కాశీమజిలీకథలు/తొమ్మిదవ భాగము/206వ మజిలీ

వికీసోర్స్ నుండి

206 వ మజిలీ

కేసటుని కథ

విక్రమార్కుం డుత్తరాభిముఖుండై యరుగుచు నొకనాఁడు నర్మదాతీరంబుఁ జేరి యందు వాఱువము దిగి నీరు ద్రాగించుచున్న సమయంబున నాప్రవాహములో నొకపురుషుఁడు కొట్టుకొని వచ్చుచుండెను. వానింజూచి యతం డార్తుం డయ్యెనని తెలిసికొని య భూభర్త తటాలున నత్తటంబు దిగి నదిలో నీదికొని పోవుచు నతనిం బట్టుకొని యొడ్డునకు లాగుకొని వచ్చి విశ్రమింపఁ జేసెను.

దివ్యాలంకారసమచితుఁడగు నాయువకుం జూచి యతండు నీ వెవ్వఁడవు ? ఈ పసుపు పుట్టములతో నీ నదిలో నేమిటికిఁ బడితివి? నీ వృత్తాంతముఁ జెప్పమని యడిగిన నాపురుషుం డాయాసము తీరినవెనుక నిట్లనియె.

సౌమ్యా ! నీవు నన్ను బ్రతికించితివి ఇఁక రెండు గడియలు దాటిన నేను మృతినొందువాఁడనే నే నీనదిలోఁ కొట్టుకొని పోవుచుండఁ దటస్థులై యూరక చూచుచుండిరి. కాని యిట్టి సాహస మెవ్వరు జేయలేక పోయిరి. నీవు మిగుల పుణ్యాత్ముఁడవు. నా వృత్తాంత మాలింపుము. నా కాపురము పాటలీపుత్రనగరము. నేను యౌవనము పొడసూపినంతఁ గులశీల సంపన్న యగు భార్యం బడయుటకై తలిదండ్రుల యనుజ్ఞ గైకొని దేశాటనముఁ జేయుచుంటిని.

ఒకనాఁడు నర్మదానదీతటంబునం గూర్చుండి ప్రవాహవిశేషముల నరయుచుంటి. నింతలో నొక యోడలోఁ బెండ్లి వారు కొందఱరుదెంచిరి. వారు తీరమునఁ దిగి కాల్యకరణీయములఁ దీర్చుకొనుచున్న సమయంబున వారిలో నొక బ్రాహ్మణుఁడు నాకడ కరుదెంచి మదీయకులశీలనామంబు లడిగి తెలిసికొని రహస్యముగా నిట్లనియె.

సుందరుడా ? నీవలన నాకొక యుపకారము గావలసియున్నది. అది చేయుదునంటివేని వక్కాణించెద. దానివలన నీకేమియు హాని రాఁజాలదు. అని యడిగిన నేను ఆర్యా! నాచేతనైన పనిచేయఁగలను. నిస్సంశయముగాఁ జెప్పుమని పలికిన నతం డిట్లనియె.

సౌమ్యా! నీవెంత చక్కనివాడవో యంతరూపహీనుఁడగు కుమారుండు నాకుదయించెను. దొప్పచెవులు దోనెకడుపు పిట్టగుడ్లు చెప్పిదవటలు గూనివీపు లొట్టచేతులు చెప్పవలసిన దేమి యున్నది. ఎన్ని యవలక్షణము లున్నవియో అన్నియు నా కుమారునందు వెలసి యున్నవి. నాకు భాగ్యము చాలఁ గలదు. ఒక్కఁడే కొడుకు కావున వాని కురూపత్వ మెవ్వరికిఁ దెలియకుండ రహస్యముగా దాచి కాపాడు చుంటిమి.

నేను రత్నదత్తుఁడను బ్రాహ్మణుని యెడకుఁ బోయి నా కుమారుఁడు మిగుల చక్కనివాఁడని చెప్పి యతనికూఁతురు రూపవతి యను యువతిని బెండ్లి చేయుమని యడిగి మఱియు నిట్లంటి.

క. నగలెన్ని యేనిఁ బెట్టెడఁ
   దగువిభవముతోడ నిటకుఁ దరలి యరుగు దెం
   తుఁ గదమదున్నతిఁ బెండ్లిలి
   యగు వేళందెలియ జను లహాయని పొగడన్.

అని యనేక మాయవచనమ్ము లుపన్యసించి యావిప్రునిచేఁ దనపుత్రికను నా కుమారున కిచ్చునట్లొప్పించి తాంబూలములు బుచ్చికొంటిమి. ఆ వివాహమునకే మేమిప్పుడు పోవుచుంటిమి. నా కుమారుఁ జూచిన నాభూసురుండు బిల్లనీయఁడు. అందుల కేయుపాయము దోచక పరితపించుచుండ దైవికముగా నీ విందుఁ గనంబడితివి. ఇందులకు దైవము నిన్నాధారముగాఁ జూపెనని సంతసించు చుంటిని. వినుము. నీ రూపము మిగుల రమణీయముగా నున్నది.

నీవే నా కుమారుడవని చెప్పెదను. నేను వానితోఁ జెప్పిన దానికన్న నీ సౌందర్యము సుత్యముగా నున్నది. నీవా వివాహవేదిక పైఁ గూర్చుండి పాణిగ్రహణవిధి నెరావేర్పుము. మా యింటికి వచ్చిన తరువాత నానాతిని నా కుమారున కిచ్చి వేయవలయును. ఇదియే నీవు నాకుఁ జేయవలసిన యపకారము, ఇందు నీకు వచ్చిన కొదవయేమి యున్నది? పెండ్లి యైదుదినములు విందు ఆరగింపుచు నుత్సవము లందవచ్చునని రాడిగిన విని నే నంగీకరించితిని.

నన్నుఁ దమయోడమీదఁ నెక్కించుకొని యావిప్రుండు నర్మదానదిని దాటి యవ్వలియొడ్డున దిగి బంధుజనముతోఁ గూడ నాటి సాయంకాలమున కొక పల్లెటూరు చేరెను. అందొక విప్రగృహంబున వంటఁజేసికొని భుజించితిమి. నేనా రాత్రిఁ గటికచీకటిలో దేహబాధకై యెఱుఁగక చెఱువుగట్టు ప్రక్కనున్న డుద్ర భూమిలోనికిం బోయితిని.

అందొక బ్రహ్మరాక్షసుఁడు నన్నుఁ జూచి జడిపించుచు నోరు తెరచుకొని నాకడ కరుదెంచి మ్రింగుటకుఁ బ్రయత్నింపఁగా నేను జేతులు జోడించి యిట్లంటి మహాత్మా! యీ శరీర మెప్పటికైన నశించునదియే. వృధాగాఁ గాక గృధ్రములపాలు గాక మీవంటి వారి కుపచరింపఁ జేయుట మహాపుణ్యముగదా. అందుల కించుకయు నేను పరితపింపను. కాని నేనొక బ్రాహ్మణుని కుపకారము చేయుదు నని ప్రతిజ్ఞఁ బట్టితిని. నా మరణము వలన నతని కుపకారము జరుగదు. ఇత్తునన్న యర్ద మీయక పోవుటకంటె దారుణమైన పాపము మఱియొకటి లేదు. ఈ విషయమై నీవు నాకొక యుపకారము జేయవలసి యున్నది వినుము. నన్నిప్పుడు వదలుము బ్రాహ్మణకార్యము జక్కబెట్టి యైదవనాఁడు రాత్రి నీకడ కరుదెంచెద నప్పుడు నన్ను భక్షించి నీయాఁకలి యడంచుకొనుము. నీకుఁ జాల పుణ్యము రాఁగల దని యుక్తియుక్తముగా నా వృత్తాంత మంతయు నెఱింగించుటయు నా బ్రహ్మరాక్షసుఁడు వెఱఁగుపడుచు నిట్లనియె.

సరే, నీ మాట కంగీకరించితి. నేఁటి కైదవనాఁడు రాత్రి రావలయు. నట్లు రాకపోయిన నాయాన సుమీయని యొట్టుపెట్టెను. నే నంగీకరించితిని. పోపొమ్మని బ్రహ్మరాక్షసుఁడు నన్ను విడిచివైచెను. అప్పుడే బసలోనికిఁ బోయి యారహస్య మెవ్వరికిం జెప్పక వారితో గలసి మఱునాఁడు రత్నపాదుని యగ్రహారమునకుఁ బోయితిని.

రత్నపాదుండు మా కెదురు సన్నాహము గావించి మిగుల వైభవముతో విడిదెలోఁ బ్రవేశ పెట్టెను. నారూపముజూచి కన్యాదాతయేకాక తద్బంధుజనమంతయు మిగుల సంతోషించెను. రూపవతి సఖురాండ్రిరువు రరుదెంచి విడిదెలో నన్నుఁజూచి తమ సంతోషమును వెల్లడించుచు నన్నుఁ బల్కరించి నావిద్యను బరీక్షించి మెచ్చు కొనుచు నరిగిరి.

అంత నాకు స్నాతకమహోత్సవము జరిగించిరి. ఆ రాత్రియే వివాహము గావించిరి. రత్నపాదుఁడును భాగ్యవంతుడగుట షోడశమహాదానములు జేయుచు శాస్త్రవిధి రూపవతిని నాకుఁ గన్యాదానము గావించెను.

మేళతాళములతో నూరేగింపులతో నుత్సవములతో విందులతో నైదు దినములు నాయగ్రహారము బ్రాహ్మణ జనసంకులమై యొప్పినది. నావివాహము సీతాకళ్యాణమువలె జరిగినదికాని నాకు మాత్రము సంతోషము లేదు. దివసములు గతించిన కొలది చింత యెక్కువ కాజొచ్చినది.

దీక్షావసానదివసంబున మాకు సమావేశమహోత్సవము గావించిరి. రూపవతి రతికన్నఁ జక్కనిది. దాని చెలికత్తెలు మిగుల నందకత్తెలు. మా వధూవరుల చక్కఁదనము ముచ్చటగాఁ జూచుచుఁ బేరంటాండ్రు పాటలు పాడుచుఁ బెద్దతడవందు విడిచి పోలేకపోయిరి.

స్త్రీజనము మా గృహము విడిచిపోయిన తరువాత రూపవతి తలుపుచెంత నిలువంబడినది. జగన్మోహనమగు నమ్మగువ సోయగముజూచి నేను చింతాశోకసమాక్రాంత స్వాంతుండనై యంతలో ధైర్యము దెచ్చుకొని మంచముదిగిపోయి యా యిందువదన చేయిపట్టుకొని తల్పము దాపునకుఁ దీసికొని వచ్చితిని.

ఆ పల్లవపాణి యా ప్రాంతమందున్న పీఠముపై గూర్చుండిఁ సారెలు సవరించుచు హాయిగా వీణ పాడినది. ఆ గాన మాలించినంత నా హృదయము నీరై పోయినది. తల్పంబునంబండుకొని యట్టె ధ్యానించుచుంటిని. నిద్రఁబోయి నట్ల భినయించితి ఆ కాంత కొంతసేపు సంగీతముపాడి నేను నిద్రబోవుచున్నానని తలంచి నాకు నిద్రాభంగము గాకుండ సద్దుఁజేయక మెల్లగావచ్చి నా ప్రక్కను బండుకొని కపటనిద్రం బోవుచుండెను.

అర్దరాత్రము దాటిన పిమ్మట నేను మెల్లగాలేచి యా చిగురాకుబోఁడిం బరీక్షించి నిద్రబోవుచున్నదని నిశ్చయించి బ్రహ్మరాక్షసునిఁ యభిలాష తీర్చుటకై యల్లన మంచముదిగి చప్పుడుగాకుండఁ దలుపులు దీసి వీధింబడి రెండుగడియలలో నా బ్రహ్మరాక్షసుడున్న శ్మశానమునకుఁ బోయితిని రూపవతియుఁ గపటనిద్రఁబోవు చున్నది కావున నా పయనము పరికించి నే నెందుఁ బోవుచుంటినోయని యాలోచించి నాకుఁదెలియకుండ వెనుకవచ్చి యందొకచో నిలువంబడినది.

నే నా బ్రహ్మరాక్షసు నాహ్వానము గావించి మహాత్మా ! నీతోననిన ప్రకారము కార్యము దీర్చుకొని వచ్చితిని. నన్ను భక్షింపుమని పలికిన విని యతండోహో! నీవు మిగుల సత్యసంధుఁడవు. నీ కతంబున నీకులంబెగాక నీ నగరముగూడఁ బవిత్ర మయినది. అని మెచ్చుకొనుచు నన్ను భక్షింపఁ బ్రయత్నించుచున్నంతలో మా మాటలు వినుచున్న రూపవతి యత్యంత వేశముగావచ్చి మానడుమనిలిచి రాక్షసేంద్రా ఈతండు నా భర్త. వీని భక్షించిన నాగతియేమి? నే నెట్లు బ్రతుకుదాననని యడిగిన నా బ్రహ్మరాక్షసుఁడు నీకు భిక్షయే యిటుమీఁద గతియని యుత్తరము చెప్పెను.

అయ్యో ! నే నాఁడుదానను. నాకు భిక్ష యెవ్వరిడుదురు ? మహాసత్వా ! విచారించి చెప్పుమని యడిగిన నా రాక్షసుండు సాద్వీ ! నీ వెవ్వని భిక్ష నడుగుదువో యా వస్తువు వాఁ డీయకున్న వాని తల నూఱుముక్కలై వ్రయ్యగలదని వరంబిచ్చుటయు నా మచ్చెకంటి మిక్కిలి సంతసించుచు సత్యవచనా ? అట్లయిన నిన్నిప్పుడు పతిభిక్షఁ బెట్టుమని కోరితిని. నా యభీష్టము దీర్పుమని యడిగినది.

ఆ మాట విని యా రాక్షసుండోహో ! గడుసుదానవే. నా నోటఁజేరిన యాహార మిత్తు ననుకొంటివా ? మఱియొకరిని యాచింపుము. ఈతని విడువఁజాలనని పలుకుచుండఁగనే వానితల పెళ పెళ బ్రద్దలై నూరువ్రక్కలై పడినది. ఆ వింత నేను కన్నులార జూచి యా సాధ్వీరత్నము పన్నిన యుక్తికి విస్మయము జెందుచు నా యువతిని మిగుల నభినందించితిని.

ఆ చిన్నది నావలన జరిగిన కథయంతయు విని నా శీలమునకు మెచ్చుకొనుచు సిగ్గువిడిచి పెద్దగా స్తుతిఁజేయుచు నింటికిం దీసికొని పోయినది. అంతలోఁ దెల్లవారినది. అందు మారాక పోక లెఱింగినవారులేరు. ఒక గండము గడచినదని సంతసించి నంతలో రాత్రిపడినది.

ఆ రాత్రి మాశయనగృహాలంకారములు కడువింతగాఁ జేసిరి. రూపవతికి శృంగార అనురాగవతి యని యిరువురు చెలికత్తెయలు కలరు. వారును మిక్కిలి చక్కనివారే. మువ్వురు నొకటే ప్రాణమగుట రూపవతితో నీ వెవ్వని బెండ్లియాడెదవో మాకుగూడ భర్తయనియేర్పరచికొని యున్నారట. రెండవనాఁడు రాత్రి యాయిరువురు యువతులును గూడ నాగదిలో నాకుఁ బరిహాసోపచారము లనేకములుగావించిరి చాల ప్రొద్దుపోవువరకు వా రాగదిని విడిచిపోలేదు. నేనును వారికిఁ దగిన పరిహాసక్రియల గావించితిని. అందఱు తలుపు బిగించి యేగిన వెనుక రూపవతి సిగ్గువిడిచి దిగ్గున నాతల్పముజేరి ప్రాణేశ్వరా? మీరు విక్రమార్కుని మించిన సాహసులగుదురు. అక్కటా నాకు నిద్రబట్టక మేల్కొని మీవెంట వచ్చితిని కాని లేకున్న నాబ్రతుకేమికావలయును? నా కే యాధారము జూపిపోయితిరి? ఆయ్యయో? బ్రహ్మరాక్షసుని కట్టిమాట యిచ్చి వచ్చినచోఁ బెండ్లి యాడ నేమిటికి ? నాతో నొక్క గడియయైన సుఖింపరయితిరే. మంచి సత్యసంధులే యని యాక్షేపించుచు శృంగారలీలలకు నన్నుఁ బురికొల్పినది.

నేనప్పు డాత్మగతంబున నిట్లు తలంచితిని. ఆహా ! ఆ వృద్ధ బ్రాహ్మణుడు నన్నీ కన్యను బెండ్లి యాడి తన కుమారుని కర్పింపుమని కోరికొనెయెను. నే నట్లు అంగీకరించితిని. అట్లు జరిగించుట శాస్త్రదూష్యమే యగుంగాకా. నేననినట్లు చెల్లించు కొనక తప్పిన మహాపాతకము. కాని యిప్పు డీ చిన్న దాని నిర్బంధ మెక్కువగా నున్నది. ఏమి చేయుటకుం దోచకున్నది. నిజము చెప్పితినేని అసలే యొప్పుకొనదు. చెప్పకున్న నీ యన్ను మిన్న నన్నుఁ గలియక విడుచునట్లులేదు. మద్భుక్తమగు నీ మగువ యితరున కెట్లు పనికివచ్చును ?

ఆ వృద్ధ బ్రాహ్మణుఁడు కోరిన కోరికయు సమంజసముగా లేదు. ఒక పురుషుండు బెండ్లి యాడిన దానిని దనకుమారుని కెట్లు పనికి వచ్చునని తలఁచనో తెలియదు. రూపవతి మహాపతివ్రత. తన మెడ మంగళసూత్రము గట్టిన నన్నుఁగాక యితరు నంగీకరించునా? అయినను నీ ధర్మసందేహము పెద్దలవలన దెలిసికొని పిమ్మట సందర్భానుసారముగాఁ గావించెదంగాక. అంతదనుక యీ రహస్యము తెలియ నీయక యెద్దియోమిషఁ బన్ని దీనిం గలియకుండఁ గాలక్షేపము జేసెదనని తలంచితిని.

అప్పుడాతలోదరి తనచేతులతో నాచేతులు బట్టుకొని తన కపోలములపై నానికొనుచు మనోహరా! మీ రేదియో ధ్యానించుచుఁ బరాకుగా నుంటిరి. మరియెవ్వరి కయినా నేదియేని మాట యిచ్చి వచ్చితిరా యేమి? ముందుగనే చెప్పుడు. సవరణ గావించుకొనెదనని యడిగిన నేనిట్లంటి.

వాల్గంటీ ? నీవంటి సాధ్వీరత్నము నాకు భార్యగా లభింప నాకు ధ్యానింప నవసర మేమియున్నది. నీవు నన్నుఁ జావునుండి తప్పించితివిగదా ? ఇంక నట్టి యుపద్రవ మేమియునులేదు. నిన్నటి సమావేళన ముహూర్తము మిగిలిపోయినది. కలియుటకై నేఁడును రేపును మంచిలగ్నములు లేవు. మాయింటికిఁ బోయిన తరువాత దిరుగ సుముహూర్తము నిశ్చయించుకొనవలయు నిందుల కై ధ్యానించుచుంటినని పలికిన విని యక్కలికి అగునగు మంచియూహయే. యిప్పుడు మించినదేమియును లేదు. వీపంచిఁబాడెద నాలింపుఁడని పలుకుచుఁ దటాలున మంచముదిగి యందలి బీఠంబున గూర్చుండి పల్లకీగానంబున నా కానందము గలుగఁ జేసినది.

ఆనెపంబున నయ్యంబుజనేత్ర నారెండుదినంబులు నంటకుండ దాటించితిని మూఁడవనాఁడు పెండ్లికూఁతుం దీసికొని యా వృద్ధ బ్రాహ్మణుఁడు బంధువులతోఁ దమయింటికి బయలుదేరి నూరుబండ్లు గట్టించెను. క్రమంబున నర్మదానదీ తీరమున కరుదెంచితిమి. అందు ముందెక్కివచ్చిన యోడలో వారినెల్ల గూర్పుండఁ జేసి యా వృద్ధుడు వేఱొక చిన్న పడవలో నన్నును మఱికొందఱినిం గూర్చుండబెట్టి పయనము సాగింపఁజేసెను. రెండుయోడలు నీటి వేగమునను గాలి విసురునను నతిరయంబునం బోవుచుండెను. నే నున్న యోడలోని వాఱొక్కక్కరే యేదియో మిషఁబన్ని యాపినప్పుడెల్ల నా పెద్దయోడలో నెక్కుచుండిరి. నేనా కపటము గ్రహింపలేకపోయితిని. ఆ వృద్ధ విప్రుండు నావికులకు లంచమిచ్చి నేనున్న నావ ముంచునట్లు నియమించెను. నావికులు పెద్దయోడను దూరముగాఁ బోవనిచ్చి యొకచో నానావను బుడుంగున ముంచి తా మీదుకొనిపోయి యొడ్డెక్కిరి.

నే నీఁత యెఱుంగనివాఁడ నగుట దైవికముగా నాయోడకొయ్య యొకటి నాచేతికి దొరకుటయు దానింబట్టికొని నీటిలోఁ మునుంగక యింతదూరము గొట్టుకొని వచ్చితిని పుణ్యాత్మా? నీవు నన్ను బ్రతికించితివి. ఇది నాకు రెండవ గండము. కృతఘ్నుండయిన యాపాఱుండెట్లు కావించెనో చూచితిరా? అని తనకథ యంతయుం జెప్పుటయు నాలించి విక్రమార్కుండు వాని సుగుణవిశేషముల మెచ్చుకొనుచుఁ బెద్దగా నగ్గించుచు నిట్లనియె.

కేసటా! ఆ బ్రాహ్మణుఁడు నిన్నుఁ గోరినమార్గము ధర్మవిరుద్ధమై యున్నది. నీవు ధర్మపత్నిగా సమంత్రకముగా సాక్షకముగా స్వీకరించిన కన్యకారత్నమును మఱియొకనికి భార్యగాఁ జేయుటయెట్లు? ఈ పని రాజు వినిన శిక్షింప వచ్చును. అది యటుండె. నాసతీతిలకము నిన్నుఁగాక యాతనికుమారు నంగీకరించునా? రూపవతి నీ భార్యయేకాని యతని కోడలుకాదు. ఆ చిన్నది నిన్నుఁ గానక పరితపించుచుండును. నీవు వెంటనే యా గ్రామమరిగి పెద్దమనుష్యులకు జరిగినకథఁ జెప్పి యప్పడంతుకను వెంటఁ బెట్టుకొని రమ్ము. కావలసిన నేనుగూడ సహాయము వచ్చెదనని చెప్పిన సంతసించుచుఁ గేసటుం డయ్యా! నాకు వారిగ్రామమేదియో తెలియదు. ఇందుల సాధనము మీరే చెప్పవలయునని యతని నభినుతింపు చుండెను.

ఇంతలో నాకాశమున నేదియోకోలాహలము వినంబడినది. అది యేమియో యని వారిద్దరు నింగి దిసఁ బరికింపుచుండ నాకసమునుండి యొక పురుషుఁడు వారి ముందరనున్న నర్మదానదిలో గుభాలునఁబడి మునుంగుచుండెను. తటాలున దుమికి విక్రమార్కుండా పురుషునిఁ గూడ బైకి లాగికొనివచ్చి యాయసము వాయ నుపచారము గావించెను. ఆ పురుషుండు సేదతీరిన పిమ్మట వారడుగఁ దన వృత్తాంత నిట్టని చెప్పెను.

దర్పకుని కథ

అయ్యా! వినుండు. నాకాపురము వేణానదీతీరమున నొప్పు రత్నపురము. నేనొక ధనికుని కుమారుండ. నా పేరు దర్పకుండందురు నేనొకనాఁడు. సాయంకాలమున మా గ్రామ సమీపముననున్న వేణానదికిఁ బోయి కాలుజారి యందులోఁబడితిని. శరవేగముగా నా ప్రవాహము పోవుచుండెను. దైవికముగా నా చేతికొక దారువు దొరికినది. దానింబట్టికొని కొట్టుకొనిపోవుచుంటిని. రాత్రియెల్ల నా ప్రవాహవేగంబునం బోయితిని. యెంతదూర మేగితినో తెలియదు. అట్లుకొట్టుకొని పోయిపోయి యొకచోట మారువడిలోఁ బడి యొడ్డునకుఁ జేరియున్న చెట్లగుమిలోఁ దగులుకొంటిని. అప్పుడు తెలతెలవారు చుండెను.

అందతియొక చెట్టుకొమ్మ పట్టుకొని మెల్ల గా గట్టెక్కి నలుమూలలు పరికించి చూచితిని. ఆ ప్రదేశమంతయు మహారణ్యముగాఁ గనంబడినది. క్రూరసత్వముల యార్పులు వినంబడుచుండెను. ఆ భయంకరారణ్యములో నెటుపోవుటకుం దోచక తొట్రుపడుచు నొకమూలకుఁ గొంచెము దూరము నడచితిని. అల్ల తదవ్వులో నొక శూన్యచండికాయతనము నా కన్నులంబడినది. కంటకద్రుమాదుల నతిక్రమించి యెటకే నాగుడిలోనికిం బోయితిని. అందెవ్వరునులేరు. కర్తవ్యతామూఢుండనై యందటునిటు తిరుగుచుండ నింతలో బ్రొద్దు గ్రుంకినది. ఒంటిప్రాణముతో నాఁకలి వేధింప నా గుడిలో నొక మూలఁబండుకొని యుంటిని.

ఇంతలో యోగినులు గొందఱు భయంకరాకారములతో నాకాశమార్గమున నా యాలయములోనికి వచ్చి యొకమూల నున్న నన్నుం జూచి యట్టహాసముజేసి నీ వెవ్వడవు? మానివాసభూమి కెట్లు వచ్చితివి? అని యడిగిన లేచి గడగడలాడుచు జేతులు జోడించి నే నిట్లంటి. దేవతా చక్రవర్తినులారా? మీకు నమస్కారము. నేను మీ చరణంబుల శరణంబు వేడితిని. మీ శరణంబుజేరిన నన్ను రక్షింపక తీరదు. నేను వేదవేదాంగములఁ జదివిన బాహ్మణుని కుమారుండ. నాపేరు దర్పకుండందురు. కాలుజారి నదిలోఁబడి కొట్టుకొనివచ్చి యిందు గట్టెక్కితిని. మీరు నన్ను కాపాడకున్న నే నీయడవిలోఁబడి మడియవలసినదే యని పెద్దతడవు వారికి జాలిపుట్టునట్టు వేడుకొంటిని. వారికి నాపై ననుగ్రహము వచ్చినది. ఆరాత్రి నాకు గడుపునిండ భోజనము పెట్టరి. నూత్నాంబరాలంకారణాదులచే నలంకరింపఁ జేసిరి. ఆ రాత్రి సుఖముగా వెళ్ళినది.

మఱునాఁడు వారిలో వారిట్లు సంభాషించుకొనిరి. మనము నేఁడు చక్రపురంబునందలి యోగినీసభకుఁ బోవలసియున్నది. వీని నిందు విడిచిపోయితిమేని మృగంబుల పాలగును. మనము తిరుగ నెప్పుడు వత్తుమో తెలియదు. కావున వీని వెంటబెట్టుకొనిపోయి యెక్కడనో యునిచి తిరుగవచ్చునప్పుడు తీసికొని వతము. అని నిశ్చయించి యాయోగినులు నన్నరచేతిలోఁ బెట్టుకొని గగనమున కెగసిపోవుచుండిరి. ఆకాశమునుండి వారు భూలోకమునుఁ బరీక్షింపుచుఁ బోవుచుండ నొక నగరములో నొక ధనికునియింట వివాహప్రయత్నము జరుగుచుండుటం దిలకించి నన్నందుంచి యా యోగిను లవ్వలఁ బోయిరి.

అయ్యజమానుని యింట నా రాత్రి వివాహము జరుప నిశ్చయించిరి. పెండ్లికూఁతురు మిక్కిలి చక్కనిది. దానిపేరు సుమన. ఏ కారణముచేతనో యిదివఱకు నిశ్చయించిన పెండ్లికుమారుఁడు సుముహూర్తమునకు రాకపోయెను. ఆ పెండ్లికుమారుఁడు చక్కనివాఁడు కాదని వారిలోఁ గొందఱ కిష్టములేదట. అభినవరూప యౌవన శోభితుండగు నన్నందుఁ జూచి యా యజమానుడు మొదటివాడు సమయమునకు రాకపోయిన కారణంబునంబట్టి వాని యందీసు జనింప నాప్తులతో నాలోచించి వీనిని మనయింటికి భగవంతుఁడే తీసికొనివచ్చెనని సంతసించుచు నాకుఁ జెప్పి మంగళస్నానములు జేయించి యాసుమనను నాకు వివాహము గావించిరి.

హటాత్సంసిద్దమైన శోభనమునకు ముఱియుచు నేను వారింటనుండఁగా నొకనాఁటి రాత్రి మరల నా యోగినీచక్రము చక్రపురమునుండి వచ్చును నాయున్న యునికి తెలిసికొని నన్నె త్తికొని యాకాశమార్గంబున బోవుచుండిరి. అప్పుడు మఱియొక యోగినీగణము వారికెదురు పడియెను. వారికిని వీరికిని మాటలు గలియక జగడము వచ్చినది. అందు యోగినీగణములు రెండును ముష్టియుద్దము ప్రారంభించినవి. ఆ గడబిడలో నేను వారిచేయిజారి యిందుఁ బడితిని. నీటిలో బడుటచే బ్రతికితినికాని లేనిచోఁ జచ్చువాడనే మీరు నన్నీ యాపదనుండి తప్పించిరి. అకారణబంధులైన మీ యుదంతముగూడ వినిపింపుడు సంతసించెదనని చెప్పిన విని నవ్వుచు విక్రమార్కుం డిట్లనియె.

మీ యిరువుర చరిత్రము నొక్క పోలిగనే యున్నది. మీ యిద్దరు చక్కని ముద్దుగుమ్మలం బెండ్లియాడిరి కాని వారి కులశీలనామంబు లెట్టివో యెఱుగ రైతిరి. అని పలుకుచు గేసటుని వృత్తాంత మంతయు నతనికి జెప్పించెను. ఇరువురు నొండొరులం బోలియుంటిమని మైత్రిగలుపుకొని యాపదపాలు గాకుండ నిరువురఁ గాపాడినవాఁ డాతండే యని యెఱిఁగి విక్రమార్కుని స్తుతింపుచుఁ బుణ్యపురుషా! మాకు మా భార్య లెందుండిరో తెలియదు. ఇప్పుడు మేమేమి చేయవలయును? కర్తవ్య ముపదేశించుఁడని వేడుకొనిరి.

నేనొక పనిమీఁద బోవుచున్నాను కానిండు. మిమ్ము భార్యలతోఁ గలిపియే పోయెదం గాక నడువుఁడని యా యాగ్రామముల గురుతులు మఱియు మఱియు విని యొకమార్గంబునబడి పోవుచు వారితోఁ గూడ గొన్ని పయనములు సాగించెను. ఒకనాఁడు సాయంకాలమున కొక యగ్రహారమునకుఁబోయి యొక గృహస్థుని యఱుగమీద బండుకొనిరి.

అప్పుడా యగ్రహారమున గొప్ప వివాహము జరుగుచుండును. ఆ పెండ్లికి నానాదేశములనుండి బ్రాహ్మణులు పెక్కండ్రు వచ్చియుండిరి. అనేక మహోత్సవములు సేయుచుండిరి. నాఁడు రెండవదివసము రాత్రి యేదియో నాటక మాడించఁ దలంచుకొని భోజనములు పెందలకడ గావింప గ్రామస్థులఁ బిలుచుటకు బంధువులు కరదీపికలతో బయలుదేరి తిరుగుచు నా పరదేశుల మువ్వుర నొకయరుగుమీదఁ జూచి లెండు లెండు వంటలైనవి. నేఁడు పెందలకడ భోజనములు కావలసి యున్నవని లేపుటయు వారు మేము పరదేశులము. మాదీయూరు కాదని యుత్తరముజెప్పిరి.

అయ్యో! మీరు పరదేశులైన నేమి? ఇందా భేదము లేదు. మీరు తప్పక భోజనమునకు రావలయును. మా యజమానుఁడు బంధువులకన్నఁ బరదేశులనే యెక్కువగా మర్యాదజేయును. తప్పక రావలయునని గట్టిగా నిర్భదించి యప్పుడే వారిం బెండ్లివారింటికిఁ దీసికొనిపోయి మడిపుట్టములిచ్చి యొకచోఁ గూర్చుండబెట్టిరి.

భుజించునప్పుడు కేసటుఁడు విస్తళ్ళలో వడ్డించిన పదార్థములఁ జూచి యచ్చెరువందుచు దాపుననున్న మఱియొక కూఱునతో నయ్యా ఈ యజమానుం డెంత భాగ్యవంతుఁడేమి? ఇన్ని పిండివంటకములఁ జేయించెనని యడిగిన నతండిట్లనియె.

ఈతండు మొదట దరిద్రులలో దరిద్రుఁడు. దైవికముగావచ్చి వారింటఁ గాంచనవర్షము గురిసినది. ఇప్పు డితనికిఁ జాలిన భాగ్యవంతుఁ డీ దేశములో లేడు. వినుం డీయన కుమార్తె యెత్తు బంగారము కన్యాదాన సమయంబున దూచి వరున కిచ్చుటయేకాక మితిలేని కట్న మర్పించెను. కూఁతురు పుట్టునప్పు డట్లు మ్రొక్కికొనిరఁట. దాని యాచించుటకై విక్రమార్క మహారాజు నొద్దకుఁ బోవుచుండ దారిలో నెవ్వఁడో సిద్ధుండు గనంబడి రసాయాన మిచ్చెనట. దానివలన లోహము లన్నియు బంగార మగుచున్నవి అని చెప్పుకొనుచున్నారు. వీరికి బంగారమునకుఁ గొదవ యేమి? అట్లు జరిగిన నేనింతకన్న నెక్కువగా బిండివంటకములఁ జేయింతునుగా.

అది యిట్లుండె. పీతాంబరము ధరించి నేతి నొడ్డించు నా పాఱుం జూచితివా ? ఆతఁడే కన్యాదాత. వాని కెన్ని యేండ్లుండునో చెప్పుకొనుడని యడిగిన గేసటుండు పూర్ణ యౌవనములో నున్న వాఁడు ముప్పది యేండ్ల లోపువాఁడని చెప్పెను. పక పక నవ్వుచు నాయనకుఁ దొంబదియేండ్లున్నవి. ఆ సిద్ధునివలననే వీనికి యౌవనముగూడ సంప్రాప్తించినది. మున్నుజూచిన వారీతని నిప్పుడు చూచిన మిక్కిలి వెఱఁగుపడక మానరు. అని వాని వృత్తాంత మంతయుఁ జెప్పెను.

విక్రమార్కుండు ఆ విప్రుని బరికించి చూచి రసరసాయన ప్రభావముల నగ్గించుచు నా వస్తువులు సత్పాత్రహస్తంబునం బడినందులకు మిక్కిలి సంతసించెను. భోజనానంతరము వారు మువ్వురును వెనుకటి యరుగుదగ్గరకుఁబోయి పండుకొనిరి. ఆ సమయంబున మఱికొందఱు విప్రు లవ్వలి యరుగుమీదఁ బండుకొని యిట్లు సంభాషించుకొనిరి.

దీక్షితులు - సోమయాజులుగారూ ! మీరు చాల దూరమునుండి వచ్చితిరి గదా కన్యాదాత మిమ్ము బాగా సత్కరించెనా ?

సోమయాజులు - దీక్షితులుగారా ? కన్యాదాత చాల తెలిసినవాఁడు. కన్యాదాన సమయంబున విద్వాంసుడన్న వారికెల్ల సువర్ణదానము గావించెను. దూరం నుండి వచ్చితిననయో గొప్ప సంస్కారి ననియో నాకు నేబది తులముల యెత్తుగల బంగారు గంటమునిచ్చెను.

దీక్షి – మీ కిచ్చినది తక్కువయే! విశ్వపతి శాస్త్రికి బంగారుగునపమునే యిచ్చెనఁట. ఇదంతయు రసాయన ప్రభావమని చెప్పుచున్నారు. ఇవి చివరి కినుప ముక్కలై పోవునేమో ?

సోమ - ఆలాగునా ? అందరకన్న నాకే యెక్కువగా నిచ్చెనని తలంచు చుంటి నట్లయినఁ గ్యదాత తారతమ్య మెఱుఁగనివాడే.

దీక్షి – సరి సరి. విశ్వపతియనఁగా సామాన్యుడనుకొంటిరా యేమి ? ఆరు శాస్త్రములు క్షుణ్ణముగా నెఱింగిన బ్రోడ. ఆ యీవియందు లోపములేదు.

సోమ - చివరకు మీరననట్టివి యన్నియు నినుపముక్కలై పోవునేమో ?

దీక్షి - ఏది యెట్లయిన నీరీతి ఇదివఱకు మన బ్రాహ్మణులలో నిచ్చిన వారు లేరు. మా యగ్రహారములో రత్నపాదుడను బ్రాహ్మణుఁడుగూడ గూతురు వివాహమునకు విద్వాంసుల సత్కరించెగాని సంసారిపక్షముగా నున్నది.

సోమ - మీ దేయూరు.

దీక్షి – నర్మదానది కవ్వలనున్న మణిసౌధమను యగ్రహారము. పాపము మా రత్నపాదునకు గొప్ప యాపదయే తటస్థించినది. అల్లునితో గూఁతురు నత్తవారింటి కనుపుచుండ దారిలో నర్మదానదిలో బడి యల్లుండు మృతినొందెనఁట. రూపవతి పుట్టినది. దాని చక్కఁదనము దాని గుణము మిగుల స్తోత్రపాత్రములు. దాని కైదువతనము కొఱఁతగాజేసిన భగవంతుని నిందింపవలసినది.

సోమ – సరి సరి. మా గ్రామములో నిట్టివింతయే జరిగినది. సుందర సేనుడను బ్రాహ్మణుండు తనకూఁతురు సుమనయను దానికి వివాహ ప్రయత్నములు చేసి తొలుత నిశ్చయించిన వరుండు రాకపోవుటచే నెక్కడనుండియో వచ్చిన యొక బ్రాహ్మణకుమారున కిచ్చి పెండ్లి జేసెను. ఆ మఱునాఁడే యాత డెందఁబోయెనో తెలియదు. పెండ్లికూఁతురు భర్త గనంబడనందులకు మిక్కిలి దుఃఖించుచున్నది. తరువాత నేమి జరిగినదియో నాకుఁ దెలియదు. ఇంతలో నీ వివాహమునకు వచ్చితిని.

సోమ - ముక్కు మొగ మెఱుంగనివానికిఁ బిల్లనిచ్చిన నేమిజరుగను ? అందులకే మనవారు కలసిన సంబంధములే చేయుమని చెప్పుచుందురు.

దీక్షి - అదిగో మృదంగధ్వని వినంబడుచున్నది. నాటకము ప్రారంభించిరి కాఁబోలు. మీరు చూడవత్తురా నేను బోవుచున్నాను బాబూ.

సోమ - నా కాయాసముగా నున్నది రాలేను.

అని వారు మాట్లాడికొనిన మాట లాలించి విక్రమార్కుండు బాగు బాగు. వీరి మాటలవలన రూపపతీ సుమనల గ్రామనామములు దెల్లమైనవి. వీరిని భార్యలతో గలుపుట యీమాటు సులభమేయని యాలోచించుచు వారివలన మఱల నా గ్రామములకు దారులడిగి తెలిసికొని యా వార్త వా రిద్దరికిఁ జెప్పి నేను రేపా రెండు గ్రామములకుఁ బోయి మీ భార్యల తావుల దెలిసికొనివచ్చెద. మీరిందే యుండుడు. కాలినడకం బోయిన జాలదినములు పట్టును. అశ్వయానమున నాలుగు మూఁడు దీనములలోఁ జూచి వచ్చెదనని చెప్పి యా రాత్రి గడిపి మఱునాఁడు గుర్రమెక్కి యరుగఁబోవు సమయంబున నేమిటికో యా కన్యదాత యా వీథికి వచ్చి గుర్రమును గురుతుపట్టి తనకు రసరసాయనము లిచ్చిన దివ్యపురుషుం డీతఁడే యని గ్రహించి విక్రమార్కుని బిగ్గరగా నాలింగనము జేసికొని మహాత్మా! ఈ వైభవమంతయు నీ దానమహత్వముననే కలిగినది. నే నెట్లుంటినో చూచితిరా ? మీరు సమయమునకు వచ్చితిరి. మా యింటికి రండని ప్రార్థించుచు నందున్న వారికెల్ల నతని వృత్తాంతము వెల్లడించెను.

జనులు గుంపులుగా మూగికొని వింతగాఁ జూడఁ దొడంగిరి. అప్పుడు విక్రమార్కుఁ డాలోచించి అయ్యా ! నేను మీ రెవ్వరో యెఱుఁగను. నేను మీ కేమియు నీయలేదు. నన్ను మీరు మఱియొకరనుకొను చుంటిరని గద్దించి పలికి గుర్రమెక్కి యవ్వలికిం బోయెను.

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ తరువాతి నివాసదేశంబున నిట్లు చెప్పఁదొడంగెను.

207 వ మజిలీ

విక్రమునిదేశయాత్ర కథ

మాణిభద్రుడు - ప్రేయసీ! నీ యక్కకూఁతురు త్రిపురసుందరికి వివాహసన్నాహ మంతయుం గావించి విక్రమార్కునిం దీసికొని వత్తునని జెప్పి యూరక వచ్చితివేల ? ఇంతకాల మెందుంటివి?

మదనమంజరి - ప్రాణేశ్వరా! నే నిందుండి యుజ్జయినీపురంబున కరిగితిని. అమ్మహారాజు గ్రామములో లేకపోయెను. ఉత్తరదేశమందలి వింతవార్తయేదియో విని దానింజూచుటకై బయలుదేరి దేశాటనము జేయుచున్నాఁడని వింటి. వెంటనే యతనిజాడలు దీయుచు నేనును వెనువెన్క నాతఁడు దిరిగిన దేశములన్నియుం దిరిగితిని. ఆహా ! ఆ మహారాజు గావించిన చర్యలు వినిన మఱియు విస్మయము గలుగు చున్నది.