన రూపపతీ సుమనల గ్రామనామములు దెల్లమైనవి. వీరిని భార్యలతో గలుపుట యీమాటు సులభమేయని యాలోచించుచు వారివలన మఱల నా గ్రామములకు దారులడిగి తెలిసికొని యా వార్త వా రిద్దరికిఁ జెప్పి నేను రేపా రెండు గ్రామములకుఁ బోయి మీ భార్యల తావుల దెలిసికొనివచ్చెద. మీరిందే యుండుడు. కాలినడకం బోయిన జాలదినములు పట్టును. అశ్వయానమున నాలుగు మూఁడు దీనములలోఁ జూచి వచ్చెదనని చెప్పి యా రాత్రి గడిపి మఱునాఁడు గుర్రమెక్కి యరుగఁబోవు సమయంబున నేమిటికో యా కన్యదాత యా వీథికి వచ్చి గుర్రమును గురుతుపట్టి తనకు రసరసాయనము లిచ్చిన దివ్యపురుషుం డీతఁడే యని గ్రహించి విక్రమార్కుని బిగ్గరగా నాలింగనము జేసికొని మహాత్మా! ఈ వైభవమంతయు నీ దానమహత్వముననే కలిగినది. నే నెట్లుంటినో చూచితిరా ? మీరు సమయమునకు వచ్చితిరి. మా యింటికి రండని ప్రార్థించుచు నందున్న వారికెల్ల నతని వృత్తాంతము వెల్లడించెను.

జనులు గుంపులుగా మూగికొని వింతగాఁ జూడఁ దొడంగిరి. అప్పుడు విక్రమార్కుఁ డాలోచించి అయ్యా ! నేను మీ రెవ్వరో యెఱుఁగను. నేను మీ కేమియు నీయలేదు. నన్ను మీరు మఱియొకరనుకొను చుంటిరని గద్దించి పలికి గుర్రమెక్కి యవ్వలికిం బోయెను.

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ తరువాతి నివాసదేశంబున నిట్లు చెప్పఁదొడంగెను.

207 వ మజిలీ

విక్రమునిదేశయాత్ర కథ

మాణిభద్రుడు - ప్రేయసీ! నీ యక్కకూఁతురు త్రిపురసుందరికి వివాహసన్నాహ మంతయుం గావించి విక్రమార్కునిం దీసికొని వత్తునని జెప్పి యూరక వచ్చితివేల ? ఇంతకాల మెందుంటివి?

మదనమంజరి - ప్రాణేశ్వరా! నే నిందుండి యుజ్జయినీపురంబున కరిగితిని. అమ్మహారాజు గ్రామములో లేకపోయెను. ఉత్తరదేశమందలి వింతవార్తయేదియో విని దానింజూచుటకై బయలుదేరి దేశాటనము జేయుచున్నాఁడని వింటి. వెంటనే యతనిజాడలు దీయుచు నేనును వెనువెన్క నాతఁడు దిరిగిన దేశములన్నియుం దిరిగితిని. ఆహా ! ఆ మహారాజు గావించిన చర్యలు వినిన మఱియు విస్మయము గలుగు చున్నది.

మాణి — తచ్చరిత్రములు విన నాకును మేను గగుర్పొడుచుచుండును. వింతయైన చర్య యేదేని గలిగిన వక్కాణింపుము.

అనుటయు మదనమంజరి యిట్లు చెప్పఁదొడంగెను.

విక్రమార్కుండు తన పేరెవ్వరికిఁ జెప్పకుండ దేశాటనముఁ జేయుచుండెను. ఒకనాఁ డొకగ్రామప్రాంత దేశమునుండి యరుగుచు జనశూన్యమైన గొప్ప తటాకగర్తమును గాంచెను. మిక్కిలి లోతగు నాగోతిలో నాలిచిప్పెడు నుదకమైన లేదు. ఎటు జూచినను రెండుక్రోశముల వైశాల్య మున్నది. ఆ నిర్జలతటాకముఁ జూచి యతండు మిక్కిలి వెఱగుపడుచు నీకాసార మింతలోతు గలిగియు నుదకము లేక పోవుట వింతగా నున్నది. ఇందుల కేదేని కారణ ముండకపోవదు. విచారించెదంగాక యని తలంచి యాగోతి కడ్డపడి నడుచుచుఁ దన్మధ్యభాగంబున నొప్పుచున్న విష్ణ్వాలయముఁ జేరి యద్దేవునకు నమస్కరింపుచు నందలి విశేషములఁ బరికింపుచుండ నొక శిలాశాసన మతనికి గనంబడినది. దానిం జదువ నిట్లున్నది.

ఈచెఱు వొకమహాభాగ్యవంతుఁడగు వర్తకునిచేఁ ద్రవ్వింపఁబడినది. దీనిం ద్రవ్వుచుండ భూమిలో నీవిష్ణ్వాలయము బయల్పడినది. అతఁ డీదేవాలయమునుజక్క పరచెను. తటాకములో నెంతవర్షము గురిసినను చిప్పెడు నీరైనను జేరదు. చేరినను నిలువదు. ముప్పదిరెండు గుణములు గల మహారాజు శిరోరుధిరంబున నీభూమిందడిపె నేని తటాకము జలపూరితమై యొప్పఁగలదు. అని యాకాశవాణివలనం దెలియఁబడినది. అట్టి గుణములుగల పుణ్యాత్ము లట్టిసాహసము గావించిరేని పెక్కండ్ర కుపకారమగును. ఈ మరుభూమి నీరులేక ప్రజలు చాల యిబ్బంది పడుచున్నారు

శ్లో. శతమపి శరదాం వైజీవితం ధారయిత్వా
    శయన మధిశయానః సర్వధా నాశమేతి
    సులభవిపది దేహే సూరిలోకైకనింద్యే
    నవిదధతి మమత్వం ముక్తికాంతోత్సుకాస్త్సే.

నూఱేండ్లు బ్రతికినను శరీర మెప్పటికైన నాశనముఁ జెందకుండదుగదా ? బుద్బుదమువలె క్షణభంగురమైన శరీరమున ముక్తికాంతాసక్తులగు విద్వాంసులు మమత్వమును వహింపరుగదా?

అని యున్న శాసనము ముమ్మారు చదివి యాభూపాలుం డపారసంతోషముతో నత్తటాకగర్భప్రసాదంబున నొప్పు పుండరీకాక్షుం బూజించి యోమహానుభావ! ద్వాత్రింశల్లక్షణయుక్తుండగు పురుషుని కంఠరక్తం బభిలషించితివఁట. ఇదిగో నా శిరంబు నఱుకు కొనుచున్నాను. మదీయకంఠ రుధిరంబునఁ దృప్తుండవై తటాకంబును నింపుము అని పలుకుచుఁ గత్తి నెత్తి కంఠమును కోసికొనఁబోవునంతలో లక్ష్మీనాథుండు ఏ! నిలు, నిలు. నీసాహసమునకు మెచ్చికొంటిని. వరంబులం గోరుకొను మని గత్తి పట్టుకొని యడిగిన నమస్కరించుచు మహాత్మా! నాకేకోరికయును లేదు. ఈ తటాకము సంతతము మధురజలపూరితమై యుండునట్లు చేయుటయే నా యభీష్టమని యతండు పార్ధించుటయు లక్ష్మీధవుండు నరేంద్రా? నీవు తీరంబుఁ జేరుము. కాసారంబు అవ్వారిగ వారి పూరితంబుగాఁ గలదని యానతిచ్చెను. విక్రమార్కుండు గట్టెక్కిన సుముహూర్తమునందే యాగర్తమంతయు నమృత పూరితంబై యాహ్లాదము గలుగఁ జేసినది. అందలి వారెల్ల నతఁడు విక్రమార్కుండని యెఱుంగ కున్నను తత్సాహసగుణంబు పెద్దగా నగ్గించిరఁట. అమ్మహారాజు వారికట్టి యుపకారముగావించి యవ్వలఁ బోయెనఁట. వింటిరా? అతం డెటువంటి సాహసుడో ? ఇది యొక్కటి యేనా ? ఈలాటిచెయ్వు లనేకములు గావించెను. తనప్రాణముఁ దృణముగానైనఁ జూచుకొనఁడు.

ఒకచోఁ దప్తతైలంబునం బడి మన్మథసంజీవిని దేవతం బ్రత్యక్షముఁ జేసికొని భూసురకుమారున కర్పించెనఁట. మఱియొకచోట వేణు వివరములో బ్రహ్మరాక్షసావేశితయగు యువతిని విడిపించి రక్షించెనట.

మఱియు శైవాలక శైలప్రాంతమందలి పరాశ నగరమను నగ్రహార వాసులగు భూసురులు ఏకచక్ర పురవాసులు బకాసురునకు వలె నప్పర్వతాగ్ర వాసియగు రాక్షసునకు నిత్య మొక్కొక్కఁడు వోయి యాహారమగునట్లు నియమముఁ జేసిరఁట. విక్రమార్కుండొక నాఁ డాయగ్రహారమున బఁసజేసి తానున్న బ్రాహ్మణకుమారునకుం మఱునాఁడు వంతు వచ్చినదని గ్రామాధికారులు వార్తఁ బంపుటయు వారు దుఃఖింపుచుండ నోదార్చుచుఁ దానా దానవున కాహారముగాఁ బోయి వధ్యశిలపైఁ గూర్చుండెనఁట.అంతలో నారాక్షసుఁ డరుదెంచి దరహసితవదనారవిందుండై యందుఁగూర్చున్న విక్రమార్కుం గాంచి మహాసత్వుఁడా ? నీ వెవ్వఁడవు ? ఆసన్న మరణుండవయ్యు నించుకయు విచారము లేక సంతోషముతో వసించితివి. కాఁబోవుపని యేమియో యెఱుఁగుదురా ? అని యడిగిన నతండు నవ్వుచు నిట్లనియె.

దానవేంద్రా ? నీకీ ప్రశ్నాయాసముతోఁ బనియేమి ? నేను బరార్ధమై శరీరమును విడుచున్నాను సంతోషము గాక విచారమేలఁ గలుగును. అగ్ని సాత్కృతముగా నున్న యీ దేహమును భక్షించి నీ యాఁకలి యడంచుకొనుము. నాకుఁ బుణ్యము రాఁగలదు. అని యుత్తరమిచ్చుటయు నోహో ? ఇదివఱ కెవ్వడు నింత ధైర్యముగాఁ బలికినవాఁడు లేఁడు. వ్యధశిలఁ జేరినతోడనే యెట్టివాఁడును. మున్నే చచ్చిన పరదుఃఖమును సహింపక నిర్లక్ష్యముగా శరీరమును విడుచుచున్నాఁడు. ఇట్టి సాధుపురుషుని భక్షించిన నాకు జీర్ణముకాదు. వీని ముట్టగూడదని తలంచుచు నతని కిట్లనియె.

ఓ మహాపురుషా! నీవు పరార్దమై శరీర మర్పించుచుంటివి. కావున శ్లాఘనీయుఁడ వైతివి. నీగుణమునకే మెచ్చినవాఁడ. వరంబు వేడు మిచ్చెదనని యడిగిన సంతసించుచు నతండు వయస్యా ! నీవు నాయం దిష్టము గలవాఁడవైతేని యిది మొదలు మనుష్యుల భక్షించుట మానవలయును.

శ్లో. యధాచ తే జీవిత మాత్మనః ప్రియం
    తథా పతేవామపి మాత్మనః ప్రియం
    సంరక్ష్యతే జీవిత మాత్మనో యథా
    తథా పరేక్షామపి రక్ష జీవితం

నీదేహము నీకెంత ప్రియమో యితరుల దేహము వారికంత ప్రియముగా నుండదా ? ఒరుల దేహములు భక్షించి నీవు నీదేహమును గాపాడుకొనుచుంటివి. ఇది యెంత యుచితమైన పనియో యాలోచింపరాదా? ఆ కలములు దివినఁ బొట్టనిండదా? ఈ నా ఘాతుకృత్యము మాను మదియే నా యభీష్టమని పలికిన సంతసించుచు నారాక్షసుఁ డట్టి వరమిచ్చి యవ్వలకుఁ బోయెను. విక్రమార్కుండు నట్లు బ్రాహ్మణరక్షణము గావించి యటఁ గదలి మఱియొక దేశము వోయెను.

అమ్మహారా జీవాటిసాహసకృత్యము లనేకములు గావింపుచుఁ దిరిగి దిరిగి పాతాళలోకమున కరిగి బలిచక్రవర్తిచే సన్మానితుండై రస రసాయనములఁ గానుకగాఁ బడసి వాని బ్రాహ్మణార్పితము గావించి భార్యావియోగచింతాసంసక్తచిత్తులైన కేసట దర్పకులను విప్రకుమారులభార్యల వెదకి తెచ్చి వారితోఁ గూర్చి తరువాత మఱికొన్ని దినంబులకు సూర్యగిరిం జేరెను. నే నానృపాలుని వెనుకనే పోవుచుంటిని. క్రమంబున నేనుగూడ సూర్యగిరి కిరిగితిని. జాము ప్రొద్దునప్పటికి నే నాతటాకముదాపునకుఁ బోయితిని.

జనులు గుంపులుగాఁ గూడికొని వింతగాఁ జెప్పుకొనుచు దుఃఖము లభినయింపు చుండిరి. నే నదియేమని యడుగఁగా గొంద రిట్లనిరి. పాప మొక చక్కని పురుషుం డెవ్వఁడో రాత్రి కీదేవాలయమునకుఁ జేరెను. కాంచనస్థంభవృత్తాంత మడుగ నెందులకో యనుకొంటిమి. నేఁటి యుదయమున లేచి యీ తటాకములో స్నానముఁ జేసి యర్కప్రతిష్టితంబగు నీశివలింగంబుఁ బూజించి యరుణము జపించుచు సూర్యోదయమువఱకు నీసోపానములఁ గూర్చుండెను.

అంతలోఁ గాంచనస్థంభంబు వాడుకప్రకారము జలమునుండి బయలుదేరినది. రెండు మూఁడు బార లెత్తెదిగినతోడనే వలదు వలదు భస్మమగుదువని యర్చకు లరచుచుండ వినిపించుకొనక గుభాలునఁబోయి యాస్థంభాగ్రమున నున్నపీఠంబునం గూర్చుండెను. అందరము చూచుచునే యుంటిమి. ఏమి చేయఁగలము, అతివేగముగ నాస్తంభ మెదిగిపోవుచుండ వారింప నెవ్వరిశక్యము ?

అదిగో స్థంభము చాలదూరము పోయినది. చివర గనంబడుటలేదు. మధ్యాహ్నమునకు రవి నందునని చెప్పుదురు. పర్వతములనైన భస్మము జేయు సూర్యుని సమీపమున మనుష్యమాత్రుఁడు నిలుచునా ! ఈపాటికే భస్మమైయుండును. ఆమాటలే చెప్పుకొనుచున్నారము. అతఁ డేదేశస్థుఁడో తెలియదు. వినోదముగా గుఱ్ఱముపైఁ గూర్చుండుట యనుకొనెను కాఁబోలు ? భార్యాపుత్రులతోఁ బోట్లాడి బలవంతమునఁ జావ నరుదెంచెనా అని యక్కడివారు నా కా తెఱంగెఱింగించిరి.

అప్పుడు నా హృదయంబునఁ జింతావిస్మయసంభ్రమంబు లావిర్భవింప నేమిఁ జేయుటకుఁ దోచక తొట్రుపడుచు నిట్లు తలంచితిని. అక్కటా? అనేక కోటి యోజనముల దూరములో నున్నను సూర్యతాపము సంతాపము గలుగఁ జేయుచుండును. దాపునకుఁ జేరిన లోహములనైన భస్మముఁ జేయఁగలదె. ఈ స్థంభంబు మిట్ట మధ్యాహ్నము సూర్యునంటియే వచ్చునట. ఈతం డెట్లు జీవింపగలఁడు? అయ్యో? ఇట్టి పరోపకారపారీణున కి దుర్మరణము గలుగవలసి వచ్చినది. ఈ పుణ్యపురుషు నలకాపురమునకుఁ దీసికొనిపోయి యెంతయో యుత్సవము సేయవలయునని తలంచి యుంటి నేదియు లేకపోవును గాఁబోలు. అట్టి పని జరుగదు. ఈ మహాత్ముని దేవతలు రక్షింపరా ?

సూర్యుఁ డీతని సద్గుణంబులు వినియుండఁడా? అదివఱ కితఁడు కావించిన సాహస క్రియలకన్న నది పెద్దదియో? వీని కీమియు భయములేదు. సాయంకాలమున నీ సుకృతదర్శన మగునని తలంచుచు నా దేవళముముందర నిలువంబడి చూచు చుంటిని.

ఈతని నీవెఱుంగుదువాయేమి? పరితపించు చుంటివని యందలివారలు నన్నడుగ నేనిట్లంటి. ఈతని నేనె కాదు. పేరుసెప్పిన మీరుగూడ నెఱింగియుందురు. ఇట్టిసాహస మెవ్వఁడు చేయగలఁడో తెలిసికొనలేరా?

సీ. బలిమిభేతాళునిఁ బట్టి తెచ్చిన మేటి
                 తను వఱ నుట్టిగోసిన ఘనుండు
    తప్తతైలోరుపాత్రమున దూఁకిన వీరుఁ
                డడిగిన తను విచ్చినట్టి దాత
    గళరక్త మర్పించి గర్తంబు పరిసం
               పూర్ణంబు జేసిన పుణ్యమూర్తి
    తలఁగోసి బలియిచ్చి ద్వాదశవార్షికా
               వగ్రహంబుడిపిన ప్రథితయశుఁడు
గీ. రస రసాయనములను నిర్లక్ష్యముగ ధ
   రామరున కిచ్చినట్టి మహావదాన్యుఁ
   డితఁడు శ్రీవిక్రమార్క నరేంద్ర చక్ర
   వర్తి యిట్టి సాహసగుణ మెవ్వరికిఁ గలుగు?

అతండు విక్రమార్కుండని చెప్పినంత విని యందలి వారెల్ల హాహాకారములు గావింపుచు నోహో యెవ్వఁడో యని యుపేక్షించితిమి. అతండని యెఱింగిన నడ్డుపడి పోనిత్తుమా? అయ్యయ్యో ? వృదగా నెట్టి సుకృతి యాపద పాల్పడియెను? ఈ గ్రామమందున్న బ్రాహ్మణుల కేమియు వసతులు లేవు. ఇందలి భూమి పండదు. కడుపునిండ నన్నము లేక బాధపడుచున్నాము. ఎప్పుడో విక్రమార్కుని కడకుఁ బోయి మా బాధలు చెప్పుకొనవలయునని తలంచుకొను చుంటిమి. ఇఁక మా యాపద లెట్లు పోవును? యని యందలి బ్రాహ్మణులు దుఃఖింప వారించుచు నిట్లంటిని.

ఆ మహాత్మున కేమియు భయములేదు. చెక్కు చెదరక పుటము పెట్టిన బంగారమువలె మెఱయుచు సాయంకాలమున కిందు రాఁగలఁడు మీరా నృపతికి క్షేమకరముగా సూర్యనమస్కారములఁ గావింపుండుఁడని ప్రోత్సహించితిని. వా రత్యుత్సాహముతోఁ బెద్ద యెలుంగున నరుణస్తోత్రములు గావింపుచుండిరి సాయంకాలము వఱకు నందలి వారిలో నొక్కండైన నక్కడ కదలిపోలేదు. భుజింపలేదు. తదాగమనం బభిలషించి ధ్యానించుచుండిరి. అంతలోఁ బద్మినీకాంతుం డపరగిరితటనికటమున కరుగుటయు నాసువర్ణస్తంభంబు క్రమంబున హ్రస్వమై తటాకములోనికిఁ దిగుచుండెను. అప్పుడు.

క. పుటమిడిన పైడివలె వి
   స్ఫుటతరతేజమున మెలయుచును కంబము చ
   క్కటిఁ గూర్చున్న నృపుఁ జెం
   గటఁగని హర్షధ్వనుల్ గగనమంట జనుల్.

కరతాళములు వాయించుచు నతని వినుతింపుచుండ నమ్మహాత్ముఁ డాస్తంభాగ్రమునుండి తటాకాంతరమునందలి మంటపమునఁ దిగి వచ్చుచుండ నందలి బ్రాహ్మణసంఘంబులెల్ల మూఁగికొని జయవిక్రమార్క భూపా! యని యరచుచు నొకచో నిలువంబెట్టి యిట్లు విన్న వించుకొనిరి.

మహారాజా! నీవు విక్రమార్కుండవని యెఱుఁగక ప్రొద్దుట నుపేక్షగాఁ జూచితిమి. ఆమె వలన నీ వృత్తాంత మంతయుం దెలిసి కొంటిమి. ఈ గ్రామములో నూఱు బ్రాహ్మణ గృహంబులు గలవు. ఒక్కనికిఁ గడుపునిండ భోజనము కుదరదు. మేమందఱము మీకడ కరుదెంచి మాయిక్కట్టులఁ జెప్పుకొనవలయు నని తలంచుకొను చుంటిమి. పెరటిలోనికిఁ గల్పవృక్షము జేరినట్లు నీవే మాచెంగట కరుదెంచితివి. ఇఁక మా దరిద్రములు పటాపంచలై పోఁగలవు. సూర్యనిం జూచినఁ జీఁకటులు నిలుచునా? మహాత్మా ? మా యూరిలోనికి రమ్ము. భార్యాపుత్రులతో మేమెట్లు బాధపడుచుంటిమో చూడుము. అని దీనులై వేడుకొనఁగా నాలించి విక్రమార్కుడు చేతులెత్తి యిట్లనియె.

బ్రాహ్మణోత్తములారా! మీకు నమస్కారము నేను మీ దరిద్రము వినజాలను. ఇవిగో యీ రత్న కుండలములు రెండును మత్సాహసమునకు మెచ్చుకొని సూర్యుండు నాకుఁ గానుకగా నిచ్చెను. ఇవి నిత్యము రెండు బారువుల బంగార మిచ్చుచుండునఁట. వీనినిప్పుడు మీకర్పించుచుంటిని దీనవచ్చిన బంగారము మీయగ్రహారస్థు లందఱుఁ బంచికొని భుజింపుడు. కొంతపట్టు మీ కష్టములు దీరవచ్చును. మీకిచ్చుట కింతకన్న నిప్పుడు నాయొద్ద నేమియును లేదు. అనుగ్రహించి నన్నుఁ గృతార్థుం గావింపుడు.

అని వేడుకొనుటయు నోహో ! ఇంతకన్న నధికమేమి కావలయును. మమ్ముఁగూడఁ జక్రవర్తులఁ గావించితివని వారు స్తోత్రములు సేయుచుండ నాకుండలములు బ్రాహ్మణార్పితము గావించి యటఁ గదలి తన గుఱ్ఱమున్న చోటికింబోయి యెక్కఁబోవు సమయంబున నే నెదుర నిలువంబడితిని. నన్నుఁజూచి చిఱునగవుతో రాజు ఓహో! నీవు మదనమంజరివి కావా ? ఇచ్చటి కెట్లువచ్చితివి.

నేను - దేవరవారు మున్ను నాకిచ్చిన వరము మరచిపోయి దేశాటనము జేయుచున్నారు. ఆ మాట జ్ఞాపకము జేయుటకై వచ్చితిని.

రాజు - ఏమి వర మిచ్చితిని?

నేను - మాయక్క కూఁతురు త్రిపురసుందరిని రెండవభార్యగా స్వీకరింతు మని యభయహస్త మీయలేదా?

రాజు — ఇందులకై యింతప్రార్దనయేల? అట్లే స్వీకరింతునుగా.

నేను - మిమ్ముఁ జూడ దేవలోకవాసు లందఱు నుత్సుహము జెందు చున్నారు! ఈ దారి నలకాపురమునకు దయజేయుఁడు.

రాజు - (నవ్వుచు) దేవలోకములలో నాటకము లాడి నన్ను బెద్దగాఁ బొగడుచుంటివఁట. ఆ వార్తలు నాకుఁ దెలియుచున్నవి. సిగ్గగుచున్నది.

నేను - నేఁ జెప్పనేల? నాఁడు మీరు కాపాలికునిఁ బరిభవించిన విషయము కుబేరుఁడెఱుఁగడా? మహేంద్రుఁ డెఱుఁగడా? బృహస్పతి యెఱుఁగడా? పరమేష్టి యెఱుఁగడా? వారందఱు తమ వలనఁ గాదని చెప్పలేదా? బ్రహ్మ మీకడకుఁ బొమ్మని యెఱింగింప లేదా?

రాజు — సరిసరి అదియొక ఘనకార్యమనియే తలంచుచుంటిరా?

అది యొకటననేలా? ఇటీవల మీరు గావించిన సాహస వితరణాది గుణ గణంబులు వేల్పులకుఁ దెలియలే దనుకొనిచుంటిరా? బలివాకిలిఁ గాచికొనియున్న శ్రీమన్నారాయణుండు మీ చేతులు బట్టి తీసుకొనిపోయి బలిపీఠముకడఁ జేర్చిన వార్తలు దేవలోకములన్నియు వ్యాపించినవి. రసరసాయనములు వృద్ధ భూసురున కిచ్చిన మాట విని కల్పవృక్ష మాకు రాల్చుచున్నది. మహారాజా ! నే జెప్పనేల ?

రాజు — అది నీ కృతజ్ఞతా లక్షణము పోనిమ్ము. మఱియు నేను మిత్రులతోఁ జెప్పకుండ నీ స్తంభంబువార్త విని వచ్చితిని. వారు నా జాడఁ దెలియక పరితపించుచుందురు. నేనింటికిం బోయి వారింగలసికొని పిమ్మట మీ లోకమునకు వచ్చెద.

నేను - మహారాజా ! మీరు గుఱ్ఱముపై హుటాహుటీ పయనంబున బోయినను నాఱుమాసములు పట్టును. మా యక్షిణీ ప్రభావంబున గుఱ్ఱముతోఁగూడ మిమ్ము రెండు గడియలలో నుజ్జయనీ పురంబు జేర్చెద నంగీకరరింతురే ?

అనుటయు నమ్మహాత్ముం డౌను. నీ ప్రజ్ఞ మున్ను నే నేఱింగి నదియే. నన్ను గడియలో మలయవతి నగరముజేర్చి తెల్లవారకుండ వెండియు నింటికిం దీసికొని వచ్చిన నేర్పరివి. అట్లెకావింపుమని కన్నులు మూసికొనియెను. అశ్వసహితముగా రెండుగడియలలో నా నరేంద్రు నుజ్జయినీనగరము జేర్చితిని. వెండియుఁ బది దినములలో రమ్మని నాకాజ్ఞ యిచ్చుటయుఁ తనానతివడసి యిందు వచ్చితినని మదనమంజరి భర్తకు దనపోయివచ్చిన వృత్తాంత మంతయు నెఱింగించినది.

అని తెలిసి మణిసిద్ధుం డవ్వలికథ తదనంతరావసథంబున నిట్లు చెప్పు చుండెను.

208 వ మజిలీ

ఐంద్రజాలికుని కథ

విక్రమార్కుండు కొల్వుకూట మలంకరించి హితపురోహిత మంత్రి సామంతాదులతోఁ దాను జూచివచ్చిన విశేషముల గురించి ముచ్చటింపుచున్న సమయంబున నొక యైంద్రజాలికుఁ డరుదెంచి నమస్కరింపుచు మహారాజా! తమ దివాణమున కైంద్రజాలికుఁ లనేకులు వచ్చియుందురు. వారి వారి విద్యాపాటవము మీరు జూచి యుందురు. మదీయవిద్యానైపుణ్యము గూడ దేవర పరీక్షింతురుగాక. అందులకై యరుదెంచితినని చెప్పిన నప్పుడమిఱేఁ డప్పుడు మాకుస్నాన సమయమైనది. ఱేపువచ్చి నీవిద్యాలాఘవము జూపింపుమని యజ్ఞాపించెను.

విక్రమార్కుండును మఱునాడు యథాకాలమునకు సకల సామంత మంత్రి పురోహిత పార వార సేవితుండై సభ నలంకరించి నిన్న వచ్చిన యైంద్రజాలికునిఁ బిలువుమని ప్రతీహారి కాజ్ఞాపించెను. అతండు ద్వారదేశ మంతయుఁ బరీక్షించి వాని నెందునుం గానక వచ్చి యాజాలికుఁ డెందును గనంబడలేదని చెప్పెను.

అంతలో నొకవీరుండు ఖడ్గహస్తుండై యతి మనోహర ప్రేక్షణీయలావణ్య భూయిష్టయగు వాల్గంటిని వెంటఁబెట్టుకొని యాసభా ప్రాంగణమున కరుదెంచుటయు వారిం జూచి సభ్యులు తెల్ల పోయి చూచుచుండిరి. అప్పుడు విక్రమార్కుడు నీ వెవ్వఁడవు. ఈ కాంత నీకేమి కావలయు నిందేమిటికై వచ్చితివని యడిగిన నవ్వీరుం డిట్లనియె.

రాజా! నేను మహేంద్రుని సేవకుండ నా పేరు వీరాస్వామి యండ్రు. సురపతి యొకనాఁడు నాపైఁ గోపముజేసి భూలోకమున గొన్ని దినములు వసింపుమని శపించెను. ఈ చిన్నది నా భార్య. ఇప్పుడు స్వర్గమున దేవతలకును రాక్షసులకును గొప్ప యుద్ధము జరుగుచున్నది. నన్ను రమ్మని వార్త వచ్చినది నేనుబోయి