Jump to content

కాశీమజిలీకథలు/ఏడవ భాగము/133వ మజిలీ

వికీసోర్స్ నుండి

యిచ్చుటకు నిశ్చయించితిమి అని యేమేమో చెప్పఁబోయిన నలుకమెయిఁ జాలుఁజాలు నీకతంబున నీముప్పు వాటిల్లినది శౌర్యవంతుని సంబంధము దెచ్చినవాఁడవు నీవు వత్సుఁడు వట్టి నిర్భాగ్యుఁడట. దర్మరతి విరతిని వానికిచ్చుట కంగీకరించినదికాదు. ఇప్పుడు శౌర్యవంతుని రావలదని ప్రత్యుత్తరము వ్రాయుము.

అనుటయుఁ గుశుఁడు తండ్రీ ! యిట్లువ్రాసిన నతనికిఁ గోపము రాదా! వాఁడలి గిన మనము నిలువఁగలమా? వాని కుమారుఁడు క్రూరుఁడని చెప్పినవారు శత్రువులు వాఁడు శౌర్యముకలవాఁడు మంధుఁడుగాడు దానంజేసి తీవ్రచిత్తుఁడువలెఁ గనంబడు నని మందస్వరముతోఁజెప్పిన విని చంద్రగుప్తుండు పోపొమ్ము నీకపటమంతయుం దెలిసినది. పెద్దవాని దేశముల పాలుజేసితివి. విరతికి నీచుం దెచ్చితివి. తెలియక నీమా యలకుఁ జిక్కితినని పలుకుచు వానిమాటలు వినిపించుకొనక తాను జేయఁదలచుకొనిన పని యొరులకుం దెలియనీయక విచారముఖముతో నిజనివాసమునకు బోయెను.

అని యెఱింగించువఱకు వేళ అతిక్రమించుటయు మణిసిద్దుండు తదనంత రోదంతం బవ్వలిమజలీయం డిట్లు చెప్పందొడంగెను.

133 వ మజిలీ.

జంగమ దేవరకథ

తెల్లవారి యెనిమిది గడియలకు ముహూర్తముంచఁబడినది. నిరూపించిన వత్సున శౌర్యవంతుని రావలదని యుత్తరములు వ్రాసిరి. వారెవ్వరును రాలేదు. రతిం బరిగ్రహింప సుకుమారుఁడు మహావైభవముతో నూరేగుచున్నవాఁడు మంగళవాద్యము లచేఁ బట్టణమంతయుఁ బ్రతిధ్వనులలిచ్చుచున్నది. విరంతిగూడ బెండ్లి కూతుం జేసిరి. పురోహితులు వివాహవేదికలపైఁ బెండ్లి పీటలు రెండునువైచి మంగళ సంస్కారములు గావించుచున్నారు విరతికి వరుఁడెవ్వఁడో తెలియదు. విడిది యెరుకపడదు. ఊరేగింపు జాడఁ గన౦బడదు ఇది కడువింతగా నున్నదని పరిజనులు బంధువులు ఆప్తులు గుజ గుజలాడుచుండిరి. కొందరు అడుఁగబోయి, నృపతి ముఖవైలక్ష్యము గనిపెట్టి యూర కొనిరి. కొందరు తొందరయేల పెండ్లి వేళ చూడమాయని యుపేక్షించు చుండిరి.

అరుణోదయమైనది. దెసల జీకటులంతరించుచున్నవి. పక్షులు గూయుచున్నవి హజారమున కాలసూచకములగు భేరీథ్వనులుమ్రోగుచున్నవి. అట్టితరి జంద్రగుప్తుఁడు స్నానముజేసి నిత్యకృత్యములు దీర్చుకొని తురగారూఢుండై మంగళవాద్యములతో రత్నాలపల్లకీ దనవెనుక వచ్చునట్లు నియమించి యుత్తరగోపురము దెసకరిగెను.

ఎక్కడనుండియో క్రొత్త పెండ్లి వారు రాఁగలరని వారిం దోడితేర రాజరుగు చున్నాడని నిశ్చయించి తమ్మెవ్వరిం బిలువకున్కి శంకించుకొనుచుఁ గొందరు బంధు వులు చూచివత్తముగాక యని పల్ల కీకి వెనుక వెనుకగాఁ జనుచుండిరి. అమ్మహారాజు సూర్యోదయమునకు నుత్తరగోపుర సమీపమున గుఱ్ఱముపై నిలువంబడి యామార్గ ముపైఁ జూడ్కులు వ్యాపింపఁ జేయుచున్నంత.


సీ. కంచుఘంటికయు శంఖంబు లంకే దగిల్చి
                  మూపునవ్రేలాడ ముందువెన్క
    నెమలియీకెలవన్నె లమరంగ మకుటంబు
                  వలెఁదల మెలిపాగ వాసిజెంద
    శంభులింగాంక భాస్వరములౌ నిత్తడి
                  బిళ్ళలంగరములందెల్ల మెఱయ
    మూఁడరల్‌ బిగిజాలు మూతి గల్గినగంత
                 గుడ్డ జోలిని జంకకునుఁ దగిల్చి

గీ. భూతిపైఁ బెద్దగంథపు బొట్టువెట్టి
    పీలికలతోడి మేలియంగీలు గ్రాల
    ప్రాయమెట్టిదొ తెలియంగబడనియట్టి
    జంగ మొక్కఁడు వీటఁబిచ్చంబు గొనఁగ.

పట్టణాభిముఖుండై వచ్చుచుండెను. ఆజంగమువానింజూచిరాజు గుండెఝల్లుమన హా ! విరతీ ? నీకెట్టిగతి పట్టినది. మహారాజు కడుపునం బుట్టియు నీవీబిచ్చగానిం బెండ్లి యాడవలసివచ్చినదా? ఇది యంతయు నీతల్లివలనం గలిగినముప్పుదానికీశాస్తి కావల సినదే. అయ్యో? ఒకరిపైఁ గోపమున నొకరికి నపకారము తల౦పవచ్చునా అక్కటా? ఇందులకు నేనేమిచేయువాఁడ విధిపరిపాక మిట్లున్నదికాబోలు , చేసిన నియమము తప్పుట మహాపాతకముగదా. ధర్మరతియు నిందులకు వ్యతిరేకమునకు సమ్మతింపదు, కానిమ్ము? అట్లే చేసెదనని యారాజు కొంతసేపు శోకము, కొంతసేపు పరితాపము కొంతసేవు క్రోధము. అభినయించుచుఁ దన్నుసమీపించియున్న పరిజనులతో నావచ్చు జంగమదేవరను పల్లకీనెక్కించి యూరేగింపుచుఁ బెండ్లి పందిరికిఁ దీసికొని రండని నియమించి దీనముఖుండై తానంతఃపురమునకుఁబోయి భార్యంగాంచి జరిగిన కథ యెఱింగించి యిప్పుడేమి చేయమనియెదవు? వానికి విరతినిచ్చి పెండ్లి చేయు దువా? అని యడిగిన కన్నుల బొటబొట నశ్రువులుగారఁ బరితాప మభినయించుచు నిట్లనియె మహారాజా! విరతి సన్యాసురాలు దానికెట్టిమగఁడై ననేమి? వత్సునికన్న నెవ్వఁడైన లెస్సయేయని చెప్పితినిగదా. పోనిండు మీ సంకల్పమెట్లో యట్లే జరిగినది. దానికి మంచి మగనిఁ దీసికొనిరాదలంపు మీకుఁ గలిగియున్న నిట్టిప్రతిజ్ఞ యేమిటికిఁ జేయుదురు? ప్రొద్దుటఁ బురిలోనికి వచ్చునాఁడు చక్రవర్తి కుమారుడగునాయేమి. కానిండు జంగమదేవర మంచివాఁడే పరమేశ్వరుఁడట్టి వేషమునవచ్చి నాకూఁతు నేలఁ దలఁచుకొనెనేమో. యెవ్వరిపుణ్యమెవ్వఱెఱుఁగుదురు? వానికే పెండ్లి చేయుఁడని నతినిష్టురముగా నెత్తిపొడిచినది.

ఈలోపలఁ బరిజనులు రాజాజ్ఞ వడువున సుగతుండను పేరుగల నా జంగమ కుమారుని బల్లకీనెక్కించి నగరిలోనికిఁ దీసికొనివచ్చిరి.

రాజు రతిసుకుమారుల వివాహము మహావైభవముతోఁ గావించెను. విరతికి లోపలనగరిలో గుప్తముగా సుగతునకిచ్చి పెండ్లి జేసెను. అట్టితఱి బంధుగులందఱు కన్నీరుగార్చుచు విరతిని వానికిచ్చిన కారణము తెలిసికొనజాలకపోయిరి. నీమగఁడు జంగము జంగము అని రతియు గుశుఁడును బాలురచేత నాక్షేపణ చేయింపఁదొడం గిరి. మాట మాటకు వెక్కిరింపుచుండిరి. జోగురాలు జంగము వేదాంతులు బిచ్చ మెత్తుకొనుచు దేశాటనము చేసికొనవచ్చునని నిత్యము పరిహసించుచుందురు.

ఆమాటలువిని విరతి యించుకయు మతిజెదరనీయక పాంచభౌతిక వికారమగు కాయమునకు సౌందర్యమననేమి. కులమననేమి? పరమేశ్వరుఁడే భర్త యతఁడే రక్షింపఁగలడు. అని తలంచుచు నొరులకేమియుఁ బ్రత్యుత్తరమీయదయ్యెను.

రతియొకనాఁ డశ్వశకట మెక్కి వచ్చి విరతీ? పూవులతోటకు విహరింపఁబోవు దము వత్తువా? నీమగఁ డెందుంబోయెను? గ్రామముల మీఁది కరిగెనాయేమి? గంట వాయించగలవా? శంకుబూరింతువా? వేదాంతురాలవు. నీమదికి సరిపడిన మగఁడు దొరికెనులే వేదాంతాభ్యాసమున కిదియే ఫలము అని వెక్కిరించిన విరతి నవ్వుచు నీది జవ్వనము క్రొవ్వు. యుక్తాయుక్త వివేకము గలుగనీయదు అక్కా ఈ యౌవనము ఈసంపదలు ఈదేహము జూచుకొని మురిసెదవేమిటికి? ఇవి క్షణభంగురములని తెలిసిన నిట్లు విఱ్ఱవీగవుగదా? అయ్యో అమ్మ పాలుద్రావియు మీరిద్దరు నింత దుష్ట స్వాంతులైతిరేమి? జ్ఞానలవశూన్యులై ప్రాజ్ఞుం నాక్షేపించుచున్నారు. వేదాంతముమీకు హాస్యాస్పదమైనదా అక్కటా? మీకొరకే నేను బొక్కుచుంటి పోపొమ్ము. మగనితో నీవు సుఖించుట నాకుఁ బరమసంతోషము అని పలికిన నులుకుచు నక్కలికి మఱల మఱల నెత్తిపొడుపుమాట లాడజొచ్చినది. ఇరువురకు వాదము జరిగినది.

అప్పుడు రాజపత్ని రతి నాక్షేపించుచు నవ్వినయూళ్ళె పట్టణములగును ఎవరినొసట నేమివ్రాయబడినదో యెవ్వరికిఁ దెలియును? తొల్లి శర్యాతికూతురు సుకన్యయను పతివ్రత శతవృద్దుడైన గ్రుడ్డితపసిం బెండ్లియాడి యింద్రభోగంబుల నందలేదా నిరతియునట్లె సుఖింపఁగలదు నీవు వేగిరపడమని రతి నాక్షేపించి మంద లించినది. మఱియొకనాఁడు కుశుఁడు సుకుమారు నేకాంతముగా జీరి బావా! యీజంగ మదేవర మూలమునమనకపకీర్తి గలుగుచున్నది. ప్రతిసభకు వచ్చిమనతో సమముగాఁ గూర్చుండును. మాతండ్రికి వానియందు బ్రేమగలుగుటంబట్టి యేమాట యనుటకు వీలుపడకున్నది. యీయవమాన మెట్ల యినవదలు నుపాయమాలోచింపవా? అని అడిగిన సుకుమారుండిట్ల నియె.

అయ్యో? నీవు రాఁబోవు ననర్థమెఱుంగక సమానప్రతిపత్తిఁ గలుగుచున్నదని వగచుచున్నావు. వినుము మీతండ్రి విరతికి మగనికి నర్ధరాజ్యము వ్రాసియిచ్చుటకు నిశ్చయించుకొనియెను. మొన్న పండితుల రప్పించి థర్మశాస్త్రములు విప్పించి యా ప్రశంస దెలిపెను. వారు కూఁతున కెంత యిచ్చినను నీయవచ్చునని చెప్పిరి. ఈప్రశం సను నీకుఁ దెలియకుండఁగనే చేయుటకు నిశ్చయించుకొనియెను. లవునిభాగము జంగమదేవరకిచ్చునఁట తెలిసినదియా? అని చెప్పినఁ గుశుఁడ్యువిభ్రాంతుడై యేమీ? మీరాజ్యమవిభాజ్యముగారా? ఒకరికిచ్చుటకుఁ దనలేమి అధికారమున్నది? అందులకు థర్మశాస్త్రములొప్పుకొనునా? అని అడిగిన నతండు చట్టములు చూచియే యిచ్చుటకు నిశ్చయించుకొనెను. అతండిచ్చిన నీవేమియుఁ జేయజాలవని చెప్పెను.

అప్పుడించుక యాలోచించి కుశుండు బావా! ఇందులకు నీవు సహాయము జేయవలయును. ఈపని జరుగకుండ వేరేదియేని యుపాయము జెప్పవలయును. మాయన్న లవుని మాయజేసి దేశాంతరమనిపితిని వీండ్రంగూడనట్లు చేసితిమేని మన కోరిక యీడేరును. ఇందులకుపాయమాలోచించుమని సూచించిన విని సుకుమారుం డిట్లనియె.

నీకుఁదెలియని యుపాయములులేవు అన్నను సాగనంపినట్లె వీరిద్దరిని దేశ ముల పాలుసేయుము. రాజు విరక్తుండై యేమిజేయఁగలడు? రాజ్యమంతయు నీకే దక్కఁగలదని చెవిలో నేదియో చెప్పెను కుశుఁడు మిగుల నానందించుచు నట్లు చేయుటకు సమ్మతించెను.

మఱికొన్నిదినముల కొకనాఁడు విరతి మహారణ్యమధ్యమున నొకచెట్టు కింద బరుండి లేచి కన్నులఁదెరచి ఆహా? ఇదియేమిమాయ అంతఃపురమేమైనది? ఇది కల కాదుగద అడవిలో నుంటినేమి? అని వెరగుపాటుతో నలుదెసలు పరికించెను. సూర్యుఁడు నాలుగుబారలు పైకిఁ బ్రాకెను ఇంకను వరుణకాంతులగానే యుండెను. దిగ్భ్రమజెంది అయ్యబల యోహో ఇది స్వప్నముకాదు. పరమేశ్వరుని యింద్ర జాలము. ఇదియే మహామాయ. యేమైన నాకేమి? వినోదములు జూచెదంగాక పర మేశ్వరుని సృష్టివైచిత్ర్య మమ్మహాత్మునిశక్తి విశేషమును దెలుపుచున్నది. అని తలంచుచు విరతిలేచి నాలుగడుగులు దూరము నడిచినంతఁ గొంతదూరములో సుగ తుఁడు తనకభిముఖముగా వచ్చుచున్నట్లు గహించినది.

ముక్కుపై వ్రేలిడుకొని జగదీశ్వరా ! వింతలపై వింతలుచూపుచుంటివే మాశుద్ధాంతమే కాంతారమైనదా! మాతల్లియేది? ఆమెయే ఈమాయ నాకుఁ జూపు చున్నదా. ఏదియెట్లయినను సరియే చూచుచుండెదనని తలంచుచుండ నతండు ఆమె దాపునకు వచ్చెను. అతండు మంగళసూత్రము కట్టుటయేకాని అంతకుమున్నామెతో మాట్లాడియుండలేదు. కావున బెదరుగదుర రాజపుత్రీ మనమిక్కడికెట్లు వచ్చితిమని యడిగెను. ఏమో తెలియదు భగవంతుని విలాసమని హస్తసంజ్ఞ చేసనది. కాని యేమియు మాటాడలేదు. ఆసన్న గహ్రించి యతండు మరుమాటపలుకక యామెతో నడుచుచుండెను. పోయినకొలది మహారణ్యమేకాని తెరిపి యేమియుఁ గనంబడలేదు గ్రామసంచార యోగ్యములైన పశువులు, పక్షులును, మృగములు నందేమియుఁ గనం బడలేదు. విరతిమతి భీతి యున్నట్లేలేదు. విరతి యెటుపోయిన సుగతుం డటుపోవుటయే గాని తాను మార్గదర్శికాఁడు ఇరువురకు సంభాషణలేదు. మూఁగవాండ్రవలె నడుచు చుండిరి. అట్లు పోవంబోవ దినమణి గగనార్థం బాక్రమింప నెండవేడిమి‌ సైరింపక నిలువఁదగునీడతలం బరయుచుండ నొకదండఁదాళ దఘ్నంబైన హ్రదంబొండువారి కన్నులం బడినది.

పిపాసాలసులైన యాదంపతులకు యరసినంతనే జీవనప్రదమైనది జీవన ప్రదమైన నెట్టియానందముగలుగునో తెలియదు. ఆకూపంబు తొంగిచూచిరి జలంబులు లోతుగానున్నవి. అత్తుయంబు ద్రావు నుపాయంబుగానక తొట్రుపడుచున్న సుగతుని దైన్యంబు దిలకించి అక్కలికి యందున్న చిఱితాటియాకుఁ జీరి త్రాడువలెగూర్చి యతని జెంతనున్న గంటత్రిప్పి యుచ్చుబిగించి నీరుతోడి వానికి బోసినది.

అతండు పదిగంటల నీరుద్రావెను. ఆమెయు దప్పిదీరునట్లు జలపానము గావిం చినది. పిమ్మట నానూతిచుట్టు తిరిగి అందలి వింతలం జూచుచుండఁ బిశాచభాషతో నొకశిలపై నీక్రిందిరీతిశాసనము చెక్కఁబడియున్నది. పిశాచభాష విరతి చదివి యున్న౦దున నాశాసనము నందలి విషయంబుల నిట్లు చదివినది.

ఈ ప్రాంతమందున్న కీలకపర్వతమందు ఛండవేగుఁడను భూతరాజుభార్యతోఁ గాపురము చేయుచున్నాఁడు. అతం డర్దరాత్రంబున నిందలి శిలాఫలకంబునం గూర్చుండి మాంసాహారము భుజించి కూపోదకమంతయు దృప్తిగా గొట్టమునగ్రోలె డివి. జలశూన్యమైన నూతిలో మెట్లుగనంబడును. వానిదిగిపోయినఁ బాతాళలోకము నకుఁ బోవుదురు. మరునాఁ డుదయమునకు యధాప్రకారము జలమూరి నూయి నిండును. అప్పుడప్పుడీ భూతదంపతులు పాతాళమున కీదారిం బోవుచుందురు. ఈ ప్రాంతమందు రాత్రుల మనుష్యులు నిలువఁగూడదు. నిలుతురేని వారలకు గబళము లయ్యెదరు.

అని పిశాచభాషలో వ్రాయఁబడియున్నది. ఆలిపిఁజదివి యమ్మదవతి ముదము జెంది యాప్రాంతమందున్న యొక చెట్టుక్రిందఁ బండుకొని తత్సమయ మరయు చుండెను. సుగతుండును వెలగపండ్లు కొన్ని కోసికొనివచ్చి తాను దిని కొంతయాకలి యడగించుకొనియెను.

విరతి యొక్కటియుఁ దినినదికాదు. సుగతుఁ డామె వసించిన చెట్టుక్రిందనే దానును వసియించెను. సుగతునకు శిలాశాసనవిషయము లేమియుం దెలియవు. కౄరమృగములేవై న వచ్చునప్పుడు గంట వాయించి శంఖమూదువాఁడు. అందుకు జడిసి యవిపారిపోవుచుండునవి

అవి చీఁకటిరాత్రులగుటఁ గాటుకపూసినట్లు దెసలెల్ల నంధకారమయమై యున్నవి. సుగతుండు వెంటనే నిద్రబోయెను విరతి నక్షత్రగమనము పరీక్షించుచు నిద్రబోక భూతాగమనకాల మరయుచుండ రెండుజాములై నది. అప్పుడు పొలుసు కంపుగొట్టినది ఆవాసన తగిలినంత నాకాంతకు స్వాంతమునఁ బెదురుదోచినది మనం బున బెక్కులూహలు దోచినవి. అయ్యో? ఈసుగతుఁడు నావలన నించుకయు సుఖ మెరుంగకున్నను విశ్వాసముగలవాఁడుంబోలె వెనువెంటఁ దిరుగుచున్నాఁడు. వీనికిని లోకానుభవ మంతగానున్నట్లు తోచదు. నావలెఁ దానును మౌనముద్రయె బూని యుండెను. కాని నన్నేమియు బల్కరించడు నాదాపునకు నేను వగవను గాని నాకతంబుననీతడిందు సమయగలఁడు అది నామది నెఱియఁజేయుచున్నది. ఆభూతము నన్నుఁ జంపి వీనిని విడిచినఁ గడు సంతసింతును అట్లుచేయఁదు అయ్యో? వీనికి సంగతియైనఁ జెప్పితినికానే పాపము గుఱ్ఱుపట్టి నిద్రబోవుచున్నాఁడు. ఆ భూతమువచ్చి క౦ఠము నులిమి చంపునుకాబోలు హరహరా ! ఎంత పాపాత్మురాల నైతిని అని పరితపించుచు మఱియు నిట్లు తలంచెను.

ఇసిరో! నేనెంత నెర్రియూహ చేయుచుంటిని. విధికృతములు నాపైనారోపణ చేసికొనుచుంటినేమి? ఈకల్పన జేసినవాఁడెవ్వఁడు? నన్నీ అరణ్యమధ్యమునకుఁ దీసికొనివచ్చినవాఁడెవ్వఁడు? వాని యుద్యమమేమియో తెలియదు. మాచరిత్రమింత టితో ముగించునో పెంచునోయెఱుక పడదు. జరుగునది చూచుచుండుటయే నాపని. అని తలంచుచు మొదటఁ గలిగిన భయమును జింతయుఁ బాపికొని యా పొన్ని కొమ్మ కొమ్మల సందునుండి వానిరాక నరయుచుండెను. అంతలో నాపర్వత ప్రాంతమునుండి గండశిలవంటితలయు గహ్వరమువంటి వదనబిలము గుహాబిలమునుండి ప్రవహించుచు రక్తప్రవాహమోయను భ్రాంతి గలుగఁజేయు నాలుకయు వాడికోరలు జుంజురు వెండ్రుకలు పొట్టిచేతులుంగలిగి తాళడ్వయో భ్రాయకాయముతో బొబ్బలిడుచు వచ్చుచున్న యాభూతరాజు విరతి కన్నులం బడియెను. చీకఁటికిని వాని మేనికాంతికి నించుకయు భేదములేదు. కోరల తెలుపును, నాలుక యెఱుపునుంబట్టి శిరంబు గ్రహింపఁబడినది వాని వికృతాకారము జూచి యీచిన్నది కన్నులుమూసికొన్నది, అంతలో మఱలఁజూచినంత నావికృత రూపము కొంతతగ్గినది. చేరువకు వచ్చినకొలఁది వానియాకారము హ్రస్వమగు చుండెను. తుదకా శిలాఫలకము చెంతకు వచ్చునప్పటికా భూతమొక సామాన్యమాన వుఁడువలెఁ గనంబడెను.

అభూతరాజు శిలాఫలకమునఁ గూర్చుండి ప్రేయసీ! ప్రేయసీ! యెందు న్నావు ఇంకను వచ్చితివికావేమి యని పిలిచెను. నూతిలోనుండి వానిభార్య గొట్టము పైనున్న మెట్లెక్కివచ్చి ప్రాణనాధా! నేడు జాగు చేసితిరేల? మీరు రాలేదుగదా? ఊర కుండనేల? జలజంతువులేమైనం దొరుకునేమోయని నూతిలోనికిం బోయితిని. ఏమి యుం దొరికినవికావు మీరాహార మేమి తెచ్చిరి? నరమాంసము లభ్యమైనదియా? యని యడిగినది.

అతండు పక్కున నవ్వుచు జవ్వనీ! నేడు ఒట్టుపెట్టినట్టేమియుం దొరికినది కాదు. నరమాంసమటుండనిమ్ము. కుక్క మాంసమైనదొరకలేదే! ఇదియేమిచిత్రము; నీవేమైన సంగ్రహించిన మాంసమున్న దేమో తీసికొనిరమ్ము కడుపు మండిపోవు చున్నది. ఇట్టియాకలి యెప్పుడు వేయలేదు. రామరామ యేతాటిచెట్టు చెంతకుఁబోయి నను వట్టికండలే దా? నాలుక తడుపుకొనుటకై నఁ గల్లుచుక్క దొరి‌కినదికాదు అని చెప్పిన వాని భార్య నిట్టూర్పు నిగుడించుచు నిట్ల నియె.

అయ్యో? మీరు ఆహారము తీసికొనివత్తురనిగంపెడాసబెట్టుకొని యుంటిని. అదియేమిపాపమో నాకును నేడే యాకలి పెద్దగానున్నది. ఏదియును దొరకక పోవు టచేతఁగాఁబోలు ఏమి చేయుదము? నూతిలో నీళ్ళుగలవుగదా కడుపునిండ గ్రోలుదము అనియుత్తరమిచ్చినది.

అక్కటా! పరగడుపున వట్టి నీరు నోటికిఁ బోవదుగదా! మఱి యేమాంసమైన వెదకి తీసికొనివత్తు. నీపుణ్యము అని దీనస్వరముతోఁ బ్రతిమాలికొనిన విని యాభూత కాంత మనోహరా? మనభయంబున పశుపక్షిమృగాదులీయడవిలో వసింపవుగదా! ఇం దెక్కడ మాంసము దొరుకును? మీకంతగా నాకలియగుచున్నచో నన్నుజంపి నామాంసము భక్షింపుడు అని పలికినది. ఆమాటవిని ఛండవేగుఁడు చెవులు మూసికొని ప్రేయసీ! అట్టిమాట పలుక వచ్చునా? నీ రక్తంబున శరీరము నిలుపుకొని పిమ్మట నేనేమిచేయుదును? ఎవ్వరిఁ జూచి సంతోషింతును? ఇట్టిమాటయెన్నడును బలుకకుము. ఒక రేయికే తాళలేమా యేమి? అని చెప్పుటయు నాభూతకాంత పోనీ! యీయడవిఫలములు చాలగలవు తీసి కొని వత్తునా? అనుటయు నతఁడు సీ! మునులవలె ఫలములుతినమా! అవి జీర్ణము కావు వాని దినిన నాకు నమనము వచ్చును వలదు వలదు. విశ్రమింపుము నీయాకలిమాట యేమి? అందులకు వగచుచున్నాను గదా రెండు దినములెట్లొ దాళుము నరమాంన రక్తసముద్రము పొంగిరాఁగలదు. అప్పుడు కడవలతో రక్తము ద్రావవచ్చును. అని నొడివిన విని యాభూతవనిత యిట్లనియె.

మనోహరా! అట్టి సంతర్పణము మనకెట్లు కలిగెడిది? పుడమి జనక్షయకరమగు నుత్పాత మేదియైనఁ బొడమఁగలదాయేమి అని యడిగిన నతండు కాదు కాదు. ఒక తరుణి మూలముగా నిరువురు మహారాజులు సంగరమున కాయత్త పడు చున్నారు. ఉభయసైన్యములు వ్యూహములఁబన్నియున్నవి. ఎల్లి శుభముహూర్తంబునం గలియఁ బడఁగలవు వేనవేలు జనులు చత్తురు మనకుఁ గావలసినంత రక్తమాంసమేదస్సంచ యము దొరకగలదు! అని నోరూరఁ గంతులువై చుచుఁ జెప్పుటయు భూతకాంత మగనిహస్తములు గైకొని సంతోషముతో వింతగా నాట్యము చేయఁదొడంగినది. ఇరువురు కొంతతడవు గంతులువైచి కూర్చుండిరి.

అప్పుడు భార్య భర్తతో మనోహరా! ఆహారములు లేకపోవుటచే నేఁడు మన కేమియుఁ బనిలేదుగదా ఒక యువతి మూలమున రాజులు పోట్లాడుచున్నారని చెప్పి తిరి. అకాంత యెవ్వతె? ఏమిటికిఁ బోట్లాడవలసివచ్చినది? ఆరాజులెవ్వరు? వివర ముము నాకథ యెఱింగింపుడు సావధానముగా నాకర్ణించెద నుబుసుబోకున్నదని యడిగిన అతఁడు బోఁటీ? ఇది కడుచిత్రమైనకథవినవలసినదే చెప్పెద వినుము. అని చెప్పఁదొడంగెను.


134 వ మజిలీ కథ

సురసకథ

దేవయజసమను అగ్రహారమున అగ్నివర్మయను బ్రాహ్మణుఁడు గలడు. అతండు వేదవేదాంగములం జదివి విధిక్రమంబున అనేక యాగములుజేసి శ్రోత్రి యులలో నుత్తముఁడని పేరుపొందెను. అతనికి లేకలేక సురసయను కూఁతురొక్క రితి వార్థక్యంబున నుదయించినది ఆ చిన్నది మిక్కిలి చక్కనిదగుట దగిన వరుని కొఱకు అగ్నివర్మ అధిక ప్రయత్నము జేసిజేసి విద్యారూప యౌవనధన సంప